శ్రీరస్తు

నీలాసుందరీపరిణయము

పీఠిక

ఇష్టదేవతాదిప్రార్థనము



లకుఁ దానకం బగుచుఁ జెన్నలరారెడు వెండికొండపై
మేలికడానిడాల్ హొయలు మీఱెడుజాబిలిఱాలమేడలో
వేలుపుఱేఁడు వల్వయును వెన్నుఁడు గొల్వఁగ మంచుఁగొండరా
చూలిని గూడి వేడుకలఁ జొక్కెడులేనెలతాల్పుఁ గొల్చెదన్.

1


సీ.

అలరుపెంగడిమితోఁటల నాడుపూఁబోడి
            పూపవెన్నెలఱేనిఁ బూనుచాన
కోరి యేనుఁగుమోముఁగొడుకుఁ గాంచినతల్లి
            చిలువతాలుపువేల్పువలపుటింతి
తెలిబొబ్బమెకపుమేల్తేజి నెక్కెడిదంట
            చెడుగురక్కసిమూఁకఁ జిదుముదిట్ట
తొలుపల్కుగిల్కుటందెలుగలయెలనాఁగ
            యెల్ల మేల్టెంకియై యెసఁగుచామ

తే.

యొనరఁ దెఱగంటితెఱవలయుడిగములకు
నడరి యుడివోనిబలుసిరులిడెడునట్టి
గట్టుదొరపట్టి యెనలేనికనికరమునఁ
బొదలుచును మమ్ము ననయంబుఁ బ్రోచిఁగాత.

2


సీ.

కొఱమాలి విసమిడ్డకఱకురక్కసిఁ జెండి
            పఱపుమీఱెడుబండి విఱుగఁ ద్రొక్కి
వెఱఁగొప్పవ్రేతల మొఱఁగి వెన్నలు మెక్కి
            తఱి సూచి మద్దులు పెఱికివైచి
యఱచేతఁ గొండఁ జూపఱు వొగడఁగఁ బూని
            నెరి గిబ్బతొలువేల్పు మురియడంచి
చిఱుతపాయపుగొల్లతెఱవల వలపించి
            మఱవ పసులఁ బల్మఱును గాచి


తే.

వెఱవెఱుంగక మడువున నుఱికి కడిమి
మెఱయఁ డక్కరివిసదారి బిఱుసుఁదఱిమి
మఱియుఁ బే రగుతులువల నుఱుముసేసి
వఱలుకఱివేల్పు నెదనెంతు గుఱిదలిర్ప.

3


ఉ.

కమ్మనితెమ్మదెమ్మెరలు గ్రమ్మఁగ ని మ్మగుతమ్మిమేడలోఁ
దుమ్మెదకొమ్మ లెమ్మెలను దూకొని నీటుగఁ బాటఁ బాడఁగాఁ
గొమ్మని పూవుఁదేనియలఁ గూరిమి నామెత లిచ్చి నిచ్చలున్
నెమ్మది నుండుపాల్కడలినెయ్యపుఁగూఁతురు మమ్ముఁ బ్రోచుతన్.

4


క.

తద్దయుఁ బొగడెద వేలుపుఁ
బెద్ద యనన్ జగము లెల్లఁ బెంచుచుఁ బల్కున్

ముద్దియతో నెఱతామర
గద్దియఁ గొలువుండునల్మొగంబులప్రోడన్.

5


చ.

బలు తెలి పుల్గు వారువము, బంగరువీణియ, మిన్కుటందెలున్,
చిలుక తుటారిబోటియును, జిందపువన్నియ మేనుఁ, బొత్తమున్,
చెలువపు తెల్లతమ్మివిరి సింగపుగద్దెయుఁ గల్గి యొప్పు న
ప్పలుకులచాన, జానలరు పల్కులొసంగెడుఁ గాత నిచ్చలున్.

6


ఉ.

మ్రొక్కు లొనర్తుఁ గేలుగవ మోడిచి చొక్కపుఁగొక్కుజక్కిపై
నెక్కెడుబల్వజీరునకు నిమ్ముగ నమ్మినవారిమేల్పనుల్
చక్కఁగఁ జేయుదేవరకుఁ జక్కెర కొబ్బెరపండు లుండ్రముల్
మెక్కెడుపాఁపజందెములమేటికి బత్తిని మాటిమాటికిన్.

7


ఆ.

పుట్టఁ బుట్టినట్టిదిట్టయు దీవిని
బొడమినట్టిపున్నెములగనియును
మొదలుగాఁగఁ గబ్బములు వేల్పుబాసను
గూర్చినట్టివారిఁ గోరి తలఁతు.

8


ఉ.

మున్ను దెనుంగుఁగబ్బములు ముజ్జగముల్ వొగడంగఁ గూర్చి పే
రెన్నికఁ గన్నబల్లిదుల ని మ్మగుడెందపుఁదమ్మిలోపలం
బన్నుగ నిల్పి నిచ్చలును బాయక కూరిమితోఁ దలంచెదన్
నన్నయభట్టుఁ దిక్కనను నాచనసోముని నెఱ్ఱప్రెగ్గడన్.

9


క.

ఎదఁ గుదు రగుబత్తిని గొ
ల్చెదఁ బలుపుట్టువులఁ గూరిచినదోసంబుల్

చిదుమంగా వేడుకపె
ల్లిద మొదవెడుదెందులూరిలింగటగురునిన్.

10


ఆ.

అనుచు నెల్లవేల్పులను గొల్చి మును కబ్బ
ములను గన్నగాళకులను దలఁచి
గురుని బత్తి నెంచి కోరి యచ్చతెనుంగుఁ
గబ్బమే నొనర్పఁ గడఁగుతఱిని.

11

కవిస్వప్నవృత్తాంతము

సీ.

ఏవేల్పు గుదెతాల్పుతీవంచమోముల
            తులువల బలుక్రొవ్వు దొలఁగ మీటె
నేసామి సామేన నేప్రొద్దు వలిగట్టు
            దొరపట్టి నర్మిలితోడఁ బూనె
నేఱేఁడు పనిమీఱ నీరేడుజగములఁ
            బ్రోడయై యనయంబుఁ బ్రోవ నోపె
నేరాయఁ డెనలేనిగారాపుటూడెంపు
            జడదారులకు ముత్తి వడి నొసంగె


తే.

మన్ను గేస్తుఁడు నగ్గియు మిన్ను నీరుఁ
బ్రొద్దు నెల గాడ్పు లెవ్వానిరూపులయ్యె
నట్టి తెలిగట్టుమన్కిప ట్టైనదిట్ట
యొరపు రాణింపఁ గలలోన నొక్కనాఁడు.

12


సీ.

పసిదిండిమెకపురక్కసితోలు మొలఁ జుట్టి
            కేల మ మ్మొనవాలు గీలుకొలిపి
చిన్న వెన్నెలఱేని సికపువ్వుగాఁ బూని
            పెనుచంక నొకజింకపిల్ల నిఱికి

జడలలోఁ దెలినీటిచదలేటిజాల్మాఁటి
            జానొంద వెలిబూది మేన నలఁది
తోరంపుఁజిల్వరాతొడవు లిమ్ముగఁ దాల్చి
            యెదఁ బున్కసరములు కుదురుపఱచి


తే.

మోముఁదమ్మిని జిఱునవ్వు మొలకలెత్త
గుబ్బలులఱేనిగారాపుఁగూఁతుతోడ
నుక్కుమిగిలినబలుగిబ్బజక్కి నెక్కి
కొమరుదళుకొత్త మ్రోలఁ గన్గొనఁగనయ్యె.

13


క.

అటువలెఁ గనఁబడి యెద మి
క్కుట మగునక్కటిక మొదక గుబ్బలిదొరయి
ల్లటపల్లుఁడు ననుఁ గన్గొని
దిటముగ నపు డిట్టు లనుచుఁ దెలియం బలికెన్.

14


సీ.

నీతండ్రి గంగన నిచ్చనిచ్చలు మమ్ముఁ
            బూజించె నపరంజిపూలచేత
నీతల్లి లచ్చమ న సంతసిలఁగ నో
            ములు నోఁచెఁ బుడమివేల్పులకు నెల్ల
నీపినతండ్రు లెన్నికలు గాంచిరి జగ్గ
            నయు సింగనయు నర్సనయును మిగిలి
నీతమ్ము లెలమి నొందించిరి మమ్ము సిం
            గనయు సూరనయు జగ్గనయుఁ జెలఁగి


తే.

నీయనుఁగురాణి బుచ్చమ నెలఁతలెల్ల
మేలనఁ దనర్చె గట్టురాచూలిఁ గొలిచి
మానిగకంబవు గద కూచిమంచికొలము
నం దరయఁ దిమ్మకవిరాయ యలర నీవు.

15

మ.

మును కబ్బంబుల నెల్లఁ జెప్పి యెలమిం బొల్పొందుచున్ నాకు న
ప్పనముల్ చేసినప్రోడ వీవిపుడు గూర్పం బూను నీయచ్చపుం
దెనుఁగుంగబ్బము నిమ్ము నిచ్చలబత్తిస్ముత్తియున్ బుత్తియున్
నెన రొప్ప న్సమకూర్చు చెప్పుడును నే నీయొద్దనే యుండెదన్.

16


క.

అని నుడువుచు నద్దేవర
కనుమొఱఁగిన నపుడు మేలుకాంచి యెదను బా
యనివేడ్క లొదవ నతనికిఁ
బని యొనరఁగ మ్రొక్కు లొసఁగి బత్తి దలిర్పన్.

17

షష్ఠ్యంతములు

క.

లిబ్బులదొరచెలికానికి
గుబ్బలియెకిమీనియనుఁగుఁగూఁతుమగనికిన్
బెబ్బులిరేఁద్రిమ్మరితో
ల్ప్రబ్బినతమిఁ గప్పుకొన్న బలువేల్పునకున్.

18


క.

చుఱుకు గలయొక్కకోలను
గుఱిగాఁ దిగప్రోళ్ళు నేలఁ గూలిచి కడిమిన్
మెఱయుచు జేజేగములకుఁ
దఱుఁగనిమే లిడినగిబ్బతత్తడిదొరకున్.

19


క.

తలఁచునిరాబారులచి
క్కులు దొలఁగఁగఁజేసి మనుచు గొనములగనికిం
దులువతొలువేల్పుఁగూటువ
బలితపుఁబెన్మొగలుఁజాలుఁబయ్యరకుఁ దగన్.

20


క.

నెలఱాలఁ బోలునిద్దపుఁ
దెలిడాల్గలమేనిమేటిదేవర కెపుడుం

గొలిచినబంటులకోర్కులు
పొలుపొదవఁగఁ బిదుకు వేలుపున్మొదవునకున్.

21


క.

పితరదొర కేటత్రాటన్
జతనంబునఁ దివియ మిగుల జడుపున నెదలో
వెత కుడుచుతపసిబిడ్డని
బ్రతికించి యసంబుగన్న బల్లిదున కొగిన్.

22


తే.

అప్పనంబుగ నెలమితో నచ్చతెనుఁగు
బాసచే నిప్పు డేనొనర్పఁగఁ దొడఁగిన
నీల యనుపేరఁ దేజున నివ్వటిల్లు
నింతిపెండిలికతతెఱఁ గెట్టు లనిన.

23