పావన రామ
కాపీ రాగం ఆది తాళం
ప: పావన రామ నామ సుధారస
పానము జేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు
చిత్తమునుంచే దెన్నటికో || పావన రామ ||
చ1: దాసులగని సంతోషమ్మున తవ
దాసోహమ్మను టెన్నటికో
భూ సుతకుసు నతి ప్రాణప్రదంబగు
పురుషోత్తము గనుటెన్నటికో || పావన రామ ||
చ2: చంచల గుణములు మాని సదా ని
శ్చలమతి నుండేదెన్నటికో
పంచ తత్వములు తారక నామము
పఠియించుట నా కెన్నటికో || పావన రామ ||
చ3: ఇనవంశాంబుధి చంద్రుడు కృప ని
ష్టార్ధము లొసగే దెన్నటికో
కనకచేలు కరుణాలవాలుని
కన్నుల జూచే దెన్నటికో || పావన రామ ||
చ4: వంచన లేకను భద్రాదీశుని
వర్ణన చేసేదెన్నటికో
అంచితముగ రామదాసుడ ననుకొని
ఆనందించే దెన్నటికో || పావన రామ ||
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.