బసవరాజు అప్పారావు గీతములు/నా స్థితి

నా స్థితి


వెన్నెల రాత్రిళ్ళు వేగించలేక
చుక్కల సొబగుల్లు చూడగాలేక
తలవాల్చి నాస్థితి దలచి కుంగేను
కుళ్ళి కుళ్ళి లోన కుమిలి పోయేను!
    రాజులలో కవిరాజునౌ నేను
    పాడుగుహలో నేడు పారాడనాయె
    కోకిలలందును పుంస్కోకిలము నేను
    గొంతునొక్కుకు మూల కూరుచోనాయె!
అమృతహస్తా, చిల్కు మమృతబిందొకటి
గొంతెండిపోయిన కోకిలనోట!
కొయ్యబారిన మేన కోరిక లీన
రిక్క పెట్టవె కాస్త చక్కిలిగింత.