పంచతంత్రము (బైచరాజు)/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

పంచతంత్రము

తృతీయాశ్వాసము


మద్వృషాకపాయీ
రామాసాపత్న్యరోషరసకృత్పరతో
భూమకుటివ్యోమధునీ
వ్యామిశ్రకటాక్షవీక్షహరిహరనాథా.

1


వ.

దేవా సంధివిగ్రహాభిధాన తృతీయతంత్రం బాకర్ణింపు మధీతనీతిశాస్త్రమర్ముం డగు
విష్ణుశర్ముండు సుదర్శనకుమారుల కిట్లనియె.

2


క.

ఆకడ వీరుం డగున, స్తోకప్రతిపక్షిఁ బెనిచి తుది రాజు చెడుం
గాకంబుఁ జేర్చుకొని నుత, లోకబలోద్రేక మొకయులూకము చెడదే.

3


క.

నావిని రాజకుమారకు, లావిప్రుని జూచి చిత్ర మది చెపుమా భూ
దేవకులోత్తమ మాకు ము, దావహముగ ననిన వారి కతఁ డిట్లనియెన్.

4


చ.

మధురనభోమణిద్యుతిసమంచితరత్నవిరాజమానధా
మధురవిలాసినీశ్రవణమంగళరాగవదీరితేక్షుహృ
న్మధురదురంతసంపదభిమానతృణీకృతరాజరాజది
ఙ్మధుర చెలంగుఁ బాండ్యమహిమండలిఁ దన్నికటాయతాడవిన్.

5


చ.

ఫలరుచివిద్యుదర్చిఁ వెలుపం బలిభుగ్రుతు లుగ్రగర్జలై
యెలయఁగ బెల్లుగా డిగినయూడలు పుష్కరవర్ష ధారలై
నిలుపఁగ వార్షికాభ్రసరణిం గగనస్థలచుంబియై దళ
ద్దళములకల్మిఁ గార్కొను నుదగ్రవటం బొకఁ డొప్పు నున్నతిన్.

6


చ.

నటన ననేకకాకపృతన ల్ప్రతివాసరము న్భజింప న
వ్వటమున మేఘవర్ణుఁ డనువాయసవల్లభుఁ డుండు వాని కు
త్కటభయకంపనంబు లెసఁగ న్నికటప్రకటాటవీకుటీ
వటమున ఘూకసేన గొలువం బెనుగూబయు నుండు నెప్పుడున్.

7

ఉ.

ఆయరిమర్దనుండు మది వచ్చలమెచ్చఁ గృతాంతవాలశూ
లాయుధకంఠఘోరతిమిరాకులమౌ నొకనాఁటిచీఁకటిం
బాయనిఘూకసేనఁ బనుపం బెనుపొందినమఱ్ఱి నేడ్తెఱం
బోయి యజాగరూకబలిభుక్పటలిం బరిమార్చి పోయినన్.

8


క.

ఆటెంకిఁ గరటవిభుఁ డొక, కోటరగర్భమున నణఁగికొని యుండుట నా
చేటొదవదయ్యె వానికి, నాఁటికి నది పోయె మఱుసు నాఁ డుదయమునన్.

9


వ.

హతశేషానుజీవకోటిం గూడుకొని యతనిమంత్రు లుద్దీపియు సందీపియుఁ బ్రదీ
పియు నాదీపియుఁ జిరంజీవియు ననువా రేవురుం గలసి రంత నందఱం గలయ
గనుంగొని మేఘవర్ణుం డిట్లనియె.

10


ఉ.

మ్రాకున నిద్రవోవ నరిమర్దనుపంపున వచ్చి ఘూకముల్
గాకముల న్వధించె నిది కక్కసపుంబని నిర్వహించు టె
ట్లీకడ నీతికార్యపరు లిందఱు పోలినభంగిఁ జెప్పుఁడా
నా కిపు డంచు రా జడిగిన న్వినయవ్యతిషంగచిత్తుఁడై.

11


వ.

ఉద్దీపి యిట్లనియె.

12


క.

ఈదృశబలవంతులతో, వాదులకుం దించి బ్రతుకవచ్చునె యెందేఁ
బోద మశక్తుల కిది మ, ర్యాద వృథా పొలిసిపోవ నగుఫల మేమీ.

13


క.

అనువచనంబులు వాయస, జనపతి విని యానతిచ్చె సందీపికి నీ
వును నొకకార్యముఁ జెపుమా, యను డాతఁడు విహితహృదయుఁడై పతిమొగమై.

14


క.

ఇది యొకపక్షమ్మున మంచిది యగు నగుఁగాక యేమి చిరవిక్రమసం
పద గలరాజున కుచితమె, సదనత్యాగంబు మానుషద్యుతి గాదే.

15


క.

స్థానంబు సకలఫలసం, ధానం బొనరించుఁ బతికిఁ దగ నజకంఠ
స్థానస్తన మిడునె యథా, స్థానస్తనభంగి మధురతరదుగ్ధంబుల్.

16


క.

చేవఁగలభూమిపతు లటు, గావునఁ గోరరు విదేశగమనము దేవా
నీ వెఱుఁగనికార్యములుం, ద్రోవలు మఱియెవ్వ రెఱుఁగుదురు లోకమునన్.

17


వ.

అనుమాటలు విని రాజు ప్రదీపి నాలోకించి తోఁచినకార్యంబుఁ జెప్పుమని యడి
గిన నతండు.

18


చ.

తడయక బాలవృద్ధవనితాజనతాదుల వైరికోటికిం
గడువడిఁ జంపు మంచు నిడుకంటె నయంబున సంధి సేయు టే
ర్పడ నుచితంబు వైరుల నపాయబలాధ్యులు రాత్రిచారు లె
య్యెడఁ దగదీరసంబు బలహీనులకు న్మనబోటివారికిన్.

19

క.

ఈవాలు వచ్చి ఠేవం, జావంగా నున్నవారిఁ జంపెద రహితుల్
దేవా సంధి యనూనశు, భావహ మొనరింపు మస్మదాదేశమునన్.

20


వ.

అనుభాషితంబు లాకర్ణించి యధిపతి యాదీపి నడిగిన నతం డతని కభిముఖుండై.

21


క.

సంధికిఁ జను టె ట్లరులు ది, వాంధులు బలదుర్నిరీక్ష్యు లయ్యును దుస్సం
బంధ మిది గాదె మనము ని, శాంధుల మె ట్లమరు దూత కరుగం దిరుగన్.

22


క.

అటు గనుక సంధికార్యం, బెటువలె నొడఁగూడు రాత్రు లెదిరికి నెల వి
ప్పటికి మనకదను పగ లు, త్కటగతిఁ జని సంహరింపుదము పగవారిన్.

23


వ.

అని యుద్దీపి ప్రదీపి సందీపి యాదీపులు తమకుఁ దోఁచినట్లు చెప్పిన విని మేఘ
వర్ణుండు చిరజీవి నాలోకించి.

24


క.

ఈతం డితఁ డితఁ డీతఁడు, చేతోగతిఁ దోచినట్లు చెప్పిరి పథ్యం
బై తోఁపదు కించిత్తుం, దాతా నీ వేమి చెప్పెదవు నాతోడన్.

25


క.

నీసద్బుద్ధిబలంబునఁ, జేసెద రాజ్యంబు నేఁ డజేయదివాంధ
త్రాస ముదయించె నీ కిది, పోసమయము ప్రాప్తకాల ముపదేశింపన్.

26


క.

హరిపరిణామమునకు ని, ర్భరనీతిపరుండు గురుఁడుబలె నాభద్రం
బరయుటకు నీవెకా కె, వ్వరు నాఁ జీరజీవి మేఘవర్ణుని కనియెన్.

27


క.

అలఘునయవినయనిధు లీ, నలువురు విన్నపముఁ జేసినా రిమ్మతిమం
తులకంటెఁ గార్యనిశ్చయ, బలమున నధికుఁడనె యంతపాండితి గలదే.

28


ఆ.

వీరు నీకుఁ బరమవిశ్వాసఘటకులు, వీరినీతిరీతి వినుట యొప్పు
నైన నాకుఁ దోఁచినంతయు వినుపింతు, నేకతంబు వలయు నింతదడవు.

29


క.

హితుఁడని యొకనికిఁ జెప్పిన, నతఁడును దనకూర్చుసఖుని కది దెలుపు నర
క్షితమై నృపమంత్రం బీ, గతిఁ బలువురు వినుటచే విఘాతత నొందున్.

30


క.

అతిగుప్తమయ్యు మంత్రము, హితనితరశ్రుతముచేత నివురంబడు ని
క్కత యెఱిఁగి ప్రాంతజనసం, గతి రాజు రహస్య మొసఁగి కావఁగవలయున్.

31


వ.

అని యేకాంతంబు వడసి చిరజీవి మేఘవర్ణునకు సంధివిగ్రహయానాసనద్వైధీభావ
సమాశ్రయంబు లనుగుణంబులం ప్రారంభోపాయపురుషద్రవ్యసంపద్దేశకాలవిభాగ
వినిపాతప్రతికారంబు లనువమగంబుల సామదానభేదమాయోపాయంబు లనుచతు
రుపాయంబులఁ బ్రభుమంత్రోత్సాహశక్తుల విచారించి యం దుచితం బగుదాని
నంగీకరింపుము నాకుఁ దోచినకార్యం బొక్కటి ప్రతిపక్షు లుదగ్రసత్త్వద
క్షులు మనకు సమరసామర్థ్యంబు చాలదు దేశకాలంబులు విచారరమణీయంబులు.

32


క.

మీనొదవునంతకుం జనఁ, గానక బక ముండుకరణి ఘననీతిధనుం

డైనయతఁ డూరకుండుం, దానహితుఁడు చిక్కుపడినదను కతిశాంతిన్.

33


క.

తనసత్వ మెదిరిసత్వముఁ, గనుఁగొన కెవ్వాఁ డఖర్వగర్వమునం బో
రునకుఁ దుదఁ గాలు ద్రవ్వు, న్విను మముష్కరునిఁ బొందు విపదోఘంబుల్.

34


చ.

సురియ కరంబునఁ గొనక శూరుఁడు నీతికళావిలాసభా
సురుఁడు వధించు వైరి విరసుం దవుదవ్వులఁ జెంతనుండియున్
సురియ ధరించియు న్మగువచొప్పున నేమియుఁ జేయలేఁడు త
న్గెరలఁగఁ జేయు మానవనికృష్టుఁడు మాటలు వేయు నేటికిన్.

35


క.

తాలిమియు ధృతియుఁ బ్రజ్ఞా, శీలతయుఁ బరాత్మగుణవిశేషజ్ఞతయుం
గాలోచితశౌర్యము గల వాలుమగం డేలు వార్ధివళితధరిత్రిన్.

36


క.

సిరి పొందును పాయకళా, పరిణతుఁ దనఁ దానపాయపాకగుసభయుం
బరుషోక్తిఁ జేరరా దిం, దిర కేలం గురులఁ బట్టి తివిచినయినన్.

37


క.

గృహపేటి నుండు మంత్రో, తృహనాఢ్యునకు న్రమాభుజంగిసుమంత్ర
గ్రహణవిమూఢున కది దు, స్సహభీతి ననారతంబు సంపాదించున్.

38


క.

మతిమంతుఁడు శాంతుఁడు వి, శ్రుతగుణసంసిద్ధుఁడు న్విశుద్ధుఁడు నీతి
ప్రతిరహితుఁడు బలసహితుఁడు, గతభయుఁ డనఘుండుఁ గార్యఘటకులు సుమ్మీ.

39


వ.

విశేషించి యిట్లు చెప్పవలసి చెప్పితిఁ గాని యుద్ధ మెప్పటికి నకరణీయంబు.

40


సీ.

కోశమంత్రములు దక్కువలు గాకుండినఁ గలుగులెక్కలకు నగ్గలము బలము
శాంతులు నిర్మలస్వాంతులు విక్రమోదయులు నిర్భయులును ధర్మమయులు
కఠినశాత్త్రవుని సాగావిత్తవంతుని వేల్పుగాఁ జూచి సేవింతు రెపుడుఁ
బ్రభుత సహాయనిబంధనం బని చెప్ప విందుము నీవును వింటి వట్లు


తే.

కులము గుణము రూపు చెలువంబు మురిపంబు, మానధర్మవిక్రమక్రమముల
వాసిఁ జూడ దబ్జవాసిని నిరపాయ, శూరసంగ్రహంబుఁ జూచినట్లు.

41


క.

ఏరీతి జైత్రయాత్రా, ప్రారంభము సెల్లుఁ బతికిఁ బ్రజలేమి నభ
శ్చారత గూడునె పక్షికి, భూరిబలాధ్యక్షపక్షములు లేకున్నన్.

42


క.

ఘోరారివీరపారా, వారం బెప్పాట దాఁటవచ్చు సహాయా
ధారతతి తారుఁ గోరక, పౌరుషసంపన్నుఁ డగునృపాలాగ్రణికిన్.

43


క.

ధనమంత్రసహాయంబుల, కొనరినభూవిభున కన్నియును గల వట్ల
య్యును సమర మకరణీయము, చనసేరదు సంధి సహజశత్రుల మగుటన్.

44


వ.

ఘూకంబులకుఁ గాకంబులకు సహజవైరానుబంధంబునన కాదె వాక్పారుష్యం బెవ్వ
రికిఁ జేటుఁ జేయదు.

45

క.

భీషణశార్దూలతనూ, వేషము దన కమర దొల్లి విశ్రుతసస్యా
న్వేషణతత్పరమతి వా, గ్దోషంబున నొక్కఖరము ద్రుంగదె పుడమిన్.

46


క.

నావిని వాయసపతి చిర, జీవికి నిట్లనియె నీతిశీలా యేలా
గీవిధము దేటపడఁ జెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

47


క.

ఒకపురి నొకచాకలవాఁ, డొకదిక్కున నొకనిచేత నొకగాడిదె వి
ల్వకుఁ బుచ్చుకొనియెఁ చౌర, ప్రకరపటీభృతికి మేనుబటువై యునికిన్.

48


క.

వలువలు చలువలు సేసెడు, నెలవునఁ బగలెల్ల నిలిపి నిశి యగుటయు న
ప్పలుగాకి చాకి పెనుగ్రో, ల్పులిచర్మము గప్పి సస్యముల కెగవిడుచున్.

49


క.

అది కడుపుకొలదియును దిని, సదనమునకు మగిడివచ్చు సరిప్రొద్దున ని
ట్లద నరసి యరుగఁ దిరుగం, బొది చెడియం జైరు గొన్నిపూఁటలు చనియెన్.

50


క.

పొల మరయుకర్షకులు మదిఁ, బులిగాఁ దలపోసి భీతిఁ బులిపులి యనుచున్
దలసాల వెడల రందొక, హలికుఁడు శరచాపహస్తుఁడయి నిశ్శంకన్.

51


క.

నెలవొడిచినధూసరరుచిఁ, గలగొంగడిముసుఁగుఁ దిగిచి కడువడిఁ దనయి
ల్వెలువడి చని కని తనముం, గల బొంచినవానిఁ జెండి గాడిదె యనుచున్.

52


క.

మెండుగ నుత్థాపించిన, దండము గమనమున కెగ్గుఁదలఁకుఁగ వీనుల్
బెండువడ నోండ్రపెట్టుచు, దుండగపుఖరంబు దన కెదుర్పఱతేరన్.

53


క.

హలికుఁడు నీవా యనుచుం, జలి విడిచి ప్రహాస మెసఁగ శయములఁ గాళ్లం
బిలపిల నెదురుగఁ బఱచిన, నలగాడిదెయుం దువాళి నఱితికి వచ్చెన్.

54


వ.

వచ్చిన.

55


క.

తగిలి తనపైరు మేసిన, పగ యగ్గలమగుటఁ గినిసి పటుముష్టిని వి
ల్దిగిచి ఘనతరశరంబునఁ, దెగ నేసిన గార్దభంబు ద్రెళ్ళెం బుడమిన్.

56


వ.

ఇది వాగ్దోషఫలం బని వెండియు.

57


క.

అని చెప్పిన చిరజీవిం, గని వాయసరాజు వలికెఁ గౌశికములకున్
మనకు న్బగ వాగ్దోషం, బునఁ బాటిలె నంటి విది చెపుము వినవలతున్.

58


వ.

అనినఁ జిరజీవి మేఘవర్ణున కిట్లనియె.

59


చ.

అపరిమితానురాగ మొలయ న్వలయాద్రిపరీతధూపత
త్రిపటలిమంత్రగూట మొనరించి మదాంధదివాంధము న్మహా
కుపితముఁ బక్షిరాజ్యమునకుం బతిగా నొనరింపఁబూనియు
న్నపు డొకవృద్ధకాక మటకై యరుదెంచినఁ బుల్గులన్నియున్.

60


క.

వెడవెడ నొండొకొండొక, తడవు విచారించి సమతఁ దమలో ననియెన్

జెడకిది బహుకాలంబులు, గడపినయది గాన యుచితగతి నెఱిఁగించున్.

61


వ.

కార్యాలోచనంబున నిందఱ మసమర్థులము కార్యనిర్ణయసమర్థం బగుదీని నడిగి
చూతమే యనుచు నాతిథ్యం బాచరించి పరివేష్టించి తమయభిప్రాయంబుఁ జెప్పిన
నప్పక్షులకు వాయసాధ్యక్షుం డిట్లనియె.

62


సీ.

కర్ణహృత్పుటసూచికాయమానోత్సూనవికటఘోషము విన్న వెగటు గాదె
కాలకాకోదరోగ్రస్ఫటాస్ఫుటముఖం బాలోకనము సేయ నళుకు గాదె
భ్రమదుల్ముకభ్రాంతిభాగవీక్షణదృష్టిసరణిఁ ద్రిమ్మరుచుండ జాలి గాదె
కర్కశవ్యాయామగరుదమంగళమరుత్ప్రతతి సోఁకినఁ బీడ వట్టుకొనదె


తే.

దారుణాకార మప్రియదర్శనంబు, ప్రకృతిరౌద్రంబు క్షుద్రం బపక్షమంబు
మూక మేయూరు పికశారికాకలాప, కీరికాముఖభరణ మేయూరు చెపుఁడ.

63


క.

దారుణదృష్టి వికారా, కార మతిక్రూర మహముఁ గానదు కరుణా
దూరం బెట్లయ్యెడు ర, క్షారంభం బెఱుఁగఁజెప్పుఁడా వినవలతున్.

64


క.

వ్యపదేశక్రియ మెఱసిన, నృపు నింపెసలార నాశ్రయించినఁ గలుగున్
విపులసుఖ మమృతకిరణ, వ్యపదేశతఁ గుశలమంద దాశశ మడవిన్.

65


క.

అనుకాకమునకుఁ బులుఁగులు, వినయంబునఁ బలికెఁ దెలుపవే శశకం బ
వ్వనజరిపుని వ్యపదేశం, బున భద్రముఁ గనుట గరటముఖ్యా మాకున్.

66


వ.

అని యడిగిన వాయసపుంగవం బవ్విహంగంబులకు నిట్లని చెప్పందొడంగె.

67


మ.

అగళద్దుర్భరతీక్ష్ణభాస్వదభిషువ్యాఘాతపాతక్షర
న్మృగ మస్తక్షతజంబు పశ్చిమమరుద్వృద్ధత్రిధామజ్వల
న్నగ మంతర్జలనిర్ఝరంబు మృగతృష్ణావాహినీసంచితా
ధ్వగ ముష్ణాగమమయ్యెఁ దొల్లి పురజిత్పాలాంబకాభీలమై.

68


వ.

అక్కాలంబున.

69


చ.

జలధరము ల్ధరాస్థలికి జాఱెనన న్దిననాథరశ్మికిన్
దొలఁగ కహో బయ ల్మెఱసెనో తిమిరంబులు నాఁగజంగమా
ద్రులగతి గండకంసితిగిరు ల్దరులారయ లెక్క కెక్కుఁడై
యలఘుమృగేంద్రభీతిరహితాటవిలో విహరించు నేర్పడన్.

70


క.

ఏకసరోవర మగువల, భీకరగహనమున నిలువు బెగడి పిపాసా
వ్యాకులితమానసము లపు, డాకరు లిట్లనియె యూధపాధ్యక్షునకున్.

71


క.

ఇచ్చోటిసరము శరముల్, నిచ్చలుగొన నివిరె మేఁపునీళ్ళ కయో ని
ప్పచ్చరమై యెవ్విధి మన, వచ్చు నవారిగఁ బ్రవారివలె మాకానన్.

72

క.

అపాతాళగభీరప, యోపూర్ణమహాప్రవాహమైనను గూపా
రాపరిమితసరమైనం, జూపుము విఱవిఱకపోవఁజొచ్చెం దనువుల్.

73


వ.

అని వదనోదరంబులఁ జూపి విన్ననయి యున్ననన్నీచదశవశావల్లభుం డరసి నిమి
షంబునుం దడయక యప్పటికి సత్వక్షీణంబులు గానివానిఁ గొన్ని గజంబులం
బిలిచి యనుజీవులారా యప్రతిహతమనోరథంబుల గహనఘంటాపథంబులం బఱచి
యగాధశరం బగుసరంబుఁ గనుంగొని రెండు పొండని నియోగించిన.

74


సీ.

మదననేచరవధూమధురగానధ్వానవివశకుంజక్రోడవిషధరములు
పరిపక్వఫలవిలుబ్ధస్తబ్ధరోమదంష్ట్రాటంకభిన్నగోత్రారుహములు
ధరచరత్పవనబాంధవదవవ్యాయామధూమకల్పితమేఘదుర్దినములు
చరమదిఙ్ముఖపతజ్జరఠకాసరవిరక్తవ్యాఘ్రబీతఖడ్గవ్రజములు


తే.

సవనతరసరసస్తేయసారమేయ, దశనదంశవనిష్ప్రాణతరుణహరిణ
నాభిసౌరభ్యదశదిశాంతస్థలములు, ఘోరకాంతారములు కొన్ని కొన్ని గడచి.

75


క.

సరి నెరసి మెఱసి బిలములు, దరిసి ధృతు ల్బెరసి దొరసి దంతావళముల్
వరశిఖరం బగు నొకమల, సరస న్సరసారసరసి సరసి న్గనియెన్.

76


వ.

తత్సరోవరం బావిష్కృతపుష్కరంబు గావున యాదవస్థానంబును మత్స్యకూర్మ
విలాసభాసురంబు గావున యోగిరాజును బ్రకాశితాహిమకరంబు గావునఁ బ్రాతః
కాలంబును నధిగతబ్రహ్మరథంబు గావునం బర్యాప్తవితానంబును నారాధితారి
కులంబు గావున నపారబలసంపన్నంబును బకవిహారయోగ్యంబు గావున నేకచ
క్రపురంబును నూర్మికాభిరామంబు గావున నలంకృతుం బురుడించి యెప్పుచుండు.

77


క.

కని యనురాగరసాబ్ధి, మునుము న్నోలాడి భిన్నముఖకమలవనీ
ఘనపరిమళగుణచిక్కణ, వనజాకరవారిలో నవారిగ నాడెన్.

78


ఉ.

ప్రావృతచూతపోతమృదుపల్లవపారణకారణంబునన్
లావు వహించి సొంపు వొదల న్బొదలం బదలాఘవంబునం
బోవఁగఁ ద్రోయుచు న్మరలిపోయి సరోవరలాభవార్త యా
క్రేవఁ జరించుయూధపతికి న్వినిపించె గజంబులన్నియున్.

79


ఉ.

చెప్పిన నప్పు డుల్లసిలుచిత్తమునం గరిరాజు గౌరవం
బొప్ప మహాహితద్విరదయూధముఁ దోకొనిపోయెఁ బోవ నా
చొప్పున దాఁటిపోవ నొకచోటును గానక తత్పదాహతిం
జిప్పలు గుల్లలై పొలిసె శీఘ్రమె పెక్కుశశంబు లచ్చటన్.

80


సీ.

అచ్చెట్టఁ జూచియు నంత శిలీముఖుం డనుశశరాజు దైన్యావలంబి
యగుచు మంత్రుల కిట్టు లను నీతినిధులార యర్థికి వారివాహములువోలె

సరమున కలఘుతృష్ణాభరంబున నేఁ డవారణ నీదారి వారణములు
పఱతెంచుచున్నవి పరికింపు మల్లవె కుందేళ్ళు వీని త్రొక్కుళ్ల మడిసె


తే.

ద్రాసకర మైనశశ ప్రళయమునకు, నకట యెబ్భంగి శాంతికార్యంబు దొరకు
నేమి సేయుదు ననువంత నెదుర నిలిచి, వివితనీతికళాశాలి విజయుఁ డనియె.

81


క.

దేవా నేఁ గలుగఁగఁ జిం, తావారిధి నేల మునిఁగెదవు శశములకుం
గావించెద శుభ మిభముల, రావిడువం జూడు నాపరాక్రమ మనుడున్.

82


క.

పలికె శశరాజు గాఢో, త్కలికన్నయనిధి దేశకాలవిభాగం
బులు నీక తెలియు నిట నీ, కలిమిఁ గ్రియాసిద్ధి యెట్లు గాలేకుండున్.

83


క.

ఆలస్య మకర్తవ్యము, కాలం భారంభమునకుఁ గరులమదరులన్
దోలి శశప్రాణంబులఁ, బాలింపుము నీయుపాయపాటన మమరన్.

84


క.

అని యాజ్ఞాపించిన నయ, వినయపరాక్రమనిధానవిజయుఁడు విజయుం
డనిలరయంబున నెదురుగఁ, జని యూధపు గాంచి మానసము గలఁగుటయున్.

85


క.

గజ మంటినట్ల యడచు, న్భుజగము మూర్కొనినయట్ల పొరిగొను ధరణీ
భుజుఁడు నగినట్ల చంపుం, గుజనుఁడు మన్నించునట్ల కొను బ్రాణంబుల్.

86


క.

కావునఁ గరినికటమునకుఁ, బోవం కార్యంబు గాదుపో యిపుడు మహా
భావనమున నుపకంఠ, గ్రావాగ్రం బెక్కి ముఖ్యకరిఁ బలికింతున్.

87


చ.

అని గిరి నెత్తమెక్కి శశ మగ్గజవల్లభుఁ జూచి యిట్లనుం
గనలున నీకు రాఁబొలము గా దిది నిల్నిలు చందమామ న
న్ననుపఁగ వచ్చితిం బయనమై యలజాబిలిలో శశంబుగా
మనమున న న్నెఱింగికొనుమా యన దంతివతంసుఁ డిట్లనున్.

88


క.

ఏమినిమిత్తము శశక, గ్రామణి ని న్నిటకుఁ బంపెఁ గైరసమిత్రుం
డామాట తేటపడఁ జెపు, మా మా కన విజయుఁ డగ్గజాగ్రణి కనియెన్.

89


క.

హేతులు పైఁబడునపుడున్, దూతలు సత్యంబుఁ బలుకుదురు తద్భాషా
వ్రాతమునకుఁ గలఁగరు ధా, త్రీతలవల్లభులు నగరు తెగ రెప్పటికిన్.

90


క.

అల నెల తనమాటలుగా, నెలవున నీతోడ నాడుమని న న్ననుపన్
దలమోఁచి చెప్పవచ్చితిఁ దెలియ న్విను యూధపక్షితిప యప్పలుకుల్.

91


ఉ.

చారువిచార యిక్కొలను చంద్రసరోవర మిందుఁ దారకా
ధారుఁడు చంద్రుఁ డిష్టవనితాజనతాయుతుఁడై యథేష్టసం
చారవినోదము ల్సలుపు సంతతమ న్విను మట్లుగాన సే
వ్వారికిఁ బోవరా దెఱుఁగవా యిట కిత్తెఱఁ గింతవింతయే.

92

చ.

నిరతము నీయరణ్యధరణీసరణిం జరియించునీశశో
త్కరములు నాకుఁ జుట్టములుగాఁ బరికింపుము చంద్రనీరజా
కర మతిభీకరంబు తడగాఁ జను నా విహితోపదేశ మా
దరమున వీనుల న్జొనుపు దవ్వుఁలవాఁడవు గాక నీతికిన్.

93


చ.

సరసికి మీ రఖండభసంబున రాఁ బరికించి యాసుధా
కిరణుఁడు నేఁడు మేరుగిరికేసరుల న్మిముఁ జంపఁ బంపఁగాఁ
పరశువు గోరఁబోవుపనిపట్టున నేమిటికంచు మాన్చి యీ
తెరువున మిమ్ము నిల్పఁ జనుదెంచితి నీతిపరుండఁ గావునన్.

94


క.

చావక నోపక యౌదల, పూ వాడక నానియోగమున నెందైనన్
బోవుట శోభన మన దం, తావళ మిట్లనియె శశవతంసంబునకున్.

95


సీ.

అది చంద్రకాసార మాసారమానసతారలు దారలై తను భజింప
జలవిహారం బందు సలుపునె నిలుపునె యొరులెవ్వ రిటకు రాకుండ విధుఁడు
పంచాననముల మాపైఁ బంప ననుకంప మాన్చి యేతెంచితె దుమ్ముఁ గాన
నీవంటికారుణ్యనిధి యెన్నిభవములం గలుగు నీకతమునఁ గలిగె బ్రతుకు


తే.

మగిడి పోయెద మనుచు నమస్కరింపఁ,
బ్రత్యయమువుట్ట నక్కరిప్రవరుఁ గొనుచు
విజయుఁ డారేయి గొలనిలో వెలుఁగువాని, జంద్రు ననుబింబితుని జూపి జరుగుమనియె.

96


వ.

అవ్విజయునియోగంబున దంతిపతి వనాంతరచింతం బఱచె నంత శిలీముఖప్రము
ఖశశంబు లానందించె గజంబులఁ దిరుగఁ ద్రిప్పుట శశంబులప్రళయంబు మాన్చు
ట చంద్రవ్యపదేశంబునం గాదె యట్లగుటఁ బ్రసిద్ధుం డగు రాజు నాశ్రయింప
వలయు దాన సుఖలాభంబులు దుఃఖక్షోభంబును నగు నీయులూకంబు ప్రసిద్ధం
బగురాజ్యంబున కర్హంబు కాదని చెప్పి కాకంబు వెండియుం బులుఁగుల కిట్లనియె.

97


క.

సముచిత మెఱుఁగక క్షుద్రుం, గ్రమరహితుగుఱించి పోవఁ గడుఁ గీ డొదవున్
దమలో నొంటక మార్జా, లముడగ్గఱి శశకపింజలంబులు దెగవే.

98


క.

నావిని విహగములను నయ, కోవిద యారెంటి కేల గొదగొద పొడమెన్
జా వేల వచ్చె నోతువు, చే వానికి నింతపట్టుఁ జెపుమా తెలియన్.

99


చ.

అని తను వేఁడుకొన్నఁ గరటాగ్రణి పక్షులఁ జూచి యిట్లను
న్వినుఁ డలవింధ్యభూమి నొకవీరమహీరుహమూలకోటరం
బునికి యొనర్చి యమ్మనికినుండుఁ గపింజల మప్పతత్రితో
నెనసి కుటైకదేశమున నేనును నుండుదు సఖ్య మేర్పడన్.

100

చ.

తగ గగనప్రచార మవితారివిభాకరుఁ డస్తమింపఁగా
ఖగము నగంబుఁ బాసి పలుకందువల న్బెనుమందపెంటలం
జిగి నిగుడం జదల్మెదలు చేఁడెలపండినపూరిదారులం
బొగసినపొళ్ళమేఁపుఁగొనఁబోయి హుటాహుటి రాకతక్కినన్.

101


ఉ.

డేగకుఁ జిక్కెనో యురువడిం ధృతి గాడ్పడి దవ్వుపోయెనో
లాగము దక్కి మచ్చువలలంబడెనో వెరవేదిపాది నెం
దేగెనొ పుట్టలెక్కి కర మేమఱి పాములచేతఁ జచ్చెనో
యేగతియంచునో తెలియ దింతయు రాఁడు వయస్యుఁ డక్కటా.

102


క.

అని బాష్పవారిధార, ల్గనుదోయిం జెమ్మగింపఁగా నలుదిక్కుల్
గనుఁగొనుచు వితాకుఁడనై, చన నేరక యుంటి నన్నిశాసమయమునన్.

103


శా.

ఆహా కృచ్చపలావిలాస మఖిలప్రాణిశ్రుతివ్యగ్రగ
ర్జాహంభావసమగ్ర ముగ్రరయనద్యంబూత్థితాంభోనిధి
వ్యూహం బాహతకాననజ్జ్వలన మోహో మింటితో వ్రేలఁ గా
లాహీం గట్టినచాడ్పునం గురిసె ఘోరాసార మచ్చీఁకటిన్.

104


క.

అలజడి యలజడిచేతం, గలఁగి మహాశశము దీర్ఘకుం డనువాఁ
డలఘుకపింజలకోటర, నిలయంబున నంఘ్రులూఁది నెమ్మది నుండెన్.

105


క.

జడిగొన్నవాన నేనుం, దడిసితి నాలో నొకింతదడవున కానె
వ్వడి సడలె నడఁగె నుఱుముల్, నిడిమించులు మాసె వెలుఁగు నిలిచి న్వెలిచెన్.

106


ఉ.

టెక్కునఁ బ్రాంతపక్కణకుటీశిఖరంబుల ఱెక్క లార్చుచుం
గుక్కుటకోటి మ్రోసె నెసగూరుమిటారులపుట్టినిల్లు గ
బ్బెక్కినమబ్బుశైలగుహ లీఁగె దిశ ల్వెలుఁగొందె నిక్కలం
జక్కవజోళ్లు గేరె జలజాతహితుం డుదయించెఁ దూర్పునన్.

107


క.

పొలమున మేఁపాడి కపిం, జల మ త్తఱి మరలివచ్చి శశము నివాస
స్థలిఁ గనుఁగొని యదలింపుచు, నలఘుతరక్రోధహృదయమై యిట్లనియెన్.

108


శా.

ఔరా కన్గొన మెందు నీతగవు లెస్సాయెం బురేయెవ్వరి
ట్లూరం బుట్టనివింత యన్యగృహమం దుండ న్విచారింతురే
రారాపు ల్గొఱగావు నేఁటి కొకనేరం బోర్చితిం జాన కో
రోరీ యెచ్చటికైనఁ బోయెదవొ పోపో యింతక్రొ వ్వేటికిన్.

109


క.

ఇది నాయది నాకేళీ, సదనము నీ కిందు నిల్వఁజనునె దురాత్మా
మదటతన ముడిగి యెంతేఁ, గదలుము లెమ్మనిన దీర్ఘకర్ణుం డనియెన్.

110

చ.

బిరుసులు వల్కి నన్ను వెఱపింపఁదలంచెదొ కట్టిపెట్టు నీ
గరువము వెఱ్ఱి యీశశశిఖామణిముందర నేడ నెవ్వరె
వ్వరు వసియించియుండి రది వారిద కాననభూమిజాతకో
టరముల నాఁపువెట్టెనె యొడంబడి పక్షుల కుర్వి చెప్పుమా.

111


క.

చెఱువులు బావులు గృహములు, తరువులు వృత్తులు ననారతము గాచినయా
నరులయవి యనుచు మను వు, త్తర మొసఁగఁడె తొల్లి దేవతాసంతతికిన్.

112


క.

బలవంతుఁ డైనధరణీ, తలభర్తకుఁ బోలునిట్టితగ వకటవకటా
పులుఁగులకును గుందేళ్ళకుఁ, బలుకులు వేయేల చెల్లుబడి గాదుసుమీ.

113


క.

జగతీరుహవివరమునకు, ఖగనాథా నీకు లేదు కారణ మేలా
తెగిపోర నాకు నీకుం, దగ వెక్కడికీని నరుగుదము రమ్మనుడున్.

114


వ.

మదీయమైత్రీమంజులం బక్కపింజలం బిట్లనియె.

115


క.

ఒప్పితి నిటఁ దగ వెవ్వరు, చెప్పెద నెఱిఁగింపు మతనిఁ జేరఁగ నెడలే
కిప్పుడ యరుగుద మనవుడుఁ, గప్పినతమకమున దీర్ఘకర్ణుం డనియెన్.

116


సీ.

తపనజాతటమున దధికర్ణుఁ డనుమహావృద్ధమార్జాలంబు విహృతిసల్పు
నది రుద్రచాంద్రాయణాదికార్యంబులఁ దనువు సన్నముఁ జేసికొని విరోధి
షడ్వర్గ మణఁగించి శాంతి వర్తిలు బహువ్యవహారదర్శి నయాంబురాశి
యది నేర్చు మనచిక్కు వదలింపఁ బెనుజోలి ద్రవ్వక నిమిషంబు దడయ కటకుఁ


తే.

బోద మావాద మాఱడి బోకపోవు, నని ప్రబోధించి శశ మమ్మహాకపింజ
లంబుఁ దోకొని చనుచుండె లాఘవమున, దలలు పడుచోటికేగు పాదములు గావె.

117


క.

ఏను గపింజలుఁ జిరమై, త్రీనిధి విననాడలేక వృక్షలతాగ్ర
స్థాని విడనాడి యెపుడెం, తే నెవ్వడిఁ గూడిపోయితిం జెలికానిన్.

118


మహాస్రగ్ధర.

చని కంటిం బ్రాంతకాంతక్షమనిరవధికశ్లాఘ్యసౌరభ్యసంప
ద్వనజాతవ్రాతరోధోవనవమధుమధువ్యగ్రమత్తాళిగీతన్
జనతశ్రద్ధానిమజ్జజ్జనభవహరణోచ్చండకాండప్రపూతన్
వినిషక్తబ్రహ్మనిష్ఠద్విజహితసికతాన్వీతఖద్యోతజాతన్.

119


తే.

కని తదంచితమణివాలుకావితర్ది , జరణములు మోఁపి నిర్గతశ్రముడ నైతిఁ
గంఠపర్యంతపరిమిళగ్రాసమంద, జవనపవనాభిగమసమాచారకలన.

120


సీ.

మనికిచో టిది గాదె యనువాసరాచాంతఖచరజీవితమరుత్కాళియునకు
నాటప ట్టిది గాదె యరివధాగతగోపవేషబృందావర్తివిష్ణువునకు
నిష్టమజ్జవగృహం బిది గాదె రాసనృత్తాశ్రాంతకాంతావతంసములకు
హలహలం బిది గాదె హాలోద్ధతప్రలంబారిలాంగలలేవిహానమునకుఁ

తే.

బ్రతిదినము గ్రోల నీది గాడిబావి గాదె, కృతశకృత్కరినందగోబృందమునకు
క్షౌద్ర మిది గాదె దివసకృజ్జలజమునకు, నని నుతించితి సంవిదాయము నయమున.

121


సీ.

అచటఁ గపింజల మావృద్ధమార్జాలపతిఁ జూచి చిత్తంబు పల్లటిలినఁ
గదియఁగూడక దీర్ఘకర్ణుఁ జూచి నిజాలతగవరి యని వీనిఁ బొగడి తీవు
కుటిలమానసుఁ డతిక్షుద్రుండు కేవలజఠరపూరకుఁడు మార్జాలజాతి
బెడిదుండు వీని నమ్మెడితెఱం గెయ్యది యొద్దికిఁ జనఁ జిత్త మొప్పకొనదు


తే.

తగవు దయ్య మెఱుంగు నీతగవుపట్టు, ప్రాణ మేటికిఁ దెకతేరఁ బాపికొనఁగ
ధర్మమున కొండుకడ కేగుదము దురాత్మ, మగుడు మనుటయుఁ గనలి యమ్మదటశశము.

122


చ.

పలికెఁ గపింజలంబున కపారకృపానిధి తుల్యదర్శి కే
వలపరిశుద్ధుఁ డార్తజనవత్సలుఁ డుత్తముఁ డబ్బిడాలభూ
తలపతి యిట్టిధర్మపరతంత్రుఁడు నమ్మినవారిఁ జంపఁగాఁ
దలఁచునె యేమి పల్కి తి పతత్రిపసంశయ మొప్ప దియ్యెడన్.

123


చ.

ఇన్నియుఁ జెప్ప నేమిపని యింకిట నీమది నంతసాధ్వసం
బున్న బిడాలముఖ్యుకడ కొక్కట నిద్దఱ మేగి సర్వ మ
చ్ఛిన్నమనీషవిన్నపముఁ జేయుద మూరక వత్తు మంచు ము
న్వెన్నును గానలేక పిఱుబీకులు సేయ ఖగంబు బీరమై.

124


వ.

యౌగపద్యాభిమానంబున శశకపింజలంబులు డాయంబోవుచుండె నప్పు డారెం
టికి నిత్యప్రత్యయం బారాధించుటకుఁగా దధికర్ణుండు ధర్మవాక్యంబు లుచ్చ
రింపం దొడంగె.

125


క.

ధర్మంబు తన్నుఁ బెనుచున్, ధర్మం బభివృద్ధిఁ బొంది తను బ్రదికించున్
ధర్మము శర్మకఠం బని, ధర్మం బేమఱరు సంతతము దత్త్వజ్ఞుల్.

126


ఉ.

ఉపగతులై భజించుతనయు ల్సహజన్ములు గూర్మిచుట్టము
ల్విపులతరైకదుఃఖముల వ్రేగురు రింతియ రారు వెంబడిన్
నిపుణుల కేల తన్మమత నెట్టన దేహి శరీర మూడ్చి చ
న్నపుడును ధర్మమొక్కడ సహాయము దానిఁ ద్యజింపవచ్చునే.

127


క.

పురుషార్థపరున కిహముం, బరముం గలదండ్రు సత్యపరతంత్రు సురా
సుర లర్చింతురు గావునఁ, బరహితసత్యములు విడువఁబడ వెప్పటికిన్.

128


తే.

ఆత్మవ త్సర్వభూతాని యనుపురాణ, వచన మూని బహుప్రాణివత్సలుఁడయి
సుఖము దుఃఖము సమముగాఁ జూచికొనుచు, దేహి పరలోకచింత వర్తింపవలయు.

129


చ.

సొలవక మేను కంటకము సోఁకినఁ గొండొకశోణితంబు పి
చ్చిలి తన కెంతనొప్పి యగుఁ జెప్పెడి దొండొకఁ డేమి దేహముల్

గలిగినవారి కివ్విధముగాఁ దనువేదనలంచు నేరిపై
నలుగుటలేక హింస కెడయై చనఁగాఁ జనుసద్వివేకికిన్.

130


క.

అను దధికర్ణునిపలుకులు, విని నిర్భయవృత్తిఁ గొంకు వీడ్కొని కదియం
జని తనకనవాగ్వాదము, లను దానికి శశకపింజలంబులు సెప్పెన్.

131


సీ.

చెప్పిన నప్పు డాజీర్ణోతు వారెంటి కనియె మీ రే మనియెదరో వినము
తెగనిచాంద్రాయణాదివ్రతంబుల దేహ మతికృశం బొనరించుకతనఁ జెవులు
తానక సూక్ష్మశబ్దస్వీకృతిం బాటిగావు గావున నీవు నీవు నిపుడ
శ్రవణము ల్గదిసి యుచ్చైస్స్వనంబులఁ బల్కుఁ డేర్పడ మీసుద్దులెల్లఁ దెలియుఁ


తే.

గదవె మమువంటిమునులకుఁ దగ వు దీర్ప, వేవు రుండంగ మము మీరు విశ్వసించి
దూర మరుదెంచితిరి కానఁ ద్రోవ రాదు, జాగుపని లేదు మా కనుస్ఠానవేళ.

132


క.

అరుదెండని నికటంబున, కరిగిన దధికర్ణుఁ డంఘ్రిహతి నారెంటిన్
దొరకుపడఁ బట్టుకొని కం, ధర విరియం గొఱికి చంపి తగ భక్షించెన్.

133


సీ.

క్షుద్రాశ్రయంబు వొచ్చుటకు జచ్చుట కాదికారణం బని చెప్పి కాక మఖిల
ఖగములఁ జూచి ఘూకం బేడఁ బక్షిసామ్రాజ్యాభిషేకసంరంభ మేడఁ
బనిగానిపని మానుఁడన రోసి గూడినపులుఁగులు చదలఁ బేరెలుఁగు లెసఁగ
వెసఁగన్నదెసల కుబ్బెసలారఁ బఱచినదర్పాంధ మద్దివాంధంబు గనలి


తే.

పసుపుజేగురుకొఱకచ్చుమిసిమి దేరు, మిట్టకనుగ్రుడ్లు మిడిమిట్లు మిడిసిపడఁగఁ
గంఠఘూత్కారముల దిశ ల్గలవరింప, గర్వదుర్లోకమునకుఁ గాకమున కనియె.

134


క.

ఏమినిమి త్తము కుటిలా, త్మా మత్స్వామితకు నెగ్గుఁ దలఁచితివే నీ
కేమిదురితం బొనర్చితి, నేమంటి భవద్విరోధినే యిది తగవే.

135


క.

శైలవనవహ్నిశిఖలం, గాలి పొదల్పొదలుఁ బరశుగతిఁ ద్రెవ్వి మనున్
సాలములు సత్క్రియాప్రతి, కూలవచోదగ్ధ ముసురుకొన దింతైనన్.

136


ఉ.

కుచ్చిత మేమి గూడు సమకూడిన రాజ్యము వీటిఁ బుచ్చఁగా
వచ్చినలాభ మేమి మఱవంబడదా తరువాత నిట్టినీ
యొచ్చపుఁజేఁత సౌఖ్యమున నుండుదుగాకని పల్కి పోయె స
వ్వెచ్ఛఁజుమీ విరోధ మొదవెం గరటాళి కులూకజాతికిన్.

137


క.

నావిని వాయసపతి చిర, జీవికి నిట్లనియె నీతిశీలా హితసం
భావన కిఁక నీతడవే, లా వేగమ తెలుపు మనిన నతఁ డిట్లనియెన్.

138


వ.

సంధివిగ్రహంబు విచారణీయం బాసనము బలిష్ఠ మయ్యు నుపస్థితరిపుస్థానం బగుట
నదియునుం గూడదు యానంబునకు లావు చాలదు స్థానత్యాగంబు లాఘవమూలంబు

ప్రత్యాసన్నవిరోధికులం బభావంబగుట ద్వైధీభావంబు పొసంగదు సంశ్రయం
బన్నిటికిం గర్తవ్యంబు విను శరీరపతనపర్యంతంబు నీకార్యంబునకేఁ బాబుపడఁ
గలవాడ.

139


క.

పలువురుకృతవైరుల మతి, బలధుర్యులు విమతులున్నఁ బరకార్యంబుల్
పొలిసిపడుం జెడు మునుధూ, ర్తులు మేకం గుక్క జేసి తోలరె విప్రున్.

140


క.

నావిని వాయసపతి చిర, జీవికి నిట్లనియె నీతిశీలా యేలా
గీవిధము తేటపడజెపు, మా వినియెద ననిన నతని కతఁ డిట్లనియెన్.

141


సీ.

చెనఁటి యాకులపాటుచే నలంగినసాధుతరుల కుబ్బొసఁగు నాదరణమూ ర్తి
భీమతీవ్రాంబకాభిహతి స్రుక్కిన మహామధురధర్మునినొప్పి మాన్పువెజ్జు
ఫలభంగమున మాటపట్టుజాఱిన పైకమునకు సత్యోక్తు లిచ్చినసుదాత
హాలినున్మత్తచండాలుర మాధవార్చనదురంధరులఁ జేసిన ఘనుండు


తే.

కాలగతిఁ బేర్చు నలజళ్ళఁ గలఁగఁబడిన, సరసులకు నిర్మలత్వంబు సంఘటించు
సౌఖ్యసందాయకుండు సాక్షాత్కరించె, సన్నుతానంతుఁ డవనివసంతుఁ డంత.

142


సీ.

ముక్తపత్రవ్యాజమునఁ జీరసడలించి కళికలఁ న్పులకల గలుగఁజేసి
పొలివోనితావులఁ బూవుదండలఁ జుట్టి కడలేనిమధుసాత్వికమునఁ దేల్చి
రణదళిఝంకారమణితము ల్ఘటియించి దీవిచక్కెరలూఱు మోవియాని
సరవినున్నతఫలస్తనములఁ గబళించి కళదేఱుతనువల్లి గౌఁగిలించి


తే.

కలికిరాచిల్కపల్కుఁ బల్కుల నలర్చి, సురభికర్పూరరజముల సొంపొనర్చి
కలితననలక్ష్మిఁ గూడి రాగము వహించె, మాధవుఁడు హృష్టనిఖిలక్షమాధవుండు.

143


వ.

మఱియు నవ్వసంతంబు కళికాభిరామంబై యుదాహరణంబును శుకసూక్తిసందర్భ
గర్భితంబై భాగవతంబును గలకంఠీకలాపదీపితంబై రాజావరోధంబును బ్రకాశిత
ప్రవాహంబై సముద్రతీరంబును సందృష్టశారికాజాలంబయి వీణాయంత్రంబును
బురుడించు నక్కాలంబున.

144


చ.

కలఁ డిల ముగ్ధభూసురుఁ డొకానొకఁ డాయనయధ్వరార్థమై
బలిసినమేఁకపోతు మెడ పగ్గమునం బిగియించి యీడ్చికొం
చలవున నింటికై యరుగ నప్పుడు గొందఱు ధూర్తు లిచ్ఛలో
పలఁ దలపోసి యయ్యజముఁ బాపపఁదలంచిరి దుర్ణ యంబునన్.

145


క.

తలఁచి యొకఁడొకఁడ చని లో, కులు నవ్వ న్విప్ర కుక్కఁ గొనిపోయెదు నీ
కులశీలంబులు వఱదం, గలపితి విఁక నేమి యని వికావిక నగుచున్.

146


క.

ఈరీతి నందఱు యజన, చ్ఛాగముఁ గుర్కురముఁ జేసి చనుచుండంగా

నాగరిక మేదివిప్రుఁడు, వేగలమున నిలిచి భ్రాంతి వికలుం డగుచున్.

147


క.

ఒకరిరువురు గా కందఱు, నకటా ఛాగంబుఁ గుక్క యని పోయెద రే
టికి బ్రమసి వేఁపిఁ దెచ్చితిఁ, దుకతుక నను నవ్వకుండుదురె తత్త్వజ్ఞుల్.

148


వ.

అని విహరణస్థలదచ్ఛాగం బగుభాగంబు విడిచి విప్రుండు పూర్ణశరం బగుకాసా
రంబునకు స్నానార్థియై చనియె నప్పుడు ధూర్తులు ప్రహాసభాసమానావను లగుచు
నొండొరులకరంబు లప్పళించుకొనుచు నయ్యజంబుం జంపుకొని భక్షించి రబ్లు
ప్రజ్ఞాశౌర్యధై ర్యాధిగుణంబులు గలవారలు పరులకార్యంబుల విఘాతంబు సేసి
స్వకార్య ముద్ధరింతురని మఱియుఁ జిరజీవి మేఘవర్ణు నాలోకించి.

149


క.

తనలావుఁ జూచి మృతకా, కనికాయశరీరరక్తకణములు మేనన్
జినికి వటతటమునం దిడి, చనుఁ డుపహతిరహితభూమిజాతంబులకున్.

150


క.

అరివద్ద నుండు సరిప్రొ, ద్దరుదెంచుం గెరలి తరలి హతశేషరట
త్కరటహృతి కట భజింతున్, హరుఁ డాపగవారిఁబోలె నాపగవారిన్.

151


వ.

భజించి నీకార్య మార్యసమ్మతంబుగా నిర్వహింపం గలవాఁడనని పలికిన మేఘవ
ర్ణుండు లుంఛితగరుజ్జాలుం గావించి విస్రం బగు కాకజఠరాస్త్రంబుఁ జినికి యచ్చి
రజీవిని న్యగ్రోధాగ్రకోటరంబునం బెట్టించి సపరివారుండై నిరుపహతిస్థానం
బున కరిగె నాసమయంబున.

152


చ.

అరుణగభస్తిబింబ మపరాద్రిఁ దిరోహితమయ్యెఁ బన్నగా
భరణి శిరోధిహాలహలభంగి నిఱు ల్నెరసె న్విరోధిభీ
కరగతి వంతగూఁబపరిగాఢమహీధరభూజదుర్గకో
టరములు నిర్గమించి వికటప్రకటాననము ల్ముడించుచున్.

153


క.

అరిమర్దనుఁ డనుపబల, స్ఫురణోల్లోకములు ఘూకములు వటకరటా
హరణేచ్ఛఁ గదలి బహుపా, ద్ధరణీరుహ మాశ్రయించి తద్విటపమునన్.

154


క.

కాకములు మెదలకున్నన్ ఘూకంబులు కర్ణఘోరఘూత్కారహతా
శాకులము లగుచుఁ గ్రమ్మఱి, పోకకు నఱ్రాడుచున్నపుడ భూజమునన్.

155


క.

మతివిదులకు నుచితమనూ, ద్యతనము సారంభుఁడయ్యు నాకృతకార్య
స్థితిఁ గడఁగనియునికి మహో, న్నతి యని మను వానతిచ్చినాఁ డట్లగుటన్.

156


క.

అని తలఁచి నిలిచి ఠీవిం, బనివడి చిరజీవి యేరుపడ నొకనెట్టెం
బొనరించినఁ గ్రమ్మఱి పరి, మునుమై యత్తొలులఁ జుట్టుముట్టె న్బట్టెన్.

157


క.

పట్టుకొని చంప నొంపం, గట్టాయితపడక యరుగుఁ గావున నతనిం
జుట్టమువలెఁ గొనిచని పతి, కట్టెదురం బెట్టి కౌశికంబులు నిలిచెన్.

158

క.

దూరితగరుదుత్కరువి, స్రారుణఘనలోహితాకృతాకృతి నతనిన్
దేరికొనఁ జూచి గర్వస, మారంభోక్తుల విరోధిమర్దనుఁ డనియెన్.

159


క.

ఓరీ నీ వెవ్వఁడ వీ,తీ రేమిటికైతి వనిన ధృతిపెంపున నా
పేరు చిరజీవి యనిన య, పారగుఁ డాయన యులూకపతి కెఱిఁగించెన్.

160


క.

ఎఱిఁగించిన మించిన నివ్వెఱ నిట్లను ఘూకలోకవిభుఁ డిట్లగుటే
తెఱఁగు చిరజీవి ని న్నఱ, మఱలే కక్కాకరాజు మన్నించుఁగదా.

161


వ.

దివస్పతికి బృహస్పతియుంబోలె మేఘవర్ణునకు ముఖ్యప్రధానుండవు నీతిపథికుండవు
ధన్యుండవు నీయట్టి కృతకృత్యునకు నిన్నీచదశ రా నేర్చునొకో సర్వంబునుం
జెప్పుమనిన జిరజీవి యరిమర్దను నాలోకించి.

162


చ.

తనపెనుగాకిమూఁకల నదాటున నీభటకోటి చుట్టి కా
ననితఱిఁ జంపి చన్నమఱునాఁడు మృతేతరభృత్యవర్గము
ల్గనుకనిఁగొల్వ న న్బిలిచి కార్యము వాయసభర్త వేఁడినన్
మనమునఁ గొంకులేక యరిమర్దనునిం గనుమంటి నాతనిన్.

163


చ.

ఘోరబలుం డగాధతరుకోటరదుర్గవిహారి రాత్రిసంచారనిరంకుశుండు పటుశౌర్యధనుం దరిమర్దనుండు క్రూ
రోరగభంగిఁ జంపఁదలనుండఁగ నెవ్విధి నిద్ర వచ్చు నీ
వారికి నీకు నెట్లు మనవచ్చు శుభంబు భజింపుమా యనన్.

164


క.

అరిమర్దను నిటఁ గని మని, తిరిగినజమునోరు దన్నితివి నాబుద్ధిం
జరియింపు మనిన వాయస ,పరివృఢుఁ డందులకు మండిపడి నావంకన్.

165


ఉ.

చూచి హితప్రధానుఁ డనుచు న్మదిఁ బెద్దయు నమ్మియుందు ని
న్నీచు విరోధిపక్షుఁ డని నేరనయో తుది నిశ్చయింప నిం
దీచెడుగొట్టుకా ల్నిలిచెనేనిఁ జెడుం బ్రతుకంచు నూఁచిపో
వైచి యులూకభుక్తికి నవత్సలుఁడై విడిపించె మఱ్ఱిపైన్.

166


తే.

ఎఱుక పిడికెడుధనమందు నిది నిజంబు, నెరయ నీమూఁక మున్ను న న్నెఱుఁగుఁ గానఁ
గనలి చంపక నొంపక గౌరవమున, దేవ నీపాదములమ్రోలఁ దెచ్చి నిలిపె.

167


తే.

తోడిమంత్రులజాడ నాదుర్మదాంధుఁ, డాడిన ట్లాడ కుచితకార్యంబుఁ జెప్పి
సిగ్గు గోల్పోతినని చిరజీవి జాతి, బాష్పుఁడై చెప్పెఁ దనచేటుపాటుఁ బతికి.

168


క.

ఆవేళ ఘూకపతి నయ, కోవిదు లగుమంత్రివరులఁ గూర్చి ప్రభుత్వ
ప్రావీణ్యంబున నచ్చిర, జీవిచరిత్రంబుఁ బ్రీతిఁ జెప్పెం దెలియన్.

169


తే.

చెప్పి వాయసరాజన్యశేఖరునకు, మాననీయుండు ముఖ్యప్రధానుఁ డితఁడు

దీని కెయ్యదితెఱఁగు వేర్వేర పలుకుఁ, డనిన నయదక్షుఁ డందు రక్తాక్షుఁ డనియె.

170


క.

చేరినమృత్యువు రిపుఁ డ, క్రూరాత్ముఁడు చిక్కినప్పుడు కొంకక చంపం
గోరుట నీతివిధానము, వైరికి దయఁదలఁచువెఱ్ఱివాడుం గలఁడే.

171


సీ.

 ఇతఁడు వాయసధరాపతికి మాన్యుఁడు ముఖ్యదండనాథుఁడు నీతిధాముఁ డనుచు
నానతిచ్చితి నిట్టివానికి నిట్టిదుర్వేషంబు వచ్చుట వెఱఁగు గాదె
ప్రత్యర్థికర్మమర్మము లెఱుంగుటకు రాజ్యప్రతిష్ఠకు నిట్టిసాధుమతులు
విను నీచవేష మైనను బూని బద్ధవైరులలోఁ బ్రవేశించి చెలిమిఁ జేసి


తే.

చిచ్చు దొలిసొచ్చి వృక్షంబుఁ జెఱిచినట్లు, పొదివి నానాటి కభివృద్ధిఁ బొంది పిదప,
జెఱిఁచి పోదురు వీని రక్షింప నేల, చంపి రాజ్యంబు సేయు నిశ్శంక నధిప.

172


క.

అని రక్తాక్షుఁడు చెప్పిన, వినఁగూడక ఘూకభర్త విశ్రుతనయధీ
ధనదక్షునిఁ క్రూరాక్షుని, గనుగొనుటయు నతఁడు మధురగతి నిట్లనియెన్.

173


క.

శరణాగతు రక్షించిన, కరహితచరితున కిహంబుఁ బరముం దురగా
ధ్వరఫలముం గలదని రో, యరిమర్దన కావు మిమ్మహాచిరజీవిన్.

174


తే.

అనుచు నాథుఁ డాడిన నద్దివాంధ, వల్లభుఁడు విని దీప్తాక్షువంకఁ జూచి
నీకుఁ దోఁచినకార్యంబు నీవు సెప్పు, మనిన నంగీకరించి యిట్లనియె నతఁడు.

175


క.

క్రూరాక్షునినీతి సుధా, పారంపరి యెట్టిదుస్స్వభావుఁడు జంపం
గోరఁడు శరణాగతు నన, ఘా రాజుకు నీకుఁ దగవు గానేర్చునొకో.

176


క.

ఈరీతి నీతి గలిగిన, సూరిజనుం డేల చెఱుపఁజూచుం జనతా
వైరి యగుదొంగబం టుప, కారము వృద్ధునకుఁ దొల్లి గావింపఁడొకో.

177


క.

నావిని యరిమర్దనుఁ డురు, భావుని దీప్తాక్షుఁ జూచి ప్రభునీతికళా
సేవధి విన నింపయ్యెఁడు, నావిధ మెఱిఁగింపు మనిన నతఁ డిట్లనియెన్.

178


చ.

కుండినరాజధాని వసుగుప్తుఁ డనం బ్రధానసార్థవా
హుఁ డఖిలార్థవంతుఁ డొకఁ డుండు నందు ప్రియావియుక్తుఁడై
పండినమూర్తితోడ నగుబాటున కుంకునఁ దన్వి నొండుచో
నండజయాన రూపవతి యన్కులకన్యకఁ బెండ్లియాడినన్.

179


క.

అలరుంబ్రాయపుఁగన్నుల, కలికికి ముదిమఁగడు బూచిగావున గవియ
న్దిలతైలమువలె నెనయక, తొలఁగుం జెలిసెట్టిఁ గన్నఁ దుప్పున నుమియన్.

180


క.

వెతలంబొగులుచు నెట్టన, రతిగతికిం బిన్నపడుచ రారమ్మనుచుం
బతిమాలి పిలువ విన దది, పతిఁబట్టిన చెవుడు దన్నుఁ బట్టినభంగిన్.

181


మ.

పలితశ్మశ్రుశిరోజరోగలతికోపఘ్ను న్ధనుర్భంగురున్
వలియుగ్వక్త్రునితస్తతశ్చలితనిస్వస్థోత్తమాంగుం గర

స్థలయష్టిం బటలావృతాక్షు విగళద్దంతు న్వయోగర్వని
స్తులయోషిత్కుల మేర్పడం బరిహరించు న్మాలవానింబలెన్.

182


సీ.

పాఱవేయుటెకాని భక్ష్యంబు లిచ్చిన వాతెర నంట దవ్వాలుగంటి
చించివైచుటెకాని చీర లిచ్చినఁ గటీరమునఁ గైసేయ దాఱంపులాడి
తొలఁగఁబెట్టుటెకాని తొడవు లిచ్చిన సొంపుపస మేన బూన దప్పలువచెలువ
మగుడనిచ్చుటెకాని మాడ లిచ్చిన ముల్లెఁ గట్ట దాజగఱాఁగ కలువకంటి


తే.

యింటిముంజూరుపెండెలో నిడుటెకాని, పువ్వు లిచ్చిన ముడువ దప్పొగరుమగువ
కుడిచి కూర్చుండి యిది యేమిగొడవఁ జేసె, వార్ధకంబున నాసార్థవాహకుండు.

183


తే.

ఆచెనఁటిభార్యపేరుఁ జెప్పగ పెఱబోటి, పేర సిగ్గుఁ దొలఁగఁబెట్టె సెట్టి
ముదిమి నేడ రోఁత యిదె నా కవిటవిటీ, జాతివశ్యభేషజంబు లడుగు.

184


సీ.

మొరడువంగినపెట్టిముదుకకు జఐరాలిమోము గాననివాని ముకుర మయ్యె
వగ్గుభర్తకు నాఁతి వాతెర చండాలవాటి వండిన పిండివంట లయ్యె
గొయ్యలూడిన పెండ్లికొడుకుకుఁ జెలినవ్వు విపినమండలిఁ గాయువెన్నె లయ్యె
వయసుపోయిన బేరివానికి సఖిచన్నుగొండ లందనిమానిపండు లయ్యెఁ


తే.

బలితునకుఁ గోకిలాలాపజిలుగుటెలుఁగు, బధిరునకు నయిన సంగీతపాక మయ్యె
మెలఁత నీక్షించి గ్రుక్కిళ్ళు మ్రింగుఁ గాని, సౌఖ్య మేమియు నెఱుఁగఁ డజ్జరఠతముఁడు.

185


చ.

నెల కొకనాఁడు గట్టెదురు నిల్వఁగఁ జూచినవాఁడు గాఁడు వీ
నుల కొకనాఁడు మాట విననోఁచినవాఁడును గాఁడు నవ్వులన్
వలపులఁ జల్ల మేల్గనినవాఁడును గాఁ డతఁ డెందువాఁడు గాఁ
డలజవరాలితోడిరతి యందనిమ్రానిఫలంబు సెట్టికిన్.

186


వ.

ఇట్లు సన్నిహితవిశేషవేదనాజాతఖేదంబున నారాటంబు బుట్టి యడియాసపస మసు
రుఁ బరిత్యజింపంజాలక ఈలకఱుచుకొని యెడతెగక నిగుడు నమందోష్ణనిశ్వాస
మాతరిశ్వంబున నధరపల్లవం బల్లలనాడ నతం డొక్కనాఁడు శయ్యాతలంబున
వొడలు పడవైచి దాసీజనంబులు తన కాచరించునూడిగంబుఁ గోడిగంబులం జేసి
కూడునీళ్ళకుం బాసి గాసిపడుసమయంబున రజస్వలాంభోజినీదివాసంగమక్రీడా
సంప్రాప్తదురితప్రాయశ్చిత్తార్థంబు భృగుపాతం బొనర్చినవిధంబున దపనుం డపర
గిరిఁ దిరోహితుం డయ్యె నయ్యెడ.

187


సీ.

పిసవెఱ్ఱిఱంకుగుబ్బెతలతప్పులు దప్పదాల్చుట కిది కన్నతల్లియిల్లు
కడుపుకక్కుఱితిపిల్పుడుగను ముదిలంజె నఱదుల కిది పిన్నవయసుమందు
గడికన్నగాండ్రయక్కఱలకు నిలుచూఱ పొరువుసొమ్మిడనిది పూఁటకాఁపు

కలవర్తకుల కన్నుఁగవలఁ బాయనినిద్రఁ గదలింపనిది నిమ్మకాయపులుసు


తే.

ప్రభకుఁ బాసినకుముదినీపత్రనేత్ర, రంజనంబున కిది విశుద్ధాంజనంబు
నాఘనాఘనకాళిమోన్నతి వహించి, కటికిచీఁకటి జగమెల్ల గప్పుకొనియె.

188


తే.

మానసాటవి నేర్చుమన్మథదవాగ్ని, బాహ్యసంచారమునకుఁ బాల్పడియె ననఁగ
దీపములు సార్ధవాహుమందిరమునందుఁ, బ్రకరశిఖ లుల్లసిల్ల జూపట్టె నపుడు.

189


క.

ఆరూపవతి ససారా, హారంబుల దృప్తిఁ బొంది యపు డొకభంగిం
బోరామి ఘోరనరక, ద్వారమువలె వృద్ధపతినివాసముఁ జొచ్చెన్.

190


తే.

చొచ్చి చచ్చినచండాలుఁ జూచుమాడ్కిఁ జూడకల్లంత నోసరించుచు గృహాంత
కాంతభిత్తికఁజెంతఁ గంకటికి నరుగు, బిటికి వీక్షించి యప్పటిపెద్దసెట్టి.

191


తే.

విరహదహనగ్రహంబువ విగ్రహంబు, కొలిమి నూఁదినగతి వేఁడి గలిగియుండ
సెజ్జ నారాటపడుచు నక్షీణవిభవు, భల్లకంపితభవు మనోధవుఁ దలంచి.

192


ఉ.

లేరె ధనుర్ధరు ల్పుడమి లెక్కకు మిక్కిలి యొండు రెండుగా
వా రడరింతు రేటినెఱవాదితనం బదిరెండు నొండుగా
నారసి వేయ నేరవలదా మఱి నీవలె నెంతవింత యా
నీరజగర్భుఁ డుండుఁ గడునీకరకౌశల మెన్న మన్మథా.

193


ఉ.

ఇంపున నవ్యచాపధరు లేసినతూపులు బాహ్యమాంసముం
జింపక మర్మభేదనముఁ జేయఁగఁజాలవు బాహ్యమాంసముం
జింకక మర్మభేదనము సేయు భవద్విశిఖంబు లెట్లు గీ
ర్తింపుదు నీదుచాప మవధీరితశంబరకాంచనాంబరా.

194


క.

తీరనికొలపగయుంబలె, నీరమణీమణికి నాకు నెనయదు విరహాం
భోరాశి నెట్లు గడతు, న్వీరోత్తమ నన్నుఁ గూర్పవే కలకంఠిన్.

195


క.

అని వెన్నునికొమరు మరు, న్వినతామరు విరహిభయదవిధసమరుఁ గన
త్కనకమణినిచయచామరు, ననుషక్తభ్రమరు దూఱి యతఁ డున్నంతన్.

196


తే.

కుశలగతి మజ్జనము లాడి కుడిచి కట్టి, ప్రజలు నిద్రించి రయ్యర్ధరాత్రివేళ
ఖడ్గఖేటకపాణియై గస్తుదిరిగెఁ, బెద్దతలవరి కింకరోపేతుఁ డగుచు.

197


వ.

అంత.

198


సీ.

భవనదీపాహితభ్రమరపేటిక వాలుకాభస్త్రి తలముళ్ళు గద్దగోళ్ళు
ములుదోరణముబట్ట మొలత్రాటికుఱువాఁడికైదువు దెసకట్టు కావుబొట్టు
జిలుఁగుగన్నపుఁగత్తి బలపంబు మొగమాయమందు తాలపుటాకు మైలగోఁచి
మడుపుటాకులు పోఁకపొడికాయ మోరచ్చు చెప్పులు భుజగవృశ్చికచికిత్స

తే.

సుప్తివృద్ధికరౌషధక్షోద మసిత, వసనభంగంబు పెడతలవంకసికయుఁ
గాఱునునుమేను నెఱ్ఱనికన్ను లమర, దూరితత్రాసుఁ డపు డొక్కదొంగబంటు.

199


సీ.

వచ్చి త్రిమ్మరుతలవరులు గన్గొనకుండ బవరిచుట్టును బలపమున వ్రాసి
ముంచి కన్నపుఁగత్తి మొనకెత్తిపెట్టించి యొయ్యనొయ్యన శిలలూడ దివిచి
వివర మేర్పఱిచి యావెంబడి బదములు నడపి నల్వంకలు దడవిచూచి
యలికిడిలేకుండఁ దెలిసి యిల్సొరఁబాఱి వాకిటిగడియ నెవ్వడిసడల్చి


తే.

గాలి రాకుండ వెలుతురు గాకయుండఁ, గఱకుగఱబట్ట గన్నపుగండి గప్పి
యొడలిసొమ్ములు వేర్వేర నొలిచికొనఁగ, సరస కేతేర పరికించి జలదరించి.

200


క.

కచభరము విరియ హార, ప్రచయం బల్లాడఁబఱచి పరిరంభించెన్
రుచిరగతి రూపపతి నిజ, కుచలికుచాగ్రములు నాఁటుకొనఁ బ్రాణేశున్.

201


సీ.

యువతి సేసిన యపూర్వోపచారమునకు వెస మిన్ను ముట్టి యమ్ముసలిపెట్టి
యిచ్చనచ్చెరువంది ముచ్చటయినను మొగం బీనిరక్కెస దనుదాన వచ్చి
నను నిటు గౌఁగిలించినది నేఁడిందుకుఁ గారణం బేమేనిఁ గలుగవలయు
నని లేచి నల్వంక లరసి యెక్కడ భయంకరహేతికరునిఁ దస్కరుని గాంచి


తే.

యితఁడు పో మూల మీశుభస్థితికి ననుచుఁ, బెన్నిధానంబుఁ జూచినపేదవోలె
నీరదోదయ మరసిననెమ్మివోలె, సమ్మదంబంది యాపరాస్కంది కనియె.

202


క.

పొడపుఱువుంబలె ననుఁ దన, కడకన్నులఁ జూడరోయుకన్నులకలికిం
గడువేడ్కఁ గూర్చి తిఁక నె, క్కడఁ గలఁ డిటువంటిచెలిమికాఁ డారసినన్.

203


క.

మానగుమహిజక్రోడ, స్థానంబున వెలుఁగుమదనదావానలకీ
లానివహము చల్లార్చెను, దీనిపయోధరము లద్వితీయచరిత్రా.

204


క.

చోరకుఁడవె యతిసమ్మద, కారకుఁడవు గాక తీర్చగలనే నీస
త్కారర్ణ మీభవింబున, దూరీకృతకలుష వడ్డితోడంగూడన్.

205


క.

తనగృహమునఁ గలవాసో, ధనకనకము లెల్ల నిచ్చెదను ధృతి మీరన్
గొని చనుమని యంజలి సే, సినఁ జోరుఁ డతిప్రసన్నచేతస్కుండై.

206


చ.

నెఱయఁ జెలంగియున్న యతనిం గని యిట్లను సార్ధవాహ యి
త్తెఱవ భవన్నియోగమునఁ ద్రిమ్మరదే యది క్రొత్త గాదె నా
మఱఁదివి నీవు చెల్లె లిది మమ్మవలోకముఁ జేసి కాదె బ
ల్వెఱపున నిన్నుఁ జేరి పొదవెం దనచక్కనిసోగచేతులన్.

207


క.

నీనిలయంబునఁ గలసొ, మ్మే నొల్లం బడుచుకరణ మిచ్చితి నిది నీ
తో నలగిన వేసారిన, చో నను మదిఁ దలఁపు మలయుచుం బఱతెంతున్.

208

క.

చెలియలని చూడఁ గినిసిన, దలఁ గోయుదుఁ బతికి సమ్మదము గానిది య
వ్వల కేల హితుల కేటికి, లలనామణి యిది మొద ల్మెెలఁగు నీయాజ్ఞన్.

209


వ.

అని భయంబుఁ బుట్టించి కృతసత్కారుండై చోరుండు సార్ధవాహు వీడ్కొని చని
యె నాసమయంబున.

210


సీ.

రాజాస్యముఖతామరసవాసనల గ్రుక్క నానుముక్కునబంటి యైనదనుక
ధరపయోధరసుధాధరరసంబునఁ జొక్కుఁ బంచబాణపిపాస పాయుదనుక
జంచలేక్షణఘనస్తనగుళుచ్ఛకముల నలముహస్తగ్లాని దొలఁగుదనుక
నాతిగాఢాలింగనమునఁ దెప్పలఁదేలు బొంది తాపము శాంతిఁ బొందుదనుకఁ


తే.

బ్రాయ ముడిబోయి కసరింకఁ బాఱియుండు, పంటిచాట్పున నెఱవేరుపడినయొడలి
పరుసుసెట్టన బీదచే పడినపగిదిఁ, గులుకుగుబ్బెతవయసెల్లఁ గొల్లలాడె.

211


సీ.

ఉదయవేళకుమున్నె నిదుర మేల్కని వచ్చి ప్రాణవల్లభుపదాబ్జముల వ్రాలు
వ్రాలి నిర్మలతరజ్వలనతప్తసువర్ణకలశోదకంబుల జలక మార్చు
జలక మార్చి సపర్వశర్వరీశాతపోత్తాలచేలంబులఁ దాల్ప నిచ్చు
లిచ్చి పొచ్చములేక హేమపాత్రంబున నిష్టాన్నముల భుజియింపఁ బెట్టుఁ


తే.

బరిమళముఁ బూయుఁ గపురంబుసురటి విసరుఁ, బూవుదండలఁ జుట్టుఁ దాంబూల మిచ్చు
బడక సవరించుఁ జిటిపొటి నడుగు లొత్తు, నలముఁ గౌఁగిట నాతి చోరాతిభీతి.

212


ఉ.

ఏరికినైనఁ జోరుఁడు సుహృత్తముఁడే యతఁ డేల సేసె స
త్కారము సార్ధవాహునకుఁ గన్గొన నిచ్చిరజీవి తావకీ
నారికి ముఖ్యమంత్రి యగు నైనను నీతిపరుండు గాన నే
తీరున నైన నిట్టిసుమతిప్రవరుఁ డశుభం బొనర్చునే.

213


క.

అని దీప్తాక్షుఁడు చెప్పిన, విని యరిమర్దనుఁడు నీతివిభవవిలాసున్
వినుతాసువక్రనాసుం, గనుఁగొనుటయు నతఁడు కౌశికప్రభుమొగమై.

214


క.

కంటకులు రిపులు దమలో, నొంటక పురిఁ బాసి యూర నొకఁడై విను మి
ట్లొంటిఁ గృశియింపుచుండుట, గెంటనిశోభనము గాదె క్షితిపా నీకున్.

215


ఉ.

ఈతఁడు మేఘవర్ణునకు నిష్టము గల్గినవాఁడు సత్క్రియా
న్వీతుఁడు రాజకార్యపరినిష్ఠితుఁ డీతఁడు లేమి లేమిసు
మ్మాతని కూర్జితైకవిజయస్థితి నీ కితఁ డున్కిఁ జేసి వి
ఖ్యాతి వహింతు శత్రుబలహైన్యము నీకు శుభంబు గాదొకో.

216

క.

వైరులు రాయుట హితస, త్కారమునక యసువు లిచ్చెఁ దస్కరుఁడు లఘు
క్షీరమహాగోద్వితయము, రారాపున గృహికి బ్రహ్మరాక్షసుఁ డిచ్చెన్.

217


క.

అన విని యరిమర్దనుఁ డా, నన మలరఁగ వక్రనాసునకు నిట్లను ది
గ్వినుత నయప్రథ యక్కథ, విన వేడుక యయ్యెఁ దెలుపవే నా కనుడున్.

218


వ.

వక్రనాసుం డిట్లని చెప్పం దొడంగె.

219


చ.

కృతవిదధీశ చెప్పెదఁ బరిగ్రహలబ్ధము భూరిదుగ్ధగో
ద్వితయము పొల్చు నొక్కజగతీసురు లోఁగిట దాని వంచనా
మతి నొకటన్ హరించుటకు మందచరుం డనుతస్కరుం డళి
ప్రతినవకాలకూటరుచిబంధుర మైనయమాసచీఁకటిన్.

220


క.

నె ప్పెఱుఁగక చనఁ గానల, చొప్పున నొకబ్రహ్మరాక్షసుం డరుగుచు నా
దెప్పరపుముచ్చు నచ్చోఁ, దప్పక వీక్షించి యద్భుతధ్వనిఁ బలికెన్.

221


క.

ఓరీ యిఱులూఱెడునీ, దారుణనిశి నెందుఁ బోయెదవు చెపుమా దు
ర్వారత్వర ననుటయు నల, చోరకుఁ డాబ్రహ్మరాక్షసున కిట్లనియెన్.

222


క.

జయసిద్ధి యనుధరామరు, నయనంబునఁ గలదు గోద్వయము దాని నతి
ప్రియతం గొని చనునాతఁడ, నయి పోయెద నొంటి నిమ్మహారాత్రమునన్.

223


ఉ.

కందెనదాయచాయకొఱ కచ్చులమేళము లక్షగోళము
ల్గుందెనమారునోరు పసిగోయ్యలదండులు పండు లిట్టిరూ
పెందును జెప్పఁ జూప నరు దెవ్వఁడ వీ వని వేఁడినం దరా
స్కందికి బ్రహ్మరాక్షసుఁడు సత్యపురస్సరభాష నిట్లనున్.

224


క.

ఈనిశ నిట నే విప్రుని, ధేనువులం ద్రాట నీవు దివియుటకై చో
రా నేఁ డరిగెద వత నిన, తానకమునఁ జంపఁజోయెద న్బలలాశిన్.

225


క.

నావిని చోరకుఁ డంతం, బోవక యనునిన్నిశీధమునఁ క్రోధమునన్
భూవిబుధుఁ జంపఁబోయెదొ, కో వాఁ డెటువంటినేర మొనరించెనొకో.

226


క.

కారణముఁ దెలుపు మన నల, చోరకునకు బ్రహ్మరాక్షసుం డను రజనీ
చారపలాయనమంత్రక, ళారూఢుఁడు గాఁడె యరయ నవ్విప్రుండున్.

227


చ.

జరఠకపిత్థరంధ్రములు సాలబిలంబు లగాధనింబకో
టరములు మఱ్ఱిమానితొఱట ల్పెనురావులతొఱ్ఱలు న్మహా
నిరవధితింత్రిణీమహిజనిర్వ్యధనంబులు తొంగిచూడ రా
దరసిన బ్రహ్మరాక్షసుల కద్ధరణీసురుచేతిరాయడిన్.

228


క.

మెఱమెఱసి యద్ధరామరుఁ, బఱిమార్పం బోవరాదు బ్రహ్మకునైనన్

మొఱఁగి నిదురించుచో నిది, తఱి యగుటం జంపఁబోయెదం బదమనుచున్.

229


వ.

ఇరువురు చని యవ్విప్రగృహంబు ప్రవేశించి రందు బ్రహ్మరాక్షసుండు ప్రతి
రోధి కిట్లనియె.

230


క.

తొలుదొలుత నరిగి విప్రుని, బొలుపారం జంపి కడకుఁ బోయెద నాలోఁ
దలఁకక నీ వరిగి నిరా, కులవృత్తిం బసుల నాఁచికొనిపొ మ్మొకటన్.

231


క.

తీ రిది యని చెప్పిన విని, చోరకుఁ డాబ్రహ్మరాక్షసున కను నీద
ర్పారంభ మెఱిఁగిరేని మ, హారభసము పుట్టు నీగృహంబున నకటా.

232


క.

ఈనెఱి నలికిడి పుట్టిన, ధేనువులను మ్రుచ్చిలింపఁ దీఱునె నాపూఁ
పైనతరువాత దూరము, గా నరిగినమీఁదఁ జంపు కాదన విప్రున్.

233


ఉ.

నావిని బ్రహ్మరాక్షనుఁడు న న్నిటు లాడఁగ నెంతవాఁడ వీ
లేవడి నిన్ను వేఁడ నవులేకలిగెం దొలుదొల్త నిద్ధరా
దేవునిఁ జంపెదం గనలు దీఱఁగనం చడరంగ దొంగయుం
బోవకు పోకు మం చతని భూరితరధ్వని నడ్డగించినన్.

234


వ.

అక్కలకలంబు విని బ్రాహణుండు మేల్కనియె నప్పు డతనికి విశ్వాసంబుఁ బు
ట్టింపందలంచి.

235


క.

మును బ్రహ్మరాక్షసుం డిట్లను ననఘా తావకీన మగుగోద్వయమున్
గొన నున్నత్రాసదీపితుఁ, డని చోరునిఁ జూపె నిజకరాంగుళికోటిన్.

236


క.

చోరుండును బటురౌద్రా, కారుండై నిను వధింపఁగా నదయుండై
చేరినక్రూరుం డితఁ డని, యారాక్షసుఁ జూపె భూసురాధ్యక్షునకున్.

237


క.

నేరముఁ దప్పించుకొనం, జోరుండును బ్రహ్మరాక్షసుండును దనతో
నీరూపునఁ జెప్పిన ముఖ, సారసరిపుమీఁద హాసచంద్రిక మెఱయన్.

238


క.

ధరణీసురుఁ డిట్లను మీ, రిరువురు పరమాప్తు లనఘు లిందెవ్వరిపైఁ
గెరలెదము చనుఁడు గాఢ, త్వరఁ గ్రమ్మఱ మీరు మీనివాసంబులకున్.

239


క.

దీవింపవలవ దవనీ, దేవత లామోదవనధిఁ దేలిన శాపం
బీవలవ దలఘుసంతా, పావిలచేతస్కు లమ్మహామహులయినన్.

240


వ.

బ్రాహ్మణద్వేషంబు లేక బ్రతుకుం డని వీడ్కొలిపినం బోయి రాచోరబ్రహ్మరాక్షస
వివాదంబు జయసిద్ధికింబోలె మేఘవర్ణచిరజీవిసంవాదంబు నీకు నిస్తులకల్యా
ణంబుఁ జేయునని విన్నవించి వక్రనాసుండు వెండియు.

241


సీ.

తనమేనికండలు దఱిగి డేఁగకు మేఁపి ఖగముఁ గావఁడె శిబిక్ష్మావరుండు
గరుడుని కాహారకబళమై నాగేంద్రవరుఁ బ్రోవఁడే మేఘవాహనుండు

నిజకళత్రద్రోహి నిర్దయాత్ముఁ గిరాతు మనుపఁడే నిర్ణిద్రమైత్రిపత్రి
శత్రుసోదరు విభీషణు సమిద్భీషణు రక్షింపఁడే తొల్లి రాఘవుండు


తే.

సకలదిక్కామినీకుచస్తబకములకుఁ, దారహారకలాపమై తద్యశంబు
నేఁడు నాఁడును నున్నది నిత్య మగుచుఁ, గంటె శరణార్థిగి మనుచుటకంటె శుభము.

242


సీ.

అని వక్రనాసుఁ డిట్లాడుమాటలు విని యందఱ వేర్వేర నడుపబుద్ధి
నపుడు దివాభీతనృపతి వికారకర్ణునిఁ జూచి తోఁచిన ట్లనఘ నీవు
పోలినతెఱఁగుఁ జెప్పుదుగాక యనునంత నెడసొచ్చి రక్తాక్షుఁ డిట్టులనియె
నేకార్య మెఱుఁగుదు రిందఱు పలుగూఁత లఱచెద రవివేకి వగుటఁ జేసి


తే.

మంత్రులకు నైజములు మృదుమధురఫణితు, లవి యథార్థీకరించి వాయసముఁ బెంచి
యేల చెడిపోయెదవు సేన నేల చెఱిచె, దహితు నిర్జింపు నాబుద్ధి నాదరింపు.

243


క.

నేరము ప్రత్యక్షంబై, చేరువ నుండంగ సంతసిల్లి సజారన్
చార న్సాధూక్తుల రథ, కారుఁడు శిరసావహించుకథ యిది యయ్యెన్.

244


క.

అన విని యరిమర్దనుఁ డా, యన నాలోకించి యోనయార్ణన యిది యె
ట్లను రాగంబునఁ జెపుమా, వినియెద నన నతఁ డులూకవిభునకు ననియెన్.

245


క.

కేరళదేశంబున రథ, కారప్రమదామతల్లి గల దవ్వికచాం
భోరుహముఖి యువజారో, దారవృషంబులకు వల్లెత్రాడై మెఱయున్.

246


ఉ.

జారులకొంగుపుత్తడి యసభ్యులచేరువపంట మన్మథ
ప్రేరితకోటి కేడుగడ పెన్నిధి గాముకజాతికిం బర
ద్వారులపట్టుగొమ్మ యుపవల్లభసంపద పాంథబృందమం
దారము పల్లవాంగణనిధానము దానివిలాస మారయన్.

247


ఉ.

క్రొవ్వినచన్నుదోయికులుకు న్నునుబయ్యెదఁ దెల్పఁజూచిన
న్రువ్వునఁ బర్వుచూపులదరు ల్చెదరం బటుపాంథమర్మముల్
ద్రవ్వ మెఱుంగుమేనిచెలువం బెడఁజేయక చూడఁ గోడెకాం
డ్రువ్విళులూఱ నూర మెఱయు న్రథకారవధూటి నీటునన్.

248


చ.

మెఱుఁగులఁ గ్రుమ్మరించుకనుమించులు త్రొక్కనిచోట్లు ద్రొక్కఁ గ్రి
క్కిఱిసినగుబ్బచన్ను లెడయీక విరోధులజోక నొండొక
ళ్లొఱయ నితంబబింబమున నొక్కొకయించుక జాఱఁగట్టుఁ గ
ట్టొఱపు ఘటింప నేగునలయుగ్మలి దూరుపుటేటినీటికిన్.

249


శా.

ఆవృత్తస్తని రూపలక్ష్మి కనువిందై యుండ నిర్గ్రాహమో
హావేశక్షుభితుండు గానినరుఁ డిష్టాహారసంచారని

ద్రావైముఖ్యము లేనివాఁడు గృహకాంతాకాంతసంతానచి
న్తావైరాగ్యవశుండు గానిజనుఁ డెన్నన్ లేఁడు లేఁ డొక్కఁడున్.

250


సీ

పలుమెఱుంగులు మోవిపై నటింపఁగఁ జేరి నవ్వు నొక్కొకసారి ఱవ్వనవ్వు
జారకర్ణగ్లాని చేసే నారజముగా బలుకు నొక్కొకసారి పచ్చిపలుకు
ముఖదృష్టియు నమర్మములు గ్రుచ్చి పారంగఁజూచు నొక్కొకసారి చుఱుకుఁజూపు
గిలుగుమెట్టెలఱంతు బెళుకుసంపాదింప నడుచు నొక్కొకసారి బెడఁగునడుపు


తే.

పదనుగా జాజుచేసినపసిఁడిఱేకు, పోల్కిఁ జూపట్టు దూతికపోలతలము
తమ్మరస మంటఁగఱుతుబ్రాయంపుకలిమి, మురియు నొకసారి వడ్లంగి మోహనాంగి.

251


సీ.

ఏతెంతుననియు పొక్కిడిపోయి మత్తాళిచూడ నాకట తొంగిచూడనయితి
చేసేఁత నప్పుడు యచ్చికబుచ్చికపుమాటలాడ నాతో మాటలాడవయితి
కెమ్మోవిరుచులఁ జొక్కించి తింతియ ముద్దుగుమ్మగుబ్బలఱొమ్ము గుమ్మవయితి
నను నేకతమున రమ్మని యొప్పి రప్పించి తెఱవ యేటికిఁ దల్పుఁ దెఱవవయితి


తే.

నీకుఁ జరణానతుఁడ నైతి నేత్రజితచ, కోర న న్నిచ్చలో నేల కోరవయితి
వందు రాత్మప్రపంచకు లైనజారు, లెదురుతాఁకైన నవ్వాడవదినెఁ గూర్చి.

252


తే.

పరుషటంకకుఠారసంభరణకరణ, జనితతాపరసక్లాంతశాంతకాంత
హస్తములఁ జేర్చు నొక్కొక్కయవసరమున, శైత్యభైషజ్యమున దానిచన్నుదోయి.

253


క.

కైసేసి బిడ్డపాపల, తో సందడిలేమి నొడలు దొడలుం బిఱుఁ దిం
తేసికుచంబులు మెఱయం, గా సుందరి పోతబొమ్మగతిఁ జూపట్టున్.

254


క.

చెలిచెలువు తెరువుటెసరుం, బలె నాపథికభోగపాత్రంబై వ
ర్తిలుచుండ దానిచెడుపో, కలు దెలిసెం బతికిఁ గొంతకాలంబునకున్.

255


క.

తెలిసి యొకనాఁడు వాఁ డా, లలనాతిలకంబు తలతలం బట్టుకొనన్
వలయునని తలఁచి వెంగలి, కలికిం బరికించి నిర్వికారతఁ బలికెన్.

256


క.

ఏలినయీకేరళనర, పాలుఁడు నా కానతిచ్చెఁ బయనము చాలన్
గాలవిళంబన మోమహి, ళాలీలం దెమ్ము సంబళముఁ గంబళమున్.

257


క.

వేఱూరికిఁ జని యిట కై, దాఱుదినంబులకు వత్తు నద్దివసము లా
ఱ్నూఱుసుమీ నీసంగతి, జూఱుట నా కని నయోషసంతోషమునన్.

258


సీ.

చివురువాతెర ఱచ్చసేయుఁబో వేఱూరి యొససరిగానిపల్లొత్తు కెంపు
తమిగుబ్బచంటిపాళెము డిగ్గుఁబో వింతగుమ్మచిమ్మటవ్రేలిగోరితాఁకు
మోముదామరతావి ముదమందుఁబో క్రొత్తబొజుఁగుకస్తురిచుక్కబొట్టుతేఁటి
చిన్నారిమేన వాసించుఁబో పొఱుగింటికలికిచుట్టము ఱొమ్ముకమ్మపూఁత

తే.

తనచొకాటపుఁజెక్కుటద్దములఁ బ్రతిఫ, లించుఁబో మాఱుమగని క్రొమ్మించురూపు
ప్రాఁతపోరాట మొండూరఁ బఱచెననుచుఁ, బొంగె లావణ్యసీమ వడ్లంగిలేమ.

259


క.

తలపేను పంటిసం దిది, పులుకాలను ముల్లు వస్త్రమున యూక కటి
స్థలి తీఁట పాదరక్షన్, శిలవోలెం బ్రాఁతమగఁడు చే టెవ్వరికిన్.

260


ఆ.

నెరసుతోడఁబోలె నేత్రంబు దుర్భర, వ్యాధితోడఁ బాసి యంగకంబు
కాంతి నుల్లసిల్లుగతి వీనిఁ బాసి యి, చ్చానురూపవృత్తి నగుదు నేను.

261


క.

అని మూఁపులు మూఁడై లా, లన రథకారునకు సంబళము గంబళ మి
చ్చి నిలిచి కుహనార్తి గడ, ల్కొన నప్పుడ నిలిచి పేరుకొని పతి కనియెన్.

262


ఉ.

నిక్కున మూరి కేగెదవె నీకు దయారహితాత్ముఁ డైనరా
జెక్కడఁ గల్గె నిన్ను నొకయించుక నే పెడఁబాసి యుండలే
నిక్కడ నేను మీపిఱుఁద నిప్పుడ వచ్చెదఁ దోడుకొంచుఁబొ
మక్కఱదీఱ నాహృదయ మక్కట నీవశ మౌ టెఱుంగవే.

263


క.

నిమిషము దివసంబై దివ, సము నెలయై మాసకంబు సంవత్సరమై
సమయుగమై చింతించెద, రమణా భవదీయయోగరాహిత్యమునన్.

264


ఉ.

ఈచెలు వీకళావిభివ మీగుణ మీకమనీయవిగ్రహం
బీచతురత్వ మీగరిమ మేమగవారికి లేదు చూచితిం
జూచితి బ్రాణనాథ నినుఁ జూచినకన్నుల కాలతాంతనా
రాచుఁడుఁ బట్టఁ డీవు మగరాజవు రాజవు నిక్క మింతయున్.

265


ఉ.

కేవలసాధనంబు లిరుగేల వహించి నటించునమ్మహా
భావజునట్ల యుక్కుటులిబాడిసయం గొని నీవు మామకీ
నావసధంబున న్మెలఁగ నచ్చరచాడ్పునఁ గన్ను లార్ప కిం
పావహిలంగఁ జూతు దరహాససరిస్ఫురితాననాబ్జనై.

266


క.

విడిఁగలమాణిక్యము పు, త్తడితోడం గూర్చినట్లు తనతో నిను సొం
పడరం గూర్చినబ్రహ్మకుఁ, దడయక చేయెత్తి మ్రొక్కుదమె ప్రాణేశా.

267


క.

తడసినఁ జత్తు న్వడి ని, క్కడి కేతెమ్మనుచు ముచ్చు గన్నీ రొలుకన్
బుడిబుడియేడ్పులతో న, వ్వెడమాయలప్రోవు మగని వీడ్కొల్పుటయున్.

268


ఉ.

వంచనఁ జేసి వాఁడు తలవాకిలి వెల్వడి పోయిపోయి య
స్తాచలకుంజకోటరమునం దినుఁ డేగినఁ డక్కు బెట్టి ద
ముంచినచీకటి న్మసలి ముచ్చువలెం జొరఁబాఱి యింటిలో
మంచముక్రిందఁ దూఱుకొని మౌనముఁ గెకొనియుండె నంతటన్.

269

ఆ.

జలములాడి మేనఁ గలపంబు నలఁది య, చ్చెలువ చలువవలిపెచీరఁ గట్టి
ముడిచి కుడిచి లేచి విడియంబు సేయుచు, మొదలియామమయిన యద నెఱింగి.

270


ఉ.

ఆతెలిగంటిగంటి నెరసైనవిభుం డరిగె న్నిరంకుశ
ప్రీతి రమింపవచ్చు నిటఁ నిల్వుము నీ వని త్రోవ దూతి మా
రేతిరిఁ బోయి చీరనగరీప్రతిరథ్యముసుం గొనర్చి సం
జాతకుతూహలుం డగుచు జారుఁడు దత్సదనంబుఁ జేరఁగన్.

271


ఆ.

కోళ్లు మూయ మద్దుగొంగడిఁ బఱిచిన, మంచమునకుఁ గ్రొత్తమగనిఁ గొనుచు
కులుకునడల నరిగి కూర్చుండె దానిక్రిం, దింటిమగఁడు డాఁగు టెఱుఁగలేక.

272


చ.

ప్రవిఘటితానురూపదృఢబంధ మమంధరమోదకృద్గళా
రవము కటీకపోలముకురస్తనదృష్టనఖక్షతంబు కై
తవపరిహాసభాషితమతాంతచపేటమపాప్తలజ్జను
ప్రవదుపగూహ ముల్లసిలె సంగమ మిద్దఱకు న్నిరాంధ్యమై.

273


క.

సాధీయాకృతధారా, సాధారణకరశిఖరనిశాతనఖంబుల్
సాధింపఁగ రతినాథా, యోధనసాధనము లయ్యె యువయువతులకున్.

274


క.

ఆసతి యుపపతియును నిజ, వసతిం జెలరేఁగి య ట్లవారణగాఢో
ల్లసనమునఁ బెనఁగ దుసికిలి, వెస నచ్చెలికాలు మగనివె న్నొఱయుటయున్.

275


క.

దిటచెడక యద్ధరిత్రీ, కటిమదిలో నిశ్చియించెఁ గనలున నీచీఁ
కటీ నెక్కటి నిక్కడికం, కటిక్రిం దిటు వచ్చె గట్టిగా మగఁ డనుచున్.

276


క.

రతితృప్తిఁ బొంది యయ్యుప, పతి నాతిం జూచి పలికెఁ బద్మముఖీ నీ
పతిరతిలో నారతిలో, మతిః దలఁగఁగ నీకు బ్రియతమం బెయ్యదొకో.

277


క.

నోరార్పక నిక్కము జెపు, మా రామా ప్రేమ ననిన నది వానిదెసన్
గూరిమిఁ గలిగియు నలరథ, కారమనోరంజకంబుగా నిట్లనియెన్.

278


మ.

[1]పతి కందర్పరహస్యకేళికిఁ దలంప న్నాక్షరోచ్చారణ
స్థితి ముంగొంగుపసిండి గాదె మది నాతిం బ్రీతిఁ దేలింపఁగా
కతివారాగతుఁడై విరక్తిఁ దొఱఁగంగాఁ జేరుజారుండు సీ
సతమే దెప్పకు వానితోడిరతి నిస్సారంబు రాజాస్యకున్.

279


క.

ఇది యేటిమాట యేలా, వదిరెదు నిను నీవెఱుంగవా నారమణుం
డుదధిచిఱుపడియ వీవ, ల్లది నే ననపన్నఁ దెలియదా నీమదికిన్.

280


క.

రోఁత నినువంటిమానిసి, క్రోఁతికి నామగనిఁ బేరుకొనఁ జక్కెరకున్

జేతికిఁ గలవాసి సుమీ, కాతాళముగాదు నీకు ఘనుఁ డాతనికిన్.

281


ఉ.

ఒండన నేల నామగనియొద్ద రమించుట యింద్రభోగమై
యుండునయో యనుంగువిభుఁ డూరికిఁ బోవుటెఱింగి యొంటి ని
ట్లుండఁగ వచ్చి పట్టికొని యోరిదురాత్మక సిగ్గులుగొంటి వీ
వెండయుఁబోలె వేఁడి ఘటియింపదె నా కిటువంటికూరిమిన్.

282


ఉ.

రాచపను ల్వహించి నలరాచకుమారునివంటిదేవుఁ డ
య్యో చని కాళ్ళతో నరిగె నూరికి నెప్పుడు వచ్చువాఁడు లే
లే చవిగావు కండ్లు పెకలింపుచు నున్నవి ప్రాణవల్లభుం
జూచినదాఁక యెట్లు నిలుచుం దను వెట్లు సహించియుండుదున్.

283


శా.

కాయం బెక్కడ నుండెనేమి వనితాకందర్పుఁ బ్రాణేశ్వరుం
బాయంజాలవు ప్రాణము ల్మనసురుబ్బాఱూళ్ళుగాఁ జేయుటన్
డాయ న్వచ్చుఁగదా పయోధరము లంటం గౌఁగిటం జేర్చి యా
చాయం బైకొని చెక్కి నొక్కురతిరాజ్యశ్రీలఁ దేలింపుదున్.

284


చ.

అగునగు బైసిమాలిచితినంచు విజృంహణవృత్తి నివ్విధి
న్సొగయనిమాటలం జెవులు సూడకు సైఁచినదానఁ గాను నా
మగనికి నిన్నువంటికొఱమాలినమానుసు లీడె [2]భర్తతోఁ
దెగి యెడద్రెవ్వకం బ్రదికితే మని యైదువనై సుఖించెదన్.

285


చ.

అనుతనుమధ్యభాషితము లారథకుడు సాదరంబుగా
విని యిది నాయెడం బ్రణయవిశ్రుతయా నటుగాకయుండినన్
నను ననుకూలుఁడంచు నుపనాథునితోడ శతాననంబుల
న్వినుతి యొనర్చునే పరిభవింపక చంపక కాతు మెచ్చితిన్.

286


ఉ.

ఏను బ్రవాసినౌ టెఱిఁగి యింతట నంతట నాకుమా ఱెవ
ర్లేని దెఱింగి కన్గొని చలింపక వీఁ డిలుసొచ్చి యుద్ధతం
డై నిలుపోవలేక కదియంబడెఁ గూఁతలు రోఁతలంచు ల
జ్జానిధిగాన మెత్తఁబడి సాధ్వి రతిస్థితి నూరకుండెడున్.

287


ఉ.

చిక్కితి వీనిచేత రొదసేయుట సిగ్గులచేటు పొందులం
జొక్కక వేగ నిల్వెడలఁ జూడఁడు ముచ్చటఁ దీర్పకున్న వీఁ
డుక్కున నేమిసేయునొ భయోదయ మయ్యెడునంచు నోడి యీ
చక్కెరముద్దుగుమ్మ సరసప్రియభాషల నింపొనర్చెడున్.

288

క.

అతివా నారతిలో నీ, పతిరతిలో నిష్ట మెద్ది పలుకం దగునం
చతఁ డడిగిన హితరూపా, న్వితుఁడని న న్నబల పొగడె వీనిం దెగడెన్.

289


ఉ.

వంచన యిప్పు డీతులువవంక జనించె జనించుఁగాక యీ
చంచలనేత్రి నాయెడఁ బ్రసన్నమనోరథ దీనిమాటలన్
గాంచితి మోదమంచు రథకారుఁడు వేగ సజారదారతో
మంచము నెత్తికెత్తుకొని మంజుగతిం జని వాడవాడకున్.

290


ఉ.

వాకొని యెంతశాంత యెటువంటిపతివ్రత యెంతయుత్తమ
శ్లోకవివేకరాశి యనుచుం బ్రియ నెన్నుచు హస్తతాళమా
నైకలఘుప్రచారగతి నాడెఁ బ్రహాసవిలాసవక్త్రులై
మూఁకలు గట్టి నాగరికముఖ్యులు త న్బరికించి నవ్వగన్.

291


వ.

ఇచ్చరిత్రంబు సాపరాధుం డగు చిరజీవిం జేపట్టిన నీ కుదాహరణం బగు నని
రక్తాక్షుండు చెప్పిన నప్పలుకు లాదరింపక నులూకేశ్వరుం డూరకుండె నంత నయ్య
భిప్రాయ మారసి.

292


క.

తనకు నులూకత్రాసము, మనుగడ కుపహతియు నబహుమానత్వము లే
దని తెలిసి తెలివిఁ గలయా, వనమునఁ జిరజీవి ఘూకనాథుని కనియెన్.

293


క.

నీరిపుచే నూరక యవ, ధీరణఁ గాంచితి జగద్విదితమతి నయ్యున్
గ్రూరాగ్ని కాహుతిగ దను, ధారణ మిఁకజాలు వేల్చెదం బ్రాణంబుల్.

294


క.

నావిని రక్తాక్షుఁడు చిర, జీవిం బరికించి చచ్చి చేసెడుపని యే
మీ వివరపుట్టఁ జెపుమా, నీ వనుటయు నాతఁ డాతనికి నిట్లనియెన్.

295


క.

ఈకాయ మనలముఖమునఁ, బోకార్చి యులూకయోనిఁ బుట్టి బలిమిమైఁ
గాకముల గర్వరేఖా, స్తోకములం ద్రుంతు మనసుతుందుడుకాఱన్.

296


వ.

అనిన విని రక్తాక్షుండు.

297


క.

లోకదృశుఘనసమీరమ, హకుధరంబుల వరింతు నని కాదా పూ
ర్వాకృతికి వచ్చె నొక్కతె, కాకికి నీకేల కౌశికత్వము గల్గున్.

298


క.

అనురక్తాక్షునిఁ గనుఁగొని, ఘనుఁ డచ్చిరజీవి వలికె గాఢప్రజ్ఞా
ధన వినఁగోరితి నిక్కథ, యనురక్తిం జెప్పుమనిన నతఁ డిట్లనియెన్.

299


సీ.

కైటభాహితపదాంగదమౌక్తికచ్ఛాయ విధికమండలుసమన్వితమరాళి
మారారిమకుటమందారమాలిక వియత్కృష్ణధేనుక్షరత్క్షీరధార
సాధుజీవంజీవచంద్రిక సగరజస్ఫాటికస్వర్గసోపానపంక్తి
చిరతపోవిత్తసంచితభగీరథకీర్తివారాశిహృదయకర్పూరచర్చ

తే.

పరుషవాసిష్ఠశాపసంప్రాప్యమాణ, మిత్రసహపుత్ర గీర్వాణశత్రువేష
సముదితక్లాంతిహృతిసమ్యగమృతవృష్టి, గంగ పొగడంగ నెగడు రంగత్తరంగ.

300


సీ.

తజ్జలంబుల నొక్కతపసి యాస్వాదింప శయపుటం బల్లనఁ జాఁపుచోటఁ
దటకుటానిలనటద్విటపకాండవిషణ్ణఘనగృధ్రచంచునిర్గతిత యగుచు
మూషిక పడియె నమ్ముని దాని నిజతపోమహిమ నొక్కమనోజ్ఞమహిళఁ జేసి
కన్నకూఁతునకంటెఁ గడుగారవంబునఁ బోషింప నొకకొన్నిపూఁటలకును


ఆ.

గుఱులు గూడై మేను మెఱుఁగెక్కెఁ బాలిండ్లు, బయలు మెఱసెఁ బిఱుఁదు బలిసె నడలు
ముఱిప మెఱిఁగె సిగ్గు మోమున నివురొత్తెఁ, దోయజాస్య కలరుఁ బ్రాయమైన.

301


క.

కలితరుచిమించువించున, ఫలముంబలె నూఁగునూఁగుఁబ్రాయము చెల్లిపై
నిలువం గని ముని మను వీ, వాలెనని తలపోసి నధికవాత్సల్యమునన్.

302


క.

ప్రతినూతవర్తువేళా, న్విత యెవ్వతె యవ్వధూటి వృషలి యగు న్ద
త్సతిపాణిగ్రహణముఁగా, మతిఁ దలఁపరు సుమతుల నభిమతమై యునికిన్.

303


వ.

ఇంతకుమున్ను వివాహంబు సేయలేనైతి నిచ్చిపుచ్చుకొనువారికిఁ గులధనాదిగౌర
వంబులు సదృశంబులు నయిన ననురాగంబు పెరుగు యౌవనాదులు పరస్పరాను
రూపంబు లయియుండిన సతిపతులకు ప్రేమాంకురంబులు వృద్ధిబొందుఁ గావున
నివ్వనజగంధి మహానుభావుండగు సూర్యదేవునకుం బరిణయంబు సేసెద నని య
మ్ముని తీవ్రధాము నాకర్షించి.

304


సీ.

తను నోరఁ బేరు గ్రుచ్చినవారి కారోగ్య మిచ్చువాఁ డఘముల వ్రచ్చువాఁడు
పరరాజసంబాధ విరియుచక్రముల రక్షించువాఁ డిఱుల శిక్షించువాఁడు
వేదాంతశుద్ధాంతవీథుల నోలగం బుండువాఁ డాపద ల్చెండువాఁడు
దుష్టమందేహసందోహంబు నెలగోలు తరమువాఁడు మురారితరమువాఁడు


తే.

సంప్రదోషవచస్స్థితి జలదరించు, నవనిజనులకు దృష్టిపాటవము నిచ్చి
మించువాఁ డెల్లదిశల దీసించువాఁడు, సారసాప్తుండు మునికి సాక్షాత్కరించె.

305


చ.

ముని యలతీవ్రధాముని సముజ్జ్వలధామునిఁ బూజసేసి యి
ట్లను దిననాథ యిక్కిసలయాధర పెంపుడుబిడ్డ నాకు నీ
కెన సుముహూర్తవేళ వరియింపుము నీ కిదె యిత్తు నన్న న
వ్వనరుహబాంధవుండు శ్రుతవంతుఁ బ్రశాంతునిఁ జూచి యిట్లనున్.

306


తే.

అనఘ నాకన్నఁ బర్జన్యుఁ డధికుఁ డభ్ర, సంచయంబున నను నిరోధించుఁ గాన
నమ్మహాతున కీకన్య నఖిలమాన్యఁ, బరిణయము సేయు మది నీకుఁ బరమశుభము.

307


క.

అని చెప్పి తపనుఁ డరిగిన, ననఘుం బర్జన్యు నంత నాకర్షింపన్
జనుదెంచి నిలిచె నతఁ డ, మ్ముని యువ్వేల్పునకు నెయ్యమున నిట్లనియెన్.

308

క.

కన్య న్భువనత్రయాస, న్మాన్య ననన్య న్వరింపుమా యిచ్చితి నీ
ధన్వత్వ మమర ననఁ బ, ర్జన్యుం డిట్లనియె మౌనిజనమాన్యునకున్.

309


క.

మరుదభిహతిదూదిక్రియం, దరలుదు నాకన్న ఘనుఁ డతం డాయన కి
త్తరళాక్షి నిచ్చి సంయమి, వర పెండ్లి యొనచ్చు మనుచు వాఁడుం బోయెన్.

310


క.

పవమానుఁ గ్రోధహతరై, పవమానుఁ దలంపఁ దపసిపాలికి నతఁ డా
ర్జవజవము లమరవచ్చిన, వివిధాతిథ్యముల గారవింపుచుఁ బలికెన్.

311


చ.

ఉచితసభాయితాఖిలపురోపవనాపవనాసురాసుర
ప్రచయములందు నీసవతుఁ రాఁ డొకఁ డిష్టజనప్రసన్నతా
రుచుల నటౌ టెఱింగి గుణరూపవయోనయధన్యఁ గన్య నీ
కచలమనీష నిచ్చెద సదాదృతిఁ గమ్ము వివాహ మీవనన్.

312


చ.

నరులు సుర ల్భవాదృశులు నన్ను మహాబలుఁ డండ్రు సత్కళా
పరపరమేష్ఠి శైలము లపారబలంబులు నే నెఱుంగుదుం
బరు లనకున్న నేమి కనుపట్టిన పట్టిధరాధిభర్త కా
దరమున నిత్తుఁ గాకని సదాగతి సెప్పి యథేచ్ఛ నేగినన్.

313


క.

ధరములఁ దటఘటితపయో, ధరముల సంగీతముఖరదైవతవిద్యా
ధరముల శ్రీగరుడసుధా, ధరములఁ దలఁచుటయుఁ బర్వతము లేెతెంచెన్.

314


క.

ముని యద్ధరణీధరములఁ, గనుఁగొని యిట్లనియె నాత్మకన్య ననన్యన్
జనలోకమాన్య నిచ్చెద, గొనకొని యొండొకఁడు పుచ్చుకొనుఁ డిం పెసఁగన్.

315


చ.

అతిశుభలగ్న మీసమయ మన్న నమస్కృతు లాచరించి ప
ర్వతములు వల్కె నేఁ డబలవంతుల మందురు పాదజడ్జరీ
కృతులము మమ్ము లెక్కఁగొన వెల్కలు వానికి నిమ్ము నిర్మల
వ్రత భవదీయప్రీతి కనివారణ లేకని చెప్పి పోయినన్.

316


క.

ఎలుకలఁ బిలిచి మహాముని, కులవల్లభుఁ డనియె నిత్తుఁ గూఁతు న్మోదం
బొలయ వరియింపుఁ డొకఁడని, పలికిన నవి కరము వెఱఁగుపడి యిట్లనియెన్.

317


క.

ఎలుకలకు మనుజసతులకుఁ, గలయిక లెట్లనిన మౌని కమనీయతపో
బలమునఁ గ్రమ్మఱఁ గూఁతురు, నెలుకంగాఁ జేసి యొకటి కిచ్చెం బుచ్చెన్.

318


వ.

అట్లగుటఁ గాకి వగునీకు ఘూకజన్మ మెట్లు గల్గునని కేరడం బాడి యధిక్షేపించు
రక్తాక్షుని వారించి యరిమర్దనుండు ప్రసాదపురస్సరదృష్టిఁ జిరజీవి నాలోకించి.

319


ఉ.

క్రూరతరావలోకములు ఘూకము లాదృతి నీకు నీప్సితా
హారము లిచ్చు నిర్భయుఁడవై ధరణీరుహదుర్గకోటరా

గారములం జరింపుచు సుఖస్థితి నుండు కొఱంతలేక యో
భూరివివేక యంచుఁ గడిపోవనిభక్తి బహూకరించినన్.

320


వ.

కృతకృత్యుండ నయితినని ధైర్యవిజితనీహారాచలానర్గళప్రచారంబున దుర్గబాహ్యా
భ్యంతరంబులం బ్రవర్తించి యన్నియుం గనుంగొని శరీరవర్ధనపర్యంతంబు చింత
దొరలకుండ ఘూకంబులం గలిసి మెలసి పక్షంబులు వ్యవహరదక్షంబు లగుటయు
నొక్కనాఁ డెడఱునేచి యులూకమూలోత్పాటనంబునకుఁ బృథ్వీరుహదుర్గకోట
రద్వారంబుల నీరంబులుగాఁ బూరిఁ గూరి నీరసేంధనంబులు దుఱిఁగి కరీషపిండఖం
డంబులు గ్రుక్కి యక్కడ నిలువక మేఘవర్ణుం గానంబోయి యవ్వాయసపతిచేత
సంభావితుండై యప్పు డుపస్థితంబైన కార్యము విన్నవించి చిరజీవి యిట్లను నీవు
ను నిన్నుం గొటుచువారును నీరసతరుశాఖలను గొఱవులను బట్టుకొనిరండు వైరిసం
హోరసమయం బిది యని తెలుపుటయు.

321


క.

ఎరవలిపట్టినకొండల, కురువడిఁ జని కాకిమూఁక లొక్కటఁ గొరవుల్
వరవరలైనపిడకలు తరిగైకొనిపోయిు ధీరతం దరికొల్పన్.

322


మ.

తగ నత్యుద్ధతి మించువాయువులచేత వ్రాఁజితోడ్తోన క్రొం
బొగలై కీలలు పర్వి నిక్కఁ జిఱునిప్పు ల్రాచి యుక్కుమ్మడిన్
గగనం బంటి ఘనస్ఫులింగములు నాల్కల్గ్రోయునచ్చిచ్చునం
బగిలెం బ్రేలిపడెం దివాంధకులము ల్భస్మంబు లయ్యెం దుదిన్.

323


క.

ఈవడువున నిశ్శేషము, గా వైరుల సంహరించి కౌతూహలసం
భావితుఁడై యప్పుడు చిర, జీవికి నలకాకరాజశేఖరుఁ డనియెన్.

324


క.

పగవానిగృహము మృత్యువు, మొగ మచ్చో నిన్నిదివసములు గట్టా యే
పగిది జరించితి వీ వని, వగచినఁ జిరజీవి మేఘవర్ణుని కనియెన్.

325


చ.

అడఁకువఁ గార్యకాంక్షి యగునాతఁడు దేజము డాఁచి దుస్థితు
ల్గుడుచుచు నీచుఁ గొల్చి తిరుగుం దివిషజ్జయులై ధరిత్రిఁ బే
ర్పడినసహోదరు ల్దనకుఁ బ్రాపుగ నుండియుఁ బుణ్యగాథలం
గడపఁడె మత్స్యరాజసముఖంబున ధర్మసుతుండు కాలమున్.

326


ఉ.

పౌరుషము న్మహాబలముఁ బండితభావముఁ గల్గినట్టియా
ధీరుఁడు కార్యదాహనిరతిం బరుఁ గొల్చు మహానసాగ్నిధూ
మారుణతాక్షులు న్మలినమైనపటంబు మహావిభూషితా
కారము దర్వియున్మెఱయఁగా నలభీముఁడు మాత్స్యుఁ గొల్వఁడే.

327


ఉ.

పౌరుష ముజ్జగించి నగుబాటున కోరిచి సాధుగర్హితా

కారతఁ గాలకాంక్ష పొసఁగ న్నిజకార్య మొనర్చుగాండివ
జ్యారవదేవదత్తరభసక్షుభితాష్టహరిత్కరిశ్రుతి
ద్వారుఁడు గ్రీడి మత్స్యపురి నాఁడు బృహన్నలయై నటింపఁడే.

328


చ.

ఒకదెసఁ గార్యదాహమున నుండక యేరికినైనఁ దీఱ దం
తకవిభసత్యుఁ డాదరణధామకటాక్షుఁ డఖండవిక్రమా
ధికుఁడు విలాసవిశ్రమణదేశము మాద్రికిఁ దొల్తపుత్రుఁ డా
నకులుఁడు మత్స్యరాజభవనంటున సాహిణియై చరింపఁడే.

329


చ.

భుజబలశాలి నీతిపరిపూర్ణుఁడు రూపవిలాసవారిజ
ధ్వజుఁడు హరిజ్జయాభిముఖదర్పుఁ డతిప్రియభాషుఁ డాశ్రిత
ద్విజనిధి కార్యదాహనిరతి న్నిజవేషముఁ గప్పిపుచ్చి గో
వ్రజములఁ గాచువాఁడయి విరాటుపురి న్సహదేవుఁ డుండఁడే.

330


ఉ.

కాలము దాఁట నెవ్వ రిల గాల్గలవారలు వారివాశికీ
లాలపరీతభూతవిపులానృపరాజముఖీశిరస్ధల
స్థాలఘురత్నభానునికషాతిసమున్మిపదంఘ్రిపద్మ పాం
చాలతనూజ తొత్తుపని సల్పదె దైవగతి న్సుధేష్ణకున్.

331


వ.

అని చెప్పి బాష్పనిష్పీడితాక్షుండై వాయసాధ్యక్షుండు చిరజీవి నాలోకించి.

332


క.

పరదేశ మఖిలదుఃఖా, కరము మదీయోపదేశగమ్యుఁడవై కా
ర్యరభసము కోర్చి రిపుమం, దిరమున నెబ్భంగి నుండితివి చిరజీవీ.

333


క.

ఘూకములు దెగడ ఘూక, క్ష్మాకాంతుఁడు గౌరవంబు సలుపఁగ బ్రతిప
క్షౌకమున నుంటి విద్దశ, నాకతమున నీకుఁ గలిగెనా చిరజీవీ.

334


సీ.

అని విన్ననయిన వాయసరాజు నీక్షించి యచ్చిరజీవి యిట్లనియె మఱ్ఱి
తరువున నీయాజ్ఞఁ దలమోచి యేనుండుతఱి మదాంధదివాంధతతులు వచ్చి
కెలఁకు లీక్షించి మీపొలకువ లేకున్న తెరలి వచ్చినత్రోవ మరలి చనఁగ
నున్నక న్నెఱిఁగి నే నొకశబ్ద మొనరించి క్రమ్మఱించితిఁ గార్యకరణబుద్ధి


ఆ.

నపుడు వికృతమూర్తినైయున్నన న్నులూ, కములు గాంచి యెఱుఁగుఁ గానఁ దొలుత
నింపుకలిమి సంహరింపక నొంపక, నాదరమున భర్త కప్పగించె.

335


వ.

అప్పుడు ఘూకవల్లభుండు నన్నుం జూచి నీ వెవ్వండవని యడిగిన మేఘవర్ణు
నకు ముఖ్యదండనాథుండ నగు చిరజీవి నని చెప్పితి నప్పలుకులు విని మంత్రుల రా
వించి మంత్రికూటంబున నన్నుం జూపి యితని కుచితం బగుకార్యం బొకరొకరు
చెప్పుం డనిన నందు రక్తాక్షుం డనువాఁ డొక్కరుండు దక్కఁ దక్కినవారందఱు
నాపక్షంబ పలికిరి రాజును వారివాక్యంబు లంగీకరించి నీతిదక్షుం డగు రక్తాక్షుని

దెస నాదరణంబు సేయండయ్యెఁ గాలపక్వంబును నట్టిద.

336


క.

జనియింపం గలకార్యము, మనమున దగ నిశ్చయించి మంత్రి సునీతిన్
వినిపించిన విననొల్లని, చెనఁటికి ముకుబంటిగాదె చేటుంబాటున్.

337


తే.

గగనమంటిన దోషాగ్ని గాఢశాంతి, నీరమున శీతలము సేయ నేర్చుమంత్రి.
చిరహితారంభపరుఁ డైనసేవకుండుఁ, కార్యనిర్వాహకులు సూవె కరటముఖ్యా.

338


క.

తానెంత కార్యపారగుఁ, డైన రహస్యమున మంత్రి నడుగక ధరణీ
జానకి నేకార్యంబుం, బూనందగ దుద్ధత ప్రభుత్వప్రజ్ఞన్.

339


ఉ.

ముప్పదిమూఁడుగోటుల సుమూర్తుల వేల్పుల నేలువజ్రి య
ప్పప్ప యవార్యశౌర్యకరుణాదులకుట్టున నించుకేనియున్
జెప్పనివాఁడె యట్టినయశాలి బృహస్పతిగోపనంబునం
జెప్పిన పంపుసేయక విశృంఖలవృత్తిఁ జరింపనేర్చునే.

340


క.

కావున రక్తాక్షుఁడు నయ, కోవిదుఁ డమ్మంత్రిమాట గురుమంత్రముగా
భావింపలేక కోటఁడు, పావకకీలాళిఁ గాలి భస్మంబయ్యెన్.

341


చ.

అరయఁగ దుష్టమంత్రినివహం బనువారము గల్గియుండ నే
పురుషు ననీతిదోషములు పొందవు రోగము లేయపథ్యబం
ధురుఁ గలఁగింప వేజనునిఁ ద్రుంపదు మృత్యువు లక్ష్మి యెవ్వనిన్
జిరమదగర్వదర్పితునిఁ జేయదు పైకొన వేరి నాపదల్.

342


వ.

లోభికిఁ గీర్తియు ఖలునకు మైత్రియు నష్టశక్రియునకుఁ గులంబును ధనార్జనతత్పరు
నకు ధర్మంబును నలసునకు విద్యయం గృపణునకు సౌఖ్యంబును బ్రమత్తసచివుం
డగు జగతీపతికి రాజ్యంబును లేదు వెండియు నీరసేంధనంబుల వహ్నియు మూర్ఖు
లందు శోకంబును జపలచిత్తులయందు గోపంబును గాంతలందు విత్తంబును
దయావంతులందు ధర్మంబును మహాత్ములయందు ధైర్యంబును వృద్ధిఁబొందు నది
యట్లుండె.

343


క.

వలవగునంతకు బగతుం, దలనిడుకొని తిరుగునీతితత్త్వజ్ఞుఁడు మున్
జిలువయొకం డట్టిదయై, మలుగందినదే యనేకమండూకములన్.

344


క.

అనిన విని మేఘవర్ణుం డనురాగరసాబ్ధి నోలలాడుచు విద్యా
ఖనికా యె ట్లీకథ చెపు, మను డచ్చిరజీవి వాయసాగ్రణి కనియెన్.

345


సీ.

విను పూర్వమున మందవిదుఁ డనుకాలాహి యాహారకాంక్ష నహర్ముఖమున
బఱచి యొండొకచోట బహుభేకకలకలప్రతిభిన్నసకలదిగ్భాగమైన
హ్రదము గన్గొని లోనికరుగ నెద్దిక్కున దెరువు గానక తీరధరణి నిల్చి
కుంభిని ఫణ మూదికొని డిక్లచెడినట్లు పరవశుగతి రుగ్ణుపగిది నుండఁ

తే.

బలికె మండూకపతి యహో ఫణివతంస, ప్రాణములు లోచనంబుల బదిలపఱిచి
యెఱచి యొల్లక యిట్లుండ నేల నేల, చింత లేమిటి నేని భక్షింపరాదె.

346


క.

తల ద్రివ్వక మ్రింగుచు కే, వలము మహాబలునియంతవాని నయోనీ
కలఁతింబడ నేకార్యము, గలిగెనొకో యన్నఁ బన్నగం బిట్లనియెన్.

347


తే.

ఓదయానిధి దైవోపపాదితుండ, నైననా కేల దొరకు నాహార ముఱక
నొరులు వెట్టినదనుక బస్తుండవలయుఁ, దనకు నావుడు మఱియు నద్దర్దురంబు.

348


క.

అనిలాశనవల్లభ చె, ప్ప నహో చిత్రంబు పస్తుపారణ లుండన్
వనరం గారణమున్నను, వినియెద జెపుమనిన మందవిదుఁ డిట్లనియెన్.

349


క.

కేవల మాహారేచ్ఛం, బోవఁగ నొకనాఁటిరేయి భోగం బద్రునం
గావడి ద్రొక్కిన నొకభూ, దేవకుమారకునిఁ గఱిచితిని బడలుపడన్.

350


క.

కాటుపడి భీతిఁ గాయం, బూటాడంబరచి జనకునూరుద్వితయా
స్ఫోటితమస్తకుఁడై శిశు, వేటుపడినకురరివోలె నేడ్చుచునుండెన్.

351


క.

అడలునలముద్దుపట్టిం, జడియకుమని వీపు జఱిచి జనకుం డురమం
దిడికొని మునుగడ పుడమిం, గడునడకున నున్న నన్ను గని కోపమునన్.

352


క.

వసుధామరుఁ డిట్లను వెలి, విసరినతమి నోరి విషపువిత్తా నో రే
పస నాడెఁ గటకటా యి, క్కసుగందుం గుందులేక కరవన్ బంపన్.

353


ఆ.

కుటిలగతికిఁ బుట్టుగ్రుడ్డికి ననుదిన, శ్రుతివిహీనునకును గ్రూరమతికి
బాపజాతి కేల ప్ర్రాపించుఁ బరహితా, చరణవిద్య నిన్ను సైఁపఁదగునె.

354


చ.

కడుదొడుసైన యిద్దురితకర్మము నిన్గొని ముంచుగాక యె
క్కడఁ జననిచ్చుఁ బుట్టపురుగా కొఱగా కెపు డస్వతంత్రతన్
మడుఁగు భజించి భేకముల మస్తమున న్భరియించి కొల్చి యె
ప్పు డవి దయామతిం గడుపు పోయఁగనుండు పొకారిపొమ్మనన్.

355


క.

ధారాళచింత నంతం, గ్రూరత చెడి మిమ్ము మోచికొని తిరుగంగా
నోరాజా వచ్చితి నా, హారము మీ రిడక లేదయా నా కనుచున్.

356


క.

ఆరోహణకౌతూహల, సౌరభ్యము మోసులొత్త జలపాదుఁడు దు
ష్టోరగభాషణములు మా, యారూపము లనక నిజము అని తనలోనన్.

357


క.

తలఁచి యలచిలువ కిట్లను, నెలకొనిననుఁ గొలువ నిలువ నీహృదయమునం
గలిగిన నాహారం బిడి, తేలకుం గ్రొవ్వెక్క నడపెద న్నే ననుడున్.

358


ఉ.

మందవిదుండు కప్ప దనమాయకు లోనయి చిక్కె నంచు నా
నందము నొంది భేకరమణభ్రమణాదులు నాకు లేవు నీ

కందువ చేరి భోగఫలకంబున నీపదము ల్వహించి యం
దుం దుదిముట్టనందనుకఁ ద్రోవక డగ్గఱఁ జేర్చుకొ మ్మిటన్.

359


క.

నను విశ్వసింపు మెప్పటి, కనుమానము మాను చచ్చునంతకు నెందుం
జననని దేవరనగరికి, దనపేరం గమ్మకట్టెదం గొనుమనుచున్.

360


ఆ.

కడుపుఁ జూపి చావగా నింక నెన్నఁడు, నడుపుకొనియె దనుచు చెడుగుఁబురుగు
చెప్పరానిప్రియముఁ జెప్పిన హృదయంబు, గరఁగి భేకరాజు తెరువు చూపి.

361


క.

ఆరోహింపఁగవలె గృ, ష్ణోరగ యీసరియవెంట నొద్దికిఁ జనుదె
మ్మా రయమున ననుటయు ని, ర్వారణనది సొచ్చి కదియ వచ్చెం గప్పన్.

362


క.

అప్పు డనురాగ మొప్పం, గుప్పలు గొని, క్రోతి గొమ్మ గొన్నట్లు వడం
గుప్పించి కప్పఱేఁ డ, ప్పప్ప పణిప్రవరు భోగ మారోహించెన్.

363


క.

జలపాదుని బాదుకొనం, దలనిడికొని త్రాచు నేచునటనం దటభూ
ముల కొంతసేపు ద్రిమ్మరి, యలసినగతి నూరకుండె నట్లుండుటయున్.

364


ఉ.

పన్నగభర్త జూచి జలపాదుఁడు పల్కె నిదేమి వేగసం
పన్నము గాకయున్నయది మందవిదా భవదీయవిగ్రహం
బన్న భుజంగ మిట్లను దయామయ యాఁకట దీలుపడ్డ నా
కున్నదె యానశక్తి కడు పోమినమీఁదటఁ జూడు చిత్రముల్.

365


క.

దొరలు తమవేడుకల జూ, తురు గాని వహించి తిరుగు తురగంబులఁ బ్రో
వరు మేపునీళ్ళతఱి నిడి, యరు దివ్విధ మనిన దర్దురాగ్రణి మదిలోన్.

366


క.

కలతెర గిట్టిద యనుచుఁ, దలఁచి యయో విప్రశాపదశ దనయిచ్చన్
వలసిన యాకహారము గొన, గలుగమి నిచ్చిలువ నొచ్చెగద యకటకటా.

367


క.

భారవహం బిది లే దా, హారము నే నిడక కటికి యాఁకట నిపుడే
కారెడు నిట్లుండిన నా, యారోహణకేళి యేక్రియం గొనసాగున్.

368


చ.

అని తలపోసి మందవిదు నారసి యజ్ఞలపాదుఁ డిట్లనున్
ననుఁ దలఁదాల్చి యాడజవనంబువలెం జఠరానలంబు రాఁ
జినయపుడెల్ల గప్పల విశృంఖలవృత్తి భుజించి లావుగై
కొని విహరింపు భోగికులకుంజరనాదములన్ హ్రదంబునన్.

369


వ.

అని నిరప్పణగాఁ గప్పలఱేఁడు సెలవిచ్చిన బలవంత మగుట నీరంబున ననర్గళ
ప్రచారంబునం బేరెంబులు వాఱుచు నొడిసియొడిసి బడలుపడం గఱిచి కిచుకు
కిచుకురనక కతిపయదినంబులకు జలపాదావశేషంబుగా నిఖిలభేకంబులం భక్షించి.

370


క.

తల నంటి పట్టుకొని చి, ప్పలు విరిగి వడంకుచున్నవాని నహో య
జ్ఞలపాదు విడిచి రోషా, విలమానసుఁ డగుచు మందవిదుఁ డిట్లనియెన్.

371

క.

తగునే భోగశిరోమణి, నగునే నొకవేళ నలఁగి యరుదెంచినఁ బై
నెగురుకొనఁ గొండ యెక్కడ, దగ రెక్కడ వలదె తారతమ్యం బరయన్.

372


క.

నలఁకువ ధర నెవ్వరికిం, గలయదియ మహాబలారిగా యితఁడంచుం
దలఁపక గౌరవమింతయు, సలుపక నను నసదుసేయజనునే నీకున్.

373


క.

అతిమణిఘృణిసంభరణో, చిత మగునాఫణము కష్టశీలా నీకు
త్సితపుటడుగులకు నర్హమె, తతినిక్కనలాఱ మ్రింగెద న్ని న్ననుచున్.

374


క.

వడి నొడిసిపట్టుకొని దెస, పడ నొడలుం దొడలు బడలుపడ నొక్కి ముదం
బడక దిగమ్రింగి వలసిన, కడ కరిగె న్మందవిదుఁడు కాకాధ్యక్షా.

375


వ.

ఏ నమ్మందవిదుచందంబున నవమానంబున కోర్చి ప్రతిపక్షషయం బాపాదించితి
నని చెప్పి చిరజీవి మఱియు మేఘవర్ణున కిట్లనియె.

376


క.

మూలముల జెఱుప ననల, జ్వాలలు తరువులన కాని చందనశైత్య
శ్రీల మగుగాడ్పుచెఱుచు, న్మూలంబులతోన వృక్షముల శీఘ్రమునన్.

377


క.

మనమున ఋణశేషము సా, ధనముల రిపుశేష మౌషధంబునఁ దనుసం
జనితగదశేష ముదకం, బున శిఖిశేషం బశేషముగఁ జేయఁదగున్.

378


చ.

ముడివడియున్నదుర్వ్యసనము న్సడలించి దురంతరోషపుం
గడలి సుశాంతిసేతువునఁ గట్టి సమాసమదేశకాలముల్
కడఁగని చిత్రగుప్తి పొసఁగ న్మనుఱేనికి వేయు నేల యి
ప్పుడమిఁ గరస్థలామలకము ల్గద సంపదలు న్శుభంబులున్.

379


క.

శరములఁ బడరు మనీషా, శరములఁ బడినట్లు రిపులు సమరము వలయున్
శరములకు వలదు ప్రజ్ఞా, శరములకుం గ్రాహ్య మెద్ది సరి యీరెంటన్.

380


క.

అలఁతులకు దైవయత్నము, బలవంతంబైన నెల్లపను లొదగు మహా
బలుల కది లేకయుండినఁ, బలుకులు వేయేల కడమ వడు సర్వంబున్.

381


వ.

సుచరితఫలంబులం గాక సకలకార్యంబులు చేకూడవు త్యాగంబున శూరుండును
వైదుష్యంబునం బ్రియుండును గుణంబుల లుబ్ధుండును నగుచు రాజు రాజ్యంబు
గావింపవలయు నిం దొక్కటి తక్కినం బురుషాకారంబు నిరర్థకం బని విందు మది
యట్టిద.

382


సీ.

ఘనరూపనిధి యనంగునకా యనంగత్వ ముచితమే బలి కహివ్యూహవసతి
పాండునందనునకా బహుకాలవనవాస మిభపురాధిపునకా యేటిచొరవ
యదుకులాధ్యక్షునకా శాపమరణంబు జాహ్నవీసుతునకా శస్త్రశయ్య
నలరాజుకా మహానసపాకభజనంబు నహుషునకా ఘోరనాగమూర్తి

తే.

మఱి త్రిశంకునకా పచ్చిమాలతనము, దృపదనందనకా రాచతొత్తుపాటు
మనుజుఁ డెవ్వఁడు కర్మస్వతంత్రుఁ డరయ, నీశ్వరుఁడు గాక సమకూర్ప నిట్టిపనులు.

383


వ.

ఇది యెఱిఁగి ప్రజ్ఞాన్యాయంబు లేమఱక యుండవలయు దైవబలంబు గలవాఁడ వ
గుట నీకు శీఘ్రకాలంబునఁ గార్యసిద్ధి యయ్యె నిరమిత్రుండవయితి ప్రాప్తమి
త్రుండవయితి వింకఁ బ్రాజ్యవైభవంబున రాజ్యంబు సేయుమని చిరజీవి చెప్పిన
మేఘవర్ణుండు సకలసంపత్పరిపూర్ణుండై రాజ్యభోగంబు లనుభవింపుచుండె.

384


క.

అని చెప్పిన ధరణీవర, తనయులు నిజగురునిఁ జూచి తాత్వికముఖ్యా
వినఁ బ్రియ మయ్యెడు జెపుమా, యనువారఁ జతుర్ధతంత్ర మని యడుగుటయున్.

385


చ.

అతనుభయంకరైకవిషమాంబకసమ్యగనంతభోగసం
గతవిగతాంతరాయగతి గాఢవినాయకనత్తచిత్తజా
దృతిబహుపద్మజాండమణిదీపితకుక్షికరంకమందరీ
కృతికపరతత్త్వవిజ్జటిమృగేంద్రవికస్వరయోగపుష్కరా.

386


క.

రంగత్తరజాతమహా, గాంగేయస్తవనఘటితఘనపులకాయ
త్నాంగనిచోళయమప్రా, గ్రంగస్థలమధ్యసంచరణశైలూషా.

387


మాలిని.

కలుషమశకధూమా క్లాంతచింతామరామా
ప్రళయకరణరోషా ప్రాణిసంగుప్తితోషా
విలసదచలధర్మా విశ్రుతశ్రౌతకర్మా
సులభభజనలోలా సుస్థిరశ్రీవిలాసా.

388


గద్య.

ఇది శ్రీ వేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్య నిత్యకవితావిలాస సకల
సుకవికృతకైవారభాషణోల్లాస రాజకులపారావారపర్వశర్వరీరమణ సీతిశాస్త్రమార్గ
పరిశ్రమణ ధైర్యపర్యాయధిక్కృత నీహారపర్వతపర్వతరాజకుమార నిస్సహాయప్ర
బంధనిర్మాణభోజభూదార సుధామధురభారతీసనాథ వేంకటనాథప్రణీతం బైన
పంచతంత్రంబున సంధివిగ్రహం బన్నది తృతీయాశ్వాసము.

  1. ప్రతిప్రాణేశరహస్యకేళికి నని పాఠాంతరము.
  2. భర్తకుం దెగి యెడద్రెవ్వినం బ్రదుకదే యని పాఠాంతరము.