పద్మపురాణము/ద్వితీయాశ్వాసము

పద్మపురాణము

ఉత్తరఖండము - ద్వితీయాశ్వాసము

క.

శ్రీ ముప్పడీంద్రరాజ్య
క్షేమంకర నయవిశాల! జితరిపుజాలా!
ఖామాజనపాంచాలా!
కామనిభా! గుణకలాప! కందచమూపా!

1


వ.

పరమ[1]యోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె.

2

సుందోపసుందోపాఖ్యానము :

క.

సుందోపసుందదైత్యు ల
మందపరాక్రములు పుట్టి మదమున సేనా
బృందములఁ గూడి జగములు
వందురఁగాఁ జేసి కడు నవారణశక్తిన్.

3


చ.

మునిజనకోటిఁ బట్టుకొని మోములు రాయుచు యాగశాలలం
దనలము వెట్టి కాల్చుచు [2]జనాశ్రమధర్మములెల్ల మాన్చి య
య్యనిమిషసిద్ధసాధ్యఫణియక్షసురాహితరాజసంతతిన్
[3]గ్గనుకని పాఱఁద్రోలుచును గర్వము దిక్కుల దుస్సహంబుగన్.

4


వ.

జగంబు లెల్లనుం దారయై విహరించుచుండి రి ట్లతి దారుణంబగు
దైత్యులపరాక్రమంబునకు బెగ్గిలి దేవతలు కమలగర్భునికడకుం
జని సుందోపసుందదైత్యులు చేయు నుపద్రవంబులు విన్నవించి
యిట్లనిరి.

5

క.

వడఁగలపాటుల నెల్లను
బడిపడి పడలేక విసివి పద్మాసన! నీ
యడుగులు గొలువగ వచ్చితి
మెడసేయక మద్విరోధి నే వడఁపు వెసన్.

6


ఆ.

అనినఁ బద్మగర్భుఁ డాలించి సుందోప
సుందవధకు నొండుమందులేమిఁ
దెలియఁ జూచి వారు తెగువతో నన్యోన్య
హతుల మృతులు గాఁగ ననువుఁ దలఁచి.

7


వ.

ఇంద్రాదులం జూచి మీరలు మీనిజస్థానంబులకుం జని సుఖం
బుండుఁ డని వారల వీడ్కొల్పి మాఘస్నానఫలంబున విష్ణులోక
సుఖం బనుభవించుచున్న వృక్షకాంగనం దలంచిన నదియుఁ ద
త్క్షణంబ.

8


సీ.

చిగురుటాకులమీఁది జిగి బాగుగాఁ గూర్చి
      యడుగుఁ దమ్ములు గాఁగ నలవరించి
కొమరారు ననఁటికంబములసోయగమెల్లఁ
      దెచ్చి యూరులు గాఁగ నచృపఱచి
పసిఁడి కుంభంబుల [4]మిసిమియంతయుఁ గూర్చి
      యొగిఁ జన్నుఁగవ గాఁగ నోజపఱచి
యలికులంబులమీఁది హరినీలరుచి నూడ్చి
      కరమొప్ప నెఱివేణిగా నమర్చి


తే.

కడఁగి బయ లావటించి నెన్నడుముఁ జేసి
కలువఱేకులఁ గన్నులుగా [5]నొనర్చి
పంచశరుఁ డేర్చి చేసిన ప్రతిమ యనఁగ
నువిద సనుదెంచెఁ గమలసంభవుని కడకు.

9

వ.

ఇట్లు వచ్చిన వృక్షకాంగన నతిగౌరవంబునం గనుంగొని యయోని
సంభవయగు నమ్మత్తకాశినికిం దిలోత్తమ యను నామం బిడి
బృందారకసుందరీసందోహంబునం దెల్ల నధికంబగు విభవవిల
సనంబునం బ్రసిద్ధవై విహరించుచుండు మని యత్తన్వి మెత్తన
నొడఁబఱచి యిట్లనియె.

10


క.

సుందోపసుందదైత్యులు
బృందారకగణమునెల్లఁ బీడించెద రీ
వం దఱిగి వారి నిరువుర
మ్రందింపుము నీవిలాసమాధుర్యములన్.

11


ఆ.

అనిన నమ్మహాత్ముఁ గని తిలోత్తమ పల్కెఁ
జిన్నిమోము వింతచెన్నుమీఱ
నకట! యాఁడుదాన! నసురవీరులమీఁద
నన్నుఁ బనుపఁదగునె నలినగర్భ!

12


వ.

అనిన విని నలువ దరహసితవదనుండై యయ్యింతి కిట్లనియె.
నద్దైత్యులు బలపరాక్రమసంపన్నులు గావున నెవ్వరికి నజేయు
లగుదురు. అట్లైనను నీ వల్లన నచ్చటికిం జనునప్పుడు నీసౌందర్య
విలాసంబులం జూచి మదనాతురులై తమలోనం గఱకఱిపడి
యన్యోన్యప్రహారంబులం బంచత్వంబు నొందెదరు. ఇంతట నీ
కనాయాసంబున లోకోపకారంబు సంభవించు. దేవహితంబగు ని
వ్విధంబు సేయు మనిన వల్లె యని సరసిజాసను [6]ననుజ్ఞ వడసి
తిలోత్తమ నిజాంగరాగపరిమళమిళితమలయానిలుండు [7]ముంగ
లిగా నవనీతలంబునకు డిగ్గిరా నర్మదాతటంబున నసురవరులున్న
యశోకవనంబు డగ్గఱి.

13

క.

కంకణమణిమయనూపుర
ఝంకారము లులియ బిగువుచనుఁగవ నెఱయన్
జంకెలు గన్నులఁ దేఱఁగ
మంకెన కెంబట్టు మెఱయ మలయుచు వచ్చెన్.

14


వ.

అంత.

15


క.

అలకలతావికి నలికుల
కలకల ములియంగ వీణ గదలించుచుఁ దాఁ
గలికి కనుఁగొనల కొలకుల
నులుకులు దలకొనఁగ లలిఁ దిలోత్తమ యొప్పెన్.

16


ఆ.

అయ్యశోకవనమునం దెల్ల విహరించి
సుడిసి కమ్మతావి సోడుముట్టఁ
దరుణి విరుల నలరు సురపొన్న తరువెక్కి
వట్టిమ్రాఁకు లిగురువెట్టఁ బాడె.

17


వ.

అప్పు డద్దివ్యగానం బత్యంతమధురంబుగా వీతెంచిన నవ్వనం
బున విహరించుచున్న దనుజనాయకపరిచరవర్తులగు నసురు ల
య్యెలుంగులు విని చనుదెంచి తిలోత్తమం గనుంగొని చిత్తంబున
నుత్తలంబు గదురఁ బఱతెంచి శాతకుంభస్తంభవిలసితంబగు మణి
మండప[8]స్థలంబునందు.

18


క.

సుందరులు పసిఁడికోరల
నందీ నందంద యాని యాసవసౌఖ్యా
నందులగు నన్నదమ్ముల
మందుల సుందోపసుంద మనుజాశనులన్.

19


క.

కని వినయంబున మ్రొక్కుచు
ననుపమసంభ్రమము దోఁప నసురులు ధాత్రి
[9]న్విని కని యెన్నం డెఱుఁగము
సునిశితబలులార యిట్టిచోద్యము లెందున్.

20

చ.

ఇదె యొకయింతి యెవ్వతయొ యివ్వనమంతయు యౌవనంబునన్
నదురఁగఁ బెక్కురాగములు గైకొని పాడుచు మ్రానిమీఁదటన్
బెదరిన తేఁటిచందమునఁ బిమ్మిటిఁ బొందఁగఁ జూచుచున్న దా
సుదతి వరించినన్ సుఖము జుబ్బన చూఱలుగావె యేరికిన్.

21


క.

అని చెప్పిన నతిసంభ్రమ
మున నయ్యిద్దఱును గదలి ముదితలు గొలువం
జనుదెంచి కనిరి లీలా
వనమధ్యమునందుఁ బొల్సు వనరుహనేత్రన్.

22


వ.

కని యక్కామినీమణివిలాసవిభ్రమలీలావిభవంబుల కచ్చెరు
వొంది పంచబాణబాణజర్ఝరీకృతమనస్కులై మచ్చరంబునఁ
బెచ్చువెఱిగి సరభసంబున నయ్యిద్దఱు డాయం జని.

23


క.

ఈచేడియ నాసతి యని
వేచని సుందుండు గవిసె వెస నుపసుందుం
డీచెలియ నాకుఁ బ్రియ యని
వాచఱవఁగ నిద్దఱికిని వైరం బయ్యెన్.

24


ఆ.

అన్నదమ్ము లొక్కయతివకై ప్రేమంబుఁ
దగవు సిగ్గు విడిచి జగడ మాడి
రట్ల కాదె యెందు నతివలఁబొడ గాంచి
జాలిఁ బొందకున్నె శంభుఁడైన.

25


వ.

అమ్మహావీరు లత్యంతరోషభీషణాకారులై యొండొరులం గలయం
బెరసి శుండాదండమండితమదోద్దండవేదండయుగళంబునుం
బోలె నుద్గండగదాదండమండితదోర్దండులై యంతకప్రేరణంబున
నంతకంతకుం గదిసి.

26


లయగ్రాహి.

దండధరరూపముల మెండుకొని యిద్దఱుఁ బ్ర
చండతరలీల యమదండయుగతుల్యో
ద్దండగదలం దుమురు తండములు రాలఁగ న
ఖండమదమత్తగతి గండదరితా రి

ట్లొండొరుల వ్రేయుచును నొండొరుల మీఱుచును
నొండొరుల డాయుచును దండితన మొప్పన్
భండనము చేసి రురుమండల గతు ల్దనరి
చండతరరోషములు నిండి పొలుపారన్.

27


ఆ.

పోరిపోరి యొక్కవూఁపున నిద్దఱు
నొక్క[10]సారి గదల నిక్కివ్రేయఁ
దలలు వగిలి కూలి రిలమీఁద వ్రాలుచుఁ
గులిశనిహతిఁ గూలు కొండలట్లు.

28


వ.

ఇట్లు సుందోపసుందులు పంచత్వంబు నొందినం జంచలించి త
త్సైన్యంబు దైన్యంబునం గనుకనిం బఱచె నంత.

29


క.

నెట్టనఁ దనకతమున నా
కట్టిఁడి రక్కసులు వడినఁ గమలానన దాఁ
జెట్టు దిగివచ్చె నల్లనఁ
జెట్టున దిగినట్టి యలరు చెలువము దోఁపన్.

30


వ.

ఇట్లు మ్రాను దిగివచ్చి విద్యుద్రేఖయుం బోలె గగనగతిం బఱచి
కమలసంభవుకడకుం జని ప్రణమిల్లిన తిలోత్తమం గని కరుణించి
సూర్యస్థానంబున నాచంద్రార్కంబుగా ననేకభోగానుభవంబులు
సేయుమని వరం బిచ్చె నట్లు భృగుపుత్రి మాఘస్నానఫలం
బునం జేసి సూర్యసన్నిధి నేఁడును ననవరతసుఖంబు లనుభ
వించుచున్నయది.

31


ఆ.

అట్లు గాన భక్తి ననవరతంబును
మకరయుక్తసూర్యమాఘతిథులఁ
బరమపదము గోరు నరులు సుస్నానంబుఁ
జేయవలయుఁ జూవె శిష్టచరిత!

32

క.

క్రతువులు నుపకారంబులు
వ్రతములు నుపవాసములును వసుధావర స
న్నుతమాఘస్నానమునకు
సతతము సరిగావు [11]తలఁప సౌజన్యనిధీ!

33


వ.

ఈ యర్థంబున [12]కొక్కయితిహాసంబు గల దాకర్ణింపు మని యి
ట్లనియె.

34

హేమకుండలచరితము :

సీ.

కృతయుగంబునఁ దొల్లి యతిశయసంపదఁ
       బొలుపగు నైషధపురమునందు
హేమకుండలుఁ డన నేపారు వైశ్యుండు
       ధనదసమానుండు దానరతుఁడు
కులజుండు సత్కర్మకుశలుండు దేవభూ
       సురవహ్నిపూజనా[13]పరిణతుండు
దానదయాచారధర్మసత్యంబులు
       మొదలైన గుణములఁ బొదలుచుండు


తే.

నవనిఁ గ్రయవిక్రయాదులయనువు లెఱుఁగుఁ
గృషియు గోరక్షణాది సత్క్రియలు నేర్చు
నధికసంపదలందును నధికుఁ డగుచు
ధర్మచరితుండు నానొప్పు ధరణిమీఁద.

35


వ.

మఱియుఁ దృణకాష్ఠఫలమూలలవణైలాలవంగమలయజాగరు
కుంకుమాదులను, వస్త్రధాన్యతైలాదులను, ధాతులోహాదులను,
గోమహిషకుంజరాశ్చమేషాదులను సంగ్రహించి తత్క్రయ
విక్రయలాభంబు లాదిగాఁగల బహువిధోపాయంబుల నెనిమిది
కోట్లసువర్ణంబు సంపాదించి యున్నంత.

36

సీ.

[14]పురుషత గలనాఁడె పురుషార్థములఁ [15]జేయు
       మొప్పార నని చెవిఁ జెప్పఁగోరు
చెలికాని పోలికఁ జెంపల నరవొంది
       నంత దేహం బనిత్యంబు గాఁగఁ
దలఁచి వైశ్యుండెల్ల ధర్మంబులను జేసి
       చెఱువులు గట్టించి శిష్టలీల
దేవాలయంబులు బావులు నల్లిండ్లుఁ
       జలిపందిరిలు నన్నసత్రములును


తే.

గొలఁది మిగులంగఁ గట్టించి చెలఁగి యాయ
మరసి భాగించి ధనము షష్ఠాంశమెల్ల
మహితలీలల నుదయాస్తమయములందు
దానములు సేయుఁ దృఢభక్తిఁ బూని యతఁడు.

37

శ్రీకుండల వికుండలుల చరితము :

వ.

ఇట్లు సకలధర్మపరాయణుండును గృతజన్మదోషప్రాయశ్చిత్తుం
డును నగు హేమకుండలునకు నిరువురు తనయులు శ్రీకుండల
వికుండలు లను నామంబులం బ్రసిద్ధులగు వార లుదయించిన
నతండు వారలకుఁ దానశేషంబగు ధనంబంతయు [16]నిచ్చి విర
క్తుండై వనంబున కరిగి యతిఘోరంబగు తపంబు సేసి పుణ్యనదీ
తీరంబునఁ బుండరీకాక్షు మనంబున నిడి శరీరంబు విడిచి విష్ణు
లోకంబునకుం జనియె నంత.

38

సీ.

అతని తనూభవు లర్థంబు మదమున
      యౌవనంబునఁ గడుఁ గ్రొవ్వి దురభి
మానులై గర్వితమతి సురాపానాది
      దుష్టదుర్వ్యసనులై కష్టచరితు
లనవరతంబు వేశ్యాసక్తులై నట
      విటగాయకులతోడ వివిధగోష్ఠి
ననురక్తులై ధనం బంతయు [17]వేణువీ
      ణాదులౌ సర్వవినోదములను


తే.

గొల్లలుగ వెదఁజల్లుచుఁ దల్లిమాట
వినఁగనొల్లక యున్మత్తవృత్తిఁ దగిలి
[18]సకలబంధుల దూషించి సతతంబు
నాతతాయితఁ జరియించి రవనినెల్ల.

39


వ.

ఇవ్విధంబున వైశ్యకుమారులు దేవగురుపితృభక్తివిరహితులై
నిచ్చలుం బెచ్చు [19]పెరిగిన మచ్చరంబునఁ దమ్ముఁ దా మెఱుం
గక తిరుగుచుండం గతిపయదివసంబులకు ధనంబంతయు నశించి
దారిద్ర్యంబు గదిరిన.

40


క.

దాసీదాసజనంబు లు
దాసీనతఁ దమ్ము విడిచి తమతమగతులం
బాసి చనిరంతఁ జుట్టలు
వేసరి చని రిష్టసఖులు వెఱచిరి పలుకన్.

41


వ.

అంత.

42

ఆ.

[20]అప్పువారిచేత నాఁకకు బెగ్గిలి
కూడుఁ జీరలేక కుంది కుంది
వీటిలోన నుండ వెఱచి దీనాత్ములై
వెడలి యటవి నాటవికులఁ గూడి.

43


వ.

ధనుర్బాణపాణులై యనేకవరాహకురంగచమరాదిమృగంబు
లను నానావిధవిహంగసమూహంబులను వధియించి తన్మాంసం
బశనంబుగా దినంబులు గడపుచు నతినీచవర్తునులై చరియించుచు
నొక్కనాఁడు మహావిటపిమధ్యపర్వతగుహాంతరంబులకు మృగ
హరణార్థంబు చనినయెడ శ్రీకుండలు నొక్కపుండరీకంబును
వికుండలు నొక్కదుష్టోరగంబునుం గఱచిన నక్కాననంబున
దిక్కు దెసలేక యక్కుమారు లొక్కదివసంబున మరణంబు
నొందిరి. అట్టియెడ నవ్వైశ్యులం బాశబద్ధులం జేసి యమ
దూతలు సమవర్తిసన్నిధికిం గొనిపోయి దురాచారులగు వారలం
జూపినం జూచి [21]యముం డిట్లనియె.

44

శ్రీకుండల వికుండలులు యమసదనంబునకుం జనుట :

క.

[22]వీరలలోపల నొక్కని
ఘోరంబగు నరకమునకుఁ గొంపొం డొకనిం
గారవమునఁ ద్రిదివమునకు
బోరనఁ గొనిపొండు దివిజపుంగవుకడకున్.

45


క.

అని దండధరుఁడు పనిచిన
విని కింకరవరులు కూడి వేగమ నరకం
బున శ్రీకుండలుఁ ద్రోచిరి
గొనకొని యొకదూత యావికుండలు కనియెన్.

46

తే.

ఓ వికుండల! దివమున కీవు రమ్ము
కదిలి భవదీయకృతపుణ్యకర్మభోగ
మనుభవింపంగ నావుడు ననియె నాతఁ
డా కృతాంతకుదూతతో నల్లఁ జేరి.

47


సీ.

యమదూత! వినుము నా కాత్మలోపల నిప్పు
         డత్యంతవిస్మయం బయ్యెఁ జూడ
నాతఁడు నేనును నన్నదమ్ముల మొక్క
         తల్లిగర్భంబునఁ దనరఁ బుట్టి
యేకర్మమైనను [23]నేకకార్యతఁ జేసి
         యెన్నఁడు [24]దగఁ బాయకున్నచోట
మా కొక్కచోటన మరణంబు ప్రాపింప
         నిట కేము వచ్చితి మిద్దఱమును


తే.

నందు మా యన్న నరకంబునందుఁ ద్రోచి
నన్ను నేటికిఁ గొనిపోవ నాకమునకు
నరయ నే నేమి చేసితి నతనికంటె
నన్ను మన్నించి చెప్పుమా యున్నరూపు.

48

వికుండలుండు యమదూతలవలన నిఖిలధర్మార్థంబులు వినుట :

వ.

అనిన వికుండలునకు యమదూత లిట్లనిరి.

49


ఆ.

తల్లి దండ్రి యన్నదమ్ములు తనయులు
లలన చెలి యనంగఁ గలుగువారు
పూర్వజన్మకర్మభోగసంప్రాప్తులై
మక్కువలఁ జరింతు రొక్క[25]యింట.

50

వ.

అది యెట్లంటేని.

51


క.

ఒక తరువున బహువిధముల
శకుంతములు [26]గూడి విడియు చందంబునఁ బు
త్త్రకళత్రాదులఁ గూడుదు
రొకనెలవునఁ బాసిపోదు రూరక పిదపన్.

52


ఆ.

ఎవ్వఁ డెట్టిభంగి నేకర్మ మొనరించు
నట్లు కర్మఫలము లనుభవించుఁ
గాన వారి వారి కర్మఫలంబులు
కమలభవునకైనఁ గడవరాదు.

53


వ.

అట్లు గావున.

54


ఆ.

అన్న యనుచు నీకు నడ్డంబుఁ [27]గాఁ జన
దతనిపాతకమును నతఁడు వొంది
నరకగామి యయ్యె సురలోకపదము నీ
కబ్బె నిట్లు సుకృతివైన కతన.

55


క.

అనిన వికుండలుఁ డిట్లను
ననఘా! నా జన్మమెల్ల నన్యాయము చే
యనకాని యొక్క పుణ్యము
[28]నెనయఁగ నేఁ జేసి యెఱుఁగ నించుకయేనిన్.

56


వ.

[29]మత్పుణ్యఫలంబు నీ వెఱుంగు దేనియుం జెప్పు మనిన
నతండు సకల భూత సుకృత దుష్కృతంబులు నా యెఱుంగని
యవి లేవు వినుమని యిట్లనియె.

57

చ.

మెర మెర యేల నీకు! హరిమిత్రసుతుండు సుమిత్రుఁ డుత్తమ
స్థిరమతిఁ బొల్చు నొక్కరుఁడు చెచ్చెర నాతని మైత్రిఁగూడి భా
సురమగు వేడ్కతో యమునఁ జొచ్చి నయంబున మాఘమాససం
కరదివసద్వయంబు నవగాహనము సేసితి తజ్జలంబులన్.

58


వ.

తత్ప్రభావంబునం జేసి యొక్కస్నానఫలంబున నీపాపంబు
వొలిసె, మఱియు నొక్కట [30]దేవలోకసౌఖ్యంబు సంభవించెఁ;
గావున నీవు తత్సుఖం బనుభవింపుము. నీ యన్న యత్యంత
పాతకుండు గావున నసివత్రభేదము[31]రాఘాతశిలాప్రహరణాది
మహానరకదుఃఖంబులం బెద్దకాలం బనుభవింపఁ గలవాఁడని
చెప్పిన యమదూతవచనంబులు విని దుఃఖహర్షంబులు మనం
బునం బెనంగొని వికుండలుం డిట్లనియె.

59


అ.

అడుగు లేడుగూడ నడచినయంతన
సఖునిగాఁ దలంచి సౌమ్యలీల
నార్యులైన వార లాప్తుఁనిగాఁ జూతు
రీవు నాకు సఖుఁడ వే విధమున.

60


క.

కావున సర్వజ్ఞుఁడ వగు
నీవలన వినంగ [32]వలతు నిరయములం దా
రే వెఱఁగు కర్మవశమున
భావింపఁగ నెట్లు దుఃఖపడుదురు చెపుమా.

61


వ.

అనిన నతండు పాపరహితుండవైతివి కావున నీ చిత్తంబున ధర్మ
రుచి జనియించి యడిగెదు నీ యడిగిన యర్థంబెల్ల సవిస్తరం
బుగాఁ జెప్పెద దత్తావధానుండవై వినుమని యిట్లనియె.

62

క.

మనమున మాటలఁ గర్మం
బునఁ బ్రాణుల హింస సేయఁబూనినవారల్
విను నరకముఁ బ్రాపింతురు
తనర నహింసయ విశేషధర్మం బరయన్.

63


వ.

మఱియు సకలవేదశాస్త్రవిదులు నహింసయె పరమధర్మం బని
చెప్పుదురు. మశకకీటకమత్కుణదంశకాదిహీనజంతువుల
రక్షించు పుణ్యాత్ములు నరలోకనిరీక్షణంబు సేయరు. జలచరస్థల
చరంబులగు జీవులం దమజీవనోపాయంబులకు వధియించు
వారలు కాలసూత్రప్రాప్తులై నిజశరీరమాంసభక్షణంబును రక్త
పానంబును జేయుచు నన్యోన్యపీడితులై యాక్రందించుచు నర
కాలయంబునం బెద్దకాలంబుండి యంత వెలువడి స్థావరంబులై
తిర్యగ్యోనిశతంబులం బుట్టి పిదప జాత్యంధులు వంగులు మూకులు
దరిద్రులునై [33]పుట్టుదురు గావునఁ బురుషుం డహింసాశీలుండు
గావలయు. నదులు సముద్రంబునం బ్రవేశించు చందంబున
సకలధర్మంబులు నహింసయందు వసియించు న ట్లగుటం జేసి
హింసకుం డుభయలోకసౌఖ్య [34]రహితుండు.

64


క.

విజితేంద్రియులై మనుజులు
నిజముగ వర్ణాశ్రమముల నిలిచిన వారల్
సుజనత్వంబున నెప్పుడు
నజలోకము నాశ్రయింతు రానందమునన్.

65


క.

[35] ఇష్టాపూర్తరతులును వి
శిష్టమతిం బంచయజ్ఞసేవకులును ను
త్కృష్టదయాత్ములు నతివి
స్పష్టయమాలయముఁ జూడఁ జన రెన్నటికిన్.

66

సీ.

విషయనివృత్తులు వేదవాదులు నగ్ని
       పూజారతులు నాకమున వసింతు
రరులు దాఁకిన శూరులై మృతులగు వార
       లర్కమండలభేదు లగుదు రెపుడు
భువి ననాథాంగనాభూసురార్థము గాఁగఁ
       బ్రాణంబు విడిచిన భవ్యమతులు
బంధుల వృద్ధుల బాలుర దారిద్ర్య
       యుతుల రక్షించిన యుత్తములును


తే.

దివ్యలోకంబు గాంతురు తివిరి గోవుఁ
బంకమున బ్రాహ్మణుని [36]రోగపంకమునను
మునుఁగకుండఁగఁ గాచిన యనఘు లశ్వ
మేధలోకంబు గాంతు రమేయచరిత!

67


క.

గోవుల నడువక యెక్కక
సేవించుచు నీరు పూరి చెచ్చెర నిడి సం
భావన చేసిన పుణ్యులు
వావిరి గోలోకసన్నివాసులు సుమ్మీ.

68


ఆ.

ప్రాణిసమితికెల్లఁ బ్రాణంబు లుదకంబు
లందయుండుఁ గాన నచట నచట
నుదకదాన మిడిన యుత్తములకుఁ బ్రాణ
దానఫలము లొందు ధర్మచరిత!

69


సీ.

ఏపుణ్యుఁ డొనరించు కూపవాపీతటా
        కంబుల నెంతజలంబు నిల్చు
నెన్నిజీవులు ద్రావు నెన్నివేలేఁడులు
        నమరలోకప్రాప్తుఁ డగు నతండు
జలములు లేనిచోఁ జలిపంది రిడుపుణ్యు
        లక్షయలోకమునందు నెపుడు
నశ్వత్థబిల్వనింబామలకకపిత్థ
        వటతింత్రిణీకామ్రవిటపితతులు

తే.

భువిఁ బ్రతిష్ఠలు చేసినపుణ్యుఁ డెపుడు
నరక[37]గోళంబుఁ జూడక నాక మొందు
మూలఫలపుష్పపత్రాదు లోలి నిచ్చు
తరువు లెల్లప్పుడును బుణ్యతమము లగుట.

70


ఆ.

దట్టమైన నీడఁ దనరి మార్గముక్రేవఁ
బొదలు తరువు లిచ్చు పుణ్యమునకు
నశ్వమేధశతములైనను [38]సమముగా
వనిరి ధర్మవేదులైన మునులు.

71


క.

ఇలఁ బక్షుల కాశ్రయమై
ఫలియించెడి తరువు నఱకు పాపాత్ములు సం
కెలలఁ బడి ఘోరనరకా
గ్నులఁ గూలరె యమునిభటులు కొఱవులఁ జూఁడన్.

72


తే.

[39]వినుము రావియు వటమును వేము నొక్క
టొకటి బిల్వకపిత్థంబు లుసిరికలును
మూఁడు మూఁ డామ్రదశకంబు మొనసి వనము
లొనర నిల్పిన నరకము నొందఁ డెపుడు.

73


వ.

మఱియు సకలవనంబులం దులసీవనంబు పరమపురుషార్థంబు
గావున.

74


ఉ.

తులసీకానన మెవ్వరింట నలరున్ దోషాంధకారార్కమై
తలఁప న్బొల్పగుఁ దద్గృహంబు ధరఁ దీర్థం బెందు నయ్యింటికిన్
బలిమి న్గాలుని కింకరవ్రజము రాఁ [40]బట్టించు నూహింపఁగాఁ
దులసీగంధము గల్గుచోటు సుకృతస్తోమాలయం బెప్పుడున్.

75

వ.

అ ట్లగుటం జేసి తులసీరోపణంబు చేసినవారు తద్బీజపత్రంబు
లెన్ని గల్గు నన్ని సహస్రవర్షంబులు విష్ణులోకంబునం బొందుదురు
తద్గంధాఘ్రాణంబున నరులు [41]గరుడారూఢులై పరమపదప్రాప్తు
లగుదురు. నర్మదాదర్శనంబును గంగాస్నానంబును దులసీ
[42]స్పర్శనంబునకు సమంబు రాదు. ప్రతిద్వాదశియందునుఁ
బ్రహ్మాదిదేవతలు చనుదెంచి తులసిపూజ సేయుదురు గావునఁ
దద్దళంబుల [43]హరి నర్చించువారలకుఁ బద్మకాంచనపుష్ప
మౌక్తికపూజాదానఫలంబులు సిద్దించుఁ. దులసీరోపణ పాలన
సేవన దర్శన స్పర్శనంబులఁ జేసిన నరులకు వాఙ్మనఃకాయసంచిత
పాపంబులు వొలియు. సకలదానంబులు తులసీరోపణంబునకు
షోడశాంశంబు దొరయవు. చూతసహస్రరోపణంబును అశ్వత్థశత
స్థాపనంబును నొక్కతులసీరోపణసదృశంబు పుష్కరాదితీర్థంబు
లును గంగాదిమహానదులును వాసుదేవాదిదేవతలును దులసి
యందు వసియింతురు గావునఁ [44]దత్పత్రంబుల విష్ణుపూజ సేసిన
నరులు లక్షయుగంబులు తల్లోకంబున విహరించుచుందురు.

76


క.

తులసీ[45]దళములచేతం
బొలుపుగ హరిహరులఁ భక్తిఁ బూజించినపు
ణ్యులు జననీగర్భగృహం
బులు దూఱక నిత్యముక్తిఁ బొందుదు రెలమిన్.

77


క.

శివపూజ సేయువారును
శివునందలి వేడ్క గల్గు శివభక్తులు నా
శివలోకంబున నుండుదు
రవిరళముగ శివునిఁ గొల్చి యాకల్పంబున్.

78

క.

లలిదంభ లోభ హాస్యం
బుల నొండెను శఠత నొండె భూతేశ్వరునిం
దలఁచినవారలు [46]మఱియును
నలఘుమతిన్ యముని[47]కడకు నరుగరు సుమ్మీ!

79


సీ.

స్ఫటికశిలారత్నపార్థివంబుల శివ
       లింగంబుఁ గావించి సంగతముగఁ
బంచాక్షరీజపపరతఁ ద్రికాలంబుఁ
       బూజించు శివభక్తి పూతమతులు
నిరయంబుఁ జూడక నిరతిశయంబగు
       శివలోకమునను వసింతు రెపుడుఁ;
బూజసేయకయైన భూతేశు నతిభక్తిఁ
       దలఁచినమాత్రన తత్పదంబుఁ


తే.

బొందఁ గాంతురు; శివభక్తిఁ బోలనొండు
ధర్మములు లేవు; శివునికిఁ దగ సమర్పి
తంబులగు పత్రపుష్పఫలాంబువులును
మొనసి నిర్మాల్యములు గాఁగ ముట్టరాదు.

80


వ.

తత్పదార్థంబు లన్నియుఁ గూపనిక్షేపణంబులు చేయునది గాని
యది యుల్లంఘించిన మహాపాతకంబగు. మక్షికాంఘ్రిమాత్రం
బును శివధనంబు లపహరించువారు ఘోరనరకప్రాప్తు లగుదురు.
హరిహరాదులయం దేదేవు నారాధించిన యయ్యైలోకంబుల
కరిగి సుఖంబు లనుభవింపుదురు.

81


క.

హరిభక్తులై మహేశ్వరుఁ
బరువడి శివభక్తులయ్యుఁ బంకరుహాక్షుం
గరకరివడి దూషించిన
నరు లేగుదు రుగ్రమైన నరకంబునకున్.

82

తే.

కాష్ఠపాషాణమృత్తులఁ గరము భక్తిఁ
గడఁక దేవాలయంబులు గట్టు నతఁడు
తివిరి పితరులతోఁ గూడ దివ్యయుగము
లమరపదమున సౌఖ్యంబు లనుభవించు.

83


వ.

మఱియు యతిగేహ [48]విప్రనిలయ జనాశ్రయ దీనానాథగృహం
బులు నిర్మించినవారలు కనకగృహనివాసు లగుదురు. జీర్ణో
ద్ధరణంబు తత్ఫలద్విగుణంబగు. యతి విప్ర దేవ ధనంబులం
బొరయు నతం డిరువదియొక్కనరకంబులు సపశుపుత్త్రబాంధ
వుండై యనుభవించు. లోభమోహంబుల మఠాధిపత్యంబు చేసిన
వాఁడు సర్వధర్మబహిష్కృతుండగుం గావునఁ దద్గృహాన్నభోక్త
కుం జాంద్రాయణాచరణంబు వలయు; నతని సంస్పర్శనంబున
సచేలస్నానంబు చేయవలయు; వస్త్రాన్న[49]దానాదులు దేవబ్రాహ్మణ
మఠపతుల కొసంగునతండు నక్షత్రలోకంబున వెలుంగుచుండు.

84


క.

హరిహరహిరణ్యగర్భుల
కరుదుగఁ బూదోఁట లిడిన యనఘాత్ములు ని
ర్జరలోకసుఖముఁ గాంతురు
కర మనురాగమున బ్రహ్మకల్పము దాఁకన్.

85


క.

అతిథుల దేవతలను స
న్మతితోఁ బూజించునట్టి మనుజులు వేడ్కం
జతురాననలోకంబున
నతిశయకల్పంబు లుందు రమృతాశనులై.

86


సీ.

అలసి మధ్యాహ్నంబునందు వచ్చు [50]నతిథి
        కెడసేయ కన్నంబు లిడు గృహస్థుఁ
డొగి నింద్రలోకంబు నొందుఁ దాఁ గడపిన
        నతనిపాతకమెల్ల నితఁడు వొందు

నతిథు లెవ్వరియింట నశనంబు భుజియింతు
       రాతని పితృజను లక్షయముగ
బ్రహ్మలోకంబునఁ బదివేలదివ్యహా
       యనములు వసియింతు రనఘచరిత!


తే.

యతిథి కీడుకంటె ధర్మంబు లవని లేవు
[51]పరమగృహమేధి కతిథియ పరమబంధుఁ
డతఁడ కల్మషజాలంబు నడఁపఁజాలు
నతిథి గడపినఁ బరలోకహాని యగును.

87


వ.

మఱియు నతిథిసత్కారంబు చేసిన పుణ్యుండు యమదర్శనం
బొల్లక యమృతభోజియై యనేకదివ్యవర్షంబులు దివినుండి పిదప
భూపతియై జన్మించి ధర్మపరుండగు. సర్వభూతంబుల ప్రాణం
బులు నన్నంబునంద [52]యాశ్రయించి యుండు గావున నన్న
ప్రదాతయె ప్రాణప్రదాత యగునని చెప్పి కింకరుండు మఱియు
నిట్లనియె.

88


క.

విను కేసరిధ్వజుండను
జనపతి దివినుండి భువికిఁ జనుదేరంగాఁ
గని శమనుఁ డతనితోడను
వినఁ జెప్పిన మాటలెల్ల విను మేర్పడఁగన్.[53]

89

ఆ.

[54]వేదమాత గాఁగ వెలసిన గాయత్రి
భక్తియుక్తితో జపంబుసేయు
నతఁడు దురితవితతి నాక్షణంబునఁ బాసి
బ్రహ్మపదముఁ గాంచు భవ్యచరిత!

90


వ.

మఱియు దజ్జపంబు నరులకు వాఙ్మనఃకాయంబులగు దోషంబు
లణంచు నేమంత్రంబులును గాయత్రియందు శతభాగంబు
దొరయ నేరవు, మఱియును.

91


క.

ఱేపును మాపును వేల్చుచు
నేపున గాయత్రిఁ జిత్తమిడి వేదము ని
ర్లోపముగాఁ బఠియించిన
యా పురుషుఁడు బ్రహ్మలోక మనయము నొందున్.

92


క.

పరపాక పరాన్నంబులు
పరిహరణీయంబు లగుటఁ బరభోజన మె
ప్పరుసునఁ జనఁ దద్ద్రవ్యము
లిరవుగఁ దా దారఁగొని భుజించుట యొప్పున్.

93


ఆ.

ఎవ్వనింట నశన మెవ్వఁడు భుజియించు
వాని పాపమెల్ల వాఁడు నొందు
నట్లు గాన ధరఁ బరాన్నంబు వర్జింప
వలయు సుగతిఁ గోరువారికెల్ల.

94


తే.

అనఘ! మూఁడునెలల నొండె నాఱునెలల
నొండె [55]నెమ్మి ప్రాయశ్చిత్త మొనరఁజేయ
జనములకు వాఙ్మనఃకాయజంబులైన
యఘము లడఁగును యమపురి కరుగఁ డతఁడు.

95

వ.

ఇట్లు గావునఁ బ్రాయశ్చిత్తంబు చేసికోవలయు. మఱియు నిత్య
స్నానంబువలనఁ గల్మషరహితంబగు. ప్రాతస్స్నానంబున నరక
గామి కాఁడు. అస్నానభోజి మలభోజియగు. అతం డశుచి గావునఁ
బితృవిముఖుండగు. స్నానహీనుండు నరకం బనుభవించి కుయో
నుల జన్మించు. నదీస్నానంబు దుస్స్వప్న దుశ్చిత్తాది దోషంబు
లణంగించి పుణ్యలోకంబు లొసంగు.

96


తే.

తిలలు దానంబు సేయువారలు యమాల
యంబు చూడక గోలోక మనుగమింతు;
[56]రెలమి గో భూమి కనకాదు లిచ్చువారు
దివ్యలోకంబులందు వర్తింతు రెపుడు.

97


వ.

మఱియు వ్యతీపాతగ్రహణసంక్రాంతులు మొదలైన పుణ్యతిథు
లందు స్నానదానంబులు సేయువారు నిరయవిముఖు లగుదురు.
సత్యవాదియు మౌనియుం గ్రోధరహితుండును మితభాషియు
ననసూయకుండును దయాన్వితుండును పరదార పరద్రవ్య పరా
ఙ్ముఖుండును నరకంబు జొరక సురలోకంబున వసియుంతురు.

98


సీ.

పరనిందకుండును పరుషవాక్యుండును
       యమలోకదుఃఖార్తు లగుదు రెపుడు
వారు చేసిన తపోవ్రతతీర్థదానంబు
       లన్నియు విఫలంబులై నశించు
ధరఁ గృతఘ్నుఁడు సేయు దానధర్మంబులు
       నష్టంబులై వాఁడు నరకమునకుఁ
బోవుఁ దీర్థములాడు పుణ్యుండు నశనవ
ర్జనుఁడును నింద్రియసమితి నోర్చు

తే.

నతఁడు చూడంగ నొల్లఁ డయ్యమునిపురము
తీర్థసేవ గావించి వర్తించు నతఁడు
[57]కడఁగి లోభంబునను బ్రతిగ్రహము గొనిన
యతని తీర్థంబు నిష్ఫల మనిరి మునులు.

99


క.

ఒకమాటు గంగనాడిన
యకుటిలమతి బ్రహ్మహంతయైనను బుణ్యా
త్మకుఁడై కాలుని పట్టణ
మొకమాటును జూడ కొందు నురుతరముక్తిన్.

100


సీ.

వ్రతదానజపములు క్రతువులు పావన
        ధర్మంబులును బుణ్యకర్మములును
గంగాజలాభిషేకమునకు సరిగావు;
        గంగ కేతీర్థము ల్గావు సాటి;
పావనహరిపదప్రభవమై హరుమౌళిఁ
        గర మొప్పుచున్న గంగాజలంబు
నందుఁ గతస్నానుఁ డగు పుణ్యపురుషుండు
       పాతకసంఘంబుఁ బాయు టరుదె?


ఆ.

నరుఁడు నూఱుయోజనములనుండియు వేడ్క
గంగ గంగ యనుచుఁ గరము భక్తిఁ
దలఁచెనేని దురితతతిఁ బాసి విష్ణులో
కమును బొందు నరకగామి గాక.

101


ఆ.

మతిఁ బ్రతిగ్రహక్షమత్వంబు గలిగియు
[58]ధారగొనిన యట్టి ధర్మపరుఁడు
దివిఁ జరించు నెపుడు దేదీప్యమానుఁడై
తారాకాభమూర్తిఁ దాల్చి యతఁడు.

102

వ.

మఱియు గోబ్రాహ్మణ[59]సంరక్షణంబు కొఱకుం బ్రాణంబులు
విడిచినవారు దివంబున నక్షత్రంబులై వెలుంగుదురు. ప్రాణా
యామపరులు పాపకారులైనను యమలోకంబు చూడరు. గో
సహస్రదానఫలంబును ప్రాణాయామంబును సమంబు. తన్మాత్రం
బున మహాపాతకోపపాతకంబులు భస్మంబు లగును.

103


క.

జితరోషు లమరలోక
స్థితినుండి ధరిత్రిఁ బుట్టి శ్రీమంతులునై
పితృజనశుశ్రూషణ జన
రతులై యమపురము దిక్కు రా రెన్నటికిన్.

104


ఆ.

తండ్రికంటె నధికతములుగా గురువులఁ
బూజసేయునట్టి పుణ్యమతులు
బ్రహ్మలోకమునను బ్రహ్మసన్నిధి నున్కి
సకల వేదశాస్త్రసమ్మతంబు.

105


వ.

మానినులు దుష్టసంగరాహిత్యంబున శీలంబు రక్షించువారు పుణ్య
లోకప్రాప్తు లగుదురు. శూద్రుం డశననియమంబున నిషిద్ధాచర
ణంబునను నిరయగతుండు గాఁడు. వేదపురాణాధ్యాపకులు దివం
బనుభవించి సకలశాస్త్రవ్యాఖ్యాతలును వేదాంతశీలురును ధర్మ
బోధకులునై భువి జనించి పిదప బ్రహ్మలోకప్రాప్తు లగుదురు.
పరమజ్ఞానోపదేశంబు చేసిన యతని నమరులు పూజింతు రని చెప్పి
కింకరుండు వికుండలున కిట్లనియె.

106


క.

విను మత్యంతరహస్యం
బనఘా! మా గమికినెల్ల యముఁ డేకాంతం
బున నానతిచ్చు పలుకులు
వినిపించెద వానినెల్ల విస్పష్టముగన్.

107

క.

పంకజనాభుని గుణములు
సంకీర్తన సేయునట్టి సత్పురుషులు ని
ష్పంకమతు లగుట వారల
వంకకు మఱచియును బోవవలవదు సుండీ!

108


ఉ.

కావున వైష్ణవోత్తములఁ గన్గొనునంతఁ దొలంగుఁ డెమ్మెయిన్
వావిరి నాదుసన్నిధికి వారలు రాఁ దగ రచ్యుతైకనా
మావళి యాత్మలం దలఁచునట్టి మహాత్ముల శంఖచక్ర[60]చి
హ్నావృతులైన యట్టి సుగుణాఢ్యుల నాదెస దేకుఁ డెన్నఁడున్.

109


వ.

దుష్టచరిత్రు లైనను విష్ణుసమారాధనంబు సేయువారలు పరిహర
ణీయులు దత్సంగులు నట్ల కావున వైష్ణవులదిక్కు పోవలదని
యముండు తన దూతలకెల్ల నెఱింగించె నట్లు గావున.

110


క.

హరిభక్తి లేనివారల
కరయఁగ నరకాబ్ధి దాఁట నన్యోపాయం
బిరవందలేదు లేదని
పరఁగఁ బురాణములు చాటుఁ బరమపవిత్రా !

111


ఆ.

విష్ణుభక్తిలేని విప్రునిఁ జండాలుఁ
జూచినట్టు లెపుడుఁ జూడవలయు
వర్ణబాహ్యుఁడైన వైష్ణవుం డగునేని
పరఁగ వాఁడు లోకపావనుండు.

112


సీ.

కులములో నొక్కఁడు గోవిందు నర్చింపఁ
       దత్పూర్వు లమరేంద్రధాము లరయ
వైష్ణవదాసులు వైష్ణవాశనము భు
       జించినవార లచ్చెరువుగాఁగ
సురలోకనిలయులు సుమ్ము వైష్ణవులిండ్ల
       నశనంబు లేదేని యచటి జలము
ద్రావిననైన నాతఁడు పుణ్యుఁ డెల్లడ
       నారాయణా యను నామజపము

ఆ.

భక్తితోడఁ జేయు పరమపుణ్యాత్ముండు
యమునిసీమఁ ద్రొక్కఁ డది నిజంబు
గాన విష్ణుభక్తి గలిగియుండుట లెస్స
భవపయోధి [61]కదియ బాడబాగ్ని.

113


వ.

మఱియు ముద్రాన్యాసచ్ఛందోదేవర్షిసమాధియుక్తంబుగా
నష్టాక్షరి యొండె షడక్షరి యొండె ద్వాదశాక్షరి యొండె జపి
యించువారలు శంఖచక్రవనమాలాలంకృతులై విష్ణులోకంబున
విహరింతురు.

114


క.

ధర సాలగ్రామ [62]శ్రీ
హరిపూజలు సేయు నతనిఁ బ్రాపించును నా
పరిపూర్ణరాజసూయా
ధ్వరహయమేధముల ఫలము తద్దయు గణఁకన్.

115


సీ.

అవనిఁ గాష్ఠంబుల ననల ముండిన మాడ్కిఁ
        జెలఁగి సాలగ్రామశిలలయందు
విష్ణుతేజం బెప్డు విహరించు నటుగాన
        సకలలోకంబులు సకలదేవ
గణము నచ్చట వచ్చి కాపుండు నెప్పుడుఁ
        దత్పూజనము సేయు ధన్యమతుల
కధ్యాత్మవిదులకు నందని లోకంబు
        లొదవుఁ దత్సన్నిధినుండి పైతృ


తే.

కంబుఁ జేసినఁ దత్పితృగణము దివ్య
లోకములు గాంచుఁ దచ్ఛిలాలోకనమునఁ
దత్ప్రసాదంబు సేవయుఁ దనరెనేని
[63]పాపికైనను బ్రాపించుఁ బరమపదము.

116

వ.

మఱియుఁ బుండరీకాక్షుండును లక్ష్మియందు వైకుంఠంబు
నందును విహరించునట్లు సాలగ్రామశిలల ననవరతంబు నుండుఁ
గావునం దత్పూజనంబు చతుస్సముద్రముద్రితధరాదానంబు
కంటె నధికఫలంబు నిచ్చు.

117


ఆ.

దానతీర్థశక్తిహీనుఁడై యుండిన
నరుఁడు ముక్తి నొందుఁ బరమభక్తి
[64]నిత్యనియమలీల నెగడి సాలగ్రామ
శిలల విష్ణుపూజ సేయునేని.

118


తే.

ఓలిఁ బండ్రెండుమూర్తుల నొక్కపీఠ
మునను నొకనాఁడు పూజచేసిన యతండు
లీలఁ బండ్రెండుకోటుల లింగములను
బసిఁడితమ్ములఁ బూజించు ఫలము నొందు.

119


ఆ.

ఎచట నిట్టిమూర్తి యే కాలమును నుండు
నచట యోజనత్రయంబు దీర్థ
మగుట ధర్మకర్మ మయ్యెడ నొనరింపఁ
గోటిగుణిత మండ్రు మేటిమునులు.

120


ఆ.

పంచగవ్యములును బహుతీర్థజలములు
వేయుమార్లు గ్రోలు విపులఫలము
గలుగు నొక్కనాఁడు గదిసి సాలగ్రామ
తీర్థమాను పుణ్యదేహులకును.

121


క.

విను సాలగ్రామశిలా
వినుతజలం బాను నతఁడు వెండియు జననీ
స్తనపాన మాచరింపక
ఘనముగ వైకుంఠమునను గాఁపురముండున్.

122


వ.

మఱియుఁ దచ్ఛిలాధిష్ఠితస్థలంబునకుఁ గ్రోశమాత్రంబున మృతు
లైన జంతువులు వైకుంఠంబు నొందుదు; రట్లగుట సాలగ్రామ

శిలాదానంబు సకలధరావలయదానఫలంబు నిచ్చుఁ. దన్మూల్య
వక్తయు విక్రేతయు ననుమతయు ననువీరలు నరకగాములు
గావునఁ దద్విక్రయంబు వలవదు. మఱియు నొక్కవిశేషంబుఁ
జెప్పెద వినుమని యమకింకరుం డిట్లనియె.

123


తే.

వేయు నేటికి నొకమాట వినుము వైశ్య
ఘోరభవములఁ దొలఁగించుకొను [65]శ్రుతంబు
గలదు హరినామ మొకమాటు దలఁచిరేని
నట్టి పుణ్యులు వొందుదు రవ్యయంబు.

124


చ.

అడవులఁ గందమూలకఫలాశనులై విజితేంద్రియాత్ములై
విడువక వేదము ల్చదివి విశ్రుతమైన తపంబు సేయఁగాఁ
బడసిన తత్ఫలం బొదవుఁ బంకజనాభుని నామ[66]సంస్తుతిం
దడయక చేయుచున్న హరిదాసుల కెందుఁ దలంచి చూడఁగన్.

125


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

126


క.

హరిదినమున నుపవాసం
బరుదుగఁ బ్రాసంగికముననైనఁ జరింపన్
నరకమును జెందఁ డనియును
బరువడి సమవర్తి పలుకు పలుకులు వింటిన్.

127


తే.

రాజసూయశతంబు దురంగమేధ
యాగశతమును జేసిన యట్టి ఫలము
నొక్కహరివాసరమునందు నుపవసించు
ఫలము పదియాఱవగు పాలి పాటిరావు.

128


క.

ఏకాదశేంద్రియంబులఁ
బ్రాకటముగఁ జేయునట్టి పాపము లెల్లన్
వైకల్యమొందు నొకపరి
యేకాదశి నుపవసించునేనియు ననఘా!

129

సీ.

ఏకాదశికిఁ దుల్య మే ధర్మమును గాదు
        మనుజుఁ డం దుపవసించిననె చాలు;
యమునివాసముఁ జూడ నరుగక ముక్తుడై
        హరిలోకసౌఖ్యంబు నతఁడు వొందు;
గంగ గోదావరి గయ ప్రయాగాది తీ
        ర్థస్నానఫలములు రావు సాటి;
నరుఁడు గూ డుడిగి జాగర మొప్పఁ జేసిన
        ఫలమింత యంతని తలఁవరాదు;


తే.

[67]తల్లి దెసవారు పదురును దండ్రివారు
పదితరంబులవారును భార్యవంకఁ
బదితరంబులవారును బలసిరాఁగ
నతఁడు ప్రాపించు నిశ్చలహరిపదంబు.

130


ఆ.

వెలయు బాలతరుణవృద్ధత్వమునలోన
హరిదినోపవాస మబ్బెనేని
కడఁగి యెట్టిపాటి కల్మషియైనను
నరకగామి గాఁడు నరుఁడు నిజము.

131


వ.

మఱియు నొకటి చెప్పెద గోభూతిలహిరణ్యాదిదానంబు లిచ్చు
టయుఁ దీర్థసేవనంబును మనోవాక్కాయకర్మంబుల భూతంబుల
కలుగమియు నింద్రియనిరోధంబును హరిసేవనంబును వర్ణాశ్రమ
క్రియాపాలనంబును నను నివి నరకవారణంబులు స్వర్గఫలదం
బులు నని గార్గ్యాదులగు మహామునులు సెప్పుదురు గావున.

132


ఆ.

అంబరములు గొడుగు [68]లాకులు పండులు
తమ్ములములు చెప్పులిమ్ము గాఁగ
దినదినంబుఁ దనకుఁ దీఱిన కైవడి
దాన మిడుట పరమధర్మ మెందు.

133

క.

ఈ లోకంబునఁ బెట్టక
యా లోకంబునను గలుఁగ దటు గాన సుమీ
మేలౌ దానము ధర్మముఁ
గాలోచితగతులఁ జేయఁగాఁ దగు మనుజుల్.

134


సీ.

అది యెట్టిదన్నను నధికధనాఢ్యులు
       పుణ్యలోకంబునఁ బొంది పిదప
సద్వంశజాతులై సమత దీర్ఘాయుస్స
       మేతులై సంపత్సమృద్ధు లగుచు
నఖిలభోగార్హులు నార్యవర్తనులునై
       జనియింతు రవనిలో ననఘవృత్తి
మాటికి నిటఁ బెక్కుమాట లేల యధర్మ
       వర్తి దుర్గతినొందు నార్తుఁ డగుచు


ఆ.

ధర్మవర్తనుండుఁ దగఁ బుణ్యలోకంబు
లందుఁ గాన బాల్య మాదిగాఁగ
ధర్మపరుఁడు గాఁగఁ దగు మర్త్యుఁ డని యతం
డనియె నవ్వికుండలునకు మఱియు.

135


క.

విను మింక నెద్దియేనియు
నను నడిగెడు వేడ్క నీ మనంబునఁ గలదే?
యనుడు వికుండలుఁ డాతనిఁ
గనుఁగొని యిట్లనియె నధికగౌరవ మెసఁగన్.

136


క.

నీ మధురవాక్యము ల్విని
నా మనము ప్రసన్న మయ్యె నాకుం జూడన్
నీ మహితసుజనగోష్ఠిన్
సామర్థ్యము గలుగువారు సజ్జను లెందున్.

137


ఆ.

గంగ నెట్టి పాపి గదిసిన బుణ్యుఁడై
యొప్పినట్లు నీవు సెప్పినట్టి
పుణ్యభాషణములఁ బుణ్యుండ నైతి ను
త్తమగుణాఢ్య! నిత్యధర్మచరిత!

138

క.

ఉపకారంబును బ్రియమును
గృపయును నీయంద కల దకిల్బిషహృదయా!
యపవిత్రుఁడు శ్రీకుండలుఁ
డపవర్గము బొందుమార్గ మానతి యీవే.

139


వ.

అనిన విని [69]యమదూత కరుణాయత్తచిత్తుండై యతని మిత్ర
భావం బుపలక్షించి దివ్యజ్ఞానదృష్టిం జూచి యిట్లనియె. వైశ్యా !
తొల్లి నీ యెనిమిదవ జన్మంబునం జేసిన సుకృతం బీ నోపితేని
భవద్భ్రాతకుం బుణ్యలోకంబు గలుగు ననిన విని యచ్చెరువంది
వికుండలుం డతని కిట్లనియె.

140

వికుండలుండు తనపూర్వజన్మసుకృతం బిచ్చి శ్రీకుండలు నుద్ధరించుట :

ఆ.

అట్టి పుణ్యకర్మ మెట్టు నేఁ జేసితి
నెట్టివాఁడ దొల్లి యెఱుఁగ నాకు
నెఱుఁగఁ జెప్పవయ్య! యిప్పుడు నీ పంపు
నట్టి పుణ్యఫలము నన్న కిత్తు.

141


([70]అనిన నత్తెఱంగు వినుమని యతనికి యమదూ తిట్లనియె.)


సీ.

మధురతరంబైన మధువనంబునఁ దొల్లి
        శాకల్యుఁ డను మునిసత్తముండు
బ్రహ్మసమానుఁడు ప్రకటవేదాభ్యాసి
         విమలతత్త్వజ్ఞాన[71]శమదమాఢ్యుఁ
డతనికి రేవతి యను వధూమణియందు
         నత్యంతనియమాత్ము లాత్మపరులు
దురుఁ డన శశి యన ధ్రువుఁడు నాధీరుండు
         ననఁగ జ్యోతిష్మంతుఁ డనఁగ వరుసఁ

తే.

గొడుకు లేవురు జన్మించి కడఁక నగ్ని
హోత్రనిరతులు గృహధర్మయుతులు విజిత
మోహమాయాగుణాఢ్యులు ముక్తిరతులు
నధికవిద్యాసమర్థులునై తనర్చి.

142


వ.

ఉన్నవారలలో నలువురు సన్న్యసించి సకల ధర్మపరిత్యాగులును
నిఃస్పృహులును సమలోష్ఠకాంచనులును [72]బ్రహ్మవిద్యాపరాయ
ణులును వీతనిద్రాహారులును సర్వసహిష్ణువులునునై సర్వంబును
విష్ణుమయంబుగా విచారించి సదానందచిత్తులై తిరుగుచున్న య
మ్మహాయోగివరు లొక్కనాఁడు.

143


క.

విను వైశ్యవర్య! పోయిన
యెనిమిదియగు భవమునందు నెఱుక సమగ్రం
[73]బునఁ దనరిన విప్రుఁడ వా
యనుపమ మగు మత్స్యదేశ మావాసంబై.

144


వ.

గృహస్థాశ్రమంబునం దారసమేతుండవై యొక్కనాఁడు మధ్యాహ్న
సమయంబున వైశ్యదేవాంతరవేళ నయ్యోగివరు లధికపథశ్రాం
తులై వచ్చి నీగృహద్వారంబున నున్న వారలం గనుంగొని.

145


సీ.

హర్షాశ్రువులు గమ్మ నంగంబు పులకల
       ప్రోవులై సంభ్రమంబును భయంబు
వినయంబుఁ బెనఁగొన విష్ణుసన్నిభులగు
       వారలఁ గని యతిగౌరవమున
[74]నలువంద దండప్రణామంబుఁ గావించి
       యాసనార్ఘ్యాదికృత్యములఁ దనిపి
తత్పాదజలములు దగ శిరంబునఁ జల్లు
       కొని మనంబున భక్తికొనలు నిగుడఁ

ఆ.

గరపుటంబు మౌళిఁ [75]గదియంగ మఱియును
మ్రొక్కి సంస్తవంబు లక్కజముగఁ
జేసి పుణ్యులార! చెచ్చెర మిముఁ జూడ
గలిగె నాదు భాగ్యగౌరవమున.

146


ఉ.

ధన్యుఁడ నైతి మీచరణతామరసంబులు గంటి మంటి స
న్మాన్యగుణాఢ్యులైన మిము మానుగ నేఁ బొడగన్నమాత్రఁ జై
తన్యము వచ్చె నా కొలుచు దైవము లెప్పుడు మీర కాని నే
నన్య మెఱుంగ ముజ్జగములందుఁ బవిత్రుఁడనైతి మీదయన్.

147


చ.

అని వినుతించి యమ్మునుల కందఱకుం గడుభక్తి గంధమా
ల్యనివహధూపదీపవివిధార్చలఁ దుష్టియొనర్చి యిష్టభో
జన మిడి తమ్ములంబు ఘనసారయుతంబుగ నిచ్చి భక్తిమైఁ
బెనఁగొన నిష్టవాక్యములఁ బ్రీతులఁ జేసితి [76]వీవు వారలన్.

148


ఆ.

అంత రాత్రి యగుడు నయ్యోగివరులు నీ
మందిరమున నింపు మవ్వ మెక్క
వెలయు శయ్యలందు విశ్రమించిరి తొల్లి
యట్టి సుకృత మెన్న నలవి యగునె?

149


వ.

నాఁడు వారల కాతిథ్యంబు చేసిన తత్ఫలంబు శేషునకుం జెప్ప
నలవి గాదు. విను మొక్కవిశేషంబు సెప్పెద. భూతంబులలోనం
బ్రాణవంతంబు లుత్తమంబు; లంతకంటె మతియుక్తు లధికులు.
వారికంటె బుద్దియుక్తులగు జనులు గరిష్ఠులు. మనుష్యులలోనం
బ్రాహ్మణులు [77]విశిష్టులు, వారికంటె విద్వాంసు లుత్తములు.
వారికంటెఁ గర్తలు ధన్యులు వారికంటె బ్రహ్మవాదులగు యోగీం
ద్రు లాఢ్యులు. వారలు లోకత్రయపూజ్యు లగుటం జేసి.

150

ఆ.

ఎవ్వనింటనేని [78]యే యోగి భుజియించి
సంతసిల్లు నతని జన్మకృతము
లైన యఘము లెల్ల నా క్షణంబునఁ బాయు
నవ్యయత్వ మొందు నాతఁ డనఘ!

151


ఆ.

కాన నాటి పుణ్యకర్మంబు నీ యగ్ర
జునకు నిచ్చి యతని సుకృతిఁ జేయు
మనిన దూత మాట విని వికుండలుఁడును
దత్ఫలంబు నపుడు దారవోసె.

152


వ.

ఇట్లు దారవోయుటయుం దత్పుణ్యఫలమాహాత్మ్యంబున నరక
కూపంబు వెలువడి మంచు విరియించి యేతెంచు మార్తాండు
చందంబున వచ్చి శ్రీకుండలుండు దమ్మునికడ నిల్చినం గనుం
గొని పులకితశరీరుండై గద్గదకంఠుం డగుచు వికుండలుం డన్న
కిట్లనియె.

153


క.

రెయ్యును బగలును నరకపు
గ్రయ్యలఁ బడి వెడల నీఁదఁ గానక మేనిం
[79]తయ్యున్నదయ్య [80]శివశివ
అయ్యో! నా యన్న! యెంత యడలితివొ కటా!

154


వ.

అని వికుండలుం డన్నకు నమస్కరించి సర్వాలింగనంబు చేసెఁ
దదనంతరంబ.

155


క.

ఇరువురఁ గని సురసంఘము
గురుతరముగఁ బుష్పవృష్టి గురియఁగ నంతన్
సురదూతఁ జూచి మ్రొక్కుచుఁ
బరమానందమున వైశ్యపతి యిట్లనియెన్.

156

క.

నీ వచనాకర్ణనమున
భావింపఁగ నాకుఁ బుణ్యపాపము లెఱుఁగం
గా వచ్చె నేఁ గృతార్థుఁడ
నై వెలసితి ధర్మదూత! యఖిలవినీతా!

157


ఆ.

నరకగామియైన నా యన్నయును నీ ప్ర
సాదమహిమఁ జేసి సాదరమున
నచటు వెడలివచ్చె నతఁడు వీఁడని చూపి
యాతఁ డనుప నరిగి రమరపురికి

158


వ.

ఇట్లు నరకంబు వెలువడి వైశ్యకుమారు లిరువురు దివ్యశరీరులై
యమరలోకంబునకుం జని యింద్రభోగంబు లనుభవించుచుండిరి.
దేవదూతయు సమవర్తి సన్నిధికిం జనియె నని చెప్పి దత్తాత్రే
యుండు

159


క.

ఈ యితిహాసం బే నరుఁ
డాయతమతితోఁ బఠించు నాతఁడు సుకృత
శ్రేయోయుతుఁడై యమపుర
మే యుగములఁ జూఁడఁ జనక యిచ్చ జరించున్.

160


వ.

అనిన విని కార్తవీర్యుం డమ్మహాముని కిట్లనియె.

161

మాఘమాసప్రభావము :

సీ.

అయ్య! నీ చెప్పిన యా యితిహాసంబు
        మాఘమజ్జనము సామర్థ్యమెల్లఁ
దెలిసె వెండియు వినవలతు నా కెఱిఁగింపు
        మనిన నమ్ముని సెప్పె నతనితోడఁ
బూతంబు శుచియును బొరి నిసర్గంబును
       దావలంబును మఱి దాహకంబు
జీవకోటికి నెల్ల జీవనాఢ్యంబైన
       యా రూపు విష్ణుమయంబ యనుచు

ఆ.

వేదవితతి సెప్పు విను గ్రహంబులలోన
నినుఁడు చుక్కలందు నిందుఁ డెట్లు
వెలుఁగు నట్లు మాసవితతిలో మాఘంబు
పావనం బనంగఁ బరఁగుచుండు.

162


చ.

మకరదినేశులం గలుగు మాఘమునందులఱేపు భక్తితో
నకుటిలవృత్తి గోష్పదమునందుల నీరనునైన మజ్జనం
బొకపరి చేసి పాపియును నుత్తమ నాకసుఖంబుఁ బొందుటల్
ప్రకటితమైన యోగమిది ప్రాజ్ఞులు సెప్పుదు రాగమోక్తులన్.

163


వ.

అందును వ్రతం బనుష్ఠించుట యుత్తమం బది యెట్టు లనిన.

164


సీ.

మాఘాదినుండి నేమముతోడ సూర్యోద
       యమున నదీస్నాన మమరఁ జేసి
ఘృత మాష తిలల నాహుతు లిడి వేల్చుచు
       భూశయ్యుఁడై యేకభుక్తమునను
ఘనసారమృగమదాగరుకుంకుమాదులఁ
       బొరిఁ ద్రికాలము విష్ణుపూజ చేసి
కార్పాసపాదుక [81]కంబళేంధనపట
       తైలఘృతాదులు దాన మిచ్చి


తే.

మును పరాన్నప్రతిగ్రహములు దొలంగి
తైలసేవయు మాని వ్రతంబు సల్పి
[82]మాససంపూర్తిఁ గడ నుత్తమద్విజులకు
నిష్టభోజనదక్షిణ లిడఁగవలయు.

165


వ.

ఇవ్విధంబున వ్రతోద్యాపనంబు చేసిన పుణ్యుం డక్షయలోక
సౌఖ్యంబు లనుభవించుచు మఱియును.

166

ఆ.

మకర[83]మాసతిథుల మాధవుఁ దలఁచుచు
నింట వేఁడినీళ్ల నెవ్వఁ డేనిఁ
దడియునట్టి సుకృతి దగ [84]ముక్తిసంపద
[85]నొనరునయ్య పార్థివేంద్ర! వినుము.

167


వ.

మఱియు వాపీకూపంబుల స్నానంబు చేసిన ద్వాదశగుణ ఫలం
బును, నదులయందుఁ దచ్చతుర్గుణంబును, దేవఖాతంబున దశ
గుణంబును, సంగమంబులఁ దచ్చతుర్గుణంబును, గంగాస్నానం
బునఁ దత్సహస్రగుణితఫలంబును సంభవించు మఱియును.

168


క.

విను మాఘంబున గంగకుఁ
జని యవగాహంబు సేయు సజ్జనముఖ్యుం
డనిమిష[86]లోకసుఖంబుల
ననుపమగతి దివ్యయుగసహస్రము లుండున్.

169


క.

[87]ఇతరనదీస్నానమునకు
శతగుణితఫలంబు వేగ సమకూఱు నృపా!
క్షితి గంగాయమునాసం
గతి మాఘస్నాతుఁడైన ఘనపుణ్యునకున్.

170


ఆ.

పాపభారమెల్ల భస్మీకరింపంగ
నెలమిఁ బ్రజలకెల్ల హితవుగోరి
[88]ధర ప్రయాగ యనఁగఁ బరమేష్ఠి గావించె
నదియె ముక్తిమార్గ మనఁగఁ బరఁగు.

171

వ.

అందు మాఘస్నానంబు చేసిన మానవుండు ప్రకృతిమాయలం
[89]జెందక పునరావృత్తి లేని విష్ణులోకంబునం దచ్యుతస్వరూపం
బున విహరించుచుండు. తత్ఫలంబు చిత్రగుప్తుండు నింతంత
యని చెప్పనేరం డచ్చట మూఁడుదినంబులు స్నానంబు సంభ
వించెనేనిం ద్రిశతవత్సరంబులు నిరాహారులై తపంబు సేయు
యోగీశ్వరులకుఁ గల ఫలంబు [90]సిద్ధించు, మఱియును.

172


తే.

కనకభారసహస్రంబు గ్రహణవేళ
నఖిలవేదాఢ్యులకు నిచ్చునట్టి ఫలము
గలుఁగు నెంతయుఁ దత్ప్రయాగంబునందు
నొక్కపరి మాఘమాడిన యుత్తములకు[91]

173


ఆ.

మాఘమునఁ బ్రయాగమజ్జనం బదిమూఁడు
దినము లబ్బెనేని మనుజుఁ డఘముఁ
బాసి దివ్యతనువుఁ బ్రాపించుఁ గుప్పసం
బూడ్చి వెలుఁగుచున్న యురగ మట్లు.

174


వ.

మఱియు భాగీరథి యిక్కడక్కడనక యంతయుఁ గురుక్షేత్ర
సమంబ; యందు వింధ్యగిరిసంగమంబు దశగుణఫలంబు నిచ్చు;
దానికంటెఁ గాశీక్షేత్రంబున నుత్తరవాహిని శతగుణం; బచ్చటి
కంటె గంగాయమునాసంగమంబు సహస్రగుణఫలంబు లొసఁగుఁ;
దజ్జలస్పర్శనమాత్రంబున బ్రహ్మహత్యాదిపాతకంబులు హరించు;
మఱి యమృతమయం బనం బ్రసిద్ధిం బొందు; నింక వేణీనదీ
మహత్త్వంబు వినుము.

175

ఉ.

వేణి విలోలనీలజలవేణి విశాలపవిత్రసైకత
శ్రోణి మరాళచక్రకులసుస్వర[92]వాణి సరోరుహోల్లస
త్పాణి సభక్తి మజ్జనవిధానవిశారద నాకలోకని
శ్రేణి మహాఘశాత్రవవిశిక్షణశాతకృపాణి యెల్లెడన్.

176


వ.

ఇట్లు ప్రఖ్యాతయైన వేణీనదియందు మాఘమాసస్నానంబు సేయ
బ్రహ్మాదిదేవతలును, ఇంద్రాదిదిక్పాలకులును, సూర్యాదిగ్రహం
బులును, యక్షగంధర్వాదిదేవయోనులును, కమలాలయాదిశక్తు
లును, రంభాద్యప్సరసలును, బితృదేవతలును జనుదెంతు [93]రందు
మూఁడుదినంబు లవగాహంబు చేసినవారి కశ్వమేధసహస్ర
ఫలంబు సిద్ధించునని మఱియు దత్తాత్రేయుం డిట్లనియె.

177

కాంచనమాలిని చరిత్రము :

తే.

అవనిఁ గాంచనమాలిని యనఁగ దివ్య
రమణి యొక్కెడ నొకబ్రహ్మరాక్షసునకుఁ
జెంది తాఁ జేయు మాఘంబునందు మూఁడు
తిథుల ఫలమిచ్చి యాతని దివ్యుఁ జేసె.

178


వ.

అనినఁ [94]గృతవీర్యుం డత్రినందనున కిట్లనియె.

179


తే.

ఎవ్వఁ డాబ్రహ్మరాక్షసుం డెట్టి భంగి
ననఘ! కాంచనమాలిని యనెడి కాంత
యెట్టి గతి నిచ్చెఁ దత్ఫల మెట్లు గూడె
నింతయును విస్తరించి నా కెఱుఁగఁ [95]జెపుమ!

180


వ.

అనిన దత్తాత్రేయుం డిట్లనియె.

181

సీ.

కాకకు వచ్చు బంగారుపూఁదెలకాంతి
        మీఱిన యొరవచ్చు మేనుదీఁగె
కడలేని సంపూర్ణకళలచేఁ బొలుపారు
        నెలతోడఁ దులదూఁగు నెమ్మొగంబు
చక్రవాకములతో సరి కయ్య మాడుచుఁ
        గునిసియాడెడు కుచకుంభయుగము
సానదేఱిన పుష్పశరుని తూపులపెంపు
        [96]గరుసు నాటిన వాలుఁగన్నుఁగవయుఁ


తే. గీ.

గలిగి శృంగారరసమునఁ గరువుగట్టి
పంచబాణుండు సేసిన ప్రతిమ యనఁగ
దనరు కాంచనమాలిని యనఁగ నొక్క
యమరసుందరి గలదు ధరాధినాథ!

182


క.

కై లాసశిఖరిమీఁదను
ఫాలాక్షునిదేవిఁ గొలుచు పడఁతులలో వా
చాలత్వముతో [97]మెలఁగెడు
నా లేమ విలాసలీల లలుఁగులు వెడలన్.

183


వ.

ప్రయాగ మాఘస్నానార్థినియై యొక్కనాఁడు.

184


చ.

వలిపెపుఁ గావిచేల చెలువంబుగఁ దాలిచి పూచినట్టి చెం
గలువలు గొప్పునం [98]జెరివి కమ్మనిపూతమెఱుంగుమీఁద మం
చొలసిన భంగిఁ బూసి మధురోక్తులతో మణినూపురధ్వనుల్
చెలఁగఁగఁ జేతివీణె గదలించుచు నల్లన నాలపించుచున్.

185


వ.

చనుదెంచి ముందట.

186

క.

ఆ గజగామిని కనియెను
భోగస్తవనీయతీర్థ [99]పూగాఢ్యలస
ద్భాగీరథీప్రవాహస
మాగమజలవేగముం బ్రయాగము నెలమిన్.

187


వ.

కని నమస్కారంబు సేసి పూర్వస్థానంబునం దజ్జలావగాహంబు
చేసి క్రమ్మఱి గగనమార్గంబునం జనుదెంచు నప్పుడు

188

కాంచనమాలి బ్రహ్మరక్షస్సును చూచుట :

క.

కమలాప్తకిరణదుర్దమ
హిమజలధారావలీసమిద్ధవిశాలో
త్తమశిఖరతుహినపర్వత
సమధికతరుపుంజకుంజసదనముమీఁదన్.

189


వ.

సమాసీనుండై.

190


చ.

[100]కొఱుగులువడ్డ వెండ్రుకలు గ్రూరపుఁజూపులుఁ గోరదౌడలున్
గఱకగు పల్లమీసము వికారపుమేనును నంటుఁ[101]బ్రక్కలున్
బొఱడగు వీఁపును న్వలుదబొడ్డును గల్గిన బ్రహ్మరాక్షసుం
డఱిముఱి మీదుసూచి ప్రియమారఁగ నాసతిఁ గాంచి యిట్లనెన్.

191


చ.

తడిసినచీర పెందొడలఁ దార్కొన లోజిగి చౌకళింపఁగా
బడువగు కౌనుదీఁగె కుచభారమున న్వెడవ్రాల వెన్నడిం
దొడవగు వేణియం దురలితోరపుఁదీర్థపుబిందు [102]లుండఁగా
నడుగులకాంతి కెందలిరుటాకులయందము డిందఁ జేయఁగన్.

192

క.

ఎక్కడనుం డిటు వచ్చితి
వెక్కడ నీయునికి యెచటి కేగెదు పూర్వం
బెక్కడ నీపే రెయ్యది
నిక్కం బెఱిఁగిఁపు మాకు నీరజనయనా!

193


క.

మృదులలితకల్పవల్లీ
సదమల నవకాంతిఁ దెగడు సౌందర్యకళా
స్పదమగు నీరూ పెక్కడ
యిదిచిత్రం బొంటి రాక యెక్కడ తరుణీ!

194


క.

నినుఁ జూడ మేనుగన్నులు
దనుపై మది శాంతి పుట్టి తాపం బాఱెన్
వనరుహదళలోచన! నీ
తను వమృతమయంబుఁ గాఁగఁ దలఁచెద నెమ్మిన్.

195


ఉ.

నీ తడిచీర బిందువులు నెమ్మిశిరంబునఁ [103]జల్లినంతటన్
నాతలఁ పొండుభంగి దయ నాటుచునున్నది యెట్టిజంతువున్
భీతి యొకింత లేక వెసఁ బీడ మణంచి భుజించు నాకుఁ గ్రౌ
ర్యాతిశయంబుమాని ప్రియమయ్యెడు నీతనురేఖఁ జూడఁగన్.

196


ఆ.

తల్లిఁ జూచినట్లు [104]తగ సహోదరిఁ జూచి
నట్లు నిన్నుఁ జూడ నధికమైన
ప్రేమ మగ్గలించె నీ మంజుభాషలు
వినఁగ వేడుకయ్యె వనజనేత్ర!

197


వ.

అనిన విని కాంచనమాలిని బ్రహ్మరాక్షసున కిట్లనియె.

198


సీ.

తగ సుమేరుండనఁ దనరు గంధర్వుని
       పుత్రిక రజతాద్రి భూతనాథు
నర్ధాంగమున నున్న యంబికఁ గొల్చిన
       తరుణులలో నెల్లఁ గరముఁ బ్రీతి

నద్దేవి మన్నించి యనవరతంబును
       సఖిఁగాఁగ ననుఁజూడ సంతసమును
నుండుదు నే నిప్పుడొగి ప్రయాగస్నాన
       మొనరించి పోయెద వినుము నామ


తే.

మవనిఁ గాంచనమాలిని యండ్రు నన్ను
నెల్లదిక్కుల విహరింతు నిచ్చఁ దగిలి
యనినఁ బ్రేమంబుఁ గృపయును నగ్గలింప
రమణిఁ గనుఁగొని యిట్లనె రాక్షసుండు.

199


తే.

ఇట్టి [105]సౌందర్యసౌమ్యత లిట్టి నేర్పు
నిట్టి నిర్మలచిత్తంబు నిట్టి పెంపు
నెట్లు నీ కబ్బె నే తప మెట్లు చేసి
తంతయును నాకు నెఱిఁగింపు మంబుజాక్షి!

200


వ.

అనినఁ గాంచనమాలిని యిట్లనియె.

201

కాంచనమాలిని బ్రహ్మరక్షస్సునకుఁ దనవృత్తాంతముఁ జెప్పుట :

క.

నా జన్మం బతిదుష్కృత
భాజన మది చెప్పఁ దడవు పట్టెడి వికచాం
భోజముఖి గిరిజఁ గొలువఁగ
రాజతగిరి కేగవలయు రాక్షస! నాకున్.

202


వ.

అని పలికి యతనిం గనుంగొని న న్నిట్లడిగెదవుఁ గాన నా
వృత్తాంతంబంతయుఁ జెప్పెదఁ దదాకర్ణనంబున నీకు మనస్తాపోవ
శాంతి యగు [106]వినుమని యిట్లనియె.

203


క.

ధరణీకాంతకుఁ దొడవై
యురుతరధనధాన్యవితతి నొప్పెడి ధాత్రిం
బరఁగు కళింగాధీశ్వరు
పురవర మేపారు పుణ్యపురుషాశ్రయమై.

204

వ.

అప్పట్టణంబునందు.

205


ఆ.

వారసతులలోన వాచాల యనుపేరు
గలిగి ప్రౌఢకాంత వొలుచునట్టి
లలనపుత్త్రి నే విలాసిని యనుపేర
బొలుతు నఖిలభోగభాగ్యములను.

206


వ.

మజ్జననికి నొక్కపుత్త్రి నగుటం జేసి యత్యంతప్రేమాతిశయం
బున నన్నుఁ బెనుచుచు.

207


ఆ.

ఆటపాట గఱపి యంగంబు వోషించి
నృత్యకళలయందుఁ నిపుణఁ జేసి
పెనుచు దినములందుఁ బ్రేమతో శశిరేఖ
కరణిఁ బెంచెఁ దల్లి గౌరవమున.

208


వ.

అప్పుడు.

209


చ.

పలుకులు ముద్దులం జిలుక వాలినఁ గందెడు మేనుఁ జేరలం
తలు గల కన్నులుం జిఱుత తాళపుదోయి నెదుర్చుఁ జన్నులుం
దిలకముఁ జూచు నున్గురులుఁ దిన్ననిమోమును గల్గి యెల్లెడన్
వలపులప్రోవ నైతి విటవర్గము చూడ్కికి బాల్యసంపదన్.

210


వ.

అంత.

211


క.

హరువుగల విప్రతనయుల
దొరకొమరుల వైశ్యసుతులఁ దోడ్తెచ్చి ననున్
మరగించి యల్లఁ బడయఁగఁ
బురికొలిపెను జనని వలఁపు పొలియక యుండన్.

212


తే.

అంతకంతకుఁ దనుకాంతి యతిశయించి
నవకమెక్కిన పువుఁదీఁగె యనువుదోఁపఁ
బల్లవావలి మనములు పెల్లగిలఁగ
నెల్ల సౌభాగ్యములకు నే నెల్ల నైతి.

213

సీ.

దినదినం బొదవెడు వనజకుట్మలభాతి
        నెక్కొన్న చనుదోయి నిక్కుదోఁచె
నళుల ఱెక్కలమీఁద హరినీలరుచి మించు
       గతి కుంతలంబులఁ గప్పు మెఱసె
నునుసానఁ దీరిన మనసిజాస్త్రములు నా
       సోఁగకన్నుల వింతసొబగు నిగిడె
వెలఁది వెన్నెలనీటఁ దొలఁచిన ముకురంబు
       కరణి మోమునఁ గ్రొత్తకాంతి దనరె


తే.

నడుము [107]బళువయ్యె మాటల నవక మెక్కె
నడుగుదమ్ముల నునుజిగి యగ్గలించె
[108]విటజనావళి చూడ్కికి వెక్కసముగఁ
జెలఁగె నా మేను యౌవనశ్రీ వహింప.

214


వ.

ఇ ట్లత్యంతరమణీయంబగు యౌవనంబు నివ్వటిల్లు సమయంబున
వివిధవిలాసచాతుర్యసౌందర్యసౌభాగ్యంబులయందు వారాంగనా
సమూహంబులలో మత్సదృశలు లేకుండునట్లుగా ననేకకళావిద్య
లం బ్రవీణనై విటకుమారపటలంబుల మనంబు లాకర్షించి నానా
మణిఖచితదివ్యాభరణంబులును నానావర్ణదుకూలాదిదివ్యాంశుకం
బులును ననేకదాసదాసీజనంబులుం గలిగి యఖిలభోగంబు
లనుభవించుచు మఱియును.

215


ఉ.

అంగజుదీము పల్లవుల యంగిటిగాలముఁ గూర్చువారి ముం
గొంగు పసిండి సౌఖ్యముల క్రోవి[109]ప్రియోక్తుల జన్మభూమి యా
లింగన చుంబనాది బహులీలలఁ గేలి యొనర్చునంచుఁ బ్రౌ
ఢాంగనలెల్ల నన్నుఁ గొనియాడఁ జరించితి నేర్పు లేర్పడన్.

216

క.

వెండియు బసిఁడియుఁ దడఁబడు
చుండఁగ నా యిల్లు లచ్చి [110]కునుకువ యయ్యెన్
[111]వెండిరువది యేనేఁడును
నిండెడు ప్రాయంబు నాకు నెలకొనునంతన్.

217


వ.

ఇట్టి దివసంబులం దొక్కనాఁడు ప్రక్కకు విటపుంగవు రాక వార్చి
ప్రొద్దు [112]వోయి నంతకు నే నొక్కతిన శయ్యాతలంబున నుండి
యతండు రామిం జిత్తం బుత్తలపడ నత్యంతవిషాదంబు నొంది
యిట్లని వితర్కించితి.

218


క.

ఏ ననఁగ నెవ్వ రాతఁడు
దా ననఁగా నెవ్వఁ డింత తాపము నొందం
గానేల వచ్చె నీయెడ
నే నేటికి నిద్రలేక యెరిసెద నకటా !

219


ఆ.

ఏల మరులుకొంటి నే నింతకాలంబు
నేమి ద్రవ్వుకొంటి నింతచేసి
పాతకములకెల్లఁ బట్టుఁగొమ్మగునట్టి
కష్టజన్మ మేల కలిగె నాకు.

220


ఉ.

అక్కట యింతకాలమును నాఱడి పాపము గట్టుకొంటి నా
కెక్కడి [113]తల్లి యీ సుహృదు లెక్కడివారలొ యీ విటాధముం
డెక్కడి కేగె నేమి ధన మేటికి నీ యవినీతవృత్తముం
దక్కక యాచరించితి వృథా యముబారికి నగ్గమైతినే.

221

ఆ.

మాంసవిక్రయంబు మనుగడగా నున్న
కటికవాఁడు పాపకర్ముఁ డవని
నంతకంటెఁ బాప మాత్మసౌఖ్యం బొరు
[114]కమ్ముకొని చరించు నంగనలకు.

222


వ.

అని [115]విచారించుచున్నయెడ నవ్విటుండు చనుదెంచి పిలిచి
నం బలుకక [116]త్రోచిపుచ్చినం బోయె నంత నా కత్యంతవైరా
గ్యంబు మనంబునం బుట్టి సంసారం బంతయు [117]నిస్సారంబుగా
వగచుచున్నయెడఁ బ్రభాతం బగుటయు.

223


తే.

ఆ పురంబున విద్వాంసు నఖిలశాస్త్ర
వేది సౌమ్యాత్ము నాత్మార్థవిదుఁ బ్రసన్ను
రూపవంతుని రాజపురోహితాఢ్యుఁ
గాన నేగితిఁ జిత్తంబు గళవళించి

224


చ.

అనుపమగంధపుష్పమృదులాంబరసంఘము వేడ్క నిచ్చి స
య్యన ధరఁ జాగి మ్రొక్కి వినయంబునఁ బ్రాంజలినైన నన్ను న
య్యనఘుఁడు గారవించుచు దయారసదృష్టినిజూచి నీవు వ
చ్చిన కత మేమి మాకడకుఁ జెప్పుము ప్రీతిఁ బయోరుహాననా !

225


వ.

అనిన విని మోడ్పుఁగేలు ఫాలంబునం గదియించి యతని
వదనంబుఁ గనుంగొని యిట్లంటి.

226


క.

దురితముల కెల్ల మూలము
లరుదుగ ధరఁ బడసి కుడుచు నంగన లందున్
సరివోల్ప రాని పాపము
తిరముగ నేఁ బుట్టి పెరిగి తిమ్మరుటెల్లన్.

227

వ.

అది యెయ్యది [118]యంటేని పిన్ననాటనుండియు దానధర్మ
తీర్థపరోపకారంబు లెఱుఁగకయును నిరంతరంబుం బరధనాపహర
ణంబును బరదోషాన్వేషణంబునుం జేయుచు నొరులకుఁ గీడు
సేయుటయు వినోదంబును నడఁకించుటయు నేర్పున ధనంబుఁ
గొనుటయుం బురుషార్థంబులుగా నిన్నిదినంబు లనృతవర్తనం
బునం దిరుగుచుండి యిప్పుడు.

228


క.

తలఁచుకొని నేఁడు దూలము
తలఁ దాకిన [119]నులికినట్లు దావము మదిలో
మొలవఁగ నీ సుఖ మంతయుఁ
గలలో నై నట్లు నాకుఁ గానంబడియెన్.

229


వ.

కావున నీప్రపంచంబంతయు మిథ్యగా విచారించి భవత్సన్నిధికిం
జనుదెంచితి; నిద్దురితదుఃఖార్ణవమగ్నయగు న న్నుద్ధరించి పుణ్య
లోకంబులు గలుగు నుపాయంబు చింతించి యానతిమ్మని
మ్రొక్కిన న వ్విప్రవరుండు నన్నుం గనుంగొని యాదరంబున
నిట్లనియె.

230


క.

తొడుగను బూయను ముడువను
గుడువను నెఱిఁ గట్టఁ గలిగి కుత్సితమతివై
[120]వెడబుద్ధులు వారింపుము
పడఁతి వినంబొత్తుగాని పలుకులు [121]గలవే.

231


క.

సుదతులు దగ మన్నింపఁగం
బదివేవురు నిన్ను నాసపడు సంపదతో
మది మది నుండియు నిటు నీ
హృదయము వైరాగ్యవృత్తి నేటికిఁ దగిలెన్.

232

వ.

ఇవ్విచారంబు లుడిగి నీ మందిరంబునకుం జని సుఖంబుండు
మనిన విని య వ్విప్రున కిట్లంటి.

233


ఆ.

మాంసరక్తపూయమస్తిష్కకీకస
స్నాయుబద్ధమైన కాయమందు
నైన సౌఖ్యమెంత యాయువు నా నంత
కష్టతరము చూడ శిష్టచరిత!

234


వ.

కలిగి భోగింపవలదా యని యంటేని.

235


అ.

పువ్వుపూఁత యాకుపోఁక చీరలు సొమ్ము
లొనరఁ బూనుటెల్ల నొకనికొఱకుఁ
గాని యాత్మసుఖము నూని భోగింప లే
దరయఁ బడసి కుడుచు నంగనలకు.

236


వ.

అదియునుం గాక నాకు భోగేచ్ఛ విడుచునట్టి సకలసౌఖ్యార్ణవబడ
బానలంబగు ముదిమి తోతెంచుచున్న యది; యిత్తఱిం బరలోక
చింతయ పురుషార్థంబు గాని సుఖంబుల కాసపడుట కర్జంబుగా దది
యెట్లంటేని.[122]

237


ఉ.

చెక్కులు జాఱెఁ గన్నుఁగవ చెన్ను దొఱంగె మొగంబునందు స్రు
క్కెక్కె శిరంబునందు [123]నరచేరెడి పక్వము దప్పెఁ గ్రీడలన్
మక్కువ వీడుకొల్పి తగుమాటల తేటలఁ బల్లవావలిం
జొక్కులఁ బెట్టుచున్న ననుఁ జూచిన నెవ్వరు నవ్వకుందురే.

238


సీ.

వెనుకవారల నేర్పు దన కా టెఱుంగక
        [124]వలనుచేతలఁ జేయ వగచి వగచి
తగిలి పాయఁగలేని మగవారు తనదిక్కు
        పలుకకుండిన క్రిందుపడుట కోర్చి

యంబరాభరణమాల్యానులేపనములు
        [125]విడిచిపెట్టిన యట్ల తొడుగనేర్చి
తనకు లేమిని నొడ్లధనము పెంపును జూచి
        విధిమీఁద మెటికలు విఱిచి విఱిచి


తే.

మోహలోభాదు లిరువంక [126]మొగిని పార
నిష్ఠురోక్తికి నిలువంగ నీడ యగుచుఁ
గష్టతరమగు ముదిమిచేఁ [127]గ్రాఁగు మనుచు
నన్ను బోధింపఁ దగునయ్య యన్న నతఁడు.

239


క.

ఇది యట్టిద మానవులకు
ముదియుట సౌఖ్యంబులెల్ల ముద్రించుట నీ
హృదయంబున వైరాగ్యము
[128]గదురుట మోక్షంపుత్రోవఁ గాంచుట తన్వీ!

240


క.

ఆశ్చర్యం బయ్యెడి నీ
పశ్చాత్తాపంబుఁ జూచి భామిని యిఁక నీ
దుశ్చరితములకుఁ జొరకుము
నిశ్చయముగ మోక్షపదము నీ కెఱిఁగింతున్.

241


వ.

అని పెద్దయుం బ్రొద్దు [129]చింతించి యిట్లనియె.

242

క.

మానుగ నుపవాసవ్రత
దానంబులకంటెఁ బుణ్యతమమగు యమునా
పానీయంబున మాఘ
స్నానం బొనరింపు భక్తిసంపద వెలయన్.

243


వ.

అట్లేని నీకు [130]ననేక జన్మసంచయదురితహరణంబైన పుణ్య
లోకంబులు సిద్ధించు. నే పుణ్యంబులునుం దీర్థస్నానంబునం బోల
వని మహామునులు సెప్పుదు రట్లు గావునం బ్రాజాపత్యతీర్థంబున
కేగి యచ్చట నవగాహంబు సేయుమని యవ్విప్రుండా తీర్థం
బునఁ దొల్లి కృతస్నానుండై యింద్రుండు గౌతముని శాపంబున
నైన దేహకల్మషంబు వాపుకొనియె ననిన విని యే నిట్లంటి.

244


ఆ.

గౌతముండు దొల్లి [131]కాకచేఁ గోపించి
యేల శాప మిచ్చె యింద్రుఁ డట్టి
దురితపంక మెట్లు దొలఁగించుకొనియె నా
కవ్విధంబుఁ దెలియ నానతిమ్ము.

245


వ.

అని యిట్లు కార్తవీర్యునకు దత్తాత్రేయుండు చెప్పెనని చెప్పిన
విని యటమీఁది కథ యెట్ల య్యెనని యడిగిన.

246


వనమయూరము.

భూరిగుణసార! బుధపోషణ! మనోజా
కార! కవితాసరసగానసువినోదా!
తారకపటీరహిమధామనిభకీర్తి
స్ఫార! సురభూరుహ[132]విశాలనిజహస్తా!

247


క.

శ్రీరామాధిపచరణాం
భోరుహమదభృంగ! శిష్టపోషణ! సుజనా
ధార! మృదుమధురభాషణ!
నారీమదనావతార! నగపతిధీరా!

248

మాలిని.

వివిధ[133]విభవరమ్యా! విశ్రుతాలాపసౌమ్యా!
ధవళవిపులకీర్తీ! దానధర్మైకవర్తీ!
యవిరళశుభగాత్రా! యౌబళామాత్యపుత్త్రా!
[134]కవినుతగుణసాంద్రా! కందనామాత్యచంద్రా!

249


గద్య.

ఇది శ్రీ నరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం
బైన పద్మపురాణోత్తరఖండంబునందు సుందోపసుందోపాఖ్యా
నంబును హేమకుండలచరిత్రంబును నతని తనయులగు శ్రీకుం
డల వికుండలులు యమసదనంబునకుం జనుటయు నందు వికుం
డలుండు యమదూతవలన నిఖిలధర్మాధర్మంబులు విని తనపూర్వ
జన్మసుకృతఫలం బిచ్చి నరకంబందున్న శ్రీకుండలు నుద్ధరించు
టయు కాంచనమాలినిచరిత్రంబును నన్నది ద్వితీయాశ్వాసము.


  1. యోగి (ము)
  2. జనాశ్రయ (ము)
  3. కనుఁగొని (ము)
  4. పసిమియు గమకంబు (హై-మ), పసిమియు గపురంబు (తి)
  5. నమర్చి (ము)
  6. వీడ్కొని (ము)
  7. ముందరిగా వచ్చు చందంబున నొక్కతియ నర్మదా....(హై)
  8. స్తంభంబునందు (ము)
  9. న్వినముం జూడము నెన్నడు (తి-హై)
  10. మొగిన (తి)
  11. నిత్య (మ)
  12. నొక్క (ము)
  13. పరిచితుండు (ము)
  14. ఉరవు గలిగినవాడ (తి)
  15. చేయ, నొప్పారునని చెవి చెప్ప జేరు (హై)
  16. నొసంగి సంసారభ్రాంతి బాసి విరక్తుండై (హై)
  17. వెలిజల్లి, వేణువీణాదికవిధవినోద, తతుల గాలంబు బుచ్చుచు దల్లి మాట (తి-హై)
  18. స్వకుల (ము)
  19. వెరిగి (ము)
  20. అప్పువారి చేతియాకకు (తి)
  21. చిత్రగుప్తునిమొగంబు చూచి యముం డిట్లనియె (తి-హై)
  22. వీ రిరువురిలో (హై)
  23. ఏకవాక్యత జేసి (మ-తి)
  24. బడి వాయకున్న చోట (మ-తి)
  25. చోట (ము)
  26. చేరియున్న (ము)
  27. రాజన (హై)
  28. నెనయఁగఁ జేయంగ నెఱుఁగ నే నించుకయున్ (ము)
  29. అ ప్పుణ్య (ము)
  30. దేవసౌఖ్యంబు (ము)
  31. మురరా (తి-హై)
  32. వలయు (ము)
  33. పుట్టి పాపంబు లార్జింపుదు రటు గావున (హై)
  34. రహితుండని మునులు చెప్పుదురు (హై)
  35. ఇష్టార్థపూర్తరతు లు, త్కృష్టదయాత్ములును సుకృతదో (.)లు నతివి, స్పష్టమగు హేయరూపము. కష్టపు యమపురము వోవ గన రెన్నటిన్ (హై)
  36. దోష (మ)
  37. లోకంబు (మ-తి)
  38. సపతుగా (తి)
  39. ఆ. వినుము రావివటము వేము నొక్కొక్కటి, యును కపిత్థబిల్వయుసిరికలును, మూడుచింత లేను మొగిమావులును నిల్పు, నతడు నరకవాస మంద డెపుడు (మ-హై)
  40. జంకించు (మ-హై)
  41. గరుడారూఢులై శంఖచక్రపీతాంబరభూషణులై (హై)
  42. స్పర్శంబును సమంబ (ము)
  43. హరిహరుల (ము)
  44. తత్పత్రత్రయంబుల (ము)
  45. మంజరిచేతం (మ-తి-హై)
  46. మరచియు (మ-తి)
  47. పురికి (మ-తి)
  48. విప్రనిలయాది గృహంబులు (ము)
  49. పానాదులు (తి-హై)
  50. యర్థి (ము)
  51. పరగ (తి-హై)
  52. యాశ్రయించుఁ గావున (ము)
  53. ఈ పద్యము తరువాతగల యధికపాఠము.

    క. అన్నంబిడు నృపసత్తము
    అన్నంబిడు నృపవరేణ్యు అవనీస్థలియం
    దున్నపుడె ధర్మమతివై
    క్రన్నన సురలోకకాంక్ష గలిగెన యేనిన్.

    వ. అని యప్పగించె నట్లు గావున అన్నదాన సమంబగు దానంబు లేదు. (హై-తి)
  54. వేద మూఁత గాఁగ (మ)
  55. నేమి (ము)
  56. రెలమిగా (ము)
  57. కణక లోభంబుమై (హై-తి)
  58. ధారగొనిన యట్టి (ము)
  59. గ్రహణంబులం (ము)
  60. చిహ్నాన్వితు (ము), చిహ్నవ్రతు (హై)
  61. కిదియె (ము)
  62. హరిం, బరిపూజితుజేయు నతడు ప్రాపించునునా (హై-తి)
  63. పాపినై నను (ము)
  64. నియమనిత్యలీల (ము)
  65. మతంబు (ము)
  66. సంస్మృతిం (ము)
  67. తల్లి తెగవారు పదుగురు (హై)
  68. లలరులు (మ-హై)
  69. దేవదూత (ము)
  70. (హై-తి)
  71. శమదమాత్ము (ము)
  72. బ్రహ్మధ్యాన (ము)
  73. బొనరిన విప్రుఁడ వీవా (ము)
  74. నలిజాగి (హై-తి-మ)
  75. గదియించి (హై-తి-మ)
  76. నీవు (ము)
  77. శ్రేష్ఠులు వారలకంటె రామానుజ మతానుసారు లుత్తములు. వారలకంటె బ్రహ్మజ్ఞానానందమయులు ఘనులు. వారలకంటె స్వాతంత్ర్యనివృత్తులు పూజ్యులు. వారలకంటె పంచేంద్రియనిస్సారదర్శను లధికులు నగుటం జేసి (హై)
  78. యోగి భుజించిన (ము)
  79. తయ్యెనె యోహో శివశివ (హై)
  80. హరి హరి (తి)
  81. కంబళ ధనపట (హై-తి)
  82. మానసస్ఫూర్తిఁ గడు (ము)
  83. మాఘ (మ-తి-హై)
  84. నారు గుణముల (మ-తి-హై)
  85. ఫలము జెందు వినుము పార్థివేంద్ర (తి-హై) ఫలము జెందునయ్య పార్థివేంద్ర (మ)
  86. భోగ (ము)
  87. ఇతరదినస్నానంబుల (ము)
  88. వర ప్రయాగమునకు (ము)
  89. బాపి (ము)
  90. సంభవించు (ము)
  91. ఈ పద్యము తరువాతగల యధిక పాఠము.
    ఆ. మాఘమాస తిథుల మనుజుండు వేణిలో
    గోరి యొక్క మాటు గ్రుంకెనేని
    నఖిల నదులయందు నవగాహ మొనరించు
    నట్టి ఫలము బొందు నవనినాథ. (తి-హై)
  92. పాణి (ము)
  93. రిందు (ము)
  94. కృత్యవీర్యనందనుం (ము)
  95. బల్కు (ము)
  96. గరిమదాటిన (ము), గరువమాడెడు (మ-తి)
  97. వెలిఁగెడు (ము)
  98. జేరి (ము)
  99. పూగాద్య (ము)
  100. గొఱుగులు (ము)
  101. బిక్కలున్ (ము)
  102. లుంట్టగా (తి-ము)
  103. జల్లినంతలో (ము)
  104. తన (ము)
  105. సౌందర్యసమ్మత మిట్టి (ము), సౌజన్యసౌమ్యత లిట్టి (మ)
  106. చిత్తగించి వినుమని (తి-హై)
  107. బడుగయ్యె (తి-హై)
  108. సరసగంభీరమోహచాతురి వహించె (మ)
  109. కళాదుల (తి-హై)
  110. కుఱవును నయ్యెన్ (ము)
  111. రెండిరువది (మ-తి-హై)
  112. వోయె నంతకు నే నొక్కతెనె (ము)
  113. తల్లి పంపు నిక నెక్కడి భోగము లీ విటాధముం (మ)
  114. కమ్మి కుడుచునట్టి యంగనలకు (హై)
  115. విచారించి చింత పేటెత్తుచున్న యెడ (హై)
  116. యాత్మజ్ఞానంబున ధ్యానంబు చేయుచున్న జారుండు శరీరస్పర్శంబు చేసె నది తెలియనైతి నెట్టకేల కెరింగి దండ నిలిచియున్న విటుని త్రోచిపుచ్చినం (హై)
  117. నిస్సారంబకా యెరింగి వగచుచున్న (హై)
  118. యనిన నేను బుట్టిననాటనుండియు (ము)
  119. పగిది నిట్లు (హై), మడికి యట్లు, మదికి నట్లు (తి)
  120. పెడబుద్దుల నూహింపుచు (హై), చెడుబుద్ధులు బోధింపుచు (తి)
  121. తగునే (మ-తి-హై)
  122. నీరు బుగ్గలం జూచి నవమౌక్తికంబులని యాసపడు చందంబు నదియుం గాక (హై) అధికపాఠము.
  123. నర పేర్పడి (మ-హై)
  124. వయసు చేతలు (మ)
  125. విడిభోగ మొల్లక విడిచిపెట్టి (హై)
  126. మునిగిపార (తి-హై)
  127. కాటుపడిన (హై)
  128. కదియుట మోక్షంబు మిగుల (హై)
  129. విచారించి యీ మానినికి వై రాగ్యంబు నిశ్చయంబు. ఇది కపటహృదయ కాదు. సులభోపాయంబున పుణ్యలోకంబు
    వడయు గాక యని వితర్కించి విశ్వాసంబున వినుమని ఇట్లనియె. (హై) అధికపాఠము.
  130. నా జన్మ (ము)
  131. కౌశికు (ము)
  132. విభాసి (మ-తి-హై)
  133. విబుధ (ము), భవన (మ-హై)
  134. కవితసుగుణసాంద్రా (ము), కవిజనమత (హై)