పదబంధ పారిజాతము/కాలికి బుద్ధి చెప్పు

కాలా___కాలా 454 కాలి___కాలి

కాలాతీత మగు

  • వేళ మీఱు.
  • "ఇప్పటికే కాలాతీత మయింది. నాలుగు ముక్కల్లో నా ఉపన్యాసం ముగిస్తాను." వా.

కాలాదిపఱచు

  • దౌడు తీయించు.
  • గుఱ్ఱంమీద కూర్చున్నప్పుడు దానిని అదిలించుటకు కాళ్లను దాని డొక్కలకు తాకి పరువెత్తు మని సంజ్ఞ చేయుట అలవాటు. అందుపై వచ్చిన పలుకుబడి. పలుకుబడి కనుకనే ఏనుగ విషయంలో ఇది అసాధ్య మయినా భావార్థంలో ఉపయుక్త మైంది.
  • "ఐరావతంబు గాలాది పఱవ." నిరంకు. 3. 36.

కాలార్చు

  • కాలాడించు.
  • "ఱోలుచు నెత్తురు ఱొంపిలో మునిగి, కాలార్ప నేరనికరితురంగములు." ద్విప. కల్యా. పు. 79.

కాలావసరములు

  • కాలకృత్యములు.
  • ఏ కాలమునందు అవసరమైన పనులు, పూజలు ఆకాలమున తీర్చుట కాలావసరములు తీర్చుట.
  • "కాలావసరములు గడలు వెట్టితివొ." పండి. పురా. ప్రథమ. 452.

కాలికంచము

  • ఒక పిల్లల ఆట.
  • "కాలికంచంబును గట్టెగుఱ్ఱము." హంస. 3. 146.

కాలికింద బలాదూరు

  • దాని కిది తీసికట్టే అనుట. దానిముందు ఇది ఏమాత్రం పనికి రాదు అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "కలకత్తా మేడలతో పోలిస్తే మదరాసు కాలికింద బలాదూ రనుకో." వా.

కాలికి బందాలు వేయు

  • ఆకొట్టుకొను.
  • "వాడి కేదో ఉద్యోగం ఇస్తా నని ఓక్షణంలో కాలికి బందం వేశేశాడు. ఇక వాడు మన మాట వినడు." వా.

కాలికి బలపం కట్టుకొని తిరుగు

  • అదే పనిగా ఎక్కువగా తిరుగు.
  • బలపం వ్రాస్తుంది. అరిగి పోతుంది. అందుపై కాళ్లరిగి పోవునట్లుగా, కాళ్ల జాడలు శాశ్వతంగా ముద్రితమై పోవునట్లుగా అన్నట్లుగా వచ్చిన పలుకుబడి.
  • "కూతురు సంబంధంకోసం అతను ఆరు నెల్లనుంచీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు." వా.

కాలికి బుద్ధి చెప్పు

  • పాఱిపోవు. కాలి____కాలి 455 కాలి____కాలి
  • "నలుగురూ చేరేసరికి ఆ దొంగ కాలికి బుద్ధి చెప్పాడు." వా.

కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు

  • ఏమాత్రం అపాయం కలగదు.
  • "కాలు ములు గాడునే సదా మేలె గాక, వెఱపు వలదు." ప్రబోధ. 4. 56.

కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేయు

  • ఏదో విధంగా వాదంలో తికమకలు పెట్టు.
  • "వానితో మనం వాదించ లేం. కాలికి వేస్తే మెడకూ, మెడకు వేస్తే కాలికీ వేస్తూ కూర్చుంటాడు. ఏదీ తెగ నివ్వడు; ఎందుకూ అంగీకరించడు." వా.

కాలికి వేస్తే మెడకు వేయు

  • ఒకదానికి సమాధాన మివ్వగా మరొక తగాదా లేవదీయు.
  • "వాడితో సమాధానపడడం సాధ్యం కాదు. కాలికి వేస్తే మెడకు వేస్తుంటాడు." వా.

కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి

  • చూ. కాలికి వేస్తే మెడకు మెడకు వేస్తే కాలికి.

కాలిక్రింది కసవుగా చూచు

  • హీనముగా చూచు. ఇక్కడ కసవు గడ్డి అనే అర్థంలో ప్రయుక్త మైనది.
  • "పరభయంకరబిరుదవిస్ఫురితు డైన, కాంతు నయ్యిందుముఖి తన కాలిక్రింది, కసవుగా నెంచు వెడమాయ గప్పి చోర,ధవుల మాటలు వడకి యౌదల ధరించు." శుక. 3. 128.
  • పొరక, పూచిక, గడ్డిపుల్లలను హీనతాసూచకములుగా ఉపయోగించిన పలుకుబడులు మనకు చాలా ఉన్నవి.
  • "వాడు నన్ను పొరకపుల్లకంటే హీనంగా చూస్తాడు." వా.
  • "ఆ పని వాడికి పూచికపుల్లతో సమానం." వా.
  • "వాడు నాకు గడ్డిపరకతో సమానం." వా.

కాలికొద్దీ పరుగెత్తు

  • ఎంత శక్తి ఉన్నదో అంత శక్తినీ ఉపయోగించి పరుగెత్తు.
  • "నలుగురూ చుట్టుకొనేసరికి ఆ దొంగ కాలికొద్దీ పరుగెత్తాడు." వా.

కాలికొద్దీ పరువెత్తు

  • వేగముగా పరుగెత్తు.
  • "కుక్క తరుముకు వచ్చేటప్పటికి వాడు కాలికొద్దీ పరు వెత్తాడు." వా.

కాలికొలది

  • కాలిదాకా.
  • "కొదమతట్టువగుంపు కాలికొలందికి వ్రేలు లాలు కుంచెలు." ఆము. 4. 35.

కాలి గోటికి దీటు రాదు

  • ఏమాత్రం సరిపోలదు.
  • "రంభ కూడా దాని కాలిగోటికి దీటు రా దంటే ఇక ఊహించుకో! ఎంత అంద మైన పిల్లో." వా. కాలి____కాలి 456 కాలి____కాలి

కాలి గోరున పోలకుండు

  • ఏమాత్రమూ సరిరా కుండు.
  • "వారల యగణ్యరూపలావణ్యతతులు, బాల! నీ కాలి గోరున బోలవరయ." రామాభ్యు. 5. 179.

కాలిజోడు

  • పాదరక్షలు.
  • "నా కాలి జోడు వాళ్ల యింట్లో మరిచి పోయి వచ్చాను." వా.

కాలి జోళ్ళు తెగేదాకా.

  • ఎక్కువగా (తిరుగు. కొట్టు).
  • "వాడి కొంప చుట్టూ కాలిజోళ్లు తెగేదాకా తిరిగాను." వా.
  • "వాడు ఆ సందు మొనలో ఒంటిగా చిక్కగానే కాలిజోడు తెగేదాకా కొట్టాను." వా.

కాలిడ నిచ్చు

  • ప్రవేశింప నిచ్చు.
  • "........దృష్టికి గన్పడె గొన్ని రూపముల్, కనుపడి మమ్ము నీ మగడు కాలిడ నీయడు మా స్థలంబులం, దునిమెదము..." హంస. 3. 114.
  • వాడుకలో రూపం: కాలు పెట్ట నిచ్చు.
  • "వా ణ్ణిక ఈ యింట్లో కాలు పెట్ట నిస్తానా?" వా.

కాలిడి నిల్చు

  • ధైర్యంగా నిలబడు.
  • "భీషణవేషమూ జూచి నేలపై, గాలిడి నిల్తురే." కుమా. 10. 144.

కాలిడు

  • ప్రవేశించు; గృహప్రవేశము చేయు.
  • "నృపాలు సారెలకు గాలిడ నెందును జోటు లేక..." భోజ. 7. 130.
  • "నీ, యనుజయు నేను గా లిడుదుము." వేం. పంచ. 1. 86.
  • వాడుకలో రూపం: కాలు పెట్టు.

కాలితెరువు

  • కాలిబాట.
  • "ఒక్క నాటి పయనంబున నది మార్గంబు దప్పి కాలిత్రోవం బడి..." శుక. 2. 245.
  • చూ. కాలిబాట.

కాలి దాటగు

  • కీడు తగులు.
  • పీడానివారణార్థం మాంత్రికులు ఏవో దిగదుడిచి నాలుగువీధులు కలిసినచోట పారవేయడం అలవాటు. వాని నింకెవ రైనా దాటినపుడు ఆ కీడు వారికి సోకుతుం దని నమ్మకం. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాని కెక్కొడో కాలిదాటై ఒళ్లు తెలియకుండా జ్వరం వచ్చింది." వా.

కాలినడక

  • బండీ బడకా లేకుండా నడిచి పోవుట.
  • "ఆ పల్లె వెళ్లా లంటే కాలినడక తప్ప మార్గం లేదు." వా. కాలి____కాలి 457 కాలి____కాలి

కాలినపుండ్లలో ఉప్పులు చల్లు

  • ఎక్కువబాధ కలిగించు. గోరుచుట్టుపై రోకటిపోటు వంటిది.
  • తాళ్ల. సం. 12. 33.
  • చూ. కాలినపుండుమీద కారం చల్లు.

కాలినపుండ్లమీద కారం చల్లు

  • ఎక్కువ బాధ పెట్టు.
  • అసలే పుండు నొప్పి. దాని మీద కారం చల్లితే మరింత బాధ.

కాలిబాట

  • దగ్గరదారి.
  • బండ్లు కాకుండా మనుష్యులు మాత్రమే పోవుటకు వీలయిన దారి.
  • "బండ్లబాటమీద పోతే పదిమైళ్లుంటుంది. కాని కాలిబాటన పోతే రెండు పరువులు ముటీముటాలుగా ఉంటుంది." వా.
  • చూ. కాలిత్రోవ.

కాలిమట్టులు

  • కాలిత్రొక్కిళ్లు.
  • "బలనికాయము కాలిమట్టులనె యడచు." పారి. 1. 23.

కాలిమానిసి

  • కాల్బలము; పదాతి.
  • "కరి తురంగంబులు కాలిమానుసులు." పల. పు. 22.
  • చూ. కాలుమానిసి.

కాలిమీది కాలు తీయకుండా

  • ఏమాత్రం పని చేయకుండా, హాయిగా సాగు ననుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వాడి కేం? కాలుమీది కాలు తీయకుండా జరిగిపోతుంది." వా.

కాలిమీది కాలు వేలిమీద రాయి వేసుకొని

  • అట్టహాసంగా - పనీ పాటా లేకుండా.
  • "వాని కేం? తండ్రి పెట్టిపోయిన ఆస్తి ఉంది. కాలిమీద కాలు వేలిమీద రాయి వేసుకొని బతుకుతాడు." వా.

కాలిముల్లు

  • బాధ పెట్టునది.
  • "గాలి కాలిముల్లు కుభృత్ పాలి పాలి పిడుగు రావణుడు డిందె." ఉత్త. రామా. 1. 149.
  • "కంటిలోని నలుసు కాలిముల్లు." వేమన.

కాలియాఱు

  • కాలిపోవు.
  • "అంగజన్మ నీ, విలసితచారురూపతను విభ్రమసంపద లీక్షణంబులో, బొలుపఱ గాలియాఱె నహిభూషణకోప దవానలాహతిన్." కుమా. 5. 72.

కాలీచవడగా

  • కాళ్ళు అరిగిపోవునట్టుగా అనుట వంటిది.
  • తిరిగి తిరిగి కాళ్ళు చిక్కి పోగా అనుట.
  • "కాలీచవడ జరింపుదు, నీ లోకమునందు నెల్ల..." పాండు. 2. 204. కాలు___కాలు 458 కాలు___కాలు

కాలుకంబము

  • ద్వారబంధపు ప్రక్కస్తంభం.
  • "మరుడు శృంగారవీథు లేర్పఱచి తనదు, పేర నొక పేట గట్టి సంప్రీతి దోర, ణాల నుంచిన కాలుకంబాల నంగ, గలికి యూరులు చెలగు బై గాంచి మెఱయ." బిల్హ. 2. 115.

కాలుకడ

  • కాళ్లవైపు.
  • "కాల్కడ యొద్ద కల్ల, జని వినమ్రు డై నిలుచుండె సవ్యసాచి." ఉద్యో. 1. 65.

కాలు కింద పెట్టకుండా

  • ఏమాత్రం పని చేయకుండా.
  • "వాని కేం? కాలు కింద పెట్టకుండా జరుగుతుంది. మనకు రెక్కాడితే గానీ బొక్కాడదు." వా.

కాలు కింద పెట్టనీయకుండా

  • ఏమాత్రం పని చేయనీయ కుండా.
  • "ఆపిల్లను కాలు కింద పెట్టనీయకుండా చూచుకొంటున్నాడు." వా.

కాలు కొను (కొననిచ్చు)

  • కాలు నిల్పు.
  • "కాలు కొనక లీలోద్యానంబున కేకాంతంబున జని." కుమా. 5. 116.
  • "అంత కంతకు నెక్కుచు సంతమసము, గాలుకొన నీక చంద్రుండు గ్రాలె నధిప!" భార. ద్రో. 5. 275.

కాలుగాలిన పిల్లి వలె

  • ఆలస్యమున కోర్వ లేక. ఒక చోట నిలువక. అత్యాందోళితస్థితిని తెలిపే పలుకుబడి.
  • "కాలు గాలిన పిల్లికరణి నీ వెంట, నేల నీబంట నై యెల్లందు దిరుగ." గౌర. హరి. 2. భా. 1243.
  • "ఎంతసేపటికి భార్య రాకపోయేసరికి వాడు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు." వా.

కాలు గీరు

  • సైగ చేయు.
  • "వాడు నేను మాట్లాడుతుండగా ఎక్కడ వాళ్లమాటకు ఒప్పుకుంటానో అని కాలు గీరాడు. తరువాత చూస్తామని చెప్పి లేచి వచ్చాను." వా.

కాలు గోకు

  • చూ. కాలు గీరు.

కాలు చాపు

  • 1. విశ్రాంతి తీసుకొను.
  • "కాస్త కాళ్లు చాపే అవకాశం కూడా లేదు. ఎన్నాళ్లని మీద వేసుకుని చేస్తాం?" వా.
  • 2. పని చేయుట మానివేయు.
  • "వాడు నా చేత కా దని మధ్యలో కాళ్లు చాపేశాడు." వా.
  • 3. త్వరగా నడుచు.
  • "సాయంకాలం కావచ్చింది. ఇంక పరువుదాకా ఉంది పల్లె. కాస్త కాలు చాపితే కాని చీకటి పడేలోగా చేరుకో లేం?" వా.
  • 4. ఆశించు.
  • అఱ్ఱులు చాపు వంటిది.
  • "కోమలాంగుళదళహస్త తామరసము, కర్ణపూరత్వలీలకై కాలు సాప." శివ. 2. 18. కాలు____కాలు 459 కాలు____కాలు

కాలుచ్చు

  • పక్షులు మొదలగువాని కాళ్లకు చుట్టుకొనే వల, ఉరి.
  • "మిడిబోనుల గాలుచ్చుల, బడదోలియు బోగులోను పఱచియు లేళ్లన్, వడి గల జింకల నెల్లన్, బొడిచిరి..." యయా. 2. 19.

కాలు జారు

  • తప్పుదారి త్రొక్కు.
  • వ్యభిచరించు.
  • "ఆ పిల్ల ఎప్పుడో చిన్నతనంలో కాలు జారిం దని అంత నీచంగా చూడడం ఏం బాగ లేదు." వా.
  • "ఒకసారి కాలు జారితే ఇక ఆపుకోవటం కష్టం." వా.

కాలు తీసి పెట్టకుండా

  • చూ. కాలు క్రింద పెట్టకుండా.

కాలు త్రొక్కి కంకణం కట్టు

  • విధివిహితంగా పెండ్లి చేసుకొను. వివాహంలోని ఆచారంపై వచ్చిన పలుకుబడి.
  • "అంత నిర్బంధం చేయడానికి నీ వేం కాలు తొక్కి కంకణం కట్టావా? నా యిష్టం వచ్చినచోటికి నేను పోతాను." వా.
  • చూ. కాలు ద్రొక్కు.

కాలు త్రొక్కికొని వచ్చు

  • వెన్నంటి వచ్చు.
  • "మీకును మాకును నీ వైరం బెక్కడ నుండి కాలు త్రొక్కికొని వచ్చెనో యెఱుంగ." థర్మజ. 59. 17.

కాలు త్రొక్కికొను

  • తొందరపడు.
  • "కాలు త్రొక్కికొనుచు గళవళపడుచున్న, నెన్నొ యట్టిస్థితులు మున్ను కన్న, వార లౌట నా యొయారులు వాడక, పదిలపఱిచి సరగ స్వాంతములను." భద్రావత్య. 2.
  • "ఏదో చేయాలి గానీ ఊరికే కాళ్లు త్రొక్కుకుంటూ కూచుంటే ఏం లాభం?" వా.

కాలు దన్ను

  • కాలూని నిలుచు.
  • "అచటికి వేగంబ యరుగక యిచట గా,ల్దన్ని యుండెడు నట్టి ధైర్యమెందు,గలదు. భార. మౌస. 97.
  • "ఇట్లు వెఱచఱచి యవిసినకలంబు జనంబులు దీవి సేరినయట్లు కర్ణుం జేరి కాలు దన్ని నిలిచె." భార. కర్ణ. 3. 165.

కాలుదివిటీ మర్యాద

  • రాచమర్యాదలలో ఒకటి.
  • "ఆయనగారు కాలుదివిటీ మర్యాదలతో తీసుకొని వస్తే గానీ వచ్చేట్టు లేడు." వా.
  • చూ. కాలుదివియ.

కాలుదివియ

  • రాజులూ మొదలయినవారు పోతుండగా దివిటీలను వంగి పట్టుకొని ముందు నడుస్తుంటారు. అ దొక రాచ మర్యాద. అలా పట్టుకొనే దివిటీలను కాలుదివియ లంటారు. దీనినే కాలుదివిటీ కాలు____కాలు 460 కాలు____కాలు
  • మర్యాద అనుట కూడా కలదు.
  • "వారు సంభ్రమించి వడి గాలు దివియలు, గొనుచు....నృత్తశాల జొచ్చిరి." భార. విరా. 3. 4.

కాలు దూయు

  • పాఱిపోవు.
  • "ఆలు కాలు దూసిన నాట గోలె బవలు, రాతి రన బోక దాసరి రామలక్ష్మి..." భద్రావత్య. 2.

కాలు ద్రవ్వు

  • కలహమునకు పిలుచు. తిరస్కరించు.
  • "కరికుంభములమీద గాలు ద్రవ్వుట గాక, జక్కవకవతోడ వక్కరించు." విక్ర. 8. 44.
  • "శేషదర్పము చిన్వి శీతాంశురుచి నవ్వి, పాలమున్నీటిపై గాలు ద్రవ్వు." కళా. 1. 76.

కాలు ద్రొక్కు

  • 1. వివాహ మాడు.
  • "నాకాలు ద్రొక్కితి నన్ను మన్నించి, నాకోర్కి దీర్చుట న్యాయంబు నీకు." ద్విప. మధు. 8.
  • చూ. కాలు త్రొక్కి కంకణం కట్టు.
  • ప్రవేశించు.
  • "పూసపాటి మహాస్థానభూమియందు, గాలు ద్రొక్కక నోడు జండాలు డైన." సూరకవిచాటువు. వావిళ్ల.

కాలు నిలువదు

  • స్థిరంగా ఒక చోట ఉండ లేడు (దు) అనుట.
  • "వాడికి ఒక చోట కాలు నిలువదు. వా డేం పని చేస్తాడు?" వా.

కాలు నేల గీరుతూ

  • సిగ్గుతో అనుట.
  • "వాళ్ల బావ రాగానే ఆ అమ్మాయి కాలు నేల గీరుతూ నిల్చున్నది." వా.

కాలు నేల దింపకుండా

  • హాయిగా.
  • "లీల మెయి బల్లకీలోని కాలు నేల బెట్టక చెలంగుసంపద...." శ్రవ. 1. 37.

కాలు పురుగు తొలుచు

  • ప్రయాణేచ్ఛ విపరీతంగా కలుగు.
  • "వాడు ఒక చోటని నిలబడతాడా? వాడికా లెప్పుడూ పురుగు తొలుస్తూనే ఉంటుంది." వా.

కాలు పెట్టిన వేళ

  • కాపురానికి వచ్చినవేళ. ఒక్కొక్క సమయాన్ని బట్టీ బాగోగులు కలుగుతాయన్న జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయంపై యేర్పడిన పలుకుబడి.
  • "ఆపిల్ల కాలుపెట్టినవేళ ఇంటికి పదిళ్లయ్యాయి. మన పిల్ల కాలు పెట్టినవేళ యెలాంటిదో కాని ఇల్లు గుల్లయి పోయింది." వా.

కాలు పెట్టే సందిస్తే...

  • ఏ కొంచెం అవకాశం ఇచ్చినా.
  • "వాడికి కాలు పెట్టే సందిస్తే ఇక మనలని ఇక్కడ ఉండనీయడు." వా.

కాలు పొడుచు

  • కా లూను. కాలు____కాలు 461 కాలు____కాలు
  • "ఒక్కయెడం గాలు వొడిచి..." పాండు. 4. 237.

కాలు బట్టి తీయు

  • క్రింద పడద్రోయు.
  • "ఓరి! మిమ్ము దా కాలు బట్టి తీతుమో." హేమ. పు. 84.

కాలుబలము

  • పదాతిబలము.
  • "చదిసె గాలుబలము." భార. భీష్మ. 2. 165.
  • రూ. కాల్బలము.

కాలు బైట పెట్టకుండా

  • ఏమాత్రం శ్రమ పడకుండా.
  • "వాడి కేం? కాలు బైట పెట్టకుండా జరుగుతుంది." వా.
  • చూ. కాలు కింద పెట్టకుండా.

కాలుమడి

  • చూ. కాల్మడి.

కాలు మడుచు

  • మూత్రవిసర్జనము చేయు.
  • ఇది కొన్ని వర్గాలలో నేటికీ వాడుకలో ఉన్నది.
  • "కాలు మడిచి కాళ్లు కడుక్కొని వస్తా ఉండండి." వా.

కాలు రాపడ తిరుగు

  • కాళ్లు అరిగిపోవునట్లు తిరుగు.
  • "చొరనిబిలంబులున్ వెడల జూడని క్రంతలు గాలు రాపడం, దిరుగని త్రోవలున్." ఉ. హరి. 1. 131.
  • వాడుకలో రూపం: కాళ్ళు అరిగేట్టు తిరుగు.
  • "నెలనుంచీ కాళ్లు అరిగేట్టు వాళ్లింటికి తిరుగుతున్నాను. కాని యిప్పటికీ ఆ పుస్తకం అతడు తిరిగీ యివ్వడు." వా.

కాలువ క్రంత

  • దొరువూ డొంకా. జం.
  • "తోట దొడ్డి యనెడు మాట లేకుండంగ, గాలువ క్రంతలక్రం దడంగ." సుదక్షి. 4. 69.

కాలువకు పోవు

  • బహిర్భూమికి వెళ్లు.
  • ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఉంటుంది. కాలువ లున్న ప్రాంతాల్లో కాలువ కనీ, యే ర్లున్నప్రాంతాల్లో యేటికనీ, వంక కనీ, దొడ్లున్న చోట దొడ్డి కనీ, ఏమీ లేని చోట చెంబు పట్టుకొని అనీ, బహిర్భూమికనీ, యిలా రకరకాలుగా యీ పలుకుబడి మారుతూ ఉంటుంది.

కాలువలు గట్టు

  • ప్రవహించు; ఏకధారగా వెడలు.
  • "ఇట్లు మధుసూదనుం డేయుసాయకంబులు గాలువలు గట్టి మెయిమఱువులు నించియు." ఉ. హరి. 1. 148.

కాలు సాచు

  • ఆశించు; సిద్ధ మగు.
  • "ఎవ్వండు నీచిత్త మెరియించు చున్నాడు, కైవల్యపదవికై కాలు సాచి." హర. 3. 43.
  • "ఆ ముసలాయన కాటికి కాళ్లు చాచుకొని ఉన్నాడు." వా. కాలు____కాల్గ 462 కాల్చ____కాల్దో

కాలుసేతులు కట్టించి తెచ్చు</big

  • నిర్బంధముగా కొనివచ్చు. వాడుకలోనూ: నీవు రాకపోతే కాళ్లు చేతులు కట్టించి తీసుకు పోతాను' అంటారు.
  • "శిష్యులచే గాలుసేతులు గట్టించి తెచ్చి పద్యము జెప్ప దెమలకుండి." హంస. 3. 141.

కాలూదు

  • స్థిరముగా నిలుచు.
  • "...అందు నల్దిక్కులం, గనుపింప న్వెడ గుండెకాయ లదరం గాలూద లేకున్నెడన్." శుక. 2. 268.

కాలెత్తు

  • వ్యభిచరించు.
  • సురతక్రీడాసూచకంగా కాలెత్తుట ప్రయుక్తం.
  • "కన్న వాడికీ కాలెత్తే పాడుబుద్ధి దానిది." వా.

కాల్గఱ్ఱ గొను

  • పాదధూళి తీసుకొను.
  • "కఱకంఠు భక్తుల గన్నంత నవ్వు, సఱణార్థి సఱణార్థి సఱణార్థి యనుచు, గర మర్థి వారిచే గాల్గఱ్ఱ గొనుచు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 118.
  • కాల్గఱ్ఱ లంటే పాదుకలని పూర్వకోశాలు. కానీ కాల్గఱ్ఱ కొను అన్న ప్పు డా అర్థం తప్పని తెలుస్తూనే ఉంది. సందర్భాన్నిబట్టి కూడా పాదధూళి తీసుకొను అనుట సరి అనిపిస్తున్నది.

కాల్చనా?

  • ఎందుకు? వ్యర్థ మనుట. నా. మా. 13.

కాల్పువడు

  • దెబ్బ తిను, ఓడిపోవు.
  • "పెనుం,గరిగొన గాల్పువడ్డజము కంటెను బెద్దలె?" కుమా. 4. 76.

కాల్బలం

  • పదాతిసైన్యం.
  • "కాల్బలముల గీ టడంచి." మార్కం. 8. 104.
  • చూ. కాలుబలము.

కాల్మడి

  • మూత్రము.
  • "కాళ్ళుచేతులు నెన్నడు గడుగు కొనడు, విడుచు గాల్మడి నిలుచుండి నడచి నడచి." మల్హ. 3. 6. హరి. పూ. 6. 5.
  • రూ. కాలుమడి.

కాల్వురు

  • కాల్బలం, పదాతిదళం.
  • "ఎదురం గాల్కొని నిల్వ నుక్కణగి వెన్ని గాల్వురు." కుమా. 11. 35,

కాల్కొని నిల్చు

  • గట్టిగా ఎదిరించి నిలబడు. కాలూని నిలుచు.
  • "ఎదురం గాల్కొని నిల్వ నుక్కణగి." కుమా. 11. 35.

కాల్దోమి కడుగు

  • కాళ్లు బాగా రుద్దుకొని కడుగుకొను.
  • పండితా. ప్రథ. పురా. పుట. 298. కావ____కావ 463 కావ____కావు

<bigకావడించు

  • కావడివలె కాళ్లు చేతులు కట్టి కఱ్ఱ కటూ ఇటూ వ్రేలాడ దీసి కఱ్ఱ కావడివలె చేయు.
  • "కాలు జేయు బడియ గావడించి." కుమా. 2. 86.

కావడిపాటు పడు

  • నీళ్లు మోయు.
  • "ఉదర, పోషణంబునకై యూరిపొంత దోస,తోట గావించె గావడిపాటు పడుచు." శుక. 3. 373.
  • 2. క్రింద మీద పడు.
  • కావడికుండలు స్థిరముగా ఒకటిగా ఉండక, కిందికీ మీదికి వాలుటనుబట్టి వచ్చిన పలుకుబడి.కావరము పట్టు
  • పొగ రెక్కు.
  • "సురతకేళుల నలరింప సుఖము మరిగి, తిరిగె దనయత్తకన్న గావరముపట్టి." హంస. 5. 176.
  • "వాడి కెంత కావరం పట్టిం దని. పిలిస్తే తలెత్తైనా చూడడే?" వా.

కావలసినంత (మంది)

  • సమృద్ధిగా.
  • "వాడిదగ్గఱ కావలసినంత డబ్బుంది. వాడి కేం లోటు?" వా.
  • "నీవు కాస్త సాయం చేస్తే కావలసినంత పని చేయవచ్చు." వా.
  • "ఈ ఊళ్లో కూలి కేం? కావలసినంత మంది వస్తారు." వా.

కావలసినదే

  • వాడి కా శాస్తి జరగవలసినదే.
  • "వానికి మొన్న గుర్రప్పందేలలో పదివేలు పోయా యట. కావలసిందే వెధవకు." వా.

కావలసినవాడు

  • ఆప్తుడు, ఇష్టుడు.
  • "మనకు ఇతను చాలా కావలసినవాడు. ఏదో పనిమీద మీ దగ్గరకు వచ్చాడు. అది కాస్తా చేసి పెట్టండి." వా.
  • చూ. అయినవాడు.

కావలి పెట్టుకొని యుండు

  • రక్షణకు ఏర్పాటు చేసి యుండు.
  • "మణిపర్వతంబునం బురంబు చేసి కావలి పెట్టుకొని యుండె." ఉ. హరి. 1. 84.

కావించి చెప్పు

  • లేనిపోనివి కల్పించి చెప్పు; చాడీలు చెప్పు.
  • "అది నామీద ఏవేవో కావించి చెప్పి నా మొగునికి నాకూ కాకుండా చేసింది." వా.

కావు కా వని యేడ్చు

  • ధ్వన్యనుకరణము.
  • 'పిల్లలవిషయంలో నేడు ఉపయోగిస్తారు. కావు కావు మని యేడుస్తున్నాడు.'
  • "నీ వంతలో గావు కావంచు నేడ్పుల్ దలిర్పన్." పారి. 3. 37. కావు____కాసి 464 కాసు____కాసు
  • "ఎఱుక చెడి కావు కావున నేడ్చు బ్రాశి." కవిక. 5. 103.

కావు పట్టు

  • మాగవేయు అనగా లక్షణయా బాగా చితక తన్ను. మాగ గొట్టు అని ఇదే అర్థంలో నేటికీ అంటారు.
  • "కావరంబున గన్ను గానవు జముడు, కావు పట్టక నిను గానడు సుమ్ము." నవ. 1. 48. పు. 25.

కావు వచ్చు

  • మాగి పండ్లకు మంచి రంగు వచ్చు.
  • "మొన్న కావు వేసిన పం డ్లప్పుడే కావు వచ్చినవి." వా.
  • వావిళ్ళ.

కావు వేయు

  • పండుటకై కాయలపై గడ్డి కప్పు.
  • "నిన్న వేయి మామిడికాయలు కావు వేసినాము." వావిళ్ళ.

కావేరిగుఱ్ఱములు

  • ఉత్తమాశ్వములు.
  • "తేరు లన్నియు గూరాటితేరులుగను గుఱ్ఱముల నెల్ల గావేరి గుఱ్ఱములుగ..." మొల్ల. సుం. 172.

కాసావాడు

  • జమీందార్ల, రాజుల దగ్గర ఉండే దాసీపుత్రుడు.

కాసింత

  • కొంచెము.
  • "సున్నం వుంటే కాసింత పెట్టు." వా.

కాసు కప్పర

  • కాసు వీసం. జం.
  • "అంగడి యంగడిం దిరుగులాడుటకుం బలంవిత్తు విష్టతిం, బొంగుచు గాసు గప్పరకు బోవుచు బెక్కు పదార్థముల్ గ్రహిం, పం గొఱ గాక..." బహులా. 1. 11.

కాసుకు కాక పోవు

  • పనికి రాక పోవు.
  • "కపురంపు జిగి మించు కరి నెక్కి యూరేగు, క్రమ మొక్క కాసుకు గాకపోయె." వ్యాఖ్యా. చాటు-తె. జా.

కాసుకు గొనక

  • లక్ష్య పెట్టక.
  • "సురుగక చొచ్చి కాసుకు నన్ను గొనక." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1104.
  • కాసు పూర్వకాలంలో చాలా చిన్న నాణెం. ఆ మాత్రం విలువకూడా యివ్వక అనుట. అందుపై వచ్చిన పలుకుబడి.

కాసు చేయని

  • పనికి రాని.
  • "కాసు సేయనిపనికి గాసి బడె బ్రాణి." తాళ్ల. సం. 5. 101.

కాసును గీసు దూసికొను

  • తృణమో పణమో సంపాదించుకొను.
  • ఇలాంటి అర్థంలోనే కాసో వీసమో రాల్చుకొను వంటివి ఉన్నవి. కాసు___కాళు 465 కాళ్ల___కాళ్ల
  • "....తనుమర్దన మాచరించుచున్, గాసును గీసు దూసికొను గాని విడం డత డేమి చెప్పుదున్?" శుక. 2. 362.

కాసువీసములు

  • ఏ కొంతో డబ్బు. జం.
  • "ఎన్నడు గాసువీస మొక టిచ్చిన వాడవు గావు." విప్ర. 4. 27.

కాసె నిలుకడ

  • మల్ల బంధములలో ఒకటి. హంస. 1. 206.

కాసె యులి

  • ఒక రకమైన ఉలి. వావిళ్ళ.

కాసె వోయు

  • గోచిగా కట్టు.
  • "ఆవిడ కాసె వోసి చీర కడుతుంది." వా.

కాస్తా కూస్తా

  • కొంచెమా నంచెమా? జం.
  • "కాస్తా కూస్తా? పదివేల రూపాయలు పోతే యెవరికి మాత్రం కష్టంగా ఉండదు?" వా.

కాహళులు పట్టించు

  • బాకా లూదు.
  • "తూర్యంబులు గొట్టించియు గాహళులు వట్టించియు." మను. 4. 37.

కాళుల దోవతి యగు

  • అడ్డ మగు.
  • నడచునప్పుడు అడ్డపడుతుంది కాబట్టే దోవతిని ఎగ జెక్కు కోవడం అలవాటు కదా!
  • "కావిరి వావిరిం దగిలి కాళుల దోవతి యయ్యె." పాండు. 2. 217.

కాళ్ల(క)కాడ బ్రదుకు

  • ఆశ్రయము.
  • "మా దేముంది నాయనా ! మీ కాళ్ల కాడ బ్రతుకు, మీరు కా దంటే మేము ఎక్కడికి పోతాం?" వా.

కాళ్లకింద గోతులు తీయు

  • మంచిగానే ఉండి ద్రోహము చేయు.
  • "వాడు పైకి మంచిగానే కనిపించినా కాళ్లకింద గోతులు తీసే రకం. జాగ్రత్త." వా.

కాళ్లకు నీళ్ళిచ్చు

  • అతిథిసత్కారము చేయు. ఎవ రైనా వచ్చినప్పుడు ముందు కాళ్లకు నీళ్లివ్వడం, కూర్చొన్న తర్వాత దాహం ఇవ్వడం మన ఆచారం.
  • "ఎవ రైనా యింటికి వచ్చినప్పుడు కాళ్లకు నీళ్లయినా యివ్వక పోతే యెట్లా?" వా.

కాళ్లకు పసుపు రాయు

  • శుభకార్యాదులలో సత్కారము చేయు.
  • "వాళ్లింటికి పెండ్లికి పోతే ఏ మైనా పెద్ద ముత్తైదువును కదా కాళ్ళకు కాస్త పసు పైనా రాయ లేదు." వా.

కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగు

  • కాళ్ళరిగేట్టు తిరుగు.
  • చూ. కాలికి బలపం కట్టుకొని తిరుగు. కాళ్ల____కాళ్ల 466 కాళ్లా____కాళ్లు

కాళ్ల జెఱ్ఱి

  • కాళ్ళు చాలా ఉండే జెఱ్ఱి.
  • "ఈ మధ్య ఎక్కడ బట్టినా కాళ్ళ జెఱ్ఱులు కనిపిస్తున్నాయి. కాస్త జాగర్త రా బాబూ! అవి చెవిలో దూరుతాయట." వా.

కాళ్ల పెనగు

  • కాళ్ళమీద పడు.
  • "కలికి నెఱివేణి చెలువంబు గాళ్ల బెనగ." విజయ. 2. 116.

కాళ్ల బేరమునకు వచ్చు

  • లొంగి వచ్చు.
  • కాళ్లు పట్టుకొనుటకు సిద్ధపడు.
  • "గట్టిగా నిలబడితే వాడే కాళ్లబేరానికి వస్తాడు." వా.

కాళ్లమీద గంజి పోసికొను

  • వెంటనే తొందరగా పోవాలని త్వరపడు.
  • "వీడు ఎప్పుడు వచ్చినా కాళ్లమీద గంజి పోసుకొని వస్తాడు." వా.

కాళ్ల మీద పడు

  • ఆశ్రయించు, ప్రాధేయపడు.
  • "వాడు ఎలాగైనా యీచిక్కు తప్పించ వలసిం దని నా కాళ్ళమీద పడ్డాడు. ఏం చేస్తాం?" వా.

కాళ్ల రిగిపోవు

  • ఎక్కువ తిరుగుటను సూచించేపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆ పుస్తకంకోసం వాడిచుట్టూ తిరిగి కాళ్లరిగి పోయాయి." వా.
  • "ఆ పుస్తకంకోసమని వాళ్లింటిచుట్టూ కాళ్లరిగి పోయేటట్టు తిరిగాను." వా.

కా ళ్లాడ లేదు

  • 1. ఏమీ తోచ లేదు.
  • "ఉన్నట్లుండి ఈ మాట తెలిసేసరికి నాకు కాళ్ళాడ లేదు." వా.
  • 2. పోవుటకు మన సొప్ప లేదు.
  • "ఈ అమ్మాయిని వదిలిపెట్టి పోవడానికి నాకు కాళ్లాడడం లేదు. పసిపిల్ల. కొత్తతావు." వా.

కాళ్లా వేళ్లా పడు

  • బ్రతిమలాడు.
  • "నే నెంత కాళ్లా వేళ్లా పడినా వాడు సాయంత్రందాకా ఉండ మన్నా ఉన్నాడు కాదు." వా.

కాళ్లు అరిగేటట్టు తిరుగు

  • ఎక్కువగా తిరుగు.
  • "కా ళ్ళరిగేటట్టు తిరిగినా ఒక్క కవళం కూడా దొరక లేదు." వా.

కాళ్లు కట్టివేయు

  • ఏమీ చేయనీయక పోవు.
  • "వాడు నన్ను కాళ్లు కట్టివేసి మూల్లో కూర్చో బెట్టాడు." వా.

కాళ్లు కట్టివేసినట్లుగా

  • నిర్బంధములో ఉన్నట్లుగా.
  • "అక్కడ పొలాల్లో చెడతిరిగేవాణ్ణి. ఈ పట్నానికి వస్తే కాళ్లు కట్టివేసినట్లుగా ఉంది." వా.

కాళ్లు కడిగి నీళ్ళు తాగు

  • ఎంతో భక్తిగౌరవాలతో చూచుకొంటాను అను సంద కాళ్లు____కాళ్లు 467 కాళ్లు____కాళ్లు
  • ర్భంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వా డేమీ చేయ నక్కర లేదు. కాస్త యింటిముందు కూర్చుంటే చాలు, కాళ్లు కడిగి నీళ్లు తాగుతా. కానీ వాడు వింటేనా. దేశాలవెంబడి తిరుగుతా నంటాడు." వా.

కాళ్లు కడిగి కన్యాదానం చేయు

  • విధివిహితంగా పిల్ల నిచ్చు. వివాహంలో అల్లుని కాళ్లు కడిగి మామ పిల్ల నిస్తా నని చెప్పడం, అట్లా ఇవ్వడం ఆచారం.
  • "వాణ్ణి ఇంట్లో పెట్టుకొని కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే వా డిట్లు చేయవచ్చునా?" వా.

కాళ్లు కడుపులు పట్టుకొను

  • బ్రతిమలాడు.
  • "ఏదో నలుగురి కాళ్లూ కడుపులూ పట్టుకొని కొడుకును చదివించుకొని బ్రతుకుతున్నాను." వా.

కాళ్లు కాయలు కాచు

  • ఎక్కువ నడచినప్పుడు కాళ్లకు కాయలు కాయడం సహజం. అలాంటిపట్ల ఉపయోగిస్తారు.
  • "ఊరంతా తిరిగి తిరిగి కాళ్లు కాయలు కాచినవి గాని వా డేమో కనిపించ లేదు." వా.

కాళ్లు కొట్టుకొంటూ

  • చాలా కష్ట పడి నడుచుకొంటూ.
  • "వాడు పొరుగూరు వెళ్ళా డనేసరికి ఆ నాలుగు మైళ్ళూ కాళ్లు కొట్టు కొంటూ వెళ్లవలసి వచ్చింది." వా.

కాళ్లు గట్టు

  • కాళ్ళను కదలకుండా చేయు; విడిచిపోకుండా చేయు.
  • "నీ కామ శాస్త్రముల్ బిడ్డ, కన్గట్టి కాళ్ళను గట్టింప నెట్లు, విచ్చేయు." పండితా. ప్రథ. పురా. పుట. 362.

కాళ్లు చల్లబడు

  • నిరాశ కలుగు. శీతం ముంచుకొన్నంత పని అయిన దనుట.
  • "వాడు ఆమాట చెప్పేసరికి నాకు కాళ్లు చల్లబడ్డాయి. వా డేదో ఇస్తాడు కదా అని అంత ఆశతో వెళ్లాను." వా.

కాళ్లు చాచుకొని కూర్చుండు

  • పనీ పాటా లేక కూర్చుండు.
  • "చేయవలసినపని యింత ఉంటే నువ్వేమో కాళ్లు చాపుకొని కూర్చున్నావు." వా.

కాళ్లుతీపులు

  • కాళ్ల నొప్పులు.
  • "తల నొప్పి కడుపు కుట్టుం, బలు గురుపుం గాళ్లు తీపు పాటించుచు నె,చ్చెలి." శుక. 2. 205.
  • కాళ్లు, చేతుల విషయంలోనే కాళ్ల తీపులు, చేతుల తీపులు అని వాడుక. కాళ్లు తీపు అన్న రూపంలో మాత్రం నేడు వాడుకలో లేదు.
  • చూ. చేతులతీపులు. కాళ్లు____కాళ్లు 468 కాళ్లు____కాళ్లు

కాళ్లు తేలిపోవు

  • నీరసించి పోవు; నీళ్లలో అడుగందక కాళ్లు పైకి లేచిపోవు.
  • "పొద్దున్నుంచీ తిండి లేక నడవాలంటే కాళ్లు తేలిపోతున్నాయి." వా.
  • "ఏదో తక్కువ నీళ్లున్నా యని నడవబోతే కాళ్లు తేలిపోయాయి." వా.

కాళ్లు నిలవవు

  • స్థిరత్వము లేదు అనుట.
  • "వానికి ఒక్కచోట కూడా కాళ్లు నిలవవు. ఎప్పు డెక్కడ ఉంటాడో దేవునికే తెలియాలి." వా.

కాళ్లు పట్టుకొను

  • ప్రాధేయపడు.
  • "ముట్టకు చాలు జాలుగడు మోహపు దేవుల కాళ్లు పట్టుకో, నెట్టును జెల్లు గాక." కళా. 7. 234.
  • "నీ కాళ్లు పట్టుకొంటాను నాయనా ! మావాణ్ణి ఎలాగైనా ఈ ఆపదలోనుంచి తప్పించు." వా.

కాళ్లు పడిపోవు

  • 1. ఎక్కువ నడచుట వగైరాలతో కాళ్ళు నొప్పి పెట్టు.
  • "పొద్దున్నుంచీ తిరిగి తిరిగి కాళ్లు పడిపోయాయి. ఇంక నే నెక్కడికి రాలేను." వా.
  • 2. పక్షపాతము తగిలి కాళ్ళు స్వాధీనము తప్పు.
  • "వాడికి పక్షపాతం వచ్చి కాళ్ళు పడిపోయినాయి." వా.

కాళ్లు పార జాపు

  • ఇక నాతో కా దని చేతులు వెల్లకిల వేయు.
  • చూ. కాలు చాపు.

కాళ్లుమొగములు వాచి

  • వానికై విపరీతమైన ఆసపడి. గర్భిణిస్త్రీలకు కోరి కే దైనా ఉంటే, కాళ్లు మొగము దద్దరించు నని వాడుక. తర్వాత అది సర్వత్రా ఉపయోగించే పలుకుబడి అయినది.
  • "నీవరపు ళ్లెల్ల...దొంటి రాజాన్నముల్ దలచి, వడి గాళ్లు మొగములు వాచి వచ్చుడును..." పండితా. ప్రథ. పురా. పుట. 287.
  • చూ. కాళ్ళూ మొగం వాచు.

కాళ్లు రాక పోవు

  • కాళ్లాడక పోవు.
  • "చాలక భీతు డై జలజాస్తసుతుడు, వడి చెడి పాఱిపోవను గాళ్లు రాక." సుగ్రీ. పు. 28.
  • "ఆ కిరాతకుల ఇంట్లో పిల్లను వదలి రావాలంటే నాకు కాళ్లు రాలేదు." వా.

కాళ్లు రెండూ ఒక చోట పెట్ట లేదు

  • ఏమాత్రం విశ్రాంతి తీసుకో లేదు.
  • "పొద్దున్నుంచీ ఒకే పని. కాళ్లు రెండూ ఒక చోట పెట్ట లేదు." వా.

కాళ్లు వచ్చు

  • 1. వయసు వచ్చు. కాళ్లు____కాళ్లూ 469 కింక____కించ
  • కాస్త అటూ ఇటూ పారాడే వయసు వచ్చిన దనుట.
  • "వా డేదో నాకు ముసలితనంలో ఆదరువుగా ఉంటా డని చాకి సంతరించాను. కాస్త కాళ్లు రాగానే వాడు ఉడాయించాడు." వా.
  • 2. నడక వచ్చు.
  • "మా వాడికి సంవత్సరం కూడా నిండక ముందే కాళ్ళు వచ్చాయి." వా.

కాళ్లు విఱుగ గొట్టుకొను

  • తొందరపడు.
  • "ఎప్పటి కయ్యేది అప్పటి కవుతుంది. ఊరికే కాళ్లు విఱగగొట్టుకుంటే పనులవుతాయా?" వా.

కాళ్లూ చేతులూ ఆడడం లేదు

  • ఏమి చేయుటకూ తోచుట లేదు.
  • ఏమి చేయుట కైనా కాళ్లూ చేతులూ ఆడితేనే కదా! అవి ఆడక పోవుట ఏమీ చేయలేక పోవుటగా ఏర్పడినది.
  • "ఉన్నట్టుండి ఆ అమ్మాయి పడక వేసే సరికి నాకు కాళ్లూ చేతులూ ఆడడం లేదు." వా.

కాళ్లూ మొగం వాచు

  • ఎంతో ఆశపడు.
  • గర్భిణీస్త్రీలకు ఏవేవో ఆశ లుంటాయని. ఆ ఆశలు తీరక పోతే కాళ్లూ మొహం వాస్తుందని ఒక ప్రతీతి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "నే నేం కాళ్లూ మొగం వాచి ఉన్నా ననుకొన్నావా?" వా.
  • చూ. కాళ్లు మొగములు వాచి.

కింకర అగు

  • "ఏదో పీడ తగులు.
  • ముఖ్యంగా చంటి పిల్లలకు జబ్బు చేసినప్పు డంటారు.
  • "ఈ పిల్లవాడికి ఏదో కింకర అయినట్టుంది. వీరాచారిదగ్గర యంత్రం కట్టించే పని చూడాలి." వా.

కింకిరి చేయు

  • మలవిసర్జన మొనర్చు.
  • "అప్పుడు నందను డా యోగివరుని, చీరపై గింకిరి చేయ." నవ. 4.

కింకిరిపడు

  • విసుగుకొను; అసహ్యించుకొను.
  • "అతిథి నిను గోరె నేనియు, మతి గింకిరి పడక యోల మాసగొనక నీ, వతనికి బ్రియంబు సల్పుము..." భార. అను. 1. 68.
  • "అడరుదుర్గం ధాన కణుమాత్ర మైన, గింకిరిపడక శంకింపక ధైర్య, మింకక చండాలూ నింటికి నేగి." గౌర. హరి. ఉ. 1584.

కింకిరిపాటు

  • అసహ్యం. కోపం.
  • "నగుమొగంబుల గాని నాతి నీదెస నెప్డు, బతులకు గింకిరిపాటు లేదు." భార. అర. 5. 291.

కించపడు

  • సంకోచించు.
  • "న న్నన్ని మాట లన్నాడా? నే నిం కింద___కిందా 470 కిందా___కికు
  • దులో సాయం చేశా నని తెలిసి అతను చాలా కించపడ్డాడు." వా.

కింద పడినా పైచేయి నాదే

  • ఎంత దెబ్బ తిన్నా పౌరుషాలు నరికేవారి విషయంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వాణ్ణి నానామాటలూ అని పంపించారు. అయినా వీడికి పొగరు తగ్గ లేదు. కింద పడినా పై చేయి నాదే అనే రకం." వా.
  • చూ. కిందపడినా మీసం మన్ను కాలేదు అన్నట్లు.

కిందపడినా మీసం మన్ను కాలేదు అన్నట్లు

  • తాను దెబ్బ తిన్నా - ఓడి పోయినా ఒప్పుకొనక పోయే వాని విషయంలో అనుమాట.
  • కుస్తీలో ఓడినా మన్ను వీపుకే అయింది కానీ మీసాలకు కాలేదు కదా అని సంతృప్తి పడేరకం అనుట.
  • చూ. కింద పడినా పైచేయి నాదే.

కిందాకు మీదాకు వాసి యగు

  • ఏదో కాస్త ఇంచుమించుగా అగు.
  • "చచ్చిపోయిన వారికై చాల వగల, దు:ఖపడుదురు మఱునాడు దొడరి చనరొ, తాము బ్రదుకుట కేది తథ్యంబు తడవ, వనిత కిందాకు మీదాకు వాసి గాదె." కుచే. 1. 80.
  • ఆకులు కాలిపోవునప్పుడు మీదాకు ముందు రాలి పోయినా కిందాకు వెను వెంటనే మీదా కై రాలి పోవలసినదే కదా!

కిందా మీదా పడు

  • ఏదో అవస్థపడు. ఒకప్పుడు తగ్గిపోతూ బాధ పడుతూ, మరొకప్పుడు తేరుకొని పైకి లేస్తూ అనుట.
  • "ఆ యింత ఆస్తిలోనే వాడు కిందా మీదా పడి కొడుకును బి. ఏ. దాకా చదివించాడు." వా.

కిందుపడు

  • ప్రాధేయపడు; లొంగు.
  • "ఏల కిందుపడి మొక్కే వేమి బాతినే నీకు." తాళ్ల. సం. 4. 168.

కింవదంతి

  • జనశ్రుతి; పుకారు.
  • "త్వరలోనే ఈ పల్లెకు పోస్టాఫీసు వస్తుందని కింవదంతిగా ఉంది." వా.

కికాకిక నగు

  • ధ్వన్యనుకరణము.
  • "మిగుల రొదగా గికాకిక నగుచు రతుల, యామములు పోక నెద్దియే నాడుకొనుచు." కళా. 1. 147. కళా. 8. 177.
  • రూ. కికకిక నగు.

కికురు పొడుచు

  • త్రోసివేయు.
  • "త్రుళ్లుచు గికురుపొడుచు." భాగ. 8. 208.
  • చూ. కికురు వొడుచు.

కికురువెట్టు

  • 1. మోసగించు.
  • "అతనిచేత నున్న యమృతకుంభము కికు____కిక్కు 471 కిక్కు____కిట
  • సూచి, కెరలు వొడిచి సురల గికురు వెట్టి, పుచ్చుకొనిరి...." భాగ. 8. 295.
  • 2. త్రోసి పుచ్చు.
  • "ఏ నొక బ్రాహ్మణకన్యక,నై నరపతి గికురు వెట్టి..." దశ. 9. 62.
  • "కికురు వెట్టి సుమంతు బాదుకలు గొంచు." సారం. 3. 134.

కికురు వొడుచు

  • మోసగించు. భాగ. 10. స్క. 431.
  • చూ. కికురుపొడుచు.

కిక్కు మనకుండ

  • ఏ మనకుండ.
  • "కిక్కు మనకుండ నేరికి జిక్కు వడక." రాధా. 4. 89.
  • "పెండ్లాం ఏమన్నా వాడు కిక్కు మనకుండా ఉంటాడు. మన మంటేనే ఇంత రాద్ధాంతం చేస్తాడు." వా.

కిక్కు ముక్కురు మనక

  • నో రెత్తక. బ్రౌన్.
  • చూ. కిక్కురు మనక.

కిక్కురు మనక

  • నో రెత్తక; ఏమాత్రం వ్యతిరేకించక.
  • ఇ దిలా 'అనక' అన్న వ్యతిరేకార్థంలోనే కాని కిక్కురుమను అన్న ట్లుండదు. అలా కొన్ని పూర్వాకోశా లిచ్చిన రూపం సరి కాదు.
  • " కిక్కురు మన కమృతంబుం, గ్రుక్కలు వెట్టుదురు సురలు." హరి 6. 122.

కిక్కురువెట్టు

  • వంచించు.
  • "శూలిన్, గిక్కురువెట్టి పోయె లతికా స్తోమాంతరాళంబులన్." విష్ణు. నా. 4. 253.

కిచకొట్టు

  • 1. కిచకిచ నవ్వు.
  • ధ్వన్యనుకరణము.
  • "పూవు గుత్తుల వంటి పూపచన్నులు గోళ్ల, నదిమిన గిచకొట్టునట్టి వేళ." శుక. 1. 300.
  • 2. కిచకిచలాడు.
  • "కిచకొట్టు ఒకదారి కివకివల్ చెవి గుల్కి, కుదురుగుబ్బ లురంబు గదియ జేర్చి." శుక. 1. 303.

కిటకిటని

  • జవజవలాడు.
  • "కిటకిటనికౌ నొకింత చలింపన్." విజయ. 3. 79.

కిటకిట పండ్లు కొఱుకు

  • పండ్లు కొఱుకుటలో ధ్వన్యనుకరణము.
  • "జటిలుండు గిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర ముకుబుటమ్ములు నటింప." మను. 5. 19.

కిటకిట మను

  • కిటకిట ధ్వని చేయు.
  • "కిటకిట మన రదనపంక్తి గీటుచు బలికెన్." పార్వ. 4. 124.

కిటకిటలాడు

  • క్రిక్కిరియు.
  • "వీధంతా జనం కిటకిట లాడుతున్నారు." వా. కిటు____కిను 472 కిను____కిమ్మ

కిటుకగు

  • వివాద మేర్పడు.
  • "తా ము న్నేసితి నటంచు దమలో గిటు కై." కా. మా. 4. 184.

కిటుకులు పెట్టు

  • కష్టపెట్టు, చిక్కులు పెట్టు.
  • "కపటనాటకు డైనకౌశికు డాత్మ గృప మాలి నిను బట్టి కిటుకులు పెట్టి." హరిశ్చ. పు. 177.

కిటుకు వట్టు

  • తప్పు పట్టు.
  • "ఏ నటు చిఱ్ఱుము ఱ్ఱనుచు నించుక కోపము తాళలేమి నా,పై నొకలాగునం గిటుకు వట్టిన దోసము కాదు." విప్ర. 4. 72.

కితా బిచ్చు

  • బిరుదిచ్చు, మెచ్చుకొను.
  • అస లర్థం బిరు దిచ్చు అయినా తర్వాత మెచ్చుకో లయినది.
  • "మెచ్చి పాచ్ఛా కితాబిచ్చుటచే వజా,రత విజయానంద రంగరాయ, లనగ బౌరుష నామధేయముల వెలసి." ఆనంద. పీఠి. 68.
  • "ఆపోనీద్దూ, అతగాడు కితా బిస్తాడా? అంత ఒదిగి ఉండడానికి." వా.

కినుక చల్లారు

  • కోపము తగ్గు.
  • కినుక అగ్నివంటి దనీ, అది యింకా ఆఱ లేదనీ ధ్వని.
  • "గుండియలు గ్రుళ్ల దన్నిన గ్రుక్కు మిక్కు, రనక యాతని కినుక చల్లాఱ నిచ్చి." శుక. 3. 627.
  • చూ. కోపము చల్లారు.

కినువడు

  • కోపపడు.
  • "అధిపతి నిన్ను నే,జన్నియ విడిచె రణముతఱి, మిన్నక కినువడక పొమ్ము మీ గృహమునకున్." భార. విరా. 4. 218.

కిన్నరకంఠి

  • మంచి కంఠస్వరముగల స్త్రీ.
  • "మేల్కిన్నర జెంత జేరి యొక కిన్నరకంఠి యొసంగ......" చంద్రికా. 2. 95.

కిన్నెరవీణె

  • ఒక విధమైన వీణ.
  • "పసిడి కిన్నెరవీణె బలికించు నెల నాగ." భీమ. 1. 4.

కిమన్నాస్తి

  • ఏమీ లేదు. మాటా. 97.

కిమ్మనకుండా

  • ఏమి అని ప్రశ్నించకుండా.
  • "అన్నిమాట లా పెండ్లాం అంటుంటే మా అన్న కిమ్మనకుండా కూర్చున్నాడు." వా.

కిమ్మన నీదు

  • నోరు మెదప నీదు.
  • "ఇందుబింబమున్, గిమ్మన నీదు మోము గిరిక్రేపులు మూపులు కౌను గాన రా, దమ్మక చెల్ల!" మను. 3. 6.
  • వాడుకలో: వాడు కిమ్మనకుండా కూర్చున్నాడు. సంస్కృతంలో కిం అంటే ఏమి అని కిరా____కిఱ్ఱు 473 కిఱ్ఱు____కిలా
  • ప్రశ్నార్థకం. ఏమి అనకుండ అనుట.
  • చూ. కిమ్మనకుండా.

కిరాణాకొట్టు

  • చిల్లరదినుసుల అంగడి.

కిరీటం పెట్టు

  • ఎక్కువ గౌరవించు, లాభము చేకూర్చు.
  • "ఆ! వా డేదో దారిలో కనబడితే మాట్లాడ్డం తప్పితే నాకు పెట్టినకిరీటం ఏముంది?" వా.

కిరీటిపచ్చ

  • గరుడపచ్చ. విజ. 3. 26.

కిఱుకుచెప్పులు

  • కిఱ్ఱుచెప్పులు.
  • చూ. కిఱుచెప్పులు.

కిఱుచెప్పులు

  • కిఱు కిఱు మని శబ్దం చేసే చెప్పులు.
  • "కిఱుచె,ప్పులు పిల్లనగ్రోవి యమర బొలము దిరుగుచున్." చెన్న. 3. 31.

కిఱుదుకట్లు

  • కుండలమీద చేసే ఒక విధమైన నగిషీపని. హం. 5. 13,

కిఱ్ఱుచెప్పులు

  • కిఱ్ఱు కిఱ్ఱు మని ధ్వనించే చెప్పులు.
  • "పొందవు కిఱ్ఱుచెప్పులును బొల్పెసగన్ ధనదత్తు డెంతయున్." హంస. 1. 172.

కిఱ్ఱుబాగాలు

  • కిఱ్ఱు పావుకోళ్ళు. వైజ. 2. 45.

కిలకిల ధ్వనులు

  • ధ్వన్యనుకరణము.
  • "తరు లెక్కి కిలకిల ధ్వనులు సేయుటయు." ద్విప. జగ. 177.

కిలకిల నవ్వు

  • ధ్వన్యనుకరణము.
  • "కిలకిల నవ్వుమోవి పలుగెంటుల దీటు గుచంబు లోరగా." హంస. 1. 217.

కిలకిల లాడు

  • కిలకిల మను.
  • "సారె సారెకున్, గిలకిలలాడుచున్ మిగుల గేకలు కొట్టుదు రంతె కాని." నీలా. 2. 81.

కిలాకిల నవ్వు

  • కిలకిల నవ్వు.
  • ధ్వన్యనుకరణము.
  • "రంభ నగున్ గిలాకిలన్." కువల. 1. 85.

కిలాడి'

  • నంగనాచి, మాయలమారి - ఇత్యాది ఛాయలలో స్త్రీ పుం భేదం లేకుండా ఉపయోగించే పలుకుబడి.
  • "వా డమ్మా కిలాడీ, నమ్మితే మనం నాశనం కావలసిందే." వా.
  • "అది వట్టి కిలాడీ. దాన్ని యింటికి రానిస్తే యిక అయినట్టే." వా.
  • రూ. కిల్లాడి. కిలా____కిస 474 కిస____కిష్కిం

కిలాదారు

  • ఖిల్లాదార్, దుర్గాధిపతి.
  • ఆనంద పీఠి. 112.

కిల్మాడుకొను

  • గీచుకొని తీసుకొని పోవు. దొంగిలించుకొని పోవు.
  • "ఆబాల యవయవముల, చెలువు గిల్మాడుకొనిరి గావలయు నేడు." కుమా. 5. 121.

కిల్లాకు

  • చీటి; ఫర్మానా.
  • ఖిల్లా అంటే కోట. తద్వారా రాజాజ్ఞా పత్రం అన్నట్లు ఏర్పడినది.
  • "ముల్లోకంబుల నేలుదు, బల్లిదుడను గింకరులు సుపర్వులు నాకుం, గిల్లాకు పంపు సేయం, బల్లవలవకృద్విలాస పద పద కమలా!" రామాభ్యు. 5. 177.
  • "ఇదియు నూరక యుంటి గాకేల నీకు, మాకతల్ విన బంటు కిల్లాకు పోవ, దొత్తుకొడుకులు వోలె దోడ్తో దిగంత, భూమిపతు లంపుచున్నారు కామితములు." కళాపూ. 7. 267.
  • "తనవచోదోషము క్షమింపు మనెడు వాడె, యే మనిన లేని వాతప్పు లెంచ సాగె, వినుము మహికాంత కొండంత పనికి నైన, బలుకు లేటికి కిల్లాకు పనుప సాగె." కువల. 2. 24.

కిల్లాడి

  • చూ. కిలాడి.

కిసరు తగులు

  • దృష్టి తగులు. నేటికీ దృష్టి దోషం తగిలి జబ్బుపడితే కిసరు తగిలిం దనే రాయలసీమలో విశేషంగా అంటారు.
  • "పిల్లకు కిసరు తగిలిన ట్లుందమ్మా. నాలుగు ఉప్పురాళ్లు చుట్టి వెయ్యి." వా.

కిసరుపడు

  • దృష్టిదోషమునకు అగ్గ మగు. వావిళ్ళ ని. కోపపడు అని అర్థం చెప్పింది. కాని కిసరు కున్న సహజార్థమే ప్రయోగంలో సరిపడుతున్నది.
  • "....పసిమి గలకిసలయమ్ములు కొసగ మెసంగి, కిసరు పడక కసరు సెడి... మించి కరాళించు కోయిలల మొత్తంబులును." భాగ. 8. 447.

కిసుక్కున తుమ్ము

  • తుమ్ముటలో ధ్వన్యనుకరణము.
  • పండితా. ప్రథ. పురా. పుట. 496.

కిసురు తీయు

  • పిల్లల పీడానివారణార్థం మంత్రతంత్రాదులతో దిగ దీయు.
  • "నెలసందు. కిసరు తగిలినట్లుంది. మునెమ్మను పిలిచి కిసురు తీసి వేయించండి." వా.

కిస్తీ బంది

  • వాయిదాల ఏర్పాటు. వావిళ్ళ. ని.

కిష్కింధంగా ఉండు

  • ఇరుకుగా ఉండు. కిష్కిం____కీడా 475 కీడు____కీర్తి
  • "ఆ యింట్లో అన్నీ ఉన్నా మరీ కిష్కింధంగా ఉంటుంది. ఇంతమందీ యెలా ఉండగలం." వా.

కిష్కింధాపురవాసులు

  • కోతులలాంటి వారు.
  • "ఆ కిష్కింధాపురవాసుల్లో పడితే మన మేం బయటి కొస్తాం? నానా కంగాళీ పట్టించి పంపిస్తారు." వా.

కీచుబిళ్ల

  • దిండు; తలగడ. శ. ర.
  • చూ. కీచుబుఱ్ఱ.

కీచుబుఱ్ఱ

  • 1. దిండు; తలగడ.
  • "గిలకల మంచమున్ విరులు నించిన సెజ్జయు గీచు బుఱ్ఱయున్." రాధికా. 1. 10.
  • చూ. కీచుబిళ్ల.
  • 2. బాలక్రీడావిశేషం. హంస. 3.

కీచు మని పోవు

  • చిక్కి పోవు.
  • "వా డీమధ్య మలేరియా వచ్చి మరీ కీచు మని పోయాడు." వా.

కీజుపోరు

  • ఊరక పోరు.
  • "కీలుగం టిది యేల పోలగా నును గొప్పు, గీల్కొప్పు కొమ్మంచు గీజు పోరు." శుక. 2. 457.

కీటడగించు

  • పొగ రణచు. కుమా. 11. 151.

కీడాడు

  • దుర్భాష లాడు; నిందించు.
  • "నను....నీ విట్టులు కీడాడంగ నర్హుండవే." భార. కర్ణ. 3. 86.

కీడుపఱుచు

  • చెఱుచు.
  • "ధర్మంబు గీడుపఱిచి." భార. భీష్మ. 1. 60.

కీడు పుట్టు

  • 1. హాని కలుగు.
  • "దాన గీ డెంత వుట్టిన దగిలె నాకు, ననుభవింపక పోవునే." ఉ. హరి. 4. 54.
  • 2. చెడు కలుగు.
  • "లావున రాక వేఱొక తలంపున వచ్చిన గీడు పుట్టదే." ఉ. హరి. 1. 67.

కీడ్పఱుచు

  • అధ:కరించు; క్రిందుపఱుచు.
  • "బయలు దామరల గీడ్పఱుచుపాదములు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 805.

కీర్తిముఖము

  • ముఖాన నుదుటిపై కట్టుకునే తెల్లటిరేకు.
  • ఇప్పటికీ రాయలసీమ వీధి నాటకాల వేషాలలో ఇది కట్టుకుంటారు. కీర్తిముఖమనే అంటారు. కోశాలలోని కిది ఎక్కినట్లు లేదు.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 312.

కీర్తిశేషు డగు

  • చనిపోవు.
  • "శ్రీవారు కీర్తిశేషు లయిరి." వా. కీర్తి____కీలు 476 కీలు____కీలు

కీర్తి సేయు

  • కీర్తించు, పొగడు, స్తుతించు. పండితా. ప్రథ. పురా. పుట. 123.

కీలన చేయు

  • కీలించు, తగిలించుకొను.
  • "చిలుకపోగులను వ్రేల్చెవుల గీలన చేసి." హంస. 5. 55.

కీలరము సేయు

  • మంద వేయు.
  • "సురధేనుసమితి గీలరము సేసె." కుమా. 4. 11.

కీలరువాడు

  • గొల్ల.

కీలారితనము

  • పశుపాలన. భార. విరా. 1. 100.

కీలుకొను

  • ఉండు, నిలుచు.
  • "కృత్తికాతారకంబుల గీలుకొన్న." భీమ. 6. 85.
  • "మెఱుగుందూపులు...కీలుకొనం జేసి." శివ. 1. 86.

కీలుకొప్పు

  • వెండ్రుకలు దువ్వుకొని కొనాన మాత్రం ముడి వేసుకున్నవిధం. కీలుముడి అని నేటి వాడుక.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 317.
  • "తలకు పోసుకున్నావు. చిక్కు దీసుకొని కీలుముడి వేసుకోవే." వా.

కీలుకొలుపు

  • ఉంచు.
  • "కీలుకొలుపుదు నొసలిపై గేలు దోయి." భీమ. 1. 7.

కీలుకొల్పు

  • చేర్చు.
  • "కేలుదోయి ఫాలంబున గీలు కొల్పి." హర. 2. 101.

కీలుగంటు

  • కీలుముడి.
  • "కేశపా,శము తడియొత్తుకొంచు గటి సంధి నటింపగ గీలుగంటు లం,దముగ నటింప." కాళ. 4. 118.
  • చూ. కీలుకొప్పు.

కీలు గలిగిన

  • కీలకము తెలిసిన.
  • "కీలు గల్గిన యొక నీలనీలవేణి." పాండు. 5. 304.

కీలుజడ

  • వదులు వదులుగా వేసుకున్న జడ. శుక. 2. 232.

కీలు ప్రిదిలు

  • రెంటికీ అనుసంధించిన అతుకు వదలిపోవు.
  • "కీలు ప్రిదిలి తటిల్లత నేల బడిన, బరవసంబున." కుమా. 5. 57.

కీలుబొమ్మ

  • 1. చేతులూ కాళ్ళూ ఆడించ గలబొమ్మ.
  • "కులుకుశృంగారరసములు చిలుక గీలు, బొమ్మవలె నీటు గలదాన వమ్మ నీవు." హంస. 1. 91.