పంచతంత్రము (బైచరాజు)/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

పంచతంత్రము

ప్రథమాశ్వాసము

అవతారిక



వృత్తస్తననిస్తులైణమదసంసిక్తం బురోవీథి బా
గై విన్నాణపుఁబుట్టుమచ్చ రవిక న్యాసన్నవిశ్వంభరా
దేవీవిభ్రమలక్ష్మిఁ దేటపఱుపం దీపించు త్రైలోక్యర
క్షావర్ధిష్ణుఁడు కృష్ణుఁ డూర్జితమనీష న్నాకు దిక్కయ్యెడిన్.

1


మ.

సరసీజాతము లాటపట్టులు నిశాచారారి చంచద్భుజాం
తరమావాసము పుట్టినిల్లు సలిలస్థానంబు దారిద్య్రభూ
ధరవజ్రాయుధకోటిచూపు నిగమాంతప్రోక్తు లాశంసినీ
పరిషద్భాగముగాఁ జెలగుజగదంబం బద్మఁ గీర్తించెదన్.

2


చ.

తరల కహో యుపాంశుజపదంభమున న్వనజాతపీఠి క
న్నరమొగిడించి సృష్టికరుణాయతి మూలకుఁ ద్రోఁచి భారతీ
చరణశిఖాంతవిభ్రమరసంబులఁ బ్రస్తుతిసేయుధాత మ
న్నిరుపమదివ్యకావ్యపదనిర్మితిఁ బ్రోఁదియొనర్చుఁ గావుతన్.

3


మ.

నవమేఘాళి ఘటించు మచ్చికురబంధశ్రీ నిరీక్షించి గో
త్రవరేణ్యంబులఁ జేయు వృత్తకుచముల్ దర్శించి భావించి నా
యవలగ్నాంగముఁ జూచి సింహసృజనం బర్థింపుమంచు న్మనోధవు
మేలంబునఁ దేల్చువాణి నను నంతర్వాణిఁగాఁ జేయుతన్.

4


ఉ.

చేకొని బ్రహ్మమంత్రములఁ జెప్ప నహో ప్రతిసీర జాఱ మై
నాకుఁడు దేవతాళిగళనాదమున న్జదివించుచోట భూ
షీకృత భోగిదర్శనముచే ధృతిదూలి చలించుగౌరి నా
లోకముఁ జేసి నవ్వు ప్రబలు న్బరమేశ్వరు నాశ్రయించెదన్.

5

ఉ.

ఆసవనారిమోవిరుచు లానఁగఁ దద్ఘనకంధరావల
ద్వాసుకిభూరిభూత్కరణవాతకనన్నిటలాంబకాగ్నిగల
సలిలాప్తి నార్చుటకుఁగా వడిదోయిలి సాఁచు చండముం
డాసురహంత్రి నన్ను సకలార్థవిధిజ్ఞునిఁ జేయుఁ గావుతన్.

6


చ.

నడుఁగక బాల్యచాపలమున న్దనపిమ్మటివ్రేలఁ జొక్కపున్
గడియపుట ట్టటంచుఁ ద్రిజగజ్జను లచ్చెరువంది చూడ న
క్కడపటికొండసొంపు లెఱుఁగం దవిలించినటించుశూలిపె
ద్గొడుకు మదీయకావ్యమునకుం గలిగించు నిరంతరాయముల్.

7


ఉ.

భూరి విరాడ్వికారగతిఁ బూర్వకుభృచ్చరమాద్రులం బదాం
భోరుహము ల్ఘటించుకొని పోకలరాకల మే న్మలంచి వి
ద్యారుచిఁ జొక్కుచోఁ జెవిపద న్రవిపోగున కెంపువోలెఁ జె
న్నార మహోన్నత న్మెఱయు నక్షరు నక్షురిపు న్భజించెదన్.

8


మ.

భవమూర్ధేందుపయోధిపర్వశశి చెప్పం జొక్కి పెక్కండ్రకై
దవఖండం బసమగ్ర ముగ్రనగమంథక్షుభ్యమాణంబు సిం
ధువసారంబు తమస్వ మొప్సఁగలచంద్రుండంచు దివ్యామృతం
బవలంబించు భుజంగకోటియగునాగారిం బ్రశంసించెదన్.

9


చ.

అతినిశితాశుధారకు మహామహనీయవిచిత్రవర్ణసం
గతికి నిరూఢగూఢసుముఖత్పదసత్యపదార్థసంగ్రహ
స్థితికిఁ బహుప్రయత్ననియతిం జనతాశ్రుతిరత్నకుండలా
యితహితసూక్తియుక్తి నుతియించెద బాణమయూరచోరులన్.

10


మ.

హృదయబ్రహ్మరథం బతిప్రియతమం బెక్కింతుఁ జేతోమరు
త్సదనాస్థానికిఁ దెత్తు మానసనభస్పంచారిఁ గావింతు హృ
ద్విదితక్షీరసముద్రఖేలనమున న్దేలింతు నుత్కృష్టన
స్తుదులం బ్రాజ్ఞుల దిక్కయజ్వ నమరేశు న్సోము శ్రీనాథునిన్.

11


క.

వాచావీచీధీకృత, లోచనకర్ణాగ్రయాయి లోకసుధాంధో
నైచికిఁ దలఁతు న్మద్వం, శాచార్యుం దిరుమలశ్రియఃపతి గురునిన్.

12


మ.

రసవిస్ఫూర్తిగొఱంత దీని కిది పూర్వచ్ఛాయ యిచ్చోటఁ ద
ప్పస దిప్పట్టున నర్ధసృష్టిపసలే దచ్చోట నశ్లీల మ
ద్దెస నాదిక్కున దుస్సమాస మిది సందేహాస్పందం బీడ నం
చు సుమాళంబునఁ బాండితు ల్నెరపునీచు న్రోఁత వాక్రువ్వఁగన్.

13

సీ.

ఒకఁ డలంకారంబునకు వేడుక వహించు నొకఁడు వార్తాసమృద్ధికిఁ జెలంగు
నొకఁడు శబ్దస్ఫూర్తులకు మాయురే యను నొకఁ డర్థసృష్టికి నుత్సహించు
నొకఁడు రసాభోగతకు మస్తముఁ గదల్చు నొకఁ డుపమానచర్చికకు నలరు
నొకఁడు పదప్రౌఢిమకు నిచ్చలో మెచ్చు నొకఁడు జాతిశ్లాఘ కుబ్బుచుండుఁ


తే.

గామిచందానఁ దలవరికరణి బధిరు, వలె దరిద్రునిగతి నాదిపగిదిఁ గనక
కారుచాడ్పునఁ బంగువైఖరిఁ గుజాతి, జాడ నిందఱే ముదలింపఁజాలు టెట్లు.

14


క.

ఒప్పులు గలకృతిలో నొక, తప్పున్నను గడమగాదు దానికిఁ గళలం
జొప్పడుశశికిఁ గళంకము, కప్పేర్పడి యేమినిందఁ గావించెనొకో.

15


ఉ.

ఆనుట కీరసంబున నహంకృతిదంశతు లల్పకాకవు
ల్వీనుల నీని మత్కవిత విద్వదుపాసిత గాకయున్న యా
హా నరభుక్తశ్లేషకబళాహరణక్షమకుక్ర్కురాళికిం
గాని నవాజ్యధార క్రతుకార్యసమాచరణీయగాదొకో.

16


[1]చ.

మృదుగతి మంచితావులకు మెచ్చుపదావనిఁ బావనాళి దా
నది గొని రోయువంకలను వంచకసంచయ మట్టిదేకదా
చదురు ఘటిల్లఁజూచు సరసప్రసవంబులఁ జంచరీకపుం
గదుపులు నిచ్చలు న్వెదకుఁ గా కుణపంబుల నక్క లేర్పడన్.

17


చ.

ఘనతరఘూర్జరీకుచయుగక్రియ గూఢముగాక ద్రావిడీ
స్తనగతిఁ దేట గాక యరచాటగు నాంధ్రవధూటిచొక్కపుం
జనుఁగవఁ బోలి గూఢమును జాటుదనంబును గాకయుండఁ జె
ప్పినయది పో కవిత్వ మనిపించు నగిం చటుగాకయుండినన్.

18


చ.

ఎడపక తారుదారె లిఖియించి పఠించి కృతుల్ ప్రతుల్ జగం
బడిగిన నిచ్చి హెచ్చి సకలావసధంబుల దారయై దిశల్
గడచి నటించుకావ్యములు కావ్యములా హరణాఘకాంతికై
విడువక కూలిఁ బెట్టి చదివించుకృతు ల్గృతులే వసుంధరన్.

19


వ.

అని యిష్టదేవతానుతియును బురాతనకవిస్తుతియు నాచార్యపురస్కృతియును గుక
వితిరస్కృతియుం గావించి, యే నొక్కనాఁడు పంచతంత్రం బాంధ్రభాషం జంపూ

ప్రబంధంబుఁ జేయం బ్రారంభించి యేతత్కావ్యకన్యకారత్నంబున కనుకూలవల్ల
భుం డేదేవుండొకో యని విచారించి శయ్యాతలంబున శయనించిన.

20


శ్లో.

హృన్నిత్యయాచర మయా ప్యుమయాప్రభుత్వం
మౌళీతుషార ఘృణినా జగతాం గురుత్వం
సందీయ న్నభసి కోపి మహాన్సుమాస్మే
స్వప్నే శుభే సితసితద్యుతి రావిరాసీత్.

21


క.

కలలో నలుపుం దెలుపుం, గలవేలుపుదొర యగణ్యకారుణ్యరసం
బొలయ ననుఁ జూచి ద్రాక్షా, మధురప్రణయపూర్వభాషలఁ బలికెన్.

22


క.

నను హరిహరనాథునిఁగా, మనమునఁ దలపోయు నృపకుమారక విద్వ
జ్జనసేవ్యము నీకావ్యముఁ, దన కి మ్మభిమతవరప్రదాతకు భక్తిన్.

23


వ.

అని యానతిచ్చి యావేల్పు విచ్చేసిన నానందకందళితపులకదంశితుండనై మేలుకని.

24


క.

ఏచనువు గలదు హరిహర, సాచివ్యము నొంద నన్యజనులకు మది నా
లోచింపఁ దిక్కయజ్వకు, నాచనసోమునకు మఱియు నాకుం దక్కన్.

25


ఉ.

సన్నుతశబ్దలక్షణరసస్ఫురితంబుఁ బురాణభారతో
త్పన్నము నైన సాధుపఠితం బయి యొప్పదు మర్త్యసేవ్యమై
యున్న ప్రబంధ మెప్పటి కహో జగదేకపవిత్రభూమిదే
వాన్నము సారమేయచరణాంకితమైన భుజక్రియార్హమే.

26


గీ.

అతికుటుంబరక్షణాపేక్షఁ బ్రాల్మాలి, కృతులు మూఢభూమిపతుల కిచ్చి
చచ్చి నిరయమునకుఁ జనుకంటె హరిహరా, ర్పణముఁ జేసి సుగతిఁ బడయరాదె.

27


ఉ.

అంగధృతాబ్జు నిశ్చలతరాతను సర్వదు సర్వమంగళా
లింగితు భీషణాశరకులీనజయోన్ముఖపౌరుషక్రియా
సంగతు భీషణాంబకకృశాను నిరూపితవైరిసద్ము యో
గాంగయుతాదృతిన్ హరిహరాకృతి మత్కృతిభర్తఁ జేసేదన్.

28


వ.

అని నిశ్చయించి యాత్రిలోకీకర్త మత్కృతిభర్తఁగా నొనర్చితి మదీయవంశా
వతారం బభివర్ణించెద.

29


ఉ.

ధీరత రాజవంశజలధిం బ్రభవించె మహావిరోధిసం
హారవిహారి సాళ్వబిరుదాంకుఁడు బైచనృపాలుఁ డద్ధరి
త్రీరమణీమనోహరుని తీవ్రయశస్స్రుతికిన్ హరాద్రినీ
హారవసుంధరాధరము లయ్యె సమగ్రవిహారశైలముల్.

30

క.

అల బైచక్షితిపతికి,
న్బలభిత్ప్రతిమానభోగపరతంత్రునకున్
గలిగె న్దిరుమలధరణీ, తలనాథుఁడు నిర్భరప్రతాపోజ్జ్వలుఁడై.

31


ఉ.

అంబుజనేత్రఁ దిమ్మవసుధాధిపరత్నము గూర్మిపేర్మిఁ ది
ప్పాంబికఁ బెండ్లియై కనియె నప్రతిమానగుణాఢ్యు వీరభ
ద్రుం బరిపంథరాజకులతోయధిమందరు ఘోరసంగరా
డంబరచుంబిభీషణకటప్రకటద్విపసైన్యసంకులున్.

32


సీ.

అతఁడు తుంకుట్ల శ్రీపతిరాజవరపుత్రి శృంగారములయిక్క లింగమక్కఁ
బరిణయంబై లింగనరనాయకవితంసుఁ బ్రాభవనిస్తంద్రు బర్వతేంద్రుఁ
గనియెఁ గుమారలింగక్షోణిపాలుండు యవనసైంధవకాననానలుండు
పోరులఁ బెక్కండ్రఁ బొరిపుచ్చె నమ్మహాధవునితమ్ముఁడు పర్వతప్రభుండు


తే.

వైరికాంతారదనవారివాహమూర్తి, పోలె ఫలితిమ్మవసుమతీపాలపుత్రిఁ
బుణ్యచారిత్ర వికసితాంభోజనేత్ర, నన్నమాంబికఁ బరిణయంబయి ముదమున.

33


క.

నను వేంకటజనవల్లభు, వినుతపరాక్రముని రంగవిభుధైర్యకళా
కనకాద్రిని శేషాద్రినిఁ, గనియె నిహాముష్మసౌఖ్యఘటనాయతికిన్.

34


క.

అసహాయసరసకవితా, రసికుఁడ వేంకటధరావరప్రభుఁడ గుణ
ప్రసవప్రకాండమదన, ద్భసలాయిత [2]విద్వదఖిలబంధువ్రజుఁడన్.

35

షష్ఠ్యంతములు

క.

భువననుయస్వాకృతికిన్, బవిపాణిప్రముఖలోకపాలకమకుటీ
దివసమణికి రణవికసిత, సవకరుణాచరణచరణజలజాతునకున్.

36


క.

పౌలస్యవరదునకు నా, ర్యాలోకచకోరతాపహరణక్రీడా
గ్లౌలాలితాస్యునకు నం, హోలుంఠకహృదయమునిజనోపాస్యునకున్.

37


క.

వినతానందనగతికిన్, ఘననరకత్రాసకరణ కరవాలభుజా
భినవాదృతసురతతికిన్, జనితప్రహ్లాదవినుతజటిసంతతికిన్.

38


క.

బహుభువనవిహారునకు, న్సహజబ్రహ్మాండభాండజటిలఫలాళీ
వహనమహనీయవిగ్రహ, మహితోదుంబరగతశ్రమశ్రీకునకున్.

39


క.

తరణిశశిలోచనునకుం, బరమాణువిలోకి యోగమార్గఖురాళీ
పరివిహృతిసనాథునకున్, హరిహరనాథునకు సద్గృహసనాథునకున్.

40

కథాప్రారంభము

వ.

సభక్తిసమర్పితంబుగా నాయొనర్పం బూనిన పంచతంత్రంబునకుం గథాక్రమం
బెట్టిదనిన.

41

సీ.

వనజగర్భకటాహవర్ధిష్ణుచరణంబు బలిబహూకృతపుణ్యసలిలఖేయ
మరుణాంశుకలశబాసురరత్నసౌధంబు కుధరబిద్గృహచుంబిగోపురంబు
ధనధవాక్రీడపద్దాతృనిష్కుటకంబు బ్రహ్మనిష్ఠద్విజప్రాంజలంబు
ప్రబలభార్గవశౌర్యబంధురక్షత్రంబు పౌలస్త్యనిభవణిగ్భాసురంబు


తే.

పద్మనాయకశుభవిభాభర్త్స్యమాన, విద్వదావాసమండలీవిహరమాణ
భూరిసంతాపతిమిరంబు పొగడ నెగడుఁ, బూర్ణగరిమంబు పాటలీపురవరంబు.

42


సీ.

హలహలం బిది గాదె యభ్యమిత్రీయజీవాని లగ్రాహివప్రాహిపతికి
బలుమదం బిది గాదె పరుషారివారిజోన్మూలకృత్సాలశుండాలపతికిఁ
జిరతమం బిది గాదె పరరాజసంరోధివరణమండలచక్రవాలమునకుఁ
గ్రొమ్మెఱుం గిది గాదె కుటిలశాత్రవతనుక్షతజయుక్ప్రాకారచక్రమునకు


తే.

క్షౌద్ర మిది గాదె ప్రతిపక్షజాతిఁ జెడని, కొమ్మరేకుల గనుపట్టుకోటతమ్మి
కనఁగ జన లోచనోత్సలం బావహిల్లఁ, బరిఢవిల్లుఁ బొగడ్త నప్పురియగడ్డ.

43


గీ.

మొదట నప్పులలోఁ గొంత మునిఁగి పిదప, రాసికెక్కిన పెనుమచ్చరాలఁ బెరిగి
పరఁగుతనపెంపుఁ గొమ్మలపాలుఁ జేసి, కోట యవ్వీట దుర్విటుపాటఁ దనరు.

44


చ.

పురనిధిరక్షణక్షమతఁ బూనిన శుద్ధసుధాసముజ్జ్వలా
వరణ ముకుందభృత్ఫణికి వాలికకొమ్మ లతిస్ఫుటస్ఫటో
త్కరము తదగ్రశీతకరకాంతశిల ల్మణులం బురుడ్బిసా
హరణచరన్మరాళపరిఘాంబువుకంచుక మెంచి చూడఁగన్.

45


మ.

దివిషద్వాహిని యప్పులం బొరసి యుద్వృత్తి న్విజృంభింపంగా
నవరోధించినవీటికోట యధమర్ణాచార మేపార నాం
బనకచ్ఛంబునఁ బాఁదుకొన్నయడుగొప్పం బ్రస్తరస్వీకృతి
న్నినసద్రత్నతదాతపోచ్చలనవహ్నిం గ్రాఁగు నశ్రాంతమున్.

46


మ.

గళబద్ధానిలభుగ్విషస్ఫురితభూత్కారంబునం గాలుఁగొం
డలు నీతేరిగురాల నెట్లు చెడకుండం బ్రోతు పవ్వప్రచ
క్షులగారుత్మతశోభఁ బూని ధరియించుం జూడుఁడా యంచు ని
స్తులదత్తోత్తరభాషఁ దెల్పి చను ఖద్యోతుం డుదాత్తౌచితిన్.

47


చ.

కులుకుకుచంబు లానకలుగు ల్బడఁ గొమ్మలఁ దొంగిచూచు కొ
మ్మలముఖచంద్రచంద్రికలమవ్వపుఁదేటగవాక్షచంద్రమ
శ్శిలల స్రవించునీటఁ బడి శీఘ్రగతిం బఱతెంచు మానకం
దళములయత్నపద్మదళదామకశోభ ఘటించుఁ గోటకున్.

48

ఉ.

బంభరడింభఝంకృతనిబద్ధకటప్రకటప్రదానవ
త్కుంభిరదప్రహారముల గూకల వ్రక్కలునైనమిన్ను వి
శ్వంధభరఁగూలున న్కలఁక సారసగర్భుఁ డొనర్చు సంభృతి
సంభములో యనం గనకసౌధము లుల్లసిలుం బురంబునన్.

49


చ.

పవనజవంబునం బురముపై గరుడాగ్రజు గాఢహూంకృతిం
బవలు గ్రమించినాఁగ ఘృణిమాలి హయాళి వయాళికశ్రమో
త్సవము ఘటించు నౌర దివిషద్వనితాజనతాముఖేందుజ
చ్ఛవినికషంబునం బొడము సౌధవిభానికాసదృషత్స్రవాహముల్.

50


చ.

మరకతకుంభము ల్దలల మాససమానవిహీనకేతువుల్
కరములు మధ్యవర్తికవికౌస్తుభరత్నము తారకాసము
త్కరము సరోజదామకముగాఁ బొగడొందిన సౌధరాడ్విరా
ట్పురుషుఁడు ప్రత్యహం బమరపూజితుఁడై కొమరొప్పు నప్పురిన్.

51


ఉ.

వన్నియమీఱ నన్నగరివాడల మేడలఁ గ్రీడలం గుదు
ర్కొన్న సమెఱుంగుమిన్నలతకూనలకుం జెలులై నిలింపనివి
ద్యున్నిభదేహ లిత్తు రళితుండవియుక్తవితీర్ణభూరుహో
తృన్నసమగ్రసౌరభనితాంతలతాంతగుళుచ్ఛకచ్ఛటల్.

52


[3]చ.

గురుపురగోపురాగ్రములఁ గూడిన భూపసతుల్పసతు ల్మనో
హరవరదత్తమత్తవిషమాయుధజన్యవిహారఖిన్న లె
చ్చరిక ఘటిల్ల వేసవులసోరునఁ దీరున మేరుమారుతాం
కురములఁ బ్రోతు రచ్ఛకుచకుంభజవిశ్రమపుష్కరప్లుతిన్.

53


[4]చ.

అలఘుసరోజభీమశిశిరాగమకాలకరాళజాఠర
జ్వలనశిఖోష్మజీర్ణవిధివాహకులాయజకోటి కిచ్చు ను
త్కళిక నిలింపధామతిమిధామవధూప్రతిబింబితామిళ
త్కలితసుగంధచంద్రఘటికాపురగోపురయౌవతాస్యముల్.

54


ఉ.

ఆపురిఁ జంద్రికానిశల హాటకహర్మ్యమృగేంద్రమధ్య ల
భ్రాపగనీట మజ్జనములాడి యలంకృతిమచ్చరీరులై
డాఁపున నున్కిఁ జేకొనఁ గడంగుదు రిందు నిలింపపుష్పలా
వీపటలార్సితావహితవృక్షలతౌఘగుళుచ్ఛకస్మృతిన్.

55


చ.

అలతొలివేల్పురాఁ బగరయాకటిపంటలు వేదబీజముల్
మొలచినచే లుదారగుణము ల్జనియించినయిండ్లు సత్క్రియా

ఫలతరువుల్ వివిక్తశుకపంజరము ల్గళ కల్మి ధాతతా
తల మన నేర్తురౌ వరతత్వవిధిజ్ఞులు వీటిభూసురుల్.

56


శా.

దూరారాతు లుదారధర్మగురుమూర్తు ల్పద్మినీహృద్విజా
సారంభు ల్వసుభూషితుల్ హృదయపద్యాబంధవిశ్వంభరుల్
ధారాసారవిధాయకు ల్ఘనపదాలంకారు లత్యర్థతే
జోరమ్యు ల్రుచిరోదయు ల్శుచివతంసు ల్వొల్తు రచ్చో నినుల్.

57


ఉ.

ఉన్నతవైభవు ల్పురివిడూరుభవుల్ భవనాంగణంబులం
దెన్నఁగఁ గోటికొక్కటిగ నెత్తిన టెక్కియము ల్లతాద్విరు
క్తి న్నెరయం ఘటించు మణిదీప్తములై గగనస్రవంతికా
సన్నఫలాభిరామదివిషత్కుటనిష్కుటవాటి కెంతయున్.

58


ఉ.

క్రూరతరత్వరాప్తి ప్రతికూలధరాధిపనిశ్చలత్వగం
భీరము మాన్పు వాహినులు పెక్కులు గొల్వఁగ లచ్చిఁ గాంచి యా
పూరితసత్వరేఖపొలుపుం గని పక్షము లాశ్రయింప ని
ర్వారణమండ్రు భూరిగుణరత్నసముద్రులు శూద్రు లప్పురిన్.

59


శా.

చూడం జూడ్కులరాగలక్ష్మి గలిగించు న్మించుఁ దోడ్తోన నా
క్రీడక్రీడనకాంక్ష కర్ణకుహారార్తిం బాపు పాదంబునం
దోడై తీర్చు రమాకుమారుపను లెందు న్విందులంబోలి యెం
తే డాకం బళిరే పురంబుకలకంఠీజాతి యశ్రాంతమున్.

60


ఉ.

రాగములం బరాగములరాగములం గరఁగింతు రంగరే
ఖాగతి మెచ్చ కచ్చరలఁ గాంచి నరుద్ధము కల్మి దేశసం
ధాగరిమంబునం దడసినం గడకాళ్ల నదిల్చి రంభ నే
లాగుననైన గెల్తురు కళావతు లాపుటభేదనంబునన్.

61


సీ.

వదనాబ్జములె చాలు వలపులఁ బ్రేరేఁప వెలిదమ్ము లేటికి విక్రయింప
సోగకన్నులె చాలు సొంపు సంపాదింపఁ గలువ లేమిటికి నంగళ్లఁ బెట్ట
మొలకనవ్వులె చాలు ముదముఁ బ్రోఁది యొనర్ప పచ్చమల్లియ లేటి కమ్మఁజూప
గురుకుచంబులె చాలుఁ బరితోష మొనరింపఁ బూగుత్తు లేటికి బుటము లెత్తఁ


తే.

గాయదీధితిచాలు రాగము ఘటింప, బేర మెఱిఁగింప నేల చాంపేయములకు
ననుచుఁ బథికులు నర్మోక్తు లాడ వాడ, వేడ్క విహరించుఁ బుష్పలావీజనంబు.

62


సీ.

ఆలాన దారుబద్ధాందువుల్ దెగఁ బిఱిందికి నీఁగి ముకుచాయ నిగిడినిగిడి
పక్షభాగములవెంబడి కుధంబులు జాఱిపోవ రజల్ వ్రయ్యఁ బొంగిపొంగి

నిర్యాణకోణము ల్నిండి యుప్పరమెక్కు శీధువీచికలపైఁ జిమ్మిచిమ్మి
సృణిఘాతముల లెక్క సేయక చేయిచ్చుకృత్తిభృద్భటపఙ్క్తిఁ గిట్టికిట్టి


తే.

హస్తిపకముఖ్యసంహతు లతులగతుల, మఱువుఁడని చూళికల కోజఁ గఱపికఱపి
వఱలునవ్వీట గర్వదుర్వారవైరి మారణారంభబలములు మదకలములు.

63


చ.

సురసరణిం బడల్పడఁగఁజూచి కరాహతిఁ దత్సురోపరి
న్నిరవధికత్వరం జనఁగ నెట్టన మావులఁ దూలవైచునో
యరదముఁ బట్టునో యనుభయంబున నేగు నదృశ్యుఁడై విభా
కరుఁడన వీటిదంతులకు గల్గిన యున్నతు లెన్న నేటికిన్.

64


ఉ.

రాజిలు పోతుమానికపురాల జిరాలగురాల సారధా
రాజవగౌరవం బడపరా కతిపుష్కరవాహకోటి గా
ఢాజడవీథిఁ దోలు విరియంబడ ధారలకల్మి మత్సరో
త్తేజితమై హయాంకభృతి దీప్తసమీరణ మూర్జితత్వరన్.

65


శా.

వైరూఢారభటీరటన్ముఖధనుర్బాణప్రచండాసిభృ
చ్ఛూరుల్ గ్రాలఁ బరోపతాప మొనరించు న్దీవ్రసంచారరే
ఖారంభంబున సంఘటించుమహికి న్గంపంబుఁ గల్యాణము
న్జేర నా్మాఱుమొగంబులౌఁ బువముతేజీ ల్దుష్ప్రభుప్రక్రియన్.

66


మ.

పరికింప న్ముకుళప్రవాళగతి నభ్రం బంటుమావు ల్సమీ
పరసం గన్నులవిందుఁ జేయు భువనప్రఖ్యాతచక్రభ్రమిం
బరమోత్కృష్టతఁ గాంచి ఖడ్గశరసంపత్తి న్బ్రకాశించి య
ప్పురితేరు ల్మహనీయజంగమనగ స్ఫూర్తి న్గడు వ్రాజిలున్.

67


వ.

మఱియుఁ గమలాలంకృతంబులై మురవైరియురంబుం బురుడించు సరోవరంబులును
బ్రతిపర్వరసోదయంబులై యనారతంబు భారతంబుంబోలు నిక్షువనంబులును
వెండియుం బేరుగల వస్తువులుం గలిగి జగత్ప్రసిద్ధి వహించిన యారాజధానిం బాలిం
చురాజేంద్రుండు.

68


సీ.

తనరూప మనురూప ధరఘాతి గురుసూతి మధుపూత విభుజాత మర్ది గాఁగఁ
దనదానమినజానఘనగారివనవారి ధనవాహవరదేహతాపి గాఁగఁ
దనశౌర్య మనివార్యతరకోపపరభూపఘనసైన్యజనదైన్యకారి గాఁగఁ
దననీతి వినయాతిధనరజ్యవనరేజ్యశతపత్రహితపుత్రసహజ గాఁగఁ


తే.

దనమహాసత్య మంతితోద్యత్త్రిశంకు, తనయసత్యతపశ్చరిత్రంబు గాఁగఁ
మనుశుభస్ఫూర్తి నిత్యధర్మప్రవర్తి, తత్వవిద్దర్శనుండు సుదర్శనుండు.

69

సీ.

తనదానగౌరవంబునఁ బుణ్యజనపరంపర చిరస్వాస్థ్యసంపద వహింపఁ
దనమహాహవముపెంపునఁ జక్రవాకాచలోత్తరతిమిరంబు లుడ్డుకుడువఁ
తనఘనాననబలోద్యమమున సతిమిత్రగోత్రకుంజరజాతి కుతుకమందఁ
దనమఱుంగున దురంతప్రతాపస్ఫూర్తి హవణించునినుఁడును నణఁగియుండ


తే.

సమధికాదృతిఁ బూని విశ్వంభరుండు, తప్ప కెప్పుడుఁ గన్నులఁ గప్పుకొనఁగ
వాలుమగఁడయి యత్యంతవసుసమృద్ధి, దనరుఁ బ్రియదర్శనుండు సుదర్శనుండు.

70


సీ.

తనయశోనటికి గోత్రావలచ్చతురబ్ధి ఘనతరంగములు రంగములు గాఁగఁ
దనమహస్సప్తజిహ్వునకుఁ బ్రాజ్యారిరాజ్యములు నిస్తులతరాజ్యములు గాఁగఁ
దనహేతిశతధార ధారకాశాపకృత్కుమతిగోత్రములు గోత్రములు గాఁగఁ
దనరూపకలహంసమునకు భామామానసములు నిర్మలమానసములు గాఁగఁ


తే.

దనమహాగుణరత్నసంపతికి శాస్త్ర, చతురభాషణకృతు లలంకృతులు గాఁగఁ
మనుసుదర్శనుఁ డభినవామ్నాయపఠిత, ధర్మతోషితహస్తసుదర్శనుండు.

71


సీ.

పరధరాధిపచిత్రపత్రఖండనకేళి దశదిశావిదితప్రతాపరేఖ
యసదనుశాసనవ్యాపారత మహాశరావళీదత్తచిత్తాదృతగతి
భువనసంచారయోగ్యవినీతగతిమత్తసారంగరంగదాస్థానగరిమ
నిరుపమాననిధానపరిపూర్ణతమనోజ్ఞగుణసమేతార్యానుకూలవృత్తి


తే.

బహువితానోన్ముఖుఁడు సమిద్గ్రహణశాలి, సత్యనిధి పుణ్యజనుఁ డతిచండరశ్మి
గంధవాహుండు హృస్టార్థిగాఢభూతి, యతఁడు దిక్పాలకాంశజుం డగుటఁ దెలిపె.

72


సీ.

అతిశీధుమదవికారత మేనులెఱుఁగని కరటులసఖ్య మగ్రాహ్య మనియు
గుత్తుకవిసము వాకునఁదీపుఁ గలపాపజాతితో నెయ్యంబు జరుగదనియు
గఱుపాటమున ద్రవ్వి కడుపుఁబోసికొనెడి పందితోఁ బొందు నిర్బంధమనియు
నఖిలకంటకసహాయతఁ బెచ్చుపెరిగిన కఠినమూర్తులచెల్మి కష్ట మనియు


తే.

ధరణి కరి ఫణి కిటి ధరేశ్వరుల రోసి, యప్రమత్తు మహావిశుద్ధాంతరంగు
నాదిగర్భేశ్వరునిఁ గరుణార్ద్రహృదయ, విష్ణుసన్నిభు నమ్మర్త్యవిభునిఁ జేరె.

73


శా.

సత్యఖ్యాతి నిధానదానజనితస్వాస్థ్యప్రతిష్ఠీకృత
ప్రత్యర్థిం బహువేదశాస్త్రపఠిత ప్రస్థానవర్తిం బ్రజా
ప్రత్యక్షాదియుగభ్రమీకృతకలిప్రారంభుఁ గారుణ్యసం
పత్యత్యాదృతమిత్రుఁ బోలదె నుతింపం దద్ధరాధీశ్వరున్.

74


మ.

బుధసంభావితమూర్తి నిస్తులకళాపూర్ణుండు నిష్పర్వపూ
ర్వధరాధీశపదప్రవర్తి హితసద్రక్షాచరిత్రుండు దా

నధురాధుర్యుఁడు గర్వభాగరివధానందుండు శోభాసుధా
నిధి యారాజిభవైరిపీఠిఁ గొలువుండెం గొల్వుకూటంబునన్.

75


క.

ఇనుఁ డుదయాద్రింబలె న,య్యినుఁ డమ్మణిపీఠి మెఱసి యేమని చెప్పం
దనయుల ననయులఁ జెంతం, గనుఁగొని నిశ్వాసవీచికలు గడలెత్తన్.

76


క.

చిత్తమునఁ బొగిలి యిట్లను, విత్తము ప్రాభవ మసద్వివేకము వయసా
పత్తిదము లొకఁడొకం డొ, క్కెత్తున నన్నియును గలుగు నేమని చెప్పన్.

77


క.

లేదఁట పాండిక్యము చవి, గాదఁట ధర్మం బదేటికానుపుదాఁ జూల్
గాదఁట యేనాఁడును బా, లీదఁట యాధేను వేరి కేలా యేలన్.

78


క.

సుకృతంబున గాంచు నొకా, నొకఁడు భయవిభూతికాంక్ష నుత్తము నతిపా
తకునకు లేఁడైన గులాం, తకుఁడుదెవులు విషమువంటి తనయుఁడు పుట్టున్.

79


మ.

పరమైకాంతికవాస మిష్టము ప్రియావంధ్యాత్వ మామోదసం
భరలాభంబు ఋతూచితాభిగమనప్రారంభవైముఖ్యమా
పరితోషం బబలాసుతాప్తి దగు గర్భస్రావ మొప్పు న్వపుః
పురుషత్వచ్యుతిపుత్రుఁ డుత్తమగుణాంభోరాశి లేకుండినన్.

80


ఉ.

కావున దుస్స్వభావమదగర్వవికారుల మత్కుమారులం
గేవలనీతిబోధమునఁ గీర్తితమూర్తులఁ జేయువాఁడు లేఁ
డే విమలాత్ముఁ డొక్కఁ డని డెందమునం దలపోయ నద్ధరి
త్రీవిభుఁ జూచి యొక్క జగతీసురపుంగవుఁ డాసభాస్థలిన్.

81


వ.

అధీతనీతిశాస్త్రమర్ముం డగు విష్ణుశర్ముం డనునతండు బృహస్పతియునుంబోలెఁ దేజరి
ల్లుచు దక్షిణహస్తం బెత్తి యిలాప్రియదర్శకుం డగుసుదర్శనున కుదారస్వరంబున
నిట్లనియె.

82


క.

పరిసముచేతను లోహో, త్కరములఁ గాంచనముఁ జేయుగతి మద్బోధా
చరణమున మీకుమారుల, గురుకీర్తీనీతిపారగులఁ గావింతున్.

83


చ.

ఇది నిజ మిందు కాఱునెల లిమ్మెడమి ట్లొనరింపకున్న నీ
వదఁ బదమూన కేను వనవాస మొనర్చెద నన్న రాజు స
మ్మదము వహించి యోవిమలమానస యంతటివానిఁగా నెఱుం
గుదు నిను వీరి ముద్దుకొడుకు ల్నయవేదులఁ జేయు మేర్పడన్.

84


వ.

అని సమర్పించినం గైకొని విష్ణుశర్ముం డక్కు మారులకొఱకుఁ దంత్రంబు లయిదు
కల్పించి కథాద్వారంబున నీతి గ్రహింపంజేయువాఁ డయ్యె నత్తంత్రనామంబు

లెయ్యవి యనిన మిత్రభేదంబును సుహృల్లాభంబును సంధివిగ్రహంబును లబ్ధనా
శంబును నసంప్రేక్ష్యకారిత్వంబును బొగడ నెగడు నందు మిత్రభేదం బారం
భించి రాజకుమారుల కతం డిట్లని చెప్పందొణంగె.

85


క.

సాహంకృతి బహుమృగకో, లాహలహలహళికవనతలంబున నొకనాఁ
డాహా కేసరివృషభ, స్నేహం బొకజంబుకంబుచే వీడ్వడియెన్.

86


క.

నా విని రాజమారకు, లావిప్రునిఁ జూచి పలికి రనఘా వృషదం
తావళశాత్రవసఖ్యం, బేవిధమున నక్క చెఱిచె నెఱిఁగింపఁగదే.

87


క.

అన నతఁ డిట్లను దక్షిణ, మున మహిళానామనగరమున నీతికళా
వనరాశి వర్ధమానుం, డన వర్తకుఁ డొకఁడు మెఱయు నతఁడు నిజాత్మన్.

88


వ.

ఇ ట్లని విచారించె.

89


ఉ.

కొంచకలేనిచోఁ బసిఁడిఁ గూర్చుట కూర్చినకాంచనంబు ర
క్షించుట రక్షితత్వ మడఁగింపక సొంపెసగం బ్రవృద్ధి నొం
దించుట దాని నేమరక తీర్థముఖప్రతిపాదితంబు గా
వించుట లెస్స నీతి రసవేదులకుం బలుమాట లేటికిన్.

90


క.

పాలింపనిసిరి చోరుల, పాలగుఁ జెడుఁ గూర్పగూడఁబడిన నిజస్వం
బీలేమి నిష్ప్రయోజన, మౌ లేమియ కలిగియున్న నతిలోభులకున్.

91


క.

పరికల్పితసస్యవనం, పరకుఁ దటాకోదకంబువలె గూర్పం జే
కుఱినసిరి యర్థులకు నిడు, కొఱకుఁ గదా యనుచుఁ దలఁచుకొని యత్నమునన్.

92


క.

ఆవణిజుఁడు నందకసం, జీవకనామముల నుల్లసిలువృషముల నా
నావిధవస్తుధురంధర, మై వెలసినబండిఁ బూన్చి యనుజీవులతోన్.

93


క.

ఘనధర్మకర్మసాధన, ధనసంగ్రహబుద్ధిఁదావు దలరి పురంబుల్
జనపదములు గడచి యశో, ధన ధనదాశాభిముఖతఁ దడయక యేగెన్.

94


ఉ.

ఆవిధి నేగి యొక్కభయదాటవిలో విషమస్థలంబునం
బోవఁగ వస్తుభృచ్ఛకటభూరిభరంబునఁ బోవ నందు సం
జీవకజానుదేశ మవిసెం బవిసందితశైలశృంగమో
నావడిఁ గ్రమ్మ రక్తమదనన్రొదపో నటు నేలఁగూలినన్.

95


క.

కొదవపడియెఁ బని యనుచు, న్మది జాలిం దూలి వర్ధమానుఁడు దానిన్
వదనుండి మనుచునందుల, కు దయాపరతంత్రుఁ డగుచుఁ గొందఱ నిలిపెన్.

96


క.

నిలిపి శకటమున నొండొక, బలవద్వృషభము నమర్చి పథమున నవ్యా
కులమానసుఁడై చనియె, న్గలవారలపనికి సేగిగలదే పుడమిన్.

97

ఉ.

కావ నియుక్తులై యచటఁ గాల్కొనియున్నభటు ల్మతంగజ
గ్రావచరత్తరక్షుభయకంపితులై యటఁబోయి చచ్చె సం
జీవకుఁ డంచు నేలికకుఁ జెప్పిరి చెప్పిన నమ్మువారుగా
కావాల నెవ్వరైనఁ గపటాత్ములచిత్తముఁ జొచ్చి చూచిరే.

98


క.

భీషణవనమున నాయు, శ్శేషవిశేషమునఁ గుళ్ళి చివుకక యచ్చో
నీషద్రుజలేకమహా, ఘోషవృషంబునకు నిరవుకొని కాల్వచ్చెన్.

99


వ.

స్వచ్ఛందాహారాదిలాభంబుల హృష్టపుష్టారిగంబున నై యాశాక్వరప్రకరంబు
యమునాప్రాంతకాంతాకంరంబువంనం గ్రుమ్మరుచుండె నక్కాలంబున.

100


చ.

కరటులమేల్మదం బణంచి కర్కశవంచకధూర్తకృత్యము
ల్సెఱిచి పరోగ్రఖడ్గపటలి న్నెఱవాఁడికిఁ బాపి క్రొవ్వునం
గుఱువులునావారుకంటకులఁ గొండగపుల్సొరఁ బోలి పౌరుషం
బఱిముఱి గ్రాలఁ బింగళకుఁడ న్మృగరాజు చరించు నచ్చటన్.

101


క.

హరికి మృగరాజ్య మెవ్వరు, కరుణించిరి తనకు దాన కాదా వరకుం
జరభంజనునకు జలనిధి, కురువిక్రమవైభవునకు నొక రీవలెనే.

102


క.

ఆకంఠీరవము పిపా, సాకలుషితహృదయ మగుచు సలిలాశన్ స
త్వాక్తీర్ణంబగుకాళిం, దీకచ్ఛంబునకు ద్రుతగతిం జనుచుండెన్.

103


వ.

అప్పు డననుభూతపూర్వంబై యకాలప్రళయజలధరగర్జితంబునుంబోని యఖండసం
జీవకగర్జనంబు పరిసరధరావరదరిద్వారంబులం బ్రతిధ్వానంబులం బుట్టించిన నాక
ర్ణించి యశనిపాతకంపితంబగు నీహారాహర్యశృంగంబునుంబోలె సింగంబు వికలి
తాంతరంగంబై నిలువంబడి యిది యేమిటిది యొక్కో యిద్దిక్కున నేమియొకో
యనుచు మందగతిం జనుచుండె నంత నంతయుం గని దమనకుండు కరటకున కిట్ల
నియె.

104


ఉ.

ఈవడఁజల్లు నెండ గళ మెండ నఖండతరత్వరం బురో
భూవనదుర్గమార్గరవిపుత్రికిఁ బోయెడురాజు వెల్వెలం
బోవుమొగంబుతో నిపుడు పుల్గుఱితోఁ జనుఠేవ మెత్తఁగాఁ
బోవఁదొడంగె నేమిగతమో గతమోహయెఱుంగఁ జెప్పవే.

105


క.

అనిదంపూర్వపరాక్రమ, ధనుఁడ సుహృత్కుంజరముల దారుణమద మే
ర్చినయీతఁ డివ్విధంబునఁ, జన ననఘా యిప్పు డేమి చందమొ యనుడున్.

106


క.

కరటకుఁ డిట్లను మన కీ, తెరు వేటికి నుచితవృత్తి తెరువెఱుఁగనియ
న్నరుఁడు సెడుం భగ్నారస, తరుకీలంబూడ్చి తెగినతరుచరుభంగిన్.

107

క.

నా విని కరటకునకు నయ, కోవిదుఁ డిట్లనియె దమనకుఁడు నీతికళా
శేవధి యాకథ యెటు సెపుమా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

108


చ.

మితరహితారిమండలసమిజ్జయయుజ్జయినీపురంబున
న్వితతవిలాససంభ్రమణవిశ్రుతవిశ్రుతనామిటారి యా
యతనుకటారి కర్కశకుచాంగజితప్రకటారి నృత్తనం
దితశకటారి వారసుదతీమణి యోర్తు నటించు నున్నతిన్.

109


క.

రాగరుచి గలుగుదెస నల, భోగిని మయిమఱుపుఁ డిగిచి పొడితెమ్మర తృ
ష్ణాగతి దరలింపఁగ సం, భోగం బొసఁగుం భుజంగపుంగవతతికిన్.

110


చ.

దినముదినంబు నిద్ర కరుదెంచిన వేడుకకానిగుండె ఝ
ల్లన జననిప్రయత్నమున నచ్చెలి వేఁకువ మేలు కాంచి మ
జ్జనవిధిఁ దీర్చి సొమ్ములిడి చందనపుందళుకొంద జాళువా
పని నునుగాసెయు న్మెఱయఁ బార్వతిసేవకు బోవు ఠీవితోన్.

111


ఉ.

ఆసఖి చూపుఁ దూఁపుగము లంగకములం దెరలింప నాసనో
పాసనబాసన ల్గుదిసి పావనభావనధావనంబుల
న్నోసరిలంగ రాఁబడినయోగముఁ ద్యాగము సేసి దీర్ఘని
శ్వాసము నించు శీధుసరసాధరజాతహనించుఁ జూచుచున్.

112


చ.

చెలి నెఱఠీవి దేవిగుడి సేవకు వచ్చినవేళ వీటిలో
గలిగినకోడెకాండ్రు సిరిగందము కప్పుర మంబరంబు కుం
చెలు ఘృతము ల్సితంబు విరిచెండులు పండులు కాసు లిత్తు ర
చ్చలిమలపట్టి కొక్కదివసంబును రా రదికాక తక్కినన్.

113


నిలివెడువిత్త మిత్తునని నీతికిఁ బాసినఁ గాని పూని య
చ్చెలి కలనేనియు న్చిలుపుఁ జెప్పెద నీతికిఁ దుచ్ఛజాతికిన్
బలితునకున్ విచారపరిపాకవిమూఢునకుం దురుక్తికిం
బలునకు రోగికిం దురభిమానికి దానికి మద్యపానికిన్.

114


మ.

ప్రవసీభూతభుజంగజీవ యలరూపాజీవ దాక్షాయణీ
భవనక్షోణి నటించు షోడశఘటీపర్యంత మంతంత మూఁ
డవయామంబున నొక్కనాఁడు ముకుచాయం దివ్వెటీ ల్గొల్చిరా
నవధానంబున నింటిద్రోవఁ గలహంసానూనయానంబునన్.

115


క.

నడతెంచుచుఁ ద్రోవ బడ, ల్పడఁద్రొక్కిన నెగసి యోరబాగయిఫణమే
ర్పడ నచ్చెరువుగా నచ్చెలి, కడకా లొకత్రాఁచుబాము గడఁకం గఱిచెన్.

116

క.

తాలువుల న్లాలాకీ, లాలంబులు చెమ్మగింప లగ్నక్ష్వేళా
జ్వాలం దూలి శతుక్రతు, నీలతమోనీలవాల నేలం గూలెన్.

117


వ.

అట్లు విషధరవిషంబునం గ్రాఁగి కూలినకూతుం గని శోకించి నిమిషంబు నుండక.

118


చ.

ధనికులు గాన దానితలిదండ్రులు జాలెలు చించి యర్ధకాం
చనము లవారి గాఁగ వెదచల్లి వసుంధర పేరుకీర్తియుం
గని మనువారలం బరమగారుడమంత్రకులం బొరింబొరిం
గొనిచనుదేర వార లలికుంతలచెంతలఁ జేరి నేర్పునన్.

119


సీ.

కాటుపట్టున గత్తివాటులు వైచి నిర్విషమూఁది మనకున్న విసివె నొకఁడు
ఘటపూర్ణమంత్రపుష్కరధార లెత్తించి గుణము గానక రోసి గునిసె నొకఁడు
కలితంబుఁగను దోయిఁ గదియించి బ్రదికించుద్రోవ దుర్ఘటమైనఁ దొలఁగె నొకఁడు
పసరు నెన్నడునెత్తిఁ బ్రామి బెత్తమున నిట్టటు మోఁది పనికిరా కరిగె నొకఁడు


తే.

కదియఁబడియున్నదౌడలఁ గాఱు జొనిపి, పాయఁబడఁజేసి తగుపాటి పలుచనైన
యౌషధీసారములఁ బోసి యవియు లావు, సేయకుండిన నొకఁడు లజ్జించి చనియె.

120


క.

అప్పాట విషచికిత్సకు, లొప్పనివదనములతోడ నొండెవ్వరికిం
జెప్పక వచ్చిన చొప్పునఁ, దప్పక పోవుటయు నాసుదతితలిదండ్రుల్.

121


ఉ.

కాంచనపుత్రి నెత్తుకొని క్రమ్మఱిపోయి శివానివాసముం
దుంచి నమస్కరించి యడలూఱఁగ నిట్లని విన్నవించి రో
పంచముఖప్రియా పడుచుప్రాణము వచ్చిన మంటపంబుఁ గ
ట్టించెదమమ్మ నిన్నుఁ బురుడింపగలేరు గదమ్మ వేలుపుల్.

122


చ.

తరువు గదమ్మ మామనవి తావకపాదయుగంబు దేవతా
తరువు గదమ్మ యీపడుచు దక్కకపోయినఁ గన్నమాకు ను
త్తరువు గదమ్మ నీవరువుదానికి నిట్టియవస్థ వచ్చు ట
చ్చెరువు గదమ్మ మమ్ము దరిఁ జేరుపుమమ్మ త్రిలోకమాతృకా.

123


చ.

అని తనువేఁడి పాడి నెగులారక వారకయేడ్చువారలం
గని గిరిజాతజాత సుముఖత్వమున న్గడకంటిచూడ్కిఁ జూ
చిన నపు డేమి చెప్ప నటఁ జేడియ నిర్విషయౌచు నిద్రమే
ల్కనినవిధంబున న్దెలిసి కౌతుకసంపదఁ దేల్చె నాప్తులన్.

124


క.

దేవీవరమహిమంబున, జీవిత యగుపుత్రిఁ గొనుచు గృహమున కానం
దావిలలీలం జని రా, జీవేక్షణ కిడినమ్రొక్కు చెల్లించుటకున్.

125


గీ.

అల్ల నర్తకదంపతు లతులమతులఁ, బవనభుగ్భూషగృహిగృహప్రాంతమునకు

నవనిజంబుల దెప్పించి రందులోన, స్థూలతరుకీలమగు నొక్కదూల మమరు.

126


ఉ.

ఆనగరోపకంఠవనికావనజాతలతాచరన్మహా
వానరయూధ ముద్దవడి వచ్చి యొకానొకవేళ దారుణే
చ్ఛానటనం బొనర్ప రభసంబున నందొకక్రోఁతి యంత నా
హా నన లాఘవంబునఁ గృతాంతవశంబున దూల మెక్కుచున్.

127


క.

వాలం బల్లార్చుచు నిరు, గేలం బిగియారఁ బట్టి కీలము వడి ను
న్మూలింప నిఱికికొనియె, న్వ్రీలిన యద్దారు వుద్దవిడి ముష్కములున్.

128


క.

ఇఱికిన వివృతాస్యంబై, యెఱలుచుఁ బొరలు న్వడంకు నులుకుఁదలంకున్
మరలుం బడు లేచుం గపి, యురిఁ దనిలినపులుఁగువోలె నుడుగనియలఁతన్.

129


క.

ఫ్లవగం బ ట్లలమఱి మే, ననశం బగుటయుఁ ద్యజించె నసువుల నుచిత
వ్యవహారక్రియఁ దెలియని, యవివేకికిఁ జేబు వొందదా యెందైనన్.

130


క.

హరిభుక్తశేషతరసం, బిరువురకుం గలదు చాలు నీపాటివృథా
పరచింత లేటి కన విని, గురుమాయాశాలి దమనకుం డిట్లనియెన్.

131


క.

తనవారిఁ బ్రోచుటకు నొం, టనివారి వధించి వైచుటకుఁగా నృపులం
బనివడి కొలుచుట లే కె, వ్వని కెద్దడి వుట్టె నన్నవస్త్రంబులకున్.

132


చ.

అతివిరసత్వసత్వకుణపాదికపారణసారమేయ మూ
ర్జితజఠరాగ్ని శాంతి యొనరించు సముచ్ఛ్రయకృఛ్రసంకుల
స్థితి వెగడందియు న్వెదకి సింహము మత్తకరిం భుజించు నే
గతుల బలానురూపఫలకాంక్షులుగా ధర నెట్టివారలున్.

133


చ.

అనుగతియుం గటీచలన మగ్రపదభ్రమణంబు వాలచా
లనమును భుక్తశేషకబళప్రదుఁ గూర్చి యొనర్చు వేఁపి చ
య్యన బుధసాంత్వనోక్తి శతకాయుతసంఖ్యలఁ గానిభుక్తికిం
దనకరమీదు కుంజరంతంసము నెట్టన నెట్టకేలకున్.

134


క.

తను లోకు లభినుతింపఁగ, మనఁగలిగిన మనికి నిమిషమాత్రమె చాలుం
దనివిసనం బ్రేతాన్నముఁ, దిని యూరం గాకి బ్రతుకదే వేయేఁడుల్.

135


క.

ఘనవిద్యావిక్రమజం, బనఘుండై కుడుచు నెవ్వఁ డతనిదివో భో
జనము పశుశిశుఖురంబు, ల్దిను గౌలేయకము దానిదియుఁ గుడుపగునే.

136


క.

అల్పమున నిండు శశపద, మల్పంబున నిండు మూషకాంజలి కుఱు పెం
చల్పమున నిండు గుపురుషుఁ, డల్పమునం బూర్ణుఁడగు మహాత్ముఁడు గామిన్.

137


క.

శ్రుతిశాస్త్రప్రకరబహి, ష్కృతము నయానయవివేకరిక్తము కుక్షి

స్థితిజాగరూక మేయున్నతిఁ జెపుమా మనుజపశువునకుఁ బశువునకున్.

138


క.

కసవు దినుఁ గూడు దెమ్మని, కసరదు బరు విడిన మోయుఁ గర్శనమునకున్
విసువదు మారొడ్డాడదు, పసరమునకు సరియె మనుజపశు వెప్పటికిన్.

139


క.

అన విని కరటకుఁ డతని, న్గనుఁగొని యిట్లనియె దమనకా విభునకు గ
ల్గినదండనాథులము దగ, మన కీవ్యాపార మనభిమత ముడుగదగున్.

140


వ.

అనిన దమనకుండు.

141


క.

పరమస్వతంత్రులయి భూ, వరుసన్నిధి మంత్రు లుండవలె నమ్మంత్రుల్
పరతంత్రు లయినఁ గలవే, పురుషార్ధము గౌరవము బ్రభుత్వము యశమున్.

142


క.

గ్రావాగ్రమునకు భూరి, గ్రావం బెక్కింప భరము గా దది ధరకున్
ద్రోవఁ బ్రయాసమె యున్నతి, కైవలెబా టధమవృత్తి కది యేమిటికిన్.

143


క.

తనకున్ హృదయము వశమై, యనుచరుచందమున నుండు నది యేమియొకో
మనుజుఁడు గౌరవ మొల్లక, ఘనలాఘవదంశితుండుగా నీక్షించున్.

144


క.

అని చెప్పి మఱియు గరటకుఁ, గనుఁగొని దమనకుఁడు బలికెఁ గంటే పంచా
ననసార్వభౌమునకు నా, ననమొప్ప దిదేమికారణము నేఁ డనుచున్.

145


క.

అది విని కంటకుఁడు మదిం, గదిరిన యచ్చెరువున న్మొగము జూచి యహో
యిది నీ వేతెఱగున నెఱుఁ, గుదు వన నాయనకు దమనకుం డిట్లనియెన్.

146


మ.

మతి నే నిచ్చినఁ గాని లేదు చన దాత్మశ్లాఘనామానసం
బితరాకారవిచేష్టితార్థముల నూహించు న్ధరిత్రిం బశు
ప్రతతు ల్నేర్చు నుదీరితార్థముల దిక్ప్రఖ్యాతమేధాసమ
న్వితుఁడై వర్తిలు పండితుం డకట వానిం బోలఁడే చెప్పుమా.

147


క.

చతురుఁడుగనుఁ బతిచేష్టా, గతిఁ దెలిసితి ననిన నతఁడు కాఁగా నోస
మ్మతి గాదు నాకు సేవా, స్థితి నీ కెఱుకపడుఁ గుశలచిత్తములేమిన్.

148


వ.

అని కరటకుండు వలికిన దమనకుం డతని కిట్లనియె.

149


క.

భూషింప మెచ్చు లోకము, దూషింపం జంపఁజూచుఁ దుది నదె విద్వ
ద్భూషితుని నన్ను నేలా, దూషించితి వైన నేరుతుం బతిఁ గొల్వన్.

150


క.

నృపసంశ్రయమున నా కతి, నిపుణత యేవలన లేదు నీవ యనియెదో
యిపు డెవ్వరేని శత్రుం, తప యోరిమిలేక యనియెదరొ ననుఁ జెపుమా.

151


క.

అను దమనకునాననము, న్గనుఁగొని కరటకుఁడు పలికెఁ గాదా మును నీ
వనవసరంబునఁ జనవో, కినుక న్నిను విభుఁడు గోపగింపఁడొ నెరయన్.

152


సీ.

ఆఁకొని భుజియింప నరుగువేళ నొకింత యొడలికి నుపఘాత మొదవినపుడు

భూరినిద్రాధరంబున సోలునెడఁ గులస్త్రీలతో నలిగి విచ్చేసినతఱి
రతికి నువ్విళ్ళూఱుగతి శరక్షతుఁడైన యవసరంబున వేఁట లాడి యలసి
ధరణీరుహచ్ఛాయ లరయుచోటఁ బిపాస సలిల మన్వేషించుసమయమునను


తే.

మజ్జనంబాడుపట్టున మౌననియతి, నర్థమీలితలోచనుండై పురాణ
పురుషు ధ్యానించునక్కాలమున నృపాలుఁ, జేరరాదండ్రు తద్జ్ఞులు సేవకులకు.

153


క.

మఱచితివే యన దమనకుఁ, డెఱుఁగుదునను జీవధర్మ మిట్టిద భటుఁ డే
తెఱఁగుననేనియు నరవరు, కుఱఁగట రేపగలు గాచి కొలువఁగవలయున్.

154


క.

అతికంటకుఁడైన విసం, గతుఁడైన గుజాతుఁడైనఁ గానీ లతలున్
సతులు ధరిత్రీపతులం, జితవైరీ యల్లికొండ్రు చేరువనున్నన్.

155


క.

కోపప్రసాదచిత్త, వ్యాపారము లెఱిఁగి కొలిచి వర్తిల్లుభటుల్
భూపాలబాహుశాఖా, రోపితులై యుంద్రు చనవు రొక్కం బగుటన్.

156


క.

అన విని కరటకుఁడు దదా, ననము నిరీక్షించి పలికె నయతత్వనిధీ
వినవలతు నాదరంబునఁ, దన కిఁక నీ వేమి చెప్పెదవు తరువాతన్.

157


క.

విత్తున విత్తుంబలెఁ బ్ర, త్యుత్తర ముత్తరమువలన నుదయించు భవ
చ్చిత్తము నీతికళాసం, పత్తికిఁ బుట్ట్నిల్లు గాదె పరికింపంగాన్.

158


వ.

అను కరటకుపలుకు లాకర్ణించి యతం డిట్లను నీతిపోషణంబులు దుఃఖశోషణం
బులు గావె భవద్భాషణంబులు నప్రాప్తకాలవచనం బెవ్వరికి నశుభంబుఁ జేయదు.

159


క.

చతురలవలె నృపసేవా, వ్రతులకు నప్రాప్తకాలవచనంబు బృహ
స్పతియంతవాఁడు బలికినఁ, బ్రతివీరధ్వంసి హాస్యపదనిరతుఁ డగున్.

160


వ.

కావున దేశకాలేంద్రియపరిపక్వంబు లెఱింగి యుచితజ్ఞుఁ డగునతండు విన్నపంబు
చేసికొని నిజప్రయోజనం బీడేర్చుకొనుచు.

161


క.

తన కేవిద్యాభ్యాసం, బున ముఖ్యఖ్యాతిలాభములు సిద్ధించున్
ఘనతరముగఁ గులపురుషుం, డనఘుండయి నేరవలయు నాసద్విద్యన్.

162


క.

కలగుణరూపప్రజ్ఞా, బలములచే నేమి వానిఁ బ్రకటింపరు భూ
తలపతులు సములు విషములు, దలపోయ నఖర్వపర్వతంబులభంగిన్.

163


క.

కావున నవనీవల్లభు, లేవిధమున నుండి రేమిహితబుద్ధి న్సే
వావృత్తి నూది వర్తిలఁ, గావలయు న్భటుల కనినఁ గరటకుఁ డంతన్.

164


క.

అగు నగుఁ బోపొ మ్మప్పని, మొగమునను న్నాఁడు రాజుమ్రోలకు చేర్చం
దగుతఱి మేలయ్యెడునో, సుగుణీ నీ కనిన నతఁడు సొం పెసలారన్.

165


చ.

మెలవునఁ జేరనేగి ప్రణమిల్లి వినీతత నిల్వఁజూచి పిం

గళకుఁడు వల్కె నోదమనకా చనుదెంచితి వేమి నావు డు
జ్వలమతి నాతఁ డిట్లను భవచ్ఛరణంబులఁ గొల్వవచ్చితి
న్గెలసము దీనికంటెఁ బరికింపఁగ నెయ్యది నాకుఁ జెప్పుమా.

166


క.

సచివకుమారుఁడ నగునా, కుచితములగుపనులు గలిగియుండుఁగదా నా
వచనము విన దేవరకును, రుచియగుఁగద కార్యతత్పరుఁడఁగద మొదలన్.

167


మ.

శ్రుతికండూయన రుక్ప్రశాంతి యొనరించుం దంతనిర్ఘర్షణ
స్థితికిం జాలునఖాగ్రభిన్నయవసచ్ఛేదంబు విశ్వంభరా
పతికార్యంబుల నప్రయోజకుఁడె ప్రాప్తజ్ఞానచాతుర్యశౌ
ర్యతతోపాయన యప్రియాలపనమేధాకారశీలుం డిలన్.

168


చ.

పరమశుచి న్సమిద్బలు నపారమహామహు నుత్సవక్రియా
స్థిరు నిరసించి క్రిందుపడఁజేసినఁ గ్రిందుపడంగనేర్చునే
కెరలి యొకప్పుడేని దలక్రిందుగఁబట్టిన నూర్థ్వకీలుఁడై
దరికొన కంబుసంభవుఁ డధశ్శిఖుఁ డై నశియింపనేర్పునే.

169


చ.

హలికుఁడు విత్తు చేయఁబడునప్పు డెఱుంగఁడు చాలు చక్కనై
తలకొసఁ జూచి మంచిదిగదా యనుఁ బిమ్మట నట్లు రాజు సొం
పలరఁగఁ గూర్చునప్పుడు భటాలి నెఱుంగఁడు ప్రస్తుతంబున
న్గెలసముఁ బూని నిల్వఁ బరికించుఁ బ్రయోజకుఁ డంచు నెంతయున్.

170


తే.

అతిశయస్థానయోగ్యు నీచాసనమున, నునుచువిశ్వంభరావల్లభునకు నింద
మస్తకోచితకోటీరమండనములఁ, గాళ్ళఁ దొడివినయమ్మర్త్యుఁ గఱటి యనరె.

171


ఆ.

అధమవృత్తి కధికు నమరించుపతి దిట్టుఁ, గుడుచుఁ గాదె యారకూటకటక
కలితమణికి నిందగాద పొనర్చిన, కుత్సితుండు నిందఁగుడుచుఁ గాని.

172


క.

శిరమున మకుటము రశనా, భరణము కటి నూపురంబు పదమునఁ బోలెన్
గురుబంధుభటుల నిల్ప న, మరు నుత్తమమధ్యమాధమస్థానములన్.

173


చ.

పురుషవిశేషలీల విరిబోఁడియు వాలువిపంచిశాస్త్రమున్
దురగము వాణియు న్నరుఁడు దొడ్డతనంబు వహింతు రట్ల కా
పురుషవిశేషలీల విరిబోడియు వాలువిపంచి శాస్త్రమం
దురగమువాణియు న్నరుఁడు దొడ్డతనంబు వహింప రుర్వరన్.

174


వ.

ఇది సృగాలమాత్రంబు దీనిచేత నేమి యని న న్నవజ్ఞ సేయకుము.

175


క.

హరిసూకరరూపంబున, హరిణాదిమృగాకృతుల మహర్షు లజంబయి
హరిసుతుఁడు పూజ్యులైయుం, డరె వారలగౌరనంబు గరిమపడియెనే.

176

వ.

అశక్తుండయిన భక్తుండును భక్తిలేని శక్తుండును నప్రయోజకులు ద్యాజ్యులు నేను
బరమభక్తుండ శక్తుండ నత్యాజ్యుండ నన్ను గౌరవము సేయుము.

177


చ.

పతి నయదూరుఁ డైన భటపంక్తియు నీతికిఁ బాయుఁ దత్ప్రధా
నత బుధు లుండరా బుధజనంబులులేమి నధర్మ మూర్జిత
స్థితిఁగను నయ్యధర్మమునఁ జేసి యఘంబులు పుట్టు వానిచే
నతులవిపద్దశ ల్వొడము నవ్విపదాయతి రాజ్యము న్జెడున్.

178


వ.

అని దమనకుండు పలికినఁ బింగళకుండు నతనిం బ్రసాదపురస్సరాలోకంబుల
నాలోకించి.

179


ఉ.

వాసికి వన్నెకుం దగినవాఁడవు రాజ్యము నీనయంబునం
చేసెదఁ గాదె నీ న్గడవ సేవకు లెవ్వరు నాకుఁ బెద్దవి
శ్వాసము నీయెడం గలదు శక్తుఁడు భక్తుఁడు నిన్నుఁ బోలఁ డో
హో సఖ విన్ననై వదన మొప్పక వచ్చితి వేమి చెప్పుమా.

180


క.

నావిని దమనకుఁ డను దే, వా విన్నపమొకటి వారివాంఛ న్వడిగా
బోవుచు నిలిచితి విదియే, లా విన్ననిమోముతోఁ గలంగినమతితోన్.

181


వ.

అనివిన్నవించిన దమనకునకుఁ బింగళకుఁ డిట్లనియె మచ్ఛరణ్యం బగునియ్యరణ్యం
బపూర్వసత్వాధిష్ఠితంబయి యున్నయది యట్లగుట చిత్తచాంచల్యంబుఁ బుట్టించు
టయు దానంజేసి యంగవైకల్య మావిర్భవించె నెట్లనిన విలయసమయసముజ్జృం
భమాణపుష్కలావర్తకవిధంబున శబ్దగ్రాహకంబులకు నధికతాపం బొనర్చుచున్న
యాది యద్దిక్కున నొక్కయపూర్వదుర్వారఘోషంబు వీతేర నాకర్ణించితి మంత్ర
ప్రతిబద్ధశ క్తి యగుఫణాధరంబువిధంబున స్రుక్కితి నీ వాకర్ణింప వొకో శబ్దాను
రూపబలమహత్త్వం బగుసత్వం బచ్చోటఁ గలిగియున్నది మదీయరాజ్యంబు
నాకు హాని వాటిల్లకుండునే యని నిట్టూర్పునించు నప్పంచాననునకు దమనకుం
డిట్లనియె.

182


క.

జలముల సేతువు బెడిదపుఁ, బలుకుల భీతుండు చెనటిపాడిం జాతిన్
జెలిమిరహస్య మొనర్పం, దలఁపనిపని చెడు నిగూఢతరమంత్రంబున్.

183


క.

నీతెరు వనిలచరన్మహి, జాతలతాఘాతభగ్నసంగరభేరీ
జాతరపశ్రవణమహా, జాతరహృజ్జీర్ణజంబుకముకథ యయ్యెన్.

184


క.

నావిని పింగళకుఁడు నయ, కోవిదు దమనకునిఁ జూచి గుణరత్నసము
ద్రా వినియెద నీకథఁ జెపు, మా వాచాపాటనం బమర నా కనుడున్.

185


క.

దమనకుఁ డిట్లను పరవి, క్రమవిక్రమసింహపురనికటవటకాంతా

రమున నొకనాఁడు గాఢ, క్రమమున నే నరిగి తిరుగఁగాఁ గట్టెదురన్.

186


ఉ.

జన్యము కాంతకుంతపరుషక్షతిపాతి బృహద్వపాళిరా
జన్యము హస్తిమస్తతరసక్షతజద్రనలుబ్ధదైత్యదౌ
ర్జన్యము భానుభేది ఘనసాహసపూజనరాజమానస
ర్జన్యముఁ జూపెఁ బర్యుషితసామజవిస్రసమేతవాతముల్.

187


చ.

కదన మొకింతచేర నరుగ న్విఱుగంబడి యున్నతేరులుం
బ్రిదిలుటలేనియేనుఁగులు బెంటలుగొన్న జిరాల్గురాలు పె
న్గదురుడివోనినెత్తురులు గాఢపుటెండలఁ గ్రాఁగి చిక్కనై
పొదలుమెదళ్లు నాంత్రములప్రోవులుఁ జూచి ప్రహృష్టమూర్తినై.

188


వ.

మఱియు నక్కలను సమున్నాళపుండరీకవ్యాకీర్ణం బగుటఁ గాసారంబును నఖం
డఫలకాండమండితం బగుట నారామంబును నమోఘప్రాసవిలాసం బగుటఁ గర్ణా
టకప్రబంధంబును ననంగవిహారయోగ్యం బగుట మధుమాసంబును దష్టకబంధ
వాహినీబంధురం బగుటం గ్రీష్మసమయంబును నవ్యక్తతారకప్యూహం బగుట నహ
ర్ముఖంబును బహుద్విజవిరాజమానం బగుట యాగంబును ననాత్మజ్ఞపారంపరీసం
పూర్ణం బగుట గంజానిలయంబును విభాగీకృతచరణంబు గావున శ్లోకపఠనంబును
గర్ణశల్యసైంధవభీష్మదుర్నిరీక్ష్యం బగుట సుయోధనాయోధనంబును బ్రయుక్తశక్తి
పాతనిర్ధూతధరాధిపప్రాగల్భ్యం బగుటఁ గుమారసమారంభంబును నవఖండమనో
హరం బయి యోషాభాషావిశేషంబును రసాభిసుప్తపురుషోత్తమంబై శరత్కాలం
బును ననుకరించె నప్పుడు.

189


క.

దూరప్రాణధురీణమ, హారణమున నేమి చెప్ప నాశ్చర్యకరం
బయిరోదసితో విను మొక, భేరీనినదంబు కర్ణపిశిత మగల్చెన్.

190


తే.

భయము దోడ్తోడ ముక్కునబంటి యయ్యెఁ, గెరలు జఠరాగ్ని గుములుచుఁ “గింకరోమి
యాగతోస్మిక్వయాస్యామి” యని యడలితిఁ, బలలపారణ కరుగంగఁ బాటుగామి.

191


ఉ.

ఎంచినభీతి మే న్వడక నే నొకయించుకసేఁపు బుద్ధి శం
కించి యిదేమి యొక్కొ పరికించెదఁగా కని చేరి ముందర
న్గాంచితి వాతపోతపరికంపితభూజలతాహతి న్దిశ
ల్సించురవంబు నీను నొకజీర్ణసమిద్దతభేరిఁ జేరువన్.

192


సీ.

కనుఁగొని చర్మసంగతదారువుగ నిశ్చయించి మెల్లన నంఘ్రు లిడుచు నరిగి

కదిసి తద్భేరీముఖము వ్రచ్చి లోపల నరయ నిర్మానుషమగుట మేను
పొదలఁ జేకుఱె మహాభోజనం బని చని వడి మేను మలఁచి నల్గడలు సూచి
కరటగృధ్రోలూకకంకాదుల శవామిషాదులఁ దోలి నే నాఢ్యలీల


తే.

దంతిపలల మశ్వతరసంబుశాక్వర, క్రవ్యముష్టమాంసఖండకాండ
మొలసి యున్న నరులపొలయును దిని గాఢ, కౌతుకమున నుంటిగాఁదె తొలుత.

193


వ.

రవశ్రవణమాత్రంబున నేమి తెలిసికొని నిర్భయుండ వగుము శబ్దం బేదిక్కున
నాకర్ణింపంబడియె నద్దిక్కువకు నన్ను౦ బనుపు మంతయుం దెలిసి వచ్చెద ననుట
యుఁ బింగళకుం డట్ల చేయుమనియె నట్లు నియుక్తుండై దమనకుండు సకలమృగ
సంచారఘోరం బగు యమునాప్రాంతకాంతారంబున కరిగి పురోభాగంబున.

194


ఉ.

చేపఁ జిగుర్చుశృంగములు శృంగములం బ్రకటింపు భూరిశో
భావిహనైకపాదములు పాదముల న్దలఁపింప జంగమ
గ్రావముభంగి భానుభవకచ్ఛమున న్విహరించువాని సం
జీవకుఁ గాంచి మ్రొక్కి నిలిచె న్మృగధూర్తకుమారుఁ డయ్యెడన్.

195


వ.

అట్లు వినీతత్వంబు నెరపి కైవారంబు సేసి యతనిచేత నాగమనకార్యం బడుగం
బడినవాఁడై.

196


చ.

హృదయము పల్లవింప నతఁ డిట్లను నెంతయు సమ్మదంబునం
బొదలుచు నీసమాగమము పూర్వము నీ కెనయైనవానితోఁ
గదిసి యఖండసఖ్యమునఁ గాల మతీతముగా నొనర్ప కి
న్నదిదరి నొంటి నుండఁదగునా మృగనాథులు లేరె మైత్రికిన్.

197


చ.

అనఘచరిత్ర పింగళకుఁడ న్మృగరా జిటనుండు నమ్మహా
ఘనుని ప్రధాననందనునిఁగా నను బుద్ధి నెఱుంగు నీకు నా
యనకు ఘటింతు మైత్రి సమయం బిదె న న్బనిఁగొమ్ము మారుతం
బనలము గూడినట్లయగు నాతఁడు నీవును జెల్మి సేసినన్.

198


క.

అన విని దమనకునిఁ గనుం, గొని సంజీవకుఁడు వలికె గొబ్బున మరలం
జని చెలిమి సేయుమా మా, కనుకూలత మెఱయ మామృగాధిపుతోడన్.

199


క.

పొమ్మన నెమ్మన మలరం, గ్రమ్మఱ మృగధూర్తకులశిఖామణి చింతా
సమ్మూర్ఛితాకృతిం బడి, నమ్మేర న్గాంచి వినతుఁడై నిలుచున్నన్.

200


క.

కనుఁగొని పింగళకుం డి, ట్లను సనయా మంత్రితనయ యచ్చోటికి నా
యనుమతిఁ గైకొని పోయిన, పని యేమి యొనర్చి తనినఁ బలికె నతండున్.

201


క.

పొనసొనఁ గానకు దేవర, పనుపునఁ జని యచటఁ గంటిఁ బ్రళయాంతరట

ద్ఘననినదు గోత్రగిరినిభ, తనునభ్రంకషవిషాణధరుఁ గట్టెదురన్.

202


వ.

భవత్కర్ణశూలాయమానం బగునప్పటికయంకరధ్వానంబు నిన్ను నుద్దేశించి చేయు
టగా నెఱుంగుము.

203


క.

అలఁతులఁ బొరిఁగొనరు మహా, బలు లాహా ఘనులఁగాని పవమానుఁ డిలం
బిలువెఱుకునె బహుశాఖా, కులగగనస్పందివృక్షకోటులుదక్కన్.

204


క.

ఈదృశబలవంతుని నీ, పాదముల కుపాయనంబుఁ బట్టెద లేదా
నాదెస నిచ్చన నిర్మ, ర్యాదప్రేమమున సింహ మాతని కనియెన్.

205


క.

నీ వనఁగ నంతవాఁడవె, కావా సంరాణభిదురఘాతంబున ధై
ర్యాళి నగల్చిన యబ్బలిఁ, దే వేగమె యనిన నతఁడు దెచ్చె న్వచ్చెన్.

206


క.

వచ్చిన సంజీవకునకుఁ, బొచ్చెము లే కలమృగాధిపుఁడు సౌహార్ద్రం
బచ్చుపడ నెదురుసని కొని, తెచ్చి సద్భక్షాసనప్రతిష్ఠితుఁ జేసెన్.

207


తే.

తనువుఁ బ్రాణంబు విరియును దావి భానుఁ, డాతపముఁబోలె నలమృగాధ్యక్షుఁ డతఁడు
పాలునీరును గూడిన పగిది నుండి, రతిశయస్నేహమునను నయ్యడవిలోన.

208


వ.

ఇట్లు పింగళక సంజీవకు లన్యోన్యప్రసన్నస్నేహప్రవర్థమానులయి యొరుల కవ
కాశం బీక యేకగ్రీవం బయియుండ ననుజీవులు పొలపెట్టులేక యాఁకట నారట
నొంది యెందేనియుం బోవ దానదిపడిన నచ్చెట్టకువంతం జింతిలి దమనకుండు కర
టకుఁ జేరంబోయి నిట్టూర్పు నిగిడించి తలవంచుకొనిన నతం డతని నాలోకించి.

209


చ.

దమనక యోపలేననిన దప్పునె యిప్పెనుజెట్ట నీనిమి
త్తమున జనించెగాదె పతిదండకు ని న్నొరు లేగుమంచు హ
స్తముఁ దెమలించిరో కుడిచి సమ్మతినుండఁగ దైవ మిచ్చునే
సమకొని వీరి కిద్దఱికి సఖ్యము సేయకయున్న సాగదే.

210


ఉ.

యెవ్వ రెటుండి రేమి మన కేమి ప్రయోజన మంచు మున్ను నే
నవ్వలఁ జూటిమోపి పతి నారయునప్పుడు నీకుఁ జెప్పనే
యవ్వచనంబు లిప్పుడు యథార్థము లాయెగదా భుజించువా
రెవ్వరు నీవెకాక మఱి యేమనలేక స్వయంకృతాగమున్.

211


క.

చేసినయంతయుఁ దడయక, చేసేతం గుడువుమనినఁ జింతానలకీ
లాసంతాపితుఁడై మే, ధాసంగతుఁ డతనిఁ జూచి దమనకుఁ డనియెన్.

212


క.

కృతికేతరవచనంబుల, గతి నీపలుకులు యథార్థకథనంబులు నా
కతమున నకటా యీదు, స్థితి పుట్టెం దీని కేమి సేయఁగవచ్చున్.

213


ఉ.

ఈతఱి నక్క వెక్కసపుటేఁడికకయ్యముచేతఁ దొల్లి చే

సేతఁ బరిగ్రహించి యతిశిష్యునిచే నొకనేఁతకానిచే
దూతిక నొచ్చె నాత్మకృతదోషమున న్గద నావు డుల్లస
క్కౌతుకవల్లి పల్లటిలఁగా నతఁ డాతనిఁ జూచి యిట్లనున్.

214


క.

అది యెట్లు విస్తరింపం, గదె యాకర్ణింతు సకలగాథాబోధా
స్పదహృదయ యనుడు వికస, ద్వదనుండై కరటకునకు దమనకుఁ డనియెన్.

215


క.

యువనాశ్వనగరమునఁ గే, శవశర్మ యనఁగ నొక్కసన్యాసి మఠం
బవలంబించి యశిష్య, ప్రవరుండై యుండె భైక్ష్యభక్షకుఁ డగుచున్.

216


క.

కల దాసన్యాసికి బహు, కలధౌతసువర్ణపూర్ణకంధస దాయ
బ్బలుగుయతి మరపు మోసము, గలనేనియు లేక దానిఁ గని రక్షించున్.

217


తే.

స్నాన మొనరించునప్పుడు జపము సేయు, నపుడు కఠపాత్రమున భిక్ష మడుగునపుడు
పండునపుడును బొంతపై నుండు మనసు, బీదగఱచినబూరె యబ్భిక్షునకును.

218


క.

చిరకాల మివ్విధంబున, నరిగిన నాషాడభూతి యను ధూర్తధరా
మరసుతుఁడు సేరి కంధా, హరణేచ్ఛ న్యతికి శిష్యుఁడై సేవించెన్.

219


ఉ.

ఆయతి యొక్కనాఁ డొకగృహంబునకుం దగ భిక్ష చేసి రా
బోయిన వాఁడు వెంబడినె పోయి భుజించి మఠంబుఁ జేరి యా
చాయ నిజోత్తరీయపరిషక్తతృణాగ్రము గాంచిపట్టి నా
రాయణ కృష్ణయంచు గురుఁ డద్భుతమందఁగ మ్రొక్కి నెవ్వగన్.

220


క.

వెలవెలనిమోముతో మఱి, యెలుఁగొందఁగ గురునిఁ జూచి యెవ్వరి కెందుం
గలుగనికలుషము నా కిదె, గలిగె నయో యెట్టిపాపకర్ముఁడ నొక్కో.

221


క.

అని మడమలు మోపక నడిఁ, జని కపటవిచారశీలుఁ జపలాత్ముని శి
ష్యునిఁ దిరుగఁ బిల్చి మదిఁ గీ, ల్కొనినమహాద్భుతముతోడ గురుఁ డి ట్లనియెన్.

222


క.

నిను నేకలుషము వొదివెన్, జనఁ కారణ మేమి సరభసంబున నాతో
వినిపింపు మనినఁ దత్పద, వనజంబుల వ్రాలి యతికి వాఁ డిట్లనియెన్.

223


క.

గురునాథ నిన్ను భిక్షా, గరిమంబునఁ జాలఁ దృప్తుఁ గావించినభూ
సురునింటిపూరి వసనో, పరి దవిలెం దీనికంటెఁ బాపము గలదే.

224


గీ.

మగుడి నీపూరిపుడకఁ దన్మందిరమునఁ, గూర్చి క్రమ్మఱ నిష్పాతకుండ నగుచు
వచ్చి సేవింతుఁ ద్వత్పాదవనరుహముల, భక్తి నామీఁద గలదేనిఁ బనుపు మటకు.

225


క.

పావనుఁడఁ గాక యేవిధి, సేవించెద నిన్ను నోవిశేషవిధిజ్ఞా
నావుడు యతి విస్మయసం, భావితుఁడై వానిఁ జూచి పలికెం బ్రీతిన్.

226


చ.

కలుషము లేదు పూరిపుడకన్ ధనమో కనకంబొ చీరలో

వల దటు పోవ నిల్వు మన వాఁడు కృతాంజలియై కనుంగవం
జలజల నశ్రువు ల్దొరుగ సన్నుతిఁ జేసి యతీంద్ర యవ్విధిం
బలుకకు మెట్టులేనిఁ దృణభంగము నేఁ డట వైచి వచ్చెదన్.

227


క.

నా విని యతిబంధువుఁ డతి, పావనుఁగా వాని వగచి పనిచె నతండున్
వేవేగ నరిగి తృణ మొక, చో వైచి భజింపఁ దొంటిచొప్పున వచ్చెన్.

228


వ.

ఇట్టి యుపాయాంతరంబుల సంత్యక్తపరప్రత్యయస్థితికి విప్రపత్తి గలుగకుండఁ
గొండొకకాలంబు నమ్మఁదిరిగిన నెళవెఱుఁగక నేయిపూసినకత్తి యగుటఁ తెలియక
గోముఖవ్యాఘ్రం బగుట వివరింపనేరక యత్తులునం బరిగ్రహించి వసుగర్భ యగు
కంథఁ జేతికిచ్చి యలుఁగులఁ దిరుగుట గజంబును నురువులఁ బెంచుట మారుతభుగ్ద
ష్టుని భువనవికారం బగుట నగజారమణుని విలాసభాసమానం బగుట వెలయాలిని
దుర్గాభైరవపాలితం బగుట నవిముక్తస్థలంబును సరసం బగుట విద్వత్ప్రబంధం
బును ననుకరించి యచ్చెరువుసేయు చెరువునకు ననుష్ఠానార్థియె చనియె నయ్య
వసరంబున.

229


క.

అప్పాపజాతి మస్కరి, యెప్పుడు దనచేతి కిచ్చె నేమఱి మఱి వాఁ
డప్పుడ పోయె ఘనంబుగఁ, గప్పినతమి కంథ నొండుగంత న్గొనుచున్.

230


క.

బొంత గొని నిజనివాసము, పొంతకు నాషాఢభూతి పోవుట మదిలోఁ
జింతింపక నికటతటా, కాంతమునకుఁ జనిన యతని యతిఁ గన్గొనఁగన్.

231


సీ.

కఠినశృంగాగ్రసంఘటితలోహపలాశఘళఘళాత్కృతుల నక్రములు బెదర
నన్యోన్యసంపాతహతి వ్రస్సి ఫాలభాగమున శోణిత ముబ్బి కరుడుగట్టఁ
జించికాంగాకరోచిర్ధురాధౌరేయనేత్రాంతముల గొప్పనిప్పు లురుల
ఖురశిఖాటంకసంక్షుభితగోత్రోత్తిష్ఠదవనిరేణువుల నీరసలు గాఁగ


తే.

గళవినిర్గతఘోరభూత్కారనినద, మమితకేదారచరపతంగములఁ దఱుమఁ
బరమగర్వోన్నతములు రభ్రములు రెండు, చెఱువుకొమ్మనఁ గయ్యంబు సేయుచుండె.

232


క.

తిరుగక విఱుగక యాభీ, కరమేషము లాహవంబుఁ గావింపంగా
సరి రెంటినడుమ నెత్తురు, దొరిగెం ప్రవహించె నిలిచె దొప్పలు గట్టన్.

233


క.

ఆనెత్తు రానుతమి నచ్చో నొకజంబుకము నడుమఁ జొచ్చి తదీయా
మానవిసాణశిఖాహతి, చే నెమ్ములు విఱిగి సొరిగి జీవము విడిచెన్.

234


క.

జంబుకము మేషయుద్ధము, నం బడుట యనంగ నిడి జనస్తుత విను ము
ల్లం బమర మఱియుఁ జెప్పెదఁ, బంబినతాత్పర్యమేరుపడ సన్యాసిన్.

235


వ.

అట్లు స్వాపరాధంబున మేషవిషాణసంపాతసంఘాతంబునఁ గొలెమ్ములు విఱిగి కాల
మ్ము సేసిన సృగాలమాత్రముం జూచి యిట్టిద నావివేకంబు స్వప్నాద్యవస్థలయం

దును మోసపోవక రక్షించిన చిరకాలసంచితార్థంబు శిష్యునిచేతి కిచ్చి వచ్చితి
శంకాయత్తంబై చిత్తంబు తత్తరించుచున్నయది యేమి యగునొకో యనుచు
ననుష్ఠానంబునకుం బాసి యబ్బడుగుసన్యాసి నిప్పుల ద్రొక్కినక్రోఁతివడువున మడిమ
లూఁదక మఠంబునకు వచ్చి.

236


క.

తానకమున నిజశిష్యుం, గానక యాషాఢభూతిగా రారా తే
రా నాసొమ్మని చీరు, న్దీనత నోరెండ యతి యతివ్యథతోడన్.

237


చ.

వెలవెలనై మఠాలయము వెల్వడుఁ దాపనిషక్తకంఠుఁడై
కెలఁకులఁ జూచు భూమిసురగేహము లారయు నేఁడు భిక్షకై
తెలతెలవేగి శిష్యుఁ డరుదేఁడుగదా కనుఁగొన్నఁ జెప్పరే
కలుషవిదూరులార పనిగ ల్దను నుస్సను నూర్చు హాయనున్.

238


క.

తప్పెను కార్యం బను నిఁక, నెప్పుడు వీక్షింతు నను నిఁకెక్కడ నున్నాఁ
డెప్పుడు చేదొరికెం ధన, మప్పుడె కపటాత్ముఁ డరిగె నని తలయూఁచున్.

239


క.

అడిగినవారిం గ్రమ్మఱ, నడుగంజనుఁ జనిన కడకు నతఁ డార్తుండై
గుడిగుండ మనక పల్లియ, పడుసరనాకరయుఁ జెఱిచి పఱచినశిష్యున్.

240


క.

ఈగతి యతి వేసటలే, కాగడపుంబోక శిష్యు నారసి యచ్చో
నేగుఱుతును గానక యా, భోగతరశ్రాంతి నొక్కపురమున కరిగెన్.

241


ఉ.

స్నాన మొనర్ప దీమసము చాలక నోంకృతి నోరఁ బేర్కొనం
గానక భిక్షకుండు దిరుగం జరణంబులు రాక ద్రవ్యకం
థా నసుఁ బాసితే యనుదుఁ దాపభరంబున మేన్చలింప లో
లో నడలూన రేయుఁబగలు న్విలపించు నతండు దీనతన్.

242


ఉ.

గాసిలి పట్టఁగోల్పడిన గాలిపిశాచమువోలెఁ గష్టస
న్యాసి దురంతతాపమున నారటమందుచు నార్జితార్థకం
థాసృతివాడలం దిరుగుఁ దాంతదశం గృశియించి యిచ్చలో
వేసరి నిల్చె సంజకడ వేఱొకసాలియవానిలోఁగిటన్.

243


క.

నిలిచి యతి కొంతచింతం, బలవించుచుఁ బంచ తిన్నెపెైఁ బడి వలకే
ల్దలక్రిందం జేరిచికొని, వెలవెలనై నిద్ర లేక వేఁగుచునుండెన్.

244


వ.

అంత.

245


ఉ.

వెంగలిపోకఁ బానగృహవీథికి నెక్కఁటి నేఁతకాఁడు వో
వంగను జూచి దూతి పిలునం దలవాకిటిఁ బాసి పల్లవా
లింగనకాంక్షఁ దన్మహిళ లేఁగను మబ్బునఁ డక్కుఁబెట్టి తు

చ్ఛాంగన రథ్య వేనేగ నెదురై పతిగన్నులు గోచరింపఁగన్.

246


చ.

కని యదలించి యోసి చెడుఁగా కడగాలము సేర నెక్కడం
జనియెదు భర్తకాఁపురము సైఁపదె కుక్కకు నాజ్య మిందు నే
మన మనసైన నిచ్చె నఁటిమార్గముఁ బట్టుదె కాచువాఁడుఁ గాఁ
డని నను నిచ్చలో నెఱుఁగవా తెగవా నగుబాలు సేయఁగన్.

247


క.

కెళవుల నీచెడుపోకలఁ, దెలియనె రేపగలు గాచి తిరుగనె చేయం
గలిగిన డాఁగునె యన నం, దుల కాజగఱాఁగ జాలిఁ దూలక పలికెన్.

248


ఉ.

ఓసరిపోయె ని ల్వెడలకుండ నయో నను రాణివాసిఁగాఁ
జేసితొ తొత్తులం బనులు సేయఁగనిచ్చినఁ బోలదంటినే
వాసికిఁ బోర నన్నుఁ గడవం బనిపాటలు సేయువార లే
రీ సురఁ ద్రావి మైమఱచి ప్రేలెదు కంటివొ పట్టుకొంటివో.

249


క.

కూరకు నారకు బయలికి, రారా దనుమేర గలదొ రానో పోనో
యౌరా చూడవె నేఁడే, లారోసము వచ్చెఁ గ్రొత్తలా యిత్తెఱఁగుల్.

250


క.

పలుకుల కేమీ రోసము, గలిగిన మగవాఁడనయినఁ గాచి కడంకం
దలతలఁ బట్టికొనంగా, వలదంటినొ చంపి త్రోని వలదంటినొకో.

251


క.

రుసింంటిదాన నన్నీ, కుసిగుం పొనరించి యేమి గుడిచెదు పాపం
బసివోలెఁ దాకు నిను నే, నుసురన్నం జాలుఁ జాలు నోహో యనుఁడున్.

252


ఉ.

కాలికుడ న్బతివ్రతవు గావె యయో నీను నీవ యెన్నుకో
నేల జగం బెఱుంగు మఱి యేను నెఱుంగుదు వింతవాఁడనే
చాలుఁ బురే పతివ్రతలు సంజకడం బెఱవాడఁబోక సం
శీలమ యిల్లు సేరు మెడసేయక యన్నియుఁ జక్క నయ్యెడున్.

253


వ.

అని రోషపరుషవచనంబులం గినియుచు గృహంబునకుం గొనిపోయి యయ్యవ
గాకి ఱంకుటాలిం గాలం గేలం బొడిచి పెడమఱలం దిగిచి నిట్రాత నేఁతపగ్గంబునం
బంధించి కాలికుండు నిద్రించె నంతఁ గొంతప్రొ ద్దరిగిన.

254


శా.

జారప్రేరితయై వినిర్భయమనీషం దూతి యేతెంచి చే
బారంబెట్టి కుటీరభారవహశుంభత్సంభృతస్తంభవి
స్ఫారప్రాంజులరజ్జుబంధితవయస్యం గాంచి కన్నీరుము
న్నీరై వెల్లివడంగఁ గాలికుని లో నిందింపుచుం గూరిమిన్.

255


క.

ఎదఁ జేర్చి కర్ణ మొయ్యనఁ, గదిసి ప్రయోజనముఁ జెఱిచెఁ గా చెలియా యీ
ముదకఁడు సరిప్రొద్దాయె, న్నిదురించిరి ప్రజలు వే చనిన మేల్గాదే.

256

ఉ.

వెన్నెలరాకకై మొగము వ్రేల్చుచకోరముభంగి జారుఁ డో
కన్నులఁ గల్కి నిద్ర గతకన్నులఁ గూర్పక యెప్పుడెప్డు వ
చ్చు న్నను డాయునం చెదురుచూచుఁ బ్రియంబున నీదురాక కి
ట్లిన్నియుఁ జెప్ప నేల చను మే నిట నుండెదఁ గట్టివైచినన్.

257


క.

చని రమ్మా నీ వని బంధనమూడ్చినఁ దంతువాయి తాలిమి మై నొం
డనక గృహస్తంభంబునఁ, దనుఁ గట్టినత్రాటఁ బెనఁచి దానిం గట్టెన్.

258


క.

కట్టి తనమాఱుగా న, ద్దిట్ట గృహస్తంభమునఁ బ్రతిష్ఠించి నరుల్
మిట్టాడని యాబెడిదపు, నట్టక నడురేయి మబ్బునం జెలి చనియెన్.

259


చ.

అలమిననిద్రఁ జొక్కు చెడి యంతనె మేల్కని కాళికుండు పే
రెలుఁగున సారెకుం బిలువ నించువెఱం బరకీయ గావునం
బలుకకయుండె నందులకు భావమునం గనలుట్టి మేలువాల్
కెళవులఁ బూని ముక్కుఁ దఱిగెం దొరిగె న్రుధిరంబు భోరునన్.

260


క.

ముక్కరకు నోఁచకుండ, న్ముక్కఱ గావించి పలువముండా చెడుమం
చొక్కమనంబున నిదురం, జొక్కెం గాళికుఁడు దొంటిచొప్పున నంతన్.

261


ఉ.

అక్కడఁ దంతువాయి ప్రియు నప్రతిమాంగజసౌఖ్యసంగతిం
జొక్కఁగఁజేసి మందిరము చొప్పునఁ గ్రమ్మఱి యిల్లుసొచ్చి పే
రక్కునఁ జేర్చి వార్త గలదా యన దూతిక యేడనార్త నా
ముక్కుకు వచ్చె నీచెలిమి మూలబడ న్విడు మిల్లు సేరెదన్.

262


ఉ.

నా విని తంతువాయి వదనంబున లేనగ వంకురింప దూ
తీ విధికృత్య మెవ్వరికిఁ దీఱదు మానుపనంచు బంధముల్
వేవదలింపఁ ద్రెవ్వి పృథివీస్థలిఁ గూలినముక్కుఁ గొంచు నా
త్మావసధంబుఁ జేరి క్షురకాంగన డెందమునం దలంకుచున్.

263


క.

ఆనేఁతకానిచెలి గృహ, మానిన నిట్రాత నంటి యటునిటు త్రాటం
దా నిరచేతు లమర్చి య, థానియతం గూయకుండెఁ దత్సమయమునన్.

264


సీ.

సింధుజామాతృదక్షిణచక్షురంగంబు మందేహగర్వనిర్మథనకేళి
సకలవేదద్రుమస్కంధంబు జలరుహప్రభవరాత్రించరోద్భవ మహంబు
సంజ్వరార్తరథాంగసమ్మదప్రతిపాది దారుణతిమిరకాంతారవహ్ని
కమలినీవదనప్రకాశపోషణమూల మాశ్రితజనజీవనౌషధంబు


తే.

కుముదసమ్మదమథననిస్తిమితవేగ, మసిపతద్వీరకృతసురాయతనమార్గ
మలఘునీహరకరటిపాకలవరంబు గ్రహవతంసంబు పూర్వాద్రిఁ గాననయ్యె.

265

చ.

తెలతెల వేగిన న్నిదురఁదేఱి కరంబులు సాఁచి లేచి క
న్గెలఁకులఁ బాఱఁజూచు మగని న్గని నాలిపిసాళి పల్కె నా
కలితపతివ్రతామహిమఁ గానక నన్ను విరూపిఁ జేసి తి
క్కలుషము నిన్ను ముంచుకొనుఁగాక విరూపతి నన్నుఁ బొందునే.

266


చ.

అనుచితచిత్తవృత్తిఁ బురుషాంతరచింత వహింప నిన్ను నొ
క్క నిగడనం బతివ్రతను గాని యొకప్పుడుఁ గాను బుంశ్చలిన్
వినుఁ డిదె లోకపాలకులు వేయును నేటికి సాధ్వినేని సం
జనితకృప న్మదాననముఁ జక్కఁగఁ జేయుఁడు కీర్తి కెక్కఁగన్.

267


వ.

అని యేడ్చి మఱియు నద్దుశ్చరి మగని నుద్దేశించి యిట్లను హాలామదంబునం జేసి కల్ల
నిజంబు లేర్పఱుపనేరక నన్నింతఁ జేయుడుగా కేమి నీచేతులు నొచ్చెడు నన్నుం
గీడువొందునే యని మందలించినం జూచి భయవినయంబులు సందడింప నక్కు
విందుండు తచ్చరణంబులం బడి పరమపాతకుండ నపరాధి నానేరంబు క్షమింపుమ
నుచు బంధంబు లూడ్చి ప్రశంసించె నత్తెఱం గంతయు నందుండుటంజేసి చూచి
యతి యతివిస్మయరసావేశితాంతఃకరణుండయ్యె నంతకుమున్న గృహీతచ్ఛిన్న
నాసాపుటయై చని కుటీరాభ్యంతరంబున ముసుంగిడికొనియున్న క్షురకాంగనం బి
లిచి తద్వల్లభుం డిట్లనియె.

268


చ.

గరితలఁ జూడవే నిదురఁ గాననె యివ్విధినున్న నెట్లు కాఁ
పురము పురంబునం గొఱగఁబోవలె నాక్షురభాండ మిమ్ము నా
కరమున కన్న నయ్యువిద గాకిముసుం గెడలింప కూర్జిత
క్షురమొక టిచ్చె గాజురొద సూక్ష్మతరార్తరవంబు గప్పఁగన్.

269


చ.

క్షురమొకఁ డిచ్చినం గనలుచు న్మగఁ డాజగఱాఁగ కిట్లనున్
గరుపము నీకుఁ జెల్లినదిగా క్షురభాండము గాక యెందు కీ
క్షురమొకఁ డంచు నోఁబలుకుచుం గుటిరాంతరసీమ వైచెఁ ద
త్తురము కఠోరభంగి నది చూచి తదీయవధూటి యేడ్చుచున్.

270


ఉ.

నేరము సేయ మార్పలుక నీతికిఁ బాసినఁదాన గాను న
న్నూరక ముక్కుఁ గోసె వినరో ప్రజలార దయాధురందరుల్
గారె యనాథ నైనననుఁ గావరె ధర్మము లేకపోయెనే
యూరికి దిక్కు లేదె యిట నుండఁగఁ దోషము నన్నుఁబోఁటికిన్.

271


చ.

కురియఁదొడంగెఁ జూడుఁ డిదిగో రుధిరంబు శితక్షురంబునన్
దఱిగినముక్కుఁ గన్గొనుఁడు నా కిటుగాఁ గతమేమి వానలే

పరుసున వచ్చు నె ట్లవనిఁ బండు జగంబు సుభిక్ష మెట్లగు
న్నరపతి లేడె యిక్కడ ననాథలపెన్మొఱ యాలకింపఁగన్.

272


వ.

అని తల విరియఁబోసికొని రక్తసిక్తంబగు మొగంబు విధుంతుదదంతకుంతనిర్భిన్నచం
ద్రబింబంబు విడంబింప గుంపులు గొనిచూచు జనులకుఁ దునిసినముక్కుఁ జూపి
వెక్కి వెక్కి యేడ్చుచు నెట్లాయెం గంటిరే యనుచు నద్దంట మగనిమీద నపరాధం
బొదవ నీవడుపున మొఱపెట్టుచుండె నప్పుడు.

273


క.

ఇటు నటు నన నోరాడక, తటతట నెడ యదర నోరఁ దడిలే కొడలా
రటపడఁగనుండె నపుడ, చ్చట మంగలి తొంగలించుసంత్రాసమునన్.

274


క.

గిలుకలు వేసిన గుదియలు, ఘలుఘల్లన నూఁదికొనుచుఁ గతమేమీ యీ
కలకలమున కనుచు వడిం, దలవరు లేతెంచి యవ్విధం బరసి ధృతిన్.

275


ఉ.

మంగలిఁ బట్టి కట్టికొని మానవనాథునిమ్రోలఁ బెట్టి చె
ప్పం గనలెత్తి యాత్మపరిపాలితవిశ్వధరిత్రి నింతహం
తం గనుగొంటలేదు కొఱఁతం బడపైవుఁడు వీని నంచు రా
జుంగర మిచ్చి యారెకుల కొప్పనఁజేసె దృఢప్రయత్నుఁడై.

276


క.

తలవరులు వానిఁ గొని చని, తలపొలమునఁ గొఱఁతఁ దివ్వఁ దమకించుతఱిన్
గలతెఱఁగుఁ జెప్పి భిక్షకుఁ, డలమంగలి నిరపరాధుఁడని యెఱిఁగించెన్.

277


వ.

మేషయుద్ధంబున నక్కయు నాషాఢభూతిచేత సన్యాసియుఁ దంతురాయిచేత
దూతికయు స్వాపరాధంబున బాధంబొందిరి యేనును నిట్టివాఁడనేకదా యని వెచ్చ
నూర్చిన దమనకునకుం గరటకుం డిట్లనియె.

278


క.

కేసరివృషమైత్రి యనా, యాసక్రియఁ జెఱుపఁజాలు నట్టియుపాయం
బోసుగుణీ చేకూరదొ, కో సరసప్రజ్ఞ తలఁచుకొమ్మన నతఁడున్.

279


క.

సరసోపాయముచేతను, కరణి పరాక్రమముచేతఁ గా దెట్లన్నన్
గరటము సుతపరిపంథిం, బొరిగొనదే కనకసూత్రమున గృష్ణాహిన్.

280


క.

అన రిపుదమనకు దమనకుఁ, గనుంగొని కరటకుఁడు పలికె ఘనబోధనసా
ధనసాధుసూక్తి నిక్కథ, ననురక్తిం జెప్పుమనిన నతఁ డిట్టనియెన్.

281


క.

మనుజులు మిట్టాడని యొక, ఘనగహనమహీరుహమునఁ గాకంబులతో
డొనరించుడింభములఁ గీ, ల్కొననీకమ్మనికిఁ గఱిచిలువ దినుదప్పిన్.

282


క.

ప్రతిసంవత్సరమును నీ, గతిఁ బిల్లలఁ బాము పాము గడతేర్పంగాఁ
బ్రతికృతికి నేర్పుజాలక, యతిదీనతఁ గాకమిథున మచ్చో నుండున్.

283


ఆ.

అంతఁ బ్రసవయోగ్యయగుభార్యఁ జూచి కా, లాహి చళికితచిత్త మగుచుఁ గాక
మడలు గడలుకొనఁగ వడి నేగెఁ దనమైత్రి , గలిగి తిరుగు జంబుకంబుకడకు.

284

వ.

అట్లరిగిన నుల్లోకశోకం బగు కాకంబునకు జగత్ప్రసిద్ధుండగు నాప్రబుద్ధుం డాతి
థ్యం బాచరించి స్వాగతం బడిగిన నశ్రుమిశ్రితాక్షుండై వాయసాధ్యక్షుం డిట్ల
నియె.

285


చ.

ఘనవనమండలంబున నొకానొకభూమిరుహంబునందు నీ
యనుజయు నేను గాలిడుదు మచ్చెలి చూలు వహించి కాంచి పెం
చినపృథుకవ్రజంబుఁ గఱిచిల్వ దినుం బ్రతివత్సరంబు దా
ని నుడుపశక్తి లేక యొకనేర్పున నూరక చూచుచుండుదున్.

286


సీ.

నూఁగారువొదలు మేనులతోడ నెరకునై కిఱుకూత లిడ నాలకింపలేదు
అల్లంతఁ గాంచి యుల్లార్చుపక్షములతో శిరము లంకింప నీక్షింపలేదు
యెగుబోదలయి గూడు దిగనాడి పెఱమ్రాఁకు లెక్క నారసి యుత్సహింపలేదు
చంక్రమక్రమవిలాసముల నంబరవీథిఁ దిరుగఁ జిత్తమున మోదింపలేదు


తే.

ప్రేమ మెసలారఁ గని యెత్తి పెనుచుచుండ, ననుఁగుమనమలఁ దిగిచి ముద్దాడలేదు
బహువిపద్దశ లనుభవింపఁగ దినంబు, లరిగెఁ జూచితె వాయసాధ్యక్షుబ్రతుకు.

287


చ.

కడపితి నిట్టు లేను జిరకాలము చాలముదం బొనర్చు నే
పడఁతుక కాననయినయది పన్నగభీతి ధరించి యెవ్విధిం
జెడక సుఖింతు నిందులకు జెప్పు ముపాయము నావు డప్పు డ
య్యడ లడఁగించి జంబుకకులాగ్రణి వాయసభర్త కిట్లనున్.

288


క.

యీలీల నుత్తమముల, న్మీలం గాపట్య మెసఁగ మెసవికుభీరా
భీలగ్రహణమున పరః, కూలద్రుమవర్తి ముసలికొక్కెర దెగదే.

289


క.

అని చెప్పిన గోమాయువుఁ, గనుఁగొని వాయసము పలికెఁ గర్కటకముచేఁ
దనివిసన మీలజాలం, దిని కొక్కెర యెట్లు పొలిసెఁ దెలుపవె యనుడున్.

290


వ.

ప్రబుద్ధుం డిట్లనియె.

291


మ.

క్షణదాయామవిఘాతి భాస్కరమహస్సంపాతి విశ్వంభరా
ప్రణమత్కుంతము సింధువింధ్యకుధరప్రచ్ఛేత్తదావానలా
రణి నానామృగమస్తకద్రుమకుఠారం బధ్వనీనార్తికా
రణభైషజ్యము దోఁచె వేసవి మహోగ్రప్రేక్షణోదగ్రమై.

292


చ.

అడుగిడరాదు నేల నెరయం దలచూపఁగరాదు నిప్పుక
ల్జడిగొనరాలు నెండవడఁ జల్లెడుపిఁడిఁక నే డమిత్రుఁడం
చుడుగక భానుఁ జూచి వగనొందుశరీరులఁ దేర్పుగాడ్పు ల
ప్పుడు పరపోషణవ్రతులు వోఘనదానకళాధురంధరుల్.

293

సీ.

దండినిప్పుల వసంతములాడు నెండల వడఁజల్లు పడమటివాయువులును
గ్రోవిగుంటలు దక్క గుల్లలు చిక్కంగ నివిరినగొంగరాయిడికి మిడికి
కొరదయుఁ గడిసె పాపరమల్గుముచ్చంగి కొంటెముక్కును లొంపిఁ గ్రుచ్చుకొనియె
వాలువముకుదమ్ము వల్లెగండెతనత్తె గుజ్జుబేడిసఱాతికొఱుకు మడిస


తే.

నూతయలజళ్ళ చెఱువుల నుండరాక, కార్మొసళ్లు నెగళ్లును గవులు విడిచి
తరలి చెంతల నూతిగుంతల వసించె,
[5]గెరలి వర్తిలు నమ్మహాగ్రీష్మమునను.

294


ఉ.

శంబరశోషణక్రియకుఁ జాలి దురంతతరప్రతాపరే
ఖం పథికాంగకంబులకు గాఁక ఘటించి హరింతు రంగసే
వ్యంబు మహాబలోద్ధతము నయినశతాంగము నెక్కి యన్నిదా
ఘంబునఁ బద్మినీయువతికాముఁడు కాముని దెల్పెఁ బొల్పుగన్.

295


వ.

మఱియు నవ్వేసవి శోషితసింధురాజంబయి ధనంజయుం గృశీకృతదశకంధరంబయి
దాశరథిని ఘనాఘననర్తితశిఖిమండలంబయి కంధరారంభంబును భోగివిరాజమానం
బయి బలిసదనంబు ననుకరించె మఱియును.

296


చ.

అనిమిషమండలీరుచికమయి కవిరాజవిరాజితోక్తుల
న్దనరి మరున్నికేతనమన న్గనుపట్టిన దాని నొక్కచోఁ
గనియె సరోవరంబు ఝషకంబులఁ బట్టుకొనంగ శక్తి లే
క నిలిచి క్రౌంచ మెచ్చిరులు కారియఁ దత్తటి నూరకుండఁగన్.

297


వ.

దాని నిరీక్షించి యొక్కకుళీరం బిట్లనియె.

298


క.

బకమా గృహ దఖిలకదం, బకమా యాహారవిధికిఁ బాసిటుల సరో
నికటమున నూరకుండెద, వకటా యిది యేమి యనిన నది యిట్లనియెన్.

299


ఉ.

యీదశ యెట్లుగాఁ దెలిసి తీవు కుళీరమ నిక్కువంబు మ
త్స్యాదుఁడ వృత్తి నా కిదియయైనను నీయెడ నేమి చెప్ప ద
త్తాదృతి నీయవస్థ కరయం గత మున్నది విన్ము జాలరుల్
మేదురశక్తి నిక్కొలనిమీనములం గొనిపోవువారలై.

300


క.

పలువురు రానున్నారని, తెలియ న్విని చెప్పవచ్చితి న్మీతో నిం
దులకయి యాహారింపం, దలఁపక వలవంత నొందెదం గర్కటకా.

301


క.

జాలములన్ గాలముల, న్మీలెల్లం బొలియకున్నె మృత్యుసమం బీ
జాలి యెటనుండి వచ్చెం, గాలము దరియింపరాదు గద యెవ్వరికిన్.

302

అని యశ్రుమిశ్రితాంబకం బై బకంబు వగచిన విషంబునంగల ఝషంబు లన్నియు
నెఱుక చేసికొని యక్కొక్కర కిట్లనియె.

303


ఉ.

ఆరయ మీనభక్షకుఁడ వయ్యును గూరిమి పెద్ద మాయెడం
గారుణికాగ్రగణ్య యటుగావున విప్రతిపత్తిలేదు ని
చ్చో రయమార మమ్ము నొకచొప్పున దుస్థితి నొందకుండ నీ
డేరుపుమయ్య సేమము ఘటింపగదయ్య ప్రసన్నమూర్తివై.

304


వ.

అని మీనంబులు దన్నుం బ్రార్థించిన సత్సుకంబయి బకంబు తనలోన.

305


క.

యీయంబుచారములు దన, మాయకు లోనయ్యెఁ గంటి మన సని సంతో
షయతి నంతర్లీనముఁ, జేయుచు మాయాకళారసికమది పలికెన్.

306


క.

వాదించి జాలరులనౌఁ, గాదన నా చేతఁగాదుగద నిజవృత్తి
ఛ్ఛేదమునకు నోరుచుకొన, రాదేకద పరమదుష్కరమ కద పూనన్.

307


క.

ఐన నిఁక నేమి సేయుద, మే నొకఁ డెఱిఁగింతుఁ జేయుఁ డిష్టంబైనన్
మీనముల నితరసలిల, స్థానములను బెట్టివచ్చెదను మిముఁ గరుణన్.

308


క.

రావలసిన రారండని, భావంబున లేనికరుణ పరిఢవిలంగా
నావృద్ధబకము పలికిన, జీవనచారములు విశ్వసించినమదితోన్.

309


క.

చేటెఱుఁగనికూనలు మీ, లాటోపము మీఱఁ జేరనరిగిన నిశిత
త్రోటి నొకఝషముఁ గొని యొక, చోటికిం జని మ్రింగి వగచుచుం గ్రమ్మఱియెన్.

310


వ.

ఇట్లు క్రమ్మరి.


క.

రారం డిఁక నొకరని రా, జీరి యొకానొకఝషంబు శితచంచువునన్
గూరిచిచని మును మెసవిన, చో రూపఱ మెసవి తొంటిచొప్పున మఱలన్.

311


క.

మగిడివిరివియును లోతున్, దిగియుం గలనీట విడిచి తీఁగొన్నిటి న
క్కగములు దన్నెన్ మృత్యువు, మొగము న్నో రుత్తమాంగమును డాఁకాలన్.

312


క.

మీకును మృత్యుత్రాసము, లేకుండం జేయనేర్తు లేలెండని రా
నాకొక్కెర యొకమీనముఁ, గైకొని చని తిని సరోముఖమునకు వచ్చున్.

313


క.

ఎడతాఁకితాకి యొండొక, మడువున నిడు కైతవమున మఱియు న్మఱియున్
బడుగుంగొక్కెర మీలం, గడుపార న్మెసవి తృప్తిఁ గైకొని యంతన్.

314


వ.

సరోవరతీరంబునం గా ల్నిలిచి వాంఛితపరనీరస్థానంబు లగుమీనంబులం గదిసి
యిట్లనియె.

315


గీ.

అరిగి తిరిగి నేఁటి కలసితి భరమాన, వసమె మూఁడుగాళ్లముసళి గానె
కండవడొయొ వయసొ గర్వమో సంచార, శక్తి ముదుక కెట్లు సంభవించు.

316

క.

బడలికఁ బాసినఁ దిరుగం, బడి ప్రాణసమానులైనబంధుల మిము న
మ్మడుగునఁ జేర్చిదనని యొడఁ, బడఁ జెప్పుం దనకు నరుగఁ బాఱినదనుకన్.

317


క.

తనివి సన నిట్లు కతిపయ, దినముల కుదరానలంబు దీఱ న్మాయా
ఖని యాబడుగుంగొక్కెర, యనఘా యాటెంకిమీల నన్నిటి మెసవెన్.

318


వ.

ఇట్లు నిరవశేషంబుగా మీనంబులం దిని యెందేనియుం బోవ సుద్యోగించు నజ్జరఠ
బకంబున కెఱుకఁజేసికొని మున్నెఱింగించుకొన్నకుళీరం బిట్లనియె.

319


గీ.

భావికైవర్తకత్రాసభగ్నమాన, మానముల మీనముల నొండుమడుగుఁ చేర్చి
సుకృతసామ్రాజ్యవిభవంబు చూఱఁగొంటి, బకపురందర కలఁడె నీవంటిధర్మి.

320


క.

నాళీజంఘాదులు నినుఁ, బోలరు పరహితవివాసమునఁ జుట్టములం
బాలించి నన్ను నేలా, పాలింపవు సఖుఁడఁ గానె పగవాఁడనొకో.

321


వ.

జలస్థలాంతరంబునుం జేర్చి పొగడ్తఁ గనుమని కైవారంబు సేయు కుళీరంబు నిరీ
క్షించి కర్కటమాంసం బపూర్వం బదియుఁ జవిచూడవలయు నని విచారించి
యక్కొక్కెర దానం గఱుచుకొని వధ్యశిలాతలంబునకుం బోయి భక్షింపఁ దివురు
టయు నయ్యుద్యోగం బెఱింగి యయ్యెండ్రి.

322


చ.

బలిమి హుటాహుటిం దఱిమి పట్టుకొన న్వడిలేక మాయపుం
దలఁపున రిత్తజాలరులదాడి గడించి ఝషంబుల న్నిరా
కులగతి మెక్కని మ్ముసలికొక్కెర యన్యజలాశయంబునం
గలుపుమిషంబునం జనదుగా కపటాత్ముల విశ్వసింపఁగన్.

323


క.

మేసినసమయంబున ధృతిఁ, బాసినమది కార్యహానిఁ బ్రాణుల నిలుగన్
వ్రాసె విధి మృతికి నేలా, గాసిలి పౌరుషము విడువఁగా నేమిటికిన్.

324


క.

పరుషకరపత్రధారా, స్ఫురణఁ బ్రకాశించు మద్విపులదంష్ట్రికలన్
శిర ముత్తరించి పాథ, శ్చరములకొలఁదీర్తు నీరసంబున ననుచున్.

325


క.

అక్కర్కటముండఁగ నల, కొక్కెర దత్తరస మొలిచికొని తినునదియై
ముక్కెత్తిచాఁచు నాలో, నొక్కూఁకునఁ గొండ్లనిఱికి యొత్తెన్ గళమున్.

326


క.

ఒత్తిన సుమడుండుభుకము, కత్తెరచేఁ దునియుమాడ్కిఁ గర్కటదంష్ట్రా
కృత్తగళంబై నెత్తురు, జొత్తిల నల వృద్ధబకము సోలె న్గూలెన్.

327


క.

రోయక ప్రాణుల కపకృతి, సేయుదురాచారుఁ డిట్లు చేట్పడు విను మో
వాయసవల్లభ శిశురిపు, వాయుభుజుం డీల్గు నిట్టివాఁడై యునికిన్.

328


మ.

భవదర్భాహితకృష్ణసర్పహరణోపాయం బెఱింగింతు నీ
వవధానంబునఁ జేయు మేమఱక రాజాగారసంచారివై

ఛవిమత్కాంచనమేఖలాలతిక దృష్టంబైన లాగించి నీ
వవిలంబంబునఁ బెట్టు మమ్మనికి రా జాపాముఁ జంపించెడిన్.


ఉ.

నావిని కాక మవ్విధమునం జరియించెదనంచుఁ బోయి రా
జావసధంబు జేరి యరయం బ్రతిసాధనఁ జేయఁబోవుచుం
బ్రావృతమేఖలాలత ఖురాళ్యుపకంఠముఁ జేర్చె దాని నా
లోవెస నంఘ్రులం గమిచి లోకులు సూడఁగ నభ్రగామియై.

330


చ.

అరుదు ఘటిల్ల మందగతి నంతట నింతట నాసపాటుగా
నరుగుచునుండ రాజపురుషావళి మ్రోయుచు రాజునానతిన్
గెరలుచు వెంటరాఁ దొలుతఁ గృష్ణభుజంగమ మున్నవృక్షకో
టరమున మేఖల న్విడిచి దాఁపున నొండొకమాన నుండినన్.

331


క.

పరశుప్రహారములఁ ద, త్తరుకోటర మగలవైచి తత్రత్యఫణిన్
మెరిగొని మేఖలయున్ గొని, పరిజనులుం జనిరి కాకిపగయును దీరెన్.

332


వ.

పరాక్రమంబునకంటె నుపాయం బెక్కువ యని చెప్పి వెండియుం దమనకుండు.

333


క.

ఇల బుద్ధిగలఁగునతనికి, బలముంగల దెట్టులనినఁ బటుబుద్ధిసము
జ్జ్వల మొకశశక మొకానొక, పొలమున మన్మత్తకరిరిపుం బొరిగొనదే.

334


క.

నావిని కరటకుఁ డది యె, ట్లీవిధ మెఱిఁగింపు మనిన నినసంసత్సం
భావితనయశాస్త్రకళా, కోవిదుఁ డాయనకు దమనకుం డిట్లనియెన్.

335


సీ.

దంతిదంతాగ్రనిర్దళితమస్తకగళన్నూత్నముక్తౌఘపాండూకృతంబు
బహుళతిర్యగ్దృషత్ప్రతిహతస్యదనదజ్ఞరఘనస్తనితలాస్యదమయూర
మచ్ఛభల్లప్రహారాస్థాతృమాక్షికచ్ఛత్రసంకీకృతక్ష్మాతలంబు
బిలసదాహారితుందిలసంకునిర్ముక్తసాంకవసురభితస్థాణుమూల


తే.

మాదృతాఖండవాగురికావతరిత, రజ్జురజ్యద్గరుచ్ఛటాభ్రాంతిచాయి
చమరవాలవిలోకసంచకితమృగము, గల దొకానొకగహన మక్కానలోన.

336


క.

కుక్షింభరి యగునొకహ, ర్యక్షము వర్తించు నహరహ మమర్యాదా
దక్షంబై నానామృగ, శిక్షాభక్షాప్తి నుల్లసిలు నది నెరయన్.

337


క.

ఈరీతి మేరమీఱి య, వారణవారణవిరోధి వధియింపంగా
బోరా దెరు వెఱుఁగక యా, ఘోరాటవి మృగములెల్ల గుములై భీతిన్.

338


వ.

వచ్చి యక్కేసరికిం బ్రణామంబు లాచరించి.

339


సీ.

గిరిదరీముఖబహుద్విరదశోణితసిక్తగండశైలము కనత్కనకపీఠి
పరితోవిసారి శంబరలులాయవ్యాఘ్రాహరణఘోషములు తూర్యారవములు

మస్తకోపరిపతన్మహిధరాధిత్యకాఝరవారియభిషేకసలిల ధార
సవిధపాదపలతాస్థాయినీడజకులాంచితతతు ల్భూసురాశీరవములు


తే.

గావె మృగరాజవిఖ్యాతిఁ గనిన నీకు, నౌర గాంభీర్య మౌర సాహసవిలాస
మౌర గారవ మౌర సత్వాతిశయము, చారుతరమూర్తి పంచాస్యచక్రవర్తి.

340


క.

హరి సాగా నీరూపము, శిరమున ధరియించి కాదె శిక్షించె మరు
త్పరిపంథిఁ గనకకశిపుం గరివైరీ నిన్నుఁ బొగడఁగా మావశమే.

341


వ.

అని యనేకప్రకారంబుల మాతంగధ్వనిం బ్రశంసించి యుల్లాసంబుఁ బుట్టించి
మెచ్చుబుచ్చుకొని వచ్చినకార్య మడుగంబడినయవియై మృగంబు లమ్మృగపతి
కిట్లనియె.

342


క.

అగపడినవారినెల్లం, దెగటార్పక మేరచేసితిని మను మటవీ
మృగములజాతికి నొకఁడొకఁ, డుగ నిది మామనవి చెవి నిడుము మృగనాథా.

343


క.

ఈతగవు నడపుమని సం, జాతత్రాసమునఁ దనుఁ బ్రశంసించిన నా
రీతి నొనర్చెద నని యది, జాతికి నొకఁడొకఁడుగా మెసవు నదిమొదలున్.

344


క.

అంత నొకవారమునఁ దన, వంతగుటయు నిశితబుద్ధివహనము ధీర
స్వాంత మొకధూర్తశశకము, దంతిప్రతిపక్షికడుపుఁ దనియించుటకున్.

345


క.

చావునకుం దెగి త్రోవం, బోవుచుఁ దలపోసి స్వగతమున నిట్లను న
య్యో వననిధిఁజొచ్చేఱుల, కైవడి హరికడుపుఁ జొచ్చెఁ గా వనమృగముల్.

346


క.

ఈనెఱికేసరిజఠరా, ధీనత దిన మొకటి లెక్కఁ దినెఁగా మృగసం
తానంబు మల్లెపట్టిన, చేనిక్రియం జెప్ప నేమి శివ పాడయ్యెన్.

347


క.

దీనికిఁ దుదమొద లెయ్యది, పో నెయ్యది తెరువు బుద్ధిపూర్వకముగ నేఁ
డేనెడ కేసరిఁ బొరిగో, ల్కో నేడని వనమృగాళికొల వారింతున్.

348


క.

బలమునకంటెను బ్రజ్ఞా, బల మెక్కుడుగాదె బుద్ధిబలమునఁ బేర
చ్చెలమునఁ గైదువువెలిగాఁ దలఁ ద్రుంతుం జెండి రెంటఁ ద్రావుడుదిండిన్.

349


క.

ధైర్యము పెట్టనివరణము, ధైర్యము నానాశుభప్రదము నేడ్గడయున్
ధైర్యధురాధుర్యునకు న, వార్యము లెక్క డివి వార్ధివలితధరిత్రిన్.

350


వ.

కావున ధైర్యాదిగుణంబులు గలిగి యిక్కొఱంతఁ బాపుకొనియెదనని నిశ్చయించి
మందగమనంబునఁ బ్రొద్దువోయినతరువాత డాయంబోవుటయు నతిక్షుత్పిపాసా
భిభూతంబగు కంఠీరవంబు రోషకషాయితేక్షణంబుల నిరీక్షించి శశకంబున
కిట్లనియె.

351

శా.

ఓరీ యాఁకటఁ గ్రుస్సితి న్సరగ రాకుండెట్లు త్రాసంబు లే
దో రామాదులఁ బాసి రా మనసు రాదో వచ్చుమార్గంబునం
దే రడ్డంబుగఁ బాఱెనో బలిమి యెందేనేమి చేకూఱెనో
యౌరా జా గొనరించి తీ వనిన బ్రజ్ఞాయత్తచిత్తంబునన్.

352


ఉ.

కేసరివంకఁ జూచి పలికెన్ శశ మే నపరాధిఁ గాఁ జుమీ
యాసరసీరుహాప్తుఁ డుదయంబగునప్పుడె లేచి యాఁకటం
గాసిలె వల్లభుండని తగం బఱతేరఁగ ద్రోవ నున్మిష
త్కేసరపఙ్క్తి దూల నొకకేసరినాథుఁ డహో యవారణన్.

353


చ.

సెలవులవెంట భూరిమదసింధురమజ్జము గాఱఁగా విశృం
ఖలగతి వచ్చె వచ్చి యరికట్టి యదల్చె సమీపవర్తియై
పలికె మృగాధమా బలముఁ బాపెద మత్సదృశద్విపాహితుం
బొలమునఁ గానవే కదిసి పో రొనరింపఁగ నింపువుట్టెడిన్.

354


క.

ననుఁబోల సింగములు లే, వని కేసరి పోతరమున నాడినమాట
ల్విని విని వారితభీతిన్, ఘనరీతి గజాభియాతిఁ గని యిట్లంటిన్.

355


క.

సంగరసంరంభపుటా, సంగర ముప్పొంగెనేని క్షణమాత్రము ని
ల్వంగలవేని తెచ్చెద, ముంగలికరిమథనచంగము న్సింగంబున్.

356


క.

అది నీకోరికఁ దీర్తుం, గదలకు మిచ్చోట ననుచు గాఢప్రజ్ఞా
భ్యుదయమునఁ జేసి చావక, బ్రదికి యహా నీకు విన్నపము సేయుటకున్.

357


క.

ఏతెంచితిఁ దడయుట కిది, హేతువు పంచాస్యమూర్తి వీ వగుటఁజుమీ
యోతీవ్రశౌర్యయారా, జాతతవిఖ్యాతనిరతుఁడై యొప్పెసఁగెన్.

358


క.

చేరి నినుఁ గొలువవలెనో, వారక యాహరినె కొలువవలెనో మాకె
వ్వారిందు రాజులనఁ గం, ఠీరవ మిట్లనియె నెవ్వడి న్మశమునకున్.

359


శా.

ఏమేమీ నిను నడ్డగించుకొనెనా యిట్లాడెనా నిక్కమౌ
నా మేలే సమరేచ్ఛయంతబలు పౌనా పౌదమా చూపలే
వా ము న్నెక్కడఁ గంటి వప్పరమగర్వగ్రంధి మచ్ఛాతదం
ష్ట్రామోఘాభిహతి న్వధింతుఁ దగ నాహారింతుఁ దన్మాంసమున్.

360


క.

నావిని శశకము నామా, యావాగురఁ జిక్కె సింహ మని యుబ్బుచు నో
దేవా విచ్చేయుము సం, ధావిభవం బెసఁగఁ జూపెదం బ్రతిపక్షిన్.

361


చ.

నిలువక వత్తుగా కని పని న్గొనిపోయి చలింప కారసా
తలజలపూర్ణకూప ముచితస్థితిఁ జూపి శశంబు వల్కె లో

పలఁ గనుపట్టు చూడు ప్రతిపక్షి ననం బరికించి తజ్జల
స్థలిఁ బెఱసింగముంబలె నిజప్రతిబింబము గోచరింపఁగన్.

362


క.

కడుఁ గెరలి యెగసి నూతం, బడనుఱికె మునింగి తేలెఁ బానీయంబు
ల్గడుపారఁ ద్రావె నసువు, ల్విడిచెం గరినైరి తీవ్రవేదనఁగృశమై.

363


వ.

బుద్ధిగలవానికి బలంబునుం గలదనుట కిది నిదర్శనం బనుటయుఁ గరటకుండు దమ
నకు నలరుమొగంబునం జూచి బుద్ధిమంతుండ వగుదు నీకు శుభంబయ్యెడు మిత్రభేదం
బున కుద్యోగింపుము పోయిరమ్మనిన నతండు కరటకు వీడ్కొని సంజీవకుండు లేని
వేళఁ బింగళకుసమీపంబున కరిగి ప్రణామం బాచరించి నిలిచిన మృగరా జమ్మంత్రి
తనయున కిట్లనియె.

364


క.

నీవలనఁ బ్రాజ్యరాజ్యముఁ, గావించెదఁగాదె దమనకా యేకార్యం
బీ వూఁది తెలుపవచ్చితి, వావిధ మెఱిఁగింపు మనిన నతఁ డిట్లనియెన్.

365


సీ.

చిరకాలసంశ్రేయస్థితి నమ్మదిరిగిన తనవారిదెస ననాదరము సేసి
సిరిఁ గోరి నడుమవచ్చినవారి మన్నింతు రభినవప్రియులు భూవిభులు గారె
పురుషుగుణాగుణంబులు విచారింపక నీతి యేపతికి మన్నింపఁ జెఱుపఁ
బరులనందఱఁ దమువలె నిరీక్షింతు రక్కఱటులు చనుత్రోవ లెఱుఁగలేరు


తే.

నమ్మఁగలవారు గాక దుర్ణయము పేర్మి , నెవ్వ రెటు సేయుదురొ యెట్టు లెఱుఁగవచ్చుఁ
గర్కటిక గాదుకద ముంటిగంటిఁ దెలియఁ, గాఁ బరస్వాంత మనినఁ బింగళకుఁ డతని.

366


చ.

కనుగొని పల్కె నోదమనకా మతి శంకితమయ్యె నిప్పు డి
ట్లనుటకు హేతు వెద్ది తెలియన్వలె సర్వముఁ జెప్పుమన్న నా
యనయను విన్నవింపవలెనా మృగనాయక నీతిఁ జెప్పఁగా
వినువినకుండు నాకుఁ దగవే కలకార్యముఁ గప్పిపుచ్చఁగన్.

367


ఉ.

త్రోవకు శుద్ధసాధుచరితుండని చిత్తమునం దలంచి సం
జీవకుఁ దెచ్చి నీసఖునిఁ జేసితి నీవును వాని కూర్జిత
శ్రీవిభవం బొసంగి సవరించితి వందఱ మూలభృత్యులం
జీవితతుల్యులం జవుకఁజేసి కడంబడవయిచి తీ విటన్.

368


సీ.

సదృశభోగము సమాసనముఁ దుల్యవిభూతియును భృత్యునకు నీఁగి చనదు పతికి
నిన్నియు నతనికి నిచ్చితి సామ్రాజ్య మేమిపాపముఁ జేసె నిత్తుగాక
సంజీవికునితోడి సఖ్యంబు పైవచ్చె హెచ్చించి యాపదఁ దెచ్చుకొంటి
యొంటిపాటున నాతఁ డొకనాఁడు నాతోడ నోడక నీసుద్దు లుగ్గడించి


తే.

రహితశక్తిత్రయుఁడు మందరశ్మి మూఢుఁ, డితని కెక్కడిసామ్రాజ్య మేడ బ్రదుకు
చెడియెఁ దెకతేర యనుచుఁ కేరడములాడె, ననిన విని విన్ననయియుండె హరివరుండు.

369

గీ.

మృగవిభుం డిట్లు విన్ననిమొగముతోడ, మలఁగుచుండంగ మఱియు నమ్మంత్రిసుతుఁడు
మంత్రి యొకఁడైన నతఁడు సన్మాన్యుఁడైనఁ, బుడమిఱేఁ డెల్ల చేటులఁ జెడు నిజంబు.

370


చ.

శ్రవణయుగాంతరావరణచక్రము లగ్గలపట్టు తోరపుం
జెవుడు కనీనికావసుధసీమకు నుమ్మలికాడు దృష్టిపా
టనము దురుక్తి నాలుకకు డాసినచుట్టము పారుపత్య మ
న్తెవులు నవైద్యసాధ్య మెడత్రెవ్వక నెవ్వని నాశ్రయించినన్.

371


క.

కరణ మధికారి యయినం, ధర లెక్కలువ్రాయువా రతనివా రైనన్
బొరపిడి పుట్టునె ధరణీ, శ్వరునకుఁ దదితరులు నిలుపవలెఁ బనిమీఁదన్.

372


క.

పరిశుద్ధులకరణిఁ బర, స్పరబంధువు లయ్యు సర్వభక్షకు లయ్యుం
నరవల్లభు దగ్గెరమా, ర్తురభంగి న్రిత్తఁబోరుదురు పనివారల్.

373


చ.

తనఘనరాజ్యమంతయు బ్రధానునిపై నిడియున్న మత్తుఁగాఁ
బెనిచి నరేశ్వరుండు నడిపించినవాఁ డతిరూఢమూఢుఁడై
కనుకని వల్లభు న్సరకుగాఁ గొనఁ డాసచివావనీశులం
దనయము నెవ్వఁ డాఢ్యతముఁడయి మనువానినచేరు లక్ష్మియున్.

374


క.

ధారుణి నపకారికి నుప, కారముఁ గావించువారిఁ గానము తద్దు
శ్చారిత్రులయెడ విశ్వా, సారంభణ మనుచితము క్రియానిపుణులకున్.

375


క.

ఊఁగెడుపల్లును విసమునఁ, దోఁగినవంటకముఁ గుత్సితుండగుమంత్రిన్
లోఁగక యుమ్మాలించిన, చోఁ గలుగు నఖండమయినసుఖ మెవ్వరికిన్.

376


క.

నీ వెఱుఁగవు నే నెఱుఁగుదు, పైవచ్చెం జెలిమికొలఁది వడఁదెచ్చె న్సం
జీవకుఁ డతనికి రాజ్యం, బీ విచ్చెదొ బలిమి నాతఁడే కయికొనునో.

377


క.

సంజీవకసాచివ్యము, నం జేటగు నీకు నీమనను చెప్పఁగల
ట్లుం జెప్పితి మానుట నా, కుం జూడ శుభంబు మెలోకో చెడుతెరువుల్.

378


వ.

అని బోధించుదమనకునకుం బింగళకుం డిట్లనియె.

379


ఉ.

నీవచనంబు లుత్తమము నిక్కువము ల్విను మట్టులైన సం
జీవకుపైన విశ్వసనచిత్తము పుట్ట దళీకవృత్తియౌఁ
గావుత దోషదుష్టములు గావె శరీరము లేరికిం గళా
కోవిద వాని వీడ్కొనుటకు న్మతి పుట్టునె నాకుఁ జెప్పుమా.

380


క.

నావిని దమనకుఁ డతిరో, షావిలచేతస్కుఁ డగుచు నను నట్లయినన్
సేవకులతోడఁగూడం, బోవిడు నీ కేమిటికిఁ బ్రభుత్వశ్లాఘల్.

381


క.

తనువు భరంబని వీడ్కొని, తనలోఁ దలపోయుమూఢతరుచందమునన్

జెనటిపతి చోదకోర్వక, చని రాజ్యము మంత్రికైవసముఁ గావించున్.

382


క.

సిరిఁ బరిహరించునరు లె, వ్వరు చెపుమా పిచ్చుకుంటునాడుంబలె హో
దరుఁ డాదిగ నృపసంశ్రయ, గరిత న్సంపదలఁ బొదలఁ గాంక్షింతు రిలన్.

383


వ.

సత్పురుషులమతి నతిక్రమించి యసత్పురుషుల బుద్ధిం బ్రవర్తించురాజు విను మప
థ్యానురాగియగు రోగియుంబోలెఁ బ్రాణభరణసమర్థుండు గాఁడు స్వబుద్ధి రాజులకు
విశేషించి వలయు బుద్ధిరాహిత్యంబునగు మంత్రివశుండై తిరిగెనేని యారాజు
విరోధనిరోధితుం డగు నట్లగుట హితతంత్రియగు మంత్రివాక్యంబులు రాజునకు నవ
శ్యకర్తవ్యంబులు వినునప్పు డప్రియంబులు పరిణామంబునం బ్రియంబులు నగు
వాని నుపదేశించు మంత్రియు నవ్వాక్యంబు లాదరించు రాజునుం గలుగఁడు కలిగె
నేని యద్దిక్కునఁ బెక్కువచెడక సిరులు పెరుగుచుండు.

384


క.

ఘనుఁ డాప్తుఁడు నగుసచివుఁడు, వినిపించిన రాజనీతి వేయేటికి రు
గ్ణునకుఁ జికిత్సాక్రియవలె, మును వెగటుం బిదప హృద్యమును నై యుండున్.

385


క.

నరపతి మూలబలంబుల, తెరు వొల్లక నడుమ నరుగుదెంచినవారం
బరిపాలించుటకంటెను, గరివైరీ యొండుచేటు గలదే పుడమిన్.

386


క.

మూలబలంబులుగల భూ, పాలునకు నరాతిజాతి భయపడు లక్ష్మీ
భూలావణ్యవతుల్ హరిఁ, బోలె న్బెడఁబాయ రవ్విభుని ననుదినమున్.

387


క.

తా నెంతశూరుఁ డయినను, భూనాథుఁడు మూలబలము పొందొల్లక ని
ర్మానపరిపంథినరవర, సేనాపారంపరీవిజేత యగునొకో.

388


ఉ.

జీవిత మిచ్చి యాదరముఁ జేసి జలౌదనసంవిభాగసం
భావనకల్మి నేధరణిపాలుఁడు భృత్యులఁ బ్రోచు నద్ధరి
త్రీవిభు ప్రస్తుతంబున శరీర మలక్ష్యముఁగా దలంచుచున్
జీవిత మిచ్చు గాయములచేఁ బడునొండె భటుం డుదగ్రతన్.

389


క.

పరిజనగౌరవము ధరా, వరునకు నత్యంతగౌరవము వెండియు న
ప్పరిజనలాఘవము ధరా, వరునకు నత్యంతలాఘవము సు మ్మెందున్.

390


వ.

నీవు మూలబలంబులం దిరస్కరించి యభినవాగతులం బురస్కరించుకొన్నాఁడవు.

391


క.

సేవకుఁ డని చూడకు సం, జీవకుని న్నతఁడు సరకుసేయఁడు రాజ్యం
బేవేళ నతనిపాలయి, పోవునొ దుది నెంతకొఱఁత పుట్టునొ నీకున్.

392


క.

నావిని పింగళకుఁడ నయ, కోవిదు దమనకునిఁ బలికెఁ గూరిమి నభయం
బీ విప్పింపఁగ నిచ్చితి, నావిధ మతఁ డేల మఱచు నది యెట్టు లగున్.

393


వ.

అనిన దమనకుండు.

394

క.

కొనియాడినఁ గొలిచిన దు, ర్జనుఁ డాత్మప్రకృతి విడిచి చరియింపఁడు ది
ద్దిన చమురుఁ బెట్టి తోమినఁ దనకుటిలతఁ గుక్కతోక దా విడుచునొకో.

395


క.

కొలిచిన నవధీరితుఁగాఁ దలఁచిన జేయును బరోపతాపము ఖలుఁడౌ
దలనిడుకొన్నం ద్రొక్కిన, బలితంపుంబాము బడలుపడఁగఱుచుఁ గదా.

396


క.

సారఘనసారముఖసం, స్కారంబుల లశున మశుభగంధముఁబోలెం
గ్రూరుఁడు ప్రతివాసరరచి, తారాధన విధుల విడువఁ డాత్మప్రకృతిన్.

397


క.

హితకార్యము న న్నడుగఁడు, పతి నా కేమిటికిఁ బృచ్ఛపరిభాషణమం
చతిమౌనముద్ర నుండుట, మత మనరు సునీతివిధులు మంత్రుల కెందున్.

398


క.

సంజీవకుదుర్భాషా, పుంజము వీనుల వహించి పోల్పోలము లి
చ్చం జింతింపవు దుర్ణయ, గంజాశరణంబు సొరవుగద మృగరాజా.

399


చ.

అవనివిభుం డనీతివశుఁ డయి మద మెత్తినదంతివోలె ని
చ్చవలసినట్లు గ్రుమ్మఱుచు సైరణ భృత్యజనాపరాధముల్
చనవునఁ గప్పిపుచ్చుచు నజస్రము దుర్వినయత్వసత్వభై
రసవిపదంబురాశిఁ వడి క్రాఁగు దురంతవిషాదవేదనన్.

400


క.

ఏజాడవాఁడు రాజగు, నాజాడనె ప్రజయుఁ దిరుగు ననుదినము 'యథా
రాజాత తథా ప్రజా' యను, నీజనవాదంబు వింతయే యిపు డనుడున్.

401


క.

చిరబోధబాధచే వే, సరి కేసరి వలికె నంత చపలాత్ముఁడొకో
పరమసఖా సంజీవగుఁ, డరుదేరం దెలిసిచూత మాయమ్మేటిన్.

402


క.

పిలిపింపుమనిన దమనకుఁ, డులుకున నను నేటికార్య మూహించితి పిం
గళకా నీ వెవ్వనిఁగాఁ, దలఁచితి వానిర్భరప్రతాపప్రబలున్.

403


క.

ముదలింపవచ్చు నెటు ది, గ్విదితప్రభు నతనివాని వీనిన్బలె ని
ట్టిదియైన మంత్ర మేక్రియఁ, దుదిముట్టుం జెప్పుమా యతులనీతినిధీ.

404


క.

పరిపక్వమంత్రబీజము, నిరతిశయారంభపాలనీయము దానిం
బరిభిన్నముఁ జేసిన నం, కురదర్శన మగునె నీతికోవిద చెపుమా.

405


వ.

ఇందులకుఁ బ్రథమోదాహరణం బగు నొక్కయితిహాసంబు గలదు దాని నాకర్ణిం
పుము.

406


క.

కల దుత్తరమున నతిని, స్తులవస్తువిశేషమహిమధుర మధురధరా
వలయపుర మధురతేజో, బలసారసబంధుఁ డది సుబంధుం డేలున్.

407


క.

అలఘుకళావిలసితుఁ డగు, నలరాజు సుబంధుఁడయ్యు నసుబంధుండై
జలధిపరీతాఖిలభూ, తలవిహరజ్జనుల సంతతము పాలించున్.

408

క.

జనలోకపారిజాతుం, డనదనరి యపారిజాతుఁ డగునమ్మహిభృ
త్తనయు నిజాస్తరణంబున, ననఘా యొకయూక మహరహము వర్తించున్.

409


క.

అది మది వేగిర మెఱుఁగక, యదనారసిసురతఖిన్నుడై రా జెంతే
నిదురింపఁ గదికి త్రావుం, దదుదయశోణితముఁ గడుపు దనివి సనంగన్.

410


క.

మఱియుఁ బ్రమాదాదులఁ జే, టెఱుఁగక పైపొటుకులేక నెక్కటిశయ్యం
గఱచుకొని తనకు నేయ, క్కఱపాటునులేక కొంతకాలముఁ గడపెన్.

411


క.

మారుతవశమున నపు డా, భూరమణవతంసుపానుపునఁ జండతరా
కారము డుండుభుకం జను, దారుణమత్కుణ ముపస్థితంబై నిలిచెన్.

412


క.

నిలిచిన మందవిసర్పిణి, యల మత్కుణముం బ్రకల్పితాతిథ్యము చె
న్నలరించి చాలు నిఁకనీ, నెలవునఁ గాలూఁదవలదు నీ వేగుమనన్.

413


క.

నిరవధితృష్ణావిరచిత, నరదంశనగుణము మత్కుణము దీనంబై
శరణని మందవిసర్పిణి, చరణంబుల వ్రాలి దీమసంబునఁ బలికెన్.

414


క.

దైవాధీనంబున నిట, కై వచ్చితి నొండుకడకు నరుగ న్దిరుగన్
నావసమె యిందు నెలకొని, త్రావెద రాజన్యశోణితము నీకరుణన్.

415


క.

నావిని మందవిసర్పిణి, దా వంతం గుంది తీక్ష్ణదంష్ట్రుండవు దూ
రావసధుండవు డుండుభు, కావారక కడుపుచి చ్చెగసినపుడెల్లన్.

416


క.

ఒడలు బడల్పడఁ గఱిచినఁ గడునెవ్వడి నదరి లేచి కంకటిపడి న
ల్గడల వెదకించి కానం, బడ నరపతి నిన్ను నన్నుఁ బరిమార్పించున్.

417


క.

తులువా నీకతనమునఁ జెడ, వలె నటు జాగుడిగి యిచ్చవచ్చినదెసకున్
వెలువడు మిపు డనఁ జరణం, బులమీఁద న్వ్రాలి డుండుభుక మిట్లనియెన్.

418


క.

నీ వెందు నిలిపి తచ్చోఁ, దావై కాలూఁదియుండెదం బొట్టకు నీ
వేవేళఁ దయదలంచితి, వావేళనె రాజరక్త మాహారింతున్.

419


క.

విడనాడకుమని దైన్యం, బడర న్మత్కుణము ప్రార్థనాలాపములతో
గడుఁగరఁగించిన నాదృతి, గడలుకొన న్యూక మట్లుగా కని పలికెన్.

420


సీ.

ఒండుదిక్కునకుఁ బోనోపలేనని కదా యర్థిఁ బ్రార్థించె దట్లయిన నుండు
పతి రతిశ్రాంతిఁ దల్పమున నిద్రితుడైనతఱిఁ జేరి నెత్తురు ద్రావి బ్రదుకు
మిది నీకు సమయ మం చది యూరకుండిన వాఁ డక్రదోషంబున న్వినీచ
గుణము మత్కుణ మతిక్షుత్పీడ శయ్యోపవేశుఁడౌ నమ్మర్త్యవిభునిఁ గఱిచెఁ


తే.

గఱువ నరనరుఁ డదరి మేల్కాంచి పనుల, జనుల సజ్జ నిరూపింపఁ బనుప వారు
దివియ లవ్వేళఁ గొనుచు నేతేర నరిగి, నికటరంధ్రాంతరము డుండుభుకము సొచ్చె.

421

క.

కాలవడిలేమిఁ గాడ్సడి, పోలే కున్నెడనెయుండఁ బొడగనవ్రేళ్లన్
గీలిచి మందవిసర్పిణి, నాలోనం బులిమివైచి రసువులు వెడలన్.

422


వ.

డుండుభుకమ్ముం జేర్చుకొని భిన్నమంత్రంబై యూక చచ్చె మంత్రంబు వెలిఁబుచ్చ
రాదని దమనకుం డాడినఁ బింగళకుం డవ్వాక్యంబులు చిత్తంబున కెక్కి నిక్కువం
బుగా వగచి యమ్మంత్రికుమారున కిట్లనియె.

423


క.

నాపై సంజీవకుఁ డతి, కోపంబున రాక కెద్ది గుఱుతు సునీతి
వ్యాపారశీల చెపుమా, గోపనగతి ననిన దమనకుం డిట్లనియెన్.

424


క.

వానతఱి నోరబాగై, యానన మమరంగఁ గొమ్ము లపనమ్రంబుల్
గా నిటకు వచ్చు నతఁ డది, గో నిన్ను వధింపవచ్చుగుఱు తెప్పటికిన్.

425


వ.

అని యభిజ్ఞానంబుఁ జెప్పి యప్పంచాస్యంబున కుపాస్యంబై యాస్యం బలర నవ్వం
చకం బచ్చోటు వాసి మందగమనంబున సంజీవకు డాయంబోయి వెడవెడఁ దల
యూఁచి నిట్టూర్పు నిగిడించుటయు నతండు దమనకుం బరికించి సఖా సుఖంబునం
బొదలుదే భద్రమే యనిన నమ్మంత్రితనయుండు.

426


ఉ.

చిత్తము నిర్వృతంబు దృఢసేవ ఘటించిన విత్తము ల్పరా
యత్తము లాశజీవితములం దొకయప్పుడులేదు వృత్తు లా
పత్తివిధాయినుల్ చ్యవనపాటన మెక్కడి భద్ర మేడ మే
ల్గ్రొత్తలె రాజసంశ్రితులకుం బలుమాటలు వేయునేటికిన్.

427


చ.

కనలు వహించి యాపదల గాసిలఁ డెవ్వఁడు బోంట్లచేత నే
ఘనునిమనంబు ఖండితము గా దిల నెవ్వఁడు నేర్చుకాలము
న్గనుఁగొన నేవనీపకుఁడు గౌరవమొందె ఖలాప్తిసౌఖ్య మే
జనుఁడు వహించె రాజులకు సత్ప్రియుఁ డెవ్వఁడు నాకుఁ జెప్పుమా.

428


చ.

నలఁకునఁ జూచి యీఁ డడిగినం గసరుం గృశియించి యున్నచో
నలరుఁ బ్రపూర్ణుఁ డైన నెరయం బరికింపఁగఁలేడు నాకు నీ
కొలు విక జాలు నన్నఁ గుసిగుంపులఁ బెట్టు వధింపఁజూఁచు గే
వలనరకంబుగా కొలంచువారికి దుష్ప్రభుసంశ్రయం బిసీ.

429


ఆ.

తనువుఁ బొదలనీఁడు తాపంబు బుట్టించుఁ, బస్తుఁ బెట్టు మూలఁ బాఱవైచుఁ
గొలుచు సజ్జనులకుఁ గుత్సితవసుమతీ, వల్లభుండు వేఁకివంటివాఁడు.

430


చ.

నగవులకుం బ్రసాదవచనం బొక టాడఁడు మ్రోల నిల్చినన్
మొగ మటు పెట్టు గేలొగిచి మ్రొక్కినఁ జే మెదలింపఁ డాజిలోఁ
బగఱ నడంచి కోల్పడినపాటును గెల్చినగెల్పు నెంతయుం
గగనసుమం బొనర్చు నొసఁగంబడునో యని దుష్ప్రభుం డిలన్.

431

ఉ.

కాననవాసియైనను సుఖంబు విశిష్టగృహాన్నభిక్షకుం
డైనవరంబు లూఖలకణాశనుఁడైన శుభంబు కర్షకుం
డైనను మేలు నీటజఠరానల మార్చుట లెస్స చూవె స
న్మానకరుండుగాని నరనాథు భజించుటకన్న నేరికిన్.

432


చ.

మడఁగిపడుండఁ బ్రానులకమంచపుఁగుక్కికి నిల్వుఱెల్లుపు
ల్గుడిసెకు నొండు రెండెనుపగొడ్లకు నోరికిఁ బోఁక ప్రక్కకున్
గుడువఁగఁ గూటికి న్మొలకు గోకకు సీదిర మెంతరోఁత యే
వడువున దుష్ప్రభుం గొలువవచ్చు నిసీ యను జీవికోటికిన్.

433


చ.

పలికినమాట నిల్వఁ డెడపందడపం జెడనాడు వచ్చు మె
చ్చుల దిగమ్రింగుఁ దొల్దొలుతఁ జూచినచూపులఁ జూడఁ డేర్పడం
జులుకదనం బొనర్చు నెరసు ల్ఘటియించు లదల్చివైచుఁ గే
వలనృపసంశ్రయంబు పగవారలకు న్వల దివ్వసుంధరన్.

434


మ.

హతదాక్షిణ్యు లనర్థకారు లభిమానాధ్యాత్ము లవ్యంజన
ప్రతిపక్ష ల్గుజనప్రియంవదులు సంపత్సన్నిపాతస్మృతి
క్షతికు ల్సత్యపరాఙ్ముఖు ల్ధనపిశాచగ్రస్తు లాద్యావన
చ్యుతు లక్షాంతు లనాంతరంగికులు రాజుల్ గారె యూహింపఁగాన్.

435


క.

చుట్టము లెవ్వరు దేశం, బెట్టిది యాయువ్రజంబు లెట్టివి కాలం
బెట్టిది యే నెట్టిడ బల, మెట్టిది నాకని తలంపుమీ నీ వనినన్.

436


వ.

దమనకు నాలోకించి సంజీవకుం డను ననుజీవులకు దుష్ప్రభుసంశ్రయంబు గాదని
యును దేశకాలంబులు విచారింపవలయుననియును నన్యాపదేశవర్ణనాసందర్భం
బుగా నంటి విమ్మాటలకు నిమిత్త మేమియొకో యని యూరకుండిన వెండియు
దమనకుం డిట్లనియె.

437


ఉ.

నావచనం బమోఘమని నమ్మి దురూహలత్రోవఁ బోక సం
జీవక యేగుదెంచితివి సింహముఖంబున కెట్లు భద్రసం
భావన సేయుదుం గద విపద్దశ లొత్తినచోట నోర్వ నా
హా విభుఁ డీరసించెనుగదయ్య నిమిత్తములేమి నీపయిన్.

438


క.

సరసవినీతరసానీ, తరసము విరసత నగల్చి తనసుభటపరం
పర కిత్తు ననియె బతి యె, వ్వరు ది క్కిఁక నీతు లున్నవా రాజులకున్.

439


క.

పరివారము దూరి వసుం, ధర నిడి వడిఁ దెల్పె నేకతంబున నన్నున్
ద్విరదారి చీరి చిత్తం, బెరియంగాఁ బిడుగువంటి యీదుర్వార్తన్.

440

వ.

ప్రాణసమానుఁడవగునీకుఁ గప్పిపుచ్చరామిం జెప్పితి నిది నీమనమ్ముననె యుండనిమ్ము
నావిని సంజీవకుండు విషాదవిహ్వలుండై.

441


క.

ధర నిరవధిచింతాసం, భరమునవలె శిరము వంచి పరికించుగుణా
కరు సంజీవకుఁ గనుఁగొని, గురుమాయాశాలి దమనకుం డిట్లనియెన్.

442


క.

చింతానలమునఁ జేతః, కాంతారము గుమిలెఁ బ్రాప్తకాలము నారా
ధింతువుగా కన నతఁ డ, త్యంతధృతిస్ఫురితచిత్తుడై తనలోనన్.

443


చ.

కరిగమన ల్దురాత్మకులఁ గాని రమింపరు హీనజాతికా
పురుషులఁ గాని భూభుజులు ప్రోవరు కానలఁగాని మేఘము
ల్గురియవు సత్యశౌచములకుం బెడఁబాసినవానిఁ గాని యిం
దిర వరియింప దుర్వి యవనీతులగాని భరింప దెంతయున్.

444


క.

పలుగూఁత లఱచువానిన్, గలు ద్రావెడువానిఁ జెవులు గఱిచెడువానిన్
బొలఁతులఁ దెచ్చెడువానిన్, దొలగింపక సంతరింపుదురు రాజన్యుల్.

445


క.

ఏకగ్రీవముగా నా, లోకన మొనరించి నిచ్చలుం గొలిచి తుదిం
గా కెడసితిఁ గద కలవే, మో కటకట సత్యశౌచములు రాజులకున్.

446


చ.

నలినములంచు రేలు కొలనం కలహంసకులంబు రిక్క నీ
డలఁ గబళించి కాంక్ష మగుడం గడకేగి మనోజ్ఞగంధము
ల్చిలికెడుతమ్ములం బగలు చేరనిచాడ్పున మోసపోయి చం
చలులగువారి కెక్కడివి సత్యపదార్థములందు నమ్మికల్.

447


ఉ.

దోషగుణంబుఁ కూర్చి కుపితుండగు నాతఁడు ప్రార్థనావిధిం
దూషితుఁడై యభీష్టఫలదుండగు దోషములే కకారణ
ద్వేషముఁ బూనియున్న కుపతిం బ్రకృతిస్థునిఁ జేయఁ బ్రార్థనా
భాషలఁ గాదు సంశ్రయణభంగులఁ గాదు ఘటింప దీఁగులన్.

448


చ.

ఫలితచికిత్స రోగములఁ బాప శుభక్రియల న్మహాఘము
ల్పొలుపఱఁజేయ నీతిధనము ల్బహుభంగులఁ గూడఁబెట్టఁ
గేవల పరతంత్రులై మెఱయు వైద్యవిపశ్చిదమాత్యులుం ధరా
తలపతిఁ బాసిపోవుదు రతండు కృతజ్ఞుఁడు గాక యుండినన్.

449


చ.

లవణపయోనిధానసలిలంబు ఘనాఘనదేశసంగతం
బవుచు మనోజ్ఞతం బొరయు నమ్మధురాంబువు వార్ధిఁ జేరి యు
ప్పువుగతిఁ గుత్సితం బమలమౌ విమలం బతికుత్సితం బవుం
దవిలి మహోత్తమాశ్రయమున న్మఱి తుచ్ఛసమాశ్రయంబునన్.

450

చ.

లలితపటీరపాదపములం జిలువ ల్గమలోజ్వలజ్జల
స్థలముల గ్రాహము ల్గుణులచక్కిఁ బడ ప్రతికూలదుర్జనుల్
పొలుచు నిధానజాతముల భూతములుం గమనీయమాక్షికా
వళి సరఘ ల్సుఖంబులకు వారనివిఘ్నము లేర్పడుంగదా.

451


క.

కేతకు లురుకంటకసం, ఘాతులు జంబాలజములు గంజాతంబుల్
నాఁతులు కుటిలస్వాంతలు, భాతుందిలమణులు దోషపటలావృతముల్.

452


క.

అను సంజీవకుపలుకులు విని దమనకుఁ డనియె నెట్లు విశ్వసనీయుం
డనవచ్చు మానసంబునఁ, గనులు న్వెలిఁ గనికరంబుగల నీరాజున్.

453


మ.

పురతఃప్రాంజలిసాశ్రుదృగ్జలజుఁ డుత్ఫుల్లాస్యుఁ డాశ్లేషణా
చరణారంభణకేళి సత్ప్రియకథాసంప్రశ్నదత్తాధికా
దరుఁ డున్మాయి బహిర్మహామదురు డంతర్గూఢహాలాహలుం
డరుదే దుర్జనుఁ డెంత శిక్షితుఁ డపూర్వాఖర్వనాట్యౌచితిన్.

454


క.

ఇతరోత్కర్షణమౌన, వ్రతుఁడు నిజశ్లాఘనప్రవక్త సుసాధు
ప్రతిపక్షిదుష్టరక్షా, రతుఁడు సుమీ కుజనుఁ డైనరా జూహింపన్.

455


సీ.

కరుణావిలాస మేగతిఁ గప్పిపుచ్చునో కోపంబు కన్నులఁ గురియుచుండు
సత్యభాషణము లెచ్చటఁ గట్టిపెట్టునో బోయబొంకులె నోరఁ బొదలుచుండు
నుపకారశరణ మె ట్లుపసంహరించునో పరిపీడహృదయంబుఁ బట్టకుండు
సౌదార్య మె ట్లదృశ్యముగా నొనర్పునో పరమలోభము బుద్దిఁ బాయకుండు


తే.

నీతి యేనూతఁ ద్రోయునో నెరయ శుద్ధ, ముష్కరత్వంబు సేఁతల మోసు లెత్తు
మేలు డిగఁ ద్రావి కీ డుద్గమింపఁజేయు, పాపకర్ముండు రాజైన బ్రదుకుగలదె.

456


చ.

అవనిపుఁ డెట్లు భాషితము లాడు శఠాధిపుఁ డెట్లు దృష్టిపా
టవము వహించు రా జెటు లోడంబడు కోరి విన న్వధూరతో
త్సవవిముఖుండు శంభువరదాననియుక్తుఁడు నోరఁగన్నులం
జెవులను బంచమేఢ్రుఁ డెడసేయక శిశ్నము లూఁదియుండుటన్.

457


చ.

తిమిరనివారణక్రియకు దీపము వారిధి విస్తరింపఁబో
తము చవిఁ బాపవహ్నిరవితాపభరం బడఁగింప నాతప
త్రము కలుషంబులం జెఱుప ధర్మము బాల్పడియుండుఁ గాని య
క్కమలజుఁడు న్సుఖోద్యముఁడు గాఁడు దురాత్ముని జక్కఁజేయఁగన్.

458


వ.

దమనకునకు సంజీవకుం డిట్లనియె.

459


ఉ.

సాధుమధుస్పృహందివససాతిగమంబు రుహాంతరాళసం
రోధము చంచరీకనికురుంబ మెఱుంగకపోవునట్లు తృ

ష్ణాధృతి నానుకొన్న మనుజప్రసరం బనుజీవితేచ్ఛ నచ్ఛా
ధముడైన భూవిభుని నంటుఁ దదాగతబాధఁ గానమిన్.

460


చ.

సరసులతోడి నెయ్యములు జాఱ మదాళికఠోరదుర్గమ
ద్విరదశిరస్స్ఫురత్కటకదేశముల న్వసియించి తచ్చల
త్పరుషతరశ్రవోనిహతి భగ్ననిజాంగకమై పొరింబొరిం
ధరఁ బడి తేఱి నెమ్మనమునం దలఁచు న్బిసినీవిహారముల్.

461


వ.

నాకథ యట్టిద.

462


క.

కడుఁగఠినుం డగుభూపతి, కడఁజేరిన నిలువనీడ గలదా చెడదా
పుడమి నొకశశము వేసవి, యెడ దాపనిరాతి నాశ్రయించిన కతనన్.

463


క.

నావిని దమనకుఁ డలసం, జీవకు నీక్షించి నీతిశీలా యేలా
గీవిధముఁ దేటపడఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

464


చ.

మడువుల నున్ననీ రివుర మందవిహారము మానె వాయువు
ల్పడమర సాగఁ బర్వతములం దవము ల్దలలెత్తె నెండలం
బడుకలు వ్రస్సెఁ గూలె మృగపంక్తికిఁ బాంథులకు న్ధరిత్రిపై
నడుగిడఁ బ్రాణసంకటము నైన యొకానొకమండువేసవిన్.

465


క.

వనయవసవిరహితంబగు జనసంచారంబు బారి వారనిజాలిం
దను వెరియం దీవ్రచరుం, డనుశశరా జొక్కనాఁ డుదాత్తత్వరతోన్.

466


చ.

నిలువక వచ్చివచ్చి ధరణిం జిఱుపెంచికలు న్వసుంధరం
గలసినగోడలుం జివికి గంపలఁ గాచిన వెఱ్ఱిసొఱ్ఱతీ
వలు చిగిరెంత గంటగమివాతులు గప్పిన పూడుపాఁతఱ
ల్గలయొకయూరిపాడు పొడకట్టినఁ జేరఁగఁ బోయి యక్కడన్.

467


క.

నేలంగలసిన యొకదే, వాలయనికటమున నారయం బొడవై హిం
తాలము గతి మెఱయుశిల, న్బోలఁగ నలశశకులాధిపుఁడు గని వేడ్కన్.

468


వ.

చేరువం బోవ దూరంబుగాఁ బరపంజుకొని యున్నతచ్ఛాయం గాల్కొనంగోరి
తదగ్రంబున నిల్చియుండెఁ బ్రొద్దునుం బెరుగుచుండ నీడయుం దఱుగుచు వచ్చె
నట్లు మధ్యాహ్నంబునకు ఛాయానుసారియై మూలంబునకు వచ్చి.

469


చ.

అనలమువంటి యెండ నొడ లారట మందఁగ నాత్మలోన ని
ట్లని తలఁచె న్శశం బతులితాకృతిసంపదఁ జూచి దీనిడాఁ
పున వసియించి యిట్లయితిఁ బ్రొద్దొకచాయ వసించె బండఁజే
రిన దురవస్థలం బొరయరే జనులం చది వోయె నెవ్వగన్.

470

వ.

కుత్సితరాజసంశ్రితుండ నగుట నే నాశశంబునకుం దోడువోయినవాఁడ మృత్యు
ముఖప్రవిష్టులకు బ్రతుకులేదు.

471


క.

పలువురుక్షుద్రులు మాయా, వులు పామరవసుమతీధవునికడ నున్నం
బొలియింతు రుత్తములఁ గే, వల ముష్ట్రముఁ జంపి మెసవవా కాకాదుల్.

472


క.

నావిని దమనకుఁ డలసం, జీవకు నిక్షించి నీతిశీలా యేలా
గీవిధము తేటపడఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

473


చ.

విటపసమృద్ధిఁ బత్రములవ్రేఁగునఁ బందిలిగొన్న కానుగుం
దుటుములు గట్టి యెండపొడ దూఱక ఘోరకఠోరజంతుప
ర్యటనదురాప మొక్కభయదాటవి రాజిలు నచ్చట న్మదో
త్కట మనుసింహ మప్రతిమగర్వధురంధర మొప్పు దానికిన్.

474


క.

పులియును నక్కయుఁ గాకియు, నలయక పరిచర్య సేయు నవి యొకనాఁ డ
ప్పొలమునఁ దిరుగుచు నొకచో, ములుగంపలు మెసవునుష్ట్రము న్గని తమలోన్.

475


క.

ఎక్కడిమొగ మెక్కడిపొడ, వెక్కడిరూ పేడగమన మెక్కడికంఠం
బెక్కడ వినము కనుంగొన, మిక్కొంకరమెకము ననుచు నేడ్తెఱ దానిన్.

476


క.

బలిభుక్ఫేరువ్యాఘ్రం, బులు డాయంబోయి పలికె మున్నెన్నఁడు నీ
పొలమున మెలఁగవు చెపుమా, తెలియఁగ నెందుండి నవచ్చితివి మృగముఖ్యా.

477


క.

కాననసత్వంబులలోఁ, గానము నీవంటిరూపు కడువెఱఁ గయ్యెన్
మానిబిడాద్భుత మఱఁ జెపు, మా నీవిధ మనిన నది యమర నిట్లనియెన్.

478


చ.

నను విను చోళమండలమున న్వసుమంతుఁడునాఁ బ్రసిద్ధిఁ గాం
చినయొకసెట్టి యుండు నలసెట్టెన మారునిలాఁతి కేగుచుం
దనధనరాశి పైనిడినఁ దాల్చి హుటాహుటి నేను భానుమం
తుని కిరణాంకురంబులును దూఱనియొండొకకానఁ బోవఁగన్.

479


మ.

సుషిరాస్యస్థలజాతఝాంకరణకక్షుణ్ణాశ మభ్రోచ్చల
ద్దృషదాస్ఫోటనపాతిభంబుకురజోతిగ్రస్తకూలంకషా
విష మున్మూలితరూఢమూలవివిధోర్వీజంబు బాహ్యాకిర
జ్ఝషకస్థానజలంబు వీచె నొకజంఝామారుతం బుద్ధతిన్.

480


క.

పినపినమెఱుపులు పొటిపొటి, చినుకులు మనసమసక లెసఁగు చీఁకట్లుం దో
చిన నొకరినొకరు గానక, చని రాలోఁ బసియుఁ గన్నచాయలఁ బఱచెన్.

481


క.

ఆనిశిఁ బసియును నొండొక, మానిసియుం బడఁడు దృష్టిమార్గంబున క

ట్లేనును గాడ్పాటునఁ జనఁ, గా నొకచో నుపరిభరము కంపలఁ దవిలెన్.

482


క.

తూరుపు తెలతెలనై రా, గా రువ్వున విసరునీఁదగాడ్పులు నయ్యా
సారమును ముట్టుకొనె నేమైరో నే నెఱుఁగ నిచట నాఁగితిఁ బదముల్.

483


వ.

నాపే రుష్ట్రంబు.

484


క.

అని తనకథ నెఱిగించిన, విని వాయసముఖులు గారవించి సుహృత్త్వం
బనఘా పాయక మాతో, నొనరింపుము నెమ్మిఁ గలసియుండుద మనుచున్.

485


వ.

ప్రత్యయపూర్వకంబుగా నతని నాదరించి కథనకుండనునామం బిడి తెచ్చి మదో
త్కటంబుం గానుపించి యభయదానంబుఁ బెంపుసేయించినఁ గాకవ్యాఘ్రగో
మాయువులం గలసి కొంతకాలంబు ప్రవర్తించె.

486


చ.

అటఁ జటులప్రతాపభయదాశువిశంకట మమ్మహామదో
త్కటము విదాహమోహకటకశ్రమశోకపురోగరోగసం
కటమున డస్సి వేఁట లరుగం దిరుగ న్వరగంధసింధుర
చ్ఛటనము నొంప వంప వడి చాలక నేలకు వ్రాలియుండఁగన్.

487


క.

చరణముల వ్రాలెఁ బులి య, క్కఱ డగ్గరి మ్రొక్కె వంచకము ప్రణమిల్లెన్
గరటము భద్రమె శుభమే, పరిణామమె యనుచు వినయపాటన మమరన్.

488


క.

నతిఁ జేసి నిలిచి దంతి, ప్రతిక్షణీకుక్షిదావపావకుఁ డేర్చెన్
గతి చెపుమా యాహార, స్థితి కీవని ఱంతు సేయ సింహం బనియెన్.

489


చ.

శితనఖరాంకుశాగ్రములచేఁ బ్రతివాసరము న్మదావళ
క్షితిపుల వ్రచ్చి మజ్జము భుజింతు మదంచితభుక్తశేష మా
శ్రితులకుఁ బెట్టుదుం దగభుజింతురు మీరు శరీరపాటవం
బతిశయితంబుకాదు గమనాగమనంబుల కేమి సేయుదున్.

490


క.

వ్యవహారయోగ్యములు గా, వవయవములు గలుగు టెట్టు లాహారము మీ
రవహితమతులయి కతిపయ, దివసంబులు ప్రోచికొనుఁడు దేహత్రయమున్.

491


క.

తనువునకు నుసుఱు వచ్చిన, దనుకం దనకామిషం బుదాత్తప్రీతిం
గొనితెండు పొండు మీ రన, ఘనతృష్ణం గాకజంబుకవ్యాఘ్రంబుల్.

492


ఉ.

తీరక పోయిపోయి బలుదెంపలఁ గంపల నేళ్ళ బీళ్ళఁ బ్రాఁ
బూరుల దారులం గడిదిపుట్టలఁ దిట్టల బోళ్ళ రాళ్ళ నీ
వారకరీరము ల్గలుగు వ్రంతలఁ గ్రంతలఁ జెట్ల గట్ల నా
హారమతిం జరించి జఠరానల మాఱక వచ్చి క్రమ్మఱన్.

493

క.

తమలోనఁ బొదరుకొని యు, ష్ట్రము వాకిట నిల్వఁబనిచి రహి నమ్మూఁడున్
సముఖమున కరిగె నం దుద, రముఁ జూపి యిభారితోఁ గరట మిట్లనియెన్.

494


క.

తిరుగఁగలదిక్కులన్నియుఁ, దిరిగితి మిఁక నేమి యలసితిమి మాపల్కు
త్తరు వాహా యాహారము, దొరకదు నిప్పస్తు లుండుదుమె నీమ్రోలన్.

495


ఉ.

లావరి యెప్పు డంగవికలత్వము వాటిలి క్రుస్సి యిమ్మహా
గ్రావగుహానివేశమునఁ గాల్కొని దేవర యుండ నెవ్విధిం
జీవిత ముండు భోజనము సేయకయే మును నిస్తరించు టె
ట్లావిధ మానతిమ్ము సుగుణార్ణవ యూరకయుండు టొప్పునే.

496


ఉ.

ఊరకయున్న నెట్లగు నిజోదరపూరణ మేటిజోలి యా
హారము లేదు మావలన నక్కట యే నొకమాటఁ జెప్పెదం
గోరికమీఱ నక్కథనకుం బొరివుచ్చి తదంగమాంసమ
జ్జారుణసేవ దేవ జఠరానల మార్పుము తేర్పు మాకృతిన్.

497


వ.

అని చెప్పిన నప్పని కొప్పనియదియై మదోత్కటంబు కరటంబున కిట్లనియె.

498


ఉ.

ఇట్టిది గాదె నీకుఁ దుది నేటికిఁ జెప్పెదు ధర్మతత్త్వముల్
చెట్టులఁ గట్టి నమ్ముమని చే తడియాఱదు చంపుటెట్లు దా
నెట్లు సహించు దైవ మిల నెవ్విధి మోయు ధరిత్రి యక్కటా
పొట్టకు గాఁగ నిచ్చె నఁటిపోకలఁ బోన మదిం దలంచినన్.

499


క.

ఉడుగు మిఁకను నట్లయినం, జెడితిమి నీసత్య మింత చేసె నయం బె
క్కడ బోధించిన దానిం, గడచెవులం గూర్పననుచుఁ గరటము మఱియున్.

500


క.

నిలుపోపరానియాఁకటఁ, బులి పిల్లల భుజగ మండముల భక్షించున్
గలుషములకు రోయునె నీ, తులు దలపోయునె బుభుక్షితుఁడు చిత్తమునన్.

501


ఉ.

ఏనిధి నీతిపద్ధతికి నేగు దయాపరతంత్రచిత్తుఁడై
కైవడినౌ మహదురితకర్ముఁడు గా కెటులుండు ధర్మసం
భావితుఁ డెట్లగు న్వినయపాటవ మేక్రియ నేర్చు గౌరవం
బేవలన న్భజించు సుఖ మేగతిఁ గాంచు బుభుక్షితుం డిలన్.

502


క.

కుక్షి దరికొన్నపట్టున, వీక్షించునె దేహి రుచులు వేళలు మునిహ
ర్యక్షము విశ్వామిత్రుఁడు, భక్షింపఁడె సారమేయపలలముఁ దొలుతన్.

503


గీ.

కలశజుఁడు చూడ నొకరాజు కానలోన, దండియాఁకటఁ దనమేను దానె తినఁడె
వఱపుతరిఁ బుణ్యధనులు గీర్వాణమునులు, చేరి పీనుఁగుఁ గఱిచి భక్షింపరోటు.

504

గీ.

కఱవునకుఁగాక ము న్నొక్కకాఁపుకొడుకు, దారపుత్రాదుల వధించి తానె తినఁడె
యాపదలచోట నియమకార్యము హుళిక్కి, శాస్త్రమత మిది వలదు దుస్సంశయంబు.

505


క.

పోషించి చంప నోహో, దోషంబని బుద్ధి దలఁచెదో సస్యములం
బోషించి కాదె కోయుదు, రీషత్కల్మషము గలిగెనే యచ్చోటన్.

506


చ.

అమితవిరోధి వీవు నిమిషార్థము నీకు శరీరపాటవం
బమరకయున్న రాజ్య మభియాతులపా లగునట్లుగాన నా
శమునకు మూలమిచ్చెడువిచారము దూరముఁ జేసి చంపు ము
ష్ట్రము జఠరాగ్ని నార్పుత రసం బిడు మాకు దయామయుండవై.

507


చ.

మొఱయిడు 'స్వాశ్రితాననసమోవహిధర్ము' వటంచు వేదముల్
పరిజనరక్ష మేని కనపాయిని దానిఁ ద్యజించి సూనృతా
చరణముఁ బూనియుండెదవు చాఁగురె జీవితవిత్తమానభూ
సురహరణాధికార్యములఁ బో గణియింప రసత్యదోషముల్.

508


క.

బలసంపదవలెనో కే, వలసూనృతభాషణంబువలెనో నీలోఁ
గలతలఁపుఁ జెప్పుమని గా, సిలి యేడ్చినఁ గాకిఁ జూచి సింగం బనియెన్.

509


క.

మతిమీఱ మీకు నాచే, నితనికి నిర్భీతి దాన మిప్పించితి రుం
చితి రానోళ్లనె నేఁ డు, ద్ధతులై వధియింపు మనియెదరు కథనకునిన్.

510


క.

మతిఁ జూచునె శరణాగతు, హతుఁగా నెటువంటికుటిలుఁ డైనను బుణ్య
శ్రుతులు పనిగొను మదీయ, శ్రుతు లాకర్ణింపనేరుచునె మీకాఱుల్.

511


క.

శరణాగతరక్షణమునఁ, దురగక్రతుఫలము దొరకు దొరకుయశోలం
కరణభృతి గలుగుఁ దొలఁగు, న్దురితంబులు చేర వొండు దుఃఖౌఘంబుల్.

512


ఉ.

చేరదు కీర్తి గౌరవము చిక్కదు రాదు శుభంబు పుణ్యముల్
నీఱగుఁ బాప మంటుఁ బ్రజ నిల్వదు కొల్వదు కమ్మకట్టు వీ
రారులు లెక్కగాఁ గొన రహర్దివసంబు విపత్పరంపరా
భారము కొండలై పెరుగు బాపురె సత్యములేనిపట్టునన్.

513


క.

కృపఁ గట్టిపెట్టి మీపా, పపుబుద్ధులఁ బట్టిపట్టి పగవుట్టి వీని
ష్కపటుఁ గథనకునిఁ బొరిగొని, నెపపడి పడియుండువాఁడనే నే నకటా.

514


వ.

అని ముగియం బలికిన హృదయనిర్భిన్నకాలాయసం బవ్వాయసంబు మృగపతి కిట్ల
నియె.

515


చ.

చెవిఁ జొర వేను విన్నపము జేసినమాట లొకించుకేనియున్
శివశివ యెంతవేడ్క యనుజీవులచావులఁ జూడ నిన్ను రే

పవలును గొల్చు టేయిడుమపాటునకా యిటులౌ నెఱుంగ నె
ట్టవునిఁక సత్యమౌ నెచటికైనను బోయెద నేను వీరలున్.

516


క.

అనఁజనదు తగులుతగులని, తనువుం బ్రాణంబుకంటెఁ దగులెద్దియొకో
చను తనువు విడిచి ప్రాణము, చనఁబోలనివారు గలరె సమయంబైనన్.

517


క.

పాటించి విడువ ముడువ, న్నీటబ్బకయున్నఁ బోవ నీకయ్యమునన్
బోటరిమగలకు శాటికి, గూటికి సీదిరమె రాచకొలు వేమిటికిన్.

518


క.

నుడువులన బయలుపందిలి, యిడి హస్తము బలుసుముంటేకెనయై దినముల్
గడపుచుఁ బొమ్మను నయ్యా, గడపునృపుం బాయుఁ జేగగలసైన్యంబుల్.

519


క.

తనకొఱకుఁ గఱఱకురిపులం, గని యని ముదలించి పొలియుఁ గన నశ్రద్ధం
గనుఁగొనక మనుజపతికిం, దనమేనిం బోలెఁ బ్రోవఁదగు భటపఙ్క్తిన్.

520


క.

నీ కెవ్వరు నేఁటికిఁ గ, ట్టాకడపట నుష్ట్రమొక్కఁ డసహాయముగా
భీకరపరిపంథిజయో, త్సేకివి గ మ్మని విషాదశిఖిలో మండన్.

521


వ.

కాకవ్యాఘ్రగోమాయువులు స్థలాంతరంబున కరుగ నుద్యోగించిన.

522


క.

బలహానికిఁ జిత్తమునం, గలఁగంబడి మాటపట్టు గలరాజయ్యుం
దల వంచి యుండెఁ గేసరి, ఖలుల కసాధ్యములు లేవు గద లోకమునన్.

523


వ.

అటు లబ్ధావకాశంబై కాకవ్యాఘ్రగోమాయువులతో నేకాంతంబు చేసి కథనకుం
బిలుచుకొని లోపలి కరిగి నిలుపంబడియె నందు వ్యాఘ్రంబు మ్రొక్కి నిలువం
బడి కేసరి కిట్లనియె.

524


మ.

సటలంకించుట యెప్పు డత్యవనతాస్యం బెత్తి నా నాహరి
త్కటకంబు ల్పరికించు టెప్పుడు దృఢస్కంధంబునం బొందుగా
దిట మానాసముఁ జేయు టెప్పు డకటా దేహంబు సామయ్యె నాఁ
కటి కడ్డంబుగ నారగింపు మివె కాకవ్యాఘ్రగోమాయువుల్.

525


క.

ఏవెంటఁ గడమపఱుపక, దేవా మము సంతరించితివి నీపాలం
జావగుట దమకుఁ దగు నటు, గావున భక్షింపు వనరఁగా నేమిటికిన్.

526


క.

అని పలికి తొలఁగె బెబ్బులి, చనవున పంచకము వాయసము దొడ్తోన
ట్లన పలికె నపుడు కథనకుఁ, డనఘుం డప్పదరు లారయక తా ననియెన్.

527


క.

మృగవల్లభ యాఁకటిచే, సగమైతివి నీకుఁ గైవసముగా నన్నుం
దగదె కనుంగొన నీపా, లగుఁ గథనకుఁ డారగింపుమా చేసేఁతన్.

528


క.

అనువచనము లోవెలిగాఁ, బెనురొదతోఁ గఱిచి వ్రచ్చె బెబ్బులి సింహ

బున కొసఁగెఁ గథనకామిష, మునఁ దృప్తింబొంది కాకముఖులకు నొసఁగెన్.

529


వ.

ఇట్టి మాయావు లున్నచోట సత్యంబు మూలఁబడి కల్ల వెల్లివిరియుఁ బింగళకుం
డును మదోత్కటంబువడువునఁ గుమంత్రి మంత్రయంత్రంబునం దగులువాఁడు
గాఁడె యన విని దమనకుండు క్షుద్రపరివారుం డగుట భూరమణున కొప్పుఁజే
యదొకో చెప్పుమన సంజీవకుం డతని కిట్లనియె.

530


చ.

అమరుమరాళసంవలితమై సితగృధ్రము హంసమట్ల హం
సము పరుషశ్మశానఖగసంవృతమై కనుపట్టు గృధ్రమ
ట్లమలమతు ల్దురాత్ము విమలాత్మునిఁ జేయుదు రల్పు లుత్తముం
దమవలె నుండఁజేయుదురు తద్ద్వయి నెయ్యది మేలు చెప్పుమా.

531


క.

కీ డెఱుఁగరు మే లెఱుఁగరు, చాడికి జెవి జేర్తు రుఱక జనలోకవిభుల్
పాడియుఁ బంతము గలచో, టేడ దొరకుఁ గొలువ నిలువ నెవ్వారలకున్.

532


క.

న్యాయం బన్యాయం బని, కూయిడి చెవి నిల్లు గట్టుకొని చెప్పంగా
నేయోజ న్వినకుండున్, మాయావులమాట లెట్టిమహిపతియైనన్.

533


క.

ఏకరణి వికలితాత్ముఁడు, గాకుండుం బతి పరోపఘాతనకరణా
స్తోకన్యాయామార్ద్రకి, ణీకృతముఖదుర్జనావినీతులచేతన్.

534


వ.

అవశ్యంబు రాజులు చెవి పేదలని పలికి వెండియు సంజీవకుండు.

535


క.

కులిశమును రాజుతేజముఁ, దలపోయ మహాకురాసదములచలములం
గులిశము వడు నృపుతేజము, పలుకులు వేయేల తునియఁబడు నెల్లెడలన్.

536


ఉ.

కావున రాజు నాదెస నకారణవైరముఁ బూని ద్రోహచిం
తావశుఁ డయ్యెఁ జాలు నిఁకఁ దద్భజనంబు మహాపరాక్రమ
శ్రీ విలసిల్ల గయ్య మొనరించెద గెల్చెద గెల్పు దక్కినం
జా వమరు న్దిగంతపరిషత్ప్రథ చేకుఱు శంక యేటికిన్.

537


చ.

సవనము లాచరించి కనుశక్రనికేతము భూరిదానధ
ర్మవిధు లొనర్చి కాంచుసురమందిర ముగ్రతపస్సమాధులం
దవులు మరుత్పథం బతులితత్వర శూరుఁడు గాంచుఁ బ్రాణముల్
ఠవఠవ లేక నిల్చి జగడంబున నేడ్తెఱ నూడ్చి పుచ్చినన్.

538


క.

గెలిచిన సిరి దొరుకు ననిం, బొలిసిన రంభాదియువతిభోగము దొరుకున్
దలగడ యది గద మృత్యువు, కలనికిఁ జావునకు నేల కళవళ మందన్.

539


చ.

బలము యశంబుఁ బ్రాభవముఁ బ్రాణము రాజ్యము మూలవిత్తమున్
గలన నరక్షణీయములు గావె మహామహులైనవారికిన్

గల దొకచిత్ర మాజి యుడుగ న్మృతి నిక్కువ మాహవార్థియై
మలసినచోట మృత్యు వనుమానము మాటలు వేయు నేటికిన్.

540


క.

పింగళకునితో మాఱ్కొని, సంగర మొనరింతు నొంతుఁ జంపుదుఁ జత్తున్
భంగమున కోర్వననునం, తం గటకట మిడికి పలికె దమనకుఁ డతనిన్.

541


క.

విమతునిబల మరయక వై, రముఁ గొనుజనుఁ డేర్పడం బరాభవ మందున్
సమధికబల మగుటిట్టిభ, కముతోఁ బగఁబూని చెడినకంధియపోలెన్.

542


క.

నావిని దమనకునకు సం, జీవకుఁ డిట్లనియె నీతిశీలా యేలా
గీవిధముఁ దేటపడఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

543


చ.

త్రిభువనకీర్తితాంబునిధితీరమున న్మును గల్గియుండుఁ డి
ట్టిభమిథునంబు దైవగతిఁ డిట్టిభి దౌహృదలాలసాంగియై
శుభమతి ప్రాణవల్లభునిఁ జూచి ప్రసూతికి వేళయయ్యె ధీ
విభవ యెఱుంగఁజెప్పఁగదవే స్థల మెయ్యది నాకు నావుడున్.

544


క.

టిట్టిభ మిట్లను నీకుం, గట్టనినీడములు గావె కంధితటంబుల్
పట్టయినచోట గ్రుడ్లం, బెట్టుము నీ వనినఁ డిట్టిభిక కనలెసఁగన్.

545


క.

మగనిఁ గని పలికె నేలా, తగుఁ తగదన కిటు పలికెదవు వనధితటి
జగతిని గట్టనిగూఁ డె, ట్లగు నీ కిది యంతకొంచెమా కనుఁగొనగన్.

546


ఉ.

పిట్టవు నీవు వారినిధి పెద్దల కెల్లను బెద్ద వెల్లి గాఁ
దొట్టు నొకానొకప్పు డతిదూరము తుంగతరంగసంఘముల్
బెట్టడఁచున్ హరించు నతిభీమభుజంగములీల నెట్టుగాఁ
బెట్టుదు నూతికట్టఁ బసిబిడ్డలు గావె మదండపిండముల్.

547


క.

కానకకాంచిన యీసం, తానము మనవలయు వార్ధిదరియేటకి నె
చ్చోనైన నిపుడ యొండొక, తానక మెఱిఁగింపు పెట్టెదం గ్రు డ్లచటన్.

548


క.

నావిని యెఱచెలువు కనుం, గ్రేవలఁ గేవలము తేరఁ గెరలి కఠోరా
రావమునఁ దనయనుంగుం, బావని నీక్షించి టిట్టిభం బిట్లనియెన్.

549


ఉ.

ఎక్కినవానికిం గుఱుచ యేనుఁగు నీ కసదైన నైతిఁగా
కెక్కువగానె న న్నెఱుగు నీసరిదీశుఁడు నాకు వార్ధికిన్
దిక్కరి మక్షికాంతరము దెల్పఁగ నేటికి గ్రుడ్లఁ బెట్టు మే
దిక్కుననైన వానిదెసఁ దేఱి కనుంగొనఁదీఱ దేరికిన్.

550


వ.

అనువచనంబు లాకర్ణింపంగూడక ప్రాణేశ్వరి ప్రాణేశ్వరున కిట్లనియె.

551

క.

ఇష్టజనోక్తులు వినక వి, నష్టదశం బొందుదుర్వినయుఁడు మరాళోలో
త్కృష్టోక్తిఁ జనక కాష్ఠ, భ్రష్టుండై తెగినకచ్ఛపముచందమునన్.

552


క.

అనుమాటలు విని టిట్టిభిఁ గనుఁగొని టిట్టిభము పల్కె గల్యాణీ యే
మినిమిత్తము హంసోక్తుల, విననొల్లక కమఠ మీల్గె వివరింపఁగదే.

553


క.

విను గతలకాచి యనిపే, ర్కొనునావచనంబు నిజమగు న్మగువా నా
కనురాగంబున నీకథ, వినియెదఁ జెపు మనిన నయ్యువిద యిట్లనియెన్.

554


ఉ.

కుంజకుటీవిహారములకుం జనఁ జెంచులు నిర్ఝరంబులం
గుంజరము ల్నటింప బలుగూడెపుబోయలు చాలు వేఁటసాఁ
గం జెలరేఁగి సాళువపుగ్రద్దలు గూండ్లకుఁ బుల్లుమోవ నిం
కం జెఱువు ల్భయంకరముగా నొకవేసవి దోఁచె తోచినన్.

555


క.

కేలెత్తి యిసుముఁ జల్లిన, రాలనియొకకానలో మరాళీవికస
న్నాళీకమధూళీమ, త్తాళీనాళీఖురాళి యగుకొల నొప్పున్.

556


వ.

అది సమగ్రశరంబును సమదసారంగభాసురంబును స్వర్ణపత్రరుచిరంబును నై
సంగ్రామంబును ననిమిషకులాధారంబును నమృతరసపూరసంభారంబును ననవద్య
తరువిస్ఫారంబును నై సురగ్రామంబును నిర్వియుక్తరథాంగంబును నిత్యకమలా
నుషంగంబును నిసర్గమధురగణచందంబును నై వైకుంఠధామంబును బరివేష్టితద్వి
జాతంబును బావనశిఖిసమేతంబును బరమనిగమపూతంబును నై హోమంబునుం
బురుడించు.

557


క.

అక్కొలను నాఁడునాఁటికి, వెక్కసమై క్రాఁచుపెట్ట వేసవుల నసల్
చిక్కజలమి విరిపోయినఁ, గొక్కెరలకు జయము మీలకు న్భయమయ్యెన్.

558


క.

ఆవిపినసరసిఁ గంబు, గ్రీవుం డనుకచ్ఛపము చరించు నతని క
చ్చో వికటసంకటము లనఁ, గా వరహంసములు రెండు గల వనుఁగుఁజెలుల్.

559


ఉ.

జాలిఁ దలంకి యవ్వికటసంకటకంబు లపారదూరయా
త్రాలసదీనతానతనిజాస్యు వయస్యుగుఱించి యిట్లనున్
రాలును నాఁచు జిక్కనిపురంబడియెం గొల నెట్టు నిల్వఁగాఁ
జాలుదు మెందుకేనియును జాలుదుమే నిను బాసి కచ్ఛపా.

560


క.

ఈయిరవున నఖమాంస, న్యాయంబున నున్నమనల నయ్యో చెడుగొ
ట్టయి యాఱడి విధి కుటిలో, పాయంబునఁ జేసెఁ గంటె పాయం ద్రోవన్.

561


క.

కావున నన్యసరోవర, సేవారతిఁ బోదుమా రసికవర్యా యిం
దీవుండు మనినఁ గంబు, గ్రీవుం డిట్లనియె వారికిం బ్రియ మెసఁగన్.

562

క.

లావును గలిగినవారలు, గావున మీతలఁపు లొప్పుఁ గద నేనన్న
న్మీవంటివాడఁ గాఁగద, యేవిధమున నిలుచువాఁడ నెక్కటి నిచటన్.

563


క.

అతివిమలపుణ్యమానస, యుతు లమలాకృతులు సుగతియోగ్యులు మఱి యా
శ్రితపక్షపాతు లకటా, హతమోహులభంగి నరుగనగునే మీకున్.

564


వ.

నా కెద్ది త్రోవ యని విన్నంబోయి యున్న గడుపునఁ జేయిడి కలంచిన ట్లగుటయు
మరాళంబులు గంబుగ్రీవు నూఱడించి.

565


క.

జడియకు మనఘా నీకుం, గడవారమె నిన్నుఁ బాయఁగా మాచిత్తం
బొడఁబడునె యొండుమాటలు, తడయక మాపనుపుఁ జేసెదవె యట్లయినన్.

566


క.

తరలక యేతత్కాష్ఠాం, తర మిఱియం బట్టు నిశితదంష్ట్రుల నది మే
మిరుగడలఁ గఱుచుకొని స, త్వర నాకాశమునఁ బఱచెదము నేఁ డొప్పన్.

567


చ.

అనఘ సరోవరాంతరమునం దిడునంతకు మానముద్రఁ గై
కొనవలయుంజుమీ యని సఖుం గమఠాగ్రణి నవ్విధంబునం
గొని యలవానజాలిపులుఁగు ల్గగనంబునఁ బోవ ద్రోవలో
చనమహమాచరించె విదిశానగరంబు సమగ్రసంపదన్.

568


క.

పరిఘలు గోటలు మేడలు, కరులు శతాంగములు హరులు కాల్బలములు భూ
సురులు భుజభవులు వైశ్యులు, చరణజులుం గలిగి యొప్పెసఁగు నవ్వీటన్.

569


క.

కరిబృంహితంబు లూఢ, త్వరపాకశికాశ్వహేషితంబులు రథ్యా
చరదఖిలజనరవంబులు, శరనిధి ఘోషించిన ట్లెసఁగ విని మింటన్.

570


వ.

కంబుగ్రీవుండు వికటసంకటంబులం జూచి.

571


క.

ఇల విననయ్యెడు నేత, త్కలకల మెఱిఁగింపుఁ డనినఁ గఱిచినదంష్ట్రల్
వెలువడిన కాష్ఠకాండో, ద్గళితంబై నేలఁ గూలి కమఠము పొలిసెన్.

572


క.

నీవును గంబుగ్రీవుని, కైవడి సుహృదుక్తియందు గాఢాదరముం
గావింపక చెడుద్రోవం, బోవుదు వని పలికి వల్లభున కది మఱియున్.

573


క.

పలికె నొకమడుఁగులోనం, గలదు ఝషత్రితయ మందు ఘననీతికళా
కలితములు రెండు తక్కిన, జలచర మతిమూఢతావశంగత మరయన్.

574


క.

నావిని టిట్టిభకము దన, దేవి నిరీక్షించి గుణవతీమణి చెపుమా
యావిధమంతయు వివరము, గా వేడుక ననిన నది మగని కిట్లనియెన్.

575


క.

ము న్నొకమడుఁగునఁ బ్రత్యు, త్పన్నప్రజ్ఞుం డనాగతవిధాతయు న
శ్యన్నీతి యద్భవిష్యుఁ డ, నన్నెగడు న్మూఁడుమీ లనఘ ఘనతరముల్.

576


సీ.

ఘనశిలాయుతమరుత్కపిలవిద్యుల్లేఖచండదావహుతాశసామిధేని
సమజమస్తకనగస్వరుపాతమహిమరుగ్జలజరాగమహోదశాణచక్ర

మధ్వన్యచరణలగ్నాందుబహుసింధుపాథోరసగ్రాహిబాడబంబు
ప్రేంఖదాతపశిఖిన్యూంఖంబుదశదిశావృతమృగతృష్ణాతివృష్టిఘనము


తే.

చించికాఫలహృష్టఘృష్టిప్రచండ, ఖరచతుష్కక్షరత్కోష్ణపరిణతాజ్య
పాకసురభితగిరిదృషత్ప్రసవకంబు, కటికివేసవి దోఁచె నక్కాలమునను.

577


క.

వెలిఁబొరలు నీటఁ గొండొని, నలఁగినయాఁతీగమడుఁగునకు నొండొకనాఁ
డలసేతరగతి వలగొని, వలఁగొని యొకవేటకాఁడు వచ్చెం జొచ్చెన్.

578


క.

చొచ్చి యగాధజలంబగు, టిచ్చం దలపోసి వేఁట కిది సమయము గా
దచ్చపుటెండలలోఁ బడి, వచ్చినతరువాతఁ దిరిగి వచ్చెద ననుచున్.

579


క.

అన్నీచుఁ డరుగుటయు ను, ద్యన్నీతిధనుం డనాగతవిధాత సము
త్పన్నమతి యద్భవిష్యుల, సన్నిధికిం బోయి ధీమసంబున పలికెన్.

580


క.

తెలతెలవారఁగఁ దోరపు, వలఁగొని యొకవేఁటకాఁడు వచ్చెం జొచ్చెం
జల మివిరినఁ జుట్టలతో, నలయక మరి మరలివత్తు ననియె న్జనియెన్.

581


క.

జల మివిరిన జాలరు లీ, తలమునకద నరసి వచ్చెదరు వారిచర
ప్రళయమగు నిలువవల దీ, నెలవును నొండెడకుఁ బోయి నిలుతమె బుద్ధిన్.

582


వ.

అనువాక్యంబు లాకర్ణించి ప్రత్యుత్సన్నమతి యనాగతవిధాత కిట్లను సఖా దూ
రంబున నేమికార్యం బుత్పన్నం బైనప్పటికిఁ బోలినతెఱంగుఁ జూచికొందము.

583


క.

నెట్టన నొండొకకార్యము, పుట్టిన నెవ్వనికి నిశితబుద్ధి గలుగు నా
దిట్టం డాకార్యముఁ గొను, గుట్టున జారద్వయమున గొల్లెతవోలెన్.

584


క.

నావిని యతిధీరత మే, ధావనవిధి యల యనాగతవిధాత యనున్
బావనమానస యిది చెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

585


చ.

గొఱియలమంద యాఁబసులగుంపు కృషిక్రియ దుక్కిటెడ్ల దొ
డ్డిఱికిటిపెళ్ళుకంప బలియించిన లోఁగిలిముల్లుపెండెముల్
తఱుపులగాడికోడి యల దామెనగాదెలఁ గొల్చుగల్గి యే
కొఱఁతయు లేకయుండు నొకగొల్లత యొండొకపట్టణంబునన్.

586


చ.

వన్నెలఁ బెట్టుఁగట్టుఁజలువ ల్చలువ ల్వెదచల్లుచన్నులన్
గన్నులకల్కి పూయు సిరిగందము మందమరుత్కిశోరముల్
జున్నులు రేఁప మెచ్చుముడుచు న్గడుఁజొక్కపుఁగ్రొవ్విరు ల్సరుల్
పన్నుశిరోథివీథిఁ గనుపట్టు నయారె యొయార మేర్పడన్.

587


ఉ.

పాయనిమందనుండి యడపాదడపా చనుదెంచుబోయనిన్
బోయినఁ జీరజిక్క దఁట పుణ్యము లేదని మానసంబునం

ద్రోయ కహోపరస్థలముఁ ద్రొక్కియుఁ జూచినయేని నాలుగేన్
గాయలు గాయ వచ్చెలువగర్భమునం దెటువంటిపాపమో.

588


క.

కని పెంచని గొడ్రాలది, గననొడలు న్దొడలు వడలు కటి నెన్నడుమున్
జనుదోయి మెఱుఁగుజిగిబిగి, యనయంబుం ద్రచ్చివేసిన ట్లొప్పెసఁగున్.

589


ఉ.

వేవిన నిద్ర మేలుకని వేఱొకబానకు నేర్పుతోడఁ బై
మీవడఁ బుచ్చి కవ్యమిడి మిట్టచనుంగవ రాయడింప మేఁ
దీవ నటింప నెన్నడుము డీలుపడం గటి గుల్కఁ గాచముల్
జోవలఁ బాడ జల్లఁ దరుచు న్వడిఁ దర్షిణి రజ్జుపాణియై.

590


చ.

వెడవెడ వేడివెన్నొరయు వేనలి మస్తకసీమఁ దక్రపుం
గడప యొకింత పయ్యెదకుఁ గాకరదోఁచును రోజమాజ్యపుం
బిడుతపికాంగనోక్తి వలపించు నెలుం గమరంగ వీట న
ప్పడఁతుక చల్లవిల్చుఁ గనుపండువు జారుల కాచరింపుచున్.

591


క.

అది దండపాలకుం డను, మొదలితలారి న్రహస్యమునఁ బిలుచు న్వాఁ
డెద నెఱుఁగకుండ నొండొక, కొదవయు రాకుండ వానికొడుకు న్బిలుచున్.

592


క.

ఈలీలఁ దిరుగఁ నొండొక, కాల మరిగె నరుగుటయు నొకానొకనాఁ డ
య్యాలరిగొల్లెత పట్టణ, పాలతనూధవునిఁ గూడి బహురతిగతులన్.

593


క.

చొక్కునెడ దండపాలకు, డక్కడి కేతెంచె నప్పు డాతనిఁ గని తా
స్రుక్కక తర్షణి తత్సుతు, నొక్కకుసూలమున దాఁచె నుచితం బెసఁగన్.

594


గీ.

దాఁచి యెదురువోయి దక్కినగతి నవ్వు, నివ్వటిల్ల వదననీరజమునఁ
గూర్చి చెట్టఁబట్టుకొని తెచ్చె లోపలి, కవదగారినారి యత్తలారి.

595


క.

తెచ్చి కుసూలములోపలఁ, జొచ్చినబొజుఁ గెగసి యెగసి చూడఁగ నపు డా
దిచ్చరి హెచ్చరికఁ బ్రియుం, గుచ్చి రతిక్రియలసొంపు గులుకుచు నుండెన్.

596


వ.

ఆసమయంబున.

597


సీ.

అట్టలెత్తిన ప్రాఁతమెట్టులు కడుగుటం బఱిచాఱికలతోడి వరువకాళ్ళు
నడిప్రాఁత ముతకగోణము మించు దులకించు ములుగత్తి యలిమిడి మూలికలును
కొడిదిపూసల నంటుకొలిపినమొలత్రాడు తలదుడ్డుచీరణంబులపొదియును
నొడిసెలపాలకావడి నుచ్చుప్రాతలగుది మూఁపుపై వ్రేలుగోర్పడంబు


తే.

తూఁతకొమ్ము చంకదోఁపినయెడమెట్టి తొర్లు గోవిధూళిధూసరితము
లైనకురులు నమర నాకస్మికంబుగా, మందనుండి యింటిమగఁడు వచ్చె.

598


క.

ఇచ్చిన జడియక కౌఁగిటఁ, గ్రుచ్చిన యలదండపాలకున కను నపు డా

దిచ్చరికంటే కావడిఁ, దెచ్చెను బతి చేయు మొక్కతెఱఁ గెఱఁగింతున్.

599


క.

కసరెత్తి ముక్కు డుస్సిన, ససరమువలె రేఁగి పరుషభాషల నన్నున్
విసువక పగఁబాటుచుఁ బొ, మ్మసమున నన దండపాలుఁ డట్లొనరించెన్.

600


క.

ఆరెకుఁ డట్లరుగుటయుఁ జ, కోరేక్షణఁ జూచి గోపకుం డను మహిళా
కారణం మేమీ తలవరి, కీరూపున వన్నె మెఱసి యిం దరుదేరన్.

601


క.

వచ్చుటయుఁ గాక నోరికి, వచ్చిన యిట్లేపు రేఁగి పదరుచుఁ జూడ్కిన్
గ్రచ్చెగయఁ బోవుచున్నాఁ, డచ్చెరు విది తెలియఁజెప్పుమా నా కనుడున్.

602


వ.

తర్షణి మగని కిట్లనియె.

603


క.

వెడనెడ నార్చుచుఁ బెఱికిన, పిడియము వలకేలఁ గ్రాల బిఱబిఱ వెంటం
బడి యాపోయెడు ముద్దుం, గొడుకుం దెగఁజూచె నెందుకో నే నెఱుఁగన్.

604


క.

తెఱుముడువడి మేన్వడకం, బఱిపఱి యగుతాల్మిఁ జావు పఱువెత్తి యహో
వెఱపున నిలుసొచ్చినఁ గడు, పఱిముఱిఁ జేపెట్టి కలఁచినట్లయ్యెఁ బతీ.

605


వ.

అట్లు భయాతురుండై యిలు సొచ్చివచ్చిన నచ్చిఱుతవాని నతిస్థూలం బగు కుసూ
లంబునం దాఁచితి.

606


క.

అప్పుడు కన్నుల నిప్పులు, గుప్పతిలఁగఁ గెరలి పండ్లు గొఱుకుచు వాఁ డా
చొప్పునన వచ్చి నన్నిటఁ, దప్పక వీక్షించి ప్రల్లదంబునఁ బలికెన్.

607


క.

ఎచ్చరిక నెఱిఁగి వెంటన, వచ్చితి నీయిల్లు సొచ్చె వాఁ డులుకున నేఁ
డిచ్చట లేఁ డెం దరిగెన్, దిచ్చఱి నిక్కువముఁ జెప్పితే మేల్గాదే.

608


క.

అని యదరవైచి న న్నడి, గిన వానిం జూచి మెత్తగిలఁబడ కంటిన్
నిను నెవ్వఁ డెఱుఁగు నెటు పో, యినవాఁడో నీకుమారు నెవ్వం డెఱుఁగున్.

609


క.

తలవరివి గావె యూరం, గలకొంపలఁ జొచ్చి చూచి కనుగొందువు నీ
కుల ముద్ధరించుకొడుకుం, దల యెవ్వరిమీఁద నొఱిగెదవు నీ వనినన్.

610


వ.

ఇప్పు డప్పరుషభాషణంబులం బలుకుచుం బోవుచున్నాఁ డనిగాదె వెలువరించిన.

611


క.

నిరవధికరాహుముఖగ, హ్వరనిర్గతిశీతభానుఁ డనఁ గట్టెదురన్
బురరక్షకసుతుఁ డుండన్, హరిణేక్షణ నెంతదాన వని పతి పొగడెన్.

612


వ.

కార్యం బుత్పన్నంబైనఁ దర్షణివలెఁ బోలినతెఱంగుఁ జూచికొందమని ప్రత్యు
త్పన్నమతి పలికిన యద్భవిష్యుం డమ్మాట లాదరింపక యూరకుండె. ననాగతవిధా
తయు నందు నిల్వ వెఱచి యల్పసలిలసరణంబున నొండొకసరపిజశరణంబునకుం
బోయె నాయెడ.

613


సీ.

కాఱుమొసళ్ళ నాకట్టుమందులు చరణాంగుళంబులఁ దాఁకుటుంగరములు
కడలేనినడగట్టి పడినపిక్కలు చుట్టి చెక్కినమొలత్రాళ్ళు చిక్కములును

జుంగు లల్లాడుగోఁచులు తండుగోలల నెట్టుకొల్పినమీలపుట్టికలును
బ్రతిదినాందోళి కాభృతి నల్పులై వెంట్రుకలు నిండి కాయలు గలభుజములు


గీ.

చెవులవెలుములు కుఱుబ్రాత చెవులనాగు, పడిగెప్రోగులు మెలిగొన్నపచ్చడములు
నమర గుమిగూడి జాలరు లరుగుదెంచి, రలరుమొగములతోఁ ద్రాటివలలు గొనుచు.

614


ఉత్సాహ.

వచ్చి తజ్జలస్థలం బవారణం గలంగి రాఁ
జొచ్చి జాలము ల్విదుర్చుచోట యద్భవిష్యుఁడు
ల్కిచ్చలోనఁ గందళింపఁ నెందుఁ జొత్తునంచు మేన్
ఱిచ్చపాటు వొంద నత్తఱిం జరించె నల్గడన్.

615


క.

మున్నాడి యొడలు డాఁపక, యన్నీటను జచ్చి తేలినటువలెఁ బ్రత్యు
త్పన్నమతి నీతిరతియుం, డెన్నిరుపముధీరతాపటిష్ఠుం డగుటన్.

616


క.

జాలరులు దానిఁ జచ్చిన, వాలువగా నిశ్చయించి వలెననక సరి
త్కూలమునకుఁ ద్రోచి సము, ద్వేలగతిం దిక్కులంబు వ్రీలన్ లీలన్.

617


క.

దుముకులు వైచుచు నాయా, సమయంబుల జలము లెత్తి చల్లుచు వలల
శ్రమలీల వైవ నయగుణ, విముఖుఁడు దొలుదొలుత యద్భవిష్యుఁడు చిక్కెన్.

618


క.

చిక్కిన లగుడంబునఁ దల, వ్రక్కలుగా మోది చంపి వైచిరి మఱియుం
బెక్కుఝషంబులఁ బట్టిరి, యక్కెలసము మాని తనిసి రది సందగుటన్.

619


సీ.

కైవర్తకశ్రేణి కనుబ్రామి యొకదొడ్డమనికి ప్రత్యుత్పన్నమతి వసించె
మతిబలంబున ననాగవిధాతయు నొండుకడకు బోవుటఁ జేటుఁ గానఁడయ్యె
విమతి గావున యద్భవిష్యుఁ డేమియు లేక పొలిసి జాలరులకు భుక్తియయ్యె
నతిమూర్ఖునకు నపాయము రాదె యిట్లని వరునకుఁ జెప్పి తావలము లేమి


గీ.

నంబునిధితీరమునఁ గులాయం బమర్చి, కొని కలంగుచుఁ డిట్టిభి గ్రుడ్లఁ బెట్టి
పొదిగె నేమఱుపాటు లేక దనఁబదన, కలుచపడకుండ నొండొంటిఁ గలసికొనుచు.

620


క.

టిట్టిభకాహంకృతికిం, గట్టల్క జనించి కడలికడ నొండొకచోఁ
బెట్టినగ్రుడ్ల హరించెం, బిట్టఱి వీక్షించి టిట్టిభిక గాఢార్తిన్.

621


చ.

కనుఁగవ భాష్పవారి దొరుగ న్వరుఁ గన్గొని దూరి యప్పు డి
ట్లనియెఁ బయోధితోఁ గలహ మావిహగంబున కెంతలేదు పొ
మ్మనక చెనంటినై భవదహంకృతి నమ్మి ప్రసూతినైతి ని
వ్వననిధితీరభూమిని వాఁడె హరించె మదండపిండముల్.

622


క.

జలనిధి యుత్కృష్టం బని, తెలిసియు నీ వలఁతి వగుటఁ దెలిసియు బ్రజ్ఞా
బలముఁ దుదఁ జదిమి యకటా, వలవంతం గంటి గౌరవము వీడ్కొంటిన్.

623

క.

నీకతనఁ దనకు వాటిలె, నీకాఱియ యనుచుఁ జిత్త మెరియంగా శో
కాకులమతిఁ బతి దూఱిన, నాకంఠక్రోధవివశమై ఖగ మనియెన్.

624


ఉ.

ఇంతదురంతచింత దగునే నను నెవ్వనిఁగాఁ దలంచితో
యింతి మదీయశక్తి యసుదేవసుదేవదురాసదంబు నేఁ
డింతకుఁ జొచ్చి వారినిధి యేపున మృచ్చిలిగొన్నగ్రుడ్ల గ్ర
క్కింతు భవద్ఘనార్తిఁ దొలగింతు ధరింతు యశఃపరిష్క్రియన్.

625


చ.

అని నిజదార నూఱడిలునట్లుగఁ బల్కి వయోవయోమణు
ల్దనుఁ గనుగల్గి కొల్వఁ జని తత్పతగాగ్రణి గాంచె ముందఱన్
ఘనబలఘాతిహేతిభయకంపసమాగతమేనకాసుతా
వనకరణప్రహృష్టహిమపన్నగముద్రుఁ బయస్సముద్రునిన్.

626


వ.

కని తత్పారావారతీరంబున.

627


సీ.

తనతల్లి కెగ్గొనర్చినపాప రామాత కడుపునఁ గడిఁది చిచ్చిడినవాని
గజకచ్ఛపాహృతిగ్రాసచక్వణతృప్తి వెలుఁగొందు జాఠరానలమువాని
ముఖసరిద్విటమధ్యమున నసాధు నిషాదఘోరవాహిని నుంచుకొన్నవాని
లావుపెంపువఁ గులగ్రావపక్షచ్ఛేదినిశితాసివేఁడి మానిచినవాని


గీ.

నెల్లజగములు దనలోన నిముడుకొనిన, నిశిచరారంభసంభోధినిజశిరోధి
దివ్యమణిబోలెఁ దాల్చి నర్తించువానిఁ, బరమకారుణపూర్ణు సుపర్లుఁ గనియె.

628


క.

కని మ్రొక్కి నిలువ వినతా, వనితాసమ్మదవిధాయి వచ్చినకార్యం
బనుచరముఖ్యా నాతో, ననురాగం బొప్పఁ జెప్పుమా నా కనుడున్.

629


మ.

పలికెం డిట్టిభ మోవిహంగకులదీపా కోప మేపార న
జ్జలధిగ్రామణి నీభటుండనని నిచ్చ ల్నే బ్రశంసింపఁ గా
సిలుగు ల్సేసి గణింప కేడ్తెఱ హరించె న్మత్ప్రియాండంబు ల
గ్గలమే దేవర కన్నసాగర మెఱుంగంజెప్పుఁ డాలావునన్.

630


క.

కాకున్న నింతగర్వం, బాకడలికి నెట్లు కలుగు నని టిట్టిభ ము
త్సేకత వినిపించిన రో, షాకులితస్వాంతుఁడై ఖగాధిపుఁ డనియెన్.

631


క.

ఏమేమీ నాసుభట, గ్రామణినని నీవు పల్కఁగాఁ డిట్టిభశం
కామగ్నుఁడు గా కబ్ది, స్వామి మహాహమిక నిట్టివాఁ డయ్యెగదా.

632


ఉ.

ధీరగరుత్సమీరణహతి న్సలిలంబులఁ జల్లి దృష్టదు
ష్టోరగకోటిజీవితము లూడ్చి తిమింగిలతద్గిలాదివా
శ్చారములం ఘనజ్జఠరజజ్వలనార్చుల వ్రేల్చి వార్ధి ని
స్సారముఁ జేసి గ్రమ్మఱ నొసంగదుఁ ద్వద్వనితాండపిండముల్.

633

క.

కులిశాయుధభీషణమై వెలిసిననాలావుఁ గనడొ వినడో నన్నుం
గొలిచినవాఁడని నిన్నుం, తెలియడొ సాగరుఁడు చూచితే తల క్రొవ్వెన్.

634


క.

అని యలుక మొలకలెత్త, న్వనరాశి న్గాసిసేయువాఁడై వినతా
తనుతాపహర్త చనఁగాఁ, గనుసన్న న్మాన్చి దైత్యఘస్మరుఁ డనియెన్.

635


క.

మామహిళాజనకుఁడు మా, మమ దుల్లసితకేళిమందిర మాప్త
గ్రామణిమణి నీరాకరుఁ, డామేటిం జెఱుప నుచితమా నీ కరుగన్.

636


క.

పలుకులనె చక్కఁజేయం, గలఁగలహం బేల కడలి కడవాఁ డా గొ
డ్డలి గోరఁ బోవుదానికి, వలె నా కన లుడుమమనిన వడి నమ్రుండై.

637


క.

ఉరగాంతకుఁ డనియె మహా, పురుషా నను గౌరవమునఁ బొందింపం దే
వరకుఁ దలఁ పున్న మత్కం, ధర నెక్కి పయోధి కరుగుతడ వేమిటికిన్.

638


చ.

కడుపునకా మహామహులఁ గాచుట గొల్చుట గౌరవంబునం
గడుఁబొడవై సుఖించుటకుఁగాక సముద్రునిచే లఘుత్వముం
బడసితి వ్యర్థమయ్యెఁ దలఁప న్దనజన్మము దేవ యెట్టియె
క్కుడు తనమేడలావు దనకు న్దల వంచుకొనంగ నోఁచితిన్.

639


మ.

అడరంగాదు సముద్రుఁ డిందిరకులాయం బంచు వారించి తు
క్కడగం దేవర నేను గానె తగులాయం బస్మదీయేప్సితం
బడుగం జెప్పితి సంఘటింపుడు మదీయస్కంధసంవాసివై
బడి విచ్చేయు మఖర్వనిర్వహణగర్వగ్రంధికి న్గంధికిన్.

640


క.

అని విన్నవించి వినతా, తనయుఁడు నికటమున నిలువ దనుజారి కన
త్కనకగిరిహేళిపోలెన్, ఘనతం దత్కంఠ మెక్కె ఖచరులు మ్రొక్కన్.

641


వ.

ఇట్లు గరుడారూఢుండై గగనంబున కుద్గమించి నిలింపులు గుంపులై కొలువ సుర
స్సద్మంబునం బద్మ యొప్ప నప్పరంధాముం డేతెంచి.

642


మహాస్రగ్ధర.

కలితాతిప్రీతిరీతిం గనియె బహుజలగ్రాహనిర్గాహధాటీ
చలపాతోత్పాతమీనాచరితపీతమహశ్చామరగ్రామపూజా
ఫలరేఖాపట్టభద్రుం బలరిపునగరప్రాంతవిశ్రాంతగంగా
లలనాసంశ్లేషభంగాలఘుకరనికరోల్లాసముద్రు న్సముద్రున్.

643


క.

కని కదియఁబోవుటయు న, వ్వనరాశి మహాపతంగవల్లభకంఠా
సనవర్తి నాదిమూర్తిన్, ఘనకీర్తి హృతాశ్రితార్తిఁ గని ముద మొదవన్.

644


క.

అకలంకరత్నములు గా, నుకలుగ జగదేకమోహినులు వాహిను లు
త్సుకలీల వెంటరాఁగా, మకరారిం జేరి సంభ్రమంబున మ్రొక్కెన్.

645


వ.

మ్రొక్కి నిలువంబడి కరంబులు మోడ్చి యిట్లని స్తుతియించె.

646

దండకము.

శ్రీవారిజాతా లయానర్తకీపూర్వరంగస్థలత్కౌస్తుభద్యోతముక్తామణీదామ
కస్తూరికాసౌరభోదారపాటీరచర్చోల్లసద్వక్ష, దేవాంబుజోన్మూలనాభీలనిర్గ్లాన
దానజ్వలద్దానవానేకపధ్వంసనావార్యహర్యక్ష, ధాత్ర్యంబరౌకస్స్వరధ్యక్షవై
శ్వానరార్కర్క్షపాణోనిలాత్మేశమౌళిస్ఫురత్పాదుకాధ్యాసినిస్పృష్టసంసార
గంధప్రబోధప్రకాశార్యచేతస్సరోనిత్యసత్యాధినాథాపచిత్యుజ్జ్వలస్వర్ణదీవా
ర్మరందప్రభాభాసురస్వర్ణమంజీరహంసస్వనత్పాదకంజాత, ధాత్రీధరారాధ
నాహంక్రియామర్షిదేవర్షభస్పష్టనిర్దిష్టదుష్టోఫలాసారసంరోధిగోవర్ధనచ్ఛత్ర
నిర్ఛీకగోగోపసంజాత, గోపాంగనాపాంగకాంతిచ్ఛటాచంద్రికాధౌతసద్విభ్ర
మభ్రూలతాకల్పకల్హారనీకాశక్షేత్రస్ఫురచ్చంపకోల్లాసనాసారుణోష్ఠాలకాలం
కృతస్రస్తకస్తూరికాబిందసౌరభ్యవిభ్రాజిరాజాస్య, తాపత్రయారాతిషడ్వ
ర్గపంచేంద్రియాశామృషాదోషసంసారదూరాదిమోపాస్య, వాచాలకేయూర
పారంపరీరమ్యసమ్యగ్రమాపాణిసంస్కారంబు ల్మహాయోగయుఙ్మానసాంతస్థలీ
ఖేలనంబు ల్సదావర్ధితప్రాణిసంమోదము ల్ఖేదవిచ్చేదము ల్భుక్తిముక్తిద్వికశ్రీ
దము ల్గల్మషత్రాసనిర్భేదము ల్నీమహాపాదము ల్మౌళిఁ గీలింతు - భార్యాసుతభ్రాతృ
మిత్రప్రియప్రేష్యదృగ్భీషణగ్రాహసందోహదుర్గ్రాహసంసారనీరాకరభ్రంశితా
లంబసంతారక ల్దుఃఖనిస్తారక ల్శంబరారిస్ఫురత్కాహళాకారక ల్భూర్భువ
స్వస్త్రయాధారక ల్రక్షితప్రాణిసంఘ ల్భవజ్జంఘ లర్చింతు, సౌన్దర్యలక్ష్మీవిహారా
లయద్వార్బహిర్లగ్నరంభాధరాజాతముల్ దానవధ్వంసనారంభకేళీకళాన్వీతముల్
గాంచనాచ్ఛాదనాచ్ఛాదితంబు ల్శుభాపాదితంబు ల్మనోజ్ఞప్రభాచారువుల్
దావకీనోరువు ర్గొల్తు, సంవర్తవేళావినిక్షిప్తవిశ్వప్రపంచస్థితి న్భాసురస్వాకృతి
చ్ఛిన్నమారాభిచారజ్వలత్కుండకాండాయతి న్నాభిశోభాసనాభిం ద్వదీయం
బ్రశంసింతు, నస్మత్సుతాక్రీడనాగారము న్గౌస్తుభశ్రీపరిస్ఫారసందీప్తరాజన్మణీ
నీలభూభృత్తటీతుల్యవిస్తారము న్సారకస్తూరికాసౌరభోదారమున్ హేమవస్త్రో
త్తరీయద్యుతిస్మేరము న్దావకశ్రీమహావక్షము న్భూమినీళాపరీరంభసంభావనాద
క్షము న్సంస్తుతింతు - న్సరోజాతచక్రాసికౌమోదకీధుర్యము ల్దుష్టశిక్షావిశిష్టాననస్థై
ర్యము ల్రాధికోరోజమాద్యద్రథాంగద్వయీనీడము ల్రత్నకేయూరసంపీడము
ల్దీననిర్భీతిదానక్రియాశస్తము ల్ద్వచ్చతుర్హసము ల్ప్రస్తుతింతు, న్సుధాంశూద్గ
తజ్యోత్స్నికావిభ్రమభ్రాంతికృన్మందహాసద్యుతిశ్రీకముం గుందబ్బందప్రతి
స్పర్థిదంతాంకురోత్సేకముం జంపకాకారనాసామణీకుండలాలంకృతశ్రోత్రకం
దర్పసందర్పణభ్రాజిగండస్థలాన్వీతము న్నిర్ణిరుద్ధానుకంపామృతస్నిగ్ధచక్షుస్సరో

జాతము న్శీతరోచిస్సఖంబు న్ముఖంబుం ద్వదీయంబు వర్ణింతు, నభ్రంకషప్రాంజన
గ్రావశృంగాగ్రజాగ్రన్నవోగ్రాంశుధిక్కృన్మహారత్నకోటీరముం దుందిలేందిం
దిరాఖర్వగర్వాతినిర్వాపణవ్యగ్రమందారగుచ్ఛప్రగామోదికేశాళివిస్ఫారము న్రత్న
రక్షాసరగ్రస్తము న్దావకశ్రీమహామస్తముం బ్రస్తుతింతు, న్జగన్నాథ యాలోలక
ల్లోలమై తాలుమూలాయతశ్వభ్రమార్గంబునం బల్మి జిమ్మించి యొక్కుమ్మడిం గల్ప
వేళోరుమద్వారపూరంబు వారంయుపాకార తన్వేదహృ ద్రాక్షసు న్రోయ నీ వాయ
తాపేక్ష మేవారగా దంష్ట్రికావైఖరిం జాపరీతి న్మహాసీరభాతిం బ్రకాశించువా ర్లే
ఖభావిక్షమాధారరామత్రయప్రక్రియం దెల్పగా, హవ్యభుక్క్రవ్యభుక్కౌట
రక్షు ల్మదీయాజ్ఞ నస్మన్మణు ల్నిగ్గుగాఁ జేయ వాతాశరజ్ఞుభ్రమ న్మందరగ్రావకాణం
బువన్నం దదాధారభూతాశ్మరూపంబునం గచ్ఛపచ్ఛద్మత న్మున్ను నాలో బ్రవ
ర్తింపవే, దేవ చక్షుర్భయోత్సాదితేజోహిరణ్యాక్షసాక్షాత్కృతిప్రోధనిర్ఘోష
రోషానలద్దామరోమాగ్రటంకంబులం దారకావ్యక్తముక్తాఫలంబు ల్దొలు
ల్వోవ ధావత్ఖురాంతర్గతగ్రావము ల్గజ్జలోదారలీలం న్రొదాలింప ఘోణాగ్రసంకల్పిత
శ్వభ్ర మేకీభజవ న్మజ్జలం బొక్కటం గ్రుక్కగాఁ బట్ట నాయామదంష్ట్రాసురంగంబుల
న్సర్వదిక్కుడ్యము ల్వ్రయ్య దీపించు నయ్యాదిఘోణిం బ్రశంసింతు యుష్మద్విష
ద్దైత్యధారాధరస్రక్తనిస్తంద్రవిస్రాస్రవార్వృష్టికి న్మర్త్యకంఠీరవాభైరవారావము
న్రోషరాగాయితప్రోక్షణాక్షీణదీప్తు ల్భవద్ఘోరనాసాపుటీనిర్గతశ్వాసము ల్గర్జలు న్మిం
చులు న్గాడ్పులుంగా, సవక్ష్మాస్థలిన్ విశ్వదాస్థానిలీలన్ బలీంద్రేంద్రజాలైకదా
నాంబుధారాప్లుతం ద్వత్కళాతేజమౌ వామనాకారబీజం బహో దివ్యధాత్రీజతం
బొంది యత్యద్భుతస్థూలపాదత్రయి న్విష్టపత్త్రీకముం గప్పవే, చండవేదండశుం
డాసముద్దండదోర్దండఖండేందువిస్ఫారపారశ్వధక్రూరధారాహతాశేషరాజన్యగా
త్రస్రవద్రక్తరోదస్వినిం ద్వత్పదాంభోజసంభూతకు న్మద్గృహాన్వీతకు న్శంభుజూ
టాటవీసంగకుం గంగకు న్నిత్యసాపత్న్యవాదంబు గల్పింపవే జామదగ్న్యుండవై,
మైథిలీశుల్కరూపాత్మబాణాసనద్రోహిగాధేయసంకల్పసంపాదనోత్సాహిని న్వా
హిని న్సొంపు దెంపారఁగా నొంప నూహించుశంభు న్మ్హహారోషసంరంభుజ్యాకృష్ట
నిర్ఛిన్నతత్కార్ముకోద్భూతకల్పాంతగర్జాసముజ్జృంభితధ్వానసంత్రాసయుక్తాగజ
శ్లేషసంపత్తిచేఁ దేర్పవే రాజు రాజాన్యసుత్రామశేషాయతేషామిళల్లాంగలత్రోటి
కోటీసముత్పాటనత్రాసితం జేసి దుర్దాంతకాంతారనీపద్రుమధ్యక్షమాధావదుష్ణాంశు
జాతన్మణీబంధవైడూర్యనాళస్ఫురద్వారిజాతం గలంగింపవే సీరివై, కంజసూతి
ప్రసాదప్రభావంబునం గావరం బెత్తి ముల్లోకము ల్హల్లకల్లోలము న్సేయు పూర్దా

నవవ్రాతము న్దిగ్జయాన్వీతము న్భూరిమాయాకళాన్వీతమున్ శౌర్యసంవీతముం జంప
నానామరశ్రేణి బాలింప నైలింపవిద్విట్పురస్థాంగనామానభంగంబు గావించి తట్ల
యిన సర్వజ్ఞతాభూతియు న్మారజిత్త్వంబు ని న్ధదర్మరాజత్వముం బొందునే, ఘోర
రుడ్భీకరభ్రూకుటీమాత్రదూరీభవల్లోకము న్సర్వదుర్లోకమున్ శార్వరానీకమున్ శా
తధారాకఠోరక్షురప్రప్రతీకాశపాదాగ్రసంక్షుణ్ణముం జేసి గంధర్వవిఖ్యాతి దీపిం
పవే, విశ్వరూపా జగద్దీప నీమస్తకం బంతరిక్షంబు నీనేత్రము ల్సమసూర్యాంశు
వుల్ దావకశ్రోత్రము ల్టిక్కు లుర్వీసురక్షత్రవిట్ఛూద్రజన్మస్థలంబు ల్ద్వదీ
యాస్యబాహూరుపాదాబ్జము ల్నీవు విష్ణుండ వంభోజగర్భుండవు న్నీవ నీవేకదా
శూలి వింద్రాదిగీర్వాణులు న్నీవ సర్గస్థితిచ్ఛేదనాదిక్రియ ల్నీవ నీకుక్షిలో నుండు
విశ్వంబు నీ విత్తు విష్టార్థము ల్ని న్బ్రశంసింప లే వాగమంబు ల్ద్రిలోకకైకరక్షా
శరన్నీరజాక్షాకృపాసాంద్రవీక్షా హృతస్వర్గవృక్షా పరబ్రహ్మమూర్తీ విధూతాశ్రి
తార్థీ మునిస్వాంతవర్తీ జగత్పూర్ణకీర్తీ విపత్కాలమిత్రా నతాంభోజమిత్రా సము
ద్యచ్చరిత్రా సురస్తోత్రపాత్రా నమస్తే నమస్తే నమస్తే నమః.

647


క.

అని పొగడి మగుడమగుడ, న్వనరాశిపలాశిశాసివరచరణముల
న్దనశిరము మోపి వినయం, బున నిలిచి కరాంబుజముల మోడ్చి సభక్తిన్.

648


క.

విన్నవించె వేదవిద్ధ్యేయతావకా, గమనకార్య మెద్ది గారవమున
నానతీవె యనిన నాపగావల్లభు, దిక్కుఁ జూచి వాసుదేవుఁ డపుడు.

649


క.

నారాకకుఁ బని విను మో, నీరాకర వైనతేయునికి నీవెఱుఁగం
బోరానిభటుఁడు టిట్టిభుఁ, డీరస మిప్పక్షితోడ నెవ్వరి కమరున్.

650


క.

చన దండపిండములఁ దె, మ్మనుడుఁ బ్రణామంబుఁ జేసి యబ్రాసి వెసం
గొనితెచ్చి యిచ్చె నాలో, వనరాశిం బాసి భక్తవత్సలుఁ డరిగెన్.

651


క.

విమతునిలా వరయక వై, రముఁ బూనినవాఁడు వారిరాశిక్రియఁ దై
న్యముఁ గాంచు ననుచు శాత్రవ, దమనకుఁ డగుదమనకుం డతని కెఱిఁగించెన్.

652


వ.

ఎఱిఁగించిన నప్పలుకు లాదరింపక సంజీవకుండు దమనకున కిట్లనియె.

653


క.

కలనికిఁ బింగళకుం డెటు, వలె నుండఁగఁబోదు ననిన వాఁ డురుదంష్ట్రల్
వెలువడినవదనముం బెడ, తలవాలము నుండ వానతఱిఁ బొమ్మనియెన్.

654


క.

అని గుఱుతుఁ జెప్పి యద్ది, క్కున నిలువక వచ్చి కరటకునిఁ గదిసి యుపా
యనములను మిత్రభేదము, నొనరించితి ననుచు నాతఁ డుబ్బుచుఁ జెప్పెన్.

655


క.

అప్పుడు గగనమున మొగు, ల్గప్పి మహిం జఱచి విసరె గాడ్పులు ఱొప్పెం
గప్పలు వడిగం డ్లురిలెం, గుప్పలుగొన సోనవాన గురియం దొడఁగెన్.

656

వ.

అయ్యవసరంబున.

657


ఉ.

జేవుఱుసోబ కన్గొనలఁ జిప్పిల నూర్పులవెంట నుజ్జ్వల
త్పావకకీలలోలిఁ గనుపట్టఁగఁ గొమ్ములు వంచి కానన
గ్రావములం బ్రతిధ్వనులు గ్రాల ఖణిల్లన ఱంకె వైచి సం
జీఐకుఁ డాగ్రహం బడర సింహముపైఁ బడియె న్మహోద్ధతిన్.

658


క.

సంజీవకపింగళకు ల, ఖంజపరాక్రమము లడరఁగాఁ గయ్యము సే
యంజొచ్చి రవుడు మహీభృ, త్కుంజరఫణిఘోణికూర్మకులపతు లదరన్.

659


క.

తొలఁగకఁ కలఁగక వృషపిం, గళకము లప్పాటఁ బోరఁగాఁ జిత్తమునం
గలఁగి వెలవెలనిమొగమునఁ, దలఁ గదలిచి కరటకుండు దమనకుఁ బలికెన్.

660


క.

అతిహీనమానసా నీ, కతమునఁ జేటయ్యె నేలికకు నీ వేదు
ర్గతి కేగెదవో యెఱుఁగ, న్మతిమంతుం డండ్రు నిన్ను మతు లేవియొకో.

661


సీ.

సాంత్వనం బుచితంబు సాంత్వనత్యాగికిఁ బరమదుర్భరపరాభవము గలుగు
వరుసఁ దక్క టివి నెన్నిరిగాని సామంబు ముఖ్యంబు దక్కినమూఁడు బుద్ధిఁ
దలఁప సంఖ్యామాత్రఫలములు సూవె దీపమున జాతకమునఁ బ్రచురరత్న
దీప్తిఁ జీఁకటివోలెఁ దీవ్రారితిమిరంబు సిద్ధసామజ్యోతిచేత విరియు


తే.

నట్లు గావున నగ్రాహ్య మైనదండ, మధిపతికి గ్రాహ్యముగఁ జేసి యని యొనర్చి
తకట నీబుద్ధి గాల నీయభినయంబు, గూల నీనేర్పు నీతీర్పు నేలఁ గలియ.

662


చ.

శ్రవణయుగాంతరావరణచక్రము లగ్గలఁబట్టుఁ దోరపుం
జెవుడు కనీనికావసధసీమకు నుమ్మలికాడు దృష్టిపా
టవము దురుక్తి నాలుకకు డాసినచుట్టము పారుపత్యపుం
దెవులున వైద్యపాధ్య మెడద్రెవ్వక యెవ్వని నాశ్రయించినన్.

663


చ.

తఱు చొకయించుకేని పరిధాన మిడం బతిలాభకార్యముల్
చెఱుచు నరాతిజాతి కెడసేయక వాకొనుమర్మకర్మముల్
గుఱుచలఁ బట్టఁ జూచు విభు కూర్చినచోటన కీడు సేయు మే
ల్మఱచు నయారె రాజుఁ జెడుమంత్రి విపజ్జలరాశి ముంపఁడే.

664


చ.

కలహము నిత్యకృత్య మపకారము పెట్టెనిసొ మసత్యపుం
బలుకు జపం బకార్యవిధి ప్రజ్ఞ యనాదరణంబు సద్వ్రతం
బలుక కులాగతక్రియ యహంకృతి కీర్తి సుహృత్తిరస్క్రియా
బలము బలంబు నీతి కెడఁబాసి నినుం బురుడించుమంత్రికిన్.

665


చ.

వడి చెడి యూఁగుప ల్వెఱికివైచినఁ గ్రూరవిషఫ్లుతాన్నముం
గడుపునఁ జేరనీక మహిఁ గ్రక్కిన గాడిన ముల్లు పుచ్చినం

గడుసుఖ మిచ్చినట్లు కొఱగానియమాత్యునియోగి పెన్గన
ల్విడిచి సుఖించుభంగిఁ బృథివీపతి వీడ్కొని మేల్గొనందగున్.

666


వ.

ఆత్మభూత్యర్థంబు రాజు వివిక్తుంగా జేసి యొక్కరుండవయుండం బ్రారంభించి
నాఁడవు రాజు లాకీర్ణవిరాజు లగు టెఱుఁగవే సహాయసంపత్తివేనియీఱేని నభి
యాతిజాతి విభీతిరీతిం జేట్బఱుఁచుఁగాదే యని కినిసి పలికి మఱియుఁ గరట
కుండు.

667


క.

తనబ్రదుకుకొఱకుఁగా దు, ర్జనుఁడు నృపాలున కనీతి చాటు శతంబుల్
పనిఁ బూని కఱపుఁ బిమ్మటఁ, దనకీ డెఱుకపడఁ బతికిఁ దాఁ బగతుఁ డగున్.

668


గీ.

పతికి నభివృద్ధి దనకు శోభనము నైన, బుద్ధి బోధించునాతఁడు వో సుమంత్రి
పతికిఁ జెట్టయు దనకు నాపదయుఁ జేయు, బుద్ధి బోధించునాతఁడు వో కుమంత్రి.

669


క.

అతిరోషుండయి శాంత, స్థితికి మతిం గపటమూఁది చెలిమికి సుఖసం
గతుఁడై విద్యకుఁ బరుష, వ్రతుఁడయి యంగనకు నాస పడఁ జన దెందున్.

670


క.

కడుఁదేజ మొసఁగి దయతో, నొడయఁడు దనఁబెంపుఁ జేయ నుబ్బున భీతిన్
నడచుట శోభనకారణ, మడఁకువ భూషణము గాదె యనుజీవులకున్.

671


వ.

నీయనుష్ఠానంబున నీతండ్రియు నిట్టివాఁడని యూహింపంబడుచున్నాఁడు.

672


క.

జనకాచార మవశ్యము, తనయుం బ్రాపించుననుట తథ్యము ధరలో
ఘనకైతకకంటకములు, దనరం దత్ఫలకులంబు దాల్చుటలేదో.

673


క.

ఇంగిత మెఱుఁగనీకు న, యాంగము బోధింపఁ ద్రాస మయ్యెడు మును దు
స్పంగతి సూచి ముఖాఖ్యప, తంగము కపిచేతఁ బోరదా దుర్బోధన్.

674


క.

నావిని దమనకుఁ డినసం, భావితుఁ గరటకునిఁ జూచి పలికెం జెపుమా
యీవృత్తాంతం బన నయ, కోవిదుఁ డాయనకుఁ గరటకుం డిట్లనియెన్.

675


ఉ.

అంతనితాంతశైత్యకరమై కర మొప్పు వహించి మించు హే
మంతము సేవమాన లసమానబకౌఘవళక్షితాఖిలా
శాంత ముపాంతకాంతమిహికార్తజగజ్జనవర్ధితస్యధా
కాంతము కృష్ణసారమదగంధనృపాలనిశాంత మెంతయున్.

676


సీ.

స్వవసువిశ్రాణనస్వపితవాసరముల కాయామమదవీయమై చనుటనొ
హీరానుషక్తిఁ జెన్నారుతమ్ముల కత్తిశ్రాంతిగాఁ గలదని చింతిలుటనొ
తనరాక మనులోకమునకుఁ బాటిలినశీతార్తి యనుక్షణం బణఁచుటకునొ
సకలసస్యాభిఐృద్ధికి గభస్తిస్థాతృజీవనం బవనిపైఁ జినుకుటకునొ


తే.

పగలు రుచి వాసి యొకమూలఁ బడి సమస్త, సత్రములఁ జేరి యాత్మతేజమున రేలు

వెలుఁగు శిఖియున్నకడ కేగవలసెననియొ, భానుఁ డక్కాలమున మందభానుఁ డయ్యె.

677


చ.

సదవనవైభవంబు పరచక్రవభోద్యతనంబు నిస్తులా
భ్యుదయ మనూనదానవిధియుం పరిపూర్ణకళావిలాససం
పదయును గల్గి రాజు గనుపట్టె ననంతపదప్రవిష్టుఁడై
యధిగత మూర్జితప్రసవయై కొమరొందె ధరిత్రి యెంతయున్.

678


మ.

ప్రతిదిగ్దృష్టతమస్సమగ్రరుచిదూర్వాచర్వణాఖర్వముల్
హితగంధామృతముక్తతర్షములు భూయిష్ఠస్వమర్త్యాయన
వ్రతము ల్నిండె నఖండపాండురతుషారక్షీరపూరంబు లు
ద్ధత హేమంతగవాధిపోద్యమముచేత న్రాజగోజాలముల్.

679


క.

అతిశీతవిమలవిధూ, న్నతపాదాక్రావతీర్ణనరలోకారా
ధితగాక యునికి చిత్రము, ఖతలాగతయతితుషారగంగ దగంగన్.

680


చ.

ఒకతృటికాలమేనిఁ బనికొగ్గక మీఁదులు చూచుదుక్కి బం
ట్రకు మడిఁ జేనఁగల్పుల కొడంబడి ఘాసము బూడ్చుకూలికాం
డ్రకు నెడసేద్యపుంబనుల డస్సిపడుండఁదలందు పెద్దయె
డ్లకుఁ గలిగించె దైర్ఘ్యవికలస్థితి వాసరపంక్తు లూఱటన్.

681


సీ.

అహరాస్యజటిలనీహారధారాసారశైత్యాపనోదనోత్సాహముననొ
మలయశైలాగతానిలఖాద్యమాద్యదర్పాఖర్వగతిరేఖ నరయుటకునొ
బహుధర్మయుతసుతప్రణిపాతపూజనస్వీకారసంభ్రమోత్సేకముననొ
మందేహదేహసంబంధకోణత్రాణరాక్షసత్రాసదారంభముననొ


తే.

మారుతప్రియుఁ డాసి పటీరవనము, కాసి శమనుసముల్లాసిఁ జేసి హావి
కాసి పుణ్యవతీడాసీ రోసి వాసిఁ, దిమిరకులశాసి వర్తించె దినకరుండు.

682


ఉ.

తోషణకారణైకవసతు ల్సకు లత్తఱి భగ్నసైంధవ
ద్వేషివిషాణగర్భరుచివిస్ఫురితాగురుదారుఖండనం
పేషీతనూతనైణమదమిశ్రఘనస్తనదత్తనిర్భరా
శ్లేషణలీలఁ దేలుతురు శీతభయార్తులఁ బ్రాణభర్తలన్.

683


ఉ.

భోగులు వుచ్చి రద్దివసముల్ పృథువహ్నిహసంతికాదిదృ
క్షాగతులం గురంగమదసమ్మిళితప్రతినవ్యదివ్యకా
లాగురుచందనంబుల మహాయమళీభవదంశకంబులన్
రాగరసైకవీటికల రాజముఖీపరిరంభణంబులన్.

684


సీ.

నిర్ణిద్రదోషఘూర్ణితమనస్కులభంగి దృఢరవంబుగ నౌండ్లు దీడితీడి
ధృతిబలోద్ధతవిరోధిత్రాసితులలీల వారక వడవడ వణఁకివణఁకి

యవనిభృన్నికటమర్త్యనుజీవులో యనఁ జేతు లంసములపైఁ జేర్చి చేర్చి
యాభీరవల్లభు లన దలవాకిళ్ల నొకట యావులగుంపు లొత్తియొత్తి


తే.

సాగుబడినాటికమ్మరజాతివోలెఁ, గటికినిప్పులకుప్పలఁ గదిసి కదిసి
రాలిచి రప్పుండు వోలినచలికతమున, నాకులత రొంది రిలలోనిలోకులెల్ల.

685


క.

శాకపుసరకులుఁ బోకలు, నాకులు గొంగళ్లు దుడుపుటంబరములు శుం
ఠీకాలాగురువు ల్గొనఁ, గైకొనఁ బ్రియమయ్య శీతకాలమునందున్.

686


ఉ.

ఆరికకూడు పుచ్చవరు గావులవెన్నయు దోసగింజ సు
బారపుటాంబురంబు తనిమజ్జిగ మాకొనకంపుతోడఁ దం
డారగఁ బట్టి రెడ్డిమడియ ల్ములుగోలలఁ బూని యెడ్లకో
టేరులు వైచి దున్నుటకు నేగిరి కొండ్రకు సాలివచ్చినన్.

687


సీ.

చవులవేడబములు చాలించి తలసారె దఱలక చప్పిళ్లు ద్రావువారు
కాయసంధుల మహోగ్రగ్రంధు లొదవినఁ బెట్టిదంబుగ నూలఁ బెట్టువారు
రసధూమ మఖిలగాత్రచ్ఛిద్రములఁ బ్రాఁక నుబ్బలఁ బడి మూల్గుచుండువారు
ఛీసిగ్గు గాదొకో చేరమాకాటది యన్నఁజైల్లెలివావి యనెడువారు


తే.

కోరి వాలుడుతైలంబుఁ గ్రోలువారు, కుములుకుంపటిశాకముల్ గోరువారు
సైరి యొకకొంద ఱచ్చలినలసవాభ, వావిధాటివిహారంబుఁ బూనుటయును.

688


వ.

ఇ ట్లాభీలంబైన చలికాలంబున.

689


క.

ఒకగహనంబున నొకచో, నొకశీతార్తప్లవంగయూథము ఖద్యో
తకముల శిఖియని కావఁగం, బకపకసూచీముఖాఖ్యపతగము నగుచున్.

690


క.

ప్రతికీశశ్రుతిపుటసం, గతమై యట సహజవహ్ని గా దిది శీత
చ్యుతి దీన నగునె యని వి, శ్రుతవాచారభటిఁ జెప్పుచుఁ న్వలదిరుగున్.

691


క.

ఈఱీతి పులుఁగు పిలువని, పేరఁట మేతెంచి చెవులు బీఱువడ న్వే
సారక చెప్పఁగ నందొక, క్రూరప్లవగంబు పండ్లు గొఱంకుచుఁ గినుకన్.

692


క.

వడి నొడిసిపట్టికొని కూ, యిడ నుప్పర మెత్తి యెమ్ము విరియఁగ శిలతో
నడిచిన నెపుడో ప్రాణము, విడిచె వృథాబోధకుండు వీఱిఁడి గాఁడే.

693


వ.

ఇట్టికథ యయ్యెడునని నిను బోధింప వెఱచెద నైన వినుము.

694


క.

అలఘుతరప్రజ్ఞాధన, బలముల నెవ్వాఁడు గోత్రభరము వహించుం
బలుకులు వేయేల నిజం, బలయుత్తము నోఁచి కాంచినది తల్లిగదా.

695


గీ.

దేశకాలాంతరంబులఁ దీలుపడని, బుద్ధిసౌందర్య మొక్కఁ డద్భుతము గాక
గాత్రసౌందర్య మేరికిఁ గలుగదనిన, దాని విని విన్ననై యుండె దమనకుండు.

696

ఉ.

వేసటతోడిపల్కు తనువేపనభావము సోష్ణదీర్ఘని
శ్వాసము గద్గదస్వరము శంకితదృష్టి కపోలహస్తవి
న్యాసము వాడుదేఱువదనంబు స్వయంకృతఘోరకల్మష
త్రాసితక్షణంబు లని తత్త్వనిధిజ్ఞులు సెప్పి రేర్పడన్.

697


క.

ఈరీతి నుండనేల మ, హీరమణున కిట్లొనర్పనేల విచారాం
కూరముఁదుదఁ జిదిమితివని, రారాపున వాని నక్కరటకుఁడు మఱియున్.

698


క.

అనయపరుం డగుమనుజుఁడు, తనవారిం జెఱిచి పిదపఁ దానుం జెడుఁ బో
మును దుష్టబుద్ధిమాటలు, విని తజ్జనకుండు ధూమవేదనఁ దెగఁడే.

699


క.

అని పలికిన నీతికళా, ధనుఁ గరటకుఁ జూచి పలికె దమనకుఁ డో స
ద్వినయార్ణవ యె ట్లీకథ, విన నిష్టం బయ్యెఁ దెలుపవే నా కనుడున్.

700


క.

కరటకుఁ డిట్లను కొండొక, పురమున వర్తించు ధర్మబుద్ధియనంగాఁ
బడఁగు నొకసెట్టి వానికి, సరిచుట్టము దుష్టబుద్ధి సఖుఁడై తిరుగున్.

701


క.

వానికి వానికి బ్రాణస, మానమహామైత్రి పెరుగు మఱి యందు మనీ
షానిధికి ధర్మబుద్ధికి, దీనారసహస్ర మొక్కవెసఁ గననయ్యెన్.

702


క.

కానంగనైన సొంపు ని, జాననమున మొలకలొత్త నవ్వార్త సుహృ
న్మానసమున డాఁపనేరక, పూని సఖుండనుచు దుష్టబుద్ధికిఁ జెప్పెన్.

703


ఉ.

చెప్పిన నద్దురాత్మకుఁడు శింగఁడు బూరఁడునై సుహృత్తముం
దప్పక చూచి పూర్వసుకృతంబున గాంచినసొమ్ము నెమ్మిమై
నిప్పొలిమేర కేసరమహీరుహమూలమునంయ డాఁచిపో
నొప్పు నొరు ల్గనుంగొనరె యూరి కయో కొనిపోవఁజూచినన్.

704


గీ.

ఇతరు లెఱుఁగనేల యింటికిఁ గొనిపోవ, నేల నేల యరసి యెఱుఁగకుండఁ
గుండ బాఁతి యింతకుండనె చనుటొప్పుఁ, దగ నొనర్పు మనల ధర్మబుద్ధి.

705


ఉ.

వంచన సొమ్ముఁ బుచ్చుకొనువాఁడయి వీఁ డిటు లాడుచున్నవాఁ
డంచు మనంబునం తెలియ కాతని నిక్కము నెయ్యుఁగా విచా
రించి యొకొన్ని పుచ్చుకొని వృక్షసముజ్జ్వలమూలమందు న
క్కాంచినసొమ్ముఁ బాఁతి చెలికాఁడును దానును బోయి రిండ్లకున్.

706


ఉ.

పోయి నిశీధమైనఁ జెడుపోకల కోమటి దుష్టబుద్ధి యా
రేయి గృహంబుఁ బాసి నగరీజనులం గనుబ్రామి యొంటి నా
చాయకు నేగి కూడుబలిఁ పల్లి పెకల్చి ధనంబుఁ గొంచుఁ బే
రాయపుసొంపునం జనియె నచ్ఛతరత్వర నొంటి నింటికిన్.

707

గీ.

అతఁడు గొన్నిపూఁట లరిగిన నింటికిఁ, బోయి తాను ధర్మబుద్ధి కనియె
దిరుగఁ జూడవలదె దీనారభాండంబు, సురిగెనేమొ దిగులు సొచ్చె నాకు.

708


క.

అని దెరవుఁ జూపి పిలిచిన, ననుమానము పట్టి తాను నాతఁడు జోడై
చని ధర్మబుద్ధి వినిహిత, ధనభాండముఁ గానఁడయ్యెఁ దరుమూలమునన్.

709


ఉ.

కానక మాససంబు కలఁగంబడ నిట్లను ధర్మబుద్ధి య
య్యో నిను సద్వయస్యుఁ డని యొండొకచిత్తము లేక నమ్మి యి
చ్చో నిడి చన్న నాధనముఁ జోరునిచాడ్సునఁ బుచ్చుకొంటి వి
స్సీ నరభోజనుండయినఁ జెట్టఁ దలంచునె విశ్వసించినన్.

710


ఉ.

పూని మదీయవిత్త మిటఁ బూడ్చుతఱిం బరికింప నక్కటా
యేనును నీవకాని యెరులెవ్వ రెఱుంగరు నీవుదక్క నొ
ప్పౌ నిజమౌఁ బరుల్పొరయ రర్థముఁ గ్రమ్మఱఁ దెమ్ము దొంగబే
రానకుఁ బాలుపడ్డ నగరా నగరాలుదురాత్మ నావుడున్.

711


క.

విని దుష్టబుద్ధి బుద్ధిం, గనలుచు నద్ధర్మబుద్ధి గనుఁగొని పలికెం
గనివాఁడవొ వినినాఁడవొ, చనునే నామీఁద నిట్టిసడి మోపంగన్.

712


క.

నీసఖ్యమునఁ జరించిన, దోసము మోసమున నేఁడె తోడన కలిగెం
బోసరమొ నోరిక్రొవ్వో, రేసో యిట్లాడ నెవ్వరికి నీడేరున్.

713


ఉ.

ముచ్చుదనంబు నాపయిన మోపకయుండిన సెట్టిబిడ్డవే
వెచ్చునె నీకుఁ గూడుఁ గుడువం గులకామిని ప్రక్కఁ బండెదే
క్రచ్చఱఁ గన్నసొమ్ము తిరుగంబడినం గొనకున్న నెట్టురా
రచ్చకునంచు నీడ్చి పదరంబడి వాఁడు సుహృచ్ఛిఖామణిన్.

714


వ.

ఇట్లు ధర్మబుద్ధి నీడ్చుకొని చని నగరంబడి ధర్మంబున కొప్పి పిన్నపెద్దలం గూడ
బెట్టిన ధర్మవేదు లుభియవాదుల నాలోకించి తమకింపక ఱంతుసేయ కడ్డంబు సొ
రక యిరువురు గలసి పలుకక యొకరొకరిపూర్వోత్తరంబులు తెలియునట్లుగా
మీమీసుద్దు లుగ్గడింపుఁ డనుటయు నందు ధర్మబుద్ధి కృతాంజలియై సభవారి కిట్ల
నియె.

715


క.

ఈతఁడు నాతోఁ జెలికాఁ, డై తిరుగం బెద్దకాల మరిగే న్వినుఁ డీ
భూతలమున దీనారస, మేతవినిష్ఖండభాండ మేఁ గనుఁగొంటిన్.

716


క.

కనుఁగొని నిక్కము చెలికాఁ, డని పెద్దయు విశ్వసించి యీకథయే నీ
తనికి నతిగోపనంబుగ, వినిపించితి నావివిక్తి వీటింబోవన్.

717


క.

వినిపించిన నాతఁడు నా, కనురక్తునిపగిది ననియె ననఘా యేత
ద్ధన మూరియొద్ద నేటికి, నిను వేఁడెద వలయు నిచట నిక్షేపింపన్.

718

క.

అని తరుమూలముఁ జూపిన, మనమున నద్దుష్టబుద్ధిమత మెఱుఁగక చె
ప్పినయట్ల సేసిపోయితి, తనయింటికి నీతఁ డంతఁ దానుం బోయెన్.

719


క.

కతిపయదివసము లరుఁగఁగ, నితఁడు ననుం బిలిచి పలికె నిష్టసఖా నా
మతి నతితాపము వొడమెడు, నతులగతం జూడఁబోత మావిత్తంబున్.

720


క.

అనపలికి నన్నుఁ దోడ్కొని, చని తరుమూలమునఁ జూడ సంగుప్తధనం
బునిచినచో లేదయ్యె, న్మనసెరియం జొచ్చె దైన్యమగ్నుఁడ నైతిన్.

721


క.

సొ మ్మున్నది నీయొద్దం, దెమ్మని నే నదరవైచితే నీతఁడు న
న్నమ్మాటలాడి త్రిప్పెం, దిమ్ములకుం జొచ్చి యీడ్చి తెచ్చె న్సభకున్.

722


వ.

ఇంతియ యని ధర్మబుద్ధి యూరకుండె నప్పుడు దుష్టబుద్ధి ధర్మాసనస్థులకుఁ బ్రణా
మంబు లాచరించి యిట్లనియె.

723


చ.

ఎనసినచెల్మి నుండుటయు నెక్కటిపాటఁ దదర్థభాండముం
గనుటయు నాకుఁ జెప్పుటయుఁ గప్పుటయుం గల దంత నిండ్లకుం
జని యొకనాలుగేనుదివసంబులు వోవఁగ వచ్చిచూడఁ బాఁ
తినకడ సొమ్ము లేదు కని తీసికొన న్మహిజంబు సాక్షిగాన్.

724


క.

నావిని ధర్మాధికృతుల్, వావాదం బేల యేనువారము లెడ మీ
రేవివిరము నాఱననాఁ, డావిష్కృతబుద్ధిఁ దోలుఁపుఁ డరుగుఁడు మగుడన్.

725


వ.

అనువచనంబులు విని దుష్టబుద్ధి.

726


క.

అవకాశ మేమిటికి వ, ట్టివివాదం బింక నేమిటికి శుద్ధాత్ముం
డవు నితఁడన నన్నందఱు, దగఁ బొగడఁగ సాక్షిఁ దెలిపెదను మీపాలన్.

727


క.

నా విని ధర్మమువారలు, నీ వెవ్వరి సాక్షిఁ దెలుపనేర్తువు చెపుమా
వావాద ముడిగె నన మా, యావాదనశాలి వారి కతఁ డిట్లనియెన్.

728


క.

ఏపాదపమూలంబున, బాపురె దీనారపూర్ణభాండ మహో ని
క్షేపింపఁబడియెఁ దెలియఁగ, నాపాపవిభుఁడు సాక్షి యగు మీ రడుగన్.

729


క.

అనుదుష్టబుద్ధిపలుకులు, విని యచ్చెరుపాటు గదుర విద్వజ్జను లే
దినమునకు నేమి ప్రొద్దునఁ, జనుదె మ్మరసెదము గాక సకలం బనుచున్.

730


క.

చని రంత ధర్మబుద్ధియుఁ, జనియె గృహంబునకు వానిజాడనె తోడ్తో
జనియెఁ బ్రతివాది యాలో, దినకరుఁ డపరాబ్ధి వారిఁ దెప్పలఁ దేలెన్.

731


గీ.

సంజ చివురించెఁ జీకట్లు సందడించెఁ గలువ సొంపెక్కెఁ జక్రవాకములు స్రుక్కె
జలజములు వాడె దిశలఁ దేజంబు వీడె, ఘూకము ల్మీఱె విహగము ల్గూండ్లు సేరె.

732


వ.

అప్పుడు దుష్టబుద్ధి యేకాంతంబునఁ దనతండ్రియడుగులం బడి యిట్లనియె.

733

ఉ.

చోరుఁడె దుష్టబుద్ధి యతిశుద్ధుఁడుగా కని భూరుహంబుచేఁ
బౌరులు గుంపులై విన సభం బలికించెదనంటి వచ్చితిన్
జేరెడుమాటమాత్రమునఁ జేకొను మస్మదభీప్సితంపుదీ
నారసహస్ర మెప్పటికి నందనులాభము తండ్రిఁ బొందదే.

734


క.

తరుకోటరమున నీ వొ, క్కరుఁడవ వసియింపు మొరులు కనుఁగొనకుండం
బరిషజ్జనము రయంబున, నరుదెంచినఁ బలుకు సభ్యుఁ డని ని న్నడుగన్.

735


వ.

అనినం గొడుకునకుఁ దండ్రి యిట్లనియె.

736


క.

చెడుబుద్ధి నీకుఁ బుట్టెం, జెడితివి నన్నుం గృతఘ్న చెఱిచెదె యూఁకో
నొడఁబాటు గాదు చిత్తము, వెడఁగులపని పంపుసేయువీఱిఁడి గలఁడే.

737


క.

మొదల నపాయం బెన్నుట, పిదప నుపాయంబు లెక్కపెట్టుట తగు నీ
చిద గొదలఁ గాదె ము న్నొక, ముదికొక్కెర యనుఁగుసుతుల ముంగిస కిచ్చెన్.

738


గీ.

అనిన దుష్టబుద్ధి జనకు నిరీక్షించి, యిట్టు లనియె నకుల మేకతమున
బకపికార్భకముల భక్షించె బక మేమి, సేసె నంతవట్టుఁ జెప్పవలయు.

739


వ.

అని యడిగినఁ దండ్రి కొడుకున కి ట్లనియె.

740


మ.

కల దభ్రంకషభూజరాజిశుకపాకగ్రస్తశస్తస్వరు
త్పదృగ్వావ్యము కూలముద్రుజఝరీభంగాంగసంఘర్షజా
విలఘోషప్రతిఘోషితద్విరదవిద్విడ్భీమ ముగ్రద్విపి
స్థలకృత్కీలదరీనికాయ మొకకాంతారంబు దుర్వారమై.

741


ఉ.

ఆవిపినంబునం దొకమహామహిజంబున నగ్రశాఖపైఁ
దా వసియించి యొక్కబకదంపతి పిల్లలఁ జేయుఁ జేయ నా
శీవిష మాసమీపబిలసీమమున న్వసియించియుండి వా
పోవఁగ నన్నిటి న్మెసవిసోవు సమాసమ నివ్విధంబునన్.

742


క.

ప్రతిసంవత్సరమును నీ, గతిఁ బిల్లలఁ బాముపాలు గావించి మనో
గతి బకమిథునము పొగులుం, బ్రతికృతిఁ గానక యలంతఁ బగలు న్రేలున్.

743


వ.

అట్లుండఁ గొండొకకాలంబునకుఁ దననాతికిఁ బ్రసూతిసమయం బగుటయు భుజ
గభయానకం బగుబకంబు తికమెకంబై సంతతిసంభరణంబునకు విరోధిసంహరణం
బుసకు నుపాయంబుఁ గానక తానకంబుఁ బాసి ప్రియసఖుండు నాపజ్జయాభి
ముఖుండును నగుకర్తరీపాణినామకుళీరకుం జేరంబోయి కాయం బడచిపడ బుడి
బుడికన్నీరు గ్రుక్కుచుఁ జిక్కుకొన్నకంఠంబునఁ దనకుఁ బాటిలినచేటుపాటు
ప్రసంగించి శోకించి పుత్రత్రాణవిధేయం బగునుపాయఁబుఁ జెప్పి యాపత్పారా

వారతీరంబుఁ దెప్పవై చేర్పుము న న్నీడేర్పుము నీ వని కనికరం బొలయఁ బ్రార్థించిన
బకంబునకుఁ గుళీరం బిట్లనియె.

744


క.

భువనవిహారివి నవలా, ఘవమును లావును గొఱంత గా దెన్నటికిన్
దివిరి వధియింతు వనిమిష, నివహము నీయంతవాఁడు నెగు లెట్లొందెన్.

745


క.

శోకార్తులకు నుపాయము, లేకరిణిం దోఁచు ధైర్య మెవ్విధిఁ గలుగున్
రాకడవోకడలకు జన, మేకొమరున దొరకుఁ గడఁక లెటువలె వొదవున్.

746


క.

ఐనను దీనికిఁ దగుతెఱఁ, గే నీ కెఱిగింతుఁ జేయు మిది భవదీయ
స్థానతరునికటబగతకా, దే నబిలంబునకు నకులదృఢబిలమునకున్.

747


క.

ఎడత్రెవ్వకుండ మీలం, దడవైవుము వానినెల్ల భక్షింపుచు నె
వ్వడి నేఁగి ముంగి పాముం, బడలుపడం గఱచి చంపుఁ బగ నీ కణఁగున్.

748


క.

చనుమని యాహారం బిడి, పనిచిన నప్పులుగు చనియెఁ బయనంబై త
ద్వనిత యెుకకొన్నినాళ్ళకు, గొనబై యచ్చోట గూఁట గ్రుడ్లం బెట్టెన్.

749


గీ.

పెట్టి ముదిగుడ్లు వడకుండఁ గట్టు గాచి, పొదుగుటయు వైరకొని కొన్నిపూఁటలకును
బికిల డింభంబు లాలోన బకవిభుండు, యెండ్రి చెప్పినగతి మీల నిండవైచె.

750


గీ.

కవుచు గాలివారఁ గవిఁ బాసి వెలువడి, వరుస మీల దినుచు వచ్చివచ్చి
పాము జంపి పాదపముఁ బ్రాకి బకశిశు, ప్రకరభుక్తిఁ దనిసి నకుల మరిగె.

751


ఆ.

ఒకఁడు సేయఁబోవ నొకఁడగు నీబుద్ధి, గూల నన్నుఁ జెఱుపకుము దురాత్మ
చెడిన నీవ చెడుము చెప్పకు మీమీట, యర్థభాండ మొల్ల నన్య మొల్ల.

752


క.

అని ముగియంబలికిన నా, ననమున దైన్యంబు దేఱ నందనుఁ డాసె
ట్టనకాళ్లమీఁదఁ బడి యిఁక, విను నావచనం బటంచు వేఁడుకొనంగన్.

753


తే.

మోసపోవనివాఁ డయ్యుఁ ముదుకఁ డయ్యు, విధివశంబునఁ జెవి వేలవ్రేసి సెట్టి
యర్థరాత్రంబునం దేగి యడగియుండె, గూబచందాన నలవృక్షకోటరమున.

754


వ.

అంతఁ గొంతప్రొద్దునకుం బద్మబాంధవుండు పూర్వపర్వతశిఖరసింహాసనం బెక్కె
నప్పుడు పిన్నపెద్ద లుభయవాదులు కావించి వృక్షసమీపంబునకు వచ్చి యర్చించి
యయ్యిరువురిలోన వంచకుం డెవ్వఁడు చెప్పుమని ప్రాంజలులై నిలిచిన.

755


క.

ఎలుగొందఁగఁ దరుకోటర, తలమున నద్దుష్టబుద్ధితండ్రి మహాని
ర్మలధర్మబుద్ధి సుగుణో, జ్వలు వంచకుఁ డనియె నెల్లవారు వినంగన్.

756


క.

అందఱు నమ్మాటకు వెఱ, గందిరి యలదుష్టబుద్ధి యానందమునం
జెంది నటియించెఁ బౌరుల, ముందరఁ గరతాళగతులు మొరియ న్నెరయన్.

757


ఆ.

ధర్మబుద్ధి వగచి తల యూఁచి తనలోన, ననియె నేఁడు సత్య మణఁగె ధర్మ
మవని వెల్లివిరిసె ననృతంబు చూచితే, నిర్నిమిత్త మిట్టినింద పుట్టె.

758

క.

తరువులు సాక్షులు పలుకునె, నరు లడిగిన మనుజభాషణంబుల నిదిపో
యరుదు పరామర్శింపం, గరము ప్రయత్నంబు తోడఁ గల దిం దనుచున్.

759


క.

ఆకుజఘనకోటరమున, నాకలములు వైచి యనల మంటించిన న
స్తోకతరకీలసంయుత, మై కీలలు ప్రబ్బికొనియె నభ్యంతరమున్.

760


క.

పొగ నుడ్డుకుడిచి మంట, న్సగమరుగం గాలి యేడ్పెసఁగ నన్నగమున్
డిగనుఱికి దుష్టబుద్ధిం, దెగితిట్టుచు బిడుగుబడుగుదేహము విడిచెన్.

761


వ.

అప్పుడు రాజపురుషు లద్దుష్టబుద్ధి నిరీక్షించి.

762


సీ.

చెల్లు సెల్లముల కీక్షింప నిచ్చినసొమ్ము మగుడ కీలేనికోమటి గులామ
చేసేత విశ్వసించినవారివెచ్చసచ్చములఁ గీడ్పఱుచువై జాతితొండ
తెగిగంటిలేనిపోటుగ నొడ్లయద్దల గిద్దలఁ బొడుచువేగినబిగాది
బూసంబుదరిపి నేర్పున నమ్మికొనుటకుఁ గరవుఁ గోరెడుదోసకారిబుడుగ


తే.

యప్పునెపమున నూఱాఱు లడిగి పుచ్చు, కొని నయంబునఁ దీర్పక కోఁకపోఁక
సరకుసప్పట సరిచెప్పి యరగఱాచు, చెడగరపుడొక్క యోరోరిసెట్టికుక్క.

763


వ.

అని తిట్టి సొమ్ము ధర్మబుద్ధి కిప్పించి దుష్టబుద్ధిం గొఱఁతబెట్టిరి దుష్టబుద్ధి యగు
వాఁడు తనవారినిం జెఱచి తానుం జెడు నిట్లు రాజునుం జెఱిచి తరువాత నీవునుం
జేటు నొందెద వని పలికి కరటకుండు వెండియు.

764


చ.

కడుఁ జెడుకార్యము ల్దమనకా మనకా భయమయ్యె నేఁడు నీ
నడవడిఁ జూచి నమ్మదగునా నినుఁ జిల్వకుఁ బాలుఁ బోసి ముం
గడ వసియింపఁజేసి చిఱకాలము వెంచిన మే లెఱుంగునే
కడఁగి బడల్పడం గఱుచుఁగాక కృతజ్ఞులె దుష్టమానసుల్.

765


క.

దెలియనినరుఁ దెలుపఁగనగుఁ, దెలిసినమానవుని వలదు తెలుపఁగ మదిలోఁ
దెలిసియుఁ దెలియనికఱటికిఁ, గలితెన మెఱిఁగింపఁ గమలగర్భునివశమే.

766


క.

పతి కి ట్లొనరించిన నీ, కితరు లనం దృణకణంబు లెలుకలచే భ
క్షితమయ్యె నినుపత్రాసను, కత విననే మున్ను దమనకా నీ వనుడున్.

767


క.

దమనకుఁ డల కరటకుది, క్కు మొగంబై యెట్లు నీతికోవిద యిది స
ర్వముఁ జెప్పుమనిన నక్కథ, యమలమతిం జెప్పఁదొణఁగె నతఁ డాతనికిన్.

768


చ.

ననిచి కవేరజాతటమున న్మహిసారపురంబునం గృత
ఘ్నునిచెలి మందభాగ్యుఁడను కోమటి వర్తిలు విక్రయింపనుం
గొనఁ దిన లేమిఁ గూటికిని గోఁకకు సీదిరమై కృశింపుచుం
గనుఁగవఁ బ్రాణము ల్నిలిపి కాఱియగాఁగ నతండు నిచ్చలున్.

769

ఉత్సాహ.

కోరి మ్రొక్కఁ గ్రొత్తపెండ్లికూతుఁ గృష్ణఁ జూచి యో
వారిజాయతాక్షి భాగ్యవంతుఁ గాంతుఁ గాని వి
ద్యారణప్రవీణుఁ గాంచ కట్టి మత్సుతు ల్వనీ
చారు లైరి చూడు మంచు సాధ్వికుంతి వల్కదే.

770


వ.

అని తలంచి.

771


క.

అతఁ డొకనాఁడు ధనార్జన, మతిఁ జనుచుం గఠినలోహమయతుల సుహృదా
యతనమునఁ బెట్టి తిరిగెం, గతి గలిగెడు ననుచుఁ దిరుగగలచోటెల్లన్.

772


చ.

సరకుల కేఁగి వేసరిఁ బసారముఁ బెట్టిన సెట్లఁ గూడి వే
సర నడుగానఁ గానక యజస్రము గూలికి మూట మోసి వే
సరి మఱి యుప్పుఁ గూరయును సందులగొందుల విల్చివిల్చి వే
సరి నొకత్రోవయు న్ఫల మొసంగదు సెట్టనభాగ్య మెట్టిదో.

773


ఉ.

అల్లన మందభాగ్యుఁ డగునాతఁడు వేవిధులం గృశించియున్
వల్లము పచ్చగాక వసివాడినమోమునఁ దా నివృత్తుఁడై
తెల్లముగా సహృత్తతుల దెమ్మని వేఁడిన వంచనామతిం
గల్లలఁ బల్కె నాతఁ డెలుక ల్దినె ద్రా సని యాసపెంపునన్.

774


క.

ఆమాట కలకి రాట, గ్రామణి దల యూఁచి యట్ల గాకున్న సఖా
యీమాడ్కి నాకుఁ జెప్పుదువే మిగుల నపూర్వ మిది సుమీ యేమాయెన్.

775


క.

అని వెగటు దోఁపకుండ, న్మునుపటివలెఁ దన్నివేశమున వర్తిలుచున్
దనలో రోయుచుఁ గతిపయ, దినములు గ్రమియించి కలఁక దీఱినపిదపన్.

776


క.

బడుగుంగోమటి తుకతుక, నుడుకుచుఁ దుల దక్కె ననుచు నున్నాఁడొ యిసీ
గుడిఁ ద్రిప్పినకపటాత్తునిఁ, దడయక గుట్టయినఁ ద్రిప్పెదం జేసేతన్.

777


క.

అని తలఁచి యల కృతఘ్నుని, తనయునిచే నొక్కనాఁ డతఁడు నూనియను
న్నను కగునుసిరికపిండియు, జనవునఁ బట్టించుకొని ప్రజ ల్వీక్షింపన్.

778


క.

స్నానవ్యాజంబునఁ జని, వాని నొకానొకసుహృన్నివాసంబున నా
లోనిడి క్రమఱుటయుఁ జిం, తానతుఁ డై వాని కాకృతఘ్నుం డనియెన్.

779


శా.

అయ్యల్ వచ్చెఁ గదయ్య నీపిఱుఁద రాఁడాయె న్మహాసాధ్వసం
బయ్యెం జెప్పఁగదయ్య నావు డతఁ డత్యార్తుంబలెం బల్కె నే
నయ్యేట న్సలిలంబులాడఁగఁ దటవ్యస్తాంఘ్రి నాశూద్ధతం
బయ్యో నీసుతు గ్రద్దఁ దన్నుకొనిపోయెన్ భీతి వాపోవఁగన్.

780


క.

ఏను వితాకుఁడనై నీ, తో నీచెడువార్తఁ జెప్పుదుం గా కనుచు
న్వే నిలువక వచ్చితి నన, నానన మఱవాడ నాతఁ డాతని కనియెన్.

781

ఆ.

చేఁపజెల్ల గాదు చిట్టెల్కయు గాదు, పిట్ట గాదు కోడిపిల్ల గాదు
కొట్టి జుట్టుఁ బట్టుకొనిపోవఁ బసిబిడ్డ, లేడ నీలగ్రద్ద లేడఁ జెపుమా.

782


క.

వినసంగతి గాదు సుతుం, గొనితెమ్మన నతఁడు గ్రద్ద గొనిపోయినబా
లునిఁ దేనగు మూషికములు, దినిపోయినయినుపత్రాసుఁ దేబాగైనన్.

783


క.

ఇనుపతుల నెలుక దినఁగాఁ, గొనిపోవఁగరాదె గ్రద్దకు న్సఖ యుష్మ
త్తనయుని కీమాటలకం, టెను వింతలె తెలియ నెప్పటికి నామాటల్.

784


క.

అని మాటమాట సరిపు, చ్చిన నందకుఁ డెఱిగి యతనిచేతికిఁ దుల ని
చ్చె నతండును దాఁచినత, త్తనయుఁ గృతఘ్నునకు సమ్మదమ్మున నిచ్చెన్.

785


క.

ఇది నీకు నిదర్శన మగుఁ, గద విను మది నమ్మరాదు గద యే మని చె
ప్పెద వొప్పు గులుక నయగుణ, మది లే దొట్టయిన సత్యమైనన నీకున్.

786


ఉ.

ఆదర మొప్ప నుక్తపరుఁడై మనువాఁ డుపవేశికిం దృఢా
హ్లాదము సంఘటించుఁ బరమాదరణశ్రవణంబు పెంపునన్
ధీదశలేమి నస్మదుపదేశ మృదూక్తిశతంబు లక్కటా
సూదులు వోలు నీచెవులు సోఁకిన నొచ్చు సహింపకుండుటన్.

787


క.

ఘనగుణములఁ దనుగుణముల, జనుఁ డమరు న్సాధ్వసాధుసంపర్కముచే
వనజనపదపథికుం డగు, ననిలుఁడు పోలెన్ శుభాశుభామాదములన్.

788


వ.

కార్యాకార్యవిచారంబు చాలనిగురునయినఁ బరిహరింపవలయునని పలుకుచు దమ
నకుం బరిహరించుకొని కరటకుండు రాజనికటంబున కరిగె దమనకుండును దోడన
జనియె నంతఁ బింగళకుండు సంజీవకుం జంపి విన్న నైనమొగంబున దమనకు నాలో
కించి.

789


చ.

ఇలఁగలఱేని కేమి గడియింపఁగరాదు హితత్వసత్యని
శ్చలగుణశాలి యైనభటసత్తము నొక్కనిఁ గూర్పరాదు గా
కలవున నిట్టిబంటు దెనటాఱె వృథా మతిలేక నీదురు
స్తులు విని చంపితి న్విగతదోషుని నమ్మహనీయభాషునిన్.

790


వ.

అనినఁ బింగళకునకు దమనకుం డిట్లనియె.

791


ఉ.

వంచకులం బడల్పఱిచివైచుట సత్పురుషవ్రజంబు ర
క్షించుట విత్త మాశ్రితులఁ జేర్చుట భూప్రజపై దయాగుణం
బుంచుట రాజచిహ్నములువో యభిషేకముఁ బట్ట బంధముం
గుంచెయు మంత్రతంత్ర బలగుప్తియు బుంటికి లేకపోయెనే.

792


క.

అరిమరణంబున కేలా, పరితాపము నొంద విరసభావము గలచోఁ
బరులేల యగ్రజు న్సో, దరునైనను జంపుదురు మొద ల్రాజన్యుల్.

793

క.

వైరము పుట్టినఁ బోరన్, శూరులు నిర్జరులు రాక్షసులఁ జంపరె యె
వ్వారికి నిది వింతయె బృం, దారకులును వారు నన్నదమ్ములు గారే.

794


క.

విరసించినచో రాజులు, దురమున నెవ్వారినైనఁ దురుముదు రలుకన్
గురు నగ్రజు ననుజు న్మో, హరమున వధియింపఁ డోటుహరిసుతుఁ డరయన్.

795


చ.

పరుషసముల్లసన్మధురభాషిణిహింసయఖండసత్కృపా
నిరతవసువ్యయవ్యసన నిత్యధనాగమకోపసుప్రసా
దరనయసత్యసత్యపరితాపదసౌఖ్యదవారకామినీ
స్ఫురణ నసత్యదాప్తిఁ బొలుచు న్నృపనీతి యనేకరూపమై.

796


వ.

అని యిట్లు దమనకుండు బోధించిన బశ్చాత్తాపంబు మాని మృగరాజు ప్రాజ్యరాజ్య
సుఖంబు లనుభవింపుచుండె.

797


క.

అని వినిపించినగురునిం, గనుఁగొని నృపపుత్త్రు లనిరి కమనీయగుణాం
బునిధీ రెండవతంత్రం, బనురక్తిం దేటపఱుపుమని యడుగుటయున్.

798


మ.

ప్రతిబాధీకృతకామకామనుజభుక్ప్రధ్వంసనారంభణ
న్యతిషంగవ్రసత్వసత్వరవరవ్యాపారపూర్భవ
న్నతసంకల్పవిశేషశేషరచితామ్నాయోక్తిపద్యశ్రుతో
ద్గతరోమాంచవితానతానవరుజాధాటీభిషక్పుంగవా.

799


క.

వనజభవతనయమేధా, వినుతివినీతైకదివ్యవృషభజగత్పా
వనపంచతత్త్వమయ వి, ధ్వినలోచన సర్వభూతహితసంచారా.

800


మాలిని.

అవనలయకరాత్మా హారియుక్చిత్తవర్త్మా
వివిధనిగమవేద్యా విశ్వసర్గోపపాద్యా
భవతిమిరపతంగా సర్వచంద్రోపమాంగా
హవిరశనబలిష్ఠా హార్యకల్పాజినిష్ఠా.

801


గద్యము.

ఇది శ్రీ వేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసుకవి
ప్రశంసాభాషణోల్లాస రాజకులపారావారపర్వశర్వరీరమణ నీతిశాస్త్రమార్గపరి
శ్రమణధైర్యపర్యాయధిక్క్రతనీహారపర్వతపర్వరాజకుమార నిస్సహాయప్రబంధ
నిర్మాణభోజభూదారవసుధామధురభారతీసనాథ వేంకటనాథప్రణీతం బయినపంచ
తంత్రంబున మిత్రభేదం బనునది ప్రథమాశ్వాసము.

————

  1. చ. మృదుగతి మంచితావులకు మెచ్చుసదావనిఁ బాననాళి దా
        వడిగొని రోయువంకలను నంచకుఁ డేడ్తెఱ నట్టిదేకదా
        వెదకు మహారసప్రసనవిభ్రమసంపదల న్మనోజ్ఞష
        ట్పదములు పూతిగంధకుణపంబులు రోయవె నక్క లెక్కడన్.

  2. సకలబంధుపరిషత్కులుఁడన్
  3. ఈపద్యము ప్రక్షిప్తమని తోఁచెడు.
  4. ఈపద్యము ప్రక్షిప్తమని తోఁచెడు.
  5. నూష్మకరమయిన యీమహాగ్రీష్మమునను (పాఠాంతరము)