బసవపురాణము/పంచమాశ్వాసము

పంచమాశ్వాసము

కిన్నర బ్రహ్మయ్య కథ

శ్రీకర! భక్తిరత్నాకర! దోష - భీకర! విమలగుణాకర! సంగ!
ఇమ్మహి వెండియు నీశ్వరభక్తుఁ - డిమ్ములఁగిన్నర [1]బమ్మయనాఁగ
వీరవ్రతైకనిష్ఠారమణుండు - సార[2]శివాచార పారాయణుండు
లోకైకపూజ్యుఁడ లోకానుసారి - యేకాంతభక్తి మహిష్ఠ మండనుఁడు
నఘటితనాద విద్యాపండితుండు - నఘవినాశన కారణావతారుండు
విదితకారుణ్య సముదితానురాగ - హృదయుండు సర్వజీవదయాపరుండు
సల్లలితుం డన శరణమార్గమున - కెల్లయై భక్తిమహిష్ఠతఁబరగి
భక్తులకును వర్వుఁబనులు సేయుచును - వ్యక్తిగాఁ [3]బొండూర యుక్తిపెంపునను
గాయకంబులు వెక్కు గఱచుటఁజేసి - వేయువిధంబుల విత్త మార్జించి
నిర్వంచకస్థితి శర్వుభక్తులకు - సర్వధనంబులు సమయంగ నంతఁ
గ్రీడార్థమై మఱి కిన్నరవీణ - వేడుక నొకనాఁడు వినిపింపఁదడవ
కిన్నరేశ్వరవంద్యుఁడన్నారదాది - సన్నుతనాదానుషక్తుండు మెచ్చి
పరగంగఁగిన్నరబ్రహ్మయ్య నాఁగ - ధరణిఁబేరిచ్చి నిత్యముఁబడిగాఁగ
నొక్క మాడయురూకయును బాతికయును - మక్కువఁ గరుణింప మహినరుల్వొగడఁ
జేకొని జంగమానీకంబునకు స - దాకాలమును నర్పితము సేయుచుండ

కిన్నర బ్రహ్మయ బసవనియొద్దకుఁబోవుట


బసవని యసమ[4]సద్భక్తి సౌరభము - వసుధపై వెల్లివిరిసి దెసల్గప్ప
రాగిల్లి కిన్నరబ్రహ్మయ్య సనియె - వేగంబె బసవని వీక్షించువేడ్క
బసవఁడు గిన్నరబ్రహ్మయ్యరాక - యెసకంబుతో సంగమేశ్వరునంద
కని యెదురేఁగి చక్కన చాఁగి మ్రొక్కి - యనునయోచిత సత్క్రియాదులఁదనిపె
గరమొగ్గి పాదోదకప్రసాదములు - నిరతిశయప్రీతి నిత్యంబుఁగొనుచు
సవిశేషతత్త్వానుభవభవ్యగోష్ఠిఁ - దవులుచు బసవఁడుత్సవలీల నుండ

నంత వినోదార్థమై యొక్కనాఁడు - సంతోషచిత్తుఁడై చని కిన్నరయ్య
యాపురంబునఁద్రిపురాంతకదేవు - గోపురాంతరమునఁగూర్చున్న యెడను

గొఱియ కథ


వారాంగనార్ధమై వధియింప విలిచి - కోరి మిండం దొకగొఱియఁజేపట్టి
యవ్వీథిఁ జనఁ[5]ద్రి(ది?)వ్వంగఁ ద్రాడు - ద్రెవ్వుడు గొఱియ దద్దేవాలయంబు
పఱతెంచి సొచ్చుడుఁ [6]బైపడి వాఁడుఁ - బఱతేరఁ గిన్నరబ్రహ్మయ్య గాంచి
“పోవక నిలునిలు బొప్ప! యీ గొఱియ - దేవాలయముఁజొచ్చెఁ జావున కోడి
యింకఁజంపుట దోస మిట్లుగాదేని - కొంకక వెల సెప్పి కొను[7]ము రెట్టైన
మృడుభక్తు లొప్పింతురే శరణన్న - జడనరులైనను జంపంగనీరు
చరజీవులకు నెల్లఁజావును నొప్పి - సరియకాదే యెందుఁజర్చించిచూడ
నీకు దీనినిఁ జంప నేమమే! చెపుమ - యాకాంత దీని[8]నే యచ్చొత్తినదియె?
పడయరానిది భువిఁబసిఁడియకాదె? - కడుఁగాక మాడైన నడిగిన నిత్తు
నదె కొమ్ము" నావుడు "నక్కటా! యిట్టి - చదురుండుఁగలఁడయ్య జగతిలోపలను
గుడిసొచ్చు [9]మడిసొచ్చు గుండంబుసొచ్చు - విడుతురే గొఱియల విలిచినవారు?
త్రోవ నదెట్టులు దొలఁగకవచ్చు? - నీవకా కిబ్బువి నీతిమంతుఁడవు -
ఎఱుఁగమే మెన్నఁడు నిటువంటి వెందుఁ - గొఱగాదు దడసినఁగోపించు లంజె
'పెట్టెద వెల' యని బిగిసెడుఁ బెద్ద - ఇట్టి దయాపరుఁడెచ్చోటఁగలఁడు?
చరజీవులకునెల్లఁ జావును నొప్పి - సరియె తా ననియెడుఁజర్చింపనట్ల
మనుజుల ప్రాణంబు మఱి వేయుమాడ - లననేల యిన్నియు నతఁడు బొంకెడినె?
వేయిచ్చియైనను విడిపించు [10]గొఱియ - యీయయ్య [11]సంపఁగనీఁడు వొ” మ్మనుచుఁ
బోవవచ్చిన “బొప్ప! పోవకు” మనుచు - వేవేగఁదెప్పించి వేయుమాడలను
నిచ్చి"బొంకినఁ బోవనీఁజుమ్ము [12]రోరి! - యచ్చొత్తి విడుతు నే నటమీఁదెఱుంగ”
ననవుడు 'నౌఁగాక' యని మాడలెన్ని - కొని లంజెయింటికిఁజనిచని మగిడి
“గొఱియలేకున్నఁ బెద్దఱికమే?” యనుచు - మఱియొక్క గొఱియఁ గ్రమ్మఱవిల్చికొనుచు
బోయినఁజొరనీక పొలఁతి గోపించి - "చా! యెట్టిమిండఁడ చనుసను మింక
సరివిటుల్ నవ్వంగఁజక్క నా యిల్లు - చొర సిగ్గుగా దెట్లు శూన్యంపుగొల్ల!

చదివెదు వెక్కులు శ్లాఘ్యమే? పసిఁడి - వెదవెట్టఁ [13]బంతు నే వీథులనెల్ల
ఇస్పిరో! లంజెర్కమే యిట్లు నీకు - దుస్సి కట్టుదుగాక దొంతరలెల్ల
బ్రతుకంగనోపునే పడఁతి యీసారె - నెదిరి నే మనఁజాలు నే లింకఁబడుపు
బొజుఁగులు గొఱియలఁబోకార్పఁగలరు - ప్రజలకుఁదనకును బట్టుగ్రాసంబు
మజ! బాపురే! లంజె మనెడుఁబొమ్మనఁగ - గుజగుజలకు నెల్ల [14]గుఱియైతినింక
నగుబాటు వట్రిల్లె నాతులలోన - మొగమెత్తనేర్తునే? మున్నెఱుఁగవొకొ!
అభిమానకత్తె దానగుట నీ” వనుచు - నభిమాన మెడలంగ నతివ వల్కుడును
“బాయఁ జూ పెనుఁబెనుఁబండువు [15]లందు - వేయేల గొఱియల వేయుమాడలకు
విలిపించి మఱి కదుపులభంగిఁదెత్తు - వలసినంతర్థంబు వ్ర(వ్య?)యమున కిత్తుఁ
జిన్నవోనిత్తునే చెలువలలోనఁ - జెన్నుగాఁ బండువుసేయు మీ" వనిన
“వేల్పుల కని మున్ను విలిచినగొఱియఁ - బాల్పడి తేకున్నఁబండువుసేయ
వెఱతుము సంపునో వేల్పు ద"మ్మనిన - నఱిముఱి 'నట్ల కాకనుచుఁదత్ క్షణమ
కామాంధునకు నొక్క గార్యంబుఁగాన - రామి దెల్లముగాన రయమున వచ్చి
గొఱియఁబట్టుడుఁదద్దఁ గోపించి చూచి - పరువడిఁగిన్నర బ్రహ్మయ్య [16]యెదిరి
“పట్టకుపట్టకు బసవరా [17]జాన - పట్టినఁదలఁ దెగఁగొట్టుదు నింక
నంజుదురే శరణాగతవజ్ర - పంజరం బిదియె మా భక్తులబిరుద”
మనుచుఁడగ్గఱుడు వాఁడలుగు [18]వెర్కినను - గినిసి రౌద్రోద్రేకమునఁ బొంగివ్రేసి
నిశితఖడ్గాయుధనిహతుఁగావింపఁ - బశుపతిగుడి వెలిఁబడియె శిరంబు
'బాస హీనునిబొంది వాడియే శివు ని - వాసంబునం దుండ దోస' మన్నట్టు
లట్టయు నీడ్పించి [19]యగడ్తవైపించెఁ - గట్టలు గట్టి మూఁకలు సూచుచుండ
[20](నంత నా వృత్తాంత మక్కర్మిబంధు - లెంతయు విని తమ యిచ్చలో వగచి
తగువారుఁదామును ధరణీశుఁజేరి - వగచుచు నేడ్చుచు జగతీశుకనిరి)
“త ప్పేమియును లేదు దమవాఁడు గొఱియ - చొప్పునఁజనిగుడిసొచ్చి పట్టుడును
భక్తుఁడు గిన్నర బ్రహ్మయ్య నాఁగ - శక్తిమంతుఁడుగాన చంపె” నావుడును
నుర్వీశ్వరుండు గోపోద్రేకవహ్ని - వర్వ నిట్లనిపల్కె బసవయ్యఁజూచి
“హరుభక్తు లధికదయాపరు లండ్రు - నిరపరాధులఁజంప నీతియే మీకు

మనుజులఁబ్రోలిలో మననీరు గాక - పనియేమి గొఱియలకును మీకుఁజెపుఁడ
మామీఁద నొకరాజు మఱి చెప్పఁగలఁడె? - భూమిలో' నన్నట్లు వొడిచివైచెదరు
రాజులకు నిరపరాధులఁజంపు - టోజయే? భక్తుల కుచితంబు గలదె?
కాలఁదన్నుట మాంసఖండంబు లిడుట - బాలునిఁజంపుట ఱాలవైచుటయుఁ
గులములు సెడిపోయి కుడుచుట దండ్రి - తలఁదెగఁగొట్టుట దన్వి నిచ్చుటయుఁ
దమ్ము[21] దొరలఁజాల ధర్మంబు లండ్రు - ఎమ్మెయిఁదగదండు రెదిరి[22] దొరలిన
మీర యేలుదురు గా కీరాష్ట్రమెల్ల - ధారుణి యేలంగఁదమ కింకఁబాసె
నప్పటి కప్పటి కదియేల [23]వెఱవ - నొప్పుకో రాజ్యంబు దప్పేమి”యనుడుఁ
“గర్జంబు మీఁదెఱుంగక పల్కుటెల్ల - బిజ్జలక్షోణీశ పెద్దఱికంబె?
ధర్మము ల్కర్ములు దప్పుదు రెందు - ధర్మముల్ భక్తులు దప్పరు వినుము
కిన్నరబ్రహ్మయ్య సన్నుతకీర్తి - పిన్నవాఁడే యూరకున్నను జంప?
నట్టేల? యెద్దీనె ననుటయు గొందిఁ - గట్టుద మనువారు గల రెట్లు సెపుమ
ఏర్పడఁగార్యాంశమెఱుఁగుము మాట - లార్పుము తగువారి నరయఁగఁబంపు
మఱి యెందుఁబోయెడు మర్యాదలెల్ల - నెఱుఁగుదు గాకేమి యింతయు” ననినఁ
దన ప్రధానులఁ [24]జూచి ధారుణీశ్వరుఁడు - పనిచినఁ ద్రిపురాంతకునిగుడి కేఁగి
కిన్నరబ్రహ్మయ్యఁగన్నంత మ్రొక్కి - "అన్నన్న! తగునె? నీ యట్టి భక్తుండు
హింసకు లోనౌట కేమికారణము? - సంసారి నేటికి సరిచేసికొంటి
విగమెడ దునియెద విదియేమి వుట్టె - జగములలో రిత్తసడి వచ్చె నీకుఁ
గొఱగాని జఱభుల కొయ్యనగాండ్ర - గొఱియల వార్తలు గూడునే త్రవ్వ
భూమీశ్వరుఁడు మమ్ముఁబుత్తెంచె నరయ - నేమని చెప్పుదు మింక” నావుడును
“నివి యేల వెడమాట లిన్నియు వాఁడు - తివియఁదివియఁద్రాడు ద్రెవ్వుడు గొఱియ
గుడిసొచ్చుడును 'బట్టఁగూడదు దీని - విడువుము కాదేని వెలసెప్పి కొనుము
ఇమ్మడి ముమ్మడి యిచ్చెద' ననిన - నెమ్మెయి నొల్లక 'యిట్టి భక్తుండు
వేయిచ్చియైనను విడిపించుఁగాని - యీ యయ్య[25] గొనిపోవనిచ్చునే' యనిన
'విండ్రె యీ మాటలువేయుమాడలకుఁ - గొండ్రె యెచ్చోటను గొఱియ' నన్నట్టు
వెక్కసం బందంగ వేయుమాడలను - జక్కఁగ నెన్నితిఁజౌకంబు ద్రోచి
'యెప్పాట[26] మగిడిన నీఁజుమ్ము' రనుచుఁ - జెప్పి యచ్చొత్తితి శివలాంఛనంబు

కాంత దన్నెంతయుఁగడవఁబల్కినను - నెంతయుఁ గొన్నాఁడ నే ధనం బనక
కొండొకవ్రొద్దుండి వెండి యేతెంచి - మిండండు బసవనిమెడఁద్రాడు వెట్ట
వలదని వారింప నలుఁగు వెఱికినఁ - దలఁ ద్రుంచివైచితిఁ దప్పెవ్వరిదియొ?
అట్లౌట కీ త్రిపురారియె సాక్షి - పట్టినఁబలికింతు నిట్టని చెపుఁడ”
అనవుడు నతివిస్మయాక్రాంతు లగుచు - జననాథునకు నిట్లు వినుపింపఁదడవ
“యద్దిరా! భక్తుని యఱ [27]గొడ్డెతనము - విద్దె లాడెడుఁగాక విందుమే తొల్లి
విపరీత మిందఱు వినఁ'బలికింతుఁ - ద్రిపురారి' ననుటెల్లఁగపటమో నిజమో?
చూతముకాక!” యంచును బిజ్జలుండు - నేతెంచె నధికవిభూతి భాతిగను
బసవఁడుఁగిన్నరబ్రహ్మయ్య పాద - బిసరుహాక్రాంతుఁడై ప్రీతియెలర్ప
'శృంగారములకీల శివుకరవాలు - మంగళత్వమునికి మానంబుమనికి
విజయంబుత్రుళ్లు వివేకంబుపెల్లు - నిజగుణస్తుతి యూఁత నిష్ఠలచేఁత
సత్యంబుభాతి యాస్థానంబుజ్యోతి - ప్రత్యయంబులరాజు భావుక మోజు
యాగంబు తునియ విరాగంబుగనియ - యాగమంబులతెల్ల [28]హర్షంపుటెల్ల
శాంతంబుప్రోగు సజ్జనభక్తిబాగు - దాంతత పెంపు వ్రతాపంబుసొంపు'
నని యసమాన సమంచితార్థముల - వినయపూర్వకముగా వినుతి సేయుచును
నుండంగ, నఖిలనియోగంబు గొలువఁ - దండతండముల భక్తవ్రాత మలర
గుడివడు గటమున్న కుంచియకోల - పొడసూప కేఁగినయెడఁగిన్నరయ్య
దరహసితాస్యుఁడై తలుపులదిక్కు - నరగంట నొక్కింత యఱలేక చూడ
నఱిముఱి నటమున్న యప్పురాంతకుఁడు - వెఱచితల్పులువాఱఁదెఱచెఁ జోద్యముగ
“దాసికిఁ దెఱచె మున్ దలుపు లనంగ - నాసకలము విందు మది గానఁబడియెఁ
దనరుచుఁ ద్రిపురాంతకుని కవాటములు - గనుఁగొననంతలో నన పాసి పడియె
బాపురే! కిన్నరబ్రహ్మయ్య యింక - నోపుఁబోఁబలికింప నీ పురాంతకుని”
ననుచుఁజూపఱు గనుఁగొని ప్రస్తుతింపఁ - జనుదెంచి బ్రహ్మయ్య సంతోష మలర

కిన్నరబ్రహ్మయ్య పిలువ శివుఁడోయని పల్కుట


“మనసిజక్రీడాంతమునఁజేయివ్రేసి - వనితపాలిండ్లు నీవని నిశ్చయించి
యడరఁగ నాతఁ'డయ్యా!” యని పిలువ - నొడయనంబన్నకు నోయన్న శివుఁడ!
వెలయఁగ[29] దాసమయ్యలవాదులోన - నిలఁబిపీలిక[30]యందుఁబలికిన శివుఁడ!

మున్ను బాపూరిబ్రహ్మన్నకుఁబలికి - జొన్నలు నీవయై యున్న శంకరుఁడ!
పలుకవే నాబారిఁబాఱి” తన్నట్టు - లలుఁగుమోహణమున హస్తంబు దొడిగి
కిన్నరబ్రహ్మయ్య సెన్ను [31]దుల్కాడఁ - బన్నగధరుమహాభక్తులఁదలఁచి
యాయతి నభిముఖుండై "త్రిపురాంత - కా”యని పిలుచుడు "నో[32]" యనుచుండె
బిట్టుల్కి మూర్ఛిల్లి [33]బిమ్మిటిఁ బొంది - నెట్టోడి లింగ సన్నిహితులు దక్క
ఖగమృగోరగ నరకరితురగాదు - లగు సమస్తచరాచరాది జంతువులు
నుక్కఱి మ్రగ్గి యట్లున్నవియున్న - చక్కటిఁ బ్రాణము లక్కున విడిచె
నాకటకం బిట యట కానఁబడియె - లోకంబులెల్లఁగల్లోలంబు నొందె
నీక్షితి గంపించె నినుఁడస్తమించె - నక్షత్రములు డుల్లె నగములు ద్రెళ్లె
నంబుధు లింకెఁ గూర్మంబుఁ దలంకె - నంబరంబిల మ్రొగ్గె నహిపతి స్రగ్గె
ననిలుండు దొలఁగె స్వాహాపతి మలఁగె - వనజనాభుఁ డులికె వనజజుఁ డలికె
సమసుప్తిఁ బొందించి జగములఁ ద్రుంచి - ప్రమథులు లోకముల్ దమమయంబుగను
నాడుచుఁ బాడుచు నసమానలీలఁ - [34]గ్రీడింప మఱియు సత్రియ [35]దులుకాడ
నవికలానేకభక్తావళి వేర్చి - సవిశేషగతి మహోత్సవములు సలుప
బాయక రేయును బగలును గూడ - మ్రోయంగ నేడ్దినంబులు సన్న పిదప
భువనోపకారార్థబుద్ధిమై బసవఁ - డవిరళగతిఁగిన్నరన్నకు మ్రొక్కి
"సజ్జనశృంగార! సత్యగంభీర! - యిజ్జగదాధార! యీశ్వరాకార!
మంగళగుణధామ! మహిమాభిరామ! - లింగాభిరూప! యభంగప్రతాప!
నిర్జితాహంకార! నిఖిలోపకార! - దుర్జనదూర! విధూతసంసార!
కారుణ్యపాత్ర! యకల్మషగాత్ర! - వీరవ్రతాచార్య! విపరీతశౌర్య!
యంచితాగణ్య నిరంతరపుణ్య! - సంచితసుఖలీల! శరణవిలోల!
సన్నుతకీర్తి! సాక్షాద్రుద్రమూర్తి! - కిన్నరబ్రహ్మయ్య! కృపసేయు” మనిన
బసవయ్యచే[36] వ్రేసిప్రహసితుండగచు - నసమాక్షుఁజూచి హే'[37]యనుచువారింపఁ
దొల్లిటియట్ల యద్భుతలీల నడరె - నెల్లలోకములు మహిష్ఠతఁబరగెఁ
గటకంబుసూడ నెప్పటియట్ల ప్రబలె - నిట చరాచరజీవు లెల్లను బ్రదికె
బిజ్జలుఁడంతలో బిమ్మటి దెలిసి - యజ్జనౌఘముఁదాను సాష్టాంగ మెరఁగి
“యభయమే జియ్య! యత్యద్భుతకీర్తి! - యభయమే దేవ! మహామహిమాఢ్య!

కిన్నర బ్రహ్మయ్య! గీర్వాణవంద్య! - కన్నుల గానని కష్ట లోకులము
అజ్ఞానజీవుల మపగతమతుల - మజ్ఞుల మధికసర్వాపరాధులము
కడసన్న నీదు విఖ్యాపితమహిమ - కడ యెఱింగెద మనఁగా మాతరంబె?
నీ యాజ్ఞఁదలమోచి నిటలలోచనుఁడు - 'నో'యనెఁబిలిచిన 'హే'యన్న నుడిగె
నింతటిలోన నీరేడులోకములు - సంతాపవర్తన సమసుస్తిఁబొందె
[38]నిప్పుడు గరుణింప నిట్లుల్లసిల్లెఁ - జెప్పఁ జిత్రము గాదె యెప్పాటనైనఁ
బరగంగ నిహలోకపరలోకములకు - హరుఁడవు నీవ శంకరుఁడవు నీవ
భవుఁడవు నీవ సద్భక్తుండ వీవ - భువిలోన మఱి సెప్పఁబోల్పంగఁగలరె?
నిద్దంబుగా నీట నద్దుము పాల - నద్దుము మాకింక నన్యధా లేదు
ఒక్క మాకేల, బ్రహ్మోక్తజీవులకు - నిక్కంబు దెస దిక్కు నీవ కావెట్లు
కావున, మముఁగటాక్షప్రేక్షణమున - భావింపవే కృపాభావం బెలర్ప”
ననుచు మఱియు మ్రొక్కియభినుతిసేయఁ - గనుఁగొని దరహాసకలితాస్యుఁడగుచుఁ
“గఱకంఠుభక్తుల కఱగొఱ లేక - వెఱచి బ్రదుకు వొమ్ము వేయునునేల?”
నని మును విశిరస్కుఁడైన మానవుని - జనులెల్లరు నెఱుంగ సప్రాణుఁజేసి
చనియెఁగిన్నరబ్రహ్మ శరణుండు భక్త - జనులును బసవఁడు ననురాగమంద
'నిశ్చయం బీతఁడే నిటలాక్షుఁ'డనుచు - నాశ్చర్యహృదయుఁడై యరిగె బిజ్జలుఁడు
అంత నట్టులు గిన్నరయ్య సద్భక్తి - కాంతుఁడై త్రిభువన [39]ఖ్యాతిమై నుండెఁ
బసరింపఁగిన్నరబ్రహ్మయ్యచరిత - మసలారఁజదివిన నర్థమై విన్న
భక్తియు సకలవిరక్తియు సహజ - భుక్తియు నభిమతభోగము ల్గలుగు

కలకేత బ్రహ్మయ్య కథ


మఱి, కలకేత బ్రహ్మయనాఁగ నొక్క - నెఱవాది భక్తుండు నిర్మలకీర్తి
జంగమవిశ్వాసి లింగాభిమాని - ([40]సంగతచరితుఁడభంగప్రతాపి
నిర్మూలితోభయ కర్మసంచయుఁడు - భర్మలోష్ఠైక సద్భావగోచరుఁడు
మహిత జీవన్ముక్తి మానసవర్తి - సహజలింగైక్యనిష్ఠాసమన్వితుఁడు
లోకైకనుతుఁడు దృణీకృతలోకుఁ - డేకాంగవీరుఁడపాకృత కర్మి
శుద్ధలింగాత్మ ప్రసిద్ధానుభవుఁడు - సిద్ధమహాద్భుత శీలుండు నాఁగఁ)

దగిలి గిల్కయు దక్షుతలకొమ్మువోలెఁ - దగరుకొమ్మునుబట్టి తనవేష మమరఁ
గోరి త్రివిక్రము కోలెమ్మువోలె - సారంగ నొక గుదియయుఁజేతఁబట్టి
కలకేత వేష మింపలరంగఁదాల్చి - నలువొప్ప భక్తుల నగళులకేగి
“పరసమయంబులఁబొరిమాల్పఁదాఁకు - ధరరుద్రు నిటలాగ్ని తగ[41]రేఁగు దెంచె
జినదర్శనంబులఁజిఱ్ఱు ముఱ్ఱాడు - మన వీరభద్రుని మదకరివచ్చె
నిమ్మహిభక్తుల యిలువిందు నచ్చె - నమ్మహాప్రమథచయము [42]ముద్దు వచ్చె
దుగళవ్వగారి సుతుం డేఁగుదెంచె - మొగి సంగళవ్వ తమ్ముఁడు వీఁడె వచ్చె
నమ్మలా! రక్కలా” రని నగించుచును - నిమ్ముల నిత్యంబు నిరుసయుఁగొల్చు
కొనివచ్చి జంగమకోటి కత్యర్థి - ననయంబుఁబరిచర్య లాచరింపుచును
సన్నుతభక్తి సమున్నతలీల - నున్నెడ నియతిమై నొక్కభక్తుండు
భాతిగాఁగిన్నర బ్రహ్మయ్యఁ జూడ - నేతెంచి యేతెంచి యేఁగఁజాలమిని
గలకేత బ్రహ్మయ్యగారి సన్నిధిని - నలసి పథిశ్రాంతుఁడై పడియున్న
“డస్సి శరీరంబు గ్రుస్సి పాదములు - వ్రస్సి యెంతయును శ్రవంపడి యిట్లు
చనుదేర నీకింతవని [43]గలదయ్య!” - అనవుడు నాయయ్య యంత వీక్షించి
“నంబి కీశుఁడు దొల్లి నలిఁబడివెట్టు - నింబుగా జనులెల్ల నెఱుఁగఁగ నిపుడు
పడివెట్టుఁ గిన్నర బ్రహ్మయ్యగారి - కెడపక యని నరు ల్బుడిబుళ్లు వోవ
విని చూడవచ్చితి వినవె దారిద్ర్య - ఘనదుఃఖ మార్చునో యనుబుద్ధిఁజేసి
వంతయు గింతయు వట్రిల్లె నిచటి - కెంతద వ్వట చెప్పవే యయ్య మఠము
చనియెద నా యయ్యఁగనుఁగొన్నఁ గాని - తన [44]దప్పివో” దని తథ్యంబు వలుక
“నిప్పాట నది యొక్కయెప్పుగా నతనిఁ - జెప్పకు సెప్పకు నేకూలి గాని
పని వెలఁగొని చేయుబంట్లకు రాశి - గొనవచ్చునే తన కూలియే తక్క
ఫలములు గుఱుతిడు భక్తుల కెట్టు - లలవడు లింగనిరంతరసుఖము
పదవులు గిదవులు వళ్లును గిళ్లు - మదనారి సద్భక్తమండలి కరుదె?
యంతద వ్వింక నెట్లరిగెదు డస్సి - యెంత యర్థంబైన నెత్తికొ”మ్మనుచు
నడరఁ [45]జేగుదియయు [46]రాలప్రోకఁ - దడయ కొండొంటితోఁ దాఁకింపఁ దడవ
తంగెడుపూవులు ధరణిఁ బ్రోవిడ్డ - భంగి నర్ధంబున్నఁ బైచీర గప్పి
కనుఁగవ హర్షాశ్రుకణములు వెల్లి - గొన నర్థి మోపెత్తికొనుచు భక్తుండు
వలివేగమున వచ్చి వచ్చి యెంతేని - బలువిడిఁజక్కన బసవనమంత్రి

నగరోపకంఠంబునను మోపువైచి - దిగదిగఁబోయి తాఁదెచ్చినక్రమము
వచ్చిన దాదిగా వార్తయుఁబూస - గ్రుచ్చినయట్లుగా గురువుగాఁజెప్పి
బసవన్న! కలకేతబ్రహ్మయ్య మాకు - నొసఁగినర్థము మోవ నొకఁడ నేనోపఁ
బనుపవే వేఱొక్కవరిచారు మాకు” - ననవుడు బసవఁ డత్యాశ్చర్యమంది
“యిట్టివా రగుదురే యీశ్వరభక్తు - లెట్టున్న వారల నేమనవచ్చుఁ?
గాయకం బలరంగఁగలకేతవిద్య - యాయయ్యమహిమ దా నతివిస్మయంబు
కల్పవృక్షం బీగి ఘన మందమేని - యల్పభోగమకాక యపవర్గ మెద్ది?
చింతామణులయీగి [47]చెప్పుదండేని - చింతింప శాశ్వతసిద్ధి యందెద్ది?
మేరువుఁజెప్పుదమే పైఁడిదక్కఁ - గోరి యందొకటైనఁగొనఁదినఁ [48]గలదె?
కామధేనువు నిత్యమే మున్ను దాను - కామించువారికిఁగార్యముల్ సలుపఁ
గల కేతబ్రహ్మయ్యగారి మహత్త్వ - మిల గారవింపంగ నిన్నిటికంటె
నతులితలీల సర్వార్థసిద్ధులకు - నతిశయస్థితిహేతు వగుచున్న యదియుఁ
గిన్నరబ్రహ్మయ్యఁ గీడ్పడఁ బలుకఁ - జన్నె యొండొరుల కాశరణుండు దక్కఁ
గానోపు నతఁడు సాక్షాత్సంగమేశుఁ - [49]డేనాఁటి కితరుల కేల చొప్పడును
దనుఁజూప కిబ్భంగి ధరణి వర్తించు - ననువుగా కతఁడేమి యల్పుఁడే” యనుచు
భక్తునకును దోడు వరిచారు నిచ్చి - [50]వ్యక్తసందర్శనాసక్తి నేతెంచి
బసవఁడు కలకేత బ్రహ్మయ్యగారి - కసలార నందంద సాష్టాంగ మెరఁగి
యంజలీకృతకరకంజుఁడై నేత్ర - సంజనితానందజలరాశి [51]మునిఁగి
యెసక మెక్కఁగ నుతియించుచు నున్న - బసవనిఁగలకేత బ్రహ్మయ్య యనియె
“బసవ! [52]యీ కిన్నర బ్రహ్మయ్య భువిని - బసరింపఁగా నిట్టి భక్తుండు గలడె?
ఒడయనంబికి మున్ను వడిపెట్టు శివుఁడు - పడివెట్టు గిన్నర బ్రహ్మయ్య కిపుడు
పలికించుటయు నిత్యపడిగొనుటయును - వెలయ నయ్యిరువురవృత్తి [53]యోకాక
ముట్టఁగొల్చిన ఫలం బిట్టుండ వలదె? - వట్టిమాట [54]లవేల వలయు వస్తువులు
నిటలాక్షు [55]వేఁడక నిక్క మున్నవియె? - కటకటా! మే మింతగాలంబుఁ గొలుచు
టక్కటా! నిష్ఫలం [56]బయ్యె నిత్యంబు - నొక్కొక్క వాతికయును గొనలేదు
శివపూజఫలము సేసేతఁగొన్నట్లు - [57]తవిలి యాతనికి నంతన సమకూఱెఁ
బున్నెంబు మాలినపొ(డు?) వలమెల్ల - నెన్నంగ నున్నార మే మేమి గొఱయు

మృడుఁ బూజసేసి [58]వ్రేల్మిడితోడఁబసిఁడి - పడయు టరిదిగాదె పగలెల్లఁబనులు
ముక్కుఁజెమట వెండి యక్కునఁ దొరుగఁ దొరుగు - జిక్కఁజేసినను గుంచెఁడుగాని లేవు
ఇన్నియుఁజెప్పఁగనేల మాకిన్న - రన్నకుఁజెప్పు వ్ర(వ్య?)యంబును బెద్ద
ఒకమాటు రజతమహోర్వీధరంబు - నకుఁజని యేతెంచుటకు మెచ్చువచ్చె
నచ్చుగా శివుని 'నో'యనిపించె ననుచుఁ - జెచ్చరఁ దనుఁ జూడవచ్చువా[59]ర్గలరు
వ్ర(వ్య?)యమునకర్థంబు వలయునో శివుఁడు - దయపడి యిచ్చు నర్థమునకుఁదోడు
బిలిబిలికాయకంబులు సేసి పడసి - యిలఁబాఁతినర్థంబు నిసుమంత గలదు
శంకరదాసయ్యచరణము ల్గొలుచు - [60]లెంకల కెట్లును లేదనరాదు
బసవ! మీ బ్రహ్మయ కెసఁగఁగ జెప్పి - వెసఁబండ్లు వుత్తెమ్ము వేనవే లయిన
నిదె యర్ధమిచ్చెద నిటువంటి” దనుచుఁ - బదడు సేపట్టుడుఁబసిఁడియైవెలుఁగ
బసవఁడక్కజమంది ప్రణుతింపుచుండ - వెసఁగిన్నరయ్య యీ వృత్తాంత మెఱిఁగి
పఱతెంచి కలకేత బ్రహ్మయ్యగారి - [61]కెఱుకువ దులుకాడ నిలఁజాఁగి మ్రొక్కఁ[62]
గలకేత బ్రహ్మయ్య [63]యల కిన్నరయ్య - నలరుచుఁగౌఁగిట నందందచేర్చి
యతిదయామృతవార్ధి నభిషిక్తుఁజేసి - [64]నుతనిష్ప్రపంచ సన్మతికీలు సూపి
యప్రతర్క్యాదిలింగప్రాణమధన - సుప్రసన్నానుభవప్రాప్తుఁజేసి
యిరువుర లింగావసరము సేయించి - సరసోచి[65]త క్రియాసంతుష్టిఁజేసి
బసవనఁగిన్నర బ్రహ్మయ్యగారి - మసలక వీడ్కొల్పి యసమానలీలఁ
గలకేత బ్రహ్మయ్య నలిఁదొంటియట్ల - విలసితభక్తి నిశ్చలలీల నుండెఁ
గలకేత బ్రహ్మయ్య ఘనచరిత్రంబు - వెలయఁగఁజదివిన వినిన వ్రాసినను
నభవుకారుణ్యకటాక్షేక్షణమున - నభిమతఫలసిద్ధియగు నక్షణంబ

మోళిగ మారయ్య కథ


మఱియును మోళిగ మారయ్య యనఁగఁ - గఱకంఠు సద్భక్తగణ [66]విలాసంబు
ప్రచ్ఛన్నరుద్రుఁ డవిచ్ఛిన్నకీర్తి - స్వచ్ఛసదాచారసంపత్ప్రపూర్తి
విజితకామక్రోధవిమలమానసుఁడు - నిజగతి లింగైక్యనిష్ఠాపరుండు
మంగళచరితుఁడు లింగసదర్థుఁ - డంగవికారదూరైకవర్తనుఁడు

సవిశేషజంగమార్చనపరతంత్రుఁ - డవికలవిధినిషేధవివర్జితుండు
ప్రవిమలాంగుఁడు నిష్ప్రపంచగుణాఢ్యుఁ - డవిరళతత్వానుభవసుఖాంభోధి
కర్మాపహరుఁడు లింగప్రాణమథన - మర్మజ్ఞుఁడన లసన్మహిమఁబెంపారి
యనయంబు నతులఘోరాటవికేఁగి - ఘనతరంబుగ మోచి కట్టెలు దెచ్చి
యంగడి విక్రయం [67]బార్చి తెప్పించి - జంగమారాధన సలుపుచునుండు
రసరసాయనములు బసవని నగర - నసలార భోగించి యాదటఁ[68]బోక
జంగమకోటి నిచ్చలు నొక్కమాటు - భంగిగా నారగింపఁగఁబెట్ట వచ్చి
“బసవ! మారని యట్టిభక్తులు గలరె? - వసుధలో నీ యింటిరసరసాయనము
లతనినగరఁగాంచు నంబకళంబు - ప్రతివచ్చునే యెన్ని భంగులనైన
ననిశంబు నతనికాయకలబ్ధి యెంత - సంతుష్టి సేయు టాశ్చర్యంబు గాదె?
బాపుఁ మోళిగమార! భక్తివిస్తార - బాపురే” యని మ్రోలఁబ్రస్తుతి సేయ
నసలార విస్మితుం డగుచు నేతెంచి - బసవఁడు ప్రచ్ఛన్నభావంబు నొంది
మోళిగ మారయ్య ముద్దియఁగాంచి - లాలితోద్యత్సముల్లాస మెలర్ప
'శరణార్థి' యని చక్కఁజాఁగి మ్రొక్కుడును - దరుణియునటమున్న 'శరణార్థి' యనుచు
నడుగుల కర్ఘ్యపణ్యంబులు దేర - నొడఁబడ కెఱిఁగెదరో యనుమతిని
“అమ్మమ్మ! మాలింగ మాకొన్నవాఁడు - క్రమ్మన వడ్డింపు రమ్ము లె” మ్మనుచు
సరసర లింగావసరము సెల్లించి - పరికించి యం దొక్కవడిగంబు క్రింద
విడియలతో రెండువేలమాడలును - [69]నడకి యమ్మకు శరణార్థి సేయుచును
సదమలలింగప్రసాదంబు గొనుచు - విదితముత్పులక సముదితాత్ముఁడగుచు
ధర నిరుపేద నిధానంబుఁగన్న - కరణిని హర్షాశ్రుకణములు దొరుగ
“నిదిగదా భవదుఃఖగదకు(ము?) నౌషధము; - ఇదిగదా భక్తిమహిష్ఠతపంట;
ఇదిగదా నా పుట్టినింటికల్పకము! - ఇదిగదా ముక్తికి నిక్క దాననుచుఁ
బొంగి ప్రసాదైకభోగియై తద్గృ - హాంగణంబున నిల్చి యాత్మలోపలను
నీ సదనం బంత నింతఁగన్నంత - దోసంబులెల్ల విధూతము ల్గావె
యీ నగరద్వార మిఱియ నేతెంచు - నా నరుఁడపుడ కృతార్థుండు గాఁడె
యీ సీమలోఁజరియించు జంతువులు - చేసిన భాగ్యంబు సెప్పంగఁదరమె
యీ గృహాంతరరేణు విసుమంత నొసల - [70]బాగొందు నతనికి భక్తి వర్ధిల్లదె?

కడిఁదిపాతకము లిక్కడఁబ్రసాదంబు - గుడిచినఁ[71]జెడు సమకూఱ దేనియును
నొడఁబడ నిచ్చటికడువనీరైనఁ - బుడిసెఁడు ద్రావినఁబొలియుఁబాపములు”
నని తలపోయుచుఁజనియె నా బసవఁ - డనురాగచిత్తుఁడై; యంత నిక్కడను
మధ్యాహ్నమగుటయు మారయ్య లింగ - తద్ద్యానసుఖనిరంతరవర్తి యగుచు
వాకిటఁగట్టెలు వైచి యేతేర - నా కాంత యెదురేఁగి యడుగులు [72]గడుగ
భంగిగా జంగమ[73]ప్రణిపత్తి [74]దీర్చి - లింగార్చనంబు సల్లీలఁజేయుచును
బడిగంబు క్రిందట బసవఁడు మున్న - [75]యడకిన మాడల విడియలు గాంచి
"యెక్కడివిడియ లిం? దెవ్వరు వచ్చి - రిక్కడి?” కని తనయింతి నడ్గుడును
“దేవ! యొక్కయ్య యేతెం చారగించె - భావింప నటమీఁది పను లే నెఱుంగ
నప్పుడ విచ్చేసె” నని విన్నవింపఁ - "[76]దప్పదు బసవఁడు దాన కానోపుఁ
గడు నర్థసంపదగల భక్తులరసి - బడుగుభక్తులఁబ్రోవఁబాడియ కాదె?
దాత గాఁడే యిట్లు దాఁబ్రోవ కెవరు - ప్రోతురు మేలయ్యెఁబో బ్రదికితిమి
తన బిడ్డఁడని [77]మనఁదలఁచి యిచ్చటకిఁ - జనుదెంచె నింతియ చాలదే మాకు
నిమ్ముల మాలింగ మిచ్చిన కాయ - కమ్మ యీ పూఁటకుఁగలిగున్న” దనుచుఁ
జక్కన నిద్దఱు జంగమంబులకు - నొక్కొక్క విడియ నియోగించి మ్రొక్కి
సదమలస్థితి నున్న జంగమకోటి - [78]పద పద్మములు గడ్గి భక్తితో వారి
శ్రీపాదజలములు సిలికింపఁగట్టె - మోపు [79]గడానియై యేపారి వెలుఁగ
వేడుక మదిఁదులుకాడ వేయేసి - మాడలయెత్తుగాఁగూడ ఖండించి
యున్నజంగమకోటి కొక్కొక్కనక్కు - చెన్నుగా నర్పణసేసి మ్రొక్కుడును
నక్కజం బందుచు నా జంగమములు - గ్రక్కున బసవనికడఁబ్రసరించి
“మిక్కిలి భక్తికి నిక్కంబు నియతి - కెక్కుడు చేఁతకు సెల్లయై పరగు
మోళిగ మారయ్యఁబోరంగ భక్తు - లేలోకమునఁగలరే” యని పొగడ
బసవఁడు! యిట్లేల యానతిచ్చెదవు? - నిన్నన్న దేమేని మున్నెండు గలదె?
[80]బడుగు భక్తులకెల్లఁబ్రాణంబునిన్నుఁ - గడ [81]సన్నభక్తులు గలరె యిబ్భువిని
మాబోటి భక్తులమనికియు నునికి - నీ బయిసియె కాదె నిఖిలోపకార!
విని యెఱుఁగము దొల్లి విడియ లనంగఁ - గనుఁగొనఁబడియె నీ కారణంబునను

బాపు! భాగ్యప్రాణి! బాపు! కృపాత్మ! - బాపురే! ధనవంత! బాపు! కీర్తీశ
నల్లవో బసవయ్య నా కిచ్చినట్టు - లెల్లభక్తావళికి నిత్తయ్య! తొల్లి
మడివాలు మాచయ్య మనుమల మమ్ము - విడువక నడుపుకో వేయును నేల?”
అని పెక్కు భంగుల నాలి సేయంగ - ఘనతరశోకాంబు కలితాస్యుఁడగుచుఁ
“గనకాద్రియరయునే కాకిగుణంబు - నినుముగుణ మరయునే పరుసంబు
గుణనిధి వీవు దుర్గుణనిధి నేను - గణుతింపఁగలదె సద్గుణము నా యందు
వెలివాడఁగలుగునే వేదఘోషంబు - నిల నావమునఁగల్గునే [82]రాగిముంత
తలఁపఁగుంపటిలోనఁదామరదుంప - మొలచునే యిన్నియు ముదలింప నేల
గతవివేకునిఁగావఁగాఁదగు నీవ - గతి దయాభావ! సంగయదేవ!” యనుచు
మారయ్య పాదపద్మంబుల కెరఁగి - సారాంచితోక్తుల సంస్తుతింపుచును
నభయంబు వేఁడుచు నడుగులమీఁద - సభయాత్ముఁడై యున్నఁ [83]జయ్యన నెత్తి
యసలారఁగౌఁగిట నందంద చేర్చి - బసవని కారుణ్యరసవార్ధిఁదేల్చి
యలరంగ మృదుమధురాంచితాలాప - ములఁబ్రబోధించుడు నలి దులుకాడ
మారయ్యగారికి మఱియును మ్రొక్కి - యారఁగ బసవరా జరిగె; నంతటను
మోళిగ మారయ్య ముందటియట్ల - లాలితభక్తిసల్లీలమై నుండె;
నారఁగ మోళిగ మారయ్యగారి - చారుచరిత్రంబు సదివిన విన్న
నిత్యప్రసాదవినిర్మలాత్మీయ - సత్యసుఖంబులు సల్లీలఁగలుగు

కన్నడ బ్రహ్మయ్యగారి కథ


పరగంగఁగన్నడ బ్రహ్మయ్య నాఁగ - ధర నొప్పు సద్భక్తిపరుఁడు వెండియును
దర్పితసంసారదళనుండు జంగ - మార్పిత ప్రాణదేహార్థాభిమాని
యద్భుతచరితుఁడుద్యద్భక్తియుక్తి - సద్భావనోపేత చరలింగమూర్తి
సారవీరవ్రతాచారుండు జంగ - మారాధకులలోన నగ్రగణ్యుండు
సంచిత బాహ్యపూజాపరతంత్రుఁ - డంచితాంతస్సపర్యాపరాయణుఁడు
నిరవద్యహృద్య వినిర్మలభక్తి - పరతంత్రుఁడన లసచ్చరితఁబెంపారి
కత్తియు బలపంబుఁ గావిచీరయును - గత్తెర యిసుము నక్షతలును ముండ్ల
బంతియు నీలికప్పడమును ద్రిండు - [84]మంతరకాటుక మఱి చండవేది
సెలగోల యొంటట్ట చెప్పులుఁ [85]బీఁకె - యొలుకులబూడిదయును వాటుఱాలుఁ

గుక్కలవాకట్టుఁగొంకినారసము - గ్రక్కునఁగంకటిరజ్జువు నమర
సూచీముఖంబైనఁజొనుపంగరాని - యేచినచీకటి నిండ్ల పంచలకుఁ
జిడిముడి పలుకులఁ జేరి యుల్వరసి - గడియకన్నంబును గడపకన్నంబు
గోడకన్నంబును గుఱి [86]నేలకన్న - మోడక త్రవ్వి యి ల్లొయ్యన చొచ్చి
పరికించుచో భక్త భవనంబులైన - సరసరదీపంబు సంధించి వారి
పాదాబ్జములమీఁదఁబడి మేలుకొలిపి - పాదోదకంబు ప్రసాదంబుఁగొనుచు
“శరణనియెడి సత్యశరణులయిండ్ల - వరవుడ బ్రహ్మఁడన్వాఁడ నే” ననుచు
నెడనెడ నేఁగుచు నితరు[87]లిండ్లైనఁ - దడయక పదపదార్థంబులు దేవి
కొనివచ్చి జంగమకోటికి వరువుఁ - బను లాచరించు చిప్పాట వర్తింప
జంగమ[88] మొకనాఁడు చాల నేతేర - భంగిగా నిది పట్టపగలని యనక
“నేలకన్నంబిడి నిఖిలేశునగరఁ - జాలనర్ధముఁదెత్తుఁజక్కన” యనుచు
నరుగుచో బసవఁడు పురవీథిఁ గాంచి - యరుదొంద భువిని సాష్టాంగుఁడై మ్రొక్కఁ
“బట్టుము గత్తియు బలపంబుఁగన్న - పెట్టఁబోవలయు నా కిట్టున్న భంగి
నొం[89]డెడ ధనములే దొనర బిజ్జలుని - బండారమిలు సూప బసవ! ర” మ్మనినఁ
బ్రత్యుత్తరం బీనిబాస గావునను - నత్యనుచిత మన 'కట్లకా' కనుచుఁ
గన్నడ బ్రహ్మయ్య గారిఁ దోడ్కొనుచుఁ - గన్నంపుము ట్లెల్లఁగరమర్ధిఁగొనుచు
నునుపరియునుబోలె నొడక నగరు - చనఁజొచ్చి బండారుసదనంబుఁజూప
గడియకన్నం బిడఁగాఁబదడెల్లఁ - గడసన్న పసిఁడియై పుడమి వెలుంగఁ
జొచ్చి పెట్టెలలోని సొమ్మెల్లఁగొనుచు - విచ్చేసె బ్రహ్మయ్య యచ్చెరువంద
నంగరక్ష[90]కులెల్ల నరిగి యట్లున్న - భంగిన యవ్వారఁబతి కెఱిఁగింప
బసవఁడునాబారిఁబాఱె బొమ్మనుచుఁ - గసిమసంగుచు మహోగ్ర[91]మునరేఁగుచును
నవుళులు గీఁటుచు “నక్కటా! తన్ను - శివభక్తుఁడని విశ్వసించుటయెల్ల
వఱితిపాలుగఁ జేసెఁ జిఱుతవాఁడనక - యఱలేక మన్నించు [92]నంతయుఁగంటిఁ
బట్టపగలు గన్నపెట్టించె బసవం - డెట్టొకో ప్రాణంబుఁబట్టియున్నాఁడు
అడిగిన వలసి [93]నంతర్ధ మీ నెట్టు - లడరఁగ విశ్వాసియయ్యె నిట్లింత
కెత్తికొన్నాఁడింక నిటమీఁద నెంత - కెత్తికోనున్నాఁడొ యెఱుఁగరా”దనుచుఁ

గన్నులమంటలు గ్రమ్మ నేతెంచి - కన్నంబువాకిటికనకంబుఁజూచి
యతివిస్మయాక్రాంతమతిఁ జిట్టమిడిచి - గతకోపుఁడై క్షితిపతి యిట్టులనియె
“నెక్కడిపసిఁడిప్రో వెక్కడి దొంగ - యెక్కడికన్న మిదేమి వన్నితివి?
బసవనమంత్రి! యేర్పడఁజెప్పు” మనిన - వసుధేశునకు బసవనమంత్రి యనియె
“భక్తుండు గన్నడ బ్రహ్మయ్యనాఁగ - వ్యక్తలింగం బనియుక్తప్రతాపి
కన్నడ బ్రహ్మయ్యగారి మహత్త్య - మెన్నఁగ శక్యమే యీశునకైన
నాతని శ్రీచరణాంగుష్ఠయుగము - ఖ్యాతిగాఁగల్పవృక్షములకు నూఁత
ఆ మహా[94]త్మునియమృతావలోకనము - కామధేనువులసంఘముపుట్టినిల్లు
చింతింప నాతనిచిత్తంబుచిగురు - చింతామణులకు నిరంతరాశ్రయము
అరయంగ నతనిహస్తాంగుళస్పర్శ - విరచింపఁగాఁబర్సవేదుల గనులు
నతని శ్రీపాదసంగతి ముక్తిభూమి - యతని ప్రసాదంబు నమృతంబుతేట
యతనికోపంబు సంహారకారణము - నతని కారుణ్యంబ యపవర్గ మింత
నణిమాదిసిద్ధులు నాతనిబంట్లు - గణుతింప నింత లింగసదర్థుఁడయ్యుఁ
బట్టిననియమంబుఁబాయక కన్న - పెట్టిన నర్థమెకాని ముట్టఁడు సేత
'నిది గుమార్గము భక్తియే' యనవలదు - ఇదియె తా సన్మార్గ మెట్టు లంటేని
యిలఁజూదమునఁబాండవులు భ్రష్టులైరి - నలిజూదమున మూర్ఖు నగజేశుఁగూడె
వేఁటాడి రాముండు వెలఁది గోల్పడియె - వేఁటాడి యెఱుకు దా విశ్వేశుఁగలసెఁ
బరసతీవశ్యులై నరపతుల్ ద్రుంగఁ - బరసతీవశ్యుఁడై హరుఁగూడె నంబి
చంపి మాండవ్యుంబు సరిఁగొర్తఁబడియెఁ - జంపి చండుండు ప్రసాదంబుఁ గనియె
బొంకిన బ్రహ్మకు భువిఁబుట్టుమాలె - బొంకి చిర్తొండండు బొందితోఁజనియె
గొఱియమ్రుచ్చని శూద్రకుఁడు [95]నఱకువడెఁ - గఱకంఠుగణనంది గలసెఁదెర్వడిచి
రమణ “రాజ్యాంతే నరక” మన ముక్తి - విమలతఁగనిరి చేరమయుఁజోడండుఁ
గాన యెట్లును నమార్గం బనరాదు - తా నీశ్వరార్థ మన్తలఁపునఁజేసి
ధర "నధర్మో ధర్మతాం వ్రజే” త్తనఁగ - హరునివాక్యముగాన యట్టిద పథము
నిన్నియు నననేల యిందఱకంటెఁ - గన్నడ బ్రహ్మయ్య గతి యెట్టిదనిన
నెప్పుడు జంగమం బేతెంచు నింటి - కప్పుడకాని పోఁడసహాయలీల
నిది వగ లిది రాత్రి యెట్లొకోయనుచు - మదిలోన లే దణుమాత్రంబు భయము
నదియును శివభక్త సదనంబ యేని - ముదమునఁబేర్సెప్పి మ్రొక్కుచువచ్చు

నిల్లిల్లుఁదప్పక యితరాలయముల - నెల్లయర్థము దెచ్చు నిహపరంబులకు
దూరమైనట్టి లుబ్దులయిండ్లు సొచ్చి - వారలఁజరితార్థవంతులఁజేయ
జనియించినట్టి ప్రాక్తనపురుషుండు - నననేల కడువిస్మయము గాదె తలఁప
ముట్టిన త్రవ్విన మెట్టిన ఠావు - పట్టినకైదువు ల్వసిఁడిమయంబు
ప్రాకటంబుగ నిన్ను రక్షింపఁదలఁచి - కాక బ్రహ్మయకు శ్లాఘ్యమె పదార్థంబు
లెక్కకుమిక్కిలి లేకున్నఁదప్పు - తక్కినబండరు లెక్కలు సూడు”
మనుచు నబ్బసవఁడత్యనురాగలీలఁ - గనుఁగొని బండరు కవిలియ సదువ
నక్కజం బందుచు నవనీశుఁ డుండె - నిక్కడ బ్రహ్మయ్య యింటి కేతేర
సుదతియుఁ బతికి నుత్సుకత దుల్కాడ - నెదురేఁగి యడుగుల కెరఁగి కన్నంపు
ముట్టులుఁజేతిసొమ్మును నందుకొనుడుఁ - జట్టన బ్రహ్మయ్య జంగమావలికి
ముదమంది ధరఁ జాఁగిమ్రొక్కెఁ దత్ క్షణమ - ముదితయుఁ దాను సముదిత సద్భక్తి
మించి వెలుంగంగఁబంచభక్ష్యములు - నంచితంబైన దివ్యాన్నపానములు
గావించినట్టి పక్వంబులు జంగ - మావలి కంత సమర్పణసేసి
వారి ప్రసాదసుధారసవార్ధి - నారంగఁదేలుచు నాదట మఱియు
ధనధాన్యవస్త్రవాహనభూషణములఁ - దనిపి జంగమల సత్కరుణాభివృద్ధిఁ
గన్నడ బ్రహ్మయ్య [96]మున్నెట్టు లట్ల - సన్నుతభక్తిమహోన్నతి నుండెఁ
గన్నడ బ్రహ్మయ్య ఘనచరిత్రంబు - విన్నను జదివిన విస్తరించినను
మృడు దయామృతరస మిళితేక్షణమున - నొడఁగూడువారి కిష్టోపభోగములు

ముసిఁడి చౌడయ్య కథ


అసదృశలీలఁబెంపారి వెండియును- ముసిఁడిచౌడయ్య నా ముక్కంటిగణము
నిఖిలసజ్జనభక్త ముఖముకురంబు - సుఖశీలసంబంధ సుపథప్రచారి
అఫలార్థకృతసత్ క్రియాసమన్వితుఁడు - సఫలీకృతామోఘ సత్యప్రతాపి
తత్‌జ్ఞుఁడు సంసారతలగుండుగండఁ - డజ్ఞానజనదూరుఁడపగతభయుఁడు
వీరరసాంభోధి గారణపురుషుఁ - డారూఢదివ్యామృతావలోకనుఁడు
నధికశాపానుగ్రహసమర్థుఁడఖిల - విధినిషేధక్రియా విరహితాత్మకుఁడు
అక్షయకీర్తి దృష్టాదృష్టలోక - సాక్షికప్రత్యయచరలింగమూర్తి
స్వసమయభూతి శాసనజనాధారుఁ - డసమానవీరభద్రసమానుఁడనఁగఁ

బరగుచు నాఁబోతు భక్తుఁడు దపసి - మరణంబు నొందిన మగిడించు బాస
నడచుచో నంబుధి నది యడ్డ[97]మైన - నడఁగించి త్రోవన యరిగెడు బాస
భక్తిసత్క్రియలు దప్పక చేయుబాస - వ్యక్తిగా భక్తినియుక్తిఁబెంపారి
భువి నొప్పి ముసిఁడి యన్పురవరంబునను - సవిశేషభక్తిమైఁజౌడయ్య యుండ
బసవనిభక్తిసౌభాగ్య మహత్త్య - మసలార విని [98]దర్శనాసక్తిఁజేసి
భక్తులుఁదానును బరమానురాగ - యుక్తులై చనుదెంచుచుండ నొక్కెడను
జాలదోయిటనెత్తి చల్లిన నిసుము - రాలినియట్టి యరణ్యాంతరమున
ముసిఁడివృక్షంబు లొప్పెసఁగ నెల్లెడల - పసిఁడి [99]కొండలభాతిఁబండి వెలుంగ
“నసలార ముసిఁడిపండ్లారగింపంగ - నెసఁగ లింగములకు నిష్టమైనయది”
యనుచు భక్తానీక మానతిచ్చుడును - విని సంస్మితానన విలసితుం డగుచుఁ
జనిచని ముసిఁడివృక్షంబుల మొదలఁ - దనకరవా లూని దట్టుఁడై నిలిచి
“యారగింపవె దేవ!” యని విన్నవింప - వారివారిక గణవ్రాత మేతెంచి
నమృతాంశుధరునకు [100]నర్పించి వేడ్క - నమృతాంశుధరుభక్తు లారగించుచును
“ముసిఁడిచౌడయ యనుముందటిపేర - యెసఁగుఁబో జగముల [101]నెట్లును నింక”
ననుచుఁద్రస్తరు లాడుచును సంతసమునఁ - జనుదేరఁగల్యాణమున[102]కు సంప్రీతి
యెసకమెక్కఁగ సంగమేశ్వరునంద - బసవన్న సౌడయ్య భావంబు గాంచి
చక్కన నెదురేఁగి జగతీతలమునఁ - జక్కఁ జాఁగిలఁబడి మ్రొక్కి తోడ్తెచ్చి
యుచితోపచారనియుక్తిఁ గావించి - యచలాత్ము ముసిఁడిచౌడయ్య నే ప్రొద్దు
సంగమేశ్వరునంద సద్భక్తిక్రియలు - భంగిగాఁగొలుచు[103]చు బసవయ్య సలుప
నసమానలీలఁగళ్యాణంబునందు - ముసిఁడిచౌడయమహోల్లసనప్రయుక్తి
నెడపక సద్భక్తి కెల్లయై యిట్లు - నడుచుచు మఱియొక్కనాఁడుత్సవమున
నార్యులు దీవించియనుప వివాహ - కార్యార్థమై యరుగంగఁగట్టెదురఁ
గటకంబు రాజమార్గంబునఁజెలఁగి - నటియించు భక్తగణంబులనడుమ
ఘనవిమానస్థుఁడై గగనమార్గమునఁ - జనుదెంచు తవరాజుశవము వీక్షించి
“వావిరి తవరాజవల్లభుచేత - దీవెన లందకపోవంగఁ దగునె?
పరిణయంబున కిత్తపస్వి యేతేర - కరిగెడువాఁడఁ గా నటు నిలుఁడనుచు
నలుఁగుమోహణమున హస్తంబు దొడిగి - జళిపించి మొనసూపి నలిరేఁగి యార్చి

యరుదెంచి డగ్గఱి “యయ్యగారలకు - శరణార్థి శరణార్థి శరణార్థి" యనుడు
“శివమస్తు శివమస్తు శివమ” స్తటంచుఁ - దవిలి తోడ్తోడన తపసి దీవింప
“డిగు డిగు గొరగ! నాకగపడి తింక - నగవు గా దిచట నున్నను సయిరింప
నందివాహన! నీకు నరవాహనంబు - పొందగునే చూచి భువి నరు ల్నగఁగ”
ననుచుఁబాదము వట్టి యల్లార్చి తివియఁ - గనుఁగొని దరహాసకలితాస్యుఁడగుచు
ధరడిగ్గి ముసిఁడి [104]చౌడరసు నందంద - కర మభిలాషమైఁగౌఁగిటఁ జేర్ప
సత్యస్వరూపుఁడు సౌడరాయండు - నత్యద్భుతాక్రాంతులై నరు ల్వొగడఁ
దోడ్తోన తవరాజుఁదోడ్కొని పెండ్లి - కేడ్తెఱ[105] దళుకొత్త నేఁగంగ నవలఁ
బొలమేర వటవృక్షముల సమీపమున నలిరేఁగి గోపాలకులు నటింపుచును
గము[106]లేర్చి యుద్దించి కాల్గన్న వారిఁ - దమలోనఁగేలివాదంబు [107]వుట్టుటయు
“గోకులపతియాన గుఱి [108]యది మీకు - మాకును బసవనిమఱ్ఱియ” యనుడు
న్యగ్రోధముల [109]యర్త నడచుచు సజ్జ - నాగ్రగణ్యుండు సౌడయ్య యాలించి
పసులవాండ్రనుగూడఁ[110]బద రిదియేమి - బసవనిమఱ్ఱి యన్పలుకయ్యె” ననినఁ
బ్రెబ్బొంతపెయ్యలపెద్ద యందొకఁడు - "నిబ్బసవనివార్త యెఱుఁగుదుఁ గొంత
యట తాతచే వింటిన ని తమతాత - చిటిపొటి వాండ్రకుఁ జెప్పె మాకెల్ల
నలుక రెట్టింప రెం డాఁబోతు లిచట - [111]మలయుచు నేడ్దినంబులు వోరఁబోర
నెత్తురు వఱదలై నేలయంతయును - జొత్తిల్ల నొకపోతు సొలసి చచ్చుడును
నచ్చోన [112]పాఁతినఁజెచ్చెర మొలచె - నచ్చుగా నీమఱ్ఱి యట్లుగావునను
బసవనిమఱ్ఱి యన్పలు కయ్యెనండు - రసలార మఱియుఁజోద్యం బట్లుఁగాక
కఱచిన మాంసంబు గతి నుండుఁబండ్లు - విఱిచినరక్తంబువిధి నీరుగాఱు
నేనాఁట మఱ్ఱిపా లెఱ్ఱనైయున్నె - తా నమ్మరే [113]చూడఁదథ్య”మిట్లనుడు
వారించి “యిదివ్రాఁతవా"ర్తని యొద్ది - వారెల్ల [114]నుడుప నవారితవృత్తి
పసరింపఁ"గ్రొత్తేమి ప్రాఁతేమి యింక - బసవనిమృతి సెవిఁబడ్డపిమ్మటను
మురియుచు బసవఁడు ముందఱఁజనక - పరిణయంబునకేఁగఁ బంతమే నాకుఁ
బడయకపోయెడుపలుకులే?” లనుచుఁ - బెడబొబ్బలిడుచు సంప్రీతినార్చుచును
“వెడలుము వెడలుము వృషభేంద్ర!” యనుచు - [115]వడినెయ్దియలుగున వటమూఁది

నటమున్న నంది [116]పాఁతదరి యద్ధరణి - పటపటఁబగులంగ వటవిటపంబు
చట్టన వ్రేళ్లతోఁజటచటఁమనఁగ - గట్టెగసల్లంత మిట్టిపడంగ
నందఱు నతివిస్మయాక్రాంతులుగను - నందుండి [117]యూఁకించి యవనికి నుఱికి
నిలిచి [118]నిట్రించి ఘణిల్ఘల్లనఁగ - నలరుచు ఱంకె లందంద వైచుచును
వాల మల్లార్చుచుఁ గాలఁద్రవ్వుచును - నేలఁగోరాడుచు నీడ కుర్కుచును
నుడువీథి కెగయుచు నొడలు వెంపుచును - వడిగొని పఱచుచు [119]నిడుజంగ లిడుచుఁ
దగిలి గద్దించుచుఁ దలఁకుచు మూతి - యిగిలించికొని మొగంబెత్తిచూచుచును
జిఱుపెండవెట్టుచుఁజిఱలు వొడ్చుచును - గుఱుజంగలిడుచు దిక్కులుసూచికొనుచు
గెలఁకులఁదన్నుచుఁ గ్రేళ్లువాఱుచును - [120]బులుగఱ చుమియుచుఁ మలఁగినాకుచును
బోరన నెగయుచుఁబొంగుచుఁగొమ్ము - లోరగించుచు మలయుచు వంగికొనుచు
నూఁకరల్వెట్టుచు నురవడింపుచును - మూఁకకు నెగయుచు ముస్సు ముస్సనుచుఁ
జవుడయ్యఁజూచుచు సంతసిల్లుచును - దవులంబు సేయుచుఁదపసి వెన్కొనుచు
బాసికంబును నాఁటి పసపుటక్షతలు - నా సమంచిత సుగంధానులేపనము
లొనరంగ వింతచెన్నొలయంగ గంట – లును మువ్వలును గజ్జెలును మ్రోయుచుండ
నంతంతఁదనరారి యాలఱేఁ డుండ - సంతోషమున ముస్డిచౌడరాయండు
బడిసివైచుచుఁజేరి మెడఁగౌఁగిలించి - యడుగులు గడిగి పుష్పాంజలు లిచ్చి
యాయతధూపదీపాదు లొనర్చి - నేయుఁబాలును బొట్టనిండ వడ్డించి
“నడవుము నడవుము [121]నందెన్న! నీవు - నడవ కేఁబెండ్లికి నడవ [122]నిక్కంబు”
అనవుడు లోకంబు లచ్చెరువంది - వినుతింపఁదద్భక్తజను లుత్సహింప
నందఱ ముందఱ నరుగు నత్తపసి - ముందట నాఁబోతు మురియుచు నడవ
[123]నరుగఁగ నరుగఁగ నంత ముందఱను - నురవడి నుప్పొంగి యుడువీథి దాఁకి
హిద్దొర యనునది యిల నిండిపాఱఁ - దద్దయు నుద్వృత్తి ధరఁదన్ని నిలిచి
“ఎఱుఁగవే వారాసు లెల్ల నొక్కయ్య - యఱచేతిలోనన యణఁగుట మఱియు
భవి పుట్టి యెల్లక భువి ముదలింప - సవిశేషభక్తప్రసాది దాసయ్య
కాదె నిన్ బోకార్చి కాల్నడయంద - యీ దేశమంతయు నెఱుఁగంగ దాఁటె
మఱియు గజ్జేశ్వరుమసణయ్య దన్ను - మఱచి శివార్చనామగ్నుఁడై నడుమ
నుండఁ బై రానోడి రెండు దిక్కులను - ఖండితంబై నీవకావె పాఱితివి?

వెడ[124]వాఁగయేమని వెల్లిసూపెదవు - అడఁగుము ద్రోవయి” మ్మనుచుఁజౌడయ్య
అలుఁగుమోహణమున హస్తంబు దొడిగి - జళిపింప నీరెల్లఁజల్లనఁబాసి
నీరిపర్వత మన నింగి నుప్పొంగి - తారాపథంబునఁదా నిట్టవొడిచె
నాకాశగంగచే హరుభక్తమహిమ - నేకాంతమున విన నేఁగినయట్లు
[125]అయ్యేఱు ముసిఁడిచౌడయ్యకు వెఱచి - చయ్యన నేఁగె రసాతలంబునకు
నన్నట్లు త్రోవ నీ రఱిముఱిఁబఱవ - మిన్నక నడుమెల్లఁదిన్నెలై యుండ
“రండు రండిపుడు [126]నీరము నడు మడువ - రెండు గా వనుమాట రిత్తయ్యె” ననుచు
ముసిఁడి చౌడయగారు ముందఱ నడవ - నసమభక్తానీక మానందలీల
నంతంత నిలుచుచు నార్చుచుఁ గుప్పి - గంతులువైచుచు గతికి నిల్చుచును
నెడనెడ నార్చుచుఁబెడబొబ్బ లిడుచు - వడిఁబిల్లమెఱములు వైచుచు లేచి
పరువులు వెట్టుచు నరుగ ముందఱను - నరుదారఁదపసియు నాఁబోతు నడవ
దరహసితోల్లాసవరవక్త్రుఁడగుచు - నరిగెఁజౌడయ్య దా నద్దరి నిలిచి
“పెల్లున లోకంబు [127]లెల్లను ముంప - గొల్లన నడచు నీ త్రుళ్లెల్ల నడఁగె"
ననుచు నమ్ముసిఁడిచౌడయ్య సద్భక్త - జనసహితంబుగా ననురాగలీల
నరిగి యొప్పారఁదత్పరిణయక్రియలు - పరితోషమతి [128]సమాప్తంబు గావించి
బగుతు లెదుర్కొన మగిడి కల్యాణ - నగరంబు వీథుల నడతెంచుచుండఁ
దపసియు నాఁబోతుఁదనతోడ నడవ - విపరీత మతి నరు ల్విభ్రాంతిఁబొంద
జయజయధ్వను లాకసము నిండి చెలఁగ - రయమునఁబఱతెంచి రమణి యొకర్తు
భావించి చౌడయ్యపాదము ల్నొసలు - మోపంగ ధరఁజాఁగి మ్రొక్కినఁజూచి
యనునయం బొదవ “శతాయుష్య” మనుచుఁ - జనుదెంచి [129]తమనిజస్థానదేశమున
దొల్లింటియట్ల యద్భుతలీల నుండ - నల్లకన్యక మృతమైన మర్నాఁడు
జనకాదు లేడ్చుచుఁగొని వచ్చివచ్చి - కనుఁగొని చౌడయ్యగారికి మ్రొక్కి
“నిన్న మీ పాదముల్ నెన్నుదు రిఱియ - సన్నుతి మ్రొక్కిన సతి నేఁడు సచ్చె
నీ దీవనయుఁదప్పునే” యని వారు పాదము ల్విడువక పలవరింపంగఁ
[130]'దొలదొలఁ'[131]డనుచును 'ద్రోవ కడ్డంబు - నిలిచి వాచర్వక నిలునిలుఁ’ డనుచుఁ
గంపరం బవనిపై దింపించి మహిమ వొంపిరిగొన నోరవోవఁదట్టుచును

'నెనయ దీవించువా రేండ్లేల యిత్తు' - రనుపలు కప్పుడ యాలంబు గాఁగ
నిశితఖడ్గం బార్చి నిఖిలంబు నెఱుఁగ - 'శిశువ! లె'మ్మని పేరఁజీరఁగఁదడవ
[132]కట్టులు వటు కనఁగాఁదెగినిద్ర - బిట్టుల్కి తెప్పిఱినట్టును బోలె
నతిసంభ్రమాక్రాంతమతిఁదేఱిచూచి - యతివ సౌడయ్యకు సాష్టాంగ మెరఁగె
తల్లియుఁదండ్రియుఁదమపుత్రితోన - యుల్లంబు దళుకొత్త నొగిఁజాల మ్రొక్కి
ముసిఁడిచౌడాచార్య! యసమానశౌర్య - వసమె నీ గరిమంబు వర్ణింపఁదలఁపఁ
బ్రాణోపకారికిఁబ్రత్యుపకార - మేణాంకధ [133]రమూర్తి యిలఁజేయఁగలదె?
దాసులఁగా మమ్ము దయ నుద్ధరింపు - మీ సంసరణవార్థి [134]యింకఁదోఁపంగ”
నంచు విన్నప మాచరించుడు మువుర - నంచితప్రాణలింగాంగులఁజేసి
గతవత్సరంబులు గాక మూవురకు - శతవత్సరాయు వాయతిఁగరుణింపఁ
“బ్రాణదానముసేయఁబరులవశంబె? - ఏణాంకధరునకు నిల నరు[135]దన్న
జా నొందఁగ మసిఁడిచౌడయ్య ప్రాణ - దానంబుసేసెఁజిత్రము సిత్ర” మనుచు
మ్రొక్కుచు లోకంబు వెక్కసపడఁగ - నెక్కుడుకీర్తికి నెల్లయై యంత
మహనీయసద్భక్తిమహిమ దుల్కాడ - సహజైకలింగి యాచౌడయ్య నడవ
నతని మహాద్భుతోన్నతిఁ జూడఁజాల - కతిమతిహీనులై యన్యదర్శనులు
“తొడ [136]సూడుపోతుల జడలతమ్మళ్లఁ - బడయుఁదానటె చూ సబంబులఁగన్నఁ
జవుడయ్య గారలచందంబు సూత - మవుఁగాక తప్పేమి” యనుచు దుర్బుద్ధి
గోనెగర్భం బిడి మానిసి రూపు - దా నిల్పి [137]బూడిది దళముగాఁబూసి
యన్నిగందువల రుద్రాక్షము ల్వూన్చి - జన్నిదంబులు వెట్టి జడలను బెట్టి
యడిపొత్తి సించి కచ్చడము సంధించి - కడపట నొకనాడు గుడికడ వైచి
యింతట నంతట నెఱుఁగని యట్ల - సంతల నిలిచి దూషకులు సెలంగ
“నక్కటా! గుడికడ [138]నదియొక్కదపసి - దిక్కుమాలినపీన్గు ద్రెళ్లి యున్నదియు
కుడువఁగట్ట విడువ ముడువలేదనియయొ! - బడుగుఁబీనుఁగుగాన భక్తులు రారు
ఎల్లవారికిఁబ్రాణమేమి నిత్యంబు? - చెల్లఁబో! యెవ్వరుఁజేర రియ్యెడకు
నెట్టు సూడఁగవచ్చు నింక ధర్మంపు - గట్టియయైనను [139]బెట్టుదం” డనుచు
దమ్మళ్లఁ గొందఱఁదపసులఁబిలిచి - గ్రమ్మన నొకవిమానమ్ముఁగల్పించి

“గుడికడ [140] నెన్నటఁగోలె నున్నదియొ? - పడికి [141] వల్చెడుఁజేరి పట్టరా” దనుచుఁ
దార యాకృతకంపుఁదపసిశవంబుఁ - జేరి విమానంబుఁజేర్చి సంధించి
జగదభినుతుఁడగు చౌడయ్యగారి - నగరిపొంతను విమానంబు రాఁబనిచి
యల్లంత నల్లంత నపహసింపుచును - గల్లరిలోకులగము లేఁగుదేర
నడతెంచు నవ్విమానంబులో శవముఁ - బొడఁగని చౌడయ్య గడుదూరమంద
కృతకంపుశవముగా మతిలోన నెఱిఁగి - యతిదరహసితాస్యుఁడగుచు నుప్పొంగి
“యవికలాజాండంబు లలిగినఁజెఱుపఁ - దవిలి కూర్చినఁగావ దక్షులైనట్టి
మదనారి భక్తులమహిమఁదలంప - నిది యెంత పెద్ద దా నీరూపమునకుఁ
బడయుదు నొడలును బ్రాణంబు”ననుచు - మృడభక్తమండలియడుగులు దలఁచి
వడిగొని డగ్గఱి వాలార్చి [142]చూచి - విడిసేసి గాయంబు గడుమొనసూపి
యందుండి [143]లంఘించి యావిమానంబు - నందున్నకృతకాంగు హస్తంబు వట్టి
గ్రమ్మనఁ "దపసి లే లె”మ్మని పిలువ - నమ్మాత్రలోన జీవాంగుఁడై లేచి
ముసిఁడిచౌడయకంటె ముందఱ నిలిచి - వసుధపైఁదజ్జనావలి సోద్యమందఁ
జవుడయ్యగారి శ్రీచరణాబ్జములకుఁ - దవలి సాష్టాంగుఁడై తా మ్రొక్కి నిలిచి
“హరుఁడవు నీవ సద్గురుఁడవు నీవ - కరుణింపు మీ పాదుకాతతి మోవ
ఖ్యాతిగా భవదీయకారుణ్యగర్భ - జాతుండ నన్యధా [144]నీతు లెఱుంగ”
నంచుఁబ్రార్ధనసేయు నాతని నపుడ - సంచితగురులింగ సంగతుఁజేసి
యతుల కోపోద్రిక్తుఁడై కసిమసఁగి - కృతకులఁదునుమంగ మతిఁదలంచుడును
బరవాదు లతిభయభ్రాంతాత్ము లగుచు - నరుదెంచి యంతంత ధరఁజాఁగిమ్రొక్కి
“యసమాన ముసిఁడిచౌడాచార్యవర్య! - దెసయును దిక్కును దేవ! యేడ్గడయు
నీవ మా కన్యథాభావంబు లేదు - కావవే యజ్ఞానజీవుల శరుల
సకలాపరాధుల సైరించి మమ్ము - సుకృతవంతులఁజేయు సుజనాగ్రగణ్య!”
యని విన్నవించుచు నభయంబు వేఁడ - ఘనకృపామతి నార్తజనశరణ్యుండు
సజ్జనశ్రేష్ఠుండు సౌడరాయండు - నజ్జనానీక మత్యర్థిఁ గీర్తింప
గతపూర్వలాంఛనాకృతులఁగావించి - యతులిత శివసమయస్థులఁజేసి
యసదృశలీల నమ్ముసిఁడిచౌడయ్య - వసుధ నెప్పటియట్ల వర్తించుచుండె

ముసిఁడి చౌడయగారి యసదృశచరిత - మసలార వినిన నత్యర్థి వ్రాసిననుఁ
జదివిన సద్భక్తిసంపద లొందు - మదనారికరుణఁబ్రమథలీల దనరు

సురియ చౌడయ్య కథ


వరకీర్తి సురియచౌడరసునా మఱియుఁ - బరికింపఁగారణపురుషరత్నంబు
లింగ[145]ధర్మజ్ఞాని లింగాభిమాని - లింగయోగానంద సంగతాత్మకుఁడు
గాఢవీరవ్రతారూఢప్రతాపి - గూఢలింగైక్య నిరూఢమానసుఁడు
ఉభయలింగప్రసాదోపభోగుండు - త్రిభువనపూజ్యుండు శుభకరకీర్తి
శుద్ధాంతరంగప్రబుద్ధుండు గతవి - రుద్ధకర్మేంద్రియబుద్ధీంద్రియుండు
సదమల [146]కీర్తి భాస్వత్పుణ్యమూర్తి - సదయాత్ముఁడపగతసంసారభయుఁడు
శిష్టమహోత్కృష్టశీలపాలనుఁడు - ఇష్టాష్టవిధభక్తిపుష్టి చేతనుఁడు
కాయనియుక్తవికారదూరుండు - మాయాప్రపంచావిధేయవర్తనుఁడు
నన విలసిల్లి కళ్యాణంబునందు - ననయంబు నేఁడు నాఁడనక ముప్పొద్దు
భంగిగా సద్గురుభావంబు నందు - జంగమకోటి కర్చనలు సేయుచును
బాయసాహారముల్ పంచభక్ష్యములు - నాయతభక్తిదివ్యాన్నపానములు
డెక్కొనగూడ వడ్డించి సంప్రీతి - మ్రొక్కి కరాంబుజంబులు దలమోపి
“పాయక శ్రుతి[147]రసా న్భక్తస్యజిహ్వా - గ్రే” యని యేప్రొద్దు మ్రోయుఁగావునను
నారంగ నీ జంగమావతారమున - నారగింపవె దేవ!” యని విన్నవించి
జంగమం బారగింపంగఁదానంత - లింగార్చనక్రియాసంగతి నిలిచి
పొరి మజ్జనోదకంబులకట మున్న - పరముపై నానందబాష్పముల్ దొరుగఁ
బూజించు నవపుష్పరాజికి మున్న - రాజాంకుపై హృత్సరోజంబు విరియ
ధూపవాసనకు మున్ ధూర్జటి మ్రోల - వ్యాపితాంతర్గతవాసన దనర
వెలుఁగు నీరాజనంబుల కటమున్న - మలహరునంద యాత్మజ్యోతి ప్రబల
వినివేదితపదార్థవితతికి మున్న - తన ప్రాణపద మీశ్వరున కర్పితముగ
లింగార్చనము [148]దాను బొంగి చేయుచును - నంగచేష్టలకు నంతంతఁబాయుచును
సుభగలింగముఁజూచిచూచిక్రాలుచును - నభవామృతం బాని యాని వ్రాలుచును
సురుచిరోక్తుల సోలిసోలి పాడుచును - స్థిరసుఖాంబుధిఁదేలి తేలియాడుచును
మంగళోన్నతబహిరంగంబు నంత - రంగంబుఁదనప్రాణలింగస్థ మగుచు

నమరెడు నిత్యలింగార్చనవేళ - సముచితనైవేద్య సమయంబునందు
మెఱవడియై సురె వెఱికి ప్రాణమున - కొఱగోసినట్టుల యొకదెసఁజేర్చి
జంగమలింగావసరము సెల్లించు - భంగిగాఁదనప్రాణ లింగంబునకును
బళ్లెరమున నెల్లపదపదార్థములు - పెల్లుగా వడ్డించి వేరువేరునను
నరుదొందఁగడిగడి కందిచ్చుచుండఁ - గరమర్థితోఁగడిగడి కందుకొనుచు
భక్తవత్సలుఁడగు పరమేశ్వరుండు - వ్యక్తిగాఁజేసేత నారగించుడును
ముప్ప్రొద్దుఁబ్రాణలింగప్రసాదంబు - సుప్రసన్నత జంగమప్రసాదంబు
గూడ భోగించుచు [149]రూఢి వెంపార - వేడుకఁజౌడయ్య విహరించుచుండ
“హరునకు నిత్యంబుఁగరికాలచోడ - నరపతి [150]యారోగణము నెమ్మిఁజలుపఁ
బలకలనేఱినప్రాసంగుఁబ్రాలు - నలవడ మున్నూఁటయఱువదివుట్లు
ననయంబుఁ బత్రశాకాదులలోని - కననేల ముప్పందు మట మిరియాలు
నారగింపనె కాని యప్పదార్థముల - పేరీశ్వరుఁడెఱుంగ నేరఁ”డనంగఁ
గమియంగఁ బదపదార్థములు వడ్డించి - నమర సాయుధుఁడయి యవల నిల్చుండ
నప్పటి కప్పటి కాస్వాదనములఁ - జప్పుడు వినఁబడ నెప్పుడు శివుఁడు
ననురాగలీల నెక్కొన నారగించె - ననఁగ విందుము దొల్లి యదియునుగాక
మాదరచెన్నయ్య మహనీయకీర్తి - యాదట మదిఁదులుకాడఁ దొల్నాటి
యంబకళంబు జిహ్వాగ్రంబు వళ్లె - రంబుగాఁ దన కర్పితం బాచరింప
శివుఁడారగించెఁబ్రసిద్ధిగా నండు - రవిరళప్రీతి మైనట్లు వెండియును
వీరచోడవ్వ దాక్షారామమందు - నారగింపఁగఁజవియైనఁగంపించెఁ
గుడుకతోడన మఱి గడి యెత్త నోడి - తడయక పులగంబు దాసిచేఁబనుపఁ
“బుత్తెంచె మాయక్క వులగంబు నీకుఁ - జిత్తజాంతక! యిదే చేకొను” మనినఁ
బ్రీతిమైఁజయిసాఁచి భీమేశుఁడతివ - చేతిపులగముఁజెచ్చెరఁబుచ్చికొనుచు
నారోగణముసేసి యందఱుఁజూడఁ - గోరఁగ్రంగన వైచె గుడివెలి ననఁగ
వినఁబడె మఱియును మును గథలందుఁ - గనుఁగొనఁబడియె నేఁడనురాగలీలఁ
గటకానఁజౌడయ్యగారిచేఁగళ్లు - నిటలాక్షుఁడారగించుట నిప్పు” డనుచు
నఖిలభక్తావళి యంతఁగీర్తింప - సుఖలీల నుండె నా సురియచౌడయ్య
సురియ చౌడయగారి చరితంబు వినినఁ - గరమర్థిఁ జదివిన గారవించినను

సహజజంగమలింగసదయాభివినుత - నిహితప్రసాదవినిర్మలచరిత
స్వానుభవాతిశయానందమలరు - మానిత [151]సద్భక్తి మహిమ వర్ధిల్లు

తెలుఁగు జొమ్మయ్య కథ


మలహరసద్భక్తి [152]మహితుండు మఱియుఁ – దెలుఁగు జొమ్మయ్య నాఁ ద్రిమలాపహరుడు
సంతత సద్భక్తి సహజసౌభాగ్య - వంతుఁడు సర్వజీవదయాపరుండు
పుణ్యపాపోన్ముక్తపూతమానసుఁడ - గణ్యపుణ్యోదయకారణాత్మకుఁడు
ఆనందకలిత మహాప్రసాదావ - ధానసంధాన విద్యావిశారదుండు
నశ్రాంతశుద్ధశివాచారయుతుఁడు - విశ్రుతాంచితకీర్తి వీరసత్తముఁడు
లోకహితార్థుఁడలోకుండు శివప - దైకనిష్ఠాపూరితాంతరంగుండు
కలియుగజనితమృగవ్యాధరుద్రుఁ - డలఘుపరాక్రముఁడసమానదాని
శివభక్తిపరతంత్రసిద్ధుండు సకల - భువనపావనుఁడన భువి నుల్లసిల్లి
లింగార్చనక్రియాలీల సల్పుచును - జంగమారాధనాసక్తిఁగ్రాలుచును
ఘనరూఢిఁగళ్యాణకటకంబునందు - ననురాగలీల జొమ్మయ్య వర్తింప
నంత నిక్కడను శివానందుండు నా ని - రంతరలింగతద్ధ్యానాత్ముఁ డగుచుఁ
బరమపరానందపారవశ్యమునఁ - బరమకాష్ఠీభూతభావనఁదగిలి
శ్రీశైలమున సమంచితనిర్ఘర ప్ర - దేశంబునను సమాధిస్థుఁడై యుండఁ
బదనఖంబులు భువిఁబర్వి వెల్గుచును - విదితమై క్రిందికి వేళులు వాఱ
నలిఁగరస్థలి నఖములు వెలుంగుచును దెలుపారి మీఁదితీగలభాతిఁబ్రబల
నురుముక్తకేశంబు లొడలు గప్పంగ - ధర నీలగిరిమాడ్కి గురుమూర్తి దనర
నాయయ్య శిష్యుఁడత్యాయతభక్తిఁ - బాయక కొల్చుచుఁబరతంత్రలీల
ననయంబుఁగందమూలాహారుఁడగుచు - ననుషక్తిఁదానును నచటన యుండ
నంత వినోదార్థు లగుచు గంధర్వ - కాంతలుఁబతులు నక్కడ పోయి పోయి
“తెల్లఁదీగలతోడ నల్లఁదనంబు - నల్లది యెట్టిదో?” యనుచు "దూరమున
శిలయొకో శిలకుఁదీగలు [153]గల్గుటెట్టు - లిల వృక్షమో వృక్షమే నాకులెవ్వి?
ముదియెల్గు గానోపుఁగదలఁజాలకయ - యదె యున్న”దనుచు నంతంత వీక్షింప
సుదతులఁబరుషులఁజూపులఁజూచి - యదయుఁడై శిష్యుఁడత్యాగ్రహంబొదవఁ
“గానరా! పరమయోగానందమూర్తిఁ - దా నన్యభావనఁదలఁపంగఁదగునె?

యజ్ఞానులార! మృగాకృతిగాఁగఁ - దజ్‌జ్ఞునిఁబోల్చిన తప్పునఁబోయి
పుట్టుఁడు మృగములై భువి” నంచు నప్పు - డిట్టలంబుగ శాప మిచ్చుడు వారు
నంత భయభ్రాంతు లగుచు [154]నక్షణమ - యంతంతఁబ్రణమిల్లి "యక్కటా!మీర
లానతిచ్చినయట్టు లన్నియునేల - కానమి మాయందుఁగలిగె నెంతయును
నదియును మున్నపహాస్యభావమున - మది నొండు దలఁచినమార్గంబు గాదు
ఐనను జాల నజ్ఞానంబు గలదు - తా నెట్టు దప్పునే తమకర్మఫలము?
ఇన్నియు నననేల? యీ శాపమోక్ష - మెన్నఁడు మా? కింక నెయ్యది దెఱఁగు?
ఇప్పుడు దయసేయవే మహాపురుష! - తప్పులు సైరించి దయతోడ” ననినఁ
“దప్ప దమోఘంబుఁదమశాప మనినఁ - జెప్పెడి దొండేమి సెచ్చెరమీరు
పుట్టుఁడు మృగములై భువిని గళ్యాణ - పట్టణాంకితవన ప్రాంతంబునందు
శూలిభక్తుఁడు దెల్గుజొమ్మయ్య యనఁగ - భూలోకపావనుఁడాలింగమూర్తి
చే మీకు మరణంబు సిద్ధించెనేని - కామించు శాపమోక్షంబగు మఱియు
నాయయ్యచేఁ జచ్చునమ్మాత్రఁజేసి - పాయనిముక్తిసంపదయు సిద్ధించు”
ననవుడు నట్లకా కనుచు గంధర్వు - లనురాగమునఁగటకాంతికంబునకు
మృగములై తొల్లింటిమెలఁతలుఁబతులుC- దగిలి యరణ్యమధ్యమునఁజనింప
మదిలోనఁదెలుఁగు జొమ్మయగారి రాక - కెదురుసూచుచునున్న యెడనొక్కనాఁడు
నలరుచు నయ్యరణ్యాంతరంబునను - దెలుఁగు జొమ్మయ్య వత్తిరిఁగోయుటకును
మెల్లన యేఁగఁగ మృగము"లితండ - తెల్లంబు గానోపుఁ దెలుఁగు జొమ్మయ్య
యనుచుఁజుట్టును నిల్చి యఱచుచునెందుఁ - జననీక యరికట్టుకొని నొక్కమృగము
“మరణంబుమీచేత [155] మాకైనఁగాని - కరుణాత్మ! శాపమోక్షంబు [156]దా లేదు
వేడుకమై నిత్యవిధి [157]కైన వేఁట - లాడవే మా మీఁద నఖిలోపకార!
గంధర్వులం దొక్కగార్యకారణము - సంధిల్లి మాకిట్టి శాపంబు వచ్చె”
ననుచుఁదద్వృత్తాంతమంతయుఁజెప్పి - "కనుఁగొన శాపమోక్షం [158]బగుటకును
దా నిక్క మిదియు మీచే నేము సావఁ - గానప్డు దివ్యవిమానము ల్వచ్చి
కొనిపోవుఁగైలాసమునకుఁదత్‌క్షణమ - జనులకు నెల్ల దృష్టప్రత్యయముగ
నరయ శాపంబె మున్నాయయ్య యీగి - వరము గాకిది మాకుఁబరికించిచూడ
నవధరింపఁగఁగల దది యెట్టులనినఁ - దవిలి ము న్నేము గంధర్వ లోకులము

అమలాత్మ! మాకింక నపవర్గపదవి - సమకూరు మీచేతఁజచ్చుటఁజేసి
యదిగాన మమ్ము దయామతిఁజూచి - బ్రదికింపవే” యని ప్రస్తుతింపంగ
నక్షయమూర్తి దివ్యజ్ఞానదృష్టి - నీక్షించి తత్కార్య మిట్లౌట యెఱిఁగి
యరుగుట సాలించి యంతన మగిడి - కరమర్థిఁగొంతవత్తిరిఁగోసికొనుచు
సరసర నసమానశరణాగ్రగణ్యుఁ - డరుదెంచి [159]కనుఁగొని యనురాగలీలఁ
బచ్చనితలచుట్టుఁబచ్చకు[160]ప్పసము - నచ్చెరువుగ విల్లు నమ్ములు వట్టి
నందనవన మరణ్యంబుపై విడియు - చందంబునను సహజక్రియఁబొల్చు
బలువేఁటకాఱు, నాపంచాస్యుమీఱు - చలమును బలమును గలజాగిలములు
దనుఁబరివేష్టించికొని యేఁగుదేర - ననఘుండు జొమ్మయ్య సన నరణ్యమున
సమ్మృగావలి యుబ్బి జొమ్మయ్య మీఁదఁ - గ్రమ్మనఁజనుదేరఁగా వేఁటకాఱు
సడి గేల డుయ్యుడు సారమేయములు - నడర నంకమపోలె విడిపించికొనుచుఁ
బొంగి మనోవేగమునఁగూడ ముట్టి - యంగద మృగముల నార్చుచు వ్రేయఁ
గుక్కలఁ జంకించి కోలల కెగసి - చక్కన జొమ్మయ్య శరముల కెదిరి
చచ్చుచు శాపమోక్షంబులు గాంచి - యచ్చోన గంధర్వులై నిల్చి తెలుఁగు
జొమ్మయ్యగారి పాదమ్ముల కెరఁగి - సమ్మదలీలఁ బ్రశంస సేయుచును
నతనిచే మరణంబు లగుటను జేసి - యతులితాగణ్యపుణ్యప్రాప్తిఁబొంది
ప్రవిమలకనక [161]దివ్యవిమానములను - శివలోకమునకుఁజెచ్చెర నేఁగుచుండఁ
గ్రూరత [162]నెగిదెడు కుక్కల మొఱిఁగి - తా రేయు శరములఁదప్పించుకొనుచు
జొమ్మయ్య చేతన క్రమ్మనఁజచ్చి - యమ్మృగరూపంబు లణఁగి మ్రొక్కుచును
గంధర్వులై కనకవిమానచయము - సంధిల్ల నేఁగు టాశ్చర్యంబు గాదె
“యదె కుక్కలేఁగు నా నంతలోపలను - నిదె పోయెఁబోయెనా నెగసిపోయెడును
ఎప్పాటనైనఁదా రేయుబాణములు - తప్పునే? తాఁకియుఁదాఁక వయ్యెడిని
మృగముల కేనాఁట మించివెలుంగు - గగనంబునను గనకవిమానపంక్తి
మేదినిఁగారణమృగరూపధారు - లాది వీ రెవ్వరో యాతఁడ యెఱుఁగు
నితరుఁడే జొమ్మయ్య యిహలోకరుద్రుఁ - డతులకారణపురుషావతారుండు”
నని తోడివేఁటకాండ్రచ్చెరువంది - వినుతింప నిబ్బంగి వేఁటలాడుచును
నిచ్చటి మృగముల నెరిఁబొలియించి - యచ్చుగా శివపురి కనుపుచు[163] నుండి
యుర్వీశుఁడాదిగా నొక్కొక్క[164]నాఁడు - సర్వజనంబులుఁజనుదెంచి చూడ

హరభక్తవితతియు [165]నరుదెంచి [166]చూడ - "నరు”దని పొగడ జొమ్మయ్య వీక్షించి
“పృథుగురుధ్యాన మన్బిందివాలమునఁ - బ్రథితసంసారమున్ పంచాస్యుఁద్రుంచి
మును భక్తదర్శనం బను ముద్గరమునఁ - జనుపురాకృతకర్మమను దుప్పిఁజంపి
గుర్వాజ్ఞ యనుకత్తి కుంతంబునందుఁ - బూర్వాశ్రమంబను పులిఁబడఁబొడిచి
సుజ్ఞానమను వాఁడి సురియఁ జేపట్టి - యజ్ఞానమను వరాహంబుఁజెండాడి
యాయతి సద్భక్తియను తోమరమున - మాయాప్రపంచ మన్మనుఁబోతుఁ [167]దునిమి
వినుతశివాచారమను కుఠారమున - జినలోకపథమను చివ్వంగిఁజదిపి
విమలప్రసాదమ న్విల్లు పూరించి - భ్రమితేంద్రియము లనఁబడు నిర్లనేసి
భాషాప్రణీతమన్బడు బల్లగోల - నీషణత్రయమను నెలుఁగు కన్నొడిచి
హరమహత్త్వంబను నడ్డాయుధమునఁ - బరవాదులను మృగోత్కరముఁగీటడఁచి
వెలసిన యా [168]బలువేఁటకానికిని - నిలమృగంబులఁజంపు టిదియెంత వెద్ద
యదిగాక పరికింప నరుగుచో నతని - పదఘట్టనలఁ జచ్చు బహుజంతువులకు
నగు మోక్షమనిన జొమ్మయ్యచేఁజచ్చు - మృగము లేఁగుట సోద్యమే శివపురికి”
ననుచు నబ్బసవయ్య యర్థిమైఁబొగడ - ఘనకీర్తిఁ గళ్యాణకటకంబునందుఁ
జోద్యతరంబుగా జొమ్మయ్య సిరస - ముద్యద్గుణాంకుఁడై యుండెఁదెల్లముగఁ
దెలుఁగు జొమ్మయ్య నిర్మలచరిత్రంబు - నలవోకఁజదివిన నర్థిమై విన్న
[169]రాజ్యాభిషిక్తుఁడై రంజిల్లుఁబ్రీతిఁ - బూజ్యత [170]లింగసామ్రాజ్యంబుఁబొందు
సారజంగమపాదసరసిజయుగ్మ - ధారాళమకరందధౌతశిరస్క!
శారదనీరదహారనీహార - తారామరాహారధౌతయశస్క!
యంచితకర్ణరసాయనకల్ప - సంచితపరిపాకసత్యవచస్క!
మహనీయరుద్రాక్షమాలికాభూతి - విహితమండనకాంతి విలసదురస్క!
సంగాఖ్య! సమసుఖసదమలప్రాణ - లింగనిరంతర లీనమనస్క!
ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య - పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోపభోగ - సంగతసుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగఘనకరస్థలి విశ్వనాథ - వరకృపాంచితకవిత్వస్ఫూర్తిఁబేర్చి
చను బసవపురాణమను కథయందు - ననుపమంబుగఁబంచమాశ్వాస మయ్యె.

  1. బ్రహ్మయ
  2. వీరా
  3. బోడూర
  4. విభ్రాజితభక్తి - రసవార్థి ... నిట్టవొడువ
  5. దెవ్వఁగా
  6. బరువడి
  7. మిన్మడైన
  8. పైన
  9. గిడి
  10. గాని
  11. గొనిపోవ
  12. గొఱియ-న
  13. బుత్తు
  14. గొలఁదైతి
  15. సేయ
  16. యెయిది, పలికె, యెఱిఁగి
  17. రాజదియు
  18. వెర్కుడును
  19. యగడితవైచె (దీనినిగూర్చి పీఠికలో చూడుడు)
  20. (నక్కర్మిచుట్టాలుఁ బక్కాలునంత గ్రక్కున బిజ్జలుకడ మొఱలిడుచు)
  21. దొర్లిన
  22. దొర్లినను
  23. వెఱతు-మొ(ప్పఁగో)
  24. బిల్చి
  25. సంపంగనీఁడు వొమ్మనుడు
  26. మగుడిన
  27. గొండె
  28. హర్షంబుయె(నె?)ల్ల
  29. దాసుమయ్యల
  30. లోన
  31. దొల్కాడఁ
  32. యనిపలుక
  33. బిమ్మట(టి)
  34. గ్రీడింపుచుండ
  35. దోఁపమఱియు
  36. భక్తిఁ బ్రణమి
  37. యని నివారింప
  38. నప్పుడ... నట్లుల్ల
  39. ఖ్యాతుఁడై యుం
  40. సంగతశుద్ధ ప్రసాదానుభవుఁడు - స్థైర్యసంపన్నుండు శౌర్యపండితుఁడు - ధైర్యప్రపూర్ణుండవార్యవీర్యుండు - సత్యవచోరాశిశరణాగ్రగణ్యుఁ - డత్యుత్తమోత్తముఁడనభువిఁదనరి - ఇట్లు రెండుమాతృకలందుఁ గలదు.
  41. నే
  42. ముందు
  43. గల్గెనయ్య
  44. దృష్టివో
  45. దృష్టివో
  46. రాలువీఁక
  47. ఁజెప్పుదంటే
  48. నేది?
  49. డేనాటని
  50. వ్యక్తి
  51. దేలి
  52. మి
  53. యుకాక
  54. లు నేల
  55. నడుగకఁ, గొల్వక
  56. బయెశివపూజ - యొ
  57. భువిమముబోంట్లకుఁ బొందంగఁదరమె?
  58. వెల్మిడిలోన
  59. రలకు
  60. లెంకుల
  61. కఱుకువ... నందందమ్రొక్కి
  62. అంజలీ కృతకరకంజుఁడై నేత్ర, సంజనితానంద జలరాశిదొరుగ. ఇది యొక ప్రతిలో నధికముగా నున్నది.
  63. గార్గిన్న
  64. హితప్రాణలింగ
  65. తాలాపసంపదఁదనిపి
  66. విలాసుండు
  67. బార్చినలబ్ధి
  68. లేక
  69. నడికి
  70. బాగొందఁబూసిన
  71. జను
  72. గడిగి
  73. ప్రతిపత్తి
  74. దీర్ప
  75. యడికిన, యడఁచిన
  76. దప్పుఁడు
  77. మమ్ముఁ
  78. పదములుగడిగివే భక్తితో
  79. సువర్ణమైదీపించి
  80. బడగు
  81. చిన
  82. చెంబుచిట్టి
  83. జక్కన
  84. మంతకాటుకయును
  85. పీఁక, క్రొత్త
  86. లేని
  87. లయిండ్లఁ
  88. ములొక
  89. డేడ
  90. కులుదారరిగి
  91. తను
  92. టంతయుఁ గలిగె
  93. నయంతర్థమీనె-య
  94. పురుషుదివ్యావ
  95. నర్కఁబడియె
  96. మున్నున్న, మున్నిటి
  97. పడిన
  98. తదీయా
  99. కుండల
  100. నర్పితంబనుచు
  101. నెల్లను
  102. లసద్వృత్తి
  103. డు భక్తులుగొలువ
  104. చౌడయ్య
  105. ముదముననేఁగ నప్పాట
  106. లేరియుద్ధింప
  107. లువుట్టె
  108. యటె
  109. చెంతనరుగుచు
  110. బదురి, బదమి
  111. నలిరేగి యేడుదినమ్ములువోర
  112. ప్రాఁతినఁ
  113. జూడఁదప్పది
  114. నుడువ
  115. నడరంగవటముపై నలుఁగుసాఁచుడును.
  116. పోత
  117. యంకించి
  118. దృష్టించి
  119. వటము మూర్కొనుచు
  120. పులుగఱనైచుచు
  121. నందెన్న' అనియే కలదు
  122. నీయాన
  123. నందఱి
  124. వ్రంత యిదియేల వెల్లిసూపఁగను
  125. అయ్యెడ
  126. నీర్నడుమవ్రేసినను
  127. లుల్లడి (డింపంగ)
  128. జేసి బహుమాన మెసఁగ
  129. తన
  130. దొలఁగుఁడటంచును
  131. మనుచునాత్రో
  132. కట్టినకట్లప్డు చట్టనఁ దెగఁగ - బిట్టుల్కి నిద్రఁ దెప్పిఱినట్లు వొరలి
  133. రునకు నిలనరు దయ్య
  134. యినుక
  135. దెన్న
  136. తొడఁగూడC(డుపో)టో (తోడుగూడుపో?)
  137. బూడిదె
  138. నదె
  139. బెట్టుదమ
  140. నిన్నటఁ (గూలియు)...యు
  141. యువచ్చెడిఁ, వ్రేసెడిఁజేరి ఇచట “వినరాని శబ్దంబు వినఁగఁ బాడుచును,
    ఘనవిష్ణునామంబు గణుతించి చదువ” అని యొక్క ప్రతియందుఁగలదు.
  142. విడిని, దిగిచి
  143. జళిపించి
  144. రీతు
  145. మర్మ
  146. స్ఫూర్తి
  147. "భక్తజిహ్వాగ్ర - కేయని” అని దిద్దిన గణము కుదురును
  148. బొంగిపొంగి
  149. రూఢి
  150. యారోగిణము
  151. శివభక్తి
  152. కలితుండు
  153. గల్గెనెట్టు?
  154. గంధర్వు- లంతంత
  155. మఱిగల్గకున్న
  156. గా
  157. నీవు
  158. బుగాంచుటకు-మహిమీఁద మీచేత మఱిమృతిఁబొంద - మహనీయ
  159. వేవిన నను
  160. కుబుసము
  161. విమానమ్ములెక్కి
  162. నెగడెడు
  163. నుండె-నుర్వీ
  164. మాటు
  165. ననయంబు
  166. చూచి-య
  167. ద్రుంచి
  168. నెఱ
  169. రాజితభక్తి సామ్రాజ్యంబు నొందు
  170. నభిమతభోగముల్ గలుగు