బసవరాజు అప్పారావు గీతములు/తాజ్ మహల్
తాజ్ మహల్
మామిడిచెట్టును అల్లుకొన్నదీ
మాధవీ లతొకటీ
యేమా రెండింటి ప్రేమసంపదా
యింతింతనలేమూ
చూడలేక పాపిష్టి తుపానూ
ఊడబీకె లతనూ
మోడయిపోయీ మామిడిచెట్టూ
మొగము వేలవేసీ
ముచ్చటైన ఆకులు కాయలనే
వెచ్చని కన్నీళ్ళోడ్చీ
పచ్చనాకులా బొమ్మరింటిలో
పండొక్కటి రాల్చీ
మామిడిచెట్టూ మాధవిలతతో
మాయలో గలసింది
కామితమిచ్చే మామిడిపండూ
కవులకు మిగిలింది!