పరిశోధన పత్రిక/సంపుటము 1/సంచిక 3, 1954/మనవి మాటలు

సంపుటి1. సంచిక 3.

సంపాదకుడు: తిరుమల రామచంద్ర సంయుక్త సంపాదకుడు: తిమ్మావజ్ఝల కోదండరామయ్య

మనవి మాటలు


ఆంధ్రవాజ్మయ ప్రపంచంలో ఎటుచూచినా ఏడు నిలువుల ఎత్తున సాక్షాత్కరిస్తారు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు.

కలం పట్టినప్పు డెల్ల కలకాలం నిలచే కొత్తసంగతి తెలుపడమే ఆయన ప్రజ్ఞ; అదే ఆయన ప్రతిజ్ఞ. సజాతీయ విజాతీయ భాషాసాహిత్యాల అంచులు చూచి, లోతులు తీసి, సాదృశ్య వైదృశ్యాల సమ్యగ్దృష్టితో మథించి, మీదు కట్టిన మేలిమీగడలతో తెలుగుతేటలను కూర్చి తేర్చి తెలుగుజాతికి అందివ్వడం ఆయన ఉపజ్ఞ : అట్టి సమన్వయమే రసప్రలుబ్ధులకు, పరిశోధన పరాయణులకు రసాయనమని ఆయన ఆజ్ఞ.

జీవితంలో అనుపదం, అనుక్షణం అన్వణువు సత్యగవేషణే ఆయన సాగించిన యోగం; అదే ఆయన ఆశించినభోగం. నేటి ఎగుడుదిగుడు సమాజంలో కష్టజీవుల కరుణగాథలకు జలజల కన్నీరు జాలువార్చడం, ఆ కన్నీటి వెలుగులలో సహానుభూతి సహకారాలు చెలార్చడం ఆయన హృదయం; అదే ఆయన సాధించిన అభ్యుదయం. కత్తిమీద సాముగా, సాహిత్యపాంథులకు ఏడు గడగా మనుగడ గడపిన ఆ మనస్వికి, కళాతపస్వికి, తానవ మెరుగని మానవంతో గోమఠేశ్వరుని గండరువునిలుపు నిలచిన యశస్వికి ఇవే మా పరసహస్రనమోవాకాలు.

ఆయన చతుర్థ వర్ధంతి దివ్యసంస్మరణకు కానుకగా ఈ సంచికను అర్పిస్తున్నందుకు ధన్యుల మని విన్నవించుకుంటున్నాము.