నేటి కాలపు కవిత్వం/భావనాధికరణం

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

భావనాధికరణం.

పూర్వపక్షం.

అవునయ్యా; మీరేదైనా అనండి. ఇప్పటిది రొమాంటికు, అంటే భావనాపటువైన, కవిత (Romantic Poetry). ఇది కొత్తది గనుక వెనకటి కవితకంటె చాలా మంచిది అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను. రొమాంటికు కవిత భారతవర్షానికి కొత్తగాదంటున్నాను. మనకూ ఆర్యావర్తానికీ గలసంబంధం గ్రీకు భిన్నులైన యూరోపునివాసులకూ గ్రీసుకూ గల సంబంధకంటె విలక్షణమైనది. బారత వర్షసాహిత్యవిజ్ఞానానికి గ్రీకులాటినుభాషల విషయాలకూ అనుచితసాదృశ్యం కల్పించుకొనడం. యూరోపుఖండ సాహిత్య చరిత్రను భారత వర్షానికి అవిచారితంగా తగిలించడం దాన్ని అప్రశస్తంగా అనుకరించడం అజ్ఞానం. భారతవర్షానికి రొమాంటికు కవిత (Romantic Poetry) కొత్తగాదన్నాను. ఇతిహాసదశ ననుసరించి మితార్ధంలో (Romantic Poetry) రొమాంటికు పొయట్రీ అనే మాటల నెట్లా అన్వయించినా బావనావృత్తితో ఉదాత్తభావప్రకర్షంగలది రొమాంటికు కవిత అని సాహిత్య వేత్తల అభిప్రాయం. ఈసంగతినే (Romantic movement in English Poetry) రొమాంటిక్ మూమెంట్ ఇన్ ఇంగ్లీష్ పొయట్రీ అనే గ్రంథంలో "The great poets of every age but the eighteenth have been romantic. What are Chaucer Shakespeare and Coleridge, if not romantic"

(అన్నికాలాల్లోను మహాకవులందరు రొమాంటికు కవులే అయివున్నారు. చాసరు, షేక్‌స్పియరు, కోల్రిడ్జిరొమాంటికు కవులుగాక మరెవరు?) అని

"What is really meant by all the phrases and by the name of the Romantic Movement, is simply reawakening to a sense of beauty and strangeness in natural things and in all the impulses of the mind and the senses"

ఈసమాసాలు రొమాంటికు మూమెంటు అనేపేరు వాస్తవంగా తెలిపేదేమంటే మనస్సుయొక్క తక్కిన యింద్రియాలయొక్క స్వభావగతుల్లోను ప్రకృతి సిద్ధపదార్థాల్లోను సౌందర్యాన్ని, వైలక్షణ్యాన్ని గోచరింప జేసే భావనావిస్తృతిని పొందించగల ప్రబోధం తప్పమరేమీగాదు". అని

"The quality which distinguishes the poetry of the beginning of the nineteenth century, the poetry which we roughly group together as the Romantic movement is the quality of its imagination and this quality is seen chiefly as a kind of atmosphere which adds strangeness to beauty."

"రొమాంటికు సరణి అనే పేరుగలిగి క్రీస్తు శకం 19-వ (కలి 50-వ) శతాబ్ది ప్రథశతాబ్ది ప్రథమభాగాన ఆకృతిపొందినకవితయొక్క విశేషలక్షణం దాని (ఉదాత్తభావాప్రకర్షరూపమైన), భావనాస్తృతి. సౌందర్యానికి వైలక్షణ్యమను సంధానం చేసే సంవిధానమే యీ విశేషంగా దృష్టమవుతున్నది" అని "That it may be affirmed that in studying this period , we are able to study whatever is essential in poetry"

ఈ తీరుగా ఈ కవితా ఘట్టాన్ని చదివేటప్పుడు ఇంగ్లీషు కవిత్వంలో ప్రధానమైనదంతా, అంటే కవితలో ప్రధానమైనదంతా చదువగలుగుతున్నామని స్పష్టంగా చెప్పవచ్చును) అరి ఆర్ధరు సైమన్సు (Arthur Symons) విశదం చేస్తున్నాడు. భావనా విభుత్వంతో విశిష్టమైన కవిత అంతా రొమాంటికు కవిత అని సాహిత్యవేత్తల అభిప్రాయమన్నాను. భారతవర్షకవితలో ఉదాత్త భావ ప్రకర్షరూపమైన భావనావిస్తృతి చిరకాలం నుండి సంగతమైవున్నది.

"కాచిత్ కవినా నవా దృష్టిః" (ధ్వ. న్యా)
"నూతనైర్వైచిత్ర్యైర్జగంత్యా సూత్రయంతి" (ద్వ. లో)

అని యిట్లా సౌందర్య విలక్షణ్యతత్పరత భారతీ సాహిత్యంలో ప్రాచీన కాలాన్నే విజ్ఞాత విషయం ఇక భావనా విస్తృతిని ఉద్‌బోధించే విశేషం భారత వర్ష ప్రకృతిలోనే వున్నది. అత్యున్నతంగా నభశ్చుంబి అయి నిల్చున్న హిమాలయం, రజత ప్రభలతో ఉదగ్రమై హృదయాలను అధిష్ఠించే కైలాస శృంగం, మానస సరస్సు, హిమగిరి ఉపత్యకలు. అధిత్యకలు, ప్రభూత శక్తితో భూమికి అవతరించే భాగీరథి ప్రభృతి మహానదులు నైమిశం, బదరీవనం, సాంద్రారణ్య పరివృతమైన వింధ్యాచలం, సీతాపావితమై న గోదావరి తీర భూములు ధర్మస్థిరమైన శ్రీరామచరణం చిహ్నితం చేసిన ఆశ్రమస్థలులు ఋషులు, తపస్సీమలు, శ్రీశైలం. భారత వర్ష కవికి సిద్ధోపదేష్టలై భావనా విభుత్వాన్ని ఉదాత్త భావ ప్రకర్షాన్ని ప్రసాదిస్తున్నవి. ఉతరరామ చరిత కంటె రొమాంటికు కవియెవ్వరు.? యూరోపు ఖండ సాహిత్య దృష్టి ప్రకారం వాల్మీకి ,వ్యాసుడు, భవభూతి ఇట్లాటి కవులందరు రొమాంటికు కవులే అయివున్నారు. అయితే వారి బావసరణులు వేరుగా వచ్చును. ఇట్లాటి యీ భేదాన్నే (Romantic Revolt) రొమాంటికు రివోల్టు అనే గ్రంథంలో "We are bound to admit that we apply the term "Romantic" to words worth in a sense very different from that in which we use it of Coleridge, in Rousseau or Herder in a sense very different from that in which we give to Chateaubriand or Burger or Tieck"

(రొమాంటికు అనే పదాన్ని వర్డ్సువర్తుకు వర్తింపజేసి దానికంటే భిన్నమైన అర్ధంలో కోలగిడ్జికి షెటూబ్రియాండు, బర్గరు టీకు అనే వారికి వర్తింపజేసే దానికంటే భిన్నమైన అర్ధంలో రూసో హార్డురులకు అన్వితం జేస్తున్నామని మన మొప్పుకొనక తప్పదు) అని చార్లెసు యెడ్వినువాహను (Charles Edwin Vaughan) వ్యక్తం చేస్తున్నాడు. రొమాంటికు-అంటే-ప్రకృష్ట భావనా పాటన విశిష్టమైన - కవిత భారత వర్షానికి కొత్తగాదని ఉత్తర రామచరిత్ర కర్తృ ప్రభృతులు రొమాంటికు కవులని విశదపరచాను. అయితే కలిశకం 49- వ శతాబ్ది (క్రీస్తుశకం 18-వ శతాబ్ది) ప్రథమ భాగంలో యూరపు దేశాల్లో కావ్య రచనయందేర్పడ్డ భావజాడ్యం అక్కడ తిరస్కార్యమైనట్లు నన్నయాదుల భారతాభాసాలు మొదలైనవాటిలో ఆరంభించి రాను రాను వికృతరూపం పొంది తెలుగుకృతుల నావరించి వున్న బావజాడ్యం వాస్తవంగా త్యాజ్యమేను. ఆంధ్ర జాతియొక్క సర్వేతిహాసంతో ఈ భావజాడ్యం సంబద్దమైవున్నది.

దీన్ని వాఙ్మయసూత్రంలో ప్రధమ ద్వితీయ ఖండాల్లో విశదంచేశాను. తెలుగు దేశపు ఆ భావజాడ్యం తిరస్కార్యమైతే యిప్పటికృతుల్లో వున్న చిల్లర శృంగారం పులుముడు శబ్దవాచ్యత అయోమయం దృష్టి సంకోచం, ఊగుడు మాటలు మొదలైన కల్మషం అంతకంటే నూరు రెట్లక్కువగా తిరస్కార్యమంటున్నాను. యూరోపు ఖండ సాహిత్య చరిత్ర భారత వర్ష సాహిత్య చరిత్ర అనుకొని భారత వర్షపు సాహిత్యానికి అంధులై చిల్లర శృంగారం పులుముడు అయోమయం మొదలైన వాటి పాలుగావడం అజ్ఞానం. భావనావిభుత్వంతో ఉదాత్త భావ ప్రకర్ష రూపమైన రొమాంటికు కవిత భారత వర్ష సాహిత్యంలో చిరకాలం నుండి ప్రతిష్టమై వున్నదని తెలిపినాను. వాచ్యరమణీయతా ప్రకారమైన యీ రొమాంటికు కవిత భారత వర్ష దృష్టి ప్రకారం సాధారణంగా కొంచె మెచ్చుతక్కువగా భారత వర్ష సాహిత్యంలో గుణీభూత వ్యంగ్య కోటిలో చేరుతున్నది. కాళిదాసాదుల్లో గుణీభూత వ్యంగ్య దశ గూడా గడచి సత్వోన్నతి గల వ్యంగ్య దశగూడా గుణీభూత వ్యంగ్యం కంటే పరిణతమైనది. కవితకు భారతవర్షసాహిత్యంలో చిరకాలం కిందటనే వర్తించగలిగింది. కవితా దశలు జాతుల సంప్రదాయాలతో సంబద్ధమయ్యే వున్నవి.

సత్వశ్రేయః పరమత్వాన్ని అనుభవించగలిగిన భారతవర్షం కవితలో తదను రూపమైన వ్యంగ్యదశను దర్శించగలిగింది. యూరోపు ఖండం యొక్క యేసంప్రదాయాల పరివర్తనం వల్ల కవితకు ప్రస్పుటంగా యీ దశా పరిణామం సిద్ధిస్తుంది? అనే విచారణ నాకిక్కడ అప్రసక్తం యూరోపు ఖండ సాహిత్య ప్రశంస యింతటితో వదులుతున్నాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయ సూత్ర

పరిశిష్టంలో భావనాధికరణ సమాప్తం.