నీలాసుందరీపరిణయము/ప్రథమాశ్వాసము

ప్రథమాశ్వాసము

కథాప్రస్తావన

క.

మును నైమిశ మనునడవిని
మొనసి నిరాబారిసింగములు పెక్కుకతల్
వినుచుండి రోమహర్షణు
ననుఁగుంగొడుకునకు నిట్టు లనిరింపొదవన్.

24


క.

జడదారిరాయ మాకుం
గడునెలమిగ లచ్చిమగనికత యొక్కటి యే
ర్పడఁ దెల్పు మనుచు వేఁడినఁ
దొరి యతం డపుడు వారితో నిట్లనియెన్.

25

మిథిలవర్ణనము

తే.

వినుఁడు బల్లిదులార మీవీను లలర
నిచ్చలంబుగఁ దెల్పెద దచ్చికడల
నెన్నఁదగి వన్నియలకెల్లనిక్క యగుచుఁ
బుడమిలోపల మిథిలనాఁ బ్రోలు వెలయు.

26


సీ.

వెలలేనివలుఁదక్రొన్నెలఱాలమాడువు
            ల్దట్టంపుఁదరఁగ మొత్తములు గాఁగ
రంగుబంగరువు మెఱుంగుటరంగులు
            నిద్దంపుటిసుకతిన్నియలు గాఁగఁ

గులుకుఁబాయపురాచతలిరాకుఁబోఁడులు
            పగడంబుఁదీవజొంపములు గాఁగ
మేటిపల్గొమ్ముల మెకపురాతుటుములు
            లలితంపుఁబఱపుగుబ్బలులు గాఁగ


తే.

వన్నియలుమీఱి చెలువారువారువములు
కొమరుదళుకొత్తు బలుమానికములు గాఁగఁ
బొంకముగ నెల్లసిరులకుఁ డెంకి యగుచుఁ
బాలమున్నీటిపగిది నాప్రోలు దనరు.

27


ఉ.

పున్నమచందురుం దెగడుపొంగపుమోములరాచకన్నియల్
గ్రొన్నెలఱాలమేలిపనికొప్రపుమేడల నాటలాడ నా
యన్నులకుల్కు లేనగవు లచ్చమవెన్నెలలంచుఁ ద్రిమ్మరున్
వెన్నెలపుల్గుమొత్తములు వేడుక నబ్బలువీట మాటికిన్.

28


చ.

మినుకుఁగాడానిబంగరువుమేడలసోరణగండ్లవెంట రేల్
చనియెడిరిక్కమొత్తమును జక్కఁగఁ జూచి మెఱుంగుఁబోఁడు లి
చ్చను బిడికిళ్ళఁ బట్టి యవి జాఱి చనం దమగోళ్ళు చుక్కలం
చును నెడ నిల్చి చే వదలి చూచుచు నుబ్బరపోదు రందులన్.

29


చ.

పగడపుఁగంబముల్ నిలిపి పన్నినముత్తెపుఁజప్పరంబులన్
నిగనిగలాడు కుందనపునిద్దపుగోడల నాఁడెమైనము
త్తిగరతనంపుజిల్గుఁబనితిన్ని యలుల్ బలుదమ్మికెంపుఱా
జిగితలుపు ల్గడు న్మెఱయుఁ జెన్ను దలిర్పఁగఁ బ్రోల నెల్లెడన్.

30


తే.

ఇగురుఁబోండ్ల కగడ్తలో నీఁదుచిలువ
చెలువ లిడుతమ్మికెంపులుఁ జెలఁగి కోట

కొమ్మలం దాడుతెఱగంటికొమ్మ లిడెడు
వేల్పుదొరమానికములు నవ్వీటఁ దనరు.

31


తే.

ప్రోలిపల్గోటకొమ్మలఁ బులుఁగుఱాలు
గఱికయని డాసి చెంతఁ జెక్కడపుసింగ
ములను గన్గొని నడుచక్కి బోవ వెఱచి
ప్రొద్దతేజీలు బలువడిఁ బోవుఁ గడల.

32


క.

పన్నుగ నందలియేనుఁగు
గున్నలపై మావటీండ్రు కోరిక లడరన్
మిన్నేటిపసిఁడితామర
క్రొన్ననలను వన్నెమీఱఁ గోయుదు రెపుడున్.

33


తే.

పొడుపుమలనుండి పడమటికడలికరుగఁ
బవలునలుజాములునుబట్టుఁ దొవలసూడు
తత్తడుల కని మాటలో దచ్చికడలఁ
బఱచి క్రమ్మఱు నచటిబాబాతుటుములు.

34


క.

నలుమొగములఁ దా నాలుగు
తొలుపలుకును సదువు టేమి దొడ్డని నలువం
బలికి కలచదువు లెల్లను
బలుకుదు రొక్కొక్కనోరఁ బాఱులు వీటన్.

35


చ.

కలన నెదిర్చెనేనిఁ దిగకన్నులవేలుపు నైన మార్కొనం
దలుఁపుదు రెద్ది వేఁడిన నెదం గని మానక జన్నిగట్టుఁ బె
ద్దలకును బేదసాదులకుఁ దద్దయు నిత్తురు ప్రోల నెప్పుడుం
బొలుపు దలిర్ప రేవెలుఁగుప్రొద్దుకొలంబులరాచసింగముల్.

36


ఆ.

తోలుదాల్పుననుఁగు తొమ్మిదిపాఁతఱల్
రొక్క మున్న దనుచు నిక్కుఁగాని

లెక్క కెక్కుడైన రొక్కంబుఁ దఱుఁగని
కొలుచు గలదు ప్రోలికోమటులకు.

37


తరలము.

మొలకుఁ దెల్లనిబట్ట లేకయు ముచ్చటం గలు ద్రావుచుం
బొలము దున్నఁగ నోడి నాఁగలి పూని త్రిమ్మరు నంచు ని
చ్చలును బల్కుచు నుందు రాకఱిసామియన్నను దట్టపుం
గలుముల న్వెలుఁగొంది యచ్చటికాఁపుఁబెద్దలు తద్దుయున్.

38


చ.

కులుకుమిటారిగుబ్బలును గ్రొమ్ముడులు న్బిగికౌనులుం బిఱుం
దులుఁ గదలంగఁ జిల్కలను దోలునెపంబున నెల్గులెత్తి గా
జులు గలుగల్లనం జుఱుకుఁజూపులచేఁ దెరువర్లడెందముల్
గలఁపుదు రందులం బొలముకాపరికాఁపుఁదుటారికత్తియల్.

39


చ.

పగడపుఁదీఁగలో తళుకుబంగరుబొమ్మలొ క్రొమ్మెఱుంగులో
తొగచెలితున్కలో మరునితూపులొ బల్రతనంపుఁదేటలో
సొగసులదీవులో యనుచుఁ జూపఱు లువ్విళులూర నందులం
బొగడికఁ జెంది యందములఁ బొల్తురు నీటుగ నాటచేడియల్.

40

ధర్ముఁడనుఱేని వర్ణనము

క.

అవ్వీ డేలు న్మేలని
దవ్వులదొర లెన్న మిగుల ధర్ముఁడు దనతోఁ
జివ్వకు నెదురై నిలిచిన
మువ్వురువేలుపుల నైన మొనసి కలంచున్.

41


సీ.

వెడవింటిబలుదంటఁ బొడసూపఁగా నీక
            తోలుదాలుపు నొక్కమూల కనిచి

తొలుమొగల్తుటుముల దూదియ ట్లనియించి
            కలువులచెలికాని వెలి యొనర్చి
గాలిమేఁతరిఱేనిఁ గాలూనఁ గా నీక
            కడలి నెల్లప్పుడు నడలఁజేసి
వెడఁదమోముమెకంబు నడవుల డాఁగించి
            గట్టులయెకిమీనిఁ గడకుఁ ద్రోచి


తే.

చక్కఁదనమున వాసిని జాగమునను
జిగిని మాటలలోఁతున మగతనమున
నిచ్చలంబునఁ గడలఁదా నెచ్చుగాంచి
పొగడికలఁ జెందునెపుడు నప్పుడమిఱేఁడు.

42


సీ.

ఎనలేనిమగఁటిమి నెసఁగువాఁ డగుటకుఁ
            బొంచుండి కోఁతిని ద్రుంచఁడేని
కోర్కులెల్లను సమకూర్చువాఁ డగుట కూ
            రక చుప్పనాక మరల్పఁడేని
కనికరంబుల కెల్ల నునికిప ట్టగుటకుఁ
            బొలదిండ్లఁ బొలియింపఁ దలఁపఁడేని
యుడివోనికలుముల నడరు చుండుటకుఁ గా
            ఱడవుల దుంపలు గుడువఁడేని


తే.

బంతితేరులపంటవలంతిఱేని
కొడుకు దొర యగు నతనికిఁ గడిమి నీగిఁ
గనికరంబున సిరి నంచుఁ గడఁగి పెద్ద
లెన్న నారాచజాబిలి చెన్నుమీఱు.

43


క.

పిఱికితనంబును జలమును
గొఱకొఱ యీలేనిగొనము గుఱి దప్పుటయుం

దుఱుతును బిగియును గల్లయు
నెఱుఁగఁ డతం డించుకయిన నెల్లెడలందున్.

44


సీ.

జగడంపుటోరెంపుజడదారికడకేఁగి
            చదలేటితెలినీట జలకమాడి
తెఱగంటిదొరయింటితెలిమ్రాఁకు లెగఁబ్రాఁకి
            వలనొప్పఁ దెలిదీవి కెలనమెలఁగి
పలుచందములఁ జిందములఁ గ్రిందుపడఁజేసి
            నెలతాల్పుబలువేల్పుచెలువు నవ్వి
చలమాని యలయేనుఁగులసూడు దిగనాడి
            మగఱాలజిగినెలఁ దగుచుఁ దెగడి


తే.

ముత్తియంబుల నురువుల మొల్లవిరుల
మంచుసోనలఁ జుక్కుల నంచగముల
నెంచి కొంచక తనయసం బెల్లకడల
వెలుఁగ వెలుఁగొందు నారాచవేల్పుఱేఁడు.

45


క.

వెంగలియుఁ బిఱికివాఁడును
దొంగయుఁ గొండీఁడుఁ బేద తులువయు ననికిన్
లొంగినవాఁడును లేఁ డర
యంగా మందునకు నైన నద్దొరపుడమిన్.

46

కుంభకుఁ డనుగొల్లదొరకత

క.

ఆరామానిక మెప్పుడు
గారవమునఁ బెనుప నందుఁ గదలనిసిరులం
గేరుచుఁ గుంభకుఁ డనియెడి
పేరిటిగొల్లదొర యొకఁడు పేర్మిఁ జెలంగున్.

47

తే.

వేలుపులఱేఁడు దన కొకవెల్లమొదవె
కల దనుచు నిక్కు నింతియకాని యిట్లు
కలవె పలువన్నియలగిడ్డికదుపు లంచు
నెంచుచుండు నతం డెందుఁ గొంచులే

48


సీ.

అడిగినఁ గొదుకక పుడమివేల్పులకు ని
            చ్చలుఁ బాడిమొదవులఁ జాల నొసఁగుఁ
బేదగేస్తులఁ జేరఁ బిల్చి కోరినయన్ని
            దుక్కిటెద్దులఁ బల్మితోడ నిచ్చు
ముదుసళ్ళఁ గడఁగమై వెదకి తా రావించి
            నెమ్మిఁ గన్గొని యోగిరమ్ము వెట్టు
నెడపక గీమున కేతెంచువిందుల
            కెలమి వల్వలును సొమ్ములు నొసంగుఁ


తే.

జెలిమికాండ్రను బెద్దలఁ గొలమువారిఁ
గూరిమి దలిర్ప సారెకు గారవించు
నౌక యరు దగుఁ బుడమిపై నరసి చూడ
గొల్లయెకిమీనినాఁడెంపుగొనములెల్ల.

49


తే.

చుక్కలను వానచినుకుల నిక్కువముగ
లెక్కయిడవచ్చుఁగాని పెంపెక్కి యెపుడుఁ
బుడమి యీనినతెఱఁగున నడరునతని
తొడుకులం దెల్లమిగ లెక్కయిడఁగరాదు.

50


క.

అమ్మేటిగేస్తునకుఁ గడు
నెమ్మి యొనర్చుచును నిచ్చనిచ్చలు బలుపు
న్నెమ్ముల ధర్మద యనియెడు
కొమ్మ దనరు నెల్ల మేలిగొనములప్రో వై.

51

సీ.

అనయమ్ముఁ బెఱయిమ్ములను ద్రిమ్మరుచునుండు
            చలివెలుంననుంగుఁజెలియ లెనయె?
పెనుఱాఁగయై మ్రోఁగుచును మోసలకునేఁగు
            నలుమొగంబులవేల్పుచెలువ దొరయె?
జగమడ్డఁ దగుదొడ్డ సత్తియై బెదరించు
            గట్టులయెకిమీనిపట్టి జతయె?
పలుఱేఁడులకు సూడు బలియించి పొలియించి
            లలిఁ గేరుపంటవలంతి సరియె?


తే.

యివ్వెలందుక కని తనీడుచేడె
లందఱును డెందములనుబ్బి యాడుకొనఁగఁ
జెలఁగి నాఁడెపుఁ బుడమి జేజేలగములఁ
బ్రోదిసేయుచునెపుడు నప్పొలఁతి యలరు.

52


క.

ఉడివోనిసిరుల నిటువలెఁ
దడవెడునయ్యాల్మగళ్ళఁ దనియింతురు సొం
పడర సిరిదాముఁ డనునొక
కొడుకును మఱి నీల యనెడుకూఁతు రొకర్తున్.

53

నీలావర్ణనము

క.

అచ్చిన్నికన్నెసోయగ
మచ్చెలువుం జిల్వచెల్వలందును మఱి య
య్యచ్చరచేడియలందును
నిచ్చలుఁ బరికింపఁ గలుగ నేర దొకప్డున్.

54


క.

చన్నులు జక్కవగిబ్బలు
కన్నులు చెన్నలరునల్లకలువలు పిఱుఁదుల్

దిన్నెలు వన్నెలగని య
య్యన్నులతలమానికంబు నలవియె పొగడన్.

55


సీ.

గొనబారునూగారు కొదమతుమ్మెదబారు
            బలుగుబ్బపాలిండ్లు పసిఁడిగిండ్లు
ననుఁ గావిజిగిమోవి ననతేనియలబావి
            దొరమించుమైరంగు తొల్మెఱుంగు
నాఁడెంపుజడపెంపు నాఁచుతీవలగుంపు
            కలికికన్గవడాలు గండుమీలు
పొగడొందుమొగమెందుఁ దొగలగాదిలివిందు
            జిగిలేఁగవునుఁదీవ మొగులుత్రోవ


తే.

తఱులు తరఁగలు చేతులు తమ్మివిరులు
తొడ లనంటులు పిక్కలు దొనలు తళుకుఁ
జెక్కుటద్దంబు లడుగులు చెంగలువలు
బొమలు సింగిణు లమ్మించుఁబోఁడి కరయ.

56


ఉ.

చిందమునందముం దఱుముఁ జేడియకుత్తుక క్రొత్తకప్రపుం
గందముచందముం దెగడుఁ గన్నియనెమ్మెయితావిపిండు లేఁ
జెందొవవిందువన్నియ నిసీ యనుఁ బైదలినెన్నొసల్ బళీ!
కుందన మెందునున్ దొరయెకొమ్మనిగారపుమేనిచాయకున్?

57


క.

నెలఁతుక చిఱునగవులు వె
న్నెలలం గన నవ్వు లేమ నిద్దపుఁగులుకుం
బలుకులు చిలుకల నులుకఁగఁ
బలుకుం బలుకుదురు వోలు బలుమగఱాలన్.

58


తే.

అట్లు లేజవ్వనమ్ము సోయగముఁ గల్గి
చెన్నుమీఱుచు నున్నయయ్యన్నుమిన్నఁ

గాంచి తలిదండ్రు లెంతయు గారవమున
నుల్లమున నుబ్బుచున్నచో నొక్కనాఁడు.

59

కుంభకునిపాలి కొకబ్రాహ్మణుఁడు వచ్చుట

సీ.

తిగరేక లేర్పడ దిద్దిననొసలిను
            న్వెలిబూదిబొట్టురంగులు సెలంగ
సరవిఁ జిచ్చఱకంటిదొరకంటిపేరింటి
            వేరులు వేరెదఁ బెంపుమీఱ
మొలఁ బింజె వట్టి చెంగులు మాటి కట్టిన
            వలిపనీర్కావిదోవతి సెలంగఁ
బైఁ గప్పుకొన్నహొంబట్టుదుప్పటిమెఱుం
            గులు నల్గడలఁ గ్రమ్ముకొని వెలుంగఁ


తే.

బొత్తములు మేల్కుళాయిపల్ ముత్తియంపుఁ
బోగులునుజాలజన్నిదంబులును గొడుగు
గిండి చెంబును గల్గి ముంగిటికి వచ్చి
నిలిచె వడినొక్కనాఁడెంపునేలవేల్పు.

60


చ.

నిలిచినఁ జూచి గొల్లదొర నిండినబత్తిని గేలు మోడ్చి య
బ్బలియుఁ డొసంగుదీవనలఁ బల్మఱుఁ గైకొని గొప్పతమ్మికెం
పులు గదియించినట్టిజిగిపుత్తడిముక్కలిపీఁటమీఁద ని
చ్చలముగ నుంచి పూజ లిడి చయ్యన నాతనితోడ నిట్లనున్.

61


తే.

పుడమిదయ్యమ! యెందుండి వెడలి వచ్చి
తిటకురాఁగర్జమేమి మా కెఱుఁగఁజేయు
మెచ్చుమిముబోఁటిపెద్దలు వచ్చుటెల్లఁ
దోడుతోడనె మేలు చేకూడఁ గాదె?

62

తే.

అనుడు నగ్గొల్లఱేనిఁ గన్గొని కరంబు
సంతసంబున నలరి యజ్జన్నిగట్టుఁ
గొలముతలమానికము తనవలఁతితనము
గనఁబడఁగ నిట్టులని చెప్పఁగాఁ దొడంగె.

63

బ్రాహ్మణుఁడు కృష్ణునిలీలం దెల్పుట

క.

విను నీకు బావ యగునం
దునిచెంగటనుండి యెమ్మెతో నీకడకుం
జనుదెంచితి నబ్బల్లిదుఁ
డనుపఁగ మీసేమ మెల్ల నారయుకొఱకున్.

64


క.

కడు నిడుములఁ బడి వా రి
ప్పుడు మునుపటినెలవు వదలి పోఁకు మిగులఁగం
దొడుకులకు బృంద యనియెడు
నడవికిఁ గాఁపురము వచ్చి రలజడి మీఱన్.

65


క.

మిగులఁ గడగండ్లఁ బడియుం
దెగకయు వా రెల్ల నిపుడు నీమేనల్లుం
డగుకఱివేలుపుకతమున
నొగి నుసుఱులతోడి నిల్చి యున్నారు సుమీ.

66


తే.

అతఁడు గావించుకర్జంబు లరయ నొక్క
మోము గలిగినమానిసి యేమి దెలుపు
మీఱఁగా నాలుగైదాఱు నూఱుపదులు
నోళ్ళు గలవారికిని బూని నుడువరాదు.

67


క.

విను సిరిమంతుఁడు కడువ్రేఁ
గున నడరెడు పుడమిపడఁతికొఱకును జేజేల్

మును వేఁడుకొనిన మానిసి
తనము గనినవెన్నుఁ డతఁ డెదం బరికింపన్.

68


క.

ఆచంద మెల్ల దిటముగ
నీచెవులకుఁ దనివి దీఱ నే నెఱిఁగింతున్
రాచపను లిపుడె తలఁపం
జూచుకొనక యాలకింపు స్రుక్కనితెలివిన్.

69


సీ.

మును సోఁకుమూఁకల మోవ నోపక నేల
            చేడియ దలఁకి జేజేలఁ గూడి
చదువులవేలుపు మొదలు వెన్నునిచెంత
            కరిగి చాఁగిలి మ్రొక్కి సరగ లేచి
యాయన కత్తెఱం గంతయు నెఱిఁగించి
            జియ్య యిప్పని జాగు సేయఁ బోక
కావింపవే యని కడు వేఁడుకొనిన న
            వ్వేల్పుల కవ్వేల్పు వెరపుదీఱ


తే.

నిప్పని యొనర్తుఁ బొండు మీరిండ్ల కనుచు
ననిచె ననిచిన కూర్మితో నపుడు తొగల
యనుఁగుకొలమున వసుదేవుఁ డనెడుదొరకుఁ
గొమరుఁడై పుట్టె నెంతయుఁ గొమరుమిగుల.

70


ఆ.

పుట్టి కంసుఁ డనెడునట్టిరాకాసుల
ఱేనివలన సూడు తోనె పూని
నందునింటఁ జేరి నందునియిల్లుటా
లగుయశోద పాపఁ డనుచుఁ బెనుప.

71


తే.

అత్తెఱంగునఁ బెనుచుచున్నంత నొక్క
యెడను బూతనయనుపేర నడరుపెరసు

నల్లఁద్రావుడుఁబడఁతి మత్తిల్లి చేరి
విసపుఁబాలిడఁ గని దాని యుసుఱుగొనియె.

72


ఆ.

దండఁ గొండపోల్కి నుండునో నొండెడ
దండితనము మీఱ నండగొనక
పిండిపిండిగాఁగ రెండుకాళులఁ దాచి
దండి బండిపొలసుదిండిఁ జెండె.

73


క.

దొరఁకొని తనుఁ బొదివి కడున్
సరగను జదలికిని నొగిని జనుబేరజపుం
గరువలిబలుతొలుజేజే
నరుదుగ గుదెతాల్పువీటి కనిచెం గడిమిన్.

74


సీ.

బుడతకల్వలవిందుఁ బోలునెన్నొసలిపై
            జెలువంపురారేక చిందులాడ
మొలఁ బట్టుదిండుపైఁ జెలువొందుగంటల
            బంగారుమొలత్రాడు రంగు లీన
నెదఁ గ్రొత్తపులిగోరు లొదవినపతకంబు
            బలుముత్తియపుసరంబులును బొదలఁ
జేతుల రతనంపుజిలుఁగుటుంగరములు
            మురువులు నెనలేని మురువు సూప


తే.

మెట్టదమ్ములనందియల్ బిట్టుమొరయ
దిట్టతనమునఁ జెలరేఁగి పట్టపగలె
నెట్టుకొని యెల్లవ్రేతల నట్టులందు
గుట్టు లరయుచు మెలఁగు నప్పట్టి మఱియు.

75


సీ.

తలిరుఁబాయపుముద్దుఁ జెలువలఁ గనుగీఁటి
            వలరాచపనులకు వలసి పిలుచుఁ

జల్ల లమ్మఁగఁ బోవు గొల్లకొమ్మల నడ్డు
            కొని సిగ్గు లెడలించి యెనసి కేరు
మగలతో నిదురించు మగువల మఱపించి
            మగచెయ్వు లొనరింప మదిఁ దలంచు
నారాటమునఁ బొంగి నీలాటిరేవులఁ
            గాంచి కన్నెల బల్మిఁ గవయఁ జూచుఁ


తే.

జిన్నపాపలఁ గూడి బ ల్మున్నరకల
నన్నిగీముల సన్నక సన్నఁ దూఱి
యున్నమీఁగడపెరుఁగుపాల్వెన్నజున్ను
లన్నియును గొల్లనాడు నవ్వన్నెలాఁడు.

76


సీ.

వెనుమిన్కుగోనత్రోవలను మెలంగెడుఱేఁడు
            చెలఁగి వ్రేతలయిండ్ల మెలఁగుచుండుఁ
గోరి నిరాబారు రారసి కనలేని
            బలియుండు గొల్లలఁ బాయకుండుఁ
గడఁగి జన్నపుదిండ్లు దొడరఁ ద్రిమ్మరుప్రోడ
            కుఱ్ఱలగమితోడఁ గూడి యాడుఁ
గలిమిపూఁబోడితోఁ గదిసి కేరెడుమేటి
            గొల్లకన్నియలతోఁ గూడి కేరు


తే.

లెక్కలిడరానిరాయంచజక్కజోదు
గ్రుడ్డుఁబనఁటులు నిండారు గొప్పబొజ్జఁ
బూనుపెనుదంట వ్రేపల్లెలోనఁ గల్గు
జున్నుపెరుఁగులు మ్రుచ్చిలి జుఱ్ఱుచుండు.

77


వ.

అంత.

78

క.

బిట్టలిగి వ్రేత లొగిఁ దన
రట్టడిచందములఁ దెల్పి రాయిడి వెట్టం
గట్టలుకఁ దల్లి ఱోలం
గట్టిన వడి నేఁగి మద్దికవ పెకలించెన్.

79


ఆ.

అట్టియావడులకు బిట్టు గాసిలి గొల్ల
లెల్ల బృందలోని కిపుడు సేరి
రందు విసపుమ్రాఁకు లైయున్నచెడుగురే
ద్రిమ్మరుల నడంచి తమ్మికంటి.

80


సీ.

బంగారుఁదగటుదుప్పటి బిగ్గ మొలఁ జుట్టి
            కేల జొక్కపుఁబిల్లఁగ్రోలు వట్టి
పెంపారుబలునెమ్మిపించె మౌదలఁ బూని
            చెవిని జీఁకటిమ్రానిచివురు దుఱిమి
సొగసుగా నొసలఁ గస్తురిబొట్టు సవరించి
            క్రొన్ననసరము లక్కున నమర్చి
గురివెందపూసపేరొరయ సందిటఁ గట్టి
            సన్నంపుసెలగోల చంక నిఱికి


తే.

చెలిమికాండ్రను గూడి నిచ్చలముమీఱఁ
గడఁకతోనాలకదుపులఁ గాచుకొనుచు
గొమరు దళుకొత్త ననయంబు జమునపొంత
మెలఁగు నెనలేనిహొయల నమ్మేటివేల్పు.

81


తే.

మరుని రేఱేని జేజేలదొరకొమరునిఁ
బూసనెలతాల్పుచెలిపట్టిఁ బోలఁ జాలు
వానిచెలువంబు నుడువులఱేని కైనఁ
బూని దిటముగ వాక్రువ్వఁ బోలదెందు.

82

సీ.

తెలిదమ్మిఱేకులఁ దెగడుకన్నులవాఁడు
            తొగలనెచ్చెలి నేలుమొగమువాఁడు
మింటునందముమించు మెఱుఁగుఁజెక్కులవాఁడు
            కొదమతేఁటుల గేరుకురులవాఁడు
మెట్టదమ్ములపొల్చు మెట్టుమెట్టలవాఁడు
            తరఁగచాలు నదల్చుతఱులవాఁడు
వలుఁద చిందము నెగ్గు పలుకుకుత్తుకవాఁడు
            జడలమెకంబుఁ బోల్నడుమువాఁడు


తే.

మొల్లమొగ్గలనెనయుపల్మొనవాఁడు
పొదలుచిగురాకుదొరయుకెంబెదవివాఁడు
తొలుమొగుల్వేగతరుముమైచెలువువాఁడు
చెన్నుగలవాఁడు వలఱేనిఁగన్నవాఁడు.

83

కుంభకునికనుసన్నచే నీల బ్రాహ్మణునకు మ్రొక్కుట

క.

అని యిత్తెఱఁగునఁ బాఱుఁడు
వినిపించిన గొల్లఱేఁడు వేడ్కలు మదిలో
ననలెత్తఁగఁ దనమ్రోలం
గనుపట్టు ననుంగుఁబట్టిఁ గనుఁగొల్పుటయున్.

84


సీ.

కొదమతుమ్మెదదిమ్ము నదలించు ముంగురు
            ల్నొసలిపై ముసరి తుంపెసలు గూయ
జిలుఁగుఁబయ్యదలోనఁ దులకించుకోడెచ
            న్బొగడలు డాఁగురుమూఁత లాడ
గొప్పపిఱుందువ్రేఁగునఁ దడఁబడునడల్
            గుడుగుడుగుంచ మింపడర నాడ

మురిపంపునగవులు ముద్దులేఁజెక్కులఁ
            బొదలుచు వెన్నెలప్రోవు లాడ


తే.

గొనములకునెల్ల నాటపట్టనఁగఁజాలి
జాలువాబొమ్మపోల్కి నన్నేలవేల్పు
జింకతాలుపుచెంగటఁ జేరి యడుగుఁ
దమ్ములకు మ్రొక్కులిడియున్న కొమ్మఁ జూచి.

85


క.

పలుతెఱఁగుల దీవనలిడి
వలనుగ నత్తమ్మిచూలివంగడపుంజా
బిలి యలఱేనిం గని యి
చ్చెలి యెవ్వరిపడుచు తెలియఁ జెప్పుము దీనిన్.

86

నీలకుఁ దగినవరునిగుఱించి బ్రాహ్మణుఁడును గుంభకుఁడును మాటలాడుట

క.

అరచేతివ్రాలు చూచిన
దొర యెందును లేనిదొడ్డదొరఁ జేకొని బల్
సిరుల నిరవందఁగల దీ
విరిఁబోఁడి జగంబులెల్ల విరివిగఁ బొగడన్.

87


తే.

గొప్పకన్నులు నిడువాలుఁగురులుఁ జెలఁగు
కౌనుఁ గెంజాయ నలరుకేల్గవయు నడుగు
లును మొనల్గలపలుచాలుపును దనర్చెఁ
గన్నియలమిన్న కివియె మేల్చిన్నె వన్నె.

88


చ.

అనుటయు బాఁపనయ్య కతఁ డర్మిలి నిట్లని పల్కె దేవరా!
విను మిది నాదుపట్టి కడువేడుక నెప్పుడు నీల యంచు నీ
గొనములప్రోకఁ బిల్తు మిదిగో నిపు డీననఁబోఁడి కందమౌ

పెనిమిటిఁ గూర్చి సొంపలరఁ బెండ్లి యొనర్చ మదిం దలంచెదన్.

89


క.

ఈకన్నియకుం దగునొక
రాకొమరుని నరసి నిబ్బరంబుగ నిపుడే
మా కెఱిఁగింపుడు తెలియ
న్మీకుం గనరాని దొకటి నేలం గలదే?

90


క.

నందుఁడు మాకున్ గాదిలి
బందుగుఁ డాతనికి నొజ్జ బాఁపఁడ వగుటన్
డెందమునకు నీపలుకులు
పొందుగఁ బ్రాఁబల్కునుడువుపోలిక సుమ్మీ.

91


చ.

కొలమును గల్మి తాల్మియును గూర్మియుఁ దెంపును జవ్వనంబునుం
జెలువము విద్దెయున్ గొనముఁ జేవయుఁ బ్రోడతనంబుఁ దెల్వియుం
గలిగినపిన్నపాపనికిఁ గన్నె నిడం దగునంచుఁ దీర్పరు
ల్పలుకుదు రట్లు గావున వలంతికి నీ కిఁకఁ జెప్ప నేటికిన్?

92


తే.

అనిన నతఁ డాతనికి నిట్టులనుచుఁ బలికె
వినుము నాయఁడ! నామాట వీనులలరఁ
బేర్మి నీకన్నియకుఁ దగుపెండ్లికొడుకు
వెన్నతెక్కలికాఁ డైనవేల్పు సుమ్ము.

93


క.

వానికి నెనయగువాఁ డెం
దైన న్మఱి కలఁడె పుడమి నటుగాకయు నీ
మేనల్లుం డతనికి ని
చ్చానం బెండిలి యొనర్పఁ జను నరయంగన్.

94

మ.

వెడఁగుంజాడలఁబోక నాపలుకు నీవీన్దోయి కింపైనఁ దెం
పడరన్వెన్నునికిమ్ము కన్నియను నెయ్యంబొప్ప నీచొప్పుగా
నుడువుల్వేయు నిఁకేల డెందమునఁ గన్గొమ్మెన్న నీకిప్పుడా
సుడివాల్దాలుపుకన్న వేఱు కలరే చుట్టంబు లేవంకలన్?

95


క.

కావునఁ గొదుకక కఱిమై
దేవర కీకన్నె నిమ్ము తిరమగుమదితో
నావుడు నాతం డట్టుల
కావించెదఁ జుమ్ము వేడ్క గడలుకొనంగన్.

96


తే.

నేలవేలుప! నందుని ప్రోలి కరిగి
యన్ని తెఱఁగుల నతనికి వెన్నునికిని
గన్నెలాగెల్ల నెఱిఁగించి కర్జ మీవు
నేర్పు మెఱయంగ వడి సమకూర్పవయ్య.

97


క.

నీకుం జెప్పెడిదే మిఁక
నీకర్జపువ్రేఁగుఁ బూని యేఁగుము మఱి మీ
రేకద మముబోఁటులకుం
గైకొని మేల్పనులు గూర్పఁగాఁ దగువారల్.

98


తే.

అనుచుఁ బెనుమానికములు దాపినవెడంద
పతకమును దావళంబును బసిఁడియుంగ
రములుఁ బ్రోఁగులుఁ బట్టుఁబుట్టములు మొదలు
గలుగుతొడవులు గడుమడుగర లొసంగి.

99


చ.

పనిచినఁ దద్దయుం బొదలి పాఱెడువేడ్కలవెల్లిఁ బెల్లుగా
మునుఁగుచు నేలవేల్పుతల ముందరిపల్లియ కేఁగె గొల్లఁడున్

గొనకొని ముద్దుఁగన్నియకుఁ గోరినయట్టిమగండు గల్గెనం
చును దనయాలుఁ దాను నెదఁ జొక్కుచు సోలుచు నుండె నెంతయున్.

100

నీల కృష్ణునియందు వలపుఁగొని తనలోఁ దలపోసికొనుట

తే.

అంత నీలయుఁ దనతండ్రిచెంత మిగుల
సంతసంబునఁ బంటవలంతివేల్పు
దొంతరగ నన్న కఱివేల్పువింతలెల్ల
మంతనంబునఁ దలఁచుచున్నంతఁ బొగిలి.

101


ఉ.

ఎన్నఁడు సూతు ముజ్జగములేలెడువేలుపుమోముఁదమ్మినిం
కెన్నఁడు విందు వీనుఁగవ కింపుగ వెన్నునిముద్దుఁబల్కులా
వన్నెలప్రోకయౌదలను వావిరిఁ బల్తెలిముత్తియంపుఁబ్రా
లెన్నఁడు నింతు నింతులపుడెంతయు నెమ్మిని సంతసిల్లఁగన్.

102


సీ.

వెన్నునిచిఱునవ్వువెన్నెలల్ పర్వక
            వలపుఁబెంజాఁకటుల్ దొలఁగఁగలవె?
గుడుసుఁగైదువుజోదు సుడివాన గురియక
            కడువిరాలపుటగ్గి యడఁగఁ గలదె?
కఱివేల్పుచూడ్కిజక్కర లుబ్బి పాఱక
            బలుగ్రచ్చుఁబైరులు పండఁగలవె?
మలతాల్పుమెయిచాయమబ్బులు గ్రమ్మక
            యెదకాఁకపెన్నెండ వదలఁగలదె?


తే.

సోఁకుమూఁకలగొంగ మెచ్చుగనుదాళి
బొట్టుమూసికతోఁగూర్చి పొసఁగ నఱుతఁ

ద్రాడు గట్టగ సొగసెల్ల దఱిమి యొడల
వ్రేలువలరాచబలుబూచి వీడఁగలదె?

103


క.

తొలునోములమే లిప్పుడు
వలనుగఁ జేకూడవలదె వన్నెలగని యై
యలరెడువలమురితాలుపు
చెలిమి వెసం గలిగి యెల్ల చెలులుం బొగడన్.

104


సీ.

పులుఁగుడాల్వేల్పు కెందలివాతెఱతేని
            యలు గ్రోల నెన్నఁడు గలుగునొక్కొ!
తమ్మిపొక్కిటిమేటిఱొమ్మునఁ గులుకుగు
            బ్బలు చేర్ప నెన్నఁడు గలుగునొక్కొ!
చుట్టుఁగైదువుజోదు మెట్టదమ్ములఁ గేలుఁ
            గవనొత్త నెన్నఁడు గలుగునొక్కొ!
చిలువపానుపువానితళుకుఁజెక్కులముద్దు
            గైకొన నెన్నఁడు గలుగునొక్కొ!


తే.

వలపు గులుకంగఁ బసిఁడిదువ్వలువతాల్పు
మేన గొజ్జెఁగపూనీటిమెఱపుటింపుఁ
గప్పురంబు జవాదియుఁ గలిపి యిడ్డ
కలప మలఁదఁగ నెన్నఁడు గలుగునొక్కొ!

105


ఉ.

వెన్నునిచెంత నప్పుడమివేలుపుమానిక మేమి దెల్పునో
చెన్నుగ నన్నియుం దెలిసి చెల్వుఁడు దా నెటుగాఁ దలంచునో
క్రొన్నెలతాల్పుముద్దియను గూర్చి యొనర్చిననోము లిప్పు డే
వన్నెను బండునో నలువవ్రాఁతతెఱం గిఁక నెట్టులుండునో.

106

క.

చెలువమును జవ్వనంబును
జెలిమియు నెఱజాణతనము సింగారంబుం
దలఁపున మెలఁగెడుగొనమును
గలమగఁ డెనలేనితొడవు గద తొయ్యలికిన్.

107


చ.

ఎడపక రేయియుం బగలు నెమ్మెల నమ్మలతాల్పుఁ గూడి పూ
వడిదపుజోదునిబ్బరపుటాలమునం దమి హెచ్చ వొచ్చె మె
య్యెడలను లేనిబల్హొయలు నిమ్ముగఁ గోరుచుఁ జాలఁబ్రోడలై
యడరెడుగొల్లకన్నె లహహా తొలుబాముల నేమినోఁచిరో.

108


సీ.

తెలిదమ్మికంటివాతెఱ యాన ముం దెంత
            పెనువంతఁ గుందెనో పిల్లఁగ్రోవి
రక్కసిగొంగపే రక్కున వ్రాలునం
            దుల కేమి నోఁచెనో తొలసిపేరు
సిరిఱేనినిద్దంపుఁజెక్కు లబ్బఁగ నెంత
            గొలిచెనో మును గొండగోఁగుఁబువ్వు
లాలకాపరిమేన నలరంగ నేమేలు
            సలిపెనో హొంబట్టుసన్నసాలు


తే.

దుక్కివాల్దాల్పునసుఁగుసైదోడుమ్రోలఁ
దొడరి యనయంబు నాడంగఁబడసినట్టి
పురిపులుఁగుమొత్త మెనలేనిపున్నియంబు
లేమిచేసెనొ సెగకంటిసామిఁ గూర్చి.

109


చ.

దిట మగుచెల్వమున్ గొనముఁ దేజును గల్గినముద్దుగుమ్మకుం
దటుకున నొక్కపాలసునిఁ దారిచి బిగ్గర నంటఁ గట్టి చొ
క్కట మగునేపువాని కొకగ్రద్దఱిజాడలచేడెఁ గూరుచుం
గటకట తమ్మిచూలికొఱగాములు బాములుగాఁ దలంచెదన్.

110

సీ.

ముసిఁడిమ్రాఁకునఁ బండ్లు పస మీఱఁ గల్గించి
            యించున కేల పుట్టించఁడయ్యెఁ
బిల్లగడ్డకుఁ దావి పెల్లుగా నొనఁగూర్చి
            కుందనంబున కేల కూర్పఁడయ్యెఁ
బందిపంటికి నైదుపదియుఁ గూనల నిచ్చి
            పొసఁగ నేనిక కేల యొసఁగఁడయ్యెఁ
గాకిపిట్టకుఁ జాలఁ గడలేనిబ్రదు కిడి
            చిలుకకు దడ వేల చేయఁడయ్యెఁ


తే.

గొలముకొఱఁత గరాసుల కలవిగాని
దొరతనము గూర్చి కడుబల్లిదుల కదేల
తిరిప మెత్తంగఁ జేసె నద్దిర కరంబు
వింత లయ్యెను జదువులవేల్పుపనులు.

111


వ.

అని మఱియును.

112


తే.

పాలమున్నీటిగారాపుఁబట్టిమగఁడు
వేడుకలు మీఱ ననుఁ బెండ్లియాడెనేని
గొప్పచింబోతుకదుపులఁ గూర్చి నీకుఁ
గావువెట్టింతుఁ జుమ్మి యోగంగనమ్మ.

113


తే.

పూని యౌదలఁ దలఁబ్రాలువోసి తాళి
బొట్టు మరుతండ్రి తనమెడఁ గట్టెనేని
వెండిపువ్వుల నపరంజివిరులచేతఁ
జెలఁగ నించెదఁ గోరి యోచిలువతాల్ప.

114


క.

తనతలపై వడి బల్లిదుఁ
డనువొప్పఁగ గ్రొత్తముత్తియపుఁదలఁబ్రా ల్వో
సినఁ దఱుఁగనుయుండ్రంబులు
వెనకయ్యా నీ కొసఁగుదుఁ బ్రిదులనిబత్తిన్.

115

క.

అని యెడ యొదవనికోర్కుల
మునుఁగుచు నిలువేలుపులకు మ్రొక్కుచ నాక్రొ
న్ననఁబోఁడి పలుతెఱంగులఁ
దనలోనం దానె యపుడు తలఁచుచునుండెన్.

116


తే.

అనుచు నుగ్రశ్రవసుఁ డింపు పొనర నెల్ల
తపసిఱేండ్లకు నెఱిఁగింపఁ దనివి సనక
వార లవ్వలికతయును వలను మీఱఁ
దెలుపవే యని సడ్డతోఁ బలుకుటయును.

117


ఆ.

మత్తగిల్లుసత్తుగిత్తతత్తడి నెక్కి
మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తిఁ
బత్తి రిడిన ముత్తిబుత్తులు రెండును
నొత్తిగుత్తగట్టుచుండుఱేఁడ.

118


ఉత్సాహ.

మొలను దోలుఁ దలను జాలు మొనలువాలు నిండువె
న్నెలలఁ బోలునొడలిడాలు నీటుదేలుచిల్కమైఁ
జెలఁఘునాలు మలను బ్రోలుఁ జెడని మేలు గల్గి వి
చ్చలును సోలుకొనుచుఁ గ్రాలు జగములేలువేలుపా.


గద్యము.

ఇది శ్రీమదుమారమణకరుణాకటాక్షమిరీక్షసంలబ్ధసరసకవితాసామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్త్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబైన నీలాసుందరీపరిణయం బనునచ్చతెనుఁగుఁ బ్రబంధమునందుఁ బ్రథమాశ్వాసము.