పదబంధ పారిజాతము/చుట్టపువాడు

చుట్టపువాడు

  • బంధువు.

చుట్టము పక్కము

  • బంధువర్గము జం.
  • "నీవ చుట్టంబుఁ బక్కంబు నీవ చెలియు." భార. శాం. 1.
  • "తనకుఁ జుట్టంబు పక్కంబు తల్లి దండ్రు, లన్న దమ్ములు మనుమలు నాలు బిడ్డ, లెల్ల నల్లుండ్రు నిల్లండ్రు నుల్లసిల్ల, ననిశముఁ గుబేరసంపద నతిశయిల్లు." బహు. 5. 64. పే.
  • "వాని కొక చుట్టము పక్కము లేరు." వా.

చుట్టముల సురభి

  • బంధుప్రియుడు.
  • చుట్టాల కాశ్రయ మైనవాడు.
  • "చుట్టముల సురభి నీ వని, భట్టికిఁ దగఁ బ్రియము చెప్పి పంకజనయనా, పట్టాంశుకమణిభూషా, రట్టజహయ గంధసింధురంబుల నొసఁగెన్." విక్ర. 4. 191.
  • చూ. చుట్టాల సురభి.

చుట్టలపై దాడి వెట్టు

  • బంధువుల యిండ్లపై పడు.
  • వారి యిండ్లలో తిష్ఠ వేయు.
  • "ఒలఁబడ్డ నెపమునఁ గల లేని సిరిఁజెప్పి, చుట్టలపై దాడి వెట్టువారు." ఆము. 7. 21.

చుట్టలు గొను

  • చుట్టుకొను. ద్వాద. 5. 74.

చుట్టాలసురభి

  • బంధుప్రీతి కలవాడు.
  • "బంటు నొచ్చిన నోరఁ బలుకండు నెఱవాది, సుఖభోగి చుట్టాల సురభి...." ఉ. హరి. 5. 278.
  • "చుట్టాల సురభియై సొబఁగు నొందెనె కాని." పాండు. 1. 67.
  • "చుట్టాలసురభికి సుందరీమణికి." గౌ. హరి. ప్ర. పంక్తి. 40.
  • చూ. చుట్టముల సురభి.

చుట్టాలు పక్కాలు

  • బంధువర్గము.
  • "చుట్టాలఁ బక్కాల జోడని కడకు... రప్పింప." పండితా. ప్రథ. పురా. పుట. 288.
  • 'ఒక చుట్టమా పక్కమా వాని కెవ రున్నారు' అని విడిగా కూడా వాడుకలో నున్నది.

చుట్టిల్లు

  • గుండ్రంగా నడుమ నిట్రాడు నాటి కట్టిన యిల్లు. శ. ర.

చుట్టి వచ్చు

  • చుట్టుకొని వచ్చు. ప్రదక్షిణం చేయు.

చుట్టుకొను

  • 1. బాకీక్రింద జమ పెట్టుకొను.
  • "జూద మాడినపైఁడి చుట్టుకొనిన." కాశీ. 4. 99.
  • 2. దొంగిలించు.
  • "వాడు ఇంట్లో నాలుగు రోజులు చుట్టపు చూపుగా ఉండి చేతి కందిన వస్తువులను చుట్టుకొని పోయినాడు." వా.
  • 3. క్రమ్ము, వ్యాపించు; పాల బడు.
  • "విధాతృ మఘమూర్తులం జుట్టుకొన్న యజ్ఞానతిమిరంబు." కాశీ. 5. 100.
  • "ఇల్లంతా పొగ చుట్టుకొన్నది." వా.
  • "వీళ్ల నాన్న నాగుబామును చంపాడట. పాపం వీణ్ణి చుట్టుకొంది. అంచేతే వీడికి సంతానం కలుగ లేదు." వా.

చుట్టు కొల్లారము

  • చుట్టు బవంతి.

చుట్టుగత్తి

  • చక్రము.
  • "చుట్టుం, గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనాఁ డొత్తిన." పాండు. 2. 33.
  • చూ. చుట్టుకైదువు.

చుట్టుగుల్ల

  • శంఖం. బ్రౌన్.

చుట్టు గొల్లారము

  • నడుమ ఖాళీ. చుట్టూ కట్టడం గల యిల్లు.

చుట్టు చవికె

  • చుట్టిల్లు.

చుట్టుదారి

  • దూరం దారి.
  • "అలా వెడితే ఎలా. చుట్టుదారి అది." వా.
  • చూ. చుట్టగు.

చుట్టుపట్టు

  • సమీపప్రాంతం.
  • "చుట్టు పట్టున నెట్టి బెట్టిదంబు సింగంబులుం జన వెఱచు." కాశీ. 3. 82.
  • వాడుకలో రూపం - చుట్టుపట్ల.

చుట్టుపట్ల

  • సమీపప్రాంతంలో.
  • "ఈ చుట్టుపట్ల అంత ధనవంతు లెవరూ లేరు." వా.

చుట్టుబవంతి.

  • చూ. చుట్టిల్లు.

చుట్టుమాలె

  • చుట్టు బవంతి.

చుట్టుముట్టు

  • చుట్టుకొను, చుట్టుకొని పట్టుకొను.
  • "సుడివడ్డ చామలఁ జుట్టుముట్టి." జైమి. 1. 4

చుట్టు ముట్టుకొను

  • ముట్టడించు.
  • "ఉ,వ్వెత్తుగఁ జుట్టు ముట్టుకొని యీటెల డొంకెనలం గటార్ల బ,ల్కత్తు- నత్తలంబులను." కళా. 8. 58.

చుట్టు వడు

  • పెనగొను.

చుట్టువారుకొను

  • క్రమ్ముకొను. సారం. 3. 28.

చుట్టువాఱు

  • చుట్టుకొను, ముట్టడించు.

చుట్టెంట

  • (చుట్టు + వెంట) తిరిగిన చో టెల్లా.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 480. చుట్లబెట్టు
  • తిరుగు, ప్రదక్షిణం చేయు; తిప్పలు పెట్టు.
  • "విభవ మాసపడి దివిన్, నీ వెంత చుట్లఁ బెట్టినఁ, బోవునె శాపంబు." నిరంకు. 4. 111.
  • "పాలచేరులు వట్టి తూలింప బలిమి నీ,డ్చుకొని కొండలఁ దూఱి చుట్లబెట్టు." మను. 4. 42.
  • వాడుకలో - చుట్టబెట్టు అనే వినవస్తుంది.
  • "వాడు ఊరంతా చుట్టబెడుతున్నాడు." వా.
  • "మా యిల్లు చుట్టబెడితే యేం లాభం? అక్కడికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి." వా.
  • రూ. చుట్టబెట్టు.

చుట్లు వెట్టు

  • పరిభ్రమించు.
  • దూరముగా పోక. అక్క డక్కడనే తిరుగు.
  • "వీటి వాకిటిచోటనే విడువ కెపుడు, సుట్లు వెట్టుచు నుందురు సోమరవులు." ఆము. 2. 10.

చుప్పనాతి

  • చూ. చుప్పనాతి, శూర్పణఖ.

చుప్పనాతి శూర్పణఖ

  • పైకి అమాయకురాలుగా కనబడినా మాయలాడి.
  • చుప్పనాతి అన్న శూర్పణఖ అన్నా ఒక్కటే.
  • "ఆ చుప్పనాతి శూర్పణఖ మెల్ల మెల్లగానే వాణ్ణి మాకు కాకుండా చేసింది." వా.

చుబ్బనచూఱ యగు

  • సంతృప్తికర మగు.
  • "లీల నా ముందట నాలేమ వొలసినఁ, జూడ్కికిఁ జుబ్బనచూఱ గాదె." భార. విరా. 2. 86.

చుబ్బనచూఱ లాడు

  • కొల్లగొను, తనివి తీరా అనుభవించు. రామా. 1. 45.

చుమ్మచుట్లు

  • కడుపునొప్పి.

చుమ్మలు చుట్టు

  • కడుపులో ప్రేవులు తోడినట్లగు. విజ. 3. 135.

ఉమ్మలువాఱు

  • చూ. చుమ్మలు చుట్టు.

చుయికొట్టు

  • చుయ్యి మను. ధ్వన్యనుకరణము.

చురక తగిలించు

  • నొప్పి తగులునట్లు అను, శాస్తి చేయు. కొత్త. 15.

చురకత్తి

  • చిన్నకత్తి.

చురచుర చూచు

  • కోపముతో చూచు.
  • "చురచురం గనుఁగొని." కవిక. 2. 127. శకుం. 3. 143.

చురచుర వోవు

  • మండు.
  • "అరదము...చురచుర వోయిన." భార. శల్య. 2. 335.

చురియకాడు

  • కత్తి పట్టిన సైనికుడు. కుమా. 11. 40.

చుఱచుఱ మను

  • చుఱుకు చుఱుక్కు మను.
  • "గఱి గఱి నంట తుంట విలుకాని శరంబులు నాయురంబునన్, జుఱచుఱఁ గాడ నీవు దయఁ జూడక..." రాజగో. 1. 100.
  • చుఱ చుఱ చూచు, నాలుక చుఱ చుఱ మను ఇత్యాదులలో రకరకాలుగా ఇది ఉపయుక్త మవుతూ ఉంది.

చుఱపుచ్చు

  • కాల్చు.

చుఱవుచ్చు

  • కాల్చు.

చు ఱ్ఱడచు

  • చురుక్కు మను.
  • "అడుగులఁ బుప్పొడు లంటి చుఱ్ఱడుచుచో." కవిక. 3. 92.

చుఱుకు చూపు

  • బాధించు, కాల్చు.
  • "ఈ చొప్పున సేవకుం జుఱుకుఁ జూపుదురే." జైమి. 4. 25.

చుఱుకు మను

  • ముల్లులాంటివి గుచ్చుకొనగా బాధ కలుగు.

చుఱు కైన

  • తెలివి గల, వేగవంత మైన పదు నైన.

చుఱుక్కున

  • కొఱుకుట వంటి వానిలో ధ్వన్యనుకరణము. రాధి. 4. 102.

చుఱుక్కు మను

  • చుఱు కను.

చుఱుచూడులు చూడు

  • బాగా కాల్చు.

చుఱు మను

  • నొప్పిపడు.
  • "మనసు చుఱ్ఱు మనంగన్." విష్ణుపు. 77.

చుఱ్ఱుపుచ్చు

  • బాధించు.
  • "సోమిచ్చి నీశత్రుఁ జుఱుపుచ్చు ననచు." ద్వి. జగ. పు. 173.

చులుకగా పలుకు

  • చులకన చేసి మాట్లాడు, కించపఱచు.
  • "చులుకగా నీయయ్యఁ బలుకకు మనుడు." పండితా. ప్రథ. పురా. పుట. 412.

చులుక జూచు

  • కించపఱుచు, తక్కువగా చూచు. చులుక జేయు
  • ఎగురకొట్టు.
  • "కేతుదండంబులు నఱికి చులుకం జేయుచు రథికసారథిసహితంబుగా/" భార. భీష్మ. 2. 71.

చులుకదనము వచ్చు

  • అగౌరవం కలుగు.
  • "కాలగతి నెంతవారికి, వాలాయము చులుకదనము వచ్చుట యరుదా." వేమన.

చులుక నగు

  • తేలి కగు, గౌరవహీన మగు.

చులుకపడు

  • న్యూనత కలుగు.

చులుకపాటు

  • చులుకన, న్యూనత.

చుల్క నగు

  • చులుకన వచ్చునప్పు డెల్లా చుల్కన అని కూడా అన వచ్చును.

చుల్కబారు

  • తేలిక యగు.
  • "మానస మొండొక చుల్కబారు." పాణి. 3. 100.

చుల్లర వెట్టు

  • బాధ పెట్టు. సాంబో. 1. 88.

చువ్వన

  • శీఘ్రంగా.

చువ్వున

  • శీఘ్రంగా.

చూకరుపడు

  • దు:ఖించు.

చూచాయగా

  • సూచనాప్రాయముగా.
  • "ఆ చిన్నెలు సవసవగాఁ జూచాయగ విని......" రాధా. 1. 6.
  • "అత నీసారి యెన్నికలలో నిలబడతాడని చూచాయగా తెలుస్తూ ఉంది." వా.

చూచి చూచి

  • తెలిసి తెలిసీ, ఉండి ఉండీ...
  • "ఎట్టు సూచి చూచి యిది పాప మనక యి,య్యసురవాతఁ ద్రోతు నదయవృత్తి." భార. ఆది 6. 249.
  • "చూచి చూచి ఆ మసులాడికి రత్నం లాంటి పిల్ల నెలా యిచ్చా వయ్యా." వా.

చూచినట్లు

  • స్వయంగా చూచినరీతిగా. చూడక పోయినా అనుట.
  • "తావక గుణంబులు చూచినయట్ల గట్టిగన్." కళా. 4. 132.

చూచుకొను

  • గమనించు.
  • "నిను విచారించవు నినుఁ జూచు కొనవు." ద్విప. మధు. 5.
  • "ముందూ వెనుకా చూచుకొని నడవాలయ్యా." వా.

చూచుకో......

  • చూస్తువుగాని లే. బెదిరింపు.
  • "చూచుకో. ని న్నేం చేస్తానో? వా. చూచెదము
  • చూతాము లే.
  • వాడుకలో -
  • "వా డెట్లా ఇవ్వక పోతాడో చూతాము." వా.
  • "వా డేం చేస్తాడో చూస్తాంగా." వా.

చూడ గను

  • దర్శనభాగ్యము పొందు.
  • "వైకుంఠుండు భూభేదన,క్రీడాలం పటుఁ డయ్యు మీపదము వీక్షింపంగ లేఁ డయ్యె నేఁ, జూడం గంటి." కా. మా. 1. 132.

చూడగల వాడు

  • అందమైన వాడు.
  • "చూడఁగల వాఁడు మే లైనసొబగు వాఁడు." విజ. 2. 164.

చూడగా చూడగా

  • చూస్తూ ఉండగనే.
  • "రవికరతాప మాఱెఁ, జూడఁ జూడంగఁ దారకస్ఫురణ దాఱె." మను. 3. 23.

చూడ జూడ '*చూడగా చూడగా.

  • "చూడఁ జూడఁ బై నెలమెడు వల్ద కోసులును........" కుమా. 6. 130.
  • పరిశీలించినకొద్దీ అనే అర్థంలో నేటికీ వాడుకలో ఉంది.
  • "చూడగా చూడగా ఇతగాడు కొంప ముంచేట్టు తోస్తుంది." వా.

చూడ దొడ్డ మంచముకోడు

  • పై ఆటోపమే కాని లోపల యేమీ లే దనుట.
  • "చూడ దొడ్డను మంచముకోడు గాని, యేమి సంపద పార్వతి కీశ్వరునకు." దశా. వరాహ. 105. పే.

చూడ నోడు

  • చూచుటకు సిగ్గుపడు.
  • "ఇనుదెసఁ జూడ నోడి తల లెత్తక నీటఁ దదీయబింబముం, గని." పారి. 2. 31.

చూడ బోయినతీవ కాళ్ళ దగులు

  • వెదకబోయినదే ఎదురుపడు అనుట వంటిది. సుద. 2. 64.

చూడ ముచ్చ టగు

  • కనులపండు వగు, దర్శనీయ మగు.
  • "ఆ అన్నదమ్ము లిద్దరూ కలిసి మెలిసి తిరుగుతుంటే చూడ ముచ్చ టవుతుంది." వా.

చూడు నా దెబ్బ !

  • నే నేం చేస్తానో చూచుకో.
  • చూ. చూడు నాప్రతాపము; చూచుకో.

చూడు నాప్రతాపము

  • నేను నీకు చెఱుపు చేయ గలను అని బెదిరించుటలో ఉపయోగించు మాట.
  • వాడుకలోనూ - చూడు నా ప్రతాపం, చూడు నాదెబ్బ - అంటారు.
  • "సొమ్ము మీఁదట నీ కీయఁ జూడు నా ప్ర,తాపమని పల్కి యుత్సాహచాపలమున." శుక. 3. 77. చూడు మఱి
  • చూడూ....; చూద్దువు గాని లే.
  • "నీ బుద్ధికొలఁది చూడు మఱి." సరం. 3. 204.

చూడు వట్టు లాడు

  • నిప్పు ముట్టించిన కఱ్ఱలను పట్టుకొని ఆడు.
  • "ధర హిమమేరు మందర ముఖ గిరుల, భరగణంబులు సూడు వట్టు లాడుదురు." పండితా. ప్రథ. వాద. పు. 678.

చూడ్కి కందు

  • కనబడు.
  • "సూక్ష్మదృష్టి వీక్షించినఁ జూడ్కి కందు." కాశీ. 4. 130.

చూడ్కికి వ్రే గగు

  • కష్టదర్శన మగు.
  • "తెగియుఁ జూడ్కికిఁ జాల వ్రేఁ గగుచుఁ బొలిచె." భార. ద్రోణ. 2. 126.

చూడ్కిపండువు

  • నేత్రపర్వము. విప్ర. 2. 14.

చూడ్కిపండువు అగు

  • కనుల పండు వగు.
  • "అమ్మరు నెలగోలు, పౌఁజు లనఁగఁ జూడ్కిపండు వగుచు." పారి. 3. 51.
  • చూ. కన్నులపండువు.

చూడ్కుల ద్రావు

  • అతిప్రేమతో, అత్యాకాంక్షతో చూచు.
  • "లలితాంగి యవయవములు సూచి మది దని వోవక చూడ్కులఁ ద్రావఁ దలఁచు." కుమా. 5. 45.
  • చూ. కనులతో త్రావు.

చూడ్కుల పండువు

  • కనులపండువు.
  • "ఆత్మవ,క్షోమణివేదిఁ బొల్పెసఁగఁ జూడ్కుల పండువు సేయువేంకట, స్వామి కృతార్థుఁ జేయు." పారి. 1. 1.

చూతము గా

  • చూస్తాము గా చూస్తాము లే అని నేటివాడుక.
  • ఒక విధమైన ఉదాసీనభావాన్ని, అసమ్మతినీ సూచించే పలుకుబడి.
  • "తా వాదము సేసి శివమతంబు జయింపఁగా వచ్చెనొ? చూతము గా రావింపుము." ఆము. 4. 55.
  • "ఎవ డొస్తాడో చూస్తాం గా నిన్ను రక్షించడానికి." వా.

చూప చెప్ప గలుగు

  • వాక్చక్షుగోచరు డగు.
  • "చూపఁ జెప్పఁ గలభక్తసుజనుఁడవు మాకు." తాళ్ల. సం. 6. 60.

చూపట్ట గలది

  • సుందరి.
  • దర్శనీయురాలు.
  • "చూపట్టంగలదాన నొంటిమెయి నిచ్చోఁ బోవరా దంచు." శుక. 3. 151. చూపట్టు
  • 1. కనబడు.
  • "అమలమూర్తు లై మీరు మహిం జూ పట్టెద రేటికి." జైమి. 8. 19.
  • "ప్రసూనంబులుఁ దమ్మలములుఁ జూ పట్టంగా." రుక్మాం. 3. 225.
  • 2. తోచు.
  • "తాలిమి చూపట్టును ధైర్య మనఁగ." కావ్యా. 2. 38.
  • 3. కలుగు.
  • "సర్వలక్షణపరిపూర్ణచారుమూర్తి, పట్టి జాంబవతికిని జూపట్టినపుడు." సాంబో. 4. 85.

చూపడు

  • చూపట్టు.

చూపరి

  • రూపవంతుడు.
  • రూపవతి.
  • "చూపరుల నెరివ నైనను, నేపున సంభోగకేళి నెనయం జూచున్." హంస. 4. 147.

చూపఱు

  • చూచువారు.

చూపఱులు

  • చూచువారు.

చూపి చూపక మునుపె

  • వెంటనే.
  • "మొనసి వెల చూపి చూపక మునుపె వారి, సరకు లమ్ముడు వోయె...." శుక. 2. 564.
  • చూ. అనియు ననక మునుపే.

చూపిడు

  • చూపు.

చూపి మోపి అను

  • సాటువులు పెట్టి నిందించు సామాన్యంగా ఆడవాళ్లు కుక్కమీదనో, పిల్లి మీదనో పెట్టి దేనినో చూపిస్తూ ఎవరినో యెత్తి పొడవడం నిందించడం మామూలు.
  • "వినుము ప్రభావతి నేమ,న్ననఁ దెలిపెదఁ జూపి మోపి యనుటయుఁ గదా!" శుక. 2. 559.
  • చూ. సూటి పోటి మాటలు.

చూపుగుఱ్ఱము

  • ఆకారంపుష్టి, నై వేద్యంనష్టి, చూడ్డానికి బాగుండునే కాని పనికి రా డనుట.
  • "సుకవాసి పనిపంద చూపుగుఱ్ఱంబు." గౌ. హరి. ద్వితీ. పం. 1494.
  • "ఆకారపుష్టి నైవేద్యం నష్టి." సా.

చూపుడు ఆయికం

  • స్వాధీనం చేయకుండా తనఖా పెట్టుట.
  • ఆయికం, తనఖా, ఆడుమానం యివన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి వాడినా అన్నీ ఒకటే.
  • స్వాధీన ఆయికానికి ఇది వ్యతిరేక మయినది.
  • "ఆ యిల్లు చూపుడు ఆయికం పెట్టి మూడు వందలు తెచ్చాను." వా. చూపుడుకొంగు
  • చీరలో పైకి బాగా కనబడునట్టు కట్టిన కొంగు.
  • అమ్మువా రా కొంగునే పైకి వచ్చునట్లు మడుస్తారు.

చూపుడుకోక

  • పలుచని నేత గల చీర. బ్రౌన్.

చూపుడుగుఱ్ఱము శ. ర.

  • చూ. చూపుగుఱ్ఱము.

చూపుడు పూట

  • పూటకాపు.
  • పూటపడిన వాడు.
  • ఒకరికి బదులుగా ఒకరిని పూట పెట్టి అప్పు తీసికొనుట అలవాటు.
  • చూపుడు ఆయకము, చూపుడు అడమానము వంటివానిలోని చూపుడు వంటిదే యిది. తాళ్ల. సం. 10. 142.
  • "చూపుడుఁబూఁట యతఁడు ఋణిఁ, జూపవలయుఁ జూపఁ డేని సొ మ్మరువఁ దగున్." విజ్ఞా. వ్యవ. 86.

చూపుడువ్రేలు

  • బొటనవ్రేలి ప్రక్కవేలు. తర్జని.

చూపు తప్పు

  • గమనించక పోవు, లక్ష్య పెట్టక పోవు.
  • "శూలద బ్రహ్మయ్య చూపుఁ దప్పితివొ." పండితా. ద్వితీ. ,మహి. పుట. 214.

చూపులనె చుఱ పుచ్చు

  • తీక్ష్ణముగా చూచు, చూపులతోనే కాల్చు.
  • "వచ్చు రిపుఁ జూపులనె చుఱ పుచ్చుచు...." ఆము. 3. 28.

చూపెట్టుకొని

  • 1. గమనిస్తూ.
  • "నిజచ్ఛాయం గని తమ్ము నంత నంతఁ జూపెట్టుక వచ్చు నొంటని తమ్మికంటులని." చంద్రా. 5. 63.
  • 2. కాచుకొని; కాపాడు కుంటూ.
  • "అశక్తుని చంద మొంది చూ,పెట్టుక యుండ నేల." ఉత్త. రా. 5. 11.
  • ఉపేక్షతో చూచు అని వావిళ్ళ ని.
  • కాని రాయలసీమలో నేటికీ పై అర్థంలోనే ఉంది.
  • "ఏదో మా నాన్నను చూపెట్టుకొని ఉంటూంది మా అక్క." వా.

చూపోపక

  • అసూయ పడి.
  • "చూపోపక." నైష. 6. 32.
  • "విధి నా,పాపల మువ్వురఁ దోడ్తోఁ, జూపోపక చంపెఁ దత్ప్రసూతిదినములన్." ఉ. హరి. 2. 14.

చూపోపని

  • అసూయ పడునట్టి.
  • "క్షితి కెల్ల నిను నభిషిక్తుఁ గావింతు, నందుకుఁ జూపోపనట్టి వారలను." వర. రా. అయో. పు. 340. పంక్తి. 5.

చూపోపమి

  • అసూయ.
  • "దివిజద్రుప్రసవంబుఁ గాంచిన సపత్నిం జూచి చూపోపక." ఆము. 5. 74.

చూపోపు

  • ఓర్చుకొను.
  • "ఆ పసిఁడి గిన్నె యెవ్వరి,చే పడియెనొ వీరి నేల సిలుగులఁ బెట్టం, జూపోపరుగా." విప్ర. 5. 28.

చూపోర్చు

  • సహించు.
  • చూపోపమికి వ్యతిరేక మయినది.
  • "ఒకరి మేలునకుఁ జూపోర్చినవాఁడు." వర. రా. అయో. పు. 247. పంక్తి. 14.

చూరకత్తి

  • ఒక రకమైన కత్తి.

చూరనాడు.

  • కొల్లగొను.
  • "ప్రచండకుసుమ, కాండ భండనమున సరికట్లఁ బెనఁగి, సుప్తిఁ బొందిరి తెమ్మెరల్ చూరనాడ." శుక. 2. 69.

చూరుకత్తి

  • ఒక రకమైన చిన్నకత్తి. బ్రౌన్.

చూరుకమ్మి

  • ఇంటి ఆకుకప్పుకు పైన ఎగిరి పోకుండా కట్టే పట్టె.

చూరుకుట్టు

  • ఇంటిమీది ఆకు కప్పునకు కుట్టే కుట్టు.

చూరుకుట్టుదబ్బ

  • చూ. చూరుకుట్టుబద్ద.

చూరుకుట్టుబద్ద

  • చూరు కుట్టే వెదురుబద్ద.

చూరు పట్టుకొని వేలాడు

  • వా ళ్లెంత తిరస్కరించినా వారిమీదనే పడి చచ్చువారి యెడ ఉపయోగించే మాట.
  • "వాడు అత్తగారింట్లో ఎన్నిమాటలన్నా పడి ఉన్నాడు. మెడ బట్టి తోస్తే చూరు పట్టుకొని వేలాడే రకం." వా.

చూరుపట్టె

  • చూరుకమ్మి.

చూరుమొగ్గ

  • చూరుపట్టీపై తీర్చిన - చేతిపని చేసిన - మొగ్గ. జైమి. 5. 157.

చూరెలుక

  • ఒక రకమైన ఎలుక.

చూర్ణము సేయు

  • నాశము చేయు.
  • "దుష్ట సత్వముల్, ధారుణి నేపు రేఁగి బెడిదంబుగ మూఁకలు గట్టి గ్రామముల్, మారి మసంగిన ట్లయి సమస్తముఁ జూర్ణము చేసినప్పుడు." రుక్మాం. 3. 79.