బసవరాజు అప్పారావు గీతములు/గోపికా గీతలు-3
గోపికా గీతలు
3
తలుపు తీయునంతలోనె
తత్తర మదియేల నోయి?
తలుపుదీతు వీలు జూచి
తాళుము కృష్ణా!
కొంతసేపు
తాళుము కృష్ణా!
పతి నిద్దుర వోవలేదు
మతి సందియ మొందె నేమొ,
పతికి కునుకు పట్టగ లో
పలకు వత్తుగాని తాళు
తాళుము కృష్ణా
కాస్తసేపు
తాళుము కృష్ణా!
నుదుట బొట్టు దిద్దలేదు
చెదరియున్న ముంగురులను
కుదురుజేయలేదు యేల
పదె పదె పిలచెదవురా
తాళుము కృష్ణా
కాస్తసేపు
తాళుము కృష్ణా
ఏల నంత తత్తరమ్ము
ఏల నంత భయము, సామి?
నిన్నుగాక వేరొక్కని
నెట్లు వలవగలను కృష్ణ!
తాళుము కృష్ణా
కాస్తసేపు
తాళుము కృష్ణా!