పదబంధ పారిజాతము/డొంకతిరుగుడు
డేగపదనుగ
- అరకొరగా; మితముగా.
- "డేగపదనుగ భోజనము సేసి." సారం. 1. 78.
డేగాట
- పెండ్లిలో అయిదవనాడు వధూవరులను ఎత్తుకొని ఆడే ఆట.
- "జంపతుల కైన డేగాట సమయమందు." బుద్ధ. 3. 102.
డేరా ఎత్తివేయు
- ఆ యూరినుండి వలసపోవు.
- "వా డెప్పుడో యీ ఊరినుండి డేరా యెత్తేశాడు." వా.
- చూ. గుడార మెత్తివేయు.
డొంకతిరుగుడు
- సూటిగా చెప్పక అటూ యిటూ తిప్పి తిప్పి మాట్లాడు పట్లా, సూటికాని దారీ మొదలగువాని పట్లా విశేషంగా ఉపయోగిస్తారు.
- "వాడు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం ఛస్తే చెప్పడు. ఆ డొంక తిరుగుడు మాటల్లో వా డేం చెప్తున్నాడో కూడా తెలియదు." వా.
- "గుంతకల్లునుంచి బొంబాయి మెయిలెక్కి నేరుగా మదరాసు చేరక పాకాలమీద ఎందుకు పోవడం? డొంక తిరుగుడు దారిలో చేరడానికి మూడు నాళ్లు పట్టుతుంది." వా.
డొంకలు దూరు
- అల్పకార్యములకు పూను. జగన్నా. 17.
డొంగియాడు
- దోగాడు. సారం. 1. 49.
డొంగులువాఱు
- తొఱ్ఱ లేర్పడు.
డొకారము చొచ్చు
- శరణు చొచ్చు.
- "కరుణను బ్రోవ మం చని డొకారము సొచ్చెను నాఁగ." పార్వ. 5. 207.
- "గరగరి మాని యొక్కట డొకారము సొచ్చు మహాద్రులో యనన్." చంద్రా. 1. 13.
- వావిళ్ల ని. లో లోపల ప్రకాశించు అనే అర్థ మొకటి యిచ్చి ఇందలి తొలి ప్రయోగ మిచ్చారు. శరణు సొచ్చు అనుటే సరి.
డొక్క చీల్చి డోలు కట్టు
- తిట్టు. కొట్లాటల్లో ఉపయోగించే మాట.
- "నీ వీ వీధిలో ఇంకోసారి కనబడ్డా వంటే డొక్క చీల్చి డోలు కడతాను జాగ్రత్త వెధవా!" వా. డొక్క జేనెడు గాదే
- కడుపు చిన్నది కాదు కదా! అనుట.
- ఇంత కడుపు పెట్టుకొని ఊరక కూర్చున్న ఎట్లు అనసందర్భములోని పలుకుబడి.
- కడుపు చిన్న దే కదా - ఇందు కోసం ఇన్ని పాపాలా? అనీ అవుతుంది.
- "అకటా!, బగ్గున మండెడు నీకును, ని గ్గించుక లేదు డొక్క జేసెడు గాదే!" శుక. 3. 277.
డొక్కబుఱ్ఱ
- తేగ పాఱి వీడిన తాటివిత్తు. శ. ర.
డొక్కలో పెట్టుకొను
- చూ. కడుపులో పెట్టుకొను.
డొక్కలో మెదలు
- మరచిపోని దురుసుమాటలు అనినప్పుడు అవి మరచిపో లేకున్నాను అనుపట్ల ఉపయోగించే మాట.
- "వా డా రోజు అన్న మాటలు డొక్క లో మెదులుతున్నాయి. చచ్చినా మరిచిపోలేను." వా.
డొక్కశుద్ధి ఉన్న....
- చదువుకొన్న...
- "వాడు కాస్త డొక్కశుద్ధి ఉన్న వాడు. ఏం చెప్పినా గ్రహిస్తాడు." వా.
డొక్కుపడు
- సంకోచము కలుగు. కొత్త. 438.
డొల్ల నడుచు
- చంపు. భార. విరా. 3. 204.
డొల్లపొట్ట
- బొఱ్ఱకడుపు.
డొల్లి డొల్లి
- దొర్లుకుంటూ దొర్లుకుంటూ.
- "నీ విప్పుడ పొమ్ము, వడి డొల్లి డొల్లి శ్రీ వారణాసికిని." పండితా. ప్రథ. దీక్షా. పు. 113.
డొల్లుపుచ్చకాయ
- అస్థిరుడు.
- "వాడు ఒట్టి డొల్లు పుచ్చకాయ. ఎక్కడా నాలుగురోజులు ఉండడు." వా.
డొల్లుపుఱ్ఱెలు
- లొత్త తలలు, లోన ఏమీ లేనివి. ఆము. 6. 17.
డొల్లుపోగులు
- బోలుగా ఉన్న పోగులు.
డోకు వచ్చు
- అసహ్యము కలుగు.
- "వానిరూపం చూస్తే డోకు వస్తుంది." వా. అసహ్యదృశ్యం చూస్తే వాంతి వచ్చుటపై వచ్చిన పలుకుబడి.
డోగాడు
- దోగాడు.
డోగి యాడు
- దోగాడు.
డోలు కట్టు
- అపహాస్యము చేయు.
ఢంకామీద దెబ్బ కొట్టి
- బాహాటంగా, గట్టిగా.
- "వాడికి ఒక అక్షరం రా దని ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పగలను." వా.
ఢకాఢకి
- ధ్వన్యనుకరణము.
ఢకీలు ఢకీలున
- ధ్వన్యనుకరణము.
ఢక్కా మొక్కీలు తిను
- జీవితంలో కష్టనష్టాలను అనుభవించు - ఎగుడు దిగుళ్ళను చూచు.
- "వాడు ఎంతయినా ఢక్కా మొక్కీలు తిన్నవాడు. కాస్త వస్తే కళ్లు తిరిగి పోవడం, కాస్త పోతే దిగులుపడడం అసంభవం." వా.
ఢిమఢిమ
- ప్రేలుటలో ధ్వన్యనుకరణము. కృష్ణ. 3. 29.
ఢిల్లికి ఢిల్లి, పల్లికి పల్లి
- పెద్దది పెద్దదే, చిన్నది చిన్నదే. కాని దేనిలో అందం దానికి ఉండనే ఉంటుంది. దేని కదే అనుట.
- "ఢిల్లికి ఢిల్లే పల్లికి, పల్లే యని చెప్పునట్టి పలుకులు వినరే." శ్రీనివా. 1. 57.
- ఢిల్లి మహానగరం, పల్లె చిన్నగ్రామం.
ఢోకా లేదు
- లోటు లేదు.
- "ఆ పొలం పండుతున్న దాకా వాడి కేం ఢోకా లేదు." వా.