బసవరాజు అప్పారావు గీతములు/ఆనందమే లేదా?
ఆనందమే లేదా?
ఆనందమే లేదా
లోకమున
నానందమే లేదా?
ప్రకృతి యందముల
పరికించుటలో ||ఆనంద||
ఇంపగు నీ సెల
యేటి గానమున ||ఆనంద||
కూ కూ యను నీ
కోయిలపాటల ||ఆనంద||
వీనులవిందౌ
పిట్టలబాసల ||ఆనంద||
పూవులు దాల్చు న
పూర్వపు శోభల ||ఆనంద||
చిగురుటాకుల
న్నగు వసంతమున ||ఆనంద||
అరుణములౌ సాం
ధ్యారాగంబుల ||ఆనంద||
మై మఱపించెడు
మలయవాయువుల ||ఆనంద||
పాఱెడు మబ్బుల
పందెపు పరుగుల ||ఆనంద||
మొగిలు కన్నియల
ముద్దు మోములను ||ఆనంద||
చక్కదనంబుల
చందమామ గన ||ఆనంద||
మిన్నున చుక్కల
మిన్కు మిన్కులను ||ఆనంద||
చలువ వెన్నెలల
సయ్యాటలలో ||ఆనంద||
అలరుందేనియ
లాని పాడుటలొ ||ఆనంద||
తీయనిపండ్లను
దిని యాడుటలో ||ఆనంద||
కీచురాయివెత
కీయని పాడగ ||ఆనంద||
నిశీథముల గను
నిశ్శబ్దములో ||ఆనంద||
చోద్యపు లోకము
చూపు నిద్రలో ||ఆనంద||
పులుగుల మేల్కొలు
పులు విని లేవగ ||ఆనంద||
ప్రభాతవాయువ
బరవశ మొందగ ||ఆనంద||
దేదీప్యంబుగ
తేజరిల్ల మిను ||ఆనంద||
బాలభాను డం
బరమున వెల్గగ ||ఆనంద||
లోచనంబులకు
లోకము గన్పడ ||ఆనంద||
ఆదర్శములా
కాశము నంటగ ||ఆనంద||
పొంగెడు నాసలు
పురికొల్పగ మది ||ఆనంద||
భగవంతుని కడు
భక్తి బాడగను
ఆనందమే లేదా
లోకమున
నానందమే లేదా?
ఎది కావలెనే?
ఇది సంపెగ పూ
విది మల్లెపూవు
ఎది కావలెనే?
చెలియా !
ఇది మామిడిపం
డిది జామపండు
ఎది కావలెనే?
చెలియా !
ఇది ద్రాక్షరస
మిది పూవుదేనె
ఎది కావలెనే?
చెలియా !