నృసింహపురాణము/పంచమాశ్వాసము

శ్రీరస్తు

పంచమాశ్వాసము

శ్రీకరకటాక్షనిగమ
శ్లోకితవివిధావధాన సుకశరణభుజ
ప్రాకారకృపానిత్య
స్వీకార యహోబలేశ శ్రీనరసింహా.

1


వ.

దేహ రోమహర్షణుండు మహర్షుల కిట్లనియె. నివ్విధంబునం బటుశస్త్రపాతంబు
మొదలుగా దైత్యనాయకుండు చేయునపాయంబు లనేకంబుల నెందును దగులుప
డక నిగుడుప్రకటితాహ్లాదుం డగుప్రహ్లాదుచందంబుఁ గనుచుం దజ్జనని భయవిస్మ
యానందంబులసందడిం బడినడెందంబుతోడ భవిష్యత్కాలవిపాకంబునకు నాశం
కిత యగుచు నుండు నంత.

2


క.

కట్టినకట్టులు దనువున, దెట్టిన పెనుకొండపొదలు దీఱిచికొనుచున్
బిట్టుజలధి నెడలినయా, దిట్టనితెఱఁ గసురవిభుఁడు తెలియన్ వినియెన్.

3


వ.

ఇట్లు బహుభంగులఁ దనకావించుకల్మషంబుల ముసిముట్టక మెఱయు నాజగజెట్టి
చందంబు విని డెందంబున భయంబును నద్భుతంబునుం గోపంబును ముప్పిరిగొన
హిరణ్యాక్షపూర్వజుండు గర్వంబువాఁడిమియుఁ జిత్తంబువేఁడిమియు మాత్సర్యంబు
పోడిమియు దరంకి పెఱకులమెఱుంగుటమ్ములు మెఱమినతెఱంగున నతనిచరిత్ర
స్మరణంబులు చిత్తోత్కంపంబు నొనరింపఁ గంపితశరీరుండును భృకుటీవికారుండు
ను గల్పితస్వేదసంచారుండును నగుచుఁ దద్వధోపాయంబున కుపాయం బూహించి
యెద్దియుం గానక కలుచపడి పెలుచ నంతిపురంబు వెలుపడి కొలువుకూటంబు
నకు వచ్చి సింహాసనాసీనుండై పెద్దలునుం బ్రెగ్గడలును దొరలునుం బరివేష్టింపఁ
గొలువుండి కొడుకుం బిలిపించిన.

4


క.

బహుమేఘపటలపరివృత, సహస్రకిరణుండపోలెఁ జనుదెంచె జగ
న్మహితుఁడు ప్రహ్లాదుఁడు దు, స్సహతేజుఁడు ఘోరదనుజసంవేష్టితుఁడై.

5


మ.

హరినామాంకము లుగ్గడించుచు ముకుందానేకచారిత్రముల్
వరుసం గీర్తన సేయుచున్ వరదు తత్త్వవ్యాప్తిఁ జింతించుచున్

బరమానందనిరూఢి నొండొకటియున్ భావింప కేతెంచున
ప్పురుషశ్రేష్ఠునిఁ జూచి దైత్యవిభుఁ డుద్భూతాధికోద్వేగుఁడై.

6


చ.

కవిదెసఁ జూచి వీఁడు కడుకష్టుఁడు వీనిమనోగతంబునం
దవిలినదైవ మెవ్విధులఁ దక్కద యక్కట యింకఁ జేయనే
మి వడువు గల్గు నీశిశునిమే నడితోడన తెల్పి తెల్పి యీ
యవినయబుద్ధి మాన్పఁగలయంతయు నింకను నాడి చూతమే.

7


క.

కాని తెఱఁగైన మనకును, వీనిదెసం గార్య మేమి వెడలవడత మె
చ్చోనైన నుండుఁ గాకను, దానవపతి మాటలఁ గవి దగుఁ దగు ననియెన్.

8


వ.

ప్రహ్లాదుండును తదాస్థానంబుఁ దఱియంజొచ్చి తండ్రికి నాచార్యునకు నమస్క
రించినం గావ్యుం డతని నాసీనుండ వగుమని పనిచిన నట్లచేసె. నాసమయంబున.

9


ఆ.

అతని జూచి యసురులందఱుఁ బెలుచడెం, దములు కలఁగి కరము దైన్యమంద
బాలభానుఁ గనిన బహుళనీలోత్పల, షండ మనఁగఁ బోలుచుండెఁ గొలువు.

10


క.

దితివంశవల్లభుఁడు భృగు, సుతువదనమునందుఁ దనకుచూడ్కి నిలిపి కు
త్సితుఁ డగువీనికిఁ జెప్పుడు, మతిగానని దుష్పథంబు మానుతెఱంగున్.

11


ఉ.

వేఁదుఱు గొన్నమానవుని వేమఱుగంటియు బిట్టుగాల్చియున్
మోఁదియు నీటఁద్రొక్కియును మున్కొని తీర్పఁగ వండంగువెజ్జు న
ట్లేఁ దగ నిన్నిచందముల నీతని దీర్చుటకై పెనంగితిన్
బేఁదఱికంబు గట్టుకొని బెట్టుగఁ జిక్కితి నేమి సేయుదున్.

12


వ.

అన శుక్రుఁడు ప్రహ్లాదు నాలోకించి.

13


శా.

అన్నా! బాధలఁ బొంద నేల జనకాజ్ఞాయత్తచిత్తుండవై
యున్నన్ సేమము గాదె? తండ్రుల ప్రియం బొందించుటం బోలఁగా
నెన్నన్ ధర్మము గల్గునే? గురుహితం బెబ్భంగి దుష్కర్మమై
యున్నన్ బుణ్యపదంబు గా బుధజనం బూహించు ధర్మస్థితిన్.

14


క.

జననీజనకుల కప్రియ, మనజన సద్ధర్మమైన నది దురితమకా
మును లుగ్గడింతు రది నీ, మనమునఁ దలపోయవలదె మహితవిచారా.

15


ఆ.

అనినఁ గేలు మోడ్చి యద్దానవాన్వయా, చార్యుఁ జూచి వినయసంప్రయోగ
కలితచిత్తుఁ డగుచు గంభీరరవమున, నిటుల ననియె బాలుఁ డెల్ల వినఁగ.

16


క.

మీ రరయనిధర్మంబుల, మేరలు నెఱుకలును గలవె మీకుం దగవే
నారాయణభక్తిపరత, వారించెద ననుట యిట్లు వైదికవర్యా!

17


ఆ.

మీరు గురులుగారె మీమాట యతనికి, వినఁగవలదె కలుషవృత్తి విడిచి
వాసుదేవుమీఁది వైరంబు దక్కి న, ర్తిల్లు గురువు గాఁగఁ దెలుపవలదె?

18


క.

తామసుఁ డితండు విష్ణుమ, హామహిమలకొలఁది యెఱుఁగఁ డద్దేవుదెసన్

వేమాఱు నలుగనంతయు, సోమించిన మడిని బ్రదుకు సులభంబగునే.

19


గీ.

తల్లిదండ్రులకును వెసఁ దగుహితంబు, చెప్పుదురు గాక యిపుడు నిషిద్ధమైన
యుభయలోకవిరుద్ధమహోగ్రవృత్తి, కార్యముగఁ జెప్పు టెందును గలదె యనఘ!

20


వ.

అవధరింపుము.

21


సీ.

వాసుదేవునిపాదవనరుహంబులభక్తి తగదనుతండ్రియుఁ దండ్రి గాఁడు
వేదచోదిత మైనవిష్ణుధర్మమునకుఁ గోపించుగురుఁడును గురుఁడు గాఁడు
భవదుఃఖములు మాన్ప, బ్రభువైనహరిసేవ వెడలించుహితుఁడును హితుఁడు గాఁడు
పరయోగమత మగువైష్ణవిజ్ఞానంబు వదలినచదువును జదువు గాదు


గీ.

కేశవాకారలీలలు గీలుకొని ము, దంబుఁ బొందనితలఁపును దలఁపు గాదు
మాధవస్తోత్రఘనసుధామధురరుచులఁ, జిలుకకుండెడుజిహ్వయు జిహ్వ గాదు.

22


చ.

పురుషగుణంబు మేనఁగలపోణిమి నొందినవాఁడు మేలు కీ
డరయఁగఁ జాలుబుద్ధి బొలుపారినవాఁడు సుఖంబు నాయువున్
జిరముగఁ గోరువాఁడు సరసీరుహనాభు ముకుందు నిందిరా
వరు భజియింప నొల్లఁడఁటె వానికి నెక్కడి వేశుభంబులున్.

23


ఉ.

ఊషరబీజముల్ భసితయోజ్యఘృతంబులు షండకన్యకా
న్వేషణముల్ పయోధిగతవృష్టితతుల్ మృగతృష్ణికాంబుగం
డూషలు దుర్గకాననకఠోరితచంద్రికవేదమూకస
ద్భాషలు విష్ణుమంగళకథావిముఖాత్ములదుష్టజన్మముల్.

24


క.

మోహాంధుఁడు దుర్గతిపద, సాహసికుఁడు బహుళదురితసాగరవీచీ
గాహనశీలుం డాత్మ, ద్రోహిగదా విష్ణుభజనదూరుఁడు ధరణిన్.

25


వ.

అని పలికి హిరణ్యకశిపు నాలోకించి.

26


క.

నిన్నింతవానిఁ జేసిన, యన్నాలుగుమోములతఁడు హరిపొక్కిటియం
దున్నవెలిదమ్మి యీనిన , కున్న యగుట తెలిసి విడువు కోపము తండ్రీ.

27


క.

హరికంటెఁ బరము లే దిది, పరమార్థము నీవు దీనిఁ బాటింపుము సు
స్థిరముఁగఁ దలఁపు మతనిమ, చ్చరమునఁ గన్న యది తలతాెఁ చలమో ఫలమో.

28


వ.

నావుడు నేయిపోసిన మండునగ్నియుంబోలె నగ్గలంబైన కోపంబు దీపింప నిలింప
వైరి నిజసేవాగతుఁడై యున్నదండధరుఁ జూచి నీవు సకలప్రాణిసంహరణాధికారధు
రీణుండవు కావున నిప్పాపాత్మునిపాపంబున కనురూపంబుగా నాగ్రహింప యాత
నలం బనుపుమని యనుశాసించినఁ బ్రసాదంబని యయ్యంతకుం డనంతధ్యానపర
వశుం దనవశంబు చేయ సమకట్టి.

29


ఉ.

కింకరకోటిఁ బిల్చి మదిఁ గింక మొగంబున నంకురింపఁగా
జంకెలు మిక్కుటంబుగఁ బ్రచండపుదండముఁ గేలఁ బూని ని

శ్శంకతఁ గాలపాశములఁ గేల నమర్చి మహోగ్రమూర్తియై
బింక మెలర్ప డాసెఁ బటుభీషణమర్త్యపురస్సరంబుగాన్.

30


వ.

ఆ సమయంబున నార్తశరణ్యుండగుగరుడధ్వజుండు పనుపఁ దదీయసేనాధిపతి విష్వ
క్సేనుండు కింకరకోటియున్ దానును దివ్యహయధట్టంబులతో దాడివెట్టి బిట్టఱఁ గృ
తాంతకింకరుల ముట్టి కనుపుగొట్టం దొడంగినం గని దైత్యపతి తానును భయభ్రాం
తుఁడై డిగ్గి తొలంగి యభ్యంతరగృహంబునకుం బఱచి వెఱవచఱచి సందులు బ్రిందులు
గొందులు దూఱియుండె. నాలోన.

31


మ.

ఖరఘోటాగ్ర ఖురాపపాతనిహతిన్ ఖండంబులై యాశ్విక
స్ఫురదుద్దామకృపాణకుంతముఖవిస్ఫోటంబులన్ వ్రస్సి భీ
కరసేనాపతిచక్రధారఁ దుమురై గర్వోల్లసత్కాలకిం
కరసైన్యంబులు వ్రేల్మిడిన్ బొలిసె నుత్కంపింప ద్రైలోక్యముల్.

32


క.

అంతఁ బరమాత్ముకింకరు, లంతం బట్టుకొని యోరి హరిదాసుల ని
ర్జింతునని పూనఁగా నీ, వెంతటివాఁడ విటఁ గుడువు మీఫల మనుచున్.

33


క.

మొగమును ముక్కును జడయఁగ,, బిగువగుపిడికిళ్లఁ బొడువ బెగడి జముండున్
సుగుణాకర ప్రహ్లాదుఁడు, విగతభయుఁడ నన్నుఁ గావవే కృప ననఁగన్.

34


ఆ.

అమ్మహానుభావుఁ డమ్మహావీరుల, ననునయించి వీఁడు ననపరాధుఁ
డీకృతాంతు విడువుఁ డితఁ డపరాధీనుఁ, డేమి చేయు సుజనుఁ డీసులేదు.

35


వ.

అనిన నట్లుకాక యని యంతట విడిచి యసురాంతకభృత్యులు దైత్యపతి మున్నుతల
యుంజీరయు విడనాడి పాఱుటఁ జూచినవారు గావున వాఁడు నరసింహనఖంబుల
కెర గాఁగలవాఁడని నిశ్చయించినవారై యేమియుం జేయనొల్లక యాదితిసూనుపురం
బుఁ గాల్చి దైత్యులఁ గొందఱబారి సమరి సమదగమనంబునం జనిరి. ప్రహ్లాదుండును
దండ్రికడకుఁ జని యి ట్లనియె.

36


మ.

సకలేశుం డగువిష్ణుసైన్యపతి విష్వక్సేనుఁ డీవీరుఁ డె
న్నికకున్ బెక్కుబలంబు లీతనికి వర్ణింపంగ శక్యంబె యి
ట్లొకఁ డేతెంచిన బొల్లరాఁ బొలిసె నీయుద్దామదర్పంబు దా
న కడంకన్ హరివచ్చినం జెపుమ నిన్ గానంగ నిందొక్కనిన్.

37


వ.

ఇది దృష్టంబుగాఁ గన్గొని.

38


ఉ.

వెన్నఁటి యింకనుం జెడక శ్రీరమణీకుచకుంకుమచ్ఛట్యా
చ్ఛన్నశరీరు నుద్యదసిశంఖుసుదర్శనహస్తుఁ గౌస్తుభో
ద్భిన్నగభస్తివిస్తరణదీప్తభుజాంతరు నంతరంగసం
పన్నదయాంతరంగు హరి భక్తవిధేయు భజింపు మింపునన్.

39


క.

క్షోదంబుల భేదంబుల, వాదంబుల ద్రోపు లేదు వనజాక్షుమహ

త్త్వోదయము నిండుఁదెలివికి, గాదిలియై చేరు దీనఁ గనుఁగొను మనఘా.

40


వ.

అని చెప్పి ప్రహ్లాదుం డూరకుండె. నయ్యసురేశ్వరుండును నట్ల బెండుపడినవాఁడై
తనలో నిట్లని వితర్కించు.

41


సీ.

హరి నాకుఁ బగగదా యతనిపక్షంబు దా వీఁ డెంత చేసిన విడువఁ డింక
వీనికినై తాను వేమాఱుఁ దనలావుఁ జూపుచున్నాఁడు విష్ణుఁడు గడంగి
యయిన నేమగుఁ జూత మాతని బలిమియుఁ గలిమియుఁ జెలువును నిలకడయును
ఎఱుఁగు వీఁ డిదియెల్ల నిప్పుడు వీనివాక్యంబులచొప్పును నరసిచూచి


గీ.

యాముకుందునిపై దాడి యరిగి యతని, మొల్ల మంతయు వెసఁగొని ముట్టిపట్టి
కట్టుకొని వచ్చి చెఱఁ బెట్టి కష్టపఱుతుఁ, బూని మున్నున్నదివిజులలోనఁ గలపి.

42


వ.

అని తలపోసి క్రమ్మఱ నంతఃపురంబు నిర్గమించి సమంచితకాంచనరత్నరచితమహా
స్తంభశతసంభారమండితం బగుసభామంటపంబుఁ బ్రవేశంచి యెప్పటియట్ల యనుజీ
వలోకంబు గొలువం బెద్దగద్దియపై నుండి ప్రహ్లాదు రావించి యిట్లనియె.

43


ఆ.

పయికి వెఱవ కిట్లు పగవారివాఁడవై, మమ్ము నేచె దింక మాటలేల
యీవిధమున నీకు లావిచ్చి పెనగించు, నతనికాక నిన్ను ననఁగ నేల.

44


క.

నీవ కనుంగొనుచుండుము, మీవిష్ణునిఁ బట్టి తెచ్చి మెదిపెద మును నా
లావున కగపడి యడఁగిన, నీవిబుధులకంటె నాతఁ డెక్కుడుగొలమే.

45


వ.

అనిన నగుచుం బ్రహ్లాదుం డిట్లనియె.

46


గీ.

అయ్య! నీ వేమి సేయుదు వఖిలజగము, వెఱ్ఱిచేయంగఁ బుట్టినవిష్ణుమాయ
నిన్నుఁ దెలియంగ నీకు దుర్నీతిఁ దెలుపు, చుండ నీప్రల్లదంబులసొంపు మెఱసి.

47


సీ.

నీ వెంతవాఁడవు దేవతలైనను మునులైన ఘనులైన మోసపోదు
రమ్మహామాయచే హరిభక్తి సీమకు నడ్డమై త్రోవఁగ నలవిగాక
విలసిల్లు నమ్మాయ విశ్వాత్ముఁ డగువిష్ణు తలఁపులోనన తాను గలిగియుండుఁ
ద్రిభువనవ్యాప్తిని ద్రిపురుషాధీశ్వరి త్రిగుణస్వరూప యాదివ్యశక్తి


గీ.

యబ్జలోచనుకరుణాకటాక్షదీవి, వ్రాలు నేవారిపై వారచాలువారు
మాయకడలిని బడమి కమ్మహితభక్తి, కలితహృదయులై తఱచుగాఁ గలరె ధరణి.

48


ఉ.

తామసజీవులై భవనిధానమునాఁ జనుమాయ చేయు ను
ద్దామవికారముల్ గదిరి ధర్మవిదూరులు కొంద ఱచ్యుతున్
దామరసాక్షుఁ గైకొనక దర్పము మచ్చరమున్ దలిర్పఁగా
వేమఱుఁ బుట్టుచున్ జెడుచు వేగుదు రుత్కటనారకాగ్నులన్.

49


చ.

తపము లొనర్చి దానముల ధర్మములన్ దుదముట్టి నిష్ఠతో
జపములు నిర్వహించి శమసంయమసౌమ్యసమాధిఁ బండి భ

వ్యపుదెసఁ జెందఁగా బహుసహస్రభవంబులపిమ్మటంగదా
విపులముకుందభక్తిపడవీథిఁ బ్రపన్నత నొందఁ గాంచుటల్.

50


సీ.

ఎసఁగువానయు సీతు నెండయు సైరించి తనువు లింకఁగఁజేయుతపము కూలి
యిడుములు బడి కన్న యొడలు వంచించి నిర్ణయమున నడుపుజన్మములపంట
లాసతో నమ్మిక యాధారముగఁ జేయు వివిధదానంబుల వెలలచొపిపు
కాలిచిపడ నెల్లకడ భూమిఁ గ్రుమ్మఱి యాడుతీర్థముల యాయాసఫలము


గీ.

దివిజకాంతలయిఱిచన్నుఁగవలమీఁద, వ్రాలి కలఁ గన్న తెఱఁగున సోల నొకఁడు
సత్య మత్యంత మనఘ మక్షయ మనంత, మచ్యుతార్చనాసంభృతోదాత్తఫలము.

51


చ.

జడధులు నింకుఁ గూలు గులశైలచయంబును ధాత్రియున్ డిగం
బడుఁ బెడబాయు భానుశశిభవ్యపదంబులు నబ్జసూతియున్
సుడివడు నెన్నఁడున్ జెడనిచోటు ముకుందపదప్రన్ను లుం
డెడునెడ యెట్టివారలకు డెందములందనిగొంది యెమ్మెయిన్.

52


శా.

అక్రూరాత్ములు సత్యసంగతులు మాయాదూరు లత్యంతని
ర్వక్రాచారులు ధీరు లుత్తమకృపావ్యాపారు లుద్యద్యశో
విశ్రాంతాఖిలలోకు లూర్జితసమావేశప్రకాశోన్నతుల్
శక్రాద్యామరపూజ్యు లచ్యుతకథాసక్తుల్ మహాత్ముల్ మదిన్.

53


సీ.

వలసినఁ జారుగీర్వాణతరుశ్రేణు లొదవి పెందోఁటలై యుల్లసిల్లు
వలసినఁ గామధుగ్వరధేనువులు పెనుగడుపులై ముందఱిగడపఁబరఁగు
వలసినఁ బ్రస్ఫురదలఘుచింతామణివ్రాతముల్ క్రీడాద్రులై తనర్చు
వలసిన నుద్గతోజ్ఞసిద్ధరసములు గరుపంపుఁబేరులై తరఁగలొత్తు


గీ.

నమరగరుడనిశాచరయక్షఖచర, వితతి వలసినఁ గింకరస్థితిఁ బరించు
నయిన హరిభక్తివర్యులయనుపమాన, నిత్యమహనీయమహిమ వర్ణింపవశమె.

54


చ.

అమరపదంబు మెచ్చ రమరాధిపులీల గణింప రేమీయున్
గమలభవత్వమున్ సరకుగాఁ గొన రాకులితార్థధర్మమో
క్షములతెఱంగుఁ జీరికిని గైకొన రచ్యుతదాస్యవృత్తమై
నమితసుఖానుభూతి నమృతాంబుధిఁ దేలుచునుండుసాత్వికుల్.

55


క.

తా రొకరులమాటలచవిఁ, గోతరు హరనామసుధయ గ్రోలుచు బెజులన్
గోరరు సంతతసౌమ్యులు, శ్రీరమ్యులు విష్ణుచరణసేవాసక్తుల్.

56


క.

నారాయణనామము సం, సారసమౌషధము దురితసముదయభూభృ
ద్దారుణభిదురము మంగళ, కారణమని ఖలుల కెట్లు గఱపఁగవచ్చున్.

57


క.

దాతవ్యుఁ డొకఁడు విష్ణుఁడు, క్రోతవ్యుం డొకఁడు దనుజసూదనుఁడు సము
ద్రాతవ్యము హరినామము, చేతవ్యము విష్ణుభక్తిచే నఖిలంబున్.

58

క.

విష్ణుమయము వేదంబులు, విష్ణుమయము వర్గ మఖిలవిజ్ఞానములున్
విష్ణుమయము జగమంతయు, విష్ణుమయము విష్ణుఁ డొకఁడ వేద్యుఁడు బుద్ధిన్.

59


సీ.

త్రిభువనవ్యాపకదీప్తినిర్గుణమూర్తి వాసుదేవాఖ్య నుజ్జ్వలత నొంది
జగదేకసంహారసమదతామసమూర్తి పతులసంకర్షణాహ్వయతఁ బేర్చి
విశ్వరక్షాకరవినుతసాత్వికమూర్తిఁ బ్రద్యుమ్ననామవిభాతిఁ బరఁగి
భువనసంభవహేతుభూతిరాజసమూర్తి ననిరుద్ధనామధేయాప్తి నొంది


గీ.

శ్రుతిపదంబులుఁ దనుఁ జతుర్మూర్తి యనఁగ, నఖిలకథలును దనుఁ జతురాత్ముఁ డనఁగ
నాగమంబులు దను జతురక్షుఁ డనఁగ, నొక్కరుఁడ యాతఁ డచ్యుతుఁ డుల్లసిల్లు.

60


క.

మఖనేతయు మఖధాతయు, మఖదాతయు మఖనిధానసూతయు మఖదు
ర్ముఖజేతయుఁ బీతాంబరుఁ, డఖిలమునకుఁ దానకాక యన్యుఁడు గలఁడే.

61


క.

జీవునిప్రకృతిం దొలితొలి, కావించెను బుద్ధిమొదలుగాఁగల్గినత
త్త్వావలి నోలిసృజించెను, గోవిందుఁడు దాన యింతకును మూలంబై.

62


సీ.

బొడ్డునఁ దామరఁ బుట్టించి యందజుఁ గలిగించి లోకాధికార మిచ్చె
నాగమంబులు నాలు గంగంబు లాఱును మఱిపురాణములు మీమాంస మనఁగ
న్యాయంబు ధర్మశాస్త్రావలి యనఁబడు నాలుగువిద్యలు వోలినిలిపె
బ్రహ్మాండములను నబ్రమున దొంతులు పేర్చి యందులో భువనంబు లరలు దీర్చి


గీ.

నబ్ధులన గిరులన దీవులనఁగ నేఱు, లనఁగ నడవులనఁగ నూరులనఁగ వరుస
నచ్చుకట్టి యిన్నింటికి నర్థకరులఁ, బనిచెఁ బరమేశుఁ డబ్జలోచనుఁడు దాన.

63


క.

మనువు మన్వంతరములు, మునులును దివిజులును దివిజముఖ్యులు మనునం
దనును దత్కులజనితులు, వనజోదరునాజ్ఞ నుద్భవస్థితికారుల్.

64


క.

తారగ్రహనక్షత్ర, స్ఫారవ్యాపారములును భవనస్కంధా
వారనిబంధస్థితులును, నారాయణశాసనప్రణయకీలితముల్.

65


క.

వసురుద్రాదిత్యాది, శ్వసనగణంబులునుఁ సిద్ధసాధ్యోరగరా
క్షసయక్షభూతదైతే, యసమూహంబులును విష్ణునాజ్ఞాకారుల్.

66


మత్తకోకిల.

కాలచక్రము నిర్వికల్పముగా ముకుందుఁడు ద్రిప్పు ను
న్మీలితక్రమవిక్రమైకసమృద్ధిమై లయవిక్రమా
వేళ నింతయు సంహరించుఁ బ్రవృద్ధయోగపరోల్లస
క్కాలరూపము దాల్చి దుర్వహగర్వనిర్వహబుద్ధియై.

67


గీ.

అతఁడు కనుఁదెర్వ బ్రహ్మాండవితితి యొదవు, నతఁడు గనుమూయ నన్నియు నడగిపోవు
భువనసంభవసంహారభూరిమహిమ, తోయజాక్షున కరయ లీలాయితంబు.

68


క.

తా ని ట్లెంతటివాఁడును, నైనట్టుల యుండు నిక్క మారసి చూడం
గా నేమిటివాఁడును గాఁ, డానందచితైకమూర్తి యచ్యుతుఁ డెందున్.

69

మ.

జననం బొందుననంగరా దజుఁడు నా శక్యంబుగా దబ్ధియం
దనిశంబున్ బవడించునా నిజముగా దత్యంతబద్ధుండునాఁ
జన దేకాంతతపస్వినాఁ జనదు శశ్వత్క్రోధినాఁ బోల దే
మని వర్ణింతును వారిజోదరుని యత్యాశ్చర్యచారిత్రముల్.

70


క.

ఆలించు నార్తరవ ము, న్మూలించును ఖలు సతతమున్ సజ్జనులం
బాలించును గృప నెంతయు, శీలించును మత్ప్రభుండు శ్రీవిభుఁ డాత్మన్.

71


మ.

ఒకకేలన్ విలసత్సుదర్శనము వేఱొంటం బరిస్ఫారనం
దకమున్ బ్రస్ఫురితాన్యహస్తమున నుద్యత్పాంచజన్యంబు నొం
డొకటన్ శార్ఙ్గము దాల్చి ధర్మరిపుల న్ఘోరాజీ మర్దింపుచున్
సకలైకాశ్రయమూర్తితోడ నెపుడున్ వర్తించు నాముందటన్.

72


వ.

అనుచు ననేకవిధంబులఁ బ్రహ్లాదుండు విజ్ఞానపరవశుండై పలుకుచున్నపలుకు లప
హసించి యసురేశ్వరుండు.73
క. తొలిమేనికర్మవశమున, బలవంతపువెఱ్ఱిబిట్టు బట్టిన నేభం
గుల నోరు మూనేరక , పలుదెఱఁగులఁ బ్రేలె దీవు ప్రాజ్ఞులు దెగడన్.

74


వ.

ఇంక నున్మత్తుతోడిమాటలఁ బ్రయోజనంబు గలదె యనిన నమ్మహానుభావుం డమ్మో
హాంధున కి ట్లనియె.

75


ఉ.

ఆదికి నాదియైన పరమాత్ముని విష్ణునిమూర్తఁ గాన బ్ర
హ్మాదుల చాల రవ్విభుశుభాకృతి యస్ఖలితైకభక్తిసం
చోదితుఁడై కృపం బొడవుచూపుఁ బ్రపన్నులకిచ్చ లైన న
వ్వేదమయుండు పొందుపడు వేఱొకటొల్లక తన్నుఁ జెందినన్.

76


క.

ఎఱిఁగినవారికి నెందును, గుఱుకొని తోనుండుఁ దన్నుఁ గొనకుండెడువా
రెఱుకలకుఁ జేరువయ్యును, బొఱయందగఁ డతఁడు నిఖిలభువనములందున్.

77


సీ.

కలఁడు మేదినియందుఁ గలఁ డుదకంబులఁ గలఁడు వాయువునందుఁ గలఁడు వహ్నిఁ
గలఁడు భానునియందుఁ గలఁడు సోమునియందుఁ గలఁ డంబరంబునఁ గలఁడు దిశల
గలఁడు చరంబులఁ గలఁ డచరంబులఁ గలఁడు బాహ్యంబునఁ గలఁడు లోనఁ
గలఁడు సారంబులఁ గలఁడు కాలంబులఁ గలఁడు ధర్మంబులఁ గలఁడు క్రియలఁ


గీ.

గలఁడు కలవానియందును గలఁడు లేని, వానియందును గలఁ డెల్లవానియందు
నింక వేయును నేల సర్వేశ్వరుండు, కలఁడు నీయందు నాయందుఁ గలఁడు కలఁడు.

78


చ.

అనవుడు రోషహాసవివృతాననుఁ డై దివిజారి యోరి నీ
వనయత నెందుఁ గల్గునని వర్ణనఁ జేసినయాతఁ డిందుఁ గ
ల్గునె యనుచున్ జగద్వలయఘోరకరాహతి వ్రేసెఁ గంబ మ
త్యనుపమతత్సభాభవన మల్లలనాడఁ గలంక లోకముల్.

79

వ.

ఇట్లు వ్రేసిన.

80


సీ.

బడబానలాహతి జడనిధిలోనున్న పటుశైలతతి వ్రేలి పెటిలె నొక్కొ
ఘనతరోత్పాతనిర్ఘాతసహస్రంబు గడఁగి యొక్కట మ్రోసి పడియె నొక్కొ
పెక్కుజీవులలోన బిక్కట్టువడఁగ నా బ్రహ్మాండభాండంబు పగిలె నొక్కొ
తఱి గాక యున్నయుద్ధతిఁ బేర్చురుద్రుండు విలయోగ్రపటలంబు వ్రేసె నొక్కొ


గీ.

యనఁగ నాకాశసకలదేశావకాశ, భరితమై విశ్వమును మూర్ఛ పాలుపడఁగ
మొనన పెఢిలు పెఢిల్లను మ్రోత వెడలఁ, బగిలెఁ గంబంబు భువనకంబంబు గదుర.

81


స్తంభోద్భవవచనము

అమ్మహాస్తంభంబున విజృంభమానజిహ్వావివృతవదనగహ్వరస్ఫురదసహ్యకహకహో
త్తర్జనగర్జాస్ఫూర్జితంబును వికటకఠోరఘోరదంష్ట్రాదండదారుణదహనదందహ్యమా
నదశదిశాభాగంబును విపులకపిలక్రూరతరలతారకాతరంగితోద్వృత్తవృత్తాయతేక్ష
రూక్షరదనస్ఫులింగపూరితభువనరంధ్రంబును నభంగభ్రూభంగభయదఫాలభాగప్రాం
తభంగురభ్రమరకదురవలోకంబును విశ్వధురంధరస్కంధపరిణాహపరిణతోదగ్రకిం
జల్కపుంజసింజరితభాసురకేసరప్రసరవిప్రక్షలితాంతరిక్షంబును హేమకమలతంతు
కాంతి కోమలరోమవల్లరీగహనఃకరాళకర్ణకోటీరఘటితకుంతలమణిమరీచిమంజరీరం
జితగండస్థలోద్భాసితంబును గల్పాంతపవనశకల్పానల్పదర్పోల్లసితసమీరసంపాది
తకంపాకులితకులధరనికరంబును సముత్కటోత్కూటకోటికుట్టనకుంఠితకుటిలకుంత
లాయమానశ్యామజీమూతసకలమనోజ్ఞమూర్ధభాగంబును శ్రీవత్సకౌస్తుభవైజయం
తీప్రముఖనిఖిలలక్ష్మణోల్లక్ష్యమాణవక్షస్థలప్రస్థూలప్రారంభనిర్విలంబలక్ష్మీసమారో
హణోత్సవంబును భక్తజనవచనవర్తనచింతనానురోధనిరవగాహనకరుణాసుధాపూర
పూరితపుణ్యహృదయప్రదేశంబును దితిసుతన్యపదేశపశుబంధనోపయుక్తయూ
పస్తంభాయితోరుయుగళంబును గనత్కనకమణీమేఖలాకలాపకలితకటితటికాం
చనవసనాంచనాందోళనధగద్ధగితధామచ్ఛటాస్ఫురితజగదండఖండంబును బహు
ళమాణిక్యహంసకావతంససితనఖాభిరామశ్రీమచ్చరణసరోరుహప్రసభాగృహీత
ఘట్టనాగ్రహోగ్రాటోపరభసక్షుభితక్షోణీవలయంబును హిరణ్యకశిపుప్రహ్లాదవిష
యనిగ్రహానుగ్రహావేశవ్యతికరవిషమసంరంభదుర్వారగర్వారంభభీషణాభిరూప
సంస్థానంబును శృంగారవీరకరుణాద్భుతానేకరసనికరసంకరసంకులప్రకారదుర్నిరూ
పోపప్లావంబును సహస్రకిరణకృశానుశశాంకసహస్రకోటితేజఃప్రతాపకాంతిసమ్మే
ళనమహితోత్సాహతీవ్రసౌమ్యస్వభావభావితంబును రుద్రద్రుహిణపురుహూతాది
సకలదేవతాశక్తిసభాసంభావనీయంబును సర్వాశ్చర్యసంజనసంబును సర్వలోకాతి
రిక్తంబును సర్వజగదుద్భవకరణకారంబును సర్వైశ్వర్యధుర్యంబును సకలవిభవాను

భావగంభీరంబును సకలశ్రుతిస్మృతిపురాణసిద్ధాంతసిద్ధదర్శనంబును సకలమంత్రతం
త్రయోగవినియోజ్యంబును సమస్తసమాశ్రితజనాభయప్రధానపరమప్రతైకపారం
గతంబును సమస్తమనోరథఫలైకసాధనంబును సమస్తసాధుజనహృదయవ్యాపార
పరానందనిష్యందంబును సమస్తనిరసనప్రదీపంబును నగు శ్రీనరసింహరూపం బావిర్భ
వించిన.

82


ఉ.

అక్కజమైన యీనరమృగాకృతితేజము లోకమంతటన్
బిక్కటిలంగఁ దీవ్రగతిఁ బేర్చి తలిర్చినఁ దేరిచూడలే
కెక్కడయుం జనంగఁ దెలియింపు నెఱుంగక దైత్యుఁ డెంతయున్
జొక్క మనంబునన్ దిగులు చొచ్చెను జేష్టలు దక్కె నత్తఱిన్.

83


గీ.

కురిసె నందనమందారకుసుమవృష్టి మొరసె గంధర్వకర్హతమురజరవము
బెరసె నారదముఖమునిబృందనుతులు, బలసె నింద్రాదినిర్జరపరికరంబు.

84


వ.

ఇట్లు విజృంభించిన దేవదేవునివ్యాపారం బాలోకించి ప్రహ్లాదుండును భయసంభ్ర
మాద్భుతభక్తియుక్తం బగుచిత్తంబుతోడ నుదాత్తధ్యానాతివందనస్తోత్రపరవశుం
డగుచు నెదుర్కొని నిశ్చేష్టితుం డగుతండ్రిఁ బేర్కొని యమ్మహామూర్తిని నతనికిఁ
జూపి యిట్లనియె.

85


చ.

అతులతపస్సమాధినియతాత్ముల కైనను గానరానియ
ద్భుతపరమాత్మమూర్తి యిదె తోఁచెఁ గృతార్థుల మైతి మింక నీ
కతలును చూని యివ్విభు నగణ్యకృపానిధి నాశ్రయింపు దు
ష్కృతముల కెల్ల శుద్ధియగుఁ జేకుఱు నీకు ననంతసౌఖ్యముల్.

86


క.

నీకడుపునఁ బుట్టినఋణ, మేకరణిం బాతునొక్కొ యే నని పడితిన్
గైకొనవే నాపలు కీ, పాకము దప్పుటయు భయము వాటిల్లుఁ జుమీ.

87


గీ.

అనిన నప్పుడు దనుఁ గాల్పఁగొనినచలము, విడువఁజాలక దైతేయవిభుఁడు రేఁగి
బేల యేల మాటల వెఱిపింతు నన్నుఁ, జూచి యెవ్వఁడు సవ తిటు చూడు మింక.

88


క.

ఈవికృతరూప మిటులై , చావఁ దలఁచి తోఁచె దీని సమయించెద నా
లావున కెదురై పెనఁగఁగ, నీవిశ్వమునందుఁ గలఁడె యెవ్వాఁ డైనన్.

89


వ.

అని పలికి యుత్సాహంబు మెఱయ బాహుబలంబు చూపుటకు నాటోపంబునం జాప
కృపాణాదిసాధనంబులు ధరియించి యానరసింహమూర్తికి నెదురు నడచి కదనం
బునకుం జొచ్చె. నసురులు నిజేశ్వరు తెగుటఁ జూచి యేచి సహస్రసంఖ్యలు గూడపడి యా
ర్చుచు నర్చిష్మంతుమీఁదఁ బ్రచురశస్త్రాస్త్రపాతంబుఁ జేయందొడంగిరి. తదనంతరంబ.

90


ఉ.

వారల యేపుఁ గోపము నవారితశస్త్రఘనాస్త్రలీలలున్
వారిధిఁ జెంది డిండెడు స్రవంతికలట్లు నృసింహుతేజమున్
జేరి యడంగిపోయె విలసిల్లె జగన్నివహంబు లప్పుడున్
గోరి సుతుండు తండ్రి యతికోపము దీర్పఁగడంగె నర్మిలిన్.

91

ఉ.

శ్రీనరసింహరూపమునఁ జెన్నుఁగఁ దోఁచె సహస్రకోటిసం
ఖ్యానము లైనబాహువులయం దొడగూడినచక్రమున్ విల
భ్యానుపమానశత్రునివహంబులచే నొకమాత్రలోన న
ద్దాననసేనయంతయును ద్రగ్గెఁ దదీశుఁడు బెగ్గడిల్లఁగన్.

92


వ.

ఇట్లు తనచుట్టు శూన్యంబైన దైన్యంబు మొగంబున నెగయ వెడబిగువుగ బిగియించు
కొనుచుఁ జలంబు మిగుల నసురపతి యప్రతిహతానేకదివ్యాస్త్రప్రయోగం బొనరిం
చిన నదియంతయు నయ్యనంతతేజోరాశియందు నిరాసంబు నొందె. నాసమయంబున.

93


సీ.

ఈదైత్యుమాత్రకు నిట్టిరౌద్రమూర్తి శ్రీనాథుఁ డేటికిఁ జెందె నొక్కొ
మడిసిరి దైత్యులు మడిసినవాఁడ తత్పతిదేవుఁ డిటమీఁదఁ దలఁగు నొక్కొ
యీయేఁపు చూడఁగ నీశుఁ డీశంతన కల్పాంతమును జేయఁ గడఁగు నొక్కొ
తక్కువయును లేని ధర్మచిత్తులుఁ గర్తకాలంబు నిండక కాచు నొక్కొ


గీ.

మనము వేఁడినఁ బ్రహ్లాదుఁ డనునయింప, నాదిదేవుండు శాంతత నందు నొక్కొ
యనుచు నింద్రాదిదివిజులు నఖిలమునులు, నద్భుతోద్వేగనిర్మగ్ను లగుచునుండ.

94


ఉ.

కోఱలు గీటుచున్ నయనకోణములం దహనస్ఫులింగముల్
గాఱఁగఁ గర్ణముల్ బిగియఁగా ఘనకేసరముల్ విదుర్చుచున్
మీఱినయుబ్బునన్ బొదలి మీఁదికి మూరెడు పేర్చి కింక దై
వాఱఁగఁ బట్టె బిట్టు దితిపట్టి నృసింహుఁ డసహ్యతీవ్రతన్.

95


వ.

అంత.

96


సీ.

పటుమృగాధిపుబారి పారి మదం బేది వడఁకుబంధురమదావళముభంగి
నుద్దామవిహగేంద్రు నురువడి కగపడి యదలుచు నొడలుమహాహిపోల్కి
మెదలికోల్పులిచెబిట్టుపొదివిన నణఁగుచు వెగడొందుసారంగవిభునిమాడ్కిఁ
గడఁగి సాగరచరగ్రాహంబు నొడపున జడిసి చిక్కినతీవ్రఝషములీల


ఆ.

రౌద్రవేగరోషరభసనిరంతర, స్ఫూర్తియగు నృసింహమూర్తి కప్పు
డగ్గమై సురారి యపగతతేజుఁడై, యడఁగి యుండె మొదల మిడుకలేక.

97


వ.

ఇవ్విధంబున నాగ్రహంబునకు ననువుపడినయాకడిందియసురం బొదివిపట్టి నెట్టన
నల్పవిహగంబు నొడసినబలుడేగయుంబోలె గగనంబున కెగసి యయ్యాదిమవీరుండు
దుర్నీక్ష్యప్రకారుం డగుచుఁ బ్రహ్లాదముఖభక్తజనంబులును మునిదేవగంధర్వాదులు
ను జయజయశబ్దముఖసహితు లగుచు నుండం గొండొకసేపు చటులనటనాటోపంబు
న దీపించి యనంతరంబ సముత్తుంగశృంగసంఘటితవియత్తలంబగు మహాశైలంబున
కు నవతరించి యం దాసీనుండై.

98


చ.

దివిజులు హేనృసింహ! భవదీయ మిదం నమ యంచు నంచిత
స్తవము లొనర్ప సన్మునులు సత్యమహోబలరుద్రరూప మా

ధన భవతే నమో యన నుదగ్రనిజాంకతలంబునందు దై
త్యవిభుని నున్చి విశ్వజనతాభయతారణఘోరవీరతన్.

99


చ.

అలఘుతరాట్టహాసము లజాండకటాహము వ్రయ్య భీషణో
జ్జ్వలవికటస్ఫురత్కులిశశాతనఖాంకురతీవ్రపాతనం
బుల నసురేంద్రుపేరురముఁ బొల్పఱఁ జించి కలంచి శోణితం
బులు దొరఁగించెఁ ద్రుంచెఁ బెనుబ్రోవులుగా బలుబ్రేవు లుక్కునన్.

100


చ.

తొలితొలిఁ గ్రమ్ముదైత్యపతి తోరపునెత్తురు నీటిధారలం
గలియ నుదగ్రమైననిజకాయముఁ దొప్పఁగఁ దోఁచితోఁచి యం
దలవడ నాత్రిలోకమయుఁ డారిపుదేహముఁ బాసి రాగదు
ర్విలసితమూర్తి నప్పుడటు వెల్వడి నిల్చినయాత్ముఁడో యనన్.

101


ఉ.

పెల్లుగ దోయిలించుకొని భీషణదానవదేహరక్తముల్
వెల్లిగొనంగ సానువులవెంట మఱి న్నరసింహదేవుఁడున్
జల్లఁగ నిండుఁగాలువలు సాగి కరంపె భయంకరంబుగా
నెల్లెడఁ గ్రొత్తకావి సెలయేఱుల చెన్నొడగూడె నగ్గిరిన్.

102


క.

దనుజేంద్రమృత్యుకారణ, ఘనసంధ్యాసమయదీప్తిఁ గడునొప్పిన య
వ్వినువీథితోడఁ బురుణిం, చినక్రియ మహిదైత్యరక్తసిక్తత నొప్పెన్.

103


క.

నరహరి చల్లినయసురే, శ్వరుశోణితశీకరములు వనపఙ్తులపై
దొరిఁగి నిరంతరపల్లవ, విరచితనూతనవసంతవిభ్రమ మొసఁగెన్.

104


క.

పగ యింతగాని పోదని, తగ దానవుమేనిశోణితపువెల్లువ నిం
పుగ దోఁగి రనఁగ నమరులు, బ్రగుణితరక్తాంగు లైరి ప్రమదముపేర్మిన్.

105


గీ.

వీరనరసింహదేవుఁ డుద్వృత్తిఁ బెఱికి, పాఱవైచినఁ బడియొప్పి పగతుప్రేవు
లసురసంపద యనుకాంత యఱుతనుండి, త్రెళ్లి జోగినహారంపుఁదీవె లనఁగ.

l06


క.

శితనారసింహనఖరా, హతదైత్యమహీపసూపహారంబునఁ ద
ర్పితయయ్యె ననఁగఁ బరిశాం, తతనొందె ద్రిలోకపీడ తత్క్షణమాత్రన్.

107


వ.

ఆ సమయంబున.

108


సీ.

ఒండొండ వీడ్వడ నునిచినఁ బొలుపారుపదములఁ బర్యంకబంధ మమరఁ
దొడలపై నున్న దైత్యునిప్రేవు లిరుదెసఁ దివిచియెత్తిన కరద్వితయ మమరఁ
గమనీయశంఖచక్రప్రభాభాసురం బై పెరహస్తద్వయంబు నమర
దంష్ట్రాకరాళంబు దరళజిహ్వయు నగు వదసంబు లింతయొప్పిదము చూపఁ


గీ.

దీవ్రలోచనత్రయదీప్తి దీటుకొనఁగ, నిభృతకర్ణకేసరకాంతి నివ్వటిల్ల
దివిజసురమునిధ్యానవిధేయలీలఁ, దేజరిల్లె శ్రీనరసింహదేవమూర్తి.

109

వ.

ఆమహామూర్తిఁ గనుంగొనుచు నాదిత్యులు నాదిమునులు ప్రహ్లాదపురస్సరంబుగా నభి
నందనము లొనరించుచు నంజలీపుటంబులు నిటలంబుల ఘటియించి యిట్లని వినుతించిరి.

110


దండకము

శ్రీనాథనాథా జగన్నాథనమ్రైకరక్షా సమక్షా సరోజాక్ష సర్వాభివంద్యా మహానందగో
వింద నీ వెందు నీవిశ్వదృశ్యప్రపంచంబునన్ నిండి యొండొండ యంతర్బహిర్వ్యాప్తి
శోభిల్లునండంబు చిందమ్ములై మ్రోసి తేల్పన్ బరానందకందమ్ము లామ్నాయబృందంబు
లిట్లున్న నీయున్నరూపొాత్మ రూపించు దీపించు నిక్కంబులే యింకఁ జొక్కంబులై
చిక్క నీచిక్కు వాపంగ నేలా గురూక్తప్రసన్నత్వనిష్ఠానుసంధానసంధూతసందేహు
లైయున్న నీయున్నతస్థాన మెట్లైనఁ జేయందు నాయందు నెందున్ సురారాతిధా
మంబులున్ సోక కేరాకలందేక యేపాపమున్ గాక లోకాతిరేకామలాలోకమై
యొప్పులోకంబు నీలోక మాలోకనీయంబె నీలోకసామాన్యధర్మావబోధానురోధంబు
లన్ గ్రోగకామాదులన్ దాఁకి యేచింతలన్ జెంతలన్ జేరఁగానీక యేకాంతీక
స్వాంతులై యుండువా రుండువా రందు నీదాఁక రాలేక లోలోర్మిడోలావలీకేలి
లోలాజగన్మూలమూలాలవాలోల్లసత్సంవిగానంద నిష్యందసీమాసమారామరమ్యస్ఫు
రద్ధామ సత్యప్రకాశావకాశా గుణావేశ దేవేశ నీవిశ్రుతైశ్వర్యమోవీళ్వధుర్యం బ
వార్యం బహర్యం బనార్యున్ సమాత్సర్యులై పూని దుర్బోధబోధాపగాధీశులో గ్రుంగి
పొంగారుమాయాతరంగోరుసంఘాతసంఘట్టనం దూలి యేత్రోవలం దావులం బొంద కు
ద్దామదృప్యద్భవద్గ్రాహనిగ్రాహ్యులై పోదు రవ్యక్తసువ్యక్తదివ్యాకృతీకృష్ణతృ
ష్ణామయోద్వృత్తివేలాయితాఖర్వయోగాపయోగా మహాయోగినిర్ణేత నీతత్త్వ
మాద్యంబు నాద్యంత మత్యంత మక్షోభ మక్షీణ మక్లీబ మక్లేశ మవ్యాజ మాజే
యనిర్వాణసర్వస్వమూలంబు మూలంబు మన్మూల మామూల మానస్వతంత్రీభవ
ల్లోకశోకం బవేలంబకాలంబకర్మంబు నిస్సీమశర్మంబు నిర్మాయధర్మంబు నిష్పంకలే
శంబు నిశ్శంకరూపంబు నిష్ప్రేయకప్రత్యయోద్భూతిహేతుత్వసిద్ధంబు సిద్ధాంత
సిద్ధార్థసంపాద మిట్లుండఁగా నేని నానానుమానాదిబంధాత్ములున్ బుద్ధినైర్మిల్య
కల్యాణముం బొందకున్నారు దుశ్శాస్త్రశస్త్రక్షతక్షాము లుద్యుక్తశక్తిన్ మహాభక్తి
సంయుక్తులై సత్యసంవిత్సుధాసిక్తసూక్తుల్ భవత్పాదపంకేరుహాభ్యర్చకై కూర్చునీకూ
ర్చువారై నిరాతంకకైంకర్యసామ్రాజ్యసంపూజ్యతం బొల్చువా రౌదురే యెల్లవా
రున్ ముకుందా సముద్రాంతరానందనందాత్మజానందకక్రీడ నాభ్యస్తహస్తాహతో
ద్వృత్త నిర్వృత్త నిర్వక్రచక్రానలజ్వాలికాహూతిదైతేయసామ్రాట్పతంగాప
తంగాగ్నికోటిప్రభాఖర్వసర్వంకషోత్తేజతేజోమయాకారకారుణ్యగాఢోత్తరంగా
విహంగాధినాథా పరోపక్రియాదక్షరక్షాపరత్వంబు మీపాలు మాపాలు నీపాలన
ప్రౌఢిభావంబు భావించి సేవించుభావంబు భవ్యాగమప్రాఁతచౌర్యంబు కార్యంబుగా

గొన్న యన్నీచు మున్నీటఁ బెన్నీటఁ బాతాళమూలంబులన్ గిట్టి వేపట్టి చెండాడి క్రీ
డారసోత్సేకపాకంబుఁ గైకొన్న యన్నిర్భరోన్మానమీనావతారక్రియావిభ్రమం
బున్ బరిభ్రామ్యమాణస్ఫుటోత్తుంగశృంగక్షతాకాశకూలంబు శైలంబు కవ్వంబు
గర్వోల్లసత్కాలకాకోలకాలానలాభీలభోగంబు నాగంబు వేత్రంబు చిత్రంబు పెం
పొందుఁ బొంగారు నుజ్జృంభితాంభోధికుంభంబునైనట్టి పెన్మోపు దీపెక్క నింపెక్క
సంపద్యమానాత్మసంపత్కళానందతంద్రాళువై బొల్చునక్కామ్యకూర్మత్వశిల్పంబు
కల్పక్షయోద్వృత్తతోయంబులం జెంది పొందేది యందేదియున్ దిక్కు దాఁగాన
మిం గ్రాఁగుపెన్నేరు నన్నేలునాఁ డిప్పు డిప్పాటులీలం గటాక్షించునో యంచుఁ బేరాస
గూరంగ నారంపుఁబేర్మిన్ నడుంగెద నాబాలు క్రొవ్వాలుగోరం గడుంబ్రేమ నాలిం
గితుం జేసి వేతెంచి యిచ్చానురూపస్థితిన్ మిన్నుమన్నంద మన్నించి నిష్పంకతా
చిత్రవిద్వన్మనఃపలక్రోడసంక్రీడశీలించునుత్తాలకోలస్వరూపావలేపంబు నై పేర్చి
యున్ స్వర్చిదాకారఘోరాసురాధీరవక్షస్స్థలోద్వేలకీలార్కబాలార్కుచే లీలఁ
ద్రైలోక్యచేతస్స్ఫురధ్వాంతముం ద్రోచి రోచిష్ణులైయున్న యాభవ్యదివ్యావతారో
దయస్ఫూర్తి నాపూర్తమై యొప్పు నీయొప్పు మ మ్మెప్డు రక్షించు లక్ష్మీశయీశా నృసిం
హా నమస్తే నమస్తే నమస్తే నమః.

111


చ.

అని బహుభంగుల న్మునిసురావలి తన్వినుతించువాఙ్మయ
ధ్వనులు నభోదిగంతమిళితంబులుగా మదవేగవిస్ఫుర
ద్ఘనదితీసూనకుంజరవిదారణదారుణఖేలనంబునం
దననరసింహలీల వినుతస్థితి సార్ధకమై తనర్పఁగన్.

112


గీ.

వీరరౌద్రభయానకవిస్మయాఖ్య, రసములను బోధ్యభంగుల నెసక మెసఁగ
నఖిలభువనహృద్యంబుగ నవ్విభుండు, నిపుణవక్రతానటనంబు నిర్వహించు.

113


క.

తదనంతరంబ యయ్యు, న్మదఘోరవిజృంభణంబు మానవికాసం
బొదవఁగఁ బ్రహర్షసాము, ఖ్యదయాసౌందర్యనూతనాకారుండై.

114


క.

సితకమలదళంబునకున్, బ్రతియగులోచనములందు బ్రబలుప్రసాద
స్మితరుచిజాలములు దిశా, ప్రతతిన్ బూర్ణేందురుచులభంగి వెలింగెన్.

115


వ.

అయ్యాదిదేవుండు ప్రహ్లాదు నాలోకించి నిజజనకునిజననంబు భక్తివిరహితం బయ్యె
మమ్ముఁ గలయుటకు లెమ్మని యంతరంగంబుతోడనున్న యతనియాకారం బుపలక్షిం
చి నగుచు నిట్లనియె.

116


గీ.

తండ్రియఱకలేమికి విషాదంబు వలదు, కాలగతితోడ నతనికి మేలు గలుగుఁ
బుత్రకృత్యంబు లెల్లను బూసనడపు, జనకునకుఁ దద్విభూతియు సంభవించు.

117


క.

మెచ్చితి నిను నీకీపొర, పొచ్చెపుఁబలు కేల యింక బుధపూజిత! నీ
సచ్చరిత మిచట నచ్చపు, టచ్చ మదీయప్రపత్తి కఖిలమునందున్.

118

క.

దైతేయరాజ్యవిభవ, ఖ్యాతి యెసఁగ నీవు పెద్దకాలము భవభో
గాతిశయము నాసక్తుఁడ, వై తగ భుజియించి పొందు మస్మత్పదమున్.

119


క.

నాయెడ నసూయ చేసె, న్మీయయ్య యనంగ వలదు నిజ మతఁడును దో
షాయత్తుఁడు గాఁడు తుదిన్, జేయుదు నతనికిని బరమసిద్ధి కుమారా!

120


ఉ.

ఈవనరాసు లీకులమహీధరసప్తక మీరవీందుతా
రావిభవంబు లీగగన మీదిశ లుండెడునంతకాలమున్
గోవిదకీర్తనోల్లసితఘోషణ మై భవదాత్మభక్తిస
ద్భాగవివేకపాకజనితం బగుపేర్మి ప్రసిద్ధి నొందెడున్.

121


వ.

అని ప్రహ్లాదుం డాహ్లాదంబు నొందకృపామధురవచనంబు లుపచరించుచున్న య
ప్పరమాత్ముపరమవాత్సల్యవైభవంబునకుం బొంగి మహామునులును ననిమిషులును జయ
జయశబ్దంబుల నద్దేవు నభినందించిరి. తదనంకరంబ యయ్యందఱఁ బ్రసాదదృష్టి
నాలోకించి యజ్జగదీశ్వరుం డిట్లనియె. ఈమహనీయస్థానంబు పరమమంగళంబై
నన్నుం దనయందు నునుపంగోరుచున్నయది. నాహృదయంబునం జూడ్కులు నిం
డం బ్రియంబు నొందెం గావున నిమ్మహాశైలంబునంద యుండంగలవాఁడ. మీరు మదీ
యబలం బహోబలశబ్దపూర్వకంగా బ్రశంసించితిరి గావున నీతీర్థం బహోబల
నాయధేయంబునఁ ద్రిభువనపావనంబై వెలయుంగాత. నా చేతి నధిరూఢంబైన యి
గ్గిరియును గరుడాద్రి యనం బ్రఖ్యాతి వహించునని యానతిచ్చె. నప్పు డగ్రభా
గంబున.

122


ఉ.

శ్రీకమనీయమూర్తి నరసింహపదాంబుజసేవ గోరి మం
దాకిని ధాత్రిమీఁది కవతార మొనర్చి నిజాంగలీల న
స్తోకతరంగసంగములతో సమదాలిమనోజ్ఞపంకజో
త్సేకముతో లసచ్చిశిరసేకమనోజ్ఞమహోత్సవంబుతోన్.

123


వ.

అమ్మహానది కొలువు గైకొనియె. నా దేవుండు భవనాశినీసమాహ్వయం బని యభినం
దించె. నింద్రాదిసురలును ప్రహ్లాదప్రముఖులును కొనియాడిరి. తదనంతరంబ తత్ప్రదే
శంబున బున్నాగ నాగకేసర సరళ రసాలతాల హింతాల తమాల నారికేళ నారంగ
మాతులుంగ లవంగ లికుచ క్రముక కుటజ నిదుల చందన చంపక వకుళ కురువకా
శోక శమ్యాక శమీక మధూక మాధవీతిలక తింత్రిణీ నింబ జంబూ జంబీర పనస
హరిభద్ర భద్ర దారు దాడిమీ సుమనోమల్లికా మరువక తులసీ ప్రముఖవివిధతరుల
తాలంకృతంబును నిరంతరవసంతవాసభవనంబును నగువనంబునం దుండి.

124


సీ.

నిండారుచందురు నెరసుఁ గొండొకజేసి మిగులఁ జెన్నొందిననగుమొగంబు
వెలిదమ్మిరేకులచెలువు మాయించి యుగ్గడువుగ బెలసినకన్నుగవయుఁ
గనకకుంభములఁ జుల్కలు చేసి యెంతయుఁ గ్రొవ్వాడి వ్రేఁగైనకుచయుగంబుఁ
గెందలిరాకులయందంబు వెసఁ జించి రంజిల్ల మెరయుకరద్వయంబుఁ

గీ.

గలిగి సర్వలక్షణశుభాకారలీల, విమలభూషాంబరోజ్జ్వలవేష మమర
నాదిలక్ష్మియు సకలలోకైకమాత, యమ్మహామూర్తిఁ జేరంగ నరుగుదెంచె.

125


ఉ.

శాంతియు దృష్టియున్ ధృతియు సన్మతియున్ మొదలైననెచ్చెలుల్
సంతతభక్తి దన్గొలువ సంయమిదేవగణంబు లద్భుతా
క్రాంతకుతూహలస్ఫురణఁ గన్గొనుచుండఁగ నట్లు వచ్చి శ్రీ
కాంత ముకుందవంక తటిఁ గైకొనియెన్ సవిలాసఖేలతన్.

126


ఉ.

కోరిక లంకురింప దనకూర్మినితంబిని యూరుపీఠమున్
జేరినమేన నెల్లెడలఁ జెన్నలకన్ బులకంబు లొక్కమై
వీరిక లెత్తఁ గన్నులకు నెక్కుడుచాయలు సెంద నవ్వు నిం
డార మొగంబునం వెలయ నప్పరమేశ్వరుఁ డొప్పె నంతయున్.

127


క.

ఆలక్ష్మీపతియాకృతి, యాలోకంబులను నంతరాలోకములన్
గ్లోలుచు నానందాంబుధిఁ, దేలుచు నుండిరి మునీంద్రదివిజప్రవరుల్.

128


వ.

అమ్మహాలక్ష్మీనివాసంబైన యారమణీయోద్యానంబును లక్ష్మీవనం బనుపేర నమరులచేతన్
గీర్తితంబయ్యె. నాక్షణంబ వేదంబులు నాల్గును సాకారంబులై తత్సమీపశైలంబున
నవతరించి సవరించి చనుదెంచి లక్ష్మీనరసింహు ననేకప్రకారంబులం బ్రస్తుతించె.
నది కారణంబుగా మును లాశైలంబునకు వేదాద్రి యనునభిధానం బొనరించి కొని
యాడి. రిట్లు లక్ష్మీసమేతుండై యానృసింహదేవుండు తేజఃప్రసాదోల్లాసదేదీప్యమాన
దేహుం డగుచున్నయవసరంబున.

129


మ.

నుతలక్ష్మీవనపుష్పసౌరభముల న్సొంపారి లోలోర్మిసం
గతరంగద్భవనాశినీసలిలసేకస్వైరశీతాత్ముఁడై
యతులోద్యన్మృదులీల మందపవనుం డబ్జాక్షసేవాసమా
గతదేవద్విజకోటిచిత్తములకుం గావించె నాహ్లాదమున్.

130


సీ.

కిన్నరగంధర్వగీతనాదంబులు వింతచందంబున విస్తరిల్లె
దివ్యదోఃప్రహతనాదిత్రఘోపంబులు చిత్రరూఢంబులై చెన్నుమీఱె
నమరకాంతలలసదభినయోల్లాసంబు లభినవన్యాసంబు లమరఁజేర్చెఁ
గల్పభూరుహపుష్పకమనీయవృష్టి యపూర్వసౌరభములఁ బొల్పుమిగిలె


గీ.

ప్రమదములు నిండెఁ బావనప్రతిభ నెఱసె, నఖిలకల్యాణభంగులు నతిశయిల్లెఁ
గరుణ నరసింహదేవుండు చిరతరముగఁ, దగిలి శ్రీమదహోబలస్థాయియైన.

181


వ.

తదనంతరంబ.

132


చ.

సనకసనందనాదియతిసంఘము నత్రిమరీచు లాదిగాఁ
దనరువిధాతలున్ బ్రకటధర్మతపోవ్రతనిత్యకీర్తులున్

మనువులుఁ దోడరా భువనమాన్యుఁడు పద్మజుఁ డేగుదెంచె న
వ్వనరుహనాభు భక్తజనవత్సలు భక్తి భజించు వేడుకన్.

133


వ.

మఱియును మేరుమందారహిమవద్వింధ్యనిషధహేమకూటకైలాసచక్రవాళాదిశై
లంబులును గంగాయమునానర్మదాదిమహానదులును ప్రభాసపుష్కరప్రయాగసాల
గ్రామగయావటకాశ్మీరకాలంజిరకేదారాదిమహాతీర్థంబులును గాశిక్షేత్రకురుక్షేత్రాది
పుణ్యక్షేత్రంబులును పుష్కరారణ్యదండకారణ్యనైమిశారణ్యాద్యరణ్యంబులును
లవణోదకశుద్ధోదకాద్యాదిసాగరంబులును జంబూప్లక్షశాల్మలాదిమహాద్వీపంబులును
నగ్నిష్ఠోమవాజపేయాతిరాత్రహయమేధాదిమహాధ్వరంబులును యుమనియమాది
యోగాంగంబులును మహాపద్మశంఖమకరకచ్ఛపాదిమహానిధులును నహోరాత్రిపక్ష
మాసర్త్వయనసంవత్సరాదికాలవిశేషంబులును భూలోకభువర్లోకాదిలోకంబులును
దిగ్విదిగ్గగనంబులును కమనీయాకారంబులు ధరియించి యయ్యాదిదేవుం గొలువ నా
విర్భవించె. వసురుద్రమరుదశ్వవిశ్వేదేవాదిదేవగణంబుల జయజయశబ్దంబులును బర
మయోగీంద్రమునీంద్రనివహంబులసాధువాదంబులును బ్రహ్లాదనారదప్రముఖభక్త
జనంబులనిరంతరస్తోత్రనాదంబులును బ్రహ్మేంద్రమరుత్ప్రజాపతులమహాప్రసా
దాభినందనధ్వనులును గిన్నరవీణాస్వనంబులును భరతాదులయాతోద్యనినదంబు
లును గలసి బ్రహ్మాండకటాహంబు పూరించె. నివ్విధంబున నభిన్నస్వర్గం బనందగి
యపరబ్రహ్మలోకంబు నా నొప్పారి ద్వితీయవైకుంఠం బనంబరఁగి యహోబలంబు
సకలకల్యాణంబులకు జన్మభూమియు సమస్తసంపదలకు నాస్పదంబును నఖిలధర్మం
బులకు నాధారంబును బరమభాగవతైశ్వర్యంబులకు నిత్యనివాసంబునునై ప్రకా
శించుచుండె. నట్టియెడ.

134


క.

తనబింబము వేఱొకటై, పెనుపొందినయట్లు మెఱయు వెలిగొడుగు ప్రియం
బునఁ బట్టె నమృతకిరణుం, డనుపమతేజున కహోబలాధీశునకున్.

135


చ.

ఇరుదెస నబ్ధినాథుఁడు సమీరుఁడు కాంచనదారుచండచా
మరములు దాల్చి తన్మృదులమారుతలీలఁ జతుర్భుజాంకసు
స్థిర యగునిందిరారమణి శ్రీకరకుంతలభారచారువ
ల్లరులకు నూత్నవర్తనవిలాసము లిచ్చుచు నుండి రచ్చటన్.

136


ఉ.

ముందట వైనతేయుఁడు సముజ్జ్వలనూతనపక్షమాలికా
సుందరమేరుశైలమున సొంపగు నున్నతిఁ బేర్చియున్ భయా
స్పందితమానసోల్లసితభక్తిపరావతమూర్తియై జగ
ద్వందితు నయ్యహోబలునివాసు భజించె నృసింహదేవునిన్.

137


శా.

ఏకాలంబును రా నెఱుంగరు మనం బేకాంతవిజ్ఞానకే
లీకాంతంబుగ నుల్లసిల్లుదురు పాలింతుర్ జగజ్జాలమున్

వైకుంఠస్థిరవాసు లట్టిఘనకైవల్యాఢ్యులున్ వచ్చి రా
లోకస్వామి నహోబలేశ్వరుఁ గృపాలోలాత్ము సేవింపఁగన్.

138


వ.

ఇట్లు పరమమహోత్సవంబై యున్ననరసింహు పేరోలగంబున మౌనీంద్రులును యో
గీంద్రులను సురేంద్రులను సాద్రానందసందోహసుందరాకారులును భక్తివినయసం
భావగంభీరులును గరపుటక్రమఫాలతలస్ఫారులు నగుచుండ నఖండితైశ్వర్యధుర్యుం
డును బ్రసిద్ధభాషాచాతుర్యుండును లక్ష్మీశదయాలాభోన్ముఖుండును నైన చతుర్ము
ఖుండు కృతాంజలియై యాదేవదేవున కిట్లనియె.

139


ఉ.

ఆగమతత్త్వవాచ్యుఁడ వనంతయశోబలధర్మవాఙ్మయా
యోగరమాసమగ్రుఁడవు యోగిమనస్పరసీపరిస్ఫుర
ద్భోగమరాళనాథుఁడవు దుర్దగ్గమదోర్బలదారితారివ
క్షోగణితాప్రదీప్తనఖశోభనమూర్తి వహోబలాధిపా!

140


క.

నీకృప నీవిక్రమరస, పాకము నీకేళిలీల ప్రస్తుతి సేయన్
నాకు వశంబె దయాకర!, శ్రీకర! నరసింహ! గుణవశీకృతలోకా!

141


సీ.

దైత్యుని యత్యుగ్రతపమున కిచ్చిన కొఱగామి నాయందు నెఱయగలదు
క్రొవ్వి యయ్యసుర యక్కొలఁదుల నిలువక చేసినతప్పును జెప్పఁ బెద్ద
బాములన్నియుఁ బడి నామీఁద సొలయక యున్నవేల్పులతాల్మి యొప్పుఁ బొగడ
దిక్కెవ్వరును లేనిదీనుల సురలఁ గైగొన్న నీకరుణకు గుఱుతుగలదె


ఆ.

పగతు దునుమ నీవు పన్నినమతములు, దలఁప నుగ్గడింపఁ దరమె దేవ!
భక్తివిభవసులభ! ప్రహ్లాదవరద! లక్ష్మీనృసింహ! నిగమశిఖరిసింహ!

142


చ.

అసురులు వంగి నప్పు డమరావళి గ్రుంగిన యప్డు ధర్మముల్
పస మఱి తూలినప్పు డపపర్గము వ్రాలినయప్డు దోఃకళా
రసికశుభావతారములఁ బ్రస్తుతి పొందుదు విశ్వరక్షణ
వ్యసనమతిన్ జతుర్యుగములందును నీకృప యిట్లు శ్రీనిధీ!

143


క.

ఆపదయగుచో నెందును, రూపించిన నంద కలఁగి రూపుగ భక్తుం
జేపట్టుదు నీ సరిగా, నోపునె యేదైవములు నహోబలనిలయా!

144


ఉ.

నేరనివార మేమిటికి నిక్కము నీగుణరూపచింతకు
న్నేరము పెద్దయు న్నియమనిష్ఠయు భక్తియు బూని సల్పఁగా
నేరము మమ్ము నివ్విధము నేరమి చూపక యాశ్రితైకర
క్షారతబుద్ధివై కరుణఁ గావు మహోబలతీర్థనాయకా!

145


వ.

అని యిట్లు భారతీవల్లభుండు సల్లాపరూపంబుగా నభిరూపార్థసంస్తవంబు గావిం
చినఁ గారుణ్యతరంగితాంతరంగుఁడై దేవతాసింహుం డగులక్ష్మీనరసింహుం డప్పితా
మహుదెస మధురస్మితవికాసభాసురంబులుగా నాలోకించి యిట్లనియె.

146

సీ.

మునులతీవ్రపుశాపమునఁ జేసి మత్ప్రతిహారులు దితిసూనులై జనించి
రం దగ్రజుఁడు హిరణ్యకశిపుఁ డభిహతుఁ డయ్యె హిరణ్యాక్షుఁ డనుజుఁ డింక
నాదివరాహరూపాస్మదీయోగ్రతేజంబుచేతన యుపశాంతిఁ బొందు
వినుము త్రేతాయుగంబున వీరరావణకుంభకర్ణాఖ్యరక్షోవరేణ్యు


తే.

లై సముద్భవ మందుదు. రపుడు నేను, నవతరించి జయింతు. మూఁడవయుగంబు
నందు శిశుపాలదంతవక్రాఖ్యఁ బుట్టి, పడయుదురు వీరు మద్భావభవ్యపదము.

147


వ.

అని యానతిచ్చి యిట్లను. నహోబలనామధేయంబున నిమ్మహాతీర్థంబు మదీయనివాసం
బై నేఁడు మొదలుగాఁ ద్రిభువనపూజనీయత్వంబునం బొగడొందు. నిప్పుడు మత్సే
వోత్సవంబునకుం జనుదెంచిన యియ్యమరగణంబును నిమ్మునిసముదయంబులును సా
గరద్వీపాదివిశేషంబులునుంగూడ నిన్నియు నిచ్చోటన నిరంతరంబును సన్నిధి చేసి
యుండునది. యిది యస్మదీయవిజ్ఞాపనంబు.

148


చ.

సకలసురైకవాసమగు సర్వమునీంద్రమయంబు విశ్వతీ
ర్థకలితమున్ సమస్తసుకృతప్రభవంబును నై త్రిలోకదీ
పకమగు నీయహోబలము భక్తి యెలర్ప భజించునంచితా
త్మకులకు నెల్లతీర్థములుఁ దథ్యముగా సమకూరు నెప్పుడున్.

149


సీ.

విషువద్దినముల రవిగ్రహసోమగ్రహణములఁ బున్నమ నమపవసలను
హరిదివసముల జయంతి బారసి వెండియును బేరుకలపుణ్యయుక్తతిథుల
భక్తి నేతెంచి యీభవనాశినీనుహానదిలోన నభిషేచనంబు సల్పి
గరుడాద్రీకందగ రస్థిరమందిరంబునఁ బొలుపొరునన్నహోబలపురీశుఁ


ఆ.

గొలుచువారు పుణ్యములకెల్లఁ గుదురైన , వారు నన్ను నెపుడు వలచువారు
వలతు నెపుడు నేను వారిశికి వారికి, నేనొనర్చు టరయ రెట్టివారు.

150


మ.

భవరోగంబుల కౌషధంబు భవపాపజ్వాలకున్ వైరి దు
ర్భవపంకప్రవిశోధనంబు భవభావస్ఫారతృష్ణాహరం
బవిరోధం బకలంక మక్షయరసోదాత్తంబు భక్తప్రియో
త్సవ మెందున్ భవనాశినీజలము నిత్యస్తుత్య మిమ్మేదినిన్.

151


క.

భవనాశిని భవనాశిని భవనాశిని యనుచుఁ బలుకు భక్తజనులకున్
భవనాశిని భవనాశిని, యవుటకు భువియందు సందియంబును గలదే.

152


ఉ.

నాకరుణారసంబు భవనాశిని నా నవినాశనాకృతిన్
శ్రీకరవాహినీతనుజఁ జేకొని నాకమనుష్యలోకద
ర్వీకరగేహగాహితపవిత్రగుణౌఘమునన్ మహాజన
శ్లోకితయై తనర్చు నతిలోకవిలోకసుపాకభవ్యతన్.

153

సీ.

అసురాంగనాకుంకుమాంగరాగంబున నరుణోదయచ్ఛాయ నమరునెడలు
మునివరనియమనియుక్తకుణాశాక్షతములఁ చెట్టువలు గట్టి పొలుచునెడలు
శబరికాశ్రవణప్రశస్తబర్హిచ్ఛదచిత్రీతోర్ముల విలసిల్లునెడలు
మదకలకాంతారమాతంగమదజలోద్వేలాంబువుల నిగ్గుదేరునెడలు


తే.

నగుచుఁ బ్రతిదివసంబును నతినవంపు, టొప్పిదంబులు దనుఁ జెందె నుల్లసిల్లు
సకలకళ్యాణకాలీలసత్ప్రవాహ, భవ్య యీభవనాశినీపరమతటిని.

154


ఉ.

ఈవనధిప్రసూతయును నేనును నింపెసలార వేడ్కమై
నీవనమధ్యభాగమున నెప్డు చరింతుము దానఁజేసి ల
క్ష్మీవననామ మివ్వనము శ్రీరమణీయము లోకపావనం
బావనజాప్తచంద్రవసుధాంబరసుస్థిర మిజ్జగింబులన్.

155


క.

తనుఁ దలఁచినఁ దనుఁ జూచినఁ, దనుఁ జెందినఁ దను సమంచితస్తోత్రములన్
గొనియాడిన లక్ష్మీవన, మనుపమసకలార్థసార మగు జనములకున్.

156


సీ.

భవభానుతీవ్రతాపంబునఁ బడనీదు తనతరుశాఖలతమపునీడ
దుఃఖవాసనములఁ దొలఁగించుఁ దనలతావరపుష్పశోభితవాసనముల
దనతనుగాలిసోఁకునఁ జాలఁ జిగురొత్తుఁ జతురమనోజ్ఞవిజ్ఞానలతలు
వనవిహంగమములయనుఁగుటెలుంగు లాహ్వానంబు సేయుఁ గైవల్యభగము


గే.

ననినఁ బొగడ నలవి యగునె యహోబల, భూషణంబు సుకృతపోషణంబు
సాత్త్వికప్రియంబు సర్వాశ్రయంబు ల, క్ష్మీవనంబు భువనపావనంబు.

157


ఉ.

ఈవిపినంపుఁ గమ్మవిరు లిందిరగ్రొమ్ముడి కీపరాగముల్
శ్రీవదనాబ్జవాసనకుఁ జెన్నగు నీవనపల్లవంబు ప
ద్మావిలసత్పదంబుగరిమంబున కెందును దాన మేది ల
క్ష్మీవనమంచు సంస్మృతులు సేయుదు రర్థి సమస్తలోకముల్.

158


క.

ఈవేదశైల మమరఁగ, నావేదశిఖాగ్రవర్తి యగు ననఁగను వి
ద్యావిభవము సాధులకున్, గావించుచునుండుఁ దన్నుఁ గని గొల్వంగన్.

159


క.

వేదనగ మఖిలకల్మష, వేదవినోదమున వేదవేదాంగవిధా
వేదితము విసరభవని, ర్వేదాదివిదితవివేకవేద్యము ధాత్రిన్.

160


ఉ.

ఆగమశృంగశైలములయందు మృగేంద్రసకృద్విభూతి నే
నేగతి నొప్పుదు న్మహిమ యింపుగ శ్రీనరసింహమూర్తిలీ
లాగరిమంబునన్ దనరులాగున నిట్టిడ దీనిమౌళియ
ట్టీగరుడాద్రిపేర్మి నుతియింపఁగ శక్యమె యెట్టివారికిన్.

161


క.

గరుడాద్రి దురితవిషధర, గరుడాకృతి సిద్ధసాధ్యగంధర్వమరు
ద్గరుడాసేవ్యం బుజ్వల, గరుడాయత మస్మదీయకర్మస్థితికిన్.

162

ఉ.

భాసురభానుభానునిభభావిభవున్ గరుడాద్రిదివ్యసిం
హాసను నన్ను నున్నతదయార్ద్రు నహోబలతీర్థనాథు ల
క్ష్మీసముపేతుఁ జారునరసింహశరీరు భజించునుత్తముల్
వే సకలార్థసార్థసుఖవీధుల గ్రాలుదు రెల్లకాలమున్.

163


వ.

మఱియు నీయహోబలంబు సమస్తతీర్థసారంబు గావున నిందలితీర్థంబుల వివరింపనుం
దత్ఫలంబు భూషింపనుం బహుతరంబైన కాలంబువలయుఁ గృతత్రేతాద్వాపరకలి
యుగంబుల నిమ్మహాతీర్థంబుమీఁదఁ దాత్పర్యంబు లేక నన్ను గొల్వక యథేష్టచరితుల
గుదురు భాగ్యంబున నెవ్వరేని యిచ్చటికి వచ్చి భయభక్తివిశ్వాసంబులతో మదీయ
సేవాసక్తులయినవారలు సకలమనోరథంబులు సఫలంబులుంగాఁ గని దివిజులకుం బడ
యరానియస్మదీయలోకాభిగమనంబుఁ బడయుదురు. యిది పరమరహస్యంబు త్రైలో
క్యహితార్థంబుగా నెఱింగించితి నని వెండియు నిట్లనియె.

164


క.

విను కలియుగమున మానవు, లనయము నాస్తికులు దృష్టమైనది దెలియం
గనుగొనియు నమ్మతని యే, నొనరించితిఁ బ్రత్యయంబు లొకకొన్ని గృపన్.

165


సీ.

సంతానకాంక్షులై యెంతయుఁ జింతిల్లు కాంతలు పురుషులు గలిగి కేని
చేరి జయార్థులై బీరంబు మిగులంగఁ గడఁగెడురాజులు గలిగిరేని
యధికరోగార్తులై యారోగ్యసంసిద్ధి గావింప వెజ్జులు గలిగిరేని
బహువిపన్మగ్నులై పారంబు గానక కలఁగెడుదీనులు గలిగిరేని


ఆ.

వారు వారు వారు వారును భక్తియు, నమ్మికయును నెమ్మనముల మిగుల
నను నహోబలేశు నరసింహదేవునిఁ, గొలిచి కాంతు రెల్లకోరికలను.

166


క.

కన్నులు జాత్యంధునకున్, గన్నియకును జారుభర్త గర్భిణికి సుతుం
డున్నతవిద్య విమూఢున, కు న్నిజముగ నమ్మి నన్ను కొలిచిన నొదవున్.

167


క.

నరహరి యహోబలేశ్వర, శరణం బగుమనుచుఁ బలుక సర్వావస్థాం
తరముల నెప్పుడు నతనికిఁ, గరస్థలము భుక్తిముక్తికళ్యాణంబుల్.

168


సీ.

క్షీరాబ్ధిభవనంబు శ్రీపురుషో త్తమం బాదికేశవ మనంతాలయంబు
శ్రీకాంచిపురి హరిక్షేత్రంబు మధుర శ్రీద్వారక శ్రీరంగభూరిపదము
శ్రీకూర్మసదనంబు సింహాచలంబును నాదివరాహసమాశ్రయంబు
మాధనాఖ్యంబు గదాధరనిలయంబు బదరీనే వనము శార్ఙ్గపాణిగృహము


ఆ.

మొదలుగాఁ ద్రిలోకవిదితంబు లగుమహా, స్థానములును సుజనసంస్తవములు
నొప్పుఁ గాని నాకహోబలతీర్థంబు, పగిది నధికవల్లభములు గావు.

169


ఉ.

ఏదివసంబునందయిన నెమ్మెయినైనను నెవ్వఁడైన న
త్యాదరవృత్తి భక్తిమతియై చనుదెంచి యహోబలేశు న

న్నాదిమదైవతంబుఁ గనినట్టి మహాత్ముఁడు సిద్ధసౌఖ్యస
మ్మోదము నొందు నెంతయు నమోఘము నాపలు కంబుజాసనా.

170


వ.

విశేషించి మద్భక్తజనంబులును వసంతమహోత్సవంబు మిగులం బాటించి కొలువంగో
రునప్పు డేను బ్రసన్నుండనై సేవకు మనోరథార్థంబులు నెరపుదు. నమరాసురసంయ
మిసిద్ధసాధ్యగంధర్వాదులు దమయిష్టసిద్ధ్యర్థంబు వసంతయాత్రాప్రసంగంబునం జను
దెంచి నన్ను నారాధించెద. రాసమయంబున మర్త్యులమర్త్యులను భేదంబు దోఁపక స
ర్వంబును దేవతామయం బయ్యు నిప్పటిమహోత్సవం బిట్లొప్పినయట్ల వసంతో
త్సవంబు నాకు మనఃప్రియంబై యుండు.

171


చ.

అమరవసంతయాత్ర నఖిలావనిమండలిమధ్యవాసులున్
దమతమకల్మి భూజను లుదాత్తవిభూషణపత్రగంధమా
ల్యములు నొనర్చువారలును వాయనసంచయ మిచ్చువారు నై
ప్రమదముతో నొనర్తురు కృపానిధి నన్ను నహోబలేశ్వరున్.

172


ఉ.

అట్టివసంతయాత్రఁ గొనియాడినవానిని రిత్త నెన్నడున్
బుట్టువు చావు నొందని ప్రభుత్వము వైష్ణవరాజ్యలీలకున్
గట్టుదుఁ బట్ట ముజ్వలవికాసకృపాకమనీయబుద్ధిమైఁ
జుట్టలు వీరు నాకు నని చూతుఁ దిరంబుగఁ నేను వారలన్.

173


ఆ.

హేమరత్నరజతభూమికన్యాదిక, దానములును సద్వ్రతక్రియలును
నొకటి కొకటి ఫలము నొసఁగు నహోబల, తీర్థమున నొనర్చు ధీనిధులకు.

174


క.

తపములు పితృకార్యంబులు, నుపవాసంబులును నియ్యహోబలమున ని
క్కపుభక్తి ననుష్ఠింప న, సుపమంబగు తీర్థఫలము లొందఁగఁగలుగున్.

175


సీ.

అనవరతంబును నస్మదీయధ్యానశీలురై బుద్ధి రంజిల్లువారు
చక్రాంకతులసీవిశాలసాలగ్రామసేవ నస్మత్ప్రీతి సేయువారు
నతిభక్తి మచ్ఛరణాగతజనులను గొనియాడి వేడుకఁ దనరువారు
మామకదివ్యనామస్తోత్రసంసక్తి నానందపరత నింపారువారు


ఆ.

చేరిగొల్చువారు శ్రీమదహోబల, తీర్థనాథు దేవదేవు నన్ను
వారు భుక్తిముక్తివైభవభాగులు, వారు పుణ్యధనులు వారు ఘనులు.

176


క.

యతులును సాత్వికులును సా, త్వతులును జక్రాంకభాగవతులును నిత్య
వ్రతులు నహోబలతీర్థ, స్థితు నరసింహాత్ము నను భజింపఁగ నర్హుల్.

177


శా.

వేదార్థప్రతిపాలనైకనిపుణుల్ విప్రోత్తముల్ సత్కథా
స్వాదప్రీతులు భూపతుల్ గుణవశుల్ వైశ్యుల్ నిజాచారసం
వేదుల్ తక్కటివారునుం గలియుగావిర్భావకాలంబునన్
వేదాతీతు నహోబలేశు నను సేవింపంగఁ బాత్రుల్ మహిన్.

178

ఉ.

వారల కెల్లకల్మషనివారిణియై మహనీయసంపుటా
కారిణియై విముక్తపదకారిణియై విలసిల్లుచుండు మ
త్కారుణికత్వలీల విను కష్టపుజాతియు న న్నహోబల
స్ఫారనివాసుఁ జేరి కనుబ్రాజ్ఞనిషేవితపుణ్యలోకముల్.

179


ఉ.

మానవకోటి కింక ననుమానము లేల విముక్తికల్మి వి
జ్ఞానవిహీనపక్షిపశుజాతములున్ దటినీమహీధ్రముల్
గ్రూనును రాయి లోనగుసమస్తచరాచరజంతుజాలమున్
బూని పునర్భవాతురతఁ బొంద వహోబలతీర్థవాసతన్.

180


తే.

విను మహోబలతీర్థపవిత్రసేవ, యందు రుచి యెల్లవారికి బొందనీను
మాయ గావింతుఁ గష్టపుమానవులకు, దానఁ జెడుదురు మాత్సర్యదర్పనిరతి.

181


చ.

అనితరతత్వశీలురగునట్టి మహాత్ములు మాయచేయుత్రి
ప్పున బడిపోక భక్తియుతభూతదయాకలితాంతరంగులై
యనఘు ననంతు నచ్యుతు ననాది నతర్కు నహోబలేశు న
న్ననుపమనారసింహు మహితాత్ము భజింతురు నిత్యధన్యులై.

182


తే.

నీవు మద్భక్తుఁడవు మునిదేవసమితి, కెల్లఁ గురుఁడవు గావున నేను నీకు
నధికగోప్యంబు విబుధరూప్యంబునైన, సిద్ధమంత్రంబుఁ జెప్పెదఁ జిత్తగింపు.

183


చ.

ఇలఁగలపుణ్యతీర్థముల కెల్ల నహోబల మెక్కుడన్ తలం
పలవడఁజేయుమామకములై చను భూతభవద్భవిష్యద
త్యలఘుతరావతారముల కన్నిఁటికిన్ నరసింహమూర్తి య
గ్గలముగఁ జూడు మివ్వధమ కాఁగనుమీ శ్రుతిశాస్త్రవీథులన్.

184


చ.

అని పరమాత్ముఁ డిట్లు పరమార్థకథారసలీల వీనులన్
దనియఁగఁ గ్రోల్చినఁ దగబితామహుఁ డుద్గతసమ్మదాశ్రులో
చనుఁడు పరిస్ఫురత్పులకచారుశరీరుఁడు నై సురారిభం
జను నరసింహు శ్రీరమణు సన్మతిలో నునిచెన్ దిరంబుగన్.

185


క.

సురలు మునీంద్రులు నానం, దరసాబ్ధిని దేలుచును సుదర్శనలక్ష్మీ
నరసింహమూర్తిమీఁదం, బరఁగించిరి తమసమస్తభావము భక్తిన్.

186


వ.

మఱియు సిద్ధసాధ్యచారణగందర్వాదులును బరమరసావేశంబునన్ దదాకారంబు గ
నుంగొనుచుం గౌతుకాశ్చర్యభక్తిభరితభావంబులతోడ జయజయశబ్దతత్పరులై యుం
డిరి. లక్ష్మీనరసింహదేవుండును బ్రహ్లాదు నఖిలదానవకులైశ్వర్యధుర్యుంగా నభిషేచ
నంబు చేసిన నతండును సాష్టాంగదండప్రణామంబులతోడ బహువిధస్తోత్రపవిత్రా
ర్చన లొనర్చినం బ్రసాదమధురాలోకనంబు లతనిపై సొలయ నప్పరమేశ్వరుండు
వరం బడుగుమనిన నమ్మహాత్ముం డిట్లని విన్నవించె.

187

క.

ఏజన్మమున జనించిన, నాజన్మమునందు నీసమంచితచరణాం
భోజంబులపై విజిత, వ్యాజమయిన భక్తి భక్తవత్సల! యీవే.

188


క.

ఖలులకు సంసారముపైఁ, గలవేడుకఁ బాసి మోక్షగరిమము గూర్పన్
వెలయవలయు నీమహిమలు, దలఁపుచు నిట్లున్న నాదు తలపున వరదా!

189


వ.

అనిన బ్రసన్నుండై భక్తవత్సలుం డట్లకా ననుగ్రహించితి. యోగీంద్రులకు మద్భక్త
జనంబులకునుం బ్రాజ్ఞజనంబులకు నన్నియు నీయరచేతిలోనివి. నీవు మదీయసాలోక్య
సారూప్యసామీప్యసాయుజ్యసిద్ధులు గ్రమంబునన్ బొందఁగలవాఁడవ యని
యానతిచ్చి మఱియు ని ట్లనియె.

190


సీ.

అధికబోధమ్మున నస్మత్పదాంబుజభక్తిరసంబునఁ బ్రకటమైన
నీమహనీయవినిశ్చలచరితంబు సంప్రీతి నేప్రొద్దుఁ జదువువారు
వినువారు జనులకు వినిపించువారును సకలకల్మషసముచ్చయము ద్రోచి
యాయురారోగ్యపుత్రార్థసమృద్ధులఁ బొంది మద్భక్తి సొంపున వహింతు


తే.

రన్యులకుఁ బడయరానియుదాత్తనిత్య, పదముఁ బడయుదు రానందభాగు లగుచు
సర్వపూజనీయం బగుసాధుహితము, వాచకంబు మన్మహిమకు వాఙ్మయంబు.

191


క.

అని యానతిచ్చి త్రిజగ, జ్జనకుఁడు ప్రహ్లాదదేవుఁ జరితార్థునిగా
నొనరించె విశ్వలోకము, ననిశము రక్షించుచుండె నధికప్రీతిన్.

192


చ.

సమధికభక్తియుక్తుఁడయి శార్ఙ్గి భజించునరుండు సంతత
సిమితయశోవిలాసుఁడయి చెన్నలరారెడు భోగభాగ్యదు
ర్దమవిభవంబు మై సుకృతి తద్దయుఁ గాంచుచు మర్త్యలోకని
ర్గమనమునాఁడు విష్ణునుపకంఠము పొందు వినిశ్చలంబుగన్.

193


క.

అని దేవశ్రవుఁ డెఱిఁగిం, చిన దివ్యక్షేత్రమహిమఁ జిత్త మెలర్పన్
విని గాలవుండు ముదమును, దనువును బెనఁగొన నృసింహుఁ దలఁచుచునుండెన్.

194


వ.

అని రోమహర్షణుఁడు వినిపించుటయు సంయమిప్రవరులు భక్తిరసావేశంబున నానం
దామృతధారల మునింగి యహోబలనాథునిచ్చలు దలంచుచు యథేచ్ఛం జనిరి.

195


ఆశ్వాసాంతము

క.

గర్వితదైత్యవిఖండన, దర్వీకరశయన వరసుదర్శనశార్ఙ్గా
ఖర్వాయుధమండితభుజ, గీర్వాణావనముదాత్మ కేశవ నృహరీ.

196


శా.

పారావారశయాన సింధుతనయాపాంగేక్షణోదార సు
స్మేరాలోకనమూర్తి దైత్యవిభవశ్రీవర్ధనవ్యత్యయా
కారుణ్యామృతవృష్టితర్పితసుభక్తవ్రాతనిత్యోదయా
రారాజచ్చరణాబ్జసంజనితగీర్వాణాపగా శ్రీహరీ!

197

మాలిని.

ప్రకృతిగుణతరంగా ప్రస్తుతౌదార్యసంగా
సుకృతిజలధిభంగా సూరిచేతోజ్ఞభృంగా
నికృతిజనవిదూరా నిర్మలాకారమారా
వికృతిదనుజవీరావేశసంహారకారా.

198


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్యధుర్య
శ్రీసూర్యసుకవిమిత్రసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతం
బయిన శ్రీలక్ష్మీనృసింహావతారంబను పురాణకథయందు సర్వంబును బంచమాశ్వాసము.


నృసింహపురాణము సమాప్తము.