నేటి కాలపు కవిత్వం/గీతాధికరణం

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

గీతాధికరణం.

అవునయ్యా; ఇప్పటివి పాడితే బాగుంటవి. ఇట్లా వెనకటివి పాట కనుకూలమైనవి గావంటారా? అది అసంబద్దం. (Lyre) లైరుమీద పాడడం గ్రీసుదేశంలో ఆదినవుండేది. తరవాతభావవేగంగల వాటినన్నిటినీ పాడినాపాడకున్నా లిరిక్సు అని కావ్యకోటిలో చేర్చారు. ఈ పాశ్చాత్యవిధాన మెట్లావున్నా పాటపాడడం కవితకు ముఖ్యం గాదు. అది పఠనమాత్రాననే రసాస్వాద జనకమవుతుంది. గతివిశేషాదులచేత లక్షితమైన పద్యంగానీ కవితకుపాట ముఖ్యంగాదు. పాట పాడడమే ముఖ్యమని ఒప్పుకుందాము. గీతాలు కందాలు మొదలైనవన్నీ పాటకనుకూలమైనవే అవివెనకటినుండే వున్నవి. వీటిలో కొత్తయేమీలేదు. రామాయణాన్ని రామలక్ష్మణులు పాడినారనే వాల్మీకిచెపుతున్నాడు. కనుక పాటవిశేషం దీంట్లో యేమీలేదు. నాటకపు పద్యాల నన్నిటినీ పాడుతూనే వున్నారు గదా. కాదుకూడదు పాడుతుంటే యిప్పటివి మనోహరంగా వుంటవంటారా? పాడితే యేది మనోహరంగా వుండదు? గరికెతో పచ్చడి చేసి గరికెపాటి అగ్రహారం సంపాదించారని మాప్రాంతాల్లో చెప్పుకుంటారు. అది తిరగమాతగింజల రుచిగాని గరికెదికాదు. పాడితే అన్నీ బాగావుంటవి. నన్నుచూడరా నన్నుచూడవే అని రాగం మీద రాగం వేసి పాటగాండ్లు పాడుతుంటే బాగానేవుంటుంది. ఆబాగు రాగానిదని అంటాము. పాడితే బాగు గనుక ఉత్తమకవిత్వంమనడం ఒప్పుకోమని తిరస్కరిస్తున్నాను.

అని శ్రీ..ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో గీతాధికరణం సమాప్తం.