పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

స్థితి). మోకాలుక్రిందిభాగము, తీర్థంకరుని శిరస్సునకు ఆచ్ఛాదనగా కల పాముపడగలు విరిగిపోయియున్నవి. ఉంగరములు చుట్టుకొని, అప్పుడే చక్కగా దువ్వినటులున్న తలవెంట్రుకలు కలవు. చక్కని మెరుపుగలదు. ఈ విగ్రహము కూడ క్రీ. శ. 10 శతాబ్దమునకు చెందినది.

4. ధ్వజ స్తంభము :- ఇది సోమేశ్వరస్వామివారి ధ్వజస్తంభము. క్రీ. శ. 15 శతాబ్దమునకు చెందిన తెలుగు శాసనమొకటి దీనిమీద కలదు. దానిలో ఇది ఒక జయస్తంభమని, "రెసబరలగనె-------" కుమారుడైన యల్లప్ప స్థాపించినటుల తెలియుచున్నది.

5. గణపతి :- దేవాలయ ద్వారముదగ్గర, ఇరువైపుల గణపతి విగ్రహములు కలవు. వీనికి ఎలాటి కిరీటములు లేక, చెవులు కొంచెము చిన్నవిగ, ఉన్నవి. గణపతి చతుర్ భుజుడు. ఎడమ చేతియందు కల మోదకములను భక్షించుచున్నాడు. నాగఉదరబంధముకలదు. ఇవి బహుశ: పురాతనమై క్రీ. శ. 11 - 12 శతాబ్దమునకు చెందియుండనోపు. (చిత్రము - 2)

6. ఆంజనేయుడు : -పైన చెప్పిన ధ్వజస్తంభమునకు ముందుగా ఈ విగ్రహము కలదు. కుడిచేతియందు గద. ఎడమ చేయి చిన్ ముద్రను ధరించియున్నవి.

7. రాతిఫలకము :- చతురప్రాకారములో కల రాతిఫలకమిది. దీని మధ్య ఒక దేవతా విగ్రహము నిలుచుని యున్నటులున్నది. నాలుగు చేతులు కల ఈ దేవత పై రెండు చేతులందూ సర్పము, త్రిశూలము ధరించి యున్నాడు. మిగిలిన కుడిచేతియందు గద, ఎడమ చేయి కట్యవలంబితమై కలదు. అతను కంకణములు, కేయూరములు, యజ్ఞోపవీతము కలిగియున్నాడు. పెద్ద కుండలములు చెవులకు కలవు. ఇది బహుశ:అంత ప్రాచీన శిల్పముకాదు.

8. నటరాజు :- శివస్వరూపము: భుజంగత్రాస నృత్యము సల్పుచున్న నటరాజ విగ్రహమిది.[1] కొంచెముగా వంగిన కుడి కాలు అపస్మార పురుషుని వీపు మీద మోపి, ఎడమకాలు కొంచెము పైకెత్తినటుల చూపబడినది. నటరాజస్వామికి పదిచేతులు. అందు ముందరి రెండు చేతులు నాట్యరీతియందుకలవు. మొదటి ఎడమ చేయి దండహస్తము[2] (లేక గజ హస్తము) నందుకలదు. కుడిచేయి అభయ

  1. అపస్మారపురుషుని మీద మోపిన కుడికాలి మోకాలి కన్నా పైకెత్తిన ఎడమ కాలుయున్న భుజంగలలితమనియు, మోకాలికన్నా క్రిందికియున్న భుజంగత్రాస నృత్యమనియు నందురు. ఇవి రెండు తాండవ మందలి రీతులు.
  2. ఎడమ చేయి శరీరము మధ్యగా, సమాంతరముగా కుడివైపుకువచ్చి, హస్తము మణికట్టు దగ్గరనుంచి వంగియుండుట.