నిర్వచనోత్తరరామాయణము/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

నిర్వచనోత్తర రామాయణము

ప్రథమాశ్వాసము



రాస్తాం మనుమక్షితీశ్వరభుజాస్తమ్భే జగన్మణ్డల
ప్రాసాదస్థిరభారభాజి దధతీసా సాలభఞ్జీశ్రియం
శుణ్డాలోత్తమగణ్డభిత్తిషు మదువ్యాసఙ్గవశ్యాత్మనాం
యాముత్తేజయతే తరాం మధులిహా మానన్దసాన్ద్రాస్థితిః.

1

కృతిప్రశంస

చ.

హరిహరపద్మగర్భులను నాదికవీంద్రుల నూత్నసత్కవీ
శ్వరులను భక్తిఁ గొల్చి తగ వారికృపం గవితావిలాసవి
స్తరమహనీయుఁ డైననను సర్వగుణోత్తరమూర్తి మన్మభూ
వరుఁడు దగంగ రాఁ బనిచి వారనిమన్నన నాదరించుచున్.

2


క.

ఏ నిన్ను మామ యనియెడు, దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా
కీ నర్హుఁడ వగు దనినను, భూనాయకుపల్కు చిత్తమున కిం పగుడున్.

3


సీ.

సకలలోకప్రదీపకుఁ డగుపద్మినీమిత్రవంశమున జన్మించె ననియుఁ
జూచిన మగ లైనఁ జొక్కెడునట్టిసౌందర్యసంపదసొంపు దాల్చె ననియు
జనహృదయానందజనక మై నెగడిన చతురతకల్మి నప్రతిముఁ డనియు
మెఱసి యొండొంటికి మిగులు శౌర్యత్యాగవిఖ్యాతకీర్తుల వెలసె ననియు


తే.

వివిధవిద్యాపరిశ్రమవేది యనియు
సరసబహుమానవిరచనాశాలి యనియు
మత్కృతీశ్వరుఁ డగుచున్న మనుమనృపతి
సుభగుఁ గావించుటకు సముత్సుకుఁడ నైతి.

4

కృతికర్తృనియమము

ఉ.

భూరివివేకచిత్తులకుఁ బోలు ననం దలఁపన్ దళంబులన్
సౌరభ మిచ్చుగంధవహుచందమునం బ్రకటంబు చేసి యిం

పారెడుపల్కులం బడయ నప్పలుకు ల్సరి గ్రుచ్చునట్లుగాఁ
జేరుప నేరఁగా వలయుఁ జేసెద నేఁ గృతి యన్నవారికిన్.

5


చ.

పలుకులపొందు లేక రసభంగము సేయుచుఁ బ్రాఁతవడ్డమా
టలఁ దమనేర్పు చూపి యొకటన్ హృదయం బలరింపలేక యే
పొలమును గానియట్టిక్రముముం దమమెచ్చుగ లోక మెల్ల న
వ్వులఁ బొరయం జరించుకుకవుల్ ధర దుర్విటులట్ల చూడఁగాన్.

6


క.

తెలుఁగుకవిత్వము చెప్పం, దలఁచినకవి యర్థమునకుఁ దగియుండెడుమా
టలు గొని వళులుం బ్రాసం, బులు నిలుపక యొగిని బులిమి పుచ్చుట చదురే.

7


క.

అలవడ సంస్కృతశబ్దము, తెలుఁగుబడి విశేషణంబు తేటపడంగాఁ
బలుకునెడ లింగవచనం, బులు భేదింపమికి మెచ్చు బుధజనము కృతిన్.

8


తే.

ఎట్టికవికైనఁ దనకృతి యింపుఁ బెంపఁ, జాలుఁగావునఁ గావ్యంబు సరసులైన
కవులచెవులకు నెక్కినఁ గాని నమ్మఁ, డెందుఁ బరిణతి గలుగుకవీశ్వరుండు.

9


క.

అని సత్కవీంద్రమార్గము, మనమున నెలకొల్పి సరసమధురవచోగుం
భనసుప్రసాదసంబో, ధనగోచరబహువిధార్థతాత్పర్యముగాన్.

10


క.

ఎత్తఱి నైనను ధీరో, దాత్తనృపోత్తముఁడు రామధరణీపతి స
ద్వృత్తము సంభావ్య మగుట, నుత్తరరామాయణోక్తి యుక్తుఁడ నైతిన్.

11


తే.

సారకవితాభిరాము గుంటూరివిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి
యైన మన్నన మెయి లోక మాదరించు, వేఱ నాకృతిగుణములు వేయునేలఁ.

12


మ.

అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
ల్పమునం బారగుఁడం గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడన్.

13


ఉ.

జాత్యము గామి నొ ప్పయిన సంస్కృత మెయ్యెడఁ జొన్ప వాక్యసాం
గత్యము సేయుచో నయిన గద్యము తోడుగఁ జెప్పి పెట్ట దౌ
ర్గత్యము దోఁపఁ బ్రాసము ప్రకారము వే ఱగునక్షరంబులన్
శ్రుత్యనురూప మంచు నిడ సూరుల కివ్విధ మింపుఁ బెంపదే.

14


క.

వచనము లేకయు వర్ణన, రచియింపఁగఁ గొంత వచ్చుఁ బ్రౌఢులకుఁ గథా
ప్రచయముఁ బద్యములను పొం, దుచితంబుగఁ జెప్పు టార్యు లొప్పిద మనరే.

15


క.

లలితపదహృద్యపద్యం, బులన కథార్థంబు ఘటితపూర్వాపర మై
యలఁతియలంతితునియలుగ, హల సంధించినవిధంబు నమరఁగ వలయున్.

16

కృతినాయకవంశావతారము

క.

ఈకృతికిఁ దొడవుగా నమ, రాకృతి యగుమనుమనరవరాగ్రేసరుస
త్యాక్పతివంశము గాఢ, స్వీకృతి దగఁ గీర్తనంబు సేయుదు నెలమిన్.

17

ఉ.

అంబుజనాభునాభి నుదయం బయి వేధ మరిచిఁ గాంచె లో
కంబుల కెల్లఁ బూజ్యుఁ డగుకశ్యపుఁ డాతనికిన్ జనించె వి
శ్వంబు వెలుంగఁజేయఁగ దివాకరుఁ డమ్ముని కుద్భవించె వా
నిం బొగడం జతుశ్శ్రుతులు నేరక యున్నవి నాకు శక్యమే.

18


ఆతనికి సకలలోక, ఖ్యాతుఁడు మను వుద్భవించి యనవద్యమతిం
జాతుర్వర్ణ్యస్థితిర, క్షాతత్పరవృత్తిఁ బరఁగె సర్వోత్తరుఁ డై.

19


శా.

లోకాలోకతటీవిహారకలనాలోలద్యశస్సింహుఁ డ
స్తోకాపాదితపుణ్యమూర్తి మనుపుత్త్రుం డాక్రమక్రీడ మై
నేకచ్ఛత్రము గాఁగ భూమివలయం బెల్లం బ్రశాసించె ని
క్ష్వాకుం డప్రతిమానదానమహిమాకల్పోజ్జ్వలాకారుఁ డై.

20


క.

ఆయిక్ష్వాకుకులంబున, సాయంతనసప్తజిహ్వసాదృశ్యశ్రీ
స్ఫాయత్ప్రతాపనిధి నా, రాయణనిభపుణ్యమూర్తి రఘు వుదయించెన్.

21


మ.

మఘవిద్యాప్రియుఁ డై దివౌకసుల సమ్మానించుఁ బ్రత్యర్థిబా
హుఘనాటోపము మార్చు దిగ్విజయలీలోత్సాహి యై సజ్జనా
లఘుకార్యంబులఁ దీర్చు వైదికవిధి శ్లాఘాదరస్వాంతుఁ డై
రఘుభూపాలకుఁ జెప్ప నొప్పదె జగత్త్రాణప్రవీణాత్మకున్.

22


క.

ఆరఘువంశంబున వి, స్తారయశోధనుఁడు విమలచరితుఁడు బుధని
స్తారకుఁడు భూమిపాలన, సారనిపుణబుద్ధి రామజనపతి పుట్టెన్.

23


మ.

మునిలోకంబు ప్రశంస సేయ జగముల్ మోదంబు నొందంగ దు
ర్జనతానిగ్రహతత్పరాత్ముఁ డగుచున్ సద్వృత్తిసంరక్షణం
బున రాగిల్లుచు నేలె రామనృపుఁ డీభూచక్రముం దత్కులం
బున రాజన్యు లనేకు లిద్ధరణిఁ బెంపుం బొంది పాలించినన్.

24


క.

పిదపఁ గలికాలచోళుం, డుదయంబై జలధిపరిమితోర్వీవలయం
బు దనకు బంటుపొలమ్ముగ, నెదు రెందును లేక పేర్మి యెసకం బెసఁగన్.

25


శా.

చేసేఁతం బృథివీశు లందుకొనఁ గాశీసింధుతోయంబులం
జేసెన్ మజ్జన ముంగుటంబున హరించెం బల్లవోర్వీశు ను
ల్లాసం బొందఁగ ఫాలలోచనము లీలం గట్టెఁ గావేరి హే
లాసాధ్యాఖిలదిఙ్ముఖుండు కలికాలక్ష్మావిభుం డల్పుఁడే.

26


చ.

అతనికులంబునం దవనతారి యుగాంతకృతాంతమూర్తి య
ప్రతిమవదాన్యతావిభవభాసి విలాసరతీశుఁ డప్రత
ర్కితవివిధావధానపరికీర్తితనిర్మలవర్తనుండు సం
శ్రితనిధి పుట్టె బిజ్జన యశేషధరిత్రియు నుల్లసిల్లఁగన్.

27

చ.

పరుషపరాక్రముం డగుచుఁ బల్లవువీట నుదగ్రు లైనప
న్నిరువుర నాతనిం గలయ నెన్ని యనర్గళమత్సరంబుమై
మురరిపుసన్నిభుండు పదుమువ్వుర గం డడఁగంగఁ బెట్టె దా
బిరుదు వెలుంగ బిజ్జఁ డరిభీకరభూరిభుజాబలంబునన్.

28


క.

తద్వంశంబునఁ బోషిత, విద్వజ్జనుఁ డహితభుజగవిహగేంద్రుఁడు ధ
ర్మాద్వైతమూర్తి వరయో, షిద్వర్గస్మరుఁడు మన్మసిద్ధి జనించెన్.

29


సీ.

భూరిప్రతాపంబు వైరిమదాంధకారమున కఖండదీపముగఁ జేసి
చరితంబు నిఖిలభూజననిత్యశోభనలతకును నాలవాలముగఁ జేసి
కరుణ దీనానాథ కవిబంధుజనచకోరములకుఁ జంద్రాతపముగఁ జేసి
కీర్తిజాలముఁ ద్రిలోకీశారికకు నభిరామరాజితపంజరముగఁ జేసి


ఆ.

సుందరీజనంబు డెందంబునకుఁ దన, నిరుపమాన మైన నేర్పుకలిమి
నతిప్రసిద్ధి చేసి యసదృశలీల మైఁ, బరఁగె మనుమసిద్ధి ధరణివిభుఁడు.

30


క.

ఆమన్మసిద్ధిసుతుఁ డా, శామండలశాసనుండు సదయాకృతి సం
గ్రామశ్రీరాముఁడు రా, మామదనుఁడు తిక్కనృపతి మహిఁ బాలించెన్.

31


ఉ.

కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి చోళతిక్కధా
త్రీశుఁడు కేవలుండె నృపు లెవ్వరి కాచరితంబు గల్గునే
శైశవలీలనాఁడు పటుశౌర్యధురంధరబాహుఁ డైనపృ
థ్వీశనరేంద్రుమస్తకము నేడ్తెఱఁ గందుకకేలి సల్పఁడే.

32


సీ.

లకుమయ గురుములూరికి నెత్తి వచ్చినఁ గొనఁడె యాహవమున ఘోటకముల
దర్పదుర్జయు లగుదాయాదనృపతుల సనిలోనఁ బఱపఁడే యాగ్రహమున
శంభురాజాదిప్రశస్తారిమండలికముఁ జెర్చి యేలఁడె కంచిపురముఁ
జేదిమండలము గాసిగఁ జేసి కాళవపతి నియ్యకొలుపఁడే పలచమునకు


తే.

రాయగండగోపాలు నరాతిభయద, రాయపెండారబిరుదాభిరాము నుభయ
రాయగండాంకు ఖండియరాయుఁ దిక్క, ధరణివిభుఁ బోల రాజులు కరిది కాదె.

33


మ.

కమలాప్తప్రతిమానమూర్తి యగునాకర్ణాటసోమేశు దు
ర్దమదోర్గర్వము రూపుమాపి నిజదర్పంబుం బ్రతిష్టించి లీ
లమెయిన్ జోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్యనా
మము దక్కం గొని తిక్కభూవిభుఁడు సామర్థ్యంబు చెల్లింపఁడే.

34


సీ.

భృత్యానురాగంబు పెంపుఁ జెప్పఁగ నేల పరివారసన్నాహబిరుదు గలుగ
వందిప్రియత్వంబు వర్ణింపఁ గా నేల పాఠకపుత్త్రాఖ్య పరఁగుచుండ
సకలవిద్యాపరిశ్రమముఁ దెల్పఁగ నేల కవిసార్వభౌమాంక మవనిఁ జెల్ల
సుభగతామహిమఁ బ్రస్తుతి సేయఁగా నేల మన్మథనామంబు మహిమ నెగడ


తే.

నుభయబలవీరుఁ డను పేరు త్రిభువనములఁ

బ్రచురముగ ఘోరబహుసంగరముల విజయ
లక్ష్మిఁ జేకొను బాహుబలంబుసొంపు
పొగడ నేటికిఁ గలికాలభూవిభునకు.

35


క.

అతనికి నుదయించెను గ, ల్పతరువునకుఁ బుట్టు రుచిరఫల మన మనుమ
క్షితిపతి కవిహృదయశుక, ప్రతతిసమాస్వాదనీయరసికత వెలయన్.

36


ఉ.

అర్థిజనంబు లోభినృపు లాసలు చూపినఁ బడ్డజాలి ప్ర
త్యర్థులు వైరిరాజులమనం బడఁగించుటఁ గన్న పెంపు నా
నార్థము లర్థి కిచ్చియు రణావని దోలియుఁ బాపు కామినీ
ప్రార్థితమూర్తి మన్మజనపాలుఁడు కేవలుఁడే తలంపఁగన్.

37


సీ.

అడవులఁ గొండలఁ బడి యాలుబిడ్డప ట్టెఱుఁగనివైరిధాత్రీశులందుఁ
గట్టంగఁ దొడఁ బూయఁబెట్టఁ గొఱంత లే కానంద మందెడు నర్ధులందుఁ
గని విని యించువిల్తునియలరమ్ములబారికి నగపడ్డ భామలందుఁ
దమతమలో నద్భుతం బంది కొనియాడు నిఖిలకళాగమనిపుణులందుఁ


తే.

గానఁగావచ్చు వేఱ పొగడ్త లాస, పడక తనయంత జగములఁ బరఁగుచుండు
దినకరాన్వయతిలకంబు మనుమనృపతి, వీర్యవితరణరూపవివేకమహిమ.

38


మ.

ద్రవిడోర్వీపతిగర్వముం దునిమి శౌర్యం బొప్పఁ గర్ణాటద
ర్పవిఘాతంబు నొనర్చి వైరిమనుజేంద్రశ్రేణికిన్ గొంగ నా
నవనిం బేర్కొని యున్న యట్టివిజయక్ష్మాధీశ్వరం గాసిగా
నెవిచెం జోళనమన్మసిద్ధి యని ప్రాయేటం బ్రగాఢోద్ధతిన్.

39


సీ.

దండప్రణామంబు దగ నభ్యసించిరో నెఱి బోరగిలఁబడ నేర్చునాఁడ
వ్రేళ్లులు గఱవంగ వెర వల్వరించిరో నోరఁ జేతులు గ్రుక్కి నొల్లునాఁడ
కడుసంకటంపుఁ బేరడవులు దూఱంగఁ దరము సేసిరొ యిలఁ దడవునాఁడ
పలుదెస విఱిగిపోఁ బరువు సాధించిరో క్రీడలుగాఁ బాఱి యాడునాఁడ


తే.

బాలశిక్షలు గా కొండుభంగి నింత, యచ్చుపడియుండునే వీరి కనఁగ నిన్ని
తెఱఁగులకు నేర్పుగలిగివర్తింతు రాజి, మనుమనృపుఁ దాఁకిపోయిన మనుజపతులు.

40


ఉ.

రంగదుదారకీర్తి యగురక్కెసగంగనఁ బెంజలంబుమై
భంగ మొనర్చి మన్మజనపాలుఁడు బల్విడి నాఁచికొన్న రా
జ్యాంగము లెల్ల నిచ్చి తనయాశ్రితవత్సలవృత్తి యేర్పడన్
గంగయసాహిణిం బదము గైకొనఁ బంచెఁ బరాక్రమోన్నతిన్.

41


సీ.

కొండలు నఱకునాఖండలుకైవడి యెనయు నేనుంగులఁ దునుమునపుడు
బెబ్బులి వడి లేళ్లుపిండు హత్తినయొప్పు గలుగు రాహుతులకుఁ గడఁగునప్పు
డడవులఁ గార్చిచ్చు లడరుచందము గాన నగుఁ గాలుబలమున కలుగునపుడు
బలుగాలి మొగుళులపై వీచుక్రియ దోఁచుఁ దఱుచైనగొడుగులు నఱకునపుడు

తే.

కసిమసంగినమృత్యువుకరణి యంత, కాలరుద్రునికైవడి కాలదండ
ధరునిబలువిడి యలవడు దురములోన, నసమశౌర్యుఁడు మనుమధరాధిపునకు.

42


శా.

శృంగారంబు నలంగ దేమియును బ్రస్వేదాంకురశ్రేణి లే
దంగంబుల్ మెఱుఁ గేద వించుకయు మాహారాష్ట్రసామంతు సా
రంగుం దోలి తురంగముం గొనినసంగ్రామంబునం దృప్తస
ప్తాంగస్ఫారయశుండు మన్మవిభుపం పై చన్నసైన్యంబునన్.

43


సీ.

అనుపనుబహురత్నహయవారణముల విద్విషులు గప్పములు పుత్తెంచుచోట
నెల్లికయ్యం బని యెద్ది యేనియు నొక్క కెలన శాత్రవదూత పలుకుచోటఁ
దలతలమని రెండు దడములవా రేటున కమానముగఁ జేర నడచుచోటఁ
బరసేన సచ్చియుం బాఱియు బయ లైన యనిలోన జయము నేకొనెడుచోట


ఆ.

నొక్కరూప కాని యెక్కుడు డిగ్గును, గానరాదు ముఖవికాసమునకు
నన్యరాజు లీడె యరిరాయవేశ్యాభు, జంగుఁ డైనమనుమ జనవిభునకు.

44

అయోధ్యావర్ణనము

క.

అమ్మనుమనృపతి కభ్యుద, యమ్ముగ నేఁ జెప్పఁ బూని నట్టి కథకు నా
ద్య మ్మయి యయోధ్య యనునా, మమున నెగడినపురోత్తమము వర్ణింతున్.

45


సీ.

అఖిలభోగములకు నాస్పదం బగుట భోగీంద్రుపట్టణమున కీడ యనియు
ధనసమృద్ధుల కెల్లఁ దల్లియి ల్లగుటఁ గుబేరునివీటికిఁ బెద్ద యనియు
వైభవంబులకు నావాస మగుట నమరాధీశుపురమున కధిక మనియు
నిర్మలవృత్తికి నెర వగుటను భారతీశ్వరుప్రోలికి నెక్కు డనియు


ఆ.

వినుతి సేయఁ జాలి వివిధోత్సవంబుల, నతిశయిల్లి సజ్జనాభిరామ
మై కరంబు వొలుచు నన్నగరంబు వి, స్ఫురితసకలవస్తుపూర్ణ మగుచు.

46


క.

చనిచని యచ్చోటను జి, క్కెనొకో తారకము లనఁ బ్రకీర్ణరుచులఁ ద
ధ్ఘనవప్రప్రాగ్భాగం, బున ఖచితము లైనవజ్రములు చెలు వొందున్.

47


తే.

ఇంతపొడ వని వాక్రువ్వ నేరి కైన, రా దనుట కోటవర్ణన గాదు నిజమ
యెగసి పఱపిన దృష్టులు నిగుడునంత, లెక్కలో నగ్రభాగంబు లేమిఁ జేసి.

48


క.

మహనీయవప్రగోపుర, బహురత్నోత్కీర్ణసాలభంజిక లొప్పున్
విహరణతత్పరనిర్జర, మహిళాతతి వచ్చి యున్నమాడ్కి బెడం గై.

49


సీ.

అవగాహనమునకు నరిగినగజములమదములు కూడిన నదులు గాఁగ
ఝషకకుళీరకచ్ఛపమకరాదిసత్త్వములమొత్తము పర్వతములు గాఁగఁ
బ్రాకారమణిగణప్రతిబింబనికరంబు విలసిల్లు బహురత్నవితతి గాఁగ
రంగతరంగపరంపరపైఁ దేలు, కలహంసములు శంఖుకులము గాఁగఁ


ఆ.

గరము పొలుపు మిగులుఁ బరిఖ విశాలగం, భీర మగుచుఁ బఱపుఁ బేర్మిఁ జేసి
యఖలభూమిచక్ర మనుతలంపునఁ బుర,వరముఁ జుట్టి యున్న శరధివోలె.

50

చ.

తరుణులవీఁగుఁజన్నుఁగవ తాఁకున నున్మదచక్రవాకబం
ధురగతి లీలఁ గామినుల తోరపుటూరులఘట్టనంబునం
గరివరహస్తకాండపటుఘాతమునం బరిఖాతరంగముల్
దిరుగుడుపడ్డతీరములఁ దెట్టువగట్టు సరోజరేణువుల్.

51


సీ.

ఉజ్జ్వలలక్ష్మికి నుద్భవస్థాన మై భువనసుందర మగు పొలుపు దాల్చి
యనుపమానంతభో, గాస్పదం బనఁ జాలి హరినీలకాంతివిస్ఫురణ నొంది
సాంద్రచంద్రద్యుతిసమితి శోభిల్లి సుధాబహులప్రబోధమును గలిగి
బహుచిత్రసత్యసంపన్నత మెఱసి తుంగాచలాతిస్థితి నతిశయిల్లి


తే.

యక్కజం బగుపెంపున నతుల మగుచుఁ
జూడ్కులకు వేడ్క సేయుచు సొంపు మిగిలి
తమకు రత్నాకరంబుచందము నెఱయఁగ
నప్పురంబున రమణించె హర్మ్యచయము.

52


ఉ.

చారుబలాకమాలికల చాడ్పున దంతము లొప్ప గర్జిత
స్ఫారరవంబులట్లుగ నభంగురతం బటుబృంహితంబు లా
సారముమాడ్కి దానజలసంతతి గ్రమ్మఁగఁ గాలమేఘమా
లారుచిరంబు లై మదచలద్ద్విపసంఘము లొప్పు నప్పురిన్.

53


తే.

మనముశిల్పియె తనదువిన్ననువు మెఱసి
గాలి నశ్వరూపంబులు గాఁ దరించెఁ
గాక యీజవసత్వముల్ గలవె ఘోట
కముల కెందు నాఁ బురిఁ దురంగములు వొలుచు.

54


సీ.

మవ్వంపుమేనుల జవ్వనంబుల కింపు మిగిలిన చెయ్వుల మెఱుఁగు పెట్ట
నల్లన మధురంపుసల్లాపరచనకు లేఁతనవ్వున నునుఁబూత పూయ
నిడువాలుఁ గనుదోయి నినుపారుకాంతికిఁ గలికిక్రేఁగన్నుల నలువు మిగుల
లలితంబు లగుచిత్తములచతురతలకు సరసంపునడవడిఁ దెరలు వుచ్చ


తే.

వెరవు గల్గి మనోభవు వీరరసము, నిరతముగ నేర్పు వాటించి కరువు గట్టి
పోసి చేసినరూపులుపోల్కి వార, వనిత లొప్పుదు రప్పురవరమునందు.

55


చ.

విలుచునెడన్ మనంబులకు వెక్కస మంద ధనంబు లమ్ముచో
విలసదనేకవస్తువులు విస్మయ మందఁగఁ జూడ్కు లెల్ల సొం
పులసహజంబు లై యెలమిఁ బొందఁగ నుజ్జ్వలలక్ష్మి యెప్డుఁ ద
మ్మలవడఁ జెంద వైశ్యజను లప్పురి నొప్పుదు రప్రమేయు లై.

56


సీ.

అనవద్యవేదవిద్యాలతావితతికి నాలవాలములు జిహ్వాంచలములు
రాజితబహుకళారాజహంసికలకు మానససరసులు మానసములు
చారుసత్యవ్రతసౌరభ్యలక్ష్మికి నుచితవాక్యములు పుష్పోద్గమములు

సాదరకారుణ్యమేదుర జ్యోత్స్నకు మధురాకృతులు శశిమండలములు


తే.

గా సమస్తమహాధ్వరకర్తృతావి, భూతిఁ దనరి యఖిలలోకపూజ్యు లగుచు
నిరుపమానసద్గుణగణనీతినిరతు, లై ధరామరు లొప్పుదు రప్పురమున.

57


చ.

అమరనగంబు నెచ్చెలులొ హైమవతీశుననుఁగుఁగొండవి
య్యము లొకొ రోహణాచలము నన్నలుఁ దమ్ములు నొక్కొ నా సువ
ర్ణమునను జారుతారమున రత్నచయంబునఁ దేజరిల్లు నం
దు మహిమ కున్కిప ట్టగుచుఁ దుంగసముజ్జ్వలదేవసద్మముల్.

58


సీ.

పడఁతులనెఱివీఁగుఁబాలిండ్లు వెడదోఁప లీలఁ బయ్యెదలు దూలించుటకును
దెఱవలపూఁతలు మెఱయఁగ నాటమై నడరిననునుఁజెమ టార్చుటకును
మెలఁతలచెక్కులమెఱుఁగు వింతఁగ నవతంసమంజరులు గదల్చుటకును
గొమ్మలయలికదేశమ్ములఁ గ్రొత్తచె న్నొలయఁ గుంతలములఁ దెలచుటకును


తే.

విటకుమారులు తనరాక వేచి వేడ, నెదురుకొని యింపుసొంపు వహించుచుండ
నడపుమెలపున జనుల కానంద మొదవ, గంధవహుఁ డప్పురంబునఁ గలయఁబొలయు.

59


చ.

శుకపికసంకులత్వమున సుందరసాంద్రలతాంతపల్లవ
ప్రకరబహుచ్ఛవిం బురవరంబు విహారవనంబు లొప్పు న
మ్మకరపతాకుసైన్యములు మానవతీవిటకోటి కైనకే
లికలహవృత్తి సైఁపక సలీలగతిన్ బయినెత్తి వచ్చె నాన్.

60


సీ.

మన్మథునాస్థానమండపంబులు మీనకేతునేపథ్యనికేతనములు
రతివల్లభునివిహారప్రదేశములు సంకల్పసంభవునిభోగస్థలములు
కందర్పునాయుధాగారముల్ కుసుమశరాసనుసంగీతకాలయములు
శంబరసూదనుజయభూము లిందిరానందనుసంకేతమందిరములు


ఆ.

రామణీయకంబు రమియించునిక్కలు, సొంపుగనులు చైత్రసంపదలకు
ననుగలంపుటిరవు లనఁగ రమ్యంబు లై, యొప్పు నుపవనంబు లప్పురమున.

61


చ.

వివిధగతిప్రకారముల వీథులఁ బాఱుసమీరణంబుచే
నవమకరందబిందుతతి నల్గడలం దగ నింపుగూడి య
త్యవిరళలీలఁ బర్వ మధుపావళి పువ్వులు రోయ కెందు నా
డి వనములోన విచ్చలవిడిన్ మదలీల వహించు నెప్పుడున్.

62


సీ.

పద్మినీకల్లోలపంక్తులపైఁ గ్రాలు రాజితరాజమరాళలీల
సహకారపల్లవసమితిఁ గదల్చు నున్మదకలకంఠకుమారుమాడ్కి
బుష్పితనవలతాపుంజంబులోపల విహరించుమత్తాళివిభునిభంగి
నుద్యానమునకు వేఱోకయొప్పు గావించు చారునవీనవసంతుభాతి


తే.

నేను గలుగంగ మదనుని కేల యొండు, పరికరము లని యన్నింటిపనులుఁ దాన
పూని చేయువిధమున మందానిలుండు, పురమునం దుండు నుపవనభూములందు.

63

పూర్వరామాయణకథ

క.

ఆపురి కధిపతి రఘుకుల, దీపకుఁ డమరేంద్రవిభుఁడు తేజోనిధి వి
ద్యాపారగుండు దశరథ, భూపాలుఁడు సకలలోకపూజితుఁ డగుచున్.

64


సీ.

అష్టదిగ్దళశోభితావనీచక్రంబు దమ్మి యై తనలక్ష్మి కిమ్ము గాఁగ
వివిధవర్ణాశ్రమవిహితవృత్తికిఁ దన యసదృశపరిరక్ష ముసుఁగు గాఁగఁ
బొలుచుచతుర్దశశభువనముల్ దనకీర్తి యాడెడునెలవుల మేడ గాఁగ
నమ్మూఁడుమూర్తుల యలవు లెన్నఁగఁ బుట్టి వ్రేలెడితనమూర్తివాలు గాఁగఁ


తే.

దనకృపాణంబు రిపుల సద్గతికిఁ బుచ్చు, పుణ్యతీర్థంబు గాఁ దనభూరిదాన
మర్థులకు భూరివాన గా నతిశయిల్లి, జలధివలయితవసుమతీచక్ర మేలె.

65


ఉ.

అత్తఱి లోకభీకరదురాచరణుం డగుపంక్తికంఠును
ద్వృత్తి నలంగునిర్జరుల విన్నపముల్ దయ నాదరించి దే
వోత్తముఁ డైనవిష్ణుఁడు సముత్సుకుఁ డయ్యె విశుద్ధవిశ్రుతో
దాత్తచరిత్రుఁ డౌదశరథక్షితినాథున కుద్భవింపఁగన్.

66


క.

తనయులఁ బడయుకుతూహల, మున నిట నమ్మనుజపతియు మునికులవంద్యుం
డనఁ జాలుఋశ్యశృంగుని, యనుమతమునఁ బుత్ర కామయజనము చేసెన్.

67


సీ.

ఆసుకృతంబు మహానుభావంబున, నమ్మహీరమణుభార్యాత్రయమున
రాజన్యకుంజరు రామునిఁ గౌసల్య, కైకేయి గుణగణాకల్పు భరతు
మానితయశుని లక్ష్మణుని శత్రుఘ్ను సుమిత్రయుఁ గాంచిరి ధాత్రి యలర
విష్ణునంశమున నివ్విధమునఁ బుట్టిన రామదేవుం డభిరామలీల


తే.

వెలసి వేదతదంగాదివిద్య లెల్ల, నభ్యసించి ధనుర్వేద మధిగమించి
సరససాహిత్యవేది యై సకలకళల, నెఱిఁగి యౌదార్యశౌర్యసమేతుఁ డగుచు.

68


చ.

జనకునియజ్ఞవేదికఁ బ్రశస్తముగా జనియించి యంగనా
జనతకు భూషణం బనఁగఁ జాలినసీతకు రుద్రచాపభం
జన మనుసుంకు విచ్చి నృపసత్తమసూతిఁ బరిగ్రహించి పే
ర్చినయుభయానురాగమున జిత్తభవుం జరితార్థుఁ జేయుచున్.

69


తే.

మును సురాసురసంగ్రామమున రథంబు, గడపి విభుచేత వరములు గన్న కైక
యడుగ నరపతి పంపంగ నక్కుమారుఁ, డరిగెఁ గాననమునఁ దప మాచరింప.

70


శా.

రాముం దాపసవృత్తి కంపఁ దను సామ్రాజ్యంబుపై నిల్ప జే
తోమోదంబునఁ గోరుతల్లికిఁ గులద్రోహంబు దక్కంగఁ ద
ద్భూమిం బ్రస్ఫుటరక్షమై నడపి నిర్భోగాత్ముఁ డై సర్వలో
కామోదం బొనరించె నాభరతుఁ డార్యస్తుత్యవృత్తంబునన్.

71


చ.

వనితయు లక్ష్మణుండు సహవాసము సేయఁగఁ బర్ణశాలలన్
మునిజనవర్తనంబునఁ బ్రమోదముఁ బొందుచు దండకావనం

బున రఘురాముఁ డున్నయెడఁ బొల్తుక యొక్కతె యేగుదెంచి యా
తనిఁ గని కాముచే నలఁగి ధైర్యవిహీనతఁ గోర్కిఁ జెప్పినన్.

72


తే.

అతఁడు నగి త్రిప్పిపుచ్చిన ననుజుకడకు, నరిగి యాతండు ద్రోచినఁ బెరిఁగి వికృత
వేషయై యెత్తికొనిపోవ రోష మెత్తి, యక్కుమారుఁడు వెసఁగోసె ముక్కుసెవులు.

73


క.

భంగపడి రాముకడ క, య్యంగన చనుదెంచి యిట్టు లనియెఁ ద్రిలోకో
త్తుంగచరిత్రుఁడు శశ్వద, భంగుం డగుపంక్తివదనుభగినిం జుమ్మీ.

74


తే.

శూర్పణఖ యనుదాన మీదర్ప మడఁప, నసుర లిప్పుడ వచ్చెద రనుచుఁ గోప
మునఁ గడంగి జనస్థానమునకు నేగి, యనుజుఁ డగు ఖరుతోడఁ జెప్పిన నతండు.

75


క.

దూషణునిఁ ద్రిశిరుఁ గూడి స, రోషంబుగ నెత్తి వచ్చి రోగంబులు ది
వ్యౌషధముఁ దాఁకుపగిది మ, నీషమెయిం జాలు రాము నెదిరి మహాజిన్.

76


చ.

పొలిసినఁ జూచి శూర్పణఖ పోయి దశాననుఁ గాంచి బన్నముం
దెలుపునెడం బ్రసంగమునఁ దేటపడన్ వినిపించె సీతకో
మలతనులీల యద్దివిజమర్దనుఁడున్ హృదయంబునం గుతూ
హల మెలరార శీఘ్రగతి నయ్యెడ కేగె వియత్పథంబునన్.

77


క.

చని కౌటిల్యమున మహీ, తనయం గొని లంక కరిగె దానవుఁ డపుఁ డా
మనుజేంద్రనందనుఁడు దన, మనమునయడ లనుఁగుఁదమ్ముమాటల మలఁగన్.

78


సీ.

ఎడసొచ్చి దైత్యుచేఁ బడినజటాయువువలన నంగన చన్నవల నెఱింగి
శరణార్థి యగుదివాకరసూతిఁ జేకొని కోలతోడనె వాలిఁ గూల నేసి
వనచరబలముల వసుధ నెల్లను నొక్కవాయిగా నడపించి వార్థిఁ గడచి
లంకపై విడిసి చలంబు బలంబును జూపి రాక్షసకోటిరూ పడంచి


తే.

కుంభకర్ణునిఁ గుంభనికుంభనాము, లైనతనయులతో నంతకాలయమున
కనిచి దేవాంతకప్రహస్తాదిబంధు, వర్గసహితంబుగా దశవదనుఁ దునిమి.

79


తే.

అఖిలదేవతాసన్నిధి నగ్నిదత్త, యైన జానకి నానంద మతిశయిల్లఁ
గైకొనియె రాముఁ డీమూఁడులోకములకు, నద్భుతప్రీతు లడరి పొంగారుచుండ.

80


క.

ఇంద్రజి ననిలోఁ జంపి మ, హేంద్రాదిత్రిదశనుతుల కెక్కినయనుజున్
సాంద్రానుమోమున రఘు, చంద్రుఁడు మో మెలమిఁ బొంద సంభావించెన్.

81


ఆ.

అతని నపుడ దివ్యయానరత్నం బగు, పుష్పకంబుఁ దేరఁ బుచ్చి దాని
కెదురువోయి యర్చ లిచ్చి సంప్రీతి నా, తండు జానకియును దాను నెక్కి.

82


చ.

శర ణని వచ్చి చొచ్చి యనిశంబును గొల్చుచు నున్న రావణా
వరజు విభీషణున్ సమరవర్తనుఁ డైనదినేంద్రనందనున్
శరనిధి దాఁటి దేవిఁ గని, చయ్యన నుంగర మిచ్చి పేర్చి య
ప్పురవర మేర్చి లోకనుతిఁ బొందినపావని నాదరించుచున్.

83

ఉ.

వారలు వారిభూపరివారముతోన విమాన మెక్కి రాఁ
గా రఘునందనుం డరిగి కాంచనతోరణచిత్ర మై నవ
ద్వారనికాయ మైననిజపట్టణ ముత్సుకవృత్తిఁ జొచ్చె నిం
డారుముదంబునన్ భరతుఁ డాదృతిఁ జేసి సలీలఁ గ్రాలఁగన్.

84


క.

వినయము గైకొనఁగాఁ జే, యను దగువా రెల్లఁ దన్ను నయ్యయిసంభా
వనమై నభినందింపఁగ, జననాథుఁడు పూజ్యరాజ్యసంపద నొందెన్.

85

ఆశ్వాసాంతము

మ.

కమలాధారుఁడు భీతిదూరుఁ డసమాకారుండు గంభీరుఁ డ
బ్జముఖీమారుఁ డపారసారుఁడు కళాస్ఫారుండు వీరుండు దు
ర్దమదోస్సారుఁ డధర్మభీరుఁడు మహోదారుండు దుర్వారుఁ డ
త్యమలాచారుఁడు నిర్వికారుఁడు యశోహారుండు ధీరుం డిలన్.

86


క.

వికచకమలాయతాక్షుం, డకుటిలచిత్తప్రచారహరిమిత్రుం డ
ర్కకులప్రదీపుఁ డభినవ, మకరాంకుఁడు విజయమానమర్దనుఁ డెలమిన్.

87


మాలిని.

నమదరినృపచూడానవ్యరత్నాంశువీచీ
సముదయసుభగోల్లాసస్ఫురత్పాదపద్ముం
డమరతరునికాయత్యాగలీలాపహాసో
ద్యమనిపుణనిసర్గౌదార్యహస్తాబ్జుఁ డుర్విన్.

88


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కన నామధేయ ప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందుఁ బ్రథమాశ్వాసము.

————