ప్రాణాయామము/పరాపూజ
పరాపూజ
ఓ ప్రభూ! నిన్నేరీతిని సంతృప్తి పరచగలనా యని ఎల్లప్పుడు తలచుచుందును.
1. గంగానది, నీపాదములనుండియే ప్రవహించుచున్నది. నీ పాదప్రక్షాళమునకై ఏ జలమును తీసికొనను?
2. నీవు ధరించిన వలువ సచ్చిదానంద స్వరూపము గలది, అట్టి నిన్ను ఏ పీతాంబరధారినిగా నొనర్పను?
3. ఓ వాసుదేవా! నీవు సృష్టియందలి సమస్తము (చేతనాచేతనములు నందు వసించియున్నావు. అట్టి నీకు కూర్చొనుటకై ఏ ఆసనము నివ్వను?
4. సూర్యచంద్రులను వారిద్దరు, సమస్త వస్తువులను చూచుటకై నీ కుపయోగ పడుచున్నారు. అట్టి మహాత్ముడవగు నీకు చూచుటకై తుచ్ఛమగు అద్దము నిచ్చుటవలన నేమి ప్రయోజనము?
5. వెలుగు లన్నిటికి వెలుగునిచ్చు మహాత్ముడవు నీవు. అట్టి, నీకు కనిపించుటకై ఏ దీపమును వెలిగించను?
6. అనాహతమందు ధ్వనించుచున్న ఓంకారము ఎల్లప్పుడు నిన్ను (రాత్రింబవళ్ళు) ఆహ్వానించుచుండును. అట్టి నిన్ను ఆహ్వానించి సంతోషపెట్టుటకు ఏ మద్దెలలు, తాళములు శంఖములను ఊదను?
7. నాల్గు వేదములు నీ మహిమను, గొప్పదనమును స్తుతించు చున్నవి. అట్టివాడ వగు నిన్నే పాటలు పాడి స్తుతించను?
8. సమస్త పదార్థములకు రుచినిచ్చు నీకు, ఏ రుచిగల పదార్థమును నివేదించి తృప్తిపరచగలను?