బసవరాజు అప్పారావు గీతములు/చందమామ

పాడవే కోకిలా
పాడవే యింపుగా
ప్రాణముల్‌ హాయిచే
పరవశ మ్మొందగా
    పాట పాడవె తీయగా,
        కోకిలా!
    పాట పాడవె తీయగా?

చందమామ

తెల్లమబ్బు గుఱ్ఱము నెక్కి తేజరిల్లి
స్వారిజేయుచు బోవు నో చందమామ!
యేల నీ కంతగర్వము? ఎల్లకాల
మొక్కతీరుగ సంపద లుండునోయి?
    పండువెన్నెల జగమెల్ల బర్వజేసి
    అందరిమనంబుల\న్‌ గొని హాయి ముంచి,
    ఎల్లలోకాలకును రాజు నేనె యంచు
    కుల్కుచుందువుగా వెఱ్ఱిగొల్లవోలె

కష్టసుఖ మెఱుగని పసికందుబిడ్డ
చందమున గంతులేసెదు చందమామ!
కాలపరిపాకమున నీకు గల్గబోవు
గతి దలంపుము నిశ్చలమతిని సుంత!

    అంధకార మలీమసం బౌచు జగతి
    ప్రళయకాలమహాబ్ధి నిర్మగ్న యట్ల
    చూడ దుర్బేధ్య మౌనప్పు డేడ బోవు
    నీదు రాచఱికంబు వెన్నెలయు, చంద్ర!

కష్టభాగ్యుడనౌ నన్ను గాంచి మంద
హాసమున పరిహసించెద వౌర, చెలియ
చెంత లేదనియేన? నీవింత యొడలు
మరచి నన్నిట్లు మతిమాలి పరిహసింతు?

    పలవ! పోపొమ్ము నీతోడ వాదులేల?
    చలువ తిన్నియపై ముద్దు చెలియమోము
    మోహపారవశ్యంబున ముద్దు గొంచు
    బుద్ధి జెప్పింతు పొమ్ము నీ పొగరడంగ.