పదబంధ పారిజాతము/కొల్ల గొట్టు
- 2. కొల్లగొను.
- "అఖిల తీర్థంబులును నాడి యవని సురుఁడు, కోర్కి మైఁ బుణ్యలక్ష్ములఁ గొల్లవెట్టె." కాశీ. 3. 91.
- 3. ముఖ్యంగా రాయల సీమలో దీనినే పాడు చేయు అనే అర్థంలో ఉపయోగిస్తారు.
- "ఇంట్లో ఆస్తంతా కొల్లపెట్టినాడు." వా.
- "కోడలు అత్త చచ్చిన నాలుగునాళ్ల కే తనవాళ్ల కంతా ఇల్లు కొల్ల పెట్టింది." వా.
- 3. ఏదో ఏడ్చు. విసుగూ, అసంతృప్తిని సూచిస్తూ వంట ఏం చేయాలి అని కోడలు అడిగినప్పుడు అత్త అంటుంది.
- "ఏదో ఒకటి కొల్ల పెట్టమ్మా? నన్నెందుకు చంపుతావు." వా.
కొల్ల బోవు
- పా డగు.
- "నా తపము భక్తిం బాడు గాకున్నె యే,ల విచారింపఁగ నెల్లయున్ వ్రతము కొల్లంబోయినం జూచెదన్."
కొల్ల లాడించు
- కొల్ల గొట్టించు.
- "గోవిందు బీరంబుఁ గొల్ల లాడింతు." గౌర. హరి. ప్రథ. పంక్తి. 1146.
కొల్లలాడు/
- కొల్ల గొట్టు.
- "భావజుపక్ష మై మిగుల బాలిక తాలిమిఁ గొల్లలాడెడిన్." కళా. 6. 248.
- "పరిజనంబులు పరిపక్వఫల సుగంధ, కుసుమరసపల్లవంబులఁ గొల్లలాడి." శుక. 1. 375.
కొల్ల లిడు
- కొల్ల పెట్టు. బ్రౌన్.
కొల్లలు కొమ్ములు పోవు
- ఎక్కువ యగు.
- "...ఐహిక భూరి సుఖంబు గొల్లలుం, గొమ్ములు వోవఁగా బనిచె గోమినిశక్తి కుమారుఁ డర్థితోన్." దశకు. 10. 111.
కొల్లలు మీఱు
- ఎక్కు వగు.
- "కురవకమునఁ గలుగఁ జేసెఁ గొల్లలు మీఱన్." రుక్మాం. 3. 129.
కొల్ల వట్టు
- కొల్ల గొట్టు.
- "గుట్టునఁ గోరిక లెల్లం గొల్ల వట్టె." తాళ్ల. సం. 3. 256.
కొల్ల విడుచు
- చూఱ విడుచు, విస్తారముగా నొసగు.
- "కుమ్మ రావంబు కడవలు కొల్ల విడుచు." శివ. 2. 40.
- "ఉన్న ధనముఁ, గొల్లవిడిచిన బ్రాహ్మణు లెల్లఁ దనిసి." జైమి. 1. 73.
- చూ. చూఱ విడుచు.
కొల్ల వెట్టు
- దోచుకొను.
- "వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం గొల్లపెట్టి సమస్తవిత్తముఁ గ్రూరతం గొని పోవఁగా." భాగ. 7. 225. కొల్లాడు
- కొల్ల గొట్టు, తనివి దీర అనుభవించు.
- "కొ, ల్లాడిరి కైవల్యలక్ష్మి నమరులు మునులున్." కాశీ. 2. 37.
కొల్లాయ (యి) గుడ్డ
- షష్ఠి పంచ. చిన్న పలుచని తుండు.
కొల్లాయ (యి) పంచ
- చూ. కొల్లాయగుడ్డ.
కొల్లారుబండి
- కప్పున్న బండి.
- "పావ లటు మీటి కొల్లారు బండి యెక్కి, దురదురన రంభ యింటికి నరిగి." కువల. 4. 213.
- రూ. కొల్లార్బండి.
కొల్లేటి చేంతాడు
- సుదీర్ఘ మైనది.
- చూ. కొండవీటి చేం తాడు.
కొల్లేటి మడుగు
- పెద్దది, అంతము లేనిది.
కొల్లేటి వ్యవసాయం
- లాభము లేనిది, వ్యర్థము.
- "అదంతా కొల్లేటి వ్యవసాయం. దాని వల్ల లాభం యే ముంది?" వా.
కొల్చి పోయు
- వెచ్చించు.
- "కాలగతులను, పొరి నాయుష్యముఁ గొల్చి పోయుచున్నా రయ్యా !" తాళ్ల. సం. 7. 33.
కొల్వుండు
- కొలువు దీఱు, సభ తీరి యుండు.
- "ఉభయవాదులను గొల్వుండి పిల్పించి." పండితా. ద్వితీ. మహి. పుట. 128. నిరంకు. 1.7.
- రూ. కొలువుండు.
కొల్వు విచ్చు
- సభ చాలించు.
- "గుండె జల్లనఁ జేతికులిశంబు వైచి, పండెఁ బొమ్మని దేవపతి కొల్వు విచ్చె." గౌ. హరి. ప్రథ. పం 318-19.
'కొశ్చన్‌మార్కు' మొగం పెట్టు
- ప్రశ్నార్థకంగా చూచు. చాలా ఇటీవలి పలుకుబడి.
కొళ్ళు కొళ్ళున దగ్గు ధ్వన్యనుకరణము.
- "కొళ్ళు కొళ్ళున దగ్గుచో..." విప్ర. 4. 19.
కోక చాకియింట వేసి కొక్కిరాలవెంట పోవు
- ఒకచోట పడవేసి మరొక చోట వెదకు.
- వ్యర్థప్రయత్న మనుట. తాళ్ల. సం. 8. 175.
కోక వాక
- బట్ట, పాత. జం.
- "మునుమున్న తెలిసి యీముది వరాటమునకై, కొంచురా లే నైతిఁ గోక వాక." నిరం. 2. 123.
- రూ. కోకా వాకా. కోకా వాకా జం.
- బట్టా బాతా.
- రూ. కోక వాక.
కోచవాఱు
- భయపడు.
- "వేల్పు, రాచవారలు నా కత్తిఁ గోఁచ వాఱ, నితఁ డనఁగ నెంత." చంద్రా. 3. 33.
- నేటికీ రాయలసీమలో 'కోచ నాయాలు' పిఱికిపంద అనే అర్థంలో ఉపయోగిస్తారు.
కోటకొమ్మ
- దుర్గప్రాకారం పైభాగము. ఆము. 2. 5.
కోట బలసికొను
- కోట కావలి కాయు, దుర్గ సంరక్షణ చేయు.
- "లెక్కకు నెక్కు డగుచు విక్రమాటోపంబునఁ గోట బలసికొనుటయు..." కళా. 8. 75.
కోటరము చేయు
- అత్తవారింట కాపురము చేయు.
- కోడంట్రికము చేయు.
- "అరయమిఁ జేసె నమ్మహా, పురుషుని పాలికిన్ బతులు వోవఁగ వీరలతోన యేను జె, చ్చెరఁ జని కోటరంబు దగఁ జేయుదునో." భార. ఉద్యో. 3. 112.
కోటలో కొల్ల వంకదారలో పోయినట్లు
- ఒకచోట వచ్చిన లాభం మఱొక చోట పోవుపట్ల ఉపయోగించే పలుకుబడి. కోటలో కష్టపడి దొంగతనం చేసి తెచ్చిన సొమ్మంతా వంకలో కొట్టుకొని పోయినట్లు.
- "ఇంత చెప్పినచో దమయంతి నిచ్చు, టెంత ఘన మిఁకఁ జెప్పఁగా నేల నీతి, కుశలతను జూడుఁ గోటలోఁ గొల్ల వంక, దారలోఁ బోయినట్టి విధంబు గాదె." నలచ. 4. 68.
కోటలో పాగా వేయు
- రాజానుగ్రహము సంపాదించు; కార్యానుకూలతను సాధించు.
- ఏ దైనా విశిష్ట మైన కార్యం నిర్వహించినప్పుడు రాజాస్థానాల్లో పండితులకు శాలువా వలె పాగా నొకదానిని ఇచ్చే వా రనీ, దానిని పాగా వేయుట అనడం కల దనీ, ఇలాంటి అలవాటు మొన్న మొన్నటిదాకా బొబ్బిలి ఆస్థానంలో ఉండే దనీ అక్కడి మిత్రు లొకరు చెప్పినారు.
- శత్రులు కోట లగ్గపట్టినప్పుడు ఉడుముతోకకు పాగా కట్టి
- కోటపైకి విసరివేసి ఆ పాగాను పట్టుకొని పైకి వెళ్లి పోవుట కలదు. దానిద్వారా వచ్చిన పలుకుబడి అయినా కావచ్చును.
- "వాడు కోటలో పాగా వేశాడు. ఇంక వాడి ప్రభ వెలుగుతుంది అన్న మాటే." వా.
కోటానకోట్లు
- 1. విపరీతముగా, అసంఖ్యాకముగా.
- "లక్షోపలక్షలు శాఖోపశాఖలుఁ గోటానకోటులు సంఖ్యాతిసంఖ్యలుగా నడుచుసమయంబున." హంస. 3. 29.
- ".....పూతాతిథి శ్రోతంబులగు బ్రాహ్మణ గృహవాటికలు దాఁటి కోటానగోటు లై కోటకొమ్మల యందు...." కళా. 2. 150.
కోటా పేటాగా ఉండు
- ఆనుకొని, కలిసి ఉండు. పూర్వం కోటలు, వాని ప్రక్కనే పౌరు లుండే పేటలూ ఉండేవి.
- "సికింద్రాబాదూ హైదరాబాదూ కోటా పేటాగా ఉంటాయి." వా.
కోటికి పడగెత్తి టాటాలు గుణించు
- కోటిని కోటానుకోట్లుగా చేయు.
- "కోటికిఁ బడగెత్తి టాటాలు గుణియింప, నే నేర్తు." విప్ర. 4. 28.
కోటికి పడగెత్తినవాడు
- కోటీశ్వరుడు. కోటి సంపాదించగనే తచ్చిహ్నంగా ఒక ధ్వజ మెత్తు ఆచారం ఉండి ఉంటుంది. అట్లా వచ్చిన పలుకుబడి.
- "కోటికి పడగెత్తిన వానిఁ బదివేల కాప వై బ్రదుకు మన్నట్టు." బస. 1. 5.
- "అన నిట్టి పలువయఱపుల, కును గోటికిఁ బడగ యెత్తి గుఱి యగుపెద్దన్, నిను నమ్మరాదు గా క, ట్లొనరించితె యిట్టి లంచ మొసఁగ నె నీకున్." కళా. 7. 27.
కోటి కొండలుగ
- ఎక్కువగా, అత్యధికంగా.
- "నృపుల పదహలరేఖల కెల్ల మా భు,జాగ్రహల రేఖలే మూల మనుచుఁ గోటి, కొండలుగ ధాన్యరాసులు పండ వీట, సుజనభజనైకవిఖ్యాతి శూద్రజాతి." ఆము. 2. 27.
కోటిపడగలు
- కోటిధనం ఉన్నవా డెల్లా ఒక ధ్వజం కట్టేవాడు పూర్వం. అదే కోటికి పడ గెత్తుట. ఆ ధ్వజాలే కోటి పడగలు.
- "నలిఁ గోటి కోటిపడగలు, గలిగొనఁ గట్టినను వానిఁ గా దని మదిలోఁ, దలఁపరసంఖ్యార్థ ధ్వజ,ములు గట్టినవారు వైశ్యముఖ్యు లనేకుల్." కుమా. 7. 118.
కోటి సేయు
- అమూల్య మగు.
- "సాటి లేనినగళ్లు కోటి సేయ." విజయ. 1. 23.
కోటేరుముక్కు
- చక్కని ముక్కు.
- సేద్యంలో కోటేరు వేసినప్పుడు ఎప్పుడూ చాలు తిన్నగా ఉంటుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
- "ఆవిడ చాలా అంద మైనది. చేరెడు కండ్లు, కోటేరు ముక్కూ, నిమ్మపండు రంగు." వా.
కోటేరు వెట్టు ముక్కు
- చక్కని ముక్కు.
- "కోటేరు వెట్టు చెన్ను మీఱిన ముక్కు." వర. రా. అయో. పు. 252. పంక్తి. 3.
- చూ. కోటేరు ముక్కు.
కోట్యంతరాలుగా
- కోట్లకొలదిగా. కాశీయా. 276.
కోడంగి యాటలు
- కోణంగిఆటలు.
- ఆనందోత్సాహంతో ఎటు పడితే అటు ఆడుతూ ఎగురుతూ ఉన్నా రనుట ఇట ప్రస్తుతము:
- పండితా. ద్వితీ. పర్వ. పుట. 434.
కోడాడు
- కుమ్మి కోరాడు.
- "అమ్మౌని శూలంబు చే, కొని నారాయణప్రాణముల్ రణములోఁ గోడాడఁ జూడన్." ఉత్త. హరి. 6. 45.
- "అ వ్వేదండంబులు... కోడాడు చుండ." నృసిం. 4. 47.
కోడికునుకు
- అరనిద్ర.
- కోడి సగం కండ్లు మూసి నిద్రిస్తుంది.
- "వాడిది కోడికునుకు. ఎప్పుడు పడితే అప్పుడే మేలుకుంటాడు." వా.
- చూ. కోడినిద్ర.
కోడి కూసినదాక
- తెల్ల వారేదాక.
- "కోడి కూసిన దాకా నిద్ర పట్టలేదు." వా.
కోడి కూసే పల్లె
- ప్రతి పల్లె.
- "అంగ రంగ వైభవములు నుం, దిర మగును దేవళంబులఁ, బరఁగఁగ నొక కోడి గూయుపల్లియు నైనన్." విప్ర. 1. 60.
- "కోడి గూసేపల్లె ఉందంటే కోమటి ఉన్నా డన్నమాటే." సా.
కోడి గ్రుడ్డంత
- కొంచెము.
- "కోడిగ్రుడ్డంత యన్నమ్ము కొసరె నొకఁడు." గుంటూ. ఉత్త. 15.
కోడిగ్రుడ్డుకు తంటసమా
- ఈ మాత్రానికి అంత అవస్థ పడవలెనా?
- కోడిగుడ్డు పట్టుకొనుటకు తంటసము కావలెనా అనుట.
- తంటసము అంటే ముక్కులోని వెండ్రుకలు లాగుటకై
- మంగలి ఉపయోగించే పనిముట్టు. వెండ్రుకవంటి అతి సూక్ష్మ మయినదానిని పట్టుకొనుటకే తంటసం కావాలి కానీ ఇంత లావాటిదానికి ఎందుకు?
కోడినిద్ర
- అరగన్ను మూతతో నిద్రించే నిద్ర.
- "వాడి దెప్పుడూ కోడినిద్ర. కండ్లు చూస్తే నిద్ర పోతున్నాడో మేలుకున్నాడో తెలీదు." వా.
- ఎప్పటి కప్పుడు మేలుకొంటూ జాగ్రత్తగా ఉంటా డనే సందర్భంలో కూడా ఉపయోగిస్తారు.
- చూ. కోడికునుకు.
కోడిఱెప్ప పెరుగు
- కనుఱెప్పపై దుర్మాంసం పెరిగే నేత్రరోగము వచ్చు." బస. 3. 74. పుట.
కోడెకాడు
- యువకుడు.
కోడెగాడ్పు
- మందమారుతము.
కోడెత్రాచు
- వయసులో ఉన్న త్రాచు పాము.
- "కోడెత్రాచును ముద్దు లాడినట్లు." వేణు.
కోడె లమ్మెడు పాటి పరికరము కలదా?
- ఆ మాత్రం పశుసంపద కలదా? అనుట. ఆ రోజులలో పశువులు కూడా ప్రధాన మైన ధనమే.
- "పరికరము కోడె లమ్మెడు పాటి గలదె." ఉ. హరి. 4. 308.
కోడెవయసు
- పడుచుప్రాయము.
- "...కోడెవయసు, పాక ముఱ్ఱూఁత లూఁగెడు భార్యమీఁద, మనసు చాలించి..." హంస. 5. 115.
కోడెవిటులు
- పడుచు విటులు. హంస. 1. 212.
కోడెవెధవ
- పడుచు వితంతువు.
- "కామాంధల్ వెలనాటి కోడె విధవల్." క్రీడా. 209.
కోణంగిచేష్టలు
- కోతిచేష్టలు.
కోణంగి యాట లాడు
- కోతి చేష్టలు చేయు, కొంటె చేష్టలు చేయు.
- "నటులు చూపిన విద్య నటులఁ గా దంచుఁ దా, నడ్డ మై కోణంగియాట లాడు." రాజగో. 5. 45.
- కోణంగి - వీధి భాగవతాలలో హాస్యగాడు. దాని మీద వచ్చిన పలుకుబడి. కోణాలగొంది
- ఒక మూల.
- "మఠాంతరాళ విశాల వేదులయందుఁ గోణాలగొందిఁ దపంబు సల్పు జనంబు." పాండు. 5. 296.
కోత కోయు
- చీట్లాటలో మిగతవారు వేసిన రంగుముక్క లేనప్పుడు తన దగ్గర ఉన్న తురుపుముక్క వేస్తే అది కోత కోయడం అవుతుంది. ఆ పట్టు వానికే పోతుంది.
- చూ. పైకోత కోయు.
కోతలరాయడు
- డంబాచారి. మాటా. 65.
కోతలు కోయు
- డంబాచారములు పలుకు. గొప్పలు చెప్పుకొను. సాక్షి. 13 పు.
కోతికి కొబ్బరికాయ అబ్బినట్లు
- ఎంత అమూల్య మైనా ఉపయోగించుకునే యోగ్యత లేనప్పుడు దొరికీ ఏం లాభం? - అనుపట్ల ఉపయోగిస్తారు.
- "ఆ ఆడంగుల వెధవకు అంత అందమైన పిల్ల నిచ్చి చేశారు. కోతికి కొబ్బరికాయ అబ్బినట్లుగా ఉంది వాడి పని." వా.
- చూ. కోతిచేతి కొబ్బరికాయ.
కోతికి కొబ్బరికాయ చిక్కినట్లు
- అనుపభోగ్య మనుట. కోతికి కొబ్బరికాయ దొరికినా అది అనుభవించ లేదు కదా ! అది యెట్లా పగలకొట్టి తినాలో దాని కేం తెలుసు?
- చూ. కోతికి కొబ్బరికాయ అబ్బినట్లు.
కోతికి స్త్రీ వేషము
- అతకనిది. కోతి వికార మైనది. దాని కెంత స్త్రీ వేషం వేసినా కుదరదు అనుట. గువ్వలచెన్న. 75.
కోతికుళ్లాయి
- చలి తగలకుండా వేసుకొనే ఉన్ని తలటోపీ.
కోతికొమ్మచ్చు లాడు
- పెద్ద వారితో పరియాచక మాడు; ఒక ఆట ఆడు. కోతి కొమ్మచ్చు లనేది ఒక విధ మైన పిల్ల లాడుకొనే ఆట. చెట్ల మీదనే దొంగకు అందకుండా తప్పించుకొంటూ చెట్టు మొదలు పట్టుకోవాలి. వేసవికాలంలో నేటికీ యీ ఆట పల్లెలలో పిల్ల లాడుతూ ఉంటారు.
- "నీ అంత స్తెక్కడ? నా అంతస్తెక్కడ? నాతో కోతికొమ్మచ్చు లాడుతున్నా వేమిటిరా?" వా. కోతిచేతి అద్దము
- చూ. కోతిచేతి కొబ్బరికాయ.
కోతిచేతి కొబ్బరికాయ
- ఉపయోగించుకో లేనివానికి అమూల్యవస్తువు లభించినప్పుడు అనే మాట. కోతికి కొబ్బరికాయ దొరికితే దాన్ని పగలగొట్టి తినడం తెలియదు కదా !
- "ఆ వెధవకు అంత మంచి పిల్ల దొరికి మాత్రం ఏం లాభం? కోతిచేతి కొబ్బరికాయ." వా.
కోతిచేతి పూలమాల
- ఉపయోగం తెలియని వారికి చిక్కిన అమూల్యవస్తువు.
- "కటకటా! మూర్ఖ మర్కటకరతలస్థ, కల్పతరు నూనమాలికా కల్పుఁ డగుచు." శుక. 1. 364.
- చూ. కోతిచేతి కొబ్బరికాయ, కోతిచేతి అద్దము.
కోతిచేష్టలు
- పిచ్చి చేష్టలు.
- "ఏమిట్రా ! ఆ కోతిచేష్టలు. ఇంత పెద్దవాడ వైనా యింకా మట్టూ మర్యాదా తెలియక పోతే యెలా ?" వా.
కోతిని బ్రహ్మరాక్షసుని చేయు
- అల్పులను అధికులుగా పొగడు.
- "వీరధర్మ మిట్లు విడిచి విభీషణ, రాజు నెదుట దాశరథులఁ బొగడఁ, బాడి యగునె క్రోఁతి బ్రహ్మరాక్షసుఁ జేయ, వచ్చినాఁడ వెంతవారు వారు." భాస్క. యుద్ధ. 119.
కోతిపుండు బ్రహ్మరాక్షసి
- చిన్న దానిని అనవసరంగా పెద్ద దగునట్లు చేయుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- పుండును కెలికి కెలికి కోతులు పెద్దవి చేసుకుంటా యని ప్రతీతి.
- "ఆ చిన్న వాగ్వాదం కాస్తా కోతిపుండు బ్రహ్మరాక్ష సై హైకోర్టు దాకా వెళ్లింది." వా.
కోతిపుల్లలు
- మగ్గం దారాలను మీదికి తగిలించే పుల్లలు. బ్రౌన్.
కోనకావలి
- వ్యర్థము.
- కోనకు కావలి కాయడం ఎందుకు అనుటపై వచ్చినది. శవజాగరణం లాంటిది.
కోనచీకటి
- చిమ్మచీకటి.
- "కోనచీఁకటిలోని కొనరఁ జొచ్చి." కళా. 4. 121.
కోన్ కిస్కా
- వీఁ డెవడు ? య: కశ్చన.
- "క్రుద్ధుం డగు భీష్ముముందు కోంకిస్క గజశ్రద్ధుండు కర్ణుఁ డే మగు." గీర. గురు. 45.
- చూ. కశ్శనగాళ్ళు. కోపకత్తె
- కోపిష్ఠి.
- "సుక్షత్రియ కులంబు నిక్షత్రముగఁ జేయు, కొడుకుఁ గాంచినయట్టి కోపకత్తె." క్రీడా. 129.
కోపగాడు
- కోపిష్ఠి.
- "అన్న మీ తండ్రి కోపగాఁ డౌనొ కాదొ." కాశీ. 4. 90.
కోపదారి
- కోపిష్ఠి.
- "బావ ప్రతికూలుఁడు నాథుఁడు కోపదారి." చెన్న. బస. 4. 277.
- "మా తమ్ముడు చాలా కోపదారి. నాతో ఏమన్నా అందువు గానీ ఈ మాట వానితో అనేవు. భద్రం!" వా.
- కోపదారి అను పాఠము సరి కాదు.
కోపము ఆఱు
- కోపము తీఱు. కోపమును అగ్నితో సమానముగా భావించుటతో వచ్చిన పలుకుబడి.
- "దీని మ్రింగక వృథా వసియించినఁ గోప మాఱునే." కా. మా. 2. 101
- చూ. కోపము చల్లాఱు.
కోపము చేసుకొను
- కోపించు.
- "వాడు నామీద చాలా కోపం చేసుకున్నాడు." వా.
కోపము పట్టలేక పోవు
- కోపమును అణుచుకొన లేక పోవు.
- "ఎంత వద్దన్నా కోపం పట్ట లేక వాడు నాలుగూ అనేశాడు." వా.
కోపము పుట్టు
- కోపము కలుగు.
- "పురభేదికిఁ గోపము పుట్టి వీఁడు న న్నించుకయేనియుం దెలియఁడు..." కా. మా. 4. 186.
కోప మెత్తు
- కోపించు, కోపము వహించు.
- "కౌరవులు సేయు నవమతికారణముగఁ, గోప మెత్తు." భార. శాంతి. 1. 13.
- "పెండ్లివారలఁ జూడ నా పిన్న తనము, గూల నింతటిలో వట్టి కోప మెత్తి, తలుపు బిగియించె మగఁడు." శుక. 2. 131.
కోపమే కూడుగా కుడుచు
- అతికోపిష్ఠి యగు.
- "కోపమే కూడుగాఁ గుడిచిన యీ బుద్ధి, కోపము విడువు మంటే గుణ మేల మాను." తాళ్ల. సం. 10.18.
కోపిష్ఠి
- చూ. కోపదారి.
కోపుదారుడు
- సరుకు బైటనుండి తెచ్చి అమ్మువాడు. శ. ర.
కోపు మీఱు
- ముందంజ వేయు.
- "ఏలికలు వెంట వెస నంట నేపు రేఁగి, కోపు మీఱి జవోద్వృత్తిఁ గూడఁ బఱచి." శుక. 1. 259.
కోపులు కల్పించుకొను
- రకరకాల అంగ భంగిమలు చూపు.
- "నట్టువకాని యందము గాక వింతగాఁ, గోపులు గల్పించుకొనుచు నాడు." శుక. 3. 14.
కోపు లెత్తు
- దండెత్తు.
- "భటరోషశిఖిశిఖప్రభల మ్రింగి బలారి, కులిశధారలమీఁద గోపు లెత్త." సాంబో. 5. 203.
కోమటినిజము
- అసంభవము. వ్యాపారస్తుడు నిజం చెప్పడం ఎలా సంభవమనుట పై వచ్చినది.
- చూ. కోమటిసత్యము.
కోమటిమాటలు
- అటూ యిటూ తేల్చకుండా మాట్లాడే మాటలు.
- "నువ్వు యిస్తావా లేదా? స్పష్టంగా చెప్పు. ఈ కోమటిమాట లన్నీ యెందుకు?" వా.
కోమటిమైత్రి
- నమ్మరానిది.
- వ్యాపారి ఎప్పుడూ తనలాభం చూచుకుంటా డనుటపై వచ్చినది. గువ్వల చెన్న. 67.
కోమటిరహస్యం
- వాడు రహస్యం అనుకున్నా ఇతరులకు స్పష్టంగా తెలియునది.
- 'కొండమీద కొట్లాట ఏమిటిరా అంటే కోమట్లు రహస్యం మాట్లాడుకొంటున్నారు అన్నాడట.' సా.
- "నీ వేదో రహస్యం రహస్యం అని చెప్పావు. నేను వెళ్లేసరికి ఊ రంతా అదే చెప్పుకుంటున్నారు. ఇదంతా కోమటిరహస్యంగా ఉందే." వా.
కోమటివిశ్వాసము
- నమ్మ రానిది.
- చూ. కోమటి మైత్రి.
కోమటిసత్యము
- అసంభవము.
- కోమటి వర్తకంలో సత్యంగా యిది యింతే నని చెప్పినా అది నిజ మై ఉండదు. రాధి. 4. 79.
- చూ. కోమటినిజము.
కోమటిసాక్ష్యం
- అటూ యిటూ కాకుండా చెప్పే సాక్ష్యం.
- ఒక గుఱ్ఱం ఎవరిది అన్న తగాదా వచ్చి యిద్దరు రాజుగారి దగ్గరకు వెళ్లారు. అందులో సాక్ష్యంగా వచ్చిన ఒక వైశ్యుడు ముందువైపు చూస్తే రంగన్నది వలెనే ఉన్న దనీ, వెనక వైపు చూస్తే రామన్నది లాగే ఉన్న దనీ చెప్పా డని ఒక కథ. అలా వచ్చిన పలుకుబడి.
- "నీవు ఏదో ఒకటి తెగ జెప్తా వని వస్తే కోమటిసాక్ష్యం చెప్తా వేమిటి?" వా. కో యని యార్చు
- 1. కూత వేయు. ధ్వన్యనుకరణము.
- "కో యని యార్చినం దెసలఁ గుంజరముల్ సెదరెన్." కా. మా. 2. 35.
- 2. అఱచు.
- "గురుతర లీల పద్య మది కో యని యార్చుచు నుండె." గుంటూ. ఉత్త. 30.
- అఱచుటలో ధ్వన్యనుకరణము.
- "నింగి కయి కుంచె యెత్తి వె,సం గో యని యార్వ." మను. 4. 59.
కోరకొండె
- వంపుగా ముడివేసిన సిగ. శ. ర.
కోరకొప్పు
- ముడి వేసి ఒక ప్రక్కగా వెండ్రుకలలో దూర్చి ఓరగా పెట్టిన కొప్పు. కుమా. 8. 143.
కోరకొమ్ము
- వంపుగా వాడిగా ఉన్న కొమ్ము.
- "హోమకుండముల పై కుఱికి కొంకర, కోరకొమ్ములఁ గోరాడుఁ గొంత తడవు." వరాహ. 11. 76.
కోరగొను
- కొంకరలు పోవు.
- "కాళ్లు నేలపైఁ ద్రొక్కఁగ రాక కోరగొని తొట్రుపడంగ." పద్మ. 3. 79.
కోరచూపు
- క్రూర మైన చూపు.
- "కోరచూపుల యెఱ్ఱ చేరు గ్రుడ్డుల వాఁడు." వరాహ. 2. 45.
కోరదౌడ
- చప్పిదౌడ. భార. మౌ. 25.
కోరపాగ
- వాలుగా చుట్టిన పాగా.
కోరమీస
- చూ. కోరమీసములు.
కోరమీసము
- చూ. కోరమీసములు.
కోరమీసములు
- పొడుగాటి మీసాలు.
- "మనుజ రక్త సిక్త తనువును గోరమీ, సములు..." భార. అశ్వ. 3. 87.
కోరలు తీసిన పాము
- ఏమీ చేయ లేనివాడు - లేనిది - తన శక్తిని చూపగల సాధనమును కోలుపోయిన వారి పట్ల ఉపయోగించే సామ్యం.
- "వెడగొడ్డుఁ బులి నాకి విడిచిన ట్లైన, జడిసి తొల్లిటి తన జంజాట మెల్ల, నుడిగి కోఱలు లేనియురగంబుఁ బోలె, వడి చెడి...." గౌ. హరి. 2. భా. 973.
- "ఉద్యోగం ఉన్నన్నినాళ్లూ మహా విజృంభించాడు. అది పోయేసరికి కోరలు తీసిన పాములాగా మూల బడి ఉన్నాడు." వా. కోరలు పెఱికి వేయు
- పొగ రణచు.
- కోరలు పీకివేస్తే పాము ఏ చేయగల దనుటపై వచ్చినది. మాటా. 52.
కోరలు లేని ఉరగము
- ఏమీ చేయలేని దనుట. గౌ. హరి. ద్వి. 975.
- చూ. కోరలు లేని పాము.
కోరవాఱు
- క్రూర మగు. వరాహ. 3. 20.
కోరవోవు
- కొంకరవోవు. పక్షవాతంతో పడిపోవు. హరి. పూ. 7. 171.
కోరసిగ
- ఓరగా వేసుకొన్నముడి.
- "కోరసిగ వేయుచోటనే కొమ్ము పుట్టి." రామా. 2. 110.
కోరాబంగారు
- తగ్గుబంగారు.
కోరిక లిగురొత్తు
- కోరికలు కలుగు.
- "నారథుఁడు పుణ్యక వ్రత, మారూఢిగ నెఱుఁగఁ జెప్ప నవహితమతి యై, కోరిక లిగురొత్తఁగ." పారి. 5. 63.
కోరిక లీడేరు
- కోరికలు తీరు.
- "నా కోరిక లీడేరఁగఁ, గైకొనవలె నీవు." కా. మా. 2. 14.
కోరిక లీరిక లెత్తు
- కోరికలు కలుగు.
- "ఎలమితోఁ గోరిక లీరిక లెత్తిన, సరణి మేఁ బులకలు జాదుకొనఁగ." విక్ర. 1. 122.
- చూ. కోరికలు గంతులు వేయు.
కోరికలు గంతులు వేయు
- కోరిక లధిక మగు.
- ".....మనంబులోపలం, గంతులు గోరి కోరికలు గంతులు వైవఁ గృషీవ లాజ్ఞ...." శుక. 2. 455.
- చూ. కోరిక లీరిక లెత్తు.
కోరికిపడు
- మోజుపడు.
- "విని వీక్షించినదాఁక ముచ్చటపడున్ వీక్షించి గాఢోపగూ,హనలాభం బగు దాఁకఁ గోరికిపడున్." మల్లభూ. శ్ర్. 22.
కోరువెట్టు
- బలి యిచ్చు.
- "అరులకుఁ గోరు వెట్టితి కదా నినుఁ దమ్ముఁడ..." రామా. 8. 38.
కోర్కుల నంద గను
- మనోరథము లీడేర్చుకొన గలుగు.
- "పారిజాతంబు నామ్రోలఁ బండి యుండ, నందఁ గంటి నాకోర్కుల నందఁ గంటి." ఉ. హరి. 2. 176.
కోర్కుల పంట
- మనోరథసిద్ధి.
- "ముం, గొంగుపసిండి భక్తులకుఁ గోర్కుల పంట, జగంబులందు మా..." అని. 1. 42.