ప్రపంచ చరిత్ర/ప్రాచీన హిందూస్థానమున గ్రామపంచాయతులు
క్రిందులుగా నున్నది. మనలో మన మెక్కువగా ఇంగ్లీషుభాషను వాడుకొనుచున్నాము. నేను నీకు ఇంగ్లీషులో జాబులువ్రాయుట హస్యాస్పదము. కాని నేను వ్రాయుచునేయున్నాను. ఈ అలవాటు త్వరలో మనము తప్పించుకొందుమని ఆసించుచున్నాను.
10
ప్రాచీన హిందూస్థానమున గ్రామ పంచాయతులు
జనవరి 15, 1931
ప్రాచీనచరిత్ర పరిశీలనమున మనము ముందుకు సాగిపోవుట ఎట్లు: నేనెప్పుడును బాటవదలి ప్రక్క పుంతలకు పోవుచున్నాను. క్రిందటి జాబులో విషయము నెత్తుకొనబోవుచు ఇండియాలోని భాషలను గురించి చెప్పితిని,
ప్రాచీన హిందూస్థానమునకు మనము దిరిగిపోదము . ఇప్పుడు ఆఫ్‌ఘనిస్థాన మనబడు దేశము అప్పుడును, తరువాత ఎంతో కాలమువరకును హిందూదేశ భాగమైయుండెను. ఇండియా వాయవ్య దేశమును గాంధార మనెడివారు. హిందూదేశమున నుత్తరమునం దంతటను, గంగా, సింధు మైదానములలో ఆర్యులు పెద్ద వలస లేర్పరుచుకొనిరి. ఈ ఆర్యులు భవననిర్మాణచాతురి కలవారై యుందురు. వారిలో పలువురు పర్షియా, మెసపొటేమియాలలోని. తమ వలసప్రదేశములనుండివచ్చి యుందురు. అప్పటికే ఆదేశములందు మహానగరము లుండెను. ఆర్యుల వలసల మధ్యమధ్య అడవులు పెక్కులుండెను. ముఖ్యముగా ఉత్తర దక్షిణ హిందూదేశములకు మధ్య ఒక గొప్ప యడవి యుండెను. ఈ యడవిని దాటి ఉత్తరముననుండి దక్షిణమున కార్యులు వలసకై పోయియుండరు. కాని దేశపరిశోఛనార్థమును, వర్తకముకొరకును, ఆర్యసంస్కృతిని, ఆర్యుల సంప్రదాయములను వ్యాపింపజేయుటకును దక్షిణమునకు పలువురు పోయియుండవలెను. దక్షిణమునకు పోయిన మొట్ట మొదటి ఆర్యుడు అగస్త్యముని యని పెద్దలు చెప్పుదురు. అతను దక్షిణాపథమునకు ఆర్యుల మతమును, సంస్కృతిని తీసికొనిపోయెను.
అప్పుడే ఇండియూ విదేశములతో వర్తకమును బాహాటముగా చేయుచుండెను. దక్షిణదేశమున దొరకు మిరియాలు, బంగారము ముత్యములు సముద్రమున కావలసున్న విదేశీయుల నాకర్షించెను. బియ్యమునుకూడ బహుశా ఆకాలమున ఎగుమతి చేసెడివారు, బాబిలన్‌లోని పురాతన భవనములంచు మలబారు టేకుకలప కానవచ్చినది.
క్రమక్రమముగా ఆర్యులు ఇండియాలో తమ గ్రామపద్దతిని ప్రారంభించి వృద్ధిలోనికి తెచ్చిరి. ఇది ప్రాచీన ద్రావిడ గ్రామము యొక్కయు, నవీన ఆర్యాభిప్రాయములయొక్కయు సమ్మేళనమే. ఈ గ్రామములు సర్వస్వతంత్రములనియే చెప్పవచ్చును. గ్రామస్థు లెస్నుకొన్న పంచాయతీ లీ గ్రామమును పరిపాలించుచుండెను. కొన్ని గ్రామములో. చిన్న పట్టణములోచేరి యొక రాజుయొక్కగాని, నాయకుని యొక్కగాని పరిపాలనమందుండెను. వీరి నొక్కొక్కప్పుడు ఎన్నుకొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు వీరు వంశ పారంపర్యముగా వచ్చిన వారై యుందురు. తరుచుగా వేర్వేరు గ్రామసంఘములుచేరి అందరి శ్రేయస్సునకును అవసరమైన పనులు చేయుచుండెడివి. రోడ్లు వేయుట, సత్రములు నిర్మించుట, పంటకాల్వలు త్రవ్వుట మున్నగు నిట్టి సంఘశ్రేయమున కుద్దేశింపబడిన కార్యములు చేయుచుండెడివి. రాజ్యమున తాను ప్రధానపురుషుడై నప్పటికి రాజు తన యిష్టమువచ్చినట్లు చేయుటకు వీలుండెడిది కాదట. , ఆర్యధర్మములకును, ఆచారములకును అతడు కట్టుబడియుండవలెను. అతనిని పదభ్రష్టుని చేయుటకుగాని, అతనిపై దండుగ (జుల్మానా) విధించుటకుగాని ప్రజలకు హక్కు కలదు. రాజ్యమును నేనే అని రాజు చెప్పుకొనుట లేదు. గత లేఖలలో ఈ విషయము నీకు వ్రాసితిని. వీనినిబట్టిచూడ ఆర్యుల నివాసభూములం దొక విధమగు ప్రజాపరిపాలన ముంచెడిదని తేలుచున్నది. అనగా ఆర్యులగు ప్రజలు కొంతవరకు పరిపాలనమునం దధికారము వహించెడి వారన్నమాట.
ఈ హిండూ ఆర్యులను ఆర్యగ్రీకులతో పోల్చిచూడుము. భేదములు చాలా కనిపించునుకాని సాదృశ్యవిషయములుకూడ పెక్కు లున్నవి. రెండుచోట్లను ఒకవిధమగు ప్రజాపరిపాలన మమలులో నుండెను. ఆర్యు లున్నచోటనే సాధారణముగా ఇట్టి ప్రజాపరిపాలన ముండెనని మనము జ్ఞాపకముంచుకోవలెను. డారి బానిసలు - అనగా తక్కువవర్ణస్థులు ఇట్టి ప్రజాపరిపాలనమునుగాని, స్వేచ్ఛనుగాని ఎరుగరు. వర్ణములు నేడున్నట్లు, ఆ కాలమున అనేక విభాగములతో లేవు. ఆ రోజులలో హిందూ ఆర్యులందు నాలుగు సంఘభాగములు, అనగా నాలుగు వర్ణములు మాత్రమే ఉండెను. అవి యెవ్వియన - బ్రాహ్మణులు - వీరు పండితులు, పురోహితులు, ఋషులు : క్షత్రియులు -- పరిపాలకులు: వైశ్యులు వర్తకము చేయువారు: శూద్రులు ---పాటుపడి పనిచేయు కార్మికులు. కాన వర్ణవిభాగము వృత్తులనుబట్టి వచ్చెనని స్పష్టమగుచున్నది. తమచే జయింపబడిన జాతులతో తాము కలియ కుండ ఉండు తలంపుతో వర్ణవిభాగము ఆర్యులు చేసియుండవచ్చును కూడ. ఆర్యులు అభిమానపూరికులు. ఇతర జాతులను వారు తిరస్కారభావముతో చూచునంతటి దురహంకారపూరితులు. కాన తమజాతివా రితరజాతులతో కలియుట వారి కష్టము లేకుండును. సంస్కృతములో వర్ణ మను పదమునకు రంగు అని యర్థము. దీనినిబట్టి హిందూదేశమునకు వచ్చిన ఆర్యులు అచ్చటి యాదిమ నివాసులకంటె సుందరమైనవారు, శుభ్రవర్ణులు అని తేటపడుచున్నది.
ఆర్యులు కార్మికుల నణచిపెట్టి వారిని తమ ప్రజాపరిపాలనమునం దేవిధముగను కలుగజేసికొనకుండ చేసి రను విషయ మొక్కటియు, తమలో తాము స్వేచ్ఛ ననుభవించుచుండి రను విషయ మొక్కటియు మనము జ్ఞాపకముంచుకోవలెను. వారి రాజులుగాని, పాలకులుగాని అక్రమముగా ప్రవర్తించుటకు వారు సమ్మతించలేదు. ఒక వేళ అక్రమముగా ప్రవర్తించినచో అట్టివారిని పదభ్రష్టులను చేయుచుండిరి. సాధారణముగా రాజులు క్షత్రియ వర్ణస్థులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు యుద్దతరుణములందును, కష్టకాలములందును తక్కువవర్ణస్థుడగు శూద్రుడు సైతము స్వసామర్థ్యముచే రాజు కావచ్చును. కాలము గడచినకొలది ఆర్యులు క్షీణదశకు వచ్చిరి. వర్ణవిభాగము మార్పుచెందుటకు వీలులేకుండ కర్కశమయ్యెను. అనేకవిభాగము లుదయించుటచే దేశము బలహీనమై పతనమయ్యెను. ఇదివరలో వారవలంబించిన స్వేచ్ఛనుగూర్చిన భావములుకూడ అంతరించెను. ఆర్యు డెన్నడును బానిసకాడనియు, ఆర్యనామమునకపకీర్తికలిగించుటకన్న చావు మేలనియు వెనుకటి రోజులలో చెప్పుచుండెడి వారు,
ఆర్యుల వలసలు, పట్టణములు, పల్లెలు ఒక క్రమపద్ధతి ననుసరించి నిర్మింపబడినవి. రేఖాగణితము ననుసరించి యీ పద్దతు లున్నవని చెప్పిన నీ వాశ్చర్యపడుదువు. రేఖాగణితము ననుసరించి యంత్రములు వేసి వేదకాలమున పూజించుచుండెడువారుకూడ. నేడుకూడ హిందూగృహములు పెక్కింటిలో ఇట్టి యంత్రపూజలు జరుగుచున్నవి. గృహనిర్మాణమునకును, పట్టణ నిర్మాణమునకును రేఖాగణితము దగ్గరి సంబంధము కలగియున్నది. ప్రాచీనార్యుల గ్రామము బహుశా ఒక దుర్గమైయుండెడిది. అప్పుడు శత్రుభయ మధికము. శత్రుభయము లేనప్పుడు సైతము నిర్మాణపద్ధతిలో మార్పురాలేదు.
ఒక సమచతురస్రము, దానిచుట్టును ప్రహరీగోడలు, నాలుగు పెద్ద ద్వారములు, నాలుగు చిన్న ద్వారములు – ఇది వారి పద్ధతియై యుండును. గోడలమధ్య ప్రదేశమున ఒక క్రమమున వీథులును, ఇండ్లును ఉండును. గ్రామమధ్యమున పంచాయతీగృహ ముండును. గ్రామ పెద్ద లీ గృహమందు సమావేశమగుచుందురు. చిన్న గ్రామములలో పంచాయతీగృహమునకు బదులు ఒక పెద్దచెట్టు ఉండును. ప్రతి సంవత్సరము గ్రామములోని స్వతంత్రు లందరును చేరి తమ పంచాయతీ నెన్నుకొందురు.
పండితులు పలువురు పట్టణములకు, పల్లెలకు సమీపమందున్న అడవులకు, శాంతముగా జీవితమును గడపుటకో, ఆధ్యయనాదులు జరుపు కొనుటకో పోయెడివారు. వారిని ఆశ్రయించుటకు శిష్యులు వచ్చి చేరుచుండెడివారు. ఇట్లు క్రమముగా క్రొత్త వలసలు ఉపాధ్యాయులతోను, శిష్యులతోను తయారగుచుండెను. ఈ వలసలు విశ్వవిద్యాలయములని మనము భావించవచ్చును. అచ్చట చక్కని భవనము లనేకములు లేవు గాని జ్ఞానార్జనకై దూరప్రాంతములనుండి ఆ విద్యాస్థానమునకు పలువురు వచ్చుచుండిరి.
ఆనందభవనము [1]కెదురుగా భారద్వాజాశ్రమ మున్నది. నీ కది బాగుగా తెలియును. రామాయణకాలమున భరద్వాజుడు ఋషి యనియు, వనవాసకాలమున శ్రీరామచంద్రు డాతనిని దర్శించెననియు నీకు తెలిసియే యుండవచ్చును. అతని ఆశ్రమమున వేలకొలది విద్యార్థు లుండెడివారని చెప్పుదురు. భరద్వాజుడు ప్రధానాచార్యుడుగా నది యొక పెద్ద విశ్వవిద్యాలయమై యుండవలెను. ఆ రోజులలో ఆశ్రమము గంగాతీరమున నుండెను. ఇప్పుడు గంగ ఒక మైలు దూరముగా పోయినది. మనతోట భూమి కొన్నిచోట్ల ఇసుకమయము. ఆ దినములలో నిది గంగ పారు ప్రదేశ మై యుండవచ్చును.
హిందూదేశమున నున్న ఆర్యులకా తొలిదినములు ఉచ్చకాలమై యుండెను. ఈ కాలమునకు మన దురదృష్టవశమున, చరిత్ర లేదు. మనకు తెలిసిన విషయము లన్నియు చరిత్రకాని గ్రంథములనుండి గ్రహించినవే. ఆ కాలమ నాటి రాజ్యములు, ప్రజాప్రభుత్వరాజ్యములు ఏవనగా - దక్షిణ బీహారులోని మగధరాజ్యము; ఉత్తర బీహారులోని విదేహరాజ్యము : కాశీరాజ్యము : అయోధ్య రాజధానిగా గల కోసలరాజ్యము (అయోధ్యనే నేడు ఫైజాబాదు అందురు): గంగా యమునలకు మధ్యనున్న పాంచాలదేశములు. పాంచాల రాజ్యములందలి ప్రఛాననగరములు మధుర, కన్యకుబ్జము. ఇవి తరువాతికాలపు చరిత్రలోకూడ ప్రసిద్ధివహించినవి. ఈ రెండు నగరములును ఇప్పుడున్నవి. కన్యకుబ్జమునకు నేటి పేరు కనోజ్. ఇది కాన్పూరు సమీపమున నున్నది. ఆ రోజులలో ఉజ్జయినికూడ ఉండెను. నేడది గ్వాలియరు సంస్థానములో చిన్న పట్టణము.
పాటలీపుత్రము (పాట్నా)నకు సమీపమున వైశాలి యను నగర ముండును. ప్రాచీన హిందూదేశచరిత్రలో ప్రసిద్దిజెందిన లిచ్ఛపులతెగకు చెందిన ముఖ్యపట్టణ మిది. వారి రాజ్యము ప్రజాప్రభుత్వ రాజ్యము. ప్రసిద్ధ పురుషుల సంఘము ఈ రాజ్యమును పాలించెను. ఈ సభకు ఎన్నుకొన్న అధ్యక్షుడుండెను. అతనిని నాయకు డనువారు.
కాలము గడువగా పెద్దపట్టణములు, నగరములు పెరుగజొచ్చెను. వర్తకము వృద్ధియయ్యెను. శిల్పవిద్యలు, వృత్తులు వికాసముచెందెను, నగరములు గొప్ప వర్తక కేంద్రములయ్యెను. బ్రాహ్మణులు శిష్యులతో నివసించు వనవాటికలలోని ఆశ్రమములు గొప్ప విశ్వవిద్యాలయ పట్టణములైనవి. ఈ విద్యాసంస్థలలో అప్పటి శాస్త్రము లన్నియు బోధించెడి వారు బ్రాహ్మణులు. ధనుర్విద్యను సైతము బోధించెడివారు. జ్ఞాపక మున్నదా. మహాభారతకథలోని పాండవుల గురువు ద్రోణాచార్యుడని. ఇతడు బ్రాహ్మణుడు. ఇతర శాస్త్రములతోపాటు ఈతడు రణవిద్యను కూడ శిష్యులకు బోధించెను.
- ↑ అలహాబాదులో నెహ్రూ కాపురముండు ఇల్లు.