ప్రభావతీప్రద్యుమ్నము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

ప్రభావతీప్రద్యుమ్నము

తృతీయాశ్వాసము

—————



మద్భక్తివిశేష
స్థేమావిశ్రాంతవిహితశివతత్త్వకథా
మీమాంసుఁడు పింగళియమ
రామాత్యవతంసుఁ డపరహంసుఁడు దీప్తిన్.

1


వ.

హరికుమారుం డొక్కనాఁ డేకాంతవర్తియు హస్తవిన్యస్త
గండస్థలుండు నగుచు ని ట్లని తలపోయం దొడంగె.

2


చ.

కలుగునొకో కనుంగవకుఁ గొంతఁ గనుంగొను భాగ్య మెక్కడన్
గలిగెడుఁ దత్పురంబు చొరఁ గల్మియ దొడ్డఁట చొచ్చి చూడఁగాఁ
గలిగిన నవ్విలాసవతిఁ గౌఁగిటఁ జేర్పక యోర్చు టెట్లు నా
తలఁపుబడిం దదాత్మయును దార్కొన కె ట్లది సంఘటిల్లెడున్.

3


చ.

శుచిముఖమాట యొం డరసిచూడఁగ నెంతయు నాసపా టొన
ర్చుచు మదిఁ ద్రిప్పుచున్నయది చూడ్కికి నన్నునె పోలువాని నా
రుచిరతరాంగిచిత్తరువురూ పొకటిన్ రహిఁ జూడఁ జెప్పెఁ ద
ద్వచనముచొప్పు నేమి నియతంబు సమాకృతు లెందుఁ గల్గవే.

4


చ.

ఇది పదిలంబుగా నడుగ కే నపు డక్కట కోర్కి దాచి వ
ట్టిదొరతనంపునీటు ప్రకటించితిఁ బాపపులజ్జ నన్ను నో

రదిమె ననాదరంబు తెఱఁగై యది హంసికిఁ దోఁచెనేమొ ని
ల్వద మఱి యించు కైన గరుప ల్చవిగానికథ ల్వచింతురే.

5


ఉ.

ఏ నొకయించుకంత మనసిచ్చినమాటలు పల్కకుండఁగాఁ
గాని మరాళి యద్దనుజకన్యకకైనను నొత్తి చూచి యే
మైన ననంగఁ బూను నని యాత్మకుఁ దోఁచుచునున్న దిప్డు కా
దేని ప్రసంగముం దిగిచి యేల నుతించుఁ దదీయరూపమున్.

6


.

అటుగా కద్భుతరామణీయకగుణాఢ్యం బైనసద్వస్తువున్
బటువాచారసికు ల్ప్రసంగమయినన్ బారంబు ముట్టన్ రసో
త్కటతం జెప్పక మానఁజాల రనుపక్షం బొండు భావించినన్
ఘటియిల్లు న్వనీతాంగవర్ణనకు నిక్కం బన్యథా సిద్ధియున్.

7


చ.

హరియును వాసవుండుఁ దము నంపినకార్యము హంసితానయై
ధరణికి డిగ్గి చెప్ప మదుదగ్రమనస్థితిఁ గాంచు టెన్న నా
సురరిపుఁ జంప నన్ననుపుసుద్దులు పుట్టఁగఁ బోలు నెల్లెడన్
సరసిజనేత్రుదక్షిణభుజంబవు నీ పని పల్కినందునన్.

8


ఉ.

అన్నియు నేకవాక్యముగ నారయ నాసలు పెంచుపక్షమే
యున్నది కొంత మించి యిది యోజన సేయఁగ నాదురూపె యా
కన్నియచేతిచిత్రఫలకంబున నున్నది యెవ్వ రట్టిచో
నన్ను నెఱింగి వ్రాయననినన్ శివ వ్రాయుట వింటిఁ జొప్పడన్.

9


సీ.

శివ నన్నె వ్రాసియిచ్చినపక్షమునను లే
            ఖననిమిత్తము వేఱ కలుగు నొక్కొ
కలుగ దంతఃపురకన్య కిట్టిది భర్తృ
            పరతఁ దక్క ఘటిల్లు టరుదు గాన
నది యట్ల యైనను దదభీష్టయువపరీ
            క్షామాత్రఫలకమై జాఱు నొక్కొ

జాఱ దీశ్వరి యిచ్చె సత్కృప నని బాల
            వేడ్కఁ జూచుటఁ జెప్ప వింటిఁ గాన


తే.

నిట్టిగతిఁ జెల్వ కుమ వెడ్డు పెట్టు నొక్కొ
పెట్ట దది దా సృజించినబిడ్డ గాన
బొం కగుచు నంత కిదియ త్రోపువడు నొక్కొ
పడ దజుఁడు చెప్పె నని వినఁబడియెఁ గాన.

10


చ.

మును తనసృష్టికామి నలుమోములవేలుపు చెప్పవింటి నే
ననుచు మరాళి పల్క నపు డక్కట యే నడుగంగ లేన యే
మని ననుఁ దిట్టుకొందు నజుఁ డట్టిప్రసంగపువేళ నవ్వరా
ననకు విభుం డితం డతఁ డనన్ వినఁబడ్డది యేమి గల్గెనో.

11


ఉ.

వావిరి నవ్విలాసవతివార్తలపట్టున నేన్ని యెన్ని ప్ర
శ్నావసరంబు లైన నొకయర్థము నే నడుగంగ లేమి ని
చ్ఛావిముఖుం డితం డని ప్రసంగము వచ్చిన నూరకుండునే
మో వరటాలలామ యిఁక ముద్దియసన్నిధి నేమి సేయుదున్.

12


ఉ.

పోవునొకో సరోజముఖిపొంతకు నింకొకమాటు హంసి దా
నావలనం దదిష్టవచనం బొకటే గొనిపోవఁ గానమిన్
బోవుట నిష్ఫలం బనుచుఁ బోకయె మానునొ కాక పోవునో
దైవతకార్యభారమును దద్వశ మైనది కొంత గల్గినన్.

13


క.

తరుణికడ కంచ యేగతి
నరిగిన నాస గల దది మహామతి నాయం
తరగతిఁ గనదే వినదే
ధర నప్రతిషిద్ధ మనుమతం భవతి యనన్.

14


క.

ఏపనియు లేక యుండిన
నాపడఁతుకఁ జూడఁ జనక హంసి నిలువ నె

ట్లోపెడును దానిఁ జూచిన
జూపఱకును వశమె తిరుగఁ జూడక యుండన్.

15


క.

అని భావనాబలంబున
మనమున ఘటిత మగుమగువ మధురాకృతి య
క్కునఁ జేర్పఁ గడఁగి తత్తఱ
మునఁ గానక వెగడుపడుచుఁ బొదలు విరాళిన్.

16


వ.

ప్రొద్దు గడపుట తద్దయం భరం బగుడు నుద్యానంబునకుం
జనియె నప్పుడు.

17


సీ.

నిబిడంపుజిగితోడ నిండుపూగుత్తులు
            బిగువుపాలిండ్లయొప్పిదము నెరప
నునుఁగెంపు గ్రక్కునూతనపల్లవంబులు
            కరతలంబులసోయగంబుఁ దెలుప
నెలమిఁ బర్వెడునట్టియెలదీఁగియలసొంపు
            సుకుమారబాహువిస్ఫురణ జరుపఁ
గడుఁ బేరెములు వాఱు గండుఁదుమ్మెదచాలు
            కడకంటిచూపులబెడఁగు నడప


తే.

విరుల తెలిడాలు చిఱునవ్వుసిరులఁ జిలుక
మధురసపునిగ్గు లావణ్యమహిమ గులుక
నతనిచూడ్కికిఁ జూడ నుద్యానభాగ
మంతయుఁ బ్రభావతీమయం బగుచుఁ దోఁచె.

18


ఆ.

యువతిపై విరాళి యొక్కింత మఱతునో
యనుచు నాస నేఁగి యచట నతఁడు
మఱచెఁ దదితరంబు నెఱయంగ నిది సుమీ
యొకటి కోర వేఱ యొకటి యగుట.

19

వ.

అతం డివ్విధంబునం బ్రభావతీవిభ్రమభ్రమవశంబున లత లతఁ
దప్పకుండఁ గదియం జనుచు.

20


సీ.

తరుణికెంగే లంచుఁ దమిఁ బట్టి కటకటా
            చిగురాకె యిది యంచుఁ జిన్నవోయి
వెలఁదిపాలిం డ్లంచు వెస నంటి చెల్లఁబ్రో
            పూగుత్తులే యంచుఁ బొలుపు దఱిగి
చెలువపయ్యెద యంచుఁ జేసాఁచి యయ్యో ప
            రాగోదయమె యంచు రహి దొఱంగి
రమణివేనలి యంచు రతికాంక్ష నొడిసి హా
            తేఁటిమొత్తమె యంచుఁ దెల్లఁ బాఱి


తే.

యకట యనిమిత్తకృపఁ దాన యరుగుదెంచి
హితవు నెరపెడిహంసితో హృదయ మిచ్చి
పలుకనికృతఘ్నునకు నాకుఁ బ్రాప్త మగునె
యట్టియువతిపొం దనుచుఁ దా నాత్మఁ గుందు.

21


వ.

అంత నంతర్గతంబున.

22


తే.

ఉవిద నాకుఁ బ్రాపించు టటుండ నిమ్ము
హంసి యిఁక నొకమఱి చూడ నబ్బునేని
నాదుకన్నులు కన్ను లెన్నంగ నేన
యగ్రగణ్యుండ ధన్యాత్ములందు నెల్ల.

23


ఆ.

వచ్చునొకొ సురారివార్త చెప్పఁగఁ దాను
వచ్చి కడలఁ బోక యిచ్చటికిని
దెచ్చునొకో ప్రభావతీక్షేమవృత్తాంత
మాత్ర మయిన నంచమగువ నాకు.

24

చ.

వినుకలిచేతనే విరహవేదన నామది నింత వర్ధిలెన్
గనుకలి నిట్లు చిత్రఫలకంబునఁ గాంచినయింతి నెమ్మనం
బుసఁ గడు నింత కెంత పరిపూర్తి వహించునొ ఎంత నొచ్చునో
ఘన మని వింటిఁ జిత్తరువుఁ గన్గొనుప్రేమయు నేమి సేయుదున్.

25


ఆ.

అందుమీఁద హంసి యరిగి నాతోడఁ దా
మాటలాడుటయును మద్విధంబుఁ
దెలుప నాస లేమి దలపోసి యె ట్లౌనొ
చెలువ యకట యేమి సేయువాఁడ.

26


మత్త.

అంచతొయ్యలి దేవతాపతియానచొ ప్పొసరించి యే
తెంచు టెన్నఁడు దానిచేత మదీయహృద్గతిఁ జెప్పి యేఁ
బంచు టెన్నఁడు గావున న్వెసం బత్రికన్ లిఖియించి యా
యంచ కిప్పుడు పంచెద న్సతి కంత దెల్పెడు నట్లుగాన్.

27


వ.

అని తలంచి యాక్షణంబ శుచిముఖపేర లేఖ వ్రాసి యిది
గొంపోవువా రెవ్వ రని నివ్వటిల్లెడుచింత నంతరంగంబు
గలంగ సుద్యానమధ్యంబునకుం గ్రమ్మఱ నరుగుదెంచి
యత్తఱి నుత్తరంబు చనువాని నెల్ల నుద్దేశించి తద్దయు
దుర్దమం బైనవిరహార్తికతన వార్తాహరణయోగ్యాయోగ్య
వివేకంబు లేక యి ట్లనియె.

28


సీ.

కృప నెఱిఁగింపరే కీరోత్తమములార
            వజ్రపురికిఁ బోవువారె మీరు
సదనుగ్రహమునఁ దుమ్మెదలార చెప్పరే
            వజ్రపురికిఁ బోవువారె మీరు
కరుణతో వినిపింపఁ గదరె కోయిలలార
            వజ్రపురికిఁ బోవువారె మీరు

తెలుపరే దయఁ జూచి మలయవాయువులార
            వజ్రపురికిఁ బోవువారె మీరు


తే.

చలువ లొసఁగెడు మేఘరాజంబులార
యమలపక్షత నొప్పు రాయంచలార
నిలిచి నామాటలకు మాఱు పలుకరయ్య
వజ్రపురికిని బోయెడువారె మీరు.

29


క.

అని పలుకుచున్న సమయం
బున నొకశుక మభ్రమార్గమున నేఁగుచు నా
తనిదీనాలాపంబులు
విని కారుణ్యమున నిలిచి విస్ఫుటఫణితిన్.

30


ఆ.

ఏను వజ్రపురికి నేఁగెడుదాన నా
వలనఁ గార్య మేమి కలదు నీకుఁ
దెలుపు మొకటిరెండుపలుకుల ముగియఁగా
ననుచుఁ బలుకుటయును యాదవుండు.

31


సీ.

ఓపక్షివర విను మాపురి శుచిముఖి
            యనుపేరి యొకరాజహంసి యుండు
నది యున్నచోటు నీ వరసి యీపత్రిక
            యందింపవలయు మత్ప్రార్థనమున
నన విని యాచిల్క యట్ల చేసెద సహా
            యంబు పోయెద మాట లాడ నాకు
లే దవకాశంబు లేశమాత్రంబును
            నాదుపక్షంబులనడుమ లేక


ఆ.

యొరుల కెఱుకపడక యుండునట్లుగఁ గట్టు
మతిరయంబుతోడ ననుచు నతని

దండ కరిగి నిలిచెఁ దడయ కాతఁడు నట్లు
చేసె నదియుఁ జనియె శీఘ్రగతిని.

32


వ.

అంతకు మున్ను శుచిముఖియును నుచితప్రకారంబున నట్లు
తనబలఁగంబునుం దానును దానవాంతఃపురకామినీసమీప
సంచారపరిచయంబు సంపాదించుకొనుచుం గ్రమంబునం
బ్రభావతితోడి చెలిమి గలిగించుకొనుటకుఁ దఱి వేచియుండుఁ
గావున నది గనిపట్టుకొని యుండ నొక్కనాఁ డక్కలకంఠి
తొంటిసరసిపరిసరంబునం దమందకందర్పతాపశమనార్థంబుగ
రాగవల్లరి యను నెచ్చెలియుం దానును వచ్చి వనవిహా
రంబు సలిపె నప్పుడు.

33


సీ.

అతివమందస్మితద్యుతిప్రసాదంబున
            విరులపాండిమ యభివృద్ధిఁ గాంచె
సతికటాక్షశ్రీలసాహాయ్యకమునఁ దు
            మ్మెదపిండుచెలువ మభ్యుదయ మొందె
జలజాక్షికరతలచ్ఛనియనుగ్రహమునఁ
            జివురుఁగెంజాయ పుష్టిని వహించెఁ
దరుణినిశ్శ్వాసగంధముప్రోది మలయవా
            యువులనెత్తావి వైభవము చెందె


తే.

నవి లతాంగికిఁ దోడ్తోన యార్తిఁ బెనఁచెఁ
బాటిలదె రజోమాలిన్యపల్లవత్వ
చాపంబుల కాధార మై పరఁగెడు
వారికిని మే లొనర్చినవారి కెగ్గు.

34


సీ.

విరహిరక్తముతోడి మరునిబల్లెము లన
            నెల్లెడ విలసిల్లుపల్లవములుఁ

బాంథమేదస్స్నేహభరితకామాస్త్రాళి
            నా నొప్పుసరసప్రసూనములును
భావజుమిడివింటఁ బాఱునీలపుగుండ్ల
            భంగిఁ జరించుపుష్పంధయములుఁ
జేతోజబలసముద్ధూతధూళి యనంగ
            రాజిల్లుసుమనఃపరాగములును


తే.

నసమసాయకజయబిరుదావళీప్ర
పాఠకరవందిజనఘనార్భటి యనంగఁ
గడు విజృంభించుశుకపికకలకలమును
నెలఁతకును గుండెదిగులు జనింపఁ జేసె.

35


వ.

ఇవ్విధంబున నయ్యింతి తంతన్యమానకంతుసంతాప యగుచు
రాగవల్లరిం జూచి యి ట్లనియె.

36


మ.

అకటా యిట్టిది ప్రొద్దు పుచ్చుట కుపాయంటే నిరోధంబ కా
క కడుం జాలు వనాంతఖేలన మిఁకం గన్నార మత్ప్రాణనా
యకురూపంబును జూచుచుండుటయె మే లామీఁద భావ్యర్థ మం
బిక యొక్కర్తె యెఱుంగుఁ దత్ఫలకమున్ బింబోష్ఠి తేవే వెసన్.

37


వ.

అని తెప్పించి యప్పలకయందు నాత్మసంకల్పవాసనావిశేష
వశంబున ననేకవిధశృంగారభావచేష్టావిశిష్టతం గనుపట్టు నట్టి
లిఖితరూపయదుకులప్రదీపు నెదుర నుండియుం గ్రేడించియు
నిర్నిమేష యయ్యు నిమీలితాక్షి యయ్యుం గొంతతడ
వనేకభావంబు లావహిల్లం జూచి చూచి.

38


చ.

అనయముఁ దృప్తిగావలయునంచు నజస్రము నెంత చూచినన్
గనుఁగవ కంతకంతకును గాటముగా నొకవింతవింతయిం

పు నెరపుచున్ననుం దరలిపోవఁగ నీ దిఁక నోర్వఁజాల నే
ననుచు రసోద్ధతిం గదియ నక్కునఁ జేర్చె నిజేశురూపమున్.

39


తే.

చేర్చి యొక్కింతతడవు నిశ్చేష్ట యగుచుఁ
జొక్కి కనుఁగవ యరమోడ్చి శోభనాంగి
యంతఁ జిత్రరూపత మదియందుఁ దోఁపఁ
గమ్మఱఁగఁ బుచ్చి కనుఁగొంచుఁ గాంక్ష లడర.

40


ఉ.

ఇట్టిమనోహరాంగుఁ డొకఁ డెందయినం గలఁడేని గల్గియుం
గట్టిగ నా కతండు బిగికౌగిటఁ జేర్పఁగ నబ్బునేని నే
నిట్టటు గొంచిన న్విడక యిష్టవిహారము లెల్లఁ గాంక్షఁ జే
పట్టి యొనర్చునేని రసభావము లెట్టివి యొక్కొ యత్తఱిన్.

41


క.

అని యువ్విళ్లూరుచు మది
ననయముఁ దలపోయు నుస్సు రనుఁ గాంతాళం
బునఁ బొరలు నిట్లు విరహం
బున కోర్వక యవ్వధూటి బోటం బలికెన్.

42


క.

ఉమసేవ యేను సలిపెడు
సమయంబునఁ గర్తృకర్మసాధనవైగు
ణ్యము లేమి గలిగెనో యి
ట్లమితవ్యధఁ దెచ్చి పెట్టె నాయమ నాకున్.

43


క.

ఇటు గాక లోకముల నిం
తటి చెలువుఁడు గలఁడె గలిగినను సుబ్బదె యి
చ్చట నచ్చటఁ గలఁడని య
కట న న్ని ట్లేచు టంబకరుణ తెఱంగే.

44


సీ.

అని పల్కుపలుకు లాయవసరంబునఁ దత్స
            మీపంబునం దనురూపగతిని

శుచిముఖ సంచరించుచు విని యిత్తన్వి
            చిత్తంబు వడసి యేఁ జెలిమికలిమి
హత్తించుకొనుటకు ననుగుణం బగువేళ
            యిదియ యటంచు నూహించి మదిని
దగునుపాయంబు వితర్కించి యపుడు య
            దృచ్ఛనపోలె నా తెఱవయెదుట


తే.

నడ్డముగ నల్లనల్లన యరుగుచు సవి
మర్శదృష్టినిఁ బలుమఱు మరలి మరలి
చిత్రఫలకంబువంక వీక్షించెఁ గొంత
సరిగడచుదాఁక నొక వింతసరణి మీఱ.

45


క.

అపు డమ్మరాళిచందం
బుపలక్షించుచుఁ గపోలయుగ్మము దరహా
సపుఁగాంతిఁ దనరఁగా నా
చపలేక్షణ తనదుప్రాణసఖి కి ట్లనియెన్.

46


క.

కఱదులపులుఁ గిది తా నే
మెఱుఁగునొకో తిరిగి తిరిగి యీఫలకముపైఁ
బఱపెడుఁ జూడ్కుల నా నా
మెఱుఁగుంబోఁడికి మరాళి మృదుమధురోక్తిన్.

47


వ.

ఇ ట్లనియె నోపడంతీ నీ పలికినట్ల మాయట్టితిర్యగ్జంతువు
లేమియు నెఱుంగమి యథార్థంబ యైనను నేను నీచేతి
చిత్రఫలకం బబ్రపడి చూచుటకుఁ గారణంబు వినుము
మున్నొక్కచోట నొక్కపురుషుం జూచి తత్సమానరూపుని
మఱి యెందునుం గానక యిప్పుడిందు నతనికైవడి దోఁచిన
నిది తదీయరూపం బెఱింగి వ్రాసినతెఱంగో యటు గాక యట్టి

వాఁడె వేఱొక్కఁ డెక్కడ నైనం గలిగెనో యని యించుక
విమర్శించి వీక్షించితి నన విని ప్రభావతి యద్భుతప్రమోద
సందేహంబులు డెందంబునం గ్రందుకొనుచుఁ గందళింప
నప్పులుగుం దప్పక చూచి యి ట్లనియె.

48


శా.

ఏమేమీ యిఁకనొక్కమాటు చెపుమా యీవున్నరూ పిట్లయో
యే మైనం గలదో విభేద మిట ర మ్మీక్షింపు మింకన్ వచ
స్సామర్థ్యం బరయన్ మహాత్మ వని యస్మద్బుద్ధికిం దోఁచె దా
హా మాభావము గానలేవె మదిలో హంసీ భయం బేటికిన్.

49


వ.

అనిన నది మదిరాక్షి నీక్షించి యి ట్లనియె.

50


క.

నీ వనినయట్ల యేను భ
యావహులను గానివారి నాకృతిన కనం
గా వలఁతి నైనఁ బిలువక
యే వెఱ్ఱినె చేర నిరువు రేకత మాడన్.

51


వ.

అనిన వెఱఁగంది యాయిందుముఖి సఖియునుం దానును
నొండొరులమొగంబులు చూచి నగుచుఁ జెవులకుం జవులు
మివుల నలవరించు గులుకుటెలుంగు గలకలికిపలుకులకె
వలచి మొలచుకుతుకంబున నతివశంవదహృదయ లై తమ
కిద్దఱకుం దాని పెద్దబుద్దులు సుద్దులు ముద్దు రప్పించుచుం
దద్దయు నుద్దీపితరాగంబు లగుచుండ రాగవల్లరి యాగఱు
వతనంబులాగు లేగరితలందును మున్ను కన్నవిన్నయవియె
దీనికఱదు లెంతయరుదులు చూచితే యంచు నాయంచపై
నాదరాహ్లాదమేదురనిరీక్షణంబుల నీక్షించి యోపక్షికుల
భూషణంబ నీభాషణంబు నిక్కంబ మిక్కిలి నక్కఱ పడి

వేఁడక ప్రోడ లగుగఱువ లిరువు రేకాంతమాడుచోటి
కేటికిఁ బోయెద రిది యట్లు గాదు గదా యే మొక్కసంది
యంబు నివర్తించుకొనం గోరి యిత్తఱి నత్యంతప్రార్థనంబు
గావించుచున్నవారము గావున నీకన్న యప్పురుషుని
యొప్పు నిప్పలుకపై వ్రాసినరూపంబుచొప్పు నొక్కటి
యగునో కాదో యీదండకు వచ్చి నిచ్చలంబుగాఁ జూచి
నిశ్చయించి చెప్పు మిప్పడుచు నేను నిట్టివాఁ డెందును లేఁడు
కలఁ డనువివాదంబునం బన్నిదంబు చఱచినవారము.

52


క.

అనుటయుఁ బందెముకొఱకై
నను వేఱొకపనికినైన నా కది తెలియం
బని గలదె మీకు నాచే
వినవలసినయర్థ మరసి వినిపింతుఁ దగన్.

53


తే.

అనుచు శుచిముఖి తనమాట కాపడంతు
లీక్షితాన్యోన్యవదన లై యెంతదూర
మరుగుచున్నది దీనివాక్యాశయ మని
మివుల వెఱఁగందఁ గొంతచేరువకుఁ బోయి.

54


క.

సవిమర్శదృష్టి నాటిత
కవిధాన మొకింత నడపి కడుఁ బదిలముగా
వివరింప నతనిరూపము
యవు నౌ నది యిందు సందియము లే దనియెన్.

55


చ.

అనుటయు రాగవల్లరి మహత్తరమోదవిశేషసంభ్రమం
బునఁ బఱతెంచి యప్పులుఁగుముద్దియఁదద్దయు ముద్దుగారవం
బును జిగురొత్త నెత్తుకొనిపోయి ప్రభావతిదండఁ బెట్టి యొ
య్యనఁ గొనగోళ్లఁ దత్తనురుహంబులు దువ్వుచుఁ గూర్మి నిట్లనున్.

56

ఉ.

అంచవు గావు నీవు నను నారసి ప్రోవఁగ మూర్తిమత్త్వముం
గాంచిన భాగ్యదేవతవు గాని మదుక్తితెఱంగు నేఁడు గె
ల్పించితి వేజగంబునను లేఁ డిటువంటి మనోహరాంగకుం
డంచుఁ గలంచు నిజ్జలరుహానన మానక నాదుచిత్తమున్.

57


వ.

అనిన విని ప్రభావతి నిజవయస్యం జూచి.

58


తే.

రాగవల్లరి నీ వేల వేగిరించె
దింతమాత్రంబ చాలునే యీప్సితార్థ
సిద్ధి కతనిలక్షణము లీచిత్రమూర్తి
యందు నేమైనఁ గల వేమొ యడుగవలయు.

59


వ.

అనిన విని యాహంసి యాచిత్రరూపంబు నిరూపించి ప్రభా
వతి నుద్దేశించి యి ట్లనియె.

60


ఉ.

ఆరయ నింక నే మడిగె దల్లవె యాతఁడు శంబరుం ద్రిలో
కారిని ద్రుంచునప్పటిప్రహారకిణంబు లురంబునందు నా
హా రతికంకణాంకములు నల్లవిగో మెడయందు వీరశృం
గారకళాఢ్యు ని ట్లతని గట్టిగ నెవ్వ రెఱింగి వ్రాసిరో.

61


వ.

ఈలక్షణకథనంబుచేత నతనినామజాత్యాదు లత్యంతప్రసి
ద్ధంబులు మీరు మీయంతనె యెఱింగెదరు గావలయు
నంతఃపురవాసినులు గావున నెఱుంగరో యని యెఱింగిం
చెద నంటినేని.

62


చ.

ఎనయఁగ నెవ్వ రెంతమన సిచ్చి వచించిరి తాను వారితోఁ
బనువడనంతమాత్ర ప్రతిభాషణ మాడుట యుక్త మండ్రు మీ
కొనరఁగఁ బన్నిదంపుగెలుపోటలు దీర్పఁగ నిప్పుడేను జె
ప్పినదియ చాలు నింకఁ దలపెట్టుట చెల్లద యెక్కు డేమియున్.

63

తే.

నీవ కద ప్రభావతి యన నిన్ను మున్ను
తరుణి నే వింటి రాగవల్లరియె బోటి
పేరు నీ విపు డన వింటి మీ రిరువురు
నీ యెఱుక మఱచెదరు సూ పోయి వత్తు.

64


ఉత్సాహ.

అనుచు గగనభాగమునకు నంచ యెగయఁజూచిన
దనుజకన్యకాలలామ తనదు రెండుచేతులన్
వినయ మొప్పఁ బొదుగఁ బట్టి వేన వేలుభంగులన్
దనరఁ బ్రియము జెప్పుచును ముదం బెలర్ప నిట్లనున్.

65


సీ.

నిద్దంపుఁబండువెన్నెల గాయుఱెక్కల
            యొప్పు చూడఁగ నొక్కయుత్సవంబు
మెఱుఁగుఁదీఁగెలబాగు మించుపక్షాంతహా
            టకరేఖ లరయ నొండొకప్రియంబుఁ
గమనీయ మగుమహాగమనగాంభీర్యాది
            విలసనం బీక్షింప వేఱె యింపు
మాధుర్యధుర్యకోమలవచనామృతం
            బనుభవింపఁగఁ గౌతుకాంతరంబుఁ


తే.

గలుగఁ జేయుచు నువ్విళ్ళు గొలుపునీదు
సంగతి యొకింత గని యెట్లు జాఱవిడుతు
నింక రాగవల్లరి పేరు నీవు నిజము
ననఁగ నీతో నొనర్తు నెయ్యంపుఁజెలిమి.

66


ఆ.

ప్రణయ మొప్ప మిగులఁ బ్రార్థించుచున్నట్టి
న న్ననుగ్రహించి నాదుచెలిమి
కొడఁబడంగవలయు నోహంసభామినీ
యనుచు వేఁడుకొనఁగ నంచ పలికె.

67

ఉ.

ఇప్పుడు నీవు చెల్మికిని హేతువు గాఁగ గణించినట్టినా
యొప్పును గిప్పుఁ దా నెచట నుండు రహస్యవిచారవిఘ్న మౌ
టెప్పుడు నీకుఁ దోఁచె నపు డింతయు రోసెదు దీనిచేత మీ
యిప్పటిమంతనంపుఁబని యేమఱ కంపుఁడు పోయి వచ్చెదన్.

68


వ.

అనిన విని రాగవల్లరి హంసీమతల్లికం జూచి యిట్లనియె.

69


క.

పోయెదఁ బోయెద నం చి
ట్లోయంచలతల్లి యేల యుడ్డాడింపన్
మాయేకాంతపుఁబనికిని
నీయునికి విరోధి గాదు నిర్వాహకమున్.

70


వ.

ఇదే నిమిత్తంబుగా సఖ్యంబు గావలయు నని ప్రార్థించెదము
గాని కేవలంబైన తావకరామణీయకంబునన కాదు నీదు
పలుకుందెరువులు పరికింప నిది నీవును దెలియుట విస్పష్టంబ
యైనను శుద్ధాంతస్థితిదోషంబునం జేసి యే మయి యీ
మాట మాటు పెట్టక గొబ్బునం జెప్పనేరకున్నవారము
చెప్పి వేఁడికొనక యేపనికిని నీవు చొరమి మొదలన పది
లంబుగాఁ దెలిపినదానవు గావున.

71


ఉ.

వట్టిమఱుంగుఁ బెట్టి నుడువం బని లే దది యెల్ల భేరి జో
కొట్టుట కాక ని న్గెలువఁ గూడునె మాటల నీవు గంటి న
న్నట్టిశుభాంగుఁ డీరమణీయాసల కాస్పద మిప్పు డాతని
న్గట్టిగ నన్వయాదికథనంబునఁ దెల్ఫి యనుగ్రహింపవే.

72


తే.

ఇప్పు డిది చెప్ప కెడ సేయు టీలతాంగిఁ
బ్రాణసంకటపఱుచు టోపక్షిరమణి
కావునను గావవలయు శీఘ్రంబ చెప్పి
వెనుక నెఱిఁగింతు నీకు మావృత్త మెల్ల.

73

వ.

అనిన శుచిముఖ వచనవక్రత చాలించి యి ట్లనియె.

74


ఉ.

అంతిపురంబుకన్యలఁట యాత్మతెఱం గభిధాప్రయుక్తి నొ
క్కింతయు నేర్పరింపరఁట యి ట్లన ని ట్లని నాకు నాకె య
ర్థాంతరము ల్గడించుకొని యంజకయెట్లు యువస్తుతు ల్ప్రపం
చింతునటంచు నుంటి నిఁకఁ జెప్పెద మీరలు గుట్టు దెల్ఫుటన్.

75


వ.

అని పలికి ప్రభావతిం జూచి నీకు మనోహారి యైనయాపురుష
రత్నంబు తెఱంగు విను మని యి ట్లనియె.

76


క.

భారతవర్షమునందున్
ద్వారక యనుపురము గలదు తద్వర్ణన వా
ణీరమణున కైనను దు
ష్పార మపారము సమస్తసౌభాగ్యములన్.

77


ఆ.

ఏను దానిమహిమ నా నేర్చినంత వ
ర్ణింతుఁ గొంత యని తలంతు నేని
నీవు ప్రకృతయువకథావిలంబమునకు
నోర్వ వేమొ యది యటుండనిమ్ము.

78


క.

నా విని నీ కిది చెప్పం
గా వలయునె యెందు మిగులఁ గతరాజవు నీ
వోవరటారత్నమ యని
యావనితలు నవ్వ నవ్విహగి యి ట్లనియెన్.

79


ఉ.

ఆనగరంబునన్ యదుకులాభరణం బగుమర్త్యజన్మమున్
బూనినసర్వభద్ర పరిపూర్ణుఁడు కేశవుఁ డుండు నాథుఁడై
యానలినాక్షు పోడశసహస్రవధూప్రియు మిక్కిలి న్గుణ
శ్రీ నలరించి యష్టమహిషీజను లెంతయు మింతు రున్న తిన్.

80

ఆ.

అందు నగ్రగణ్య యై యొప్పు రుక్మిణీ
నామధేయ యొకతె యామగువకుఁ
బట్టి యొకఁడు గలఁడు ప్రద్యుమ్ననాముఁ డా
యనఘురూప మిది సుధాంశువదన.

81


ఉ.

శౌర్యమయుం డతండు భుజసత్త్వనిధానము కాంతిరాశిగాం
భీర్యపుఁబ్రోక సత్కళల పెన్గని రూపము దాల్చినట్టి యౌ
చార్యము పెక్కులేటికి నుదాత్తగుణోదయ మాయపూర్వసౌం
దర్యత కెంత యెంత యుచితం బగు నంతయుఁ గల్గి శోభిలున్.

82


వ.

అని చెప్పిన.

83


శా.

సంతోషం బపు డాత్మఁ బిక్కటిలుచున్ సర్వంకషంబై శరీ
రాంతర్భాగముఁ బట్టఁ జాలక నిలింపారాతిరాట్నన్య క
త్యంతంబు న్వికసిల్లఁ జేసె ముఖపద్మంబు న్ద్రపాశిక్షఁ ద
త్కాంతారత్న మొనర్చునట్టి యపహిత్థాయత్నము న్మీఱుచున్.

84


మ.

ప్రమదం బొప్పఁగ రాగవల్లరియు నాపద్మాననం జూచి చి
త్రము నీకిచ్చిన దేవివాక్యమునకున్ దార్కాణగా నామజ
న్మములు న్వింటిగదమ్మ తద్వసతియున్ సంసిద్ధి యయ్యెంగదా
కమనీయం బగునీమరాళికృప నింక న్మాను మాందోళమున్.

85


వ.

ఇమ్మరాళబాలిక యాలాపచాతుర్యంబు చూడఁ గడమకా
ర్యంబును సాధించి పెట్టునట్టి దిట్టతనంబు గానిపించుచున్నది
మొదలనుండియు సకలకళల సడిసన్నఁ జదురులప్రోదిఁ
బెరిఁగినది గాఁబోలుఁ గాలిపెండెరంబు నొక్కటి గలిగి
యున్నది యని తదక్షరంబు లీక్షించి చదువుకొని యాబిరు
దంబునకు నరుదుపడి యాహంసివలనం దజ్జన్మనామవిద్యా

భ్యాసాదులు విని మనంబునం గడు ముదం బందుచుం
బ్రభావతిం జూచి యోచెలువ మనకొదవ లన్నియుం
దీర్చుటకు శరణం బింక నిదియకాని వేఁ ఱొండు గాన మని
పలికి యావులుఁగుఁజెలువకుం దనచెలికత్తె కలతెఱంగు
సకలంబునుం జెప్పి తదాది గా నప్పటితుదకు ముదిత కొద
వినమదనావస్థ లెల్ల సవిస్తరంబుగా వినిపించి యింతకుం
దెల్లంబుగ నీపల్లవాధరయాకారంబు పరికించి చూడు మని
యి ట్లనియె.

86


సీ.

నెలఁతముక్కరయందు నీలంబు గాదు సూ
            తెలిదళుకొత్తుముత్తియము గాని
యువిదసందిళ్ల బాహుపురులు గావు సూ
            మితి చూడ నిడినయూర్మికలు గాని
సుదతిపాలిండ్లఁ గస్తురినల్పు గాదు సూ
            కనుదోయికాటుకకప్పు గాని
రమణికర్ణికల వజ్రపుదీప్తి గాదు సూ
            ప్రాఁగెంపుఁదునుకలరంగు గాని


తే.

యూర్పువేఁడిమిఁ గృశత బాష్పోదయమున
గండపాండిమఁ దత్తత్ప్రకారములను
గానఁబడియెడు నోవిహంగమపురంధ్రి
యింక నీచేత నున్న దీయింతిబ్రదుకు.

87


చ.

అరయఁగఁ దల్లి కక్క చెలియండ్రకుఁ దక్కును గల్గినట్టిచు
ట్టరికమువారికి న్నెరయ డాఁచు రహస్యము లీనిజాంతర
స్మరవికృతిప్రవర్తనలమాటలు వీని వినంగ నాప్త లై
పరఁగెడునెచ్చెలుల్ చెలికిఁ బ్రాణము లిచ్చిన నప్పు దీఱునే.

88

సీ.

కావున నోహంసి నీ వెఱుంగనిసఖీ
            ధర్మంబు లేదు విద్వజ్జనంబు
సఖ్యంబు నెంచును సాప్తపదీనంబు
            గాఁగ నట్లౌట వేగంబ యరిగి
యదుకుమారకునకు హృదయంగమముగ నీ
            యతివసౌందర్యాదు లభినుతించి
యేతన్మనోరథం బీడేర్పవలయు నీ
            వని పల్కుటయును నాహంసరమణి


తే.

యతనియొద్ద నీయంగనయంగకముల
చక్కఁదన మెల్ల నొక్కప్రసంగవశత
నేను మున్న వర్ణించినదానఁ దత్ప్ర
సంగ మెయ్యది యంటేని సకియ వినుము.

89


ఉ.

ఏ నిట మున్ను నివ్వనరుహేక్షణఁ గన్గొని చన్నదాననై
యానరవర్యుఁ గాంచి యరుదైనతదాకృతిశోభ కెన్న జో
డైనది యావిలాసవతియాకృతిచెల్వమ కావునం దలం
పైన వచింపఁగా వలసె నాతనియొద్దఁ బ్రసక్తి వెంబడిన్.

90


క.

వచియించిన నౌఁ గా దను
వచనం బపు డేమియు నుడువకయుండె నతం
డచలస్థితి నాకును నది
య చాలు నప్పటికి నేతదర్థ మెఱుఁగమిన్.

91


క.

అన విని మనసు చివుక్కురు
మనఁగఁ బ్రభావతి వివర్ణ మగువదనముతోఁ
గనుపట్టుడు నింతనె ముగి
సెనె కార్యం బేల యింత చింతిల ననుచున్.

92

వ.

అద్దనుజరాజకన్యక నూరార్చి హంసి యి ట్లనియె.

93


మ.

అతివా ని న్వినిపించువేళఁ బ్రతివాక్యం బేమియు న్లేమిఁ ద
ద్రతికాంతున్ వెసఁ దెత్తుఁ బంపుమని పంతంబాడుకోరాదుగా
ని తగం దెచ్చెద నిశ్చలం బయినపూన్కి న్సిద్ధగంధర్వదై
వతదైత్యాదికులంబులం దొకని నెవ్వాని న్మదిం గోరినన్.

94


తే.

తాను జెప్పినవానిని మాని యితర
పురుషు నేఁ గోర నుమచిత్తమునకు రాదొ
యనవలదు భక్తపరతంత్ర కాభవాని
కరయ భవదిష్ట మెయ్యది యదియ ప్రియము.

95


వ.

కావున సందిగ్ధఫలం బయిన ప్రద్యుమ్నవాంఛ విడిచి దేవ
దైత్యసిద్ధవిద్యాధరగంధర్వాదులందు నెవ్వఁడు గా
వలయు నన్న నతని నతనుపావకప్రజ్వలనధాయ్యామంత్రా
యమానం బయిన తావకీనసౌందర్యసంపత్సహస్రతమభాగ
కథనమాత్రంబున నపాస్తధైర్యుం జేసి తెచ్చి నీకుఁ గింక
రుం గావించెద నీ వించుకయు నీరామణీయకమహిమ యెఱుం
గవు గాన యిది వినిన మదనవశంవదహృదయుండు గాని
వాఁడునుం గలండె యదుకుమారుం డొక్కరుండ యనుప
మేయరూపలావణ్యగర్వంబునం గన్ను గానకున్నవాఁడు
గావలయు నతం డట్ల యుండనిమ్ము తత్సమాను లనరాదు
గాని నానాభువనసంచారిణి నైన నాకు నక్కడక్కడ మిక్కిలిం
జక్కని కొమరుఁబ్రాయంపుఁగొమరు లెంద ఱెంద
ఱైనం గనంబడుదురు వారల నందఱ లిఖించి తేవలసి
వచ్చినం దెచ్చెద నిచ్చకు మెచ్చువచ్చినవాని వరియింపు

మనిన నమ్మాటలు పెడచెవులం బెట్టి యొక్కింతతడవు
చింతించి కటకటం బడుచుఁ బ్రభావతి యి ట్లనియె.

96


మ.

చిరకాలంబునఁబట్టి యేను మదిఁ గాంఘింపం బ్రియోదంత మి
ట్లరపదార న్వినిపించి ప్రాణసఖివై హంసీ తుదన్ యుక్తమే
విరసంబైనవచఃప్రపంచనముచే వేపంగ నిందాఁక నిన్
సరసత్వంబునఁ బ్రౌఢవంచు మదిలోఁ జాలంగ నే నమ్మితిన్.

97


తే.

వజ్రనాభుండు మును స్వయంవరపువిధికి
నను నియోగించి దేవగంధర్వసిద్ధ
యక్షవిద్యాధరాదుల నసురవరుల
విశదముగ వ్రాసి చూపించె వేఱువేఱ.

98


క.

వారలలో నెవ్వానిం
గోరెడునందాఁక లేదు కొలుపద యుల్లం
బారసి చూడఁగ నైనను
బ్రారబ్ధం బెట్టు లున్నయదియొ యెఱుంగన్.

99


చ.

జనకుఁడు నప్పు డీసకలసద్గుణపూర్ణుని వ్రాసి చూప నా
కనుపఁడు వ్రాయునంతటి సమర్థులు లేమినొ తా నెఱుంగఁడో
మనుజుఁ డటంచుఁ గైకొనఁడొ మత్కులవైరితనూజుఁడంచు మా
నెనొ యెఱుఁగన్ సురారికులనిర్మథనుండని విందుఁ గేశవున్.

100


చ.

అది తలపోసి కుందఁ దగునా యదునందనునందు నున్ననా
మదితెఱఁగున్ జగజ్జననిమాటలుఁ జెప్పఁగ వించు శంకచే
సెదు పురుషాంతరానుమతి చేకుఱునో యని నీకు నింక నా
హృదయములోఁతు గానఁబడ దే నెఱిఁగింతుఁ బ్రతిజ్ఞ యొం డిఁకన్.

101

క.

విను ప్రద్యుమ్నునిఁ దక్కన్
మనమున నే నొరు వరించుమాట విడుపు మా
ఘనుఁ డొల్ల కున్నఁ జెందుదు
మనసిజశిఖిఁ దనువు వ్రేల్చి మఱుసటిమేనన్.

102


ఉ.

ఈతుదిపక్షమే మదికి నిప్పుడు నిశ్చిత మె ట్లటన్న ము
న్నాతఁడు వించు నాకథల కట్టిటు పల్కమి గాక తద్గళ
ద్యోతితకంకణాంక యగుతొయ్యలి నొక్కతెఁ గల్గఁ జెప్పి తీ
వేతప మాచరించెనొకొకొ యిందులు కారతిప్రాగ్భవంబునన్.

103


వ.

అని తదీయం బయినసతీవాల్లభ్యంబునకు ముచ్చటపడుచు
నొక్కింత తలపోసి.

104


సీ.

ఆరతికిఁ గరంబు లైతిరే నవ్విభుఁ
            గౌఁగిలింపఁగ నబ్బుఁ గరములార
యాయింతికిఁ గుచంబు లైతిరే నతనివ
            క్షోనిపీడన మబ్బుఁ గుచములార
యాలతాంగికిఁ జెక్కు లైతిరే నారమ్య
            శీలుచుంబన మబ్బుఁ జెక్కులార
యానెలంతకు వీను లైతిరే నాకళా
            విదుమంతనము లబ్బు వీనులార


తే.

యట్లుగా నోఁచ కేల నాకైతి రకట
యని నిజావయవంబుల కాత్మ వగచు
బాల్యమునఁ దన్ను రమణసౌభాగ్యకలిత
యనినసాముద్రికులమాట లరసి తిట్టు.

105

వ.

ఇవ్విధంబునం బెద్దయుం బ్రొద్దు విరహవేదనాదోధూయ
మానమానస యగుచు నుండి యంతట శుచిముఖిం జూచి
యి ట్లనియె.

106


సీ.

ఓహంసి నిన్ను నే నొక్కటి తుదమాట
            యడిగెద నీహృదయంబునందుఁ
గలయట్లు చెప్పుమీ కల్ల లాడిన నీకు
            నాతోడు సుమ్ము ప్రాణసఖి వీవు
తడయక ప్రద్యుమ్నుకడ కింక నొకమాఱు
            పోయి దుస్తర మైననాయవస్థ
చెప్పి చేరికఁ గొంత చేయవచ్చునొ రాదొ
            యీదురాశాపాశ మెందుఁ దెగని


తే.

బంధ మై ప్రాణముల వెలువడఁగ నీక
యాఁగి పెంచెడు మదనాగ్ని నహరహంబు
నీవు చని యవుగాములు నిశ్చయించి
యాశఁ దెగఁగోయు మదియ మత్ప్రాణరక్ష.

107


వ.

అనుటయు నాతరుణికిం గల హరితనయవరణానురాగం
బెవ్వారికి నవారణీయం బనియును నింక నియ్యాస చెడ
కుండ నిర్వహింపక తడసినం గడు నెడరు వాటిల్లఁ గార్యంబు
దప్పు ననియు నిశ్చయించి యంచ యి ట్లనియె.

108


చ.

మదితమిఁ జూడఁ గొన్ని వెడమాటలు పల్కితి నీవు నమ్ము మే
నిదె భవదీశుఁ దెత్తు నపుడేమి పరాకున మాఱు పల్కఁడో
సుదతి యెఱుంగఁగాని యిఁకఁ జూడుము తావకరూపవైభవా
భ్యుదయము విన్కలిన్ బ్రియము పూని యతండు విరాళిఁ గుందెడున్.

109

వ.

దీనికి నిమిత్తంబును దైవనియమంబు గల దది విను మెఱిం
గించెద.

110


తే.

బ్రహ్మకును సరస్వతికిని బ్రణయకలహ
మయ్యె మును పొక్కనాఁ డపు డబ్జభవుఁడు
తద్విరహపీడ సైరింపఁ దరము గాక
వాణిఁ దేర్పఁ దదాప్తు లెవ్వారొ యనుచు.

111


క.

ఆరసి ననుఁ బిలిపించెను
శారదకడ నప్పు డేను సరసక్రీడా
చారసచివత్వమున సం
చారముఁ గావించు చునికిఁ జంద్రనిభాస్యా.

112


వ.

అట్లు పిలిపించి నన్నుం దనపొలఁతిపొలయలుకం దీర్చుటకుఁ
బనుపుచుండి యద్దేవి నుద్దేశించి.

113


సీ.

నీసుప్రసాదసన్నిధిమహత్త్వమ సుమీ
            నిగమరాశి ముఖస్థ మగుట నాకు
నీవిలాసమచర్చికావిశేషము సుమీ
            సంగీతసాహిత్యసౌరభంబు
నీకటాక్షశ్రీవిపాకభేదమ సుమీ
            వేణువీణాదులరాణ లెల్ల
నీ వనుగ్రహలీలఁ గావించుటన సుమీ
            యఖిలలోకవ్యవహారసిద్ధి


తే.

కావున నొకింత యోవాణి నీ వలిగిన
నొకవినోదంబు నొదవ దే నోర్చు టెట్లు
విరహ మేకాంతదాస్యకింకరునియందుఁ
గరుణ లే కింతతడ వలుగంగఁ దగునె.

114

క.

అని యేఁ దనుఁ గడుఁ దూఱితి
నని మత్ప్రియకడకు నేఁగి హంసి పలుకుమీ
యనుచు నపు డంతకంతకుఁ
దనరు మనోజార్తిఁ గరముఁ దప్తుం డగుచున్.

115


తే.

ఏలరా మన్మథుఁడ నన్ను నింత యేచు
టేమి మేలు రానున్నవి యిట్టిపాట్లు
నీకు నిఁకఁ బ్రభావతి యనునెలఁతపై వి
రాళి కారణముగ వేగిరంబు వలదు.

116


క.

నా విని యేను రతిప్రియు
భానము న ట్లపహరించుపాటిది యైన
న్నీ వనిన వనిత యెక్కుడె
లావణ్యాదులను రతివిలాసిని కనుడున్.

117


క.

రతిరూప మెక్కడ ప్రభా
వతిరూ పెక్కడ విమర్శవంతులు దెలియన్
రతిసాగుకంటెను బ్రభా
వతిపస ముమ్మడి నలుమడి వాసి మరాళి.

118


వ.

ఆ ప్రభావతీరూపంబును మదీయసృష్టియం దతిదుర్లభం బది
పార్వతీవరప్రసాదజనిత యై పొలుపొందు నని పలికి నిజాం
గనారోషంబుఁ దీర్చుటకు సత్వరంబుగాఁ బనిచిన నే నతని
కాలవిలంబనాసహిష్ణుత్వంబు దెలిసినదాననై యప్పు డేమియు
నడుగ వెఱచి యరిగితి మఱియుఁ గ్రమక్రమంబున నట్టి
ప్రభావతివి నీవ యని నిశ్చయించితిం గావున నీవల్లభుండు
భవదాయల్లకభరంబునం బరితప్తుం డగుచు నిన్ను వరియిం
చుటకు నీకంటెను వేగిరించు నని తోఁచుచున్నయది రతీ

విలాసంబును దదంతరాయంబు సేయం జాలదు నీవు సకల
సంశయంబులు నుడిగి సుఖం బుండు మనిన విని యద్దను
జేంద్రనందన తనడెందంబున సందియంబు నొందుచు రాగ
వల్లరిమొగంబు చూచుటయు నది తదభిప్రాయం బెఱింగి
హంసి కి ట్లనియె.

119


తే.

ఏమిటికి హితవుగఁ జెప్పి యెందు నదికి
తచ్చెరువు నీదు మాట లోయంచగరిత
కాముఁడు ప్రభావతీకాంక్షఁ గలఁగెనేని
మనచెలియ కిష్టుఁడు విరాళి గొనుట యెట్లు?

120


మ.

అనిన న్నవ్వి మరాళి యి ట్లనియెఁ జెల్వా కాముఁ డన్వాని మీ
రును విన్నారు గదమ్మ యాసకలసద్రూపోపమానత్వశో
భనకీర్తిప్రథితుండు తొల్లిటిసురూపశ్రీఁ గడు న్మించుచె
న్నొనరం బుట్టినవాఁడు రుక్మిణికిఁ బ్రద్యుమ్నుం డనం బుత్త్రుఁడై.

121


క.

అని నిజశంకల కన్నిటి
కినిఁ బరిహారములు చెప్పి గెంటక యుండన్
దనయాస నిలుప దితిసుత
తనయ రమణుఁ గలయ మిగులఁ దమకించుమదిన్.

122


వ.

హంసిం జూచి.

123


సీ.

నీ చెప్పినట్ల యిన్నియునైన మొదలఁ ద
            త్పుర మెంత దవ్వొ నీపోవు టెపుడు
పోయి వేళ యెఱింగి పొసఁగ నవ్విభున కీ
            దృశ మైననాకోర్కిఁ దెలుపు టెపుడు
తెలిపిన నేవిఘ్నములకు లోఁబడక నా
            పై నతఁ డనుకంపఁ బూను టెపుడు

పూని తా నిచటికి రా నొక్కనెపమున
            గురునాజ్ఞ దొరకించుకొనుట యెపుడు


తే.

వట్టి పెనుమచ్చరపురాళి వజ్రనాభుఁ
డస్మదిచ్ఛకు ననుకూలుఁ డగుట యెపుడు
విరహవారిధి నేఁ గడవెళ్లు చెపుడు
వలవనిదురాశలను గుమారిలుటె కాక.

124


క.

అని తాల్మి వదల విడుచుచు
ఘనముగఁ బ్రజ్వరిలుదర్పకజ్వలనముచే
ననయము శోషిలి చెలి లో
చనముల వెడలించె మోవిసరసత యెల్లన్.

125


క.

అట్టియెడఁ గట్టెదుర నొక
చెట్టున నురిఁ దగులుపడిన చిలుక వెఱపుతో
ని ట్టటు ఱెక్కలు తటతటఁ
గొట్టుకొనుచు నెగయఁ బెనఁగఁ గోమలి కనియెన్.

126


క.

కని ఘనసంభ్రమమున ది
గ్గున లేచి దయాకులం బగుమనోవృత్తిన్
దనతోఁ జెలియున్ హంసియుఁ
జనుదేరఁగఁ దానిఁ జేరఁ జనియె రయమునన్.

127


క.

చని చిలుకఁ గదలకుండఁగ
ననువునఁ దాఁ బొదుగఁ బట్టి యంఘ్రియురి వద
ల్చిన నది రయమున నబ్భా
మిని కే ల్విడిపించుకొనుచు మింటికి నెగసెన్.

128


వ.

అప్పుడు.

129

మ.

శుక్లపక్షంబులలోననుండి తదతిక్షోభంబునం జాఱి ప
త్రిక పడ్డన్ వెఱఁగంది యిట్టు లను దైతేయాధిపాంతఃపురం
బకటా చోద్యము చూచితే యిది కడు న్హంసీవిచార్యంబు కొం
కక యిందెవ్వరి కెవ్వ రంపిరొకొ చిల్కం బట్టి తే నోపుదే.

130


తే.

అని ప్రభావతి పల్కిన హంసి యపుడ
కూడఁ జని పట్టి తెత్తుఁ జిక్కుపడ కెంత
దవ్వు పాఱెడు ననుచుఁ బంతమునఁ బఱచె
శీఘ్రగతి నింత నంత నాచిలుకఁ దగిలి.

131


ఉ.

అంతఁ బ్రభావతీసతి వయస్యఁ గనుంగొని యింతి చూచితే
యెంతటిచోద్యముల్ మొదల నిక్కడ ని ట్లురు లెవ్వ రొడ్డిరో
వింత యటన్న నీచెవికి వేఁడిగఁ బల్కుపికాళిఁ బట్టి శి
క్షింతునటంచు నేఁ గడఁగి చేసినత ప్పిది యొప్పు నోర్వఁగన్.

132


క.

చిత్రము మిక్కిలి నిపు డీ
పత్రిక చందంబ యోప్రభాతాబ్దలస
న్నేత్ర యది చూత మనుచున్
బత్రిక పుచ్చుకొని విచ్చి భాసురఫణితిన్.

133


సీ.

"శ్రీమత్సరస్వతీరామాకృపాసంప్ర
            యుక్తోపమాతిశయోక్తికామ
ధేనుసద్బిరుదాంకదివ్యమంజీరసం
            శోభితపాదకు శుచిముఖికిని
బ్రద్యుమ్నుఁ డూర్జితప్రణయపూర్వకముగా
            ననిపినయట్టిరహస్యలేఖ
ప్రప్రభాభావతిఁ బలుదెఱంగుల నీవు
            వచియింప” నని చదువుచునె యుబ్బి

తే.

సంతసము నాపఁజాలక చంక వైచు
కొనుచు నొకదాఁటుగొని నిన్నుఁ గూర్చి కాంతుఁ
డనిపినట్టిపత్రికయె కదమ్మ భాగ్య
వతివి నీ వని చెలి ప్రభావతిని బల్కె.

134


చ.

పలికిన నట్ల యున్నదియె పత్రికలో నడకించెదో ననున్
జెలి యిటు చూపుమా యనుచుఁ జేరఁగఁ బోవుచుఁ జేయి సాఁచె నా
యలినిభవేణి తత్సఖియు న ట్టిటు పాఱుచు దేవునాన యేఁ
గలయది యంతయుం జదువఁగా విను చూచెదు కాని నావుడున్.

135


ఉ.

ఆవిధిఁ దప్పకున్నఁ జెలియా ననుఁ జేకొను టెట్లు ప్రప్రభా
భావతి నాఁగ నెవ్వతయొ పత్రిక యింకను లెస్స చూడు నా
కీ వల దన్న నెఱుఁగవే భవదాఖ్యయె కాదె యిట్లుగా
నోవనజాక్షి వర్ణపునరుక్తిగ వ్రాసినవాఁడు భ్రాంతిచేన్.

136


వ.

అనుటయు.

137


క.

ఎట్టటు కాని మ్మది యిఁక
నట్టిటు పాఱక మృగాక్షి యవలఁ జదువు మే
నిట్టే యుండెద నావుడు
గట్టిగ నట్లేని వినుము కడమ చదివెదన్.

138


వ.

అని ప్రథమశ్రుతాంతంబు నందుకొని యి ట్లని చదువం
దొడంగె.

139


సీ.

“ప్రప్రభాభావతిఁ బలుదెఱంగుల నీవు
            వచియింప నపుడు నిర్వచనవృత్తి
నే నున్కి కల్లగు ట్టింతియె కాని యా
            యింతియంగము లెవ్వి యెట్లు చెప్పి

తని యెల్ల నట్ల నాయాత్మఁ దద్దయుఁ బడి
            యచ్చున నద్దిన ట్లమర నంటి
మలిచినగతిని మిక్కిలి దృఢత్వముఁ జెంది
            స్వగుణసంపద్గౌరవమున నేమొ


తే.

యూఁది బడలించుచున్నవి యోమరాళి
యధరసుధఁ చేర్చుమని వేఁడుమా మృగాక్షి"
నని చదువునంత గొబ్బునఁ జని సురారి
పుత్త్రి సఖిచేతిపత్రికఁ బుచ్చుకొనియె.

140


ఉత్సాహ.

పుచ్చుకొనుడుఁ బెనఁగఁబోక బోటి చేయి వదలి పో
నిచ్చి నాకుఁ జదువఁ దగద యింతనుండి మిక్కిలిన్
బచ్చిగాఁగ వలపు తేటపఱిచి వ్రాసినాఁడొ నీ
యిచ్చఁ జదువుకొనుము వెనుక నిపుడు దాఁచి నావుడున్.

141


వ.

ప్రభావతి భావంబునం గోపలజ్జాలోల యగుచు లేఖ నలిపి
వేయం బోయిన రాగవల్లరి పెక్కాన లిడుచుం బడుచుఁ
దనంబును మనంబున నింతఘనంబుగాఁ బూనియున్నదానవే
దానవేశ్వరతనూజా నీయోజ మేలు మేలు బాలుం బది
వేలు వచ్చె నా చేతికిఁ దెమ్ము తేవేనిం బదిలంబుగాఁ
బొదివి దాఁచుము మొదల నీయాకునకు నీకుం బని యేమి
యామహామహుండు శుచిముఖిపేరం బుత్తెంచినాఁ డింతియ
యాశకుంతకాంత చూచుకొనకుండ మనలో మనమె
యడంచిన నది యె ట్లుండు మనము దానితోడం జేసిన
ప్రాణసఖ్యం బెట్టిది యగు గట్టిగ నింతపట్టు నీవ భావించి
కొను మదియునుంగాక నీపోకడమాలినతనం బేమి చెప్ప
వల్లభుండు వాల్లభ్యంబు నెఱపి యనిపిన పత్రిక భాగ్య

వతులు కులదేవతంబలెఁ బూజించి దాచుకొనుట యెప్పుఁ
గాక యిట్టట్టు సేయుటకంటె నమంగళంబు గలదే యని
యదరవైచియు బుజ్జగించియు బోధించియు వారించె నంచయు
నించుకదవ్వునన చిలుకం గూడ ముట్టి పదంబులం బొదిగి
పట్టిన నది యిట్టు నట్టుం బెనంగుచుం గీచు కీచు మని
యఱచుచుం జరణంబులు గఱచుచు రాక చీకాకు పఱిచిన
రేసి యోసి గడుసుంబులుంగ యెలింగించి చావక వేవేగ
నావెంట రమ్ము ఱెక్కలలో దాఁచుకొని యెక్కడెక్కడి
లేఖ లెక్కడికి నడుపుచున్నదానవు రక్కసులఱేని యాఁడు
బిడ్డ నిన్నుం బట్టి తెచ్చునంచాఁక నదె కదలకున్నది యనిన
నది యి ట్లనియె.

142


క.

చంపినఁ జంపుము న న్నటు
గొంపోకుండినను జాలు కొసర కదయతన్
జంపిన న న్నొకటిన మఱి
కొంపోయిన నెంద ఱె ట్లగుదురో యెఱుఁగన్.

143


వ.

అనుటయు.

144


క.

నీను విడిచినఁ గొంపోయినఁ
బనికొదవలు లేమి సరియె పత్రిక చేఁ జి
క్కినయది నీ వింక నీడిగి
లిన నొచ్చుట మీఁది మిక్కిలి వివేకింపన్.

145


తే.

వచ్చితేనియు విను ప్రభావతిమనమున
కెట్టిగతి నైన దయపుట్ట నేను జెప్పి
నిన్ను విడిపింతు ననుచుఁ దన్విడక బలిమి
గొని చనంగ మరాళి కి ట్లనియెఁ జిలుక.

146

ఉ.

ఏల చలంబు నీ వడిగెదేని వచించెద నాదుగోప్యముం
బేలవె యార్చి తేళ్లఁ దలఁబెట్ట రహస్యము దప్పు నన్నచో
దాలిమిఁ గప్పిపుచ్చినను దద్గుణ మొక్కొకచో ఫలించు నా
వేళబపంచు సేయ నొకవీసము గల్గదు హింస తప్పదున్.

147


సీ.

కావున నొకవివిక్తస్థలంబున నిల్పి
            వినుము నాత ప్పెల్ల వినినవెనుక
నీకుఁ దోఁచినయట్లు గైకొని చేయుదు
            గాని నావుడు హంసకాంత దనకు
నప్పటి కదియ కార్యముగ వివేకించి
            చుట్టుపట్టుల నెందుఁ జెట్టు చేమ
లేక యొప్పెడునొక్కలీలామహీధర
            శిఖరంబుపై నిల్చి చిలుకఁ దనదు


తే.

పక్షముల బల్మిఁ బట్టి యాపత్రికాప్ర
కార మేమియు నీ వింకఁ గడమపెట్ట
కంతయును నాకు నెఱిఁగింపు మనుచుఁ బలికె
నంచతొయ్యలి కదియు ని ట్లనుచుఁ జెప్పె.

148


క.

ద్వారక యనుపురమున కొక
కారణమున నేఁగి నేను గ్రమ్మఱి రాఁగాఁ
జారుతరమూ ర్తి యొకఁ డొక
యారామములో నతివ్యధాకులుఁ డగుచున్.

149


సీ.

కృప నెఱిఁగింపరే కీరోత్తమములార
            వజ్రపురికిఁ బోవువారె మీరు

సదనుగ్రహమునఁ దుమ్మెదలార చెప్పరే
            వజ్రపురికిఁ బోవువారె మీరు
కరుణతో వినిపింపఁ గదరె కోయిలలార
            వజ్రపురికిఁ బోవువారె మీరు
తెలుపరే దయఁ జూచి మలయవాయువులార
            వజ్రపురికిఁ బోవువారె మీరు


తే.

చలువ లొసఁగెడు మేఘరాజంబులార
యమలపక్షత నొప్పు రాయంచలార
నిలిచి నామాటలకు మాఱు పలుకరయ్య
వజ్రపురికిని బోయెడువారె మీరు.

150


వ.

అని కన్నకన్నవారి నెల్లఁ బ్రార్థించుచుండ విని దయ
పుట్టి యేల పలవరించెదు వజ్రపురంబునకు నేఁ బోయెడు
దాన నావలన నయ్యెడుకార్యంబుఁ జెప్పు మనిన నత్యా
దరుం డై.

151


శా.

శ్రౌతస్మార్తపథానువర్తనపరిష్కారాత్మవర్ణాశ్రమ
స్ఫీతాచారపవిత్రమూర్తి శమగాంభీర్యక్షమాసత్యని
ష్ఠాతుష్ట్యాదిగుణోరుకీర్తి సముదంచన్నీతివిద్యామహా
చాతుర్యాపరకావ్యుఁ డార్యజనతాసంభావ్యుఁ డత్యంతమున్.


క.

చారిమకారిమహత్తర
గౌరిమహారిమహనీయగాఢయశుఁడు గం
భీరిమదారినిషూదుఁడు
భూరిమదారిమహిమవ్యపోహకుఁ డెపుడున్.

153


స్రగ్విణి.

ఇందుపూతక్రతాయీతనూజార్థరా
ణ్ణందనస్వాంతభూనైషధేళాసుతా

మందసౌందర్యసంస్కారకాకారసం
స్పందితశ్రీధృతిప్రాభవుం డెంతయున్.

154


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ
పింగళి యమరనార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామ
ధేయప్రణీతంబైన ప్రభావతీప్రద్యుమ్నం బనుమహాప్రబం
ధంబునందుఁ దృతీయాశ్వాసము.

—————