బసవపురాణము/షష్ఠాశ్వాసము

షష్ఠాశ్వాసము

ఏకాంత రామయ్యగారి కథ

శ్రీ మన్మహాభక్త చిరతరవరద - యామృతపూరవిహారసంగాఖ్య
మఱియు నేకాంత రామయ్య నానొక్క - నెఱవాది భక్తుండు గఱకంఠమూర్తి
శమదమస్ఫురణానుషక్తుండు జైన - సమయకోలాహుఁడమితప్రతాపి
యతులితశివసమయప్రతిపాలుఁ - డతిశయవీరభద్రావతారుండు
నిస్పృహేంద్రియగుణాన్వీతచేతనుఁడు - నస్పృశ్య భవిజనుఁడపగతభయుఁడు
లింగ[1]సమ్యజ్ఞాని లింగావధాని - లింగగంభీరుఁడభంగురకీర్తి
యేకాంతభక్తి సుశ్లోకుఁడు మర్త్య - లోకపావనుఁడు ద్రిలోకవంద్యుండు
ధీరమహోదారశూరగంభీర - సారగుణస్తోమధౌరేయుఁ డనఁగ
నెగడి నిత్యక్రియానియతప్రయుక్తి - దగిలి శివార్చనాంతమున నత్యర్థిఁ
బ్రమథలోకమున కుద్యమలీల నరిగి - విమలాత్మవీరక వీరభద్రాది
గణ నికాయములకుఁబ్రణమిల్లి వారి - గుణకీర్తనలు సేసి కోర్కి దైవాఱ
శివభక్తి తత్త్వానుభవ సదేకాంత - [2]సవిశేషసుఖసుధాశరధి నోలాడి
యెప్పటి [3]యట్లిల కెలమి నేతెంచి - ముప్పూఁట నిమ్మార్గమునఁ జరింపంగ
బసవనిభక్తి సంపత్సముద్రంబు - దెసల ధరాస్థలి దివి నిట్టవొడువ
స్వచ్ఛుండు సందర్శనేచ్ఛ నేతెంచి - ప్రచ్ఛన్నయుక్తి నబ్బసవనిఁజూచి
“యాకటకమునందు నేకాంతరాముఁ - డేకాకియై చరియించుచునుండ
నొక్కజైనుఁడు సెప్పు లూడ్వకవచ్చి - చక్కన శివనివాసంబుఁజొచ్చుడును
లోపల రామయ్య గోపించి చూచి - "యీ పాపమున కింక నేగుఱి గలదు
రోరి! జైనుఁడ! తగ దుడురాజధరు న - గారాంతరముఁజెప్పుఁగాళ్లఁ జొరంగఁ;
గడవఁజొచ్చితినని మృడునకుఁజాఁగఁ - బడి మ్రొక్కు చెప్పులు వాఱంగ వైచి
యటుగాక తక్కిన నంతకోద్దండ - పటుదండ బాధలపాలైతి పొమ్ము

ఇంకఁజెప్పులతోన [4]యిట్లుంటివేని - శంకింప కిప్పుడ సందుసందులకు
నఱకుదు” ననవుడుఁబిఱుసన కతఁడు - "నఱిముఱి నింతేల యాగ్రహించెదవు?
ముక్కంటిగుళ్లకు దిక్కు గల్గితివి - నిక్కపు భక్తుండ! నీకేల వెఱతు
గుడి వసదియ వేల్పు [5]లొడయండు జినుఁడు - నుడువకుకాదేనిఁబడయుమా[6]మగిడి
దల దర్గియిప్పుడ మలహరుచేత; - నిలనీవె భక్తుండ వితఁడె వే”ల్పనిన
“నితనిఁజంపుట [7]యిది యెంత దలంపఁ - [8]బ్రతినఁజూపమి భక్తిపంతంబు గాదు
శిరమిత్తుఁబడయుదు జినసమయంబు - శిరము ద్రుంపుదు బాసఁజెల్లింతు” ననుచు
శ్రీకంఠుభక్తికిఁజేవ యెక్కంగ - నేకాంతరామయ్య యిట్లని పలికె
“శిర మిచ్చి పడయుట యరిది యంటేని - బరవాది! [9]వినుర మా భక్తులమహిమ
యొక్క భక్తుండు జం[10]బూర్మహాకాళుఁ - డక్కజంబుగ శిర మభవున కిచ్చి
యిలయెల్ల నెఱుఁగంగ నెలమితోఁబడసెఁ - దల నట్టతోఁ గీలుకొలిపి ప్రాణంబు
అట వార్తగలిగి యీకటకంబునందుఁ - బటుమతి గోవిందభట్టారకుండు
శివుని నిర్మాల్య మిచ్చిన మస్తకంబు - [11]తవిలిచి కొను టిది దప్పు దప్పనుచుఁ
గఱకంఠునకుఁదల [12]దఱగి పూజించి - నెఱయ మూన్నాళ్లకు మఱియొండుశిరము
వడసె వెండియు నొక్కభక్తుఁడిట్టిదియుఁ - గడు నపహాస్యంబుగాఁబ్రతిష్ఠించి
మూఁడుదినంబులు ముక్కంటి యచట - లేఁడొ తాఁజచ్చినవాఁడొ కా కనుచు
మొఱటద వంకయ్య యఱిముఱి శిరము - తఱుగంగ మొలవఁగఁ దఱుగఁగ మొలవఁ
దఱిగెడు తలలును బూన్పని శిరముఁ - [13]బూన్చినపిమ్మటఁబుచ్చెడు శిరము
బూన్చెడి శిరమును మొలచిన శిరము - మొలవఁగ లోలోన నలిఁదోఁచు శిరము
మొలచెడు శిరమును మొలచిన శిరము - మొలవఁగ లోలోన నలిఁదోఁచు శిరము
తఱిగెడు శిరమును దఱుగని శిరము - తఱుగక తనుదాన యొఱఁగెడు శిరము
సరసర హరుమీఁద సంధిల్లుశిరముఁ - బొరి నొయ్యనొయ్యన పొడవగు శిరము
కన్నులార్చుశిరముఁగాదనుశిరము - మిన్నక శివుమ్రోల మెలఁగెడి శిరము
నున్నతి మీఁదన యుండెడుశిరము - సన్నసేయు శిరము జరిగెడు శిరము
నారుచుశిరము నౌనౌ ననుశిరముఁ - గేరెడుశిరమును దారెడుశిరముఁ
బారుతెంచుశిరంబుఁబైపడుశిరము - గారవంబున శివుఁగలసెడి శిరము

[14]ననలంబుమీఁదను నలరెడు శిరము - ననలంబు మ్రింగుచు నటయుండుశిరము
బొబ్బిడుశిరమును నుబ్బెడుశిరము - గుబ్బనఁబడి తద్ద గునిసెడుశిరము
నాలుక ల్గ్రోయుచునలి గొనుశిరము - శూలిని వెక్కిరించుచు నుండుశిరము
నుఱికుర్కిపడుశిర మొఱగెడుశిరము - మఱియు సంధిల్లుచు [15]మఱపడుశిరము
పొగడెడుశిరమును నగియెడుశిరముఁ - దెగడెడు శిరమును దీవించుశిరము
శరణనుశిరమును జయవెట్టుశిరము - సరసమాడుశిరముఁజదివెడుశిరము
[16]మలరెడుశిరమును మార్కొనుశిరము - [17]దలఁకకీశ్వరుతోడఁ దాఁకెడుశిరము
'బా'పనుశిరమును బాడెడుశిరముఁ - 'జాపంద'యని శివు జంకించుశిరము
నిప్పాటఁ [18]బసికమై నీశ్వరుఁబూన్పఁ - గుప్పలుగొని తల ల్గుడిఁబిక్కటిల్ల
మారారి విస్మయమానసుం డగుచు - “నోరోరి! వంక! నా కూరుపు వోదు
ఓడితినన్నను మేడెమువొడువఁ - బాడియే నీ వీరభక్తికి నిలువ
నా వశంబే?” యని దేవదేవుండు - నావంకతందె శ్రీహస్తంబు వట్టి
యనురాగమునఁబొల్చు నత్తలలెల్లఁ - దన లింగమూర్తిలోనన ధరియించె
శంకించుచును నరు ల్సంస్తుతి సేయ - వంకయ్య శివునిమాఱంకమై గెలిచె
నిటువంటి భక్తు లనేకులు గలరు - కుటిలాత్మ! విన నీకుఁ గొలఁది గాదెట్లు
నెఱుఁగవే తొల్లి మీయెడ్గడవారిఁ - బఱపిన మా శివభక్తుల మహిమ;

తిరునావుకరశు కథ


తిరునావలూరను పురిఁదిరునావ - కరిశుండనఁగ జైనగురుఁడొక్కరుండు
జినసమయాచార్యుఁడనఁజనునట్టె - మును శూలకుట్టెత్తి మూల్గుచు నేలఁ
బడి పొరలుచుఁబ్రాణపరితాపమందు - నెడ వారి [19]తోఁబుట్టు వేతెంచి చూచి
“యీ మంత్రతంత్రలూలామాలములను - నో మలదేహి! నీ కుడుగదు నొప్పి
బ్రదుకంగవలతేని భక్తసమ్మతిని - మదనసంహరు దివ్యమంత్రంబు గఱవు
వేగంబ నీకు నీ రోగమయ్యెడును - రాగిలి యీప్సితార్థములు వొందెడిని”
ననవుడు “భక్తుండ నయ్యెదనింక - ననుమాన మొక్కింతయును వల” దనుచు
శపథంబు నేయుడుఁజయ్యన నతివ - త్రిపురారిభక్తులఁదివుటఁదలంచి
యనుపమదివ్యపంచాక్షరీమంత్ర - మున భసిత మలంది మొల దిగఁదుడువ
శూలకుట్టుడుగుడుఁజోద్యంబు నొంది - యా లలనకు నతఁడష్టాంగమెరఁగి
“పడఁతి! నీకతమున బ్రదికితి నింక - నడర భక్తుండనే నయ్యెద” ననుచు

శ్రీపతినాథునాజ్ఞాపనఁజేసి - నాపగలూరికి నరిగి యక్కడను
నిలఁబంకమందున్న జలరుహమట్ల - వెలివాడనున్న నిర్మలసుచరిత్రు
గురుమూర్తిఁగదిసి యత్తిరునావకరిశుఁ - డరుదంద సాష్టాంగుఁడై మ్రొక్కి నిలువ
ముదమునఁదద్గురుమూర్తియు [20]నతనిఁ - బదపడి శివభక్తిపరుఁజేయఁదలఁచి
తనదు కృపావలోకనమాత్రఁ [21]జేసి - నొసలి దుర్లేఖలు [22]గసిమసి సేసి
శివతీర్థకలశాభిషేక మొనర్చి - సవిశేషలింగ[23] సంస్కార మొనర్చి
సంచిత శివహస్త సంగతుఁజేసి - పంచభూత [24]వికారపథమునఁబాపి
యంగలింగనియుక్తి మంగళక్రియల - సంగత[25]సత్యప్రసాదాంగుఁజేసి
విగతవాయుప్రాణవిధు లాచరించి - నెగడ లింగప్రాణనిష్ఠితుఁజేసి
సిద్ధమంత్రమునఁబ్రసిద్ధుఁగావించి - [26]శుద్ధాత్ముఁజిన్మయజ్యోతిఁగీలించి
వినుతజీవన్ముక్తికిని హేతువైన - యనుపమ శివరహస్యార్ధము ల్దెలిపి
తమ కరుణాప్రసాదముఁగృపసేసి - విమల సద్భక్తిసంవేత్తఁగావింపఁ
దిరునావకరిశియుఁదేజిష్ణులీలఁ - బరమశివాచార పారవశ్యమున
భవభక్తవితతికి భువిఁజాఁగిమ్రొక్కి - శివమహోత్సవములు సేయఁగఁబనిచి
వాహనవస్త్రసువర్ణాభరణ స - మూహార్చనక్రియ ల్ముదమునఁజలిపి
వలపారఁదన మనోవాక్కాయ కర్మ - ములఁ బ్రాణదేహార్థముల నివేదించి
భూతిరుద్రాక్షవిభూషణపరమ - పూతవ్రతస్థుఁడై భువిఁబ్రవర్తింప
"నన్యదర్శనమార్గుఁడయ్యె వీఁ"డనుచు - నన్యాయమున జైను లందఱు నతని
[27]గరికిఁబెట్టుడు భద్రకరి ముట్టనోడెఁ - గరిచర్మధరుబంటుఁగరి యేమిసేయు?
విషము వెట్టుడుఁగుడ్చి విజయుఁడై నిలిచె - విషసంహరునిబంటు విషమేమిసేయు?
[28]బహ్వగ్నిఁద్రోవఁబైఁబడ నాఱె వహ్ని[29] - జిహ్వాంతకునిబంటుఁజిచ్చేమిసేయు?
జలముల ముంపుడుఁజాలవు ముంప - జలమౌళిబంటును జల మేమిసేయు?
జంపంగ నేక్రియఁజాలక తమ్ముఁ - జంపునో యితఁడని శరణుసొచ్చుడును
గంటకులగు జైనకర్ములఁగాచి - తొంటిలాంఛనములు దుడిపించి యంత
రుద్రాక్షభసితాదిరూపిత పంచ - ముద్రాధరులఁజేసి రౌద్రముతోడ
వెసజైనప్రతిమల విట [30]తాటమాడి - వసదులన్నియు వచ్చి వైపించెఁగాదె
లలి జైనసమయకోలాహలుఁడనఁగఁ - గలుగు మా తిరునావకరిశి దేవుండు

ఇరుత్తాండి కథ

యోరి! చెల్లత్తిరువాలూర మఱియు - మారారిభక్తుఁడు మహినిరుత్తాండి
యనఁగ నొక్కయ్య జాత్యంధుఁడై యుండి - మనసిజహరునకు మజ్జనార్థముగ
గుడిముందఱను నొక్క గొలను గావింపఁ - గడఁగి కుద్దాలంబుఁగంపయుఁగొనుచుఁ
ద్రవ్వుచు నొకశంకుదరి నొకశంకుఁ - ద్రెవ్వనిత్రాట సంధించి చేపట్టి
మ్రోఁకువెంటన యెడతాఁకుచుఁజుట్టి - ప్రోఁకగాఁబోయుచుఁబ్రొద్దులు వుచ్చ
జినసమయులు "దీనిఁ జెరుపుదఁ[31]" డనుచుఁ - గనుఁగొని పెక్కువిఘ్నములుగావింపఁ
[32]దలఁక కెప్పటియట్లత్రవ్వుచునుండ - నిలమ్రోఁకుఁద్రెంచి శంకులు వాఱవైవఁ
గఱకంఠుచే నప్డు కన్నులు వడసి - యఱిముఱి వసదులు వెఱికి వేఁటాడి
జినసమయులనెల్లఁజీకులఁజేసి - కనఁబర్చెఁగాదె మాగణ మిరుత్తాండి

పిళ్లనైనారు కథ


మఱియు శ్రీకాళినా మహినొప్పు పురిని - నెఱిశివబ్రాహ్మణునికి నుదయించె
నలరి కుమారుని యంశంబునందు - నలువొప్పఁగాఁబిళ్ళనయనా రనంగ
జనకుఁ[33]డర్కటఁబెట్టికొని యొకనాఁడు చని సరోవరతీరమున బాలు నునిచి
తా నఘమర్షణస్నానంబు చేయఁ - గా నభోవీథిని గౌరియు శివుఁడు
మానితదివ్యవిమాననిరూఢ - యానులై చనిచని "యల్ల బాలుండు
మనకుమారునియట్ల” యనుచు నగ్గిరిజ - కనుఁగవఁజూచుడుఁజనుఁగవ సేఁప
నవనీతలంబున కరుదెంచి బాలుఁ - గవుఁగిటఁజేర్చి కూఁక[34]టి వుడుకుచును
దేవి దా శాంభవదీక్షితుఁజేసి - భావించి శివభక్తిపరునిఁగావించి
కడుపారఁజనుఁబాలు గుడిపి పసిండి - కుడుకతో వెండియుఁగొన్ని సే నిచ్చి
గౌరి దా నీశ్వరు కడ కేఁగె నంత - నీరఁ గ్రుంకిన ధరణీసురోత్తముఁడు
భోరున లేచి విస్ఫారదివ్యాంగ - చారుదీధితిఁగ్రాలు సత్పుత్రుఁగాంచి
“యోరి! చ న్నిచ్చినవా రెవ్వ రిచట - నో రెక్కడివి పైఁడికోరయుఁబాలు
నెవ్వ రేతెంచిరి యెక్కడి కేఁగి - రెవ్వల నున్న వా రిట చెప్పు” మనుచు
జన్నిదంబునను జేసాఁచి వ్రేయుడును - దిన్నని నగవును సన్నపుటేడ్పు
కన్నులఁ దొరిగెడు చిన్ని బాష్పములు - గ్రన్నన సెలవులఁగాఱుదుగ్ధములు

చెన్నొలయఁగఁగోరఁజేతఁగప్పుచును - "అన్నన్న! నన్నేటి కడిచెదు వినుము
దివి [35]నల్లవోయెడు దేవదేవేశు - కవనుండి యయ్యుమాకాంత యేతెంచె[36]
యురుజటాజూటభాస్వరుకడ నుండి - చిరమణిమకుటభాస్వర యేఁగుదెంచె
తగఁజంద్రరేఖావతంసుని నిల్పి - సుగుణావతంస దత్సుదతి యేతెంచె
ముక్కంటి వాని సమ్ముఖమున నుండి - యిక్కంటితో నొక్కయింతి యేతెంచె
కరమొప్ప నీలకంధరుకడనుండి - సరసరఁగంబుకంధర యేఁగుదెంచె
ఘనచందనాంకువక్షఃస్థలిఁబాసి - స్తనచందనాంకవక్షఃస్థలి వచ్చె
ఉరగేంద్రహారుని యూరులనుండి - కామిని వరహంసగమన యేతెంచె
ముల్లోకములఱేని ముందఱ నుండి - ముల్లోకములకెల్లఁదల్లి యేతెంచె
చన్నిచ్చెఁగడుపార మన్నించి మఱియుఁ - గొన్నిపాలు పసిండికోరలోఁబిదికి
నిలిపి వచ్చిననీలగళునిపాలికిని - బొలఁతి యల్లదె చూడు వోయెడి” ననిన
నా మహీసురుఁడద్భుతాత్ముఁడై యయ్యు - మామహేశ్వరులకు మహిఁజాఁగి మ్రొక్కి
కొడుకుఁదా నఱకట నిడుకొని వచ్చి- మడఁదియుఁదాను సమ్మదలీల నుండఁ
బార్వతీస్తనపయఃపానప్రసక్తి - సర్వజ్ఞతయు వచస్సంసిద్ధి దనరి
వేవిన గుడికేఁగి వేనవేల్విధుల - భావించి పార్వతిఁబ్రస్తుతించుడును
అంబిక స్వర్ణతాళంబు లొసంగ - దుంబురునారదాదుల మీఱి పాడఁ
గరమర్థితోడ శ్రీకాళినాథుండు - విరచితంబై యొప్పు వెలిగొ[37]డుగులును
నక్షయనిధియు ముత్యాలపందిరియు - నీక్షితిఁబ్రతిలేని హేమాసనంబు
ఖండేందుధరుఁడప్డు గరుణింపఁగనక - దండె యందల మెక్కి తా వైభవమున
భాతిగా ధారలు పరమతధూమ - కేతువు నాఁగఁబ్రఖ్యాతమై మ్రోయ
నురుతరలీలఁగులోత్తుంగచోడ - ధరణీశు శివభక్తిపరులఁ గావించి
యలరుచు సుగతసహస్రద్వయంబు - గొలువఁగఁ జను బౌద్ధగురుఁ బాఱఁద్రోలి
లీలమై మఱి రెండువేల బౌద్ధులను - బాలించి శివభక్తిపరులఁగావించి
తిరుమరక్కడయను పురిని బ్రహ్మేశు - చిరకవాటములు సుస్థితిఁదెఱపించి
తిరు[38]నావలూరు నాఁబరగునప్పురికి - నరుదెంచి జైనులనందు జయించి
యిల సర్పదష్టుఁడై యీ ల్గినయట్టి - [39]వెలమనిప్రాణముల్ వేగంబె పడసి
మధురేశుదేవి సమ్మతమునఁజేసి - మధురకేతెంచుడు మనుజేశుకడకు

జైనులు బౌద్ధులు సనుదెంచి యపుడు - "జ్ఞానసంబంధినాఁగా నొక్కశిశువు
నాతతవేదబాహ్యసమయధూమ - కేతుండు నాఁగ్రొవ్వి యేతెంచినాఁడు
పురి వెడలింపుము నరనాథయనిన - "గురుఁడటే యచ్చోడనరపతి కతఁడు
నూరక వెడలిం[40]చుటుచితంబుగాదు - వారి నోడింపుఁడే వాదుననైన”
ననుడు జైనులు పదునెనిమిదివేలు చని [41] యెట్లుఁదర్కింపఁ జాలక నిలిచి
నర్ధరాత్రంబప్పు డతఁడున్నయింట – స్పర్ధమైంజిచ్చిడ జ్వలనుండు వెఱచి
యెదుర నిల్వఁగఁబడ్డ “నేమేమిరోరి! - సదనంబు గాల్పనా చనుదెంచి తీవు
విహ్వలుఁగావించి వీరభద్రుండు - జిహ్వలు నీరెండు సేతులుఁదొల్లి
కోసివైవఁగ నున్నకొఱఁత నీముక్కు - గోసివైపించి యేఁగొన మఱిఁగెదవు
జైనుల గీనుల శక్తిసూచెదము - దీనఁదప్పేమి యీ భూనాథుమేనఁ
బ్రాపించి యుష్ణజ్వరస్వరూపమునఁ - దాపమొందింపుము దహన! కాచితిమి”
యనవుడు నతనిదేహంబునఁబొంది - ఘనతరజ్వరరూపమునఁగొని కాల్ప
మంగయక్కరసి యమ్మండలేశ్వరుని - యంగన తనపతియనుమతంబునను
తా నప్డు రప్పించి జ్ఞానసంబంధి - కా నాతి సాష్టాంగయై విన్నవింప
“వారెవ్వరేఁగలరారాజు నొడలి - యీరుజఁబాపంగ నింతయు [42]వలదు
వలపల మాపాలు వామభాగంబు - బలహీను[43]లార! మీ పాలు మంత్రింపుఁ”
డంచు[44]ను భూతి మంత్రించి చల్లుడును - సంచితంబుగ మేనిసగమును బాసి
వామభాగమునన జ్వర మిన్మడింప - నామును ల్మంత్రింప నగ్గలంబైన
“నారోగ ముడుపవే శ్రీరుద్రమూర్తి - యీరుజ మాన్పవే కారుణ్యపాత్ర
నాతెవు [45]లార్పవే నల్లనైనార - యీతాప[46]మడఁపవే యీడ్యచరిత్ర
నాగదఁబాపవే యోగీంద్రవంద్య! - యీగహనజ్వర [47]మిగిరింపు తండ్రి”
యని పెక్కువిధుల మహారవం బులియ - జనపతి ప్రార్థింప జ్ఞానసంబంధి
క్రమ్మన భసితంబుఁగలయఁగఁజల్లి - ముమ్మాఱు దిగఁదుడ్చి, ముట్టినంతటను
బొఱటిపాండ్యేశుడు వొలుపారమున్ను - పొఱడువోయినవీపు పొఱడుమానుటయు
భావింపఁబొంకయ్యెఁజావకపోవు - నా వీఁపు పొఱడని యాడుమాటయును
గూనిపాండ్యండను హీనత్వ ముడిగి - తా నొప్పె నంత సుందరపాండ్యుఁడనఁగ
రెట్టించి దాపటఁదొట్టినజ్వరము - చట్టన నుడుగుడు సతియును దాను

భువి సమస్తాంగము ల్వొందంగ మ్రొక్కి - యవసరోచితసత్క్రియాదు లొనర్ప
“జినమంత్రలేఖయు శివమంత్రలేఖ - యును నగ్నిలో వైవ నొగిఁగాలకున్న
వారిదె గెలు”పని వార్నుడువుడును - ధారుణీశ్వరుఁజూచి "దానఁదప్పేమి
పసిఁడితో నొకగుక్కపల్లు దూఁచుడును - బసిఁడియునెముకయుఁబ్రతివోల్పఁదగునె
పాలకావడి తూన్కి ఱాలఁ [48]దూన్చుడును - బాలును ఱాలును బ్రతియెతలంప
మలయజంబులు వట్టిమ్రాఁకులుఁ [49]దూన్ప - మలయజంబులు వట్టిమ్రాఁకులు సరియె
శివమంత్రలేఖయు జినమంత్రలేఖ - తవిలి కూర్చిన నేమి దత్తుల్య మగునె”
యంచును “శివ”యను నక్షరద్వయము - పంచవర్షాఢ్యుండు పత్రిక వ్రాయ
మండలాధీశుండు రెండు లేఖలును - మండెడు పెనుపగు మంటలో వైవఁ
గరమెత్తు నంతన సురసురఁగమరి - పరవాదిజినమంత్రపత్రంబు గాలె
హరమంత్రపత్ర మయ్యర్కునిఁగన్న - సరసిజదళమట్ల కర మొప్పియున్న
జినమునుల్తల సచ్చియును దోఁక సావ - కలరి “ముమ్మాటికి నరయఁగవలయు
శివమంత్రలేఖయు జినమంత్రలేఖ - తవిలి కావేరిమధ్యంబున వైవ
నేటఁబోయినపత్ర మోటపత్రంబు - నేటికి నెదురెక్కుడిది నిజం” బనినఁ
“బిడికిటఁగోమటిఁబొడువంగమఱియుఁ - బొడువుమా యనుక్రియఁబోవంగరాదు
ఊరక పోనీకు మోడినవారి - ధారుణిజనులెల్లఁ దల లెత్తిచూడ
నెఱ్ఱఁగాఁగాల్పించి యిచ్చట నినుప - కొఱ్ఱులఁ [50]దివియింపు కువలయేశ్వరుఁడ!”
యనవుడు నవుఁగాకయని జినమునులు - జనపతియును దారుఁజనుదెంచి యంత
నాకులు కావేరియందు వైచుడును - జేకొన నెదురెక్కె శివమంత్రలేఖ
వారి మంత్రం బాకు వఱదనే కలసెఁ - బూరించునే చమత్కారమంత్రములు
అంత నా పిళ్లనైనారు భూనాథు - సంతోష మలరార సద్భక్తుఁజేసి
పదునెనిమిదివేలు మొదలిజైనులను - బొదిగొని పిలిపించి పొరిఁబొరిఁబట్టి
యచ్చెరువందఁగులచ్చిరియారు - చెచ్చెర నటమున్న చేయించినట్టి
కాలియున్న యినుపశూలంబునందు - నోలిఁ [51]దివ్వించుచు వ్రాలి యిద్ధరిణిఁ
బరగఁగ దిరువూరఁబఱపుట వినవె - యురుభక్తియుక్తిమై నోరి జైనుండ!

నిడుమారని కథ


పుడమినట్టులు సెప్పఁబడియె వెండియును - నిడుమారఁడనునొక్కనిఖిలేశ్వరుండు

దన యేలుభూమి దాఁదక్కఁదక్కెల్ల - జినమార్గవర్తు లౌటను [52]నిషేధించి
మందునకైన భస్మత్రిపుండ్రాంగి - యెందును లేకున్న నెట్లొకో యనుచు
మది విచారించుచు మనుజేశుఁడుండఁ - దదవసరంబున మదనారిభక్తి
మానసుండగు శివజ్ఞానసంబంధి - నా నప్పు డా పాండ్యభూనాథుధరణి
కేతెంచి వీరమాహేశ్వరోద్యుక్తి - భాతిగాఁబ్రభవించి పరవాదులైన
జినమార్గవర్తుల నినుపకొఱ్ఱులను - గనలఁగఁదివియించె ననుచు నీవార్త
విని యట నిడుమారవిశ్వంభరేశుఁ - డనఘుడు దన దేశమున నెన్నఁబడ్డ
జినపదాచార్యుల జినమంత్రయుతుల - నననేల వీరు వా రనక రాఁబనిచి
“క్షితి నవాంతరశాస్త్రమతములు వన్ని - శ్రుతిబాహ్యులై చను మతిహీనులార!
పశుకర్ము నొకనరుఁబరమేశుఁడనుచుఁ - బశుపతి నెఱుఁగని పశుజీవులార!
పొసపరి శూన్య దుర్బోధలఁదగిలి - భసితం[53]బలందని పాతకులార!
అద్వైతకర్మమాయాకుయుక్తులను - సద్విధిఁజెందని చండాలురార !
అజ్ఞానబోధల కాలయం బగుచు - విజ్ఞానరతి లేని విద్వేషులార!
[54]యెట్టొకో నా ప్రజ నింతగాలంబు - బట్టి దుర్బోధలపాలు సేసితిరి
అటుచూడుఁడా యిప్పు డభవుసద్భక్తుఁ - డటె పిళ్లనాయినా రాపాండ్యభూమి
సర్వప్రమాణ దృష్టప్రత్యయములు - శర్వుఁడ కర్తగాఁ జనఁబ్రతిష్ఠించి
జినబౌద్ధసమయంబు లను పేళ్లు దుడిచి - మునులఁదివ్వించె నాయినుపకొఱ్ఱులను
గాన కొల్వుండు మా శ్రీనీలగళుని - గానినాఁడిందఱఁగ్రాఁగినకొర్ల
భువిఁదలక్రిందుగాఁదివియింతు” ననుచు - శివభక్తవర్యుఁడాశిష్టేశ్వరుండు
నిశితఖడ్గాయుధాన్వితహస్తుఁడగుచుఁ - బశువరింపుచుఁగొర్లపాలు సేయుచును
నంతలో శివభక్తులగు జినమునుల - సంతోషచిత్తుఁడై చనఁగాచెఁగాదె
నిడుమార భూనాథు మృడుభక్తిమహిమ - సడిసన్న లెఱుఁగవే జైనకష్టుండ!

నమినంది కథ


మఱియును నమినంది మా భక్తుఁడొకఁడు - వఱలుఁచెల్లత్తిరువాలూరిలోనఁ
దిరిగి యార్జించి [55]నే దెచ్చి భర్గునకుఁ - బరువడి వేయుదీపములు ముట్టించు
వ్రతతత్పరతఁబ్రీతి వర్తింపుచుండఁ - గుతగులై జైనులు గూడి యయ్యూర
భక్తుఁడొక్కఁడితనిఁబాఱఁగఁదోలు - యుక్తులెట్లని పెక్కులూహించి చూచి

యల్ల పాడ్గుడిలో సహస్రదీపంబు - లెల్లెడ ముట్టించు[56]నిది నిజవ్రతము
నీయూర నితనికి నెవ్వరు నెయ్యి - వోయకుండినఁదాన పోయెడిఁగాక
యంచు నాలోచించి యతనికి ఘృతము - నించుకయును బోయ నీకున్న వచ్చి
“ప్రాణేశ నేయి యెప్పాటనులేదు - ప్రాణము ల్విడుతు దీపంబు లాఱినను”
అంచుఁబరిచ్ఛేది యగుడు నద్దేవుఁ - డంచిత ప్రీతిఁబ్రత్యక్షమై నిల్చి
"వరదసోమయ యర్ఘ్యపణ్యంబులందుఁ - బరువడిఁదొల్లి దీపము లెత్తినట్లు
సజ్జనలీల మజ్జనబావిలోని - యజ్జలంబులు వోయ నలరు దీపములు
కానక యన్యాయకారులై యున్న - జైనుల పనులును జచ్చెడునేఁడ”
యని దేవదేశుఁడానతిచ్చుడును - విని మహానందసంజనితాస్యుఁడగుచుఁ
గొలనిజలంబులఁగోటిదీపంబు - లలరఁగ ముట్టించి యాడుచున్నెడను
నఱవంగ నొక్కవెయ్యయును లేకుండ - నఱిముఱిఁబసులెల్ల హతమైనఁజూచి
“యిదియేమి సోద్యమో యింతలోఁబసులు - మెదలవు గదలవు మృతిఁబొందె నల్ల
పాటిదేవరచేతఁబడసి దీపములు - కోటానఁగోటి యీకొలని నీర్వోసి
ముట్టించినాఁడటే యిట్టి చోద్యంబుఁ - బుట్టునె శివభక్తు లెట్టి [57]వారుండ్రొ?
యిట నెయ్యి వోయంగనీక యుండినను - గటకటా శాపించెఁగాక యత్తపసి
కాదేని [58]బిట్టబడ్గరఁబసు ల్సచ్చు - నా దీనఁదప్పేమి పోదండుగాక”
యనుచు నేతెంచి సాష్టాంగులై మ్రొక్కి - వినుతింపుచుండ నా ఘనకృపామూర్తి
పసుల ప్రాణం బిచ్చి పరగ జైనులకు - నొసఁగఁడే శివదీక్ష యోరి జైనుండ!

సాంఖ్యతొండని కథ


వెండియు విను సాంఖ్యతొండండు సోడ - మండలంబున శాంతమంగయన్పురిని
బౌద్దునికడుపునఁ బ్రభవించి మఱి ప్ర - బుద్ధుఁడై బౌద్ధవిరుద్ధసంగతిని
దొలుమేని తనపుణ్యఫలమునఁజేసి - వలగొని శివ[59]భక్తివాసన నిగుడ
“భక్తుండనైనను బ్రదుకంగ నీరు - భక్తుండఁగాకున్న బ్రదుకు [60] దానేల
యామటఁబదిటలింగార్చకుం డనెడు - నామంబు వినఁగరా దేమి కర్మంబొ?
యిట్టి భవద్భక్తిహీనుకడ్పునను - బుట్టింపఁదగునయ్య భూతేశ్వరుండ!
యేలయా నన్నింత యీశ్వర! కరుణ - మాలి పుట్టించితి మలధారియింట
నిండారుసద్భక్తి నిను భజియింప - నొం డుపాయమ్ము లే దొగి నట్లుఁగాక

సిద్ధంబు వేదవిరుద్ధంబు జైన - బౌద్ధచార్వాకదుష్పథ సమయములు
మూఁడును నిర్మూలముగఁ జేయు దనుక - మూఁడు ఱాలనువైతు ముప్ప్రొద్దునిన్ను
నిది నిజవ్రత” మంచు నిలఁబ్రవర్తింప - నది వెల్లివిరిసి [61]యేన్నాళ్లు వాఱంగ
గుడి కేఁగరామిని గుదగుదమనుచుఁ - గుడువక [62]యేన్నాళ్లు గడచినపిదప
నేఱు డొంకిన గుడి కేఁగియు “లెక్క - నేఱ నేమిటికి ఱాలెన్ని వైచినను
మిసిమింతుఁడవు గావు మృడ! దేవ! యేను - విసివితి నివియేల వేయును నింక
నీ యొక్కటియె చాలుఁ బో” యని పెద్ద - ఱా యెత్తికొనిపోయి “కో” యని వైవ
శివలింగ మంతలోఁజేతులు సాఁచి - యవుదలఁబడకుండ నాఁగి నవ్వుచును
“మెచ్చితి వరము నీ కిచ్చితి నడుగు - మిచ్చ యెయ్యది” యన నిలఁజాఁగి మ్రొక్కి
"హరియును బ్రహ్మయు నాది నంత్యంబు - పరికించి కానని యురులింగమూర్తి
వేనవేల్విధముల వేదంబు లరసి - కానక వెదకెడు ఘనలింగమూర్తి
సకలసిద్ధాంతశాస్త్రపురాణయుక్తి - నిక మిట్టి దనరాని నిజలింగమూర్తి
సనకసనందనమునిముఖ్యవితతి - మనములు గడచిన మహలింగమూర్తి
శేషవాసుకి బహుజిహ్వోక్త వినుతి భాషలు గడచిన పటులింగమూర్తి
కంటి మీ శ్రీపాదకమలంబు లేను - మంటిఁజాలదె నాకు మఱియొం డదేల?
మల్లెమొగ్గల వైవ మదనుని వేఁడి - [63]వెల్లఁగాఁజేసితి దెల్లంబుగాదె
ఱాలవైచినఁగరుణాలోకనమునఁ - బాలించితివి భక్తిపరునిగా నన్ను
నన్యాయమున నీకు సహితంబు సేయ - ధన్యత్వ మీగి సోద్యము గాదె జియ్య!
స్తుతియును నిందయు హితము సహితము - మతిఁదలంచినను సమానము ల్గావె
భక్తవత్సల! భక్తపరతంత్ర! భర్గ - ముక్తివల్లభ! దయామూర్తివి గాన
నిందించి నంబన్న నీ గుణకీర్తిఁ - జెంది మల్హణుఁడును జేరరె నిన్నుఁ
గావున నన్ గటాక్షప్రేక్షణమున - భావించి యీ ఱాయి వూవుఱాయిగను
అలవడ నీయుత్తమాంగంబుదెసను - నెలమి నుండఁగఁజేయు మెల్లగుళ్లందు”
ననుచు నవ్వేద[64]బాహ్యంపు మార్గములు - దునిమివైవఁడె సాంఖ్యతొండండు జైన!

కోవూరి బ్రహ్మయ్య కథ


మఱియుఁగోవూరి బ్రహ్మయ్య నాఁగ నొక్క - గఱకంఠుభక్తుఁడఖండితకీర్తి
జినమునులకుఁదనకును దర్కమైన - జినసమయుఁడు వాదమున సిగ్గువడియు

వటమహీజాత మచ్చటనున్నఁజూచి - "యటుగాక దృష్ట మివ్వటముఁగాల్చెదవొ
పడసెదో చెప్పుమా భక్తుఁడ” యనిన - "మడియింపఁగూడదేఁబడసెద" నన్న
మంత్రతంత్రములచే మఱ్ఱిగాల్చినఁగు - మంత్ర కుతంత్ర కుమాయాపహారి
వసుధ నీఱైయున్న వటముపై నపుడు - భసితంబు సల్లి యెప్పటియట్లు నిలిపి
వఱలఁగఁ గోవూరివసదులన్నియును - జెఱుపఁడే బ్రహ్మయ్య సిగ్గేది జైన!

తేడర దాసయ్య కథ


మఱియును విను పొట్లచెఱు వనుపురిని - వఱలంగ నేణ్ణూరు వసదులు గట్టి
వెలయ ము న్నిరువదివేల్జినమునులు - గొలువఁగ జినకులగురుఁడొక్కరుండు
నా బల్లహునకు ముఖ్యాచార్యుఁడగుచుఁ - దా బుద్ధి సెప్పుచుఁదగఁబ్రబోధింప
క్షితిపతియైన [65]యా సింగబల్లహుని - యతివ సుగ్గలదేవి యకలంకచిత్త
తానును తేడరదాసయ్య వరద - యానూనసద్భక్తిమానస గాన
తమగురుస్వాములౌ దాసిదేవునకు - రమణి యాస్థితి విన్నపముసేసి హితులఁ
బుచ్చుడు నప్పు డప్పొట్లచెర్వునకు - నచ్చెరు వందంగ వచ్చునయ్యెడను
జినమును ల్వెక్కు గుచ్చితములు సేయఁ - గని నూఁకుచును లెక్కగొనకేఁగుదేర
నగ్గురు శ్రీచరణాంబుజంబులకు - సుగ్గలదేవి యుత్సుకలీల మ్రొక్కి
భామ గురుప్రసాదామృతాంభోధి - లో ముదంబారఁదేలుచు మునుంగుచును
వేఱొకఠావున విడియింప నతఁడు - మీఱివచ్చుట నటమీఁద నెట్లగునొ
యనివచ్చి జినమును ల్వినిపింప రాజు - జినసమయుఁడుగాన వనిత కిట్లనియె
“సతి కొక్కగతియును బతి కొక్కగతియు - నతివ! యేలోకంబునందైనఁగలదె
యెక్కడి గురువు[66]లు నేనాఁటిబుధులు - చక్కన నంపుము జైనులు విన్న
విపరీత మగు నింక వేయును నేల - చపలాక్షి! యనుపు మీసాముల” ననిన
నధికకోపోద్రిక్తయై "వీరిరాక - యధమజైనుల పెంపు లడఁపనె కాదె
పురుషునకు సతికిఁదెరు వొకఁడైన - గురుశిష్యులకు వేట తెరువులు గలవె
స్త్రీవివాహమునాఁడు సేసినబాస - నీవ విచారించుకో వేయునేల?
గడియించుకో భార్య గలదేని యోర్తు - విడువుము నన్ను నే మృడుఁగాని యొల్లఁ
గాదేని యోడింపు వేదశాస్త్రాది - వాదతర్కప్రతివాదంబులందు”
నంచు సుగ్గలదేవి మించిపల్కుడును - గుచ్చితులగు జైన [67]కూళలందఱును

బిలిపించి బల్లహుకొలువున వారి - వలపట నవరత్న కలితమై తనరు
సింహాసనాసీనుఁజేసి యాజైన - సంహారుఁడైనట్టి సద్గురుదేవు
దాసయ్యపాదము ల్డాసి యెత్తుచును - నా సుగ్గలవ యుండె నా జినమునులు
[68]మంత్రతంత్రానేకమాయాదులను గు - యంత్రమహేంద్రజాలాది విద్యలను
అద్వైతశూన్యమాయావాదకర్మ - విద్వేషమున [69]జైనవితతి దర్కింప
వేదవేదాంతాదివాద సిద్ధాంత - వాదతర్కముల సంపాదించి మించి
న్యాయవైశేషి కాద్యఖిలవాగ్దృష్ట - ధీయుతోక్తులఁబెక్కు దెఱఁగులు సూపి
“నద్వితీయుఁడు రామనాథుఁడే కర్త - సద్విధిసర్వము సర్వేశ్వరుండు
శ్రుతి "యేక ఏవ రుద్రో ” యనుతత్త్వ - గతి "లింగమధ్యే జగత్సర్వ” మనియు
రతి "లింగబాహ్యాత్పరం నాస్తి” యనియు - సతత మిట్టులు శ్రుతి చాటెడిఁగాన
యీక్షింప నింతయు నీశ్వరమయము - దక్షత గల్గెనా తర్కింపుఁ”డనిన
“నింకఁదర్కింపంగ నేది? యంతయును - శంకరుఁడనియెడు సచరాచరంబు
వలదుపో గుడి కేఁగి కొలిచెదమనఁగఁ - గలఁడంతటను గఱకంఠుఁడు మఱియు
నంగజహరుఁడు సచరాచరంబులకు - నంగమో జీవమో యాత్మయో చెపుమ”
యనిన [70]“శ్రమణులార! యాదిప్రశ్నకును - వినుఁడుత్తరంబ"ని వెండి యిట్లనియె
“నీరాష్ట్రములకెల్ల నీరాజుదక్క - ధారుణి మఱి చెప్పలే రనుటెల్ల
నోలి సమస్తపిపీలికాదులును - మాలలు బోయలు మహిపతి యనుటె
సర్వేశు [71]సుగుణవిచారితవృత్తి - సర్వంబునందును సంకీర్ణపదమె
యదిగాక వినుఁడీశ్వరాద్వైత మనుట - యిదియు సర్వాద్వైతమే యట్లుఁగాక
గుడికేఁగి మీకింకఁ గొలువనేలనిన - వెడఁగు ప్రశ్నకు మీరు వినుఁడుత్తరంబు
సర్వగతంబైన చంద్రాతపమున - సర్వశిలలు నుండఁజంద్రకాంతంబు
స్రవియించు నా రెంటిసామరస్యమున - స్రవియించునే యున్నశైలములెల్ల
శిలలపై వెన్నెల గలుగదే [72]కలిగి - ఫలమేమి యది ప్రాణపదముగా దట్లు
చంద్రికకొఱక తచ్చంద్రకాంతంబు - చంద్రాశ్మముకొఱక చంద్రిక యరయ
సర్వగతుండగు శర్వులోపలను - సర్వంబు నుండంగ శరణునిమనసు
కరఁగురెంటికి సమకళ [73]గల్గుఁగాన - కరఁగునే తక్కిన నరుల చిత్తములు
నఖిలంబు లింగమధ్యంబున లేదె - యఖిలంబు నుండియు నం దేమిఫలము

శరణునికొఱకె శంకరునిలీలయును - శరణునిహృదయంబు శంకరుకొఱక
మొదవుఁగ్రాపును దనయదియ కాఁదలఁచు - మొదవున కటె ప్రాణపదముగాక్రేపు
బ్రదుకుఁగాఁపును రెంటిపరిణామమంద - మొదవుగాఁపును నెఱుంగదు గ్రేపుఁగాని
మది లింగభక్తసన్మథనంబునంద - బ్రదుకు నెంతయుఁబ్రాణపథముగానుండు
స్వాతివాన గురియు జలములోనెల్ల - నేతఱి [74]గఱిఁగొన దిట్టిచిన్కులకె
కాని, నోర్దెఱవదు గఱి చిప్ప యొకటి - తానెల్ల వానలఁదడియుచు నుండు
నుభయసంగతిఁజేసి యుదయించు రత్న - మభవుని శరణుని యనువును నట్ల
కావున లింగభక్తస్నేహలీల - మీ వశంబె యెఱుంగఁగావలులార!
రమణమై నాడంబరమకాక లింగ - [75]సమధనసుఖములజాడ లేలింక
యంగమో జీవమో యాత్మయో యనిన - వెంగలిప్రశ్నకు వినుఁడుత్తరంబు
అంగంబు పూర్వకర్మావశేషంబు - నంగంబు సుఖదుఃఖసంగతినెలవు
నంగంబు పుణ్యపాపాలయం బట్టి - యంగంబు శివుఁడుగా దది వోవనిండు
జీవుఁడు శివుఁడని భావింతురేని - జీవుఁడు మలినుఁడు శివుఁడు నిర్మలుఁడు
జీవుఁడు దుష్కర్మి శివుఁడు నిష్కర్మి - జీవుఁడు సకళుఁడు శివుఁడు నిష్కళుఁడు
జీవుఁడు పశుమూర్తి శివుఁడు పశుపతి - జీవుఁడముక్తుండు శివుఁడు ముక్తుండు
జీవుఁడు సభవుండు శివుఁడభవుండు - జీవుఁడనిత్యుండు శివుఁడు నిత్యుండు
జీవుఁడశుద్ధుండు శివుఁడు శుద్ధుండు - జీవుఁడు మృతదుఃఖి శివుఁడమృతుండు
జీవుఁడు సంసారి శివుఁడసంసారి - జీవుఁడు సందేహి శివుఁడసందేహి
కావున, జీవుఁడు దేవుఁడు గాఁడు - పోవఁగ నిండది వొలుపుగా దింక
నాత్మయుఁబరమాత్మ యనరాదు వినుఁడు - ఆత్మ దాఁబంచభూతాత్మకంబయ్యు
నాత్మ దాఁబంచేంద్రియాత్మకంబయ్యు - నాత్మ దా దేహగుణాత్మకంబయ్యు
నుండుఁ గావున నాత్మయును గాఁడు శివుఁడ - ఖండిత సూక్ష్మవికస్వరలీల
సకలముఁగపటనాటకసూత్రములను - బ్రకటించు చైతన్యభావంబు శివుఁడు
అందు "నణోరణీయా” ననఁజొచ్చి - నందు లేకున్నట్టి శంభుఁడు శివుఁడు
నూవులలోపలి నూనియయట్ల - భావింపఁగాష్ఠంబుపావకునట్లు
పూనిపాషాణంబులో నిను మట్ల - తా నేత్రములలోని తద్రూపమట్ల
యలవడఁబాలలోపల నేయియట్ల - జలకుంభములలోని చంద్రునియట్ల
వెలుఁగు నద్దంబులోపలి నీడయట్ల - తలఁపఁబూసలలోని దారంబునట్ల

ఘటపటాదులలోని గగనంబునట్ల - పటికంపుశిలలోని భావంబునట్ల
వెలయ బీజములోని వృక్షంబునట్ల - నలరు శబ్దంబులోపలి యర్థమట్ల
పర్వతంబులలోని ప్రతిశబ్దమట్ల - సర్వంబునందును శర్వుండునట్ల
ముల్లు గుట్టఁదెఱపి యెల్లెడ లేక - యెల్లచోఁదానయై యిట్లున్నవాఁడు
ఈశుండు సకలలోకేశుండు గర్మ - నాశుండు నాదు రామేశుండె” యనిన
“యవునేని దాసయ్య! యఖిలంబునందు - - శివునకుఁగల్గువిశేషంబు లెవ్వి?
శివుఁడు నిత్యుండటె యవి యనిత్యములు - శివుఁడుననిత్యుండో శివుఁడందులేడొ
శివుఁడు దైవంబటె యవి యదైవములు - శివుఁడు నదైవమో శివుఁడందులేఁడొ
శివుఁడటే పశుపతి యవి వశురాశి - శివుఁడును బశువయో శివుఁడందులేఁడొ
యందొక్కటైనను హరుని గుణంబుఁ - జెందంగవలవదా యిందులో” ననిన
నన్యాయవాదుల నతగులఁజూచి - ధన్యుఁడు [76]దేడరదాసి యిట్లనియె
“నూనియగాఁజేసి నూల్కొనుదీప - మా[77]నూవులందును నలరునే చెపుఁడ
నువ్వులఁగల్గునే నూనియ గుణము - నువ్వులలోపల నూనియ లేదె
యీశునిగుణమేల నిన్నిటఁబొందు - నీశుఁడు దానెట్టు లిన్నిట లేఁడు
నువ్వులలోపల నూనియ గలదు - నువ్వులు గల్గునే నూనియలోన
సర్వజ్ఞునందును సర్వంబునుండు - సర్వజ్ఞుఁడుండునే సర్వంబునందు
నీ హేతువులకెల్ల నిట్లు చూడుండు - ఊహింపఁగా లేకయును గలవిధము
మథనపక్వక్రియామానంబునందుఁ - బ్రథితంబుగా మీఁదఁ బరము గాన్పించుఁ
గలుగంగవలెనన్నఁగలుగు జ్ఞానికిని - కలుగ దజ్ఞానికివలె నన్ననైన
సర్వజ్ఞుఁడిట్టుండు సర్వంబునందు - సర్వప్రమాణాదిసంసిద్ధ మిదియు”
ననవుడు జినమును లపహసింపుచును - మనమునఁదలపోసి మఱియు నిట్లనిరి
“పెక్కు లెఱుంగుట వెద్ద మేలయ్యె - నిక్క మింతయుఁగూడ నిటలాక్షుఁడేని
కలుగునే మలమూత్రములు విడ్చు [78]ఠావు - నిలమెట్టవచ్చునే యిది సెప్పు” మనిన
కూడజైనులనెల్లఁ గూళలఁజేసి - దౌడలు వడునట్లు దాసి యిట్లనియె
“యెఱుఁగరె జైనులా! రెన్నఁడు మీర - లెఱుఁగని కార్యమే యిది మీకుఁగ్రొత్తె
మృడుఁడు లేఁడనియెడు జడకర్మవాది - నడుతలమెట్టియే నడుతు మేప్రొద్దు
మనసిజహరుఁడు లేఁడని పల్కు నధమ - మనుజుల నోళ్లు మామర్గడంబులకుఁ
గింకిరిపడకుఁడీ బొంక నే నేర - నింక నే మడిగిన నిట్ల చెప్పెదను

భావింప నీ రెండుఠావులు దక్క - దేవదేవుఁడు లేనిఠా వున్నదెట్లు
సకలంబుఁదానయై సకలంబునందు - నికము దాఁబొందని నేర్పరి యతఁడు
సకలంబుఁబుట్టించి సకలంబునందు - నికము వుట్టకయున్న నేర్పరి యతఁడు
సకలంబు నడపుచు సకలంబునందు - నికము దానడవని నిర్గుణి యతఁడు
సకలంబుఁద్రుంగించి సకలంబునందు - నికము ద్రుంగనియట్టి నిత్యుఁడతండు
సకలముఁదనలోన నందు లేకునికి - సకలము నడఁచెడు జాణఁ డతండు
సకలంబుఁదన నిజాజ్ఞాప్రభావమునఁ - బ్రకటించు [79]చైతన్యభావకుఁడతఁడు
సకలంబు లీల నిచ్చామాత్ర నిలిపి - వికృతంబు లార్చు నిర్వికృతి యతండు
కలిగి యంతటిలోనఁగలుగనివాఁడు - కలఁడన్న వారికిఁ గలిగుండువాఁడు
తలఁపుల మిగిలిన తత్త్వంబువాఁడు - తలఁచినవారికిఁ దన్నిచ్చువాఁడు
కొలఁదికి మీఱిన గుణములవాఁడు - కొలఁది యెఱింగినఁ గూడుండువాఁడు
వలపింపరానట్టి వలపులవాఁడు - వలచినఁబాయక వరమిచ్చువాఁడు
గమియింపరానట్టి గమకంబువాఁడు - గమియించువారికిఁగడసూపువాఁడు
పట్టంగఁజూచినఁబ్రభసూపువాఁడు - పట్టిన మఱి బట్టబయ లగువాఁడు
వినికికి మిగిలిన వేషంబువాఁడు - వినునంతలోనన విహరించువాఁడు
దృష్టికిఁదాటిన తేజంబువాఁడు - దృష్టించి చూచినఁదెలి వగువాఁడు
వాసనగడిచిన వర్తనవాఁడు - వాసనమైఁగూడ వర్తించువాఁడు
చవులకు మీఱిన సారంబువాఁడు - చవులఁబాసినఁదాఁబ్రసన్నుఁడౌవాఁడు
పలుకులు గడచిన బాసలవాఁడు - [80]పలుకు లెఱింగిన ఫలియించువాఁడు
[81]భక్తవత్సలుఁడనఁబరగినవాఁడు - శక్తికతీతుఁడై సడిసన్నవాఁడు
యుక్తికిమీఱిన యుక్తులవాఁడు - వ్యక్తి సాక్షాల్లింగమై యున్నవాఁడు
కావున మాలింగదేవునిమహిమ - భావింప నెఱుఁగ మీ ప్రాప్తియకాదు
రామనాథుండు సర్వంబును నగుట - భూమి నభక్తులఁబొందకుండుటయు
నప్రసిద్ధపుమాట లనవల దిపుడు - సుప్రసిద్ధముగ దృష్టప్రత్యయముగఁ
జూపెద మీరడ్గ నోపెదరేని - యీ పొట్లచెఱువులో నెన్నఁగఁబడ్డ
వసదు లేణ్ణూరును వ్రచ్చివైపింతు - పనుల మిమ్మేమని పఱుతు నే” ననిన
"నెన్నిమార్గంబుల నీతనిఁ జెఱుప - కున్నఁ”గాఁదని జైను లూహించి చూచి
“దృష్టాంత మిప్పుడు దృష్టమౌఁగాని - దుష్టోరగంబునఁదొడికింత” మనుచు

వాసుకి మెచ్చక వాని నాలుకలు - గ్రోసెడు నన్నట్టి ఘోరసర్పంబు
గడువలోపలఁబెట్టి, "కలఁడయ్య! యిందు - [82]మృడుసర్వగతుఁడని నొడివెద”వనిన
“కలఁడనుమానమే ఘటములోపలను - కలుగఁడేనియు సర్వగతుఁడె రామయ్య”
యనుచు నూతనపురాతన మహాభక్త - జన పాదపద్మ సంస్మరణాత్ముఁడగుచు
నిర్భయుఁడై చేరి నిలిచి తత్కుంభ - గర్భస్థ మైయున్న దుర్భరోరగము
రోఁజుచుఁబొంగుచు [83]మ్రోగుచు లోనఁ - దాఁజప్పరించుచు దౌడలడఁచుచు
నెడనెడఁగడువలోఁబడఁగడచుచును - గడవడించుచు భుజంగము విజృంభింప
“రామనాథుండు [84]సర్వగతుఁ డవ్యయుఁడు - రామేశుభక్తు లీ భూమి నుత్తములు
పరముఁ గొల్వనివారు పరమపాతకులు - నరులెల్ల వింటిరే నాశపథంబు”
నంచు నా ఘటములో హస్తంబు దొడిగి - పొంచున్న సర్పంబుఁగుంచి తివుచుడును
పటికంపులింగమై స్ఫుటకాంతిఁజేసి - చటుల భాస్కరకరపటల మంతయును
విటతటముగ దిశాతటములఁగప్పఁ - గుటిలాన్యసమయ విఘటనతదీయ
పటుతరకరతల ఘటతమై వెలుఁగ - నటుగూడ జనులు ఖే యని జయవెట్టఁ
దటుకున జైనులు గుటిలత యడఁగి - ఘటితఫాలస్థల కరకంజులుగను
సుగ్గలదేవి యౌత్సుక్యంబు దనర - నగ్గురుదేవుఁదా నగ్గించుచుండ
బల్లహుఁడాదిగా నెల్లజైనులును - దల్లడంబందుచు ధరఁజాఁగి మ్రొక్కి
రంత దేడరదాసమయ్య బల్లహుని - సంతోషమున లింగసహితుఁగాఁజేసి
యిట దర్క ముత్తరించుటఁజేసి యల్ల - పటికలింగంబు నప్పట్టణంబునను
నుత్తరేశ్వరుఁడన నొగిఁబ్రతిష్ఠించి - యత్తఱి నా దాసమయ్య యేణ్ణూరు
వసదులు వ్రప్పించివైచి జైనులకు - నొసఁగఁడే శివదీక్ష యోరి జైనుండ!

హిరియ నాచయ్యగారి కథ


మారుడిగనుపురి మఱియొక్క భక్తుఁ - డారంగ హిరియ నాచయ్యగా రనఁగఁ
బరు లెఱుంగకయుండ భక్తుఁడైయుండఁ - బరవాదిజైనులు వ్రల్లదంబునను
నేడ సూచినఁదామె యెలమిని వెయ్యి - యేడునూర్వసదుల కిది వొడవనుచు
నొక్కశివాలయంబున్నఁ [85]వ్రప్పించి - చక్కన నచటి పూజారిఁగారింపఁ
“బరవాదిజైనులఁబఱపక యింకఁ - బరమున కారగింపఁగఁబెట్టరాదు
తప్పగుఁదడసిన నిప్పురి” ననుచు - నప్పుడ నాచిదేవయ్య దా వెడలి

పదినాళ్ళలోనన పండ్రెండువేలు - మదనారి సద్భక్తమండలిఁదాను
నెలమి దలిర్ప వేయేణ్ణూరు లింగ- ములఁబండ్ల కెత్తించి వలివేగమునను
నడతెంచి చుట్టు మారుడిగపై విడిసి - "బడుగు[86] బాఁపఁడు బట్టు పరదేశిమొదలు
దడయక జైనులు దక్కఁ దక్కెల్ల - వెడలుఁడో”యని యెల్ల వినఁగఁజాటించి
యందులో దేరసు లనఁబదుమువ్వు - రందఱ వారించి హరభక్తు లలరఁ
దలపడి తాఁకి జైనులఁగూడ ముట్టి - తలపట్లు వట్టి యుద్ధంబు సేయుచును
దమకంబుమైఁదార తమతమశిరము - లమితకోపోద్రిక్తులై తఱగికొని
యెలమి నత్తలలు డాపలికరంబులను - వలచేతఁగరవాలములు జళిపించి
చెలఁగి యత్యంత విజృంభితులగుచు - నలరుచుఁదూఁగాడ నలుఁగులు వెలుఁగఁ
గునియుచు నాడుచుఁగోయని యార్వ - జినమును ల్భీతిమూర్ఛిల్లి వాపోవఁ
మునుమాడి యాజిన మునుల మోఁదుచును - గనికని శిరములు దునిమి వైచుచును
రూఢిమై నాడుచుఁ బాడుచు వెయ్యి - యేడునూర్వసదులఁగూడ లెక్కించి
జినరూపముల తలల్ సిద్రుపలుసేసి - జినవసదులమీఁది సిడములు నూకి
యొక్కొక్కలింగంబు నొక్కొక్కవసది - నక్కజంబుగ నిల్పి యఖిలంబు నెఱుఁగ
నారంగఁదలలతో నట్టలుగూర్చి - ధారుణి వెలయరే తేరసు లనఁగ
నాచిదేవయ్య యనశ్వరమహిమ - నీచుఁడ! యెఱుఁగవే నిన్నటివార్త!
పాటివేల్పని మీరు వాటించు జినుని - చేటెఱుంగరె యొండు సెప్పనే లింకఁ
బఱచుట సోద్యమే పశువుల మిమ్ము - మఱియును నా హుళిగఱ యనుపురిని

సోమన్న గారి కథ


శూలిభక్తుండు దా సోమన్న యనఁ ద్రి - కాలంబుఁజేయు లింగస్పర్శనంబు
నేమంబుగాఁగోరి భూమి వర్తింపఁ - గా మఱియొకనాఁడు గన్నులు నొవ్వఁ
గడుసంకటంబునఁగానంగరామి - గుడికిఁ బోనేరక కుడువక యున్నఁ
దానొక్కరుఁడ తక్కఁదత్పురినెల్ల - జైనుల కావ యసహ్యభావమున
“గుడువ కుండఁగనేల గుడికడ కేము - దొడుకొని పోయెద మడరఁగ నిపుడు”
అంచు జైనులు దోడికొంచుఁదత్కార్య - వంచకు ల్సురహొన్నవసదికి నేఁగి
“మ్రొక్కుము వీఁడె మీ ముక్కంటి” యనినఁ - గ్రక్కున జినుతలఁగరములువెట్టి
పుడికి లింగాకృతి వడువుననున్న - దొడఁగి ముమ్మాఱు వ్రేల్మిడి మ్రొక్కి మ్రొక్కి

వలగొని సర్వాంగములును సంధిల్ల నిలఁజాఁగి మ్రొక్కిన "నింక లే చాలు
జినుఁడు ప్రసన్నుఁడై తనుఁగొల్వనిచ్చెఁ - బనిలేదు మా బుద్ధిగొని యిటబ్రదుకు”
మనవుడు సోమన్న యాగ్రహంబంది - "జినునికి గినునికిఁజేతు లెత్తుదునె
చా, పన్నలార! సాక్షాల్లింగమూర్తిఁ - జూ పెద రం” డంచు లోపలి కేఁగి
కన్నులఁగట్టిన [87]కవణంబు వుచ్చి - మున్ను లేచుచు బల్మిఁగన్నులు దెఱవ
నటమున్న జినరూప మటయట పాసి - పటపటఁబగులుచు నిటయటవడఁగ
నిటలతటానలోత్కటచటులాక్షుఁ - డట జినప్రతిమమధ్యంబున నిలిచె
ఖ్యాపితార్వాచీనరూపంబు దనర - గోపతివాహనుఁడేపు [88]దలిర్ప
సురహొన్న వసదిన సోమేశుఁడనఁగఁ - బరగె మా సోమన్నభక్తికి మెచ్చి
ముంజేతికంకణంబున కద్ద మేల - భంజింపఁబడు జినప్రతిమయ సాక్షి
యిలఁబ్రసిద్ధము నేఁడు నెఱుఁగుదు గాదె - హుళిగఱలోపల నోరి జైనుండ!

వైజకవ్వ కథ


వెండి బరవళిగవెలఁది వైజవ్వ - ఖండేందుధరపాదకమలాంతరంగ
మగఁడాదిగాఁబురి మనుజులందఱును - వగవఁగ జినమార్గవర్తులై నడవ
నాతి మగండొక్కనాఁడు జైనులకుఁ - బ్రీతితోఁబర్వంబు వెట్టునయ్యెడను
దరళాక్షి పదపదార్థములు గావించి - వరుఁడు జైనులఁబిలువంగఁబోయినను
దరుణియు నప్పదార్థములు వీక్షించి - "హరమూర్తియొకఁడైన నరుగుదేడఁయ్యె
బరికింపఁదాఁ జేయు పాయసాన్నములు - పరమేశ యితరులపా”లయ్యె ననుచుఁ
గడుఁగడు దుఃఖాన్నిఁగ్రాఁగుచు నున్న - యెడఁ దపోవేషియై మృడుఁడు యేతేరఁ
బడఁతియుఁగడుభయంపడి యప్పుడులికి - పడి వడి సంతోషపడి చక్కజాఁగఁ
బడి పలుమఱు మ్రొక్కఁబడి పాదధూళిఁ - బడి పొరలుచును బైఁబడి వైజకవ్వ
యాదిదేవునిమూర్తియగు తవరాజు - పాదంబులు గడిగి ప్రాశించి మ్రొక్కి
సముచిత సత్కారసంపదఁదనిపి - యమలిన దేహు సుఖాసీనుఁజేసి
పదపదార్ధమ్ములుఁ బక్వాన్నములును - గదళీదళం బిడి కన్ను దనియఁగ
వడ్డింపఁదపసియు వడి నారగింప - సడ్డలు సేయుచుఁ జప్పరింపంగ
సంతోషమునఁగుడ్వఁజనుదెంచి జైను - లంతకాంతకమూర్తి నల్లంతఁగాంచి
యంతన మగిడిపో నధిపుఁడేతెంచు - నంతన తపసియు నట్లదృశ్యముగఁ

“బాసోసి వైజి! తాపసి యెం దణంగె? - గాసిపడక చూపు క్షపణులచేతఁ
గన్నంతటను జూడఁగాదను తపసి - కెన్నెదల్ గల్గె నీకిటు గుడ్వఁబెట్టఁ
గూడునే తనయిల్లు వాడు సేసితివి - యేడ దాఁచితి చెప్పు బూడిదగొట్టు
మగనియాజ్ఞకు మీఱఁదగునె యి ట్లేమి - తగులమో కాక యత్తపసికి నీకు
సమ్మతంబగునేని చను” మని యతివ - సమ్మెటఁగొని చాటుచాటున వ్రేయ
నతివయు లెక్కసేయక శివుఁదలఁపఁ - బతి వ్రేయు వేట్లెల్ల సతిమీఁదఁబడక
పిట్టారగింపంగఁబెట్ట శంభుండు - పిట్టవ్వకై రాచవెట్టికిఁబోయి
సోలుచుఁగ్రాలుచుఁబ్రేల[89]గింపుచును - నాలంబు సేయుడుఁగోలలవారు
నలుకమై 'వడుగ! పొమ్మని వ్రేయువ్రేట్లు - కలయఁజోడని నియోగముఁదాఁకినట్లు
వసదులు నిండఁగ వాడలనడుమ - మసలిన తమ జైనపసులను దాఁక
త్రట్లను గట్టి ముచ్చుట్లును జుట్టి - వ్రేట్లతోడన తమవీవుతో ళ్లెగయ
నులికుల్కి వీఁగి వీపులు విర్చుకొనుచుఁ - గెలకు లారయుచుఁజేతులు నొగ్గికొనుచు
నుఱికుర్కిపడుచు [90]దబ్బఱమానుఁడనుచు - వెఱవేఁకు లందుచు విభ్రాంతు లగుచు
హోయని జడియుచు నుపతపించుచును - వాయెత్తి యేడ్చుచు వసదు లెక్కుచును
నందుండి యుఱుకుచు నైదవెట్టుచును - సందుల కేఁగుచుఁగ్రిందు సొచ్చుచును
చెఱవులమునుఁగుచుఁజెట్లఁబ్రాఁకుచును- బఱచుచునొండొరుమఱువుసొచ్చుచును
వ్రేట్లకు నులుకుచు విహ్వలు లగుచుఁ - ద్రట్లంటి చూచుచుఁ 'దమకర్మ'మనుచు
జినువెన్క డాఁగుచుఁ 'జిక్కితి'మనుచుఁ - గనుకనిఁజనుచు 'నెక్కడ సొత్తు' మనుచు
'వచ్చెఁజా'వనుచు'దైవమెఱుంగు'ననుచు - 'నొచ్చితి'మనుచును వెచ్చనూర్చుచును
దలలు గుండులతోడఁదాఁకించికొనుచు - నిలఁబడి పొరలుచునెట్లోకో' యనుచుఁ
దొరిగెడి మేని నెత్తురు లంటియంటి - పొరిఁబొరిఁజూచుచుఁ'బొక్కితి' మనుచుఁ
'జొరఁజోటు'లే దంచు సొమ్మసిల్లుచును - 'హరుకృత్యమో కాక' యనుచు నిబ్బంగి
సంతాపమున వ్రేట్ల జైనులు వొరల - నంతలో నొకబుద్ధిమంతుఁడీక్షించి
“చాటున నొకవ్రేటు సతి వ్రేయఁజాటు - చాటున నీ జైనకోటిఁదాఁకెడిని
యక్కజంబుగను నినాంశులు వోలె - నొక్కొక్క వ్రేటు వేయు ముఖముల్గాఁగ
శ్రీచంద్రమునివోయి చెఱువుపాలయ్యె - నాచార్యముని వోయి యగడితఁబడియె
వరచంద్రమునివోయి వసదెక్కి యుఱికె - నరహతముని వోయియడవులఁగలసె

క్షపణేంద్రమునిప్రాణ ముపతాపమొందె - విపులేంద్రముని వీపు విక్కన విఱిగె
రాజేంద్రముని బిట్టు వ్రాణముల్ విడిచె - నీ జినకులగురుఁడింతలోఁబొలిసె
నింతయుఁగూడ నొక్కింతయై మడిసెఁ - గంతుసంహరుచెయ్ది గానోపు” ననుచు
నతివ కడ్డము సొచ్చి యతని వారింప - నతగులపై వ్రాలునవ్వ్రేటు లుడిగె
భార్య సద్భక్తితాత్పర్యురా లగుట - యార్యేతరుఁడెఱింగి య ట్లెర్గనట్టు
“లన్నంబు వెట్టితి వన్నన్న మున్న - త న్నెఱుంగకయుండఁదపసి కొక్కనికి
నటుగాక శిక్షించి తందర నిప్పు - డిటు మునీంద్రులకెల్ల నెగ్గు సేసితివి
ముది గొరగల తంత్రములు మంత్రములును - మదిమది నన్నేల బ్రదుకంగనిచ్చు
వెఱతుము తమయిల్లు వెడలుమీ” యనుచు - నఱిముఱిఁద్రోచుడు నవ్వైజకవ్వ
చనుదెంచి చనుదెంచి జైనాలయంబుఁ - 'గని శివాలయ మిది గానోపు'ననుచు
వనిత మున్నిలు వెలువడమిగాఁజేసి - కని వసదియు గుడియును నెఱుంగమిని
'ముక్కంటి శర'ణంచు మోడ్పుఁగేలమర - మ్రొక్కుచువసది యమ్ముద్దియగదియ
నటజినప్రతిరూప మప్పుడ వ్రస్సి - యటయిట వడఁగఁదదభ్యంతరమున
నుదయించె నద్భుతాస్పదలింగమూర్తి - ముదిత సముదితసమ్మదలీలఁదనరఁ
“బురుషుఁడు శివభక్తివిరహితుఁడేని - బురుషుని మీఱుట దరుణికిఁబథము
దుర్గతిఁబొంద దెందును బతిఁబాసి - భర్గుని గొనియాడు పడఁతియు నట్ల
చనఁగ నాలాయని యను మునిభార్య - యనసూయయు బురుషుఁడు నభక్తుఁడైన
బాసి శంభుని గొల్చి పడసెను గాదె - భాసురంబగు మోక్షపదవి వెండియును
నిల యెల్ల నెఱుఁగఁగ దిలకవ్వనాఁగ - వెలఁది యీశ్వరభక్తి విముఖుఁడైనట్టి
మగనిఁబాయుడు వాఁడు దెగనున్న యెడను - నెగిది శివాలయం బింతి సొచ్చుడును
వెనుకొని యేతెంచి పెనిమిటి శివుని - వెనుక దాఁగిన నాతి గినియుచుఁగొంగు
వట్టి తివ్యఁబురుషభావమైయుండె - నెట్టణ శివభక్తి నిష్ఠగాఁజేసి
యనుచుఁజెప్పఁగ విందు మాద్యోక్తులందుఁ - గనుఁగొనఁబడియె నీ కాంత సద్భక్తి"
యని యసంఖ్యాతభక్తావలి వొగడ - జన నికాయంబు ఖే యని జయవెట్ట
నా జిన మును లెల్ల నాశ్చర్యమంది - వైజకవ్వకు మ్రొక్కి వడిఁబ్రస్తుతింప
వైజవ్వ భావోద్భవంబౌటఁజేసి - వైజనాథుం డన వసుధపై వెలసి
భ్రాజిల్లు టెఱుఁగవే బరవళిగందు - వైజకవ్వ మహిమ యో జైన కూళ!
చన్న సద్భక్తుల శౌర్యాతిశయము - లెన్న ననంతంబు లిన్నియు నేల

నాఁటి [91]లింగము నేఁడు నవసెనే చెపుమ - నాఁటి[92]భక్తమహిమ నవసెనే నేఁడు
చిటిపొటిసమయంబు లిటువంటి వడఁప - నట వెద్దలేల నే మైనఁజాలుదుము
గబ్బున జైనమార్గమె యాది యనుచు - నిబ్బంది జినమును లీ యబ్బలూర
మెట్టి మాతోఁబ్రతిఘట్టించి యాడ - నెట్టణ వాదంబు నిల్చి గెల్చినను
“నటువోవ దింకఁబ్రత్యక్షప్రమాణ - మిటు సూపుమా” యని యటు ముదలింప
“హిరియవసదినాఁగఁ బురినెన్నఁబడ్డ - యురుజినాలయ మినుఁడుదయమౌనంత
లోనన గోడలతోనన కూలి - తానపు మీ వేల్పుతలయును బగిలి
నేలపాలయ్యెనేనియు నీశుబంటఁ - జాలుఁబో యిదియ దృష్టముచూడుఁ”డనుచు
వచ్చినంతటిలోన వసదియుఁగూడ - వ్రచ్చి వందఱ లాడువడువునఁద్రెళ్లె
జినరూప మంతఁదుత్తునియలైపడియె - జనులు జైనులును నాశ్చర్యంబు నొంద
నిలువ దప్పురిఁగూలు నేఁడును వసది - యిలయెల్ల నెఱుఁగరే యిన్నియునేల
ముదిలంజెపడు పట్లు ముందటికథలు - పదరి చూపఁగలేని [93]పందవే నేఁగు
వరకీర్తి మొఱటద వంకయ్యగారి - వరవుడఁ బిఱుసనవచ్చునే నాకు
యిప్పుడ శిరమిచ్చి యేడుదినంబు - లిప్పురవీథులనెల్లను మెఱసి
తలవడయుదు ధరాస్థలియెల్ల నెఱుఁగ - దలతలచూడను గలదురా శక్తి
యటమీఁదఁగళ్యాణకటకంబునందు - నటయిట మందునకైన లేకుండ
వసదు లన్నియు వ్రచ్చి వందఱలాడి - వెస జినప్రతిమల విసమాల్తు నిదియు
బాస మిమ్మిరుగాలిపసుల నింకొండు - చేసిన నిం కొండు సిద్ధియుఁగలదె”
యనవుడు"నట్లకా”కని యొక్కదెసను - జీనసమయస్థులు సేరిచూడంగ
బసవఁడు సహితంబు భక్తనికాయ - మెసకంబుతోఁగొలు విచ్చి కూర్చుండ
నా బిజ్జలుఁడు దంత్ర మప్పురాంతరము - నా బాలవృద్ధాదు లంతంతఁజూడ
నచ్చెరువంద నేకాంతరామయ్య - కచ్చించికొని యంకకాఁడునుబోలె
దరహాసకాంతి వక్రమునఁదుల్కాడ - నరుదొంద భక్తగణాళికిమ్రొక్కి
యార్చి బొబ్బిడిపొంగి యలుఁగు గంఠమునఁ - జేర్చి క్రుమ్ముడి యొక్క సేతసంధించి
యాసురంబుగ నల్గ నప్పుడట్టకును - బాసి శిరము కేల “బాపు బా” పనఁగ
బసవఁడు గీర్తింప భక్తసమూహ - మసమానలీలఁగో యని పొంగియార్వ

క్ష్మాతలేశుఁడు శిరఃకంపపూర్వముగఁ - జేతులు రెండును శిరమునఁదాల్ప
వారక జయజయధ్వనులు ఘూర్ణిల్ల - పౌరజనములు విభ్రాంతులై చూడ
నవికలసకలవాద్యధ్వను ల్సెలఁగ - వివిధ నాటకమహోత్సవము లొప్పార
వలచేత నలుఁగు డాపలిచేత శిరము - దులుకాడ వీథివీథుల మెఱయుచును
జతులు వెట్టఁగఁదాళగతుల కాడుచును - క్షితిఁగటారముమీఁదఁజేరినిల్చుచును
శరణార్థిసేయుచు జయవెట్టుఁడనుచుఁ - బిరిగొని యార్చుచుఁబెడబొబ్బ లిడుచు
నిప్పాటఁగలయంగ నేడుదినంబు - లప్పురి మెఱసి యేకాంతరామయ్య
వచ్చి యప్పరు[94] గుడివాఁకిట నిలిచి - "వచ్చెనా బాస శ్రవణులార!" యనుచు
నేకాంగవీరుఁడలోకానుసారుఁ - డేకాంతరాముఁ డపాకృతకర్మి
చక్కన శిరమట్ట సంధింపఁదడవ - నొక్కింత కొకదెస కోరవో యుండె
'హరుఁడు వేల్పగుట కేకాంతరామయ్య^ - శిరములోకులకెల్ల గుఱి' యన్నయట్లు
ఏకాంతరామయ్య శ్రీకరమహిమ - లోకాంతమయ్యెఁద్రిలోకంబులందుఁ
[95]బ్రత్యక్ష మీతఁడే పరమేశుఁడనుచు - నత్యద్భుతాక్రాంతులై జను ల్వొగడ
'గడుదురాత్ములఁజూడఁగా దని తమకుఁ - బెడమొగం బిడె' నని భీతిల్లినట్లు
జనపాలుకునిచేత జయపత్ర మిచ్చి - జినసమయులు వచ్చి శివభక్త వితతి
ముందటిదెసఁజాఁగి మ్రొక్కఁగఁబడిన - యందఱిమొగములయం దచ్చులొత్తి
యారిచి పెడబొబ్బ లందంద యిడుచు - వీరమహేశ్వరవితతి యుప్పొంగి
వెనుకొని వసదుల విఱుగఁ గొట్టుచును - జినప్రతిమల తలల్చిదిమివైచుచును
నసమానలీలఁగల్యాణంబునందు - - వసదియు జినుఁ డనువార్త లేకుండఁ
గసిమసంగుచుఁజంపి గాసివెట్టుచును - వసుధలో జిను లనువారి నందఱను
నేలపాలుగఁజేసి నిఖిలంబు నెఱుఁగఁ - గాలకంధరుభక్తగణసమూహంబు
అనుపమశౌర్యు నేకాంతరామయ్య - ననురాగలీలమైఁగొనియాడుచుండ
ననయంబు బసవఁడు దనసంగమేశుఁ - డని భక్తిఁగొల్వ నేకాంతరామయ్య
వరకీర్తిమై నిట్లు వర్తింపుచుండె - ధర లసద్భక్తివిస్ఫురణమై మఱియుఁ
బ్రథితుఁడీ యేకాంతరామయ్య దివ్య - కథ విన్న వ్రాసిన గారవించినను
జల హాలహల వహ్ని శస్త్రాస్తబాధ - నలి నాగ మృగ రోగములభయంబణఁగు
విపులదృష్టాదృష్టవివిధ సౌఖ్యములు - నపవర్గములు గల్గు హరుకృపఁజేసి

షొడ్డలదేవు బాచయ్యగారి కథ

ధీరుండు షొడ్డలదేవుబాచయ్య - గారు నా వెండియుఁగఱకంఠమూర్తి
నిర్గతేంద్రియవైరివర్గదుర్గుణుఁడు - భర్గనిరర్గళాంతర్గతధ్యాని
యుగ్రాక్షభక్తగణాగ్రగణ్యుండు - నిగ్రహానుగ్రహోదగ్రశౌర్యుండు
కష్ట గుణాశ్లిష్ట దుష్ట జనారి - శిష్ట జనానంద పుష్టి పాలకుఁడు
దుర్భావరహితుఁడగర్భసంభవుఁడు - నిర్భవాశ్రయుఁడపునర్భవశాలి
శాంతుండు దాంతుండు సదమలభక్తి - కాంతుండు నిర్జితావాంతరసమయి
పరదైవ పర్వతప్రథితదంభోళి - పరదైవసందోహతరుకుఠారంబు
పరదైవశుండాలపంచాననుండు - పరదైవవార్థిశుంభత్కుంభజుండు
"త్రినయనునతులితోద్రిక్త శౌర్యంబు - చనునందికేశ్వరు సర్వజ్ఞతయును
భృంగినాథుని యేకలింగనిష్ఠయును - భంగిగా నవ్వీరభద్రురౌద్రంబు
భృగుదధీచ్యాదులపృథుశాపశక్తి - తగుగౌతమాదుల తర్కప్రయుక్తి
గురునాథుఁ డిన్నియుఁగూడ బాచాంక - వరదివ్యమూర్తిగా విరచించెనొక్కొ
కానినాఁ డిటువంటి కలియుగరుద్ర - మానితపృథుదివ్యమహిమ యెట్లొనరు”
ననుచు లోకంబు లత్యర్థి గీర్తింప - ననురాగలీల నూనిన భక్తియుక్తి
'సిద్ధాంతముల శ్రుతిస్మృతిమూలములను - బద్దవేదాంతసంపాదితోక్తులను
న్యాయవైశేషికాద్యఖిలశాస్త్రముల - నాయతబహుపురాణాగమార్థముల
సహజానుమానాదిసర్వప్రమాణ - బహుతర్కవాదజల్పవితండములను
వెలయు నుత్పత్తిస్థితిలయకారణుఁడు - నలరు నిత్యానందుఁ డంబికాధవుఁడు
పశుపతి దాఁగర్త వలువేల్పులెల్లఁ - బశువులే'యని ప్రతిపాలన సేసి
జినసమయస్థులశిరములు దునిమి - మును విష్ణుసమయులముక్కులు గోసి
యద్వైతులను హతాహతముగాఁదోలి - విద్వేషవాదుల విటతాటమార్చి
చార్వాకవాదుల గర్వం బడంచి - సర్వేశుభక్తియే యుర్వి నిష్ఠించి
దిట్టయౌ షొడ్జలదేవుబాచయ్య - యిట్టిసద్భక్తిమహిష్ఠుఁడై నడవ
నెడనెడ సౌరాష్ట్ర మేఁగి యేఁటేఁటఁ - గడు నర్థితోడ జాగరము సెల్లించు
దిన మేఁగుదెంచుడుఁ'దివుట సౌరాష్ట్ర - మున జాగరము సేయఁజనియెద'ననుచు
బిజ్జలునకు వినిపింపఁగ నతఁడు - "కర్ణ మెంతేనియుఁగలదు వోరాదు
కొట్టరువునఁబళ్లు గొలువఁగవలయు - నిట్టేల చెల్లు నీ కిరుదెస కొలువు

బాలెంతలంజియపడపట్ల రాచ - యూళిగంబును భక్తియును గూర్చి నడవ
సౌరాష్ట్రమున కీవు సనుము గాదేని - సౌరాష్ట్రనాథుఁడు సనుదేర నిమ్ము
శివరాత్రి గివరాత్రి సేయుట మాను - తవిలి యీయుళిగంబు దప్పింపరాదు”
అనుచు నప్పరవాదులనుమతంబునను - జనపతి వారించుడును బోక నిలిచి
“ముదలించి పలుకుడు మూర్ఖుఁడై పోక - యదియుఁగష్టముగాదె యతఁడన్నయట్లు
వచ్చు నిచ్చటికొండె వరదుఁడు నాకు - నచ్చటి కేఁగున ట్లయ్యెడు నొండె
దీనఁదప్పినదేమి నా నిజవ్రతము - తా నెట్లు శివునకుఁదప్పింపవచ్చు”
ననుచు నిశ్చింతాత్ముఁడై యున్న యెడను - ఘనుఁడు సోమేశుఁ డాదినము దొల్నాడు
[96]మడఁపులేఖయు నందిపడగయుఁగొనుచుఁ - బడిహారిక్రియఁబట్టపగలె యేతెంచి
కొట్టరువునఁబళ్లు గొలిపించుచుండ - నట్టిచో బాచయ్య కాతఁడిట్లనియె
“సౌరాష్ట్రనాథుండు సనుదెంచుచుండి - భోరన ముందఱఁబుత్తెంచె నన్ను
శంకరు నానతిఁజదువుకో లేఖ - యింకిటపూఁటకు నేఁగుదెంచెడిని
నాసక్తిమై నింక ననిశంబు మీని - వాసంబునన యుండవలయుఁ గావునను
నీ పెద్ద గాదియలోపలఁగొలుచు - వేపోయఁబనుపుము వెడలి సోమేశుఁ
డచ్చోటఁబ్రత్యక్ష మయ్యెడి” ననుచు - నచ్చుగాఁజెప్పుచు నతఁడదృశ్యముగఁ
“జనుదెంచు నిచటికి సౌరాష్ట్రనాథుఁ - డనుమాన ముడుగుఁడీ యదియెట్టు లనిన
వచ్చెనే మున్ను రావణుని మన్నించి - యచ్చోన చిక్కెఁగా కనిపల్కవలదు
భక్తుఁడే యతఁడు దపఃఫలోన్నతిని - శక్తిమంతుఁడు గాక చర్చించిచూడ
భక్తులచేఁ బట్టువడుఁగాక శివుఁడు - భక్తిహీనుల [97]కేల పట్టిచ్చు శివుఁడు
విలసితభక్తి సద్విధి మెచ్చికాదె - యెలమి గుడ్డవ్వకు నెదురుగా వచ్చి
కదల కట్టుల చిక్కెఁగాదె సోమేశుఁ - డదియేల నావిందె గనుపురంబునను
గావునఁజూడంగఁగందు మిప్పురిని - దేవునిరాకకు దృష్ట మిచ్చటికి
పడిహారి భావనఁబఱతెంచె నతఁడు - నడర సౌరాష్ట్రనాయకుఁడ కానోపు
సకళనిష్కలభావ సన్నుతశక్తి - నిక మెట్టి పడిహారులకు నున్నదెట్లు
వచ్చెనిట్లానతియిచ్చె లోకులకు - నచ్చెరువుగ నెల్లి [98]యరుదెంచుఁజుండి
యిట యదృశ్యుండయ్యె నీశుండ” యనుచుఁ - గటకంబునరులు విఖ్యాతిసేయంగఁ
దవిలి సమ్మదసముద్భవవారి గ్రమ్మ - శివునియానతి లేఖ శిరమునఁదాల్చి
పుర మప్డు శుభముగా విరచింపఁబంపి - కరమనురక్తి బాచరసు వెండియును

బసవయ్య మొదలుగా భక్తులు దాను - నసమమొడ్డోలగంబై యున్న యెడను
వింతచే నానందవిభ్రమంబెసఁగ - నంతంతఁబాడంగ నంతంత నాడ
నదెవచ్చె వచ్చె వియన్మండలమున - నిదెవచ్చెవచ్చు సోమేశుండనంగ
నీరధు లేడు ఘూర్ణిల్లినభాతి - సారగంభీరవాద్యారవంబెసఁగ
భోరన మ్రోయుచప్పుడు వినఁబడఁగ - సౌరాష్ట్రనాథుఁడాశ్చర్యంబెలర్పఁ
దివిరి కొట్టరువు గాదియ వ్రచ్చికొనుచు - భువిఁబ్రతిష్ఠుండయ్యె నవని గంపింప
'సిద్ధరామయ్య దా శ్రీగిరికేఁగి - శుద్ధాత్ము మల్లికార్జునునిఁబ్రార్థించి
కొనుచు నా సొన్నలికను పురంబునకుఁ - దానెట్లు రప్పింపఁగా నేరఁడయ్యె
నిప్పు డిచ్చటనుండి యీ బాచతందె - రప్పించుకొనియెఁ [99]జేరఁగ సోమనాథు
నిట్టిధన్యుఁడు గల్గునే' యని భక్తు - లిట్టలంబుగ నుతియించుచునుండ
నచ్చెరువందుచు నా బిజ్జలుండు - వచ్చి సాష్టాంగుఁడై వడిఁబ్రణమిల్లి
సకలనియోగంబు జయవెట్ట బసవఁ - డకలంకలీల బాచయ్య నంకింప
వలివేగమున గాదియలు వడఁద్రోచి - నెలకట్టుకట్టించి నిమిషమాత్రమున
వరరత్నఖచితసువర్ణాలయంబు - విరచించి కోటగోపురము లెత్తించి
ప్రవిమలోద్యద్భక్తి బాచిరాజయ్య - శివరాత్రినియమంబు సెల్లించెనంత
నలిఁగొట్టరువు సోమనాథు డనంగ - వెలసె లోకావలి వినుతింపుచుండఁ
దెల్లగాఁషొడ్డలదేవు బాచయ్య - సల్లీల సద్భక్తి కెల్లయై పరగ
లలినన్యసమయ కోలాహలమహిమ - కిల బిజ్జలుండు సహింపక మఱియుఁ
గుమతియై యప్పురిసమయులుఁదాను - రమణఁబ్రతాపనారాయణపురిని
గోవిందప్రతిమ సద్భావంబెలర్ప - గావించి యొకగుడిఁగట్టించి మంచి
దినమున నతనిఁబ్రతిష్ఠగావించి - యనురాగలీలమై నంతఁ [100]గొల్విచ్చి
యున్నెడ నఖిలనియోగంబు గొలువ - నన్నరేంద్రుండు దా నందఱఁజూచి
“బాచిరా జటయేమి భక్తుండ ననియొ - యేచియో యీ కార్య మెఱుఁగఁడో
తా లెక్కసేయక తమకొలువొల్లఁ - డో లీల నిట్టి యొడ్డోలగంబులకుఁ(యెఱిఁగి
జనుదేరకుండు టే”మని యాగ్రహింప - మనుజేశునకు బసవనమంత్రి యనియెఁ
దవిలి నీయుడిగంబుఁదప్పించెనేని - బవరంబు ముట్టినఁబాఱెనేనియును
దప్పని దండింపఁ దగ వగుఁగాక - యిప్పరదైవంబు [101]లిండ్లిండ్లకడకు
నేల రా వనవచ్చునే పతి వీవు - జోళవాళిక కాక వేళవాళికిని

వత్తురే యన్యదైవంబులయిండ్లు - చొత్తురే భక్తులు సూతురే విండ్రె
లింగైకనిష్ఠావిలీనుండు భృంగి - యంగజారాతికి నతివ యైనట్టి
యర్ధనారికి మ్రొక్కక భవునిదక్షి - [102]ణార్ధ మేర్పఱిచియు నటమ్రొక్కెననిన
నిట వేయునేల మాహేశ్వరవితతి - చిటిపొటివేల్పులఁజీరికిఁగొండ్రె
వినవె ఘంటాకర్ణుఁడను ప్రమథుండు - మును పరశబ్దంబు విననినేమంబు
గాన ఘంటలు ఘణఘణయని మ్రోయ - వీనుల నొకవేనవేలు ధరించి
లోకంబులందు ఘంటాకర్ణుఁడనఁగఁ - బ్రాకటంబుగఁజెప్పఁబడియె వెండియును

అరియమ కథ


[103]నదియట్టు లెఱుఁగవే యరియమనాఁగ - మొదల నర్వద్దాడి మువ్వురలోన
వెలయ మహేంద్రమంగళ మనుపురిని - నెలకొన్న సద్భక్తినిష్ఠ పెక్కువను
దనయొద్ద నొండొకదైవంబుఁబేరు - కొనువారి తలఁదెగఁదునుముదు ననుచు
నున్నెడ నింటికి నొక్క బ్రాహ్మణుఁడు - సన్నుతి రుద్రంబుఁజదువుచు వచ్చి
భిక్షంబు వేడుడుఁబ్రీతిమైఁ దాన - భిక్షంబు గొనివచ్చి పెట్టంగ నురిలి
యందులో నొకమెదు కవనిపైఁబడ్డ - సందడింపుచు నన్యశబ్దంబుఁబలుకఁ
గట్టుగ్రమునఁజేతిచట్టువంబునను - గిట్టి యాభూసురు పొట్ట వ్రచ్చుడును
“నక్కటికము లేక యరియమనాఁగ - నొక్క భక్తుఁడు సంపె నొక్క విద్వాంసు
'ధర బ్రాహ్మణో న హంతవ్య' యనంగఁ - బరగిన వేదోక్తిఁబరపరసేసి
స్వాధ్యాయపరుఁడగు సద్భ్రాహ్మణుండు - వధ్యుఁడే యూరక వధియింపఁదగునె
యడుగ భిక్షంబు వెట్టెడిది గాదేని - గడపెడి దింతియకాక చంపుదురె”
యనుచు భూసురు లాగ్రహంబునఁగూడి - జననాథునకు నంత వినిపింపఁదడవ
యప్పుడ పిలిపించి యరియమరాజుఁ - “[104]దప్పేమి మునుజేసెఁజెప్పుమా విప్రు
నేలచంపితి నీతియే యింత బుద్ధి - మాలుదురే భక్తి మదిఁగల్గు ఫలమె
చెప్పు కాచెద మేమి[105]సేసె నాతండు - చెప్పవేనియు సరిసేసెద మిట్లు
చెల్లునే' యనవుడుఁజిఱునవ్వు నవ్వి - “చొల్లువాఱుడుమాటలెల్ల నేమిటికిఁ
జంపితి నట్లైనఁజంపినవిధము - చంపంగఁ దగుతప్పు శంభుఁడ యెఱుఁగుఁ
గావఁజంపఁగఁగర్త దేవుఁడ కాక - కావఁజంపఁగ మీరు గర్తలె” యనుడు

“భవికీటకంబుతో శివభక్తిపరుని - భువి సరిసేయుట యవినీతి” యనక
ధరణీశ్వరుండు మదగ్రస్తుఁడగుచు - సరిసేయఁబంచుడు నరియమ మగిడి
వచ్చుచో నొకశివావాసంబులోను - సొచ్చి చేతాళంబు లిచ్చుచు నిట్టి
పరమపాతకుఁడనఁబడు ద్రోహితోడ - సరి సావఁదగునయ్య పరమాత్మ” యనుడు
నరియమరాజు లింగైకనిష్ఠకును - బరమనిర్మలభక్తిభాతికి మెచ్చి
“పరదైవనామదుర్భాషణుతోడ - సరిసేయవచ్చునే శరణుని” ననుచు
నక్షణమాత్ర నెయ్యంబుతోఁదనదు - వక్షంబు దెఱచి యావరలింగమూర్తిఁ
'జొరుచొరు'మనుడు నా యరియమరాజు - కరమర్థితో లింగగర్భంబు సొచ్చె
నత్తఱి 'నదెపోమె నదెపోయె' ననుచు - నత్తలవరు లేఁగునంతకు మున్ను
వెలుపల మూరెఁడు మొలకచ్చతోఁక - వెలయ లింగంబులోపలఁబ్రవేశించె
భంగిగా మా శివభక్తు లెయ్యెడల - వెంగళివేల్పుల [106]వినఁగ నొల్లమికి
యరియమగట్టిన యయ్యంబరంబు - కరిగాదె నేఁడును గానవచ్చెడిని

వీరశంకరుని కథ


వీరశంకరుఁ డన వెండియు నొక్క - మారారిభక్తుని చారిత్ర వినుము
కల నైనఁబరసమయుల దైవములను - దలఁపడు ముట్టఁడు వలుకఁడు దోడ
నదియె నేమముగ సమ్మదలీల నడవ - నదియొక్కనాఁడు స్వప్నావస్థయందు
"నంటితి నొకబౌద్ధు” నని కలగాంచి - కంటగించుచు మేలుకని విచారించి
“కుక్క ముట్టిన కడ్వకును విధి యేమి - చక్కనఁగాల్చినఁజాలున కాదె”
యని కృతనిశ్చయుఁ డగుచు శ్రీగిరికిఁ - జనుదెంచి హాటకేశ్వర దేవునొద్ద
విస్ఫులింగంబులు వెడలుచు నగ్ని - ప్రస్ఫురింపఁగ బగబగయను నినుప
పెనముపైఁగూర్చుండి భీకరోద్వృత్తిఁ - గనలెడు నయ్యిన్ప పెనము కాఁకకును
రెట్టించి ముప్పదిరెండాయుధముల - దట్టుండు గెలసంబు దా నాచరించి
మదనారి మెప్పించి మహితసాయుజ్య - పదవిఁ దత్‌క్షణమాత్రఁబడసెఁగావునను
నంతకాంతకుభక్తు లన్యదైవముల - నంతయు నొల్లమి సహజంబు వినుము

శివలెంక మంచయ్యగారి కథ


శివలెంకమంచయ్య శ్రీకాశిలోనఁ - దవిలి విశ్వేశ్వరస్థానంబునందుఁ
దప్పక శివునకుఁదనపదివ్రేళ్లు - ముప్పూఁటఁ బూజించి యప్పుడ పడయు

జను లద్భుతం బంది వినుతింపనట్ల - యనయంబు వర్తించుచును రూఢి వెలయ
నక్కజం బందఁగ నన్యదర్శనుల - ముక్కుపైఁగత్తియ న్టెక్కె మప్పురిని
నెత్తించి 'వీరమాహేశ్వరపదమె - యుత్తమ మీశ్వరుఁడొక్కండె కర్త'
యని ప్రతిష్ఠింపంగ నన్యదర్శనులు - చని యంత వారణాసిని గదాధరుని
గుడిసమీపంబునఁగూర్చుండి గర్వ - మడరఁ దర్కోన్ముఖులై పిలిపింపఁ
బసిగమై మంచెనభట్టారకుండు - నసదృశమహిమ దుల్కాడ నేతేర
సమయులు దమతమశాస్త్రంబు లెత్తి - భ్రమగొని యొక్కొక్కప్రశ్న సేయుడును
నయ్యయి శాస్త్రసూక్త్యర్ధంబులందు - నయ్యయి సమయుల కియ్యకోలుగను
నిపుణతమై సకలపురాణశాస్త్ర - విపులార్థవాదము ల్విఖ్యాతి వెలయఁ
జూపుచు వెండియు శ్రుతిసంహితాది - రూపితార్థంబుల రూఢిగాఁబ్రశ్న
సేయుడు లెంక మంచెనపండితులకు - నాయెడ సమయులు వాయెత్తనోడి
“చదువులు గిదువులు సాలుఁబో”వేయు - [107]నదియేల దృష్ట మే మయినను గలదె
యనవుడుఁ దనక తా నరుగ నవ్విష్ణుఁ - గొనిపోయి విశ్వేశ్వరునకు మ్రొక్కింతు
నింకఁ"జూడుం డంచు లెంకమంచెయ్య - యంకించి నరు లెల్ల నటు ప్రస్తుతింప
మారారి సద్భక్తమండలిఁదలఁచి - "యోరోరివిష్ణు! [108]నీకొడయఁడైనట్టి
విశ్వేశునకు మ్రొక్క వెడలి ర”మ్మనుడు - నశ్వరపరదర్శనస్థులు వడఁక
శ్రీరమణుండు మంచెన పండితయ్య - గారి యానతికిని గడగడ వడఁకి
మ్రొక్కుచు నత్తిరుముట్టంబు వెడలి - చక్కఁదెర్వునఁబాదచారియై నడవ
శివలెంక మంచెయ్య శివభక్తవితతి - దవిలి ముందట మహోత్సవలీలఁజనఁగ
నగ్గదాధరువెన్క నన్యదర్శనులు - నగ్గలికము సెడి యరుదెంచుచుండ
నక్కజంబుగ నటు హరిఁగొనివచ్చి - మ్రొక్కించె విశ్వేశ్వరునకు మంచెయ్య
భువి“శివభక్తః ప్రభు ర్మమ” యనఁగ - నవిరళంబయ్యెఁగేశవునివాక్యంబు
మంచెనపండితు ల్మఱి తన్నుఁబిలువఁ - 'బంచినపని సేసి బ్రదుకుదు' ననుచుఁ
జక్కనఁజనుదెంచి మ్రొక్కె నంతటను - 'జిక్కె' నంచును గూడి శివభక్తు లలర
“నదిగాదె నేఁడును హరి విశ్వనాథు - నెదుర మ్రొక్కినయట్టు లీల నున్నవాఁడు
నేవాదులును విష్ణు లేవంగనెత్తఁ - జూవె చాలక యిట్లు సూచుచున్నారు
హరునకుఁబ్రతిలేమి యన్నియునేల - ధరఁజాఁగఁబడియున్న హరిరూపసాక్షి

శంకరదాసయ్యకథ

భక్తులయాజ్ఞలోపలివాఁడు హరియు - భక్తు లల్గినఁజెడు బ్రదుకుఁగూర్చినను
ధరణి నెట్లన్న శంకరదాసి యనఁగఁ - బరికింప రెండవఫాలలోచనుఁడు
ఇట యల్గిచూచిన నితరదైవంబు - లటవ్రయ్యలై పడు నన్యదర్శనులు
తొల్లియు జగదేకమల్లఁడన్పెద్ద - బల్లహు నొద్ద సంపాదన సేయ
బిలిబిలి పరసమయులు దల్లడిల్ల - నలిగి శంకరదాసుమయ్య సూచుడును
ఫాలకరాళవిశాలనేత్రాంత - కీలావళీస్ఫురత్కాలాగ్ని గ్రమ్మఁ
గ్రక్కున నచటి నారాయణప్రతిమ - వ్రక్కలయ్యెనుగాదె వసుధ యెఱుంగ
నరయ శూన్యాలయంబై యున్నయట్టి - తిరుముట్ట మది దాన కరిగాదె చూడఁ
గావున మా [109]భక్తగణములమహిమ - నీ వేమియెఱుఁగుదు నిఖిలేశ్వరుండ
యననేలవేయు నట్లైన బాచరసు - ఘనమహత్వముసూతుగాదె తొల్లియును
యణకించి పలుకఁ దత్‌క్షణమాత్ర నీవ - ప్రణుతింప సోమేశు రప్పించుకొనఁడె
[110]కొట్టరువునఁబళ్లు గోటానకోట్లు - పెట్టియు మనుజులపేళ్ళు వ్రాయండు
కదియఁబంచాక్షరి కవిలియవ్రాసి - చదువు లెక్కలు [111]వెర సది దప్పకుండ
నెఱుఁగుదుగాదె మున్నేఁజెప్పనేల - యెఱుఁగుదుగాకేమి యిటమీఁదిపనులు”
నంచును వృత్తాంతమంతయుఁ బసవఁ - డంచితమతి విన్నవించి పుచ్చుడును
'వాద మన్నను బోవవలయుట తగవు - గాదె' యంచును సముద్గతకోపుఁడగుచుఁ
జనుదెంచి భక్తులఁగని మ్రొక్కి నిలువ - జననాథుఁడాగ్రహంబున నిట్టులనియె
“నరుదగు నఖిలలోకాధీశుఁడైన - హరిప్రతిష్ఠకు నమాత్యవ్రాతమెల్లఁ
జనుదేర నీవేల చనుదేర విచటి” - కనుడుఁగోపోద్దీపితాంగుఁడై పొంగి
“పుట్టఁ జుట్టువుమాలి చుట్టుముట్టాడు - నిట్టిట్టివేలుపు లెట్టునరేంద్ర!
కర్తలనియెదవు కర్తలిం దెవరు - కర్తలకర్త మత్కర్తయ కాదె
కర్తవ్య మింతయుఁగర్త శంభుండు - కర్తవ్య మెందును గర్తకు సరియె
కర్తప్రధానుండు గాక తక్కెల్లఁ - గర్తయు హర్తయుఁగలఁడె వేఱొకఁడు
హరియును గిరియును నజుఁడును గిజుఁడు - సురలును గిరలును హరునిసమంబె
యిల 'మమ కర్తా మహేశ్వర' యనుచుఁ - బలికెడు విష్ణుఁడు పరమేశుఁడగునె
యటుగాక స్థితికర్త యందమే విష్ణుఁ - డిట పుత్రు రక్షింప నేలొకో లేఁడు
నలువ దైవంబనుపలుకులు మున్నె - పొలిసెఁగాదే తల [112]వొలిసినయపుడు
కాఁడువో యుత్పత్తికర్తయు నజుఁడు - పోఁడిగాఁ దనతలఁబుట్టించుకొనఁడె

ధర జినబౌద్ధులు దైవంబులేని - నరరూపులై యుండుదురె మహత్తణఁగి
పశుకర్ములగు వేదబాహ్యులువారు - పశుపతు లగుదురె ప్రత్యక్షమిదియు
నననేల 'హస్తినాహన్యమానో౽ప్తి - యన [113]నిరీశ్వరుని విశ్వాలయుఁడనఁగ
నేనుఁగు వెన్కొని యెగిది [114]మట్టాడు - చోనైన వసదులు సొరరెట్టివారు
మాయ [115]దైవం బనుమాట లేమిటికి - మాయ దానట పేరు మఱి దైవమగునె
హరునధికారులు నజుఁడును హరియు - నరయంగ శ్రుతిబాహ్యు లాయున్నము
నెవ్వండు గర్త యీ యేవురియందు - నెవ్విదర్శనము లి ట్లెన్నఁగ నాఱు (గురు
శ్రుతి "ఏక ఏవ రుద్రో”యన్నయట్టు - లితరదైవంబుల నెన్న నేమిటికి
వేదంబు దైవమే వేయును నేల - నాదిసోమకుచేత నపహృతంబగునె
తలరునే పృథివియు దైవమేనియును - నిలయమై యుండునే మలమూత్రములకు
నెఱయ దైవమె నీరు నిట్టపాటులను - వఱలునె యణఁగునె యఱచేతియందు
ననలుఁడు దైవ మే నటు భంగపడునె - మును సర్వభక్షుఁడై చనునె లోకముల
నక్కరువలి దైవ మండ్రేని నొక్క - దిక్కున నుండునే దిక్పాలుఁడనఁగఁ
దలఁపఁనాకాశంబు దైవమండ్రేని - బ్రళయంబుఁబొందునే ప్రమథులచేత
నిలుకాల నిలువఁగ నేరక తిరుగు - నిల దినేశుండు సర్వేశ్వరుం డగునె
యానిశాపతి దైవ మన నెట్లువచ్చు - [116]నానాఁటికిని గళానష్టతఁబొందు
నఖిలంబునకుఁగర్త యాత్మయేనియును - సుఖదుఃఖములఁబొందిసొగయుచునున్నె
కావున మున్ని ట్లొకండొకొక్కటికి - దైవంబు లేనియుఁదారు వుట్టుదురె
కర్మంబ యంతకుఁగర్తయంటేని - గర్మం బచిత్తు దత్కర్తయు జడుఁడు
నెట్టన్న నన్యాయ మేమేనిఁజేయ - నట్టివానిఁబఱప నధికారి గలఁడొ
[117]తనకుఁదాఁబఱపునో తత్కర్మఫలము - [118]తనకుఁదాఁబంధించుకొనునొతత్కర్త
కావునఁబఱప నొక్కఁడు గర్తగలడు - భావనఁదత్కర్మఫలములు గుడుపు
నిలను గర్మాధీశుఁడీశుండు గర్మ - ఫలదాత మా యుమాపతియె దైవంబు
కర్మంబు గర్తయేఁగ్రతువునఁబుణ్య - కర్మి యంచును దక్షుఁగడతేర్పవలదె?
పితృవధసేసిన యతికర్మఫలము - నతని బొందఁగనీక యఖిలంబు నెఱుఁగ
మేటికర్మము గర్తమృడుఁడు గాఁడేని - కాటకోటని కేల కైలాస మిచ్చె
నటు 'కృతం కర్మ శుభాశుభం' బనెడి చిటిపొటివాదము ల్సెల్ల వెయ్యెడను

కోయని శ్రుతియు 'నేకో రుద్ర ఉచ్య౽తే' యనుఁగాన మా దేవుండె కర్త
హరిముఖ్యులీశుఁబంచావరణములఁ - [119]బరి[120]చరులై కొల్చుపశువులు గాక
కర్తలే యొక్కొక్క కార్యకారణవి - వర్తన [121]మాత్రన వా రెట్టు లనినఁ
బనిసేయు [122]బంట్లెల్ల మును దమచేయు - పనికె కర్తలుగాక ఫలకర్త లెట్లు
కాన కర్తలకర్త మానీలగళుఁడు - దీనికి నిం కొండు దృష్టంబు లేల
పరమేశు చుట్టును ధర నూర నూరఁ - బరిచరులై హరిప్రముఖులు గొలువ
నప్రతిమాకారుఁడగులింగమూర్తి - కీ ప్రతిమాకారులే సమానంబు
నిర్మలనిత్యనిష్కర్మదేహునకు - దుర్మల దుష్ట దుష్కర్ములు సరియె
శుద్ధ ప్రసిద్ధానిరుద్ధ దేహున క - సిద్ధ బౌద్ధాశుద్ధ జీవులు సరియె
చావుఁబుట్టువులేని దేవదేవునకు - చావుఁబుట్టువుగల దేవత ల్సరియె
బ్రహ్మమాయాకారపశుపాశపతికి - బ్రహ్మేంద్రహరిముఖ్యపశువులు సరియె
శంకరునకు ధృతకంకాళునకును - శంకితు లగుచున్న కింకరు ల్సరియె(లెనయె
ప్రళయంబుఁబొందించు ప్రళయరుద్రునకుఁ - బ్రళయంబుఁబొందెడు పలువేల్పు
మునిగణార్చిత పాద వనజాతునకును - మునిశాపదగ్దులౌ పినుఁగులుసరియె
పూజితుండగు లింగపుంగవునకును - పూజించికొలిచెడి పూజరు ల్సరియె
సిరిమహాదేవుఁడౌసిరిగిరిపతికి - సిరివాసుదేవాదిసురలు సమంబె
నలిమూఁడుగన్నులుగల త్రినేత్రునకు - నలరెండుగన్నులయతగులు సరియె
హాలాహలాగ్ని సంహారశౌర్యునకు - హాలాహలాగ్నిహతాంగులు సరియె
త్రిపురదైత్యాంత కోద్రిక్త వీర్యునకుఁ - ద్రిపురదైత్యోపద్రవపతితు ల్సరియె
అంధకాద్యసురదర్పాపహారునకు - నంధకాద్యసురభయభ్రాంతు లెనయె
హరికమలజకపాలాస్థి ధారునకు - హరికమలజసురాసుర తతి సరియె
యావిర్భవింపని యభవున కరయ - దేవకీపుత్రాది దేవత ల్సరియె
లింగమూర్తికి జగత్సంగతాత్మునకు - లింగమధ్యములోని లెంగులుసరియె
సర్వజ్ఞుతోడ నసర్వజ్ఞు లెనయె - సర్వేశుతోడ నసర్వేశు లెనయె
షొడ్డలదేవుతో సోమేశుతోడ - సడ్డలదైవము ల్సర్చింప సరియె
హరుఁడు సర్వేశ్వరుం డభవుండు శివుఁడు - పరముఁడు పశుపతి పరమేశ్వరుండు
శ్రీమహాదేవుఁడన్నామంబు లున్న - వే మహినిటువంటి యితర వేల్పులకు(?)

రమణఁ'దద్విష్ణోః పరం పద' మనఁగ - నమర విష్ణునకుఁబరమమైనపదము
శ్రుతి “సదా పశ్యంతి సూరయో” యనఁగ - గతకర్ము లీశుండ కాఁగనియుండఁ
గుమతులై కర్మశాస్త్రములవెంబడిని - బ్రమసియో యిలఁగుక్కపాలు ద్రాగుటనొ
మఱి నాము మేసియో మతిమాలినట్టి - యఱవపాఱులమాట లవనీశ వినకు
మపునర్భవత్వంబు నచ్యుతత్వంబు - నుపమింప విష్ణున కున్నదే యెందు
పూని మా భృగుశాపమున నచ్యుతుండు - తా నుదయింపఁడే దశజన్మములను
సామ మా 'విష్ణుః పితామహా' త్తనఁబి - తామహునకు హరి దాఁబుట్టెఁడాదె
యజునిగుదంబున హరి వుట్టుటకును - నిజనామ మది యథోక్షజుఁడయ్యెఁగాదె
యదిగాక యదితి కింద్రానుజుఁడనఁగ - నుదయించెఁగాదె పయోజనాభుండు
ఆదట ద్వాపరమందు విష్ణుండు - బాదరాయణుఁడనఁబ్రభవించెఁగాదె
యయ్యుగంబునను మున్నచ్యుతుం డుదయ - మయ్యెనుగాదె కృష్ణాఖ్యుండునాఁగ
విష్ణుఁడొక్కొక్కెడ విలయంబుఁబొంద - విష్ణుత్వ మర్థించి విశ్వేశుఁగొలిచి
యొక్కొక్కఁడుదయించె నొగి విష్ణుఁడనఁగ - నెక్కడఁబట్టి యింకెన్ని జన్మములు
నతనిబాములు విను మవనిపాలుండ - శ్రుతిమూలముగఁజూడు ప్రతివాద[123]మనక
తగిలి దూర్వాసుండు దన్నినఁగాదె - నగధరువక్షంబునను మచ్చయయ్యె
హరిని రుక్మిణిఁగూడ నట్లును గాక - కరమర్థితో బండిగట్టి తోలండె
యమృతాబ్దిసేవన నయ్యుపమన్యుఁ - డుమియఁడే కుత్తుకనున్న కేశవుని
హరిని జలంధరుం డనునొక్కయసుర - పొరిమాల్చెఁగాదె నభోమార్గమునను
చలమరి యొక జరాసంధునకోడి - యిల దుర్గమును బన్నఁడే కేశవుండు
నవ్విష్ణు నిభదానవాదిరాక్షసులు - మువ్వురు సలపట్టు టెవ్వరు వినరె?
యేచి విష్ణుండు దధీచిఁజక్రమున - వైచుడు వీ పొగ్గి యాచక్రమపుడ
తునియలుగాఁగొట్టుచును నతం [124]డెగుదఁ - గనుకనిఁదలవీడఁగాఁబాఱెఁగాదె
మును మృగచండాలమను గార్దభంబు - వనజాక్షు ప్రాణంబు సనఁగాచెఁగాదె
హరుఁడు విసముద్రాగి యమృతంబుఁ బనుప - హరి మగఁటిమి [125]విడ్చియాఁటదిగాఁడె
బలిఁగిట్టి భువిఁగొన్నపాపంబుకతన - యిలగోలుపడి హరి జలధి సొరండె
యాలిఁగోల్పడి రాముఁడట బ్రహ్మహత్య - పాలయి ధర చుట్టు భ్రమరించెఁగాదె
పోటరి విష్ణుండు బోయచేఁగాల - నేటువ డీల్గఁడే యిల యెల్ల నెఱుఁగ

వేయేల [126]వ్రేవాడ వెన్న మ్రుచ్చిలుచుఁ - బోయి ఱంకాడఁడే పొలఁతులతోడ
నోలి నందీశ్వరు నూర్పులఁదగిలి - పోలేక వచ్చుచుఁబోవుచుండండె
హరి దాన దైవంబ నని జగం బెఱుఁగ - నురులింగమూర్తిచే నుబ్బణంగండె
మృడుఁ బెక్కుయుగములు మేఘరూపమునఁ - గొడుకు నర్థించి దాఁగొలువఁడే
మత్స్యావతారంబు మడియించి కాదె - మత్స్యకేతనవైరి మఱి తలఁకజుట్టె (శార్‌ఙ్గి
పరగఁదత్కూర్మకపాలంబు గాదె - హరుహారమధ్యంబునం దున్న యదియు
బ్రాంతిగా నాదివరాహదంష్ట్రంబు - ఖ్యాత మీశ్వరుచేతఁగాదె యున్న యదియు
శరభరూపము దాల్చి పొరిమాల్చికాదె - నరసింహుతోలు శంకరుఁడు దాఁగట్టె
పొట్టి త్రివిక్రము నెట్టెమ్ముగాదె - పట్టె ఖట్వాంగము భాతి శంకరుఁడు
నగ్రజుఁడగు విష్ణు నక్కళేబరము - నుగ్రాక్షుమూఁపున నున్నదే కాదె
మా దేవదేవుని పాదపీఠమునఁ - గాదె లక్ష్మీశ్వరుక న్నున్నయదియు
మృడుఁడు విష్వక్సేనుఁబొడిచి యెత్తుడును - గడఁగి శూలంబునఁగాదె యున్నాఁడు
అత్తఱిఁగలికేతుఁడై కేశవుండు - నెత్తురు వఱపఁడే నిటలాక్షుమ్రోల
సంతతంబును శ్రుతిసన “హరిగుంహ - రంతం” బనుచు మ్రోయు రౌద్రభావమున
[127]హరిని హరించుట హరిహరుండయ్యె - హరుఁడు సేతోజాతహరుఁడఘహరుఁడు
శ్రుతులు "యజ్ఞస్య శిరోభిన్న” మనఁగఁ - గ్రతుపురుషుని జంపఁ గడుఁగోపమునను
వెనుకొని తునుమఁడే వీరభద్రుండు - చని కేశవునితల జన్నంబులోన
నవలేపమునఁ బొంది దివిజాధ్వరమునఁ - దివిరి విష్ణుఁడు దలఁదెగఁగొట్టువడఁడె
యతఁ డేల యెవ్వఁ డహంకరించినను - రతిపతిహరునిచే బ్రతుకఁగఁగలఁడె
వసిగొని హరియు దేవతలు నెత్తంగ - వెస నోపిరే యక్షవినిహితతృణము
మించి మున్ బ్రహ్మ గర్వించిన శివుఁడు - త్రుంచివైవఁడె వానిపంచమ శిరము
హరిణమై కూఁతురివరియింప నజుని - హరియింపఁడే మృగవ్యాథ రుద్రుండు
అతనిపుత్రుండు నహంకారియగుడు - క్షితి నుష్ట్రమైయుండఁజేయఁడే హరుఁడు
వాసుదేవుండు దైవంబనియెత్తు - వ్యాసుని చేయి నిహత మయ్యెఁగాదె
యదిగాక గర్వించినట్లి రావణుని - నదుమఁడే శివుఁడు వాదాంగుష్ఠ మంద
మలహరుతో మాఱుమలసి కాముండు - నిలయెల్ల నెఱుఁగ నేఁటేఁటఁ గాలండె
కాలుని శ్వేతునికై చంపెఁగాదె శూలంబునఁను బొడ్చి సురలెల్ల నదర

దక్షుండు గర్వించి తలఁగోలుపడుట - సాక్షిగా దెట్లు మేషంబుశిరంబు
ఆది దా నఖిలలోకాధ్యక్షుఁడన్నఁ - గాదె భగాదిత్యు కన్నులు వెఱికె
దూషించి పలుక రుద్రుం డనుగణము - పూషుని పండ్లూడఁబొడిచెను గాదె
తానచూ యీ జగత్ప్రాణుఁడ నన్నఁ - బూని త్రుంపఁడె పవమానునికాళ్లు
ద్రోహిచే నాఁడాహుతుల్ గొని కుడిచి - బాహుజిహ్వలు గోలుపడియెఁబావకుఁడు
ననిమిషాధిపుచేయి యదితినాసికము - దునుమఁడే వీరభద్రుండు రౌద్రమున
నమృతాంశుమేను వాదాంగుష్ఠమునను - జమరఁడే యతఁడు యజ్ఞమున కేతేర
సయ్యన మును సరస్వతి ముక్కుఁగోసి - [128]వయ్యఁడే నాఁటియధ్వరములోపలను
వెండియుఁగ్రొవ్వినవేల్పుల నెల్ల - దండించుచును జగద్రక్షణార్థముగ
ముల్లోకములఁగూడ ముంచినగంగ - మల్లికాదలభాతి మౌళిఁదాల్పండె
త్రిపురంబు లతిదుర్నిరీక్ష్యమై తిరుగఁ - ద్రిపురారి వోడేర్చుతివుటఁగాల్పండె
నే లెల్ల మోవఁగఁజాలిన శేషు - వ్రేలిముద్రికగాఁగఁదాలిచెఁగాదె
సంగతి విషవహ్ని జంబూఫలంబు - మ్రింగినభావన మ్రింగఁడే హరుఁడు
నంధక కరిదైత్య వ్యాఘ్ర లాలాజ - లంధరాదుల నిర్దళనము సేయండె
యింతింతవనులకు నీశ్వరుం డేల - కంతుసంహరు నొక్కగణము సాలండె
యొకశివగణముచే సకలలోకములు - ప్రకటంబుగాఁజెడుఁబ్రభవించు మించు
నన మహాదేవు మహత్త్వంబునకును - నెన యున్నదే యింక నిన్నియునేల
నిత్యుండ నేన యనిత్యు లందఱును - సత్య మిట్లనుచు సజ్జనసాక్షికముగ
నిత్యస్వరూప వినిశ్చితదృష్ట - ప్రత్యయంబుగఁదాల్పఁబడియున్న యట్టి
హరివిరించుల కపాలాస్థిమాలికలు - కరి గాదె యీశుండు కర్త యౌటకును
నదిగాక యుపమన్యుఁడను మునిచేతఁ - బదపడి శివదీక్షఁబడసి విష్ణుండు
[129]సొంపున నింద్రనీలంపులింగంబు - నింపార సజ్జయం దిడి కొల్చెఁగాదె
వెన్నుండు దా నిత్య వేయుఁదామరల - నున్నతిఁబూన్ప నం దొకటి లేకున్నఁ
గన్నప్డువుచ్చి శ్రీకంఠుఁబూజించి - కన్నును నాఁటి చక్రముఁ బడయండె
మత్స్యావతారుఁడై మఱి లంకలోన - మత్స్యకేశ్వరు నిల్పి మఱి కొల్చెఁగాదె
మున్ను దోరసముద్రమునఁగూర్మనాథుఁ - బన్నుగాఁగూర్ముండు భక్తిఁగొల్వండె

శ్రీరాముఁడును నట్ల సేతువు నిల్పి - శ్రీరామనాథు నర్చించుట వినమె
యాది క్షీరారామ మందు విష్ణుండు - గాదె రామేశ్వరుఁగడు నర్థిఁగొలిచె
ద్వారావతిని నిల్పి తాఁగొల్చెఁగాదె - కోరి గోవిందేశు గోవిందుఁడర్ధి
బ్రహ్మ యలంపూర భక్తితోనిల్పి - బ్రహ్మేశ్వరునిఁగాదె పాయక కొల్చె
నింద్రుండు పుష్పగిరీంద్రంబుమీఁద - నింద్రేశు నిడికాదె యెప్పుడుఁ గొలుచు
వారణాసిని నిల్పి వ్యాసుఁడుగాదె - కోరి వ్యాసేశ్వరుఁ గొల్చుసంతతము
ననయంబు వారణాసిని మునీంద్రులును - దనుజామరాదులు దమతమపేళ్ల
నొక్కొక్క లింగంబు నక్కడ నిలిపి - యక్కజంబుగఁ గొల్చు టది [130]దెల్లగాదె
యభవుఁడక్షయుఁడు మహాదాని దక్క - నభిమతార్థము నిచ్చు [131]నధిపులున్నారె
యవ్విష్ణుఁడాబ్రహ్మ యజ్జినముఖ్యు - [132]లెవ్వరే నెవరికే నిచ్చిరే పదము
హరివిరించిప్రముఖామరదైత్య - నరగరుడోరగవరమునీంద్రులకు
నీశ్వరుఁడొసఁగినయీప్సితార్థముల - శాశ్వతలీల సజ్జనసాక్షికముగ
నిచ్చిన సకలలోకేశ్వరుమహిమ - గచ్చరఁబడసినగణముల వినుము
చేతులు రెండు సంప్రీతిఁబూజింప - భాతిగాఁజేతులు బాణున కిచ్చెఁ
గన్నులు రెండు సమున్నతిఁబూన్పఁ - గన్నుల ప్రోవిడెఁగాళిదాసునకు
నాసక్తి శివనాగుమయ్యకుఁగన్ను - లేసోమవారంబు నెడపక యీఁడె
భానునిచేఁబోని లోని కుష్ఠడఁచి - పూని [133]మయూరుని మే నిచ్చెఁగాదె
హరిచేతఁబోని దుర్భరమైన కుష్ఠు - హరియింపఁడే దండి యర్థిఁగీర్తింప
భువిజనులెల్లను బొగడుచునుండఁ - దవనిధి దేడర[134]దాసయ్య కీఁడె
ధూపవేళను ఘంటతోఁ గొనిపోఁడె - యేపారమెచ్చి యోహిళుఁదనపురికిఁ
గరికాల [135]చోడుకుఁ గనకవర్షంబు - నరులెల్ల నెఱుగంగఁగురియించెఁగాదె
మిగిలినబాసకు మెచ్చి ప్రాయంబు - మగుడఁగ నీఁడె కుమ్మరగుండయకును
అక్కడఁబ్రమథులు నక్కజంబంద - నెక్కిన గద్దియ యీఁడె చేరమకు
నిమ్మవ్వకై యేడ్దినమ్ములు సూఱ - యిమ్ములఁబ్రమథలోకమ్మున విడఁడె
చెనసి బొమ్మయ్య చంపినమృగంబులను - ననయంబుఁగైలాసమునకుఁగొంపోడె
పూని యేడ్దినములపీనుఁగు బ్రదుకు - మానుగాఁగదిరె రెమ్మయ కిచ్చెఁగాదె
మలయరాజయ్య నిర్మల విమానమున - నలిగొన బొందితోనన కొనిపోఁడె

నిర్జితసంసారునిఁగుమారపాల - ఘూర్జరుఁదంత్రంబుఁగొనిపోయెఁగాదె
లలి నూరివారి పిళ్లయనయనారు - వెలయఁగఁదనలోనఁగలపికొనండె
వరగొండ పెరుమాణి నరులెల్ల నెఱుఁగఁ - గర మర్థిఁ గొనిపోఁడె కైలాసమునకు
మ్రోలఁబాడఁగఁదాళములతోడ నంబిఁ - గైలాసమునకు శంకరుఁడు గొంపోఁడె
యెలమి షోడశగణముల నిరతముగ - వెలయఁబీఠంబుల నిలుపఁడే మఱియు
తేరసగణముల వీరసద్భక్తి - గారవించుచు మెచ్చి కరుణించెఁగాదె
పొంచి మృగార్థియై పొరి నిద్రవోని - చెంచున కొసఁగఁడే శివరాత్రిఫలము
చన్న సద్భక్తులచరిత లనంత - మెన్ననే లిపుడు నీ వెఱుఁగంగ శివుఁడు
వసుధఁబేర్కొను మడివాలుమాచయ్య - యదృశుఁడగు కిన్నరయ్య యాదిగను
నచ్చుగా భక్తుల కభిమతఫలము - లిచ్చుచునున్న వాఁడిట్లు గావునను
గంతుసంహరు కెన గలదనుచదువు - లింతయు శివుఁడను నేకాత్మమతము
విను"యథాశివమయో విష్ణు” వన్మాట – లును ద్రిమూర్తులునొక్కటను దురుక్తులును
అష్టమూర్తులు రుద్రుఁడనుకుయుక్తులును - దుష్టమానవుల భక్తుల కెన సేసి
పలుకుటయు వినంగఁబాతకంబొందుఁ - గలదేని పనిసెప్పు పిలిపించి తనుఁడు
భూములు సూచుచు మోములు వాంచి - గామడ్చినట్టు లంగంబులు మఱచి
యుక్కఱి స్రుక్కి యయ్యూరుపు లుడిగి - నక్కిళ్లు వడి గ్రక్కుమిక్కన లేక
యున్నవారలఁజూచి యుత్తరం బడిగి - యన్నరేంద్రాధముఁడట్లు లజ్జింప
క్రొవ్వడంగిరి దార్కికులు గూసి కుక్క - దువ్వుఁ దెచ్చికొనిన యవ్విధంబయ్యె
నీక్షితి బాచయ్య యితరమర్త్యుండె - సాక్షాత్త్రినేత్రుండు సత్యమిట్లనుచు
కొలువు దిగ్గనలేచి బిలిబిలి తార్కి - కులుఁదాను నేఁగె బిజ్జలుఁడు దత్‌క్షణమ
బాచిరాజయ్యయు బసవయ్యముఖ్య - మైచను నిఖిలభక్తావళి యంత
చనుశీలసద్భక్తి సౌభాగ్యమహిమ - దనరార జనులెల్ల ఘనకీర్తి సేయ
రాచిన సద్భక్తిగోచరుం డగుచు - బాచిరాజయ్య యెప్పటియట్ల యుండె
బాచిరాజయ్య విభ్రాజితచరిత - మేచినవీరమాహేశ్వరసభలఁ
జదివిన విన్నను సంస్తుతించినను - సదమలసద్భక్తి సౌఖ్యసారంబు
సహజైకలింగనిష్ఠాపరత్వంబు - మహితశివాచార మహిమయుఁబొందు

నాతతసకలపురాతనచరిత - గీతానుభవసుఖకేలీవిలోల
విహితశాస్త్రపురాణవేదవేదాంత - మహితరహస్యార్థమార్గానుపాల
తను మనో ధన నివేదనభక్తివినయ - జనితానురాగాత్మసద్భక్తిజాల
విదితప్రసాదసవినయసౌఖ్యప్ర - ముదితాంతరంగసమున్నతలీల
హృన్మందిరాంతర్నిహితగురుధ్యాన - మన్మిత్ర సంగనామాత్య సుశీల
ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య - పదపద్మసౌరభ భ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోప భోగ - సంగతసుఖసుధా శరధి నిమగ్న
సుకృతాత్మ పాలుకురికిసోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగ ఘనకరస్థల విశ్వనాథ - వరకృపాంచిత కవిత్వస్ఫూర్తిఁబేర్చి
చను బసవపురాణ మనుకథయందు - ననుపమంబుగను షష్ఠాశ్వాసమయ్యె.

  1. మర్మజ్ఞుండు
  2. సవినయ
  3. యట్లట్లయెలమి
  4. ఇట్లుండితేని
  5. టొ, నొ
  6. మగుడి
  7. యెంతయిదిముదలింప
  8. ప్రతిఁజూపకుండుట (కునికిదా)
  9. వినర
  10. బురి
  11. తవిలించినిలుచుట
  12. దఱిగి
  13. బూన్పంగ నొయ్యనఁ బొందగు శిరము
  14. ఈ రెండుపాదములు నొకప్రతిలోఁగలవు
  15. మఱుపడు
  16. మలసెడు
  17. దలర
  18. బసిగమై
  19. తోబుట్టుగే
  20. నంత
  21. నతని
  22. గసిబిసి
  23. సంస్కారుగాఁ జేసి
  24. శరీరబంధంబు
  25. సద్యః
  26. శుద్ధాత్మఁజిన్మయ
  27. కరినిగొల్పుడు
  28. బ్రహ్మాగ్ని...
  29. జిహ్వా
  30. తటమార్చి
  31. దలర
  32. డు నొకనాఁడు దనచంకఁబెట్టి
  33. నదేపోయెడు
  34. యేతెంచి (తర్వాతఁగూడ క్త్వార్థకములేయున్నవి)
  35. యేతెంచి (తర్వాతఁగూడ క్త్వార్థకములేయున్నవి)
  36. పాళనాయనా
  37. వెలువ
  38. పను
  39. యెను
  40. వలయు
  41. రాల
  42. దిర్నీరు
  43. ల్మాన్పవేఁ
  44. ముడుపవే
  45. మెడలింపు
  46. బూన్చు
  47. బూన్ప
  48. దీయింపు
  49. దీపిం
  50. విశేషించి
  51. బుఁ బూయని పాపాత్ములార
  52. యెట్టకో
  53. నెయ్
  54. టిది
  55. భూనుతులొ, వార్గలరొ, వారలరొ
  56. కాడెబిట్టకబిఱ్ఱుగా
  57. తత్త్వ
  58. దాలేదు
  59. మూ
  60. మూ
  61. వెల్లగాఁజేసిన వేల్పవునీవు , తెల్లంబుగాఁగ
  62. బాహ్యపుసమయములు
  63. దే
  64. లిందేటివి
  65. గురులనం
  66. యంత్రతంత్రార్థమాయావాదములఁగు
  67. నసద్వృత్తిఁదర్కింప
  68. కక్షప
  69. ఁడగుణ
  70. కలిమి
  71. గల్దు
  72. గఱిగొన
  73. సుమ... జూడలేదింక
  74. దేవర
  75. నూనెయం
  76. తావు
  77. సర్వజ్ఞభావకుఁ
  78. పలికినయట్లున్నఁబైఁబడువాఁడు
  79. భక్తికతీతమై పరగిన
  80. మృడుఁడు సర్వంబని
  81. మ్రోయుచు
  82. సర్వసమక్షముండు
  83. ద్రవ్వించి
  84. బ్రాహ్మఁడు
  85. కవళంబు, కమలంబు
  86. దీపింప
  87. రొప్పు, రించు
  88. నబ్బుర మిదియనుచు
  89. నిష్ఠయు
  90. భక్తి
  91. పందనేనేను
  92. యెప్పటి
  93. ప్రత్యయ
  94. ముడుపు
  95. కెట్లు
  96. యరుదెంతునంచు, ని.
  97. బోరన
  98. గొల్వించి
  99. లిండ్లకునతని
  100. ణార్థంబయేర్పఱచట
  101. అదియెల్ల
  102. తప్పేమిసేసె నీ విప్రుఁడుసెపుమ
  103. సేసి నాఁడతఁడు
  104. వేఁడ
  105. నిదియేలదృష్టాంత (మిటుచూపగలవొ) మేఁజూపఁగలదె.
  106. కృష్ణ
  107. శివ
  108. కొట్టారమున
  109. వెరుసది
  110. పోయిన
  111. ఁగనీశ్వరుని
  112. ముట్టాడు
  113. యెదైవమన్మాట
  114. నానాటికి పుడును నష్టంబుఁ బొందు
  115. తనుఁదాన
  116. తనుఁదాన
  117. బరికరు
  118. వారమైకొల్చిబ్రదుకుదుర్గాదె
  119. ధారులైవర్తింతురెట్లు
  120. బంట్లుదాఁబదపడి
  121. మేల
  122. డెగువ, నెదురేఁగ
  123. చెడి
  124. వ్రేపల్లె
  125. హరిని హరింపఁడె హరిహరుం డనెడి
  126. వెయ్యఁడే యధ్వరవేళఁదెల్లముగ
  127. పెంపున
  128. నిక్క
  129. నధికు
  130. లెవ్వరెవ్వరికిచ్చి రేమేమిపదవి
  131. మయూరుకు
  132. దాసి కియ్యండె
  133. చోడన్కి