నా జీవిత యాత్ర-1/నా వృత్తి

7

నా వృత్తి

ప్లీడరీ ప్రారంభించినప్పటినుంచీ నాకు ఫైలు బాగానే వుండేదని చెప్పాలి. ఆరుమాసాల్లో పెద్ద ప్లీడర్లకి కూడా తీసిపోని ఫైలు ఉండేది. నన్నంతవరకూ వెంటాడించిన లేమి క్రమంగా వెనకపట్టింది. ఏ వృత్తిలోనైనా పేరు రావాలంటే ముందుపట్టిన కేసుల్లో మంచిపేరు సంపాదించాలి. నేను ప్రాక్టీసుకి వచ్చిన కొద్ది రోజులకే మంచిపేరు పడింది. ఆ రోజుల్లో క్రిమినల్ కేసుల్లో మేజిస్ట్రీటుల ధాటీలకి నిలబడే ప్లీడర్లకి ఫైలు బాగానే వుండేది. కేసుల్లో బలంలేదని ఇతర ప్లీడర్లు వదులుకున్న కేసులు కొన్ని నా పరం అవుతూ వుండేవి.

ఒకప్పుడు ఇద్దరు కుర్రవాళ్ళ మీద రైల్వే పార్సెల్ లోనించి వెండి పాళీలు తస్కరించారని కేసు వచ్చింది. పోలీసులు సారంగధరుడి మెట్ట దగ్గిర దాచిపెట్టిన వెండిపాళీలు చూపించారు. అందులో ఒకకుర్రవాడి తండ్రి నా దగ్గిర నౌఖరీ చేస్తూ వుండేవాడు. నేను ఆ కేసు పట్టి, చోరీ ఆస్తి చూపించినంత మాత్రాన నేరం రుజువు కాదని వాదించాను. మేజిస్ట్రేటు కేసు సెషన్సుకి పంపించాడు. సెషన్సు జడ్జీ ముందే ఒక అభిప్రాయానికి వచ్చాడు. అందులోనూ ఒక ముద్దాయి నేరం ఒప్పుకున్నాడు. దాంతో నేరం ఒప్పుగున్న ముద్దాయికి ఒక సంవత్సరం శిక్షా, ఒప్పుకోనివాడికి ఐదేళ్ళ శిక్షా విధించారు. నేను పట్టు దలకొద్దీ, వెంటనే ఆకేసు హైకోర్టుకి తీసుకువెళ్ళి, ఆడమ్సు అనే ఆయన్ని ప్లీడరుగా పెట్టి, కేసు నడిపించాను. అక్కడ వున్న లా పుస్తకాలన్నీ తిరగవేసి రిపోర్టు కాని కేసుల్లోనించి ఒక తీర్పు పట్టుకున్నాను. చోరీ ఆస్తిని గురించి ఆచోకీ ఇచ్చినంతమాత్రం చేత నేరం రుజువు కాదని తీర్పు దొరికింది. ఆ తీర్పు చూపించడంతోటే సర్ డేవిస్, సుబ్రహ్మణ్య అయ్యరుగార్లు శిక్ష కొట్టివేసి, ముద్దాయీలను విడుదల చేశారు. దాంతో మరింత గణనలో పడ్డాను.

మునసబు కోర్టులో లా ఫైలు ఆకర్షించాను. అప్పుడు రంగమన్నారు అనే ఆయన మునసబు. ఆయన కోర్టులో గుమాస్తాగా వుండి క్రమంగా పైకివచ్చినవాడు. మంచి తెలివైనవాడు. జడ్జిమెంటు మంచి పకడ్ బందీగా వ్రాసేవాడు. అయితే ఆయనకి లంచగొండి అనీ, పక్షపాతి అనీ కొంత అపఖ్యాతి వుండేది. అప్పట్లో ఆయనకి ఏలూరి వెంకట్రామయ్యగారు అంటే అభిమానం. ఎందుచేతనో రంగమన్నారు నాయెడల కొంచెం సద్భావం చూపించేవాడు. నే నెన్నడూ ఆయన్ని ఆశ్రయించలేదు. కాని, ఎందుచేతనో ఆయన నాకు చాలా సహాయం చేస్తూ వుండేవాడు. అందుచేత కూడా ఫైలు పెరిగింది. ఈ ప్రభ కొంతకాలం నడిచాక ఈ రంగమన్నారుకీ నాకూ తగాదా వచ్చింది.

సుబ్బారావుపంతులు ప్రభృతులు, ఆయన లంచగొండి అనీ, కొందరు ప్లీడర్లంటే ప్రత్యేకాభిమానం చూపిస్తాడనీ, తద్వారా న్యాయ వ్యవహారాలకి నష్టం వస్తోం దనీ, హైకోర్టుకి పిటీషన్ పెట్టారు. అందులో నన్ను కూడా సంతకం చెయ్య మన్నారు. అల్లాంటి కింవదంతులు, గోల వుండేవి. కనక నేను కూడా దస్కతు పెట్టాను. దాంతో ఆయనకీ, నాకూ చెడిపోయింది. ఇంతమంది ప్లీడర్ల పిటీషన్ మీద హైకోర్టువారు అది విచారణకి పంపారు. రంగమన్నారు ఘాటైన సమాధానం వ్రాశాడు. అసలు వ్యవహార మెట్లా ఉన్నా సమాధానం మంచి చాకచక్యంగా వ్రాశాడు.

దాంతో అతను నిర్దోషిగా నిర్ణయించబడ్డాడు. హైకోర్టువారి నిర్ణయం చేత ఆయన మరీ తాడుబారిపోయాడు. ఆయనకి ఆశ్రితపక్ష పాతం మరింత హెచ్చయింది, కాని, నాకు మాత్రం ఆయన వ్యతిరేకి అయ్యాడు. దాంతో నాకు స్థానికంగా కొంత సివిల్ ప్రాక్టీసు తగ్గింది. కాని, క్రిమినల్ వ్యవహారం బాగానే నడిచింది. నా ప్రాక్టీసు రాజమహేంద్రవరంలోనే కాకుండా జిల్లాలోనూ, పక్క నున్న ఏలూరు వగైరా పట్టణాల్లోనూ కూడా బాగానే వుండేది. డబ్బు కూడా దానికి తగినట్టుగానే వస్తూ వుండేది. ప్లీడర్లు, సంపాదనలో తన విలువ తానే నిర్ణయించుకోవాలి. నేను నా విలువ చాలా హెచ్చుగానే వుంచానని చెప్పాలనుకుంటాను. నా తోటి ప్లీడర్లు అందులోనూ బి.ఏ., బి.ఎల్.లు కూడా 25 రూపాయలు పుచ్చుకునే కేసులో నేను నిర్మొహమాటంగా వందరూపాయలు పుచ్చుకునేవాణ్ణి. ఒక కేసులో పోలవరం, జంగారెడ్డిగూడెం మొదలైన చోట్లకి వెళ్ళినందుకు పల్లకీ వగైరా ఖర్చులు గాక, రోజకి నూరురూపాయలు పుచ్చుగున్నాను. డబ్బనేది పోయేటప్పుడు ఎల్లాగ చేతులూ, కాళ్ళూ వచ్చిపోతుందో వచ్చేప్పుడు కూడా అలాగే వస్తుంది.

నాకు డబ్బు వస్తున్నట్టుగానే, సంసారం ఖర్చు కూడా చాలా దుబారాగానే అయింది. ఒంగోలులో వుండే కుటుంబం అంతా బంధువులతో సహా రాజమహేంద్రవరం చేరారు. హనుమంతరావు నాయుడుగారి కుటుంబభారం కూడా కొంతవరకు భరించడంలో నేను నా విధి కొంచెం మాత్రమే నిర్వర్తించగలిగాను. డబ్బు కనపడ్డప్పటినుంచీ ఖర్చు కూడా ఎక్కువైంది. మొట్టమొదట కొన్ని రోజులదాకా కోర్టుకు వెళ్ళడానికి ఒంటెద్దుబండి పెట్టాను. స్వయంగా ఆ బండికి రంగులు వేయించి ఒక ప్రత్యేకత ఏర్పడేటట్లు చేశాను. తరవాత కొంతకాలానికి ఒక డాకార్టూ, చక్కని పోనీ కొన్నాను. ఆ తర్వాత గుఱ్ఱాల్ని కొనడం, వాటిని పెంచడం కొంతకాలం అయింది. అప్పటికి డాకార్టు పెద్ద ప్లీడర్లైన నేతి సోమయాజులుగారికి ఒక్కరికే వుండేది. అప్పట్లో ఆయనతోబాటు నాకు కూడా డాకార్టు వుండాలని సరదాగా వుండేది.

మొదట్లో-అనగా ప్రాక్టీసు ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే నేను పెద్ద కేసుల్లో మాగంటి లక్ష్మణదాసు కేసు ఒకటి. దానికి అర్థణా కేసని పేరు. లక్ష్మణదాసు ఏలూరుదగ్గర చాటపర్రు గ్రామస్థుడు. కమ్మ. మంచి పలుకుబడి గలవాడు. అతను ఒకసారి టోలుగేటు ఫీజు అర్థణా ఇవ్వకుండా పోయి, కంట్రాక్టరుమీద జబర్ దస్తీ చేశాడని కేసు, ముందు బెంచికోర్టులో కేసుపెట్టారు. కాని, ఎప్పుడైతే అతను పట్టుదలకొద్దీ వాదించదలుచుకన్నాడో అప్పుడు పోలీసులు దాన్ని పెద్ద కేసుగా మార్చి ఏలూర్ సబ్ కలెక్టరుదగ్గిర పెట్టారు. అప్పుడు సబ్ కలెక్టరు కెర్షాప్ అనే పార్సీ ఐ.సి.యస్. ఉద్యోగి; అతను మొదటి నించీ ముద్దాయికి వ్యతిరేకమైన రిమార్కులు పాసుచేస్తూ ఉండడం వల్ల, అతను కేసు విచారణ చేయకూడదనీ, ఇంకొక మేజిస్ట్రీటు దగ్గిరికి కేసు మార్చవలసిందనీ హైకోర్టుకి పిటీషన్లు పెట్టాం. అతను ఆ పిటీషన్ లు లక్ష్యం చేయకుండానే కేసు విచారించి, 500 రూపాయలు జరిమానా విధించేటట్లు కనబడ్డాడు. అతని ధోరణి చూస్తే శిక్ష కూడా విధించేటట్లు కనబడ్డారు. నేను అడుగడుగుకీ అడ్డు పిటీషన్లు తగిలించి అతన్ని మరీ విసిగించాను. అందుచేత రాజమహేంద్రవరం జిల్లాకోర్టులో అప్పీలు వచ్చింది. ఎవరో సీనియర్ ప్లీడర్ ని ఏర్పాటుచేసి కేసు నడిపించారు. కాని, కిందుకోర్టు తీర్పే ఖాయపడింది. ఆపైన హైకోర్టుకి అప్పీలు చేయించి, అప్పీలు విషయంలో స్వయంగా కృషిచేసి, కేసు గెలిపించాను. దాంతో నా పేరు అటువైపుని బాగా పాకింది. ప్లీడరీలో మొదటి నుంచీ కూడా స్వతంత్రత చూపిస్తూ, సీనియర్లు అనేవాళ్ళనాట్టే లక్ష్యపెట్టకుండా, తొందరగా ప్రాక్టీసు సంపాదించడం వల్ల, తోటి ప్లీడర్ల అసహనానికి పాత్రుణ్ణయ్యాను. తత్ఫలితంగా కొందరు ప్లీడర్లు నామీద కక్ష కట్టారు కూడాను. దానికి ఏమీ కారణం లేదని నా నమ్మకము. అందులో ముఖ్యులు నేతి సోమయాజులు, ములుకుట్ల అచ్యుతరామయ్యగార్లు, నేతి సోమయాజులుగారు గవర్నమెంటు ప్లీడరు కూడాను. ఆయన నామీద కక్ష సాధించడానికి ఏ పని చెయ్యడానికీ కూడా సందేహించలేదు.

ఇల్లాగ ప్రాక్టీసు బాగా సాగుతూండగా నేను ఆనాడు రాజ మహేంద్రవరం అంతటినీ కలవరపరుస్తూ వున్న మునిసిపల్ వ్యవహారాల్లో పడ్డాను. ఒక కేసులో ముద్దాయి తరఫున నేను, ఫిర్యాది తరఫున ఆయన హాజరయ్యాము. కేసు తాడినాడ వెంకట్రామయ్య అనే మేజస్ట్రీటు దగ్గర. ఆయన వింతపద్ధతి అవలంబించి, వకీలుగా ఉన్ననన్ను సాక్షిగా పిలిపించాడు. నాచేత సాక్ష్యం పుచ్చుకుని తన తరఫున మరి కొందరి సాక్షులచేత నేను చెప్పినదానికి విరుద్ధంగా చెప్పించి, అబద్ధం సాక్ష్యం ఇచ్చినందుకు నామీద ప్రాసిక్యూషన్ కోసం పిటీషన్ పెట్టాడు. ఒక ప్లీడరు ఇంకొక ప్లీడర్ని ఇలాగ కక్ష సాధించడం చాలా అపూర్వమైన విషయం! మేజస్ట్రీటు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాడు. కాని, సోమయాజలుగారు గవర్నమెంటు ప్లీడరుగా తనకి వున్న పరువుప్రతిష్టలు ఉపయోగించి మేజస్ట్రీటుని స్వాధీనపరచుకున్నాడు. కేసు ఫైలయింది రాజమహేంద్రవరం జాయింటు మేజస్ట్రీటు దగ్గిర. వెనక లక్ష్మణదాసు కేసులో ఏలూరులో వున్న కెర్షాప్ అప్పటికి రాజమహేంద్రవరం సబ్ కలెక్టరుగా వచ్చాడు.

ఇంక అడిగే దేముంది! అందరూ 'అతనికి నా మీద ఏదో కొంచెం ఆగ్రహం ఉండకపోదనీ, నాకు తప్పకుండా శిక్ష పడుతుందనీ' అనుకున్నారు. నేనే కెర్షాప్ దగ్గిర స్వయంగా హాజరయ్యాను. ఆ కెర్షాప్ దగ్గిర నేను చూసిన ఉత్కృష్టత ఏమి టంటే-ఆయన నన్ను చూసి ముందుగానే "ఏమండీ! ఈ కేసు నేను విచారించడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఏలూరు సమాచారం వల్ల మీకు నామీద ఏదైనా అనుమానం వుందా?" అని అడిగాడు. నాకు అల్లాంటి సంకోచం ఏమీ లేదని, కేసులో విచారణ న్యాయంగా జరుగుతుందనే నమ్మకం నాకు వుందనీ చెప్పాను. ఆపైన ఆయన కేసు విచారించాడు. సోమయాజులు గారు తను అల్ల గలిగిన కథ అంతా అల్లాడు. కాని కెర్షాప్ చివరికి నేను నిర్దోషి నని తీర్పు ఇచ్చి, ఇల్లాంటి అభూత కల్పనాయుతమైన కేసు ఎన్నడూ జరగలేదనీ, గవర్నమెంటు ప్లీడరు తన పలుకుబడి దుర్వినియోగం చేశాడనీ వ్రాశాడు.