ప్రబోధానందం నాటికలు/ఎవరు దేవుడు

ఎవరు దేవుడు

ఎల్లయ్య, గిరి అను ఇద్దరు భక్తులు స్టేజిమీద దేవుని గురించి వాదోపవాదములు చేయుచుందురు. ఎల్లయ్య, "ఆదిపరాశక్తియే దేవుళ్ళందరికి పెద్దయనీ, ఆమెవలననే త్రిమూర్తులైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు పుట్టారనీ, దేవతలందరికీ పెద్ద ఆదిపరాశక్తియే" అని వాదించుచుండును. గిరి "దేవుడు పురుషునిగానే ఉండును, స్త్రీ ప్రకృతి స్వరూపిణి. అందువలన పరాశక్తి అందరికీ తల్లివంటిది ఆమెకు భర్త అయిన దేవుడు ప్రత్యేకముగా ఉన్నాడు" అని అన్నాడు.

ఎల్లయ్య :- దేవతలందరికీ పెద్దయిన విష్ణువుకే ఆమెతల్లి అయినపుడు విష్ణువుకంటే ఏ దేవుడు పెద్దలేనపుడు ఆదిపరాశక్తియే కదా అందరికీ పెద్ద.

గిరి :- ఆదిపరాశక్తి అయిన ఆమెకు కూడ భర్తగలడు. ఆయనే అసలైన దేవుడు. ఆయననే కొందరు సృష్ఠికర్తయని, కొందరు పరమాత్మయనీ, కొందరు దేవుడని అనుచున్నారు.

ఎల్లయ్య :- నారాయణమూర్తి అయిన విష్ణువునే దేవుడని అందరూ అంటున్నారు కదా! ఆయనను పుట్టినంచిన ఆదిపరాశక్తియే కదా పెద్దది.

గిరి :- పరాశక్తికి పుట్టినవాడు సృష్ఠింపబడినవాడే కానీ సృష్ఠికర్త కాదుకదా! అటువంటపుడు విష్ణువును దేవుడని సృష్ఠికర్తయని ఎలా అనాలి?

ఎల్లయ్య :- అయితే నీ దేవుడు ఎవడో చెప్పు? ఎక్కడుంటాడో చెప్పు? ఏమి చేస్తుంటాడో చెప్పు?

గిరి :- ఎవడని చెప్పను! ఆయనకు పేరేలేదు, ఆకారము అంతకూలేదు, ఎక్కడుంటాడని చెప్పను? ఆయన అంతటా వ్యాపించి, అంతటా ఉండువాడు. ఆయన ఏమీ చేయడు. తన సంకల్పముతోనే ప్రకృతియే అన్నీ చేసి పెట్టుచున్నది. నిజానికి ఆయనెవరో భూమిమీద ఎవరికీ తెలియదు.

ఎల్లయ్య : -ఆయనెవడో ఎవరికీ తెలియనపుడు ఆయనతో మనకేమి పని?

గిరి :- మనము జీవులము కనుక, శరీరమను జైలులో చిక్కిన వారము కనుక, ఆయనశక్తిని మనము పొందనిదే, ఎవడూ దేహ ఖైదునుండి బయటపడడు కనుక, ఆయనే దేవుడు కనుక, ఆయనను తెలుసుకొనుటయే ప్రతి మనిషికి ముఖ్యమైన పని.

ఎల్లయ్య :- అటువంటి దేవుడు ఒకడున్నాడని పూర్వము ఎవరికైనా తెలుసునా? పూర్వము ఆయనను ఎవరైనా పూజించారా?

గిరి :- పూర్వము పరమాత్మను గురించి చాలామందికి తెలుసు. అందువలన త్రేతా యుగములోనే శ్రీరాముడు, రావణుడు, మానవాకారములేని గుండును దేవుని గుర్తుగా చేసి పూజించారు. అంతకుముందు సృష్ఠి ఆదిలోనే విష్ణు, ఈశ్వర, బ్రహ్మలైన త్రిమూర్తులు, వారికే తెలియని దేవునికొరకు ఎంతో తీవ్రముగా యోచించారు.

ఎల్లయ్య :- ఏమిటీ త్రిమూర్తులు కూడ ధ్యానించారా?

గిరి :- అవును త్రిమూర్తులను కూడ పుట్టించినవాడే సృష్ఠికర్తయిన దేవుడు. ఆ దేవున్ని గురించే పరమ, పవిత్ర, పరిశుద్ధ గ్రంథమైనభగవద్గీత కూడ చెప్పిది.

ఎల్లయ్య :- నేను నీ మాటను నమ్మను. ఇంతకాలము నేను పూజించిన పరాశక్తినే ఈ విషయము అడుగుతాను.

గిరి :- వీలైతే అడుగు.

ఎల్లయ్య :- అమ్మా! పరాశక్తీ! దేవుడెవరు అను సంశయాన్ని నీవే తీర్చాలి. ఈ విషయము నాకే కాదు సమస్త మానవాళికి తెలియాలి. నీవు మమ్ములను కరుణించి, మాకు కనిపించి ఈ విషయము చెప్పు తల్లీ.

(అంతలో పరాశక్తి స్టేజి మీద కనిపిస్తుంది.)

పరాశక్తి :- నేను దేవుణ్ణి ఏమాత్రము కాదు, ఒక దేవతను మాత్రమే. దేవుడెవరో తెలియాలంటే భగవద్గీతలో నేనే దేవున్ని అన్న శ్రీకృష్ణుణ్ణే అడగండి.

గిరి :- గీతను బోధించిన కృష్ణా! ఈ విషయమును నీవే చెప్పాలి. మా మాటను ఆలకించి మా సంశయమును తీర్చుము.

(అంతలో స్టేజి మీద కృష్ణుడు ప్రత్యక్షమైనాడు)

కృష్ణుడు :- కనిపించే వాడు ఎప్పటికి దేవుడు కాడు. అందువలన కనిపించే కృష్ణుడు దేవుడు కాడు, దేవుడెవరో తెలియాంటే నారదుణ్ణి అడగండి.

(అంతలో అక్కడికి నారదుడు కూడ వస్తాడు)

నారదుడు :- దేవుడెవరు? అన్నది అన్నిటికంటే పెద్దప్రశ్న. ఇది సమస్త మానవులకూ తెలియని ప్రశ్న. ఎందరో, ఎన్నో మతాలను సృష్ఠించుకొని దేవుడు ఫలానా అంటున్నారు. మా వాదనే నిజమని అన్ని మతములవారు అంటున్నారు. వాస్తవానికి ఎవరి మాటలూ సత్యముకావు. దేవుడెవరన్న సత్యమును నానోట, నామాటగా దేవుడే చెప్పించడము నాభాగ్యమని తలచుచున్నాను. దేవుడెవరన్న వివరము భగవద్గీతలో ఈ శ్రీకృష్ణులవారే చెప్పుచు వచ్చారు. నన్నే మ్రొక్కు, నన్నే ఆరాధించు, నేనే సృష్ఠికర్తను, పరమ్మాతను అన్న కృష్ణుడు కూడ ఇపుడు నేను దేవుణ్ణికాదంటున్నాడు. చావుపుట్టుకే లేని దేవుడు ఎవరన్నది ఎవరికీ తెలియదు. దేవుని విషయము తెలిసినవాడు దేవుడొక్కడే. ఆ విషయము మానవులకు తెలియాలంటే ఆయనే చెప్పాలి. ఆ సూత్రము ప్రకారము ఎచ్చట దేవుని ధర్మములు తెలియుచున్నవో, అచ్చట దేవుడే చెప్పుచున్నాడని తెలియాలి. దానిప్రకారము గీతలో సంపూర్ణ జ్ఞానమును తెలియజేసి, నేను తప్ప వేరు దేవుడులేడు అనిన కృష్ణుణ్ణి దేవుడనాలి. కానీ దేవుడు ఇంద్రియ అగోచరుడు అన్న సూత్రము ప్రకారము అయితే కంటికి కనిపించు కృష్ణుడు కూడ దేవుడు కాడు. అందువలన కృష్ణుడు కూడ నేను దేవుణ్ణి కాదు అంటున్నాడు. ఈ మాటయు వాస్తవమే. పరస్పర విరుద్ధవాక్యములను దేవుడు చెప్పునా అని కొందరు ప్రశ్నించవచ్చును. దేవుడు ఎప్పుడూ అలా చెప్పడు. వాస్తవ మేమంటే కనిపించే కృష్ణుని శరరీములోనుండి, కనిపించక మాట్లాడే వాడే దేవుడు. గీతలో నీముందు, నీ వెనుక, నీలోను ఉన్నానని అర్జునునితో చెప్పినపుడు అర్జునునికి అనుమానము వచ్చి, మాట్లాడువాడు కృష్ణుడుకాదని తలచి, నీవెవరని ప్రశ్నించినపుడు, నేను నీకంటికి కనిపించువాడను కానని స్వయముగ దేవుడే కృష్ణుని రూపమునుండి చెప్పాడు. ఆ దినము దేవుని రూపము అర్జునునికి మాత్రమే తెలియబడినది. ఎప్పటికైన అదియే భవిష్యత్‌ కాలమునకు నిదర్శనము. దీనినిబట్టి కృష్ణుని రూపే దేవుడైతే ప్రత్యేకముగా కనిపించనవసరము లేదు. కావున నేడు కృష్ణుడు, నేను దేవుణ్ణి కాదన్నమాట వాస్తవమే. అమ్మపరాశక్తి నేను దేవుణ్ణి కాదన్నమాటా వాస్తవమే.


కొందరు మనుషులు దేవుణ్ణి కృపామయుడు, ప్రేమమయుడు అంటున్నారు. ఆ మాట వాస్తవమా అని పరిశీలిస్తే, ‘కృప’ అనగా ‘దయ’ అని అర్థము. దయగాని, ప్రేమగాని ఇవి మానవుని తలలోని పండ్రెడు గుణములలో వేరువేరు రెండు గుణములు. దేవుడు గుణాతీతుడు అన్న సూత్రము ప్రకారము, దేవుడు ఏ ఒక్క గుణముగలవాడు కాదు. గుణము ఉంటే దానివలన కార్యము, కార్యము వలన కర్మ, కర్మవలన జన్మ తప్పక వస్తుంది. దేవుడు గుణములకు, కార్యములకు, కర్మలకు అతీతుడు కావున ప్రేమమయుడు, కృపామయుడు అన్న వాక్యము కూడ అతనికి సరిపోదు.


ఇకపోతే కొందరు దేవుడు పరలోకములో ఉన్నాడన్నారు. ఆ మాటను వివరిస్తూ, పరలోకము పైన ఆకాశములో ఉన్నదని, అక్కడినుండి దేవుడు తన దూతలను పంపి దేవుని విషయమును వారిద్వారా చెప్పించునని అంటున్నారు. పరలోకము ఎక్కడున్నది? ఎంతదూరములో ఉన్నది వారికే తెలియదు! ఎక్కడో ఉన్నాడంటే ఇక్కడ లేడనే కదా అర్థము? ఇక్కడ లేని వానిని, అక్కడ మాత్రమున్నవానిని కొంత ప్రదేశానికే పరిమితి చేయవచ్చును. ఈ మాటప్రకారము దేవుడు పరిమితుడగును. దేవుడు అప్రమేయుడు, అపరిమితుడు, ఎల్లలు లేనివాడు, ఏ కొలతకూ దొరకనివాడని, గీతలో దేవుడు చెప్పిన సూత్రముల ప్రకారము ఎక్కడో ఉన్నవాడు, ఇక్కడలేనివాడు దేవుడు కాడు.


మరికొందరు దేవుడు పరలోక రాజ్యములో నుండి తన ఇష్ట కుమారులను భూమిమీదకు ప్రవక్తలవలె పంపుచు, తన విషయము ప్రజలకు చెప్పునట్లు చేయుచున్నాడని అంటున్నారు. ఆయన గృహములో పని మనుషులు కూడ ఉన్నారని అంటున్నారు. దేవుడు సర్వవ్యాపి అను సూత్రము ప్రకారము, మరియు సర్వజీవరాసులకు నేను తండ్రిని అను సూత్రము ప్రకారము ఆయనకు జంతువులు, పక్షులు, మనుషులు అందరూ సంతతేకాని ఫలానావారే కుమారులను మాట వర్తించదు. పరలోకము ఈ లోకము లోనే కనిపించనిదని తెలియక ఎక్కడో ఉన్నదనుకోవడము పొరపాటు. అందువలన సర్వవ్యాపి, సర్వపిత అను సూత్రము ప్రకారము వారి అంచనా ప్రకారమనుకొన్నవాడు దేవుడు కాడు.


మరికొందరు కంటికి కనిపించేరాయినీ, రాజ్యమేలిన రాజును దేవుడనుచున్నారు. కనిపించే ఆవులో దేవుడున్నాడని కొందరు మ్రొక్కు చున్నారు. అలాగే గుర్తింపు పొందిన మనిషిలో దేవుడున్నాడని కొందరు మ్రొక్కుచున్నారు. ఇతరులను మ్రొక్కువారు ఇతరుల లోనికి, నన్ను మ్రొక్కు వాడు నాలోనికి, చేరునన్న సూత్రము ప్రకారము మనము మ్రొక్కువారందరు దేవుడుకాదని తెలియుచున్నది.


ఇన్ని చెప్పినా దేవుడెవరో చెప్పక ‘‘వీరు అనుకొన్నట్లు కాదు, వారు అనుకొన్నట్లు కాదు అంటున్నారు. మీకు తెలిసిన ప్రకారము దేవుడెవరో తేల్చి చెప్పలేదే’’ అని మీరనుకోవచ్చును. దానికి మా సమాధానమేమనగా! నేను చెప్పితే దేవుని జ్ఞానము అర్థమగును, కానీ దేవుడు అర్థముకాడు. దేవుడు అనిర్వచనీయుడు, మాటలకు అందనివాడు. అందులన దేవుని జ్ఞానమునే ఎవరైనా చెప్పవచ్చును. దేవుడు ఫలానా అని చెప్పలేడు. జ్ఞానము ప్రకారము చెప్పాలంటే, ఇక్కడ కనిపించక, సర్వమునకు సూత్రధారియై, జన్మకర్మకు అతీతుడై, మాయ జన్మయెత్తి, మాయ శరీరములోనున్న ఈ కృష్ణుణ్ణే దేవుడని చెప్పవచ్చును. ఇంతవరకు కృష్ణుడు కూడ దేవుడు కాదన్న మీరే, అదే నోటితో కృష్ణుణ్ణి దేవుడంటున్నారేమిటి అని చాలామందికి ప్రశ్న వచ్చియుండవచ్చును. దానికి నా జవాబు ఏమనగా! మీరు కంటికి కనిపించేదే చూస్తున్నారు. కావున మీకు ఈయన దేవుడుకానేకాడు. నేను కంటికి కనిపించని దానిని, నాకున్న నేత్రములతోకాక, అనేత్రముతో చూస్తున్నాను, కావున నాకు ఈయనే నిజమైన దేవుడు. సంపూర్ణ జ్ఞానమును తెలిసి మరొక జ్ఞాననేత్రము మీరు సంపాదించుకొన్న రోజు, మీకు నిజమైన దేవుడెవరో తెలియగలరు.


మీరు దేవుణ్ణి తెలియాలంటే త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి. నేనే దేవుణ్ణి అని ఒకచోట, నేను దేవుణ్ణికాదని మరొకచోట, నేనే అన్నీ చేయుచున్నానని ఒకచోట, నేనేమీ చేయలేదని మరొక చోట, నేను పుట్టేవాడినే కాదు అని ఒకచోట, నాకు అవసరమొచ్చినపుడు పుట్టుచున్నానని మరొకచోట పరస్పర విరుద్ధ వాక్యములను చెప్పిన దేవుణ్ణి కనుగొనండి. ఇక్కడ పరస్పర విరుద్ధ వాక్యములు దేవుని వాక్యములై ఉండునా అని కొందరికి నా మీద అనుమానము రావచ్చును. ప్రశ్న పుట్టించి, వెదికించి, జవాబు దొరికించడము దేవుని విధానము. అందువలన ప్రశ్నతో ఆగవద్దండి. జవాబు కొరకు వెదకండి, అంతటితోనే ఆపకండి, పూర్తి జవాబు దొరికే వరకు వెదకండి అప్పుడు తెలుస్తాడు దేవుడెవరో! ముఖ్యముగా చెప్పునదేమనగా! మీకు దొరికిన కొంత జవాబుతోనే గోడకట్టుకొని కూర్చోకండి. ఎక్కడ ప్రశ్నరాని జవాబు దొరుకునో, ఎప్పుడు ఎవరూ ఎదురాడని జ్ఞానము దొరుకునో, అప్పుడే దేవుడెవరో తెలియబడును. కానీ, ఇప్పటి కాలములో దేవుడే దిగివచ్చి, ఈ కృష్ణునిగా చెప్పినా వినక నాది ఫలానామతమని, నామాటే వినవలెనని అనుకొనుచుందురు. అట్టివారు వ్యర్థులగుదురు. మతాలకు అతీతముగా యోచించండి. మతము హద్దులో మాట్లాడకండి. దేవునివద్దకు చేరడానికి మతములో మార్గము దొరకదు. మతాతీతునివైనపుడే మార్గము దొరకగలదు.


నాకీ అవకాశమును కల్గించిన ఈ మాయ కృష్ణునికి, దేవదేవుడైన ఈయనకు నేను నమస్కరించుచున్నాను. నేను దేవుడుకాని కృష్ణునికి మ్రొక్కక, దేవుడైన కృష్ణునికే మ్రొక్కుచున్నాను. ఇదే నా సందేశము.

సృష్ఠికర్త, పరమాత్మ శ్రీకృష్ణునకు జై !!!

-***-