అచ్చు____అచ్చొ 34 అచ్చొ_____అజ

అచ్చు వేసిన ఆంబోతు

  • స్వేచ్ఛాచారి.
  • దేవునిపేర అచ్చు వేసి ఒక ఆంబోతును విడుచు అలవాటుపై వచ్చిన పలుకుబడి. దానినే వృషోత్సర్జనం అంటారు. అది ఎవరి అదుపులోనూ ఉండదు కనుక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వాళ్ల నాన్న చచ్చిపోయినతరవాత అడిగేవాళ్లూ పెట్టేవాళ్లూ లేక వాడు ఊరకే అచ్చు వేసిన ఆంబోతులా తిరుగుతున్నాడు." వా.

అచ్చు వేసినయెద్దు

  • చూ. అచ్చు వేసిన ఆంబోతు.

అచ్చు వొడుచు

  • వేఱుగా ఉంచు, అట్టిపెట్టు.
  • "మూడుపాళ్ళు వెచ్చమునకు రానీక యచ్చు వొడిచి డాపవలయు."
  • శృం. శా. 4. 175.

అచ్చొత్తిన గొఱ్ఱె

  • శివ. 71.
  • చూ. అచ్చు పోసినఆంబోతు.

అచ్చొత్తినదియె?

  • ఇదే కావాలని ముద్రవేసి విడిచినదా?
  • "నీకు దీనిని జంప నీమమే సెపుమ ఆకాంత దీనినే అచ్చొత్తినదియె."
  • బస. 5. అ. 125 పుట.

అచ్చొత్తి విడుచు

  • అచ్చు వోసి విడుచు.
  • దేవార్పణంగా పశ్వాదులను వదలివేయడం ఆచారం.
  • బస. 5. ఆ. 125 పుట.

అచ్చొత్తు

  • ముద్రించు.
  • "ఇది ఆనంద ముద్రాక్షరశాలయందు అచ్చొత్తింప బడియె." పా. వా.

అచ్ఛాణి (డి)

  • స్వచ్ఛము, శ్రేష్ఠము.

అజ కనుక్కొను

  • జాడ తెలుసుకొను.

అజగజన్యాయం

  • చూ. అజగజాంతరము.

అజగజాంతరము

  • దానికీ దీనికీ చాలా వ్యత్యాసం ఉన్న దనుట.
  • చూ. హస్తిమశకాంతరము.

అజగరోపవాసము

  • దొంగ ఉపవాసము.
  • కొండచిలువ ఒకచోటనే పడి ఉంటుంది. తనదగ్గరికి ఏదో ఒక జంతువు వచ్చేదాకా ఉపవసిస్తుంది. వస్తే మాత్రం వదిలిపెట్టదు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • "అజగరోపవాస మల బక ధ్యానంబు నక్కవినయ మిట్టినయము లెల్ల." వైజ. 2. 19. అజ్జ______అట 35 అట______అటు

అజ్జ యైనవేళ

  • వీలుపడినప్పుడు, అవకాశము చిక్కినప్పుడు.
  • "అని పలికె నదియు మొదలుగ వెనుదీయక యజ్జ యైన వేళల నెల్లన్."
  • శుక. 3. ఆ. 494 ప.

అజాగళ స్తనాలు

  • వ్యర్థము లనుట.
  • "నగంగ నైన వా, క్రుచ్చి యజాగళ స్తన సగోత్రులు వారల నెన్న నేటికిన్."
  • కళాపూ. 1. 7.

అజా పజా లేదు.

  • చూ. అజా వజా లేదు.

అజా వజా లేదు.

  • అయిపు లేదు.
  • "వాడి అజావజా లేదు. మూడు రోజులయింది వాడు ఇల్లు విడిచిపోయి.:: వా.

అజ్ఞాతవాసం

  • రహస్యముగా జీవించుట, ప్రజల యెరుకకు రాకుండా ఉండుట.
  • పాండవులు పండ్రెండేండ్లు అరణ్యవాసం చేసి, ఆతరవాత ఒకయేడు అజ్ఞాత వాసం చేశారు. దానిపై వచ్చిన పలుకుబడి.
  • " నే నిప్పుడు అజ్ఞాతవాసంలో ఉంటున్నాను. ఒక్కసారే ఒక కావ్యం ముగించి ప్రజలముందు పడతాను." వా.

అటకలు-నాకు

  • దరిద్రముతో బాధపడు.
  • అటకలు అనగా వంట చేసుకునే చిన్నకుండలు.
  • "అత్త అటకలు నాకుతూ ఉంటే అల్లుడు వచ్చి దీపావళిపండగ అన్నాడట." పా.

అటమటకాడు

  • మోసగాడు.
  • "అటమటకాడు మహామాయలాడు." గౌర. హరి. 2. 646.

అటమటము

  • అయథార్థము.
  • "అటమటమో లేక నిజమొ." సారం. 2. 254.

అటమున్ను

  • అంతకంటె ముందు.
  • "సృష్టికి నటమున్ను." హర. 3. 13.
  • కాశీ. 4. 213.

అటుకుగింజ

  • గడుసరి.

అటుకులు తిని చేయి కడుగు కొన్నట్లు

  • పూర్తిగా సంబంధము వదలు కొన్నట్లు.
  • అటుకులు తింటే చేయి కడుక్కోకనే చేతి కేమీ మిగలదు. ఇక కడుక్కుంటే అసలేమీ ఉండదు కదా!
  • "మీ చెల్లెలు పోగానే ఆయింటి సంబంధం అటుకులు తిని చేయి కడుక్కున్న ట్లయింది." వా.

అటుండనీ

  • అది అలా ఉండనీ. అటు______అట్ట 36 అట్ట_______అట్టి
  • "ఓరి దండధర! యీ చండితనంబు లటుండనీ రా." హేమా. పు. 29.

అటువంటివారమా

  • అటువంటివారము కాము, మంచివారము అనుట.
  • "అటువంటివారమా యాకలి దప్పమిక్కిలి పుణ్య మన్న నంగీకరించి."
  • శుక. 4. ఆ. 7. ప.
  • "నేను అట్లాంటివాణ్ణి కాదు."
  • "నేను అట్లాంటిదాన్ని కాదు. నాతో సరస మాడ వద్దు." వా.
  • ఏక వచనంలో - మహదమహదర్థలాలు రెండింటా యిది ప్రయుక్త మవుతుంది.

అటో యిటో తేల్చి చెప్పు

  • నిశ్చి తాభిప్రాయమును వెల్లడించు.
  • రుద్రమ. 9. పు.

అట్టకట్టు

  • చిక్కగా యేర్పడు.
  • "....క్రొమ్మావి చిగురు బఱపుపెట్టు పెట్టినచందాన నట్టకట్టె."
  • శకుంతలా. 3. 177.
  • "చెమటకాతలతో ఒళ్ళంతా అట్ట కట్టుకొని పోయింది." వా.

అట్టళ్లు వన్ను

  • కోటకొమ్మలపై కాపలా సైనికుల నుంచుటకై గదుల నేర్పరచు.
  • "కోట సింగారించి కొత్తళంబుల నెల్ల నట్టళ్లు వన్నించి యాళువరికి." ఉ. హరి. 2. 92.

అట్టహాసం

  • దర్జా, దర్పం.
  • ఇందులో కొంత 'ఇంత ప్రదర్శన మెందు' కన్నవ్యంగ్యం అంతర్భూత మై ఉంది.
  • సంస్కృతంలో మామూలుగా ఉన్న గట్టిగా నవ్వడం అన్న అర్థం ఇందులో మాసి పోయింది.
  • "వా డిప్పుడు మన కెక్కడ దర్శనం యిస్తాడు. వాడి అట్టహాసమూ వాడూ వెలిగిపోతున్నాడు."
  • "వాడీమధ్య మహా అట్టహాసంగా ఉన్నాడు." వా.

అట్టహాసంగా

  • మహా దర్జాగా.
  • చూ. అట్టహాసం.

అట్టహాసం పట్టపగలు

  • వాడి దర్జా చాలా పెరిగి పోతూ ఉంది అని కొంత నిరసన సూచిస్తూ అనేమాట.
  • "వాళ్ళ అమ్మమ్మవైపు ముదనష్టపుఆస్తి యేదో వచ్చిపడింది. ఇంకేం! వాడిదంతా అట్టహాసం పట్టపగలుగా ఉంది." వా.

అట్టిట్టగు

  • 1. డోలాందోళిత మగు
  • "అయ్యనిమిషలోచనకు హృదయ మట్టి ట్టయ్యెన్." నిరంకు. 4. 41.
  • 2. సంచలించు.