పంచతంత్రము (దూబగుంట నారాయణ)/పంచమాశ్వాసము

పంచతంత్రము

అసంప్రేక్ష్యకారిత్వము

క.

శ్రీకారుణ్యకటాక్ష, స్వీకృతబుధబంధునికర జృంభితవిమతా
నీకగ్రీవాఖండన, భీగరకరవాల బసువపృథ్వీపాలా.

1


వ.

అవధరింపుము సుదర్శనక్షితీశ్వరనందను లసంప్రేక్ష్యకారిత్వం బెఱింగింపు మనిన
విష్ణుశర్మ వారల కిట్లనియె.

2


చ.

నిజమును గల్లయుం దెలియనేరక క్రోధమునం బ్రమత్తుఁడై
సుజనుల కెగ్గు చేసి చెఱుచుం దనమున్నటిమైత్త్రి మానవుం
డజగరమున్ హరించినమహానకులంబు వధించి బ్రాహ్మణుం
డజితమనోవ్యథం బొరలు నయ్యవివేకముఁ బోల్పఁ బట్టగున్.

3


వ.

అనుటయు నృపకుమారులు తత్కథాక్రమం బెఱింగింపుఁ డనిన నతం డిట్లనియె.

4


సీ.

గౌడదేశంబునఁ గల దగ్రహారంబు, సకలసౌఖ్యములకు జన్మభూమి
తన్నివాసంబుగ ధరణీసురాన్వయ, జాతుఁ డుండును దేవశర్మ యనఁగ
నాయనకులకాంత యాజ్ఞసేని యనంగ, శుభలక్షణాంగి యాసుదతి తనకు
ఘనపురాకృతపుణ్యకర్మంబునను జేసి, సమధికం బైనగర్భము ధరింప


గీ.

నధికసంతోషచిత్తుఁడై యతివఁ జూచి, నాతి నీగర్భమున నున్ననందనుండు
మనకులం బెల్ల నుద్ధరింపంగ నోపు, భాగ్యవంతుఁ డౌ ననఁ దనభర్తఁ జూచి.

5


వ.

యాజ్ఞసేని యిట్లనియె నాథా నీమనోరథసహస్రంబు లేమియుఁ గొఱగా వీయస్థి
రంపు సంసారంబునకుఁ గడకట్టినకార్యంబు తుదముట్ట నేర దని పెద్దలచే వినంబడు
విను మని యిట్లనియె.

6


గీ.

మహి ననాగతకార్యంబు మదిఁ దలంచి, కోరునాతఁడు దుఃఖసంకులత నొందు
బెక్కువిధములఁ జింతింప బెండువడుట, సహజ మది సోమశర్మునిజనకునట్లు.

7


వ.

అనినం దత్కథాక్రమంబు విఫ్రుండు తనభార్య నడిగిన నానితంబినీతిలకం
బిట్లనియె.

8

సీ.

పరఁగ విద్యాభ్యాసపరుఁ డొక్క భూసురుం డనువుగా మహళయంబున భుజించి
చనుదేర నొండొకసదనంబు విప్రుండు పితరులకై పేలపిండి యిడినఁ
గైకొని తా నొక్కఘటము సంపాదించి పొందుగా నాసక్తు వందుఁ బోసి

చేతి కందెడునట్టె చేరువ నాకుంభ మెలమితోఁ బ్రీతుఁడై యచటఁ బెట్టి


తే.

సమధురోత్కృష్టభోజనోత్సవముకతన, నతఁడు సుఖసుప్తి నొందెడునవసరమున
నంతకంతకు దట్టమై యలమఁబడిన, గురుమనోరథ మంతయుఁ గోరుచుండి.

9


వ.

ఆనైష్ఠికుండు తనలో నిట్లని తలపోయం దొడంగె.

10


చ.

కఱ వరుదెంచినన్ ఘటము గర్భమునం గలసక్తు వంతయున్
దఱుఁగక యమ్మి మేఁకఁ గొన దానికిఁ బిల్లలు రెండు గల్గు న
మ్మఱకలు రెంటికిం గలుగు మానుగ దూడలు నాల్గు వాని కి
ట్లఱిముఱి నెన్న నెన్మిదిఁ బదాఱును ముప్పదిరెండుఁ బుట్టఁగన్.

11


వ.

ఇవ్విధంబునం గ్రమక్రమవృద్ధిం బొందినఛాగంబులు కాలాం
తరంబున శతసహస్రసంఘంబు లగుటయు వాని నమ్మి గోధనం
బులు సంపాదింప నవియును బ్రతిసంవత్సరంబును వత్సంబుల
నిడ ననేకసంవత్సరంబులకు నసంఖ్యాతగోధనంబు లగుటయు
వానియందు.

12


సీ.

కోడె లన్నింటిని గూడంగఁ దోలించి మేదింప దుక్కికి మెతక లైన
మ్రుచ్చుగిత్తలఁ బట్టి ముకుద్రాళ్లు గుట్టించి గంతగోనెకు వాని సంతపఱిచి
బేహార మాడింపఁ బెరిఁగినధనమునఁ గమ్మతంబులు వెట్టఁగా ధరిత్రి
నమరినధాన్యంబు లమ్మించి ధనములు గోటులసంఖ్యలై కొలఁది మీఱ

తే.

రాజుచేత మహాగ్రహారములు వడసి, గుళ్లుఁ జెఱువులు వనములు గోపురములు
సౌధములు మల్లెసాలలుఁ జప్పరములు, నంతిపురములు లోనుగా నమరఁ జేసి.

13


సీ.

గజనికేతనములు గట్టించి యన్నిఁట భద్రదంతావళప్రతతి నుంచి
వాజిశాలలు గట్టి వరరూపజవసత్త్వసంపన్నవర్ణితాశ్వములఁ గట్టి
పరశుపట్టసగదాప్రాసతోమరకుంతకోదండహస్తులఁ గూడ నేలి
భేరీమృదంగగంభీరరావంబులు కలయంగ ముందటఁ జెలఁగుచుండ


తే.

రత్నభూషణాలంకృతరమ్యగాత్రు, ననుదినంబును వాహ్యాళి కరుగునన్నుఁ
జూచి బంధుజనంబులు చోద్యపడుచు, నెలమిఁ దమకన్నియల నాకు నీఁదలంప.

14


క.

కులమును రూపును గుణమును, గలకోమలిఁ బెండ్లియాడి కాయజకేళిం
జెలఁగంగఁ బెద్దకాలము, జలజాక్షికిఁ జనుచునుండ సంతతిలేమిన్.

15


తే.

పెక్కునోములు నోమంగ భీతహరిణ, నేత్ర గర్భంబు ధరియించి పుత్రుఁ గాంచ
నాఁడు నత్యంతసుకుమారవైభవమునఁ, బేరు సోమశర్మ యనంగఁ బెరుఁగుచుండ.

16

తే.

కనకసూత్రంబుతో మొలగంట లమర, జోక నలికంబుపై రావిరేక లనుర
జరణయుగమున నందియల్ మొరయుచుండ, నంతటంతటఁ గూర్చుండి యాడునపుడు.

17


చ.

పనితమకంబునన్ గృహిణి బాలకు నెత్తక యుండు దెట్లు నీ
వని భృకుటీవికారవదనాంబుజుఁడై వసుధామరుండు తాఁ
దనకర మొప్పఁ జూచి ఘనదండము గైకొని వ్రేయఁ బిండి పె
ట్టినకలశంబు భగ్న మగుడుం దెలి వొంది యనంతరంబునన్.

18


క.

తలయుం జీరయు నొడలును, దెలతెలఁగాఁబడ్డపిండి దిక్కులు గప్పన్
బలపలనివేడ్కతోడుత, వెలవెలనై బ్రాహ్మణుండు విస్మితుఁ డయ్యెన్.

19


వ.

విస్మితుండై మనోరాజ్యంబు మిథ్య యగుటకుఁ జింతాక్రాం
తం బగునంతఃకరణంబుతో నెగ్గువడి యూరకుండెం గావున
నీవును నమ్మహీసురునట్ల యనాగతమతిం దలంపం దగ దన్న
కొన్నిదివసంబులకుం బరిపూర్ణం బయినగర్భంబున నాతన్వికి
శుభలక్షణాలంకృతుం డైననందనుండు పుట్టిన సాంద్రానందం
బునం బొదలుచున్నసమయంబున.

20


తే.

పుణ్యదివసంబు వచ్చినఁ బొలఁతి వేడ్క, నర్భకుని నాత్మనాథున కప్పగించి
విప్రకన్యాసమేతయై వెడలి నదికిఁ, బావనస్నాన మొనరింపఁ బోవునంత.

21


ఉ.

ఆనగరంబుభూపతిగృహంబునఁ బుణ్యదినంబు వచ్చినన్
దానముఁ గైకొనం దలంచి తక్కినవిప్రులు పాఱుచుండఁగాఁ

దా నది చూచి బ్రాహణుఁడు తద్దయు శోకము నొంది యాత్మలో
మానిని నేల పంపితిఁ గుమారునిరక్షకు లెవ్వ రిత్తఱిన్.

22


వ.

అని మఱియు నమ్మహీసురవరుండు తనమనంబున.

23


ఉ.

ఎన్నఁడు వచ్చుఁ బుణ్యతిథి యెన్నఁడు దానముచేయు భూవరుం
డెన్నఁ డకించనత్వమును నేఁ బెడఁబాసి సమస్తవస్తుసం
పన్ననికేతనుండ నగుభాగ్యము గల్గునొ యంచుఁ గోర్కిమై
నున్నయెడన్ ధనాగమము నొందుటకుం దఱి తప్పె నెట్లోకో.

24


ఉ.

అక్కఱ లెల్లఁ దీఱవు నృపాగ్రణికిం బొడసూపకున్న నా
కిక్కడ వెన్నపాపనికి నెవ్వరు కా పిఁక వేళ దప్పెఁ బో
నక్కడ నేప్రయోజనము లబ్బు మనంబున మానవుండు దా
నొక్కటి చింతసేయ విధి యొక్కఁడు వేఱ తలంచు నక్కటా.

25

గీ.

అనుచుఁ గదలి పోవు నట పోయి క్రమ్మఱ, మగిడి వచ్చి బాలుమొగము చూచు
సుదతి వచ్చుతెరువు చూచు దిక్కులు చూచు, నిక్కి చూచు గోడ లెక్కి చూచు.

26


వ.

ఇవ్విధంబున నాందోళించుడెందంబు కొందలం బంద నందందు సందడిం బొందుచుఁ
బొందుపడి డిందుపఱుచుకొని పుత్త్రసమానంబుగా మునుమున్న పెంచినవకులంబు
నాలోకించి దాని బంధించినసూత్రంబు విడిచి కొనివచ్చి కుమారునిచుట్టునుం
ద్రిప్పి సంజ్ఞగా నెఱింగించి తలవాకిటం బదిలంబుగా నిలిపి పుత్త్రసంరక్షణంబు
నీకుం గర్తవ్యం బని పలికి బ్రాహ్మణుండు చనినం దదనంతరంబ.

27


సీ.

నకులంబు చూడంగ నొకకృష్ణసర్పంబు, వడిగొని మూషికద్వారవీథి
జొచ్చి బాలునిఁ గవియునంతట ముంగి, యుదరి నాగము ముట్టె యొడిసి పట్టి
కంఠంబు గ్రక్కున ఖండించి మే నెల్ల, శతఖండములు చేసి చంపి వైచి
నవరక్తధార లాననమున జొత్తిల్లి శోభిల్ల, మున్నున్నచోన నిలువ


గీ.

దాన మంది యపుడు ధరణీసురుఁడు తన, పట్టిఁ దలఁచుకొనుచుఁ బాఱుతెంచి
శిరము నోరు రక్తపరిషిక్తముగఁ దన, ముంగిటఁ దనుఁ గన్నముంగిఁ జూచి.

28


క.

ఈనోరు రక్త మూరక, కానేరదు శిశువుఁ జంపెఁగా దుర్జాతం
బైనపురు వంచు నుగ్రత, దానిం జావంగ నడిచెఁ దత్క్షణమాత్రన్.

29


వ.

అడిచి యమ్మహీదేవుం డభ్యంతరమందిరంబునకుం జని శతఖండీకృతకృష్ణసర్పంబును
జెలంగి యాడుచున్న తనకుమారు గనుంగొని నాకులమరణంబునకుఁ బరితప్తాంతః
కరణుం డగుచు నుదరతాడనంబు చేసికొనియు శిరంబు పగుల మోఁదుకొనియు ధరణిం
బడి పొరలుచు మొఱలు పెట్టుచు ననేకకాలంబునం బట్టి పట్టివలెఁ బెంచిననకులంబుం
బరామర్శింపక వధించినపాపం బేమిటం బాయునని మఱియు ననేకప్రకారంబుల
బ్రలాపించుసమయంబున భార్య చనుదెంచి యిది యేమినిమి త్తం బని యడిగిన
నతండు తద్వృత్తాంతం బంతయుం జెప్పిన నమ్మగువ యతని కిట్లనియె.

30


క.

పదిలముగ వినక చూడక, మొదలఁ బరామర్శ చేసి మొనయక పరుసం
బొదవించు నెవ్వఁ డాతం డదయత క్షౌరకుఁడువోలె నాపదఁ బొందున్.

31


వ.

అనిన నవ్విధం బెఱింగింపు మని యావిప్రుండు భార్య నడిగిన నమ్మానినీతిలకం
బిట్లనియె.

32


చ.

కలఁ డొకపట్టణంబునను గ్రామణి వైశ్యకుమారుఁ డెల్లవా
రలుఁ గొనియాడునట్టివివరంబుగలం డతిధార్మికుండు పె
ద్దలయినతల్లిదండ్రులును దత్పరివారము రోగబాధలన్
బొలిసిన దాదిచేఁ బెరిఁగి పూర్వవయఃపరిపాకశాలియై.

33

గీ.

ఉండి సెట్టిబిడ్డఁ డొకనాఁడు తనదాదిఁ, జేరఁ బిలిచి నాకుఁ జెప్పు మతివ
యయ్య చేర్చి నట్టియర్ధ మెక్కడఁ బోయెఁ, దెలిసి లేమి నెట్లు తిరుగువాఁడ.

34


సీ.

తల మాసినపుడును దైల మించుక లేక, ముదమునఁ గోకయు మొలకు లేక
కడుపార నన్నంబు కుడువ నెన్నఁడు లేక, మన సైన నొకపోఁక తినఁగ లేక
కమ్మపువ్వులపూఁత కలలోపలను లేక, పేర్మికతంబునఁ బెండ్లి లేక
ప్రియబంధుజనులకుఁ బెట్ట నేమియు లేక, దీవించునర్థులఁ బ్రోవ లేక


గీ.

యేల యున్నాఁడ నీదేహ మేల నాకు, విడుతు నీప్రొద్దె కాదేని విపినభూమి
చొచ్చి మునివృత్తిఁ దపము భాసురము గాఁగఁ, జేసి పుణ్యలోకంబులు చేరుఁవాఁడ.

35


వ.

అనినం గన్నీ రొలుక నయ్యుపమాత యిట్లనియె.

36


క.

నాకన్నతండ్రి నీ కీ, శోకం బేమిటికి నేను జూడఁగ భాగ్య
శ్రీకలిమి మెఱయుచుండెదు, లోకంబులు వొగడ బంధులోకములోనన్.

37


గీ.

వెలయ నీవు జనించినవేళఁ దొల్లి, దివ్యయోగీంద్రు నడిగినఁ దేటపఱిచె
నిన్నిసంవత్సరంబులు నిట్టిమాస, మిట్టిదినమున శ్రీకాంత యితనిఁ జేరు.

38


వ.

అని యతం డిట్లు చెప్పె నది యాదిగ నేను సంవత్సరమాసదినంబు లెన్నికొనుచుండు
దు నదియును నెల్లింటికిం బరిపూర్ణం బగుచు వచ్చెఁ దప్ప దని యవ్వైశ్యకుమారు
నూఱడం బలికి మజ్జనభోజనాదుల నతనిఁ బరితుష్టుం జేసి మృదుతల్పంబున నునిచిన
నారాత్రి నిద్రించె నక్కుమారుండును దీర్ఘనిశ్శ్వాసవ్యాకులమానసుం డగుచుఁ
దృతీయయామంబున నిద్రాముద్రితలోచనుం డయ్యుఁ జతుర్థయామావసానంబున.

39


ఉ.

బద్ధగజాజినాంబరము బాలశశాంకళావతంసస
న్నద్ధజటాభరంబు కరుణారసపూర్ణవిలోకనంబునున్
శుద్ధపటీరహీరరుచిశోభితవర్ణము నైనమూర్తితో
సిద్ధవరేణ్యుఁ డొక్కరుఁడు చెచ్చెర నాతనిఁ జేరి యిట్లనెన్.

40


శా.

ఓరీ వైశ్యకుమార సాహసమహోద్యోగంబునన్ జావఁగాఁ
గోరం గారణ మేమి యేఁ గలుగ నీకుం జింత యిం తేల న
న్నారాధించితి పూర్వజన్మమున నయ్యత్నంబునన్ సంపదల్
చేరం బ్రాప్తము నేఁట రేపటను నిశ్చింతుండవై యుండుమీ.

41


క.

కల యని చూడకుమీ నా, పలు కంతయు నిక్కువంబు భావించి మదిన్
దలపోసి యేను జెప్పిన, తెలివిం దగ నాచరింపు ధీయుక్తుఁడవై.

42


వ.

అవ్విధం బెట్టి దనిన.

43

సీ.

అరుణోదయంబున హరిహరస్మరణంబు, చేయుము మేల్కాంచి చిత్త మలరఁ
దల దువ్వి ముడిచి వస్త్రము పొందుగాఁ గట్టి, చెనసి యాచమనంబు చేసి వచ్చి
సుస్నాన మొనరించి సురభూసురార్చనా, యత్తచిత్తుం డెట్ల యట్ల యుండు
తఱి వచ్చి భిక్షుకత్రయము నీముందటఁ, బొడమినఁ గని వారిఁ బూజ చేసి


గీ.

లగుడమున మస్తకంబులు పగుల నడువఁ, దాఁకు వడునట్టి భిక్షుకత్రయము చూడఁ
దత్క్షణంబున ఘననిధిత్రయము నగుచుఁ, గోటిసంఖ్యలమాడల కుప్ప లగును.

44


వ.

ఇవ్విధంబున సంప్రాప్తం బయినధనంబువలన.

45


సీ.

దేవతాగృహములు దృఢముగాఁ గట్టించి, ఘనతటాకంబులు కలుగఁజేసి
వనములు పెట్టించి వడుగులుఁ బెండ్లిండ్లు, భూదేవసమితికిఁ బొందుపఱిచి
కీర్తికి నెలవైనకృతులకుఁ గర్తవై, నెలకొన నంతంత నిధులు నిలిపి
యధిపతిచేఁ గొని యగ్రహారము లిచ్చి, మఱియుఁ బొందైనధర్మములు చేసి


గీ.

యాశ్రితుల బంధుజనముల నరసి మనిచి, పుత్త్రపౌత్త్రాభివృద్ధితోఁ బొగడువడఁగ
లాలితంబుగఁ బెద్దకాలంబు బ్రతుకు, మనుచు సిద్ధుండు కానరా కరుగుటయును.

46


వ.

అప్పు డావైశ్యకుమారుండు తనదాదిం బిలిచి యిట్లనియె నేఁ డరుణోదయానంత
రంబ మనగృహం బలంకరించి శుచిస్నానంబు చేయించి గృహదేవతలం బూజింపు
ముదయవేళకు నెద్దియేనియు శుభప్రాప్తికిఁ గారణంబు గలదు పొమ్మనిన నమ్ముదుసలి
దాదియు నట్ల చేసినయనంతరంబ.

47


సీ.

పాకశాసనపురప్రాసాదశిఖరాగ్రగురుతరసౌవర్ణకుంభ మనఁగఁ
బూర్వదిగంగనాస్ఫురితఫాలస్థలీదీపితసిందూరతిలక మనఁగ
బహుళవీచీస్ఫురత్ప్రార్దిగంభోరాశికూలప్రవాళనికుంజ మనఁగ
నమరాధిపతిసతీహస్తాబ్జవిన్యసమోహనమాణిక్యముకుర మనఁగ


గీ.

నరుణకిరణుండు పొడచూపె నఖిలజనక, రాబ్జములతోడఁ గుముదవనాలి మొగుడ
జారచోరులచిత్తంబు జల్లనంగఁ, జక్రవాకంబు లానందజలధిఁ దేల.

48


వ.

ఇవ్విధంబున సూర్యోదయం బగుటయుఁ గనుంగొని యవ్వైశ్యకుమారుండు తన
దాదిం బిలిచి యిట్లనియె.

49


క.

క్షారాభ్యంగస్నానము, లారంగ నవశ్య మగుట నతిశీఘ్రగతిన్
జేరంగఁ బిలువు నాపితు, నీరును నటకలియుఁ గాచి నీవు లతాంగీ.

50


వ.

అనిన నాయమ విదగ్ధక్షౌరకుం బిలిచి తెల్పిన వాఁడును దంతధావనపదనఖధావనాది
క్షౌరకర్మంబులు తనకు నత్యంతసమీచీనంబుగాఁ జేసినం బ్రియం బంది యవ్వైశ్యుం
డతని కిట్లనియె నీ వింతకుమున్ను నావలన నెన్నఁడునుం ప్రయోజనం బెఱుంగవు

నేఁ డించుకతడవు మద్గృహంబున నిలువు మని నిలిపి తైలాభ్యంగనస్నానం బాచ
రించి ధౌతపరిధానశోభితుం డై మహాదేవు నర్చించి గృహదేవతలం బూజించి
విశుద్ధాత్ముం డయి యుండ నంత విధిప్రేరితం బైనక్షపణకత్రయం బావైశ్యకుమారుని
ముందఱం బొడచూపి నిలిచిన నతండు వారలం బూజించి తదీప్సితాహారంబులఁ
దృప్తులం జేసి లగుడఘాతంబుల నమ్మువ్వురం బ్రహరించిన వారు సంపూర్ణనిధి
త్రయం బగుటయుఁ దద్ధనంబుఁ దనగృహంబున నిండించుకొని సుఖంబుండి
నాపితునకు విశ్వాససంరక్షణార్థంబుగా సువర్ణనిష్కశతం బొసంగి నిగూఢంబుగా
ననిపిన.

51


క.

కొనిపోయి నిష్కశతమును, తనకాంతకు దాఁప నిచ్చి తద్వృత్తాంతం
బెనయంగఁ దెలిపి మంగలి, మనమునఁ దలపోసి వైశ్యమతముం జేయన్.

52


వ.

తనభార్య కిట్లనియె.

53


క.

పరదేసు లైనజోగుల, తిరిపంబున నడఁచి ధనముతిప్పలఁ బడసెన్
వెర వెఱిఁగి సెట్టిబిడ్డఁడు, తరుణీ నే నొద్దనుండి తప్పక కంటిన్.

54


వ.

అని క్షౌరకుండు క్షారాభ్యంగనస్నానధౌతపరిధానాదికర్మంబు లావైశ్యకుమారు
నట్ల తానును నాచరించి వేల్పుల వలగొని భిక్షుకాగమనంబును గోరుచుండు
నంత నప్పురంబునఁ గాపురం బున్న వృద్ధు జంగమయ్య యొక్కరుండు క్షౌరకునిగృహ
ద్వారంబు చొచ్చి లోపలికిం జని ధర్మమే సంచితార్థం బని పేరెలుంగున భిక్షం
బడుగుటయుఁ గనుఁగొని నాపితుం డాభిక్షున కిట్లనియె.

55


గీ.

నీవు గాక యుండ నెరయంగ నిరువురఁ, దొడికి వచ్చితేని నొడిక మైన
భంగి మువ్వురకును భైక్షంబు పెట్టెదఁ, గూర్చి తెమ్ము మ్రొక్కు తీర్చుకొనఁగ.

56


వ.

అనినం బ్రమోదంబు నొంది యాభిక్షుకుండు మఱియును నిరువురం దోడ్కొని
వారుం దానును జనుదెంచి నిలిచినం జూచి క్షౌరకుండు.

57


గీ.

మెచ్చు లొదవంగ నర్చన లిచ్చి వారి, కిచ్చవచ్చిన భోజనం బిడుచు నుండి
త్వరితముగఁ బాఱి వాకిటితలుపు వైచి, శీఘ్రగతి ముట్టి లగుడంబు చేతఁ బట్టి.

58


క.

పొడవు గలజంగమయ్యను, బెడతల లగుడంబుచేత బెట్టడువ మహిన్
బడినఁ గని పాఱునిరువుర, బడి తప్పక మొఱలు పెట్టఁ బరువడి నడచెన్.

59


క.

అప్పుడు మొఱ్ఱో యనుచుం, దప్పక మువ్వురును గూయఁ దలవరులు వడిన్
దప్పు గొని మదురుగోడలు, కుప్పించి యదల్చి వెఱవకుఁడు మీ రనుచున్.

60


వ.

ఆభిక్షుకత్రయంబును మోపించుకొని నాపితుం బెడకేలు గట్టికొనివచ్చి భూవరు
సమ్ముఖంబునం బెట్టిన నతండు నాక్షౌరణనిం జంపించి తద్గృహంబు సర్వంబునుం

జూఱగొనియం గావున నీవు న ట్లవిచారమూఢుండ వని పలికి వెండియు.

61


క.

నెఱయంగఁ బలుకనేరని, యెఱుకయు నాచారహీనునిలువడియును నీ
వెఱుఁగుము నిరర్థకం బని, యఱిముఱి భస్మమున నిడినయాహుతిఁ బోలెన్.

62


వ.

అని మఱియుం దనపురుషు నుద్దేశించి.

63


చ.

తనమతి వేగిరించి నెఱి దప్పఁగఁ గర్జము సేయరాదు చే
సినయవివేకి నాపదలు చెందుట సిద్ధము నీతికోవిదుం
డనయము సద్విచారమతి యై యొనరించినయట్టికృత్యముల్
పనుపడి భవ్యసంపదలఁ బాయ కొనర్చు ధరామరేశ్వరా.

64


వ.

అని యిట్లు తనభార్య చెప్పినవివేకవచనంబులకుఁ బ్రమోదంబును నవిచారమూర్ఖత్వం
బునం దాను జేసిననకులవ్యాపారంబునకుఁ బరితాపంబును నైనచిత్తంబుతో
సర్వమ్మును దైవాధీనంబు గాక యని పలికి యమ్మహీదేవుండు ధననందను నుపలా
లనంబు చేయుచుఁ దనభార్యయుం దానును జిరతరజీవనస్థితిం బ్రవర్తిల్లి రని చెప్పి
సుదర్శనక్షితీశ్వరనందనులకు విష్ణుశర్మ యిట్లనియె.

65


చ.

కదిసి పఠింప లోకహితకార్యము లెల్లను దోఁచు మూఢులై
చదువనివారికిం దెలివి చాల నొనర్పదు నీతిసంపదా
స్పద మగునీప్రబంధము విశాలగుణోన్నతి నెల్లనాఁడు న
భ్యుదయముఁ జేయు భక్తి వినుచుండినఁ బాఠము చేయుచుండినన్.

66


క.

ధర్మార్థకామసాధన, కర్మములకుఁ దగినయట్టికథ లన్నియు మీ
కర్మిలిమై వినిపించితి, నిర్మలదృఢచిత్తు లగుచు నెగడుఁడు మీరల్.

67


వ.

అనిన విష్ణుశర్మకుం గుమారు లిట్లనిరి.

68


చ.

విమలగుణోన్నతాపరుసవేది యొకించుక సోఁకినట్టి లో
హములును శుద్ధకాంచనమయత్వమునుం గనునట్టిభంగి ను
త్తమభవదీయవాగమృతధారల నాత్మలు నిర్మలంబు లై
యమర వివేకసంపదకు నర్హుల మైతిమి మీకతంబునన్.

69


వ.

అని యతనికిం బ్రణామంబులు చేసి మఱియు నక్కుమారులు నృపనీతిశాస్త్రం
బులు చదువుచున్నయనంతరంబ సుదర్శనక్షితీశ్వరుండు విష్ణుశర్మ రావించి యన
ఘా మీవలనం గుమారు లత్యంతప్రజ్ఞాధురంధరులై బ్రతికి రిటమీఁద నాయుధా
భ్యాసంబు చేయింపఁ గాలంబె గావునఁ జదువు చాలింపు మని యమ్మహీదేవు
నగణ్యగోహిరణ్యాదిదానంబుల నధికసంతుష్టుం జేసి బహుమానంబుగా నను
పుటయును.

70

శా.

బాలాహృత్సరసీమరాళ పరిఘాభవ్యోన్నతోద్యద్భుజా
లీలారూపజయంత పద్మవదనాళీనూత్నకందర్ప నా
రీలావణ్యధనాధిపాత్మజ కుమారీపూర్ణ రాకాశశీ
భూలోకప్రమదారమాధిప సితాంభోజాతపత్త్రేక్షణా.

71


లయగ్రా.

కింకరజనాంబురుహపంకరుహమిత్త్ర రిపుపంకరుహరాజిహరిణాంకనిభమూర్తీ
శంకరమనోజ్ఞకరకంకణవచోవిభవ వేంకటగిరీశకరుణాంకురితభాగ్యా
సంకులమణీనిచయసంకలితహేమసదలంకరణదేహ మకరాంకురకరాసీ
కుంకుమహిమాంబుశశిసంకుమదసంకరవిశంకటపటీరయుతపంకిలశరీరా.

72


భుజంగప్రయాతము.

దిగంతప్రమేయప్రదీప్తారుకీ ర్తీ
ధగన్మేరుధైర్యా సదాదానమూర్తీ
యగణ్యోరుభర్మాద్యలంకారభారా
దృగంతానుకూలప్రతిక్ష్మాపవీరా.

73

గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజన
విధేయ నారాయణనామధేయప్రణీతం బైనపంచతంత్రం బను
మహాప్రబంధంబునం దసంప్రేక్ష్యకారిత్వం బనునది పంచ
తంత్రంబునందు సర్వంబును బంచమాశ్వాసము.

————