బసవరాజు అప్పారావు గీతములు/స్వయంకృతము
నిరాశ
కోరి కోరి విసమ్ము గొని ద్రావె దేల?
"అదియె నా పాలిటి కమృతమ్మయ్యె."
పొరి పొరి విధితోడ బోరాడె దేల?
"విధియె నన్ బోరికి పిలుచుచున్నాడు."
చెచ్చెర మృత్యువు జేరబో నేల?
"అదియె నా కష్టాల కగును నంతమ్ము."
స్వయంకృతము
ఆకాశముపై చూడ్కి నిగుడ్చుచు
నదేపనిగ యోజింపకు మనసా?
ఆకాశమ్మున నేమి గలదు నీ
యనుభవమ్ము తప్పింపగ మనసా?
చల్లని వెన్నెల నుసురుసు రనుచును
సంతాపముపడె దేటికె మనసా?
ఎల్లజగమ్ముల నీ వెన్నెలయే
చల్లదె ప్రేమ పరాగము మనసా?
సురనదిమెడ నూగు పద్మపతకము
మురికి చెఱువులో వేతువె మనసా?
సరసముగ బాడుకోకిలకు కాకి
సావాస మెట్లు మేలౌను మనసా?
కమ్మతావులిడు రోజాదండను
గన్నేరుపూవు గుత్తువె మనసా?
అమృతమ్ములో విషము గలుపుకొని
అంత తప్పదాగ నేలనే మనసా?
మనస్సాక్షి
పడగ ముడుచుకొను పన్నగమ్మె కడు
భయము గొల్పునో దేవా!
కడలి శాంతముగ నున్న యప్పుడే
కడుభయ మిడునో దేవా!
నిద్దుర దోగెడు సింగపుగురకయె
నీరుజేయు దేహము దేవా!