పంచతంత్రము (దూబగుంట నారాయణ)/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

పంచతంత్రము

పీఠిక

శా.

శ్రీరామాస్తనకుంభకుంకుమరసార్ద్రీభూతవక్షస్స్థలో
దారుం డంజనశైలభర్త కరుణాధామాంతరంగుండు శృం
గారశ్రీనిధిఁ దమ్మరాజు బసవక్ష్మాకాంతుఁ గాంతాజన
స్మేరాలోకనపూర్ణచంద్రు జయలక్ష్మీనాయకున్ జేయుతన్.

1


సీ.

ఆకాశమండలం బరవిరిపూఁదోఁట, సొమ్ముపెట్టె రసాతలమ్ము తనకుఁ
గందర్పుదేహంబు కమ్మగందపుమ్రాను, కట్టువర్గంబులకాపు సురలు
వారువంబులఁ బట్టువారు బ్రహ్మాదులు, శిఖిరవిచంద్రు లక్షిత్రయంబు
పవనాగ్నిరవిశశిపరమాత్మగగనభూ, జలము లంగము లట్టి చారుమూర్తి


గీ.

శంభుఁ డానందరసకళారంభుఁ డగుచు, సమధికైశ్వర్యముల నిచ్చు సంతతంబు
సల్లలితకీర్తిమల్లికావల్లభునకు, బాహుబలునకు బసవభూపాలునకును.

2


చ.

పలుకులబోటి యాత్మసతి భావభవుండు సహోదరుండు గా
నలినదళాక్షునాభినలినంబు నిజంబుగఁ గన్నతల్లి గాఁ
దలఁచినమాత్ర లోకములఁ దాను సృజింపఁగఁ గర్త యైనయ
న్నలువ చతుర్ముఖుండు కృతినాథున కిచ్చుఁ జిరాయురున్నతుల్.

3


ఉ.

ఖండశశాంకశేఖరుఁడు కన్నకుమారుని కగ్రజుండు మా
ర్తండశశాంకవహ్నిముదితప్రభ నొప్పెడిదివ్యమూర్తి యా
ఖండలపద్మజాచ్యుతు లఖండితభక్తి భజించుచుండు వే
దండముఖుం డభీష్టఫలదాయకుఁ డై బసవేంద్రుఁ బ్రోవుతన్.

4


చ.

మెఱసినవేల్పుఱేనితలమీఁదివియన్నది కాంతి మించి యే
డ్తెఱఁ గనుపట్టుపూర్ణశశిదేహవిలాసము నేలఁ జాలి చూ
పఱకు మనోహరంబు లగుభాసురదీప్తుల వర్ణనీయ యై
వఱలెడువాగ్వధూటి బసవక్షితిపాలునిఁ బ్రోచుఁ గావుతన్.

5


చ.

కిసలయహస్త పీనకుచ కిన్నరకంఠి కరీంద్రయాన హే
మసమతనూవిలాస హరిమధ్య మనోభవు కన్నతల్లి యిం
పెసఁగ ముకుందుదేవి కడుప్రేమను సూనుని నేలునట్లుగా
బసవనృపాలుమందిరముఁ బాయక యెప్పుడు నేలుఁ గావుతన్.

6

వ.

అని యిష్టదేవతాప్రార్థనంబుఁ జేసి.

7


ఉ.

కొండయమంత్రియెఱ్ఱయకుఁ గూరిమినందనుఁ డైనమద్గురున్
ఖండశశాంకశేఖరుఁ ద్రికాలముఁ బూజ యొనర్చునాగనా
ర్యుం డనుపేరు గల్గినసరోజభవాన్వయవార్ధికైరవా
ప్తుం డగుపుణ్యమూర్తి సులభుం డగుటం గొనియాడి వేడుకన్.

8


సీ.

వల్మీకభవునకు వందనం బొనరించి, సత్యవతీసూను సంస్తుతించి
బాణుని నుతియించి భవభూతిఁ గొనియాడి, భారవిఁ బొగడి మయూరుఁ దలఁచి
శివభద్రుఁ గొనియాడి శ్రీహర్షుఁ బ్రార్థించి, కాళిదాసుఁ బ్రసన్నుఁగాఁ దలంచి
నన్నయభట్టారకునకు మ్రొక్కి తిక్కన, సోమయాజుల నతిస్తుతులఁ గొలిచి


గీ.

శంభుదాసుని మదిలోన సంస్మరించి, మఱియు సుకవుల సత్కృపామహిమ వడసి
శారదాసత్ప్రతాపవిశారదుండ, నగుటఁ గృతిఁ జెప్పుతలఁపు నా కమరి యుండ.

9


ఉ.

చెప్పిన నాకవిత్వము రుచింపనిఠావులు చూచి చెప్పుఁడీ
తప్పులు లేనిచో నవుఁ గదా యని తీర్పుఁడు మాటిమాటికిన్
జెప్పకుఁ డొప్పుఁ ద ప్పనుచుఁ జెప్పఁగ నేర్చినవాని కొక్కచోఁ
దప్పులు లేక మాన వని తద్ జ్ఞు లెఱుంగుఁడు మీకు మ్రొక్కెదన్.

10


వ.

అని మద్గురుకరుణాస్మరణంబును బురాతన సత్కవిసమారాధనంబునుం జేసి యొక్క
మహాప్రబంధంబుఁ జెప్ప నుద్యోగించుసమయంబున.

11


సీ.

మండలాధిపమూర్ధమకుటమాణిక్యసం, భావితాంచితపాదపంకజుండు
కల్పితహేమాద్రికల్పమహాదాన, ధారుణీదేవసంతర్పకుండు
పరిచరసహవాసభామామనఃప్రియ, భాసురుకుసుమశరాసనుండు
మానితాంగకసర్వమంగళాలంకృత, శేఖరీకృతరాజశేఖరుండు


గీ.

వల్లభూపాలతమ్మభూవల్లభేంద్ర, శుక్తిముక్తాఫలం బనఁ జూడ నమరి
నూన్యసామంతవిద్వదమాత్యనృపతు, లోలిఁ గొలువంగ బసవేంద్రుఁ డొక్కనాఁడు.

12


వ.

విద్వత్సంభాషణసమయంబున.

13


చ.

హరిహరభక్తు నార్యనుతు నంధ్రకవిత్వవిశారదు న్మహీ
శ్వరవరమాననీయుఁ గులవర్ధను శాంతుఁ బ్రబంధవాచకా
భరణము నాగమాంబకును బ్రహ్మయమంత్రికి నాత్మసంభవున్
సరసుని దూబగుంటిపురశాసను నారయనామధేయునిన్.

14


క.

తలపించి హితులు చెప్పఁగఁ, బిలిపించి కవిత్వగోష్ఠిఁ బ్రియ మెసఁగంగాఁ
బలుకుచు నితాంతభక్తిం, దలుకొత్తఁగ నంకురించు దరహాసముతోన్.

15

క.

తనముఖచంద్రమరీచులు, జననయనచకోరములకు సాంద్రానందం
బొనరింప వేడ్క నన్నుం, గనుఁగొని యి ట్లనియె వినయగౌరవ మెసఁగన్.

16


చ.

సురుచిర మైననీకవిత సూరిసభాంతరయోగ్యతామనో
హరసరసార్థగుంభనల నందము గావున నారనార్య సు
స్థిరగతిఁ గీర్తిన న్నొనరఁ జేసి సమస్తజగత్ప్రసిద్ధ మై
పరఁగుచు నుండ మా కొకప్రబంధ మొనర్పు ప్రియం బెలర్పఁగన్.

17


వ.

తత్ప్రబంధం బెయ్యది యంటేని.

18


గీ.

పంచతంత్ర మనఁగ సంచిత గీర్వాణ, భాష మున్ను చెప్పఁబడినయట్టి
కావ్య మంధ్రభాషఁ గర్ణామృతంబుగాఁ, గూర్పవలయు నీదునేర్పు మెఱయ.

19


వ.

అని వినయంబునం దాంబూలనవాంబరాభరణంబు లొసంగి వీడుకొల్పినం
బ్రియం బంది మదాత్మగతంబున.

20


చ.

పస గలనీతిశాస్త్ర మని ప్రాజ్ఞులు మెచ్చిన పంచతంత్రికిన్
వసుమతిఁ దమ్మరాజు బసవక్షితినాథుఁడు నాథుఁ డౌటకుం
బొసఁగి యశోవిలాసినికిఁ బుట్టినయి ల్లని సన్నుతింపఁ బెం
పెసఁగె సముద్రముద్రితమహీస్థలిరాజసభాంతరఁబులన్.

21


వ.

కావున నేతత్కృతి కధీశ్వరుం డైన బసవక్షితీశ్వరువంశం బభివర్ణించెద.

22


చ.

రవికులజేశుఁ డైనరఘురామునినందనుఁ డై కుశావనీ
ధవుఁ డుదయించె నాయనకు ధర్మవిధం బ్రభవించె శ్రీసదా
శివమహిమాఢ్యుఁ డై విజయసేనకుమారకుఁ డొప్ప నుర్వరన్
సవినయమూర్తి యవ్విభునిసంతతి నంతఁ గ్రమక్రమంబునన్.

23


చ.

మును బెజవాడదుర్గఁ దనముగ్ధుతనంబున మెచ్చఁ జేసి పెం
పున రథదంతివాజిభటభూరిబలంబులచేఁ గళింగభూ
జనపతిఁ ద్రుంచి చేవఁ దనసంతతికై మహిఁ బాడి నిల్పి క్ర
మ్మనఁ జిరకీర్తులం గనియె మాధవవర్మ తదన్వయంబునన్.

24


మ.

ఉదయించెన్ గమలాప్తవంశకరుఁ డై యుద్యత్ప్రతాపోన్నతిన్
జదియించేన్ సకలార్థిదైన్యముల రాజత్కల్పభూజాత మై
కదియించెన్ నిజకీర్తిరాశి దిశలన్ కల్పాంతరస్థాయిగాఁ
గుదియించెన్ బ్రతివీరబాహుబలమున్ గొమ్మావనీశుం డిలన్.

25


క.

ఆకొమ్మక్షితిపాల, శ్రీకాంతున కుదయ మయ్యెఁ జిరతరపుణ్య
శ్లోకుం డన్నలదేవమ, హీకాంతుం డతులధైర్యహేమాచలుఁ డై.

26

చ.

అతనికి నుద్భవించె నభియాతిమహాంబుధికుంభసంభవ
ప్రతిముఁడు సింగభూవిభుఁ డభంగపరాక్రమశాలి శౌర్యవ
ర్ధితుఁడు వివేకశీలుఁ డతిధీరుఁడు నిర్మలకీర్తికామినీ
రతుఁడు సమగ్రదానగుణరమ్యుఁడు సౌమ్యుఁడు బుద్ది నెంతయున్.

27


ఉ.

బల్లిదుఁ డైనసింగనరపాలున కుద్భవ మైరి ధాత్రి శ్రీ
వల్లభమూర్తు లైన పెదవల్లభుఁడున్ బినవల్లభేంద్రుఁడున్
సల్లలితప్రతాపబలసాహసనీతివివేకసంపదన్
దొల్లిటి రామలక్ష్మణులదోయి యనంగ మహానుభావు లై.

28


వ.

అం దగ్రజుండు.

29


చ.

తిరుగనిమందరాద్రి కళ దీయనిపూర్ణశశాంకుఁ డాజులన్
సురుగనిపార్థుఁ డీశుకను సోఁకనిమన్మథుఁ డొక్కబొంకునుం
బొరయనిధర్మసూతి యుడి వోవనికల్పమహీరుహం బనన్
వరగణధాముఁ డైన పెదవల్లభభూవరుఁ డొప్పు నెంతయున్.

30


క.

అన్నరపతిపుణ్యాంగన, యన్నలదేవమ్మ గెలుచు నన్నలుదేవిన్
సన్నుతగుణసౌందర్యస, మున్నతవిభవముల నన్న నునిదలు సరియే.

31


వ.

ఆదంపతులపురాకృతపుణ్యవిశేషంబున.

32


క.

సుతు లుదయించిరి సింగ, క్షితిపతియును దమ్మవిభుఁడు శ్రీతిరుమలభూ
పతియుఁ గలికాలమున నొక, సతికిని రామత్రయంబు జనియించెనొ నాన్.

33


వ.

అమ్మహీశ్వరులలోఁ దమ్మక్షితీశ్వరుండు.

34


సీ.

త్రిభువనాలంకారదీపిరతధావళ్య, వరకీర్తిమల్లికావల్లభుండు
నిజభుజాసికుఠారనిర్భిన్నదుర్వార, పరనృపాలకమన్యభార్గవుండు
కింకిణీఘంటికాంకితసింధుఘోటక, బహుసైన్యరణరంగభైరవుండు
బంధుసంరక్షణప్రకటమహాభాగ్య, బంధురసహకారబాంధవుండు


గీ.

నతమహీపాలమస్తకన్యస్తమృదువి, రాజమానపదాబ్జుండు రాజవరుఁడు
రాజమాత్రుండె విభవవిభ్రాజితుండు, వల్లభూపాలతమ్మభూవల్లభుండు.

35


మ.

మనుమార్గుం డగుతమ్మభూపతికి వేమాజాంబకున్ బుత్త్రుఁ డై
జనియించెన్ బసవేంద్రుఁ డర్థిజనభాస్వత్కల్పభూజాత మై
వనితామన్మథుఁ డై వివేకనిధి యై వారాశిగంభీరుఁ డై
యనతారాతిమహాంధకారపటలీహంసప్రతాపాఢ్యుఁ డై.

36


వ.

మఱియు నేవంవిధగుణగణాలంకృతుం డైనబసవభూపాలుండు.

37

సీ.

రమణీయదానధారాప్రవాహంబులు, పాథోధి కతివిజృంభణము గాఁగ
నిరుపమానప్రభావనిర్మలసీతకీర్తి, త్రిభువనసాంద్రచంద్రికలు గాఁగ
నతులవిక్రమబలోద్యత్ప్రతాపస్ఫూర్తి, పరులకు నుగ్రాతపంబు గాఁగ
సమధికశృంగారసౌందర్యరేఖ, దాఁ దరుణీలతావసంతంబు గాఁగ


గీ.

రామరఘురంతిసగరధర్మజదిలీప, భోజసర్వజ్ఞసోమేశరాజసరణి
ధాత్రిఁ బాలించెఁ దమ్మభూధవసుతుండు, శాశ్వతంబుగ బసవభూమిశ్వరుండు.

38


సీ.

నరులకుఁ జే చాఁచినను ఫలం బందని, దివిజభూరుహమువితీర్ణి యెంత
యవయవశృంగార మంగనామణులకుఁ, జూపనికందర్పురూప మెంత
కనుఁగొన నొకవేళ ఘనతిరోహితుఁ డైన, తపనునిమహితప్రతాప మెంత
యురుశ క్తిఁ జని మహావ్యూహంబు వెడలంగఁ, జాలని సౌభద్రుశౌర్య మెంత


గీ.

వితరణంబున శృంగారవిలసనమున, దీపితాటోపసహజప్రతాపమహిమ
శౌర్యగుణమున నెవ్వారు సాటి వత్తు, రితని కన మీఱి బసవభూమీశ్వరుండు.

39


సీ.

కుసుమకోదండంబు గుఱుతు చూడము గాని, దర్పితరూపకందర్పుఁ డనియు
నిజమూర్తిలోపల నెర సెఱుంగము గాని, సత్కళాసంపూర్ణచంద్రుఁ డనియు
నుష్ణాంశుజాలంబు లొదవఁ గానము గాని, యతులితసత్ప్రతాపార్కుఁ డనియుఁ
బొసఁగ వేగన్నులపొడవు మించదు గాని, సాంద్రవైభవనిర్జరేంద్రుఁ డనియు


గీ.

ననుదినంబును దనుఁ జూచునఖిలజనులు, సమధికానందమగ్ను లై సన్నుతింప
సురుచిరాకారకాంతితేజోవిభవము, లమరుఁ దమ్మయబసవధరాధిపునకు.

40


క.

అసమానమానధనునకు, రసికశిఖామణికి దానరాధేయునకున్
బ్రసవాంబకసమరూపున, కొసబిరుదరగండనికి మహోర్వీశునకున్.

41


క.

వేమాజాంబాసుతునకు, భామాకంతునకు మన్యభార్గవునకు సం
గ్రామక్షోణీవిజయ, శ్రీమహనీయునకు రాజసింహంబునకున్.

42


క.

రణరంగభైరవునకున్, బ్రణమితరాజన్యహృదయపద్మార్కునకున్
మణికనకవస్తువాహన, గణికాద్యఖిలప్రదానఖచరేంద్రునకున్.

43


క.

సహకారబాంధవునకున్, సహజాలంకారదేహసౌందర్యునకున్
మహనీయకీర్తివాచా, మహితాత్మునకున్ బ్రతాపమార్తాండునకున్.

44


క.

తెల్లదలాటాంకునకున్, సల్లలితకృపాకటాక్షసౌజన్యునకున్
ఫుల్లారనిందనేత్రున, కుల్లసితపరాక్రమునకు నూర్జితమతికిన్.

45


క.

కిమ్మిరాంతకబలునకు, ధమ్మిల్లనవప్రసూనధరునకుఁ దరుణీ
సమ్మోహపంచశరునకుఁ, దమ్మయబసవనికి నుభయదళమిండనకిన్.

46

మిత్త్రభేదము.


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా చెప్పం బూనిన పంచతంత్రి యనుమహాప్రబంధం
బునందుం గలకథలకు నలంకారంబుగా వర్ణింపం దగిన పాటలీపురం బెట్టి దనిన.

47


సీ.

వేదశాస్త్రపురాణవిద్యావిజృంభిత, కలితధాత్రీసురకలకలంబు
గజహయారోహణకాశలసంచార, మహితరాజకుమారమండలంబు
వజ్రముక్తాఫలవస్త్రసువర్ణాది, సకలవిక్రయవైశ్యసంకులంబు
నానాయుధాభ్యాసనైపుణధారేయ, విశ్రుతసచ్ఛూద్రవిభ్రమంబు


గీ.

కల్పితానల్పదేవతాగారభూమి, రత్నకీలితఘనసౌధరాజితంబు
నగుచు నమరేంద్రునగరంబు నగుచు ధాత్రిఁ, బొలుచుఁ బాటలీపుత్ర మన్పురవరంబు.

48


ఉ.

ఆపుర మేలుచుండు నమరాధిపతిప్రతిమానవైభవో
ద్దీపితుఁ డార్యసమ్మతుఁడు ధీరుఁ డుదారుఁడు బాహువిక్రమా
టోపవిజృంభితుం డనఁ గడున్ బొగ డొంది సుదర్శనుండు నా
భూపకులావతంసము ప్రభుత్వముఁ బేరును బెంపు నొప్పఁగన్.

49


క.

ఆరాజు తనకుమారులు, ధారుణిఁ జాలించు నేర్పు దగిలెడు చదువున్
నేరక యునికి మనోవ్యథఁ, గూరి నిజాత్మం దలంచెఁ గొలు వున్నయెడన్.

50


గీ.

ఎఱుకయును ధార్మికత్వము నింత లేని, కొడుకు పుట్టిన నేటికిఁ గొఱ తలంపఁ
జూఁడిపాఁడివిధంబులు చూపలేని, గొడ్డుటా వైన వలవనిజడ్డు గాదె.

51


క.

పెక్కండ్రుసుతులు గల రని, లెక్కించిన ఫలము గలదె లేశంబును బెం
పెక్కినకులదీపకుఁ డగు, నొక్కఁడె తనయుండు సాలు నుర్వరమీఁదన్.

52


వ.

అని మఱియుఁ దనమనంబున.

53


సీ.

కలకంఠిగర్భంబు క్రాఁగిపోయిన మేలు, పుట్టినప్పుడ మృతిఁ బొంద మేలు
తగ ఋతుకాలంబు దప్పిపోయిన మేలు, కన్య యైనను నంతకంటె మేలు
కాంతుఁడు పరదేశగమనుఁ డైనను మేలు, మగువ గొడ్రా లైన మఱియు మేలు
పల్లవాధర పతి నొల్లకుండిన మేలు, పదఁతుక తెగులుచేఁ బడిన మేలు


గీ.

గాక శాస్త్రపరిజ్ఞానమనులు గాని, సుతులు గల్గినఁ దండ్రికి సొంపు గలదె
రూపబలవిక్రమాద్భుతాటోపు లైన, నధికధనవంతు లైన నయ్యధము లేల.

54


చ.

జనకునిపూర్వపుణ్యఫలసంపదఁ దత్తనయుం డుదారుఁడున్
మనునిభమూర్తియున్ బితృకమాతృహితుండును నౌను బాపక
ర్మునకు జనించినట్టి యధముండు కులాంబుధిమంథనంబునన్
జనితహలాహలం బనఁగఁ జాలి హరించుఁ గులంబు వ్రేల్మిడిన్.

55

సీ.

కమనీయవిద్య దాఁ గామధేనువుభంగిఁ, గామితార్థంబులు గలుగఁజేయు
సజ్జనవిద్వాంససంఘంబులోపల, మానుగాఁ దనుఁ బెద్దమాన్యుఁ జేయు
నెన్నిదేశంబుల కేఁగిన సాయమై, తల్లిచందంబునఁ దన్నుఁ బ్రోచుఁ
బన్నుగాఁ దనపుణ్యపాపంబు లెఱిఁగించు, సాధించు నిహపరసాధనంబు


గీ.

నగ్నిఁ గాలదు రాజుల కలవి గాదు, నీళ్ల నానదు చోరులపాలు గాదు
సోదరులచేత నెప్డుఁ బంచుకొన రాక, చెలఁగు విద్యాధనమునకుఁ జేటు లేదు.

56


వ.

కావున.


గీ.

సంతతోన్మార్గవర్తన సరవిఁ దిరుగు, సుతులఁ జదివించి సద్బుద్ధిహితులఁ జేసి
వెసను నీరీతి సంపద నొసగఁజాలు, నట్టిపుణ్యుండు గలఁడొకో యరసి చూడ.

57


ఉత్సాహ.

అని సుదర్శనుండు పల్కునట్టి యవసరంబునం
దనిమిషేంద్రగురుఁడపోలె నఖిలనీతిశాస్త్రసం
జనితబుద్ధియుతుఁడు విష్ణుశర్మనామధేయుఁ డి
ట్లనియెఁ దాఁ బ్రతిజ్ఞ గాఁగ నవనివిభునితోడుతన్.

58


గీ.

అఖిలనీతిశాస్త్రంబులు నాఱునెలల, నీకుమారులఁ జదివింప లేక యున్న
సుతులపని యేమి నన్ను నాశ్రితులలోన, నడప కాప్రొద్దె గ్రామంబు వెడల నడఁపు.

59


సీ.

అని విష్ణుశర్మ వల్కినప్రతిజ్ఞావచ, నంబుల కతఁడు ముదంబు నొంది
యనుపమభూషాంబరాదులఁ దనిపి సం, భావించి సుతుల నప్పనము సేయ
సరవిఁ దొల్లిటినీతిశాస్త్రంబు లన్నియు, సంక్షేపరూపవిస్పష్టముగను
దంత్రంబు లైదింటి ధరఁ బ్రసిద్ధము గాఁగ, నేర్పడఁగాఁ జేసె నెవ్వి యనిన


గీ.

మిత్రభేద మనఁగ మెఱయ సుహృల్లాభ, మనఁగ సంధివిగ్రహం బనంగ
లబ్ధనాశ మనఁగఁ లలి నసంప్రేక్ష్యకా, రిత్వ మనఁగఁ బరఁగురీతి మెఱయ.

60


చ.

అమరినయట్టితంత్రముల నైదిటియందును సర్వనీతిశా
స్త్రముల సుభాషితంబులను సారకథాబహుళంబు భూవరో
త్తమతనయానుభోధమును ధారుణి లోకహితంబుగాఁ గ్రమ
క్రమమునఁ గావ్యరూప మెసకంబుగఁ జేసెను వానిలోపలన్.

61


వ.

ప్రథమతంత్రం బగుమిత్రభేదం బెట్టి దనిన.

62


క.

మృగపతియును వృషభంబును, మిగులఁగ సఖ్యంబు చేసి మెలఁగఁగ వనిలో
మృగధూర్తం బారెంటికి, విగతస్నేహంబు చేసి విఱియఁగఁ జేసెన్.

63


గీ.

అనిన నృపకుమారు లాకథ మా కెఱిం, గింపుఁ డనుచుఁ బలుక నింపు మిగుల
సావధానబుద్ధి సకలంబు వినుఁ డని, చెలఁగి విష్ణుశర్మ సెప్పఁ దొడఁగె.

64

గీ.

కలదు దక్షిణాపథమునఁ గనకరత్న, రాజితం బయి మహిళాపురం బనఁగ
వర్ధమానుం డనఁగ సార్ధవాహుఁ డందు, నధికసంపత్సమృద్ధిచే నతిశయిల్లు.

65


వ.

ఇట్లున్న సార్ధవాహుఁ డొక్కనాఁడు తనధనంబు వృద్ధి నొందించుటకుఁ దలంపు
పుట్టి యి ట్లనియె.

66


గీ.

అరసి లేనిచోట నర్ధ మార్జింపంగఁ దగినయది సురక్షితంబు గాఁగఁ
జేసి వృద్ధిఁ బొందఁజేయుతెఱంగున, నట్టిధనము సద్వ్యయంబు సేయ.

67


క.

నేరవలె నివ్విధంబున, నేరుపు లేకున్న వానినిలయమున ధనం
బేరీతి నిలువ దది ని, ష్కారణ మయి విఱియఁ బాఱఁ గానరు మూఢుల్.

68


వ.

అవ్విధం బెట్టి దనిన.

69


సీ.

సంరక్ష సేయనిస్వర్ణ మప్పుడె చెడు, వృద్ధిఁ బొందింపనివిత్త మెడయు
ననుభవతకు రానియర్థంబు గల్గియు, లేనిఫలమె కాని లేదు సుఖము
తగ నుపార్జించియు ధనము పాత్ర మెఱింగి, దక్షత నిడిన సంరక్ష యదియ
నిండినసరసికి నెరయ వాటము గాఁగ, నలువులు దీర్చినయట్ల కాన


గీ.

ధనము లార్జించి సంరక్ష తగ నొనర్చి, వృద్ధిఁ బొందించి యనువుగా వెచ్చపఱిచి
నడవ నేర్చినవానిజన్మంబు సఫల, మున్నవారలజీవన మెన్న నేల.

70


వ.

అని వర్ధమానుఁడు వెండియుఁ దనమనంబున నిట్లు తలంచె.

71


చ.

తమయుదకంబు వాహినులు ద్రావనిభంగి ఫలించినట్టివృ
క్షములు ఫలంబులం దిననిచందమునన్ జలదంబు నీట స
స్యములకుఁ దృప్తిఁ జేసి యవి సమ్మతిఁ గోరకయున్నమాడ్కి ను
త్తములధనంబు సజ్జనులఁ దార్కొను బ్రత్యుపకారనిస్పృహన్.

72


సీ.

అని వర్ధమానుండు తనమదిఁ జింతించి, శకటంబునను బెక్కు సరకు లెత్తి
యందు సంజీవకనందకాఖ్యము లగు, వృషభయుగ్మముఁ గట్టి విపినభూమి
త్రోవ రాజ్యమునకుఁ బోవఁగాఁ దెరువున, నిమ్నోన్నతంబుల నీల్గి తివియ
జానుభగ్నం బైన సంజీవకుని, గనుఁగొని వర్ధమానుఁ డాకులత నొంది


గీ.

పరిజనుల నాతఁ డం దున్నసరకు లెల్ల, మోవఁ గట్టడ చేసి సంజీవకునకుఁ
గాపు కొందఱఁ బెట్టి యక్కడఁ దొలంగి, చింత నొందుచుఁ బోవ ననంతరంబ.

73


ఉ.

కావలి యున్న యాభటనికాయము నుగ్రవనంబులోపలన్
జావఁగ నేల పోద మని చయ్యన నేఁగి నిజేశ్వరుం గళా
కోవిదుఁ గాంచి యొక్కహరి కూడఁగ ముట్టిన నేము పాఱ సం
జీవకుఁ బట్టి చంపె నది చెప్పఁగ సిగ్గగుచున్న దెంతయున్.

74

క.

అని యివ్విధమున వారలు, వినయం బెసఁగంగ వచ్చి వినిపింప నిజం
బని సంజీవకుఁ దలఁచుచు, మనికితపడుచుండె వర్థమానుఁడు బుద్ధిన్.

75


వ.

అట సంజీవకుండు.

76


చ.

విఱిగినకాలు వచ్చి యటవీస్థలి నాయువుకల్మిఁ జేసి యే
డ్తెఱఁ జని పూరి మేసి కడుఁ దియ్యనిచల్లనినీరు ద్రాగి మై
యెఱుఁగక సత్వసంపద వహించి భయం బొకయింత లేక య
క్కఱ నొకనాఁడు డప్పి యెసఁగ న్నదికిన్ వడి నేఁగుచున్నెడన్.

77


గీ.

ఆవనంబునఁ బింగళకాఖ్యుఁ డయిన, సింహ మధికజంతువుల శాసింప నధికుఁ
డగుచు నిజభుజవిక్రమణాఢ్యమహిమ, ననుభవించుచు రాజ్యంబు నట్ల కాఁగ.

78


క.

అభిషేకాదిక్రియలను, విభవము లేకయును ఘోరవిపినంబులలో
శుభగోన్నతవిక్రమమునఁ, బ్రభు వై సింహము మృగాధిపతియై వెలసెన్.

79


వ.

ఇట్లు సకలవనజంతునియామకుం డై పింగళాఖ్యుఁ డగుహర్యక్షముఖ్యుండు వనంబున
వెలుంగుచుండె.

80


శా.

ఆసింహం బొకనాఁడు డప్పి గొని తోయం బానఁ గాంక్షించి పే
రాసం దా యమునాతరంగిణిని డాయం బోవుచో నవ్వలన్
భూసంత్రాసకరాంత్యకాలజలదప్రోద్భూతగర్జోపమ
వ్యాసంగంబుగ ఱంకె వైచె నొకచో నాఁబోతు కా ల్ద్రవ్వుచున్.

81


క.

బెడిదంబుగ నవ్విధమున, నడరిన సంజీవకునిమహాధ్వని విని య
ప్పుడ మృగపతి తనయాత్మం, గడు శంకం బొంది యచటఁ గదలక యున్నన్.

82


గీ.

అతనిమంత్రితనయు లైనట్టికరటక, దమనకాఖ్యు లపుడు తద్విధంబుఁ
దెలిసి దమనకుండు తెఱఁ గొప్పఁ గరటకు, తోడఁ బలికె నగవు తోఁప నపుడు.

83


గీ.

ఇంతరాజు చూడు వింతశబ్దము విని, నదికి నీరు ద్రావఁ గదల వెఱచె
దీనికారణంబుఁ దెలియుదమే యన్నఁ, గరటకుండు వలికెఁ గడఁకతోడ.

84


క.

మన కేమికారణం బీ, పనులు విచారింపఁ దగనిపనికిం జనినన్
మనుజుండు నొచ్చు ము న్నొక, వనచర మొకతగనిపనినెపంబున నీల్గెన్.

85


వ.

అనిన విని దమనకుం డవ్విధం బెట్లనినఁ గరటకుం డిట్లనియె.

86


చ.

ఒకనగరంబుచేరువ మహోన్నతదేవగృహంబు జీర్ణ మై
వికలత నంది యర్ధము భువిం బడి యుండఁగ దానిఁ జూచి యు
త్సుకమతి నొక్కవైశ్యుఁ డది తొల్లిటియందము నొందునట్లుగా
నకుటిలవృత్తిఁ జేయుఁ డని యర్థ మొసంగిన శిల్పకారులున్.

87

క.

ఇయ్యకొని నగరు గట్టుచు, నయ్యెడ నొకచేవదూల మది పలకలుగా
వ్రయ్యుటకు నాడనాడను, జయ్యనఁ గీలములు గాఁడఁ జఱిచినపిదపన్.

88


గీ.

ప్రొద్దు చేరఁబడినఁ బోయి రిండ్లకు వార, లాసమీపతరుల నాశ్రయించి
తిరుగుమర్కటములు దేవాలయంబున, కవల నివల మెలఁగునట్టియెడను.

89


సీ.

గుడియొక్క తరులపైఁ గుప్పించునవియును, దరువులపైనుండి దాఁటునవియు
నురుతరశాఖల నూఁగాడునవియును, బ్రాకారములు ప్రాఁకి పాఱునవియు
గోపురంబులమీఁదఁ గూర్చుండునవియును, గోళ్ళఁ బ్రక్కలు వీఁపు గోఁకునవియు
నిక్కుచు బొమ లెత్తి వెక్కిరించెడునవి, యొండొంటితోఁ బోరి యోడునవియు


గీ.

నిట్లు వానరయూధంబు లిట్టు నట్టు, సహజ మగుచాపలంబున సంభ్రమింప
వానిలోపల నొకవృద్ధవానరంబు, దూరముగఁ బాఱి తా విధిప్రేరణమున.

90


క.

కీలాకీర్ణస్తంభము, లోలతమై నెక్కి నెఱియలో నండంబుల్
వ్రేలంగ రెండుకరముల, సీలం బెకలించి లావుచేఁ దిగియంగన్.

91


క.

బిగు వెడలి సీల యూడిన, నగచరు బీజంబు లిఱుక నానొప్పిఁ గడున్
వెగ డొంది మొఱలు వెట్టుచుఁ, దెగియెన్ మర్కటము దానిత్రిమ్మట వింటే.

92


వ.

కావునఁ దమకుం గారణంబు లేనిపనికిం జొచ్చినమానవుల తెఱం గిప్పుడు చెప్పిన
మర్కటవ్యాపారంబుచందంబు మన కిది విచారింప నేమిపని మనయేలిక భక్షింపఁగా
మిగిలిన మాంసం బున్నయది భక్షింతము రమ్మనిన విని దమనకుండు రాజులం
గొలిచి తనకడుపుఁ బ్రోచుకొనుమాత్రం బైనఁ గొలువ నేల విను మని యి ట్లనియె.

93


క.

మిత్రుల కుపకారంబును, శత్రుల కపకారమును నిజంబుగఁ జేయన్
క్షత్రియులఁ గొలుచుట యుదర, మాత్రముకొఱ కైన సేవ మహీఁ గొఱ యగునే.

94


క.

ఒక్కరునిఁబ్రతుకువలనన్, బెక్కండ్రు మహాసమృద్ధిఁ బెరుఁగక యున్నన్
ముక్కునఁ బొడుచుక తినియెడి, కొక్కెర తనకడుపుఁ బ్రోచుకొనదే తలఁపన్.

95


సీ.

స్వల్పవసాస్నాయుసంయుతకఠినాస్థిఁ గొఱుకు నాఁకలి మానుకొఱకుఁ గుక్క
సింహంబు తనయంకసీమ జంబుక మున్న, దృష్టించి మఱి దానితెరువు వోక
శుంభదుజ్జృంభితకుంభికుంభంబుల, మెదడు భక్షింపంగ మదిఁ దలంచు
హీనులు నధికులు నైనమానవులును, దమతమకొలఁది సత్వములఁ దలఁతు


గీ.

రఖిలకర్మంబులను గాన నాత్మశక్తి, కనుగుణం బైనఫలములె యావహిల్లు
నట్లు నీవును జాతిమర్యాదతోడి, తలఁపుఁ దలఁచితి విది దొడ్డతనము గాదు.

96


వ.

అదియునుం గాక.

97

సీ.

వాలంబు నులిచియు నేలఁ గా ళ్ళడఁచియు, ధాత్రిపైఁ బొరలియుఁ దాల్మి విడిచి
వదనంబుఁ దెఱచియు నుదరంబుఁ జూపియుఁ, బెక్కుపాట్లను బడ్డ కుక్క కొక్క
కడియెఁ డన్నమె కాని కడుపార నిడఁబోరు, నాగంబునకుఁ బ్రార్థనంబుతోడఁ
గబళశతంబులు కరమున కందియ్య, నాఁకలి దీఱంగఁ నది భుజించు


గీ.

నెంతకార్పణ్యపడినను హీనజాతి, కెవ్వరును నీరు కడు నల్ప మిచ్చిరేని
ఘనున కూరక యుండంగఁ గాంక్ష దీఱ, గురుతరార్థంబు లిత్తురు ధరణిపతులు.

98


క.

ఘనవిద్యావిక్రమములు, మనుజేంద్రులు సూచి మెచ్చ మఱి బ్రతికినఁ గా
కనయంబుఁ దోఁక నులిచిన, శునకమునకుఁ గడెడుకూడ సూడక యిడరే.

99


గీ.

పౌరుషజ్ఞానకీర్తులఁ బరఁగెనేని, వానిసంపద యొకపూఁట యైనఁ జాలు
నుదరపోషణమాత్రకై యుర్విమీఁదఁ, గాకి చిరకాల మున్న నేకార్య మగును.

100


గీ.

అల్పజలముల మొరపవా గడరి పాఱు, నల్పధాన్య మొదవు మూషకాంజలికిని
స్వల్పఫల మబ్బె నేనియు స్వల్ప మనక, యల్పుఁ డానందమును బొందు నల్పలీల.


క.

సరవి హితాహితగుణముల, వెర వెఱుఁగక చవికిఁ జదువు వింతగ నాత్మో
దరభరణకేవలేచ్ఛం, బరఁగెడునరపశువు పశువుప్రతి యన వినవే.

101


వ.

అనినఁ గరటకుం డిట్లనియె.

102


క.

మనము ప్రధానులమే యే, పనులకుఁ గర్తలము గాము బహునీతులకుం
బని యేమి యనిన నతనికి, విను మని దమనకుఁడు వల్కె వివరం బెసఁగన్.

103


గీ.

భాగ్యవశమున బుద్ధిసంపన్నుఁ డగును, బుద్ధిబలమున నృపులకుఁ బూజ్యుఁ డగును
నృపులు మన్నింప నయకళానిపుణుఁ డగుచుఁ, బూని రాజ్యంబు నడుపుప్రధానుఁ డగును.

104


వ.

కావునఁ బ్రధానపదవికిం బ్రాప్తంబు గలిగినం గలుగుఁ గాక దాన నేమిచోద్యంబు
విను మని యిట్లనియె.

105


చ.

నడవడి మంచి దైనను జనంబులు పెద్దఁగఁ జూతు రాతనిన్
నడివడి చక్కఁగానినరు నచ్చిన చుట్టము లైనఁ జేరనీ
కెడ గలుగంగఁ దోలుదు రహీనతయున్ లఘువృత్తియు న్మహిన్
నడివడిచేత వచ్చుటది నైజము దీని నెఱుంగ వింతయున్.

106


చ.

ఒడికముతోఁ బ్రయత్నమున నొక్కమహాశిలఁ గొండమీఁదికిన్
గడపఁగ భార మచ్చటిది గ్రక్కున భూమికి డిగ్గఁ ద్రోవఁగాఁ
గడు సులభంబ యట్ల గుణగణ్యుఁ డనం బొగ డొందు టద్భుతం
బుడుగక దుర్జనుం డనఁగ నుండుట దా సుకరంబు ధాత్రిలోన్.

107

క.

అని దమనకుండు సెప్పిన, విని కరటకుఁ డతనితోడ వివరించితి వీ
వను వైననీతివాక్యము, లెనయఁగ నీతలఁచుకార్య మెయ్యది సెపుమా.

108


మ.

అనినన్ వానికి నిట్లనున్ దమనకుం దత్యంతభీతస్థితిన్
మనరా జేటికిఁ బోవఁగా వెఱచియున్నాఁ డిఫ్డు కంటే యనన్
విని యేభంగి నెఱింగి తీ వనిన భావింపంగ నేకార్య మై
నను భావజ్ఞులయంతరంగములఁ గాన న్వచ్చు భావింపుమా.

109


చ.

పలికినస న్నెఱిఁగి పశుపంక్తులు సెప్పినయట్ల చేయు శి
క్షల హయకుంజరంబులు వశం బయి మోచుకపోవు నట్లు మ
ర్త్యులు తమబుద్ధిలే కెదిరియుక్తిఁ జరించిన వార లేటికిన్
వెలయఁ బరేంగితం బెఱుఁగ నేర్చుట గాక వివేక మిమ్మహిన్.

110


ఉ.

కావున నిప్పు డివ్విభునిఁ గన్గొని చిత్తము వచ్చునట్లుగా
సేవ యొనర్చి మన్ననలఁ జెందెద నన్ను నతండు మున్ను ఛా
త్రీవిభులన్ భజింపవు తదీయచరిత్ర లెఱుంగుదే యనన్
గోవిదవృత్తి భూపతులఁ గొల్వఁగ నేర్తు నటంచు నిట్లనున్.

111


గీ.

అతిసమర్థుల కిల నసాధ్యంబు లేదు, పోల నుద్యోగికిని దూరభూమి లేదు
విద్య గలవాని కెందును వింత లేదు, వఱలఁ బ్రియవాదికిని శాత్రవంబు లేదు.

112


వ.

అనినం గరటకుం డతని కిట్లనియె మనస్వామిచిత్తవృత్తి యెఱుఁగనినీకుం గదియ నెట్ల
గు ననిన నతం డిట్లనియె రాజు మన్నించుసేవకులపొందునం బోయి న న్నెఱింగించు
కొని యాసన్నవర్తనుండ నయ్యెద విను మని యిట్లనియె.

113


ఉ.

వీనికి విద్య లే దనరు వీఁడు కులస్థుఁడు గాఁ డనారు మే
ధానిధి వీఁడు గాఁ డనరు తమ్ము భజించినఁ జాలు నెప్పుడున్
మానవనాథులున్ సతులు మవ్వ మెలర్చినపువ్వుఁదీఁగెలున్
మానకపార్శ్వసంశ్రితసమాజముఁ బూని గ్రహించు నిచ్చలున్.

114


క.

కోపప్రసాదచిహ్నము, లేపార్థివునందు భృత్యుఁ డెఱిఁగి చరించున్
దీపించి వాఁడు నృపుచే, నేపారఁగ మంతు కెక్కు నెక్కుడుకరుణన్.

115


వ.

అనినం గరటకుండు నేఁడు నీవు రాజుసమ్ముఖంబునకుం బోయి యేమని పలుకంగల
వాఁడ వనినం దమనకుం డిట్లనియె.

116


క.

ఉత్తరమునఁ బొడమెడుఁ బ్ర, త్యుత్తర ముత్తరము లేక యుత్తర మగునే
హత్తినసువృష్టి వలనన్, విత్తులకుం బొడమినట్టివిత్తులుఁబోలెన్.

117


వ.

అని మఱియును.

118

చ.

నరుల కపాయదర్శనమునం బ్రభవించిన యావిపత్తియున్
సరవి నుపాయదర్శనవశంబున వచ్చిన కార్యసిద్ధియున్
వెడవున బుద్ధిమంతులు వివేకమునన్ దగునీతిసంపదన్
దిరముగ మున్న కాంతురు మదిం దలపోయుచు నిక్కువంబుగన్.

119


వ.

కావున నిమ్మహీపతికి సంప్రాప్తకాలం బైనవిన్నపంబు చేయుఁదు నెట్లనిన నప్రాప్త
కాలవచనంబు లుపన్యసించి బృహస్పతి యైన నవమానితుం డగు దేశకాలపరిజ్ఞానం
బెఱుంగక గుణహీనులు ప్రయోగించిన సుభాషితంబులు వ్యంగ్యంబు లగు నని
మఱియు నిట్లనియె.

120


క.

తననడవడి సత్పురుషులు, కొనియాడఁగ నుబ్బ కదియ గుణముగఁ దద్వ
ర్తనము న్వదలక యుండిన, మనుజుఁడు పూజ్యుండు జనసమాజములోనన్.

121


వ.

అని మఱియు నిట్లనియె సేవకులు రాజులం గొలువ నెట్లు వచ్చు వారు పర్వతంబులుం
బోలెఁ బ్రకృతివిషములుఁ జలగ్రాహులు నని పలుకవలదు.

122


గీ.

ఎవ్వరెవ్వరియాత్మల కెద్ది హితము, వారివారికి ననుగుణవర్తనమున
బుద్ధిమంతుఁడు శీఘ్రంబ పొసఁగ మెలఁగి, యతని వశ్యునిఁగాఁ జేయు నాక్షణంబ.

123


గీ.

చటులసింహశరభశార్దూలగజముల, వశ్యములుగఁ జేయవచ్చు ననఁగ
నరయ మిగులఁ దద్జ్ఞు లగువారలకు నల్ల, యవనిపతులు వశ్యు లగుట యెంత.

124


వ.

అనినం గరటకుండు దమనకా నీకుఁ కార్యసిద్ధి యయ్యెడు మరుగు మనిన దమన
కుండు పింగళకుసమ్ముఖంబునకుఁ బోయి మ్రొక్కిన నాసీనుంగా నియమించి కృపా
కటాక్షంబు లొలయఁ బింగళకుండు నిన్నుఁ జిరకాలంబునకుఁ బొడగంటిమి భవదా
గమనంబునకు నిమిత్తం బేమని యడిగిన దమనకుండు భవత్పాదపద్మంబులకు నావల
నం బ్రయోజనంబు గలుగుటంజేసి పనివింటి నమాత్యుం డైనవాఁడు దనయేలికకు
నవసరంబు గలయప్పుడు కార్యాకార్యంబు లెఱింగింపఁ బిలువకున్నను గదియవలయు
నేనకా దెట్టిమానవుం డైననుం బార్ధివేంద్రునకు నొక్కొక్కవేళం బ్రయోజనపడు
నని యిట్లనియె.

125


గీ.

కర్ణములతీఁట దంతనిర్ఘర్షణంబు, వేఱుతృణకాష్ఠములఁ గాని తీఱ దనిన
నంగవాక్పాణిపదముల నమరునట్టి నరుఁడు గొఱగాక యుండుట ధరణి గలదె.

126


ఉ.

ఒప్పమి సజ్జనోత్తమున కొక్కయెడన్ బ్రభవించెనేనియున్
దప్పదు ధైర్యవృత్తి సతతంబును బూర్వపథంబు నగ్నిఁ దా
నొప్పర వేల్మిఁ బట్టునెడ నూర్ధ్వముఖంబులు గాక తచ్ఛిఖల్
దప్పి యధోముఖంబు లయి తార్కొన నేర్చునె యెన్నఁడేనియున్.

127

వ.

అని మఱియు విశేషజ్ఞుం డైనమహీవల్లభునకు సర్వంబును మున్ను గానంబడు
నెట్లంటేని.

128


మ.

హలికుం డోపి సమస్తబీజముల నయ్యైవేళలం జల్లుచో
నెలమిం బుట్టినకోమలాంకురముల న్వీక్షించి మున్మున్న తాఁ
దెలియుజ్ సస్యఫలంబు లాకరణి నర్థిన్ బుద్ధిమంతుండు మ
ర్త్యులయాకారము సూచి నిశ్చయము సేయున్ దన్మనోవృత్తులన్.

129


క.

నరపతి భృత్యులఁ దొడవుల, నొరసి తగిననెలవులందు నునుపక యున్నన్
జరణంబునఁ జూడామణి, శిరమున నందియయుఁ బెట్టు చెలువము గాదే.

130


గీ.

కుందనము గూర్ప నర్హ మై యందపడిన, పృథులరత్నంబు వెండిలోఁ బెట్టెనేని
రత్నమున కేమి కొఱయగు రాజు బంటుఁ, దగినపనిఁ బెట్టకుండినఁ దగవు గాక.

131


ఉ.

ఈతఁడు బుద్ధిమంతుఁ డగు నీతఁడు నా కనురక్తుఁ డేలఁగా
నీతఁడు తా జడుం డని మహేశ్వరుఁ డాత్మ నెఱింగి వారి నా
రీతుల నేర్పడ న్మనుపఁ బ్రీతి దలిర్పఁగ నట్టివార లా
భూతలనాథునిన్ విడిచిపోవక కొల్తుర యెల్లయప్పుడున్.

132


క.

తురగంబులు నాయుధములు, నరుదుగ శాస్త్రములు వీణ యావాణియు నే
ర్పరి యగు నరుండు నారియుఁ, బురుషవిశేషంబు నొంది పొరి నుతి కెక్కున్.

133


క.

అని పలికి దమనకుం డి, ట్లను నన్ను సృగాలమాత్ర మని నీచిత్తం
బునఁ దలఁపక నావిన్నప, మనఘాత్మ వినంగఁ దగుఁ బ్రయత్నముతోడన్.

134


సీ.

సూకరరూపంబు భీకరంబుగఁ దాల్చి, పుండరీకాక్షుండు పొగడు వడఁడె
మృగరూపమునఁ బుట్టి జగతిఁ బ్రసిద్ధుఁ డై, ముని సురేంద్రునిచేత మ్రొక్కు గొనఁడె
ఛాగస్వరూపంబు షణ్ముఖుండు ధరించి, సురసమూహమునఁ బ్రస్తుతి గనండె
యింద్రాగ్ను లిరువురు నెసగంగఁ బందు లై, పృథులసత్కీర్తులఁ బెంపు గనరె


గీ.

యల్పజంతువు లని వారి నాదరింప, కుండెనే తొల్లి సురమునిమండలంబు
గాన నీవును ననుఁ జుల్కఁగాఁ దలఁపక, చిత్తమునఁ జేర్చి నామాట చిత్తగింపు.

135


వ.

అని మఱియును.


క.

అసమర్థుఁ డైనహితుఁడును, నసమానసమర్థుఁ డైనయహితుండును న
వ్వసుధాధిపునకుఁ గొఱ గా, రెసఁగఁగ నాశక్తిభక్తు లెఱుఁగఁగవలయున్.

136


వ.

అని పల్కి వెండియు.

137


సీ.

అవివేకి యగు రాజు నంటిన ప్రజలందు, నెట్టివారును మతిహీను లగుదు
రట్టివా రాసన్ను లై మహీశ్వరుఁ గొల్వ, రెడపక పెద్దలు విడుతు రపుడ

పెద్దలు విడిచినఁ బెరిఁగి యన్యాయంబు, ప్రబలంబు గాఁగ ధర్మంబు తొలఁగు
ధర్మంబు తొలఁగిన ధాత్రీతలం బెల్లఁ, జీకాకు పడి రూపు చెడి యడంగు


గీ.

రాజు పరిసరవర్తులు రాష్ట్రజనము, మున్న నశియించి చనుటకు మోస లేదు
గాన సర్వజ్ఞుఁ డనఁగ లోకంబుచేత, వినుతి బొందిన రాజు వివేక మమరు.

138


గీ.

అనుచు నిట్లు దమనకాఖ్యుండు పలికిన, నర్ధిఁ బింగళుండు నతని కనియెఁ
బొసఁగ మాకు మంత్రిపుత్త్రుండ వగుటను, జెప్పఁదగినబుద్ధి సెప్పఁదగదె.

139


క.

అన నతఁడు విన్నవించెద, ననఘా! యుదకార్థి నగుచు యమునానదికిం
జనుచుండి వెఱఁగుపడి ని, ల్చినకారణ మేర్పడంగఁ జెప్పుము నాకున్.

140


వ.

అనిన నాతం డిట్లనియె.

141


సీ.

ఈయున్నవన మెల్ల నాయధీనం బిది సర్వసత్త్వవ్రాతసంకులంబు
నిన్నాళ్లును గదలకుండితిమి యీ, విపినంబు నేఁ డింక వెడలవలసె
నెట్లన్న నొకశబ్ద మేమని చెప్పుదు, నశనినిరోషంబు ననుకరించి
నాకర్ణముల సోఁకినను భయం బొదవిన, విన్నచోటనె నిల్చి యున్నవాఁడ


గీ.

శబ్ద మూహింప నుత్కృష్టజంతువునకుఁ, గాని యల్పజంతువునకుఁ గలదె యట్టి
దేమి సేయుదు ననిన మృగేంద్రునకును, దమనకాఖ్యుండు వల్కె నందంద మ్రొక్కి.

142


వ.

దేవా శబ్దమాత్రంబునకు శంకింపం బని లే దవధరింపు మని యిట్లనియె.

143


గీ.

బహుజలంబుల సేతువు పగిలిపోవు, విను మరక్షితమంత్రంబు విఱిసిపోవుఁ
గొండియంబున సఖ్యంబు గ్రుంగిపోవుఁ, గఠినభావలఁ బడిపోవుఁ గాతరుండు.

144


వ.

అని మఱియును.

145


క.

నీ విన్న శబ్ద మిప్పుడ, యే విని తెలిసితిని బుద్ధి నెంతయు మును దా
భావించి నక్క తెలియదె, దేవా ఘనదారుచర్మతీవ్రధ్వనులన్.

146


వ.

అనినం బింగళకుం డవ్విధంబు తెలియం జెప్పు మనిన నతం డి ట్లనియె.

147


గీ.

ఎసఁగునాఁకటిపెల్లున నిందు నందు, నడవిఁ జరియించి యాహార మబ్బకునికి
నలసి యొకజంబుకంబు భాగ్యమునఁ గాంచెఁ, గలహ మొనరించి పోయినకదనభూమి.

148


సీ.

అఱిముఱి నంతంతఁ దఱుచుప్రోవులు గట్టి, యఱవఱలై యున్నయరదములును
దొండముల్ గొమ్ములుఁ దొడలు మస్తకములు, ఖండంబు లైనవేదండతతులుఁ
జరణంబు లూరులు బరులుఁ గంధరములుఁ, దునకలై పడియున్న తురగములును
గంకణాంగదములఁ గడు నొప్పి విఱిగిన, బాహుదండంబులభటకులంబుఁ


గీ.

గలిగి భీభత్సరౌద్రశృంగారములకు, నాస్పదంబుగఁ గనుపట్టునట్టినేల
కౌతుకంబునఁ బొడగాంచి కదియునంత, నవల నొకమహాధ్వని గుండె లవియ నిగుడ.

149

సీ.

అమ్మహాధ్వని విని యత్యంతభయముతో, మృగధూర్త మట్టిట్టు మెదల వెఱచి
కను మూసి తెఱవ కెక్కడఁ జొత్తు నని బుద్ధి, శోకించి కను విచ్చి చూచునంత
ధారుణిఁ బడి యున్న భేరీముఖంబునఁ, దరుశాఖ గాలిచేఁ దాఁగుచుండఁ
బొడగని తనలోనఁ బొడమినభయ మెల్లఁ బోయిన నా భేరి డాయ వచ్చి


గీ.

యప్పు డిది గాన నేరక యధికభీతిఁ, బాఱిపోవఁగఁ జూచితిఁ బట్టు విడిచి
సొలవ కిది భాగ్యదేవత చూపె నాకు, ననుచు నానక్క యాత్మ ని ట్లని తలంచె.

150


గీ.

ఇది మహాభోజ్య మిచ్చట నొదవె నాకు, నిప్పు డిది వ్రచ్చుకొని చొచ్చి హిత మెలర్ప
వలయుమాంసంబు భక్షింపవచ్చు ననుచు, సొలవ కాభేరి వ్రచ్చి తాఁ జొచ్చి చూచి.

151


వ.

ఆమృగధూర్తం బందు నేమియుం గానక వృథాస్థూలం బని పోయెం గాన శబ్దమా
త్రంబునకు శంకింపంబని లే దెచ్చట శబ్దంబు వినంబడె నచ్చటికిం బోయి తెలిసికొని
వచ్చెదం బనుపు మని యతండు వనుప సంజీవకుం డున్నయెడకుం బోయి యి ట్లనియె.

152


సీ.

ఎఱుఁగు మృగేంద్రునిహితభృత్యుగా నన్ను, నతఁడు నీయున్నెడ కరుగు మనిన
వచ్చితి నాతఁ డివ్వనజంతుకోటికి, నధిపతి గావున ననఘ నీవు
నాయనపంపు చేయక యొంటిఁ దిరుగుట, తగవు గా దతనిపాదములు గనుము
మంత్రి వై తత్కార్యతంత్రంబు తీర్పుము, వెఱవక రమ్మన్న విని యతండు


గీ.

సమ్మతించిన మృగపతిసమ్ముఖమునఁ దాను మును నిల్చి మృగనాథ యేను బోయి
మున్ను నీవిన్నశబ్ద మిమ్ముగ నెఱింగి, తెలిసి వచ్చితి నీ పాదములు భజింప.

153


వ.

అది కావించినయతండు దేవర మన్నింప నర్హుం డని చెప్పి మఱియు నిట్లనియె.

154


సీ.

అడరి మహాబలుం డధికసత్త్వంబున, నురుతరువ్రజముల నురులఁ గొట్టి
నీచంబు మృదువువై నెరయ నానత మైనకసవుఁ బెల్లగిలంగ విసర నొల్లఁ
డబ్బంగి నధికుండు నల్పులదెసఁ బోక, ఘనత రారాతుల గండడంచు
నట్లు నీవును మహాహంకారమృగములఁ, దగిలి సాధింపంగఁ దగుదు గాన


గీ.

సాధుజంతుమాత్రంబుల బాధపఱిచి, యుదరపోషణ మొనరించుచున్న హరులు
సాటి సేయంగఁ దగునె యీజగతి నీకు, శౌర్యగుణధామ మృగకులసార్వభౌమ.

155


క.

అని కీర్తించుచుఁ దమనకుఁ, డనఘా నీ వపుడు వినఁగ నార్భట మటఁ జే
సినయాతఁడు సంజీవకుఁ, డనఁ జనువృషరాజు సౌమ్యుఁ డనఘుఁడు బుద్ధిన్.

156


తరల.

అతఁడు నీకును మంత్రి గాఁదగు నాయనం గొనివత్తు నే
నతులవిక్రమ పోయి వచ్చెద నన్న నాతఁడు పొమ్మనన్
వితతవాక్యవివేకసంపద వింతభావము మాన్చి తాఁ
జతురతన్ వృషభేంద్రు సింహముసమ్ముఖంబునఁ బెట్టినన్.

157

క.

అది మొదలుగ సంజీవకు, వదలక మృగనాథుఁ డధికవాత్సల్యం బిం
పొదవఁగఁ దనయెద్ద సచివ, పదవికిఁ దగు విభవ మిచ్చి పనిగొనునంతన్.

158


మాలిని.

కరటకదమనకాఖ్యుల్ గాఢచింతాంతరంగ
స్ఫురితబహువిధోక్తుల్ శోకమూలంబు గాఁగన్
బరఁగఁగఁ దమలోనన్ బల్కుచున్నట్టివేళఁ
గరటకుఁ డనె వానిం గర్ణశూలంబు గాఁగన్.

159


గీ.

సరవి నిన్నాళ్ళు నీమహేశ్వరుఁడు మనలఁ, బ్రజల నొక్కర లేకుండ భ క్తిఁబ్రోచె
వెనుక సంజీవకుండు వచ్చినది మొదలు, విడిచె నిది భవత్కృతదోషవిధిన కాదె.

160


వ.

అనిన వానికి దమనకుం డిట్లనియె.

161


ఉ.

వావిరి రాజు ప్రాఁతపరివారము నెల్లఁ బరిత్యజించి సం
జీవకుఁ బట్ట సేవకులు చెచ్చెర గ్రాసము లేక చిక్కి రేఁ
జూవె విచారదూరమతి చొప్పడ నిద్దఱఁ బొందు చేసితిన్
దైవము కర్త గాక మఱి తక్కినవారివశంబె చెప్పుమా.

162


వ.

అని దమనకుం డస్మత్కృతదోషంబునకు వగవం బని లేదు విను మని యిట్లనియె.

163


గీ.

మేషయుద్ధమధ్యంబున మెలఁగి యొక్క, శివయు నాషాఢభూతిచే సిద్ధమునియుఁ
దొడరి సాలీనిసతిచేత దూతికయును, నాత్మకృతదోషమునఁ గాదె హానిఁ బడిరి.

164


వ.

అనినం గరటకుం డవ్విధం బెఱింగింపు మనిన దమనకుఁ డిట్లనియె.

165


ఉ.

కలఁ డిల దేవశర్మ యనఁగా నొకయోగి యతండు పెక్కుది
క్కులఁ జరియించి నే ర్పెసఁగఁ గూర్చిన యర్థము కంథలోపలం
బొలుపుగఁ బోసి వైచుకొని పోవఁగ నత్తెఱ గెల్లఁ గాంచి మ్రు
చ్చిలుటకు శిష్యభావమునఁ జేరి యొకానొకదుర్జనుం డొగిన్.

166


గీ.

నామ మాషాఢభూతి నా నటన మెఱసి, కదిసి భయభక్తు లతనికిఁ గానఁబడఁగఁ
బరమవిశ్వాస మెసఁగంగఁ బనులు చేసి, మెలఁగు నంతటఁ దపసియు మిగుల నమ్మి.

167


క.

ఈకంథ నాకు వ్రేఁ గని, చేకొన నాషాఢభూతిచే నిచ్చి యతం
డాకందువ వనమధ్యత, టాకముఁ బొలుపారఁ జూచి డాసి కడంకన్.

168


క.

ఆచమనం బొనరింపఁగ, నాచేరువ మేషయుగళ మత్యుగ్రముగాఁ
ద్రోచియును మస్తకంబులఁ, దాచియఁ దమలోనఁ బోరఁ దా నవ్వేళన్.

169


గీ.

తగరుదోయితలలు దాఁకంగఁ దాఁకంగఁ, బగిలి రక్త మొలికి పడుచు గట్టి
కరడు కట్ట మాంసఖండంబుగాఁ జూచి, ఫేరవంబు మిగులఁ జేర వచ్చి.

170

వ.

ఆరక్తం బాస్వాదింపఁ గోరి మేషయుద్ధమధ్యం బని తలంప నెఱుంగక దుర్బుద్ధియ
గుజంబుకంబు జిహ్వాచాపలంబునఁ దద్రక్తం బుపయోగించుసమయంబున.

171


క.

మును పాసి వెనుకవెనుకకుఁ జని తాకుతగళ్ళనడుముఁ జచ్చిననక్కన్
గనుఁగొని వగచుచు భిక్షుకుఁ, డెనయఁగ నాషాఢభూతి నెలమిం బిలువన్.

172


వ.

వాఁ డంతకుమున్న వసుభరితం బైనయాకంథ నపహరించి చను టెఱింగి మోసపోయితి
నని భిక్షుకుండు దనమనంబున మేషయుద్ధమధ్యంబున జంబుకంబునకును నాషాఢ
భూతివలనఁ దనకును ననర్థకం బయ్యె ననుచుఁ జింతింపుచు నస్తమయసమయంబు
నఁ దత్సమీపనగరంబుఁ బ్రవేశించి యం దొకతంతువాయగృహంబునకుం జని సు
హృద్వాతగోష్ఠిం జెంది సుఖోపవిష్టుం డై యుండెనంత.

173


క.

ఆసాలీనికులాంగన, దోసం బన కన్యవిటులతోఁ దిరుగంగా
నాసరసిజాక్షివలనన్, గాసిల్లుచు దానివిభుఁడు కన్నిడియుండెన్.

174


సీ.

ఉన్నచో నారాత్రి యొండు బాలికఁ గూర్చి, మగఁడు వోవఁగఁ జూచి మది నెఱింగి
తనదుదూతిక యైనతరుణి రమ్మని పిల్వ, నదియుఁ దానును నన్యసదనమునకుఁ
జనునంత నెదురుగా సాలీఁడు వచ్చిన, దూతికఁ దొలఁగించి తోయజాక్షి
పురుషుముందఱ నేఁగి భోరున నిలు చొచ్చి, గరగతోయము దెచ్చి కాళ్ళు గడుగఁ


గీ.

దఱియ భావజ్ఞుఁ డై దానిధౌర్త్య మెఱిఁగి, విసువ కొడ లెల్లఁ జెడఁ గొట్టి విఱిచికట్టి
తెల్లవాఱంగఁ జూడు నీతెఱఁ గటంచు, నిండుమనమున నాతండు నిదురవోవ.

175


వ.

అయ్యవసరంబున.

176


ఉ.

దూతిక వచ్చి నీపతి మృతుండునుబోలెను నిద్రవోయెడున్
భీతకురంగనేత్ర యితనిం గనుబ్రామి సుఖింపఁ బొమ్ము నీ
వీతఱి వచ్చునంతకు సహించెదఁ గట్టినరజ్జుబంధముల్
నాతనువల్ల నుంచుకొని నాకుఁ బ్రియం బిది పద్మలోచనా.

177


ఉ.

కంతునిఁ బోలునట్టియుపకాంతునితోడ రమించితేనియున్
సంతస మందె దంచు విలసద్ధతి నీకడ కేఁగుదెంచితి
గాంత పురాతనుం డయినకాంతుఁడు మేల్కనెనేని వీఁడు కా
లాంతకుఁ డైననుం దలఁకు నచ్చటికిం జని రమ్ము పొ మ్మొగిన్.

178


వ.

అని దానిరజ్జుబంధంబు లూడ్చి దానికిం బ్రియంబుగాఁ దన్ను గట్టించుకొని యయ్యు
వతీరత్నంబు పనిచిన నదియు నర్ధరాత్రసమయంబున నిబిడాంధకారంబునఁ బుష్పకో
దండసహాయ యగుచు నుపనాథమందిరంబుఁ బ్రవేశించె నిటఁ దంతువాయుండు నంత
మేల్కాంచి యంధకారంబుకతంబునఁ దనకాంత యున్న రూ పెఱుంగ కిట్లనియె.

179

ఉ.

ఓసిగులామ న న్నెఱుఁగకుండఁగ నెయ్యడ కేఁగి తిప్పు డే
వాసియు వన్నెయుం గలుగువాఁడఁ గులంబున నింద తెచ్చి వే
ద్రోసి తలంప నీకరణి దుష్కృత మెవ్వరు చేసినారు నీ
బైసి తొలంగఁ దొత్తువలెఁ బాపెదఁ గూటికిఁ జీరకుం జెడన్.

179


వ.

అని మఱియును.


క.

నిను విడువలేక పలికెదఁ గనికరమున నేఁడు మొదలుగా నెందేనిన్
జన నని శపథముఁ జేసిన నిను విడిచెద సమ్మతంబె నీకుం దరుణీ.

180


క.

అని యిట్లు పలుకుచుండఁగ, విని దూతిక యెలుఁగు చూప వీఁ డెఱుఁగునొ యం
చొనరఁగఁ బలుకక యుండిన, మనమునఁ గ్రోధానలంబు మండుచు నుండన్.

181


వ.

ఆతంతువాయుం డంతట సముత్థితుం డై యిద్దురాత్మిక నాకుం బ్రమాణంబు సేయు
మనినఁ బలుక కూరకున్నయది యిట్టిధౌర్త్యం బింకను జేయుతలంపు గావలె నని యగ్గ
లంపుఁగోపంబున దిగ్గన లేచి తీక్ష్ణశస్త్రికం గొని యాదూతిక నాసికాచ్ఛేదంబుఁ జేసి
క్రమ్మఱ శయ్యాతలంబునకుం జని నిద్రించుసమయంబునఁ దంతువాయుకాంత యుప
కాంతునితో నలరువిల్తుకేళిం గలసి వేగంబ వాని వీడ్కొని యంతంత నాలకింపుచుఁ
జనుదెంచి దూతికం గదిసి యిట్లనియె.

182


క.

పురుషుఁడు మేల్కని నిన్నుం, బరుషంబులు పల్కు నంచుఁ బఱతెంచితిఁ దా
మరసాక్షి వాఁడు మేల్కని, యరయండు గదా విచార మయ్యెడు నాకున్.

183


వ.

అని పలుకఁ గన్నీ రొలుక నల్లన నల్లలన యిట్లనియె.

184


గీ.

నీవు వోవఁ దడవ నీనాథుఁ డప్పుడె, నిదుర మేలుకాంచి నీ వటంచు
ముక్కుఁ గోసె నింక నెక్కడిసంసార, మమ్మ నన్ను విడువు మరుగవలయు.

185


క.

అని యొయ్యఁ బలుక దానిం, గనికర మొప్పంగ విడిచి ఘనబంధములన్
దనతనువునఁ గట్టించుక, వనజానన యుండె దానివల్లభుఁ డంతన్.

186


వ.

ప్రబుద్ధుం డగుచు నాసన్నుండై యోదురాత్మికా యేమిచేసెద వనిన నమ్మగువ
యిట్లనియె.

187


ఉ.

నన్ను నకారణంబ సరినారులలోఁ దలవంపు సేయుచున్
మిన్నక ముక్కుఁ గోసితివి మిక్కిలి నాకడ నేర మేదియేన్
గన్నది విన్న దింతయినఁ గల్గెను యొల్లనివాఁడవై కదా
పిన్నతనంబు చేసి వగపించితి వేమితలంపు చెప్పుమా.

188


ఉ.

దేవమహోత్సవం బని సతీమణు లందఱు నేఁగ నేనునుం
బోవఁగ నీవు నా కెదురు బోరన వచ్చినఁ బోక చిక్కితిం

గావునఁ దప్పు నావలనఁ గల్గమి నీవు దలంపకుండినన్
దైవ మెఱుంగఁడే తగనిదండము దండధరుండు చేయునే.

189


క.

ఇలువాడుదు గరగరగాఁ, దలవాకి లెఱుంగఁ బొరుగుతరుణులఁ గూడన్
గల నైన నన్యపురుషులఁ దలఁపన్ దులువా పతివ్రతామణిఁ గానే.

190


వ.

అని సురమునీంద్రుల నుద్దేశించి యిట్లనియె.

191


ఉ.

ఓసురలార యోమునివరోత్తములార భవత్పదాబ్జవి
శ్వాసము నాకుఁ గల్గుట నిజం బగునేని మదీయకాంతుపైఁ
జేసినభక్తి యెన్నఁడును జిందిలదేని వినుండు నేఁడు
నాసిక వచ్చుఁగాక జతనంబుగఁ బూర్వగతిం బ్రకాశమై.

192


వ.

అని పలికి నిజనాథు నుద్దేశించి యిట్లనియె.

193


చ.

ఎఱుఁగక చేసినట్టినిను నేమన వచ్చుఁ బతివ్రతాగుణం
బెఱుఁగుటఁ జేసి నాకు సుర లిచ్చిరి ముక్కిటు చక్కఁ జూడు ప
ల్లఱపులు మాని యాక సమునందు సురేంద్రుఁడు లోకపాలురుం
దఱుదుగ నన్నుఁ జూచుటకుఁ దార్కొని రందఱుఁ గాన నయ్యెడున్.

194


క.

అని తనవల్లభ పలికిన, విని విస్మితుఁ డగుచు లేచి విభుఁ డతిశీఘ్రం
బున దివియఁ గొనుచుఁ గదియం, జని కనియెం దనదుభార్యచక్కనిముక్కున్.

195


క.

పొగడగని తనభామినికిన్, దడయక పదయుగము చేరి దండం బిడి య
ప్పుడ తాఁ గట్టినపెడకే, ల్విడిచి ప్రియుఁడు ప్రియము వల్కె వేగినపిదపన్.

196


వ.

భిక్షుకుండును నిద్రావిరహితుండై సర్వవృత్తాంతంబునుఁ జూచుకొనియుండె నట
దూతికయును వస్త్రాచ్ఛాదితముఖకమల యై తనగృహంబునకుం జని శయ్యాతలం
బున నాసీనయై తనపురుషుం డెఱింగిన నేమని మొరుంగుదు నేమి సేయుదు నెక్కడఁ
జొత్తు నని చింతించుచున్నసమయంబున దానివల్లభుం డైనక్షౌరకుండును మేల్కని
ముఖప్రక్షాళనంబు చేసికొని తనభార్యం బిలిచి యిట్లనియె.

197


గీ.

కత్తు లున్న సంచి కడువేగఁ గొని రమ్ము, పోయి యూడిగమ్ము సేయవలయు
రాజు పిలువఁ బంపె రమణిరో తెమ్మన్న, నదియుఁ గత్తి యొకటి యతని కొసఁగ.

198


వ.

అది పుచ్చుకొని నాపితుం డగ్నికణంబు లొలుకఁ గన్నుల దానిం జురచురం జూచి.

199


ఉ.

కత్తులతిత్తిఁ దె మ్మనినఁ గానక నా కిది యొంటికత్తి నీ
విత్తఱి నేల యిచ్చి తిది యేమి పరాకున నున్నదాన వో
తొత్తులతొత్త వేసడమ దూలపిసాచి యటంచు నాత్మలో
నెత్తినతీవ్రకోపమున నింతిపయిం బడఁ గత్తి వైచినన్.

200

గీ.

వాటు దాఁకి ముక్కు వ్రయ్యలై పడె నంచు, ముదిత కోకకొంగు మూసికొనుచు
వాడవాడ లెల వడి వెంటఁ దగులంగఁ, బోయి రాచనగరఁ గూయుచుండ.

201


గీ.

అపుడు దౌవారికులు విని యవ్విధంబు, నృపుని కెఱిఁగింపఁ బిలిపించి నెలఁతఁ జూచి
యిత్తెఱంగున కేమినిమిత్త మనిన, జనపతికి విన్నవించె నిజంబు తోఁడ.

202


ఉ.

తప్పొకయింత లేదు తను దైవము గాఁగఁ దలంతు నేను దా
నొప్పక నాయెడం గినియుచుండు నకారణవైర మూని నేఁ
డిప్పుడు ముక్కు గోసె ధరణీశ్వర యీ దురవస్థ నేమిగాఁ
జెప్పుడు నీవ దిక్కనుచుఁ జేరితి నామొఱ యాలకింపవే.

203


వ.

అనిన విని భూమీశ్వరుండు నాప్రొద్ద నాపితుం బిలిపించి వాని కిట్లనియె.


గీ.

ఓరి నీభార్య కేలరా యూర కిట్లు, వికృతవేషంబు చేసితి వెఱపు మాలి
యనిన వాఁడు భయంపడి మనుజపతికి, నొండు పలుకంగ నేరక యూరకుండె.

204


క.

ధరణీశ్వరుండు నంతటఁ, బరిజనులం జూచి వీనిఁ బట్టుకొనుచు మీ
రరిగి నగరంబువెలుపల, నరణ్యదేశమునఁ జంపుఁ డని పనుచుటయున్.

205


వ.

అంత భిక్షుకుండు తద్వృత్తాంతం బంతయు నెఱుంగుం గావున నమ్మహీశ్వరుసమ్ము
ఖంబున నిలిచి యాశీర్వాదపురస్సరంబుగా నతని కి ట్లనియె.

206


గీ.

మేషయుద్ధమధ్యంబున మెలఁగి యొక్క, శివయు నాషాఢభూతిచేఁ జిక్కి నేనుఁ
దొడరి సాలీనిసతిచేత దూతికయును, ముప్పు గను టాత్మకృతదోషములనె యనుచు.

207


ఉ.

చెప్పిన నద్భుతం బెసఁగ శీఘ్రమె నాపితుఁ బిల్వఁ బంచి యే
తప్పును లేదు పొ మ్మనుచుఁ దత్తరుణిం బురి నుండకుండఁ బెం
పొప్పఁగఁ దోలఁ బంచి సుజనోత్తము భిక్షుకు నిచ్చ మెచ్చెఁ దాఁ
జొప్పడ భూమిపాలుఁ డని సౌం పెసఁగం గథ చెప్పినంతటన్.

208


వ.

కరటకుండు నీ వింకఁ జేయఁదలఁచినకార్యం బెయ్యది యనిన నతం డతని కిట్లనియె.

209


గీ.

దృష్టముగఁ గార్య మంతయుఁ దెలియుకొఱకు
నెసఁగులోకప్రవర్తనం బెఱుఁగుగొఱకుఁ
దుది ననర్థకార్యంబులఁ ద్రోచుకొఱకుఁ
దగిన దెయ్యది యదియ మంత్రంబు సుమ్ము.

210


ఉ.

కావున మంత్రభిన్న మయి కార్యము దప్పక యుండ నిఫ్డు సం
జీవకపింగళాఖ్యులకుఁ జేరక భేదము పుట్టునట్లుగా
నేవెర సైనఁ జేయక సహించిన నవ్విభుఁ జేరవచ్చునే
సేవకకోటికిన్ మనకు సీమ దొలంగుట గాక యిత్తఱిన్.

211

వ.

అనినం గరటకుం డది యెట్లు సాధ్యం బగు ననిన నతని కిట్లనియె.

212


చ.

చెనసి యుపాయమూలమునఁ జేయఁగ శక్యము లైనకార్యముల్
మొనసి పరాక్రమంబున నమోఘముగా నొడఁగూర్ప శక్యమే
కనకవిభూషణంబు గొని కాకము సర్పముఁ జంపె నేర్పుతోఁ
గనఁగ నుపాయసాధ్యములు గానిపనుల్ గలవే తలంపఁగన్.

213


వ.

అనిన నక్కథ వినవలతుం జెప్పు మనిన దమనకు డిట్లనియె.

214


ఉ.

వాయసదంపతుల్ తగునివాసముగా నొకవృక్షశాఖపైఁ
బాయక యున్నచో నునికిపట్టునఁ జేరువ పుట్టపట్టునం
దాయతరోషభీషణమహాభుజగేంద్రుఁ డెఱింగి కాచి వా
లాయము గాఁగఁ జంపును జలంబునఁ గాకముకన్నపిల్లలన్.

215


వ.

ఇవ్విధంబునఁ జంపి తినుచున్న కృష్ణసర్పంబునకుం దలంకి చేయునది లేక నిరంతర
క్లేశంబునఁ జింతింపుచు వాయసంబు తనకాంతకుం బ్రసవకాలం బగుటయుఁ గనుం
గొని తనకు నత్యంతమిత్రుం డైనగోమాయువుకడకుం జని కుంభీనసంబు సేయు నప
కారంబు చెప్పి యేమి సేయుదు ననిన జంబుకం బిట్లనియె.

216


గీ.

తగిలి యుత్తమమధ్యమాధమము లైన, మత్స్యముల నెల్ల భక్షించి మరియు బకముఁ
గపటమునఁ దొల్లి కర్కటకంబు చంపె, నట్ల నీవును బగ దీర్పు మనువు పడఁగ.

217


వ.

అనిన వాయసంబు తన కక్కథ వినిపింపు మనిన జంబుకం బిట్లనియె.

218


చ.

గురుసరసీతటంబునకుఁ గొక్కెరవృ ద్ధొకఁ డేఁగుదెంచి ని
ర్భరనియమవ్రతాచరణభావము దోఁపఁగ మోము వాంచి కం
ధరముఁ గురించి కన్నుఁగవ దార్కొన మూసిన దానిఁ జూచి య
చ్చెరువునఁ గర్కటం బచటఁ జేరి మృదూక్తుల నల్లి నిట్లనున్.

219


గీ.

మిగుల నాఁకంటిపెల్లున నొగిలి నీవు, చిక్కియును మీను గదిసినఁ జీరకునికి
యద్భుతం బయ్యెఁ జెప్పుమా యని కుళీర, మడుగ దానికి బకవిభుఁ డనియె నపుడు.

220


సీ.

ఏకొలంకుల నైన నిట్టట్టు మెలఁగెడు, మీనుల భక్షించి మేను పెంతుఁ
బెంచుచో నొకనాఁడు పిడుగుఁ బోలెడువార్త, నాచెవి నాటిన నాఁటనుండి
కడుపు విచారింపఁ గడువిచారంబునఁ, జిక్కితి నేమని చెప్పువాఁడ
ననినఁ గుళీర మేముని వింటి వీ వన్న, గొక్కెర కన్నీరు గ్రుక్కుకొనుచు


గీ.

ననియెఁ గైవర్తు లిచటికి నరుగుదెంచి, వలలు నూఁతలు మొదలుగా వలయునట్టి
సాధనంబులు గొని జలజంతుకోటిఁ, బొరిగొనఁగ వత్తు మనఁగను బొసఁగ వింటి.

221

గీ.

అని కుళీరంబుతో బక మపుడు పలుక, నచటిమీనంబు లన్నియు నాలకించి
యోబకంబ మ మ్మిందఱ నుద్ధరింపఁ, గలిగితివి నేఁటియాపద గడపవలయు.

220


వ.

అనినం గొక్కెర యొక్కింతప్రొద్దు చింతించి మీకు నేఁ జేయందగినకార్యం బెద్ది
యనిన నామత్స్యంబు లిట్లనియె.

221


క.

ఇంకనిజలములు గలిగిన, నింకొక్క యగాథసరసి నిడినఁ జాలున్
సంకోచింపక మము నీ, యంకిలి వాపుటకు నీవ యర్హుఁడ వెందున్.

222


అనిన నాబకం బిట్లనియె జాలరుల వారింప నశక్తుండఁ గాని మిమ్ము నొక్కొక్కరినె
గ్రక్కున ముక్కునం గబళించుకొని పోయి మీకు ననుకూలం బైనతావునఁ గ్రమ
క్రమంబున నందఱను బెట్టి వచ్చెద ననిన నవి సమ్మతించుటయు నాబకంబు.

223


ఉ.

ముక్కున నొక్కటిం గఱచి మొక్కల మేమియు లేక పాఱి తా
నొక్క శిలాతలంబుపయినుండి రయంబున మెక్కి వచ్చి వే
ఱొక్కటిఁ గొంచుఁ బోయి యదియుం దిని క్రమ్మఱఁ బాఱుతెంచి తా
నక్కఱ దీఱ మత్స్యముల నన్నిటిఁ జంపెను గాంక్ష మీఱఁగన్.

224


వ.

ఇట్లు క్రమక్రమంబునం గతిపయదినంబులు నాసరోవరంబునం గలమత్స్యంబుల నెల్ల
భక్షించి మఱియుం దనివి చనక మత్స్యంబుల వెదకుచున్న బకంబుం గనుంగొని కర్క
టకం బొక్కటి కదియం జనుదెంచి యిట్లనియె.

225


క.

ఇమ్మడువుమీనములతో నిమ్ములఁ గూడాడి పెరిఁగి యిన్నాళ్ళును బ్రే
మమ్మున నుండితి నొంటిగఁ, గ్రమ్మరలే నింక నన్నుఁ గొనిపోవఁగదే.

226


క.

నావుడుఁ గుళీరమాంసం, బే వెనుకను నమలి యెఱుఁగ నిది నేఁ డొసఁగెన్
దైవంబె యనుచు దానిని, వేవేగం గఱచి పట్టి విహగం బెలమిన్.

227


క.

మును మత్స్యంబుల భక్షించినయెడకుం గొంచుఁ బోయి శిలపైఁ దా వా
లిన మత్స్యమాంసమేదో, ఘనగంధం ఔఱిఁగి యెండ్రి కడుఁ జకితంబై.

228


వ.

ఇద్దురాత్ముండు కపటోపాయంబున మీనంబుల నెల్ల నిచ్చోట వధియించెనని యెఱింగి
తనలో నిట్లని వితర్కించె.

229


క.

సాహసము లేనివానికి, నూహింపఁగ బ్రతుకు గలదె యొకట ధరిత్రిం
బాహువిజృంభితశత్రు, వ్యూహంబులఁ జంపుఁ జచ్చు నొండె ఘనుఁ డిలన్.

230


వ.

అని మఱియుం గుళీరంబు దనమనంబున.

231


ఉ.

ఏలొకొ యుద్ధభూమి నొకయించుక నిల్చి జయంబుఁ గైకొనన్
జాలుట లేక పాఱుదురు చావు శరీరము దాఁచఁ దప్పునే

కాలవశంబు గాక యది గానక హీనుఁడు పాఱుఁ బ్రాజ్ఞుఁ డా
వేళఁ దొలంగిపో కనుభవించును నిందును నందు సౌఖ్యముల్.

232


వ.

అదియునుంగాక.

233


సీ.

వైరంబు కొఱ గాదు వసుధ నెవ్వారికి, నట్టిది బలవంత మయ్యెనేని
తగినసాహాయ్యంబు దలగూర్చుకొని పగ సాధింపవలయు నుత్సాహలీల
బలముఁ గూడకమున్న పగతుండు తఱినేచి గొదగొని చిక్కించుకొనియెనేని
నొదుగక పగరపై నుఱికి చంపుట యొండె, రణమున వారిచేఁ జచ్చు టొండెఁ


గీ.

బాఱి కలకాల మెవ్వాఁడు బ్రతుకు నంచుఁ, బ్రాణసందేహమునఁ దెగుఁ బ్రాజ్ఞుఁ డెఱిఁగి
సాహసము చేయ నాకును సమయ మనుచు, నుఱికి కొక్కెరకంఠంబుఁ గొఱికి చంపె.

234


వ.

ఇట్లు చంపి యాకుళీరం బెటకేనియుం జనియె నట్లు నీవును గృష్ణసర్పంబు భంజింపు
మని యుపాయంబుం జెప్పినఁ దెలిసి వాయసంబు జంబుకంబు ననిచి నిజనివాసం
బునకుం జనియెఁ దదనంతరంబ.

235


ఉ.

ఆమఱునాడు వాయసము నాపుర మేలుమహీశుమందిరా
రామములోనఁ గ్రుమ్మరఁగ రాజపురంధ్రులు వచ్చి యచ్చటం
గోమలపుష్పమంజరులు గోసి పదంపడి యంబుకేళికిన్
బ్రేమ దలిర్ప డిగ్గుతఱి భీతమృగేషణ యోర్తు నెవ్వడిన్.

236


చ.

తన మెడ హేమసూత్ర మొకదారువునం దగిలించి గ్రక్కునం
జనిన నెఱింగి వాయసము చంచుపుటంబున దాని గ్రుచ్చి యం
గనలు గనుంగొనంగ వడిగాఁ గడు దూరము పోవ కొయ్యనొ
య్యనఁ జన నత్తెఱంగు వసుధాధిపునొద్దకుఁ బాఱి చెప్పుడున్.

237


క.

విని యానరపతి భృత్యులఁ, గనుఁగొని వాయసము గొన్నకంఠాభరణం
బనువుగఁ దెమ్మని పనిచినఁ, జని వారలు వాయసంబుచక్కటి నరుగన్.

238


గీ.

వాయసంబును నెలయించి వారు సూడఁ, గనకసూత్రంబుఁ గొనిపోయి కాలసర్ప
మున్న వల్మీకవివరమం దునిచి తొలఁగ, సరభసంబున నా పుట్టఁ దిరుగువాఱ.

239


గీ.

గడ్డపారలఁ బారల బెడ్డ లొదవ, వెడఁదగుద్దళ్ళ నాపుట్ట విడియఁ ద్రవ్వ
నందు నిద్రించుచున్న కాలాహి కెరలి, తూలి పాఱంగఁ గొందఱఁ దోలితోలి.

240


వ.

కఱచి యెటయేనియం బఱచునమ్మహాహిం బొదివి పోనీక కొందఱు కోదండధరులు
డాసి యేసి కృష్ణసర్పంబును మృతిఁ బొందించి యాకంఠాభరణంబు గైకొని
చనిరి గావున నుపాయంబున సాధింపరాని కార్యంబులు గలవే యని దమనకుఁడు
వెండియు నిట్లనియె.

241

ఉ.

వారక బుద్ధిమంతుఁ డగువాఁడె బలాధికుఁ డైనవాఁడు గా
కారయ బుద్ధిహీనునకు నైనబలం బది నిష్ఫలంబు దు
ర్వారమదంబునం బరఁగి వాలినసింహముఁ జంపె నేర్పుతో
నీరస మెక్కు డైనశశ మెట్టిదొ బుద్ధిబలంబు చూడుమా.

242


వ.

అనినం గరటకుం డక్కథ నా కెఱింగింపు మనిన దమనకుం డిట్లనియె.

243


ఉ.

ఉగ్రవనంబులోన హరి యొక్కయెడన్ వసియించి సర్వస
త్త్వగ్రహణార్థి యై బహువిధంబుల మాంసముఁ దించు నుండఁ ద
ద్వ్యగ్రతఁ జూచి జంతుతతు లన్నియుఁ గూడి మృగేంద్రుపాదప
ద్మాగ్రము లౌదలల్ గదియ నార్తిమెయిం బ్రణమిల్లి యిట్లనున్.

244


సీ.

అవధరింపు మృగేంద్ర యడవి జంతుసమూహ, మిదె విన్నపంబున కేఁగుదెంచె
నెటన్న నన్నింటి నెసరేఁగి యొక్కటఁ, జలపట్టి యొకనాఁటఁ జంప వేల
నిత్య మొక్కమృగంబు నీకుఁ గట్టడ గాఁగఁ, బ్రీతి నాహారంబు పెట్టఁగలము
సమ్మతింపు మనిన సకలజంతువులకు, నట్ల కానిమ్మని యభయ మొసఁగి


గీ.

యనుప నవి వోయి నిత్యకృత్యంబు గాఁగ, నుదయ మయ్యెడికొలఁదిని నొకటిఁ బంప
నది భుజించి హర్యక్షము ముదముఁ బొందు, నీవిధంబునఁ జిరకాల మేఁగునంత.

245


క.

పులి కోలుకాఁడు గావున, నలయక వరు నెఱిఁగి వాని ననుపగ నొకనాఁ
డొలసి యొకచెవులపోతుకుఁ, గలయఁగ నిలువరుస యనుచుఁ గ్రక్కునఁ జెప్పున్.

246


గీ.

పలుకు విన్నమాత్రఁ బ్రాణంబు చలియంప, శశక మపుడు మూర్ఛఁ జాలఁ దూలి
తెలిసి కన్ను దెఱచి దృష్టించి తల యూఁచి, దిగులు పుట్టి యాత్మ పగుల నొగిలి.

247


వ.

ఆశశకంబు ముహూర్తమాత్రంబు చింతించి తెలివొంది డెందంబుకొందలం బుడిపి
కొని వృద్ధుం డయ్యును సాహసంబు దెచ్చుకొని తనలో నిట్లని వితర్కించె.

248


క.

క్రూరమృగనిగ్రహోగ్ర, స్ఫారమహాబలమృగేంద్రు సాహస మెసఁగన్
వారింతుఁ ద్రుంతు నొక్కఁడ, సారం బగునాదుబుద్ధిచాతుర్యమునన్.

249


వ.

అని మఱియుం దనమనంబున.

250


క.

బుద్ధికి నశక్య మగుపని, యిద్ధాత్రిం గానఁ గలదె యిదె గెలిచెద నా
బుద్ధిబలంబున సింహము, నుద్ధతి యణఁగించి ప్రాణయుక్తికిఁ బాయన్.

251


క.

అనుచుఁ దలపోసి యాశశ, మనుమానింపుచును గదలునప్పటికి నినుం
డు నభోమధ్యగతుం డగు, డు నతిక్షుత్పీడచేఁ గడుం గ్రోధమునన్.

252


గీ.

అవుడు గఱచి కంఠీరవం బౌర యివ్వ, నమున మృగములు నేఁడు గర్వమున నేచి
దినదినంబును నాకుఁ బుత్తెంచుమృగము, ననుప విది యే మొకొ యనునవసరమున.

253

క.

అడుగులు తొట్రుపడంగా, నడ లొందినయదియ పోలె నయ్యైయెడలన్
బుడమిఁ బడి మ్రొగ్గి లేచుచు, గడుసరి యగుశశక మొయ్యఁ గదియం బోవన్.

254


క.

అప్పుడు చూచి మృగేంద్రుఁడు, నిప్పులు కనుదోయినుండి నెగయఁగ నోరీ
చొప్పడదు వేళ దప్పిన, యప్పటియశనంబు నాకు నహితం బగుచున్.

255


క.

అపరాహ్ణవేళదాఁకం, గపటంబున నిట్లు రానికారణ మేమీ
విపరీతంబులు వుట్టెనొ, విపినంబున నున్నజంతువితతికి నెల్లన్.

256


వ.

అని యివ్విధంబున రోషావేశంబునఁ బలుకుచున్నమృగేంద్రునకు సాష్టాంగదండ
ప్రణామంబులు చేసి శశకం బిట్లనియె.

257


చ.

కినియక చిత్తగింపు మొకకీడును నాదెస లేదు నేఁడు సూ
ర్యునియుదయంబువేళ నను నొక్కమృగేంద్రుఁడు వచ్చి యడ్డగిం
చిన నిది యేల యేలిక భుజింపఁగఁ బోయెడినన్నుఁ బోవని
మ్మనిన వనంబుజంతునివహంబుల కేలిక నేన కానొకో.

258


వ.

అనుచుఁ బెద్దయుం బ్రొ ద్దతండు నన్ను దేవరసమ్ముఖంబునకుఁ బనివిననీక నిలిపి
మఱియు నిట్లనియె.

259


క.

నాకంటె నధికుఁ డెవ్వఁడు, నా కతనిం దెల్చి చూపిన న్నిను మెత్తున్
లేకున్న నిన్నుఁ ద్రుంతుం, గా కని యతఁ డప్పు డనుపఁ గడు భీతిమెయిన్.

260


క.

ఆవిధ మెఱిఁగించుటకై, దేవర యున్నెడకుఁ బాఱుతెంచితి నీకుం
దేవలసినట్టిమృగమును, రా విడువం డనిన నతఁడు రభసం బెసఁగన్.

261


క.

ఏవంక నుండు నాహరి, యేవేళకు నాకుఁ జిక్కు నే నేభంగిన్
భావించి యతనిఁ గదియుదు, నావుడు నాతనికి శశకనాథుం డనియెన్.

262


క.

సింగం బాఁకలిగొని సా, రంగాదిమృగాళి వెనుక రయమునఁ జన నీ
వంగీకరించి కదలుము, వెంగలిమృగరాజుఁ బట్ట వెఱ పేమిటికిన్.

263


క.

అనుపలుకు విన్నమాత్రన, తనమదిఁ గ్రోధానలంబు దరికొన శశకం
బున కనియె నోరి ముందఱ, వనమున వాఁ డున్నదెసకు వడిఁ జను మనుచున్.

264


సీ.

ఆమృగేంద్రుండు మహాజవంబునఁ బాఱ, నతనిముందఱఁ దాను నతిరయమున
నెలయించి చెవులపో తెంతయు దూరంబుఁ, గొనిపోయి మున్ను చూచినయగాధ
జలములు గలకూపసన్నివేశంబున, నిలుచుండి నీశత్రునికి నివాస
యోగ్యంబు నెల విది యూహించి డగ్గఱి, చూడుమా యనఁ దొంగి చూచునప్పు


గీ.

డాత్మదేహంబు కూపజలాంతరమునఁ, గాంచి వేఱొకసింహంబుగాఁ దలంచి
కన్ను గానక మౌర్ఖ్యంబుకతన నుఱికి, యపుడు మృతిఁ బొందె దుర్బుద్ధి యగుటఁజేసి.

265


.

కావున నెంతటిబలవంతు నైనను బుద్ధిబలంబునంజేసి బుద్ధిమంతుండు గెలుచు ననఁ
గరటకుం డట్లకాక నీకుఁ కార్యసిద్ధి యయ్యెడు మరుగు మనిన దమనకుండు పింగళకు
సమ్ముఖంబునకుం బోయి నమస్కరించి యిట్లనియె. దేవరకు నే నత్యంతాపరా
ధంబు చేసితి సంజీవకునిఁ గొలువం బెట్టి తగనిపనిఁ జేసితిఁ గావున నీయపరాధంబు
సహింపవలయు నని యిట్లనియె.

266


క.

పదవిం బొందిన సచివుఁడు, పదఁపడి నృపునెదుట నెట్లుపలికిన నమరున్
బదహీనుఁడు తగుపలుకులు, పదివే లాడినను భూమిపతి కింపగునే.

267


క.

అనినం బింగళకుం డా, తనితో నీ వేమి చెప్పఁదలఁచిన నీకం
టెను హితుఁడు గలఁడె నాయొ, ద్దను వెఱవక చెప్పు మనిన దమనకుఁ డనియెన్.

268


క.

ఈసంజీవకుఁ డెప్పుడు, నాసన్నిధిఁ దప్పనాడి నగుచుండు నినున్
చా సరకుసేయఁ డేమిట, నీసున నినుఁ గొలువఁ జేరనీఁ డెవ్వానిన్.

269


చ.

అదియునుగా కతండు భవదాజ్ఞఁ జరింపక నీప్రభుత్వసం
పదయును మంత్రశక్తియును బ్రాభవశౌర్యమహోద్యమంబులున్
మదమునఁ దప్పనాడును గ్రమంబున నీమహిఁ దాన కైకొనన్
మదిఁ దలపోయు నేఁ దెలిసి మానుగ నీ కెఱింగింప వచ్చితిన్.

270


గీ.

అనిన భయవిస్మయమ్ములు మనముఁ గలఁప, నేమియును బల్కకున్న మృగేంద్రుతోడ
నధిప నీమంత్రి నీకంటె నధికుఁడైన, కతన నభివృద్ధి నీ కెట్లు గలుగు వినుము.

271


గీ.

మహిమ నత్యుఛ్రయుం డగుమంత్రిమీఁదఁ, బార్థివునిమీఁద నొక్కొక్కపదము నిలిపి
నిల్పి స్త్రీస్వభావంబున నిల్వలేక, యుదధికన్యక వారిలో నొకని విడుచు.

272


వ.

అన నతండు వెండియు నిట్లనియె.

273


సీ.

మనుజవరుఁడు నిజామాత్యుగా నొక్కని, నిల్బఁ దద్భారంబు నిర్వహించి
తనరు స్రక్చందనవనితాదిసుఖముల, మోహ మంతంతకు మురియఁబడఁగ
మోహంబుచే గర్వమునఁ గన్ను గానక, గర్వాతిశయమునఁ గానిపనులఁ
జేసి నిజేశ్వరుచే నొత్తు ననుబుద్ధి, నతని నుల్లంఘింప మతిఁ దిలంచుఁ


గీ.

దలఁచి దృఢతరముగ నేలి దళముఁ గూర్చుఁ, గూర్చి రాజ్యంబు తనకుఁ గైకొనఁగడంగుఁ
గడఁగి నృపపక్ష మగువారికడుపు కిడక, కుశలబుద్ధిని బతిఁ గాలవశునిఁ జేయు.

274


వ.

అని మఱియును.

275


ఉ.

పెంచి యనేకసంపదలఁ బ్రీతి వహింపఁగఁ జేసి తన్ను మ
న్నించిన రాజుమీఁదఁ దుది నేరము వెట్టి పరావనీశదే

శాంచితభూరిసంపదల కాసపడున్ పడి హానిఁ బొందు నే
మంచితనంబు దుష్టు లగుమంత్రులకుం గలదే తలంపఁగన్.

276


గీ.

అతిసమర్ధుఁ డై మంత్రి కార్యములు దీర్చు, నపుడు హితమతి గాకున్న నదియుఁ గాదు
మిగుల ననురక్తుఁ డగువానిమీఁదఁ గరుణ, నవనిపతి యున్పకుండిన నదియుఁ గాదు.

277


వ.

అని వెండియు.

278


క.

సేవకులు లోకమందును, శ్రీవిశ్రుతు లైన నేల సేవింతురు ధా
త్రీవిభులఁ దమకు జరగమి, కై వలసినపంపు సేయ నగుఁ గాక మహిన్.

279


వ.

అనినం బింగళకుండు సంజీనకుండు నా కత్యంతస్నేహితుం డెట్లు విడువనేర్తు నని
యిట్లనియె.

280


గీ.

సకలదుష్టదోషసహితదేహం బిది, నాకు నేటి కనెడినరుఁడు గలఁడె
యట్లు నిజహితుండు నప్రియం బొకచోటఁ, గడఁగి చేసెనేని విడువరాదు.

281


వ.

అని పలికి సంజీవకు నుద్దేశించి.

282


ఉ.

నమ్మిక యిచ్చి చేకొని ఘనమ్ముగఁ బూజ్యునిఁ జేసి మాటమా
త్రమ్మున వీఁడు గాఁ డని వృథా బహుదోషము లెన్ని భృత్యు రా
రమ్మని యాజ్ఞ సేయ నగరా నను లోకమువారు వాని నే
రమ్మున వాఁడె పోవుఁ దెగ రాదు కలంపకు నాదుచిత్తమున్.

283


వ.

అనిన విని దమనకుం డిట్లనియె.

284


ఉ.

ఎంతయు గారవించి తను నింతయమాత్యునిఁ జేసి రాజ్య మి
ట్లంతయుఁ జేతి కిచ్చి యనయమ్మును దేవర నమ్మి యున్నచో
గొంతయినం దలంపక నిగూఢముగా మహి యెల్లఁ గైకొనన్
జింత యొనర్చు టే నెఱిఁగి శీఘ్రమ నీ కెఱిఁగింప వచ్చితిన్.

285


వ.

మఱియును.

286


గీ.

అన్నదమ్ముఁడైన నాత్మజుం డైనను, సచివపదవిఁ బనులు జరుపుచోట
దానిమీఁదృష్టి వదలినయప్పు డా, రాజుఁ బాయు నిందిరావధూటి.

287


చ.

సుజనహితోక్తి కర్ణముల సోఁకఁగనీయ కహర్నిశంబునుం
గుజనులబుద్ధి చిత్తమునఁ గూర్చి సరాష్ట్రము గాఁగ నమ్మహీ
భుజుఁడు నశించు రోగి తనబుద్ధి నపథ్యమె పథ్య మంచు న
క్కజముగ నాత్మలోఁ దలఁచి కాలవశంబును బొందుచాడ్పునన్.

288


ఉ.

అప్పటి కప్రియం బయి నిజాత్మకు మీఁదటికిన్ బ్రియంబుగాఁ
జెప్పెడు వాక్యముల్ విను సుచిత్తుఁడు నిచ్చక ముజ్జగించి మేల్

తప్పక చెప్పు నుత్తముఁడు ధారుణిఁ బుట్టరు పుట్టిరేని న
య్యొప్పెడివారల న్విడువకుండు రమాసతి యెల్లకాలమున్.

289


క.

ప్రాఁత యగుమంత్రి తనకుం జేఁతఱికముఁ జేసె ననుచు శిక్షించి యొరున్
లాఁతిం బెట్టిన నీఁతలు, మ్రోఁతలు నై రాజు విడుచుఁ బొందక మూఁకల్.

290


సీ.

పాటించి తన ప్రాఁతపరివారమును బ్రోచి, హత్తిననృపునకు హాని గలదె
మొన పేర్చి వైరులు మోహరించినవేళఁ, గేడింప కప్పుడె గెలుచు టొండె
మొనసి దైవాధీనమున నపజయ మైన, భూపాలుఁ గప్పి కొంపోవు టొండె
నర్ధంబు దఱిఁగిన నధిపతి ధన మిచ్చి, నడపలే కుండిన నవయు టొండె


గీ.

నెవ్విధంబున నైన మహీశువలని, మన్ననకుఁ జాల నిలుతురు మఱవ కెపుడు
విడువకుండుదు రెటువంటి వేళలందుఁ, బూర్వపరివారమును బోల్పఁ బురుఁడు గలదె.

291


క.

అనినం బింగళకుం డి, ట్లను సంజీవకున కభయ మట్లొసఁగి పద
స్థునిఁ జేసి ప్రీతి యొనరిం, చిన నా కె గ్గతఁడు లోనఁ జింతించునొకో.

292


వ.

అనిన దమనకుం డిట్లనియె.

293


గీ.

ఎంతసఖ్యంబు జేసిన నెంతప్రియము, చేసి తిరిగిన దుర్జనుచిత్త మేల
చక్కటికి వచ్చు శునకపుచ్ఛంబు కడఁగి, వంక యొత్తినఁ జాయకు వచ్చు నెట్లు.

294


క.

కొఱ యగుపదార్థ మెందుం, గొఱ యగుఁ గొఱ గాని దైనఁ గొఱ గా దెచటన్
నెఱి నమృతధారఁ బెంచినఁ, గొఱ యగునే ముసిఁడి కల్పకుజముంబోలెన్.

295


ఉ.

వారక యుత్తముండు దనవారి కపాయము వచ్చువేళ ము
న్నారసి చెప్పి తీర్చును దురాత్ముఁ డెఱింగియుఁ జెప్ప కాత్మ ని
ష్కారణవైర మూఁది తనగాదిలిచుట్టము నైన నిర్దయా
కారత నొంచుఁ గొండియముఁ గైకొను నొందులచేటుకు న్నగున్.

296


వ.

అని వెండియు నిట్లనియె.

297


సీ.

వ్యసనదూరుం డైనవాఁడె పో సిద్ధుండు, గీర్తితం బగునదె వర్తనంబు
పురుషానుకూలతఁ బొగ డొందునదె భార్య, బుధవర్ణనీయుండె బుద్ధియుతుఁడు
మదముఁ జేయక యుండునదె మంచిసంపద, యాశావిహీనుండె యధికసుఖుఁడు
కపటస్వభావనిర్గతుఁడె సన్మిత్త్రుండు, విజితేంద్రియుండె వివేకఘనుఁడు


గీ.

కారణము లేకయును బరకార్యములకు, నోపి తీర్చినయాతండె యుత్తముండు
సమరరంగంబునం దధీశ్వరునిపనికి, వెనుకతీయనియాతండె వీరభఁటుడు.

298


వ.

అని పలికి దమనకుండు సంజీవకునిమీఁదఁ బింగళకునిచిత్తంబు తిరుగంబడకుండుట
యెఱింగి యిట్లనియె.

299

సీ.

అధికకామాసక్తుఁ డైనభూపాలుండు, మొనసి కార్యాకార్యముల నెఱుంగ
కత్యంతమదఘనాహంకారయుక్తుఁడై, సన్మార్గ మరుచిగా సంచరించుఁ
దొడరి భృత్యామాత్యదోషవిచారంబు, చాలక శిక్షింప శక్తి లేక
యపవాదకంటకాయతశోకగహనంబు సొచ్చి, వెల్వడు నట్టిచోటు గాన


గీ.

కహితమృగములచే నొండె నాత్మభృత్య, దావపావకపటుశిఖాతతుల నొండె
రీతిఁ జెడుఁ గాని మఱి సేకరింపలేఁడు, శౌర్యగుణధామ మృగకులసార్వభౌమ.

300


వ.

అని చెప్పినఁ బింగళకుఁ డిట్లనియె సంజీవకుండు నాకుఁ బ్రతికూలుం డై కీడు సేయ
సమర్థుం డగునే యనిన దేవర కవ్విధంబున మున్న విన్నవింపవలసినవాఁడనై యుం
డియు మంత్రభిన్నం బైనఁ గార్యంబు దప్ప దని శంకించితి మంత్రం బతిప్రయత్న
రక్షణీయంబు గావలయు విజ్ఞాతశీలాచరణుం డగుశాత్రవు విశ్వసించి మయిమఱచిన
నతం డేమి సేయ నోపండు విజ్ఞాతశీలాచరణం బగుడిండికంబుచేతం గాదె మందవిస
ర్పిణి మృతిం బొందె ననుటయు బింగళకుండు తత్కథాక్రమం బెట్లనుటయు నతఁ
డిట్లనియె.

301


క.

మందవిసర్పిణి యన నా, నందముతోఁ జీరపేను నరపతిశయ్యం
బొందుకొని పెద్దకాలం, బెందుం బో కచట నుండు నిష్ట మెలర్పన్.

302


క.

అచ్చోటికి నొకతెఱఁగునఁ, గ్రచ్చఱ నరుదెంచి డిండికం బను నామం
బచ్చుబడిననల్లి మదిం, బొచ్చెము లే కనియె యూకపుంగవుతోడన్.

303


శా.

నీపాదంబుల కేను మ్రొక్కెదఁ దగ న్నీవాఁడ నీచుట్టముం
గాపాడం దగు నన్న యూక మకటా కైవార మింతేటికిన్
నాపుణ్యంబున వచ్చి తిచ్చటికి ధన్యం బయ్యె మద్వంశ మీ
భూపశ్రేష్ఠునిపాన్పునందు సుఖినై పూజ్యుండ నైతిం జుమీ.

304


వ.

అని మఱియును.

305


క.

న న్నేమియడుగుకొఱకై, సన్నుతగుణ ప్రియము చెప్పఁ జనుదెంచితి నా
యున్నయది హీనవృత్తము, కన్నారఁగఁ జూచి యేమి కాంక్షింతు వనా.

306


వ.

అనిన నమ్మాటకు జండికాఖ్యం బగుమత్కుణం బిట్లనియె.

307


సీ.

కలిమిలేములు చూచి కాంక్షించునా యర్థి, తనకు నక్కఱ యైనఁ దగులుఁ గాక
యితఁడు లోభి వదాన్యుఁ డితఁ డని యెఱుఁగునా, యర్థంబు కాంక్షఁ బెల్లఱచుఁగాక
హీనాధికంబుల నెఱిఁగి యాచించునా, లేమికై యెరులఁ గారించుఁ గాక
విద్య లే దని తన్ను వివరింప నేర్చునా, సభల విత్తాపేక్షఁ జదువుఁ గాక


గీ.

తెల్ల బట్టలవార్వెంట నెల్లఁ దిరిగి, తనదు నేర్పున నడుగంగ దాత మెచ్చి
యర్థ మిచ్చిన నలరు లోభానుకూల, చిత్తుఁ డీకున్న నంతటఁ జిన్నవోవు.

308

వ.

అని పలికి డిండికుండు వెండియు నిట్లనియె.

309


గీ.

అర్థి తారతమ్య మడుగంగఁ జెప్పితి, నర్థకాంక్ష నిన్ను నడుగ రాను
మిత్త్ర నాకు నశనమాత్ర మింతియ నీవు, చేయవలయునట్టిసాయ మెల్ల.

310


ఉ.

మానక మున్ను నేఁ జెనఁటిమానవరక్తముఁ ద్రావుచుండుదుం
గాని మహీశుదేహమునఁ గల్గినశోణిత మానఁ గానమిన్
మే నెరియంగ నుండి నిను నేఁడు గనుంగొన నిందు వచ్చితిన్
దీనికి నీయకొ మ్మిటు మదీయమనఃప్రమదంబు చెల్లఁగన్.

311


వ.

ఇవ్విధంబున నువ్విళ్ళూరిన కారణం బెట్లంటేని.

312


సీ.

శాల్యన్నఘృతసూపశాకభక్ష్యములతో, వాసన గలరసావళులతోడ
బహుఫలంబులు గలపానకంబులతోడఁ, గమనీయమాంసఖండములతోడ
మధురేక్షుగోక్షీరమధుపానములతోడ, సరసంబు లైనపచ్చళ్ళతోడ
సుమనోగ్రదధితక్రశుద్ధజలములతోఁ, బరిమళగంధపుష్పములతోడఁ


గీ.

జతురశృంగారవతు లైనసతులతోడ, ననుదినంబును భోగించునవనిపతుల
దేహరక్తంబుఁ గ్రోలంగ నూహ చేసి, తిరుగుచుండుదుఁ గాని సిద్ధింప దెందు.

313


వ.

అనుడిండికంబుపలుకు లాకర్ణించి కటకటంబడి మందవిసర్పిణి యిట్లనియె.

314


చ.

చలనము లేక యీనృపతిశయ్య నహర్నిశమున్ సుఖించునా
మెలఁకువ హానిచేయుటకు మేకొని రాఁదగునయ్య దోషకా
రులు సుజనాపకారములు రోయుట నైజము గాన నీకు నే
నలుగుదుఁ గాని యించుకయు నాత్మ నొడంబడ మత్కుణోత్తమా.

315


వ.

అనిన మందవిసర్పిణికి డిండికుం డిట్లనియె.

316


క.

నీదగు నెలవున నాకుం, గా దవు నన బలిమి లేదు కరుణాన్విత నీ
పాదముల కేను మ్రొక్కెద, వా దడవక సమ్మతింపవలె నన నదియున్.

317


వ.

దాక్షిణ్యంబుకతంబున నొడంబడి యిట్లనియె.

318


క.

వెర వెఱిఁగి వేగిరింపక, సురతశ్రమపారవశ్యసుఖసుప్తిమెయిన్
బొరసినధరణీకాంతుని, వరదేహం బొయ్యఁ గఱచి వలయుఁ దొలంగన్.

319


క.

కక్కురితకాఁడు కార్యము, చక్కటి యెఱుఁగండు సంధ్యజామున నతనిన్
బొక్కిపడ నీవు కోఱల, నొక్కిన నది తెలియ మన కనువు దప్పుఁ జమీ.

320


గీ.

అనిన నట్ల కాక యని నల్లియును జీర, పేను నేకశయ్యఁ బ్రీతి నుండఁ
బేనుకన్ను మొఱఁగి ప్రియపడి భూమీశుఁ, గదిసి సందెజామె కఱచె నల్లి.

321

వ.

అప్పు డమ్మహీపతి నిద్రావిరహితుండై యుండుటం జేసి యదరిపడి తనపదతలంబు
లొత్తుచున్న యనుచరుల నాలోకించి యిట్లనియె.

322


ఉ.

దీవియఁ దెచ్చి చూడుఁడు మదీయశరీరము తేలు కుట్టిన
ట్లే వెత పొందెడుం గడు రయంబున రం డన వాండ్రు వచ్చునా
లో వివరాంతరంబునకు లోఁగినమత్కుణనాథుఁ గాన కా
భూవరుపాన్పుమధ్యమును బొందినమందవిసర్పిణిం దగన్.

323


క.

పొడగాంచి యిదియె కఱిచెం, బుడమిధవునిదేహ మనుచుఁ బొడవడఁగింపన్
మడిసెను మందవిసర్పిణి, కడు దుర్జనుపొందు హాని గా కేలుండున్.

324


వ.

అని యిట్లు దమనకుండు చెప్పిన విని పింగళకుండు నాపరాక్రమం బెఱింగియు
సంజీవకుఁ డెయ్యైసాధనంబుల నన్ను సాధించువాఁ డనుటయు నతం డిట్లనియె.

325


ఉ.

కొమ్ముల గ్రుచ్చి యెత్తియును ఘోరఖురాగ్రనిపాతనంబులన్
జిమ్మియు దంతఘాతములఁ జించియు వాలవిశాలచాలనో
గ్రమ్ముల నెమ్ము లెల్లఁ గడికండలు గాఁ జదియంగ మోఁదియున్
సమ్మద మారఁ జించు మృగసత్తమ యేమఱి యుండితేనియున్.

326


వ.

అనిన విని పింగళకుండొక్కింత చిత్తక్షోభంబుగా దమనకుం జూచి నీ వింతట నరిగి
యావృషభనాయకుని యభిప్రాయం బెఱిఁగి శీఘ్రంబ రమ్మన్న వాఁడును నంతంత
నొదుఁగుచుఁ జకితుండునుంబోలె సంజీవకుం జేరం బోయిన నతం డిది యేమి భయ
కంపితుండ వగుచుఁ జనుదెంచితివి కుశలంబ కదా యనిన సేవకధర్మంబునం దిరుగు
వారికి సంసారసుఖంబు గలదే విను మని యిట్లనియె.

327


ఉ.

ఇంతటివానిఁ జేసె నృపుఁ డింతధనం బొడఁగూడెఁ బక్ష మ
త్యంతము నాపయిం గల దయత్నసుఖానుభవంబు దీర్ఘకా
లాంతరసంచితం బని నిజాత్మఁ దలంచును బాలిశుండు ప్రా
ణాంతము గాఁ దలంచి చలితాత్మత నుండు వివేకి యిమ్మహిన్.

328


వ.

అని చెప్పి మఱియును.

329


సీ.

ధనవంతు గర్వంబు దార్కొన కేలుండు, వ్యసని కాపద యేల పొసఁగకుండు
సతులఁ జూచిన మతి చలియింప కేలుండు, నృపులమన్నన లేల నిజము లగును
గాలంబుచే రూపుకడచన కీలుండు, గౌరవ మర్థి కేకరణిఁ గలుగు
దుర్జనవాగురఁ దొడర కెవ్వఁడు నిల్చుఁ జిరకాలసుఖము నేనరుఁడు పొందుఁ


గీ.

గాని గుణములు విడిచి పుణ్యానుకూల, వర్తనంబుల నిహపరవైభవములఁ
బొందువాఁ డొక్కఁ డొక్కఁడు పుణ్యపురుషుఁ, డతఁడు దేవాంశజనితమహాత్ముఁ డండ్రు.

330

గీ.

దేశకాలధనాగమస్థితులఁ దెలిసి, యరులు మిత్త్రులుఁ దన కెవ్వ రని యెఱింగి
యెవ్వఁ డైనను నాశక్తి యిట్టి దనుచు, నధిపుఁ డెప్పుడుఁ జింత చేయంగవలయు.

330


వ.

అనిన విని సంజీవకుం డచ్చటి రాజకార్యప్రసంగం బెద్ది యనినఁ గదియం జని కూర్చుం
డి యల్లన నిట్లనియె.

331


క.

ఏకాలంబున రాజులఁ, జేకొని సేవకులు నమ్మి చెడు టది సిద్ధం
బీకొలఁది నే నెఱింగితి, నీకుం జెప్పంగఁ దగు ననింద్యచరిత్రా.

332


వ.

అనుచు నేకాంతంబున నిట్లనియె.

333


ఉ.

ఎప్పుడు మోసపోవక మృగేంద్రునిపైఁ దగువేగు వెట్టి తెం
పొప్పఁగ నాయతం బయిన నోపిక ముట్టినకార్య మైనచోఁ
దప్పక నిర్వహించుకొని ధాత్రికి నీవ యధీశ్వరుండ వై
చొప్పడకున్న మాబ్రతుకు సూవె వృథా వృషభాధిపోత్తమా.

334


వ.

అనిన సంజీవకుం డదరిపడి మృగేంద్రుని కరుణాకటాక్షంబు నాయెడ శిథిలంబు గా
దు గదా యనిస నతం డేకాంతంబుగా నిట్లనియె.

335


క.

విపరీతచిత్తవృత్తునిఁ, గపటి దయారహితుఁ జపలు గాంభీర్యగుణ
వ్యపగతు రా జని కొల్చిన, నపరాధము లేకయైన నాపద వచ్చున్.

336


వ.

అని మఱియును.

337


చ.

కొలువున కీవు రాఁ దడవ ఘోరకరాళవిశాలదంష్ట్రలన్
మెలఁగఁగ నిన్నుఁ బట్టి బలిమిన్ గళరక్తము మున్ను గ్రోలి క
ట్టలుక నిజాశ్రితప్రతతి కంతటికిన్ భవదీయమాంస మ
గ్గలముగఁ బంచి పెట్టుటకుఁగా నియమించె మృగేంద్రుఁ డుగ్రతన్.

338


వ.

ఇత్తెఱంగు నేఁడ కాదు పెద్దకాలంబునుండియుఁ బింగళకుండు నీనామంబు ప్రసంగ
వశంబునం గొలువులోపల వినంబడినయప్పు డసహ్యతయుఁ బ్రజ మెచ్చు
నీపారవశ్యంబును మెచ్చమియును నీవార లైనవారలయెడ నాగ్రహంబును నీవు
వెలిగాని సంపద కసూయయు నీయొప్పమికిఁ బ్రియం బందుచిత్తంబును నై యున్న
వాఁడు మున్ను నీకు శపథం బిచ్చి కొలిపించుటంజేసి యివ్విధంబునం దెలుపం
జనుదెంచితి నీకుఁ బొందైనతెఱంగు జూచుకొ మ్మనిన సంజీవకుం డత్యంత
దుఃఖాకులుం డగుచు నిశ్చేష్టితుం డై యూరకుండి కొండొకసేపునకు దమనకుం
జూచి యిట్లనియె.

339


ఉ.

పూని దురాత్మగమ్య యగుపొల్తుక చక్కదనంబుఁ బాత్రస
న్మాన మెఱుంగలేనినరనాథునివేకముఁ గష్టవృత్తిమై

నానినలోభిసంపద మహాంబుధిలోపలఁ బర్వతంబులం
దూనినవర్షధారలును యోగ్యము గావు నిరర్థకంబు లౌ.

340


క.

ఆరాధ్యమానుఁ డగునృపు, నారాధన దనకు లేమి యది గల దంచున్
గోరి యపూర్వప్రతిమా, కారము గైకొనుట వైరకారణ మరయన్.

341


క.

నేరమున కలుగు భూపతి, చేరువనె ప్రసాద మొందు సేవకులపయిన్
నేరము లేకయె యలిగెడు, భూరమణునిమనసు ప్రీతిఁ బొందునె యెపుడేన్.

342


వ.

అని పలికి వెండియు.

343


సీ.

రాత్రులు సరసిలో రాజహంసము చొచ్చి, నవసితోత్సలఖండనంబు సేయు
తఱిఁ బ్రతిబింబితతాలౌఘములఁ జూచి, యవియ కైరవపఙ్క్తి యని తలంచి
ముక్కునఁ బొడుచుచు నక్కడ వృథ యైనఁ, దక్కినపుష్పసంతతియుఁ గల్ల
గాఁ జూచు నేగినఁ గన్నులఁ గనియును, బొడువ శంకించుచుఁ గుడుపు దక్కి


గీ.

నిలుచుఁ గల్ల నిజంబును నిజము కల్ల, యు నని స్వాత్మకుఁ దోఁచు నొక్కొక్కవేళ'
దాను మూఢాత్మతను మున్ను తప్పఁ దలఁచి, నాఁడ నని చూడఁ డెన్నండు నరుఁడు మదిని.

344


క.

నెపము గలకోపమైనను, నృపుచేఁ బడవచ్చుఁ గాక నెప మేమియు లే
కపరాధంబులు వెదకెడు, కపటాత్మునిఁ గొలువ వశమె కలకాలంబున్.

345


వ.

అని పలికి సంజీవకుండు దమనకున కిట్లనియెఁ బింగళకుండు పరప్రణీతవ్యాపారసంగ
తుండు గాఁబోలు నని మఱియు నిట్లనియె.

346


గీ.

వైద్యవిద్వజ్ఞనామాత్యవర్యు లేధ, రాధిపున కిచ్చ లాడుదు రావిభుండు
సంతతారోగ్యధర్మతోషముల వృద్ధిఁ, బొంద నేరక శీఘ్రంబ పొలిసి పోవు.

347


వ.

అని పలికి సంజీవకుండు మఱియు నే నీరాజునకుఁ గీడు దలంచుట లేదు నాయెడ
నిర్నిమిత్తాపకారి యయ్యెఁ జూచితే యని యిట్లనియె.

348


శా.

భావాతీతము లైనకార్యములు దీర్పన్ మెచ్చఁ డెల్లప్పుడున్
సేవాభక్తివిహీనదుర్మతుల రక్షించు న్మహీభర్త దా
నేవాఁ డైనను రాజులం గొలుచు నే ర్పేభంగులం గల్గు హా
సేవాధర్మము యోగి కైన వశమే చింతింప నీధాత్రిలోన్.

349


క.

గుణులం జేరినపురుషుఁడు, గుణి యగు నవగుణులఁ గూడి గుణహీనుఁ డగున్
బ్రణుతికి నెక్కిననదులు ల, వణజలధిం గూడి చెడినవడువున నెందున్.

350


గీ.

మంచిగుణములు గలయట్టిమనుజునందు, స్వల్పగుణ మైన నది ప్రకాశంబు నొందు
శ్వేతగిరిశిఖరంబుపై శీతకరుని, కిరణజాలంబు మెఱవడిఁ బొరయుకరణి.

351

గీ.

కానిగుణములు కలయట్టివానియందు, మంచిగుణములు పైకొని మించలేవు
సురుచిరోరునిశాకరకిరణజాల, మంజనాద్రిపైఁ బ్రసరించి యడఁగినట్లు.

352


వ.

అని మఱియును.

353


చ.

ఖలునకుఁ జేసినట్టియుపకారము విశ్రుతశబ్దజాలదు
ర్బలున కుపన్యసించినసుభాషితవర్గము మూఁగవానితోఁ
బలికినవాక్యపద్ధతులు భావమునం దనమాటపాటిగాఁ
దలపనివానికిన్ బహువిధంబుల బుద్ధులుఁ గానిపద్ధతుల్.

354


సీ.

దారుణాటవిరుదితంబుఁ జేసినయట్లు, చేరి శవంబుఁ గైచేసినట్లు
నిర్జలం బైనచో నీరజం బిడినట్లు, వట్టిచోటను విత్తు వెట్టినట్లు
సారమేయముతోఁకఁ జక్కఁ గట్టినయట్లు, చెవిటి కేకాంతంబు చెప్పినట్లు
తనరఁ జీకునకు నద్దంబుఁ జూపినయట్లు, వెలిమిడిలో నెయ్యి వేల్చినట్లు


గీ.

చాల నవివేకి యైనట్టిజనవరేణ్యుఁ, దగిలి కొలుచుట నిష్ఫలత్వంబు సేయు
సేవకుల కెల్లభంగి విశేషబుద్ధి, నిల వివేకంబు గలరాజుఁ గొలువవలయు.

355


గీ.

మొనసి యల్లంతఁ గని ధూర్తు మ్రొక్కు లేచు, నార్ద్రహృదయుఁ డై యొసఁగు నర్థాసనంబు
బిగియఁ గౌఁగిటఁ గదియించుఁ బ్రియము వలుకు, నిషము నమితంబులోనను వెలిని గాన.

356


మ.

రవి యస్తాద్రికి నేఁగునప్పుడు విచారం బేది మత్తాళి లో
భవశేచ్ఛన్ వెసఁ బంకజోదరము దర్పం బేర్పడం జొచ్చి త
ద్వివరం బంతటఁ గమ్ముకొన్నఁ గడు నార్తిం బొందుచందాన మా
నవులుం గొందఱు మీఁ దెఱుంగ కెలిమిన్ వర్తింతు రీలాగునన్.

357


వ.

అని చెప్పి మఱియును.

358


చ.

శరనిధి దాఁట నావయును సంతమసం బడఁగింప దీపమున్
వరకరిశిక్ష కంకుశము వాయువుఁ గూర్పఁగఁ దాళవృంతమున్
వెరవునఁ జేసె బ్రహ్మ పదివేలవిధంబుల మూర్ఖచిత్తువి
స్ఫురణ మడంపలేక తలపోయుచు నిప్పుడు నున్న వాఁ డహా.

359


వ.

అని పలికిన సంజీవకుం డిట్లనియెఁ దృణాహారవ్యవహారంబునఁ బతిహితకార్యంబు
చేయునాకుఁ గాలముఖప్రవేశంబు కర్తవ్యం బయ్యె నింక నేనెక్కడిబ్రతుకు విను మని
యిట్లనియె.

360


గీ.

ఎన్న నిప్పుడు పెద్దలు పిన్న లనక, వితతమాయోపజీవితయుతులు గాన
సాధులకుఁ గీడు దలఁతురు జగతి నుష్ట్ర, మునకుఁ గాకాదు లేక మై మొనసినట్లు.

361


వ.

అనిన విని దమనకుం డక్కథ నాకెఱింగింపు మన్న సంజీవకుం డిట్లనియె.

362

చ.

అతులమహోగ్రకాననమునందు మదోద్కటనామసింహ ము
ద్ధతిఁ జరియించు దానికిఁ బ్రధానులు కాకము పుండరీకమున్
మతిగలజంబుకంబును గ్రమంబునఁ బం పొనరింపుచుండి యొ
క్కతఱి నరణ్యదేశమునఁ గాంచిరి యుష్ట్రము నిండువేడుకన్.

363


మ.

కని నీ వెచ్చటనుండి వచ్చి తనినం గాకాదిజంతుత్రయం
బునకున్ వందన మాచరించి యనియెన్ మున్ సార్ధవాహుండు వీఁ
పున మోపింపఁగ మోసి డస్సి యెచటం బోలేక దాగున్నవాఁ
డను మీ రేగతి నన్నుఁ బ్రోచినను వేడ్క న్నిల్తు మీచేరికన్.

364


వ.

అని పలికినయుష్ట్రంబునకు జంబుకం బిట్లనియె.

365


క.

ఈకాన నొకమృగేంద్రుఁడు, చేకొని సామ్రాజ్యపదవిఁ జెన్ను వహించున్
మా కతఁడు కులస్వామిగఁ, గైకొని సేవింతు మెల్లకాలము కడఁకన్.

366


క.

నీవును మాలో నొకఁడవు, గావున మృగరాజుసమ్ముఖంబున నిడి నే
నీవిధముఁ దెలియఁ బలికి శు, భావహ మగుభంగి నీకు ననుసంధింతున్.

367


చ.

వెఱవక విశ్వసింపు మము వింతగఁ జూడగఁ వచ్చితేని ని
న్నెఱుకపడన్ మృగేంద్రునకు నింపుగఁ జెప్పి తదీయభ క్తికిన్
గుఱుతుగ నిన్నుఁ జేసి మనకోరిక లెల్ల నతండు దీర్పఁగా
నెఱసినవేడ్క నల్వురము నెమ్మది నుండుద మెల్లకాలమున్.

368


క.

అనుటయు నాలొట్టియయును, దనమది ముద్ద మంది వెంటఁ దగిలిన వానిం
గొని చని మృగపతిముందట, వినయముతో నతని తెఱఁగు వినిపించుటయున్.

369


వ.

ఆమృగేంద్రుండును నయ్యుష్ట్రంబు నభయవాక్యంబులఁ బ్రమోదం బెసంగం జేసి
కథనకనామధేయం బిడి నాపూర్వామాత్యులలో నీ వొకండవై యుండు మని నియ
మించిన గోమాయుపుండరీకకాకంబులం గలిసి యతిస్నేహంబునఁ బెద్దకాలం బున్న
సమయంబున నొక్కనాఁడు మదోత్కటుండు కాకవ్యాఘ్రగోమాయూష్ట్రం
బులం గనుంగొని యిట్లనియె.

370


ఉ.

కల్యమునందు భక్ష్యమును గానక మేను కృశించె రోగదౌ
ర్బల్యము నాకుఁ గల్గుటను భద్రగజేంద్రశిరఃపలాదబా
హుల్యము లేమి నుద్ధతికి నోపక చిక్కితిఁ గాన దేహవై
కల్యము మానుకైవడి సుఖం బగుపథ్యముఁ దెచ్చి పెట్టుఁడీ.

371


వ.

అని పలికిన మృగేంద్రునకు నన్నలువురు నేకవాక్యంబుగా నిట్లనిరి.

372

గీ.

మీకుఁ దగినయాహారంబు మేము దెచ్చి, ప్రీతి నొకపూఁట కైనను బెట్టలేము
చాల నల్పుల మగుట మాచంద మట్టి, దనిన మృగరాజు వారితో ననియె నపుడు.

373


క.

ఏపాటియశన మబ్బిన, నాపాటిం బ్రొద్దు గడపి యట్లుండెద నా
కీపాపపుఁదెవు లొదవెం, జూపోపక దైవ మిట్లు సొం పడఁగించెన్.

374


వ.

అట్లు గావున.

375


క.

వడిఁ బోయి మీర లిప్పటి, కడిదికి నేమాంస మైన గ్రక్కునఁ గొనిరం
డెడ సేయ కనుచుఁ బనిచినఁ, గడు వడి నలువురును బోయి గహనములోనన్.

376


గీ.

పొదలు సొచ్చి చూచి పుట్టలు వీక్షించి, చెట్టు గుట్ట మొదలు చేరి కాంచి
గిరులు నదులుఁ దొనలు బరికించి పరికించి, కాన నొకమృగంబుఁ గానలేక.

377


వ.

కాకవ్యాఘ్రగోమాయూష్ట్రంబులు నలుదిక్కులం జెదరి వెదకం బోయి కథన
కుండు వెలిగా నొక్కచో మువ్వురుఁ గూడుకొన్న సమయంబునఁ గాకం బిట్లనియె.

378


గీ.

స్వామిపని పూని వచ్చినచందమునకు, నడవిలోపల నేమియు నబ్బదయ్యెఁ
గంటకాహారుఁ డైనయాకథనకాఖ్యు, నతని కాహారముగఁ జేయ ననువు గాదె.

379


వ.

తచ్ఛేషంబును మనకుఁ గొన్నిదినంబు లుదరపోషణంబునకుఁ జాలు గతకాలంబున ననే
కమృగమాంసంబుల మనలఁ బోషించిన రాజున కీసంకటంబుఁ బాపం దగదే యనినఁ
గాకంబునకు నవి యిట్లనియె.

380


గీ.

అభయ మిచ్చి కరుణ నందఱకంటెను, విభవ మిచ్చినట్టి విభుని మొరఁగి
మనము వీనిఁ జంప మది నెఱింగినయేని, నాగ్రహించి మనల నాజ్ఞ చేయు.

381


క.

పేరెఱుకమాత్ర నధిపతి, చేరువ నంతంతఁ దిరుగుచిఱుతని నైనం
గారించెనేని సచివుని, భూరమణుఁడు గినియు వీనిఁ బొసఁగునె చంపన్.

382


వ.

కావున మనస్వామి యెఱుంగకయుండ నతనిఁ జంపుట కార్యంబు గా దనినఁ
బుండరీకజంబుకంబులకుఁ గాకం బిట్లనియె.

383


గీ.

చావు తథ్యంబు మనకు విచార మేల, పెక్కు దివసంబు లాఁకటి పెల్లుకుడుచు
హరికి నెచ్చోట నేమియు దొరకదయ్యె, నరయ నింతకు దైవికం బట్ల కాదె.

384


మది నధికక్షుధార్తుఁ డగుమానవుఁ డాలిని బిడ్డ నొల్లఁ డిం
పు దనర సర్పముం దనకుఁ బుట్టినయండములన్ భుజించు నొ
ప్పు దఱిగినట్టిచోటను బుభుక్షితుఁ డై దురితంబు చేయఁగా
మదిఁ దలపోయకుండునె ప్రమాదము పుట్టుఁ దొలంగిపోదమా.

385


వ.

అనినఁ గాకంబునకు శార్దూలం బిట్లనియె మనస్వామి మహావ్యాధిపీడితుండును
బుభుక్షితుండును నై యున్నయెడఁ దొలంగిపోవుట భృత్యన్యాయంబు గా దతని

సమ్ముఖంబునకుం బోవుద మని కదలునంతం గథనకుఁడుం గూడుకొన్న నన్నలువురుం
జని సింహంబుబహిర్ద్వారంబునఁ గథనకుని నిలిపి మువ్వురుం జని మదోత్కటునకుం
బ్రణమిల్లి యిట్లనిరి.

386


గీ.

అధిప గిరిగహ్వరముల కుగ్రాటవులకు, నరిగి యామిష మబ్బక తిరిగి తిరిగి
చిక్కితిమి నీవు చిక్కి నశింప నేల, విన్నవించెద మే మొకవెరవు వినుము.

387


గీ.

కథనకుండు మిమ్ముఁ గార్యార్థియై వచ్చి, కొలిచినాఁడు గాని నిలువలేదు
వాఁడు నీకు మాకు వలయుభోజన మగుఁ, బ్రియము వదలి మట్టుపెట్టితేని.

388


వ.

అని కాకంబు పలికిన విని మృగేంద్రుండు కర్ణస్పర్శపూర్వకంబుగా హరిస్మర
ణంబు సేయుచు నభయవాక్యంబు లొసంగి కొలిపించుకొని యిట్లు సేయం దగునే
విను మని యిట్లనియె.

389


మ.

ధనదానంబును నన్నదానమును గోదానంబు భూదానమున్
విను మిట్లీయభయప్రదానమునకు న్నిక్కంబు తుల్యంబు లౌ
ననరా దీయెడ నశ్వమేధమఘపుణ్యంబు భయభ్రాంతుఁ గా
చినపుణ్యంబునఁ బోల దంచు సుజనుల్ చెప్పంగ వింటిం దగన్.

390


వ.

అనినఁ గాకం బిట్లనియె.

391


గీ.

కులముకొఱకు విడుచుఁ గొఱగాని పుత్రునిఁ, గులము విడుచు నూరు నిలుపుకొఱకు
భూమికొఱకు విడుచు బోరన గ్రామంబు, ధాత్రి విడుచు నృపుఁడు తనకుఁగాను.

392


వ.

కావున మే మందఱముం గలిగియుఁ బ్రయోజనంబు లేదు సకలజంతురక్షకుండ వగు
నీశరీరంబు నిలిచినం జాలు నాదేహం బీపూఁట కాహారంబు సేయ నవధరింపు మని
వాయసంబు పలికిన విని మృగపతి యూరకున్న యెడ లబ్ధవకాశులై తక్కిన
మువ్వురుం గూడుకొని యతనిముందఱ నిలిచి యుండ వాయసంబు మఱియు నిట్లనియె.

393


గీ.

తప్పఁ జూచి నన్ను మెప్పింపఁజాలవు, చాలకున్న నేన చత్తు నాశ
రీరమాంస మిపుడు ప్రియమున భక్షింపు, మనఘ నాకు దీన నగు ముదంబు.

394


వ.

అనినం గాకంబునకు సింహం బిట్లనియె.

395


గీ.

అల్పమాంస మిందు నాప్యాయనము గాదు, వట్టిహింస నాకుఁ గట్ట నేల
యనిన నాలకించి యమ్మగేంద్రునితోడ, జంబుకంబు పలి'కె సామ్యఫణితి.

396


క.

నాదేహము నీ కిచ్చితిఁ, గా దనక భుజింపు స్యామి కార్యము సేయం
బ్రోది గలనాకు నిదె నీ, పాదంబులె దిక్కు సూవె పరమార్థముగన్.

397


వ.

అనిన విని మదోత్కటుండు కాకంబుతోడఁ బల్కినట్ల యమ్మృగధూర్తంబునకుం
బ్రత్యుత్తరం బిచ్చినఁ బులి కదియం జనుదెంచి సాష్టాంగనమస్కారంబు చేసి వినయ

పూర్వకంబుగా నిట్లనియె.

398


క.

ఎవ్వరు నేటికి నామెయిఁ, గొవ్వినమాంసంబు గలదు కొను మాఁకలియున్
నొవ్వియును దీఱు నంతట, నవ్వల నారోగ్య మగు మృగాధిప నీకున్.

399


వ.

 అని శార్దూలంబు పలికిన మృగేంద్రుం డిట్లనియె.

400


ఉ.

గోవుల విప్రులం దఱిమి కూడఁగ ముట్టి భుజించి తచ్ఛరీ
రావృతమాంసపోషణమునం దనిశంబును మేను పెంచుటన్
గా విటువంటికల్మషనికారపుమేనులు భక్ష్యభోజ్యముల్
నీవు దొలంగు మాఁకటికి నేఁడును నోర్చెద వ్యాఘ్రపుంగవా.

401


వ.

అని మదోత్కటుండు పలికినఁ బుండరీకంబు సలజ్ఞావనతవదనఖిన్నత్వంబునం దొలఁగి
చనినఁ దదనంతరంబ కథనకుం డతనిం గదియం జని మచ్ఛరీరంబున భవదాత్మరక్షణం
బు గావింపం దగునన్న నాక్షణంబ.

402


క.

వడి నుఱికి లొట్టిపిట్టను, మెడఁ గోఱలఁ గఱిచి పట్టి మేదినిమీఁదం
బడఁ దిగిచిన శార్దూలము, నొడఁగూడిననక్క తాను నుదరము వ్రచ్చెన్.

403


వ.

వ్రచ్చి తచ్ఛరీరమాంసంబు మృగపతికిం బెట్టి తచ్ఛేషంబు గోమాయువ్యాఘ్రకాకం
బు లనుభవించెఁ గావునఁ క్రొత్తగాఁ గొలిచినసేవకుం డెంతబలవంతుం డయ్యును రా
జునకును బరివారంబునకును హత్తనేరఁ డత్తెఱంగున నన్నుం జూచి తెలియం బలికి
వెండియు సంజీవకుం డిట్లనియె.

404


క.

సన్నపువారల నధిపతి, మన్నించినఁ బ్రాప్తుఁ డైనమంత్రికి బ్రతు కే
మున్నది మునుము న్నతఁడును, సన్నకసన్న నటఁ బాసి చనకున్నఁ జెడున్.

405


వ.

అని మఱియును.

406


సీ.

చెలఁగి మానససరసీతటంబున నొక, గ్రద్ద హంసములలోఁ గలసి యుండ
నదియును నొకవన్నెహంసంబు గాఁబోలు, ననుచుఁ జూచినవార లాత్మఁ దలఁతు
రొక్కటి కలహంస యూరిచేరువఁ బ్రేత, భూమి గృధ్రంబులఁ బొందుపడినఁ
గనులొని గృధ్ధంబుగాఁ దలంతురు గాని, రాయంచ యనువిచారంబు రాదు


గీ.

గానఁ దగువార లున్న భూకాంతునొద్ద, నల్పు లైనను గుణవంతులై భజింతు
రధిపు నొద్దను హీనాత్ము లలమికొనిన, భవ్యగుణుఁ డైననధిపతి ప్రకృతిఁ దొలఁగు.

407


వ.

అని సంజీవకుండు రాజునకు నాకును నన్యోన్య భేదం బెవ్వఁడో పుట్టించె దురాత్ముం
డైనవాఁడు నిజంబు కల్లయుఁ గల్ల నిజంబుఁగా మహేశ్వరునకుఁ జెప్ప నెవ్వరి నేమి
సేయఁ డతనిదయావిశేషంబు నామీఁద శిథిలంబయ్యెఁ గార్యంబునుం దప్పె నేమి సే
యుదు నని మఱియు నిట్లనియె.

408

గీ.

వజ్రమును రాజతేజంబు వసుధమీఁద, నతిభయంకర మగు నందు నశనిపాత
మొక్కనిన కాని మెప్పింప దుర్విరిపుల, రాజతేజంబు చెఱుచు సరాష్ట్రముగను.

409


వ.

కావున నే నతనితోడిసంగ్రామంబున మృతిం బొందుటయ భావ్యంబు గాని తదా
జ్ఞానువర్తన మయుక్తంబు.

410


క.

ఉడుగక కార్యాకార్యము, లెడఁదం బరికింపఁ కెఱుగ కేపను లైనన్
బెడఁ జేసెనేని వానిం, దడయక గురు నైన విడువఁ దగు నేభంగిన్.

411


వ.

అనికి నిశ్చయించి మఱియు నిట్లనియె.

412


చ.

క్రతునివహంబుఁ జేసినను గైకొని దానము లెన్ని యేనియున్
జతురతఁ జేసినన్ బ్రచురసాగరతీర్థము లాడినన్ రణ
క్షితి నిమిషంబు నిల్చి దృఢచిత్తమునం బ్రతివీరమర్దన
వ్రతమునఁ బ్రాణముల్ విడుచువానిఫలంబునఁ బోలఁ దేమియున్.

413


వ.

అదియునుంగాక.

414


ఉ.

ధీనిధి యై మనస్స్థిరతఁ దెంపున వైరి నెదిర్చి యాజిలోఁ
దా నిలుగంగ స్వర్గమునుఁ దద్రిపువర్గము నుక్కడంచినన్
వానిసమస్తసంపదలు వచ్చుటయుం గడు రెండు నొప్పుటం
బూనిన శత్రుభంజనముఁ బోలునె యొండొకరాజధర్మముల్.

415


వ.

కావున నా కిప్పుడు యుద్ధంబ కార్యంబు నానిశ్చయంబు వినుము.

416


గీ.

పన్ని రణమున నిలువక పాఱిపోయి
ప్రాణములు దాఁప నెప్పుడేన్ బడకపోఁడు
ప్రాణసంశయ మైనచోఁ బ్రాజ్జుఁ డెదిరి
గెలుచు నొండైన మృతి నొందుఁ దొలఁగిపోఁడు.

417


వ.

అనిన విని దమనకుం డిట్లను రణమరణంబు మంచి దని యసాధ్యశత్రుమధ్యంబునం
దఱియ నుఱుకం జనునే శత్రుపరాక్రమం బెఱుంగక వైరపడు నెవ్వాఁడు వాఁడు ప
రాభవంబు నొందు మున్నొక్కటిట్టిభంబుచేత రేఁపంబడిన సముద్రుండును బోలె ననిన
నక్క థఁ దెలియఁ జెప్పు మనిన సంజీవకునకు దమనకుం డిట్లనియె.

418


ఉ.

టిట్టిభదంపతుల్ సుఖపటిష్ఠత వార్ధితరంగజాలసం
ఘట్టితభూమిజాతములకందువగూఁట వసించి యున్నచో
నట్టి యెడం గులాంగన నిజాత్మవిభుం గనుఁగొంచు నన్ను నీ
పట్టునఁ గావరా ప్రసవభారమునం దురపిల్ల వల్లభా.

419


వ.

అనిన దానివిభుం డిట్లనియె.

420

గీ.

గర్భభార మెఱుంగుదుఁ గంబుకంఠి, చేయవలసినకార్యంబుఁ జెప్పు మనినఁ
గలదు సకలంబు నేమియు వలదు నాకుఁ, జిత్తసంక్షోభ మొదవెడుఁ జిత్తగింపు.

421


ఉ.

సంగతిఁ బర్వకాలములఁ జంద్రునిఁ జూచి చెలంగి పొంగుచున్
నింగియు దిక్కులుం గడచునీరధి యీమనమున్న తెంకికిం
జెంగటఁ బాసిపోవుట విశేషపుబుద్ధి ప్రసూతికాల మై
నం గదలంగలేము జతనం బగుచోటికిఁ బోయి నిల్తమే.

422


వ.

అనినం బ్రియాంగనాలాపంబులు హాస్యంబు సేయుచు నాతీతు విట్లనియె.

423


గీ.

ఈసముద్రుండు నాతోడ నెట్లు వైర, పడ సమర్థుండు తెలియక పలికి తబల
సంశయము మాను మిట్టట్టు జరుగుపనికి, ననినమాటల కాకాంత యనియె నిట్లు.

424


వ.

ఈసముద్రునకును నీకును హస్తిమశకాంతరంబు వినుము.

425


క.

తనశక్తియుఁ బరశక్తియు, జననుత విజ్ఞానదృష్టిఁ జర్చించినయా
మనుజుఁడు దుఃఖప్రాప్తికి, ననుకూలుఁడు గాక సౌఖ్య మందుచు నుండున్.

426


వ.

అని పలికి మఱియును.

427


క.

ఎన్నఁదగుహితులు బుద్ధులు, విన్ననువునఁ జెప్పు నతఁడు వినకున్నఁ జెడున్
ము న్నొకకాష్ఠమువలనం, బన్నుగఁ బడి చెడినకూర్మపతియునుబోలెన్.

428


వ.

అని టిట్టిభాంగన పలికినఁ బురుషుం డాకథ యెఱింగింపు మనిన నది యిట్లనియె.

429


క.

కంబుగ్రీవుం డనుపే, రం బరఁగినకచ్ఛపము నిరంతరసౌఖ్యా
డంబర మగు నొకకొలనం, బంబినసంతోష మెసఁగఁ బాయక యుండున్.

430


గీ.

అందు వికటసంకటాఖ్యహంసయుగంబు, నిలిచి కచ్చపంబుఁ గలసి తిరుగు
వానలేక చాల వఱ పైనఁ గూర్మంబుఁ, గాంచి యప్పు డనియె నంచదోయి.

431


క.

మానససరోవరాంతర, మానితజలపానకేళిమగ్నుల మైనం
గాని మనబడలికలు మఱి, మానంగా నేర విచటిమడుఁగులనీళ్ళన్.

432


గీ.

నఱికి యెలతామరలతూండ్లు నమల లేవు, చాలఁ దీయని తెలినీరు గ్రోల లేదు
జాతిపక్షులతోఁ గూడ జరగ లేదు, పోదుమా యన్నఁ గచ్ఛపంబును దలంకి.

433


వ.

హంసయుగ్మంబున కిట్లనియె.

434


సీ.

కూడితి మిన్నాళ్లుఁ దోడఁబుట్టువులట్ల, యెడరు పుట్టినచోట విడుతుడయ్య
పక్షహీనుం డని భావింతురేని స, పక్షుండ నతిదుర్విపక్షవృత్తి
బక్షాధికులు మీరు పక్షపాతము గల్గి, పక్షిమార్గమున సంరక్షతోడఁ
గొనిపోవకుండినఁ గొల నింకునంతలో, నెవ్వరిచే నైన నీల్గవలయుఁ

దోడుకొనిపోవుఁ డన నంచదోయి యొక్కకాష్ఠమధ్యంబుఁ గమఠంబుఁ గఱవఁ బనిచి
కడలు రెండును ముక్కునఁ గఱిచిపట్టి, యెగసి రాయంచ లుడువీథి నిగుడి పఱవ.

435


మ.

అతిదూరంబుగఁ గచ్ఛపంబుఁ గొనుచున్ హంసంబు లి ట్లేగఁగా
క్షితిపై నొక్కపురంబుమానవులు తెచ్చిత్రంబు నీక్షింపుచున్
జతురోక్తుల్ బెరయంగఁ జెప్పుకొన నాసంరావ మాలించి దు
ర్మతి యై యాత్మఁ దలంపలే కపుడు కూర్మం బంచలన్ జూచుచున్.

436


క.

ఇది యేమికలకలం బని, వదనము కాష్ఠంబు వదలి వసుధం బడున
య్యద నెఱిఁగి మాంసలుబ్ధకు, లదయతఁ గొని రనుచుఁ డిట్టిభాంగన మఱియున్.

437


క.

వినుమా వెండియు నొకకథ, వినిపించెద నీకుఁ బూర్వవృత్తము దెలియన్
విన నేర్చినమతిమంతుఁడు, వినుతిం బొందంగఁ గను వివేకులతోనన్.

438


వ.

కావున ము న్ననాగతవిధాతయుం బ్రత్యుత్పన్నమతియు యద్భవిష్యుండును నను
మీనంబులు గల వందులోన యద్భవిష్యుం డల్పమతి యగుటంజేసి వెర వెఱుంగక
చిక్కి మృతిం బొందిన తెఱం గగు ననినం దత్కథాక్రమంబు దెలియం జెప్పు మని
పురుషుం డడిగినఁ డిట్టిభాంగన యిట్లనియె యొక్కతటాకంబున నిప్పుడు చెప్పం
బడినమీనత్రయంబును నన్యోన్యస్నేహంబునఁ బరిభ్రమించుచుండ నొక్కనాఁ
డనాగతవిధాత యిట్లనియె.

439


క.

మడుఁ గింకఁజొచ్చె నీజల, మెడఁ జేరిన, బెద్దమడువు కేఁగుట భారం
బెడచేసిన జాలరులకు, నెడ గలుగును మనలఁ బట్ట నిదె పోవలయున్.

440


వ.

అని మఱియు నొక్కవిశేషంబు వినంబడె నింతకమున్ను జాలరులు దమలోనం
బలికినపలుకు లీసరోవరతీరంబునందు.

441


గీ.

అడుసు చిక్క జలము లాడకాడకు నింకె, మొనసి పులుఁగుగములు దినఁగఁ జొచ్చె
సాధనంబు లెల్ల సమకూర్చుకొని మన, మరుగుదెంత మెల్లి యనఁగ వింటి.

442


వ.

కావున నీప్రొద్ద యీసరోవరంబు విడిచిపోవం దగు ననినఁ బ్రత్యుత్పన్నమతి
యిట్లనియె.

443


క.

నేరుపు గలమతిమంతుఁడు, నేరమి యొకవేళఁ బొంద నెఱి నది గెలుచున్
జారద్వయసంపర్కము, గౌరవముగ మెలఁగుగోపకాంతయుఁబోలెన్.

444


వ.

అనుటయు ననాగతవిధాతయు యద్భవిష్యుండును నక్కథ మాకుఁ జెప్పు మనినఁ
బ్రత్యుత్పన్నమతి యిట్లనియె.

445


సీ.

కరికుంభయుగ మతికాఠిన్య మగుఁ గాని, యీకాంతచనుదోయి కింత వెలితి
దళితారవిందంబు తెలివి మేలగుఁ గాని, యీయింతిమోముతో నీడు గాదు

మెఱసి నిల్చినకారుమెఱుఁగు మేలగుఁ గాని, యీ కొమ్మకనుకాంతి కింత కొఱఁత
మించి కెంజిగురాకు మెఱయుచుండును గాని, యీలేమపదముల కీడు గాదు


గీ.

అనుచుఁ గొనియాడుతలఁపుల కగ్గలించి, కమ్మవిల్తునిమృదుసాయక మ్మనంగఁ
జారుశృంగారమోహనాకార యగుచుఁ, బ్రణుతి కెక్కినగోపాలబాల యోర్తు.

446


గీ.

కాంతుఁ గనుఁబ్రామి తా భోగకాంక్ష దండ
పాలకుఁడుఁ దత్సుతుఁడు నుపపతులు గాఁగ
నెన్నఁడును వారు దమలోన నెఱుఁగకుండ
నొనర రతికేళి సలుపంగ నొక్కనాఁడు.

447


క.

తలవరికొడుకును దరుణియుఁ, దళుకొత్తెడువేడ్క మన్మథక్రీడ మెయిన్
గెల నరయక జక్కవకవ, పొలువున బహురతులఁ బ్రొద్దు పుచ్చుచునుండన్.

448


ఉ.

ఆతఱి దండపాలకుఁడు నయ్యెడకుం జనుదేరఁ దత్తనూ
జాతుని గాదెలోన నిడి సమ్మద మొప్పఁ దలారితోడ సం
ప్రీతి రమించునంతట గభీరగతిం జనుదెంచుచున్నయిం
టాతనిఁ జూచి గోపిక భయంపడ కయ్యుపనాథుతోడుతన్.

449


వ.

ప్రత్యుత్పన్నమతి గావున నిట్లను వీఁడె మద్వల్లభుం డరుదొంచెం బాదుకారావంబు
వినంబడియె నీవు నామీఁద వృథారోషంబు దీపింపం దిట్టుచు మద్గృహంబు వెడలు
మనిన వాఁడును నట్లు సేయ నంతటఁ గదిసి గోపాలుండును దనగృహంబు చొచ్చి
భార్యతో నెన్నండు లేనిది యీతలవరి మనయిల్లు చొచ్చి నిన్నుఁ దిట్టుచుం
బోవుటకుఁ గతం బేమి యని యడిగిన నది యిట్లనియె.

450


గీ.

కొడుకుమీఁద నతం డిటు కోప మెత్తి, యేనిమిత్తంబొ చంపక మాన ననుచు
నొలసి వెదికంగ వీఁడు నానిలయమునకు, భిన్నమతి రాఁ గుసూల నిక్షిప్తుఁ జేసి.

451


సీ.

తమకింపకున్నచో దండపాలకుఁడును, దనయుని నిల్లిల్లు దప్పకుండఁ
జూచుచు మనయిల్లుఁ జొచ్చి మావాఁడు మీ, యింటనె యున్నవాఁ డిప్పు డనిన
నెన్నండు రానిమాయింటి కేటికి వచ్చు, నతఁడు రాడని త్రోచి యాడఁ గినిసి
నిష్ఠురాలాపముల్ నీవును వినుచుండ, ననుఁ బల్కి పోవుచున్నాఁడు కంటె


గీ.

యింత కోపించి పొడగన్న నెంత దెగునె, వీనిపై నంచు నీగాదెలోన దాచి
చూపకుండితి నిదె వీనిఁ జూడు మనుచుఁ, బొలఁతి తలవరిసూనుని బిలుచుటయును.

452


వ.

పిలిచినఁ గుసూలంబు డిగ్గ నుఱికి నిలిచిన వానిం బరిరంభణంబుఁ జేసి నగుచున్నతన
భార్యం జూచి మెచ్చి గోపాలకుం డిట్లనియె.

453

క.

ఈపిన్నవాని నిప్పుడు, వేపడినం జంపు వాఁడు శీఘ్రమ దోషా
రోపంబున కర్హుం డై, కోపము పాపంబుపొత్తు కువలయనేత్రా.

454


క.

వీనిం దండ్రిని గూర్పక, మానుగ నను గూర్చి మిగుల మన్నించితి ప
ద్మానన నీసరి లే రని, తా నప్పుడు గొల్ల మెచ్చెఁ దనకులకాంతన్.

455


వ.

కావున గోపాంగనయుఁ బ్రత్యుత్పన్నమతి యై తనముప్పు దప్పించుకొనియె నట్ల
మనమును నప్పటికిం దగినకార్యం బనుసంధింత మని యూరకున్న యనంతరంబ యనా
గతవిధాత యనుమత్స్యం బెడతెగని జలప్రవాహమార్గంబున నన్యజలాశయంబునకుం
బోయె నమ్మఱునాఁడు.

456


గీ.

మత్స్యఘాతుకు లేతెంచి మడువు సొచ్చి, మొదలఁ బట్టిన మీలను గుదులు గ్రుచ్చి
యీడ్చి తిరుగంగ నప్పుడు హెచ్చి గుదికి, నడుము గబళించి జీవంబు విడిచినట్లు.

457


క.

అనువున నుండఁగ నొండొక, వనజాకరమునకు నేఁగి వారలు గుదులం
బెనురొంపి పోవఁ దొలఁచినఁ, జనెఁ బ్రత్యుత్పన్నమతి నిజం బగుకడఁకన్.

458


వ.

అంత యద్భవిష్యుం డెటఁ బోదు నేమి సేయుదు నని విచారించుసమయంబునం
బట్టువడి మృతిం బొందె నని చెప్పి టిట్టిభాంగన కొన్ని దివసంబులకుఁ బ్రసూతి యైనఁ
దత్ప్రతిజ్ఞాభంగంబు సేయంగలవాఁడై సముద్రుం డయ్యండంబుల నపహరించిన.

459


క.

ఆపక్షీంద్రకులాంగన, దీపించిన శోకజలధిఁ దేలుచుఁ బతితో
నాపలుకులు వినవైతివి, పాపాత్మసముద్రుచేతఁ బడఁ బాలైతిన్.

460


ఉ.

అవ్వల నెన్ని లే వట మహాగహనైకనికుంజవృక్షముల్
దవ్వున నిప్పు డున్నయదె తా మన కుండఁగఁ గాణయాచియే
యివ్విధ మేను ము న్నెఱిఁగి యెంతయుఁ జెప్ప ననాదరంబుతో
నవ్వితి గాని పట్టదు మనంబున మీఁదటిహాని ధీనిధీ.

461


వ.

అని పరిదేవనంబు చేసిన తన ప్రాణవల్లభ నూఱార్చి దానివిభుం డగు పక్షి యిట్లనియె.

462


చ.

వెఱవకు కాంత నన్ను నవివేకి యితం డని నీవు చూడ కే
డ్తెఱ భువనప్రపంచమునఁ ద్రిమ్మరుపక్షులఁ గూర్చి నీవు ని
వ్వెఱపడఁ బక్షివల్లభుని విష్ణునిఁ దెచ్చి యపత్య మిప్పుడే
నెఱయఁగఁ దెచ్చి యిచ్చెద ననింద్యచరిత్ర విచార మేటికిన్.

463


మ.

అని యాటిట్టిభ మప్పు డేఁగి తనకార్యం బుర్విపైఁ గల్గుప
క్షినికాయంబున కేర్పడం తెలిపి భక్తిం బక్షులుం దానుఁ బు
ణ్యునిఁ బక్షీంద్రుని వేఁడుకో నతఁడు నన్నున్ మీర లెల్లం దలం
చి నమస్కారము లాచరించినను మచ్చిత్తంబు రంజిల్లుటన్.

464

మత్తకోకిల.

మీర లున్నెడ కేఁగుదెంచితి మేలు మీ కొకఁ డెద్దియేన్
గోరి చేసెద నందు దొడ్డును గొంచెముం దలపోయకుం
డేరి కిందు నసాధ్య మైనది యిత్తు నుత్తములాగ నా
వార లెవ్వరు మీరు గా కని వైనతేయుఁడు పల్కినన్.

465


గీ.

పక్షు లెల్ల విహంగమపతికి మ్రొక్కి, జలధి టిట్టిభములకును జలముతోడిఁ
గీడు చేసినపని యెఱిఁగింప నెఱిఁగి, యమ్మహాత్ముండు పక్షుల కభయ మొసఁగి.

466


వ.

క్షీరాబ్ధిమధ్యగతం బగు వైకుంఠంబునకుం జని తన్మధ్యంబున దివ్యసుధాభవనం
బునఁ బన్నగతల్పంబున నున్న పురాణపురుషుం బుండరీకాక్షుం గని సాష్టాంగ
నమస్కారపూర్వకంబుగా బహువిధస్తోత్రంబుల బ్రసన్నుం జేసి తనకులస్వాము
లకుం జేసినయర్ణవదుర్ణయంబు విన్నవించిన.

467


సీ.

నీలాంబుదచ్ఛాయ నెఱసినమేనితో, రమణీయపీతాంబరంబుతోడ
శంఖచక్రాదికోజ్జ్వలహస్తములతోడ, ధవళాబ్జతులితనేత్రములతోడ
వనమాలికాంకితవక్షస్స్థలంబుతోఁ, బ్రవిమలకౌస్తుభప్రభలతోడ
శోభితోభయపార్శ్వసురసమూహంబుతో, సిద్ధవిద్యాధరశ్రేణితోడ


గీ.

గరుడవాహనారూఢుఁ డై కైటభారి, రయముతో వచ్చి యుదధితీరమున నిల్చి
యండజంబులు మ్రొక్కిన నభయ మొసఁగి, జలధరధ్వనిఁ గే లెత్తి జలధిఁ పిలిచె.

468


చ.

పిలిచిన నంబుధీశ్వరుఁడు పెం పెసలార ముకుందు మందరా
చలధరుఁ గాంచి సద్వినయసంభ్రమ మొప్పఁగఁ జాఁగి మ్రొక్కినన్
జలరుహలోచనుం డనియెఁ జయ్యన నీవు హరించినట్టిపి
ల్లలఁ గొని రమ్ము పక్షులవిలాపము మాన్పుము నేఁడు మాకుఁగన్.

469


క.

అనినన్ జలధి ప్రసాదం, బని వేగమ తెచ్చి టిట్టిభాండంబుల న
వ్వనజోదరుముందట నుం, చినఁ గైకొని యతని ననిచి శ్రీపతి పేర్మిన్.

470


వ.

అయ్యండంబు లయ్యండజంబుల కిచ్చి యంతర్హితుఁ డయ్యెఁ డిట్టిభంబులు పూర్వ
ప్రకారంబున నచ్చోట సుఖంబున నుండె నని చెప్పిన సంజీవకుండు మృగేంద్రుం డే
భావంబున యుద్ధసన్నద్ధుం డగు ననిన దమనకుం డిట్లనియె.

471


క.

మునుగాళ్లు రెండు తోఁకయు, ఘనములుగా మీఁది కెత్తి కడు వివృతముగా
నొనరించినవదనముఁ గని, మనమునఁ దలపోయు కలహమతిఁగా నతనిన్.

472


వ.

అని చెప్పి దమనకుండు కరటకుం డున్నయెడకుం జని మన ముద్యోగించిన కార్యంబు
సఫలం బయ్యె నన్యోన్యభేదంబులు పుట్టె నని చెప్పి యతనితో మఱియు నిట్లనియె.

473

గీ.

నయవిశారదు లైనమానవులచేతఁ, దెమల భేధింప రానికార్యములు గలవె
గాన నేనును నావేర్పు కరము నెఱపి, కార్య మీడేర్చుకొంటిని గడిఁది ననుచు.

474


వ.

అని పింగళకునిసమ్ముఖంబునకుం బోయి పగతుండు వీఁడె యుద్ధసన్నద్ధుండై
చనుదెంచుచున్నవాఁడు నీ విప్పుడు మయిమఱచి యుండం దగునె యనిన నతండును
దమనకుండు చెప్పినతెఱంగునఁ గట్టాయితంబై యెదురు చూచుచుండె నంతట
సంజీవకుండును జనుదెంచి మున్ను దనవిన్నచందంబున నున్న పింగళకునివికృతా
కారంబు చూచి వెఱవ కతనిం దాఁకిన బింగళకుండును సంజీవకునిమీఁదికి
లంఘించె నయ్యిరువురకు నన్యోన్యబద్ధామర్షయుద్ధం బుద్ధురగతిం జెల్లుచున్న
సమయంబునం గరటకుండు దమనకున కిట్లనియె భవద్దుర్మంత్రవిలసితం బిట్లుండునే
యని పలికి మఱియును.

475


గీ.

తగిలి సానభేదదానదండములందు, మూఢుఁ డైన సామమునఁ గరంగు
భేదదానదండవాదంబు లెన్నిక, కొఱకుఁ గాని సామగుణము మేలు.

476


గీ.

మొదలఁ గార్యజ్ఞుఁ డగువాఁడు మూఢునందుఁ, జెలఁగి సామప్రయోగంబు సేయవలయు
సామమున నెల్ల పనులును సరవిఁ బొందు, నెన్ని చూచినఁ గీడు లే దెట్టియెడల.

477


గీ.

తలఁప సామభేదదానదండంబులు, భూరికార్యసిద్ధికారణములు
సంఖ్యకొఱకు నయ్యె సరవిఁ దక్కి నయవి, సామముననె సిద్ధి సంభవించు.

478


చ.

నరనుత చంద్రనూత్నకిరణంబులచేత సరోజబాంధవ
స్థిరమహితాతపస్ఫురణచేత, గృపీటసముద్భవప్రభా
పరిణతిచేతఁ బాయనియపారవిరోధిమహాంధకారముల్
విరియు ముహూర్తమాత్రమున విశ్రుతసామవిలాససంపదన్.

479


గీ.

దగిలి సామభేదదానదండములచే, వెలయు నీతి నాల్గువిధము లగుచు
నందులోన దండ మధికపాపముఁ జేయు, నది పరిత్యజించు టర్హవిధము.

480


వ.

కావున మంత్రరహితుం డగుట గర్వం బనంబడు గర్వంబున నాత్మవినాశం బగు
స్వామికిం గొఱగామి సంభవించినయప్పుడు తత్ప్రతీకారం బూహించుట కర్త
వ్యంబు.

481


చ.

కొలది యెఱింగి సంధి యెడఁగూర్పఁగ నేర్చినమంత్రిమంత్రమున్
దొలఁగఁగ సన్నిపాతగతి తోడనె మాన్పినవైద్యువైద్యమున్
జెలఁగి సభాంతరాళములఁ జెప్పికొనం దగుఁగాక యుల్లస
ద్బలుఁ డగువేళ నేయతఁడు పండితవృత్తి వహింపకుండెడున్.

482

క.

నృపుఁడు గుణి యైన సచివుఁడు, కపటాత్ముం డైనఁ బ్రజలు గదియరు వానిం
జపలమకరాశ్రయం బగు, విపులసరోవరముఁ జేర వెఱచినభంగిన్.

483


వ.

అని మఱియును.

484


ఉ.

ఆసల నీశుభంబునకు నక్కట యీ విభు నొంటివానిఁగాఁ
జేసితి గాని సేవకులఁ జేరఁగ నీవు ప్రజాసమృద్ధి ను
ద్భాసితుఁ జేయ కంతయును దా నయి యున్నయమాత్యుఁ డెంతవి
శ్వాసము గల్గెనేని నరవర్యునకున్ బగవాఁడు దా నగున్.

485


క.

పరుసనివానికి మదిహిత, మరుదుగ నొనరించు నెవ్వఁ డితఁ డమృత మగున్
బురుషవరేణ్యున కెవ్వఁడు, వెరవిడియై కీడు సేయు విష మగు నతఁడున్.

486


వ.

కావునఁ బురుషుల కహితం బాచరించు తలంపునఁ బ్రవరిల్లునీవు బుద్ధిహీనుండ వని
పలికి కరటకుండు మఱియు నిట్లనియె.

487


సీ.

కడఁగి మనోవాక్ప్రకారంబు లేకంబు, గాక మిత్రునిఁ గూడి కడఁగునతఁడుఁ
బ్రతిదినప్రఖ్యాతపాపవర్తనమునఁ, దగిలి ధర్మము చేయఁ దలఁచునతఁడు
నేపార నెపుడుఁ బరాపకార మొనర్చి, పృథు సంపదలఁ గూడఁబెట్టునతఁడు
సమధికం బగుదేహసౌఖ్య మపేక్షించి, చెలఁగి విద్యల నభ్యసించునతఁడుఁ


గీ.

బరుసఁదనమున నేప్రొద్దుఁ బద్మముఖులఁ, బొసఁగ వలపింతు నని తలపోయునతఁడు
నెఱుక చాలనివా రని యిద్ధరిత్రి, నెఱయ నూహింతు రనిశంబు నీతివిదులు.

488


క.

స్వామిప్రసాదసంపద, వేమఱు మదిఁ గోరువానివిభవం బమరున్
స్వామి ప్రసాదసంపద, వేమఱు మదిఁ గోరకుండువీఱిడి చెడెడున్.

489


క.

ఏరాజు తనదుభృత్యుని, కారుణ్యమువలనఁ బ్రతుకగాఁ జూచి మదిన్
వారక శంకితమతి యగు, నారాజువిధంబు నీచ మగు ననుదినమున్.

490


గీ.

అర్థశాస్త్రంబు చదువనియట్టివాని, పుత్త్రుఁడును దండ్రిగణములఁ బోలి పొలుచు
జగతిఁ గేతకీవృక్షసంజాతఫలము, బహుళకంటకములచేతఁ బ్రబలినట్లు.

491


వ.

కావున నీకుం జెప్పఁదగినబుద్ధి యేమి యున్నది విను మని యిట్లనియె.

492


చ.

నెఱయఁగ వంపరానిధరణీజము వంపఁగడంగెనేని నే
డ్తెఱ బలుఖడ్గధార జగతీధరశృంగము వ్రేసెనేని మీఁ
దెఱుఁగక బుద్ధిహీనునకు నెంతయు బుద్ధులు చెప్పెనేని చె
చ్చెర నొకవానరంబునకుఁ జెప్పినసూచిముఖంబుచా డ్పగున్.

493


వ.

అనిన విని దమనకుండు తత్కథాక్రమం బెట్టి దని యడుగఁ గరటకుం డిట్లనియె.

494

సీ.

ప్రాలేయభూధరప్రాంతకాంతార
                దేశభాసురసరిత్తీరములను
దాలతమాలతక్కోలహింతాలాది
                రాజతానేకమహీజములను
గిసలయవిసరసంకీర్ణనానాలతా
                మంజులోదారనికుంజములను
నిరుపమానతరంగిణీవేగసంజాత
                మహనీయసైకతమంటపముల


తే.

సొరిది విహరించుకపు లొకచోటఁ గూడి
కడిది చలిచేత మేనులు గడు వడంక
రాత్రి మెఱుఁగారుఖద్యోతరాజిఁ జూచి
కణఁకు గాఁబోలు నని సీతుగాఁచుచుండ.

495


క.

సూచిముఖ మనువిహంగం
బాచేరువనుండి యనల మది గా దని యా
లోచనము చేసి యొకకపి
కాచందము తెలియఁ జెప్ప నతికుపితంబై.

496


ఆ.

అడుగ కూర కేల నొడివితి విప్పుడు
వట్టితీఁట నీకుఁ బుట్టె ననుచుఁ
బట్టి దాని రాతిపైఁ బ్రామి వధియించె
హీనమతికి బుద్ధు లేలకొలుపు.

497


వ.

అట్లు గావున.

498


చ.

అనవరతంబు విశ్వవినుతాయతబుద్ధి విశేషవృత్తి నొం
డెను ధనవృత్తి నొండెను గడిందిబలంబున నొండె నెవ్వఁ డిం
పెనయఁ గులంబువారల నహీనగతిన్ భరియించు నట్టినం
దనుని ముదంబునం గనినతల్లియ తల్లి ధరాతలంబునన్.

499

క.

ఆపాదమాత్రశోభిత
రూపము లేకుండ నెన్నరుండును గలఁడే
దీపితసుజ్ఞానకళా
స్థాపితమతి లేఁడు గాక చరమయుగమునన్.

500


వ.

అని యిట్లు పలికిన విని దమనకుం డూరకున్నం గనుంగొని
కరటకుండు మఱియు నిట్లనియె.

501


తే.

స్వరము భిన్నంబు ముఖము వివర్ణ మరయ
దృష్టి శంకించు వడఁకును దేహ మెపుడుఁ
జెనసి యపకార మొరులకుఁ జేసినట్టి
కల్మషాత్మునిగుణ మిట్లు కానఁబడును.

502


వ.

అని చెప్పి మఱియును.

503


క.

క్షితి దుష్టబుద్ధిబుద్ధులు
మతియుతు లాదుష్టబుద్ధి మందాక్షము లే
కతిలోభత్వగుణంబున
మృతుఁడుగఁ దనజనకుఁ జేసె మిన్నక కంటే.

504


వ.

అనినఁ దత్క థాక్రమం బెఱిఁగింపు మనినఁ గరటకుఁ
డిట్లనియె.

505


ఉ.

పొందుగ దుష్టబుద్ధియు సుబుద్ధియు నాఁగ వణిక్కుమారు లా
నందముతోఁ జరింప నొకనాఁ డొకచోట సుబుద్ధి గాంచెఁ బెం
పొంద సొనారిటంకముల నుంచినకాంచనకుంభ మట్టియా
కుందన మొక్కచోట నిడి కూర్చినకోమటిఁ జేరి చెప్పినన్.

506


సీ.

చెప్ప వారిరువురు శీఘ్రంబ చని రాత్రి
                గొనివచ్చి తమపురంబునకు వెలిని
వృక్షమూలంబున వెలయ నిక్షేపించి
                వెచ్చంబునకు మున్ను పుచ్చినట్టి

నిష్కంబు లిరువురు నెఱయ విభాగించు
                కొని తమయిండ్ల కింపొనరఁ బోయి
ప్రకటితస్నేహసంపదఁ బొంది యిరువురు
                తొలఁగక మెలఁగంగ దుష్టబుద్ధి


తే.

తనదుచిత్తంబునందుఁ దద్ధనముఁ దాన
యపహరించిన నంతయు నబ్బు ననుచుఁ
దలఁచి యొక్కనాఁ డొంటిగాఁ దాన యరిగి
పేర్చి యాబిందె వేగంబె పెల్లగించి.

507


క.

కొనితెచ్చి యతిరహస్యం
బున నొకచోఁ బాఁతి దుష్టబుద్ధి సుబుద్ధిం
గని పలికె నాఁడు దాచిన
ధన మిండ్లకుఁ దేక మనకుఁ దడయఁగ నేలా.

508


క.

అతిధార్మికుండు నరపతి
చతురుఁడు మంత్రియును బ్రజలు సజ్జను లగుటన్
మతిఁ దలఁక నేల మన కిది
సతముగఁ జేకూడెఁ బసిఁడి సర్వము ననుచున్.

509


వ.

పలుక వైశ్యకుమారు లిరువురుఁ జని తరుమూలంబున నిడిన
నిక్షేపంబు పుచ్చుకొనుటకుం గ్రొచ్చి చూచి యప్పు డచ్చోటఁ
బసిండి గొనిపోయినతద్ఘాతం బుపలక్షించి యొండొరుల
మీఁద నవిశ్వాసంబు నొంది వివాదంబు సేయుచు నప్పురంబు
మహీశ్వరుసమ్ముఖంబునకుం జని యత్తెఱం గెఱింగింప నతం
డును ధర్మాధికారులఁ దీర్ప నియోగింప వారలను బంచదిన
పర్యంతంబు మీలోనం దెలిసి రం డని యనిపినం జని షష్ఠ
దివసంబునఁ బ్రభాతంబున నయ్యిరువురం బొడచూపి నిలిచి
కప్పుడు దుష్టబుద్ధి ధర్మాధికాదుల కిట్లనియె.

510

మత్తకోకిల.

పూని దీనివిచార మేల సుబుద్ధి తానె హరించె మీ
యాన దానికి సాక్షి యచ్చట సంచితం బగువృక్షమే
కాని మానిసిఁ జెప్పఁ జెప్పినఁ గల్ల పెట్టుఁడు నన్ను స
న్మానితాత్మకులార మీరలు నాకు దిక్కని మ్రొక్కినన్.

511


క.

వెఱఁగువడి వారలందఱు
నెఱయఁగ నొండొరులఁ జూచి నేఁ డాశ్చర్యం
బెఱుకపడఁ దరులచేతను
వఱలఁగఁ బలికించునట్టివారలుఁ గలరే.

512


వ.

అనుచు ధర్మాధికారులు వైశ్యకుమారుల కిట్లనిరి.

513


ఆ.

ప్రొద్దులేదు నేఁడు పోయి ప్రాతఃకాల
వేళ రండు పొండు వేగ యనిన
నరిగి దుష్టబుద్ధి యాత్మీయజనకునిఁ
బ్రార్థనంబు చేసి పలికె నపుడు.

514


సీ.

తండ్రి యీహస్తగతం బైనయర్థంబు
                నెట్టివానికిఁ బాలు వెట్ట నేల
వాఙ్మాత్రమున నీకు వశ మైనపని గానఁ
                జెప్పెద నామాట చిత్తగింపు
వృక్షకోటరము ప్రవేశించి యీరాత్రి
                నీ వదృశ్యంబుగా నిలుచునంత
ధర్మాధికారు లంతట రేపకడ వచ్చి
                యచటివృక్షము సాక్ష్య మడుగఁ దడయ

తే.

యిద్ధనంబు సుబుద్ధి గ్రహించెఁ గాని, దుష్టబుద్ధికిఁ బని లేదు దృష్ట మనుచు
నీవు పలికిన నది తీఱిపోవుఁ బిదప, మనకుఁ గలకాల మెల్లను మనుట గలుగు.

515


వ.

అనిన విని దుష్టబుద్ధికిఁ దజ్జనకుం డిట్లనియె.

516


చ.

చెడుతరువాయి నిట్టిపని చెప్పితి గాని ధనంబుకాంక్షకున్
గడపలలేదు హీనమతి గప్పినవానికి దుష్టబుద్ధి నా
నొడువఁగ నున్నని న్నిటు తనూభవుఁగాఁ గనునట్టిపాపపుం
జెడుఁ గగునాకు దుర్లభమె చెప్పెడు నారకబాధ పుత్రకా.

517


వ.

అని పలికి మఱియు నిట్లనుఁ బ్రాజ్ఞుం డుపాయంబు చింతించిన పిదప నపాయం
బునుం దలంపవలయుఁ దొల్లి బకమూర్ఖంబునకుం గలయపత్యంబుల నొక్కముంగి
మ్రింగినచందం బగు విను మని యిట్లనియె.

518


మ.

ఒకకాసారతటంబునందు నొరపై యున్నట్టివృక్షంబుపై
బకయుగ్మంబు వసింప భార్య పురుషుం బ్రార్థించి యోనాథ య
ర్భకరాజిం దీనిపోవఁ గ్రిండఁ గలసర్పం బేపుమై నింక న
చ్చిక నేతెంచుఁ బ్రసూతికాలమును వచ్చెం కార్య మెట్లుండునో.

519


వ.

అనిన విని బకవిభుం డమ్మహీరుహంబు డిగ్గి కొలనితీరంబున నిల్చి విచారించు సమయం
బువ నయ్యెడకు నొక్కకుళీరంబు చనుదెంచి యిది యేమి దుఃఖాకులుండవై
యున్నవాఁడ వనిన నబ్బకం బిట్లనియె.

520


ఉ.

నాకులకాంత గర్భమయి నందనులం గనునంతలోన ద
ర్వీకర మేఁగుదెంచి తిని వేగమ పోయెడు నెల్లి నేఁటిలో
నాకలకంఠి వెండియును నర్భకులం గనువేళ గాన నే
నాకులతఁ దలంకెద మదాత్మకు నేమియుఁ దోఁపకుండఁగన్.

521


వ.

అనినం గర్కటంబు నీకుం దగినయుపాయంబు చెప్పెద విను మని యిట్లనియె.

522


గీ.

నకులవివరంబునందుండి నాగవిభుని, యునికిదాఁకను మీనంబు నొకటినొకటి
వైచుకొనిపోవ నాముంగి వరుసఁ దినుచుఁ, బాముఁ జంపును దీని ముపాయ మిదియె.

523


వ.

అని కుళీరంబు చెప్పినఁ గొక్కెర యవ్విధం బాచరింప నకులం బమ్మత్స్యంబులఁ
దినుచుం జనిచని కృష్ణసర్పంబును ఖండించి వృక్షం బెక్కి ఒకదంపతులయపత్యంబు
లను భక్షించెం గావున.

524


క.

తనబ్రతుకుకొఱకు నొరునిం, గనికర మొక్కింత లేక కారించినయ
మ్మనుజుఁడు గనఁ డున్నతశో, భనముల నెన్నండు మూర్ఖబకముంబోలెన్.

525

వ.

అని యిట్లు చెప్పినతండ్రిపలుకులు గైకొనక దుష్టబుద్ధి లోభాక్రాంతుడై బలా
త్కారంబున నతని నొప్పించుకొనిపోయి నిశామధ్యంబున, దత్తరుకోటరంబున
నునిచి ప్రభాతసమయంబున.

526


సీ.

ఆదుష్టబుద్ధి ధర్మాధికారులఁ బిల్చి, కులము పెద్దలఁ గూర్చుకొని కడంగి
ధర్మబుద్ధియుఁ దోన తడయక చనుదేర, నావృక్షమునకు సాష్టాంగ మెసఁగి
సత్యంబ పలుకు వృక్షము సాక్షి వీవన్న, బూని వనస్పతిలోననుండి
ధర్మబుద్ధి మొరంగి ధనముఁ గైకొనెఁ గాని, పుచ్చుకోఁ డీదుష్టబుద్ధి యన్న


గీ.

వాగ్విలాసంబు వినఁబడ్డ వార లెల్ల, నద్భుతం బంది కనుఁగొనునంతలోన
మ్రాను పలికినచోటు దా మహి నెఱిఁగి, పాటిమాలి యసత్యంబు పలికె ననుచు.

527


వ.

ఆధర్మబుద్ధి యంతరంగంబునఁ గోపోద్దీపితుం డై.

528


గీ.

కుజము వెస నెక్కి యామీ, దికొమ్మ లరసి, తొలఁగ వీక్షింపునపు డొకతొఱ్ఱఁ గాంచి
యింగలంబును బూరియు నెసఁగఁ దెచ్చి, కోరటంబున వైచి యచ్చోటు దొలఁగ.

529


క.

అనలజ్వాలాజాలము, తనదేహము చుట్టుముట్టఁ దల్లడపడుచున్
మునుకొని మొఱ్ఱలు పెట్టుచు, జనములపై దుష్టబుద్ధిజనకుం డుఱికెన్.

530


గీ.

పడినసెట్టిఁ జూచి పైఁబడి ధర్మాధి, కారు లెల్ల బ్రమసి కదిసి యడుగ
సుతుఁడు దుష్టబుద్ధి సుండు న న్నిటువంటి, యుడుకు చేసె ననుచు నుసుఱు విడిచె.

531


వ.

విడిచినం జూచి ధర్మాధికారు లత్తెఱం గంతయు మహీకాంతునకుం జెప్పిన నతండు
దుష్టబుద్ధిం గొఱత వేయం బంచి వాని సర్వస్వంబునుం జూఱకొనియె నని చెప్పి
కరటకుండు మఱియు నిట్లనియె.

532


సీ.

సుమధురవాహినీసంపూర్ణజలములు, వడి లవణాబ్ధిలో నడఁగుదాఁక
ప్రకటితస్నేహసంబంధబంధుత్వంబు, లంగనానిర్భేద మయినదాఁక
నత్యంతకాంతరహస్యవాక్యంబుల, వివరించి కొండీఁడు విన్నదాఁక
కలితపారంపర్యకులసమృద్ధి దలంప, నిలఁ గుపుత్త్రుం డుదయించుదాఁక


గీ.

నిలుచునేగాని యటుమీఁద నిలువ కునికి, దప్ప దందురు నయశాస్త్రధర్మవిదులు
నీవు కులహాని యగునట్టి నీచగతికిఁ దగిననడవడి గన భయం బగుచు నుండు.

533


గీ.

కడఁగి పిశునవృత్తిఁ బెడఁబాయ కుండిన, వాని వదలకున్నవాఁడుఁ జెడును
నురగశాబకంబుఁ జిరకాల మొగిఁ బెంప, మెఱసి యొక్కవేళఁ గఱువకున్నె.

534


గీ.

ఎఱుకగలవానిపొం దైన నెందు నమరు, నతఁడు కపటాత్ముఁ డయ్యనే నదియుఁ గాదు
మూర్ఖుతోఁ గూడి మెలఁగెడుమూర్ఖశఠుని, సఖ్య మెన్నండుఁ గొఱ గాదు సజ్జనులకు.

535

వ.

కావున నీవు స్వామికి నిట్టిదురవస్థ యుత్పాదించి తింక నన్యులు నీకుం దృణకణాయ
మానం బగుట నిశ్చయంబు విను మని యిట్లనియె.

536


ఉ.

వేయితులాలలోహమును వేడుకతో దినె మూషకంబు ల
త్యాయతశక్తి నంచు వ్యవహారి యొకం డన నొక్కరుండు పి
న్నాయన నొక్కగృధ్రము రయంబున నెత్తుకపోయె నంచు ము
న్నోయి విచిత్ర మైనకథ యొక్కటి వింటిమి నీవు వింటివే.

537


వ.

అనిన నక్కథ వినవలయు నాకుం జెప్పు మనినఁ గరటకుం డిట్లనియె.

538


చ.

లలి నొకపట్టణంబునఁ గలం డొకవైశ్యుఁడు లేమిచేత ని
మ్ముల వ్యవహారికంబునకుఁ బోవుచు లోహతులాసహస్ర మి
ట్టలముగ నొక్కచుట్టముకడం బదిలంబుగఁ బెట్టి సమ్మదం
బొలయఁగ నాత్మమందిరమునొద్దకుఁ గ్రమ్మఱ వచ్చి యత్తఱిన్.

539


వ.

లోహం బిడిన వైశ్యునికడకుం జని యతం డిట్లనియె.

540


క.

ఇన్నిదినంబులుఁ బోయితి, నన్నా పరదేశమునకు నచ్చట నాకుం
జిన్న ముఁ జిదరయుఁ బుట్టక, మిన్నక రావలసె మగిడి మీ రున్నెడకున్.

541


క.

మీయింట దాఁచఁబెట్టిన, నాయిను మిపు డొసఁగవలయు నని పలికిన వాఁ
డీయక మూషకములు తిని, పోయె ననుచు ద్రవ్యలోభమున నన నతఁడున్.

542


క.

ఈలాగున నాసొ మ్మీఁ, జాలక కేరడము లాడుచనవరి నెట్టున్
దూలించి మోసపుచ్చక, యేలా నాసొమ్ము వచ్చు నింతట ననుచున్.

543


ఉ.

ఆయెడ లోహహర్త యగు నాతనిసూనుఁడు వచ్చె నాడఁగాఁ
బోయి జలంబు లాడుటకుఁ బోదము రమ్మని వానిఁ గొంచు నా
త్మాయతనంబు చేరువగృహంబున బాలుని దాఁచి యుండఁగాఁ
బాయనిదుఃఖభారమున బాలునితండ్రియు వాని రోయుచున్.

544


గీ.

పురవరంబున నింటింట నరసియరసి, యడుగఁగా లోహ మిచ్చిన యతఁడె కొడుకు
నంత గొనిపోయె నని చెప్ప నతఁడు నించు, శీఘ్రగతితోడఁ జనుదెంచి సెట్టితోడ.

545


క.

పాపని నదికిం దోడుక, వే పోయితీ వాఁడు రాఁడు వెండియు సతి దా
వాపోవఁ దొడఁగెఁ జెప్పవు, పాపం బని తలఁచి దుఃఖపడ వింతైనన్.

546


వ.

అనిన నతం డిట్లనియె.

547


క.

ఇద్దఱమును నేటికిఁ జని, ప్రొద్దునఁ దీర్థంబులాడి బోరన రాఁగా
గ్ర ద్దెత్తుక చనె నీసుతు, బద్దురవలె నుండు ననుచుఁ బలుకఁగ వెఱతున్.

548

వ.

అనిన నతండు రూక్షేక్షణుండై యతిత్వరితగతిం బఱచి రాజద్వారంబున నాక్రోశిం
ప నమ్మహీశ్వరుండు ధర్మాధికారులం బిలువం బంచి విచారింపుం డన వారును నవ్వై
శ్యునిఁ దన్నిమిత్తం ఒడిగిన నతం డిట్లనియె.

549


గీ.

సెట్టి దొంగ యొకఁడు శీఘ్రమ నాపట్టిఁ
బట్టి చంపి పక్షి పట్టుకొనుచుఁ
బాఱిపోయె ననియె భావింపరయ్య యీ
యాగడంబు భూమియందుఁ గలదె.

550


వ.

అనిన విని ధర్మాధికారు లీకార్యం బతర్కితం బిది విచారింపం దగు నని ప్రతివాది
వైశ్యునిం బిలువం బంచి యవ్విధం బడిగిన నతం డిట్లనియె.

551


క.

వేయితులాలం గలిగిన
యాయిను మితనింట నిడిన నది యెలుకలచేఁ
బోయె ననెఁ జిన్నపాపని
నాయతగతి గ్రద్ద కొనుచు నరుగుట యరుదే.

552


చ.

అని పలుకంగ నాసభికు లప్పు డెఱింగి యితండు సెట్టి నీ
యిను మొసఁగుం గుమారకుని నిమ్మని వారలు చక్కఁబెట్టినన్
మనమున సమ్మతించి మఱుమా టన కాసభవారు తీర్చి చె
ప్పినగతి నట్లు చేసి రని పెం పెసఁగన్ గథ చెప్పి యిట్లనున్.

553


క.

మతిమంతుఁ డైనవానికి
హితముగ నొకమాట చెప్ప నెఱిఁగి చరించున్
ధృతి దఱుఁగ నీవు నేలా
ప్రతిమగతిం జేష్ట దక్కి బ్రమసితి గంటే.

554


వ.

కావున నీకు నేకార్యంబును నుపదేశింపం బనిలేదు నిన్నుఁ గూడుట యనుచితంబు.

555


గీ.

సుజనదుర్జనసంగతిఁ బ్రజలు నడవ
గుణములును దుర్గుణంబులుఁ గూడి పరఁగు
వరుస బహుదేశసంచారవాయువులకు
గంధదుర్గంధములు వచ్చి కలసినట్లు.

556

క.

మతిమంతులు దమకార్య
స్థితు లొనరింపంగఁ జింత సేయుదు రభ్యా
గతజల మానెడుమనుజుం
డతితృష్ణాభరముఁ దొరయ నరయనిభంగిన్.

557


వ.

అని యిట్లు కరటకుండు పలుక దమనకుం డిట్లనియె మనస్వామి సంజీవకునిం జంపిన
తెఱం గెఱుంగవలయుఁ బోద మని యయ్యిరువురుఁ గదియం జనునప్పుడు పింగళకుం
డటమున్న సంజీవకుం దెగటార్చి పశ్చాత్తాపంబునం బొరలుచుండి యప్పుడు దమన
కుం జూచి చూచితే యని పలికి యిట్లనియె.

558


శా.

పాలింపం దగువానిఁగాఁ దలఁచి తాఁ బాలించి రాజార్హసు
శ్రీలం బ్రోదిగఁ జేసి పెంచుటయ ధాత్రీపాలధర్మంబు గా
కేలా యిట్లు విచారదూరమతి నై యేఁ ద్రుంచితిన్ వాని దు
శ్శీలుండై విషవృక్ష మైన నిడి తా ఛేదించునే యెవ్వఁడున్.

559


వ.

అదియునుంగాక.

560


చ.

అవగుణి యైనఁ కాక సుగుణాత్మకుఁ డైన భటోత్తము న్మహీ
ధవుఁడు పరిత్యజింప మఱి తక్కినవారు తొలంగిపోదు ర
య్యవినయవృత్తి భూపతికి హానియు ధాత్రికి నాకులంబు నై
భువి నపకీర్తి పుట్టుఁ దలపోసి తలంకెద నేమి సేయుదున్.

561


వ.

అనిన విని దమనకుండు దేవా వైరిసంహరణానంతరంబున నిట్లు సంతాపింపం బని లే
దు విను మని యిట్లనియె.

562


ఉ.

సమ్మద మొప్ప వైరిజనసంహరణం బొనరించెనేని శో
కమ్మును బొంద నేల ఘనగర్వమునన్ బ్రతికూలవృత్తిగాఁ
దమ్ములు భృత్యులున్ హితవితానముఁ బుత్త్రులుఁ గూడ కుండినన్
గ్రమ్మఱ నాజ్ఞ సేయఁ దగుఁ గాదె నృపాలుర కివ్వసుంధరన్.

563


సీ.

సార్వకాలికకృపాసంపూర్ణమతి యైన, మానవేశ్వరునకుఁ గానిగుణము
కుటిలవిచారసంఘటితమిత్త్రుం డైన, వాని భావించినఁ గానిగుణము
సమధికప్రియమున సర్వభక్షకుఁ డైన, భూనిలింపున కది కానిగుణము

ప్రాణేశసంతతప్రతికూల యగునేని, మానినీమణి కది కానిగుణము


గీ.

తివిరి సచివుండు రాజ్యంబుఁ దీర్చునపుడు
కడుఁ బ్రమత్తత పొందుట కానిగుణము
చెనసి భృత్యుండు నృపుపంపు సేయ కుండు
క్రమము గలిగిన నదియును గానిగుణము.

564


చ.

అరయ మనుష్యమాత్రులకు నంటినకొంచెపుబుద్ధి ధారుణీ
శ్వరుఁడు ధరిత్రి యేలు టది వర్ణన కెక్కునె శత్రుభీకర
స్ఫురదురుకార్యఖడ్గముల భూతల మంతయు నాక్రమించి సు
స్థిరఘనకీర్తిసంపదలఁ జెన్ను వహించినఁ గాక మేదినిన్.

565


వ.

అని మఱియును.

566


సీ.

సత్యంబు దప్పక జరపు నొక్కొకచోట, ననృతంబు లొకచోట నడరఁ జేయు
సరసంపుఁబ్రియములు సలుపు నొక్కొకచోటఁ, బరుషంబు లొకచోటఁ బల్కఁ జేయుఁ
బరమకారుణ్యస్వభావ యౌ నొకచోట, నొకచోట హింసకు నుత్సహించు
నర్థార్జనాతిసమర్థ యౌ యొకచోట, నుచితదానాఢ్య యౌ నొక్కచోట
నిత్యవ్యయంబులు నెఱపు నొక్కొకచోట, నొడగూర్చు బహుధన మొక్కచోట


గీ.

నమర నృపనీతి పెక్కురూపములు గలిగి
చతురవారాంగనయుఁబోలె జగతి మెఱయు
నిట్టినయమార్గములు నీవు నెఱిఁగి నడువు
ఘనతరైశ్వర్యసంసిద్ధి గలుగు నీకు.

567


వ.

అని యిట్లు దమనకుండు పలికినఁ గలంక దేఱినచిత్తంబునం బ్రియం బంది నిజ
భృత్యామాత్యవర్గంబులం గూడుకొని పూర్వప్రకారంబునం బూజ్యసామ్రాజ్యంబు
సేయుచుండె నని విష్ణుశర్మ నృపకుమారులకుం జెప్పినమిత్త్రభేదంబు విని యటమీఁద
సుహృల్లాభంబు తెఱం గెఱింగింపు మనుటయు.

568


శా.

భామానూతనపుష్పబాణ కరుణాపారీణ విద్వజ్జన
స్తోమారామవసంత వైరిజనతాశుండాలహర్యక్ష ది
క్సీమాలంఘనసాంద్రకీర్తిలతికాకీర్ణప్రభావోదయా
సామోచ్చారణభుక్తిముక్తిఫలదా నమ్రైకరక్షామణీ.

569

తరల.

చిరయశోధన శిష్టబోధన చింతితోద్యమసాధనా
సరసభూషణ సాధుపోషణ శత్రులోకవిభీషణా
పరమపావన ప్రాజ్ఞసేవన పద్మనేత్రవిభావనా
స్మరవిరాజిత సత్యయోజిత సర్వలోకసుపూజితా.

570


మాలినీ.

సరసగుణవిశాలా చారుధర్మానుకూలా
వరవితరణకర్ణా వర్ణితానందపూర్ణా
పరుషజనవిదూరా భామినీచిత్తచోరా
గిరిధరవరసేవా కీర్తనీయప్రభావా.

571


గద్య.

ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర, బ్రహ్మనామాత్యపుత్త్ర, సుకవిజనవిధేయ,
నారాయణనామధేయప్రణీతం బైనపంచతంత్రం బనుమహాకావ్యంబునందు మి
త్త్రభేదం బనునది ప్రథమాశ్వాసము.