758. దేవుడు మనిషిని మాయలో పుట్టించి తర్వాత తనవద్దకు వస్తాడో రాడో, తనను గుర్తిస్తాడో లేదో చూడాలనుకొన్నాడు. ఆ ప్రక్రియలో మొదటిదే నిన్ను ఒక మతములో పుట్టించడము. బాగా చూచుకొంటే నీవు ప్రస్తుతము మాయలో ఉన్నావు, దేవుని వైపుపో.

759. మనము ఎక్కడినుండి ఎక్కడకు పోవాలని ప్రశ్నిస్తే మాయవైపు నుండి దేవునివైపు పోవాలన్నది జవాబు. అనగా నీవు ముందే మాయవైపు ఉన్నావని అర్థము. నేను పలానా మతస్థుడనని అనుకోవడము మాయ. నా దేవుడు పలానా వాడనుకోవడము మరీ పెద్ద మాయ. సృష్ఠికి అంతా ఒకే దేవుడు అధిపతి.

760. నీకు ఒక పేరునూ, నీకు ఒక కులమునూ, అలాగే ఒక మతమునూ ఇతరులే నీకు మొదట కరిపించారు. దేవునికి పేరుందా? కులముందా? మతముందా? అవి ఏవి లేవు. అవి లేని వానిని తెలుసుకోవాలంటే నీవు నీ పేరునూ, కులమునూ, మతమునూ దేవుని విషయములో దూరముగా పెట్టుకో.

761. దేవునికి శరీరముకానీ, ఆకారముగానీ లేదు. అటువంటి వానిని ఒక ఆకారముతో ఊహించుకోవద్దు. అలా ఊహించుకొంటే నీ ఊహ తప్పు అవుతుంది. ఆకారమున్నది ఏదైన అది దేవుడు కాదు.

762. దేవునికి ఒక ఆకారమే కాదు. నిద్ర, మెలకువ, ఆకలి, దప్పిక ఏవి లేనివాడు దేవుడు. సర్వమును వ్యాపించివాడు, అన్ని వేళల ఉన్నవాడు, అందరిని గమనిస్తున్నవాడు దేవుడు. ఆ దేవున్నే నీవు తెలుసుకో. 763. యజ్ఞముల విూద, వేదపఠనముల విూద, దానముల విూద, తపస్సుల విూద దేవునికి అయిష్టత కలదు. బ్రహ్మయోగమూ, కర్మయోగమూ, భక్తి యోగముల మూడిటి విూద దేవునికి పూర్తి ఇష్టము కలదు.

764. దేవునికి ఇష్టములేని యజ్ఞములను, దానములను, వేదాధ్యయనములను, తపస్సులను నాల్గింటిని వదలి దేవునికి ప్రీతిని కల్గించు బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగములను మూడిటిని ఆచరించుటకు ప్రయత్నిద్దాము.

765. నేటి కాలములో స్వాములూ, పీఠాధిపతులూ, బాబాలూ మొదలగు వారందరు యజ్ఞాలు చేస్తున్నారు, వేదములను పఠిస్తున్నారు. ధనికులందరు దానములు చేస్తున్నారు. మెడిటేషన్‌ అను పేరుపెట్టి తపస్సులు చేయుచున్నారు. ఈ విధముగ చేయడమేనా భక్తి?

766. దేవుడు భగవద్గీతయందు విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయములో 48,53 శ్లోకములలో యజ్ఞ,దాన, వేదాధ్యయణ, తపస్సుల వలన నేను తెలియనని చెప్పగా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేఖముగా చేయువారిని స్వాములనాలా? బాబాలనాలా? పీఠాధిపతులనాలా? విశిష్ట జ్ఞానులనాలా? ఏమనాలో విూరే చెప్పండి?

767. నీ అధికారము, నీ హోదా, నీ పలుకుబడి, నీ ఉద్యోగము మధ్యలోవచ్చి మధ్యలో పోవునవే. వాటిని చూచి మిడిసిపడకు నీ శరీరము కూడా నీ మాటవినని రోజుంది జాగ్రత్త!

768. అందరికి అధికారి ఒక్కడు కలడు. అతను చెప్పకనే నడిపించును, చూపకనే చేయించును, కనిపించకనే నీ వెంట ఉండును. అతనే ఎవరికి తెలియని దేవుడు. 769. దేవుడు దేవులాడబడేవాడు (వెదకబడేవాడే) ఎప్పటికి కనిపించే వాడు కాడు. మనిషి దేవులాడేవాడు (వెదికేవాడు), ఎప్పటికీ కనుగొనలేడు.

770. ప్రపంచవిషయములలో మునగనిది, దైవజ్ఞానమును చూచి అసూయ పడనిది, మనిషికంటే బుద్ధిలో తక్కువ, జ్ఞానములో ఎక్కువగా ఉన్నది, మనిషికంటే పాపసంపాదన తక్కువ గలది (గుడ్డలులేని జంతువు).

771. దైవజ్ఞానము అంటే ఏమిటో తెలియని మనిషి, దేవుడెవరో, దేవతలెవరో తెలియని మనిషి, దైవజ్ఞానమును చూచి అసూయపడు మనిషి, ప్రపంచ విషయములలో మునిగిపోయి తన చావును మరచిన మనిషి (గుడ్డలున్న జంతువు).

772. ఇందూమతములోని "మాయ", ఇస్లాంమతములోని "సైతాన్‌", క్రైస్తవమతములోని "సాతాన్‌" అన్నీ ఒక్కటే. దైవమార్గమునకు ఆటంకమును చేయునదే మాయ.

773. అరచేతిలో అతిపెద్ద రహస్యం కలదు. కనుకనే గుడిలోని ప్రతిమ తన హస్తమును చూపుచుండును. అది అభయహస్తము కాదు. అతి రహస్యమైన మూడు ఆత్మల త్రైతము.

774. సిరి అనగా సంపద, మగసిరి అనగ జ్ఞానసంపద. పురుషుడు అనగా పరమాత్మయనీ, మగవాడైన పరమాత్మజ్ఞానము కలవానిని మగసిరి కలవాడని అందురు.

775. స్త్రీలను రమింపజేయడము మగసిరికాదు. ప్రకృతి జ్ఞానమును అతిక్రమించు జ్ఞానమును కల్గియుండడమే నిజమైన మగసిరి కల్గియున్నట్లు తెలియుము. 776. జ్ఞానములు రెండు రకములు గలవు. ఒకటి ప్రకృతివైపు నడిపించును, మరొకటి పరమాత్మవైపు నడిపించును. నీవు ఏ జ్ఞానములో ఉన్నావో చూచుకో.

777. దినమునకు 12 గంటల పగటికాలము లేక 720 నిమిషములు, సెకండ్లయితే 43,200 అగును. ఒక సెకనుకు పదింతల ఎక్కువ కాలమును 4,32,000 సూక్ష్మకాలము అంటాము. ఒక దినమునకు కాలముతో పాటు శరీరములో 4,32,000 మార్పులు జరుగుచుండుటవలన కొంత కాలమునకు నీ శరీరము ముసలిదగుచున్నది.

778. మనిషికి గల బుద్ధి, ప్రపంచ సంబంధ వివరమునూ, పరమాత్మ సంబంధ వివరమునూ అందించుచుండును. మనిషికి గల బుద్ధి కర్మను బట్టి ప్రపంచవిషయమును అందించగా, శ్రద్ధనుబట్టి దైవ విషయమును జీవునకు అందించుచుండును.

779. భూమి విూద కొన్ని వేల మంది బోధకులుండవచ్చును. కానీ అంతమందిలో గురువులేకుండవచ్చును, ఉండవచ్చును. 780. గురువు అరుదుగా భూమివిూదకు వస్తాడు. కావున ఆయన ఏ కాలములో ఉంటాడో చెప్పలేము.

781. కొంత తెలిసిన మనిషి, తాను ఇతరులకు బోధించి బోధకుడు కావలెననుకొనును. కొంత బోధ చెప్పుచున్న బోధకుడు తాను ఇతరులకు ఉపదేశమిచ్చి గురువు కావలెనని అనుకొనును.

782. మనిషి బోధకుడు కావచ్చును, కానీ గురువు ఎప్పటికి కాలేడు. ఎందుకనగా మనిషి నుండి గురువురాడు, గురువు నుండి మనిషి రాగలడు. 783. దేవుడు ఒక్కడే భూమివిూద గురువుగ ఉండగలడు. కాని మనిషి గురువుగా ఎప్పటికి ఉండలేడు. మనిషి బోధకునిగా ఉండవచ్చును.

784. ఈ దినములలో భూమివిూద ఉన్న స్వావిూజీలందరిలో ఎవడైన గురువు ఉన్నాడా? అని ప్రశ్నిస్తే నిజం చెప్పాలంటే చాలా కష్టము.

785. పుస్తకములన్ని శాస్త్రములుకావు. కొన్ని చరిత్రలు, కొన్ని పురాణములు, కొన్ని కావ్యములుగా ఉన్నవి. అలాగే మనుషులందరు జ్ఞానులుకారు. వారిలో కొందరు రౌడీలు, కొందరు దొంగలు, కొందరు జూదరులున్నారు.

786. దేవున్ని తప్ప ఇతర దేవతలనుగాని, మాయనుగాని ఆరాధించవద్దని చెప్పునది అసలైన జ్ఞానము.

787. మనుషులు దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేకపోవడము వలననే అన్ని అనర్థములకు కారణమైన హింసలు, దోపిడీలు అవినీతి అక్రమములు మనుషులలో చెలరేగుచున్నవి.

788. హింసతోగానీ, భయపెట్టిగానీ ఎవరిని మార్చలేము. జ్ఞానమును బోధించి ఎవరినైన, ఎంతటి మూర్ఖున్ని అయిన మార్చవచ్చును.

789. భయపెట్టి బయట మార్చగలము కాని లోపల మార్చలేము. భయముతో ఎవడైన బయట మారినట్లు నటించును కాని లోపల తన స్వభావమును వదిలిపెట్టడు.

790. ఎవడైన తన స్వభావమును మంచిదనే అనుకొనుచుండును.