ఈ పుట ఆమోదించబడ్డది

శిల్పము గలదు. గుహాలయముయొక్క 'కపోత' క్వార్టర్ సర్కిల్ ఆకారములో మలుచుటకు ప్రయత్నము జరిగియున్నది కాని పూర్తిచేయబడలేదు. 'కూడు' డిజైన్లు లేవు. శాసనములు లేవు.

ఇచ్చటి గుహాలయాలలో మొదటి గుహాలయమునుండి నాలుగవ గుహాలయము వరకు అతిదగ్గరి పోలికలు కనిపించుచున్నవి. కావుననే ఇవన్నీ ఒకే కాలానికి చెందినవని భావించవచ్చును.

ఐదవ గుహాలయము:

మొదటి నాలుగు గుహాలయములకన్నను నిర్మాణరీతులలో ఇది చాలా భేదమును కలిగియున్నది (17,18, 19,34, 36 వ చిత్రపటములు చూడుము). ఇది మొదటి నాలుగు గుహాలయాలకంటె తరువాతి కాలములో నిర్మింపబడినట్లు తెలియుచున్నది. ఇది క్రీ.శ. 9వ శతాబ్దమునకు చెందినదని కొందరి అభిప్రాయము. మరికొందరు ఇది క్రీ.శ 8వ శతాబ్దమునకు చెందినదందురు. ఇది నాలుగవ గుహాలయము పైన కొద్దిగా వెనుకగా నిర్మింపబడియున్నది. ఇందు 6 అ॥ చతురస్రాకార గర్భగృహ,శివలింగము కలదు. ఈ గుహాలయ ద్వారపాలకులు కుశలురగు మేటి స్థపకుల చేతి నిర్మింపబడిరని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యంగారి అభిప్రాయము. గర్భగృహ ముందు 15 ఆ॥పొడవు. 4 ½ అ॥వెడల్పు గల మండపము. అందు రెండు కుఢ్యస్తంభాలు. రెండు స్తంభములపై ఏకశిల యందే రూపొందింపబడియున్నది (18, 19,37 వ చిత్రపటములు చూడుము). స్తంభములకు వెలుపలి ముఖమున నాలుగు చిన్న శాసనములు గలవు. వాటి సారాంశమునుగూర్చి కృష్ణశాస్త్రిగారు ఇట్లు వివరించిరి:

(1) 'శ్రీ త్రిభువనాదిత్యం' (ఇది చాళుక్యరాజుయొక్క బిరుదుగా యుండును.)
(2) 'శ్రీ దెర్లుగుముదం ఆచార్ల పపి కోసిరి' (అనగా ఈ శిల్పనిర్మాణము సుప్రసిద్ధుడగు బెర్లుగుముదం ఆచార్యులని స్పష్టము. బహుశః రెండవ గుహలోని 'ధీరుకంతి' అను పదమే ఇందలి 'దెర్లుగుముద'మై వుండును).
(3) 'దాకేరేమి' (బహుశా దాకేరేమి పదము ద్రాక్షారామ శాసనములందు కన్పించెడివి).
(4) 'శ్రీ నరనరేంద్రుండు' (ప్రఖ్యాతి రాజరాజనరుడు, చాళుక్యరాజుగా నుండవచ్చును. ఆ కాలమున కృషియొక్క పునీతత్వము శ్లాఘించబడుచుండెను).

గర్భగృహయందు పానపట్టము ప్రాంతీయమైన శిలతో నిర్మాణము చేయబడియున్నది. ద్వారపాలకుల ప్రక్కన మండపముయొక్క మూలలకు దగ్గరగా కోష్ఠములందు బ్రహ్మ,విష్ణువుల అర్ధశిల్పములు గలవు మండపము ముందు విభాగమున రెండు కొనలందు కుఢ్యస్తంభాలు, ఆ రెండింటి మధ్యభాగాన రెండు స్తంభములు గలవు. స్తంభముల అండ విభాగమున క్రింద, పైన చతురస్రాకారపు విభాగము గలిగి ఈ రెండింటి మధ్య అష్టకోణ విభాగం ఆందు తడి, కుంభ విభాగాలు యున్నవి. ఈ స్తంభముల 'కాపిటల్' విభాగమునందు 'కుంభ', 'వీరకంఠ', 'పొటిక' విభాగములు గలవు. (17,18, 19వ చిత్రపటములు చూడుము). స్తంభములపైన చిన్న 'దూలము' వంటి విభాగము, దీనిపైన 'కపోత', ఈ రెండింటి మధ్య 'గణమాల' కలదు. కపోత ముఖభాగమున 'కూడు' డిజైనులు కలవు. వీటిపై విభాగమున సింహపు తలలు గలవు. ఈ సింహపు తలలు పల్లవరీతి లోనివి. పశ్చిమ చాళుక్యుల కాలమందు కూడ ఈ రీతి గలదు. 'కపోత' పైన సింహపు జంటల వరుస గలదు. ఇచటి 'కూడు'ల మధ్యభాగమందు మానవ తలలుగల అర్ధశిల్పములున్నవి. ఈ గుహ ప్రాంగణము యొక్క ఉత్తర,దక్షిణములందు గణేశ,చండేశ అర్ధశిల్పములున్నవి. శివలింగమునకు ఎదురుగా ప్రాంగణాన నంది ప్రతిమ గలదు.