నిరాశ

కోరి కోరి విసమ్ము గొని ద్రావె దేల?
"అదియె నా పాలిటి కమృతమ్మయ్యె."

పొరి పొరి విధితోడ బోరాడె దేల?
"విధియె నన్‌ బోరికి పిలుచుచున్నాడు."

చెచ్చెర మృత్యువు జేరబో నేల?
"అదియె నా కష్టాల కగును నంతమ్ము."

స్వయంకృతము

ఆకాశముపై చూడ్కి నిగుడ్చుచు
నదేపనిగ యోజింపకు మనసా?

ఆకాశమ్మున నేమి గలదు నీ
యనుభవమ్ము తప్పింపగ మనసా?

    చల్లని వెన్నెల నుసురుసు రనుచును
    సంతాపముపడె దేటికె మనసా?

    ఎల్లజగమ్ముల నీ వెన్నెలయే
    చల్లదె ప్రేమ పరాగము మనసా?