ప్రపంచ చరిత్ర/హెల్లాసు మహత్తర ప్రతిభ

నీతిని వచించెను. అతడు చెప్పిన దేమన - జాతి చరిత్రకు మూడు దశలుండును : విజయము : విజయమూలకముగా గర్వము : అన్యాయము : పిమ్మట పై కారణములవల్ల పతనము.


16

హెల్లాసు మహత్తర ప్రతిభ

జనవరి 23, 1931

పర్షియనులమీద గ్రీకుల విజయముల ననుసరించి రెండు ఫలితములు వచ్చినవి. పర్షియన్ సామ్రాజ్యము సన్నగిలి సన్నగిలి దుర్బల మాయెను. గ్రీకుల చరిత్రమున దివ్యయుగము ప్రారంభమాయెను. ఆ జాతి జీవితములో ఆవెలుగు కొద్దికాలమే యుండెను. 200 సంవత్సరముల కాలముమాత్రమే అది నిలిచెను. పర్షియా సామ్రాజ్యము, అంతకు పూర్వమందలి యితరసామ్రాజ్యములవలె విశాలమైనసామ్రాజ్యముండుట వల్ల వచ్చిన గొప్పతనము కాదు దానిది. కొంతకాలమైనపిమ్మట ఘనుడగు అలెగ్జాండరు తలయెత్తి తన విజయములతో, కొద్దికాలము, లోకమును ఆశ్చర్యమున ముంచెను. ఇప్పుడాతనిని గురించి మనము ప్రసంగించుకొనుట లేదు. పర్షియన్ సంగ్రామములకును, అలెగ్జాండరు రాకకును మధ్యనున్న కాలమునుగురించి మనము ప్రసంగించుకొనుచున్నాము. ధర్మాపిలె, సాలమీస్‌యుద్ధముల తరువాత 150 సంవత్సరములకాల మది. పర్షియనుల దండయాత్రలు గ్రీసుల నేకము చేసెను. ఈ ప్రమాదము తప్పుటతోడనే వారు మరల విడిపోయి వారిలోవారు పోరాడుకొనజొచ్చిరి. ముఖ్యముగా ఏథెన్సు నగరరాష్ట్రములును, స్పార్టాయును ప్రబలస్పర్థను పూనియుండిరి. వారి పోరాటములతో మనకిప్పుడు ప్రశంస లేదు. అవి ప్రధానము కాదు. మనము వారిని స్మరించుటకు కారణము, ఆ రోజులలో ఇతర విధములుగా గ్రీసు గొప్పతనము సంపాదించుకొన్నది. గ్రీసుయొక్క ఆనాటిఉచ్చదశను జ్ఞాపకముచేయు కొద్దిపుస్తకములు, కొద్ది ప్రతిమలు, కొద్ది శిథిలములు మన కిప్పుడు గోచరమగుచున్నవి. ఈ కొద్దివస్థువులే మనచేత తలయూపించుచున్నవి. హెల్లాసు ప్రజల సర్వతోముఖచాతురి చూచి మనము ఆశ్చర్యమగ్నమానసులమగు చున్నాము. ఇంత అందమైన శిలాప్రతిమలను, భవనములను నిర్మించిన చేతుల కెంత పనితన మున్నదో! మనస్సు లెంత పరిపక్వమైనవో : ఆ రోజులలో విగ్రహాదుల చెక్కుటకు ప్రసిద్ధివహించిన శిల్పి ఫిడియాస్. ఇంకను ప్రసిద్ధు లనేకులుండిరి. వారి నాటకములు సుభాంతములును, దుఃఖాంతములును సర్వోత్తమము లనిపించుకొన్నవి. సోఫోక్లీసు, ఎస్కిలస్, యురిపిడిస్, అరిస్టోఫేన్సు, పింవార్, మినాండర్, సాఫో మున్నగు పేళ్లు ప్రస్తుతము నీకు నామమాత్రములే. కాని పెద్దదానివైన పిమ్మట వారి గ్రంథములను నీవు చదవగలవని ఆశింతును. చదివిగ్రీసుయొక్క మహత్తరప్రతిభ కొంత అవగతము చేసికొనగలవు.

ఏ దేశచరిత్రనైనను ఎట్లు చదువవలెనో ఈ కాలమందలి గ్రీసు చరిత్రనుబట్టిమనముగ్రహించవలెను. అల్ప సంగ్రామములమీదను, గ్రీకు రాష్ట్రములలో నున్న అల్పత్వముమీదను బుద్ధిపెట్టుకున్నచో వారిని గురించి మన మేమి తెలిసికొనగలము? వారిని మన మవగాహనచేసికో దలచుకొన్నచో వారి తలంపులను మనము గ్రహించవలెను. వారేమనుకొనుచుండిరి? వారెట్టి కార్యములు చేసిరి? అను విషయములను మనము తెలిసికొనప్రయత్నించవలెను. నిజముగాప్రధానమైనది అంతరచరిత్రమే. ప్రాచీన గ్రీకు సంస్కృతికి నేటి యూరోపును వారసుగా చేసిన దిదియే.

జాతుల జీవితములలో అట్టి తేజోవంతమగు దశలు వచ్చి, పోవుట చూడ వింతగా నుండును. కొంతకాల మాదశలు సమస్తమును వికాసవంతము చేయును. ఆదేశమం దాకాలమునందున్న స్త్రీ పురుషులు రమణీయమగు వస్తువులను సృష్టిచేయుదురు. ప్రజ లావేశపూరితులైరా యనిపించును. మన దేశమునందుకూడ అట్టిదశలు వచ్చినవి. మనకు తెలిసినంతమట్టుకు తొలుతటి దశ వేదములును, ఉపనిషత్తులును, ఇతర గ్రంథములును పుట్టిన కాలము. దురదృష్టవశమున ఆప్రాచీనకాలమును గూర్చి చెప్పు గ్రంథములేమియు లేవు. ఎన్నోచక్కని గొప్పగ్రంథములు అంతరించియుండవచ్చును. లేదా ముందుముందు మనకు దొరకవచ్చును. ఉన్నదానినిబట్టి చూడ ప్రాచీనకాలమునాటి హిందూదేశస్థులు ఎంతటి అఖండమైన బుద్ధియు, ప్రజ్ఞయు కలవారో తెలిసికొనవచ్చును. తరువాత కాలమునాటి హిందూదేశ చరిత్రలోకూడ అట్టి తేజోవంతమగు దశలున్నవి. యుగములలో మనము చేయుచున్న సంచారములందు దానిని మనము చూడవచ్చును.

ఈకాలమున ముఖ్యముగా ఏథెంసు ప్రసిద్ధికివచ్చెను. దానినాయకు డొక గొప్ప రాజకీయవేత్త. అతని పేరు పెరిక్లీసు. ముప్పది సంవత్సరములపాటు అతడు అధికారపదవియం దుండెను. ఈ కాలమున ఏథెన్సు గొప్ప నగరమైనది. చక్కని భవనములతో, గొప్ప చిత్రకారులతో, గొప్ప తత్వవేత్తలతో అది నిండియుండెను. నేడుకూడ దానిని పెరిక్లీసుయొక్క ఏథెన్సు అందురు. పెరిక్లీసుయుగ మను నానుడికూడ కలదు.

ఈకాలమునందే ఏథెన్సులోనున్న చరిత్రకారుడగు మన హెరొడోటస్ ఏథెన్సు పొందిన యభివృద్ధినిగూర్చి తన యభిప్రాయమును చెప్పెను. నీతులు చెప్పుట అతనికిష్టము. కాన పైవిషయములనుగూర్చి యాతడు నీతిని చెప్పెను. తన చరిత్రలో నాత డిట్లు వ్రాసెను.

"ఏథెన్సు ప్రభుత్వ మతిశయించెను. స్వాతంత్ర్యము మంచిదనుట కిది నిదర్శనము. దీనిని ఋజువుచేయుటకు ప్రతిచోటను దృష్టాంతములు గలవు. ఏథెన్సుప్రజలు నిరంకుశప్రభుత్వముక్రింద మ్రగ్గుచున్నప్పుడు యుద్ధకౌశలము వారికి పొరుగువారికన్న నధికముగాలేదు. నిరంకుశ ప్రభువును వారు వదల్చుకొన్నపిమ్మట యుద్ధమున, పొరుగువారిని వారు మించిరి. ఒకనికి లొంగి యున్నప్పుడు వారు పురుషప్రయత్నము చేయలేదు. యజమాని కొరకు మాత్రమే వారు పనిచేయుచుండిరి. స్వాతంత్ర్యము చేజిక్కగానే ఎవరికి వారు, ఇతరుల ప్రోద్బలములేకుండగనే తమశక్తివంచనలేకుండ పనిచేసిరి."

ఆకాలమునాటి ప్రసిద్ధపురుషుల పేళ్లు పేర్కినియుంటిని. వారందరికన్నను గొప్పవాడు - ఆకాలమునందున్నను గొప్ప వాడనిపించుకోదగ్గవాడు. - అయిన పురుషుని నేనింకను పేర్కొనలేదు. అతని పేరు సోక్రటీసు. అతడు తత్వవేత్త. సత్యాంవేషణమే అతని నిరంతర కృషి. మనష్యున కుండదగ్గది జ్ఞాన మొక్కటే యని అతని యభిప్రాయము. క్లిష్టసమస్యల నాతడు తన మిత్రులతోను, పరిచయములతోను తరచు చర్చించుచుండెను. చర్చలఫలితముగా సత్యము వెల్లడియగునని అతని యాశయము. అతనికి శిష్యులనేకులు గలరు. వారందరిలోను గొప్పవాడు ప్లేటో. ప్లేటో అనేకగ్రంథములను వ్రాసెను. అవి మనవరకు వచ్చినవి. ఈ గ్రంథములనుబట్టియే అతని గురువైన సోక్రటీసును గురించిన విషయములు పెక్కులు మనము తెలిసికోగలిగితిమి. నూతన విషయములను కనుగొనగోరువారిని చూచిన దొరతనములకు కన్నుకుట్టుట వాస్తవము. సత్యాంవేషణ చేయుట వారికి కిట్టదు. ఏథెన్సు దొరతనము సోక్రటీసు పద్దతుల నిష్టపడలేదు. విచారణచేసి సోక్రటీసుకు మృత్యుదండన విధించెను. ప్రజలతో చర్చలు కట్టిపెట్టి, తనపద్ధతులు మార్చుకొనుటకు సమ్మతించి. ఆవిధముగా వాగ్ధానము చేసినయెడల వదిలి పెట్టుదుమని వారు చెప్పిరి. అత డట్లు చేయుటకు నిరాకరించెను. తన ధర్మమును పరిత్యజించుటకంటె విషముత్రాగుటయే సమ్మతమని చెప్పి, గిన్నెలో తెచ్చిన విషమును త్రాగి యాతడు మరణించెను. మృత్యుముఖములో ప్రవేశించుటకు ముందు తనపై నేరము మోపినవారిని, తీర్పు చెప్పినవారిని ఉద్దేశించి అత డిట్లు చెప్పెను.

"నా సత్యాన్వేషణమును పరిత్యజించిన నన్ను మీరు వదలిపెట్టెద రని మీరనినదానికి నేను చెప్పు సమాధానమిది. ఏథెన్సు ప్రజలారా! మీకు నమస్కారము. ఈ కార్యమునందు నన్ను భగవంతుడు నియోగించినని నా నమ్మకము. కాబట్టి అతని యాదేశముప్రకారమే చేయుదును. మీ మాటలు లెక్కపెట్టను. కంఠములో ఊపిరి, శరీరమున బలము ఉన్నంతకాలము తత్త్వజిజ్ఞాస మానను. నేనెవరిని కలిసికొన్నను వారిని కుశలమడిగి వారితోనిట్లు చెప్పుదును : "ధనముకొరకును, గౌరవములకొరకును మీరు ప్రాకులాడుచున్నారు. సత్యవివేకములపై మీకు శ్రద్ధలేదు. ఆత్మను నిరసింపజేసికొనవలెను నను శ్రద్ధ మీకులేదు. ఇందుకై మీరు సిగ్గుపడవద్దా? మృత్యువన్న నేమో నాకు తెలియదు. అది మంచిది కావచ్చును. మృత్యువన్న నాకు భయములేదు. కాని నేను నమ్మిన ధర్మమును నేను పరిత్యజించుట చెడ్డదని అని నాకు తెలియును. చెడ్డదని తెలిసిన పనిని నేను చెయ్యను. మంచిది కావచ్చు నన్నదానినే కోరుదును."

బ్రతికియుండి సోక్రటీసు సత్యజ్ఞానములకొరకై చక్కగా పాటుపడెను. మరణించుటవల్ల అంతకన్న అతిశయముగా వాటికి సేవచేసినట్లయినది.

ఈ రోజులలో అనేక సమస్యలనుగూర్చిన చర్చలు, వాదములు నీవు వినుచుందువు. చదువుచుందువు - సాంఘీకవాదమును, ధనికపక్షవాదమును, ఇతరవాదములను గూర్చిన చర్చలు, వాదములు. ఈప్రపంచమున బాధలు, అన్యాయము అధికముగా నున్నవి. పలువుర కిందలి పరిస్థితులు అసంతృప్తికరముగా నున్నవి. వాటిని మార్చవలెనని వారు పూనుకొనిరి. ప్రభుత్వమునకు సంబంధించిన సమస్యలను ప్లేటోకూడ ఆలోచించెను. దీనినిబట్టి చూడ ఆరోజులలోసైతము అందరును సుఖముగా జీవించగలుగుటకు దేశప్రభుత్వమునకును, సంఘమునకును ఎట్టి రూపము నీయవలెనో ప్రజలాలోచించు చుండిరని తేలుచున్నది.

ప్లేటో వార్ధక్యదశ నందుచుండగా వేరొక ప్రసిద్ధ గ్రీకుపురుషుడు రంగమునకు దిగుచుండెను. అతని పేరు అరిష్టాటిల్. ఘనుడగు అలెగ్జాండరు కతడు ఇంటివద్ద పాఠములుచెప్పు ఉపాధ్యాయుడు. అలెగ్జాండ రతని కార్యమునకు చాల తోడ్పడెను. సోక్రటీసువలెను, ప్లేటోవలెను అతడు తత్వశాస్త్ర సమస్యలనుగూర్చి విచారణపెట్టుకొనలేదు. ప్రకృతి లోని పదార్థములను పరిశీలించిచూచుట యన్నను, ప్రకృతి వైఖరుల నర్థము చేసికొనుటయన్నను అతని కిష్టము. దీనినే ప్రకృతి తత్వశాస్త్ర మందురు. ఇప్పుడు భౌతికశాస్త్ర మనుచున్నారు. కాబట్టి అరిష్టాటిల్ తొలినాటి శాస్త్రజ్ఞులలో ఒక్కడు.

ఇప్పుడు మనము అరిష్టాటిల్ శిష్యుడైన అలెగ్జాండరువద్దకుపోయి వేగముగా గడిచిపోయిన అతని జీవితచర్యను గమనింతము. ఆపని రేపు. ఈ రోజుకు కావలసినంత అప్పుడే వ్రాసితిని.

ఈ రోజు వసంతపంచమి. వసంతాగమము సూచించుచున్నది. అల్పకాలమే నిలిచిన హేమంతము గడచినది. గాలికి చురుకు తగ్గినది. పక్షులు క్రమక్రమముగా మావద్దకు వచ్చుచున్నవి. వాటి పాటలతో పగటి భాగము నంతయు నింపుచున్నవి. 15 సంవత్సరములకు పూర్వము, ఈదినమున, ఢిల్లీ నగరములో మీ అమ్మకును, నాకును పాణిగ్రహణము జరిగినది.

17

ప్రసిద్ధవిజేత, కాని దురహంకార పూరితుడగు యువకుడు

జనవరి 24, 1931

వెనుకటి జాబులోను, అంతకుముందు వ్రాసినజాబులలోను ఘనుడగు అలెగ్జాండరు పేరెత్తినాను. అతనిని గ్రీకు అన్నాను. అట్లనుట సరికాదు. అతడు నిజముగా మాసిడోనియను - అనగా గ్రీసుకు ఉత్తరమున నున్న దేశమునుండి వచ్చినవాడు. అనేకవిషయములలో మాసిడోనియనులు గ్రీకులను పోలియుండిరి. వారిని వారి జ్ఞాతులని చెప్పవచ్చును. అలెగ్జాండరుతండ్రి ఫిలిప్పు మాసిడోనియారాజు. అతడుసమర్థుడగు పరిపాలకుడు. తన చిన్న రాజ్యము నాతడు బలపరిచి సమర్థమగు