పదబంధ పారిజాతము/జాడించి తన్ను
జాడపడు
- ఎక్కువగా ఉన్నవి తక్కు వై పోవు, విరళ మగు.
- రూ. జాడలు పడు.
జాడించి తన్ను
- కాలుతో తీసి తన్ను.
జాడించి పలుకు
- గట్టిగా తిట్టు.
- "సామాన్య యోగుల జాడించి పలుక." ప్రభు. 3. 86.
జాడు పేడు
- తృణప్రాయం, దిగదుడుపు ప్రాయం, తాడుతోను చెక్కపేడుతోను సమాన మనుట.
- "....ధీజనస్తుత వచోవిభవంబు నశేష చక్రివా, దోడన సాటిగా నతనితోఁ బెఱమంత్రులు జాడు బే డనన్." శృం. శాకుం. 1. 6.
జాతకర్మ
- పుట్టినబిడ్డకు చేయు సంస్కారము.
జాతాశౌచం
- పురుడు.
- చూ. మృతాశౌచం.
జాతి...
- ఉత్తమ మైన, శ్రేష్ఠ మైన. మంచి జాతికి చెందిన అన్న అర్థంతో ఆరంభ మై, ఉత్తమ మైన అన్న విశేషణంగా నిలిచిన మాట.
- జాతివార్తా చమత్కారములు, జాతికుక్క, జాతిసరుకు, జాతి ముత్యాలు ఇత్యాదులు.
- చూ. జాతిగా.
జాతిగా
- అందముగా.
- "జాతిగాఁ దాల్చి నెఱ మిండజంగ మగుచు." హర. 5. 41.
- చూ. జాతి...
జాతినాగు
- మంచిజాతి సర్పము.
- "జాతినాగులఁ జంపుచుండి, ప్రతిమ నాగులకును బాల్వోసినట్టు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 202.
- బ్రతికి ఉన్న నాగులను వదలి, ఱాతి నాగులకు పాలు పోసినట్లు - వ్యర్థము.
జాతివార్తలు
- జాతీయములు.
- "జాతివార్తలు దొలఁక రసంబు గులుకఁ, గవిత రచియించుఁ గల్పించి కతలు నుడువు." శుక. 2. 14.
జాదరలు
- పెండ్లిండ్లలో తొలుత కుల పాలికాపూజ చేసి మూకుళ్లలో మొలక పోస్తారు. ఆ మొలకలు.
- "ఈశు నుద్వాహమున కమరేంద్ర దిగ్వి, లాసవతి పైఁడిపాళియఁ బోసి తెచ్చు, జాదరలొ నాఁగ రాగపూర్ణోదయేందు, బింబమునఁ బాండుకిరణాంకురంబు లెసఁగె." కుమా. 8. 112. జాదరాడు
- గందవొడి చల్లుకుంటూ క్రీడించు.
జాదుకొను
- పరవశ మగు, భావాతిరేకముచే నుద్రిక్త మగు.
- "సకలాంగకంబులు జాదుకోఁ బులకించి." నైష. 5. 9.
- "అర్థి యనుపేరు చెవి సోఁకినంత మాత్ర, జాదుకోఁ బులకించె నజ్జన విభుండు." నైష. 3. 48.
జాదులు ప్రసాదము నగు
- తనకు సహజంగానే యిష్టమయినది దైవప్రసాదము కూడా అయిన దనుట.
- "సంతస మంది జాదులు ప్రసాదము నయ్యె నటంచుఁ బొంగి నా,గాంతకుఁ డంబుజోదర.." పారి. 2. 75.
- "అనూన మైనచ,క్కందనమున్ సువర్తనముఁ గల్గినఁ బెన్మిటి కేమి చెప్ప ? నా, చందనగంధి జాదులు ప్రసాదము గాదె చకోరలోచనా!" కళా. 7. 95.
- చూ. జాజులు...
జాదులు వేచు
- అననురూప కార్యమున కగ్గము చేయు, సుకుమార మైనవానిని కఠినంగా శిక్షించు.
- "సరవి యెఱుంగ లే కకట జాదులు వేఁచెను మంగలంబునన్." శృం. శాకుం. 2. 62.
జానకిత్రాడు
- 1. నిప్పు ముట్టించే తాడు.
- 2. కర్ణాటకపు తుపాకుల చెవియం దుండే నిప్పు ముట్టించే త్రాడు.
- బాణసంచా కాల్చేందుకూ ఉపయోగిస్తారు.
జా నగు
- అంద మగు; తేట యగు.
- "పల్కుననబోఁడి జా నగుపల్కు లిడుచు." అచ్చ. రా. బాల. 6.
జా నఱు
- విచక్షణాజ్ఞానం కోల్పోవు.
- "జానఱి పశుపతి నుఱక వి, దానమహారంభుఁ డైనదక్షుం డనున,జ్ఞానికి." కుమా. 2. 15.
జానుగా
- తేటగా.
జానుతెనుగు
- తేట తెనుగు. మంచి తెనుగు.
- "సరళము గాఁగ భావములు జాను తెనుంగున నింపుపెంపుతో..." కుమా. 1. 35.
- "ఉరుతర గద్య పద్యోక్తుల కంటె, సరస మై పరఁగినజాను తెనుంగు, చర్చింపఁగా సర్వసామాన్య మగుట...." బస. 1.
జానుపడు
- తేట తెల్ల మగు. భార. ఆర. 2. 214.
జానువాఱు
- చూ. జానుపడు. జాపత్తిరి
- జాతిపత్త్రి.
జా పరమేశ్వరా అను
- పాఱిపోవు.
- జానపదకథలలో ఎవ రైనా పోవునప్పుడు 'జా పరమేశ్వరా' అనడం వినవస్తుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
- "జా పరమేశ్వరా యనిన జంతువులన్నియుఁ బోయె మాయ మై." వరా. 1. 148.
జాబు జవాబు
- ఉత్తరాలు. జం.
జాము వేగు
- బ్రతుకు గడచు.
- "చట్టు కూఁతురు గలుగ నీ జాము వేఁగె." నిరంకు. 3. 30.
- వాడుకలో -
- "అలాంటి భార్య ఉండబట్టి నీవు గడుపుకొస్తున్నావు గానీ లేకపోతే యీపాటికి ఏమై పోయేవాడివో?" వా.
జారీచెంబు
- ప్రయాణాదులలో ఉపయోగించే ఒకవిధ మైన చెంబు.
జాఱ విడుచు
- విడిచి వేయు.
- "సత్కలాపంబులు జాఱ విడిచె." శివ. 2. 102.
జాఱిపోవు
- పోవు, చ్యుత మగు.
జాఱుకొప్పు
- కొనముడి.
జాఱుపైట
- జాఱుచుండునట్టు వేసుకొను పైట.
జాఱుముడి
- దువ్వుముడి.
జాఱువాఱు
- చ్యుత మగు, తొలగు.
జాఱువోవు
- తొలగు.
జాలకఱ్ఱ
- నల్లఱాతియందు బెజ్జము లేర్పఱచిన కిటికీ. శ. ర.
- వెలుతురు ప్రసరించుటకు రాతిలో చేసిన బెజ్జము. బ్రౌన్.
- నిలువుగా కఱ్ఱను నాటిన కిటికీ. వావిళ్ల ని.
జాలవల్లిక
- తాంబూలం తట్ట - అందుపై నగిషీ చేసి ఉంటారు.
జాలవాడు
- ఈటెకాడు. బ్రౌన్.
జాలిక లేకనే బంగర మాడు
- అతి సాహసి, నేర్పరి, జాణ అని నిరసనగా అనుటలో -
- "అదా అమ్మా ! జాలిక లేకనే బంగర మాడుతుంది." వా.
జాలిగుండె
- దయాళువు.
జాలి గుడుచు
- దు:ఖపడు.
జాలిగొను
- విచారపడు, భయపడు.
జాలిపడు
- దు:ఖపడు, కష్టపడు. ఇందుకు దగ్గఱి భావచ్ఛాయలలో... నేటి వాడుకలో కృప సూపు అన్నట్లు వినవస్తుంది.
- "వాణ్ణి జాలి దలచినవాడు పాపాత్ముడు." వా.
జాలిపెట్టు
- 1. బాధించు. భీమ. 4. 112.
- 2. సొదపెట్టు.
- "పెక్కుమాటల నిఁక జాలిపెట్ట నేల?" కాశీ. 2. 88.
జాలి పొందు
- భయభ్రాంత మగు.
- "గోలాంగూలకులంబు లాకులపడెన్ ఘోషించె శార్దూలముల్, జాలిం బొందె లులాయముల్/" హర. 6. 46.
జాలి మాలి
- కోరిక బల మై ఉఱ్ఱట లూగుట. దీనినే వాడుకలో ఆలీ జాలీ యెత్తు, ఆలీ జాలీ పడుతున్నాడు అంటారు.
- "మనసిజవేదనల జాలి మాలి తిరుగఁ గాన్." హంస. 4. 45.
- "ము,వ్వంపుల కైదువుం దిగిచి వంపుచు దావుల యంపసోన వ,ర్షింపుచు జాలి మాలి గొనఁ జేసె మరుం డమరీకదంబమున్." కవిరా. 3. 45.
జాలి వొందు
- జాలిపడు.
- "అని జాలి వొంది రయముతో వచ్చు, జనకజాభర్త...!" వర. రా. అర. పు. 210. పంక్తి. 3.
జాలుకొను
- 1. ప్రవహించు, స్రవించు.
- 2. వర్ధిల్లు.
- 3. ప్రసరించు.
జాలువాఱు
- చూ. జాలుకొను.
జా లెత్తు
- స్రవించు.
- "జల జల జా లెత్తెఁ జంద్రకాంతములు." వర. రా. సుం. పు. 18. పంక్తి. 12.
- "జా లెత్తె నౌర! ...లోచనాంచలమ చెలమ." విజయ. 3. 11.
జాలెత్రాడు
- ఒక జెట్టి సాధనం
జావ కారి పోవు
- భయపడి పోవు, నిర్వీర్యుడగు.
- "కాస్త గట్టిగా అదిలించా మంటే వీడు జావ కారి పోతాడు." వా.
- చూ. జా వయి పోవు.
జావయి పోవు
- భయపడి పోవు, నిర్వీర్యు డగు.
- "ఆవిడముందు నిలబడినా డంటే వీడు జావయి పోతాడు." వా.
జిగటరకం
- పట్టుకుంటే వదలనివాడు అనుట.
- "వాడిది ఒట్టి జిగటరకం. తగులుకుంటే ఇంక అంతే. కాళ్లు చీములు పట్టవలసిందే." వా.
జిగిదేఱు
- కాంతి తేలు.
జిగురుకండె
- చూ. జిగురు చుట్టిన కండె.
- రూ. జిగురుగడ.
జిగురు చుట్టినకండె
- వేటలో పక్షులను పట్టుకొనుటకు ఉపయోగించునది, వదలనిది. తాళ్ల. సం. 12. 75.
- చూ. జిగురున పడ్డ...
జిగురున పడ్డ రాచిలుక
- చిక్కున పడినది.
- పక్షులను పట్టుకొనుటకై ఒక శివవంటి దానిపై ఒక చిన్న పలక నమర్చి దాని మీద వజ్రంవంటి జిగురును అతికిస్తారు. దాన్ని ఏ చెట్టు మీదనో పెట్టినప్పుడు చిలుక వాలడం, దాని కాళ్లు కరుచుకొని పోయి వేట కానికి చిక్కడం జరుగుతుంది. లక్షణయా వదిలించుకొని పోవ వీలులేని పరిస్థితిలో పడిన అనుట.
- "జిగురునఁ బడ్డరాచిలుకచెల్వున." కా. మా. 4. 29.
జిగురు వైచు
- వల వైచు వంటిది.
- పూర్వం వేటకాండ్రు కొన్ని పక్షులను పట్టుకొనుటకై పలకలపై జిగురు పూసి చెట్లపై పెట్టేవారు. పక్షులు వాలి చిక్కుకొని వాళ్లకు చిక్కేవి. అందుపై వచ్చిన పలుకుబడి. నేడు కూడా ఈగలకై జిగురుకాగితాలు పెట్టుట అలవాటు.
జిడ్డుకొను
- జిడ్డు తేలు. పాండు. 4. 253.
జిడ్డుపడు
- వ్యర్థ మగు.
జిడ్డుపఱుచు
- వ్యర్థ పఱుచు, కలత పెట్టు.
- "నీ పడ్డపాటు వృథగా జిడ్డు ఱేపం గలవారమె." హర. 2. 132.
జితపడు
- అనుకూలపడు. జితపాటు
- అలవాటు.
జిత్తులమారి
- ఉపాయశాలి, మాయోపా యజ్ఞుడు.
జిత్తులవాడు
- చూ. జిత్తులమారి.
జిద్దుగొను
- ఎదుర్కొను. రంగా. 2. 40.
జిమ్మ దిరుగు
- దిమ్మ తిరుగు.
- "....జిమ్మ దిరిగి దశ శిరుండు." భాస్క. అర. 2. 135.
జిమ్మ పడ!
- ఒక తిట్టు. వాడుకలో జిమ్మడ! అనీ వినవస్తుంది.
జిరాయితీ హక్కు
- సేద్యం చేసుకునే హక్కు.<.big>
జిఱకొట్టు
- గిరికీలు కొట్టు.
- ధ్వన్యనుకరణము.
- "చెరలాడు జిఱకొట్టుఁ జెలఁగి పేరెంబు, దిరుగుఁ బర్విడు."
- గౌ. హరి. ప్రథ. పంక్తి. 605-06.
- గౌ. హరి. పూ. 699. పం.
జిఱ్ఱ జిఱ్ఱ
- ధ్వన్యనుకరణము.
జిఱ్ఱత్రాడు
- పురి పెట్టిన తాడు.
జిఱ్ఱ దిరుగు
- గిరగిర తిరుగు.
- "చక్ర భ్రమణంబునఁ జిఱ్ఱ దిరిగి." నైష. 3. 151.
జిఱ్ఱన తిరుగు
- గిర్రున తిరుగు.
- ధ్వన్యనుకరణము.
- "రజత ధరణీధర మ,చ్చెరువుగఁ జిఱ్ఱనఁ దిరిగెన్, బురహరుతోఁ గూడ వెండి బొమ్మరముక్రియన్." కుమా. 6. 155.
- "నెగడు మందరగిరి నిలు వెంత కడు భోగి, దీర్చిన జిఱ్ఱనఁ దిరిగె నట్టె." కుమా. 3. 5.
జిఱ్ఱవోవు
- జిఱ్ఱు మని చెవులు దిమ్ముపడు. శృం. శాకుం. 3. 115.
జిఱ్ఱున చీదు
- ధ్వన్యనుకరణము.
- "కడుఁ గపాలము దాఁకి కలగంగఁ జక్కఁగాఁ, జే సాఁచి జిఱ్ఱునఁ జీఁది చీఁది." కా. మా. 2. 148.
జిఱ్ఱున దిగుచు<.big>
- చరాలున లాగు.
- ధ్వన్యనుకరణము.
- "తూణికాబాణము జిఱ్ఱునం దిగిచి." కా. మా. 3. 115.
జిలకఱరాజనాలు
- సన్నని ధాన్యవిశేషం. జిలజిల మను
- 1. చెమ్మగిలుటలో ధ్వన్యనుకరణము.
- "జిలజిల మంచుఁ జెమ్మగిల." రాధి. 3. 110.
- 2. వ్యాపించుటలో ధ్వన్యనుకరణము.
- "జిలజిలన వడిసె వెన్నెల, జిలజిల దిక్కులకు నొడిసెఁ జీఁకటు లెడసెన్." రంగా. 3. 187.
జిలమబుడతలు
- ధాన్యవిశేషం.
జిలితొగల రాజనములు
- ధాన్యవిశేషము.
జిలిబిలి
- 1. మనోహర మయిన.
- "తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో, జిలిబిలిపాట ముద్దులు నటింప." మను. 2. 27.
- 2. ఒక నగ.
- 3. ఇంపైన, ముద్దు ముద్దయిన.
- 4. అంద మైన.
- 5. చిన్న దైన.
జిలిబిలి చీర
- చిన్న చిన్న గళ్ళున్న సన్నని పట్టుచీర. శ. ర.
జిలిబిలి వోవు
- 1. ఒప్పు.
- 2. తొట్రుపడు. నైష. 7. 103.
- 3. ఎక్కు వగు. విక్ర. 4. 224.
జిలుగక్షరాలు
- గొలుసుకట్టు వ్రాత.
- "ఆ పత్రంలోని జిలుగక్షరా లీకాలం వాళ్లు ఎవ్వరూ చదవ లేరు." వా.
జిలుగువన్నెలు
- వస్త్రవిశేషం. యయా. 4. 122.
జిలుగువ్రాత
- గొలుసురాత.
- చూ. గొలుసురాత.
జిలుబారు
- అంద మయిన.
- "చెలికత్తె జిలుబారు పలుకుఁ జిలుక." నైష. 1. 5.
జిల్లేడుకాయలు
- ఒక పిండివంట పేరు.
జివ్వంకలు వంగు
- జివ్వున జివ్వున ఆడుతూ వంగిపోవు.
- "నెవ్వలి సన్నుల వ్రేఁగున, జివ్వంకలు వంగఁ గౌను." కుమా. 9. 113.
జివ్వాడు
- జివ్వు జివ్వు మని కదలు.
జిహ్వ ఆడక
- నాలుక ఆడక, మాట రాక.
- "యెవ్వతె నంచును జిహ్వయాడ కంత్యంతముఁ దొట్రిలం బలికె." కళా. 6. 131. జిహ్వ చచ్చు
- అరుచి యేర్పడు.
- "ఆ మధ్య జబ్బు పడ్డాక జిహ్వ చచ్చి పోయింది." వా.
జిహ్వ త్రుప్పు డుల్లు
- నాలుక త్రుప్పు వదలు. ఇది నేటికీ వాడుకలో 'నాలుక త్రుప్పు వదలు' అన్న రూపంలో ఉంది.
- ఏ దయినా ఉపయోగించ నప్పుడు తుప్పు పట్టుతుంది. దానిని బాగా ఉపయోగిస్తే ఆ తుప్పు తొలగి పోతుంది. కత్తులు ఇత్యాదులలో ఇది సుప్రసిద్ధం. అందుపై యేర్పడిన పలుకుబడి.
- "అప్ప టప్పటికిని జిహ్వ త్రుప్పు డుల్ల, నామెత లెఱింగె నీతుషారాద్రికతన." మను. 2. 11.
జీడి నిఱ్ఱి అచ్చొత్తు
- జీడితో - ఓడిపోయినా డని తెలుపుటకై - జింక బొమ్మను ముద్రించు.
- "ఉరముపై జీడి నిఱ్ఱి యచ్చొత్తి విడిచె." కుమా.
జీతకాడు
- సేవకుడు.
జీతగాడు
- చూ. జీతకాడు.
జీతనాతములు
- జీతము బత్తెము. జం.
- "....బుధుల్, చెప్పిన కార్య పద్ధతులు చేయుట గొల్చిన పేదసాదలన్, జప్పున జీతనాతము లొసంగుట భూషణమయ్య పుత్రకా!" రాజనా. 2. 34.
జీతపురాళ్లు
- జీతంగా వచ్చే రూపాయలు. రూపాయలను రాళ్ల నడం మరి కొన్నిటా కనబడుతుంది. మాటా. 79.
జీతము పెట్టని బంటు
- జీత మివ్వకనే వచ్చినా సేవకునిలా చేసేవాడు.
- "బడలి జీతము పెట్టని బంట నగుచు, వెఱచి నా కేల నీ వెనువెంటఁ దిరుగ." హరి. 4. 35.
జీతము సేయు
- జీత మిచ్చు.
- "భావజవిభుఁ డలి శుకపిక, సేవకతతి కెడరు దీర జీతము సేయం,గా వెలిఁబోసిన పసిఁడుల, ప్రోవులు నాఁ దమ్ము లెలమిఁ బూచె." కుమా. 4. 92.
జీనపటము
- దట్టీ.
జీనిగిరివాడు
- కర్ర బొమ్మలూ అవీ చేసి రంగులు వేయువాడు.
- చర్మకారు డని... బ్రౌన్, ముచ్చివా డని... శ. ర. వాడుకలో అలా వినరాదు. జీనిసరిపెణ
- ఒకరక మైన మెడలోని గొలుసు.
జీనిసరులు
- ధాన్యవిశేషం.
జీనువముక్కులు
- ధాన్యవిశేషం.
జీబుకొను
- దట్ట మగు.
జీరగుండులు
- మేల్కట్టున వ్రేలునట్లు కట్టే రసగుండ్లు.
జీరాడు
- వ్రేలాడు.
జీరుకాడు
- చూ. జీరాడు.
జీరుకుపాటు
- తొట్రుపాటు.
జీరుకురాయి
- జీరుకుబండ.
జీరులాడు
- చూ. జీరాడు.
జీరువాఱు
- జీరాడు.
జీఱుకువాఱు
- జీఱు.
జీలుగు పెరిగిన మాలెకు కంబము గాదు
- బలహీన మైనది ఒక పెద్దరక బలమైనపనికి పనికి రాదు. జీలుగు వట్టి బెండు. అది యెంతగా పెరిగినా యింటికి పెట్టుకొనుటకు స్తంభముగా పనికి రాదు.
- "ప్రేలకు జీలుగు వెరిగిన, మాలెకుఁ గంబంబు గాదు." ఉ. హరి. 3. 50.
- "జీలువు పెరిగిన మాలెకంబము గాదు, గొడ్డుఁ బెంచిన జాతిగోవు కాదు." నీతి. 70.
జీవగఱ్ఱ
- 1. ప్రాణాధారము.
- "వలిమల యల్లువాఁడు తలవాఁక ధరించిన పూవుగుత్తి వే,ల్పుల గమి జీవగఱ్ఱ." పారి. 1. 6.
- "శ్రేయోవధూటికి జీవగఱ్ఱ." విప్ర.1. 84.
- 2. శ్రుతిని హెచ్చించుటకో తగ్గించుటకో ఉపయోగించే వీణెపై నున్న కఱ్ఱబిరడా.
- "శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ, జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ." క్రీడా. 1. 36.
జీవచ్ఛవముగా
- బ్రతికి చచ్చినవానితో సమానముగా.
జీవనము పడగొట్టు
- బ్రతుకుతెరువు చెడగొట్టు.
- "నా జీవనం పడగొట్టితే నీ కేం వస్తుంది?" వా. జీవనాధారము
- బ్రదుకుదెరువు, జీవనోపాయము.
జీవన్ముక్తుడు
- బ్రతికి యుండగనే ముక్తిని చెందినవాడు.
జీవన్మృతుడు
- బ్రతికిఉన్నా చచ్చినవాని వంటి వాడు.
జీవమాతృక
- సప్తమాతృకలలో ఒకతె.
జీవము వచ్చు
- ప్రాణము లేచి వచ్చు.
- "సమ్మతిఁ బ్రోవ నిందు, వచ్చితి గాన జీవము వచ్చె నాకు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 2835-36.
జీవశ్రాద్ధము
- ఘటశ్రాద్ధము. కాళ. శత. 34.
జీవితము ఏమిగా చేసి పోయెదవు?
- నా బ్రదుకు ఏం చేస్తావు? ఎవరినో పూర్తిగా నమ్మినపుడు అతడు దిగనాడగా అనుమాట.
- "నా జీవితంబు, నేమిగాఁ జేసి పోయెద వెఱుఁగఁ జెపుమ." కళా. 3. 59.
జీవితములు సేయు
- పని కల్పించు, జీతమునకు పెట్టుకొని వారికి జీవనం ఏర్పఱచు.
- "తాఁ గాక మఱియు మేదరులు గొందఱకు, జీవితంబులు సేసి చేటలు సాలఁ, గావించి బండ్లను గడపి యూరూర, నమ్మించి." పండితా. ప్రథ. పురా. పు. 476.
జీవితములో నిప్పులు పోయు
- బ్రతుకు పాడు చేయు.
- "ఏమీ ఎరగని ఆ పిల్లను చెఱచి దాని జీవితంలో నిప్పులు పోశాడు వెధవ." వా.
జుంజుఱుకట్ట
- వెలుతురుపుల్లలు వగైరాతో చేసిన దివిటీ. శ. ర.
జుంజుఱుపిశాచము
- కొఱవిదయ్యము. చంద్రా. 6. 98.
జుంటితేనె
- జుంటీగలు కూర్చిన తేనె.
జుంటిమోవి
- జుంటి తేనెవంటి మధుర మైన ఓష్ఠం.
జుంటీగ
- తేనెటీగ.
జుజురుకొను
- దట్ట మగు.
- "జుజురుకొన్న తనూరుహస్తోమములను." కాశీ. 6. 41.
జుట్టనవ్రేల జూపు
- వేలెత్తి చూపు. తప్పు పట్టు.
- "నరునకు నిన్ను జుట్టనవ్రేలనుం జూపవచ్చునే." భార. ద్రోణ. 2. 304.