ప్రబోధానందం నాటికలు/మూఢ పండితులు

మూఢ పండితులు

అది ఒక యజ్ఞ కార్యక్రమము. అందులో కొందరు పండితులు యజ్ఞము చేయుటకు పూనుకొన్నారు. యజ్ఞము ప్రారంభమవుచున్నది. పండితులు వారివారి మంత్రోచ్చాటనలో నిమగ్నమైనారు. ఆ యజ్ఞము పేరు "భూ మాతా యజ్ఞము" అంతా హడావిడిగా ఉంది. అక్కడికి ఒక బిక్షగాడు వచ్చి అడుక్కుంటాడు. అక్కడి పండితులు బిక్షగాడిని కసురు కొంటారు. బిక్షగాడు మొండిగా ఉంటాడు. అంతలో ఒక హేతువాది వచ్చి మాట్లాడను మొదలుపెట్టును.


హేతువాది :- ఏమి మనుషులయ్యా మీరు? వాడు ఆకలికొని కడుపు మంటను అపుకోలేక, ఏదో ఒకటి ఇవ్వమని అడిగితే కసురుకొని పొమ్మంటారా? పుట్టినప్పటి నుండి నెయ్యిని చూడనివారు, నెయ్యి రుచి ఎట్లుంటుందో తెలియనివారు, ఈ దేశములో చాలామంది కలరు. డబ్బాలు డబ్బాలు నెయ్యి అగ్నిలో పోసే బదులు, ఒకకేజీ నెయ్యి ఇటువంటి బీదవానికి ఇస్తే, ఇచ్చినందుకు మీకు పుణ్యము, తీసుకొన్నందుకు అతనికి సంతోషమైనా ఉంటుంది. ఇటు పుణ్యానికిగానీ, అటు పురుషార్థమునకుగానీ సంబంధము లేని పనిని మీరు చేస్తున్నారు.
1) పిల్లవాడు ఏడుస్తుంటే అన్నము పెట్టలేని ఆర్థిక ఇబ్బందులలో ఎందరో ఉండగా, భక్తి అను పేరుతో దేవతల మెడలో బంగారం, దేవతల గుడులలో బంగారం నింపడము సాటిమనిషి చేయదగిన పనేనా? 2) ఎదుటివాడు అడుగుచున్నా పిడికెడు అన్నము పెట్టకుండా, అడగని మూగదేవతలకు, తినని మొండిరాళ్ళకు రుచులతో కూడిన నైవేద్యములు పెట్టడము మంచిదా? 3) మీరు చేసే యజ్ఞములలో వృథాగా కాల్చు గుడ్డలు, బంగారు, నెయ్యి, ధాన్యములను ఇతరుల ఆహారమునకు ఉపయోగిస్తే ఎంతమంచి పని అగునో కొంతయినా యోచించారా?

1) బిడ్డ పెళ్ళికి అరతులము బంగారంకొనలేని తండ్రులు ఎందరో ఉండగా, కొన్ని కేజీల బంగారం మోయుచున్న ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.

2) చంటిబిడ్డకు పాలులేక డబ్బులు పెట్టి కొనితెచ్చి తాపలేక, బాధపడు తల్లులు ఎందరో ఉండగా, వందలలీటర్ల పాలు నెత్తిన పోయించుకొను ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.

3) కట్టుకొనుటకు ముతకగుడ్డలు కూడ లేక, చలికి బాధపడు బీద వారుంటే వెచ్చనిగుళ్ళళ్ళో పట్టువస్త్రములు కట్టిన ప్రతిమలు ఎన్నో ఉన్నాయి.

4) తిండి, గుడ్డ లేని మనుషులు ఎందరో ఉండిన ఈ దేశములో తిండి, గుడ్డ, బంగారమూ ఉన్న దేవతలు ఎందరో గలరు. తిండి గుడ్డలు బంగారు బాధలుపడే మనిషికి అవసరమా? బాధలు లేని దేవతలకు అవసరమా?

మాకంటే మించిన జ్ఞానులులేరను భావముతో మీరున్నారు. మాలాంటివారు నిజము చెప్పితే నాస్తికులని, హేతువాదులని మమ్ములను అంటారు. మీకు బుద్ధి చెప్పే జ్ఞానులు త్వరలోనే వస్తారు.

(అంతలో తెల్లనిచక్రములు నుదిటి మీద ధరించిన నలుగురు (భటులు) అక్కడికి వస్తారు. వారి చేతులలో కొన్ని వ్రాతల బోర్టులు కలవు. ఆ సమయములో ఒక నిశ్శబ్దము ఏర్పడుతుంది. మంత్రములు చదువుచున్న పండితుల గొంతులో శబ్దమురాలేదు. వారు నోరు అల్లాడించినా గొంతులు మూగ బోయినవి. వచ్చిన వారు గద్దించి పండితులను నోరు కూడ మెదపకుండ చేశారు.)

భటులు :- మూర్ఖపండితులారా! మీ నోర్లు పడిపోయిననూ, మీకు ఇంకా బుద్ధిరాలేదు. శబ్దము రాకున్నా ప్రయత్నించి నోరు అల్లాడిస్తున్నారు. నోరు మూయండి.

పండితులు :- (చేతితో సైగ చేయుచు) మీరు ఎవరు అన్నట్లు అడిగాడు.

భటులు :- మేము జ్ఞానులము. మీ మూఢత్వమును చూచి మీకు బుద్ధి చెప్పనువచ్చాము.

పండితులు :- (అంతలో ఒకడు తమ నోరును చూపి మాకు మాట వచ్చేటట్లు చేయమని ప్రాధేయపడుతాడు.)

భటులు  :- (అంతలో ఒక భటుడు) నీకు మాటవచ్చేటట్లు చేస్తాము. మా మాటవింటావా?

పండితులు :- ఊ..ఊ.. అని మూల్గుచు వింటాను అని సైగ చేశాడు.

భటులు :- మాలో దైవశక్తి అయిన జ్ఞానశక్తియుంటే, మాశక్తి వలన వీరి కర్మకాలిపోయి నోటమాట వచ్చునుగాక. అని అంటూనే పండితులకు నోట మాటలువచ్చాయి. మీరు యజ్ఞము చేయుచున్నారు కదా! యజ్ఞమంటే నిజార్థము తెలుసా?

పండితులు :- తెలుసా అంటే కొంత తెలుసు.

భటులు :- ఏమి తెలుసో చెప్పండి?

పండితులు :- దేవతలకు ఫ్రీతికొరకు, దేవతలకు మనమిచ్చు వస్తువులు చేరుటకొరకు యజ్ఞము చేస్తున్నాము.

భటులు :- దేవతలా! ఎవరా దేవతలు! తమకంటే గొప్ప ఒక దేవుడు ఉన్నాడని, వారే దేవుణ్ణి భక్తిగ మ్రొక్కుచుంటే, అసలైన దేవుణ్ణి వదలి వేరే వారికి దేవతలని పేరుపెట్టి, మీరు యజ్ఞములు చేయడము జ్ఞానమంటారా?

పండితులు :- మేము వేరే దేవతలకు యజ్ఞము చేయలేదు, భూమాతకు చేస్తున్నాము.

(అంతలో విచిత్రశబ్దము ఏర్పడినది. అట్టహాసము చేయుచు శరీరమంతా మట్టినిండిన వ్యక్తి అక్కడికి వచ్చాడు.)

భూమి :- ఓరీ పండితులారా! నేను భూమిని మాట్లాడుచున్నాను. మీరు అధర్మమైన యజ్ఞములు చేయడమేకాక, నన్ను కూడ కలుపుకొని నాపేరుతో యజ్ఞము చేయుదురా! యజ్ఞమే ఒక పెద్ద అధర్మమూ, అజ్ఞానమూ అయితే, అందులో నన్ను కూడ ఇరికించి భూమాతాయజ్ఞమనీ, నాపేరు పెట్టి ఎందుకు చేయుచున్నారు.

పండితులు :- భూమాతాయజ్ఞము చేస్తే పంటలు బాగాపండుతాయని, ప్రజలు సుఖముగా ఉంటారని చేస్తున్నాము.

భూమి :- ఆహా ఇంతటి మోసమా? మీరు పండితులని పిలిపించు కొనుటకు తగినవారేనా? నాపేరు చెప్పి ప్రజలను మోసము చేస్తారా? నాపేరు పెట్టి యజ్ఞము చేస్తే పంటలు బాగాపండుతాయని నేను ఎవరితోనైనా చెప్పానా? నేను ఎవరికీ చెప్పని విషయమును మీరెందుకు చెప్పుచున్నారు? నీకు యజ్ఞము చేయమని నీతో చెప్పానా? నీతో చెప్పానా? చెప్పండి.

పండితులు :- లేదు తల్లీ! మమ్ములను క్షమించు.

భూమి :- ఏమిటి నేను తల్లినా? నాపేరు భూమాతనా? ఏమీ తెలియని ప్రజలు, మీమాటలువిని నన్ను ఆడదానిగా లెక్కించుకోరా? ఎవరు చెప్పారు. నేను స్త్రీనని చెప్పండి.

పండితుడు :- ప్రకృతి స్త్రీ స్వరూపమని భగవద్గీతలో చదివాము.

భూమి :- ప్రకృతి అంటే ఐదు భాగములు తెలుసా! అందులో నేను ఒక్కణ్ణి, నేను ప్రకృతిలో ఒక భాగమైనంత మాత్రమున నన్ను స్త్రీగా లెక్కించు కోవడము పొరపాటు కాదా? నేను ప్రకృతిలో ఒక్కణ్ణి కావున మీరు నన్ను స్త్రీగా పోల్చి చెప్పుకుంటే, అదే పద్ధతి ప్రకారము అగ్నిని అగ్నిమాతా అనాలి కదా? అలా ఎందుకనలేదు. అగ్ని దేవుడని ఎందుకంటున్నారు. గాలిని గాలిమాత అనవచ్చును కదా? గాలి దేవుడనీ, వాయుదేవుడనీ ఎందు కంటున్నారు. గాలికి పుట్టినవాడు ఆంజనేయుడని చెప్పుకొంటున్నారే. అపుడు స్త్రీగా గాలినెందుకు చెప్పలేదు? ప్రకృతిలో భాగములైన అగ్నిని అగ్ని దేవుడనీ, వాయువును వాయుదేవుడనీ పిలిచెడి మీరు, నన్నేమో భూమాత అని అంటున్నారెందుకు?

(అక్కడ ఒక విధమైన శబ్దము ఏర్పడగా అందరూ ఆశ్చరముగ చూస్తుండగా అక్కడికి వాయువు, అగ్ని ఇద్దరూ ప్రవేశిస్తారు.)

అగ్ని :- ఏమి భూమీ! నీవేదో మాపేర్లు చెప్పుచున్నావు.

భూమి :- అవును. నేను కూడ మీతోపాటు పురుషుణ్ణే కదా! వీరు నన్ను భూమాత అనీ, భూదేవి అని పిలుస్తున్నారు. అదే విషయమును గురించి వాయువును వాయుదేవుడనీ, అగ్నిని అగ్ని దేవుడని చెప్పే వీరు నన్ను మాత్రము ఆడదిగా చెప్పడమెందుకని ప్రశ్నించుచున్నాను.

అగ్ని :- భూమిమీద మేము ఎంతో జ్ఞానులమనీ, సర్వజ్ఞులమనీ చెప్పుకొనే వీరు, నిన్ను స్త్రీగానే పిలుస్తున్నారు. అంతమాత్రము తప్ప, నిన్ను ఎక్కడా వాడుకోలేదు. నన్నయితే ఏకముగా గుమస్తానే చేసినారు. వీరు యజ్ఞ గుండములో వేసే పట్టుచీరలు, నగలు మొదలుకొని ప్రతీదీ ఎవరికి సమర్పిస్తే వారికి చేర్చుటకు, ఆ వస్తువులను కాల్చి పొగరూపములోనికి మార్చి పంపాలట!

వాయువు :- నీవు పొగరూపములోనికి మార్చితే, ఆ పొగరూపములో ఉన్న వస్తువులను వీరు ఎవరి పేరు చెప్పి సమర్పించారో వారికి చేర్చాలట. వీరి లెక్కలో నేను కూడ గుమస్తానే! యజ్ఞాలు చేస్తే లాభాలు కలుగుతాయని భ్రమించి, మమ్ములను మీ పని మనుషులుగా ప్రచారము చేస్తారా? తెలియని ప్రజలు మేము అలాంటి పనులు చేసేవారమే అనుకోరా? ప్రకృతిలో భాగములైన మేము, దేవుని ఆజ్ఞ ప్రకారము పనిచేయుచున్నాము. కానీ మనుషుల ఆజ్ఞల ప్రకారము పనులు చేయడములేదు. మీరు చేసే యజ్ఞముల వలన, ప్రజలు మమ్ములను తప్పుగా అర్థము చేసుకొను అవకాశము గలదు. పండితులమని పేరుపెట్టుకున్న మీరు, మమ్ములను పని మనుషులుగా ప్రచారము చేయడము బావ్యమా! మీరు చేసే యజ్ఞములో అటు భూమి, ఇటు నీరుకంటే అగ్ని వాయువులైన మమ్మే ఎక్కువ వాడుకొను చున్నారు. ఇది మీకు ధర్మమా?

(అపుడు మరియొక వింతశబ్దము ఏర్పడును. అంతలో అక్కడికి నీరు కూడ వచ్చును.)

నీరు :- ఏమిటీ? ఇక్కడ భూమి, అగ్ని, వాయువు ముగ్గురూ ఉన్నారు. నాపేరును పలుకుచున్నారేమిటి?

అగ్ని :- భక్తి అను ముసుగులో వీరు చేయు అధర్మపనులను విమర్శిస్తున్నాము. మీస్వార్థము కొరకు మమ్ములను ఎందుకు దుష్ప్రచారము చేస్తున్నారని అడుగుచున్నాము.

నీరు :- వీరు పండితులమని పేరుకల్గి, భక్తి అను పేరుతో వక్రమార్గములో ప్రయాణిస్తూ, వీరు చెడిపోవడమేకాక, వీరిని అనుసరించు ప్రజానీకమంతా చెడిపోవునట్లు చేయుచున్నారు. పండు అనగా బాగా పరిపక్వత చెందినదని అర్థము. జ్ఞానములో బాగా పండినవారిని పండితులు అని అనవచ్చును. కానీ వీరివద్ద జ్ఞానము ఏమాత్రములేదు. అయినా పండితులమని ముసుగు తగిలించుకొన్నారు. భక్తీ, విశ్వాసము, విశ్వమునకంతా అధిపతియైన దేవుని మీద ఉండాలి. దేవుని మీదకాక చిల్లర దేవుళ్ళ మీద భక్తిని చూపుచు వారికొరకు యజ్ఞములనుచేయు వీరా పండితులు? వీరిలో చిల్లర దేవుళ్ళ భ్రమతప్ప అందరికి అధిపతియైన, అన్ని మతములకు పెద్దదిక్కు అయిన దేవుని మీద వీరి దృష్ఠి ఏమాత్రములేదు. మహాభూతములని పేరుగాంచిన భూమినేమో భూమాతా, భూదేవి అని స్త్రీని చేశారు. అగ్ని, వాయువులనిద్దరిని అగ్నిదేవుడు, వాయుదేవుడని మగవారిని చేశారు. చివరకు నీరునైన నన్ను అటు ఆడకాకుండ, ఇటు మగకాకుండ చేశారు. నదిలో ఉన్నప్పుడు గంగమ్మ తల్లి అనీ అంటూనే, సముద్రములో ఉన్నప్పుడు సముద్రుడు అంటున్నారు. వీరు చెప్పుమాటలనుబట్టి, కొందరు ప్రజలు నన్ను ఆడకాక, మగకాక రెండింటికి తప్పినవాడని అనుకొంటున్నారు.

పుష్కరాలని పేరుపెట్టి, వీరి స్వార్థముకొరకు శుభ్రముగ పారుచున్న నన్ను అశుభ్రము చేయుచున్నారు. నాలో స్నానముచేస్తే మీపాపాలను కడిగేస్తానని ఎవరికైనా చెప్పియున్నానా? మీరు చేసుకొన్న పాపాలు నా నదిలో స్నానము చేస్తే పోవు అని తెలుసుకొనే దానికి, పుష్కరాలకు వచ్చి తిరిగిపోయే వారిలో కొందరికి నేను రోడ్డు ప్రమాదములు కలిగించి కాళ్ళు, చేతులు విరిగేటట్లు చేశాను. అప్పటికైనా పుష్కరాలలో శరీరము మీద మలినము తప్ప, తలలోని పాపములు పోవని ఎవరైనా తెలుసు కొంటున్నారా? అదియు లేదు. పాపములు పోతే అనుభవించేది ఉండదు కదా! అలాంటపుడు నాకు చేయి ఎందుకు విరిగింది? కాలు ఎందుకు విరిగింది? ప్రమాదము ఎందుకు జరిగింది? అని మేధావులు కూడ ఆలోచించడములేదు. ఎవరూ నిజము తెలుసుకోకుండా పుష్కరాల పేరుతో నన్నూ, యజ్ఞాలపేరుతో అగ్ని, వాయువులనూ బాధించు వీరి మీద, మాకు ఎంతో కోపమున్నా, మేము ఏమీ అనకుండా ఇంకా కొంతకాలానికైనా తెలుసుకుంటారులే అని కొంత ఓర్పుతోనే ఉన్నాము. వీరికి మాలాంటి వారికంటే రావణబ్రహ్మయే సరియైనవాడు. ఎందుకంటే ఆయన యజ్ఞములు చేయడము మంచిదికాదని కొట్టిచెప్పాడు.

(అంతలో ఒకరకమైన శబ్దము ఏర్పడుతుంది. అపుడు రావణ బ్రహ్మయే స్వయముగా అట్టహాసముగా అక్కడికి వస్తాడు.)

భటులు :- అహో! రావణబ్రహ్మ! త్రికాలజ్ఞానీ, బ్రహ్మజ్ఞానీ, దైవాంశ సంభూతా! నవగ్రహములనే శాసించిన శాసనకర్త! ధర్మప్రచారా! అధర్మశత్రూ మీకిదే మా వందనమ్‌.

రావణబ్రహ్మ :- ఏమిటీ! త్రేతాయుగములో బ్రహ్మ అని పేరుగాంచిన నన్ను, కలియుగములో ఈ విధముగ పొగడుటయా! కలియుగములో... అజ్ఞానాంధ కారములో... భ్రమించు మనుషులు, నన్ను దుర్మార్గునిగా... దుష్టునిగా... చెప్పుకొను తరుణములో, నన్ను సుత్తించుటయా... బహు ఆశ్చర్యముగ నున్నదే... ఎవరు మీరు?

భటులు :- మేము మీ అభిమానులము. త్రైతసిద్ధాంత ఆదికర్త అయిన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల శిష్యులము. మా గురువుగారు చెప్పిన జ్ఞానము వలన మిమ్ములను, మీ ఔన్నత్యమును గుర్తించాము.

రావణబ్రహ్మ :- లెస్సపలికితిరి! లెస్సపలికితిరి! యోగీశ్వరుడే మీకు గురువుగా దొరికినందుకు మీరు ధన్యులు. నొక్కివక్కాణించు సత్యమేమంటే మీ గురువు అగమ్య, అగోచర, అనర్థ, అపారుడు. ఆయన ఎవరికీ అర్థము కాడు, అంతే. అసలు విషయానికి వస్తాము, ఇపుడు ఇక్కడ భూమి, అగ్ని, వాయువు, నీరు ఇందరు కలిసి నా నామధేయమును ఉచ్చరించు కారణమేమిటి?

భటులు :- ఇక్కడ భూమాతా యజ్ఞమను కార్యము జరుగుచున్నది. దానిని వ్యతిరేకించుటకు మేము వచ్చాము. మాకు శ్రమలేకుండ సత్యము చెప్పుటకు మాకు సహాయకులుగా మహాభూతములైన భూమి, అగ్ని, వాయువు, నీరు వచ్చారు. వారి మాటలలో మీపేరు వచ్చింది.

రావణబ్రహ్మ :- అటులనా! సారాంశమర్థమైనది. మహాభూతములారా మీరేమన్నారు?

భూతములు :- మేము ఈ కార్యము తగదని, అజ్ఞానమనీ, అధర్మమనీ చెప్పుచున్నాము. స్వయముగా తమరే వచ్చారు, మాకు సంతోషము.

రావణబ్రహ్మ :- మదీయ నామధేయము రావణ! నవగ్రహముల ముఖతా బ్రహ్మ బిరుదాంకితుడనై, రావణ బ్రహ్మయని పేరుగాంచిన నన్ను, ఒక అసురునిగా భావించి, రావణాసుర అని పిలుచు ఈ కలియుగ వాసులను మూర్ఖులనాలో లేక మూఢులనాలో నాకే అర్థముకాలేదు.

నాలో అసురత్వమున్నదా?..........అజ్ఞానమున్నదా?....... అధర్మమున్నదా?..... అహేతుకమున్నదా?..... ఏమి చూచి నాకు రావణాసుర అని రాక్షస పేరు పెట్టారు?

అహర్ణిశలు ధర్మచింతనా పరుడనై... కర్మయోగా అనుష్టుడనై.... ధర్మకార్యాచరుడనై.... వేదఘోష వ్యతిరేఖినై.... యజ్ఞయాగాదుల బద్ద శత్రువునైన నన్ను.... అసురా! రావణాసురా! అని పిలుచు ఈ మూర్ఖ మూఢ మానవులకు మీరే కాదు నేనుకూడ బుద్ధి చెప్పవలసిందే.

త్రేతాయుగములోనే నేను యజ్ఞములను వ్యతిరేఖించాను. వేద పఠనములను వ్యతిరేఖించాను. వాటిని అచరించు వారిని ముప్పుతిప్పలు పెట్టి మాన్పించాలని చూచాను. యజ్ఞముల విషయములోనే మొదట పిల్లవాడైన శ్రీరామునితో శత్రుత్వము పెంచుకొన్నాను. నేను ఎంత వ్యతి రేఖించినా, మనుషులు మాయప్రభావితులై యజ్ఞముల నుండి బయటికి రాలేకపోయారు. ఆనాటి ఆర్యులైన వారు నన్ను దుర్మార్గునిగా, స్త్రీలోలునిగా, కామాంధముతో సీతను అపహరించిన వానిగా ప్రచారము చేశారు. నా వయస్సు 90 సంవత్సరములుండగా, నాకు మనువరాలు వయసున్న సీతను కోరినానని దష్‌ష్ప్రచారము చేశారు.

ద్వాపరయుగములో స్వయముగా భగవంతుడే వచ్చి యజ్ఞములు బాహ్యముగా చేయునవికావు, దేహములోనే రెండు రకముల యజ్ఞములు ఉన్నాయని చెప్పినా, బాహ్యయజ్ఞముల వలన దేవుణ్ణి చేరలేరని చెప్పినా, ఆయన మాటలను మనుషులు ఖాతరు చేయలేదు. సాక్షాత్తు దేవుడేయైన కృష్ణుణ్ణి కూడ నిందించారు. ఈనాటికి ఆయన మీద మంచి అభిప్రాయము లేదు. భగవంతుడైన కృష్ణుణ్ణే జారుడు, చోరుడు అని ప్రచారము చేయుచున్నారు. కలియుగములో యోగీశ్వరుడైన ఆచార్య ప్రబోధానంద యజ్ఞముల వలనగానీ, వేదపఠనములవలనగానీ, దానముల వలనగానీ, తపస్సుల వలనగానీ దేవుడు తెలియబడడని చెప్పుచూ, గీతను ఆధారముగా చూపుచున్నప్పటికి, హిందువులమని పేరుపెట్టుకొన్న వారికే నచ్చక, ఆయనను కూడ చెడుగానే చెప్పుకొంటున్నారు. త్రేతాయుగములో బ్రహ్మ అని పేరు గాంచిన నన్నుగానీ.... ద్వాపరయుగములో భగవంతుడని గుర్తింపు వచ్చిన కృష్ణున్నిగానీ.... వదలక, చెడుగా చెప్పుచున్న మానవులు, కలియుగములో యోగీశ్వరుడని పేరుగాంచిన ఆచార్య ప్రబోధానందను చెడుగా చెప్పకుండా వదులుతారా?

ఇటు నన్ను, అటు యోగీశ్వరులను మానవులుగా లెక్కించితే లెక్కించవచ్చు. మా మాటలను అజ్ఞానముగా పోల్చితే పోల్చవచ్చు, మమ్ములను దుర్మార్గులుగా భావించితే భావించవచ్చును. కానీ సాక్షాత్తు దేవుని అవతారమైన కృష్ణుడు చెప్పిన మాటలనైనా కలియుగములోని మనుషులు నమ్మగలిగారా? కృష్ణుడు భగవద్గీతను బోధించుచు అందులో అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయములో 28వ శ్లోకమున యోగి అయిన వాడు వేదపారాయణము చేయువారికంటే, యజ్ఞములు చేయువారికంటే, దానములు చేయువారికంటే, తపస్సులు చేయువారికంటే అధికుడనీ, వారి పుణ్యములకంటే అధికశక్తికలవాడనీ తెలియజేశాడు కదా!

విశ్వరూప సందర్శన యోగములో 48 శ్లోకమున మరియు 58 శ్లోకమున తపములచేతగానీ, దానములచేతగానీ, వేదాధ్యయనముల వలన గానీ, యజ్ఞముల వలనగానీ దేవుణ్ణి తెలియుటకు శక్యముకాదని చెప్పాడు కదా! మేము హిందువులమని గొప్పగ చెప్పుకొను మీరు, హిందూ మతములో పరమ, పవిత్ర, పరిశుద్ధ గ్రంథముగ పేరుగాంచినదీ, దేవుడే స్వయముగా చెప్పినదీ అయిన భగవద్గీతను నమ్మరా?

దేవుని మాటను కూడ లెక్కించకుండా వేదములను పారాయణము చేయువారినీ, యజ్ఞములను చేయువారినీ, నా కాలములో తీవ్రముగా శిక్షించాను. యజ్ఞములను ధ్వంసము చేయించాను. అప్పుడు నేను చేసినది మంచిపనియని చెప్పుటకు ద్వాపరయుగములోని భగవద్గీత కూడ ఆధారముగా ఉన్నది.

ఇప్పటికైన మీరు బయటి యజ్ఞములను మానుకొని, దేవుడు చెప్పిన లోపలి యజ్ఞములను ఆచరించండి. మీ కర్మలను ఆ యజ్ఞములో కాల్చండి. మీ కర్మనిర్మూలనమైన రోజు, మీరు దేవునివద్దకు చేరవచ్చును. ఈ మాటలను లెక్కించక, మీ బుద్ధులుమానక, అట్లే యజ్ఞములు చేయుచూ ఉంటే నేను తిరిగి భూమిమీదకు రావలసి వస్తుంది. మీ యజ్ఞములను ధ్వంసము చేయవలసివస్తుంది జాగ్రత్త.

పండితులు :- మమ్ములను క్షమించండి. మీరు ఇంతమంది వచ్చి చెప్పేంతవరకు మేము చేయుచున్నది ధర్మమే అని నమ్మియుంటిమి. ఇపుడు మీ మాటలువిన్న తర్వాత, మేము ఇంతవరకు చేసినది అధర్మమే అని తెలియుచున్నది. ఇప్పటినుండి మేము కూడా యజ్ఞములు, వేదా ధ్యయనములు అధర్మమని ఇతరులకు తెలియజేస్తాము.

నేటికాలములో మీవలె చెప్పుచున్న అచార్య ప్రబోధానంద యోగీశ్వరుల మాటలనే వింటాము. ప్రేక్షకులైన మీరు కూడ నేడు ఎవరూ బోధించని అణగారిపోయిన ధర్మములను తెలియజేయు శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల జ్ఞానమును విని తరించండి...

రావణబ్రహ్మకు...జై

అర్ధ శతాధిక గ్రంథకర్త, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు...జై

-***-