బసవరాజు అప్పారావు గీతములు/యశోధరా విలాపము
యశోధరా విలాపము
లేపనైనా లేపలేదే!
మోము
చూపనైనా చూపలేదే!
కోపకారణ మేమొ
యే పాప మెఱగనే! ||లేపనైనా లేపలేదే!||
హృదయ తల్పముపైన
సొద మరిచి హాయిగా
నిదురదోగే నన్ను
వదిలి పోయేవేళ ||లేపనైనా లేపలేదే!||
మబ్బు కన్నెల కింత
ఉబ్బితబ్బిబ్బేలొ?
ఆకాశమున కంత
ఆనంద మెందుకో? ||లేపనైనా లేపలేదే!||
మాధవీలత కింక
మంటికౌగిలి యేన?
మాపటింతల నింట
దీప మిక వెలిగేన! ||లేపనైనా లేపలేదే!||
ద్వారమా! నాధు
డే దారిబడి పాయెనే?
కన్నిబాబా! నీకు
కలలైన రాలేద?
లేపలైనా లేపలేదే?
మోము
చూపనైనా చూపలేదే!
ఉత్తుత్త పెళ్ళి
పెళ్ళిపందిట్లోన పెద్ద లంతాను
వేంచేసి వున్నారు పెళ్ళికొడు కేడి?
ముత్యాలముంగిట్లో ముత్తైదులంతా
కూచునుండిరి పెళ్ళికూతు రేమాయె!
బాజా భజింత్రీలు పల్లకీవాళ్ళు
కచ్చేరి సావిట్లొ కాచుకున్నారు!
వీధి వీధుల ప్రజలు వేలాదివేలు
వేచియున్నారైతె పెళ్లుత్తదేనా?