బసవరాజు అప్పారావు గీతములు/రాధికా గీతము

రాధికా గీతము

నా మోహపున్‌ తున్క
నా నోముల ఫలమ్ము
నా నాథుడేల రాడే?
           అయ్యయో
     నను వీడిపోయినాడే!

నా జీవితేశుండు
నాదు వలపుల ఱేడు
నా కృష్ణుడేల రాడే?
           అయ్యయో
     నను మరచిపోయినాడే!

చిన్నతనముననుండి
తన్నె ప్రేమించినా
కన్నెప్రేమము మరచెనే
            అయ్యయో
     నన్ను మరచిపోయెనే!

చిరినవ్వు మోముతో
చెలువొందు నా సామి

శ్రీకృష్ణుడేల రాడే
          అయ్యయో
     చింతలను ముంచినాడే!

నిండుచందురు బోలు
నెమ్మోము గలవాడు
నాసామి తావచ్చునే?
          చెలియరో!
     నాకోర్కె లీడేర్చునే?

నెమలి పింఛములతో
కొమ రొప్పు మౌళి గల
సుందరాంగుడు వచ్చునే?
         చెలియరో!
     అందమును జూపించునే?

పాలు దీయుచునుండ
పైనబడి బలిమిమై
పాలనన్నియు ద్రావునే
         ఈకున్న
     పసిబాలువలె పోరునే.

పని జేసిచేసిట్టె
కునికినంతనె చేరి

కనులు రెండును మూయునే
         యెవ రంచు
     నను పరవశం జేయునే.

వనములో తా నుంట
తన రాధకుం దెల్ప
వేణుగానము సేయునే
         హాయిగా
     ప్రాణ ముప్పొంగించునే!

నను జేరి పొదరిండ్ల
తనువు పులకలు జెంద
రాధ కౌగిట దేల్చునె
         నా సామి
     రాధ చింతల జీల్చునే!

సోగ కన్నుల ప్రేమ
రాగ మొలుకంగ నీ
లోకమును మరపించునే!
         నామనో
     లోలత్వముం బాపునే!

ఆనందమయమైన
యా ప్రేమరాజ్యమ్ము

రాధ రాణిగ నేలునే
         చెలియరో!
     రాధపున్నెము పండునే!

దొంగకృష్ణుడు

(రాధికాగీతము)

ల్లవాడే
    గొల్ల
పిల్లవాడే
    చెలియ
కల్లగాదే వాని
వల్లో జిక్కితినే! నల్ల ||

వచ్చినాడే
    తోట
జొచ్చినాడే
    సకియ
చొచ్చి నాదౌ మనసు
ముచ్చిలించాడే! నల్ల ||