పదబంధ పారిజాతము/ఇనుప కచ్చడములు

ఇద____ఇది 156 ఇది____ఇది

ఇదమిత్థము

  • 1. ఇది ఇట్లా అని.
  • "ఇదమిత్థ మ్మని యేనును మది మితి సేయంగ నేఅ..." పాండు.. 3. 125.
  • 2. సారాంశము.
  • "అతను గంటలకొద్దీ ఏవేవో చెప్తాడు. ఇదమిత్థం తేల్చి చెప్పడు." వా.

ఇదానీంతనము

  • ఆధునికము.

ఇది గాక

  • మరిన్నీ.
  • ఏదైనా చెప్తూ మరొక ఉపపత్తిని తెలిపేటప్పుడు ఉపయోగించేపలుకుబడి.
  • ఈ 'ది' 'దీ' అని దీర్ఘంతో కూడా వినిపిస్తుంది.
  • "ఇది గాక మఱొక మెలిక కూడా ఇందులో ఉంది." వా.
  • చూ. ఇదీ గాక.

ఇదిగో అంటే ఇన్నూ రేండ్లు

  • ఇప్పుడే చేస్తా నంటూ కాలం గడిపేవాని విషయంలో ఉపయోగించేపలుకుబడి.
  • "వాణ్ణి నమ్ముకుంటే ఇక నాపని అయినట్లే. వాడు ఇదుగో అంటే ఇన్నూ రేండ్లు." వా.
  • రూ. ఇదుగో అంటే ఇన్నూ రేళ్లు.

ఇదిగో అదిగో అని చూచు

  • ఇదో వస్తుంది అదో వస్తుంది అని వృథాగా ఎదురు చూచు.
  • "మా, కోసము తల్లిదండ్రు లిదిగో నదిగో నని చూచు టాయె." నానా. 47.

ఇది తడవ బని లేదు

  • దీన్నిగూర్చి ఆలోచించవలసిన అవసరం లేదు.
  • "దీని కెంత వలసిన నేమి యిది దడవం బని లేదు." కళా. 3. 66.

ఇది పోలు నిది పోల దని

  • ఇది మంచీ, ఇది చెడ్డా అని.
  • "ఇది పోలు నిది పోల దని చెప్ప దెలియునే, యసదు బొడువ." పాండు. 5. 229.

ఇది యది యనక

  • అడ్డు చెప్పక.
  • "ఇది యది యన కూరకునికి యెంతయు నొప్పున్." భార. ఉద్యో. 2. 59.
  • "వాడిపాటికి వా డేదో చెప్పుకొంటూ ఉంటాడు. ఇదీ అదీ అనకుండా వింటే సరి. మన కెందుకు వచ్చినగొడవ." వా.
  • రూ. ఇదీ అదీ అనకుండా.

ఇదియే పదివేలు

  • ఇంతే చాలు.
  • జరిగిన యేస్వల్ప మైనపనినో మహత్కార్యంగా భావించుటలో ఉపయోగించుపలుకుబడి.
  • "ఇదియె పదివేలు వైభవం బెల్ల నాడు, నల్ల పూసలు చెవియాకు నాకు జాలు." శుక. 2. 84.
  • "నువ్వు తిరిగి వచ్చావు. అదే నాకు పది వేలు, డబ్బు పోతే పోయింది." వా.
  • రూ. అదియే పది వేలు. ఇది______ఇను 157 ఇను______ఇను

ఇది యేమి పెద్ద బ్రహ్మాండమా

  • ఇ దొక లెక్కా, ఇదొక గొప్పా అనుట.
  • "ఇది యేమీ పెద్ద బ్రహ్మాండమా?" శ్రవ. 5. 5.

ఇది యేమి పాపమో!

  • ఇ దేమి అన్యాయం అన్న లాంటి పలుకుబడి.
  • "ఇది యేమి పాపమో యబల!" పాణి. 3. 5.

ఇదీ అదీ అనకుండా

  • చూ. ఇది యది యనక.

ఇదీగాక

  • చూ. ఇదిగాక.

ఇదేనా రావడం

  • ఎవరైనా బంధుమిత్రులు ఇంటికి వచ్చినప్పుడు చేసే పలకరింపు.
  • "ఓహోహో బావగారు! ఇదేనా రావడం." వా.

ఇదే పనిగా

  • ఇతరపనులు మాని.
  • "ఈ మాడ్కి నిదియ పనిగా, గామాం ధుం దగుచు నున్న గార్యము లెల్లన్." కా. మా. 2. 22.

ఇద్ద రిద్దరే

  • ఇద్దరూ ఒకలాంటివారే.
  • "...హతమనస్కులు నిద్దరు నిద్దరే వృథా." దేవీ. 5. 211.
  • రూ. ఇద్దరూ ఇద్దరే.

ఇనుడు గుడిచిన నీ రగు

  • ఇంకిపోవు, ఎండిపోవు.
  • "చలవమందుల శైత్యంబు సంభవిలక యినుడు గుడిచిననీ రయ్యె." శకుం. 3. 44.

ఇనుప కచ్చడములు

  • వాచ్యార్థం ఇనుముతో చేసిన కౌపీనము లేదా లంగోటీ అనే అయినా, లక్షణయా నిష్ఠుర బ్రహ్మచర్యానికి సంకేత మయినది.
  • "...యినుప కచ్చడాల్ గట్టికొను మునిమ్రుచ్చు లెల్ల, దామరస నేత్ర లిండ్ల బందాలు గారె." మను. 2. 78.
  • "విషయాంకురము గిల్లి వేయని వారికి నినుపకచ్చడమున కెంత దవ్వు?" పాండు. 4. 278.
  • "తెమలి యినుపకచ్చడము లూడివడు నన్న, నున్న వారి నింక నెన్న నేల?" విక్ర. 8. 73.

ఇనుపకుందు

  • వాకిలి తిరుగుటకై వేసిన గుండ్రని యినుపగూటము. కాంబెల్.

ఇనుపగజ్జెల తల్లి

  • దరిద్రదేవత.
  • "వాళ్లయింట్లో యినుపగజ్జెలతల్లి తాండవిస్తూ ఉంది." వా.

ఇనుపగుగ్గిళ్లు

  • కొఱుకుడు పడనివి.
  • ముఖ్యంగా అర్థమూ, భావమూ సులువుగా తేలని కావ్యాలపట్ల, ఇతరములపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • తాళ్ల. సం. 7. 34. ఇను_____ఇను 158 ఇను_____ఇను
  • "శ్రీ హర్షుని నైషధశ్లోకాలు ఇనుపగుఘ్ఘిళ్లు." వా.
  • చూ. అయ:పిండం.

ఇనుపచిట్టెము

  • మండూరము.
  • ఆయుర్వేదంలో ఉపయోగించేఖనిజము.

ఇనుపతెర

  • దాటరాని ఆటంకము.
  • నేటి రాజకీయాలలో 'ఐరన్ కర్టన్‌' అన్న యింగ్లీషు మాటనుండి వచ్చిన పలుకుబడి.
  • నా. మా. 131.

ఇనుపతేలు

  • నల్లతేలు.
  • ఎఱ్ఱతేలుకు, బాపన తేలుకు వ్యతిరేకం.
  • చూ. ఎఱ్ఱతేలు, బాపనతేలు.

ఇనుపదారి

  • రైలుమార్గము.

ఇనుపమంగలమువలె నుండు

  • విపరీతముగా కాలిపోవుచుండు.
  • "ధరాతలం బినుపమంగలముం బలె నుండె గాలి." కా. మా. 1. 123.

ఇనుపమొలకు మేడ గాల్చు

  • అల్పలాభానికై అనంతనష్టము కలిగించుకొను.
  • ఇనుపచీలకోసం మేడను ఎవరైనా కాల్చుకొంటారా?
  • "కరవాలు జేత బూనినకరణి, నినుపమొలకు మేడ గాల్చుట సుమ్మూ." రుక్మాం. 5. 143.

ఇనుపయెడ్లు

  • ఎనుములు, గేదెలు, దున్నలు. శాసనపరిభాష.
  • ఎనపగొడ్లు అని రాయలసీమలో నేటి వాడుక.
  • అసలు ఇనుపయెడ్లే ఇన్పయె డ్లై, ఎన్పయె డ్లై, ఎన్పగొడ్లుగా మారిఉండవచ్చును. ఎనుములు అని ప్రత్యేకించి వాడడం కూడా కద్దు.

ఇనుమడి

  • రెండింతలు, రెట్టింపు.
  • చూ. ఇబ్బడి.

ఇనుమడించు

  • ఎక్కు వగు.
  • "ఇనుమడింపద మానసమున నలంత." భార. స్త్రీ. 2. 166.

ఇను మడిచేవానికి తగర మడుచు టెంత?

  • సులభ మనుట.
  • ఇనుము చాలా గట్టిలోహం. దాన్నే సాగగొట్ట గలవానికి తగరం మరీ మెత్తన కనుక చాలా సులభం కదా.
  • "ఎన లేక యెదిరికి నినుమడి చేవారికి తన తగర మడువ దడ వయ్యేనా?" తాళ్ల. సం. 8. 61.

ఇనుమాఱు

  • రెండుమారులు. ఇను_____ఇను 159 ఇన్నా_____ఇపు
  • "కర్ణుం డినుమా ఱొకశరము దొడుగునే." కర్ణ. 3. 317.

ఇనుమిక్కిలి

  • ఇబ్బడి.
  • "రాజుకంటె నినుమిక్కిలి మా కనురక్తిమై." సారం. 2. 268.

ఇనుమిక్కిలిగా

  • అధికముగా.
  • "మందగా, మిని యను టెల్ల నప్పు డిను మిక్కిలిగా దన యందె నిల్వగన్." విజ. 3.207.
  • "ఈ సంవత్సరం వాడి ఆదాయం ఇను మిక్కిలిగా పెరిగింది." వా.

ఇనుము గూడి యున్న అగ్నికి పెట్టు వచ్చు

  • సహవాసదోషంవల్ల కష్టములు కలుగు ననుటను సూచించే పలుకుబడి.
  • "ఇనుము గూడి యున్న యగ్నికి బెట్టు రాకుండు నెట్లు." కళా. 7. 261.
  • చూ. వరగుతో దాగరయు నెండినట్లు.

ఇనుము సంగతిజేసి యిల బావ కుండు వనుగొని మర్దింప బడునట్లు

  • సహవాసదోషం వల్ల బాధ ననుభవించుపట్ల అంటారు.
  • పండితా. ప్రథ. పాద. పుట. 695.

ఇనుమో ఱాయో

  • చాలా కఠిన మనుట.
  • "నాయుల్ల మరయ నినుమో ఱాయో కా కిట్లు రూపఱన్ విన నేర్చెన్." భార. భీష్మ. 3. 419.

ఇన్నాళ్లు

  • ఇంత కాలంగా.
  • "ఇన్నాళ్లు నడుగ బుత్తేడు." నైష. 3. 123.
  • "ఏలా పుట్టె నీ దూఱు నీ కిన్నాళ్ లేనిది." సారం. 3. 88.
  • "ఇన్నాళ్ళూ ఎంతో హాయిగా వున్నాం. ఇప్పుడు కలత లారంభమైనవి." వా.

ఇన్నాళ్లుగా లేనిది.

  • ఇంతవరకూ ఎప్పుడూ లేనిది.
  • "ఏలా పుట్టె నీదూఱు నీ కిన్నాళ్ లేనిది." సారం. 3. 88.
  • "ఇన్నాళ్లుగా లేనిది వాడికి ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో తెలియదు." వా.

ఇన్నూఱు

  • రెండువందలు.
  • "ఇన్నూఱు మున్నూఱు నేనూఱు కన్నులు గల వేలు పెవ్వాని గన్న తండ్రి." నైష. 6. 72.

ఇన్పగుండు

  • తుపాకిగుండు.
  • "తామరతూడు నాళముల దార్కొను తుమ్మెద యిన్పగుండు లు, ద్దామత గూర్చి." కాళిందీ. 3. 155.

ఇన్మాఱు

  • రెండుమాఱులు.
  • భార. అను. 3. 284.

ఇపు డేమి గంటి

  • ఇప్పుడే యే మయింది?
  • ఇంకా ముం దున్న దనుట.
  • "ఇపు డేమి గంటి నా కెక్కడి సిద్ధ సంకల్పత." ప్రభా. 4. 51. ఇప్ప_____ఇము 160 ఇము_____ఇయ

ఇప్పపూ మొగ్గలబోని బుగ్గలు

  • అంద మైనబుగ్గలు. కవిసమయ సిద్ధ మైన ఉపమానం.
  • "అంబురుహముఖుల యొప్పులకుప్ప లగు నిప్పపూమొగ్గలం బోని బుగ్గలం దగ్గలిక నూపుకమ్మపంజుల..." మను. 3. 28.

ఇబ్బంది

  • కష్టము.
  • "ఈ యీబ్బందిలో మీరు ఆదుకోవాలి." వా.

ఇబ్బందిగాడు

  • బెబ్బులికీ, చిఱుతపులికీ పుట్టినపులి.
  • బ్రౌను. శ. ర.

ఇబ్బందిపడు

  • చిక్కు పడు.
  • "ఆ ఊళ్లో డబ్బు లేక నేను చాలా యిబ్బందిపడి పోయాను." వా.

ఇబ్బడి

  • రెండింతలు.
  • "వేడ్క యిబ్బడి గాదే." ఉత్త. రామా. 2. 240.
  • "కాస్త జాగ్రత్తగా చేస్తే యింత కిబ్బడి ముబ్బడి చేయొచ్చు." వా.
  • చూ. ఇనుమడి, ఇమ్మడి.

ఇముడుకొను

  • 1. కాపాడు.
  • "కొన్ని నాళ్లు నన్ని ముడుకొమ్ము కరుణ ననాథ ననిన." ప్రబో. 5. 81.
  • 2. చేరుకొను, కలుసుకొని పోవు.
  • "వాడు వాళ్ల అత్తగారింట్లో బాగా యిముడుకొని పోయాడు." వా.

ఇమురుకొను

  • హరించికొని పోవు.
  • "ఇమురుకు యాఱి పోయిన దీపమునకు, జమురు వోసినయట్టు."
  • రంగ. రామా. అయో. 145.

ఇమ్మడి

  • రెండింతలు
  • "ఉత్సవోన్మత్తభావ మిమ్మడి యై ప్రమోదంబునం దేలిరి." భార. అశ్వ. 3 ఆ.
  • రంగ. అయో. 145 పు.
  • చూ. ఇనుమడి, ఇబ్బడి.

ఇమ్మడి ముమ్మడి

  • ఇబ్బడి ముబ్బడి, రెండింతలు, మూడింతలు.
  • "ఇమ్మడి ముమ్మడి యితరదేశంబు లిమ్మహి." పండితా. ద్వితీ. పర్వ. పుట. 416.

ఇమ్ముకొను

  • వ్యాపించు.
  • "నెమ్మి పురి విచ్చె గాలుష్య మిమ్ము కొనియె." కాళిందీ. 2. 43.

ఇమ్ముల నుండు

  • నెమ్మదిగా నుండు.
  • "మునుల సద్గోష్ఠి నిమ్ముల నున్న వేళ." గౌ. హరి. అ. పంక్తి. 12.
  • "ఇమ్ముల నున్న వాడె హరి." భాగ. స్క. 10 (పూ) 1474.

ఇయత్త

  • సత్తా, సారం. ఇయ_____ఇర 161 ఇర_____ఇర
  • "వాడి యియత్త ఇంతా అని తెలిస్తే అప్పుడు ఏం చేసేది ఆలోచించవచ్చు." వా.
  • చూ. ఇయత్త్వం.

ఇయత్త్వం

  • సత్తా సారం.
  • చూ. ఇయత్త.

ఇయ్యకొను

  • ఒప్పుకొను.

ఇయ్యకొలుపు

  • ఒప్పించు.
  • భార. ఉద్యో. 1. 27.

ఇయ్యకోలు

  • ఒప్పుదల, అంగీకారము.
  • "ఎవ్వని చరిత మియ్యకో లై రాశి కెక్కు లోకములు." పండితా. ప్రథ. పురా. పుట. 385.
  • "ఇయ్యకోలుమై జనియె." ఉద్భ. 2. 226.

ఇయ్య యను

  • సరే అను.
  • "నా సుతునకు భార్య వగు మన్న నొడబడి యియ్య యనియ." భార. ఆది. 4. 141.

ఇయ్య సేయు

  • ఒప్పుకొను. రాజశే. 3. 19

ఇరవందు

  • ఒప్పారు.
  • భాగ. పూ. 10. 468.

ఇర వగు

  • నెలకొను, ఉండు.
  • "ఈడనే శ్రీ వెంకటాద్రి నిర వైతి వనుచు." తాళ్ల. సం. 6. 162.
  • "అం దిర వై యుయ్యెల లూగు చున్నది." విప్ర. 2. 62. నైష. 1. 52.

ఇరవారు

  • ఒప్పు.
  • "పరిణయ మిరవారగ నాడు చేసితి." భా. రా. సుం. 294.

ఇరవుకొను

  • నెలకొను.
  • "కొల నైన....ఇచ్చోట నిరవుకొన్నది చూడుడు." వర. రా. కిష్కి. పు. 480. పంక్తి 12.

ఇరవుకొలుపు

  • నెలకొల్పు.

ఇరవుకొల్పు

  • నెలకొలుపు.

ఇరవు చూపు

  • స్థాన మిచ్చు.
  • "ముక్తికి నిరవు చూపెడుచేతు లివియె పో." తాళ్ల. సం. 5. 108.

ఇరవు దప్పినమాట

  • క్రమము తప్పినమాట.
  • "ఇరవు దప్పినమాట నేటి కాడెదవు?" ద్విప. జగ. పు. 213.

ఇరవు పడు

  • నెలకొను.

ఇరవుపఱచు

  • ఉంచు, నెలకొలుపు.
  • "ఈశానుదిక్కునం దిరవుపఱిచె." పాండు. 5. 157. ఇర_____ఇరు 162 ఇరు_____ఇరు

ఇరవై ముఫ్పై రోజులలో

  • కొద్దిరోజులలో.
  • "చాలా నా ళ్లుండను. ఇరవై ముఫ్పై రోజులలో వచ్చేస్తాను. బెంగ పెట్టుకోకు." వా.

ఇరవొందు

  • నెలకొను.

ఇరసాలు చేయు

  • కిస్తీ వసూలు చేసినడబ్బును తాలూకా కచ్చేరికి పంపించు.

ఇరాఱు

  • పండ్రెండు.
  • "ఇరాఱు మేనులం దా నటు దిడ్లు దూఱి చనె." రుక్మి. 1. 43.

ఇరిమిరిమి చూచు

  • బిక్కిరిచూపులు చూచు. ఇది ఉరుమి ఉరిమిగా కనబడదు. కాని అలాంటిదే ఇది.
  • "ఇల మృగమ ట్లిరిమిరిమి చూచుచును." పండితా. ద్వితీ. పర్వ. పుట. 441.

ఇరియించు

  • భస్మము చేయు.
  • "నొసల నెసగుశిఖియసమున, మసరు మనోభవు మెత్తనిమే, నిరియించితి." ఉద్భ. 3. 289.

ఇరివిలి

  • తొలి; పోగఱతో చేయబడిన రంధ్రము. శ. ర.

ఇరుకుచేతి....

  • లోభి యైన.
  • ధారాళ మైనచేయి కా దను పట్ల, మనిషి వాడు ఇత్యాదులతోచేరి విశేషణంగా ఉపయుక్త మవుతుంది.
  • "ఎంతుంటే నేం? వాడు వట్టి యిరుకుచేతి మనిషి. ఇస్తాడా? పెడతాడా?" వా.
  • "ఆ ఇరుకు చేతివానిదగ్గఱ కెందు కెళ్ళారు?" ఇస్తాడా? పెడతాడా." వా.

ఇరుగాలుఓసులు

  • ద్విపాదపశువులు - నీచు లనుట. పశువులే కాని రెండే కాళ్ళు. ఇంతే భేదం అని...
  • "మి మ్మిరుగాలి పసుల." బస. 6. 525.
  • చూ. ఇర్గాలి పసులు.

ఇరుగాలు నిలువక

  • ఒక్కచోట నిలువక.
  • "ఇరుగాల నిలువక యేగు బెగడి." కవిక. 4. 99.
  • చూ. రెండుకాళ్లూ ఒకచోట పెట్టక.

ఇరుగింటి దయ్యము పొరుగింటి గూబ

  • దుష్టస్త్రీ.
  • గూబ అమంగళసూచకము. దయ్యం భయంకర మైనది.
  • "ఇరుగింటి దయ్యంబు పొరుగింటికిని గూబ, యెదురింటివారల కెదురు చుక్క." శుక. 3. 20.

ఇరుగిల్లు

  • ప్రక్క యిల్లు.

ఇరుగుపొరుగు

  • ప్రక్క యింటివారు. ఇరు______ఇరు 163 ఇరు______ఇరు
  • ఇరుగూ పొరుగూ అని నేటి వాడుక.
  • "ఒక్క లగ్న మేర్పఱిచి యిరుగుపొరుగు నెఱుగకుండ..." శుక. 2. 166.
  • చూ. ఇజ్జలజ్జలవారు; అంతపొంతలవారు ; ఇరుగుపొరుగులు.

ఇరుగుపొరుగులు

  • ప్రక్క యిండ్లవారు.
  • "ఇరుగుపొరుగు లెఱుగక యుండన్." రాధ. 1. 33.

ఇరుచంబడు

  • కుంచించుకొని పోవు.
  • "ఇరుచంబడి గుమ్మడిమూట గట్టి." క్రీడా. పు. 15.

ఇరుచెవి యెఱుగకుండా

  • పక్కవానికి తెలియకుండా.
  • "ఇరుచెవి యెఱుగక యుండం, దరుణీ సుఖ మనుభవింప..." ఉ. హరి. 5. 197.
  • "ఏగె దేవేంద్రు డిరుచెవి యెఱుగ కుండ." భీమ. 4. 50.
  • రూ. ఇరుసెవి యెఱుగకుండా.

ఇరుజీవి ఎరగకుండా

  • రెండవవానికి తెలియకుండా, రహస్యముగా ననుట. వాడుకలో మాత్రమే ఉంది.
  • "వా డేం చేసినా ఇరుజీవి ఎరక్కుండా చేస్తాడు." వా.

ఇరుదలపాము

  • రెండుతలల పాము. బురద పాము.

ఇరుదలపులుగు

  • గండభేరుండము.

ఇరుదలశిఖండి

  • మేదరకత్తి..
  • "కీసినవెదురు సలాకల, నేసినయిరుదల శిఖండి." క్రీడా. పు. 22.

ఇరుదెసకొలువు

  • ఇద్దఱిక్రింది ఉద్యోగం.
  • "ఇ ట్టేల చెల్లు నీ కిరుదెసకొలువు." బస. 6. 168 పుట.

ఇరుమే నయి

  • అతిలాఘవంతో - ఒకడు యిద్దరుపోలికగా విజృంభించి.
  • "హరుడు వినోదార్థముగా, నిరుమే నయి రణ మొనర్చె." భార. ద్రోణ. 5. 295.

ఇరులుకొను

  • క్రమ్ము, వ్యాపించు.
  • "శైత్యపాండిమలు దుషారాంతమున జేరి, నిర్లుకొన్ ద్రాక్షపందిరుల విరుల." ఆము. 5. 139.

ఇరులుకొల్పు

  • చీకటి కలుగజేయు.
  • "ఇరులు కొల్పుచు నున్న వీప్రావృషేణ్యశరదంబులు." వర. రా. కిష్కి. పు. 393 పంక్తి. 11.

ఇరువాయికట్టు

  • మలమూత్రబంధ మగు.

ఇరువైపుల కను గల్గి

  • జాగ్రత్తగా.
  • రెండువేపులా కన్ను వేసి ఉండాలి - అన్నట్లు నేడు విన వస్తుంది. ఇరు_____ఇర్గా 164 ఇఱి_____ఇఱు
  • "ఇరుకెలంకులను కనుగల్గి దిక్కులు కలయ గన్గొనుచు." వర. రా. కిష్కి. పు. 286. పంక్తి 16.

ఇరు లన్న నో యనియెడు తమిస్ర

  • కటికచీకటి.
  • పిలిస్తే పలికే దనుటలో కావలసినంత ఉన్నది అనేభావం సూచితము.
  • "మరులుదీగ మెట్టి యిరు లన్న వో యని యెడితమిస్ర గాడుపడి." ఆము. 6. 12.
  • చూ. పిలిస్తే పలుకు.

ఇరు సెవి యెఱుగకుండా

  • రెండవచెవికి తెలియ నీయ కుండా - ఇతరుల కెవరికీ తెలియకుండ రహస్యముగా అనుట.
  • "ఇరు సెవి యెఱు గక యుండం, దరుణీసుఖ మనుభవింప దలచిన." ఉ. హరి. 5. 197.
  • రూ. ఇరు చెవి యెఱుగ కుండా.

ఇర్గాలిపసులు

  • ద్విపాదపశువులు.
  • మనుష్యులను నిందించుటలో అనుమాట. కాళ్ళసంఖ్యలో భేదమే కాని పశుసమానులే అనుట.
  • "ఇర్గాలి పసు లగుగౌళతాపసులు నిందింప." పండితా. ప్రథ. పురా. పుట. 389.
  • చూ. ఇరుగాలిపసులు.

ఇఱియుకౌగిలి

  • బిగికౌగిలి.
  • "ఎదురొత్తగా నేర్పె నిఱియుకౌగిటి యందు." కవిక. 3. 226.

ఇఱుకటమున బడు

  • చిక్కుకొను ; ఇఱుకులో పడు.
  • "పెనుసందడిలో నిఱుకటమున బడ్డనృపతి." నైష. 4. 124.

ఇఱుకటములు

  • తిప్పుడుమాటలు.
  • "ఈ యిఱుకటములు మాని, లేదు బొంకితి నని లెమ్ము." ద్వి. హరిశ్చ. పూ. 140214.

ఇఱుకాటము

  • స్థలము చాలమి.
  • "ఇల్లు ఇఱుకాటంగా ఉంది." వా.
  • "అక్కడ దారి యిఱుకాటంగా ఉంది." వా.

ఇఱుకాటంలో పడు

  • చూ. ఇఱుకులో పడు.

ఇఱుకున పడు

  • ఎటూ చెప్ప లేనిస్థితిలో పడు.
  • "వాడు వాణ్ణి ఎదుట ఉంచుకొని నన్ను నిలదీసి అడిగేటప్పటికి కాస్త యిఱుకున పడ్డాను." వా.

ఇఱుకుమ్రాను

  • తోటలకూ దొడ్లకూ చుట్టూ ముళ్లకంచె వేసి దారిలో ఒక యిఱుకుమాను నాటుతారు. అది పంగలకొయ్య. మనిషి పట్టడానికి తగినంత సందే అందులో ఉంటుంది. దానిని ఇఱు_____ఇఱు 165 ఇఱ్ఱి_____ఇఱ్ఱి

నేటికీ యిఱుకుమాను అనే అంటారు.

  • "ఇఱుకుమాను వేస్తే గాని దొడ్లో పశువులు పడకుండా ఉండవు." వా.

ఇఱుకుమ్రాకులు

  • రథచక్రములక్రింద పోటీగా పెట్టుకొయ్యలు.
  • "ఇఱుకుమ్రాకుల వైచి యే లెల్ల యనుచు దో,పించిన నింతైన బెగల దయ్యె." శుక. 2. 12.

ఇఱుకులో పడు

  • సంకటావస్థలో చిక్కుకొను.
  • "వా డిప్పుడు ఇఱుకులో పడ్డాడు. ఇప్పు డాఉకోక పోతే మనస్నేహం ఎందుకు>" వా.

ఇఱుకులో సరుకుమత్రంచేయు

  • చిక్కులో పడినప్పుడు దాని నుపయోగించుకొని తన పని గడుపుకొనుపట్ల ఉపయుక్త మయ్యే పలుకుబడి.
  • "వా ళ్లేదో యిబ్బందుల్లో ఉంటే అప్పిచ్చినట్టే యిచ్చి ఆపొలం వాడు ఇఱుకులో సరుకు మంత్రం చేశాడు." వా.

ఇఱుచీకటి

  • కారుచీకటి.
  • అతి శ యార్థ ద్యోతక మైన ద్విరుక్తి.
  • ఇరులు = చీకటి.
  • "ఇఱు జీకటి నిశల నింక నెవ్వం డ నుపున్." హర. 3. 88.

ఇఱుముకొను

  • వ్యాపించు.
  • "ఇఱుముకొనం దొడంగె దెస లేచినచీకటి నంచు.-" భా. రా. యు. 1084.

ఇఱ్ఱింకుచూపులు

  • తళుకుచూపులు.
  • "ఈక్షింపగా నేర్చె నిఱ్ఱింకు జూపుల." కవిక. 3. 226.
  • నిలిచి చూచుచూపులకు వ్యతి రిక్తము లయినవి.

ఇఱ్ఱింకు లింకించు

  • ఇంకునట్లు చేయు. లక్షణయా అడుగునట్లు చేయు.
  • "ఎవ్వాడు వింధ్యాద్రి నిఱ్ఱింకు లింకించె గంభీరహుంకారగర్జనమున." భీమ. 2. 77.

ఇఱ్ఱింకు లింకు

  • ఇంకిపోవు, ఎండిపోవు, నీర సిల్లు.
  • "భౌమవారపు వీరభద్రపళ్ళెర మిడు గృహదైవతంబు లిఱ్ఱింకు లింక." ఆము. 4. 43.
  • "ఎం దేని నఘము లిఱ్ఱింకు లింకు." భీమ. 3. 66.

ఇఱ్ఱింకులు చేయు

  • పోగొట్టు. నైష. 7. 993.

ఇఱ్ఱి గోఱజము

  • కస్తూరి.

ఇఱ్ఱిదీముభోగములు

  • చంచలము లైనసుఖములు. ఇఱ్ఱిదీము మృగతృష్ణకు తెలుగుమాట అనిపిస్తుంది.