పండితారాధ్యచరిత్ర
చెన్నపురి:
ఆంధ్రపత్రికా ముద్రాశాలలో ముద్రితము.
1939.
ప్రకాశకుల విజ్ఞప్తి
దాదాపు నాలుగైదేండ్ల పరిశ్రమ ఫలమును నేటికి బయట పెట్టగలుగుచున్నాము. ఈ ఆలస్యమునకు కారణమును సహృదయులైన పండితమహాశయులు ఊహించలేకపోరు.
ఆనాడు మేము దీనిప్రకటనకు ప్రారంభించినప్పుడు మా కాధారభూతమైనది దీని ప్రాత ముద్రితప్రతి ఒకటిమాత్రమే. అగుట కేమో ఇది అదివరకే ముద్రితమైయుండెను. కాని అది అడుగడుగునకును సంస్కారాపేక్షముగానే యుండెను. ఇటువంటి ఉత్తమగ్రంథము అటువంటి అసంస్కృతరూపములో ఉండుటను చూచి సహింపలేకయే మేము దీని పునర్ముద్రణమునకు పూనుకొంటిమి. అందుచేత ఆ లభించిన ఒక గుజిలీప్రతిని ఆధారముగా పెట్టుకొని, వివిధ భాండాగారములందు లభించిన భిన్నభిన్నము లయిన వ్రాతప్రతులతో దీనిని సరిచూచి, అనేక పాఠాంతరములను సేకరించి, యుక్తము లయిన పాఠమును గ్రహించి, అసలు గ్రంథమునకు దీటురాగల అమూల్యమైన పీఠికతో ఈ గ్రంథమును ఆంధ్రలోకమునకు సమర్పించవలయునని పూనుకొన్న మహోద్యమములో అనివార్యముగా ఈ ఆలస్యము సంభవించక తప్పినది కాదు. మా పరిశ్రమఫలితమును పండితసోదరులు ఈ గ్రంథములో ప్రత్యక్షముగా గ్రహింపగల రని మా దృఢవిశ్వాసము.
అడిగినదే తడవుగా మా ప్రార్థనమును మన్నించి, అనేక ప్రయాసల కోర్చి, సొంతపనులను కూడ మానుకొని ఈ గ్రంథమును శుద్ధముగా సంస్కరించి, పరినిష్ఠత మైన పీఠికను రచించి మా యుద్యమమునకు సర్వవిధములుగా సహాయపడిన డా. చిలుకూరు నారాయణరావు యం. ఏ., పి. హెచ్. డి. గారికీ ఈ సందర్భములో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతావందనములను సమర్పించుచున్నాము.
ఈ గ్రంథ ప్రాశస్త్యమును గురించియు, దీని విశిష్టగుణములను గురించియు మేము ప్రత్యేకముగా పేర్కోవలసిన అవసరము కానరాదు. శ్రీ నారాయణరావుగారే ఆవిషయముల నన్నిటిని సమగ్రముగాను, విపులముగాను తమ పీఠికలో ప్రశంసించియున్నారు.
ఆంధ్ర మహాజనులు మా గ్రంథమాలయందు యథాపూర్వమైన ఆదరాభిమానముల నుంచి, 30వ కుసుమముగా ప్రకటితమైన ఈ అపూర్వగ్రంథరాజమునకుకూడ యథోచితముగా ప్రోత్సాహ మిచ్చినయెడల మా యుద్యమము చరితార్థము కాగల దని విన్నవించుచున్నాము.
- చెన్నపురి
- ప్రకాశకులు.
- 4-12-39.