బసవరాజు అప్పారావు గీతములు/చెవిటి మల్లయ్య పెళ్లి
చెవిటి మల్లయ్య పెళ్లి
(శ్రీశైలయాత్ర)
హృదయమా! సంద్రమునకన్న పది పదింత
లతివిశాలపు కమ్మ! దేవాధిదేవు
డగు మహాదేవు కరుణామృతంపు వాహి
నులను నీలోన కలుపుకోవలెను కాదె !
ఇది మహాదేవు సామ్రాజ్య మిచట నీకు
నీతిబాధల భయ మించుకేని లేదు
సకల శుభములు నొదవు నిస్సంశయమ్ము
శివునిపే రశుభాలకు చెంపపెట్టు !
పవను డనుకూలుడౌ దప్పి వాపికొనగ
కొండవాగులలో నీరు గ్రోలి తమిని
ఇటు నటులు జూడకే కాలు దిటముగాను
మెట్లపై నూని పై కెక్కు మృదులగాత్రి !
హరహరా, శంకరా, మల్లికార్జునుండ !
ౘదుకో, చెవిటి మల్లయ్య ౘదుకొమ్మ
టంచు నుత్సాహమున పైకి నరుగుచుండ్రి
తోడి యాత్రికు లరుగోనె తోయజాక్షి !
మూట నెత్తినబెట్టుకా మూడుకాళ్ళ
ముసలిదే కర్ర బుచ్చుకు మోహరించి
యెక్కు చుండగ చెప్పెడి దేమికలదు?
పడుచు దంపతులము భయంపడగ దగునె?
పూలపాన్పులు బరచిన నేలనైన
కాలు బెట్టినతోడనే కందిపోవు
నవ్యనవనీతగాత్రి నీ భవ్యమైన
భక్తియే ఊతగాగొని పైకి జనుమ !
పెళ్లి వేడుక జూచిపో బిలిచె నన్ను
చెవిటి మల్లయ్య, మాదె పై చేయి సుమ్ము
పెళ్లి కూతురు భ్రమరాంబ పిలిచె నంచు
పెంకితన మేలనే ఆడపెళ్లి దాన !
ఈ మహాగహనాంతర సీమలోన
నీవు శ్రీగిరి భ్రమరాంబ, వేను మల్లి
కార్జునుడ, యాత్రికుల్ ప్రమథాదు లనుచు
సరస మాడుకొనుచు పైకి జనుద మబల !