ప్రపంచ చరిత్ర/పడమటి ఆసియాలోని సామ్రాజ్యములు



8

పడమటి ఆసియాలోని సామ్రాజ్యములు

జనవరి 13, 1931

నిన్నను మమ్మందరిని చూచుట మంచిదయినది. కాని తాతను చూచునప్పుడు నా కెంతో విచారము కలిగినది. ఆయన నీరసముగాను, జబ్బుగాను ఉన్నట్లు కనిపించిరి. మరల పుష్టిగట్టి యథాస్థితికి వచ్చువరకు ఆయనను జాగ్రత్తగా కనిపెట్టి చూచుచుండుము. నిన్న నీతో సరిగా మాటాడలేకపోతిని. సమావేశ మంత కొద్ది కాలములో జరుగవలసి యున్నప్పు డెవరేమి చేయగలరు ? మనము కలవలేని సమావేశములకు, చెయ్యలేని ప్రసంగములకు బదులు ఈ ఉత్తరములను వ్రాయుచున్నాను. కాని ఇవి వానివంటివి కావుగదా ! ఈ నటన చిరకాలము నిలువజాలదు. కాని ఇట్టి నటనకూడ ఒక్కొక్కప్పుడు మంచిదే.

ఇక మనము ప్రాచీనులవద్దకు పోదము. ఇప్పటివరకు ప్రాచీన గ్రీకులవద్ద నుంటిమి. ఈ కాలమున ఇతర దేశము లెట్లున్నవి? యూరోపులో నున్న యితర దేశములను గురించి మనము తెలిసికోవలసినది ఆట్టేలేదు. వానిని గురించి తెలిసికోదగ్గ విషయము లున్నట్లు లేదు. ఉన్నను నాకు తెలియవు. ఉత్తర యూరోపు యొక్క శీతోష్ణస్థితి బహుశా మారుచు ఉండవచ్చును. ఇందువల్ల క్రొత్త పరిస్థితు లేర్పడియుండ వచ్చును. నీకు జ్ఞాపకమున్నదేమో - ఎన్నో సంవత్సరములకు పూర్వము ఉత్తర యూరోపును, ఉత్తర ఆసియాయును శీతలముగా నుండెడివి. ఈ కాలమునకు హిమయుగ మని పేరు. పెద్ద హిమానీనదులు మధ్య యూరోపువరకు ప్రవహించెడివి. ఆ కాలమున బహుశా మానవుడు లేడేమో. ఒక వేళ ఉన్నను మానవత్వముకన్న పశుత్వమే ఆతనిలో ఎక్కువగా నుండెను. ఆ కాలమున హిమానీనదు లున్నవని యిప్పుడు మన కెట్లు తెలియునని అనుకొనుచున్నావేమో. ఆ కాలములో పుస్తకములుగాని, గ్రంథకర్తలుగాని లేరు కాబట్టి ఆ విషయములు వ్రాసిన గ్రంథము లుండవు. కాని ప్రకృతి వ్రాసిన గ్రంథమున్నదని నీవు మరచి పోలేదనుకొందును. తన కొండలమీదను, రాళ్ళమీదను ప్రకృతి తన చరిత్రను తన పద్ధతి ప్రకారము వ్రాయును. చదువదలచినవారందు చదువు వచ్చును. ఆది యొక విధమగు స్వీయచరిత్ర. హిమానీనదులు వాని యునికిని తెలుపుటకు కొన్ని గుర్తులను వదలును. ఒకమారు వానిని గుర్తించుట తెలిసికొన్నచో మన మెప్పుడును పొరపాటుపడము. ఈ గుర్తులను తెలిసికోగోరినచో హిమాలయములలోగాని, ఆల్ప్సుపర్వతములలోగాని, ఇతర ప్రదేశములందుగాని యిప్పుడున్న హిమానీనదులవద్దకు వెళ్ళవలేను. ఆల్ప్సులలోని బ్లాంకుశిఖరము చుట్టును ఉన్న హిమానీ నదులను నీవు చూచియుంటివిగదా. కాని అప్పుడీ గుర్తులు నీ కెవరును చూపలేదు కాబోలును. కాశ్మీరులోను, హిమాలయములం దితరభాగములలోసు చక్కని హిమానీనదులు పెక్కులున్నవి. మనకు మిక్కిలి దగ్గర నున్నది పిండారీ హిమానీనది. ఆల్మోరా కది వారము దినముల ప్రయాణములో నుండును. నేను చిన్నపిల్లవాడనుగా నున్నప్పుడు - ఇప్పుడు నీకంటే చిన్నగా నున్నప్పుడు అక్కడి కొకమారు పెళ్ళితిని. ఆ దృశ్య మింకను కన్నులకు కట్టినట్లున్నది.

చరిత్రను, గతకాలమును గురించి చెప్పుటకు బదులు హిమానీ నదులను, పిండారీని గురించి చెప్పుచున్నాను. నటనవల్ల వచ్చిన ఫలిత మది. నీవు నా యెదుట ఉన్నప్పుడు నీతో నేను మాటాడు విధముగా మాటాడుచున్నాను. అట్టి సందర్భములో మన మప్పుడప్పుడు హిమానీ నదులకో, ఇంకొక చోటికో షికార్లు పోవలేనుగదా,

హిమానీనదులను గురించి చర్చించుటకు కారణము నేను హిమ యుగము పేరేత్తితిని కాబట్టి. మధ్య యూరోపులోనికిని, ఇంగ్లాండులోనికిని హిమానీనదులు వచ్చిన వనుటకు కారణము వానిగుర్తు లాదేశములలో మనము చూడవచ్చును కాబట్టి. ప్రాతకొండలపై నవి కానవచ్చును. అప్పుడు మధ్యయూరోపు, ఉత్తరయూరోపు మిక్కిలి శీతలముగా నుండెనని దీనినిబట్టి మన మూహించవచ్చును. తరువాత ఆ దేశములు వేడియగుటచే హిమానీనదులు క్రమముగా తగ్గిపోయినవి. భూగర్భ శాస్త్రజ్ఞులు - అనగా భూమిచరిత్రను పరిశోధించువారు ... శీతలయుగము పోయి ఉష్ణయుగము ప్రవేశించినదని చెప్పుదురు. అప్పుడు యూరోపు నేటి యూరోపుకన్న ఉష్ణముగా నుండెడిది. ఈ యుష్ణము కారణముగా యూరోపునం దంతటను అరణ్యములు దట్టముగా పెరిగెను.

ఆర్యులు తమ సంచారములో మధ్యయూరోపునకుకూడ వచ్చిరి. అక్కడ ఆ కాలమున వారు చెప్పుకోదగిన కార్య మేమియు చేసినట్లు లేదు. కావున వారిని ప్రస్తుత ముపేక్షింతము. నాగరీకులగు గ్రీకులును, మధ్యధరా ప్రాంత ప్రజలును మధ్య యూరోపు, ఉత్తరయూరోపులందు నివసించువారిని అనాగరికులుగా ఈసడించుచుండిరని తోచును. కాని యీ "అనాగరికులు" వారి అడపులలోను, గ్రామములలోను ఆరోగ్యముగా వీరులబ్రతుకు బ్రతుకుచుండిరి. దక్షిణముననున్న నాగరికజాతులపై వచ్చిపడి వారి ప్రభుత్వమును తలక్రిందులు చేయుటకు, అనుకొనకుండ, తయారగుచుండినారు కూడ. కాని ఇది ఎంతో కాలము తరువాతగాని జరుగలేదుకాబట్టి ముందుగా దానిని మనము తలచుకొన నవసరములేదు .

ఉత్తర యూరోపును గురించి కొద్దిగా మనకు తెలియునుగాని గొప్ప భూఖండములను గురించియు, కొన్ని దేశభాగములను గురించియు మన కసలే తెలియదు. కొలంబసు అమెరికాను కనుగొనె సని చెప్పుదురుకాని అంతకుముందు అక్కడ నాగరికత గల ప్రజలు లేరని కాదు. ఆ సంగతి ఇప్పుడిప్పుడు మనము తెలిసికొనుచున్నాము. ఏది యెట్లున్నను మనము ప్రసంగించుకొనుచున్న కాలమున అమెరికా యెట్లుండెడిదో మన కేమియు తెలియదు. ఈజిప్టు.. మధ్యధరాతీరము తప్ప మిగత ఆఫ్రికాఖండమునుగూర్చి మన కేమియు తెలియదు. ఈకాల మున బహుశా ఈజిప్టుయొక్క ఘనమగు ప్రాచీననాగరికత క్షీణించు చున్నట్లున్నది. అయినప్పటికిని ఆ కాలమున నది మిక్కిలి యభివృద్ధి జెందిన చేశ మనక తప్పదు.

ఆసియాలో ఏమి జరుగుచున్నదో ఇప్పుడు మనము చూతము. ఇచ్చట, నీ వెరుగుదువనుకొందునుగు, ప్రాచీన సాగరికతా కేంద్రములు మూడుండెను, మెసపొటేటయన్ కేంద్రము, ఇండియన్ కేంద్రము. చైనీసు కేంద్రము.

మెసపొటేమియా, పర్షియా, ఆసియామైనర్లలో, ఆ తొలిరోజులలోనే, సామ్రాజ్యమువెనుక సామ్రాజ్యమువచ్చి తరలిపోయెను. అస్సీరియన్ సామ్రాజ్యము, మీడియన్ సామ్రాజ్యము, బాబిలోనియన్ సామ్రాజ్యము, తరువాత పర్షియన్ సామ్రాజ్యము, ఈ సామ్రాజ్యములు ఒకటితో నొకటి ఎట్లు పోరాడుకొన్నవో, లేదా కొన్నాళ్ల పాటు ఎట్లు అన్యోన్యముగా ఉన్నవో, ఒండొరుల వినాశమునెట్లు చేసుకొన్నవో ఆ వివరములలోనికి మనము దిగ నవసరములేదు. గ్రీకు నగరరాజ్యములకును, పడమటి ఆసియా సామ్రాజ్యములకును ఉండు భేదము నీవు గమనించవలెను. మిక్కిలి ప్రాచీనకాలమునుండియు ఈ దేశములలో ఒక గొప్పరాజ్యమో, సామ్రాజ్యమో వెలయవలయునని ఆకాంక్ష ఉన్నట్లున్నది. అంతకు ముందున్న ప్రాతనాగరికత దానికి కారణము కావచ్చును. లేదా యితర కారణము లుండవచ్చును.

ఒక్క పేరును వినుటకు నీ విష్టపడవచ్చును. ఆ పేరు క్రోసస్. ఇతనిని గురించి నీ విదివరలో వినియుండవచ్చును. క్రోసస్ అంత ధనవంతుడగుట — ఇది ఇంగ్లీషులో ప్రసిద్ధలోకోక్తి, ఈతనిని గురించిన కథలుకూడ నీవు చదివియుండవచ్చును. అత డెంత ధనాఢ్యుడో ఎంతటి గర్వియో, ఎట్లు పరాభవింపబడెనో , లిడియా అను పేరుగల దేశమునకు క్రోసస్ రాజు. ఆసియాకు పడమటి తీరమున, నేడు ఆసియా మైనరున్నచోట ఈ లిడియా యుండెను. సముద్రము నంటియున్న దేశ మగుటచే బహుశా వాణిజ్య మధికముగా జరుగుచుండెను. అతని కాలములోనే సైరస్‌పాలనమందున్న పర్షియన్ సామ్రాజ్యము అభివృద్ధిజెంది శక్తివంత మగుచుండినది. సైకస్‌కును, క్రోసస్‌కును యుద్ధము తటస్థించెను. అందు క్రోసస్‌ను సైరస్ ఓడించెను. ఈ పరాజయమును గూర్చియు, హీనస్థితికి వచ్చి గర్వియగు క్రోసస్ ఎట్లు బుద్ది తెచ్చు కొన్నదియు హిరొడేటస్ అను గ్రీకుచరిత్రకారుడు వ్రాసియున్నాడు.

సైరస్‌కు ఒక గొప్ప సామ్రాజ్య ముండెను. అది బహుశా తూర్పున ఇండియావరకుకూడ విస్తరించియుండెను. అతని తరువాత వచ్చిన డయరస్‌కు అంతకన్న గొప్ప సామ్రాజ్య ముండెను. ఈజిప్టు, మధ్యఆసియాలో చిన్నభాగము, సింధునదివద్దనున్న ఇండియాలోని చిన్న రాష్ట్రము సైతము అందుండెను. ఇండియాలోనుస్న ఈ రాష్ట్ర మునుండి పసిడిరజము రాసులుగా, కప్పముక్రింద, అతనికి చైల్లించుచుండిరట. ఆ రోజులలో బంగారుపొడి సింధునదీప్రాంతమున దొరుకుచుండవలెను. ఇప్పు డక్కడ ఏమియు దొరకదు. అది ఎక్కువ భాగము బీడుగానున్నది. శీతోష్ణస్థితి ఏవిధముగా మారినదో దీనినిబట్టి గ్రహించవచ్చును.

నీవు చరిత్ర చదివి వెనుకటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చూచినప్పుడు ఒక్క విషయము నీమనస్సు నెక్కువగా ఆకర్షించును. ఆది మధ్యఆసియాలో వచ్చిన మార్పు. ఒకప్పు డా ప్రదేశమునుండి అసంఖ్యాకులగు మనుష్యజాతులును, గుంపులు గుంపులుగా స్త్రీపురుషులును బయలుదేరి దూరదేశములకు వ్యాపించిరి. ఒకప్పుడా ప్రదేశమునందు అద్భుతమగు గొప్పనగరములు ప్రాచీనకాలమున వెలసినవి- భాగ్యవంతమైనవి. జనసంకీర్ణమైనవి. నేటి యూరోపియన్ ముఖ్యనగరములకు సాటివచ్చునవి. నేటి బొంబాయి, కలకత్తా నగరములకన్న ఎంతో పెద్దవి. ఎక్కడ చూచినను ఉద్యానములే. ఎక్కడ చూచినను పచ్చికబయళ్లే. శీతోష్ణస్థితి సమశీతోష్ణముగా నుండెను. - అంత వేడియు లేదు. అంత చలియులేదు. ఇవి వెనుకటికాలము మాటలు. నేడో, చాలావందల సంవత్సరములనుండి అది వాసయోగ్యముకాని గొడ్డు దేశమైనది. ఎడారితో సమానముగా నున్నది. ఆ నాటి గొప్పపట్టణములు కొన్ని నేటికి నిలిచి యున్నవి సమర్కండ్, బొఖారా అనునవి రెండు పట్టణములు. వాని పేళ్లు విన్నంతనే మనకు ప్రాతవిషయములెన్నో స్మృతిపథమునకు తగులును. కాని నేటి పట్టణములు వెనుకటి పట్టణముల ఛాయలు మాత్రమే. ,

మరల నేను రాబోవు విషయములను ముందు చెప్పుచున్నాను. మనము ప్రసంగించుకొనుచున్న కాలములో సమర్కండ్, బొఖారాలు లేవు. ఇదంతయు ముందు రాబోపు విషయము. భావికాల మను తెర దానిని మరుగు చేసినది. మధ్య ఆసియా గొప్పతనమును, పతనమును ముందుకాలపు విషయములు.


9

ప్రాతసంప్రదాయముల భారము

జనవరి 14, 1931

నేను చెరసాలలో క్రొత్త అలవాట్లను చేసికొన్నాను. అందొక్కటి అరుణోదయము కాకముందేలేచుట. కడచిన వేసగినుండియు ఈ అలవాటు చేసికొన్నాను. ఉషఃకాలమువచ్చి క్రమక్రమముగా నక్షత్రముల నార్పివేయుట చూడ నాకు సరదాగా నుండును. ఉషఃకాలమునకు ముందుండు వెన్నెల నెప్పుడైన చూచితివా? రాత్రి మెల్లగా మారి పగలగుట చూచితివా? వెన్నెలకును, ఉషఃకాలమునకును జరుగు పోరాటము నెన్ని పర్యాయములో చూచితిని. చివరకు విజయమెప్పుడును ఉషఃకాలముదే. వింతగానుండు ఆ సగము వెలుగులో అది వెన్నెలయో, లేక రానున్న పగటివెలుగో చెప్పుట కొంత సేపటివరకు కష్టము. పిమ్మట, హఠాత్తుగా సందేహము తొలగును, అది పగలే. వెలవెలబారు చంద్రుడు పోరాటమున ఓడిపోయి వెడలిపోవును.