పద్మపురాణము/తృతీయాశ్వాసము

పద్మపురాణము

ఉత్తరఖండము - తృతీయాశ్వాసము

క.

శ్రీకర వాణసకులర
త్నాకర! [1]సంపూర్ణకరసుధాకర! [2]ఘనశో
భాకర! సంతతదానద
యాకర! సత్కీర్తిబృంద! యబ్బయకందా!

1


వ.

పరమయోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె.
నట్లు కాంచనమాలిని యడుగుటయు నవ్విప్రుం డిట్లని చెప్పె.

2

కాంచనమాలిని బ్రహ్మరాక్షసునకుం జెప్పిన మాఘస్నానప్రభావము :

క.

కృతయుగమున గౌతముఁ డను
నతిపావనమూర్తి మునివరాగ్రణి వహ్ని
ప్రతిమానతేజుఁ డిల న
ప్రతిహతరోషుండు వేదపారగుఁ డొప్పున్.

3


తే.

అమ్మహాముని పత్ని యహల్య యధిక
లక్షణాన్వితహాసవిలాసవిభవ
సౌమ్యలావణ్యసౌందర్యచతురగతుల
నమ్మృగాక్షికి నీడులే దవనియందు.

4


వ.

ఇ ట్లతిశయరూపయౌవనంబులు గలిగి తనకు ననురక్తయగు
భార్యయుం దాను నొక్కపుణ్యారణ్యంబునం దాశ్రమంబు
నిర్మించుకొనియుండె నంత.

5

ఆ.

వినుము బ్రహ్మలోకమున నుండి నారదుం
డంతరిక్షవీథి నరిగి యరిగి
గౌతమాశ్రమమునఁ గర మొప్పుచున్న యా
సతి నహల్యఁ గాంచె సమ్మదమున.

6


వ.

అయ్యింతిలావణ్యంబున కచ్చెరు వంది యింద్రుసభకుం జని
యతనిచేతం బూజితుండై యమ్మునీంద్రుండు సురేంద్రున కిట్ల
నియె.

7


క.

గౌతముని భార్య త్రిజగ
త్ఖ్యాత యహల్యాఖ్య వికచకమలానన యా
నాతి కెనవచ్చు సుదతుల
నేతరమునఁ జూచి వినియు నెఱుఁగ సురేంద్రా !

8


ఉ.

చన్నుల[3]యొప్పిదంబుఁ గటిచక్రపుపెంపును మోవికెంపుఁ గ్రేఁ
గన్నులసోయగంబు నలకంబులకప్పును మేనికాంతియుం
దిన్ననికౌను నెమ్మొగముతీరును జూడ్కికి విందుసేయఁగా
నన్నలినాక్షి యొప్పు విషమాయుధు మోహనశక్తియో యనన్.

9


వ.

అని చెప్పి దేవముని నిజేచ్భం జనుటయు ననిమిషపతియును
మనంబునం [4]గోరికలు కొనలునిగుడ మనసిజాయత్తచిత్తుండై య
త్తన్విం జూచువేడ్క నాప్రొద్ద [5](కదలి) గౌతమ మహామునీంద్రు
నాశ్రమంబునకుం జని వియత్పథంబున నిలిచి కలయం గనుం
గొను నప్పు డప్పర్ణశాలాంగణంబున.

10

ఇంద్రుఁ డహల్యం బొందఁ గోరుట :

తే.

పుష్పలత నెండినాకులు పొదివినట్లు
బెరసి కర్కశవల్కలాంబరము గట్టి
క్రొత్తగా గర్లు గట్టినఁ గొమరు మిగులు
నంగభవబాణతుల్య నహల్యఁ గనియె.

11

వ.

కని తత్ప్రతీపదర్శని సౌందర్యంబునకుఁ గొందలంబందు డెందం
బునం గందర్పశరగోచరుండై యందంద కనుంగొని సంక్రంద
నుండు తనలో నిట్లనియె.

12


సీ.

తివిరి క్రొమ్మెఱుఁగు దా నవయవంబులు పూని
        తిలకించి ధాత్రిపై మెలఁగెఁ గాక!
కవవీడు వడని జక్కవలు మే యొఱపుతోఁ
        బొలుపు బింకముఁ బూని నిలిచెఁ గాక!
కడివోని వాడని కాము బాణములకు
       నిరుదిక్కులను వాఁడి బెరసెఁ గాక!
[6]కఱఁ దొరంగిన సుధాకరమండలముమీఁద
       మురిపెంపుఁ జిఱునవ్వు మొలచెఁ గాక!


ఆ.

యిట్టి మేనిసొబగు నిట్టి చన్నులపెంపు
నిట్టి కనుఁగవయు నిట్టి మోముఁ
గామినులకు నేల గలుగు మన్మథమాయ
మగలఁ గలఁప నిట్లు నెగడెఁ గాక.

13


ఆ.

ఇది లేనినాఁడు రుద్రుఁడు
మదనునిక న్నింగలమున మాఁడిచెఁ గా కీ
సుదతిఁ గనుఁగొన్న శివు మది
చిదురుపలై యెమ్ములెల్లఁ జిల్లులువోవే?

14


వ.

అని యివ్విధంబున నవ్వధూమణి వలని వలపంత యంతకంత
కగ్గలించినం బెగ్గిలి మఱియు నిట్లని వితర్కించు.

15


ఉ.

ఏటికి నారదుండు తరలేక్షణరూపము సెప్పెఁ జెప్పఁగా
నేటికి వింటి విన్కలిన యింకుచునుండక యింతిఁ జూడఁగా
నేటికి వచ్చితిం బిదప నేటికిఁ జూచితిఁ జూచినంతలో
నాటఁగఁ బుష్పబాణముల నన్నిటు లేల మనోజుఁ డేసెడిన్.

16

క.

కలకంఠి మగఁడు శివుతో
సొలయక యఱకాలఁ గన్ను చూపినవాఁ డీ
పొలఁతుక కెడయాడుట [7]దాఁ
బులితోఁ [8]జెరలాట మాడఁబోవుటగాదే.

17


ఉ.

ఇచ్చటనుండ నన్నుఁ గని యీ ముని యేమని శాప మిచ్చునో
వచ్చిన చేటు వచ్చెనని వామవిలోచనఁ బట్టుకొంటి నే
నిచ్చ యెఱుంగ కేమనునొ యీ పని గాదని యూరకుంటినేఁ
బచ్చనివింటిజోదు నను బాణపరంపర నొంపుఁ దెంపునన్.

18


ఉ.

చూడదు కన్నువిచ్చి మఱి చూచిన నవ్వదు నవ్వి మాఱుమా
టాడదు మాట చొప్పడిన నందెడు డెందముగాదు దీనిపై
వేడుక యేల పుట్టెఁ గడువేఁదుఱు గొల్పె మరుండు నన్ను నీ
చేడియ నెన్నిచందములఁ జెందక యాఱఁడిఁ [9]బోవవచ్చునే!

19


క.

రాత్రి యిలు సొచ్చి పట్టఁగ
[10]గాత్రస్పర్శమున లోనుగాకుండునె స
త్పాత్రాపాత్రము లంబుజ
నేత్రలు దలఁపుదురె జారునిం బొడఁ గన్నన్.

20


ఆ.

అనుచు వెచ్చనూర్చు నయ్యింతి [11]లోఁ బట్టు
మతము లుగ్గడించు కుతిలకుడుచు
మరలిపోవఁ [12]జూచు విరహాగ్నిశిఖలచేఁ
దిరుగు మరులుగొనుచు దివిజవిభుఁడు.

21

క.

ఇవ్విధమున దివిజాధిపుఁ
డవ్వెలఁదుకఁ బొందఁ గాన కారటపడఁగా
నెవ్వగలఁ దొలఁగిపోయిన
యివ్వడువున నినుఁడు పశ్చిమాంబుధిఁ గ్రుంకెన్.

22


క.

అఱసంజవేళఁ జుక్కలు
దఱిదఱిఁ బొడచూపెఁ గలువతండము విరిసెన్
నెఱి నగ్నిహోత్ర గృహముల
కఱిముఱిఁ జని వేల్వఁ దొడఁగి రమ్మునిముఖ్యుల్.

23


వ.

అప్పుడు.

24


క.

కనువిచ్చుటయును మోడ్చుట
యును సరిగా నుయ్యి కొండయును నొక్కటియై
తనరి పెనుసూదిఁ బొడిచినఁ
జినుఁగక యతినిబిడ మగుచుఁ జీఁకటి పర్వెన్.

25


వ.

అంత ననుష్ఠానాధ్యయనంబులు చాలించి మునిజనంబు లయ్యై
యెడల విశ్రమించిరి గౌతముండు నహల్యాసహితుండై నిజ
గృహంబున నుండె నప్పుడు.

26


క.

ఇది దోషము గర్హణ మని
మదిఁ దలఁపక యెఱుక లేక మన్మథవశుఁడై
త్రిదశేంద్రుఁడు దను పంచన
నొదిఁగిలి మునియింట దండ నొక్కఁడ యుండెన్.

27


సీ.

నందనాభ్యంతరమందారములనీడఁ
       జింతామణులవేదిఁ జెలువు మిగిలి
రంభాదిదేవతారమణులు సేవింప
       గంధర్వకిన్నరగాన ములియఁ
బౌలోమికుచగంధబంధురవక్షుఁడై
       పొసఁగ వాచస్పతి బుద్ధి వినుచు
సకలదిక్పాలకమకుటరత్నప్రభా
       లలితాంఘ్రితలుఁడైన బలరిపునకు

ఆ.

నడవి నాకు నలము నశనంబుగా సల్పి
నడుమ నార గట్టి నవయుచున్న
[13]పాఱు నాతియింటిపంచ ప్రాప్తము చేసెఁ
గాముచేత బ్రతుకఁ గలరె యొరులు.

28


వ.

అని యఖిలభూతనివహంబు [14]లాక్రోశించుచు నుండ నప్పురం
దరుండు.

29


ఉ.

ఎప్పుడు గాని వేగదొకొ యీ నిసి నేఁడును నిమ్మునీశ్వరుం
డెప్పుడు పోవునో వెడలి యీ నది దిక్కున కీ మృగాక్షి నే
నెప్పుడు కౌఁగిలించి సుఖియింతునొకో యని ప్రొద్దుచూచుచున్
నిప్పులఁ బడ్డ చందమున నిర్జరనాయకుఁ డుండె నంతటన్.

30


క.

తొలికోడి కూయ శిష్యులఁ
దెలుపుచు గౌతముఁడు నదికి దిగ్గన నరిగెన్
బలభేదియుఁ గొనచీఁకటిఁ
బొలఁతుక యిలు సొచ్చి మేను పుణుకఁగ నదియున్.

31


క.

ఇది యెవ్వరన్న సతి నో
రదుముచు మైఁ గౌఁగిలించి యల్లన చెవిలో
రొదసేయకు [15]మని యింద్రుఁడ
వదలక నినుఁ జూచి కూడ వచ్చితిఁ దరుణీ!

32


క.

పంచశరుబాణసంహతిఁ
బంచత్వము నొందలేక భామిని యిదె నీ
పంచకు వచ్చితి దీనిఁ బ్ర
పంచము గానీక మేలు వడయుట యరుదే.

33

చ.

అని దయపుట్ట నాడిన నహల్యయు నూరకయుండె నింద్రుఁడుం
దనమది కోర్కి దీర్చుకొని తత్తఱ మందుచు మింటికేగె న
వ్వనితయు లేచివచ్చి తనువల్లిక దివ్యసుగంధవాసనల్
తనరఁగ నెమ్మనంబున ముదంబు భయంబును దోఁప నున్నెడన్.

34


క.

తెలతెల వేగుడుఁ బులుఁగులు
కలకల పలుకంగ జగము కన్నులు దానై
తళతళ వెలుఁగుచుఁ దమ్ముల
చెలి యల్లన నుదయశిఖరి శిఖరం బెక్కెన్.

35


వ.

ఇట్లు సూర్యోదయం బగుటయు సముచితానుష్ఠానంబులు దీర్చి
శిష్యగణసమేతుండై గౌతముండు చనుదెంచిన భయసంభ్రమా
కులితచిత్తయై యహల్య యెదురు వచ్చి.

36


చ.

చెదరిన కుంతలంబులును జిన్నిమొగంబును వింతకాంతియున్
బెదరినవాలుఁజూపులును బింకము చూపుచు నొప్పు మోవియుం
గుదివడుచున్న నెన్నడుముఁ గూరిన దప్పియు మేన నెల్లెడం
గదిరిన దివ్యగంధమును గాంచి మునీంద్రుఁడు సంశయంబుతోన్.

37

గౌతముం డహల్యకు నింద్రునకును శాపంబు లిచ్చుట :

క.

పోలించి చూచి సురవిభుఁ
డాలలనం గవయు టెఱిఁగి యమ్ముని క్రోధ
జ్వాలలు [16]నిగుడఁగఁ గన్నులఁ
గాలాంతకుపగిది నింతిఁ గనుఁగొని పలికెన్.

38


వ.

కులశీలగుణంబులు విచారింపక యింద్రుతో వ్యభిచరించి [17]చెట్ట
చేసితివి కావున నిశ్చేతనంబగు పాషాణంబవై యుండుమని య

న్నాతికి శాపం బిచ్చి కమండలూదకంబులు కరతలంబునం బట్టి
పురందరు నుద్దేశించి.

39


ఉ.

మిన్నక వచ్చి వచ్చి పులిమీసల నుయ్యల లూఁగినట్లు దా
న న్నొకచీరికిం గొనక నా యిలు సొచ్చి భయంబులేక ద
ర్పోన్నతి నిట్లు సేయు [18]కలుషోగ్రమనస్కుని మేను రోఁతగాఁ
గ్రన్ననఁ బెక్కుయోనులుగఁ గావుతమంచు శపించె నుగ్రతన్.

40


వ.

ఇ ట్లతిదారుణంబైన శాపం బిచ్చుటయుఁ బాకశాసను శరీరంబు
[19](నాక్రమించి) యోనిస్వరూపంబులగు దుర్వ్రణసహస్రంబు
లుద్భవించి తత్క్షణంబ.

41


క.

చీమును నెత్తురు దొరఁగఁగఁ
బై ముసరెడు మక్షికాళి బహుగతిఁ దొలువం
గా మహిమఁ దొఱఁగె నింద్రుఁడు
సామాన్యమె యమ్మహాత్ముశాపము తరుణీ!

42


వ.

అ ట్లతిజుగుప్సితం బగు తనశరీరంబుఁ జూచుకొని లజ్జావనత
వదనుండై మహేంద్రుం డాత్మగతంబున.

43


తే. గీ.

తొల్లి చేసిన సుకృతంబు లెల్లఁ బొలియు
శ్రీయు నాయువు నశియించుఁ జేటువచ్చుఁ
గానఁ బరదార సుఖవాంఛఁ బూననొల్ల
రాత్మసుఖులైన పుణ్యాత్ము లనుదినంబు.

44


ఆ. వె.

ఇంత యెఱిఁగి యెఱిఁగి యే మీఁదు గానక
యింత తెచ్చుకొంటి నంత చేసి
యది యలంఘనీయ మమ్మహా[20]ముని శాప
మనుభవింప వలయు హరునకైన.

45

క.

అటుగాన నా శరీరం
బిటువలె నుండంగ [21]నచటి కేమని పోదుం
గటకట! యీ కర్మము మి
క్కుటమై యిటు[22]వలెను ముట్టుకొనునే నన్నున్.

46

ఇంద్రుండు శాపగ్రస్తుఁడై లజ్జచే పద్మనాళప్రవేశ మగుట :

వ.

అని యుత్తరాభిముఖుండై పోయి హిమాచలశిఖరంబున శత
యోజనవిస్తీర్ణంబగు నొక్కసరోవరంబుఁ బ్రవేశించి తన్మధ్యం
బునఁ గనకకమలనాళంబు భేదించి చొచ్చి దాని తంతువులలోన
నతిసూక్ష్మరూపంబున నణంగియుండె నంత నిక్కడ.

47


ఆ.

రాజులేని యట్టి రాష్ట్రంబు గావున
నమరలోక మిట్టునట్టువడియె
నపుడు లోకపాలు రాదిగాఁ గల దేవ
గణము నింద్రు వెదకి కానలేక.

48


వ.

పౌలోమిం బురస్కరించుకొని యందఱు బృహస్పతి పాలికిం
[23]జని యమ్మహాత్మునిం గని ప్రణమిల్లిన వారల దీవించి దగిన
సంభావనంబులు చేసి శచీదేవిని గారవించి యుచితాసనంబు లిడి
వచ్చిన కార్యం బెఱింగింపుం డనిన వారు దేవవిభుండు [24]లేమి
నైన సురలోకోపద్రవం బెఱింగించి పాకశాసనుండు చనుదెంచు
నుపాయం బానతిమ్మనిన వాచస్పతి యిట్లనియె.

49

క.

సురవిభుఁడు గౌతముని [25]సుం
దరి నన్యాయమునఁ గవిసి తన్మునిచేతం
బరిభవముఁ బొంది యిపు డొక
[26]సరసి నొదిగియున్నవాఁడు చౌర్యగతుండై.

50


ఆ.

నీతిపథము దప్పి నెఱి వేగపడి సేయు
నతఁడు దుఃఖఫలము లనుభవించుఁ
గ్రిందు మీఁ దెఱింగి కృతకార్యుఁ డగువాఁడు
చేయు కార్యమెల్ల సిద్ధిఁ బొందు.

51


సీ.

ఎవ్వఁ డే పని వెంట నే రీతి నేర్పరి
         వాని నియోగింపవలయు [27]నంద;
హితుఁడు విశ్వాసియు మతిమంతుఁడును నగు
         విప్రు నమాత్యుఁ గావింపవలయు;
[28]శక్తిభక్తులు గల్గు సద్భటావలిచేత
         నంగసంరక్ష సేయంగ వలయుఁ;
బ్రజఁ దల్లి పాలించు పగిది భూజనముల
         ననుదినంబును దాన యరయవలయు


తే.

నర్థ మార్జింప నోపెడు నట్టివారి
నాజిశూరుల నీతిజ్ఞులైన వారిఁ
బాపరహితుల పోలిక బంధుజనుల
నరసి ప్రోవంగ వలయుఁ దా నవనివిభుఁడు.

52


వ.

మఱియు సప్తాంగసంపన్నుండును సప్తవ్యసనదూరుండును
చతురుపాయజ్ఞుండును శక్తిత్రయసమేతుండును షడ్గుణపరాయ
ణుండును పరాకృతోపాయ ref>దూరీకృత (ము) </ref>దూరీకరణనిపుణుండును నయా

నయజానవిశారదుండునునై చతుర్దశరాజదోషంబులు పరిహరించి
స్వాయత్తుండైన రాజు భూప్రజారంజనంబును వైరికులభంజనం
బునుం జేయుచు దానధర్మవివేకగుణంబులు దనకు సహాయం
బులుగా దండనీతికుశలుండును పరదారపరాఙ్ముఖుండును నై పక్షా
పక్షంబులు లేక సమచిత్తుండైన రాజు రాజ్యంబు పూజ్యంబగు న
త్తెఱంగు విడిచి.

53


క.

అతిశయరాజ్యమదంబున
మతిఁ గార్యాకార్యచింత మఱచి పరస్త్రీ
రతిఁ జేసి యింద్రుఁ డిహపర
గతులకు [29]నెడఁబాసెఁ దనదు గర్వము పేర్మిన్.

54


వ.

అనిన శచీదేవి యతని కిట్లనియె.

55


క.

నీతియు హితమును ధర్మము
జాతుర్యముఁ గలుగునట్టి సచివుఁడు చెప్పం
బ్రీతి విన నొల్లకుండిన
భూతలనాయకుఁడు [30]తాను బొలియుం బిదపన్.

56


ఆ.

కాలకూటవిషము కడువాఁడిశరమును
గొనిన యతఁడు చచ్చు [31]నెఱను దాఁకి
దుష్టమంత్రి మంత్రదోషంబు దాఁకినఁ
బుడమి జనముఁ బతియుఁ బొలసిపోవు.

57

ఆ.

[32]నేతిగూన పూని నిచ్చెన యెక్కెడు
నరుని యట్లు [33]రాజ్యభరము పూని
పతికి దుర్యశంబుఁ బాపంబు రాకుండఁ
బదిలపఱచి మంత్రి మెదల వలయు.

58


వ.

అట్లు గావున నీ యట్టి పుణ్యాత్ముల శాసనంబునం దిరుగ నేరమిం
జేసి పాకశాసనున కిట్టి దురవస్థ సంభవించె; నెవ్విధంబుననైనను
నీ యాపదఁ దొలగించి దివిజరాజ్యం బుద్ధరింపవలయు ననినం
బురుహూత పురోహితుండు.

59


క.

ఇంత యననేల నను మీ
[34]కింతకుము న్నింద్రుశాప మీఁగెడి విధమేఁ
జింతించినాఁడ [35]మీ కా
వంతయుఁ జింతిలక రండు [36]హరిహయుకడకున్.

60


చ.

అని తగ నూఱడించి దివిజావలిఁ దోకొని యా సరస్సునం
గనకసరోజనాళమునఁ గానకయుండ నణంగియున్న య
య్యనిమిషనాథుఁ బిల్చి నయమారఁగ సన్నుతు లొప్పఁజేయఁగా
విని సురరాజు వెల్వడియె విశ్రుతమైన సరోజషండమున్.

61


వ.

ఇట్లు వెలువడి లజ్జావనతవదనుండై వాచస్పతికి నమస్కరించి
కృతాంజలియై యిట్లనియె.

62

తే.

[37]చేయవలవని కార్యంబు సేయు కతన
నిట్టి దురవస్థ ప్రాపించె; నిపుడు నాకు
సొలసి సిగ్గున మీ మోముఁ జూడనోడి
తొలఁగి యిందున్నవాఁడ నే నలఘుచరిత !

63


క.

నా కేడుగడయు మీర వి
వేకింపఁగ నన్య మెఱుఁగ విబుధోత్తమ! నేఁ
డీ కష్టదురితవారిధి
నే కతమునఁ గడతు నానతీవే కరుణన్.

64


వ.

అనిన వాస్తోష్పతికి వాచస్పతి యిట్లనియె.

65


ఆ.

ఏల యింత వగవ! నీ కల్మషంబెల్ల
[38]విడిచిపోవునట్టి [39]విధము గలదు;
తగఁ బ్రయాగ కేగి తజ్జలంబులఁ దోఁగి
తనువు దోషమెల్లఁ దలఁగికొనుము.

66


వ.

అని యా క్షణంబ గంగాయమునాసంగమంబునకుం గొనిపోయి
తజ్జలంబుల మాఘస్నానంబులు మూఁడుదినంబులు సేయించిన
నింద్రుని శరీరంబున మునిశాపదోషంబున నైన కుయోను
లన్నియుఁ దత్ప్రాజాపత్యతీర్థప్రభావంబున నేత్రంబులై వికచ
కమలవనంబు చందంబునం జెలువు మిగిలె నప్పుడు.

67


ఆ.

సురలు పుష్పవృష్టిఁ గురిసిరి; దేవదుం
దుభులమ్రోఁత నభము తుముల మయ్యె;
నప్సరోనికాయ మాడఁగ గంధర్వ
గానములు సెలంగఁ గౌశికుండు.

68

వ.

ఐరావతారూఢుండై సకలదేవగణంబును [40]దిక్పాలురునుం బరి
వేష్టించి కొలిచిరా నమరావతికిం జని సహస్రాక్షుం డక్షీణంబగు
దివిజరాజ్యంబు సేయుచు శచీసమేతుండై యుండె నని మాఘ
స్నానమహత్త్వంబు చెప్పి యవ్విప్రుండు.

69


క.

ఇల [41]నీ యితిహాసోత్తమ
మలవడ విను పుణ్యమతుల కాయువు సిరియుం
గలుగు మహాపాతకమును
దొలఁగును బరదారగమనదోషము లణఁగున్.

70


వ.

అని చెప్పి నీవునుం బ్రయాగ కరిగి మాఘస్నానంబు చేసి సకల
దోషంబులుం బాపికొని పుణ్యలోకసుఖంబు లనుభవింపు మనిన న
మ్మహానుభావు చరణంబులు శిరంబు సోఁక బ్రణమిల్లి యనుజ్ఞఁ
గొని చనుదెంచి.

71


క.

బంధుజనదాసదాసీ
బంధురసంపత్ర్పపూర్ణభవనంబున ని
ర్బంధమును విడిచి సుఖ [42]మను
సంధింపక దృఢవిరక్తి సంపదపేర్మిన్.

72


వ.

కతిపయప్రయాణంబుల నెవ్వరితోడం జెప్పక చనునప్పుడు.

73


సీ.

హరి లచ్చి నే ప్రొద్దు నక్కునఁ దాల్చు[43]
        హేమంత మరుదెంచు టెఱిఁగికాదె
హరుఁడు ఫాలంబుపై ననలంబుఁ దాల్చు [44]
        తఱుచైన చలి కోర్వ వెఱచికాదె

కూర్మంబు మేను సంకుచితంబు సేయు[45]
        శీతాగమంబగు భీతి కాదె
మొగి పాపఱేఁడు మైముడిఁగి నిద్రించు[46]
        తుహినంబు సోఁకునఁ దూలి కాదె


ఆ.

యనఁగ సకలదిశల నలమిజీవుల నెల్లఁ
గంప మొందఁ జేసి పెంపు మిగిలి
కమలముల హరించి కమలాప్తు గెలువఁగ
నప్పళించు శీత మరుగుదెంచె.

74


వ.

అప్పుడు.

75


సీ.

నేలయంతంతయు నెఱిఁ జంద్రకాంతపు
       ఱాలఁ గట్టించినలీల మెఱసె
నింగియంతంతయుఁ బొంగి దుగ్ధాంభోధి
       నిట్టదొట్టినమాడ్కి దట్టమయ్యె
సకలజీవులమీఁదఁ బ్రకటమై హరికీర్తి
       కలయఁ బర్వినమాడ్కిఁ దెలుపుచూపె
నక్కజంబుగ నెల్లదిక్కుల నొక్కటఁ
       దెరచీర లెత్తిన కరణిఁ దోఁచె


తే.

నగము లెల్లను నీహారనగము లయ్యెఁ
[47]దరువు లెల్లను ఘనసారతరువు లయ్యెఁ
[48]బక్షు లెల్లను రాయంచపదువు లయ్యె
గురుతరంబగు పెనుమంచు గురియు కతన.

76


క.

వలరాజున కాశ్రయమగు
చెలువల పాలిండ్లపంచఁ జేరకయున్నన్
జలిపీఁచ మణఁచఁగూడునె
సొలవక పెనుగిరుల మరువుసొచ్చిన నైనన్.

77

వ.

ఇవ్విధంబున నంతకంతకుఁ దా నతిశయించి సకలజీవనిర్బంధ
కారణంబై హేమంతాగమనంబు ప్రవర్తిల్లుచుండ నట్టిసమయం
బున.

78


ఉ.

ముక్కున నీరుజాఱ [49]వలిమో మెగయింపఁగ మేను చేతులం
జిక్కఁగఁ గప్పుకొంచు దలచీరఁ దలంపక గాళ్లు నేలపై
ద్రొక్కఁగ రాక కోరగొని తొట్రుపడంగ నరణ్యభూమియం
దొక్కతె నేగితిం జలన మొందక తీర్థము లాడువేడుకన్.

79


వ.

ఇ ట్లరిగి మకరమాఘంబునందు సకలమునిగణసేవితంబైన
గంగాయమునాసంగమంబునం ద్రిదివసావగాహంబునఁ బాతక
హరణంబును సప్తవింశతివాసరస్నానఫలంబునం ద్రిదివసౌఖ్యం
బును సిద్ధించె. తత్ప్రసాదమహిమన యిట్టి సౌభాగ్యంబు జాతి
స్మరత్వంబును సంభవించుటం జేసి ప్రయాగమాహాత్మ్యంబు
దలంచి.

80


క.

ప్రతిమాఘంబుఁ బ్రయాగకు
[50]నతిరక్తిని వచ్చి తీర్థ మాడుదు నిది నా
వ్రత మీతీర్థమహత్త్వం
బతిశయముగ సంస్తుతింతు రమరేంద్రాదుల్.

81


వ.

అని కాంచనమాలిని తనవృత్తాంతంబు చెప్పి బ్రహ్మరక్షస్సున
కిట్లనియె.

82


తే.

ఎట్టి జన్మంబువాఁడ నీ వేమి చేసి
తిట్టి వికృతంపురూపు నీ కేల కలిగె
నిన్నగంబున నేటికి నున్నవాఁడ
వింతయును నాకు వివరించి యెఱుఁగఁ జెపుమ!

83

బ్రహ్మరాక్షసుఁడు కాంచనమాలినితోఁ దనపూర్వవృత్తాంతము చెప్పుట :

చ.

అన విని బ్రహ్మరాక్షసుఁడు నాసతి కిట్లను దల్లి! నీదు వ
ర్తనము పవిత్రమైన గతిఁ దప్పక చెప్పఁగ విన్నమాత్ర నా
మనము ప్రసన్నమయ్యె గరిమన్ స్ఫుటసజ్జనగోష్ఠి నేరికిన్
ఘనతరసౌఖ్యసంపదలు గల్గుట నిక్కముగాదె యెచ్చటన్.

84


వ.

అట్లు గావున నిఖిలదోషంబులకు మూలంబైన నా తెఱంగు విను
మని బ్రహ్మరాక్షసుం డిట్లనియె.

85


సీ.

విశ్వేశనిలయమై వెలయుఁ గాశీపురి
        బ్రాహ్మణాన్వయుఁడ దుర్భాగ్యయుతుఁడ
దోషంబు దలఁపక దుర్దానములు గొని
       ధనలోభమునఁ జేసి తగవు విడిచి
చండాలుఁ డిచ్చిన నొండు దలంపక
       తివిరి యేదైనఁ బ్రతిగ్రహింతు
నవిముక్తతీర్థంబునందు నెల్లప్పుడుఁ
       బాపంబు సేయుదుఁ బ్రతిదినంబుఁ


తే.

బొరి పరాన్నంబు భుజియింపఁ బోదుఁ గాని
దేవపైతృకములఁ జేయఁ దీర దెపుడు
నొకనికై తీర్థ మాడుచునుందుఁ గాని
యెట్టిదినమున నొకగ్రుంకు పెట్టుకొనను.

86


వ.

ఇవ్విధంబునఁ గాలంబుఁ బుచ్చుచుండ ననేకవత్సరంబులు
జరిగిన పిదపఁ దత్క్షేత్రంబున శరీరంబు విడిచినకతంబున నరక
లోకంబునకుఁ దొలంగితి నది యెట్లనిన.

87


క.

పెఱచోఁ జేసిన పాపము
లఱుమక యయ్యెడ నడంగు నవిముక్తమునం
గుఱుకొని చేసిన యఘములు
కఱగొని దృఢవజ్రలేపకంబగుఁ దరుణీ!

88

వ.

అట్లు గావున నచ్చటం జేసిన దురితంబుల నెరియుచున్న నాకు.

89


సీ.

విను! రెండుజన్మంబులను గృధ్రమై పుట్టి
         ముమ్మారు పులిగర్భమున జనించి,
పెను[51]బామనై రెండుజననంబు లొందితి;
         బొరి నులూకంబనై పుట్టి, యొక్క
మాటు వర్తించితి, మఱి శునకంబనై
         పుట్టి, యాపాపంబు చుట్టుముట్టఁ
బదియగు జన్మంబు బ్రహ్మరాక్షసుఁడనై
        యీరూపమునఁ బుట్టి, యిచటనుండి


ఆ.

సోలి డెబ్బదేనువేలేండ్లు[52]కొలెఁ బాప
మనుభవించుచుండి యవధిగాన
నేమి చేయువాఁడ నెయ్యది [53]తెప్ప నా
కిట్టి పాపవార్ధి నెట్లు గడతు.

90


వ.

అదియునుం గాక యీక్రూరజన్మంబునం బుట్టి మఱియునుం
బాపంబు సేయుచుండుదు; నిప్పుడు నాచేత మృతులైనవారి
నెన్నం గొలఁది గాదు. నాకు వెఱచి యిచ్చట యోజనత్రయంబు
నిర్జనంబై యున్నయది; నేఁడు భవదీయదర్శనంబునం జేసి
నాచిత్తంబు దోషంబులకుఁ [54]దొడరకున్నది; యిట్టి నాకు దురిత
విముక్తి ప్రసాదించి పుణ్యలోకంబు గలుగు నుపాయంబు సెప్పి
యుద్ధరింపు మని నమస్కరించినం గరుణాయత్తచిత్త యై య
క్కాంచనమాలిని యి ట్లనియె.

91

క.

అక్కట! సద్ద్విజజన్మము
నెక్కొనియును జేసికొనిన నేరిమి నిన్నుం
ద్రెక్కొనఁ గష్టపుబాములఁ
బొక్కుచు నిన్నేడు లెట్లు పొరలితి తండ్రీ!

92


క.

నినుఁ జూచి నామనంబున
ననుకంప జనించె దోష మణఁగెడివిధ మే
ననుసంధించెదఁ దెలియఁగ
వినుమని రాక్షసునితోడ వెలఁదుక పలికెన్.

93


సీ.

గంగయు యమునయుఁ గలసిన యచ్చోట
        నేనాడు మాఘంబు లెన్నియేని
గల వందులోన నీ కలుషంబుఁ దలఁగింప
        నవి మూఁడుదినముల ఫలము [55]నిప్పు
డిచ్చెద నంత నీ వీరూప మెడఁబాసి
        యమరత్వ మొందెద వనుచుఁ జెప్పి
తడిచీరకొంగునఁ [56]బిడిచిన జలములఁ
        దత్ఫలం బతనికి ధారవోయ


ఆ.

నతఁడు రాక్షసత్వ మప్పుడే పెడఁబాసి
దివ్యతనువుఁ దాల్చి తేజరిల్లి
సంతసంబు ప్రియము సందడి పడుచుండ
నమ్మృగాక్షి కిట్టులనియె మ్రొక్కి.

94


ఆ.

వెడలఁబాటు లేక వేఁగుచునున్న నా
దురితవితతిఁ బాఱఁదోలి నీవు
నాకలోకసుఖము నా కిచ్చితివి మాఘ
మజ్జనప్రభావమహిమఁ జేసి.

95

క.

నీ కారణమున నిపు డీ
భీకరరూపంబు విడిచి పెంపగు నాక
శ్రీ కర్హుఁడనై నెగడితి
నాకుం గర్తవ్య మెద్ది నళినదళాక్షీ !

96


వ.

అనిన నద్దివ్యపురుషునకుఁ గాంచనమాలిని యిట్లనియె.

97


క.

ధర్మము సేయుము; సతతము
నిర్మల[57]మతి నుండు; హింస [58]నినుపకు మదిలో;
ధార్మికులజోక విడువకు;
దుర్మదమున నన్యజనుల దూషింపకుమీ!

98


వ.

కామక్రోధాదులం దగులక శరీరం బస్థిరంబుగాఁ దలంచి వైరా
గ్యంబు గలిగి భూతహితంబు సేయుచు నత్యంతపుణ్యలోక
సౌఖ్యంబు లనుభవింపుమనిన నతఁడు కాంచనమాలిని కిట్లనియె.

99


శా.

ఆచంద్రార్కముగా నిరంతరము నీ వారూఢిఁ దారాద్రిపై
నాచంద్రార్ధకిరీటుసన్నిధిఁ బ్రియంబారంగఁ గ్రీడింపు గౌ
రీచిత్తప్రియకారివర్తన మతిప్రేమంబుతో సంతత
ప్రాచుర్యంబగుఁ గాత నీకు విలసద్రాజీవపత్రేక్షణా!

100


వ.

అని యాశీర్వదించుచు నతండు దివ్యవిమానారూఢుండై [59]కాంచన
మాలిని వీడ్కొని దివిజలోకంబునకుం జనియె; నట్లు బ్రహ్మరాక్ష
సుండు ముక్తుండై దివంబునకుం జనుటం జూచి యవ్వనంబున
నున్న దేవకన్యకలు కాంచనమాలిని కిట్లనిరి.

101


క.

నీకారణమున విప్రుఁడు
నాకంబున కరిగె నడవి నవయుచు దుఃఖ
వ్యాకులులమైన మమ్మును
జేకొని రక్షింపవలదె సింధురగమనా!

102

వ.

అనిన విని కాంచనమాలిని గంధర్వకన్యకలకుం దనమాఘమాస
స్నానఫలంబు నిచ్చి వారును దానును గైలాసంబున కరిగి సుఖం
బుండె; నిట్టిది [60]మాఘస్నానమహాత్మ్యం బని దత్తాత్రేయుండు
కార్తవీర్యునకుం జెప్పెనని చెప్పుటయు విని దిలీపభూపాలుం డట
మీఁది వృత్తాంతం బాన తిమ్మని యడిగిన.

103


సీ.

మనుజేంద్ర! విను మాఘమాసమజ్జనఫల
        మరయ నేరికిఁ జెప్ప నలవిగాదు;
సర్వయజ్ఞములకు సర్వధర్మములకు
        సర్వదానములకు సాటివచ్చు;
నొకనాఁడు సుస్నాన మొనరించు మానవుం
        డుభయకులంబుల నుద్ధరించు;
దివిజాలయము నొందు భువి నెట్టిపాపియు
        [61]జన్మాంతరముల దోషము లణంచి;


తే.

యరయ నధ్యాత్మవిదులైన యట్టివారు
ఘనులు ప్రాపింత్రు మాఘావగాహనమును
బూర్వసుకృతంబు కతమునఁ బొందుగాక!
యితరమనుజుల కీఫలం బేల కలుగు?

104


వ.

మఱియు మాఘమాసంబున సుస్నాతులై యథాశక్తి నెవ్వియే
నియు దానంబు లిడవలయు. నన్నదానం బిడినయతం డమృ
తాశియై దివ్యవర్షసహస్రంబులు దేవలోకంబున వసియించు. హేమ
దానం బిడినయతం డింద్రు డగ్గఱియుండు. వస్త్రదీపాదు లిచ్చిన
వాఁడు సూర్యసన్నిధి నుండు. నందు సూర్యోదయవేళ విష్ణు
నారాధించినవారు విష్ణులోకంబునం బొందుదురు. [62]కావున దొల్లి
గంధర్వకన్యలు మునిశాపంబున నత్యంతదుఃఖంబునం బొంది
రోమశానుజ్ఞ వడసి మాఘస్నానంబు సేసి పుణ్యతనువులు ప్రాపించి

రని చెప్పిన దిలీపుండు తద్వృత్తాంతంబు వినవలతుం జెప్పుమని
యడిగిన వసిష్ఠుం డిట్లనియె.

105


చ.

అనుదిన[63]పద్మసంఖ్యల సదక్షయముఖ్యవిధానయుక్తమై
యనుపమనిర్జరీగణసమంచితగానవిశిష్టమైత్రిలో
చనమకుటేందుఖండరుచిసంచయధౌతసువర్ణహర్మ్యమై
ధనదుని పట్టణం బమరుఁ దద్దయు వస్తుసమృద్ధి నెప్పుడున్.

106

గంధర్వకన్యకల వృత్తాంతము :

వ.

అందుఁ గుబేరుసమ్ముఖంబున ననవరతంబునుం గొలిచియుండు
గంధర్వకన్యకలలోన నగ్రగణ్యలగు వారు సంగతిక కూఁతురు
ప్రమోహినియును, సుశీలపుత్త్రి సునీలయు, స్వరవేది తనయ
సుస్వరయును, చంద్రాకాంతుని నందన సుచారియును, [64]ప్రభా
కరాత్మజ చంద్రికయు నను నేవురు సమానవయోరూపసౌభాగ్య
వినయవిద్యావిశేషంబులుం గలిగి.

107


ఆ.

అంగభవునితూపు లైదును ధాత్రిపై
[65]యంగకములు దాల్చి యలరినట్లు
మెలఁగి యాడుచున్న మెఱుఁగుఁదీఁగెల భాతిఁ
బెంపుమైఁ జరింతు రింపు లొలయ.

108


ఆ.

చంపకములు దుఱిమి సౌవర్ణభూషణ
స్తోమ మమరఁ దాల్చి [66]సొన్నచాయ
పట్టు నొనరఁ గట్టి పద్మాక్షు లొప్పిరి
పసిఁడి జేసినట్టి ప్రతిమ లనఁగ.

109


వ.

ఇ ట్లవ్వనితలకు మవ్వంబులగు జవ్వనంబులు నివ్వటిల్ల స్వరగ్రామ
తానమానమూర్ఛావిశేషంబుల వీణావాదననైపుణంబు మెఱయ

మధురగానంబు సేయుచుఁ జతుర్విధనృత్యంబులఁ బ్రగల్భలై
సమస్తవిద్యాకళాభిజ్ఞలు నగుచుఁ బితృలాలనంబులం బెరసి
సకలవనంబులం గ్రీడించుచు నొక్కనాఁడు మధురసాస్వాద
మత్తమధుకరమంజురవాకీర్ణం బగు మధుమాసంబునఁ బుష్పాప
చయంబులు సేయుచుం జనిచని ముందట.

110


శా.

ఆ రాజాస్యలు గాంచి రయ్యెడ సముద్యల్లోలకల్లోలసం
చారోద్ధూతనవీనఫేనదరహాసస్ఫారమున్ నిర్జరా
హారశ్రీకరవారిపూరముఖరవ్యాపారవిస్తారముం
బారావారగభీర [67]నీరము [68]మహావారమ్ముఁ గాసారమున్.

111


వ.

కని దాని మహిమాతిశయంబులు గొనియాడుచు న య్యిందువదన
లచ్చోటను.

112


తే.

స్ఫటికవైడూర్యసోపానపంక్తులందు
నల్లనల్లన డిగి యీఁదులాడి [69]తనిసి
వెడలి తడుపులు పట్టులు విడిచి కట్టి
రమణు లొప్పిరి మరుని బాణము లనంగ.

113


వ.

అప్పుడు.

114


ఉ.

గౌరి భజించి లీలఁ దెలిగన్నుల రాగము సొంపుచూపఁగా
గారవమార వీణియలు గైకొని యల్లన [70]నాలపించుచు
న్వారక మంజులధ్వనుల వారిజనేత్రలు పాడి రాడుచున్
శారద యేనురూపులగు చందము దోఁప విలాసలీలలన్.

115


వ.

అయ్యవసరంబున.

116

చ.

లలితమృగాజినంబును బలాశపుదండము నారముంజియుం
దెలుపగు గోఁచియున్ మెఱుఁగుఁదీఁగెలఁ బోలెడు జన్నిదంబుఁ బెం
పొలసిన యూర్ధ్వపుండ్రమును నొప్పగు వేలిమిబొట్టుఁ గ్రాలఁగా
నలవడ బ్రహ్మచారి యొకఁ డచ్చటికిం జనుదెంచె లీలతోన్.

117

వేదనిధి పుత్రునింజూచి గంధర్వకన్యకలు మోహించుట :

వ.

ఇట్లచ్చటి తీర్థస్నానార్థియై వచ్చి వేదనిధి తనూజుండు తత్తటం
బున విహరించుచుండ గంధర్వకన్యక లందఱుం గూడుకొని.

118


ఉ.

వాని శరీరకాంతియును వాని విలాసవిహారలీలలున్
వాని విశాలవక్షమును వాని సమంచితదీర్ఘబాహులున్
వాని మొగంబు లేనగవు వాని పదంబుల సోయగంబు నిం
పూనఁగ నందఱుం దగిలి యొక్కటఁ జూచిరి పద్మలోచనల్.

119


వ.

ఇట్లు కనుంగొని తమలోన.

120


క.

హరు సూడు పట్టుకొఱకై
పొరిఁ బొరిఁ దప మాచరించు పుష్పాస్త్రుఁడుగా
కరయఁగఁ ద్రిభువనముల నె
వ్వరి యందుల నిట్టి రూపవంతుఁడు గలఁడే.

121


వ.

అని కొనియాడుచు గౌరీపూజనంబు చాలించి యా బ్రహ్మచారి
డగ్గఱం జని.

122


తే.

అతివ లందఱు నభిలాష లగ్గలింపఁ
జూచు చూపులు మునిమేన సొబగు మిగిలె
నమరగణసేవ్యుఁడైన మురారి మేనఁ
గణఁగి పూజించు నల్లనికలువ లనఁగ.

123


వ.

ఇట్లు కనుంగొని మదనబాణజర్జరీకృతశరీరలై యంతకంతకుఁ
గదియం జని తమక తమక తగునని తమక పడుచు ఱెప్పవెట్టక
చూచుచుం దమలోన.

124

ఆ.

పతి యితండు నాకుఁ బ్రాణేశు డీతఁడు
వీఁడు తనకు మగఁడు వీఁడు భర్త
నాకు[71]నితని నేన చేకొందు నని కన్య
లేవురును ననంగ నిచ్చ నతఁడు.

125


మ.

విని మాధ్యాహ్నికవర్తనంబులు గడు న్వేవేగఁ గావించి చిం
తన సేయం దరుణీజనం బఁట సముద్యత్ప్రీతితోనున్న దీ
వనితామాయలచేతఁ దొంటిమునులున్ వాయోడి పుష్పాస్త్రుచే
ఘనధైర్యంబులు గోలుపోయి మిగులం గాసిల్లినా రక్కటా!

126


క.

[72]ఏపున నింతులచూపుల
తూపులు భ్రూధనువునందుఁ దొడిగి మరుఁడు దు
ర్వ్యాపారవిటమృగంబులఁ
[73]బాపంబన కేయ నడ్డపడ నొరు వశమే?

127


ఆ.

మదము గదురఁ జేసి మది మోహ మెక్కించి
చూపుదీఁగెలందుఁ జుట్టుకొల్పి
యెట్టి మునులనైన నెట్టనఁ జెడఁ జూతు
[74]రంగవించిరేని యబ్జముఖులు.

128


ఆ.

బుద్ధిమంతులైన పురుషుల కంగనా
జనులఁజేరి యునికి చనదు గాన
నీ సరోజవదన లిటఁ నన్ను [75]గదియక
యుండ నింటి కరుగు టొప్పు ననుచు.

129


వ.

ఉన్నయెడ.

130


ఉ.

అంత వధూజనంబు తను నయ్యెడఁ బట్టఁదలంచి వచ్చుచో
నంతకుమున్న వైష్ణవమహత్వము గల్గినవాఁడుగాన ని
శ్చింతుఁడు బ్రహ్మచారి కడుఁజిత్రము గాఁగ నదృశ్యమూర్తియై
యింతుల మోసపుచ్చి చనియెం బ్రమదంబునఁ దీవ్రవేగుఁడై.

131

ఆ.

ఇట్లు విష్ణుభక్తి నేగిన యా బ్రహ్మ
చారిమహిమఁ జూచి సతులు మతుల
నద్భుతంబు నొంది యమ్మౌనిఁ గానక
విరహవహ్నిచేత వేఁగివేఁగి.

132


ఆ.

ఇంద్రజాలవిద్య లెఱుఁగునో మాయల
రూప మొక్కొ యిట్టి రుచిరమూర్తి
మనకుఁ దన్నుఁ జూపి మరుబారి కొప్పించి
యింతలోన నెచటి కేగె నొక్కొ!

133


వ.

అని యందంద గలయం దిరుగునప్పుడు.

134


క.

ఆ వనితల తనులతికల
లో విరహానలము పర్వ లోచనసుఖద
శ్రీ విలసిల్లె లతలలో
దావానలశిఖలు [76]గలయ దరికొనుభంగిన్.

135


క.

అప్పుడు తరుణులు మనములఁ
గప్పిన విరహానలమునఁ గానక వనముం
దప్పక వెదకుచుఁ జదలున
కప్పురుషుఁడు వోవుమార్గ మరయుచు నలఁతన్.

136


ఉ.

ఏ లరుదెంచె నీ వడుగఁ డిచ్చటి కిప్పుడు? వానిఁ జూచి నే
మేల విరాళిగొంటి? మిటు లిందఱ మొక్కట; మమ్ముఁ జూచి వాఁ
డేల యదృశ్యమయ్యె? నతఁ డేగతిఁ బోయినఁ బోయెఁ గాక తా
నేల మనోజుఁ డిప్పు డలయించెడి మమ్మిటు పువ్వుఁదూపులన్.

137


వ.

అని యంత నిలువక.

138


సీ.

తఱుచుగాఁ బూచిన తరువుల లోపల
        నల్లనల్లనఁ జొచ్చి యరసి యరసి
కంటకవల్లికాక్రాంతకుంజంబులు
        బెదరక చని చొచ్చి వెదకి వెదకి

పొడవైన తరులెక్కి భూసురోత్తమ! యని
       పలుమాఱు దీనతఁ బిలిచి బిలిచి
వాఁగులు వ్రంతలు వనజాకరంబులు
       చొచ్చి విచ్చలవిడిఁ జూచి చూచి


ఆ.

వడుగురూప మెందుఁ బొడగాన నేరక
విరహవహ్నిచేత వెచ్చి వెచ్చి
యుదయుఁడైన కాము నమ్ములఁ దొడిఁబడి
మానధనము [77]లురిలి మగువ లపుడు.

139


ఉ.

కాననభూమి నిర్జనము గావున నయ్యెడ నుంటఁజేసి తా
మానధనంబుఁ జిత్తమును మన్మథచోరుఁడు గొంచు నేగినన్
దీనతనొంది కుంది సుదతీమణు లచ్చొటు వాసి యిండ్ల కె
ట్లేనియు వచ్చి రేటి కెదు[78]రీఁదెడు కైవడి నార్తచిత్తలై.

140


వ.

ఇట్లు తదీయప్రేమపాశ[79]బద్ధచిత్త లై యిండ్లకుం జని యమ్ము
నీంద్రువలని వలవంత యంతంకంత కతిశయింపఁ దమ్ముఁ దా
మెఱుంగక యున్నంత.

141


ఉ.

అత్తరలాయతాక్షులు ప్రియంబగు నమ్మునినాథురూప మ
చ్చొత్తినభంగి నెమ్మనములందుఁ జెలంగఁగఁ బంచబాణుచేఁ
జిత్తము లొత్తగిల్లి పలుచింతలఁ జేడ్వడి మ్రానుపాటుతోఁ
జిత్తరురూపులం బురుడుసేయుచుఁ జేష్టలు దక్కి రయ్యెడన్.

142


వ.

మఱియును.

143


ఉ.

తల్లులు సీరిన న్వినక దాదులదిక్కును జూడ కంగముల్
డిల్లము నొంది ధైర్యములు డింద మనోభవబాణసంహతిం
దల్లడమంది మైమఱచి[80]తద్దయు మోములు వంచి చెక్కులం
బెల్లుగఁ గన్నునీ రురల భీతమృగేక్షణ లుండి వెండియున్.

144

ఉ.

ఆమునినాథు నెన్నడుము నంగముతీరును దీర్ఘబాహులున్
మోమువికాసముం జెవులు మోచిన కన్నులడాలు నొండొరు
ల్వేమఱుఁ జెప్పుకొంచుఁ బదివేలవిధంబులఁ బ్రస్తుతించుచుం
దామరసాయతేక్షణలు దర్పకుచెయ్వులఁ జంచలింపఁగన్.

145


వ.

ఇట్లు నితాంతలతాంతాయుధసంతాపనాదిశరసంతానదురంత
సంతాపాక్రాంతస్వాంతలగు నయ్యింతులం జూచి నెచ్చెలులు
వలవంతగా నంతరంగంబులం గనుంగొని యల్లనల్లన నక్కన్ని
యలం గదిసి

146


సీ.

కురులు వంకలు దీర్చి కొనగోళ్లఁ దిలకంబుఁ
         బాగుగాఁ దొల్లిటిభంగి నిలిపి
కనుఁగొనలను రాలు కన్నీరు వో మీటి
        చెక్కులఁ గ్రమ్మెడు చెమటఁ దుడిచి
యడుగు లొత్తుచు మేను లందంద పుణుఁకుచుఁ
        దెఱవలమోముల దృష్టి నిలిపి
యల్లన నడుగంగ నమ్మృగాక్షులు ప్రాణ
        సఖులతోఁ బ్రేమఁ గాసారభూమి


తే.

కగజఁ బూజించువేడ్కఁ దా రరుగుటయును
సుందరాకారుఁ డగు విప్రుఁ జూచుటయును
నతఁడు దముఁ జూచి మాయమై యరుగుటయును
నతని కతమున విరహాగ్ని యడరుటయును.

147


క.

చెప్పినఁ బ్రియసఖు లందఱు
నప్పొలఁతుల దిక్కు చూచి యచ్చెరువడి తా
రెప్పాట నెందుఁ జూడని
చొప్పులు వినఁబడియె నిట్టి చోద్యము గలదే?

148


ఉ.

ఎక్కడి బ్రహ్మచారి యతఁ డెవ్వరివాఁ డెటువంటి రూప సే
దిక్కున కేగె నిట్లు సుదతీమణు లందఱు మన్మథాగ్నిచేఁ
బొక్కుచు నున్నవారు పలుపోకలఁ [81]బోయిన మాయబోటు లి
ట్లక్కడి కేల పోయి రకటా! మరునమ్ముల కేది మం దొకో!

149

క.

తరుణులపాలిటి కర్మము
పురుషత్వము దాల్చి వడుగుఁ బొడవండై తా
దొరకొనియెఁ గాక ధర నె
వ్వరికిని నిటువంటి దొంతివలపులు గలవే!

150


తే.

ఒకతె నెబ్భంగినైనను నోమవచ్చుఁ
గోరి యొకతెకు నొకనిఁ దోడ్తేర వచ్చు
గాక యేగురు విరహాగ్నిఁ గ్రాఁగుచుండ
నేమి సేయుదమని యింతులెల్ల [82]బెగడి.

151


చ.

కమలవనంబుపొంత సహకారమహీజముక్రేవ నుల్ల స
ద్భ్రమరనినాదము ల్చెలఁగు ప్రన్నని పూఁబొదరింటిలోనఁ జె
న్నమరెడు చంద్రకాంతపుశిలావలి నొప్పు నరుంగుమీఁదటన్.
సమధికలీల లేఁజిగురుశయ్యలు సేసి సరోజలోచనల్.

152


ఆ.

పుష్పసమితి నెఱపి పూఁదేనెతోఁ గూర్చి
కప్పురంపునీటఁ గలయ నలికి
సతులఁ దెచ్చి యునిచి చలిమందు లొనరింప
నంగజానలంబు నతిశయించె.

153


వ.

ఇ ట్లయ్యతివలు సేయు శిశిరోపచారంబు లన్నియు ననలంబుపై
నేయి చల్లిన చందంబున నంతకంతకుం బెరిగిన విరహానలంబున
నంబుజాసనలు పుష్పశయ్యలు వెన్ను మోపనేర కారాటంబునం
బొరలు సమయంబున.

154


తే.

విరులశయ్యలఁ దనుగాలి వీవ నింతు
లగ్గలంబగు మదనాగ్ని బెగ్గడిలిరి
చెలఁగి నలుఁగడ నెరవలిచిచ్చు గ్రాల
నడుమ సుడిఁగొన్న [83]లేటితండమును బోలె.

155

వ.

ఇ ట్లాక్రాంతంబగు విరహానలంబు సైరింపనోపక యక్కన్నియలు
సఖుల కిట్లనిరి.

156


ఆ.

అకట! మమ్ము నింత యలజడిఁ బెట్టుచు
శిశిరవిధులు మీరు సేయనేల?
యతనిఁ దోడి [84]తేర నారు నీవిరహాగ్ని
లేకయున్న బ్రతుకు లేదు మాకు.

157


వ.

అని పలుకు నవసరంబున.

158


క.

కమలములు మొగుడఁ గలువలు
దమకింపుచుఁ దమక తమక తలచూపఁగఁ బ
శ్చిమదిగ్వధూటి రాగిలఁ
గమలాప్తుఁడు గ్రుంకె విప్రగణము నుతింపన్.

159


వ.

అయ్యవసరంబున.

160


చ.

కలువలవిందు పూవిలుతు గాదిలిచుట్టము రేవెలుంగు వె
న్నెలగని చంద్రకాంతముల నెచ్చెలి లచ్చికిఁ దోడునీడ చు
క్కలగమికాఁడు రాజు కఱకంఠుని యౌదలసూసకంబు పాం
థుల వెఱగొంగ నాఁగ శశి తూర్పుదెసం బొడతెంచె నుగ్రతన్.

161


వ.

ఇట్లు చంద్రోదయం బగుటయు నమ్ముద్దియలకు విరహానలం
[85]బెచ్చినఁ జేతనంబు సడలి మన్మథపరవశలై యుండం జెలికత్తె
లందఱు నుత్తలంబును నివ్వెఱఁగునుం గదిరి భయభ్రాంతచిత్తలై
యుండ నెట్టకేలకుఁ బ్రభాతం బయ్యెఁ దదనంతరంబ.

162


ఉ.

తమ్ముల నిద్రఁ దెల్చి బెడిదంబగు చీఁకటి బాఱఁదోలి లో
కమ్ముల యారటం బుడిపి కన్నులకెల్ల వెలుంగు దానయై
యమ్మును లిచ్చు నర్ఘ్యముల [86]నాతఱి మూర్తులు మూఁడు దానయై
క్రమ్మఱఁ బూర్వశైలశిఖరంబునఁ దొఁచె సరోజబంధుఁడున్.

163

వ.

ఇట్లు సూర్యోదయంబున నక్కన్నియలకుం జెలికత్తెలు దిన
ముఖోచితక్రియలు సేయించి యా మునికుమారునిం గనుంగొనిన
యచ్చోటితీర్థంబుకడకుం గొనిపోయి గౌరీసమారాధనంబులు
సేయుచు నాటపాటలవెరగున నమ్మరులు మఱపింప నవ్వామ
నయన లమ్మునికుమారుండు చనినమార్గం బీక్షించుచు నొండు
దలంపు లుడిగి [87]యుండిరి.

164


ఉ.

అప్పుడు బ్రహ్మచారి రయమారఁగ [88]వచ్చె సరోవరంబునం
దొప్పుగఁ దీర్థమాడ [89]నని యుజ్జ్వలరూపముతోడఁ బల్మఱుం
దప్పక కన్యకాజనులు తన్నుఁ బ్రియంపడి చూచుచుండఁగా
నెప్పటియట్ల తా వికృతి యెద్దియు లేక మనోముదంబునన్.

165


క.

అయ్యువిదల నెమ్మనముల
నెయ్యంపురసంబు లుబ్బి నిట్టలు వొడువం
జెయ్యాడ కతని డగ్గఱి
రొయ్యనఁ గనుఁగొనలఁ గలికి [90]యులుకులు చిలుకన్.

166


క.

తొలునాఁడును మైవంచనఁ
దొలగుటఁ దలపోసి సతులు దురఁదురఁ జని తా
రలసుపడనీక విప్రుని
నలుఁగడ నరికట్టి పట్టి నగుమోములతోన్

167


క.

ఎక్కడికిఁ బోవ వచ్చుం
జిక్కితి గా కింక విప్రశేఖర! మాచే
నిక్కముగ ననుచు నతనికి
వెక్కసముగ [91]నలదిపట్టు విడువకయున్నన్.

168

తే.

పణఁతు లందఱు తనుఁ జిక్కఁ బట్టినపుడు
నిండుమనమునఁ దలఁకక యుండె నతఁడు
పసిఁడిగను లన్నిదిక్కులఁ బ్రజ్వలింప
మండితంబగు చల్లనికొండ యనఁగ.

169


వ.

ఇ ట్లయ్యింతులు చుట్టుముట్టి పట్టుకొనుటయు నిట్టట్టు గదలనేరక
యిట్టలంబుగఁ దట్టుముట్టుపడి దిట్టతనంబున నెట్టకేలకు నిట్లనియె.

170


ఉ.

అక్కట! బ్రహ్మచర్య మిటు లాఱడివోవఁగ నన్ను నేల మీ
రక్కటికంబుమాలి వెస నంటఁగఁ బట్టినవారు మీకు నే
నొక్కటి చెప్పెద న్వినుఁడు యుక్తముగా దొరకొన్నవేద మిం
పెక్కఁ బఠించు నంతకు వరించుట ధర్మము గాదు కాంతలన్.

171


క.

దొరకొన్న వ్రతము విడిచిన
దురితంబగు నట్లు గానఁ దొయ్యలులారా!
కరుణించి నన్ను విడువుఁడు
పురుషార్థము సేయుఁ డేను బోయెద నిచ్చన్.

172


వ.

అని పరిహరించిన నవ్విప్రోత్తముం గనుంగొని కలకల నవ్వుచుఁ
గలకంఠకంఠు లిట్లనిరి.

173


క.

[92]ధర్మము నర్థముఁ గామము
నర్మిలి యొకటొకటితోడి యనుబంధముగాఁ
బేర్మి భజియించువారికి
నిర్మలగతి గలుగునండ్రు నిగమోక్తవిధిన్.

174


వ.

అని యెయ్యవి యంటేని.

175


ఆ.

ఆర్తులైన [93]వారి ననుకంపఁ బ్రోచుట
పరమధర్మ మేము పత్ను లగుట
నర్థకామసిద్ధి యగు నంతమీఁదటఁ
బుత్త్రలాభ మొదవుఁ బుణ్యచరిత!

176

వ.

అట్లు గావున నుత్తరంబు చెప్పక యనుగ్రహింపుమని సకలశాస్త్ర
సమ్మతంబుగాఁ బలికిన యక్కన్నియలం గనుంగొని విప్రుం డి
ట్లను మీ మాటలు సర్వధర్మంబులును సత్యంబులునై యున్న
యవి; యయిన నొక్కతెఱఁగు చెప్పెద వినుండు.

177


క.

దొరఁకొన్న వ్రతము నిండఁగ
గురుజనములచే ననుజ్ఞఁ గొనియే మిమ్ముం
బరిణయ మయ్యెద విడువుఁడు
తరుణులు మీ కింత చేయఁదగునే తలఁపన్.

178


ఆ.

అనిన నింతు లనిరి మునికుమారునిఁ జూచి
యేల వచ్చె నీకు బేలతనము
శీలసుభగలైన బాలిక లబ్బెడు
నింతకంటె వ్రతము లెవ్వి జగతి?

179


క.

ఏ మెక్కడ నీ వెక్కడ
కాముఁడు మము మరులు గొలుపఁగా నిబ్భంగిం
బ్రేమమునఁ దగిలి వచ్చిన
మామీఁదఁ గటాక్షదృష్టి మలఁచుట దగునే!

180


వ.

అని బహుప్రకారంబుల నొడంబఱచుచు మమ్ము గాంధర్వవివాహం
బునం బరిగ్రహింపు మనిన నతం డిట్లనియె.

181


క.

ధర్మాత్ములైనవారికి
ధర్మంబుఁ బరిత్యజింప ధర్మం బగునే
ధర్మార్థకామమోక్షము
లర్మిలిఁ గ్రమయుక్తి సలుప నధికఫలంబుల్.

182


క.

విపరీతమైన ధర్మము
గపటమతిం జేయ నంత కామాంధుఁడనే
యిపుడు మిముఁ బొందు వేడుక
నెపమెద్దియు నాకు లేదు నెలఁతుకలారా!

183

వేదనిధి కుమారుండును గంధర్వకన్యకలు నన్యోన్యశాపగ్రస్తు లగుట :

వ.

అనిన యక్కన్నియ లందఱుఁ దమకం బగ్గలింప.

184


ఆ.

ఒకతె కౌఁగిలించె నొకయింతి యడుగుల
కొఱగె నొకతె కరము లొనరఁబట్టె
నొక్కయింతి చెక్కు నొక్కె నొండొకలేమ
యమ్మునీంద్రుఁ జుంబనమ్ము చేసె.

185


వ.

ఇట్లు కందర్పపీడితలై వయోరూపప్రభావమానధనంబులఁ
దలంపనేరక పైఁబడు నంగనలం గనుంగొని కనుంగొనలఁ గన
లగ్గలింప ననలసన్నిభుండగు నమ్మునికుమారుండు.

186


ఆ.

ఊర కిపుడు నన్ను నొగిఁ బిశాచులయట్ల
యలఁచుచున్న వార లట్లు గాన
ధరఁ బిశాచవృత్తిఁ జరియింపుఁ డని వారి
కతఁడు శాప మిచ్చె నవనినాథ!

187


క.

మేదినిలోఁ దలఁపఁగ బ్ర
హ్మాదులకును దొరకనట్టి యతివలు దగులన్
మోదమఱి శాప మిచ్చెను
వేదజడుం డేమి నేర్చు వెలఁదులఁ బొందన్.

188


వ.

ఇట్లు బ్రహ్మచారి యక్కన్నియలకు శాపమిచ్చుటయుఁ దత్క్షణంబ.

189


సీ.

ఎరగలి సోఁకిన యెలదీఁగె గమి మాడ్కి
        జెలువారుమేనుల చెన్ను దొఱఁగె
జలిముణింగిన కంజదళముల పోలిక
        మిడిసి కన్నులు మిడిగ్రుడ్డు లయ్యె
ముక్తాఫలశ్రేణి మొనయు దంతంబులు
        చూడఁ జూడఁగఁ గోర దౌడ లయ్యె
భావజన్ముని నెత్తపలకలఁ బురడించు
        పొలుపారు వెన్నులు బొఱడు లయ్యె

ఆ.

మోము లిగిరెఁ జెవులు ముణిఁగె మేనులు డస్సె
బరులుదేరె బిట్టు నరము లెగసె
గొరకవెండ్రుకలును గుఱుచచేతులు నయ్యె
తరుణులకుఁ బిశాచతనువు లొదవె.

190


వ.

ఇ ట్లతిదారుణం బగు మునిశాపంబున నయ్యంగనలు పిశాచ
రూపంబులు దాల్చి యమ్మునీంద్రు డగ్గఱి యిట్లనిరి.

191


మ. కో.

తాపసోత్తముఁ డంచు నున్నతధర్మశీలుఁడ వంచు నీ
రూపుఁ గన్గొని మన్మథాస్త్రనిరుద్ధత న్నినుఁ జేరినం
బాపకర్మము చేసి యిట్లు కృపావిహీనుఁడవై వడిన్
శాప మిచ్చితి నీతి మాలి పిశాచరూపులుగా మమున్.

192


వ.

అనపరాధలమైన మమ్ము నిష్కారణం బిట్లు చేసితివి గావున నీవు
నుం బిశాచంబవగు మని శాపం బిచ్చిన మన్మథాకారుడగు నా
బ్రహ్మచారియు నప్పుడు వికృతాకారం బగు బిశాచం బయ్యె ని ట్ల
న్నోన్యశాపంబుల వికటాకారులై యవ్వనంబునం గ్రుమ్మరుచు
నాఁకటిపెల్లున కోర్వలేక యాక్రందనంబు సేయుచుండి రట్లు
గావున.

193


క.

తమ తమ కాలంబులతోఁ
దమకు శుభాశుభము లొందుఁ దప్పదు తలఁగం
దమనీడఁ గడవఁ బాఱఁగఁ
గమలభవాదులకు రాదు కర్మము పేర్మిన్.

194


వ.

ఇట్లు దిరుగుచున్న యక్కన్నియలం గనుంగొని చెలికత్తియలు
కనుకనిం బాఱి చెప్పిన వారి తల్లితండ్రులు భయభ్రాంతచిత్తులై
పఱతెంచి వికృతాకారలగు వారలఁ గనుంగొని శోకవ్యాకులిత
చిత్తులై [94]యంగలార్చుచు నిట్లనిరి.

195

ఉ.

అక్కట ముద్దుకూన లిటు నాడఁగ నేటికి వచ్చి రిచ్చఁ; దా
రెక్కడి బ్రహ్మచారి నిట నేటికిఁ గన్గొని; రా దురాత్మకుం
డక్కటికంబు మాలి యిటులాఱడి నేల శపించె వీరలం;
ద్రెక్కొని యిట్లు చేసితె విధీ యని యేడ్చుచు నార్తమూర్తులై.

196


క.

ఆ విప్రవరుని జనకుం
డై వెలసిన వేదనిధి నిజాత్మజు వెదకం
గా వచ్చి ఘనపిశాచం
బై వికృతాకారుఁడై న యాతనిఁ గనియెన్.

197


వ.

ఇట్లు కనుంగొని యాతని వెనువెంటన యాక్రందనంబులు
సేయుచుఁ జనుదెంచు పిశాచికలగు వారలంజూచి యడలుచున్న
గంధర్వదంపతులం గనుంగొని యిది యేమి మీర లెవ్వ రిందులకు
రాఁ గతంబేమి యని యడిగిన వార లిట్లనిరి.

198


క.

మా పిన్నపాప లిచటికి
శ్రీ పార్వతి నోమ వచ్చి చెచ్చెర నొకదు
ర్వ్యాపారి [95]వడుగుఁ బొడగని
రా పొడువఁడు వారిఁజూచి యదయాత్మకుఁడై.

199


వ.

అక్కన్నియలకుం బిశాచరూపంబులుగా శపియించిన వారలు
నవ్వటుకుమారునిం బిశాచంబ వగుమని శపియించి; రిట్లన్యోన్య
శాపంబులం జేసి వికృతాకారులై పొత్తుల కర్మంబు లనుభవించు
చున్న యక్కన్నియలకు జననీజనకులమని చెప్పిన నవ్విప్రుండు
నతండు తన తనయుఁ డని చెప్పి హాహాకారం బెసంగ నేడ్చి,
ధైర్యం బవలంబించి విధికృతం బనుభవింపకపోవదని నిశ్చ
యించి యుండె; నివ్విధంబున నతిక్రూరంబులగు నవస్థ లనుభ
వించుచుండఁ బెద్దకాలంబు సనుటయు నచ్చోటికిఁ దీర్థస్నానార్థియై
రోమశమహామునీంద్రుండు పౌష్యశుద్ధచతుర్దశియందు వచ్చిన
నవ్విప్రు భక్షించు తలంపున నప్పిశాచంబులు చనుదెంచి.

200

సీ.

రోమశముని మహోద్దామతేజంబున
         దందహ్యమానులై తల్లడిల్లి
యతనిముందట నిల్వ నసమర్థులై యటఁ
         దొలఁగి యంతంతన నిలిచి; రప్పు
డవ్వేదనిధి విప్రుఁ డల్లన సనుదెంచి
         యమ్మహామునికి సాష్టాంగ మెరఁగి
[96]మాభాగ్యవశమున మహనీయ! యిప్పు డీ
        తీర్థంబునకు నరుదెంచినాఁడ;


తే.

వనఘ! సజ్జనసంగమం బఖిలదోష
హరణమై పుణ్యసౌఖ్యంబు లందు నరున;
కట్లు గావున నేడు[97]నీయట్టి పుణ్య
పురుషుఁ బొడఁగంటి మంటి నే దురితరహిత!

201


వ.

అని ప్రియంబులు పలికి రోమశమహామునికిం దద్వృత్తాంతం
బంతయుం జెప్పి వీరు గంధర్వకన్యకలు. వాఁడు మదీయ
పుత్త్రుండు. వీరలకు నాశాపవిముక్తి యగు తెఱం గానతిమ్మని
గద్గదకంఠుండై [98]యడిగిన వేదనిధిం గరుణించి యమ్మునీం
ద్రుం డిట్లనియె.

202


క.

వెఱవఁగ నేటికి వీరిం
దఱుఁ గడువికృతంబులైన తమదోషములం
దొఱఁగి సుఖించెడు మార్గం
బెఱిఁగించెద నీకు నే నహీనగుణాఢ్యా!

203


వ.

అది యెట్లనిన నిద్దోషం బొండువిధంబునం బొలియనేరదు. వీర
లిందఱు నాతోడం జనుదెంచి మాఘస్నానంబు సేసిరేని వికృత
రూపంబు లణంగి దివ్యశరీరులై సుఖియింతు రని చెప్పి రోమ
శుండు మఱియు నిట్లనియె.

204

తే.

సప్తజన్మకృతాఘముల్ చటులవర్త
మానదురితంబు లెడఁబాయు మాఘతిథుల
యందు సుస్నాతుఁ డయ్యెనే నదియుఁ దీర్థ
ములను సేయంగఁ గల్గుట ముఖ్యఫలము.

205


శా.

ప్రాయశ్చిత్తములేని పాపములకుం బ్రవ్యక్తమై యుండఁగాఁ
బ్రాయశ్చిత్తము గల్గు[99]మాఘమున తీర్థస్నాన మెవ్వారికిం
జేయం గల్గినఁ జాలు మానవులకున్ శ్రేయస్కరంబై తుదిన్
శ్రీయుక్తంబగు నాకలోకసుఖముం జేకూరు నెల్లప్పుడున్.

206


వ.

మఱియును మాఘస్నానంబు హిమశైలోపరిభాగతీర్థంబులం
జేసిన నఖిలపాపహరణం బగుఁ[100]దత్తీర్థంబున నింద్రలోకప్రదం
బగు; బదరీవనతీర్థంబున సర్వకామఫలదంబై మోక్షంబిచ్చు; నర్మద
యందు దుఃఖహరంబై రుద్రలోకంబుఁ జెందించు; యమున
యందు సూర్యలోకంబు నిచ్చు; సరస్వతినదియందు బ్రహ్మ
లోకంబు నొసంగు;[101]విపాశయందు విశేషఫలం బొదవించు;
భాగీరథియందు విష్ణులోకంబు నొసంగు; పరయువును గండకి
యును సింధువును జంద్రభాగయును గౌశికయును దామ్ర
పర్ణియు గౌతమియు భీమరథియును దుంగభద్రయును గృష్ణ
వేణియును గావేరియు నను నివి మొదలుగాఁ గల తీర్థంబులను
సముద్రగాములగు నితరనదులను నాకలోకసౌఖ్యంబు నొందించు;
నైమిశారణ్యంబున విష్ణుసారూప్యంబుఁ జేయుఁ; బుష్కరంబున
బ్రహ్మసారూప్యంబు గలిగించుఁ; గురుక్షేత్రంబున దేవేంద్రాది[102]
లోకఫలంబుల నుత్పాదించు; దేవహ్రదంబున దేవత్వంబు నొం
దించుఁ; బ్రభాసంబున రుద్రగణత్వంబు నాపాదించు; హేమకూట
మహాకాలాహతామరనీలకంఠార్బుదతీర్థంబులందు రుద్రలోకంబు

సిద్ధించు; సర్వనదులందును నదీసంగమంబులను సర్వకామఫల
ప్రదం బగు. మఱియు సర్వనదులందుం బ్రయాగతీర్థంబు విశే
షంబు గావునఁ దత్ఫలంబు వివరించెద నెట్లనిన.

207


మ.

మకరార్కంబగు మాఘమాసమున[103]బ్రహ్మానందతీర్థంబునం
దొకకాలంబున మేను దోఁచిన యతం డుద్దామగర్భాలయ
ప్రకటక్లేశముఁ బొంద కచ్యుతసమీపం బొందునం చెల్లచో
నకలంకస్థితి సన్నుతింతురు ప్రయాగాఖ్యంబునన్ దేవతల్.

208


క.

కనుఁగొనరు నరక మెన్నఁడు
మనుజులు పుణ్యప్రయాగ మాఘస్నానం
బనయంబు మూఁడు దివసము
లొనరించినవారు ధాత్రి నుత్తమపురుషుల్.

209


తే.

[104]దానతీర్థవ్రతాధ్వరధర్మములును
మొగిఁ బ్రయాగాఖ్యసుస్నానమును విధాత
మొనసి తులఁబెట్టి తూఁచుచో ముల్లుచూపె
స్నాన మతిగురుత్వమున విశాలధర్మ!

210


సీ.

పవమానపానీయపత్రభోజనముల
        దేహంబు శోషిల్లు దినము దినము
యోగంబు సాధించుచున్నవారలు ప్రయా
        గస్నాతుఁ డరిగెడు గతికిఁ బోవ
రందు మాఘములోన నవగాహ మొనరించు
        నట్టి పావనుల గేహాంగణముల
[105]గంధమదామోదకలితషట్పదగాన
        సౌమ్యంబులై యొప్పు[106]సామజములు

తే.

[107]దురగములు నెల్లప్రొద్దును గరము [108]మిగులు
నశ్వమేధాదికృత్యంబు లాచరించి
సర్వగానంబులును జేయు సత్ఫలంబు
లపుడె సిద్ధించు నరులకు ననఘచరిత!

211


వ.

అని చెప్పి రోమశమహాముని యివ్విషయంబున నొక్కయితి
హాసంబు గల దాకర్ణింపుమని వేదనిధి కిట్లనియె.

212

వీరసేన భద్రకుల చరిత్రము :

సీ.

వసుమతిలోన నవంతీశ్వరుఁడు వీర
        సేనాఖ్యుఁడను రాజశేఖరుండు
గలఁ డట్టి రాజు నిష్కల్మషుఁడై భక్తి
        నర్మదాతటమునఁ బేర్మితోడ
సౌవర్ణమయయాగశాలలు గావించి
        భర్మనిర్మాణయూపములు నిలిపి
రాజసూయముఁ జేసి యోజతోఁ బదియాఱు
        హయమేధములఁ జేసి యశ్రమమునఁ


ఆ.

బర్వతోపమానబహుధాన్యరాసుల
ధేనువులను కనకదానములను
వెలయ వేలసంఖ్య విప్రోత్తముల కిచ్చె
సకలజనులుఁ దన్ను సంస్తుతింప.

213


ఆ.

దానపరుఁడు దేవతాభక్తుఁ డుత్తముఁ
డధికసదయహృదయుఁ డనఘమూర్తి
వర్ణధర్మనీతివర్తనల్ పెంపొంద
నవని యేలుచుండు నతిముదమున.

214

వ.

అయ్యవంతిదేశంబున భద్రకుండను నొక్కబ్రాహ్మణుండు నిజ
కులాచారంబులు విడిచి జననీజనకులం దొఱంగి యతికృపణుం
డును జంచలస్వభావుండును ధర్మదూరుండును దురాచారుండునై
తిరుగుచు నశనాభిలాషియై యొక్కనాఁడు తీర్థయాత్ర చనువార
లం గూడుకొని ప్రయాగకుం బోయి మాఘమాసంబున మూఁడు
దినంబు లవగాహనంబు చేసి యవగతపాపుండై సద్ద్విజత్వంబు
నొంది.

215


చ.

అతఁడుఁ బ్రయాగతీర్థ మటులాడి పురంబున కేగుదెంచెఁ ద
త్పతియగు వీరసేనుఁడును భద్రకుఁడున్ సమకాలమందు స
న్మతిమృతులై సమంచితవిమానము లెక్కి విభూషితాంగులై
యతులితరూపయౌవనబలాతిశయంబునఁ జూడఁ దుల్యులై.

216


వ.

మందారపుష్పమాలాలంకృతులును దివ్యభూషణభూషితులును
దివ్యాంబరధారులును దివ్యస్త్రీసహస్రపరివృతులునునై సురపతి
సమ్ముఖంబున నిరువురుం గొలిచియుండం జూచి వచ్చి తట్లు
గావున రాజసూయాశ్వమేధంబులును బ్రయాగస్నానంబును
సమంబులు.

217


ఆ.

అవని రాజసూయయాగంబు చేసిన
యతఁడు[109]నమరసౌఖ్య మనుభవించి
రాకపోకలేని లోకంబు నరుఁ డొందు
మహిఁ బ్రయాగ మాఘమజ్జనమున.

218


వ.

అట్లు గావునఁ బ్రయాగస్నానంబు చేసిరేని దన్మహత్త్వంబున
గంధరకన్యకలును నీపుత్త్రుండును పిశాచత్వంబు వలనం
బాయుదు రట్లగుటం జేసి బ్రహ్మతీర్థస్నానంబు సేయింపవలయు
నని చెప్పి రోమశుండు మఱియు నిట్లనియె.

219

సీ.

తెల్లమిగాఁ దొల్లి దేవద్యుతిఖ్యాతుఁ
        డగు బ్రాహ్మణుఁడు గలఁ డనఘమూర్తి
విష్ణుభక్తుఁడు సర్వవేదపారగుఁడు గృ
        పారసవారాశి చారుచరితుఁ
డొక్కనాఁ డొకచోట నొకపిశాచమునకు
        శాపమోక్షము సేసె సదయబుద్ధి
ననవుడు మునినాథ! యవ్విప్రుఁ డెవ్వఁ డె
        వ్వనిపుత్త్రుఁ డెట్టిచో నెవ్విధమున


తే.

నప్పిశాచంబుఁ గాచెను నవ్విధంబు
వినఁగ నాచిత్త మెంతయు వేడ్కఁ గదిరె
వెలయఁ దత్కథయంతయు విస్తరించి
సమ్మదంబున నా కానతిమ్ము నెమ్మి.

220


వ.

అనిన విని రోమశుండు సకలపుణ్యోదయంబగు నయ్యితిహాసంబు
చెప్పెద నాకర్ణింపుమని వేదనిధి కెఱింగించె ననినం దత్కథా
క్రమంబు వినవలతుం జెప్పవే యని యడుగుటయును.

221


ఉ.

భూరితర[110]ప్రభావ! గుణభూషణవైభవ! వజ్రహస్త! ది
క్పూరితకీర్తిలోల! సురభూరుహసన్నిభదానశీల! వి
ద్యారసికాంతరంగ! వినయాన్విత! సూనృతవాగ్విలాస! వి
స్తారవివేక! చిత్తభవసన్నిభ! సుందర! దైర్యమందిరా!

222


క.

సకలనృపనయవిశారద!
ప్రకటితదిక్చక్రవాళభాసురకీర్తీ!
సుకవిజనబంధుపోషణ!
మకరధ్వజసుభగరూప! మధురాలాపా!

223

మా.

క్షితిధరపతిధైర్యా! శ్వేతసత్కీర్తిధుర్యా!
వితరణగుణజాలా! విశ్రుతాచారలీలా!
పతిహితనయదక్షా! పద్మపత్రాయతాక్షా!
గతకలుష[111]నికారా! కందనామాత్యధీరా!

223


గద్య :

ఇది శ్రీ నృసింహవరప్రసాదలబ్ధకవితవిలాస భారద్వాజగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం
బైన పద్మపురాణోత్తరఖండంబునందు నింద్రుం డహల్యం బొం
దుటయు గౌతమశాపంబునం బదభ్రష్టుండై మాఘస్నానవిశేషం
బునఁ దనపదవిం బొందుటయుఁ బ్రయాగాది బహుతీర్థమహ
త్త్వంబును గంధర్వకన్యక లుత్సాహతీర్థంబున విప్రతనయునిం
గనుంగొని విరహాక్రాంత లగుటయు విప్రకుమార కన్యకాన్యోన్య
శాపకథనంబును పిశాచరూపంబులగు వారలు వేదనిధిం గనుం
గొనుటయు రోమశముని దర్శనంబును నతనివలన సకలతీర్థ
స్నాన[112]మహిమలు వినుటయు వీరసేనుచరితంబును భద్రక
చరితంబు నన్నది తృతీయాశ్వాసము.

224


  1. సంపూర్ణతర (మ-తి-హై)
  2. గుణశోభాకర (మ)
  3. క్రొవ్విదంబు (ము)
  4. వినుకల (తి-హై)
  5. (తి-హై)
  6. కందు విరిసిన (హై)
  7. యా (హై)
  8. జెరలాడి బ్రతికిపోవుట (తి-ము)
  9. జావవచ్చునే (ము)
  10. గాత్రస్పర్శనము (ము)
  11. లోబడు (హై)
  12. జూచి (ము)
  13. బడుగు నాలియింటి (హై), బడుగువాని యింటి (మ-తి)
  14. లాలోకింపుచుండ (హై)
  15. మే నింద్రుడ (తి), నే నింద్రుడ (హై)
  16. నిగుడఁగఁ గన్నుల (ము)
  17. బద్ది (హై)
  18. గలుషాగ్ర (ము-యతిభంగము)
  19. (మ-తి-హై)
  20. త్ముని (ము)
  21. నెచటి (హై)
  22. చుట్టుముట్టుకొనునే తన్నున్ (హై), చుట్టుముట్టుకొనియెను నన్నున్ (తి)
  23. జనిన న మ్మహాత్ముండు వారలం (ము)
  24. వెలియైన (హై)
  25. సతి, నరయగ పాపమున గదిసి యమ్మునిచేతం (హై)
  26. సరసిని యొదిగున్నవాడు శౌర్యరహితుడై (హై)
  27. నండ్రు (ము)
  28. శక్తియుక్తులు (తి-హై)
  29. బెడబాసె (తి-హై)
  30. దాన (తి-హై)
  31. ముద్రితపాఠమున యతిభంగము. నెనరు తి-హై పాఠము కాని యర్థము పొసగదు. ఇది నెనడు-మజ్జ యను మాట కావలెను. అప్పుడు యతితోపాటు అర్థమును సరిపడును. వ్రాత పొరపాటున నెనడుమాట నెనరుగా మారియుండును.
  32. నెత్తి గడవ బూని (తి-హై)
  33. కార్య (మ)
  34. రింతయు మౌనీంద్రుశాప మీదెడు విధమే (తి)
    కింతకుము న్నింద్రుపాప మెయిదెడు విధమే (మ)
    రింతకము న్నింద్రుశాప మెడలెడు విధమే (తి)
  35. మీ రావంతయు (తి)
  36. వాసవుకడకున్ (మ)
  37. చేయ దగనట్టి (తి)
  38. గడచునట్టి విధము గలదు వినుము (హై)
  39. వెరవు గంటి (తి)
  40. దిక్పాలకులును రంభోర్వశీమేనకాతిలోత్తమలును తను పరివేష్టించి కొలచిరా నమరావతికిం జని సహస్రాక్షుండు సింహాసనంబున శచీసమేతుండై యక్షయసుఖంబు లనుభవింపుచు రాజ్యంబు పాలించెనని ప్రయాగ మాఘస్నాన .... (హై)
  41. యితిహాసంబును, నలరగ (హై)
  42. మనుసంధించుక (ము)
  43. టీ (హై)
  44. టీ (హై)
  45. టీ (తి)
  46. టీ (తి)
  47. గజములెల్లను నమరేంద్రగజము లయ్యె (తి)
  48. రేయుబవలును నెడలేక వేయిగతుల (తి)
  49. చలిమో మెగయింపక (తి)
  50. నతివేడుక (తి-హై)
  51. బాము (తి-హై)
  52. గులె (ము)
  53. తెరువు (ము)
  54. రోయుచున్నది (ము)
  55. నీకు నిచ్చెద (మ-హై)
  56. ముడిచిన (ము)
  57. గతి (మ-తి-హై)
  58. సేయకు (తి)
  59. వేల్పులు గురియు పువ్వులవానల దడియుచు కాంచనమాలిని (హై)
  60. మాఘమాహాత్మ్యం బని (ము)
  61. జన్మాంతరాఘముల్ సమయజేసి (హై)
  62. వారల చరిత్రంబు పలుక నశక్యంబు మరియు దొల్లి (హై)
  63. శంఖపద్మముల నక్షయముఖ్యనిధానయుక్తమై (తి-హై)
  64. సుప్రభాత్మజ (తి-హై)
  65. యంగములను దాల్చి యమరినట్లు (హై)
  66. హేమఛాయ (హై)
  67. సారము (ము)
  68. మహాపారంబు (తి-హై)
  69. యలసి, తలచుట్లు విడిచి పావడలు గట్టి (హై)
  70. మేళగింపుచున్ (మ)
  71. విభు డటంచు నలినదళాక్షులు, నేవురును (హై)
  72. ఏపుల (ము)
  73. పాపంబున నేయ (ము)
  74. రగ్గలించిరేని (మ-తి)
  75. లిట్లునన్ (ము)
  76. వెడలి/తగిలి (మ)
  77. లుడిగి (ము)
  78. రేగిన (ము)
  79. బద్ధులై (ము)
  80. దందడి(మ-తి)
  81. బోయెడి మాయచోటు (హై)
  82. బొగిలి (హై)
  83. లేడిదండమును (ము)
  84. తేక నారునే (హై)
  85. బినుమడించిన (మ-హై)
  86. నాచరమూర్తులు (హై), నాస ద్రిమూర్తులు (తి)
  87. యుండు నవసరంబున (తి-హై)
  88. వచ్చి (తి-హై)
  89. మాడిచని (తి-హై)
  90. యలుకలు (ము-యతిభంగము)
  91. నల్గిపట్టి (ము)
  92. ధర్మముగ నర్థకామము (హై)
  93. మమ్ము (మ-తి-హై)
  94. యిట్లనిరి (ము)
  95. నిచట బొడగని, రావడుగయు (తి), రాపొడువయు (హై)
  96. భాగ్యవశమ్మున మహనీయ యిప్పు డీ (ము-యతిభంగము)
  97. మీ (తి-హై)
  98. హస్తంబులు మోడ్చియున్న (హై)
  99. మాఘమను (ము)
  100. నచ్చోటితీర్థంబున (మ-హై)
  101. కాశియందు (ము)
  102. లోకంబుల (ము)
  103. బ్రహ్మంబైన (ము)
  104. తే. దానతీర్థవ్రతాధ్వరధర్మములను
    మొగి బ్రయాగతో దూచెను మును విధాత
    దాని సరిపోల్పరాకున్న ధరణిలోన
    నిదియ మోక్షంబు నరులకు నెల్ల యనుచు.

    వ. మరియు బ్రయాగకు సమంబు క్షేత్రంబు లేదనిన (హై)
  105. గండ (తి)
  106. సామజముల (ము)
  107. తురగముల (ము)
  108. మిగుల (ము)
  109. మరలు (ము)
  110. ప్రతాప (తి-హై)
  111. విహారా (తి), వికారా (తి)
  112. ఫలవిశేషంబులు (మ-తి-హై)