బసవరాజు అప్పారావు గీతములు/కైపు
కైపు
కావ్యపానము జేసి
కై పెక్కినానే!
దివ్యలోకాలన్ని
తిరిగొచ్చినానే!
ఎక్క రానీకొండ
లెక్కివచ్చానే!
పైకెక్కి నీకేసి
పారజూశానే! ||కావ్య||
కావ్య దేవత నోటె
కవిత విన్నానే
చీమ లనిపించారె
భూమిలో కవులు!
కావ్యపానము జేసి
కై పెక్కినానే!