నేటి కాలపు కవిత్వం/ప్రకాశాధికరణం

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

|ప్రకాశాధికరణం.

పూర్వపక్షం.

మీరు గుణాలు కనబరచలేదు. మీరుదోషాలు ప్రదర్శిస్తున్నారు. దోషాన్వేషణం మంచిదిగాదు. శివుడు విషం కంఠంలోఉంచి ప్రకాశానికి తీసుకొనిరాక చంద్రుణ్ని నెత్తినపెట్టుకొని ప్రకటిస్తున్నాడు. అట్లా మీరు దోషాలను దాచవలసింది. కాని దోషాలను ప్రకటిస్తున్నారు. అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. శివుడి ఉదాహరణం యాచకులు దానానికి పోయినప్పుడు దోషాలేమైనావుంటే క్షమించి మాగుణాలకే మెచ్చుకొని దానంజెయ్యమని చెప్పడానికి పనికివస్తుంది. శరణాగతులను కాపాడేటప్పుడు వారిదోషాలను గణించ నవసరంలేని సమయం వస్తుంది. అట్లాటి సందర్భాల్లో దోషాన్వేషణం అనావశ్యకం అందుకే

"దోషో యద్యపి తస్య స్వాత్ సతామేతదగర్హితం" (రా)

అని విభీషణుడి విషయంలో శ్రీరాము డంటాడు. కాని కావ్యవిచారణలో దోషనిర్ణయం అవశ్యకమే అవుతున్నది. కాకుంటే సాహిత్య గ్రంథాల్లో దోషప్రకరణమే అనుచితమై వుంటుంది.

"తదల్పమపి నోపేక్ష్యం కావ్యే దుష్టం కదాచన
 స్యాద్వపుః సుందరమపి శ్విత్రేణైకేన దుర్బగం." (కా ద)

(కావ్యంలో దోషం కొద్దిదైనా ఉపేక్షించరాదు. శరీరం సుందరమైనదైనా ఒక్కకుష్ఠంచేత దుర్భరమవుతున్నది)

అని దండి అంటున్నాడు.

"సభాం వా న ప్రవేష్టవ్యం వక్తవ్యం నా సమంజసం
 అబ్రువన్ విబ్రువన్ వాపి నరో భవతి కిల్బిషి" (మను)

(సభలో ప్రవేశించరాదు. ప్రవేశించిన తరువాత సత్యమే తెలుపవలెను. అసలు చెప్పకున్నా, వక్రమార్గంలో చెప్పినా నరుడు పాపి అవుతున్నాడు.) అని మనువుచెప్పుతున్నాడు. పులుముడు, అయోమయం, క్షుద్రశృంగారం మొదలైనవాటిచేత లోకం వంచిత మవుతున్న దని తెలిసినప్పుడు సత్యప్రకటనం ధర్మమని అనుకొంటున్నాను. ఇకగుణాలవిషయం నాకు కనబడ్దవరకు చెప్పినాను. మరేవైనా గుణాలువుంటే యెవరైనా చెప్పితేవింటాను. అవి దోషాలని స్థిరపడితే అవిదోషాలని విన్నవిస్తాను. గుణాలైతే సంతోషిస్తాను. మనవారు పరిణతబుద్ధులై సంస్కారపరిపాకంతో గుణవత్కావ్యాలు రచిస్తే యెవరికి ఆనందదాయకంగాదు?

అని శ్రీ..ఉమాకాన్తవిద్యాశేఖరకృతిలోవాఙ్మయసూత్ర

పరిశిష్టంలో ప్రకాశాధికరణం సమాప్తం.