పదబంధ పారిజాతము/చండశాసనుడు
చంటివాడు
- పాలు తాగే పసివాడు.
చండశాసనుడు
- నిర్దాక్షిణ్యంగా తప్పును శిక్షించువాడు.
- "అతనా చండశాసనుడు! నీ సిఫారసు లేవీ పని చెయ్య వక్కడ." వా.
చండాలవాటిలో బ్రాహ్మణ గృహము వెదకు
- వ్యర్థప్రయత్నము చేయు. మాలగూడెంలో బాపన యింటికోసం వెదకడం వ్యర్థమే కథా !
- "వసుధ నెం దైనఁ జండాల వాటిలోన, బ్రాహ్మణగృహంబు వెదకుట భ్రాంతి గాదె." ప్రభా. 4. 160.
చండిపోతు
- మొండివాడు.
- "మొండరి చల్లచప్పుడు గోడచేర్పు, చండిపో తనునట్టిజాడ నున్నాఁడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1497-98.
చండి వడు
- మొండి కెత్తు.
- "మజ్జనక్రీడాపరాయణం బై చండివడి కదలమిన్." పారి. 5. 13.
చండి సేయు
- మొండికి వేయు, కోపించు.
- "చండి సేసి యడిగినఁ జక్క మాకుం జెప్పదు." తాళ్ల. సం. 3. 626.
చండ్రనిప్పులు
- భగభగ లాడు నిప్పులు.
- చండ్రకఱ్ఱ కాల్చిన నిప్పులు చాలా వేడి అనుటపై ఏర్పడినది.
- "చండ్రనిప్పులకంటె వేండ్రంబు లగునట్టి, కన్నులఁ గోపాగ్ని కణము లురల." హరిశ్చ. 3. 91.
చండ్రమల్లెలు
- చండ్రనిప్పుల మంటలు.
- "రవరవ మండు నెర్రని చండ్రమల్లెల." క్రీడా. పు. 48.
చండ్రలాటలు
- ఒక పిల్లల ఆట. హంస. 3. 146.
చందనకావులు/
- ఒక రకమైన బట్టలు. పండితా. పర్వ. 307. పుట.
చందన మలదు
- గంధము పూయు.
- "అలఁదెఁ జందన మొక ధవళాయతాక్షి." పారి. 2. 12.
చందమామ కొండనాలిక
- చందమామ చిఱునాలిక వంటిది. అనగా తెల్లనిది, మృదు వైనది, సన్ననిది అనుట. చందమామే లలితం. అంతకంటె లలితాతిలలితం.
- "చందమామ కొండనాలిక యగు నొక్క గొమలిరేకు." క్రీడా. పు. 57.
చందమామ గుటకలు
- దొరకనిదానికై ఆశపడి నోరూర్చుకొనుట. వట్టి ఆశ.
- "అందనిపంటి కేమిటికి నఱ్ఱు నిగిడ్చెదు విష్ణుఁ డున్న యా, కందువ చందమామ గుటకల్ విను మీ పని గట్టిపెట్టి..." వి. పు. 2. 51.
- చూ. చందమామ ఘుటిక. చందమామ గ్రుక్కిళ్ళు.
చందమామ గ్రుక్కిళ్ళు
- దొరకనిదానికై వట్టి ఆశతో గుటకలు మ్రింగుట.
- "ఎలమి సుముహూర్తమునఁ దెర యెత్తు నంతఁ, బ్రేమ మది మీఱఁగాఁ జందమామ చెలుల, కెంపు మోవుల సుధకు గ్రుక్కిళ్ళు మ్రింగ, క్షితిఁ గలిగె జందమామ గ్రుక్కిళ్ళు నాఁడు." శశాం. 5. 137.
- చూ. చందమామ గుటకలు. చందమామ ఘుటిక.
చందమామ ఘుటిక
- వట్టి ఆశ. ఎదురుగా ఉన్నదని దొరకనిదాని నాశించుట. చందమామను చూచి గుటకలు వేసినట్లు. ఎలాగూ దొరకదు.
- పిల్లలకు చందమామను చూపుతూ వట్టి చేతులతో తినిపించగా తినునట్లు వారు నటింతు రని సూ. ని. సరియని తోచదు. గుటకలు వేయుటయే ఇక్కడ.
- "మనకు నిజ మయ్యె నల చందమామ ఘుటిక." భీమ. 2. 135.
- చూ. చందమామ గుటకలు.
చందమామ పక్కె
- ఒక రకమైన చేప. బ్రౌన్.
చందమామ పురుగు
- ఆరుద్రపురుగు. బ్రౌన్.
చందమామ పులుగు
- చకోరపక్షి.
చందా కెంపు
- ఒక జాతి కెంపు.
- "మేనఁ జందాకెంపు మించుటొడ్డాణంబు." సమీర. 2. 67.
చందాదారు
- చందా కట్టువాడు.
చందుచట్టు
- చంద్రకాంతం.
చందురకావి
- లేత కావి రంగు.
- "విశద ముక్తాదామ రశనఁ జందుర కావి, కలికపు వలువపై నలవరించి." మను. 6. 5.
- చూ. చంద్రకావి.
చందురజోతి
- ఒక రకం బాణసంచా. శ. ర.
చందురుకూనలు
- నఖక్షతాలు.
చందురువంకలు
- నఖక్షతాలు.
చంద్రకావి
- లేత కావిరంగు. రాధి. 1. 99. చంద్రగోళి
- చంద్రపు గిన్నె.
- అంచు లేని గుండ్ర మైన గిన్నె. పక్షులు నీరు త్రాగుటకూ, మనం చేతులు కడుగు కొనుటకూ ఇత్యాదులకు అందులో నీరు ఉంచుతారు. గోళెము అన్నది కొంచెం వెడల్పాటి అంచు లేని గిన్నె కే నేడు కూడా రూఢము.
- "క్షాళనోచితచంద్రగోళి యనఁగ." పాండు. 5. 24.
- చూ. చంద్రపుగిన్నె.
చంద్రపుగిన్నె
- అంచు లేని గుండ్ర మైన గిన్నె.
- "చక్రవాకములకుఁ జల్లఁగా మంచు ద్రా,గించిన చంద్రంపు గిన్నెవోలె." ఉత్త. హ. 3. 86.
- చూ. చంద్రగోళి.
చంద్రవంక
- ఆభరణము.
చంద్రవంకలు
- ఒక రకమైన ధాన్యం.
చంద్రుని కొక నూలిపోగు
- తగినంత కాక పోయినా యెంతో కొంత ఆరాధన చేత నైన కానుక.
- చంద్రదర్శనం చేసుకొన్నప్పుడు - ముఖ్యంగా విదియనాడు - ఉత్తరీయంలోని నూలిపోగు తీసివేసి నమస్కరించుట ఆచారం. దానిపై వచ్చిన పలుకుబడి.
- "కావున సమస్తసామ్రాజ్యకర్త యైన, యిందిరాధీశునకుఁ గాను కీయవలయుఁ, జంద్రునకు నూలుపో గన్న సామెతగను, గాన నేమైన మనశక్తి గలకొలంది." కుచే. 1. 109.
- "మీరు చేసేది గొప్ప సత్కార్యం. వేలమీదా లక్షలమీదా కావలసిన పని. చంద్రుని కొక నూలిపోగు లాగా నేనూ ఒక పదిరూపాయలు యిచ్చుకుంటాను." వా.
చంపి పుట్టు
- వారికంటె మించినవా డగు.
- "వాడు వాళ్లనాన్నను చంపి పుట్టాడు." వా.
- "రావణాసురుణ్ణి చంపి పుట్టినాడు వీడు." వా.
- అనగా అతనికంటె మించినవాడని అర్థం.
- నిరసన సూచించు పట్టులనే యిది యెక్కువగా ఉపయోగిస్తారు.
చంపుక తిను
- వేధించు, బాధించు.
- "పదిరూపాయలు అప్పు ఇమ్మని వాడు నాలుగు రోజులనుంచీ నన్ను చంపుక తింటున్నాడు." వా.
- రూ. ఏటికి చంపెదరు?
చంపుకు తిన్నట్టు
- రూ. నను చంపుకొన్నట్టు. చంపుడు గట్ట
- వధ్యశిల.
- "చంపుడుగట్ట యగు శిలాపట్టంబు మెట్టి." కాశీ. 5. 169.
చంపుడు గట్టు
- చూ. చంపుడు గట్ట.
చంపుడు ముంపుడు
- చచ్చు పుచ్చు; చెఱుచునట్టి. ఇదేదో విశేషణంగానే ఉపయోగిస్తారు.
- "చంపుడు ముంపుడు బోధ గాథలన్." పాండు. 5. 224.
- చూ. చచ్చు పుచ్చు.
చకచకా
- గబగబా.
- "అతను ఏ పనైనా చకచకా చేసుకొని పోతాడు." వా.
చకారపు గుడులు
- చీవాట్లు, చీకొట్టుటలు.
- వాడి దగ్గరికి వెళ్లా మంటే చకారపు గుడులకు తక్కు వుండవు." వా.
చక్క జూచు
- 1. బాగుగా చూచుకొను, ఆదరించు.
- "సాగఁబడి మ్రొక్కి యిల్లాలిఁ జక్కఁ జూడఁ గావు మని బాస లీయఁగాఁ గంటి నేను." శుక. 1. 526.
- 2. సరిగా చూచు, బాగా చూచు.
- "కడుకొనక తప్పఁ జూచినఁ, జెడులోకము లనుట యిది ప్రసిద్ధము జగతిన్, మృడ నీవు చక్కఁ జూచిన, జెడియె మనోభవుఁడు నిది విచిత్రము గాదే." కుమా. 9. 44.
- శ్లేష ఇక్కడ.
చక్క జేయు
- 1. సరిపఱచు.
- "విరస మయ్యె నేని వెర వెద్ది మఱి చక్క,జేయ నీవ చింత చేసి చూడు." ప్రభా. 5. 19.
- 2. సంస్కరించు.
- "స్నానంబు గావించి చనుదెంచు నంతలో, జపవేదిఁ దగురీతిఁ జక్కఁ జేయు." ఉత్త. రా. 1. 199.
- 3. పూర్తి చేయు.
- "పోయివచ్చి నీ,పని మఱి చక్కఁ జేసెద నెపంబు సహింపుము." భాస్క. రా. సుం. 83.
- 4. చంపు, కూల్చు.
- "గంగానందనుఁ గూల్చి ద్రోణుపని చక్కంజేసి కౌరవ్యవీ,రాంగమ్ముల్ నుఱుమాడి." భార. భీష్మ. 2. 153.
- "జలరాశి గర్వంబుఁ జక్కఁజేసి." భాగ. 6. 306.
చక్క జేర్చు
- సవరించు.
- "తమ్మి పూ,మొగ్గల నేలు పూపచను ముక్కులఁ బయ్యెదఁ జక్కఁ జేర్చుచున్." శుక. 1. 293.
చక్కటులు దిద్దు
- చక్క దిద్దు.
- "......జక్కవకవం జక్కట్లు దిద్దున్ గుచా,హంకారంబు మదాళిమాలికల నూటాడించు వేణీరుచుల్. విజ. 2. 16.
- రూ. చక్కట్లు దిద్దు. చక్కట్లు దిద్దు
- సరి దిద్దు.
- "జక్కవకవన్ జక్కట్లు దిద్దున్ గుచా హంకారంబు." విజయ. 2. 16.
- రూ. చక్కటులు దిద్దు.
చక్కడచు
- సంహరించు.
- "చక్కడఁతు నిన్ను విష్ణునిఁ, బెక్కులు ప్రేలెదవు." భాగ. స్క. 7. 272.
చక్క నగు
- సరిపడు, నెఱవేఱు - ఇత్యాది భావచ్ఛాయలలో కనిపించు మాట.
- "కలికి భుజంగసంగతిఁ గన్న కేతకి, సాధ్విచెంత వసింపఁ జక్క నౌనె." ఇందు. 3. 72.
చక్కనయ్య
- మన్మథుడు.
చక్కని కొమ్మ
- అంద మైన స్త్రీ.
- "మనవమ్మానన్నో చ,క్కని కొమ్మా మెచ్చుకొమ్మ కథ విని పొమ్మా!" హంస. 1. 149.
చక్కనిమిన్ను
- గగనమధ్యం.
- "సవితృండు చక్కని మింటికిం జనుదెంచె." భార. భీష్మ. 3. 346.
చక్కనివారిలో మిగుల చక్కనిది (వాడు)
- అతి సౌందర్యవంతురాలు (డు) ఇట్టి పలుకుబడులు మనకు చాలా ఉన్నవి. ధనవంతులలో ధనవంతుడు - ఇత్యాది.
- "చక్కనివారిలో మిగులఁ జక్కని దాన వటంచు వేడ్కతోఁ, జొక్కముఁ జెప్పి రందులకుఁ జూచినయందుకు..." హంస. 1. 84.
చక్కబడు
- సరిపడు; నెఱవేరు.
- "ఈ పని ఇంతలో చక్కబడేట్టు లేదు." వా.
చక్కబఱచు
- సవరించు.
- "శయ్య విదిలించి పైచీర చక్కఁ బఱచి." రుక్మాం. 4. 82.
చక్కబెట్టు
- 1. చాలించు, కట్టిపెట్టు.
- "జపహోమతంత్రముల్ చక్కఁ బెట్టి." రుక్మాం. 4. 102.
- 2. సరిచేయు, చక్కదిద్దు.
- "...........మీ రొక్కొక వేళ..... చక్కఁబెట్టువాడు." పాండు. 5. 218.
- 3. దొంగిలించు.
- "వాడు అందరూ నిద్ర పోతూండడం చూచి ఆరవేసిన నాలుగు పంచలూ చీరలూ చక్క బెట్టుకొని పోయాడు." వా.
- 4. లోబరచుకొను.
- "వాళ్లయింటికి అప్పుడప్పుడూ పోతూ వస్తూనే ఉండి, వాడు ఆ పిల్లను కాస్తా చక్క బెట్టినాడు."
- 5. బియ్యం సరిచేయు.
- "బియ్యం చక్కబెట్టి ఆ తరవాత ఎసట్లో పోయవే." వా.
- ఇదే వాడుకలో పశ్చిమ ప్రాంతాలలో 'సగబెట్టు' అనే రూపంలో విరివిగా వినవస్తుంది.
- "ఆ పొరక, చేట అంతా సగబెట్టి కసువు నూకు." వా.
- చూ. సగబెట్టు.
చక్కబోవు
- సరాసరిగా వెడలిపోవు.
- "ఈసారి చని వేఁడ నే మనునో యని, సంకోచమునఁ గొక్కి చక్కఁబోవు." హంస. 3. 155.
- "వాడు నేను పిలుస్తూండగానే చక్కా పోయాడు." వా.
చక్క సగము
- సరిగ్గా సగం.
- "ఒడలిలోఁ జక్క సగము నా కొసఁగు మనుడు." ఉత్త. హరి. 5. 56.
- చూ. చక్క సమము.
చక్క సమము
- సరిగ్గా సగం.
- "పంచి పెట్టెదం, జక్క సమంబుగాఁగ నిది సమ్మత మౌఁ గద మీకు వారికిన్." దశా. 2. 343.
- చూ. చక్క సగము.
చక్కాడు
- 1. సంహరించు.
- "తక్కిన రాక్షసదళముల నొకటఁ, జక్కాడె మానవశరమహత్త్వమున." రంగ. రా. బాల. పు. 35. పంక్తి. 23.
- 2. నుఱుమాడు, తెగగొట్టు.
- "ఖడ్గ మెత్తినఁ జక్కాడెఁ గంబు కంఠి." కాశీ. 6. 245.
చక్కిలిగింత
- సంతోషకారి; చక్కిలిగిలి.
- "అమరుల బోనపుట్టిక సహస్రమయూఖుని జోడుకోడె సం,తమసము వేరు విత్తు కుముదంబుల చక్కిలిగింత పుంశ్చలీ, సమితికిఁ జుక్కవాలు." పారి. 2. 41.
- "చక్కిలిగింత పెడితే నాకు బా గుండదు." వా.
చక్కిలిగిలిగింత
- చక్కిలిగింత.
- "చొక్క మగు రాధహృదయము, చక్కిలి గిలిగింత గొనియె శంబర రిపుచేన్." రాధా. 4. 71.
చక్కిలి గిలిగిలి
- గిలిగింతలు పెట్టుటలో అను మాట. చక్కిలిగిలిగిలీ అంటూ నవ్వునట్లు అరి కాళ్లలోనూ చంకలలోనూ వ్రేళ్లతో తాకుతారు. నవ్వు వస్తుంది.
- "క్రిక్కించుఁ జక్కిలి గిలిగిలియనుచు." పండితా. ప్రథ. పురా. పుట. 457.
చక్కిలింతలు పుచ్చు
- గిలిగింతలు పెట్టు. పండితా. ప్రథ. పురా. పుట. 457.
- రూ. చక్కిలి గిలిగిలి పెట్టు. చక్కీ పంచదార
- శుద్ధి చేసిన చక్కెర. బ్రౌన్.
- గడ్డ కట్టిన చక్కెర. వావిళ్ళ. ని.
చక్కీ మంచము
- పేము మొదలగువానితో నేసిన చట్టం గల మంచం.
చక్కుగా జేయు
- చక్కు సేయు.
- "పొలుపారు సౌధగోపురములతోడఁ, గాశీపురము చక్కుగాఁ జేసి కాల్చి." ద్విప. జగ. 175.
- చూ. చక్కు చేయు.
చక్కు చేయు
- 1. తుత్తుమురు చేయు.
- "తుందుడు కాఱ శాత్రవుల దోర్బల సంపదఁ జక్కు చేసి." నిరంకు. 4. 80.
- చూ. చక్కాడు.
- 2. నిర్మూలించు.
- "శర మేర్చి యిపుడె, చంద్రసూర్యాగ్నులఁ జక్కుఁ చేసెదను." వర. రా. అర. పు. 231. పం. 3.
- రూ. చక్కసేయు.
చక్కుపగడ
- ఏడో సంఖ్య. వేంక. మాన.
చక్కుముక్కు చేయు
- చిందరవందర చేయు.
- "ఎక్కడి పగ యొకో యింద్రియాలు నన్నుఁ బట్టి, చక్కుముక్కుల చేసి యెంచి సాధించేని." తాళ్ల. సం. 6. 105.
చక్కువడు
- ముక్కలు ముక్క లగు.
- "అక్కిరీటి సైన్యంబు లెక్క గొనక, యుక్కు మిగిలి యక్కజంబుగాఁ, జక్కువడం బెక్కు నారసంబులు." జైమి. 5. 20.
చక్కెర తిన్ననోర వేపాకు మేసినవిధము
- మంచిపని చేసినపిదప చెడుపని చేయ రా దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "తీపారుచక్కెరఁ దిన్న యానోర, వేపాకు మేసినవిధమున నీవు, చేసి నంతయు మేలు చేసి మ ఱేల, చేసితి విట్టి కుచ్చితము...." గౌర. హరి. ద్వి. 1281-'84
చక్కెర పెట్టు
- తీపి తినుబండము పెట్టు.
- "కనకపంజరశారికలకుఁ జక్కెర వెట్టి, చదివింప రేలొకో సకియ లిపుడు." పారి. 1. 106.
చక్కెర బుగడ
- ఒక రకమైన పిండివంట.
చక్కెర బెట్టి లాలించు
- ప్రేమతో పెంచు.
- "ప్రేమతోఁ జక్కెర వెట్టి లాలించిన, చిలుకకే వెగటుగాఁ బలుక సాఁగె." ఉషా. 2. 47.
చక్కెరబొమ్మ
- అందగత్తె.