పదబంధ పారిజాతము/గాండ్రు గాండ్రు మను
- గాడిద గుఱ్ఱమువలె సవారికి పనికి రాదు గదా!
- "వీడికి ఆ స్కూలుపని అప్పగించడం గాడిదకు గంత గట్టినట్లే." వా.
- ఇక్కడ గంత = జీను.
గాడిదగత్తర
- 1. గందరగోళము.
- "గాడిదగత్తర వ్రాఁతలు." గుంటూ. పూ. పు. 43.
- 2. అల్లరి.
- "....ఇంత మాదిగమంచ మగునప్పుడు శ్లోకము కీర్తనము గాఁగ నెంత గాడిద గత్తర యగునో శ్లోకములోని శబ్దములకు..." సాక్షి. 285 పు. 20.
గాడిదగుడ్డు
- వట్టిది.
- "...కోటలో నే మున్నదిరా గాడిదగుడ్డు. నోటిలో నుండవలయునురా..." సాక్షి. 176. పు.
గాడిదచాకిరి
- ఎక్కువ చాకిరి.
- "వాడు వాళ్లింట్లో గాడిద చాకిరీ చేయ లేక ఛస్తున్నాడు." వా.
గాడిదచావు చచ్చు
- దిక్కులేనంత చాకిరీ చేసి దిక్కుమాలిన చావు చచ్చు.
- "వాళ్లింట్లో పనంతా నెత్తిన వేసుకొని చేశాడు. కడకు ఒక మంచి మాట లేకుండా గాడిదచావు చచ్చాడు." వా.
- చూ. కుక్క చావు చచ్చు.
గాడిదపిల్ల కోమలికం
- త్వరలోనే మాసిపోవు కోమలత్వం.
- "ఆ యింటి పిల్లల దంతా గాడిదపిల్ల కోమలికం. ఈడు వచ్చేసరికి దమ్మిడీకి పనికి రాకుండా తయా రవుతారు." వా.
- రూ. గాడిదపిల్ల కోమలం.
గాడిపొయ్యి
- ఎక్కువ పాత్రలలో వంట చేయుటకు వీలుగా నేలపై ఒక గాడిని త్రవ్వి యేర్పరచిన పొయ్యి.
- పెండ్లిండ్లు వగైరాలలో నేటికీ గాడిపొవ్వులు త్రవ్వడం అలవా టున్నది.
- "ఇంతమందికీ భోజనా లమరా లంటే యింకో గాడిపొయ్యి తవ్వాలిసిందే." వా.
గాతు గావించు
- ప్రేల్చు.
- "...పిరంగు, లొక్క మొగి గాతు గావింప నుక్కు మెఱసి, గుండ్ల గుంపులు బడివాన గురిసినట్లు." రంగా. 3. 66.
గాదములోని కాయవలె
- మాటుపడి, నిక్షేపంలా.
- "గాదమున మాటు పడియున్న కాయ వోలె." విక్ర. 4. 60.
గాదములోని దోసకాయవలె
- మాటుపడి, నిరుపద్రవంగా.
- "అలఘుబలాఢ్యుఁ డయ్యును దయాళువు గావున శాంతచిత్తుఁ డై, నిలిచిన
- తండ్రి కాలమున నెమ్మది గాదములోని దోసకా,యలువలె నున్న రాజులు..." వరా. 3. 24.
గాదియ కొలుచు
- ఇంటిగాదెలో నున్న ధాన్యం వలె అందుబాటులో నుండునది.
- "గాదియ కొలుచౌనొ నీ దొరతనము." పండితా. ప్రథ. పురా. పుట. 360.
గాదెల కొలుచు
- అందు బాటులో నున్న అపూర్వభాగ్యం.
- కొంగుబంగారం వంటిమాట.
- "అమృతమథను మహి మదె మాగాదెల కొలుచు." తాళ్ల. సం. 10. 51.
- చూ. గాదియ కొలుచు.
గాదెల బోయు
- కూడబెట్టు.
- "తిన్నని కర్మములు గాదెలఁ బోసే రయ్యా." తాళ్ల. సం. 7. 32.
గానరస మాను
- పాట విని ఆనందించు.
- "రసికులు మీగానరస మాన వచ్చిరి, పాడరే శివభక్తి పాడుగాను." కా. మా. 4. 35.
గానుగ ఎద్దు
- ఇతర ప్రపంచం తెలియకుండా అందులోనే పడి కొట్టుకొనువాడు.
- "వాడు గానుగెద్దులా ఆ సంసారంలో పడి తన్నుకుంటున్నాడు." వా.
- గానుగెద్దు గానుగు చుట్టూనే ఎప్పుడూ చుట్టి చుట్టి తిరగడంపై వచ్చిన పలుకుబడి.
గానుగమొద్దు
- ఎద్దు మొద్దు స్వరూపం అనుట వంటిది. శరభాంక. 45.
గానుగాడు
- నూనె తీయు.
- "నువ్వులు రేపు గానుగాడించాలి." వా.
గానువున బెట్టి యార్చు
- శిక్షించు. గానుగలో పెట్టి తిప్పి నులిమి వేయు.
- "అతని వంశం బెల్లన్, గానువునఁ బెట్టి యార్చిన నేనియుఁ జాలదు." కుమా. 2. 96.
గాభరా పడిపోవు
- భయభ్రాంతి యేర్పడు.
- "జేబు తడివి చూచుకొంటే పర్సు కనిపించకపోయే సరికి గాభరా పడి పోయాను." వా.
గామిడికత్తె
- దుష్టురాలు.
గామిడికాడు
- దుష్టుడు.
గాముల మోచిన గంప
- ప్రమాదకరము. తాళ్ల. సం. 4. 122.
గాములువారు
- చీకటిపడు, కాలహరణ మగు.
- "గాములు వారెడి పొద్దు కావలి కాండ్లాల (ర)" తాళ్ల. సం. 10. 166.
గారడీసంసారము
- ఏమీ లేకున్నా, ఉన్నట్లు ఆడంబరంగా కనిపించే సంసారము. రామరామ శత. 12.
గార ద్రావిన మీనువలె
- ఆలీ జాలితో.
- ఆవాలు నూరి త్రాగినట్లు అనుట వంటిది.
- "గార ద్రావిన మీను సంగతి మనోజ, వేదన నతండు పొరల..." వైజ. 2. 140.
గారము చేయు
- బుజ్జగించు; సరస మాడు.
- "సకియ నీ యింటికి సారంగధరుఁడు, ఒక పావురము వెంట నుఱికి రాలేదె, రాఁగానె నీవు గారము చేయ లేదె." ద్విప. సారం. 3. 104. పు.
గాలము వేయు
- ఎత్తు వేయు; ఎక్కు పెట్టు.
- "వా డప్పుడే ఆ ఆస్తికి గాలం వేస్తున్నాడు. పిన్నమ్మను విడిచి ఒక క్షణం ఉండడం లేదు." వా.
గాలికబుర్లు
- వట్టి మాటలు.
- "ఆఁ, ఈ గాలికబుర్ల కేం లే. అసలు సంగతి ఎవరికీ తెలియదు." వా.
గాలికి
- 1. వట్టినే, అనవసరంగా.
- "గాలికి వాడి మాట విని వెయ్యి రూపాయలు పోగొట్టుకొన్నాను." వా.
- 2. స్వేచ్ఛగా; అప్రయత్నంగా.
- "వాడు గాలికి తిరుగుతున్నాడు." వా.
- "వాడి కేదో గాలికి ఆ ఆస్తి వచ్చి పడింది." వా.
గాలికి పుట్టు
- నిందార్థంలో ఎవడికి పుట్టెనో తెలియదు అనుపట్ల ఉపయోగిస్తారు.
- "వా డేదో గాలికి పుట్టి గాలికి పెరిగాడు. వాడికి నీతులూ నియమాలూ ఎట్లా వస్తాయి?" వా.
గాలికి పెరుగు
- ఇతరుల పోషణ లేకయే పెరుగు.
- "వాడికి పాపం ఎవరున్నారు? గాలికి పెరిగాడు." వా.
గాలికి ఫొయిన పేలపిండి కృష్ణార్పణం
- ఎలాగూ తనకు రాని దని తెలిసి, తన కిష్టం లేక వదిలి వేసినట్లుగా నటించినప్పుడు ఉపయోగించే పలుకుబడి.
- "ఆ ఉద్యోగం కోసం వాడు నానా యాతనా పడ్డాడా? అది రాకపోయే సరికి ఇప్పుడు అందులో ఏ మంచి అవకాశమూ లే దంటూ మొదలెట్టాడు. పైగా తన వాడికే దొరికిం దని సంతోషంగా ఉం దంటాడు. గాలికి పోయే పిండి కృష్ణార్పణం." వా.
గాలికి పోయే ఒగుడాకు వలె
- మరీ పల్చగా ఉన్నా రనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "గాలిఁ బోయెడి యొగుడాకు గతి." కుచేలో. 2. 7.
- "ఆ పిల్లేమమ్మా అలా గాలికి పోయే ఒగుడాకులా ఉంది?" వా.
- ఒగుడాకు అంటే జొన్న సజ్జ వగైరా దంట్లపై నున్న ఆకు.
గాలికుంటు
- పశువులకు గెట్టెలు పుండు పడే వ్యాధి.
గాలికొమ్ము
- వాద్యవిశేషం.
గాలి కైనా చొరగూడని చోటు
- దుష్కరప్రవేశ మైనస్థలము.
- "తిరిగితిమి గాలి కైనం, జొరఁగూడని చోటు లెల్ల నూర్యమరీచుల్..." ఉ. హరి. 5. 313.
- చూ. పోతుటీగకు చొరరాని.
గాలిగంగమ్మవలె తిరుగు
- స్వేచ్ఛగా నిష్ప్రయోజనంగా తిరుగు.
- "వాడికి పొద్దున్నుంచీ గాలిగంగమ్మ లాగా తిరగడంతోనే సరిపోతుంది." వా.
- "వాడు పెళ్లీ పెటాకులూ లేక గాలిగంగమ్మలా తిరుగుతున్నాడు. వా.
గాలిగంగలు
- గాలిగంగమ్మలు, క్షుద్రదేవతలు.
- గాలిగంగమ్మ ఒక దేవత.
- "జాతర సాటించె... గాలిగంగల కెల్లన్." పాండు. 3. 73.
గాలిగంటి (టు+ఇ) డగల
- గాలిని మూట గట్టగల - అసాధ్య కార్యములను చేయగల - ఏమైనా చేయగల జాణ అను నిరసనార్థంలో. కుమా. 8. 135.
గాలిగుడి
- సూర్య చంద్రుల చుట్టూ ఏర్పడే పరివేషం.
గాలిగొను
- ఎండిపోవు.
- "తిత్తొలిచి గాలి గొన వైచిన కుక్క కలిమంబు గనుంగొని." భార. శాం. 3. 285.
గాలిగోపురము
- చాలా ఎత్తై దేవాలయముల ముందుండే గోపురం.
గాలిగ్రుడ్డు
- చెడిన గ్రుడ్డు. తె. జా.
గాలిచీర
- తెఱచాప.
గాలి తిరుగు.
- మునుపటి స్థితి మారిపోవు.
- "మూడు నెలలుగా నానా అవస్థా పడిపోయాను. ఈ రోజే ఒక మంచి వార్త విన్నాను. గాలి తిరిగింది కదా అని కొంచెం ఉత్సాహంగా ఉంది."
- "వా డేదో యీ మధ్య కాస్త ప్రసన్నంగా కనిపిస్తున్నాడు. గాలి తిరక్క ముందే మన పని చేసుకోవడం మంచిది." వా. గాలిదుమారము రేగు
- వాదప్రతివాదాలు చెలరేగు.
- "ఆ రోజుల్లో వ్యావహారికభాష పనికి రా దని పెద్ద గాలిదుమారం రేగింది." వా.
గాలిపంట
- గట్టిగా వస్తుందో రాదో చెప్పలేనిపంట. శ. ర.
గాలిపటము
- చూ. గాలిపడగ.
గాలిపడగ
- గాలిపటము, ధ్వజము.
- "పటుగతిఁ జను గాలిపడగలతోడన, కడువేగమున పెందగడియ లెగసె." కుమా. 11. 51.
గాలిపాట
- శాస్త్రీయంగా నేర్చుకొనక విని అనుకరించే సంగీతం. శ్రుతపాండిత్యం వంటిది.
- "వాడి దేదో గాలిపాట తప్పితే నేర్చుకొన్న సంగీతం కాదు." వా.
గాలిపిశాచము
- దయ్యము.
గాలి పోయు
- పశువులకు పారుడురోగము వచ్చు.
- "ఊళ్లో పశువు లన్నిటికీ గాలి పోస్తూ ఉంది. మన గిత్తలను అక్కగారి ఊరికి తోలిస్తేనే మంచిది." వా.
గాలిబిళ్లలు
- గవుదలు వాచు వ్యాధి.
గాలిబుచ్చు
- వ్యర్థం చేయు.
- "ఏకాంత మిక్కానలో, గాలిం బుచ్చెడు పౌరుషం బిది." దశ. 6. 6.
గాలి బోవు
- వ్యర్థ మగు, తొలగు.
- "కలిగినముద మెల్ల గాలిఁబోయిని కలశితి విదె." తాళ్ల. సం. 3. 34
- "ఎలమి గరుడధ్వజుపై నెక్కు నా విషములు, కరగి నీరై పారి గాలిఁ బోవుఁ గాక." తాళ్ల. సం. 8. 1.
గాలిమందలు
- స్వేచ్ఛగా తిరిగి మేయు పశువుల మందలు. కాశీయా. 358. పు.
గాలిమాట
- వట్టిమాట, జనశ్రుతి.
- "మలయమారుత మైన మెలఁత దెచ్చు నటన్నఁ, గానరా దదియును గాలి మాట." తపతీ. 2. 79.
గాలి ముడి గట్టు
- గాలి మూట గట్టు.
- "గాలి ముడి గట్టినట్టు కాయము మోచితిమి." తాళ్ల. సం. 9. 267.
గాలిమూట చిక్కు
- శరీరధారి యగు. శరీరాన్ని గాలిమూట అని వేదాంతు లంటారు.
- "గాలిమూటఁ జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి." తాళ్ల. సం. 9. 243.
గాలిమెకము
- లేడి. గాలిమేడలు కట్టుకొను
- మంచిని ఊహించుకొని సంతోషించు.
- "వాస్తవదృష్టితో చూడాలి గాని వట్టి గాలిమేడలు కట్టుకొని సంతోషిస్తే లాభ మే ముంది?" వా.
గాలిమేతకు పోవు
- వాహ్యాళి వెడలు
గాలి మేసి రావడానికి
- షికారుకు. ఇటీవల ఉరుదూద్వారా వచ్చిన పలుకుబడి.
- "అలా గాలి మేసి రావడానికి పోయి వద్దాం. రారాదా?" వా.
గాలిలో దీపము పెట్టి దేవుడా నీమహిమ అను
- దుష్ఫలితము తప్ప దని తెలిసి కూడా ఆ పని చేసి దేవును మీద వేయు. అది నిష్ప్రయోజన మనుట.
- "గాలిలో, దీపము వెట్టి నీ మహిమ దేవుఁడ! యం చన." మానిని. 6.
గాలిలో పెట్టిన దీపము
- ప్రమాదపరిస్థితిలో ఉన్నది. గాలిలో పెట్టినదీపం ఆరిపోక తప్ప దనుటపై యేర్పడిన పలుకుబడి.
- "వాడి బతుకు గాలిలో పెట్టిన దీపం లాగా ఉంది." వా.
గాలివార్త
- కింవదంతి.
- "ఈ కలెక్టరు మారిపోతా డని యేదో గాలివార్తగా తెలిసింది." వా.
గాలిసవారీ పోవు
- అనవసరంగా తిరుగు.
- "ఆ. వాడి కేం పని? గాలి సవారీ పోవడం తప్పిస్తే." వా.
గాలి సోకు
- దయ్యము పట్టు. భూత ప్రేత పిశాచాదులు శరీరము లేనివిగా భావించి వానిని గాలి అనుట అలవాటయినది.
- "...దాని పిఱుందం, జని వీరుఁ డతని యాకృతిఁ, గని త్రోవం గాలి సోఁకెఁ గావలె ననుచున్." శుక. 2. 540.
- "ఆవిడ కేదో గాలి సోకినట్లుగా ఉంది. ఎన్ని మందు లిచ్చినా రోగం కుదర లేదు." వా.
గావుకేక పెట్టు.
- పొలికేక పెట్టు.
- "గావుకేక పెట్టి ఆవిడ కింద పడిపోయింది." వా.
గావుగొను
- బలిగొను. వీథి. 41.
గావు పట్టు
- 1. చంపు.
- "హోమకుండములు నిర్ధూమధామంబులు, గావించి పశువుల గావు వట్టి." వరా. 5. 115.
- 2. నాశము చేయు.
- "పొదవెడు పురుషార్థముల గావు పట్టి,
- మదము మాత్సర్యంబు మట్టి మల్లాడి." విష్ణు. పూ. 3.
గావు వెట్టు
- బలి యిచ్చు.
- "గొప్ప చింబోతు కదుపులఁ గూర్చి నీకు, గావు వెట్టింతుఁ జుమ్మ యోగంగ నమ్మ !" నీలా. 1. 113.
గాసట బీసట
- సంస్కారము పొందనిది.
- "గాసట బీసటే చదివి గాథలు ద్రవ్వు తెనుంగువారికిన్." నృసింహ. 1. 9.
గాసర కూస రగు
- గాసట బీసట యగు.
- "గాసర కూస రయ్యె నని గాని వచింపరు మేలిమాట." గీర. 28.
గాసి చేయు
- బాధ పెట్టు.
- "నఖంబుల గీఱుచు గాసి సేయుచు." భాగ. స్క. 5. 106.
- రూ. గాసి సేయు.
గాసిపఱచు
- కష్టపెట్టు.
గాసిపఱుచు
- చూ. గాసిపఱచు.
గాసి బెట్టు
- కష్టపెట్టు.
- "దేశాధిపోదగ్రులన్, గాసిం బెట్టి విశాపుఁ జేసె నృగునిం గంసారి సామాన్యుఁడే." ఉ. హరి. 2. 65.
గాసివెట్టు
- కష్టపెట్టు.
- "గాఢ యౌవనమున గాసి వెట్టుటె కాక." నిరంకు. 2. 33.
గాళు చేయు
- పాడు చేయు.
- "ఆట తిప్పలు వుచ్చి పాట బండులు గూల్చి, కట్టువ లన్నియు గాళు చేసి." అచ్చ. రా. సుం. 95.
గింజ గిట్ర
- ధాన్యము. జం.
- "కొంచము గొంచు రం డతనిఁ గొల్పి భుజించెను గింజగిట్రలున్." (పద్య) బసవ. పు. 2. 21.
గింజుకొను
- తన్నుకొను.
- తదనుగత అర్థచ్ఛాయలలోనూ కానవస్తుంది.
గిజ గిజ కుడుచు
- కలవరపడు.
- "కదిలించి యెత్తఁగాఁ గడు నశక్తుఁడయి, గిజ గిజ కుడిచె నక్కేక యుండు."
గిజగిజ తన్నుకొను
- విలవిల లాడు.
- "గిజగిజం దన్నుకొనుచు ధరణిం బడి పొరలువారును." రాధా. 5. 88.
గిజగిజ పడు
- కలవరపడు.
గిజగిజ లాడు
- తన్నుకొను.
- "వాడు వానిచేతిలో దొరికి గిజగిజ లాడుతున్నాడు." వా.
గిజిగిజి యగు
- గిజగిజ లాడు, తన్ను కొను.
- "క్రిందటి కూర్మము గిజిగిజి గాఁగ." బస. 3. 68.
- చూ. గిజగిజ లాడు.
గిజిబిజిగా
- నమలుటలో ధ్వన్యనుకరణము.
- "గిజిబిజిఁ బిప్పిగా నమలు గిత్త..." కకు. 5. 72.
గిటకకాయ
- పొట్టివాడు.
గిటగిటన
- పొట్టిది.
- "హేమకూటంబు గిటగిటన." కాశీ. 1. 100.
- 'గిటక కాయ' అన్న రూపం పొట్టివాడు అన్న అర్థంలో వాడుకలో ఉంది.
గిటగిట నగు
- దుర్బలముగా నుండు.
- "గిటగిట నైన యీ కీరవాణికిని." గౌ. హరి. ద్వితీ. పం. 917.
గిటగిట మను
- కదలు; చలించు.
- "చనుఁగవవ్రేఁగున గిట గిట మను నెన్నడుము." ప్రభా. 2. 83.
గిట్ట కఱచు
- పళ్లు తీయ వీలు లేక కఱచుకొని పోవు.
గిట్టిపట్టు
- గట్టిగా పట్టుకొను. కుమా. 1. 102.
గిట్టుబా టగు
- లాభము వచ్చు.
- "ఈమాత్రం అమ్మితే పది రూపాయలు గిట్టుబా టవుతుంది." వా.
గిడసబారు
- పొట్టిగానే ఉండిపోవు.
- "వీ డేమిటిలా గిడసబారిపోతున్నాడు." వా.
- "పొట్లకాయ లన్నీ గిడసబారినవి." వా.
గిన్నెబొట్టు
- మంగళసూత్రము. తాళిబొట్లు రెండు రకాలు. ఒకటి మగడు కట్టేది. అది గుండ్రముగా కానివలె ఉండి, మధ్యలో చిన్న ఉబ్బు ఉంటుంది. గిన్నె బొట్టు గిన్నెవలె గుండ్రంగా ఉంటుంది. ఇదే చిట్టిబొట్టు కావచ్చు. ఇది పుట్టినింటివాళ్లు ఇస్తారు.
గిరవుంచు
- కుదువ ఉంచు. పూటగా నుంచు.
- "భవనాహృత శేషిత రత్నరక్షక, భగతరుసంతతిం బ్రథమభార్యఁ బురిన్ గిరవుంచె వార్ధి నాన్." ఆము. 1. 54.
గిరవు వెట్టు
- 1. కుదువ బెట్టు.
- "గిరికుచము లివిగో కృష్ణరాయ, గిరవు వెట్టకుం డాన కృష్ణరాయ." తాళ్ల. సం. 3. 174.
- "కనుదోయి మెఱుఁగులు కంతుతూపుల కడ,గిరవుగాఁ బెట్టితే హరిణనయన." విక్ర. 7.62.
- 2. కానుక యిచ్చు. వరాహ. 2. 113.
గిరికీలు కొట్టు
- పల్టీలు కొట్టు.
గిరికొను
- వ్యాప్త మగు.
- "తఱచుగఁ గూలినకరులున్, గిఱికొనియెన్ సమరమేదినీతల మెల్లన్." భార. భీష్మ. 2. 136.
గిరుక్కున (మరలు)
- ధ్వన్యనుకరణము.
- "హేమావతి వినోదకేళిగతి గిరుక్కున మరలి వచ్చి యాకథ వినియెద..." హంస. 1. 200.
- చూ. గిరుక్కున మళ్లు.
గిరుక్కున మళ్లు
- గిర్రున వెనుతిరుగు.
- "అటు గిరుక్కున మళ్లి..." రాధి. 1. 124.
గిరుల తాతలు
- కొండలకంటె పెద్దవి.
- "తత్పరిసరవర్తు లై గిరులతాత లనం గపియూధనాథులు..." భాస్క. యుద్ధ. 319.
గిఱికొను
- 1. క్రమ్ముకొను.
- "గిఱికొన్న మనోజవికారవేదనన్." జైమి. 4. 119.
- 2. నిలుచు. కాశీ. 5. 284.
- ఇందుకు దగ్గఱగా ఉన్న భావచ్ఛాయలలో ఇది ఉపయుక్త మవుతుంది.
గిఱికొలుపు
- పాదుకొనునట్లు చేయు.
- "మఱియును శరశతకము మెయి, గిఱికొలిపిన వృష్ణి వరుఁడు గినియఁగ లేక..." భార. ద్రోణ. 3. 271.
గిఱిగొను
- కుదురుకొను.
- "అఱిగ్రమ్మి మఱియు నిట్లనిరి నరేంద్ర, గిఱిగొన్న ప్రేమ భోగినులఁ గామంబుఁ." గౌ. హరి. ప్రథ. పంక్తి. 966.
గిఱిపిల్లాడి
- పిల్లెండ్లు. శ. ర.
- ఆడవాళ్లు కాలిలో చిటికెన వ్రేలి ప్రక్క వేలికి వేసుకొనే మెట్టెలవంటి వానిని పిల్లెండ్లు పిల్లాండ్లు అని నే డంటారు.
గిఱ్ఱున
- తిరుగుటలో ధ్వన్యనుకరణము.
గిఱ్ఱుపురుగు
- చెట్లలో గిఱ్ఱు మని అరుస్తూ ఉండే పురుగు. శ. ర.
గిలకకు నీరెక్కు
- చూ. కొండెకు నీ రెక్కు. గిలకొట్టు
- 1. చేతితో చిలుకు. జిలకొట్టు - గిలకరించు అని కూడా వాడుక. పెరుగు విషయంలో నేడు బాగా ఉపయోగిస్తారు.
- "కెరలించి యమృతంబు గిలకొట్టఁగా రాదె, ముద్దు చూపెడి వీరిమోవులందు." పాండు. 1. 117.
- 2. ముద్దుగా పుణుకు.
- "గిలకొట్టి యట్టె చక్కిలిగిలి యని పెట్టి..." చంద్రా. 2. 5.
- 3. గిలగిల మనిపించు.
- "గళదనర్గళగళ దళదుద్ధత ధ్వను, ల్గిల కొట్టి మండూకములు చెలంగ." శుక. 1. 276.
గిలగిల లాడు
- బాధపడు, తన్నుకొను.
- "అతను కడుపునొప్పితో గిలగిల లాడు తున్నాడు." వా.
- రూ. గిలగిల లాడిపోవు.
గిలవకాయ
- ఒకానొక ధమని.
గిలిగింతలు
- చక్కిలిగిలి. పాండు. 2. 38.
గిలిగింతలు పెట్టు
- చక్కిలిగింత పెట్టు.
- ఒకరిని నవ్వించుటకై చక్కిలి గిలి పెడతారు.
- "కేరఁగ రాదు నవ్వి గిలిగింతలు వెట్టఁగ రాదు చెక్కులం, జీరఁగ రాదు." హంస. 1. 94.
గిలిగింత వోవు
- చక్కిలిగిలి పెట్టిన ట్లగు.
- "ఎదుట జలకేళి గావింపఁ దదఖిలాంగ, ములు నిరీక్షించి గిలిగింత వోవు మనసు, నిలుపలేని కతంబున నిర్గమించెఁ జరమ ధాతువు శైలనిర్ఘరమువోలె." వరా. 11. 81.
- రూ. గిలిగిలి వోవు.
గిలిగిలింతలు పుచ్చు
- చక్కిలిగిలి పెట్టు. హరి. పూ. 5. 190.
గిలిగిళ్లు
- చక్కిలిగింతలు.
గిలుక్కు మను
- ధ్వన్యనుకరణము.
గిలుపాడు
- 1. కొద్దికొద్దిగా అపహరించు. బంగారము లాంటివానిని కొద్దికొద్దిగా గీచి రాచి తీసుకొనుటపై వచ్చినపలుకుబడి.
- "గిలుబాడు తల్లిపైఁ గలపసిండి." పాండు. 3. 16.
- 2. వంచించు.
- "తన ప్రాణనాథుఁ దోడ్తేర, వనజాక్షి యొక్కతె మనసుఁ బంపుడును... తను గిలుపాడెఁ గదా మనం బనుచు..." పండితా. ప్రథ. దీక్షా. పుట. 226.
గిలుబుకొను
- దొంగిలించు. మను. 3. 84. గిలుబు చేయు
- "తలిదండ్రులకు సమ్మతంబుగా నతిథి స,త్క్రియ యటంచు నొకింత గిలుబు సేయ." నిరం. 2. 26.
- చూ. గిలుబాడు.
గిల్కు మను
- ధ్వన్యనుకరణము.
గిల్గింత
- గిలిగింత.
గిల్బాడు
- చూ. గిలుబాడు.
గిల్లకన్ను
- మెల్ల కన్ను. కాశీ. 2. 80.
గిల్లచూపు
- మెల్ల చూపు.
గిల్లికజ్జా పెట్టుకొను
- ఊరికే ఉన్న వానిని కలహానికి లాగు.
- గిల్లి పెట్టి కయ్యమునకు లాగుట అన్న వాచ్యార్థముపై వచ్చిన పలుకుబడి. స్వల్ప విషయాలపై తగాదా రేపుట కూడా యిందులో సూచితము.
- "వాడికి గిల్లికజ్జా పెట్టుకోవడ మంటే మహా సరదా." వా.
గిల్లిన పాలు కారు
- 1. మిక్కిలి సుకుమార మయిన. శ్రవ. 3. 61.
- 2. శైశవావస్థలో నున్న.
- "గిల్లినను బాలు గారెడుపల్ల వోష్ఠి." లక్ష. 3. 80.
గీజుపోరు
- ఒకే వేధింపు వేధించు, పోరు.
- "కీలుగం టిది యేల పోలఁగా నునుఁ గొప్పు, గీల్కొల్పుకొ మ్మంచు గీజుపోరు." శుక. 2. 456.
- "శిశువులు...చిఱుతిండి గని యిది తె మ్మటంచు, గీజుపోరుట కెద పెల్ల గిల్లఁ బొగిలి, పొలఁతి యూరార్ప నతఁడు కాఁపురము సేయు." శుక. 3. 224.
- చూ. గీదుపోరు.
గీటడగించు
- చంపు.
- "బావిలోఁ, గెడపితి వట్టి ని న్నపుడు గీటడఁగింపక పోవ నిత్తు నే." జైమి. 3. 109.
- రూ. గీటణగించు.
గీటడచు
- రూపుమాపు.
- "సోదరయుతు దశాస్యుని గీటడంచి." రంగ. రా. బాల. పు. 19. పంక్తి. 11.
- రూ. గీటణచు.
గీటున బుచ్చు
- 1. కొట్టివేయు. ఏదైనా వ్రాసినప్పుడు వ్రాసినదానిలో దేని నైనా తొలగించి వేయ దలచుకొంటే దానిమీద గీత పెట్టడం అలవాటు. దానిపై వచ్చిన పలుకుబడి. గీత, గీటు ఒకటే.
- "....అని తలంచుచుఁ గీచకుని మాటలు గీటునం బుచ్చి యొండుపలుకులు జరపిన." భార. విరా. 2. 42.
- 2. వ్యర్థపఱచు; తిరస్కరించు.
- "వీఁడు సంయమి వనుమాట గీటునం బుచ్చి తన వలసినయట్లు చేయువాఁ డయ్యె." భార. సౌ. 2.
- "విని విననివాని చందం,బున గీటునఁ బుచ్చి." జైమి. 8. 39.
గీట్లబ్రద్ద
- రూళ్ళ కర్ర.
గీతకట్టె
- వడ్రంగులు గీతలు గీసేందుకు ఉపయోగించే పనిముట్టు.
గీతకత్తి
- కల్లు గీసే కత్తి.
గీత బయటపడు
- అదృష్టము కలుగు. కొత్త. 319.
గీదు పోరు
- ఒకే వేధింపు వేధించు. విప్ర. 3. 14.
- చూ. గీజుపోరు.
గీపెట్టు
- 1. శబ్దించు.
- "అదుకు వడక గీపెట్టక, పదను దివిసి రాగిదేరి పలుకక యున్నన్." పాండు. 3. 182.
- 2. అఱచు.
- "వా డెంత గీపెట్టినా వీడు ఆ వస్తువును ససేమిరా యివ్వ నన్నాడు." వా.
గీర
- గర్వము, పొగరు.
- "వాడికి కాస్త గీర యెక్కువ." వా.
గీరనగింజలు
- ఒకరక మైన పిల్లల ఆట. కళా. 6. 202.
గీర్వాణం
- గర్వము, అతిశయం.
- "దానికి మహా గీర్వాణం లే." వా.
గీఱుగాజులు
- ఒక రకమైన గాజులు.
గీఱునామము
- గోటితో గీటువలె పెట్టుకొనే బొట్టు.
గీఱుబొట్టు
- గీఱునామము.
- రూ. గీర్బొట్టు.
గీఱెత్తు
- దిమ్మ తిరుగు.
- "ఎండ తగిలి తల గీఱెత్తినది." వా. వావిళ్ళ.
గుంజా లేదు గూటము లేదు
- ఏమీ లే దనుట.
- రైతులద్వారా వచ్చిన పలుకుబడి. పశువులు కట్టివేయుటకు గుంజ, పత్తిగింజలు దంచుటకు గూటము కూడా లే దనుట.
- "వాడింట్లో గుంజా లేదు గూటమూ లేదు." వా.
గుంజిలి పెట్టు
- గుంజిళ్ళు పెట్టు; చెప్పిన పనులన్నీ చేయు.
- వావిళ్ళ ని. లో దాచు అని అర్థమిచ్చి ఇచ్చిన ప్రయోగం ఇది.
- "కావర మెత్తి యిట్టు తను గాఱియ పెట్టుచునున్న దాని ని,చ్ఛావతిఁ జూచి లేచి రభసంబున రెడ్డన పల్కె నోసి నీ, చేవ యెఱింగి కాదె మును చెప్పక గుంజిలి పెట్టి యున్కి నీ, వే వల దన్న వేఁడు కొనవే మఱి యే నయి చెప్పినాఁడనే." వెంక. పంచ. 4. 469.
గుంజిళ్ళు తీయు
- గుంజిళ్ళు పెట్టు.
గుంజిళ్ళు పెట్టు
- గుంజిళ్ళు తీయు.
గుంజుకొను
- లాగుకొను - బలవంతంగా. రాయలసీమలో బాగా వాడుకలో ఉన్న మాట.
గుంజు గునుకు
- హాస్యం చేయు. బ్రౌన్.
గుంటక గుజ్జులు
- గుంటకు ఉన్న గుజ్జు లనే భాగాలు.
గుంటక పాయు
- గుంటకతో పొలం దున్ను.
గుంటక్రోవ
- ఒక రకమైన ఫిరంగి.
- రూ. గుంటక్రోవి.
గుంట గూలు
- కూలిపోవు.
- "కొంత గుఱ్ఱ మెక్కితేనే గుంటఁ గూలిపోదురు." తాళ్ల. సం. 8. 186.
గుంట గూల్చు
- నాశనము చేయు. ఈ పలుకుబడి నేటికీ రాయలసీమలో నున్నది. 'వాణ్ణి నమ్మితే వాడు నన్ను గుంట గూల్చాడు.' గుంటలో పడవేయు యౌగికార్థం.
- "ఎవ్వండు వీర మహేశ్వరాహితుల, క్రొ వ్వడంగఁగ గుంట గూల్పంగ నోపు." పండితా. ద్వితీ. మహి. పుట. 208.
గుంటచాళ్ళు
- ఒక రకమైన పిల్లల ఆట.
గుంటచిక్కులు
- అనంతంగా మధ్యలో వచ్చే చిక్కులు.
- "ధనసంపాదనమునందలి గుంటచిక్కు లెక్కువగఁ దెలిసినవాఁడు." నందక. 116. సాక్షి. 406.
గుంటచిక్కులు పెట్టు
- నానారకా లయిన చిక్కులు పెట్టు.
- "తీసుకున్న పది రూపాయలూ యివ్వడానికి వా డెన్నో గుంటచిక్కులు పెడుతున్నాడు." వా.
గుంటదూలము
- 'గృహ విశేషములయందు కడయొత్తులమీద నుండి
- గుజ్జుల నడిమికి జొప్పించెడి చిన్నదూలము. శ. ర.
గుంటనక్క
- కపటి; కుయుక్తిశాలి. కుతంత్రాలు పన్నువాడు.
- "వాడు గుంటనక్క. వాణ్ణి నమ్ముకొని మాత్రం ఈ వ్యవహారంలో దిగొద్దు." వా.
గుంట బెట్టి గంట వాయించు
- మోసగించు; పాడు చేయు
- "ఔరౌర! వారల నిసర్గాభినయ ప్రభావ మెట్టిదియొ కాని మార్గగుల నట్టె కాలు గట్టి నిలువఁబెట్టి పయనంబును నది గుంటఁ బెట్టి గంట వాయించు నట్టుల గనుకట్టు చేయఁగలరా." ధర్మజ. 49. 3. తె. జా.
గుంట బెట్టు
- రూపు మాపు.
- "తొంటి చాకచక్యం బెల్ల గుంటఁ బెట్టె." నందక. 17 పు.
గుంట యోనమాలు
- తొలి అక్షరాలు.
- నేలమీద కానీ, చెక్కమీద కానీ అక్షరక్రమాన్ని తొలిచి ఉంచేవారు. పిల్లలు తొలుత వానిలోనే వ్రేలు రుద్దుకొని నేర్చుకొనేవారు.
- "తాను సర్వవిద్యా పారంగతుం డై యుండియు మనకు గుంట యోనమాలైన నేర్పినాఁడా." సాక్షి. 47 పు.
గుంటుకాడు
- యుద్ధసైనికులలో ఒక విధమైన ఆయుధం ధరించేవాడు. కుమా. 11. 40.
- చూ. కుంతంబువాడు.
గుండగొయ్య
- దుర్మార్గుడు; మూర్ఖుడు. బ్రౌన్; శ. ర.
గుండాడు
- నులిచి వేయు.
- "దుండగంబునఁ బూల గుండాడ వికలిత,వృత్తిఁ గల్పకవాటి వీటిఁబోయె." వరాహ. 10. 15.
గుండాన పడిపోవు
- గంగలో కలియు వంటి పలుకుబడి. కొత్త. 142.
గుండా పిండి యగు
- ధ్వంస మగు. పిండిపిండి యగు అనుట.
గుండియ గూడు వట్టు
- హృదయము చిక్కబట్టుకొను, నిబ్బరముతో ననుట.
- "ఏవగ నుండినాఁడొ హృదయేశుఁడు గుండియ గూడు వట్టి తా, దేవుఁడు గానఁ గొంత కడతేఱె మనోభవుఢాక కన్యుఁడే..." బహులా. 4. 60.
గుండియ యదురు
- భయపడు.
- "ఆన విని గుండియ యదరన్, మనుజేశ్వరుఁ డాప్తు లైనమంత్రులతో ని,ట్లను." శుక. 1. 458. గుండియలు క్రుళ్ల దన్ను
- బాగుగా తన్ను.
- "గుండియలు గ్రుళ్ళఁ దన్నిన గ్రుక్కు మిక్కు, రనక యాతని కినుక చల్లాఱ నిచ్చి." శుక. 3. 627.
- వాడుకలో - గుండెలు కుళ్లేట్లు తంతాను.
గుండుకొను
- గుంపు కట్టు.
- "గుండుకొని చూచుమానిసి, తండముఁ దొలఁగంగఁ ద్రోచి తత్కరివెస నా, చండాలుఁ దెచ్చి తత్కరి..." వాసి. 4. 103.
గుండుగల్లు దాచిన పెండ్లి చెడునె
- వివాహ సందర్భంలోనే సన్నికల్లు త్రొక్కిస్తారు. ఒక వేళ ఆ గుండ్రాయి దాచి పెట్టినంతమాత్రంతో పెండ్లి ఆగుతుందా? ఆగ దనుట. ఇలాంటిదే "అయ్యవారు లేక పోతే అమావాస్య నిలుస్తుందా?"
- "మును గుండుగల్లు డాఁచినఁ బెండ్లి సెడునె, చెనసి బిచ్చమ్ము మాన్చిన భక్తి సెడునె." పండితా. ప్రథ. పురా. పుట. 383.
- చూ. గుండ్రా డాచిన...
గుండుగిలు
- చాపచుట్టగా పడు.
గుండుగుత్త
- సర్వహక్కులతో ఇచ్చేగుత్త. బ్రౌన్.
గుండు గూడు
- గుంపుకట్టు; కలిసి ప్రయత్నించు.
గుండు గూలగ గొట్టు
- పొడిపొడి చేయు. రుక్మాం. 3. 10.
గుండుజల్ల
- పెద్ద జల్ల.
గుండులు నీరుగా
- రాళ్లు కరిగేటట్లు.
- "చాండాలికన్ మీటుచున్, గుండుల్ నీరుగ నెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్." ఆము. 6. 7.
గుండు వేయు
- ఫిరంగో, తుపాకో పేల్చు.
గుండు వేస్తే అందకుండా వెళ్ళు
- కనిపించకుండా పోవు.
- "గుండు వేస్తే అందకుండా వెళ్ళావు - ఏ మయ్యావు రా ఇన్నాళ్లు." వా.
గుండుసున్న అగు
- పని చెడిపోవు.
గుండుసూది
- తలపై పూజగా ఉన్న సూది.
గుండె ఆగి పోయింది
- అత్యాందోళనను తెలిపే పలుకుబడి.
- "అతను వస్తాడు వస్తా డని ఆరునెల్ల నుంచీ కాచిపెట్టుకొని ఉన్నానా? రానని తంతి వచ్చేసరికి నా గుండె ఆగి పోయింది." వా. గుండెకు రోమాలు మొలిచిన వాడు.
- ధైర్యశాలి, ధీరుడు.
- "ఈ ఊళ్లో గుండెకు రోమాలు మొలిచినవాడు ఒక్కడు ఉన్నట్టు లేడు." వా.
గుండె గతుక్కు మను
- భీతి కలుగు.
- "అకస్మాత్తుగా ఆవిడ పోయిం దనే సరికి గుండె గతుక్కు మన్నది." వా.
గుండె గుబ్బు మను
- గుండె జల్లు మను. ధ్వన్యనుకరణము.
- "దానిన గుండె గుబ్బు మన దా నెరియన్ విడిచెన్." కళా. 4. 21.
గుండె గూడు దిగు
- గుండెమీది బరువు తొలగిపోవు. దిగులు తీరు. అనగా నిర్భయస్థితి యేర్పడు.
- "నదులకు గుండెగూడు దిగె నాగకులంబులు నిద్ర వోయె ని,ర్జరులును మిన్ను దన్నిరి..." కాశీ. 2. 61.
గుండె గూడు పట్టు
- ఎంత బాధ లున్నా గుండె బిగ బట్టుకొను, బాధ కోర్చు కొను.
- "....యేవగ నుండినాఁడొ హృదయేశుఁడు గుండియ గూడు వట్టి తా, దేవుఁడు, గానఁ గొంత కడతేఱె మనోభవుఢాకకు..." బహులా. 4. 60.
- "...చూడ దాడ దొక సుద్దియు గుండియ గూడు పట్టి నాఁ, డెట్టు భరించినాఁడొ హృదయేశ్వరుఁ డవ్వ లరా హళహళిన్." పాంచా. 3.
- రూ. గుండియ గూడు పట్టు.
గుండె గొంతుకలో కొట్లాడు
- మాట పెగలనీయనంత భావోద్రేకము కలుగు.
- "గుండె గొంతుకలోన కొట్లాడుతాది, కూకుండ నీదు రా కూసింతసేపు." ఎంకిపాటలు.
గుండె చిక్కబట్టుకొను
- గుండెదిటవు కల్పించుకొను.
- "పాపం ! ఆవిడ ఎన్ని అవస్థ లొచ్చినా గుండె చిక్కబట్టుకొని ఎలానో కొడుకును చదివిస్తూంది." వా.
గుండె చెక్క లగు
- హృదయవిదారక మగు.
- "ఆవిడ గుండె చెక్క లయ్యేటట్లుగా యేడ్చింది." వా.
గుండె చెదరు
- "ఆ పిల్లను ఆ స్థితిలో చూచేసరికి గుండె చెదిరి పోయింది." వా.
ఉండె చెఱువు చేసికొను
- భయపడు.
- "ఆ గొల్ల కుఱ్ఱడు కాసంత కనులెఱ్ఱ చేసినంతన యింతగా బెండువడి గుండె చెఱువు చేసికొనవచ్చునా?" ధర్మజ. 76. పు. 16.
గుండె జల్లు మను
- భయపడు. ధ్వన్యనుకరణము.
- "వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె జల్లు మని కల్లువడి..." మను. 5. 19.
- "తొలుదొల్త వానిఁ గన్నులఁ గాంచి నప్పుడ, పల్లవాధర గుండె జల్లు మనియె." మను. 3. 91.
గుండె ఝల్లను
- బెదరు, బెంగగొను, దిగులు పడు.
- ధ్వన్యనుకరణము.
- "ఝల్లన గుండె గుభుల్లన నవసి." పండితా. ప్రథ. పురా. పుట. 467.
గుండెతల
- వక్షస్థ్సలము.
- "గుండెతల బిట్టు దన్నినఁ గూలుటయును." దశ. 6. 153.
గుండెతల్లడము
- భయకారణము.
- "కోకములకు గుండెతల్లడము కైరవ మిత్రుఁడు దోఁచెఁ దూర్పునన్." పారి. 2. 41.
గుండెదిగులు
- భయంకరము. విరోధి.
- రూ. గుండెదివులు.
గుండెదివులు
- భయంకరము.
- "భరతంపుటయగారి గుండెదివులు." శుక. 3. 20.
- చూ. గుండెదిగులు.
గుండెధైర్యము
- ధైర్యము.
- "వాడికి గుండెధైర్యం లేదు." వా.
గుండె నీ రగు
- భయభ్రాంతి కలుగు.
- "చారులచే గాండీవి మ,హారథికుల తోడ వచ్చె నని విని గుండెల్, నీ రై సైంధవతనయుఁడు, పేరోలగ ముండి బిట్టు పిఱువడి చచ్చెన్." జైమి. 8. 156.
గుండె పగుల బొడుచు
- గట్టిగా చావుపోటు పొడుచు.
- "ఉరువడి పోరాడి యొగి కైటభారి, భల్లూకపతి గుండెఁ బగులంగఁ బొడువ." ద్విప. కల్యా. పు. 97.
గుండె పగులు
- భయము కలుగు.
- "నవమాసంబులు నిండె గుండె వగిలెన్ నా కంతలోఁ గొంత లో,క వినోదంబుల కీ ఫలంబు చవి దక్కం జేసి రక్షింపవే." ఉ. హరి. 2. 15.
- "వాడు వచ్చా డనేటప్పటికి నా గుండె పగిలి పోయింది." వా.
గుండె పటుక్కనన్
- ధ్వన్యనుకరణము.
- "గుండె పటుక్కన వచ్చె వి,భుం డిఁక నె ట్లనుచు మల్ల పుంగవుఁ బథికుం...." శుక. 3. 215.
గుండె పట్టుకొను
- 1. గుండెనొప్పి కలుగు.
- "ఉన్నట్టుండి మంచినీళ్లు తాగేసరికి గుండె పట్టుకొనింది." వా.
- 2. ధైర్యము తెచ్చుకొను. ప్రబోధ. 3. 40.
గుండెపై చేయిడి నిద్ర పోవు
- ఆదమఱచి నిద్రపోవు.
- "మా అమ్మ ఉన్నంతదాకా నా కేం భయం లేదు. గుండెమీద చేయి వేసుకొని నిద్ర పోవచ్చు." వా. గుండెబలం
- ధైర్యం, స్థైర్యం.
- వాడికి గుండెబలం ఎక్కువ. కాబట్టే యెన్ని వచ్చినా తొణకకుండా బెణక కుండా ఉండగలుగు తున్నాడు." వా.
గుండెబెదురు
- హృదయశల్యం వంటిది. ఆ పేరెత్తితే హడలు పుట్టిస్తుందను పలుకుబడి వంటిదే.
- "కర్మవాదుల గుండెబెదురు." పండితా. ప్రథ. వాద. పుట. 511.
- చూ. హృదయశల్యం.
గుండె భగ్గు మను
- దిగులు కలుగు.
- "గుండె భగ్గు మని తల్లడపా టొదవంగ." సారం. 2. 270.
గుండె భగ్గు రను
- "గుండె భగ్గు రనుచు నుండ దెట్లు." కవిక. 4. 112.
గుండె రాయి చేసుకొను
- ఏదో విధంగా - అతి కష్టంపై గుండెదిటవు కల్పించుకొను.
- "ను వ్వెన్ని కష్టాలు పడుతున్నా పిల్లలను చూసైనా గుండె రాయి చేసుకొని తిరుగాడాలి." వా.
గుండెలపై కుంపటి
- అతి సన్ని హిత మై యెల్ల వేళలా వేచు దిగులు - భారము.
- "చిన్నతనంలోనే పసుపు కుంకుమ నోచుకోని యీ పిల్లను ఎదాన వేసుకొని యెలా యీడ్చుకొస్తున్నానో దైవానికి తెలుసు. ఈ గుండెలపై కుంపటిని ఎన్నాళ్లు మోసుకొని తిర గాలో? ఎప్పుడు ఆ దైవం పిలుస్తాడో?" వా.
గుండెలపై బండగా తయా రగు
- భారంగా, బాధాకరంగా పరిణమించు.
- "ఏదో సహాయంగా ఉంటా డని వీణ్ణి యింట్లో ఉంచుకుంటే గుండెలమీద బండగా తయా రయ్యాడు. పోయిన చో టంతా రంపులు తెస్తున్నాడు." వా.
గుండెలమీద బరువు దించు
- దిగులును తగ్గించు. ఇలా అనే పట్ల ఉపయోగించే పలుకుబడి.
- "ఎలాగో మా అమ్మాయికి కాస్త మంచి సంబంధం ఒకటి చూచిపెట్టి నా గుండెలమీద బరువు దించండి. మిమ్మ ల్నెప్పుడూ తలచుకొంటూ ఉంటాను." వా.
గుండెలు కొట్టుకొను
- భయం కలుగు. భయాందోళనలను సూచించే పలుకుబడి.
- "ఆవిడ పేరు చెప్పితే నాకు గుండెలు కొట్టుకొంటాయి. గయ్యాళిగంప ఆవిడ." వా.
గుండెలు క్రుళ్లు
- దిగులుపడు.
- "అయ్యున్కిఁ గనుఁగొని గుండె లెల్లఁ, గుళ్లుచుండంగ వదినెలు కుంది కుంది." భోజ. 6. గుండెలు జాఱిపోవు
- ధైర్యము సడలు ; దిగులు కలుగు.
- "ఆ పిల్లను ఆ స్థితిలో చూచేసరికి గుండెలు జాఱిపోయాయి." వా.
గుండెలు తీసిన బంటు
- ధీరుడు.
- గుండె ఉంటే భయపడే అవకాశ మైనా ఉంటుంది. అది కూడ లే దనుట.
- "వాడు గుండెలు తీసిన బంటు. ఇరవై మంది కాదు. ముప్పై మంది వచ్చినా ఆప గలడు." వా.
- "వాడు గుండెలు తీసిన బంటు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడ గలడు." వా.
- "వాడు గుండెలు తీసిన బంటు. పది మంది వచ్చినా జవాబు చెప్పగలడు." వా.
గుండెలు పగిలిపోవు
- ఎక్కువ భయాందోళనలు కలుగు.
- "నేను స్నేహితులతో చీట్లపేక ఆడుతున్నానా, అప్పుడు మా నాన్న వచ్చాడని నా స్నేహితు డొకడు వచ్చి చెప్పేసరికి నా గుండెలు పగిలిపోయా యంటే నమ్ము." వా.
గుండెలు బాదుకొను
- దు:ఖావేశమును తెలుపు చేష్ట.
- "ఆ ఉత్తరం వచ్చేసరికి ఆవిడ గుండెలు బాదుకొంటూ బయలుదేరింది." వా.
గుండె లేనివాడు
- భీరువు.
- "వా డేమాత్రం గుండె లేనివాడు." వా.
గుండెలో గాలము
- హృదయశల్యము, భయ కారణము.
- "అనిమిషుల గుండెలో గాల మఖిల లోక, నేత్రమున నాఁటి వేధించు నెరసు గాలి." ఉ. రా. 1. 149.
గుండెలో రాయి పడు
- నిరాశ కలుగు.
- "వస్తుంది వస్తుంది అని ఆ ఉద్యోగం కోసం కాచుకు కూర్చున్నాను. అది కాస్తా వాడు తన్నుకుపోయా డనేసరికి నాకు గుండెల్లో రాయి పడింది." వా.
గుండేల్లో రైళ్లు పరుగెత్తు
- అత్యాకుల మనస్కతను సూచించు పలుకుబడి. ఇది ఇటీవల విపరీతంగా కథలలో కానవస్తుంది.
- "తా నెంతగానో ప్రేమించినవాని పెండ్లిపత్రిక వచ్చేసరికి ఆవిడకి గుండెల్లో రైళ్లు పరుగెత్తినాయి." వా.
గుండా, చెరువా ?
- అంత ధైర్యమా ? అంత సాహసమా ? అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "మిమ్మలిని అంత మాట అనడానికి వాని దేం గుండా? చెరువా?" వా.
గుండ్రా డాచిన పెండ్లి యాగునా?
- స్వల్ప మైనది లేకున్నంత
- మాత్రాన పని ఆగిపోవునా అనుటలో వాడు పలుకుబడి. పెండ్లిలో వంట వార్పులకు ఏ కొంతో ఉపయోగపడే గుండ్రాతిని దాచిపెట్టినంత మాత్రంతో పెండ్లి ఆగు తుందా?
- పెండ్లిలో సన్నె కల్లును పెండ్లి కూతిరిచేత త్రొక్కించుట అలవాటు. కనుక ఈగుండ్రాయికి సన్నెకల్లు అని కొందఱు అర్థం చెబుతారు. కాని అది కూడా వివాహకర్మలో విడ దీయరాని ఒక భాగం. అది లేక వివాహం ఆగినా ఆగ వచ్చును కనుక ఇక్కడ గుండ్రాయి గుండ్రాయే. సన్నికల్లు కా దేమో?
- "గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కున్ గష్టముష్టింపచా!" మను. 5. 17.
గుండ్లు గూల్చిన భంగిన్
- (పై నుండీ) గుండ్లు దొర లించినట్లు.
- "కురిసె మహావృష్టి గుండ్లు గూల్చిన భంగిన్." కుమా. 6. 105.
గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు
- అస్యవ్యస్త మయినట్లు. పరిస్థితి తలక్రిందు లయినప్పుడు ఉపయోగించే పలుకుబడి.
- "పొదిలిన యగ్గురు ప్రాపున భవదీయ సైనికులు గొంద ఱాకృష్ణులం జేరి పరాక్రమించుట గుండ్లు దేలి బెండ్లు మునింగిన ట్లయ్యె." భార. ద్రో. 3. 67.
- చూ. బెండ్లు మునిగి గుండ్లు తేలు.
గుండ్లు దేలి బెండ్లు మునుగు
- చూ. గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు.
గుండ్లు బెండ్లాడు
- కదిలించివేయు.
- "వాయువు లొగి లోకపంక్తు లన్నియు గుండ్లు బెండ్లాడంగఁ దొణఁగె." రంగ. రా. ఉత్త. 11. పుట.
గుంతకండ్లు
- లోతుకండ్లు.
- "ఆ గుంతకండ్ల పిల్లను ఎవడు చేసుకుంటాడు?" వా.
గుంపిడు
- గుంపు గట్టు, గుంపుగా చేరు.
- "గుంపిడి జనులు...." పండితా. ప్రథ. పురా. పుట. 444.
గుంపు గూడు
- గుంపు చేరు.
- "తదీయ నగరావనకో,విదు లగు ననేక పావకు లదరి, బెదరి గుంపు గూడి యందఱుఁ దమలోన్." ఉషా. 4. 29.
- "తండోపతండము లై గుంపు గూడి." రాధా. 4. 103.
గుంపు దీర్చు
- వెంట్రుకలు మొదలైనవానిని చేర్చి సవరించు.
- "పెన్నెఱుల్, మెల్లన గుంపు దీర్చి." కాళిందీ. 2. 63. గుంపులు కట్టు
- గుంపు గూడు.
- "అక్కడ నిక్కడన్ నిలిచి రత్తఱి గుంపులు గట్టి వానరుల్." భా. రా. యు. 919.
గుంపులో గోవింద
- ఏదో గందరగోళం జరగగా ఆ సందున తన ప్రయోజనమును సాధించుకొను.
- చూ. సందట్లో సమారాధన.
గుంపెనలాడు
- గునిసియాడు.
- "ఊరకుండవుగా ఓసి మాయ నిన్నుఁ జేరఁ బిలువము గుంపెన లా డేవు." తాళ్ల. సం. 11. 3. భా. 41.
గుం పెఱుగు
- విజృంభణము తెలియు, రీతి నెఱుగు. (సరిగా చెప్ప వీలు లేకున్నది.)
- "తారాకాసురుండు...మహా యుద్ధంబు సేయుచున్నం గని వాని గుంపెఱింగి నగుచున్." కుమా. 12. 178.
గుక్క పట్టు
- ఊపిరి తిరగకుండా బిగపట్టు. ఇది యేడ్చుటలో ముఖ్యంగా వినవస్తుంది. కుమార. శత. 27.
గుక్కు మిక్కనక
- పలుకక, నో రెత్తకుండ.
- "అడరుభయమున గుక్కు మిక్కనక వెనుక, వెనుక కొదిగెడు తన ప్రాణ విభునిఁ జేరి." శుక. 3. 275.
గుక్కుమిక్కను
- ఆకలిచే నకనకలాడు.
- "అంత నొక్క బక్క నక్క గుక్కు మిక్కనుచు డొక్కం బిక్కటిల్లిన క్షుధానలంబున దందహ్య మానం బై డస్సి..." హంస. 1. 188.
గుక్కుమిక్కు మనకుండా
- కా దనకుండా.
- "అది ఏం తిట్టినా వాడు గుక్కు మిక్కు మనకుండా వెళ్లిపోతాడు." వా.
గుజ గుంపులు
- హడావిడి; గుసగుసలు.
గుజగుజ యగు
- గిజగిజ లాడు.
- "గజము మద ముడిగి తిరుగుచు, గుజగుజ యై గేఁక వెట్ట." భాగ. 5. స్కం. 407.
గుజగుజరేకులు
- ఒక పిల్లల ఆట.
గుజగుజలాడు
- గుసగుసలాడు; గోప్యముగా, మెల్లగా మాటలాడు.
- "నిఖిలసన్మునులు, గుజగుజలాడఁ గన్గొని సభవారి." గౌ. హరి. ప్రథ. పంక్త్ల్. 131.
గుజగుజలు వోవు
- రహస్యముగా మాటలాడు.
- "పెక్కువిధంబులం దలపోసి గుజగుజలు వోవుచుండుదురు." భార. విరా. 2. 201.
- "వారివారికి నెఱింగి గుజగుజ వోవుచు." హర. 5. 57.