పంచతంత్రి/ప్రథమాశ్వాసము

భానుకవి పంచతంత్రి

ప్రథమాశ్వాసము

శా.

శ్రీరామాకుచకుంకుమఛ్ఛవిలసచ్ఛ్రీకౌస్తుభస్ఫూర్తి కా
ధారంబై యురమంతయుం బ్రథమసంధ్యారాగభాలార్కకాం
త్యారూఢోదయశైలరీతిఁ దనరన్ దా(సన్ను)తుండైన శృం
గారాధీశుఁడు వేంకటేశ్వరుఁడు లక్ష్మామాత్యుఁ బ్రోచుందగన్.

1


శా.

గౌరీచిత్తసరోమరాళము వియద్గం(గాఝరీ)చంద్రరే
ఖారాజన్మణిమౌళి, పారిషదసంఘస్తోత్రపాత్రుండు, గం
భీరోదారగుణుండు శంభుఁడు రహిన్ (బెంపొంద) రక్షించు వి
ద్యారాజీవభవున్, మహావిభవు లక్ష్మామాత్యచూడామణిన్.

2


ఉ.

వారణరాజవక్త్రుఁడు దివాక[రశీతకరామరాధిపాం]
భోరుహసంభవాదిసురపూజితపాదతలుండు విఘ్ననీ
హారవిపాటనార్కుఁడు గణాధిపుఁ డీకృతి[నాథు భూమిభృ
ద్వారసభాంతరప్రణుతవాగ్విభవాన్వితుఁ] జేయు వేడుకన్.

3


మ.

అరవిందమ్మున నున్న యట్ల నిజగేహంబందు వర్తించి సుం
దరరూపాయు[రనామయప్రచురసత్సంతానముల్ గంధసిం
ధురవాహప్రమదామణీవనగృహస్తోమాదికైశ్వర్యముల్]
గరుణాపాంగములన్ [బయో౽బ్ధిసుత] సంకల్పించు [లక్ష్మయ్యకున్.]

4


కమనీయోజ్జ్వలభాగ్యుఁ జేయుత మహాకారుణ్య మేపార సం
భ్రమచిత్తమ్మున [సౌరవాహినికి] భారంబొప్ప సామేని యి
క్క మునీంద్రస్తుతమూర్తియై యభవు నంకంబందు వర్తించు శీ
తమ (హీభృత్సుత) ప్రోచు లక్ష్మవిభు మందారాభవిశ్రాణనున్.

5


ఉ.

అంబురుహాసనానన గృహాంతరభాగమునన్ వసించి లో
కంబులచేతఁ బూజఁగొని గాత్రసితప్రభలన్ వెలుంగు న

య్యంబుజనేత్ర విద్యలకు నాకర మయ్యెడి దేవి భారతిన్
గంబుసమానకంఠి నధికంబుగఁ గొల్చెదఁ గార్యసిద్ధికిన్.

7


వ.

అని యివ్విధమ్మున నిష్టదేవతాప్రార్ధనమ్ము చేసి,

8


గీ.

అఖిలజనులకు రామకథామృతమ్ము
గలుగఁ బ్రవహింపఁజేసిన కవివరేణ్యు
సుభగచారిత్రు మునిజనస్తోత్రపాత్రు
నేకమనమునఁ గొల్తు వాల్మీకి నెపుడు.

9


క.

భారతవాగ్భణితులను న
నారతకలికలుషతిమిర మణఁగించుచు వి
ద్యారూఢి నవనిఁ దనరిన
పారాశర్యుని నుతింతుఁ బరమప్రీతిన్.

10


సీ.

కావ్యత్రయము నాటకంబులు రచియించి
                    ఘనకీర్తి నొందిన కాళిదాసు
(నహరీశహ)రుల విద్యలచేత మెప్పించి
                    యుర్విఁ బేర్గనిన మయూరు బాణుఁ
దెలుఁగునఁ బాండవేయుల కథఁ గూర్చి పెం
                    పెక్కిన నన్నయఁ దిక్కనార్యు
భాగవతమ్ము నా పద్ధతి గావించి
                    పొలుపొందు బమ్మెర పోతరాజుఁ
జతురు శ్రీనాథు భాస్కరు శంభుదాసు
రంగనాథుని ఘను నాచిరాజు సోముఁ
దలంచి తక్కినకవుల ముదమునఁ బొగడి
కరముఁ బెంపొంద వారల కరుణ వడసి.

11


వ.

ఏ నొక్కప్రబంధమ్ము నిర్మింపంగోరి పురాతనకవీంద్రులచేత
మున్నఖిలమ్ము రచింపంబడె నాకు నిప్పు డెయ్యది గలుగునో యని విచారిం
పుచునున్న యవసరమ్మున.

12


సీ.

తనయరు లఖిలగోత్రక్షమాధరతట.
                    స్థానమ్ముల ననారతమ్ము దిరుగ

తన(దు) గుణమ్ములు (దనరి) పద్మభవాండ
                    (కాండసం)పూర్ణవిఖ్యాతి నొంద
తనదానజలనిధుల్ వనధి యాదో జంతు
                    సంతతికిని సంతసమ్ముఁ జేయ
తనప్రతాపోష్మమార్తాండ (బింబము రి)పు
                    ధ్వాంతసంతానమదం బడంపఁ


గీ.

బరగు శ్రీకృష్ణరాయ భూపాల కార్య
భారధౌరేయుఁ డర్థార్థిపారిజాతుఁ
డలఘువిభవమహేంద్రుండు (నధిపవిధి)ప
రాయణుండగు లక్ష్మీనారాయణుండు.

13


సీ.

వేదశాస్త్రపురాణవిద్యాప్రవీణత
                    నొప్పు విద్వజ్జను లొక్కవంక
సంస్కృతప్రాకృతశబ్దార్థవిదులగు
                    నుభయభాషాకవు లొక్కవంక
సంగీతసాహిత్యచతురత నవనిఁ బెం
                    పొందిన నేర్పరు లొక్కవంక
బహువిధవిద్యలఁ బరిణతిఁ బొందిన
                    యురుజనసంఘమ్ము లొక్కవంక


గీ.

నాదిగా గల్గువారలు నపరిమితము
గాఁగఁ బొలుపొందఁ జూచి సంకల్పసిద్దుఁ
డఖలభాగ్యుండు చిట్టన యతనితోడఁ
బలికె సంతోషహృదయసంపన్నుఁ డగుచు.

14


క.

ధననిక్షేపము గృతియును
దనయుఁడు నల్లిల్లు దేవతాభవనమ్మున్
వనము తడాగము నన నివి
(జననుతముగఁ) దనరు సప్తసంతతులందున్.

15


క.

తలపోయఁ గృతియ జగతీ
తలమున నాచంద్రసూర్యతారకమై ని
ర్మలకీర్తిలతకుఁ గుదురై
నిలుచుగదా యనుచుఁ బలుక నిపుణత వెలయన్.

16

సీ.

మందాకినీచంద్రమందారచందన
                    సితకీర్తిఁదగు నరసింహభట్టు
పతికార్యహితనయోపాయమ్ములను [యుగం
                    ధరుఁ డనఁజాలిన] నరసమంత్రి
నృపసభాంతరవర్ణనీయధీమార్గవ
                    ర్ధిష్ణుఁడౌ నవధాన కృష్ణఘనుఁడు
నానా[విధ]కళాప్రవీణత దిక్కుల
                    వెలసిన భరతము విష్ణుభట్లు


గీ.

మొదలుగా నున్నవారలు మోదమునను
వరుస నందఱు విన్నవించిరి ప్రధాన
వర్య! మీతలఁ పొప్పు భూవలయమునను
నల హరిశ్చంద్ర రామచంద్రులకునైనఁ
గీర్తి యున్నతి కెక్కుట గృతులఁగాదె!

17


ఆ.

ఆశ్రితుండు మీకు నాంధ్రభాషావిశా
రదుఁడు భానుకవి, కరమ్ము వేడ్క
నతనిచేత నెద్దియైన ప్రబంధము
సేయఁబనుపు మధికధీయుతముగ.

18


మ.

వరవాగ్వైఖరి లక్షణజ్ఞతను శ్రీవత్సాన్వయఖ్యాతి భూ
వన మాన్యప్రకృతిన్ బురాతనసుకావ్యప్రౌఢిమన్ భారతీ
వరమంత్రప్రతిభన్ మహేశపదసేవానిష్ఠ (నిన్ బోల రు)
ర్వరలోఁ [1]దిప్పయ భాస్కరేంద్ర! [బుధవర్ణ్యమ్ముల్] భవద్భాగ్యముల్.

19


వ.

అని కృతిపతితోడఁ జిట్టనామాత్యుండు వలుక నాతండు సంతో
షాతిశయంబున వల్లెయని కర్పూరసమేతంగాఁ దాంబూలంబును జాం
బూనదాంబరాభరణమ్ములునుఁ జామరాందోళికావిభవమ్ములును నేక
భోగగ్రామంబులు నొసంగి బహుమానపూర్వకంబుగా ననిపిన నేనును
నమ్మహాప్రధానశేఖరు నిట్లని వినుతించితి.

20


స్రగ్ధర.

లక్ష్మీకారుణ్యవీక్షాలయశుభకలనాలంకృతస్ఫారతేజా!
లక్ష్మీశాకార! వాచాలసదురగ(సమశ్లాఘ!)వంశప్రతిష్ఠా!
సుక్ష్మాభృల్లేఖకార్యస్తుతవిభవ! కళాస్తోకవిఠ్ఠార్యపుత్రా!
లక్ష్మీనారాయణా! దోర్లసితవితరణోల్లాస వర్ధిల్లు ధాత్రిన్!

21

స్రగ్ధర.

నామప్రఖ్యాతి నీతి న్మధురమృదులసన్మంజుభాషామనీషా
సామగ్రిన్ సాధుభక్తిన్ సరసగుణపరిష్కారరేఖాప్రసక్తిన్
సామంతోద్భావనాదిన్ సచివగుణములన్ సన్నుతి న్మించితౌరా
శ్రీ మద్విఠ్ఠయ్య లక్ష్మా! స్థిరమతి విభవాశీ విషాదీశ లక్ష్మా!

22


వ.

అనిస్తుతియించి యమ్మంత్రిమణిఁ గృతీశ్వరుంగా నియమించి తదీయ
వంశావతారం బభివర్ణించెద.

23


శా.

భారద్వాజపవిత్రగోత్రమున శుంభల్లీలమైఁ గేశవుం
డారూఢిం బ్రభవించెఁ గీర్తియను స్వచ్ఛాంభోనిధిన్ బుద్బుదా
కారభ్రాంతి నజాండపంక్తి దనరన్ గర్ణాంబుదశ్రీదమం
దారోదారగుణమ్మునన్ సరసవిద్యాప్రౌఢిఁ గీర్తింపగన్.

24


క.

భామామణి యగు గౌరమ
యా మంత్రివరేణ్యు భార్యయై పరగె లస
త్సీమంతిని మునునోఁచిన
నోముల ఫలమిదియ యని తనుం బ్రజ వొగడన్.

25


క.

వారల పుణ్యంబునఁ బెం
పారగ నుదయించె విఠ్ఠలామాత్యుఁడు గం
భీరగుణవారిరాశిసు
ధారుచిసమకీర్తిధీరతామేరు వనన్.

26


ఉ.

సారసశాత్రవాంకము వృషధ్వజకంధరనీల మష్టది
గ్వారణగండదానజల[పంకము] దుగ్ధపయోధిమధ్య ల
క్ష్మీరమణాంగ కృష్ణరుచిశేషదృగంచిత[నీలకాంతి నిం]
పారగఁ గప్పు విఠ్ఠసచివాగ్రణిఁ బొందినకీర్తు లెల్లడన్.

27


సీ.

గజపతి మెప్పించి కనకఘంటలు గొని
                    విద్యాప్రవీణత వినుతి కెక్కె
సతతాన్నదానమ్ము సాగి[౦చి భూసురో]
                    త్తముల [నేప్రొద్దు] నెయ్యమునఁ బ్రోచె
పరహితకృతికృతాభ్యాసకీర్తి స్ఫూర్తి
                    పొలుపొంద భూషణమ్ముగఁ దనర్చె

ధర్మమ్ము గుణము సత్యమ్మును దనతోఁడు
                    నీడలు నాఁగ వర్ణింపఁ దనరె


గీ.

నవని నానార్థిజనదరిద్రాంధకార
పటల మణఁగించె నరవిందబంధుఁ బోలి
సఖులపాలిటి కల్పవృక్షమ్ము దలఁప
మంత్రిమాత్రుండె విఠ్ఠయామాత్యవరుఁడు.

28


గీ.

అతనికిని భార్యయై రుక్మమాంబ యపుడు
దేవతాగురుభక్తి యతిథిసపర్య,
పతి సమారాధనక్రియాపరత, తనకుఁ
గరము పెంపొం[దు భూషలుగాఁ జెలంగె.]

29


వ.

వారిరువుర భాగ్యవశంబున.

30


సీ.

ప్రత్యర్థిపార్ధివపట్టణద్వారక
                    వాటపాటనబలోజ్జ్వలభుజుండు
సప్తసముద్రాంతశైలోపరిస్థలీ
                    సంకీర్ణగుణలతాసంచయుండు
[హరజటా]నిర్గతసురధునీభంగ
                    నిర్హ్రాదజృంభితవాగ్విరాజతుండు
ఛద్మమంత్రిలలాటచారుభాగ్యాక్షర
                    సంహృతిదీప్తవిచక్షణుండు

31


గీ.

సజ్జనవ్రాతదైన్యతుషారహరణ
కమలమిత్రుండు కవిరాజకల్పశాఖ
పంచబాణనిభుం డుదయించె బంధు
రక్షణము సేయ లక్ష్మీనారాయణుండు.

32


చ.

అమలినచందనా[స్పదము నాయత]వృత్తగుణమ్ము చారుభో
గము గల లక్ష్మమంత్రి కరకంజము జేరినయట్టి ధాత్రి క్రో
డమునకు వ్రీడఁ జేసి జగడంబుల [గచ్ఛపు]దుచ్ఛ మాడి [లో
కములను శేషు]దోషయుతుగా నొనరించెను సార్వకాలమున్.

33


సీ.

ఏ మంత్రి సితకీర్తి హీరకర్పూరనీ
                    హారహారమ్ముల నపహసించు
నే మంత్రి శేముషీభీమవిక్రమ [మరి
                    రాజన్యులకుఁ గూర్చు రంభపొందు]

నే మంత్రి దానమ్ము జీమూతవాహన
                    శిబిబలికర్ణుల సిగ్గుపఱచు
నే మంత్రి సౌందర్య మింద్రాత్మజ మనోజ
                    ధనదజులకు విన్నఁదనము సేయు


గీ

నఖిలభోగవినిర్జితహరిహయుండు
[సచివమాత్రుండె కవిబుధప్రచయసురభి]
[కృష్ణరాయ దయావి]వర్థితరమావి
రాజి కరణము లక్ష్మి నారాయణుండు.

34


శా.

దానంబందుఁ బ్రతాపశక్తి నురువిద్యాప్రౌఢి [సద్బంధుమి
త్రానూనప్రియవర్తనమ్మునను సప్తాంగక్షమారక్ష ల
క్ష్మీనారాయణునామ మెన్నుదురు గోష్ఠీసంప్రయోగమ్ములన్]
నానారాజసభాంతరమ్ములఁ గవీంద్రశ్రేణి యశ్రాంతమున్.

35


గీ.

పుణ్యగుణదానభోగవిభూతిఁ దనరు
పొ... పార్వతియును గడునొప్పు మిగులఁ
దనకు నిల్లాండ్రు గాఁగ భూతలమునందు
రమణఁ జెలువొందె లక్ష్మినారాయణుండు.

36


వ.

.......

37


క.

తనుఁ బశ్చిమాబ్ధిపాలకుఁ
డన దిక్కులఁ బేరువడసి యఖిలసుకృతులన్
దనరిన విఠ్ఠప్పొడయఁడు?
తనయుడుగా లక్కమంత్రి దద్దయు వెలసెన్.

38


వ.

ఏవం విధ గుణగణ...

39


క.

శ్రీరాజితభవనునకు న
పారయశశ్చంద్రకాంతబహుభువనునకున్
బౌరాణికకవిభటమం
దారునకును దాన, వారిధరధీరునకున్.

40


క.

లాలితమహిళానవపాం
చాలునకున్ బంధుమిత్రజనపాలునకున్

బ్రాలేయకరయశోమా
లాలంకారునకుఁ జిత్తజాకారునకున్.

41


క.

బాహాసినిహతరిపుసం
దోహవిమర్దనకళాచతుర్బాహున క
వ్యాహతభోగజితాంబుద
వాహునకు రమాపయోజవనగేహునకున్.

42


క.

దానజలధౌతవిప్రవి
తానభయానకదరిద్రతాపంకునకున్
దానవమథనపదాబ్జ
ధ్యానమహాపుణ్యశశ్వదకళంకునకున్.

43


క.

నానామహీశమహితా
స్థానీ(జేగీ)యమానచంచద్గణసం
(తాన)యుగంధరునకు ల
క్ష్మీనారాయణున కర్థిచింతామణికిన్.

44


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన పంచతంత్రి
యను మహాప్రబంధమునకుఁ గథాక్రమం బెట్టిదనిన—

45


సీ.

కమనీయసాలబద్ధమణిప్రభాచ్ఛలా
                    శబలితాకాశదిశా[2]తటమ్ము
సౌధాంతరస్థిత[స్త్రైణరుచికరూ]ప
                    రేఖావిజితనిర్జరీగణమ్ము
నానా[విధసుమప్రతాన]నూత్నరమావి
                    చిత్రతాపహసితచైత్రరథము
సంతతమదవారిసామజ(సంభావి)
                    తాకాలవర్షాగమాభ్రచయము


గీ.

ఘన(నవాగరు)ధూపితగంధవహము
త్యాగినృపసుతహసితదుగ్ధార్ణవంబు
స్వర్ణరథపరికల్పితస్వర్ణధరము
భువనమాన్యమ్ము పాటలీపురవరంబు.

46

వ.

అమ్మహానగరమ్మున కధీశ్వరుండగు సుదర్శనుండు.

46


సీ.

తనదృష్టి యష్టదిగ్దళమహీమండల
                    పద్మాంతరస్థమై పరగుచుండ
తన రూప మంగనాజనమానసములకుఁ
                    బంచశిలీముఖభ్రాంతిఁ జేయ
తన కీర్తిసతి జగత్రయరమణీయసౌ
                    ధాభ్యంతరమ్ముల నాడుచుండ
[తన ప్రతాపాగ్ని శాత్రవకానన నమ్ముల]
                    పై, ననారతమునుఁ బ్రజ్జ్వలింప


గీ.

గంధగజగోత్రభూమిభృత్కచ్ఛపాహి
పాల [కిటిరాట్]ధురంధరబాహుభీమ
శక్తి సంపదఁ బెంపొంద, సత్యనిరతిఁ
బొలిచె ముందటిరాజులఁ బోలి యతఁడు.

47


వ.

అంత నమ్మహీవల్లభుం డొక్కనాఁడు సమస్తవిద్యావిధిజ్ఞులగు
తిథిజ్ఞులును నధికతరప్రబంధనిస్తంద్రులగు కవీంద్రులును, అఖిలపురాణపారీ
ణులగు పౌరాణికులును పరరాజరాష్ట్రవిభేదననీతితంత్రజ్ఞులగు మంత్రు
లును, నిజకృపాపాత్రులగు నుత్తమక్షత్రియులుసు, గొలువం బేరోలగం
బుండి తన కుమారులు నీతిశాస్త్రపారంగతులు గాకుండుటకు హృదయం
బున విషాదంబు నొంది సభాజనమ్ములు విన నిట్లనియె.

48


చ.

అలఘుకళావివేకవిభవాదులఁ బెంపగు సూనుఁ డేక్రియన్
గలుఁగడ యేని, భార్యఁ దన కౌఁగిలి జేర్పకయుంట మేలు ము
న్నలిగి ఋతుప్రసంగతుల నంటక యుండిన మేలు, గర్భమై
పొలిసిన, వంధ్యయై, రమణి పుట్టిన మేలు ధరాతలమ్మునన్.

49


క.

ఘనవిద్వాంసుఁడు ధార్మికుఁ
డును గాకుండినఁ దనూజుఁడు ధరిత్రిన్ గ
ట్టని పిదుకని మొదవుం బో
లినవాఁ డరయంగ సూక్ష్మలిఖితాచార్యా!

50

క.

ఏలా! నరునకుఁ దనయా
జాలము విద్యావిలాససత్యవచోల
క్ష్మీలలితమూర్తి యొక్కఁడ
చాలుం దలపోయ లక్ష్మసచివవరేణ్యా!

51


గీ.

చోరు లపహరింపలేరు భూపాలుర
వలని బాధ లేదు వాయువహ్ని
వారి[భయము] నొరయ దారయ విద్యాధ
నంబు వసుమతిన్ ధ్రువంబుగాదె!

52


క.

అయమార్గనీతివిద్యా
నయముల నేఘనుఁడొకో! పునర్జన్ములఁగా
నయ మొప్పఁజేయు నతిగ
ర్వయుతుల నానుతుల నతనువశదుర్మతులన్.

53


క.

అనిన నృపుఁ జూచి విద్వ
జ్జనవందితుఁడైన విష్ణుశర్మను విప్రుం
డనువేడ్క నాఱునెలలకు
ననఘా నీయాత్మజుల మహాత్ములఁ జేతున్.

54


వ.

అనిన నమ్మహీకాంతుండు నితాంతసంతోషమ్మున నతని నఖిల
వస్తుసంచయములం దేలించి నిజకుమారుల నర్పించిన నతండును వారలం
దోడ్కొని (యాత్మ)విద్యామంటపమునకుం జనుదెంచి మిత్రభేద, సుహృ
ల్లాభ, సంధి, విగ్రహ, లబ్ధనాశ, నాసంప్రేక్ష్యకారిత్వంబులను పంచతంత్రంబులు
కల్పించి యందుఁ బ్రథమతంత్రంబగు మిత్రభేదం బెఱిఁగించువాఁడై
యిట్లనియె.

55


చ.

చెలిమి యొనర్చినన్ గపటిచేఁ జెడుఁ దథ్యము తొల్లి కానన
స్థలమున సింహగోవిభులు చారుతరమ్ముగ మైత్రిఁ జేసి ని
శ్చలమతి నుండువేళ నొకజంబుకవల్లభుచే విరోధముల్
గలుగవె! యొండొకళ్లకనఁ, గౌతుకమానసులై కుమారకుల్.

56


వ.

మహాత్మా! యెవ్విధంబున........... నెఱింగింపుమనిన విష్ణు
శర్మయు వారల మనఃప్రియంబులం దెలిసి యా కథఁ జెప్పదొడంగె నది
యెట్లనిన మున్ను దక్షిణాపథమ్మున,

57

మ.

మహిళారూప్య మనంగఁ బట్టణము రమ్య[ప్రాంశు]హర్మ్యావళీ
మహితోద్యానసరోవరప్రతతులన్ మాతంగవాహావళిన్
బహుఘంటాపథయంత్రవప్రపరిఖాప్రాకారకూపమ్ములన్
మహనీయం [బగుసప్తస]ప్తివిలసన్మార్గోప[రోధోన్నతిన్.]

58


గీ.

అందు వర్థమానుఁడను వర్తకుఁడు గలఁ
డతఁడు నేర్పుతో బెహారమాడి
వచ్చు లాభధనము వసుమతీసురదేవ
తార్పణమ్ము సేయు నాత్మఁ దనరి.

59


వ.

అతఁడు పెద్దయుఁ దనహృదయమ్మున నిట్లు తలపోసె.

60


క.

సిరులును ఘనవిభవముల,
స్థిరములు తనతోఁడ వచ్చుఁ జేసిన సుకృతం
బరయగ నది పరికింపగఁ,
బరసుఖకారణము నూత్నభరతాచార్యా!

61


క.

[జలదానో]కహగోవ్రజ
జలఫలదుగ్ధమ్ములట్ల సత్సంపదలున్
దలపంగఁ బరహితార్థమె
విలసిల్లు ధరాతలమున విఠ్ఠయలక్ష్మా!

62


సీ.

పుత్రపౌత్రకళత్రభోగభాగ్యస్వగా
                    త్రంబులు దలఁప నిత్యములు గావు
నమర విప్రులకు యోగ్యముగాని విత్తంబు
                    చోరనృపతులచేఁ [జూఱ] వోవు
పరహితమునకును బాథేయమగు పాత్ర
                    దానమ్ము భక్తియుక్తముగఁ జేయ
నని, యంత బేహారమున కేఁగ నూహించి
                    వర్థమానుండు సర్వార్థములను


గీ.

నింబలరఁ గూర్చికొని సంభ్రమం బెలర్పఁ
గదలి నందకసంజీవకంబు లనఁగ
వఱలు వృషభమ్ము లుభయపార్శ్వములఁ గట్టి
ధనికులగు మిత్రబాంధవజనులతోఁడ.

63

వ.

అయ్యవసరంబున నతిజవంబునం జన నొక్కవిపినప్రదేశంబునఁ
బ్రమాదవశంబున నెరకలుఁగులో సంజీవకంబు కాలువిఱిగిన నతండు ధనవం
తుం డగుటఁ జేసి వెండియు నొకవృషభంబుఁ బుచ్చుక తచ్ఛకటంబున నమ
రించుకొని.

64


ఉ.

పోవుచు వర్తకుండు వృషపుంగవురక్ష యొనర్ప నొక్కనిన్
గావలి నిల్పి వాని కధికంబగు విత్త మొసంగె నత్తఱిన్
జీవము వోవకుండఁ గృపచేఁ దృణవారి యొసంగి వేడ్క సం
జీవకుఁ బుండరీకములచేఁ బడకుండగఁ బ్రోచె నాతఁడున్.

65


వ.

ఇవ్విధంబున వర్తకభృత్యుండు పెద్దకాలంబు నావృషభంబును
గాచి వేసటంబొంది కాలురాకునికి నాసంజీవకుని విడిచి, చని వాఁ డది మృతిం
బొందె నని వర్థమానున కెఱింగించిన నతండును నయ్యనడ్వాహమ్ము
పిత్రార్జితంబగుటం జేసి విషాదంబు నొందె నంత నక్కడ.

66


క.

జొంపములు గొనిన పచ్చిక
గుంపులు మే సచట వృషభకుంజరుఁ డనుమో
దింపుచుఁ జరణము దట్టి చ
రింపఁదొడఁగె వనమునందు రేపును మాపున్.

67


ఉ.

వారణరాజకుంభమును వ్రక్కలుజేసి తదీయరక్తముల్
సారెకుఁ గ్రోలిక్రోలి సరసంబగు మాంసము మెక్కి తుంది లా
కారబలంబునన్ మృగనికాయము దిక్కుల మీఱి గర్వవి
ద్యారుచిఁ బొల్చుఁ బింగళకుఁ డన్మృగవల్లభుఁ డవ్వనంబునన్.

68


వ.

విలసిల్లుచుండి యతం డొక్కనాఁడు సమస్తమృగములు గొల్వ,
యమునాసమీపమ్మునఁ గ్రుమ్మరుచున్ బ్రళయకాలబలాహకగర్జాసన్నిభం
బగు సంజీవకు భయానకధ్వానం బాకర్ణించి కలుషితస్వాంతుండై తనలో
నిట్లనియె.

69


క.

తనభీతియుఁ దన నేరమి
తనధనహానియును దగిన తనమర్మంబున్
దనగృహరంధ్రం బెప్పుడు
ఘనునకు గోప్యముగవలయుఁ గరణికలక్ష్మా!

70

క.

అని తలపోయుచు మదిబొడ
మిన యద్భుతసాధ్వసంబు మృగసందోహం
బున కింతయు నెఱిగింపక
ఘనమగు గోప్యమున నుండెఁ గడుఁనే ర్పమరన్.

71


గీ.

తన్మృగేంద్రపరివృఢప్రధానసుతులు
గలరు ఫేరవభర్తలు కరటకుండు
దమనకుండన నీతివిద్యాప్రవీణు
లలఘుబలు లింగితజ్ఞులు ననఘమతులు.

72


వ.

తత్సమయంబున నయ్యిద్దఱిలో దమనకుండు కరటకుం గనుంగొని
యయ్యా! ఈమృగేంద్రుండు జలాభిలాషి యయ్యు మందసంచారుండై
యుండుటకుఁ గతం బెఱుంగుదే యన నతం డీయర్థమ్ము మనకుఁ దెలియం బని
యేమి యని యిట్లనియె.

73


క.

ధారుణి నెవ్వండ వ్యా
పారంబుల దిరుగుఁ [3]బ్రేతపతి? సదనంబున్
జేరు నతఁడు తరుచీలయు
వారక పెడబాపినట్టి వానరు భంగిన్.

74


సీ.

అనవుడు దమనకుం డది చెప్పుమనఁ గర
                    టకుఁడు ము న్నొక్కపట్టణసమీప
మునను దేవాలయంబునకుఁ గూర్చిన మ్రాను
                    వ్రయ్యలు వారంగ వైచి దాని
నడుమ చీల ఘటించి నరులేఁగఁ గానల
                    కరుగుచుఁ గపిసంచయమ్ము చేర,
నందొక క్రోతి [దిష్టాంతకప్రేరణఁ
                    దటుకునఁజీల] మీఁదటికి నురికి


గీ.

స్తంభవిరాంతరమునఁ గోళములు వ్రేల
పాణిదంతమ్ములను జీల బలిమి దించి
యుగ్రవథఁ బొందెనట్లు గాకుండ మెలఁగ
వలయు మతిమంతు లుచిత(స)ద్వర్తనముల.

75

వ.

కావున నీవేళ మనకు నిన్నటి భుక్తశేషమృగామిషం బనుభ
వింపవలయు, పోదమనిన దమనకుండు వానింజూచి యాహారమాత్రార్థి వెట్లు
రాజసేవ సేయనోపుదనినఁ గరటకుం డిట్లనియె.

76


చ.

పరుల మదంబుద్రెంచ దనబాంధవకోట్లను మన్చి దిక్కులన్
గురుతరకీర్తి నించ దనకోరికలెల్ల ఫలించ రాజశే
ఖరులను సజ్జనాళి కలకాలము గొల్చుటకాక, పొట్టకై
తిరముగఁ గొల్వనేల కులదీపక! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

77


సీ.

ఉదరపోషణమున నుండదె కొక్కెర
                    చండియై జీవనస్థలములందు
శూద్రనివాసమ్ము చుట్టున నెంగిళ్లు
                    తినియుండదే కుక్క దినదినమ్ము
భోజనమ్ములుగ [ధరాజనోచ్ఛిష్టముల్,
                    కాకు లుండవె] చిరకాల మిలను
గ్రామసూకరములు కష్టవర్తనముల
                    బ్రతుకవే దేహాదిభ్రాంతిచేత


గీ.

పరుల రక్షింపనోపని నరులజన్మ
ములు దలంపఁగ నట్టివ యలఘుకీర్తు
లలఘుకార్యమ్ములకుఁ బూని యధికు లగుట
లాలితంబగు విఠ్ఠయ లక్ష్మధీర!

78


వ.

క్షుద్రనదీవిధంబున వివేకశూన్యుం డల్పజీవనంబునన్ బరిపూర్ణ
మనోరథుండగునని పలికినఁ గరటకుం డతనిం జూచి యిప్పు డుచితకార్యం
బెయ్యది చెప్పుమనిన నతం డిట్లనియె. మన విభుండగు మృగనాథుండు సాధ్వ
సమనంబునం బరివారసహితుండై యున్నవాఁ డనిన నది నీ వెట్లెఱుంగుదు
వని కరటకుం డడిగిన దమనకుం డిట్లనియె.

79


గీ.

పలికినంత నెఱుఁగు పశువులు, దలపోయ
సంజ్ఞ నెఱుఁగు దంతి, సైంధవములు
నొరుల యింగితమ్ము లూహ నెఱుంగుట
తెలివి, లక్ష్మమంత్రి! ధీసమేత!

80

వ.

అట్లు గావున నాప్రజ్ఞాబలమున నెఱింగితి ననం గరటకుం డతని
నిరీక్షించి రాజు నుపాసించు సమయ మెఱుంగఁజేయు మన దమనకుం
డిట్లనియె.

81


క.

కోపప్రసాదగుణములు
భూపాలునియందుఁ దెలిసి బుద్ధి నధికుఁడై
చాపలవిరహితహృదయుం
డై పెంపునఁ గొలువ, నధికుఁడగు సేవకుఁడున్.

82


గీ.

అనినఁ గరటకుఁ డిట్లను ననవసరము
నందు మున్నొక్కనాడు నీవరుగ విభుఁడు
మిగుల విలపించె నీవేళఁ దగుఁ జనవునఁ
బోవ, ననవుడు నాతండు బుద్ధిబలికె.

83


వ.

ఎవ్విధంబుననైన నుపజీవులకుఁ బరివృఢసేవ విడువవచ్చునే యని
దమనకుండు వెండియు నిట్లనియె.

84


క.

పతి, యంగనాంగసంగ
స్థితిఁ దాఁ జేపట్టినట్లు చెనఁటులనైనన్
సతతమ్ము డాసి కొల్చిన
నతికరుణను బ్రోచు, వారి నవనీపతియున్.

85


వ.

అని చెప్పిన గరటకుండు దమనకుతో నీవు పతిసన్నిధికిం జని
యచ్చట నతనిచిత్తమ్ము వచ్చునట్లుగా నెవ్విధంబుగఁ బలికెదవనిన నతం
డతని కిట్లనియె.

86


క.

ఒరులాడిన వాక్యమ్ముల
సరవిం బ్రతివాక్యములు రసస్థితి వొడమున్
ధరణిని బీజమ్ములు దా
మురు వృష్టిని బొడముకరణి నుచిత మ్మగుచున్.

87


క.

గురువైనసు [భటుఁడైనను]
బరిభవమును బొందు మనుజపాలకుచేతన్
సరసత్వము సమయోచిత
మురువాచాప్రియము నెఱుఁగకున్నను ధరణిన్.

88

క.

భారములేదు సమర్థున
కారయ పరదేశ మెద్ది యతివిజ్ఞునకున్
దూరమ్ము గలదె సాదికి!
వేరీ! ప్రియవాది కరులు విఠ్ఠయలక్ష్మా!

89


వ.

అని యివ్విధంబునఁ దనపలుకులకుఁ బ్రత్యుత్తర మొసంగిన సంత
సిల్లి దమనకా! నీకు భద్రంబగు మృగరాజు సేవకుం బోయిరమ్మ నిన వల్లెయని
దమనకుం డచ్చోటు వాసి.

90


చ.

జవమున నామృగేంద్రవిభుసన్నిధికిం జని వందనమ్ము గౌ
రవమునఁ జేయ నాతఁడు కరంబు ముదమ్మునఁ దేలి మంత్రిపుం
గవ! చిరకాల మయ్యె పొడగంటిమి నేఁడను నంత, జంబుక
ప్రవరుఁడు డాసి పల్కె మధురంబగు వాక్యము లుల్లసిల్లఁగన్.

91


వ.

దేవా! భవచ్చరణారవిందసేవకుండ, నీసేవకంటె నా కన్యంబొండు
గలదే యేనిప్పుడు రాచకార్యం బెఱింగి నీ సమ్ముఖంబునకుం జనుదెంచితి,
నని తత్ప్రసాదసదనంబగు వదనంబు విలోకించుచు దమనకుం డిట్లనియె.

92


గీ.

[నమ్మి] భృత్యుఁడనుచు నన్ను జూడకు దేవ
వచ్చి హితము సేయువాఁడు ఘనుఁడు
పాదకంటకంబు వాపుట కరయంగ
ముసలమేల! వాడిముల్లుగాక.

93


క.

ఇడుములు వొందిననైనను
విడువరు ధైర్యమ్ము నతివివేకులు దివియన్
బుడమిన్ దలక్రిందైనను
విడుచునొ[కో! మిడు]తతతులు విఠ్ఠయలక్ష్మా!

94


క.

హలికుఁడు సమస్తబీజం
బులు నుర్వరఁజల్లి పిదప మొలకలచేతన్
ఫల మెఱిఁగినట్లు హృదయం
బుల కార్యఫలమ్ము లెఱుఁగఁ బోలు సుమతికిన్.

95


క.

తొడవులక్రియ భృత్యుల నిలి
పెడుచోటుల నిలుపవలయు, పృథివీశుఁడు పెం

పడర, నటుగాక తక్కినఁ
దడబడుఁ గార్యములు తద్విధంబున దలఁపన్.

96


గీ.

కనకభూషణసముచితకమ్రమౌక్తి
కమ్ము లోహానఁ గట్టిన కరణి నధిక
[విధుల] పతి హితమతులందు వెలయుభటులఁ
గూర్చు సిరికన్య పురుషులఁ గూర్పఁజనదు.

97


చ.

జనవిభుఁ డజ్ఞుఁడైన పరిచారులు బుద్ధివిహీను, లట్టిచోఁ
బనులొనరింప నచ్చటికిఁ బ్రాజ్ఞులు చేరరు, నట్టివారు లే
మిని, బహునీతిశాస్త్రముల మేలు గ్రహింపగలేఁడు నీతిహీ
నుని నృపు నెంతవానిని మనుష్యులు రోఁతురు భూతలమ్మునన్.

98


ఆ.

ఘోరకాంతరాజగుణములచే నుప
జీవి సంతతికినిఁ జేరరాక
వచ్చుటయును గల్గి వనజంతుమణులచే
సుదధివోలె నధిపు డుండవలయు.

99


ఆ.

చైత్రచిత్రభానుచందమ్ము పెనుపొంద
వెట్టకోర్చి విభుఁడు వెతదలంప
కఖిలజనమహీరుహావళీహృదయముల్
చెలఁగి పల్లవింపఁజేయవలయు.

100


వ.

అని యివ్విధంబున [విన్నవించి] నిఖలమృగసేవితపాదాంబుజ
చతుష్క! నన్ను నీయందలి భక్తియుక్తుగా నెఱుంగుమని ఫేరనప్రవరుం
డిట్లనియె.

101


చ.

హరియును పోత్రిగాత్రధరుఁడై శరజన్ముఁడు ఛాగరూపియై
సరసిజబాంధవుండు హయసంహనుఁడయ్యు[ను మున్] మహేశ్వరాం
బురుహభవాదిదేవపరిపూజ్యులు గారె మృగేంద్ర! శౌర్యభా
సుర! నను నక్కమాత్రముగఁ జూడకుమీ మది నీకు బూజ్యుఁడన్.

102


వ.

అని పలికిన, బింగళకుండు మదీయప్రధానపుత్రుండవగు నీవు
పూజ్యుండవు [గాక] తిరస్కౌరార్హుండవే యనినఁ బ్రహృష్టమనస్కుండై
దమనకుం డిట్లనియె.

103

సీ.

అధిప పాథోవాంఛ నరుగుచు నిచ్చట
                    నిలిచిన కార్యమ్ము దెలుపుమనిన,
దమనక! మద్వనాంతరమునన యకాల
                    ఘనఘనాఘనఘోరగర్జతోఁడ
సరిపోలు నొక్కనిస్వానమ్ము విని దాని
                    గమనింప సత్త్వవిఖ్యాతుఁ డిందుఁ
గలడని చెంత నిక్కడ నిల్చియున్నాఁడ
                    [నన విని] యేల భయమ్ము నీకుఁ


గీ.

[4]జెప్పు మల్పు నధికుఁ జేసెద వలుఁగు నీ
రములచేదఁ బోదె, రాజ మంత్ర
రక్ష [లేక నృపతి] రక్షణంబునఁ గార్య
మనఘ! యింత విఫలమగు దలంప.

104


క.

మును మృగధూర్తకకులనా
థునిచేఁ దెలియంగబడిన దుందుభినాదం
బును బోలె నధిప! యేతద్
ధ్వని యిప్పుడు మనకుఁ దెలియదగునని పల్కెన్.

105


వ.

అనిన విని మృగవిభుం డది యెట్లని యడిగిన దమనకుం డాను
పూర్వికంబుగా నెఱింగించువాఁడై యిట్లని చెప్పందొడంగె మున్ను లంబ
కర్ణుండను జంబుకసత్తముం డధికక్షుత్పరవశుండై యొక్కభగ్నవాహినీ
సమీపస్థలంబునఁ గ్రుమ్మరుచు నొక్కనాఁడు వాతాహతభేరీనినాదమ్ము
లాకర్ణించి భయమ్ము నొంది తనయంతరంగమ్మున నిట్లని చింతించె.

106


క.

మిక్కిలి నాఁకటిచేతం
జిక్కితి నీవేళ నేమి సేయుదునొ కదే!
యెక్కడికి బోదునని యం
దొక్క మహాభేరిఁ గనియు నొయ్యన నగుచున్.

107


క.

పవనాహతతరుశాఖా
నివహముచే మ్రోఁగు టెఱిఁగి, నిర్భయుఁ డగుచున్

జవ మొప్ప జడియ కతఁ డి
ట్లు విచారము సేసె నాత్మలోఁ గడుబ్రీతిన్.

108


గీ.

అధికభోజన మిది గల్గె ననుచు లంబ
కర్ణుఁ డాభేరి చించి సకౌతుకముగ
నందుఁ జొరబడి వెడలె నిరాశుఁ డగుచు
నట్లు గావున నిది తెలియంగవలయు.

109


వ.

వచ్చిన శబ్దంబునకు భవన్మనంబున సాధ్వసం బేటి కిదె సర్వంబును
దెలిసి చనుదెంచెదనని తద్వనిమార్గమ్మునం జని వాని ముందట

110


మ.

కనియెన్ భూధరసన్నిభాంగు నతి తీక్ష్ణ......
.. ........నిజవాలసంచలనభూవాతూలనిర్ధారితా
భ్రనికాయున్ మృగయూథకర్ణకుహరోగ్రధ్వానునుద్యత్కకు
ద్ఘనభూషాంచితగర్వనిర్వహణవిద్యాంకున్ గకుద్మత్ప్రభున్.

111


మ.

కని గోవల్లభ! యిట్టు లొంటిఁ దిరుగంగా నేల యొక్కండ వి
వ్వనమార్గంబున నీకథావివరముల్ వాక్రుచ్చి నాకంతయున్
వినుపింపన్ దగునేనిఁ జెప్పుమనినన్ వీక్షించి యాద్యంతమున్
దనవృత్తాంత మెఱుఁగఁజెప్పె నతిమోదం బాత్మ సంధిల్లఁగన్.

112


వ.

ఇట్లు చెప్పిన నవ్వృషభేంద్రుండు జంబుకప్రభుం జూచి యయ్యా!
భవన్నామం బెయ్యది నన్ను డాయం జనుదెంచుటకుఁ గతం బేమి యెఱింగింపు
మనిన నతం డతని కిట్లనియె నేను దమనకుం డనుపేరుగలవాఁడ మృగనా
థుండు మన్నాథుండని చెప్పి వెండియు నిట్లనియె.

113


మ.

మదదంతావళ[కుంభసంభృతిలస]న్మాంసాన్నముల్ నిచ్చఁ బెం
పు దలిర్ప న్దిని మేనువొంగ సతతంబున్ శౌర్యగాంభీర్యసం
పదఁ బెంపొందిన సింహవల్లభునకున్ బంటన్ వృషాధీశ! కూ
ర్చెద మన్నాథుని నీదు స్నేహమునకున్ సిద్ధమ్ము వేడందగున్.

114


వ.

అనిన సంజీవకుండు దమనకుం జూచి యతనికి నాకు మిత్రత్వం బెట్లు
సమకూడు! మృగేంద్రుం డతులబలపరాక్రమసంపన్నుం డే నల్పబలుండ నఖిల
గుణంబులు సమంబైనఁగదా! సంధించవలె ననిన విని దమనకుం డిట్లనియె.

115

క.

హీనాధికబలములు నీ
మానసమునఁ దలఁపవలదు మైత్రి ఘటింతున్
నానేర్పుచేత నన విని
గోనాథుం డాత్మలోనఁ గోర్కులు నిగుడన్.

116


గీ.

అట్లు గావించి నన్ను నెయ్యమునఁ బ్రోవు
మనిన దమనకుఁ డతని వీడ్కొని కుతూహ
లంబు పెంపార, వడిఁ బింగళంబు కడకు
నరిగి ప్రియమున వందనం బాచరించి.

117


వ.

[నిలిచిన] పింగళకుం డతనిం బ్రియపూర్వకంబులగు వాక్యంబుల
నాదరించి పోయివచ్చిన కార్యం బెఱింగింపుమనిన దమనకుం డిట్లనియె.

118


సీ.

సమవర్తి వక్త్రదంష్ట్రాభీషణములగు
                    దీర్ఘవిషాణముల్ తేజరిల్ల
ధరణిఁ జరించు గోత్రగావమో యన
                    ననుదైన సింహసంహనన మొప్పఁ
బాయని మేచకాభ్రముభాతి నెంతయు
                    రమణీయమగు మూపురమ్ము దనరఁ
బ్రళయావసన[రుద్ర]పటహానినాదంబు
                    లంకురించిన మాడ్కి ఱంకె లమరఁ


గీ.

బ్రకటగాంభీర్యధైర్యదర్పప్రతాప
గుణములఁ దనర్చు నొకవృషగణవరేణ్యుఁ
గంటి నాతఁడు నన్నును గారవించె
[నధిపు మన్ననగల] బంట నగుటఁ జేసి.

119


వ.

అని చెప్పిన విని యిట్టి బలపరాక్రమసంపన్నునికడ కెట్లు వోయితని
యడిగినఁ దద్విధం బెఱింగించెదనని యతం డిట్లనియె.

120


మ.

ఘనబాహాబలసంపదుజ్జ్వలుఁడు దీర్ఘక్రోథుఁడై వీరయో
ధనికాయమ్ములఁ గూల్చు నల్పజనులన్ ధాత్రీస్థలిన్ నిల్పు నె
ట్లనినన్ గాఢజవప్రభంజనుఁడు ఘోరారణ్యసాలమ్ములన్
గినుకన్ గూల్చి తృణమ్ములన్ నిలుపుమాడ్కిన్ లక్ష్మమంత్రీశ్వరా!

121

వ.

అట్లు కావున నిర్భయమ్మున నచ్చటి కరిగితి నీకును నతనికి మైత్రి సంఘ
టింతు నతనిం దోడ్కొని చనుదెంచెద నిక్కార్యమ్మునకు సమ్మతంబగునే
యనం గంఠీరవసత్తముండు కౌతుకాయత్తచిత్తుండై తత్ప్రయోజనం
బాచరింపుమని యాలింగనమ్ము చేసి యనిపినం, జని యో ఋషభేంద్రా!
మృగేంద్రుఁడు నీ కభయ మ్మిచ్చె నీకార్యమ్ము సర్వమ్ము నతని కెఱింగిం
చితి నీవును గృతార్థుండవైతి వమ్మహాత్ముని దర్శనమ్మున కేతెమ్మనిన
నతండు.

122


ఆ.

సంతసమ్ముతోఁడఁ జనుదెంచి వందనం
బాచరింప నతని నామృగేంద్రుఁ
డాదరించె నప్పు డాలింగనమ్మునఁ
గరము సొంపు మిగులఁ గౌతుకమున.

123


గీ.

అప్పు డిరువురు మైత్రిఁ బెంపారఁజేసి
స్వర్ణమురుమణివిధమున సంతతంబు
గలసిమెలసియు నుండిరి బలిమి చేటు
పాటు మదిలోపలను దలంపక ముదమున.

124


వ.

ఇట్లు సింహవృషభేంద్రులు జంబుకనిమిత్తంబున మైత్రిఁజేసి సుఖం
బుండి రంత కొంతకాలమ్ము చనినసమయమ్మున మృగాధిపతి వృషేంద్రు
పసలంబడి యొండెఱుంగక యతండును దానును భోజనమజ్జనశయ్యాసన
పానసౌఖ్యమ్ములఁ బ్రొద్దుపుచ్చుచు దమనకు మఱచిన నతండు పురపురం
బొక్కుచు తన్ను విచారింపకునికిం జేసి క్షుధార్తుండై కరటకుం గూడికొని
యుండె నందు.

125


సీ.

దమనకుం డను మున్ను ధాత్రిపై మేషసం
                    గ్రామంబుచే జంబుకంబు భిక్షుఁ
డఘమానసుండగు నాషాఢభూతిచే
                    వడి మంగలియుఁ దంతువాయుచేత
తమతమ చేయునేరముల మోసము నొంది
                    నట్ల [నా]బుధ్ధిశూన్యత దలంప
నిట్ల యయ్యె నటన్న నెంతయుఁ బ్రీతితో
                    గరటకుం డీమూడుకథలు నాకుఁ

ఆ.

గర్ణపర్వముగను గ్రమము దప్పక యుండ
...................చెప్పుమనిన నతఁడు
...........................శివశర్మ
.......యనగ గలడు ..........ఘనుఁడు.

126


గీ.

అతఁడు చిరకాల మార్జించినట్టి ధనము
దనర నొకబొంతలోన గుప్తమ్ము నేసి
బడుగు నోడలికిఁ దొడవుగాఁ దొడిగి దాని
విడువ కెప్పుడు దిరుగుఁ దద్విధము దెలిసి.

127


వ.

ఆషాఢభూతియను దురితాత్ముం డది యవహరించువాఁడై యా
భిక్షుం జేరి మహాత్మా! నేను నీకు శిష్యుండనై పరిచర్యసేయువాఁడనై
వచ్చితి నన్నుఁ బరిగ్రహింపుమనిన నాతండును వానివిధమ్మునకు మెచ్చి
కపటత్వ మ్మెఱుంగకయుండె నాకపటశిష్యుండును బనులయెడ విశ్వసిం
పన్ జేయుచు కిల్బిషరహితహృదయుండునుంబోలె పాయక శుశ్రూష
సేయుచుండె నంత కొన్నిదినమ్ములకు భిక్షుం డతని నమ్మి తన యెడలి
కుబుసం బతనిచేతి కిచ్చి పదిలంబని చెప్పి వనోపకంఠమ్మున కాచమనార్థం
బరిగి యందలితటాకతటమ్మున నవక్రపరాక్రమమ్మునం బోరు మేష
ద్వయంబుఁ జూచుచుండె నప్పుడు.

128


క.

ఒండొకటిఁ బాసి తాఁకుచు
నుండఁ దల ల్పగిలి రక్త ముబ్బుచునుండన్
అండములు వెడల జవురుచుఁ
గొండలక్రియఁ బొల్చె మేషకుంజరము లిలన్.

129


క.

ఆలోపలఁ జనుదెంచి సృ
గాలం బొక్కటి కృతాంతకప్రేరితమై
కీ లెఱుఁగక నడుమంబడి
కూలెన్ గీలాలవాంఛ కుంభినిమీఁదన్.

130


గీ.

అపుడు శివశర్మ మది విస్మయంబు నొంది
జంబుకము గూలె మేషయుద్ధమ్ముచేత
ననుచుఁ దనటెంకి కేతెంచునంత బొంత
పుచ్చుకొనిపోయె నాషాఢభూతిగాఁడు.

131

వ.

అంత శివశర్మ తననిలయమ్మున కేతెంచి యాషాఢభూతిం గానక
బొంత యెత్తుకొనిపోయెనని దిగులుపడి చింతింపుచు నర్థాపేక్షం బొక్కి
పడియతనింగను గమనిక నొకపుటభేదనంబు ప్రవేశించి యందు నొక్క
తంతువాయగృహమ్మువేదికఁ జేరి శయనించియుండు నవసరమ్మున.

132


క.

నారాయణు నంబరల
క్ష్మీరమణినిజాంఘ్ర[కంజ]కీలితమగు మం
జీరమున వ్రేసెనో యన
సారసబాంధవుఁడు నపరశరధిం గ్రుంకెన్.

133


చ.

తన మణి పోవ సంబరము ధారుణిలో వెదుకంగ వచ్చెనో!
యనఁదగె నంధకారనివహమ్ము, సరోజభవాండపేటికన్
దనరగనిడ్డ కస్తురివిధంబున, జారుల మానసమ్ములున్
ఘనముగఁ గైరవమ్ములు వికాసము నొందె ననంతరమ్మునన్.

134


క.

మరుదీశ దిగ్వధూటిక
కరకందుక మనఁగ గగనకాసారసితాం
బురుహ మన మదనకువలయ
శర మనఁ గనువిం దొనర్ప శశి వొడతెంచెన్.

135


వ.

తత్సమయంబునం గోకవిరహిలోక[భీ]కరంబులును జకోరహృదయ
వశీకరమ్ములును గలశపయోధిశోభాకరమ్ములును నగు చంద్రకిరణ
మ్ములు భూభాగమ్మున నిండియుండె నయ్యవసరమ్మున.

136


చ.

ఒడలికి నన్ను, గన్నులకు నొప్పగుకెంపు మనోజ్ఞజిహ్వకున్
వెడవెడ పల్కు లంఘ్రులకు వేమరుసుం దడబాటు గూర్ప, నో
పెడు మదిరావశత్వమునఁ బ్రేలుచునుండెడి తంతువాయు న
ప్పుడు గని వానిభార్య పరపూరుషసంగమవాంఛ సేయుచున్.

137


వ.

ఉండు నెడ నంబష్ఠకన్యకాప్రేరితయై యుచితాలంకారమ్మునం జెలు
వొంది మందమందగమనమ్మునం జనునవసరమ్మునఁ దద్విభుండు.

138


క.

ఒడ లెఱుఁగక కులటిక! యె
క్కడ వోయెదు మున్ను కన్నుగవ వ్రామిన కై

వడివని పట్టుక రోషం
బడరఁగ బంధించె దాని నతఁడు గృహమునన్.

139


వ.

ఇట్లు గృహస్తంభంబునఁ దన భార్యను విఱిచికట్టి పానపరవశత్వ
మ్మున నిద్రాపరవశుండై యున్నసమయంబున.

140


ఉ.

ఓగు పిసాళి గుల్లబడి యోటు, బికారి విటాళిపాలికిన్
రోగముకుండ గోకరి కురూపి మృషాలయ యింద్రజాలద్ర
వ్యాగమశీలమాటల ప్రియంబు నయంబ [నయంబు] మీఱఁగా
వేగమ వచ్చి మంగలి నివేశనబద్ధవధూటి, కిట్లనున్.

141


క.

ప్రియుఁ డంపిన వచ్చితి న
ప్రియ మిప్పుడు సేయవలదు ప్రియుప్రియ యుక్తిం
గ్రయముగగొని బన్నమ్ములు
శయమున దిగిచికొని నా కొసంగుము తన్వీ!

142


వ.

అని కుంటెనకత్తె యగు మంగలి చెప్పిన విని తంతుకారాంగన
దాని కిట్లను చెలియా! మద్వల్లభుండగు వీఁడు వీతమానసుండై నే భుజంగా
సక్తిఁ బోవు టెఱింగి నన్ను బంధించె నే నెవ్విధంబున వత్తు ననిన మంగలి
కొండొక చింతించి నీకట్ల నేతెంచి నిన్ను నీవల్లభుకడకు నంపి నీవు వచ్చు
నందాఁక నిన్నుపోలె విఱిగి కట్లతో నుండెద ననిన నాసాలెలేమ సంతోషించి
నీనిమిత్తమ్మున మద్వాంఛితమ్ము సఫలంబాయెనని మంగలిదానిచేతన
కట్లు విడిపించుక తాన దానిం గట్టిన నదియును మద్యమదావేశమ్మున నూర
కుండె నంత.

143


చ.

పసిఁడిసలాక చెంగలువబంతి రతీశ్వరుదంతి యెప్పుడున్
వసికుల పక్కదాపు వలరాయనితూపు మనోజకేళికిన్
గొనరగలట్టిరూపు కడుగూటమియందులయేపు నుజ్జ్వలో
ల్లసములకుప్ప కప్పురపు లప్పలమించిన సాలెలేమయున్.

144


వ.

ఇ ట్లొప్పి యుచితశృంగారవేషమ్మున సంభ్రమంబు దళుకొత్త
జలధరమధ్యనిర్గతసౌదామనీలతికచందమ్మునఁ దనమందిరమ్ము వెలువడి
వ్యామగ్రాహ్యపయోధరభారమ్ములవలన మధ్యం బసియాడ నీలిచేలంబు
ముసుంగిడి గోడనీడల నడచుచు శంబరవిరోధియాఱవబాణం బనంగ

ననంగశరమ్ముల నవయవమ్ము లెఱుంగక విటాన్వేషమ్మున మందగమన
మ్మున నాపరాంగన గృహాంత్యకుటీరమ్ము చేరి జారుం గౌఁగిలించికొని
యధరపానమ్మునం దేలి కలరవమ్ము లుల్లసిల్ల మన్మథయుద్ధమ్మునకు దాసె
నంత నక్కడ మేలుకొని.

145


క.

ఆతంతువాయుఁ డప్పుడు
నాతింబిలువంగ నది వినని యట్లుండన్
నాతోఁడ నలిగినావని
దూతిక నాసమ్ము కత్తి దూరిచి కోసెన్.

146


వ.

ఇట్లు, అంబష్ఠి ముక్కు గోసి క్రమ్మఱఁ గంకటిపై నిద్రించినంత నా
సాలెత విటకానితో నిష్టాభోగంబులం గేళి సల్పి వానిం బోఁబనిచి క్రమ్మఱ
నాత్మీయగృహమ్మునకు వచ్చి నాసికాచ్ఛిన్నయైన మంగలిం జూచి భయం
బున కడకటంబడి దాని కట్లు విడిచి వెండియుఁ దా కట్లం బడియుండియు నా
మంగలిదానింబోలె నేడ్చుచుండియుఁ దద్దూతికాంగనం గరసంజ్ఞం బోవం
బనిచిన నదియును నెత్తురు నాకికొనుచుఁ దలవరులకుం దప్పించుకొని తన
యింటి కరిగి గూఢభావమ్మున నుండునంత.

147


సీ.

ప్రాచీదిశావధూఫాలదేశమ్మునఁ
                    బొలుపొందు చంద్రంపుబొ ట్టనంగ
జంభాసురారాతి సౌధోపరిస్థితిఁ
                    గొమకారుకాంచనకుంభ మనఁగ
ప్రథమాచలేంద్రమ్ముపైఁ గనుపట్టి శో
                    భిల్లిన జేవుఱుగ ల్లనంగ
కోకవియోగాగ్నిఁ బోకార్చుటకు నెత్తు
                    సమయాభయశయాంబుజం బనంగ
చంద్రుఁ డపరాద్రిఁ జెర, భూజనులు నిద్ర
దేఱ, గలువలు ముకుళింప, వారిజాత
వితతి వికసింపం, జీఁకటి విరియఁ, గెంపు
మెరయ, మార్తండబింబమ్ము మింటఁ బొడమె.

148


వ.

ఇట్లు వేఁగు నవసరమ్మునఁ దంతువాయుని భార్య దంభనిద్రితుం
డగు ధవుని గుర్తించి వృథాక్రోశసమేతయై శపథమ్ముగా నిట్లనియె.

149

తే.

అన్యపురుషుని నాహృదయమ్ములోనఁ
దలఁచి యెఱింగితినేని సత్యమ్ము, నాసి
కంబు రాకుండు నారీతి గాకయున్న
వచ్చుగ్రమ్మఱ, నని పల్కె వఱలు మతిని.

150


వ.

అయ్యవసరమ్మున నతండు గనుంగవ దెఱచి నాసిక ముఖమ్ము
నం దేజరిల్లు నాత్మవల్లభుం జూచి యువతీ! పతివ్రతాభరణం బవని గాఢా
లింగనంటు జేసి తద్బంధనంబులు విడిచెనంత.

151


క.

సంతోషమ్మున భిక్షుం
డంతయు వీక్షింపుచుండ నద్దూతిక య
త్యంతవిషాదమ్మునఁ గడుఁ
జింతింపుచునుండె ముక్కు చేడ్పడుకతనన్.

152


వ.

అంతఁ దద్వల్లభుండగు క్షౌరకుండు పురజనమ్ములకుఁ బనులఁ
జేయుటకునై ముంగిట నిలువంబడి తనభార్యం బిలిచి క్షురికాసంఘమ్ము
దెచ్చియిమ్మనిన నది మొగమ్ము గానరాకుండ నిలయమ్ములోనుండి చేయి
సాచి యొక్కకత్తి యిచ్చిన నది శాతక్షురిక గాకుండుటం గలంగి గృహ
మధ్యంబునం బడవైవ నాజంత తన కిదియ సమయం బని విస్మయశోకమ్ములు
కల్పించుకొని యప్పుడు.

153


శా.

ముక్కున్ గత్తి కరమ్మునందుఁ దనరన్ మొఱ్ఱో మొఱాలింపరో!
దిక్కై యిప్పుడు గావరో! నిరపరాధిన్ నన్ను మద్భర్త, చేఁ
జిక్కం బట్టుక యింత చేసెననుచుం జీరెం దలారిం బ్రభున్
నిక్కం బంచు జనమ్ము వీథులఁ దను న్వీక్షింప దుఃఖంపుచున్.

154


సీ.

ఆతలవరి భూతలాధిపు కెఱిగింపఁ
                    గుపితుఁడై మంగలి నపుడు పట్టి
తెప్పించి సభఁగూర్చి యిప్పు డీపాపాత్ము
                    నేమి సేయఁగదగు నెఱుఁగఁ జెప్పు
డన విని శూలమ్మునను వీని వ్రేయంగఁ
                    దగవని జెప్ప నత్తఱి జనమున
సన్యాసి చన విచ్చి యన్యాయ మిది యని
                    తల యూచి నగుచు పద్యమ్ము చదివి

గీ.

తగరు పోర సృగాలమ్ము, తాఁ దలంప
భూరికపటాత్ముఁ డాషాఢభూతిచేత,
తంతువాయకుచే దూతి, తనక తనక
స్వార్థముగఁ బొందె నీమూఢనర్థములను.

155


వ.

వెండియు నమ్మహాత్ముండు సవిస్తరమ్ముగా నెఱిఁగింపఁ దత్స
భాజనంబులు విస్మయంబు నందిరి నరేంద్రుండును నాయంబష్ఠుని విడిపించె
నాశివశర్మయు నపహృతార్థుండై యెందేనియం జనియె, నట్లు భిక్షుకజంబు
కదూతికలు తమతమ నేరమిచే వృథాచేటు నందిరి. అట్లు నేనును
నేమి కతంబున నిది దెచ్చుకొంటి ననిన విని కరటకుండు దమనకుం గర్తవ్యం
బెయ్యది చెప్పుమనిన, దమనకుం డిట్లనియె.

156


క.

మృగవల్లభవృషభులకును
బగ బుట్టఁగఁజేసి ప్రేమ వాయఁగజేయన్
దగిన మహోపాయము పెం
పుగఁ దలపోయంగవలయు బుద్ది నటంచున్.

157


కవిరాజవిరాజితము.

చలమున విక్రమసంపద నోర్వవశం [బదికాక) యుపాయపుఁ బెం
పలవడ గెల్వఁగవచ్చు నహీంద్రుని నబ్బలి భుగ్విభుమాడ్కి ననన్
దెలువు మదెట్లన ము న్నొకమ్రాకునఁ దేఁకువ వాయసయుగ్మము, పి
ల్లలఁగన దత్తరుకోటర నాగము లాఁచికొనం గని శోకమునన్.

158


వ.

ఒక్కనాఁ డవ్వాయసవిభుండు నిజసతిం జూచి ప్రసవసమయంబగు
టెఱింగి తనసఖుండగు జంబుకప్రవరుకడకుం జని మదీయనివాసంబగు
తరువున నొక్కకోటకమ్ముఁ జేకొని యొక్కకాలసర్పంబు మదర్భకుల
భక్షింపఁదొడంగె, తదపాయోపాయమ్ముఁ జెప్పుమనిన నతం డతని కిట్లనియె.

159


క.

బక మొక్కటి మీల సము
త్సుకతం దిని యెండ్రిచేత సొంపరి మది నం
తకుఁ జేరదె హింసారం
భకులకు ధరలోనఁ జేటు వాటిలకున్నే!

160

వ.

అనిన నాకథావృత్తాంతం బెట్లని కాకం బడిగిన జంబుకప్రభుం
డిట్లనియె.

161


సీ.

అనఘ లంబోదరుండను బకాధిపుఁ డొక్క
                    కొలనితటమ్మున నిలిచియున్న
[నడిగె] నందలి యెండ్రి యాహారశూన్యత
                    నిచట నింకనుఁ గార్య మేమి యనిన
నలమత్స్యములు మాకు నాహారములు గాన
                    నవి నేడు జాలరు లరుగుదెంచి
[కై]కొనిపోదు రెక్కడఁ జొత్తునని యిట్లు
                    [వనరుచు] నున్నాఁడ ననిన పలుకు


ఆ.

లాలకించి మీనులన్నియు నేతెంచి
యతని మమ్ముఁ బ్రోవుమనిన మిమ్ముఁ
గరుణతోఁడ నన్యకాసారములలోన
విడుతు బ్రతుకుఁడంత వేడ్క ననిన.

162


క.

ఆమాట నమ్మి ఝషములు
ప్రేమమ్మున నెచటనైనఁ బెట్టుమటన్నన్
దా మొఱఁగి తిగిచి క్రమమున
బామరపతి వానినెల్ల భక్షించినచోన్.

163


గీ.

ఎండ్రివిభుఁ డెఱింగి యిప్పుడు నన్నును
గొంచు నేగుమనినఁ, గొంగ యపుడు
పారివచ్చి తన్ను బట్ట కుళీరమాం
సార్ధి యగుచు దంభ మతిశయిల్ల.

164


వ.

అప్పు డతండు మనమ్మున నిట్లని వితర్కించె.


చ.

ఇది కపటప్రభావమున నేచి ఝషమ్ముల మ్రింగి నన్ను దు
ర్మదమునఁ బట్టి చంపు ననుమానము లే దిక విక్రమంబు చూ
పెదనని యంతరంగమున భీతి నెఱుంగక బల్మి కంఠమున్
వదలక కొండ్లఁబట్టి యమవాసము జేర్చె బకాధినాథునిన్.

165


వ.

అట్లు గావున హింసాపరులుం గార్యాంతరంబుల హతు లగుదు రనిన,
నతండు నిప్పు డుచితకార్యం బెఱింగింపుమనిన వెండియు నప్ఫేరవపతి కాకం

బున కిట్లనియె నిమ్మహీపాలు [నంతఃపుర కాసారంబునకుం జని] కనకభూష
ణం బపహరించి తావకాపకారియగు గోకర్ణకోటరమ్ములో వేయుమని
వీడుకొలిపిన నవ్వాయసవిభుండు.

166


క.

రాజగృహమ్మునకును జని
రాజచ్చట జలకమాడ రాగిల్లి మనో
రాజ? మగు పీటమీఁదను
రాజిల్లెడి కనకభూషరాజటు పెట్టన్.

167


క.

కని కాకము భూషణముం
గొనివచ్చి ఫణీంద్రుఁడున్న కోటరమధ్యం
బున వేయ దాని వెనువెం
టన వచ్చిరి రాజభటులు ఢాక దలిర్పన్.

168


వ.

వచ్చి తద్భూజంబుక్రింద నిలువంబడి.


గీ.

పాదపము నెక్కి యందలి పాము జంపి
కనకసూత్రమ్ము జేకొని చనిరి వేడ్క
కాకమిథునమ్ము [మది]ఁ గుతుకంబు నొందె
నట్లుగావున దగు నుపాయంబు వలయు.

169


క.

మతిమంతుఁడైన సౌఖ్య
స్థితినుండు నబుద్ధియైనఁ జెడిపోవును దు
ర్మతియై హరి, శశకముచే
మృతిఁబొందిన మాడ్కి... దలిర్పన్.

170


వ.

కరటకుం డాకథ యెఱింగింపు మన దమనకుం డిట్లనియె.


సీ.

కలఁ డొక్కవనమునఁ గంఠీరవేంద్రుఁడు
                    దర్పించి మృగములఁ దఱచు దినఁగ
మృగములన్నియు గూడి మృగకులాధిప యిట్లు
                    దిన నేల మాయందు దినము నొకని
భక్షింపదగునని పల్కిన నంగీకరించి
                    యారీతిఁ జరించుచుండ
నందొక్కనాఁడు శశాధీశు దినము వ
                    చ్చిన వాఁడు మదిలోనఁ జింతనొంది

గీ.

ఘనతరోపాయ మొక్కటిఁ గాంచి, బుద్ధి
నలరువానికిఁ, గానికార్యములు గలవె!
యనుచు సంతోషచిత్తుఁడై యచ్చటికిని
దడసిపోయినఁ గోపించి తన్ను జూచి.

171


మత్తకోకిల.

లంబకర్ణ! మహాక్షుథం బడలంగఁ జేసితివన్న సిం
హంబుతోనను నన్యకేసరి యామిషాభిరతిన్ బ్రమో
దంబు నొంది గ్రహింప వచ్చినఁ దల్లడించి యరణ్యభా
గంబునంబడి పారివచ్చితిఁ గల్లకాదని పల్కినన్.

172


వ.

సింహంబు కుందేలున కిట్లనియె.

173


గీ.

నాకుఁ జూపఁగలవ! యాకేసరిప్రభు
ననినఁ బదమటంచుఁ నధికనిమ్న
కూపతీరమునకుఁ గొనిపోయి, వీఁడె యు
న్నాఁడు చూడుమనుచు వాఁడు పలుక.

174


వ.

మృగేంద్రుండును జలాంతరమ్మునఁ బ్రతిబింబితంబగు కంఠీర
వంబు గనుంగొని కోపించి హుంకరిపుచు దుర్మదంబున నానూఁతంబడ
నుఱికి మృతింబొందె, నప్పుడా శశకంబు నిఖిలమృగస్తోత్రపాత్రంబయి
చరియించె నట్లు గావున కుశలబుద్ధి వలయుననిన విని కరటకుం డట్లేని భేద
కార్యంబున నన్యోన్యవివాదం బాపాదించి తగు నుపాయంబునం బ్రవర్తిం
పుము రాజసన్నిధి నీకు భద్రంబగు గాక పొమ్మని యనిపిన మహాప్రసాదం
బని దమనకుం డచ్చోటువాసి పింగళకు సమీపంబునకుం జని యిట్లనియె.

175


గీ.

అధిప వీక్షింపు డిదె ప్రళయంబు వచ్చె
భూమిఁ దనవిభు నాపద పొందుచోటఁ
దెలుపకుండిన భటుఁ జెందుఁ గలుష మనుచుఁ
జేరి హితవాచరింప వచ్చితినటన్న.

176


ఉ.

పింగళకుండు వానిఁ గడుప్రేమముతోడుతఁ జెప్పుమన్నఁ జె
ప్పంగఁ దొడంగె, నుక్షపతి పాపమతిన్ భవదీయశక్తి నా
ముంగల కొద్దిచేసి యనుమోదవశంబున రాజ్యమెల్ల నే
లంగలవాఁడ నంచు దనలావు మదమ్మున నున్నవాఁ డనెన్.

177

వ.

అని చెప్పిన దమనకువాక్యమ్ము లాకర్ణించి హరిరాట్పుంగవుం
డాశ్చర్యభయహృదయుండయ్యుఁ గొండొక విచారించి యతం డట్టివాఁడు
గాడని దమనకుతోఁ జెప్పిన నక్కపటాత్ముండు వెండియు నిట్లనియె.

178


క.

ఉక్షపతి యొకఁడు మీకును
వీక్షింపఁ ప్రధాని యతఁడు వెరవున సర్వా
ధ్యక్షుండయ్యును కైతవ
దక్షుఁడు మదిలోన నమ్మఁదగదని మఱియున్.

179


వ.

మృగరాజా! వృషభంబు కృతఘ్నుండు చేసిన మేలెఱుంగని
వాఁడు వాని నమ్మరాదు నిన్నుం ద్రోసి రాజ నయ్యెదనని యున్నవాఁడు. ఇట్టి
కార్యమ్ము విన్నవాఁడనై నిప్పు ద్రొక్కిన ట్లదరిపడి నే నీకుం జెప్పవచ్చితి,
ప్రళయమ్ము వచ్చెనని నే విన్నవించుటయెల్ల, నీసంస్థానంబు చెడిపో, నేఁ
జూడజాలక సుమీ! యని విన్నవించి వెండియు నిట్లనియె.

180


క.

పతికన్న మంత్రి బలిసిన
క్షితియాతని దైతనర్చు సిద్ధము సతి దా
పతికంటె ఠవరయైనను
పతికార్యము చెడును నూతన భరతాచార్యా!

181


సీ.

రాజ్యరక్షకునిగా రాజు మంత్రిని నిల్పు
                    మంత్రి యాదక్షత మదము నొందు
నామదమ్మునఁ గార్య మాలస్యముగఁ జేయు
                    నటమీఁద స్వాతంత్య్ర మాత్మగోరు
స్వాతంత్య్రమున నిజేశ్వరున కొండు దలంచు
                    నంతట మతి వేఱె యగుచునుండు
నందుకుఁ బ్రతికర్మ మప్పుడు మఱచిన
                    వెనుకనంతటబోదు విగ్రహించుఁ


గీ.

గాన విషమైన భోజ్యమ్ము గ్రక్కవలయుఁ
దవిలి నొప్పించు దంతమ్ము దివియవలయు
మంత్రియును దుర్జనుండైన మాన్పవలయు
రాజనీతికి విఠ్ఠయ ప్రభుని లక్ష్మ!

182

వ.

అని యివ్విధంబున రాజనీతిక్రమంబు విన్నవించినఁ బింగళకుం
డాకర్ణించి దమనకుతో నిట్లనియె. నయ్యా! యాసంజీవకునందు నాకుం
బక్షపాతంబు బెద్దయైయుండు నతండును నాయందు నట్ల. అతనియందు
దోషమ్ము లేనియట్లున్నది. అస్మత్కార్యమ్ముపట్ల కంటిని ఱెప్ప గాచి
నట్లు నాకుం గన్నాకై యున్నాడు. ఇట్టి పెద్దను దుర్నీతిచేత నెడయం జేసి
కొనుట కార్యమ్ముగాదనిన దమనకుం డిట్లనియె.

183


క.

సుతుఁ డనుచుఁ జుట్ట మనుచును
హితుఁ డనుచును నమ్మవలన దెఱుఁగనిరీతిన్
మతిదృష్టిఁ దెలియవలయును
బతు లారయ వారి నూత్నభరతాచార్యా!

184


క.

మంత్రుల బుద్దుల వినక, కు
మంత్రులవాక్యములఁ దిరుగు మనుజేంద్రుఁడు చా
తంత్రమున బాసి పగతుర
యంత్రమ్ములఁ జిక్కువడు మహాత్ముండైనన్.

185


వ.

అని చెప్పిన మృగేంద్రుఁ డిట్లను నే నతని కభయం బొసంగితి నా
వృషవరేణ్యు నెట్లు నిగ్రహింతు నది యకర్తవ్యంబు. కాదని చేసితినేని పర
లోకహానియు నపకీర్తియు నగు, నతని హృదయంబువ దోషంబించుకయును
లేదు, అధికతరప్రియం బబ్బుచున్నది యనిన దమనకుండు నిట్టూర్పు నిగిడిం
చుచు వెండియు నిట్లనియె.

186


గీ.

కావ్యమతము రిపునికాయమ్ము నెవ్విధి
నైన జెఱుగవచ్చు, నఖిలసమ్మ
తంబు, మైత్రిఁ జేసి దంభభావమునఁ జ
రించువాని నట్ల త్రుంచవచ్చు.

187


వ.

రాజులకుఁ దలంప వీరధర్మంబు కారణంబు ధర్మాధర్మమ్ములు
విచారించిన రాజ్యం బెట్లు సిద్ధించు విరోధులగు కపటాత్ములం బొలియించు
చుటయు, నాప్తవాక్యంబు లాకర్ణించుటయు, నేర్పు గలిగి కార్యంబులపట్ల
ప్రవీణుం డగుటయు, రణధైర్యంబు గల్గుటయు, నను రాజగుణంబు లెఱుంగ
వలయు నవివేకపరిపూర్ణంబై యున్నది భవదీయహృదయంబున నాహితంబు
ప్రవేశింపఁ జోటు లేదని మఱియు నతం డిట్లనియె.

188

ఉ.

నీకుఁ బ్రియమ్ము గూర్చి బహునీతులు కార్యపథమ్ము దెల్పినన్
జేకొనవైతి విట్లు విధిచేఁ జెడువారల కేల బుద్ధి, శౌ
ర్యాకరుఁడైన గోవిభుని యద్భుతకైతవశక్తి మెచ్చి, దీ
నాకృతి నాహితంబు హృదయంబున నిల్పెదవన్న, నావుడున్.

189


వ.

పెద్దయుంబ్రొద్దు చింతించి సంజీవకు గుణావగుణంబు లెఱింగెద
నతని నిచ్చటికిం దోడ్కొని రమ్మనిన నతం డట్లేని బలవంతుండు నీచెప్పినట్ల
వినునే! మంత్రభిన్నమ్ము గాకుండ నరిం బొరిగొనవలయు నీవు దలంచిన
మహోద్యోగమ్ములు జన్మాంతరఫలప్రాప్తియునుంబోలె నిడుదలై యున్న
యవిగాన సన్నిహితకార్యంబులు గావు నొరులకపటత్వం బూహ నెఱుంగ
వలయు ననిన, నమ్మృగేంద్రుండు తోఁకఁద్రొక్కిన భుజంగమ్ము చందంబున
మండిపడి యహంకారపూర్వకంబగు వాక్యంబున నిట్లనియె.

190


క.

తలపోయ నుగ్రవిక్రమ
కలితుఁడ న న్నేమి సేయఁగలడని, తనతోఁ
బలుకక యుండిన దమనకుఁ
డలరుచునుం బలికె వేడ్క నాతనితోఁడన్.

191


వ.

ఎవ్వండేని గృహమ్మునం దననడవడి యెఱుంగనివానికిఁ బ్రతి
శ్రీ నొసంగిన డిండిభంబు పట్ల దోషంబున మందవిసర్పిణి యను చీరపేనుం
బోలె దండధరునిలయంబునకుం బోవు ననిన విని మృగేంద్రుం డాకథ
యెఱింగింపుమనిన దమనకుం డిట్లనియె.

192


గీ.

అనఘ ము న్నొక్కరాజు శయ్యాతలంబు
నందు మందవిసర్పిణి యనఁగ వస్త్ర
యూక యుండంగ డిండిభాఖ్యుండు మత్కు
ణాధిపతి వాయువశమున నచట పడిన.

193


గీ.

వానిఁ బొడగని ప్రీతితో వస్త్రయూక
యతిథిసత్కారపూజల నాదరించి
యేఁగుదెంచిన కార్యమ్ము నెఱుఁగఁ జెప్పు
మనిన నాతండు వాని కిట్లనుచుఁ జెప్పె.

194

క.

మానవనాయక! శోణిత
పాన మనోరథముచేతఁ బఱతేవలసెన్
నే నని చెప్పిన నందుకుఁ
దా నిట్లనియెం బ్రియమ్ము దళు కొత్తంగన్.

195


వ.

డిండిభా! నీవు తీక్ష్ణదశనుండవు కాలం బెఱుంగవు యెట్టివాని
నైన మిట్టిపడం బొడిచెద వనిన నల్లిఱేఁడు నట్లైన మన్నిలయంబున కరుగు
దునే! యన చీరపేను దాక్షిణ్యమ్మున మహీపతి సుప్తుండైన రక్తపానంబు
సేయుమని ముదల యిచ్చిన నల్లియు నల్లుకొన్న సంతోషాతిశయంబున
నియ్యకొని, యెప్పుడు ప్రొద్దు గ్రుంకునని యెదురుచూడ నంత నిశాసమ
యంబగుడు రాజు భోజనం భారగించి శయ్యాతలంబునఁ జేరి నిద్రించు
చుండ మెల్లన మత్కుణం బతనిక్రిందకిం జని యారాజుం గఱచిన నతం
డదరిపడి లేచి.

196


క.

భూపతి ప్రతిహారులఁ గని
దీపము దెమ్మనిన వారు దెచ్చిన యంతన్
వే, పారిపోయి మత్కుణ
మాపర్యంకమ్ముక్రింద నణఁగె భయమునన్.

197


గీ.

మంచతల మెల్లఁ జూడఁ దన్మధ్యమందు
వస్త్రయూక చరించంగ వారు సూచి
యద్భుతం బంది యచ్చటి కరుగుదెంచె
ననుచుఁ జంపిరి దాని ననంతరంబ.

198


వ.

అట్లు గావున వివేకహీనునకుఁ దన శ్రీ యొసంగిన వస్త్రయూక
చెడిపోయినచందమ్మునఁ జచ్చునని చెప్పిన విని మృగేంద్రుం డంగీకరించి
యిట్లనియె మృగధూర్త! గోపతి యుద్ధసన్నద్ధుండగుట, యేక్రమంబున
నెఱుంగ వచ్చుననిన నతం డిట్లనియె, నాయనడ్వాహమ్ము తనశృంగాగ్ర
మ్ములు వంచుకొని యభిముఖుండై చకితుండునుంబోలె పాదాంతికమ్ము
చేరునప్పుడు తెలియుమని చెప్పి యచ్చోటు వాసి సంజీవకు కడకుం జనిన
వాఁడు దమనకుం జూచి యిట్లనియె.

199

సీ.

కుశలంబె యని పల్కఁ గొల్చి మనెడు ప్రజ
                    కును దలంపంగ నేటి కుశల మాత్మ
సంపదలను మానసంబు ప్రాణంబులు
                    నధిపతి సొమ్ము లటంచుఁ బలికి
ద్రవ్యంబు గలిగి గర్వము లేనివాఁడును,
                    భామామణులవలం బడనివాఁడు,
నుర్వీశులకుఁ బ్రియం బొనరించువాఁడును,
                    బంధురామయములఁ బడనివాఁడు


గీ.

నర్థియై గౌరవంబున నలరువాఁడు,
కపటచిత్తుని మాయలఁ గడచువాఁడు,
శమనపుటభేదనముఁ జేరఁ జననివాఁడు,
మనుజుఁ డెవ్వాఁడు గలడు భూమండలమున!

200


మ.

అన సంజీవకుఁ డిట్టిపల్కులకుఁ గార్యం బంతయున్ జెప్పు మ
న్నను, వాఁ డిట్లని చెప్పి రాజుకుఁ బ్రమాణం బెద్ది నీమాంసమున్
దను సేవించినవారికెల్ల నిడ నాత్మం గోరియున్నాడు, ము
న్ననఘా! మైత్రి ఘటించినాఁడవని నీ కాద్యంతమున్ జెప్పితిన్.

201


వ.

అని పలికిన నిని యత్యంతవిషాదమ్మునఁ గుందుచుఁ సంజీవ
కుండు దమనకుం గనుంగొని యిట్లనియె.

202


మ.

అపరాధ మ్మొకయింత లేని నను నన్యాయమ్మునన్ రాజు క
ష్టపువృత్తిన్ జెఱుపంగఁ జూవె కడునాశ్చర్యమ్ము! సర్వంసహా
ధిఫులం దెక్కడి నీతి! చూడఁగ మదాంధీభూతచేతస్కులై
యువకారం బొనరించువానిఁ బరుగా నూహింతు రుర్వీస్థలిన్.

203


క.

కారణము లేక యల్గును
వారణ మశకముల నొక్కపడువునఁ జూచున్
ధారుణిపతిఁ గొచ్చుట మది
నారయ నల్పంబు విఠ్ఠలాత్మజ లక్ష్మా!

204


సీ.

అరయ జాత్యంధున కద్దమ్ముఁ జూపుచం
                    దమున నరణ్యరోదనము మాడ్కి

చెవిటి కేకాంతమ్ము సెప్పిన కరణి కృ
                    తఘ్నునితోడి మిత్రతవిధమున
జడధిఁ జిన్కిన వృష్టి వడువున నూషర
                    స్థలములఁ జల్లు బీజముల పగిది
షండుండు కన్య విచారించు పోలిక
                    పందికి చందనపంకమట్లు


గీ.

నతివివేకవిరహితాత్ముండు నగు మహీ
పతికి నాచరించు హితవు నిష్ప
లంబు నీతి ఘనకళాచతురుం డది
దెలియవలయు లక్ష్మ! ధీసమేత!

205


క.

దండింపఁదగనివారల
దండించిన, దండమునకుఁ దగువారి కృపన్
దండింపకున్నఁ జెడు భూ
మండలనాథుండు లక్ష్మమంత్రివరేణ్యా!

206


వ.

అని చెప్పి వెండియుఁ గపటరహితహృదయుండనగు నన్ను
మృగేంద్రుం డట్లు చేయఁదలంచె నది ప్రాక్తనకర్మఫలమ్ము గానోపునని
నిట్టూర్పు నిగిడించుచు మఱియు నిట్లనియె.

207


చ.

సరసుల నక్రముల్, మలయజంబులఁ బన్నగరాజు, కేతకీ
తరువులఁ గంటకమ్ములు, నిధానములన్ బహుభూతముల్ సుధా
కరునిఁ గళంకమట్లు నధికంబుగ, దుర్దశ లుర్విలోన స
త్పురుషులఁ బొందుచుండుఁ దమపూర్వకృతంబగు పాతకంబునన్.

208


క.

అన విని దమనకుఁ డిట్లను
ననఘ! మృగేంద్రుండు గడుఁబ్రియం బొనరించున్,
మనమున నది నమ్మకు దు
ర్జనలక్షణ మదియె మది విచారింపఁ దగున్.

209


చ.

మలయజశీతలమ్ములగు మాటలఁ దేల్చును, వచ్చినంతఁ బెం
పలవడ లేవఁ జూచునుఁ బ్రియంబు లొనర్చును లేఁత నవ్వు వె

న్నెలలు ముఖేందునం దమర, నిష్ఠురదంభము మానసమ్మునన్
దలముగఁ బొల్చు దుర్జనుఁడు ధాత్రితలంబున లక్ష్ముధీమణీ!

210


సీ.

బహుళాంధకారంబు వాప దీపము జీవ
                    నంబుల దాఁటంగ నావ భద్ర
దంతావళముల మదం బణఁపఁగ నంకు
                    శము పన్నగముల రోషంబు చెఱుప
గారుడమంత్రంబు ఘనతరాఘంబుల
                    హరియింప ధర్మువు నతిదరిద్ర
బాధ దీర్పంగ సంపద శోకముల నోటు
                    పఱుప నానాకళాప్రౌఢిమయును


గీ.

బ్రేమమున నబ్జభవుఁడు గల్పించెగాని
చేయ నోపంగ లేడయ్యెఁ జెనఁటిహృదయ
దంభ మొక్కింత మాన్పంగ ధాత్రిలోన
లాలితోదార విఠ్ఠయ లక్ష్ముధీర!

211


వ.

అని చెప్పిన విని వృషభేంద్రుండు చింతాపరవశుండై తనలో
నిట్లనియె.

212


ఉ.

గాలముఖమ్ము మేఁతలకుగా నతిసంభ్రమవృత్తి నేఁగి, మీ
నాలి జనమ్ము చేత హతమైన విధమ్మున నల్పబుద్ధి వాం
ఛాలసచిత్తుఁడై మడియు, నాదిఁ బురంబులత్రోవఁ బోవలే
కీ, లయమంద వచ్చితి మృగేంద్రునివాక్యము విశ్వసించితిన్.

213


వ.

అనిన విని దమనకుండు సంజీవకుం జూచి.


గీ.

అల్పులైనట్టి మాంత్రికులైన, వైద్యు
లైనఁ, బల్వురు గూడిన నౌషధమ్ము
లొనర నేమైన నిత్తురు నుష్ట్రవిభుని
నాదిమంబునఁ గాకాదు లట్ల తలఁప.

214


వ.

అని చెప్పిన విని సంజీవకుం డాకథ యెఱింగింపుమనిన దమనకుం
డిట్లని చెప్పదొడంగె. ము న్నొకవనంబు నింబకదంబౌదుంబరజంబూ
జంబీరమాధవీమధూకోద్దాలసాలహింతాలమందారసిందువారబీజ

పూరపూగఖర్జూరనారంగులుంగలవంగపనసవకుళామ్లాతకాదిముఖ్య
వనంబై నృత్యరంగంబునుంబోలె నటనటీశోభితంబై శరన్నభోభాగమ్మునుం
బోలె చక్రబాణాసనవిరాజితంబై భారతసమరస్థలంబునుంబోలె నర్జున
రమ్యంబై రమణీజనవదనశృంగారంబునుబోలె చందనతిలకరమణీయంబై
యొప్పు నవ్వనంబునందు.

215


క.

కలఁడు మృగేంద్రుం డతనికి
బలిభుగ్జంబుకతరుక్షుపతులు సచివు లం
దుల వారు దిరుగుచు నుభయ
కలితుండగు నుష్ట్రవిభునిఁ గని వాక్ప్రీతిన్.

216


సీ.

ఉష్ట్రకులేంద్ర! యెందుండి నీరా కన,
                    నేను వర్తకు నోసరించి యిచట
నణకువ నున్నాఁడ నన విని వారలు
                    నావిధం బెట్లని యడుగఁ, జెప్పె
దను విను స్వర్ణకుండను బేరి బహుపదా
                    ర్థము సంగ్రహించి పరాగమైన
త్రోవను బేరంబు తులదూఁగి యాడంగ
                    సమకట్టి గోనెను సకలధనము


గీ.

పూని నావీఁపుపై నెత్తి కాననమున
నరుగ భారము నధికమై యాఁగికొనఁగ
నొక్కచరిలోన నాగోనె చక్కవైచి
మున్ను నిచ్చట దాఁగితి ముదము దఱిగి.

217


వ.

అంత నాస్వర్ణకుఁడు నన్నుంగానక సకలకాననగిరిగహ్వరంబుల
నెమకి, విసివి తననివాసంబునకుం జనియె, నాఁటంగోలె నేనును వర్తకునకు
వెఱచి స్వర్ణభారంబు మోవంజాలక యిం దణంగియున్నవాఁడ, నాభాగ్య
వశంబున మిమ్ముం బొడగంటి ననిన, గాకజంబుకతరక్షువులు సంతసిల్లి
యిట్లనిరి.

218


సీ.

లొటిపిట్ట నీకును లొంగంగ నేటికి
                    భయమేల నీకు మాభర్తసన్ని

ధికిని దోడ్కొనిపోయి యకలంక మృగరాజుఁ
                    గాన్పింపఁజేతుము ఘనతరముగ
ననుచు లొట్టియను దామనువుగాఁ దోడ్కొని
                    పొడగానిపింపగఁ బొంగి హరియు
నభయంబు నిచ్చి యత్యాసక్తిఁ గథనకుం
                    డనుపేరు నిచ్చి నిత్యాంతరంగుఁ


గీ.

డుగను గృపఁజేసి సంతోష మగణితముగఁ
బ్రోచుచుండంగ నుండె నా ముసలియుష్ట్ర
మరయఁ గొన్నాళ్ళు జన ననుచరులఁ జూచి
చెలఁగి మృగపతి యిట్లని పలికె వేడ్క.

219


క.

కాకం బాదిగ మువ్వుర,
నాఁకలి పెద్దగుచునుండె నాహారము మీ
రేకమతిఁ దెచ్చి యిండనఁ,
గాకియు సకలమ్ము వెదకి క్రమ్మఱ విభుతోన్.

220


గీ.

చూడఁగలచోటులన్నియుఁ జూచి వచ్చి
తిమి మృగాధిప మాంసము తెగువదొరక
దనుచు లొట్టియ యొక్కటి ఘనతనున్న
దదియు నీకును నాహారమగుత నేఁడు.

221


వ.

అని, మృగపతికి నుష్ట్రమ్ముమీఁది కోర్కె వెగ్గలంబగుటకు నీర
సంబున బలిభుగ్జంబుకతరక్షువులు తమమీఁది మైత్రి సడలుట జూచి,
యెడయఁ జెప్పిన నక్కంఠీరవేంద్రుండు తద్వాక్యంబులు విని కర్ణకఠోరం
బగుడుఁ గంటకభోజనున కభయం బొసంగితి నే నెట్లు చెఱుతు నన, ననుచర
మధ్యంబునుండి వాయసప్రభుం డిట్లనియె.

222


ఉ.

తెంపున నాలుబిడ్డల నతిక్షుథకుం బతి పాపవృత్తి శం
కింపక యమ్మడే! ధరణిఁ గ్లేశమునందినవానికిం గృపా
సంపద కల్గ నేర్చునె! విచారము లేమిటి కుష్ట్రవల్లభుం
జంపి భవచ్ఛరీరము నిజంబుగఁ బ్రోవు మృగేంద్రచంద్రమా!

223


వ.

అని చెప్పిన విని కరుణార్ద్రచిత్తుడై వెండియు నిట్లనియె.

224

క.

గోదంతితురగకన్యా
మేదిని దానములకంటె మిక్కిలి యధికం
బేదనిన నభయదానం
బాదరమున నెఱుఁగు లక్ష్మణామాత్యమణీ!

225


క.

శరణన్నవానిఁ గాచిన
హరిమేధక్రతువుకంటె నధికఫలంబున్
సిరియును దత్పురుషవరున్
గర మొప్పుగఁ బొందు ధరణిఁ గరణికలక్ష్మా!

226


చ.

అని మఱియున్ మృగేంద్రుఁ డను నాతనితో నిపు డెట్లు చంపనే
ర్తును నకటా! యెఱింగి యని దోషముగాదె తలంపనన్న, ని
ట్లనుఁ దన ప్రాణరక్షకొఱకై యనఘాత్మక యెవ్విధం బొన
ర్చినఁ గలుషమ్ము చేకురదు చింత భవన్మతి నేల సారెకున్.

227


వ.

మీ రంగీకరించిన నేమే వధించెదమన నతండు క్షుథాజ్ఞానప్రవే
శంబున నూరకుండె నంత కాకజంబుకవ్యాఘ్రంబులు మువ్వురుఁ గూడి
కొని యుష్ట్రంబునున్ బొరిగొనుట కిదియ వేళయని కపటోపాయంబునఁ గథ
నకుం గూర్చికొని మెల్లన డాసి యారాజుతో నిట్లనిరి.

228


క.

అడవులఁ బడి తిరిగితి
మెక్కడ నాహారమ్ము నీకుఁ గానము నీవి
ప్పుడు మము నెవ్వరినైననుఁ
దడయక భక్షింపుమని ముదంబున మఱియున్.

229


క.

భావింప నింతకాలము
దేవరకృపచేత బ్రతికితమి మీకొఱకై
జీవము విడిచిన నేమీ!
భూవలయంబుననుఁ గీర్తి బొందమె యనుచున్.

230


వ.

విన్నవించి యామువ్వురిలోఁ గాకంబు మృగపతిని డగ్గఱి దేవా!
నను భక్షింపుమనిన నది నవ్వి నాపంటిసంధికిం జాలవు పొమ్మనిన నది
కడకుం దొలంగె జంబుకం బేతెంచి నన్ను నమలుమనిన కబళమాత్రంబునకుం

జాలవు కదలుమనిన నది యొదిగినిలిచె, వ్యాఘ్రం బేతెంచి నన్ను నాహా
రంబు గొనుమనిన నీవు నా కర్ధాహారంబు చాలదనిన నది కడకుంబోయె,
నిట్లు మువ్వురు దొలంగినం జూచి యుష్ట్రవిభుండు నిర్భయహృదయుండై
యిట్లనియె.

231


శా.

బాహుళ్యక్షుథ నొంద నేమిటికి న న్బక్షింపుమన్నంత, ను
త్సాహం బొప్పగఁ గాకజంబుకతరక్షమ్ముల్ మహోపాయశౌ
ర్యాహంకారము లొప్పఁ జంపిన మృగేంద్రాధీశ్వరుం డంతలో
నాహారం బొనరించె వాని నది యట్లయ్యెన్ విచారించినన్.

232


వ.

అని దమనకుండు సెప్పిన సంజీవకుండు విని యిట్లనియె.

233


గీ.

కలదు ము న్నొక్కగిరి మహాగహనమందు
దానిశృంగమ్ము నిరువది తాఁటిచెట్ల
పొడవు గల దందుపై వటభూరుహంబు
పొలుచు ఫలముల సాంద్రసంపూర్ణముగను.

234


వ.

అట్టి భూజమ్మునందు.

235


గీ.

కలఁడు కాండోద్భవుండను కాకవిభుఁడు
వేలపర్యంతములు కాకవితతి గొలువ
నందు గూడుల నమరిచి యఖిలతరుల
ఫలములను దిని సుఖితమై బ్రతుకుచుండ.

236


వ.

అం దొక్కనాఁడు సముద్రతీరమ్మున వసియించు చక్రియను వృద్ధ
హంస తనపరిజనమ్ములం దానును విలాసార్థంబుగా సకలభూములం
గ్రుమ్మఱి తననివాసమ్మునకుం జనుచో నడుమను దనభటుల నెడఁబాసి
యేకాకియై యెందేనియుం దిరిగి తిరిగి పథంబుగానక ప్రొద్దు వ్రాలుటయుం
జూచి దిక్కు లేక, కాండోద్భవుండను కాకప్రభుండున్న వటమహీజంబుఁ
జేరిన.

237


క.

అందుల కాకులు దమకుల
మందముగాఁ గాకయున్న నలిగి కఠోరం
బంద జగడంబు చేసినఁ
బొందుగఁ గాకప్రభుండు పొండని మాన్పెన్.

238

వ.

ఇట్లు హంసకాకములయుద్ధమ్ము మాన్పి యావృద్ధహంసంబుఁ
జేరి యెందులవాఁడ వని యడిగిన నది తనవృత్తాంతంబంతయుఁ జెప్పిన విని
కాకరాజు కృపాపరిపూర్ణుండు గావున నయ్యంచను తనపంచ నుంచుకొని
సకలభోగమ్ములం బరితుష్టునిం జేసి యంత వాని కొకయిఱుకుపాటు గల
దని విచారించుకొని యున్నంత.

239


క.

వడితో శంపాజాలము,
వడగండ్లును గురియదొడఁగె వడి చెడక, ముదం
బెడల జడితట్టి యశనము
లుడిగెను కాకమ్ములకును నుర్విని లక్ష్మా!

240


క.

కడు బలిభుక్కులు వడవడ
వడ వణఁకుచు మేపు లేమి వరటియు వానన్
బడి యీఁద గాలిచేతను
సుడియుచుఁ బతిఁ జేరి ముడిగి స్రుక్కుచు మఱియున్.

241


వ.

ఇట్లని విన్నవించె.

242


ఆ.

వానగాలిచేత [5]వడలెల్ల స్రుక్కెను
తరులఫలములెల్ల ధరణిఁ గూలె
వాన తెలియదాయె దీనికి నొకవిధం
బానతిండు మీర లనఘచరిత.

243


వ.

అనిన విని బలిభుగ్వల్లభుండు తమవారల కిట్లనియె.

244


క.

ఆఁకఁటచేతను మీరలు
చీకాకును బొంది వచ్చి చిటులుచు నున్నా
రేకమతిఁ బక్షిజాతికిఁ
బ్రాకటఫలసంగ్రహమ్ము పాల్ప డెందున్.

245


క.

అన విని కాకులు మనకును
ఘనమగు నాహారసమితి గలిగున్నది యీ
డనె యంచఁ జంపి తిందము
ననవుడు నా మాట వినియు నాగ్రహ మెసఁగన్.

246

గీ.

అవునె పాపులార యతిథియై వచ్చిన
యంచఁ జంప నీతి యగునె యనిన
దేహ ముంట చాలు తెగి ధర్మ మెల్లను
బ్రబలుచుండు దీనఁ బ్రౌఢిఁ జెడదు.

247


వ.

అని కొన్నియుపాయమ్ములు కాండోద్భవునకు నెఱింగించిన
నతండును నాఁకఁటిపెల్లున నూరకుండిన నదియ సమయం బని కాకంబు లెల్లం
గూడికొని నిద్రించుచున్న రాయంచను వధియించి యందఱు భక్షించిరి.
నాకును నట్టిది యగునని తలపోసి ధైర్యంబు దెచ్చుకొని రాజతేజం బజేయం
బైనను నిప్పుడు సంగరం బొనర్చుట కర్తవ్యం బని నిశ్చయించి వృషభేం
ద్రుండు దమనకుం జూచి యిట్లనియె.

248


చ.

సమరముఖంబునం బడిన స్వర్గము, గెల్చిన లక్ష్మి గల్గు, కా
యము లనయంబు బుద్బుదములట్ల, మదిం దలపోసి చూడ దు
ర్దమ మగుశక్తిఁ బోరెద మదంబ మదీయహృదంతరంబునం
దమర మృగేంద్రుతోఁడ, నను నప్పుడు సూడుఁడు మీరలందఱున్.

249


వ.

అనిన దమనకుం డిట్లనియె శత్రువిక్రమం బెఱింగియు నెవ్వండేని
విరోధమ్ముఁ జెందు నతండు డిట్టిభమ్ముచేత సముద్రంబునుం బోలె పరాభ
వమ్ము నొందు ననిన సంజీవకుండు విస్మయమనస్కుండై తత్కథాక్రమం
బెఱింగింపు మనిన దమనకుం డిట్లనియె.

250


సీ.

వనధితీరమ్మున వసియించి టిట్టిభ
                    పతి యుండ నొక్కనాఁ డతనిపత్ని
గర్భిణియై యిది కల్లోలతతి నపా
                    యస్థలం బెచ్చటికైన నరుగ
వలయునన్నను, నర్ణవంబునకేల యి
                    ట్లాత్మలోఁ గలఁగ నాయంతవాఁడె
యీ సముద్రుఁడు! నన్ను నేమి సేయఁగ, నోపు
                    నరయ నిద్దఱికి మహాంతరమ్ము


గీ.

తెలియ కేమని యూహించి పలికెనేని
కాష్ఠమధ్యమ్ము గఱచిన కచ్ఛపమ్ము

వోలె జెడు నన మదికి నద్భుతము వొడమ
వనిత తద్విధ మేరీతి ననుచుఁ బలికె.

251


గీ.

కంబుకంథరుఁడన నొక్కకమఠవిభుఁడు
వికటసంకటులను హంసవిభులు మున్నుఁ
గూడి చరియింతు రొకపెద్దకొలనిలోన
మైత్రి యొనరించి నిశ్చలమానసముల.

252


వ.

అందుఁ జిరకాలం బుండ ననావృష్టిదోషమ్ము వచ్చె నయ్యవస
రంబున.

253


ఉ.

చండకరాంశుజాలము కృశానుశిఖావళిమాడ్కి నుగ్రమై
నిండె దిశాంతరాళముల, నీరజషండము నాళపంక్తితో
నెండె, సరోవరమ్ముల, నహీనతటాకములన్, ఝషమ్ము లొం
డొండొండఁ గృశమ్ములై సొరిగె నుష్ణజలంబులు దమ్ము నేఁపఁగన్.

254


వ.

అట్టిసమయంబున వికటసంకటు లన్యసరోవరంబున కరుగ నిశ్చ
యించినఁ, గంబుగ్రీవుండు వారలం జూచి.

255


మ.

నను బాయందగదయ్య మీకు నేను నన్యాయంబు మీ రెందుకై
నను గొంపొం డిదె వత్తు నే ననిన నానందమ్ముతో హంస లి
ట్లను నిక్కాష్ఠము బూని వచ్చెదము మధ్యంబొప్ప దంష్ట్రించి ర
మ్మనినం దద్విధ మాచరింప నవి య ట్లాకాశమార్గంబునన్.

256


వ.

అధికజవమ్మునం జన, జనమ్ము తమ్ముం బొడగని యిది చిత్రమ్మని
నవ్వుచుండఁ గాష్ఠమధ్యమ్ము గఱచియుండియు నవివేకమ్మునం గలకల
మ్మేమి యని వికటుసంకటల నడుగంబోయి, నేలంగూలి మృతింబొందె. నవ్వి
ధంబున మిత్రుండని నన్ను నెఱుంగక యేమేనియుం బలుక నూహించిన జడ
నిధియుం జెడునని యతండు సతిం జూచి వెండియు నిట్లనియె.

257


ఆ.

ధాత్రిలో, ననాగత విధాత, యుత్పన్న
మతి, భవిష్యమతియు, మహి ననంగ
ముగురు మీనపతులు మోదమ్ముతోఁ గల
రందు నొకడు చచ్చె ననఁగ వినవె.

258

సీ.

అది యెట్టిదనఁ, గమలాకరం బొక్కటి
                    జలసంచయంబునఁ జెలగుచుండుఁ
దగినవేడుక జయంబుగ మీసములు మూడు
                    వసీయించి యుండంగ వాంఛతోఁడ
జాలరు లచటికిఁ జనుదెంతురని యనా
                    గతవిధాతనువాఁడు మతివివేక
మున నెందుకైనను జనవలెనన, విని
                    తాత్కాలికప్రజ్ఞ తగునటంచు
నుత్పన్నమతి చెప్పె నొకకథ మును గొల్ల
                    వనజాక్షి తలవరితనయుఁ గూడి


గీ.

వానితండ్రి కోరివచ్చిన నెఱిఁగి త
త్తనుజు గాదెలోన దాఁచి యతనిఁ
గామతంత్రకేళిఁ గరఁగింప బాంధవుఁ
డరుగుదేరఁ జూచి యంత లేచి.

259


చ.

అలిఁగి సుతుండు మీభవనమందులకున్ జనుదెంచెనంచు నీ
తలవరి వచ్చె లేదనినఁ, దా మది నమ్మఁడు సూడుమంచుఁ దొ
య్యలి విభుఁ గూడి జారు నపు డంపి నయంబున డాసి గాదెలో
పల నణఁగున్న తత్సుతుని బైకొను వేడుకఁ, దీసి యిట్లనున్.

260


వ.

మీజనకుం డెఱుంగకుండం జనుమని కరుణార్ద్రచిత్తయుం
బోలె మందిరమ్ము వెడలననిపి యాత్మదోషంబు దెలియంబడకుండ నక్కు
లట నిజవల్లభు నిష్టోపభోగమ్ములం దేలించె నట్లు గావున తాత్కాలిక
మతియె కారణంబని చెప్పిన, నంగీకరింపక యనాగతవిధాత యనువాఁ డన్య
సరోవరంబున కరిగె నంత నొక్కనాఁడు.

261


క.

జాలరులు వచ్చి యొక్కట
జాలమ్ములు విప్పి కొలనుజలములపై నా
భీలత నెగవఁగ వైచిన
నాలో, నుత్పన్న మతిభయస్వాంతుండై.

262


క.

మృతి నొందినట్లు దెలిసిన
యతనిం బొడగాంచి వార లావల నిడి, యం

చితగతిఁ జన, నతిగర్విత
మనస్కుఁడై యాభవిష్యమతి యున్నంతన్.

263


వ.

పట్టుకొను నవసరంబున నుత్పన్నమతి చిలుపచిలుప నీరునంబడి
ప్రవాహంబున నొండొకహ్రదమ్ము జేరె నప్పుడు జాలరు లరుగుదెంచి
"యద్భవిష్యతిఁ" బట్టుకొని పదిలంబుగా జాలమ్ములం దిడి లగుడంబున
మృతిబొందించిరి. అట్లు గావున, ననాగతబుద్ధి యోచింపవలయునని టిట్టిభ
ప్రభుండు వనితకుఁ జెప్పి యూరకుండె నంత.

264


క.

టిట్టిభవిభుఁ డొనరించిన
యట్టి కులాయమ్ములోన ననువున నుండన్,
బెట్టున ముంచె సముద్రుం
డెట్టిదొకో దీనిమహిమ యెఱిఁగెద మనుచున్.

265


ఉ.

టిట్టిభి యంత నేడ్చినఁ గడింది మగంటిమి నాతఁ డిట్లనున్
వట్టివిలాప మంద, సతి! వల్దిది నేఁ గొనివత్తు నండముల్
గట్టిగనంచు నండజనికాయము గూడుక వైనతేయు న
ప్పట్టున గొల్చి మ్రొక్కి తనపా టెఱిఁగించి నుతించె భక్తితోన్.

266


వ.

ఇట్లు టిట్టిభమ్ము సుపర్ణు నుతియించిన నతం డతనిభక్తికి మెచ్చి
టిట్టిభావ్యండజంబుల ముందిడుకొని పుండరీకాక్షుసన్నిధికిం జని దండ
ప్రణామంబు లాచరించి నిటలతటఘటితకరకమలపుటుండై యిట్లని
స్తుతియించె.

267


దండకము.

శ్రీ మత్కృపావీక్ష! రక్షోమదాంభోధి[6]మంథాన
యోగీంద్రచిత్తాంబుజాసక్తరోలంబ! జంభారిముఖ్యామకస్తోమమౌళి
స్ఫురద్రత్నకాంతిచ్ఛటాక్రాంతపాదాబ్జ! దుగ్ధాబ్ధికన్యాకుచద్వంద్వకస్తూరికా
వాసితోరస్స్థలప్రాంత! నే నెంతవాఁడన్ భవన్మూర్తి వర్ణింప, నాస్వర్ణగర్భా
దులున్.....అంభోఘటౌఘంబులన్ జంద్రసూర్యాభ్రముల్ పెక్కులై
తోఁచుచందమ్మునన్ లోకలోకాంతరాళమ్ములన్ జీవరూపత్వముం బొంది
తత్కర్మబీజంబునన్ బద్మపత్రాంతరస్థాంబుబిందుస్వభావంబునన్, గూడి
యుం, గూడ వాకారశూన్యత్వ మొప్పన్ బరంజ్యోతివై యుండియున్

బద్మగర్భాచ్యుతేశాభిధానంబులం దాల్చి నానాజగద్రాజి, కుత్పత్తి రక్షాల
యం బాచరింపంగఁ ద్రైగుణ్యవృత్తిం బ్రవర్తింతు నొక్కొక్కచో మత్స్య
కూర్మాదిరూపమ్ముల న్మించి లోకోపకారమ్ము గావింతు వంభోజగర్భాం
డముల్ రోమకూపమ్ములోనుండ నత్యున్నతస్థూలదేహమ్ముచే నుందు, వే
కార్ణవంబైనవేళన్, వటోద్భూతపత్రమ్ముపై సూక్ష్మగాత్రమ్మునన్ శైశవ
క్రీడ నర్తింతు వింద్రావనీభృత్ఫణీంద్రాకృతిన్ నాకభూనాగలోకమ్ములన్
లీలఁ బాలింతు వాకాశతేజోనిలాంభోవనీపంచభూతాత్మకత్వంబునన్
సర్వభూతాళి కాధారమై యుందు, వీరేడులోకంబులం గూర్మశీర్షంబు
విఖ్యాతి [నం]తర్బహిర్వృత్తిఁ దేలింతు వభ్రచ్యుతాంభోలవంబంబు
పూరంబునుం జెంది పాథోనిధానంబులం జెందుచందమ్మునన్ సర్వతేజోవి
శేషంబులెల్లన్ భవద్విగ్రహంబంద డిందున్ గజేంద్రాదిసద్భక్తరక్షార్థమై
తావకస్ఫీతబాహాచతుష్కంబునన్ జక్రశార్ఙాసిశంఖమ్ము లేపారుచుండన్
ద్వదీయాంఘ్రికంజాతమందాకినీనిర్మలోదంబు లశ్రాంతమున్ గ్రూరపాపోరు
పంకమ్ములం బాపు నీమాయ, గీర్వాణముఖ్యాఖిలప్రాణిసంఘాతవారాశికిన్
వేలయైయుండు నంభోజభూసంభవానందకారీ! మురారీ! భుజంగేంద్ర
తల్పా! సుధాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః॥

268


చ.

అని వినుతించినం గరుణ నంబుజనాభుఁడు [వానితోఁడ]
హనమవు కేతనంబ వరయన్ బ్రియభక్తుఁడ వీవు నాకు నీ
మనముననున్న కోర్కు లనుమానము మానుమెఱుంగఁ జెప్పుమ
న్నను, ముదితాంతరంగుఁడయి నాథునితోఁ బ్రియమొప్ప నిట్లనున్.

269


వ.

దేవా! మత్కులసంభవుండగు టిట్టిభవరునండమ్ముల మహో
ద్రేకమ్మున సముద్రుండు నిష్కారణంబునఁ గైకొన్నవాఁడ నిన నాభగవం
తుండు పర్జన్యు నాననం బాలోకించిన నతండు జగన్నాథునాజ్ఞం జేసి నదీ
వల్లభుం గోపించిన జలాంతర్గతంబగు నండమ్ములు దెచ్చి పర్జన్యుని కిచ్చె
నతండు భగవంతుని సమ్ముఖమునం బెట్టిన నాసర్వేశ్వరుండు వినతాసుతున
కిచ్చె, నాపక్షిపతి టిట్టిభున కొప్పించె, నతండును పుత్రకళత్రమ్ములఁ గూడి
కొని విరోధివర్గంబు మట్టుపెట్టి సుఖంబుండె. నట్లు గావున శత్రువిక్రమం
బెఱింగియు వైరంబు దగదనిన విని సంజీవకుండు దమనకుం జూచి మృగ
ధూర్తా! మృగేంద్రుం డెవ్విధంబున నున్న సమరోద్యోగి యని తెలియ
వచ్చు ననిన నతం డిట్లనియె.

270

క.

లాంగూలం బల్లార్చి క
నుంగవ ద్రిప్పుచును నోర నురువులు గ్రమ్మన్
మ్రోఁగుచు నుండిన నెఱుఁగుము
సింగము జగడమ్మునకును జేరె నటంచున్.

271


క.

అని చెప్పి దమనకుఁడు వెసఁ
జని కరటకుతోఁడ నపుడు సర్వము దెలియన్
వినుపించిన నాతఁడు తనుఁ
గనుగొని నిందించి పలికెఁ గలఁగినమతితోన్.

272


క.

హితమంత్రి వయ్యు నక్కట
పతికిని వృషభేంద్రునకును బగపుట్టఁగ నీ
గతిఁ దిండి కొనర్చితి, సం
గతి మాలినకార్య మధికకపటాకృతివై.

273


వ.

అని పలికెఁ దదనంతరంబ.

274


ఉ.

నీలబలాహకవ్రజము, నింగిపయిం గనుపట్టె మందవా
తూలము లెల్లడం బరగెఁ, దోఁచె మెఱుంగులు దిక్కులందు, ధా
రాళమహోగ్రవర్షము ధరావలయంబునఁ గప్పె, భోగిభు
గ్జాలము నృత్యము ల్దనరె శైలములన్ దొలివానకారునన్.

275


వ.

తత్సమయంబున వృషభేంద్రుడును గాలచోదితుండై ధారా
వర్షమ్మునకు సహింపలేక విషాణమ్ములు వంచుకొని మృగేంద్రుం జేరిన
నతండును దర్పోద్ధతుండై లాంగూలం బల్లార్చి వివృతవదనగహ్వరుండై
మహానాదంబు గావించి దమనకుండు సెప్పినవిధంబున నితండు నాతో సంగ
రమ్మునకు వచ్చినవాఁడు మేలెఱుంగఁజాలక కయ్యంబు నకు వచ్చిన నీ
గోద నిప్పుడు పట్టి చంపెదనని సమరంబునకుఁ దలపడి భీమహిడింబులట్ల
పోరం దొడంగిన నఖిలమృగమ్ములు గలంగె నప్పుడు కరటకుండు దమన
కుం జూచి దుర్బుద్ధీ! నీకతమ్మున నీ యిరువురకు విరోధంబు వాటిల్లెనని
యిట్లనియె.

276


చ.

నృపతి మదోద్ధతుండయిన నేర్పున మంత్రివరుండు రాచకా
ర్యపుసరవుల్ ప్రజావితతి నంటని యాపద మంచివేళ జె

ల్వి పడగఁ జెప్పి వాని యవివేకము మాన్పి హితం బొనర్చినన్
విపులయశమ్ము నొందు గుణవిశ్రుత! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

277


చ.

గురు వెలయన్ బ్రధాని, నృపకుంజరు నర్భకురీతి, నీతిశా
స్త్రరుచిరచిత్తుఁ జేసి, పరరాష్ట్రసభాజనమెల్ల మెచ్చఁ బెం
పరుదుగ నుండెనేనిఁ, దను నత్యధికంబగు నూత్నభోగముల్
సిరియును గీర్తి బొందు నిది సిద్ధము విఠ్ఠయ లక్ష్మధీమణీ!

278


ఉ.

ఆరసిచూడ రాజు సుకృతాంచితుఁడైవఁ, దదీయసేవకుం
గ్రూరపుమంత్రి డాసిన నకుంఠమతిం బ్రజ తల్లడింపుచున్
జేరదు, నక్రమున్న సరసింబలె, నుగ్రఫణీంద్రమున్న ధా
త్రీరుహ మట్లు వానిఁ, గులదీపక! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

279


వ.

అని పల్కి ధర్మమార్గమ్ము కపటాంధతమసమ్మున నెఱుంగఁ
బడదు. భవజ్జఠరార్థంబు మృగేంద్రున కహితం బాచరించితివి. పాలును నీరు
నుంబోలె నతిలియ్యంబైయున్న వృషభపంచాననులకు, నన్యోన్యవైరమ్ముఁ
జేసితి విస్సిరో! యిది యన్యాయంబు, మిథ్యావాక్యమ్ము లాదేశించినవాని
జగద్ద్రోహి యన వినవే! అవమతికి బుద్ధి సెప్పుట యకర్తవ్యం బనక యెఱిం
గించెనేని, యతండు వలిముఖునిచేత సూచీముఖుండను పతత్రిపతియునుం
బోలెఁ బొలియుననిన విని దమనకుం డాకథ యెఱింగింపు మనినఁ గరటకుం
డిట్లనియె.

280


చ.

జలధి సరిత్సుధాకిరణశైత్యసమేధితమైన, యాహిమా
చలమున ముంచి పూని వెదచల్లుచు వచ్చినయట్ల, లోకమున్
గలగొన మంచు ముంచి చలికాలము మున్ను దనర్చె, నెంతయున్
జలరుహబాంధవుండు గడుచంచలతన్ శిఖిమూల కేఁగఁగన్.

281


క.

లలనాకుచదుర్గంబులు
గలుగఁగ, హరిహరపయోజగర్భులు జనులున్
దలడుఁప సుఖించిరి గా కీ
చలి పగఱకుఁ దలఁగ నొండు శరణము గలదే!

282


వ.

తత్కాలమ్మున, —

283

సీ.

వలగొని వణఁకుచు వానరు లడవిలో
                    మిణుగురుపురువులు మెఱయఁ గాంచి
నిప్పుకలని డాసి నివ్వెరపడఁ, జూచి
                    పలికె సూచిముఖుండు ప్రజ్ఞ మెఱయ
నగ్గి కాదిది యేటి కలముక యున్న నా
                    రన, నుపలమ్ము చేనంది యొక్క.
క్రోతి తత్పక్షీంద్రుఁ గ్రోధాకృతిని వేయఁ
                    బడె, నట్లు గావునఁ బాపమతికి
బుద్ధి దెలియఁజెప్పఁ బోలడు, జెప్పితిఁ,
గ్రూరశిష్యుచేత గురుఁడు దొల్లి
భంగమొందె, నట్టిపాటు చేకురదు గ
దా! యటచుఁ బలుక దమనకుండు.

284


అ.

అనఘ యెఱుఁగఁ జెప్పు మాకథావృత్తాంత
మనిన నొక్కపురమునందు మున్ను
భిక్షుఁడుండ నతనిఁ బ్రీతిఁ గిరాతుండు
సేవఁజేసె నిష్టసిద్ధికొఱకు.

285


వ.

భిక్షుండును గతిపయదినమ్ములు చనిన నతనిఁ గృపావీక్షణం
బున వీక్షించి మత్పదాంగుష్ఠంబు ప్రతిదినంబును జలంబులం గడిగికొని
త్రావు మట్లైన నీకు నిష్టసిద్ధి యగుననినం, గిరాతుం డవ్విధం బొనరింపు
చుండ,—

286


చ.

అవనిపుఁ డొక్కకార్యమున కంపిన దూరము బోయ సోపోవుచున్,
బ్రవిమలచిత్త! మీచరణపద్మమునందలి వ్రేలినీరు నా
కు, వలె ననారతమ్ము సమకూఱఁగ, మీ రరుదెండటన్న, భి
క్షువరుఁడు వాని యాననముఁ జూచి మదిం గలుషించి యిట్లనున్.

287


వ.

లుబ్ధకా! గురువువెంట్ల శిష్యుండు పోవుఁ గాని, శిష్యునివెంట
గురువు పోవునే! యిది విరుద్ధాచారమ్ము నీవెంట వచ్చుట యన నవివేకంబు,
నాయందలి భక్తియె నీకుఁ గలిగినంజాలు నాపదాంగుష్ఠజలంబు కారణంబు
గాదనిన, నక్కిరాతుండు వెడనవ్వు నవ్వి దేవా! మీ రి ట్లాన తీఁదగునే! సత
తం బాచరింపుచున్నవ్రతం బే నెట్లు విడువనేర్తు, నావెనువెంట నీవు వచ్చినఁ

బాదజలమ్ము గలుగు, రాకున్న, నీయంగుష్ఠమ్ము నా కిమ్మని దుర్బుద్ధిం జేసి
డాసి యప్పుడు.

288


క.

గురువుఁ బడఁద్రోసి చరణాం
బురుహము పెనువ్రేలు కోసి పుచ్చుక వేగో
ద్ధురతఁ జనియె, జనులును గని
యరుదందఁగ, ననుచుఁ జెప్పి యాతనితోఁడన్.

289


గీ.

అధికమగు దుష్కృతం బెవ్వఁ డాచరించు
నతడు, తత్ఫలమంతయు ననుభవించుఁ
దొల్లి తనయునిచేఁ దండ్రి ధూమసంచ
యమున మృత్యువు బొందె నటంచుఁ బలుక.

290


వ.

విని దమనకుం డది యెఱింగింపుమనినఁ గరటకుం డిట్లని చెప్పం
దొడంగె, ము న్నొకపురమ్మున ధర్మబుద్ధి దుష్టబుద్ధులను వైశ్యకుమారు
లిరువురు గలరు, వా రొక్కనాఁడు విత్తం బార్జించుకొఱకు నన్యదేశమ్ము
నకుం జని రందు,

291


సీ.

ధర్మబుద్ధి మహానిధానమ్ము గని దుష్ట
                    బుద్ధి కెఱింగించి యిద్ధనమ్ము
గొని యింటి కరుగుదమన, సమ్మతింప న
                    య్యిరువురుఁ దమయున్నపురము డాసి
తమచేతిధన మొక్కతరుసమీపమున ని
                    క్షేపించి యాత్మనికేతనములఁ
బొంది, మిత్రతఁ గడుపొలుపొంద నుండి, రం
                    దొకనాఁడు దుష్టబుద్ధికి నధర్మ
బుద్ధి పుట్ట, ధర్మబుద్ధికిఁ జెప్పక
యవపహరింతు ననుచు నాత్మఁ దలఁచి
యర్థరాత్రసమయమం దొక్కఁడును జని
యద్భుతంపుటర్థ మపహరించె.

292


గీ.

అద్దురాత్ముండు చిరకాల మరుగ, ధర్మ
బుద్ధిఁ బొడగని లేములఁ బొరయ నేల!
నేల దాఁచిన విత్తమ్ము నీవు నేనుఁ
బంచుకొందము నేఁ డని పలుక, నతఁడు.

293

ఉ.

అవ్విధ మాచరింపుమన, నాతఁడుఁ దానును నేఁగి గుద్దటన్
ద్రవ్వఁగ నప్పు డందలినిధానము గానక, ధర్మబుద్ధి, నన్
గవ్వతనమ్మున న్మొఱఁగి కైకొనె నెంతయుఁ బాపవృత్తి మై
నెవ్వని నమ్మఁబోలును! మహీస్థలి నర్థములందుఁ జూచినన్.

294


వ.

అను పలుకులు పలుక, నన్యోన్యవివాదం బధికంబయ్యె నంత న
య్యిరువురు ధర్మార్ధకోవిదులయొద్దకుం జని వారల కీవృత్తాంతం బెఱిం
గించిన, వార లుభయవాక్యమ్ములు విని యేను దినమ్ములకు ధర్మం బేర్చ
రించెదమని మితిఁ బెట్టిన, దుష్టబుద్ధి వారల కిట్లనియె,—

295


సీ.

పశ్యతోహరుఁ డతిపాపాత్ముఁ డితని ని
                    ప్పుడ పట్టి దండించి పుచ్చుడనుచుఁ
బలికిన, వార లిందులకును గల సాక్షి!
                    యని తన్ను నడిగిన నచటితరువు
గుఱియన, వినుచు మిగుల మేము రేపు వ
                    చ్చెద మన్నఁ గృహములఁ జెంది రందు
దుష్టబుద్ధి మదంబుతోఁ దండ్ రికిట్లను
                    వచ్చు వాఙ్మాత్రమ్మువలన నధిక


ఆ.

ధనమటన్న, నతఁడు దద్విధ మేరీతి
ననిన, రాత్రి భూరుహమ్ము కోట
రమున దాఁగి యెల్లి ప్రజలెల్ల విన, ధర్మ
బుద్ధిఁ దిగిచికొనుట సిద్ధ మరయ.

296


వ.

అట్లైన నధికద్రవ్యము చేకూఱుననం దనూభవునకు నతం డిట్లను,
మతిమంతుం డుపాయమ్ము క్రియ నపాయమ్ము చింతింపందగు నది యెఱుం
గకున్న మున్ను బకవల్లభుండు దనశిశుసంచయమ్ము నకులమ్ముచేతం
బోలె హింస నొందునన, విని దుష్టబుద్ధి తద్విధంబు జెప్పుమనినఁ, దజ్జనకుం
డిట్లనియె.

297


క.

ఒకవిటపకోటరమ్మున
బకమిథునం బుండు టెఱిఁగి పన్నగము భయా
నకగతిఁ జని తదపత్య
ప్రకరము భక్షించుచుండెఁ బరమప్రీతిన్.

298

గీ.

అంత బకపతి తనభార్యయందుఁ గన్న
పిల్లలను బ్రోవవలెనని పెల్లుచింతఁ
దీరమున నున్న, గొలని కుళీరవిభుఁడు
గాంచి, హితుఁ డౌటచేఁ గౌతుకమునఁ బలికె.

299


వ.

బకపతీ! చింతాక్రాంతస్వాంతుండ వగుటకుం గతం బేమి యన
నతండు నిజవృత్తాంతం బంతయు నెఱింగించిన విని యే నొక్కయుపా
యమ్ము చెప్పెద, నొక్కనకులసుషిరమ్ము మొదలుకొని సర్పవల్మీక
పర్యంతమ్మును జలచరమ్ముల నెఱపు మట్లైన నీకు శుభం బగునని చెప్పిన
బకప్రభుండును తద్వచనప్రకారమ్మున నాచరించె నయ్యవసరమున.

300


క.

నకులమ్ము వెడలి మీనప్ర
కరము దిని పాముఁ జంపి భక్షించి మహో
త్సుకతఁ దరు వెక్కి యందలి
బకసంతానమ్ము మ్రింగెఁ బ్రస్ఫుటభంగిన్.

301


వ.

ఇట్లు గావున నుపాయమ్ము క్రియ నపాయమ్ము చింతింపవలయు
ననిన, విని లోభాకీర్ణహృదయుండై దుష్టబుద్ధి బలాత్కారమ్మున నిబిడ
ధ్వాంతాక్రాంతనిశాంతయగు నిశీధవేళం, దరుకోటరమ్మున, నిజజనకు
నిం డాఁచె నంత.

302


చ.

కలువలఁ బాసి తుమ్మెదలు కంజగృహమ్ముల డాయఁ, గుక్కుటం
బులు రొదసేయ, జక్కవలపొందులు మించఁగ, నీడజంబు చె
య్వుల విహరింపఁ, జీఁకటిసమూహ మణంగ, జగజ్జనం బిలా
తలి నలరంగఁ, దారకలదర్పము దప్పఁ బ్రభాత మొప్పినన్.

303


వ.

ఇట్లు వేఁగిన దుష్టబుద్ధియు,—

304


గీ.

అద్దురాత్ముండు పెద్దల నప్పు డటకుఁ
దోడుకొనిపోయి దురితవిదూర! వృక్ష!
యిచటఁ బాఁతినవిత్తంబు నెవ్వఁ డపహ
రించె నెఱిగింపు జనులకుఁ బ్రీతి యెసఁగ.

305


వ.

అని పలుక నావృక్షకోటరమ్ములోనున్న వృద్ధవణిక్కు ప్రజలకు
వినవచ్చునట్లుగా నావృక్షమ్ము పలికినట్ల ధర్మబుద్ధి యిప్పదార్థం బహరించె,

నను వాక్యంబు వినంబలికిన, పెద్దలు నాశ్చర్యంబు నొందిరి. ధర్మబుద్ధియు
విషాదమ్ము నొంది భూరుహంబునందు ధర్మం బెద్దియు లేకపోయెనని,
తత్కోటరంబునఁ దృణసంఘం బిడి యనలమ్ము రగిలించె నంత,—

306


చ.

పొగ లెగయంగ నుగ్రత, నభోవలయమ్మున విస్ఫులింగముల్
మిగులఁగ బర్వఁ, గోటరసమేతుఁడు కోమటి యోర్వలేక ము
న్నుగ మహిఁ గూలి చచ్చినఁ గనుంగొని పెద్దలు దుష్టబుద్ధిఁ గ్రో
ధగతి నదల్చి తిట్టి, రిది, తథ్యముగా నెఱిఁగెన్ నృపాలుఁడున్.

307


క.

ఆలోన భూతధాత్రీ
పాలుం డాదుష్టబుద్ధిఁ బటురోషమునన్
శూలమ్మున వేయించె, జ
నాలి యితఁడె ధర్మసూనుఁ డని మదిఁ బొగడన్.

308


వ.

అట్లు గావున, చేసిన దుష్కృతం బెట్టివారికి ననుభవహేతువగు
నని వెండియు దమనకుం జూచి కరటకుం డిట్లనియె.

309


క.

కులము కుపుత్రునిచేతం,
బలి యల్పునిచేత, సాధుభావంబులు చె
ల్వలచేత, సుకృతసంహతి
కలుషంబులచేతఁ బొలియుఁ గాదె! తలంపన్.

310


గీ.

విషధనంజయభీమదర్వీకరముల
పగిది, నీదుచరిత్రమ్ము భయద మనుచు
నున్నయది నాకు, గురుదశ నొందఁజేసి
తమ్మహాత్ముని మృగరాజు, నని యతండు.

311


వ.

వెండియు నిట్లనియె.


ఆ.

ఎలుక లద్భుతముగ నెందేని లోహస
హస్రతతుల మ్రింగె, నంద మిత్రు
వలన వారి చిఱుతవాఁడును డేగచే
నవహరింపఁబడె నటంచుఁ బలుక.

312

వ.

విని దమనకుం డేతత్కథ యెఱింగింపుమనినఁ గరటకుం డిట్లనియె.
ము న్నొక్కపట్టణంబున నతిక్షీణవిభవుండగు వణిక్కుమారుండు గలఁడు.
అతండు లేమి చేతం గ్రిందువడి పత్తిగింజలు చిళ్ళగింజలు జీడివిత్తులు చీపురు
కట్టలు విస్తరాకులు ఉప్పు గుగ్గిళ్ళు గానుగపిండి మజ్జిగ కూరలు కట్టెలు
మొదలుగాగల క్షుద్రద్రవ్యమ్ము లమ్ముకొని తత్పదార్థంబున వేలపర్యం
తంబులు, ఇనుపముద్దలు గొని యవి స్వకీయద్రవ్యమ్ము లని తనసఖు
నొద్ద డాఁచి ద్రవ్యం బార్జించుకొఱకు నన్యదేశంబునకుం జని యందు బహు
వ్యాపారమ్ములం దిరిగిన, మందభాగ్యవశత్వంబున నేమియు నబ్బక రిక్త
హస్తుండై తిరిగి తననిలయంబు జేరి.

313


క.

అతిరయమున లోహసహ
ప్రతతులు నా కొసఁగుమనుచు సఖు నడిగిన, ను
ద్ధత లుబ్ధమానసుండై
యతఁ డా, ఖుశేణి మ్రింగెనని పలుకుటయున్.

314


వ.

విని యిది మహాద్భుతంబని పెద్దయుం బ్రొద్దు చింతించి యతం
డొక్కయుపాయమ్మునం గాని తనయినుపముద్దలు మళ్ళవని నిశ్చ
యించి యాసఖునితో నిట్లను, నే నభ్యంగనమ్ము చేసుక బహుదినంబు
లాయెను తటాకతీరంబున నుష్ణజలమ్ములు నిర్మించుక తీర్థం బాడెద, నచటికి
నీసుతుచేతఁ దైలం బంపుమని చెప్పిన, నతం డట్ల చేసిన, బాలవణిక్కులు
తటాకంబు చేరి వణిక్పుంగవుం డభ్యంగనం బాచరించి తీర్థం బాడి తిరిగి
వచ్చునప్పుడు సఖుసతు నొక్కగొందిని దాఁచి యొక్కండును సఖుగృహం
బున కేతెంచినఁ, దత్సఖుండు దురపిల్లుచుఁ గోమటి నీక్షించి,—

315


ఉ.

బాలకుఁ డెందుఁ బోయెనని పల్కిన, నాతఁడు డేగ బల్విడిన్
దైలసమేతుగా నుడుపథమ్మునకుం గొనిపోయెనన్న, శో
కాలయమూర్తులై భువనమం దిది చిత్ర మటన్న, వారలన్
లాలితదంభజృంభితమనమ్మునఁ గౌతుక మంది యిట్లనున్.

316


వ.

మూషికమ్ము లస్మదీయలోహసహస్రమ్ముల భక్షించినట్ల, నీ
కొమరుని డేగయు దివమ్మునకుం గొనిపోయె, నేమి చేయవచ్చు! నిద్దఱకును
దుఃఖమ్ము సరియ, నాకుఁ బదార్థమ్ము పోయె,నీకు నీసుతుండు పోయె, నిందుకు
వడలం బని లేదు; ఊరకుండుమని చెప్పినఁ, దద్భావగుప్తం బెఱింగి సఖుండు

మహాత్ముఁడని నిశ్చయించి యాతని యినుపముద్దలు తెచ్చియిచ్చె, నా
కోమటియు నవ్వుచుఁ గుమారుఁ దెచ్చి సఖున కొప్పించె, నట్లు భవజ్జీవంబు
నకై మృగేంద్రవృషభేంద్రులకుఁ గైతవవిరోధంబు గల్పించితివి నీసహ
వాసం బధికప్రయాసంబని చెప్పి దమనకుతో వెండియు నిట్లనియె.

317


క.

వేయు, పది, యేను, చేతులు
వాయుదు, రేనుఁగుకు హరికిఁ బందికిఁ, గపటో
పాయులకునైన సుజనులు
వాయుదు రెడకల్గ, నూత్న భరతాచార్యా!

318


క.

అని కరటకుఁ డీచందం
బున నిందింపంగ, సిగ్గుబొందిన డెందం
బునఁ గుందుచు దమనకు డుం
డెనంత, హరి గోవిభుని వడిం బొలియించెన్.

319


వ.

అప్పుడు.

320


మ.

కర మాశ్చర్యముగా, హిరణ్యకశిపున్ గైవల్యమున్ జేర్చి, బం
ధురరోషానలహేతిరేఖ, నమృతాంధుల్ భీతినొందన్ భయం
కరుఁడై యున్న నృసింహుచందమున నక్కంఠీరవేంద్రుండు గో
వరుఁ జెండాడి మృగౌఘముల్ గలఁగ గర్వస్ఫూర్తియై నున్నచోన్.

321


వ.

ఇట్లు విజృంభించి మృగపతి శోభిల్లుచుండఁ గరటకదమనకు లతని
సమ్ముఖంబున కరిగి యతనిపాదమ్ములపై వ్రాలిన నతండు శోకవ్యాకుల
చిత్తుండై నిట్టూర్పులు నిగుడించుచు వారలతో నిట్లనియె.

322


గీ.

మొదలు రక్షించి వృషభేంద్రుఁ గదనభూమి
నకట చంపితి వృ......చి
కాన నఱకుట జగదయుక్తమ్ము గాదె!
గర్వవశమునఁ గలుషమ్ము గట్టుకొంటి.

323


ఉ.

ప్రాణసమానుఁడైన వృషభప్రభుఁ, గోపయుతుండనై, రణ
క్షోణి నణంచియున్న ననుఁ జూచి, మనంబున నమ్మునే! మృగ
శ్రేణి, మృగేంద్రరాజ్యము రుచించునె! నామదికిం దలంపఁ గ
ల్యాణగుణమ్ము బాసి దురితాత్ముఁడ నైతిని నేను నిత్తఱిన్.

324

క.

దమనకుఁ డను, హర్యక్షో
త్తమ! నీమదిఁ బొగుల నేల దర్పించిన గో
రమణు వధించితి హితకా
ర్యమునఁ దిరుగు[వేళ వే]చి తనఘగుణుఁడవై.

325


ఆ.

కైతవమున కధికకైతవం, బాదరం
బునకు నాదరమ్ము, వొసఁగు ననుచుఁ
దొల్లి వారకాంతతో నొక్కచిల్క ప
ల్కదె! యటన్న విని మృగప్రభుండు.—

326


వ.

ఏతదితిహాసం బెఱింగింపుమనిన, దమనకుం డిట్లని చెప్పందొడంగె,
ము న్నొక్కనగరంబున నిజభుజబలవిజితహరిదంతరుండును, బుండరీక
భవాండకరండపూరిత[యశః]కర్పూరప్రకాండుండును, నేకపత్నీవ్రతుండు,
నగు మహామండలేశ్వరుండు గలం, డతండు,—

327


క.

తనవీట నున్న వారాం
గనఁ, గలలో నొక్కనాఁడు కాయజుకేళిన్
దనియించితి నని కాంచి, మ
ది నద్భుతము వొడమి నిద్ర దేఱి నలఁగుచున్.

328


వ.

ప్రభాతం బగుడు నరేంద్రుండు నిజస్వప్నప్రకారంబు తనవద్ది
పురోహితులు కెఱింగించి వారల యనుమతంబునఁ దద్దోషపరిహారార్థం బు
చితదానమ్ము లొనరించి నిర్మలాంతరంగుఁడై యుండ, నవ్వార్త దిక్కులఁ
బొడమె, నట్టి యవసరమ్మున,—

329


సీ.

కీలుకొప్పున నున్న గేదంగిఱేకులు
                    నిందిందిరములకు విందు సేయఁ,
గలికిచూపులు భుజంగవ్రజంబులకును
                    మరుతూపు లగుచు మర్మములు గాఁడ,
గజకుంభవిజయంబు గైకొన్న చనుదోయిఁ
                    గస్తూరికాలక్ష్మిగరము మెఱయ,
నడపులమురిపమ్ము లెడనెడ నాగర
                    శిఖికులమ్మునకెల్ల సిగ్గు గఱప,

గీ.

రుక్మతాటంకమణిగణరుచులఁ జిన్ని
నగవులును మోముతోఁ బొత్తు మిగుల నెరప,
లలన కైదండ గొని కడుచెలువ మొంద
ధారుణీపతి కలఁగన్న వారకాంత.

330


గీ.

వచ్చి జలజాయతాక్షి భూవరునిమ్రోల
నిలిచి నిజకుచరుచిఁబోలు నిమ్మపండ్లు
కౌతుకమ్మునఁ గానుకఁగా, నొసంగి
పలికె పుంస్కోకిలస్వరమ్ములు చెలంగ.

331


వ.

నరవరా! నిఖిలధర్మాధర్మవిదుండవగు నీ వెఱుంగని తగ వేది
యును లేదు. నాకు నిద్దురకు వేయిగద్దెంబులు జగమ్మున నున్నవిటు లొ
సంగుదురు. అది జగత్ప్రసిద్ధంబై పర్యవసించుఁ గావున, నేఁటిరాత్రి నన్ను కల
లోనం గలసినవాఁడవుగదా! యన, నమ్మహీకాంతుండు విని లజ్జించి, చింతా
క్రాంతుండై యిక్కాంతకు విత్తం బిచ్చినఁ గాక, వివాదమ్ము సంఘటిల్లునని
చిత్తమ్మునం దలఁచి యూరకుండ, నక్కొలువుకూటంబునఁ బంజరమధ్యంబు
నందున్న రాజకీరం బాకీరవాణిపలుకులు విని రాజుం జూచి యిట్లనియె.

332


ఉ.

చంచలచిత్త మేల నృపసత్తమ! విత్తము దర్పణమ్ముఁ దె
ప్పించుము పెద్దవారిఁ బిలిపింపుము సత్వర మన్న, నట్ల కా
వించినఁ, దత్సభాజనులవీనులపండు వొనర్పఁ జిల్క భా
షించి కలధ్వనిం దగవు సెప్పెను రాజుకు వారకాంతకున్.

333


చ.

కల దను నొందెనంచు, మహికాంతుని నిద్దుర పైఁడి వేఁడ, వా
కలలన, వచ్చె మీరు ముకురప్రతిబింబితవిత్తరాశి యి
చ్చెలువకుఁ జూపుడన్న, నటుచేసిన, నాననబోణి, సిగ్గునన్
వెలువడె రాజమందిరముఁ, వేమరు బల్లవులెల్ల నవ్వఁగన్.

334


వ.

అప్పు డాసభాజనమ్ము తదుపాయమ్ము నకు విస్మయంబందె.
నరేంద్రుండును దనకళంకమ్ము వాపెనని, తద్దయు రాజకీరంబుఁ బోషింపు
చుండె, నంత.

335


క.

తను నధికసభామధ్యం
బునఁ బ్రజ్ఞాప్రౌఢి లజ్జవోఁజూచె, నరేం

ద్రునివలనఁ బడసి చిలుకం
దినియెదనని వేశ్య మదిఁ బ్రతిజ్ఞ యొనర్చెన్.

336


క.

ఆరమణి నృత్యవిద్యా
పారీణత నొక్కనాఁడు పాకాసురసం
హారుని నూర్వశిక్రియఁ బెం
పారఁగ మెప్పించెఁ దజ్జనాధిపముఖ్యున్.

337


సీ.

మెప్పించి వెసను నమ్మేదినీరమణుని
                    రమణి ప్రార్థించి ప్రేమమున నడుగఁ
దద్భావగుప్తి కైతవము భావింపక
                    రత్నకాంచనపంజరమ్ముతోఁడ
నిచ్చిన, మచ్చర మెచ్చ నచ్చెలి నిజ
                    చేటిచేతికిఁ గూర సేయుమనుచు
నొసఁగిన, నది గరుద్విసరమ్ము మిసమిస
                    లొత్తుక తరుగంగఁ గత్తి కరుగఁ,


ఆ.

జిలుక దోఁగిదోఁగి చేరె జాలరిరంధ్ర
మునకు దానిపోకఁ గని భయమ్ము
వెనుప, నన్యపక్షిఁ గని వండిపెట్టిన
గుడిచి వేశ్య మిగులఁ గుతుక మొందె.

338


వ.

అంతఁ దత్సమయమ్మునం గీరమ్మును దృగ్గోచరమ్ము గాకుండ
జాలరిరంధ్రమ్మునం, దణంగి లజ్జావారి యుచ్ఛిష్టాహారమ్మువలన శరీర
పోషణం బాచరించుకొనుచు దనఱెక్కలు వచ్చునంతకు, నంద యుండె
నంత నవ్వార కాంతయు,—

339


సీ.

ఖండేందుశేఖరుఁ జండీశుఁ గుండలి
                    కుండలాలంకృతుఁ గొండయల్లు
మందాకినీధరు మందారమాలాంసుఁ
                    గందర్పదర్పఘ్ను నందివాహుఁ
గాలకూటాద్భుతనీలకంఠుఁ గృపాళు
                    ఫాలాక్షు నాభీలశూలహస్తు

శర్వు నానాకళాఖర్వు గజాసుర
                    గర్వాపహు సుపర్వసార్వభౌము


గీ.

భీము నప్పురిలింగమ్ముఁ బ్రియ మెలర్ప
సోమవారమ్ములను మనశ్శుద్ధి నుపవ
సించి, యవ్వారరామ పూజింపుచుండు
టెఱిఁగి యొకనాఁడు శుకరత్న మెగిరి చనియె.

340


వ.

ఇట్లు చని చరమసంధ్యాసమయమ్మున నబ్భీమలింగమ్ము గుడి
చొచ్చి యద్దేవునిఁ బూజించిన పత్రదూర్వాంకురసుమమ్ముల నడుమ నిల్చి
తననిజాంగమ్ము, స్వకార్యసిద్ధికొఱకు నర్చనగా సమర్పించెనో! యనఁ బచ్చ
వన్నియ మించి యం దణఁగియుండె నంత.


చ.

చెలులు ప్రయత్వపూర్వముగఁ జెంగలువల్ పొగడ ల్నవోత్పలం
బులు సురపొన్న లబ్జములు పొన్నలు నాదిగఁ బుష్పఖండముల్
ఫలములు పత్రముల్ పువులు పళ్ళెములంగొని యేఁగుదేఱ, వా
రలలన డాయవచ్చెఁ, ద్రిపురద్విషదంచితధామ మొప్పుగన్.

341


క.

ఆరాజబింబవదన పు
రారాతిం, బూజసేయునప్పుడు గని, గం
భీరస్వనమున నచ్చటి
కీరం బిట్లనియె దానికిం బ్రియ మెసఁగన్.

342


క.

ఓలలన! నిన్ను మెచ్చితి
నీలోకభ్రాంతి విడుపు నేఁ గొనిపోదున్
కైలాసశిఖరి కీక్షణ,
మేలా! యాలస్య మనిన, నిట్లని పలికెన్.

343


వ.

స్వామీ! మహాదేవ! దేవతారాధ్య! మదనభూతిలిప్తాంగ! తావ
కదయాపాంగవిశేషంబున మజ్జన్మమ్ము సఫలత్వమ్ము నొందె, బ్రహ్మేం
ద్రాదులకునైన, ననిర్వచనీయుండవైన నీవు వేశ్యయని నన్నుం జూడక
సాక్షాత్కారంబునం బిలిచి బుద్ధి ప్రసాదించితివి, నేఁ గృతార్థనైతి, నింక నే
నెయ్యది యాచరింపవలయు! నెఱింగింపుమనిన, నక్కపటకీరమ్ము మహే
శ్వరభ్రాంతియె తలంచి యిట్లనియె.

344

గీ.

పడఁతి! నీకల్మషమ్ములు వాయఁ బుడమి
సురుల కిడు నీగృహమ్మెల్లఁ జూఱవిడిచి
బోడితలతోఁడ నేతెమ్ము పొమ్మ, టన్న
నది ముదంబునఁ దద్విధం బాచరించి.

345


వ.

మగుడి చనుదెంచినం, జూచి నితాంతకౌతుకమ్మున నమ్మహా
లింగం బుభయపార్శ్వమ్ములఁ బత్రకుసుమమ్ములు వాయఁ జంద్ర ఖరుం డిదె
వెడలి చనుదెంచుచున్నవాఁ డని గణికారత్నం బన్యకాంతల కెఱింగింప, నతి
రయమ్మునఁ వెడలి తద్ద్వారశాఖిశాఖాగ్రమ్మున వ్రాలి, దానిం జూచి
యారాజకీరం బిట్లనియె.

346


ఆ.

కైతవమున కధికకేతవం, బాదరం
బునకు నాదరంబు, పొందుఁబొసఁగు,—
పక్షములకు నన్ను బాపిన, నాకు, నీ
శిరము ముండనమ్ము సేయఁజనదె!

347


మ.

అనిన, న్వారవధూటి ఘోరతరశోకాంభోనిధిం దేలుచున్
మునుఁగం బారుచునుండె నెచ్చెలులు తన్నుంజూచి దైన్యమ్మునన్
వనరం దద్విధమెల్ల భూపతి, జనవ్రాతంబు, నా లోపలన్
విని హర్షం బొనరింపఁ, గీర మటవీవీథిం జరించెన్ దగన్.

348


వ.

అది గావున వృషభేంద్రుండు హితం బాచరించిన, నీవును హితం
బాచరించితివి. కపటోపాయమ్మునం జరించిన, నీవును గపటోపాయమ్మునం
జరించి పొరిగొంటివి. నీకు వృథాశోకం బేమిటికి! ధరిత్రీకళత్రులకుం బుత్ర
మిత్రభ్రామికంబు వలవదు. భుజబలపరాక్రమంబ, కారణంబు. యిట్టి వ్యాపా
రంబు పూర్వరాజులయందుఁ బ్రసిద్ధంబని తెలిపిన విని కంఠీరవేంద్రుండు దమ
నకువాక్యం బంగీకరించి రాజ్యసుఖమ్ము లనుభవింపుచు సమస్తజన
మ్ములు గొల్వ సుఖంబుండె, నంతఁ గరటకదమనకు లతనియొద్దనే యుండిరని
రాజకుమారులకు విష్ణుశర్మ యెఱింగించె నంత.

349


శా.

సారాసారవిచార! నూత్నభరతాచార్యాంక! మార్తాండతే
జోరాజత్సుకుమారవిగ్రహ! దిశాశుండాలగండస్థలీ
ధారాళప్రగళన్మదోదకభవోద్యత్కాళిమా[ంకేందు] వి
స్తారశ్వేతయశోవిశాల! కరుణాచంచత్కటాక్షేక్షణా!

350

క.

చారుతరమానగుణగాం
ధారేయ! మహాప్రశాంతిధర్మజ! సంగ్రా
మారంభవిజయ! దానక
ళాశారాజితకర్ణ! భాగ్యరాజితశరణా!

351


పంచచామరము.

జితామరేంద్రభోగ! వాగ్విశేష(సర్వ)లోకస
న్నుతస్ఫురద్గుణాభిరామ! నూతనస్ఫుటాంబుజాం
చితేక్షణప్రసన్నవక్త్ర! శేముషీబృహస్పతీ!
ప్రతాపవైరిభీమకాంతభామినీరతీశ్వరా!

352

గద్య
ఇది శ్రీ భారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర తిప్పనమంత్రిపుత్ర
సుజనవిధేయ భానయ నామధేయ ప్రణీతంబైన
పంచతంత్రియను మహాప్రబంధమ్మునందుఁ
బ్రథమాశ్వాసము

  1. తిప్పయ భాస్కరేంద్ర జనవాక్యమ్ముల్ భవద్భాగ్యముల్.
  2. సఖమ్ము
  3. పితృపతి
  4. జెప్పు మల్పు పలుకు జేసెద వధిక నీ
  5. ఒడలని సంస్కరించినచో యతిభంగము.
  6. మంచార